1
భగవంతుడు తన భృత్యులకు విధియించిన ప్రథమ కర్తవ్యము: తన దివ్యావిష్కరణమునకు అరుణోదయమును, తన శాసనోద్భవము నకు స్రవంతియును, తన దివ్యధర్మ సామ్రాజ్యము, సృష్టి ప్రపంచము రెండింటియందునను దివ్యత్వమునకు దౌత్యకర్తయగు ‘ఆయన’ ను గుర్తించుట. ఈ కర్తవ్యమును నెరవేర్చినయాతడు సకల శుభసాధకుడు; తద్విహీనుడెంతటి సత్కార్యకర్తయైనను, దాని నుండి వైదొలగినట్లే. ఈ మహోత్కృష్ట స్థానమును, ఈ మహామహిమోపేత శిఖరమును అందుకొనిన ప్రతియొక్కడును, లోకాపేక్షితుడగు ‘ఆయన’ ప్రతి శాసనమును పాటింపవలె. ఈ కర్తవ్యద్వయ మవిభాజ్యము. ఇందేదియును రెండవది లేకుండ అంగీకారయోగ్యము కాదు. దివ్యప్రేరణకు మూలాధారుడగు ‘ఆయన’ చే నివ్విధముగ నాదేశింపబడినది.
2భగవంతునిచే నంతర్దృష్టి ప్రసాదింపబడినవారు, ఈ ప్రపంచ సంవిధాన సంరక్షణకు, దీని ప్రజాభద్రతకు అత్యుత్తమ సాధనములుగ భగవంతుడేర్పరచిన ధర్మసూత్రములను యిట్టే గ్రహియింతురు. వాటినుండి వైదొలగినవా డధములయందునను, అవివేకుల యందునను ఒకనిగ గణియింపబడును. మీ దుర్మోహముల, నికృష్ట వాంఛల యాదేశములను తిరస్కరింపుడనియు, మహోన్నతుని దివ్యలేఖిని స్థిరీకృతమొనరించిన హద్దులు సకల సృజితములకును జీవనశ్వాస యగుటచే, వాటిని మీరవలదనియు, మేము నిశ్చయముగ మిమ్మాదేశించినాము. సకల దయామయుని ఉచ్ఛ్వాసమారుతమునుండి దివ్య జ్ఞాన, దివ్యభాషణా సాగరము లుద్భవించినవి. ఓ విజ్ఞులారా ! అత్యధికముగా సేవించుటకై త్వరనొందుడు. భగవంతుని యాదేశముల నతిక్రమించుట ద్వారా ‘ఆయన’ దివ్యఒడంబడిక నుల్లంఘించి తిరోగమించిన వారు సమస్త సంపన్నుడూ, సర్వోన్నతుడూనగు భగవంతుని దృష్టియందున మహాపరాధము నొనరించినారు.
3ఓ ప్రపంచ జనులారా! నా యాదేశములు నా భృత్యుల యెడ నా ప్రేమాన్వితానుగ్రహ దీపికలనియు, నా సృజితజీవులకు నా కరుణాన్విత కుంచిక(తాళపుచెవి) లనియు నిశ్చయముగ తెలిసికొనుడు. ఆవిష్కరణాధిపతి యగు భగవంతుని యిచ్ఛాస్వర్గము నుండి ఇవ్విధముగ నిది యనుగ్రహీతమైనది. సకల దయామయుని యధరము లుచ్చరింపనెంచిన పదముల మాధుర్యము నే మానవుడైనను చవిచూచెనేని, ‘ఆయన’ ఔదార్యోపేత సంరక్షణ, ప్రేమోపేత కారుణ్యముల అరుణోదయముపై శోభిల్లు ‘ఆయన’ యాదేశముల యందలి ఏ యొక్కదాని సత్యనిరూపణకైనను - భూలోకమందలి సకలసంపదలును తన యాధీనమందున్నను వానినన్నింటిని త్యజియించును.
4వచించు : నా శాసనముల నుండి, నా వస్త్రపు సుమధురపరిమళము నాఘ్రాణింపవచ్చును, వాటి సాహాయ్యమున మహోన్నత శిఖరములపై విజయధ్వజములను నిలుపవచ్చును. నా సర్వశక్తియుతమహిమాన్విత స్వర్గమునుండి నా యధికారవాణి నా సృష్టి నుద్దేశించి ఇవ్విధముగ పలికినది: “నా సౌందర్యాపేక్షకై నా యనుశాసనముల ననుసరింపుడు.” ఏ జిహ్వయును వర్ణింపజాలని కారుణ్యసౌరభ ప్రపూరితములగు యీ ప్రవచనముల నుండి పరమప్రియతముని దివ్యపరిమళము నాఘ్రాణించిన ప్రేమికుడు సంతోషాన్వితుడు. నా జీవితము సాక్షిగా ! నా దయానుగ్రహయుత హస్తముల నుండి న్యాయమను శ్రేష్ఠమధువును గ్రోలిన యాతడు నా సృష్ట్యోదయమున కెగువన శోభిల్లు నా యనుశాసనముల చుట్టును పరిభ్రమించును.
5మేము మీకై కేవలమొక ధర్మస్మృతిని వెలువరించితిమని యెంచ వలదు. వాస్తవమునకు, శక్త్యధికారములనెడు యంగుళులచే దివ్యమదిరా భాండమును వివృత మొనరించినాము. దివ్యావిష్కరణ లేఖిని వెలువ రించినదే ఇందుకు సాక్ష్యమును వహియింపుచున్నది. అంతర్దృష్టియుతులారా! ఇందుపై పర్యాలోచింపుడు.
6దివ్యప్రవచనావిష్కర్తయగు భగవంతునికి ఉదయ, మాధ్యాహ్నిక, సాయంకాలములయందున అర్పించుటకై తొమ్మిది ‘రకాహ్’ లతో అనివార్య ప్రార్థనను మీకు నిర్దేశించినాము. భగవంతుని దివ్యగ్రంథము నందలి యాదేశముగా, అసంఖ్యాక ప్రార్థనల నుండి మిమ్ము విముక్తులనొనరించినాము. నిశ్చయముగా, ‘ఆయన’ నిర్దేశకుడు, సర్వశక్తివంతుడు, అనిర్బంధనుడు. మీరీ ప్రార్థన చేయనెంచినప్పుడు - ఊర్ధ్వలోక నివాసులు ప్రదక్షిణ మొనరించునదియును, అమరపురజనుల కారాధనా కేంద్రముగ నిర్దేశిత మైనదియును, సమస్త భూ స్వర్గవాసులకు ఆదేశమూలమును అగు ఈ పునీత స్థానము దెసకు, నా పరమ పవిత్ర ప్రత్యక్షతా స్థానము వంకకు అభిముఖులు కండు; దివ్యసత్య, దివ్యోచ్చారణా సూర్యుడస్తమించినపుడు, మేము మీకై నిర్దేశించిన యట్టి దివ్యస్థలి వైపునకు మీ వదనములను సారింపుడు. నిశ్చయముగ, ‘ఆయన’ సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు.
7అప్రతిహతమగు ‘ఆయన’ యాదేశమునుండియే సమస్తమును ఆవిర్భవించినది. నాదగు ఉచ్చారణా స్వర్గమున సూర్యుని వోలె నా శాసనము లగుపించునపుడు, అవి - నా తీర్పు ప్రతి మతధర్మపు స్వర్గమును ఛిన్నాభిన్నమగు నట్లొనరించునదైనను - ప్రతి యొక్కనిచేతను విధేయతా పూర్వకముగ ననుసరింపబడవలె. ‘ఆయన’ తనకు ప్రమోదకరమగు దానినే నిర్వర్తించును. ఎంచుకొనువా ‘డాయన’, ఆయన ఎంపిక నెవ్వరును ప్రశ్నింపలేరు. పరమ ప్రియతముడగు ‘ఆయన’ నిర్దేశించినదేదైనను, నిశ్చయముగ ప్రియతమమే. సకలసృష్ట్యాధినాధుడగు ‘ఆయన’ నన్నిందులకు సాక్ష్యముగ నిలిపినాడు. సకల దయామయుని మధుర పరిమళము నాఘ్రాణించి, ఈ ఉచ్చారణామూలమును గ్రహియించిన యాతడు తన స్వీయనేత్రములతో శత్రుశూలములను స్వాగతించును, తద్వారా దైవశాసనముల సత్యమును మానవాళియందున సంస్థాపింపగలడు. వాని నాశ్రయించి, ‘ఆయన’ స్థిరనిర్ణయపు టాంతర్యమును గ్రహియింప గల్గినవానికి శుభమగు గాక !
8అనివార్య ప్రార్థనా వివరములను మేమింకొక దివ్యఫలకమునందు వెల్లడించినాము. సకల జనపాలకుడగు ‘ఆయన’ యాజ్ఞాపితమును పాలించు నాతడు ధన్యుడు. దివంగతుల కొరకైన ప్రార్థన యందలి ఆరు నిర్దిష్ట గ్రంథ భాగములు దివ్యప్రవచనావిష్కర్తయగు భగవంతునిచే ననుగ్రహింపబడినవి. పఠియింపగలవా డీరచనా భాగములకు పూర్వభాగముగ వెలువరింపబడిన దానిని రాగయుక్తముగ నాలపింపవలె; అట్లొనరింపలేని యాతని నా యావశ్యకత నుండి భగవంతుడు విముక్తుని గావించినాడు. సత్యముగా ‘ఆయన’ శక్తివంతుడు, క్షమాపకుడు.
9కేశములైనను, జీవరహితములగు నస్తికలవంటివైనను నీ ప్రార్థనను భంగము గావింపనేరవు. బీవరు (మూషిక జాతికి చెందిన ఒక విధమైన జంతువు), ఉడుత, యింకను యితర జంతువుల యున్నిని మీరు ధరియింపవచ్చును. వీని యుపయోగముపై గల నిషేధము, ఖురాన్ నుండి కాక, మతాచార్యుల విపరీత వ్యాఖ్యల మూలమున వచ్చినది. నిశ్చయముగా, ‘ఆయన’ సకల మహిమాన్వితుడు, సర్వజ్ఞుడు.
10యుక్తవయస్సారంభమైననాటి నుండి ప్రార్థన చేయుమని, ఉపవ సింపుమని మేము నిన్నాదేశించినాము; నీ ప్రభుడును, నీ పూర్వీకుల ప్రభుడును అగు భగవంతునిచే నిది నిర్దేశితమైనది. అనారోగ్యముచే, లేక వృద్ధాప్యముచే దుర్బలులైన వారిని ‘ఆయన’ తన సాన్నిధ్యానుగ్రహముగ, దీనినుండి మినహాయించినాడు; ‘ఆయన’ క్షమాదాత, దయాళువు. పరిశుభ్రమగు స్థానమెందైనను సాష్టాంగ ప్రణామము నొనర్చుటకు భగవంతుడు మీ కనుమతి ననుగ్రహించినాడు, ఏలయన ఇందుకు సంబంధించి దివ్య గ్రంథమునందేర్పరుపబడిన నియమమును మేము తొలగించినాము; మీరెరుగనిది, సత్యముగ భగవంతుని కవగతమే. శుద్ధీకరణకు జలము అలభ్యమైన యాతడు “పరమ పావనుడగు, పరమ పావనుడగు భగవంతుని దివ్యనామము పేరిట” యను పదముల నైదు పర్యాయములు పలికి, ఆపై తన ప్రార్థనాదికముల కుపక్రమింపవలె. సకల లోకాధిపతి యానతిట్టిది. దివారాత్రముల యవధి సుదీర్ఘముగ నుండు ప్రదేశములయందున గడియారముల, లేదా కాలగమనము నెరుకపరచు సాధనముల వలన ప్రార్థనా సమయములు తెలిసికొనబడు గాక. నిశ్చయముగ ఆయన ప్రదాత, వివేకి.
11సంకేత ప్రార్థన గావించవలసిన యావశ్యకత నుండి మిమ్ములను విముక్తుల నొనరించినాము. భయానక ప్రకృతి వైపరీత్యములు దృగ్గోచరము లైనప్పుడు సర్వవీక్షకుడును, సకలశ్రోతయును అగు మీ దేవుని శక్తిని, శౌర్యమును స్మరియించుకొని, యిట్లు పల్కుడు: “గోచరాగోచరములకు ఈశుడును, జగత్పతియును అగు భగవంతునిదే సామ్రాజ్యము”.
12మీలో ప్రతి యొక్కరును వ్యక్తిగతముగా అనివార్య ప్రార్థనను చేయవలెనని నిర్దేశింపబడినది. దివంగతులకు నిర్దేశితమైన ప్రార్థనయందు తప్ప సామూహిక ప్రార్థనాచారము తొలగింపబడినది. సత్యముగ ‘ఆయన’ నిర్దేశకుడు, సకల వివేకి.
13బహిష్టైన మహిళలను - అనివార్య ప్రార్థనను, ఉపవాసములను చేయుట నుండి భగవంతుడు మినహాయించినాడు. వారందుకు బదులుగా, ప్రక్షాళన మొనరించుకుని, పిదప, నాటి మధ్యాహ్నమునకు మరునాటి మధ్యాహ్నమునకు మధ్యకాలములో “దేవుడు మహిమాన్వితుడు శోభా సౌందర్యాల విభు” డని తొంబదియైదు పర్యాయములు పఠియింపవలె. గ్రహియింపగలవారేని - దివ్యగ్రంథమునందిది నిర్దేశితమైనదని - గ్రహియింపుడు.
14ప్రయాణము చేయునపుడు, ఏదేని సురక్షితప్రదేశమందు ఆగి విశ్రమింపవలసివచ్చెనేని, మీరు - స్త్రీ పురుషులొకే విధముగ - చేయలేకపోయిన ప్రతి అనివార్య ప్రార్థన స్థానము నందొక్క సాష్టాంగ ప్రణామము నాచరింపవలె; అట్లొనరించునపుడు “దయానుగ్రహముల సార్వభౌముడును, శక్తివంతుడును అగు భగవంతుడు మహిమాన్వితు” డని పలుకవలె. ఇట్లాచరింపలేని యాతడు “భగవంతుడు మహిమాన్వితు” డని పలుకుగాక; నిశ్చయముగ ఆతనికది చాలును. సత్యముగా ‘ఆయన’ సకల సంపన్నుడు, అనంతుడు, క్షమాశీలి, కరుణామయుడు. మీ సాష్టాంగ ప్రణామముల యనంతరము స్త్రీ పురుషు లొకేవిధముగ నర్ధపద్మాసనాసీనులై “భూస్వర్గ సామ్రాజ్యాధిపతియగు భగవంతుడు మహిమాన్వితు” డని పదునెనిమిది పర్యాయములు పఠియింప వలె. ఏకైక పథమగు నీ దివ్య ఋజుమార్గమునకు దారితీయు సత్యనిర్దేశనా రీతులను, భగవంతుడివ్విధముగ సరళీకృత మొనరించినాడు. ఈ మహాదయా నుగ్రహమునకు భగవంతునికి ధన్యవాదముల నర్పింపుడు; భూ స్వర్గావృతమగు ఈ వదాన్యతకు ‘ఆయన’ ను ప్రస్తుతింపుడు; సమస్తసృష్టినీ ఆవరించిన ఈ కారుణ్యమునకు ‘ఆయన’ ను సంకీర్తింపుడు.
15వచించు : భగవంతుడు నిగూఢమగు నా ప్రేమను దివ్యైశ్వర్యమునకు తాళపుచెవిని గావించినాడు, మీరెరుగుదురా! అయినను, ఆ దివ్యైశ్వర్యము తాళపుచెవికిని శాశ్వతముగ నగోచరమైయుండెడిది, విశ్వసింపగలరా! వచించు: దివ్యావిష్కరణకు మూలాధారమిది. దివ్యవైభవమునకు తన దీప్తిచే జగద్దిఙ్మండలములను శోభిల్లజేసిన ఉషోదయమిది. మీకవగతమైనదా! నిశ్చయముగ, న్రపతిహత నిర్ణయములకు మూలమగు నా యప్రతిహత నిర్ణయమిది.
16ఓ మహోన్నతుని దివ్యలేఖినీ! వచించు: ఓ ప్రపంచజనులారా! మీకు స్వల్పకాలముపాటు ఉపవసించుటను విధియించి, తదంత్యమును నౌరూజ్ పండుగగా నిర్ధారించినాము. ఆద్యంతముల కధినాధుడగు ‘ఆయన’ చే నాదేశింపబడినటుల ఉద్గ్రంథ దిఙ్మండలోపరితలమున ఉచ్చారణ ప్రభాతనక్షత్రమీ విధముగ శోభిల్లినది. మాసములయందలి అధిక దినములు ఉపవాస మాసమునకు ముందుంచబడు గాక. ఈ రేయింబవళ్లన్నియును, “హా” యక్షరస్వరూపములని నిర్దేశించినాము. అవ్విధముగా నవి సంవత్సర, మాస పరిమితులకు నిబద్ధము గావింపబడలేదు. ఈ దినములలో తమకును, స్వజనులకును, అందరికి మించి పేదలకు, ఆర్తులకు ఉల్లాసమును కలిగింపజేసి, ఆనందోత్సాహములతో భగవంతుని శ్లాఘించి, ప్రస్తుతించి, సంకీర్తించి ‘ఆయన’ నామమును బృహత్తరము గావింపవలెనని బహాప్రజలకు విధియింప నైనది; నిగ్రహకాలమునకు మునుపు వచ్చునట్టి ఈ దాతృత్వ దినములు ముగిసిన పిదప వారు ఉపవాసమున కుపక్రమింతురు గాక. సమస్తమానవాధిపతియగు ‘ఆయన’ చే నివ్విధముగ నాదేశింపబడినది. ప్రయాణికులు, రోగులు, గర్భవతులు, స్తన్యముచ్చు తల్లులు ఉపవాస నియమమునకు బద్ధులు కారు; భగవంతుడు తన యనుగ్రహమునకు ప్రతీకగ వారిని మినహాయించినాడు. నిశ్చయముగా, ‘ఆయన’ సర్వశక్తి వంతుడు, మహోదారుడు.
17దివ్యగ్రంథముల యందునను, దివ్యఫలకముల యందునను భగవంతుని మహోన్నత లేఖినిచే నిర్దేశితములగు దైవశాసనములివి. తమ వ్యర్థపుటూహలను, నిరర్ధక భావనలను అనుసరింపుచు, తామేర్పరచుకొనిన ప్రమాణములను పట్టివ్రేలాడుచు, భగవత్ప్రమాణములను వెనుకకుద్రోసియుంచు వారివలె కాక, ఆయన శాసనములకును, ఆదేశములకును దృఢముగా కట్టువడియుండుడు. సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకును అన్నపానాదులను వర్జింపుడు; దివ్యగ్రంథ ప్రస్తావితమగు నీ యనుగ్రహమును ఐహికవాంఛ మీకు దక్కనీయదేమో, జాగరూకులు కండు.
18న్యాయాధీశుడగు భగవంతుని విశ్వసించు ప్రతియొక్కడును అను దినమును తన హస్తములను, ఆపై ముఖమును ప్రక్షాళనమొనరించుకుని, ఉపవిష్టుడై భగవంతుని వైపుకు తిరిగి “అల్లా ‘హో’ అభా” ను తొంబదియైదు పర్యాయములుచ్చరింపవలె. వైభవాధికారములతో తన దివ్యనామముల సింహాసనములపై నాసీనుడైనప్పుడు దివ్యలోకముల సృష్టికర్త యిచ్చిన యాదేశమట్టిది. అటులే, అనివార్య ప్రార్థనకై శుద్ధీకరణములను గావింపుడు; అతులితుడును, అప్రతిబంధితుడును అగు భగవంతుని యాదేశమిది.
19హతమార్చుట లేక వ్యభిచరించుట, పరోక్షనింద, మిధ్యారోపణల యందు నిమగ్నులగుటనుండి మీరు నిషేధింపబడినారు; మరి, మీరు పవిత్ర గ్రంథములు, దివ్యఫలకములయందలి నిషిద్ధములను వర్జింపుడు.
20మేము వారసత్వపుటాస్తిని ఈ రీతిగ సప్తవర్గములుగ విభజించినాము: ఐదువందల నలభై రెండు వాటాలు గల తొమ్మిది భాగములను పిల్లలకును; నాలుగు వందల ఎనభై వాటాలు గల ఎనిమిది భాగములను భార్యకును; నాలుగు వందల ఇరవై వాటాలు గల ఏడు భాగములను తండ్రికిని; మూడు వందల అరవై వాటాలు గల ఆరు భాగములను తల్లికిని; మూడు వందల వాటాలు లేదా ఐదు భాగములను సోదరులకును; రెండువందల నలభై వాటాలు లేదా నాలుగు భాగములను సోదరీమణులకును; నూట ఎనభై వాటాలు లేదా మూడు భాగములను ఉపాధ్యాయులకును కేటాయించినాము. నిశీధియందునను, ఉషఃకాలమునందునను మా దివ్యనామమును కొనియాడు నా యగ్రగామి శాసనమట్టిది. గర్భస్థశిశువుల యార్తనాదముల నాలకించినయంత, వారి వాటాను ద్విగుణీకృత మొనరించి, మిగిలినవారి వాటాలను తగ్గించినారము. సత్యముగా, ‘ఆయన’ కు తన యాకాంక్షానుసారము శాసించు శక్తి కలదు; ‘ఆయన’ తన సార్వభౌమాధికారముచే తన యిచ్ఛానుసారము వ్యవహరింప గలడు.
21మృతినొందినవానికి సంతానము లేనిచో, వారి వాటా - అది అనాధల నిమిత్తమును, వైధవ్యమునొందినవారి నిమిత్తమును, జనబాహుళ్య ప్రయోజనముల నిమిత్తమును, సకలదయామయుడును, క్షమాశీలి యును అగు తమ దైవమునకందరును ధన్యవాదములనర్పించు రీతిన దయాన్వితుని ధర్మకర్తలచే వ్యయపరుపబడునటుల, న్యాయమందిరమునకు చెందవలె.
22మృతునకు పిల్లలుండి, దివ్యగ్రంథమునందు పేర్కొనబడిన ఇతర ఔరసవర్గీయులెవ్వరును లేనియెడల, వారికి మూడింట రెండు వంతుల యాస్తి సంక్రమింపవలె; మిగిలిన మూడవ వంతు న్యాయమందిరమునకు మరలింప బడవలె. సకల సంపన్నుడును, సర్వోన్నతుడును అగు ‘ఆయన’ చే తేజో వైభవములతో నొసంగబడిన యాదేశమిట్టిది.
23మృతునకు - బంధువులయందున అన్నదమ్ముల, అక్కచెల్లెండ్ర పిల్లలు దక్క పేర్కొనబడిన వారసులెవ్వరును లేనియెడల, వారసత్వపుటాస్తిలో వారికి మూడింట రెండు వంతులు చెందును; వీరు సైతము లేనియెడల, అది యాతని తల్లిదండ్రుల తోబుట్టువులకును, వారి యనంతరము వారి కుమారులకును, కుమార్తెలకును చెందును. మిగిలిన మూడవవంతు వారసత్వపుటాస్తి, ఏ పరిస్థితియందైనను, న్యాయసింహాసనమునకు మరలింపబడవలె. సర్వజన పాలకుడగు ఆయనచే దివ్యగ్రంథమునందీ రీతిగ నిర్దేశితమైనది.
24మహోన్నతుని లేఖినిచే లిఖితములగు నామములు గల యే వారసులును మృతునకు లేనియెడల, ఆతని యవదాస్తియును దైవనిర్దేశితము నకు వ్యయపరచుటకై, పూర్వప్రస్తావిత సింహాసనమునకు మరలింపబడును. నిశ్చయముగా ఆయన, నిర్దేశకుడు, సర్వశక్తిశాలి.
25మృతుని నివాసమును, వ్యక్తిగత వస్త్రములను, స్త్రీ సంతతికో, అన్య వారసులకో కాక, పురుషసంతతికే ప్రత్యేకించినాము. నిశ్చయముగ ఆయన ప్రదాత, సకల వదాన్యుడు.
26మృతుడు జీవించియుండగనే, సంతానవంతుడగు ఆతని కుమారుడు దివంగతుడయ్యెనేని, భగవంతుని దివ్యగ్రంథ నిర్దేశితానుసారము ఆ సంతతి తమ తండ్రి వాటాకు వారసులగుదురు. పరిపూర్ణన్యాయముతో వారి వాటాను వారికి పంచియిండు. సమస్త మానవాధినాధునిచే నిర్ణీతములగు శాసన మౌక్తికములను వెదజల్లుచు, ఉచ్చారణోదధి పెనుకెరట మావిధముగ నువ్వెత్తున పైకెగసినది.
27మృతుని పిల్లలు పసివారైనచో, వారసత్వపుటాస్తియందలి వారి వాటాను వారు యుక్తవయస్కులగునంత వరకు వారి పక్షమున వ్యాపారమునందో, వాణిజ్యమునందో మదుపుచేయుటకై ఒక విశ్వాసపాత్రునికి లేదా వాణిజ్యసంస్థకు అప్పగింపవలె. అట్లేర్పరుచుటచే దానికి సమకూరిన లాభమునందలి సముచిత వాటానొకదానిని, తద్ధర్మకర్తకు కేటాయింపవలె.
28హుఖుఖుల్లా చెల్లించబడి, ఋణములేవైనను పరిష్కృతములై, అంత్యక్రియల, ఖననముల వ్యయములు జరుపబడి మృతుడు సమాధిస్థలికి గౌరవ మర్యాదలతో కొనిపోబడిన పిదపనే ఆస్తిపంపిణీ జరుగవలె. ఆద్యంతాధినాథుడగు ‘ఆయన’ చే నిట్లు నిర్దేశితమైనది.
29వచించు: గోచరాగోచర సూచక సంకేతమును, నిరతిక్రమణమును, అత్యంత విశిష్టనామమును అగు తొమ్మిదితో నారంభింపబడుటచే యెన్నడును మార్పునొందని మర్మజ్ఞానమిది. మేము బాలలకు సముచితమని ఏర్పరచిన యట్టిది - దయాళువును, కరుణామయుడును అగు తమ దైవమునకు వారు కృతజ్ఞతలను తెల్పుకొనునటుల భగవంతుడు వారికి అనుగ్రహించినది. నిశ్చయముగా దైవశాసనములివి; క్షుద్ర, స్వార్ధవాంఛాప్రేరితులై వాని నతిక్రమింప వలదు. దివ్యోచ్చారణోద్భవస్థానమగు ఆయన మీకిడిన యాజ్ఞలను పాలింపుడు. దైవసేవకులయందలి నీతివంతులు ఆయన వెలువరించిన శాసనములను, ప్రతి మతావలంబకులకును జీవనతోయములుగను, సమస్త భూస్వర్గ వాసులకు వివేకజ్యోతిగను, సాదరానుగ్రహముగను పరిగణింతురు.
30బహా సంఖ్యకు సరిపడునంతమంది సలహాదారులు గల ప్రతి నగరమునను న్యాయమందిరమొక్కటి స్థాపింపబడవలెనని, ఆ సంఖ్య అధికమైనను సరియేననియు భగవంతు డాదేశించినాడు; తామందు ప్రవేశించినపుడు, ఘనత వహించినవాడును, పరమోన్నతుడును అగు భగవంతుని సాన్నిధ్యమను సభాంగణమున కేగుచున్నటుల, అగోచరుడగు ‘ఆయన’ నవలోకింపుచున్నటుల వారు భావించుకొనవలె. మానవులయందున దయామయుని విశ్వాసపాత్రులుగ వ్యవహరించుటయును, సమస్త భూలోకవాసులకును దైవనిర్దేశిత మార్గదర్శకులుగ మెలగుటయును వారికి విధియింపబడినది. సంఘటితముగ సమాలోచనలను గావించుటయును, తమ స్వప్రయోజనములను గణియించినటులే, భగవంతునికై, ఆయన సేవకుల ప్రయోజనములను సైతము గణియింపుట యును, సయుక్తమూ, సముచితమూనగు దాని నెంచికొనుటయును వారికి అనివార్యమైయున్నది. సర్వాధిపతియగు మీ దైవము మిమ్మీవిధముగ నాజ్ఞాపించినాడు. విస్పష్టముగ ఆయన దివ్యఫలకమునం దావిష్కృతమైనట్టి దానినలక్ష్యమొనరింతురేమో, జాగ్రత్త. ఓ వివేకులారా, దైవభీతిని కలిగి యుండుడు.
31ఓ జగజ్జనులారా! సకల మతాధీశుడగు ‘ఆయన’ పేరిట, సమస్త భూభాగముల యందుననూ ఆరాధనామందిరములను నిర్మింపుడు. ఐహిక ప్రపంచమున వానిని సాధ్యమైనంత నిర్దుష్టముగ నిర్మింపుడు; చిత్రములతోడనో, ప్రతిమలతోడనో కాక, సముచితరీతిన వాని నలంకరింపుడు. వానియందున పరమ దయామయుడగు మీ భగవంతుని సంకీర్తనము నానందోత్సాహములతో గావింపుడు. వాస్తవమున ‘కాయన’ స్మరణమున నేత్రపర్వమగును, హృదయములు జ్యోతిర్మయములగును.
32మీలో స్తోమతగల వారు పవిత్రగృహమునకు తీర్ధయాత్రను గావింప వలెనని దేవాధిదేవు డాదేశించినాడు; ఆయన తన కారుణ్యము కొలది మహిళల నిందుండి మినహాయించినాడు. నిజమున కాయన సకలౌదార్యుడు, మహాదాత.
33ఓ బహాజనులారా! ఏదో ఒక వృత్తి - అనగా కళ, వర్తకము లేదా తత్సమానమగు వ్యాసంగము - లో ప్రవేశించుట మీలో ప్రతియొక్కరికిని విధియుక్తము. మీరట్టి కార్యమునం దవలగ్ను లగుటను నిజదైవారాధన స్థాయికి సముద్ధరించినాము. ఓ ప్రజలారా! మీ దేవుని యనుగ్రహమును, ఆశీస్సులను స్మరియించుకొనుచు, ఉదయసాయంసంధ్యలయం దాయనకు ధన్యవాదముల నర్పింపుడు. నిర్వ్యాపారముతో, అలసత్వముతో మీ కాలమును వ్యర్థమొనరింపక మీకును, అన్యులకును ఫలదాయకమగు దానినొనరింపుడు. ఈ దివ్యఫలక దిఙ్మండలము నుండి వివేకోచ్చారణలనెడు ఉదయతార ప్రభవిల్లినది; ఇట్టి ఫలకమునుండి ఈ విధముగ నిర్దేశితమైనది. క్రియాశూన్యులై కూర్చుని, భిక్షాటనమొనరించువారు భగవంతుని దృష్టిలో పరమనీచులు. సాధనలనెడి రజ్జువును దృఢముగ చేబూని సర్వసాధనాప్రదాతయగు భగవంతునియెడ మీ విశ్వాసమును నిలిపియుంచుడు.
34కరచుంబనము దివ్యగ్రంథమున నిషేధింపబడినది. తదాచరణ, మహిమాదేశముల కధినాధుడగు దేవదేవునిచే నిషేధింపబడినది. తమ పాప విముక్తికై అన్యుల క్షమనాశించుటకెవ్వరునూ అనుమతింపబడలేదు; పశ్చాత్తాపము మీకును, మీ దైవమునకు మధ్యనే యుండు గాక. నిక్కముగా ఆయన క్షమాపకుడు, ప్రదాత, దయామయుడు, పశ్చాత్తప్తుల మోక్షకుడు.
35ఓ దయామయుని భృత్యులారా! దివ్యసంకేతోదయమును విశ్వసింపని వారు కలిగించు క్లేశములును, వేదనలును మిమ్ము క్షోభింపచేయకుండునటుల దివ్యధర్మసేవకై ఉద్యుక్తులు కండు. వాగ్దానము నెరవేర్పబడి, వాగ్దత్తపురుషుడు ప్రత్యక్షీకృతుడైనపుడు భూప్రజల మధ్య వైరుధ్యములు పొడసూపినవి; ప్రతి యొక్కరును తమతమ మిధ్యాభ్రమల ననుసరించినారు.
36తన మనమునం దగ్రాసనము నపేక్షింపుచు ద్వారసీమ చెంతగల పాదరక్షల మధ్య ఆసీనుడైన వాడొకడు జనులయందు గలడు. వచించు: వాస్తవవిరుద్ధముగ నగుపించు ఓ యహంభావీ, అలక్ష్యపరుడా! ఎట్టి మనుష్యుడ వీవు? అంతర్జ్ఞ్ఞానకోవిదుడనని, ఇంకను నిగూఢ జ్ఞానమందు నిక్షిప్తమైయున్నదని చెప్పుకొనువాడును జనులయందే గలడు. వచించు: నీ వసత్య మాడుచున్నాడవు. దైవసాక్షిగా, నీయొద్దనున్నది - శునకములకు పారవైచిన శల్యములవోలె - నీకు మేము వైచిన తాలు తప్ప వేరొండు కాదు. ఏకైక నిజ దైవజ్ఞాన సాక్షిగా! ఎవ్వడైనను సర్వమానవ పాదప్రక్షాళన మొనరించినను, వనములయందునను, లోయలయందునను, పర్వతముల యందునను, ఉన్నత గిరులపైనను, మహోన్నత శిఖరములపైనను దైవము నారాధించినను, తదారాధనకు సాక్ష్యముగ ప్రతి శిలను, తరువును, మృత్శకలమును వదలక నిలిపినను, ఆతని నుండి మా సంప్రీతి పరిమళము లాఘ్రాణితములు కానేరవు, ఆతని కార్యములెన్నటికిని భగవంతుని యంగీకృతినొందజాలవు. సకలాధీశుడగు ‘ఆయన’ చే నివ్విధముగ నిర్దేశితమైనది. భరతఖండపు పర్వతసానువుల యందెందరు - న్యాయ బద్ధములని దైవము నిర్దేశించిన శాసనములకు దూరులై సర్వసంగ పరిత్యాగులై, కఠోర నియమములను విధియించుకొని, దివ్యపదావిష్కర్తయగు భగవంతుని స్మృతికి దూరులు కాలేదు. మీ విషయ వాంఛాసాధనకై మీ కార్యములను జాలములను గావింపవలదు; అంతియే కాక భగవత్సాన్నిధ్యమునందినవా రందరును అనవరతము పరితపించినయట్టి పరమోన్నత లక్ష్యమునకు మీరు దూరులు కావలదు. వచించు : నా సంప్రీతిని వడయుటయే సకల కార్యములకు జీవము; సర్వమును నాదగు యామోదము పైననే ఆధారపడి యుండును. సకల వైభవోపేతుడును, సర్వౌదార్యుడును అగు భగవంతుని దివ్యగ్రంథముల యందేమున్నదో తెలిసికొనవచ్చును గాన మా ఫలకములను పఠియింపుడు. నా ప్రీతికి పాత్రుడైనవాడు, స్వర్ణాసనమునకును, సకల ప్రపంచ గౌరవమునకును అర్హుడగును; తత్ప్రీతి విహీనుడు ధూళిపై నాసీనుడైనను, ఆ ధూళి సైతము సకల మతాధీశుడగు భగవంతుని శరణువేడును.
37సహస్రవర్షముల పరిపూర్తికి పూర్వమే భగవదావిష్కరణకర్తగా ప్రకటించుకొనువాడు నిక్కముగ వంచకుడు. అట్టి ప్రకటనను ఉపసంహరించు కొనుటకును, పరిత్యజించుటకును ఔదార్యముతో నాతడికి తోడ్పడుమని మేము భగవంతుని వేడుచున్నాము. ఆతడు పశ్చాత్తాపము నొందెనేని, పరమాత్ముడు నిస్సంశయముగా మన్నించును. అయితే ఆతడు మూర్ఖత్వముకొలది తన పట్టును వీడనిచో, ఆతనియెడ నిర్దాక్షిణ్యముగ వ్యవహరించు నాతనిని భగవంతుడు నిశ్చయముగ పంపగలడు. శిక్షించుటయందు భగవంతుడు యదార్థముగ చండప్రచండుడు! ఈ ప్రవచనమును - దీని విస్పష్టార్థమునకు విరుద్ధముగ - వ్యాఖ్యానించు నాతడు, సమస్త జీవకోటిని యావరించిన దైవతేజస్సునకును, ‘ఆయన’ కరుణకును పాత్రుడు కాజాలడు. దైవభీతిని కలిగియుండుడు, మీ వ్యర్ధభ్రమల ననుసరింప వలదు. సర్వశక్తివంతుడును, సకల వివేకియును యగు మీ పరమాత్ముని యాజ్ఞను పాలింపుడు. అనేక ప్రదేశములయం దచిరకాలములోనే ధిక్కారస్వరములు వెలువడును. ఓ నా జనులారా! మరి, పాపాత్ములను, దుస్స్వభావులను అనుసరింపవలదు. ఇరాక్ నందు వసియించునప్పుడును, మరి ఆపై మార్మికభూమి(అడ్రియానోపుల్) యందుండగను మేము మీకు ముందుగా హెచ్చరిక చేసినదియును, ఇప్పుడీ దేదీప్యమానస్థలి నుండి హెచ్చరింపుచున్నదియును ఇదియే.
38ఓ జగజ్జనులారా! నా సౌందర్యప్రభాతనక్షత్ర మస్తమించినప్పుడు, నా స్వర్గధామము మీ నేత్రముల కగోచరమొనరింపబడినప్పుడు వెఱపునొందవలదు. నా దివ్యధర్మపురోగతికిని, మానవులయందున నా ప్రవచనోద్ధతికిని ఉద్య మింపుడు. మేము సర్వదా మీతో నుందుము, సత్యబలముచే మిమ్ము శక్తి వంతులనొనరింతుము. సత్యముగా మేము సర్వశక్తివంతులము. నన్ను గుర్తించిన యాతడు, భూస్వర్గ శక్తులు సైతము తన యుద్దేశ్యమును నిరోధింప జాలనంతటి దృఢసంకల్పముతో నన్ను సేవించుట కుద్యుక్తుడగును.
39ప్రపంచజనులు గాఢనిద్రావస్థయందున్నారు. వారు తమ సుషుప్తి నుండి మేల్కాంచిరేని సర్వజ్ఞుడును, సర్వవివేకియును అగు భగవంతుని దెసకు ఆత్రమున పరువిడుదురు. తమ ప్రభుడు తమనుద్దేశించి కేవలమొక్క పదము నుచ్చరించు నటుల గుర్తుంచుకొనుటకై తమ సర్వమును - అది భూమి పైనున్న సకలసంపదలైనను - పరిత్యజింతురు. సమస్త జ్ఞానమును నికిప్తమైనట్టిదియును, సృష్టినేత్రము గాంచియుండనిదియును, సాక్షాత్త్తు తనకుతప్ప అన్యులకు అనావిష్కృతమును అగు దివ్యఫలకమున సర్వశక్తివంతుడు, సకల జగద్రక్షకుడు యిచ్చిన యాదేశమిట్టిది. తమ దుర్వాంఛల మైకమున వారెంతటి విభ్రమము నందుండిరనిన “పరాక్రమశాలిని, సకలవివేకిని యగు నేనుతప్ప అన్యదైవము లే”డని వారి ప్రభునివాణి అన్ని వైపులనుండియు యెలుగెత్తి పిలచినను గ్రహియించుట కశక్తులైనారు.
40వచించు: మీ యాధీనమందలి వస్తుసంచయము పట్ల మురియ వలదు, ఈ రేయికవి మీవి, రేపటికవి పరుల పాలగును. సర్వజ్ఞుడును, సకల విదుడును అగు ‘ఆయన’ మిమ్మీవిధముగ హెచ్చరింపుచున్నాడు. వచించు: మీ స్వాధీనమందున్నది శాశ్వతమని, సుభద్రమని యనగలరా? లేదు! సకలదయాళువునగు నా సాక్షిగా, న్యాయబద్ధముగ నిర్ణయించు వారలైనచో, అనలేరు. మీ జీవితకాలము, ప్రాణవాయువు వోలె కరగిపోవును, మీకు ముందు చనిన వారి కీర్తివైభవముల వోలె మీ కీర్తివైభవములును అంతరించును. ఓ జనులారా! యోచింపుడు మీ గతించిన దినములకు, శతాబ్దముల కేమైనది? దైవస్మరణకు అంకితములైన దినములు ఆనందదాయకములు, సకల వివేకియగు ‘ఆయన’ ను స్తుతించుటకు వెచ్చించిన ఘడియలు శుభప్రదాయినులు. నా జీవితము సాక్షిగా ! బలవంతుల యాడంబరము గాని, సంపన్నుల సంపద గాని, దుష్టుల ప్రాబల్యము గాని నిలువబోవు. ‘ఆయన’ నుండి వెలువడు ఏకైక వాక్కుతో సర్వమును నశించును. నిశ్చయముగా ‘ఆయన’ సర్వాధికార పరిపూర్ణుడు, సమస్తప్రేరణకర్త , సర్వశక్తివంతుడు. మానవులు సమకూర్చుకొను భౌమవస్తువుల వలన ప్రయోజనమేమి? వారు తమకు ప్రయోజనకరమగు దానిని పూర్తిగా నలక్ష్యము గావించినారు. అనతికాలమునకే వారు తమ గాఢనిద్రనుండి మేల్కాంతురు; సర్వశక్తివంతుడును, సమస్త శ్లాఘనీయుడును అగు తమ ఈశుని జీవితకాలములో తమకు దక్కియుండని దానినిక పొందలేమని తెలిసికొందురు. వారికి తెలిసి యుండెనేని, ‘ఆయన’ సింహాసన సమక్షమున తమ నామప్రస్తావనకైై సమస్తమును పరిత్యజించియుండెడి వారు. నిశ్చయముగా, వారు మృతసదృశులు.
41పాండిత్యముచే గర్వమునొంది, స్వయమాధారుడనగు నా దివ్య నామమును గుర్తించుట నుండి తిరస్కరింపబడినవాడై, తనను వెన్నంటివచ్చు పాదరక్షల సవ్వడిని వినినంతనే స్వీయౌన్నత్యమున నిమ్రోదుకన్న తానే యధికుడనని అహంకరించునాతడు జనబాహుళ్యమున కలడు. ఓయి తిరస్కృతుడా! ఇప్పుడాతని యావాసమెక్కడ? దైవసాక్షిగా, అధోలోకాగ్ని యది. వచించు : ఓ దివ్యజ్ఞానుల సముదాయమా! నా పరమోన్నతలేఖిని చేయు తీవ్ర ధ్వని నాలకింపలేకున్నారా? సమస్త కీర్తి దిఙ్మండలోపరితలమున ఈ భానుడు దేదీప్యమానముగ శోభిల్లుటను కాంచలేకున్నారా? మీ దుష్ట మనోవికార ప్రతిమల నింకెంత కాలమారాధింతురు? మీ శుష్కభ్రమలను వీడి అనంతజీవనుడగు మీ భగవంతుని దెస కభిముఖులు కండు.
42ధర్మకార్యార్ధమై యర్పించిన దానధర్మములు సంకేతములకర్తయగు భగవంతునికే చెందును. ఆవిష్కరణకు అరుణోదయస్థానమగు ‘ఆయన’ యానతిలేనిదే దానిని వినియోగించు హక్కెవ్వరికిని లేదు. ‘ఆయన’ యనంతరము అఘ్సాన్‌కును, ఆపై న్యాయమందిరమునకును ఈయధికార మబ్బును. ఈ ప్రపంచము నందది స్థాపితమైనప్పుడు వారీ దానధర్మములను ఈ దివ్యధర్మపరముగ నౌన్నత్యమునొందిన ప్రదేశములయందున శక్త్యధికారాధి నాధుడు తమకు నిర్దేశించిన దానికై వినియోగింపవచ్చును. అట్లు కాదేని, ‘ఆయన’ ఆజ్ఞ లేనిదే మాట్లాడనివారు, ‘ఆయన’ ఫలకమునందు నిర్దేశింపబడిన దాని ననుసరించి తప్ప వేరు తీర్మానించని బహాజనులకు, ఈ దేవాదాయములు మరలింపబడును. అదిగో చూడుడు, వారు భూ స్వర్గముల మధ్య విజయాగ్రేసరులు. శక్తివంతుడును, ఔదార్యుడును అగు భగవంతునిచే దివ్యగ్రంథమునందు పొందుపరచబడినటుల వారు దానిని వినియోగింప వచ్చును.
43పరీక్షాసమయమున పరితాపమునొందక, సంబరపడక, ఆపత్కా లమున నన్ను స్మరియించుట, భవిష్యత్తులో మీకు సంభవింపనున్నదాని గురించి యోచించుట యను మధ్యేమార్గము నెంచికొనుడు. సమస్తజ్ఞాని, సకలమును ఎరిగినట్టి ఆయన* - ఈ విధముగా తెలుపుచున్నాడు.
44మీ శిరములకు సంపూర్ణ ముండన మొనరింపవలదు. భగవంతుడు వానిని కేశములతో నలంకరించినాడు. ప్రకృతి యవసరములను గ్రహియింప గల్గిన వారికిందు సృష్టికర్త గావించిన సంకేతములున్నవి. ‘ఆయన’ నిశ్చయముగా బలవివేకములకు దేవుడు. అయిననూ, కేశములను కర్ణసీమలను మించి పెరగనీయుట యుక్తము కాదు. జగదీశుడగు భగవంతుడీ విధముగ నాదేశించినాడు.
45చోరునకు ప్రవాసమును, కారాగారవాసమును శిక్షగా నిర్ణయింప బడినవి; నేరము మూడవమారు పునరావృతమయ్యెనేని, భగవంతుని నగరములలోనికిని, ‘ఆయన’ రాజ్యములలోనికిని అనుమతింప బడకుండు నటుల, ఆతని నుదుటిపై నొక ముద్రను వేయుడు. వాత్సల్యము కొలది మీరు దైవశాసనముల నమలుచేయుట నుపేక్షింతురేమో, దయాళువును, కరుణా మయుడును అగు ‘ఆయన’ చే మీకై విధియింపబడిన దానిని నిర్వర్తింపుడు. తండ్రి తనయునకు బుద్ధిగరపునటుల - జ్ఞాన, శాసనములను దండముతో మేము మీకు బుద్ధిగరపునది మీ స్వీయరక్షణకు, అభివృద్ధికే తప్ప వేరొండు కాదు. నా జీవితము సాక్షిగా : పవిత్ర శాసనావిష్కరణ మూలమున మీకై మేమభిలషించినదానిని మీరెరిగియుంటిరేని విమలమును, శక్తియుతమును, మహోన్నతమును నగు ఈ దివ్యధర్మమునకై ఆత్మార్పణమొనరింతురు.
46ఎవ్వరైనను సువర్ణ, రజత పాత్రముల నుపయోగింప నెంచినచో స్వేచ్ఛగా వాడుకొనవచ్చును. నలుగురితోకూడి ఆహారస్వీకరణము గావించునపుడు పాత్రములు, పళ్లెరముల యందలి పదార్ధములలోనికి చేతులను జొప్పింతురేమో, జాగరూకులు కండు. అత్యంత పరిశుభ్రతకనువగు తీరుల నవలంబింపుడు. నిశ్చయముగా, ‘ఆయన’, మీరు పరమోన్నత సామ్రాజ్యమందలి స్వర్గవాసుల లక్షణములను మీయందు వీక్షింప నభిలషింపుచున్నాడు. మీకును, స్వర్గలోక నివాసులకును ఏహ్యమగు దాని నవేక్షించుట నుండి మీ నేత్రములు సురక్షితము లగుటకై సర్వావస్థలయందునను స్వచ్ఛత కత్యధిక ప్రాధాన్యతనిండు. దానినుండి వైదొలగిన యాతడి కార్యము తక్షణమే నిష్ఫలమగును. అయినను, తగు హేతువున్నచో భగవంతు డాతడిని మన్నించును. ‘ఆయన’ నిక్కముగా దయామయుడు, మహాప్రదాత.
47పరమోన్నత నిష్కళంకత్వమున, భగవంతుని దివ్యధర్మపు టుషోదయోత్పన్న స్థానమగు ‘ఆయన’ కు భాగస్థుడెవ్వడును లేడు. సృష్టి సామ్రాజ్యమందలి “స్వీయేచ్ఛావర్తను” ని దివ్యావతార మాయనయే. భగవంతుడీ వైశిష్ట్యమును తనకై ప్రత్యేకించుకొని, అట్టి మహోత్కృష్ట స్థానము నందెవరికిని భాగనిర్దేశనము చేయలేదు. ఇతఃపూర్వ మభేద్యమర్మపు జాలికయందు నిక్షిప్తము గావింపబడిన దైవనిర్ణయమిది. ఈ దివ్యావిష్కరణమునందు వెల్లడించి, ఆపై భగవంతుని దివ్యగ్రంథమునందలి సత్యమును గ్రహియింపలేక, అలక్ష్యపరులయందున గణియింపబడుటకు కారణమగు తెరలను చింపి పారవైచితిమి.
48పఠన, లేఖన కళను, భగవంతుని పవిత్ర దివ్యఫలక నిర్దేశితము నంతటిని తన కుమారునికిని, కుమార్తెకును నేర్పింపవలసిన బాధ్యత ప్రతి తండ్రికిని విధియింపబడినది. తనకాజ్ఞాపితమైనట్టి దానిని త్రోసిపుచ్చిన వాని నుండి - ఆతడు సంపన్నుడైనచో - వారి విద్యాబోధన కవసరమగు ధనమును దివ్య ధర్మకర్తలు రాబట్టుకొనవలె; ఆతడు సంపన్నుడు కాడేని, న్యాయమందిరమే ఆ బాధ్యతను వహియింపవలసి యుండును. నిశ్చయముగా, దానిని మేము నిరుపేదలకును, ఆర్తులకును ఆశ్రయము గావించినారము. తన కుమారుని లేదా అన్యుని కుమారుని వృద్ధిలోకి తెచ్చిన, అది నా తనయుని వృద్ధిలోనికి తెచ్చినయట్లే యగును. అట్టి వానికి, లోకావృతమగు నా వైభవమును, నా ప్రేమాన్వితానుగ్రహమును, నా కారుణ్యమును ఉపలబ్ధములగును.
49ప్రతి జారుడును, జారిణియును న్యాయమందిరమునకు చెల్లింవ వలసిన అపరాధ శుల్కమును తొమ్మిది మిష్కల్‌ల సువర్ణముగా భగవంతుడు నిర్దేశించినాడు; వారా నేరమును పునరావృత మొనరించిరేని అది రెండింత లగును. దివ్యనామాధిపతి యగు ‘ఆయన’ వారికీ ప్రపంచమున విధియించిన అపరాధశుల్కమట్టిది, కాగా, ఆగామిలోకము నందత్యంత యవమానకరమగు వేదనను విధియించి నాడాయన. ఎవ్వడైనను పాపద్రష్టుడయ్యెనేని, దానియెడ పశ్చాత్తప్తుడై భగవంతు నాశ్రయించుట యుక్తము. ‘ఆయన’ నిశ్చయముగా, తాదలచిన యాతనికి క్షమాభిక్ష నొసంగును; ‘ఆయన’ సంప్రీతుడై గావించిన నిర్దేశము నెవ్వరును ప్రశ్నింపతగదు. వాస్తవమునకు, ‘ఆయన’ సర్వదా క్షమాపకుడు, సర్వశక్తివంతుడు, సమస్త శ్లాఘనీయుడు.
50సజీవమగు ఈ విమలోదక దివ్యస్రవంతి నుండి మీ వంతునొంద నీయక విభవపు తెఱలు - మిమ్ము నిరోధించేను జాగ్రత్త. అరుణోదయ కారకుడగు ఆయన పేరిట మోక్షకలశము నందుకొని, సకల మహిమాన్వితు డును, ఉపమానరహితుడును అగు ఆయనను సంకీర్తింపుచు, మెండుగా గ్రోలుడు.
51సంగీతశ్రవణమును, గానమును మీకు శాసనబద్ధము గావించినాము. అయినను, తత్శ్రవణము మిమ్ము గౌరవమర్యాదల పరిధుల నతిక్రమింప చేయకుండునటుల జాగరూకులు కండు. హృదయములను పరవశింపజేసి, భగవంతుని సాన్నిధ్యమునొందిన వారందరిని పరమానందభరితులను గావించు నా మహోన్నత దివ్యనామ సంజనితానందమే నీ యానందమగు గాక ! నిశ్చయముగ మేము, సంగీతమును మీ యాత్మల కొక నిశ్రేణిగ, అవి మహోన్నత దివ్యధామమునకు సముద్ధరింపబడు సాధనముగ నొనరించినాము; కావున, దానిని స్వార్ధమోహములకు ఱెక్కలుగా కానీయవలదు. యదార్ధమునకు, మీరు బుద్ధిహీనుల యందెంచబడగ జూడవలెనన్న మాకసహ్యము.
52సకల అపరాధశుల్కముల యందలి తృతీయ భాగము న్యాయ సింహాసనమునకు చెందవలెనని మేమాదేశించినాము; అట్టి సంచితమును - సకల వివేకియును, సర్వజ్ఞుడును అగు ‘ఆయన’ తమకు విధియించిన కార్యముల నిమిత్తము వెచ్చించుటయందున పూర్తిన్యాయమును పాటింపవలెనని దాని సభ్యులకు ప్రబోధింపుచున్నాము. ఓ న్యాయపురుషులారా! మీరు మీ కొమరులను కాపాడుకొనునటుల, భగవంతుని దివ్యధామమునం దాయన గొఱ్ఱెలకు సంరక్షకులు కండు; ప్రచ్ఛన్నములై యాకలిగొనియున్న తోడేండ్ల నుండి వానిని రక్షింపుడు. దివ్యోపదేశకుడు, విశ్వసనీయుడు మీకిటుల ఉద్బోధింపుచున్నాడు.
53ఏ యంశము గురించి యైనను మీలో విభేదములు తలయెత్తెనేని, వానిని యీ దివ్యస్వర్గపు నభోమండలముపై సత్యసూర్యుడింకను ప్రకాశింపు చుండగనే భగవంతునికి నివేదింపుడు; తత్సూర్యుడస్తమించినప్పుడు ఆయనచే ననుగ్రహీతమైనట్టి దానికి నివేదింపుడు. నిశ్చయముగ నిది సమస్త ప్రపంచ జనులకును సముచితమైనది. వచించు : ఓ ప్రజలారా ! నా ప్రత్యక్షతావైభవ మంతరించినపుడు, నా యుచ్చారణాసాగరము స్తబ్ధతనొందినపుడు మీ హృదయములను కలవరమొందనీయకుడు. మీ మధ్యనగల నా యుపస్థితి యందొక వివేకమున్నది; తుల్యరహితుడును, సర్వజ్ఞుడును అగు భగవంతునికి దక్క అన్యుల కర్థముగానట్టి దింకొక్కటి నా యనుపస్థితి యందున్నది. మేము మా దివ్యవైభవధామము నుండి నిశ్చయముగ, మిమ్మవలోకింతుము; మా దివ్యధర్మ విజయమున కుద్యమించు వారికి మా దివ్యగణాతిథేయులతో, మా యనుగ్రహమునొందిన దేవదూతలతో సాహాయ్యము గావింప జేయుదుము.
54ఓ భూ ప్రజలారా! అనిర్బంధితుడైన మీ ఈశునిచే నుచ్చరింపబడిన ప్రవచన మధురిమచే గండశిలలనుండి స్వచ్ఛవిమలోదక స్రవంతులు ఉప్పొంగినవనుటకు - శాశ్వతసత్యమగు భగవంతుడే నాకు సాక్ష్యము; అయినను, మీరింకను సుషుప్తి యందున్నారు. మీ యాధీనమందలి సర్వస్వమును త్యజియించి, నిస్సంగత్వమనెడు పక్షములపై సమస్త సృజిత ప్రాణుల కతీతముగ విహరింపుడు. తన లేఖినీచలనముచే మానవజాతి యాత్మను పరివర్తితమొనరించిన యా సృష్ట్యాధిపతి మిమ్ముల నీ విధముగ నాదేశింపుచున్నాడు.
55సకల కీర్తివంతుడగు మీ ప్రభుడు ఎట్టి మహోన్నత సీమల నుండి పిలుచుచున్నాడో యెఱుగుదురా? సకల నామాధిపతియగు మీ సర్వేశ్వరుడు దేనితో మిమ్ము శాసింపుచున్నాడో ఆ దివ్యలేఖినిని గుర్తించితిమని భావింపు చుంటిరా? లేదు, నా జీవితముపై యాన! దీనిని మీరెరిగియుంటిరేని ఈ జగమును త్యజియించి, హృదయపూర్వకముగ దివ్యప్రియతముని సమక్షమునకు వేగిరపడి యుండెడువారు. ఘనతరమగు జగమును సంక్షోభములో పడద్రోయు నటుల మీ యాత్మలు ‘ఆయన’ వాక్కునకు పరవశించెడివి, ఇక ఈ యల్పప్రపంచ మెంత ! నా యనుగ్రహమునకు ప్రతీకగా, నా ప్రేమాన్విత కారుణ్య ధామము నుండి నా యౌదార్యతుషారములు మీరు కృతజ్ఞులగునటుల భువిపై వర్షించినవి.
56ఒకనిని గాయపరచినందుకు లేక కొట్టినందుకు విధియింపబడు అపరాధశుల్కము - గాయపు తీవ్రతపై నాధారపడియుండును; ఏలయన దివ్యన్యాయాధీశుడు ప్రతి స్థాయికిని, విశేషపరిహారమును సూచించినాడు. సత్యముగా, ‘ఆయన’ నిర్దేశకుడు, శక్తివంతుడు, మహోన్నతుడు. మా కభీష్టమయ్యెనేని ఈ చెల్లింపులను వాటి సముచిత పరిమాణములలో నిర్దేశింతుము -- మేమిచ్చు వాగ్దానమిది; ‘ఆయన’ యదార్ధమునకు, తన ప్రతిజ్ఞాపాలకుడు, సమస్త విషయజ్ఞుడు.
57మాసమునకొక్క పర్యాయము విందును గావించుట, కేవలమది జలసమర్పణమైనను సరియే, నిశ్చయముగ మీకు విధియింపబడినది; ఏలయన, పరమాత్ముడు భూస్వర్గ సాధనములు రెండింటి సాహాయ్యమునను హృదయములను సమైక్యము గావింపదలచి యున్నాడు.
58దైహికములును, నీతిబాహ్యములును అగు వాంఛలు, మీ యందున విభేదములను రేకెత్తించునేమో జాగరూకులు కండు. ఒకే హస్తపుటంగుళుల వలె, ఒకే దేహపుటంగముల వలె ప్రవర్తిల్లుడు. మీరు విశ్వసింతురని, దివ్యావిష్కరణాలేఖిని మీకీ విధముగ నుపదేశింపుచున్నది.
59భగవంతుని సౌహార్ద్రమును, ‘ఆయన’ పురస్కారములను గణియింపుడు. ఆయన సమస్త ప్రాణులను తానై త్యజియింప జాలినను మీకు లబ్ధినొసంగు వానిని మీకు విధియించినాడు. మీ దుష్కార్యములు మాకెన్నడును హానిని కలిగింపజాలవు; అట్లని, మీ సత్కార్యములు మాకు లబ్ధినీ చేకూర్చవు. కేవలము పరమాత్ముని కొరకే మిమ్మాహ్వానింపుచున్నారము. అవగాహనా పరుడును, అంతర్దృష్టి యుతుడునునగు ప్రతి మనుష్యుడును యిందుకు సాక్షీభూతుడే.
60మీరు ఆహారయోగ్యములగు మృగములనో, పక్షులనో వేటాడవలసి వచ్చెనేని, వానిని వెన్నంటునపుడు భగవన్నామమును స్మరియింపవలె; ఏలయన, అటుపై పట్టుబడినదేదైనను - అది విగతజీవిగ దొరికినను సరియే - మీకు ఆమోదనీయమే యగును. ‘ఆయన’, సత్యముగా సర్వజ్ఞుడు, సమస్త పరిజ్ఞాని. అయినను, మితిమీరి వేటాడతగదని తెలియుడు. సర్వవిషయముల యందునను న్యాయపథమును, సమతౌల్యతను అనుసరింపుడు. దివ్యా విష్కరణోదయస్థానమగు ‘ఆయన’ మిమ్మిటుల ఆదేశింపుచున్నాడని గ్రహియింపుడు.
61నా వారియెడ కరుణను చూపుమని పరంధాముడు మిమ్మాదేశించి నాడు; కాని అన్యుల యాస్తిపై వారికెట్టి హక్కును ‘ఆయన’ యనుగ్రహింపలేదు. సత్యముగా భగవంతుడు తన సృజితజీవుల యావశ్యకతల కతీతముగ స్వయం సమృద్ధుడు.
62ఎవ్వడైనను ఉద్దేశ్యపూర్వకముగ నొక గృహమును అగ్నికి ఆహుతి గావించెనేని, మీరును వానినట్లే దహియింపుడు; బుద్ధిపూర్వకముగ నెవ్వడైనను యింకొకని ప్రాణమును తీసెనేని మీరును వానిని పరిమార్పుడు. మీ సర్వశక్తి సామర్ధ్యములతో భగవంతుని ప్రబోధముల ననుసరింపుడు; అజ్ఞానుల విధానములను విడనాడుడు. గృహదగ్ధ కారకునకును, హంతకునకును ఆజన్మ కారావాసమును మీరు విధియించినచో నది దివ్యగ్రంథ నియమముల ప్రకార మామోదనీయమే. ‘ఆయన’ కు, నిశ్చయముగ, తన యిచ్ఛానుసార మాదేశించు అధికారమున్నది.
63పరమేశ్వరుడు మీకు వివాహమును నిర్దేశించినాడు. ఇరువురుకన్న ఎక్కువమంది భార్యలను వివాహమాడుదురేమో, జాగ్రత్త. ఎవ్వడైనను భగవంతుని పరిచారికలయందొక్కరిని జీవిత భాగస్వామిగా పరిగ్రహించి సంతుష్టి నొందెనేని ఆతడు, ఆమె - యిరువురును సామరస్యముతో జీవింతురు. తన సేవకై యొక సేవికను గైకొను నాతడు సముచితరీతిన వర్తింపవలె. సత్యముగ, న్యాయముగ దివ్యావిష్కరణాలేఖినిచే పొందుపరుపబడిన నిర్దేశమిట్టిది. నా సేవకుల యందున నన్ను స్మరియించువానికి జన్మమునీయవచ్చును కనుక, ఓ మానవులారా ! వివాహితులు కండు. మీకిది నాయానతి; మీకు సహాయకారి యగుటకై దీనిని స్థైర్యముతో పాలింపుడు.
64ఓ జగజ్జనులారా! స్వార్ధప్రేరణల ననుసరించవలదు; ఏలయన, నిక్కముగా నవి క్రౌర్యమును, కామోద్రేకమును రేకెత్తించును. అందుకు బదులుగా భక్తిని, దైవభీతిని ప్రదర్శింపుడని మిమ్మాదేశించు సమస్తసృజిత వస్త్వాధిపతియగు ఆయన ననుసరింపుడు. ‘ఆయన’ యదార్ధమునకు, తన ప్రాణిసర్వస్వముకును సార్వభౌముడు. క్రమబద్ధీకృతమైన పిదప భువియం దనర్ధములను రెచ్చగొట్టరాదని తెలిసికొనుడు. ఇట్లు వర్తించునాతడు మావాడు కాడు, మేమాతనిని వర్జించినాము. దివ్యావిష్కరణాధామము నుండి సత్యబలముచే, ప్రకాశితమైన యాదేశమిట్టిది.
65వివాహము ఉభయపక్షముల సమ్మతిపై నాధారపడి యుండునని బయాన్ నందు పేర్కొనబడినది. మా సేవకుల యందున ప్రేమ, ఐక్యత, సామరస్యములను కలిగింపనెంచి, వారి మధ్య వైరమును, విద్వేషమును తల యెత్తునేమోనని, వివాహమాడనెంచిన జంట యభీష్టము తెలిసినతోడనే, అది వారి జననీజనకుల సమ్మతిన జరుగవలెనని మేము నియమబద్ధము గావించి నాము. మాకిందు వేరు ఉద్దేశ్యములును కలవు. మా యాదేశ మీవిధముగ నిర్దేశితమైనది.
66నగరవాసులకు పంధొమ్మిది మిష్కల్‌ల స్వచ్ఛమైన సువర్ణముగను, గ్రామీణులకు అంతే పరిమాణముగల రజతముగను నిర్ధారితమైనట్టి వివాహశుల్క సమర్పణ లేకుండ ఏ వివాహమును కుదర్పబడరాదు. ఈ మొత్తము నెవ్వరేని పెంచనెంచిన, దానినాతడు తొంబదియైదు మిష్కల్‌ల పరిమితి నధిగమిపనీయతగదు. మహత్వాధికారపూర్వకముగ పేర్కొనబడినయట్టి యాదేశ మిది. అయినను, అత్యల్పస్థాయి చెల్లింపుతో సంతుష్టుడయ్యెనేని, దివ్యగ్రంథాను సార మది యాతనికి సముచితమే యగును. లోకేశుడు, యదార్ధమునకు, తా దలచిన వారిని ఇహపర సాధనముల మూలమున సుసంపన్నుల నొనరించును; ‘ఆయన’ కు సత్యముగా, సకలాంశములపై నధికారమున్నది.
67తన సేవకులయందెవడైనను ప్రయాణము చేయనెంచిన, ఆతడు తాను గృహమునకు తిరిగివచ్చు సమయమును తన యర్ధాంగికి నిర్దుష్టముగ తెలుపవలెనని సర్వేశ్వరుడు తీర్మానించినాడు. వాగ్దత్త సమయమునకే తిరిగి వచ్చెనేని, ఆతడు దేవదేవుని యాదేశమును పాలించివాడగుటయే కాక, ‘ఆయన’ యధీకృత లేఖిని మూలమున ధార్మికులయందున గణియింప బడును; అట్లుగాక, ఆలస్యమునకు తగు కారణముండెనేని, తన కళత్రమునకా వర్తమానమునంపి, సకాలమునకామె చెంతకు వచ్చుటకు శాయశక్తుల యత్నింపవలె. వీటియందేదియును సంభవింపనిచో నామె నవమాసముల పర్యంతము నిరీక్షించుట యుక్తము; తదనంతరమామె పునర్వివాహము చేసికొనుట కెట్టి యవరోధమును ఉండబోదు. అయినను ఆమె సుదీర్ఘ కాలము నిరీక్షించెనేని - ఓరిమిని వహియించు స్త్రీ, పురుషులను భగవంతుడు నిశ్చయముగ, ప్రేమించును. నా యాజ్ఞల ననుసరింపుడు, భగవంతుని పవిత్ర ఫలకము నందపరాధులుగా గణియింపబడిన దుష్టుల ననుసరింప వలదు. ప్రతీక్షా సమయము నందొకవేళ, తన భర్తనుండి వార్తయందెనేని, శ్లాఘనీయ విధానము నామె యవలంబింపవలె. సత్యమునకు తన సేవికాసేవకులు పరస్పర మన్యోన్యముగ నుండవలెననునది ‘ఆయన’ యాకాంక్ష; మీలో పంతములు చెలరేగునట్లు వర్తింతురేమో, జాగరూకులు కండు. ఇవ్విధముగ తీర్మానము ధృవీకృతమై వాగ్దానము నెరవేరినది. అయితే, ఒకవేళ తన పతి మరణ లేదా హత్యా సమాచార మామెకు చేరెనేని, సాధికారిక నివేదికవలననో, ధర్మపరులగు యిరువురు సాక్షుల సాక్ష్యమువలననో నిర్ధారితమగునంత వరకు పునరుద్వాహము గాకుండుట యామెకు విధియింపబడినది; ఆపై నిర్ణీత మాసముల యనంతరము, తానెంచుకొనిన విధానమునామె యవలంబింప వచ్చును. శాసనకర్త యును, శౌర్యశాలియును అగు ‘ఆయన’ యాదేశమిట్టిది.
68భార్యాభర్తల మధ్య రోషద్వేషములు తలయెత్తెనేని, యాతడామెకు విడాకులనీయక ఒక సంవత్సరకాలము ఓరిమిని వహియింపవలె, ఏలయన, బహుశః వారియందనురాగ సౌరభములు పునఃపరిమళింవ వచ్చును. ఒకవేళ ఈ వ్యవధి పూర్తయి, వారి మధ్య ప్రేమ పునరుజ్జీవము నొందనిచో విడాకులు చోటుచేసుకొనుట విధాయకమే. నిక్కముగా, భగవద్వివేకము సమస్త వస్తు జాలమును ఆవరించినది. మీరు ముమ్మారు పలికి స్త్రీకి విడాకులనిచ్చు పూర్వ విధానము నవలంబించుటను పరమాత్ముడు తన తన యాజ్ఞాలేఖినిచే లిఖియింప బడిన యొక ఫలకమునందు నిషేధించినాడు. మీరు కృతజ్ఞులుగా పరిగణింప బడవలెనని, ఆయన తన పరముగ అనుగ్రహించినట్టిదిది. ఒక్కొక్క మాసము గడచుకొలది పరస్పరానురాగమును, అభీష్టమును ఒనగూడి నపుడు, విడాకులిడిన వాడు తన యర్ధాంగిని, ఆమె వేరెవ్వరినీ మనువాడియుండనిచో, పునరుద్వాహమగుటకు నిర్ణయించుకొనవచ్చును. ఆమె మరల వివాహిత కాకపోయిన పక్షముననూ, ఆమె పరిస్థితి మారనట్లు స్పష్టమైననూ తప్ప, ఈ నవ్యసమాగమముతో వియోగము నిర్ధారణయై విషయము ముగిసిపోవును. దివ్యసౌందర్యోదయ స్థానమగు ఆయనచే, రాజసముట్టిపడ, ఈ మహిమాన్విత ఫలకమునం దీవిధముగ తీర్మానము లిఖియింపబడినది.
69భార్య భర్తననుసరించి ప్రయాణించునప్పుడు దారిలో వారి మధ్య విభేదములు తలయెత్తెనేని ఆమెకొక సంపూర్ణ వత్సరము వ్యయములకు ధనము నాతడేర్పరుపవలసి యుండును; ఇంకను, ఆమెను వచ్చినచోటికి పంపివేయవలె, లేనిచో నామె ప్రయాణమునకు వలయు ఏర్పాట్లన్నియు చేసి ఒక విశ్వసనీయుని తోడిచ్చి గృహమున కంపవలె. మీ ఈశుడు, యదార్ధముగా, భూజనులందరినీ ఆవరించినయట్టి సార్వభౌమాధికారముతో తన యభీష్టానుసారము ఆదేశించును.
70విశ్వాసఘాతుక వర్తన నిరూపితమగుటచే పరిత్యక్త అయిన పడతి ప్రతీక్షాకాలము నందెట్టి మనోవర్తిని పొందజాలదు. ఇవ్విధముగ, న్యాయాంబరము నుండి మా శాసనప్రభాతనక్షత్రము దేదీప్యమానముగ ప్రజ్జ్వలించినది. వాస్తవము నకు, పరాత్పరుడు సమైక్యతను, సామరస్యమును అభిలషించును, వియోగమును, విడాకులను అభిశంసించును. ఓ జనులారా, ఒండొరులు ఆనందోత్సాహములతో మెలగుడు. నా జీవితము సాక్షిగా! ఉర్వి యందలి సమస్తమును సమసిపోవ సత్కర్మలే సజీవములై వర్ధిల్లును; నా వాక్కులు సత్యమనుటకు సర్వేశ్వరుడే సాక్షి. ఓ నా పరిజనులారా! మీ విభేదములను పరిష్కరించుకొనుడు; దురహంకారులను, ముష్కరులను అనుసరింపక, మా మహనీయలేఖిని ప్రబోధమును పాటింపుడు.
71మీ పూర్వీకులను మోసగించినటుల, మిమ్ము సైతమీ ప్రపంచము మోసగించునేమో, జాగరూకులు కండు! మీ పరమేశుని శాసన నియమములను పాలింపుచు, మీ ముందేర్పరుపబడిన సత్య, ధర్మయుతపథము ననుసరింపుడు. అసమానతను, అపరాధమును త్యజియించి సుగుణము నలవరచుకొనినవారు భగవంతుని దృష్టియం దాయన ప్రాణులలోకెల్ల శ్రేష్ఠులు. వారి నామములు ఊర్ధ్వలోకవాసుల సముదాయము చేతను, భగవన్నామమున సమున్నత మొనరింపబడిన ఈ దివ్యగుడారమునం దధివసించు వారందరిచేతను వినుతింపబడును.
72స్త్రీ, లేక పురుష బానిసల వ్యాపారము చేయుట మీకు నిషేధించ బడినది. తానే సేవకుడైయుండిన వానికి భగవంతుని సేవకుల క్రయము తగనిది. ఆయన పవిత్ర ఫలకమునందిది నిషేధ్ధము. ఆయన కారుణ్యముకొలది న్యాయలేఖినిచే ఈ రీతిగ యాజ్ఞ లిఖియింపబడినది. ఎవ్వడును ఇంకొకనిపై యాధిక్యతను వహియింపకుండు గాక; అందరును భగవంతుని యెదుట కట్టు బానిసలే; అంతియేకాక, ఆయన తప్ప అన్యదైవము లేడను సత్యము నెల్లరును సోదాహరణముగ చాటుదురు. సత్యముగా, ఆయన సమస్తవిజ్ఞాని; ఆయన విజ్ఞానము సర్వావృతము.
73మీరు సత్కర్మ వస్ర్తాభూషితులు కండు. ఎవని కార్యములు భగవంతునికి సంప్రీతిపాత్రములగునో, అట్టివాడు నిక్కముగా, బహా జనుల యందొకడై ఆయన సింహాసన సమక్షమున స్మరియింపబడును. సద్వివేచన, సద్వివేక, సద్ధర్మపూరిత కార్యములతో సమస్తసృష్ట్యాధిపతికి సహకరింపుడు. సకల దయామయుడగు ‘ఆయన’ పలు దివ్య ఫలకములం దీరీతిగ మీరు ఆదేశింపబడినారు. యదార్ధమునకు, నేను వచించునదంతయూ ‘ఆయన’ కు విదితమే. అన్యునితో నెవ్వడును కలహింపకుండు గాక, ఆతనిని వధియింప కుండు గాక; సత్యముగా నిది ఈ మహనీయ దివ్యగుడారమునం దగోచరముగ నుంచబడిన గ్రంథమునందు ప్రతిషేధితమైనది. ఏమీ! భగవంతుడు చేతనత్వమునిచ్చి, తన శ్వాసచే యూపిరిపోసిన వానిని వధియింతురా? అట్లయిన, ఈ మీ యుల్లంఘనము ‘ఆయన’ భద్రాసన సాన్నిధ్యమున తీవ్రమైనదిగా గణియింపబడును సుమా! దైవభీతిని కలిగి యుండుడు, ‘ఆయన’ పరిపోషితమును నాశనమొనరించుటకై అన్యాయ, దౌర్జన్య హస్తముల నెత్తక, నిత్యుడగు భగవంతుని మార్గము ననుసరింపుడు. దివ్యప్రబోధ కేతనధరులై దివ్యజ్ఞానాతిథేయ సమూహము లగుపించినయంతనే, సకల వైభవోపేతుడనగు ఆయన యూపిరిచే సృజియింపబడిన స్వర్గమునందలి యనంత జీవనస్రవంతి నుండి పానముచేయ నెంచిన వారు దక్క, మతవర్గములు పారద్రోలబడును.
74భగవంతుడు తన జీవకోటిపై తనకుగల దయకు ప్రతీకగా, వీర్యము ఏహ్యకరమైనది కాదని తీర్మానించినాడు. సంతోషాతిరేకముతో, ‘ఆయన’ కు కృతజ్ఞతల నర్పింపుడు, ఆయన సాన్నిహిత్యమను ఉదయస్థానమునకు దూరముగనుండువాని ననుసరింపకుడు. సర్వావస్థలయందునను దివ్య ధర్మమును సేవించుట కుద్యుక్తులు కండు; ఏలయన, భగవంతుడు, నిక్కముగా, సకల జగాచ్ఛాదితమగు తన సార్వభౌమాధికారముచే మీకు సహకరింపగలడు. మీ వస్త్రములపై మాలిన్య మిసుమంతైనను అగుపింపకుండు నటుల పారిశుధ్యపాశమును దృఢముగ చేబూనుడు. సకల పరిశుద్ధతల కతీతముగ పవిత్రీకృతుడైన ‘ఆయన’ యాదేశమిట్టిది. ఈ ప్రమాణము ననుసరింప లేకపోవుటకు తగు కారణమున్నచో నట్టి యాతడు నింద్యుడు కాడు. నిజమునకు, భగవంతుడు క్షమాశీలి, కరుణాళువు. మలినమైన ప్రతిదానిని, పేర్కొన బడిన మువ్విధములయం దేవిధముచేతను మార్పునొందని జలముతో ప్రక్షాళన మొనరింపుడు; గాలియందుంచుట చేతనో, మరియే అన్యమూలకముల వలననో మార్పునొందిన యుదకము నుపయోగింపక జాగరూకులు కండు. మానవాళి యందున పరిశుభ్రతకు పరమార్ధము కండు. అతులితుడును, సకల వివేకి యును అగు పరమేశ్వరుడు, సత్యమునకు మీకై యభిలషించినదిదియే.
75ఆ ప్రకారముగ, భగవంతుడు తన యౌదార్యసమక్షము నుండి వెలువడిన యనుగ్రహముగ, వివిధాంశములకును, జనులకును అశుచిని ఆపాదింపుచున్న “మలినత్వ” భావన నుద్వాసించినాడు. నిశ్చయముగా, ‘ఆయన’ సదా క్షమాశీలి, మహోదారుడు. సత్యముగా, మేము మా మహోత్కృష్టనామముల, మా విశేషస్వభావముల శోభలను సమస్త జగముపైనను భాసిల్లజేసిన నాటి, రిద్వాన్ ప్రథమ దివసమున, సమస్తసృష్టియును విమలాంబుధి యందున స్నానమాడినది. సమస్తభువనావృతమగు నా దయానుగ్రహమునకిది యదార్ధముగ నొక సంకేతము. మరి, సర్వమతస్థులతోడను సన్నిహితముగ వ్యవహరింపుడు; పరమకరుణాళువగు మీ యమరేశుని దివ్యధర్మము నెలుగెత్తి చాటుడు; అవగాహనా పరులైనచో సకల కార్యములకును మకుటాయమాన మిదియేనని యెరుంగుడు.
76ధూళిచే మలినమైన దానిని ప్రక్షాళనచేయవలెననుచు, సంపూర్ణ పరిశుభ్రతావలంబనను పరంధాముడు మీకు నిర్దేశించియుండ, ఇక పేరుకు పోయిన మురికిని, తత్సదృశ మాలిన్యమును గురించి వేరుగ చెప్ప నవసరము లేదు. దైవభీతిని కలిగి, పరిశుభ్రదేహులు కండు. ఎవ్వని వస్త్రమైనను మురికిగనున్నట్లగుపించినచో నాతని ప్రార్థనలు భగవంతుని దరి చేరజాలవు. ఉత్కృష్ట దేవగణము లాతనినుండి దూరముగ వైదొలగిపోవును. గులాబీజలమును, స్వచ్ఛములగు సుగంధద్రవ్యములను వినియోగింపుడు; తుల్య రహితుడును, సకల వివేకియును అగు మీ దేవదేవుడు వాస్తవమునకు వాంఛించినది మీ నుండి పరిమళింపవలెనని భగవంతు డనాదిగ నాశింపు చున్నాడు.
77బయాన్‌నందు గ్రంథ వినాశన పరముగ నిర్దేశితమైన శాసనము నుండి భగవంతుడు మిమ్ము విముక్తులను గావించాడు. వ్యర్థవివాద కారకములు గాక, మీకుపయుక్తములగు శాస్త్రముల నధ్యయనము గావించుట కనుమతించినాము; గ్రహియింపగలిగిరేని, మీకిది మేలొనర్చును.
78ఓ ధరణీశులారా! సకల సార్వభౌమాధినాధు డేతెంచినాడు. సర్వశక్తి వంతుడును, సంరక్షకుడును, స్వయంభువును అగు భగవంతునిదే దివ్య సామ్రాజ్యము. ఆయనను దక్క అన్యునారాధింప వలదు; సమస్తనామాధిపతి యగు మీ దైవము వంకకు జ్యోతిర్మయ హృదయములతో వదనములను సారింపుడు. మీ స్వాధీనమందలి దేనికిని సాటిరానట్టి దివ్యావిష్కరణమిది యని తెలియగలరు.
79మీరన్యులకై సంగ్రహించియుంచిన దానియెడ మీరానంద పరవశు లగుటను, నా నిక్షిప్తఫలకము దక్క అన్యమెద్దియును గణుతింపలేని లోకముల నుండి మిమ్ముమీరు దూరముగావించు కొనుటను మేమవేక్షింపు చున్నాము. మీరు సమీకరించుకొనిన సంపదలు మీ పరమలక్ష్యము నుండి మిమ్ము బహుదూరమున కాకర్షించినవి. ఈ రుగ్మత మీకు సముచిత మైనదేనని గ్రహియింపుడు. ఐహికములగు సకల మాలిన్యములను మీ మనస్సులనుండి క్షాళన మొనరింపుడు; సర్వమును త్యజియించి నిక్షిప్తఫలక నిర్దేశితమును పాటించిన వారిని దక్క తక్కిన ప్రపంచమును ప్రకంపింపజేసి, సమస్త జనులను శోకతప్తులనొనరించిన భూలోకసువర్లోకస్రష్టయగు మీ భగవంతుని సామ్రాజ్యమున కేగుటకు త్వరనొందుడు.
80భగవంతునితో సంభాషించిన యాతడు యుగప్రాచీనుని ప్రభను గాంచి, సాగరముల నుప్పతిల్లజేసిన ఈ దివ్యపాత్రమునుండి పునర్మిలనమను విమలోదకమును గ్రోలిన దివ్యదివసమిది. వచించు : ఏకైకుడగు నిజదైవము సాక్షిగా! దివ్యసామ్రాజ్యశిఖరముల నుండి పరమాత్ముని వాణి : “భువియందలి యో గర్విష్టులారా, కార్యోన్ముఖులు కండు, ఆయన చెంతకు త్వరనొందు” డని ప్రకటించుట విననగుచుండ దివ్యావిష్కరణాప్రత్యూషము చుట్టును సైనాయ్ పరిభ్రమింపుచున్నది. ఈ దినమున, కార్మెల్ ఆయన సాన్నిధ్యమునకు భక్తి తత్పరతతో త్వరనొందుచుండ, జియోన్ హృదయము నుండి: “వాగ్దానము నెరవేరినది. మహోన్నతుడును, సర్వశక్తివంతుడును, పరమ ప్రియతముడును అగు భగవంతుని పవిత్రాదేశమునం దుద్ఘోషితుడైన యాతడు ప్రత్యక్షీకృతుడైనా,”డను ప్రకటన వెలువడుచున్నది.
81ఓ మహీపతులారా ! ఈ స్థానమున, భావాతీతప్రభాస్థలియగు ఇప్ర్పదేశమున మహోన్నత శాసన మావిష్కృతమైనది. చంద్రు డెవ్వరిచే ఛిద్రము గావింపబడెనో, అప్రతిహతమగు ప్రతి తీర్మానమును ఎవ్వరిచే విశదీకృతమైనదో, తుదిఘడియల నెవ్వరారంభించిరో ఆ పరమ నిర్దేశకుని యిచ్ఛామూలమున ప్రతి నిక్షిప్త విషయమును వెలుగులోనికి తేబడినది.
82ఓ రాజన్యులారా ! మీరు సామంతులు మాత్రమే. తన మహాద్భుత కీర్తితో కొలువై, సంకటహరుడును, స్వయంభువును అగు తన చెంతకు మిమ్మాహ్వానింపుచు, రాజాధిరాజగు ‘ఆయన’ ప్రత్యక్ష మైనాడు. దివ్యావిష్కరణా మూలము నెరుగుటలో మీ యహంకారము మిమ్ము నిరోధించేను జాగ్రత్త; స్వర్గస్రష్టయగు ‘ఆయన’ నుండి మిమ్ము ప్రాపంచికవిషయములు తెరలవోలె త్రోసివేయునేమో జాగరూకులు కండు. సమస్త జాతుల ఆకాంక్షయును, మిమ్ము తన ఏకైకవాక్కుచే సృజించి, తన సార్వభౌమత్వమునకు శాశ్వత ప్రతీకలు గావించిన ‘ఆయన’ ను సేవించుట కుద్యుక్తులు కండు.
83భగవంతుని ధార్మికత్వము సాక్షిగా! మీ రాజ్యములపై ఆధిపత్యమును నెరపుట మా యాకాంక్ష గాదు. మానవ హృదయములను జయించి, స్వాధీన మొనరించుకొనుటయే మా కార్యము. బహా నేత్రములు వానిపైననే స్థిరముగా నిలిచినవి. దివ్యనామముల సామ్రాజ్యమిందులకు సాక్ష్యము వహియించునని మీరు గ్రహియించిన చాలును. తన దైవము ననుసరించు నాతడు ప్రపంచమును, తత్సర్వమును త్యజియించును; మరి యంతటి మహోన్నత స్థానము నొందియున్న ఆయన నిస్సంగత్వమెంతటి యుత్కృష్టమై యుండ వలె ! మీ సౌధములను వీడి ఆయన దివ్యసామ్రాజ్యప్రవేశప్రాప్తికై త్వరనొందుడు. వాస్తవమునకు, మీకిది ఇహపరములు రెండింటియందునను ఫలదాయకము. ఊర్ధ్వలోకాధిపతి యిందుకు సాక్ష్యము వహియించునని తెలియుడు.
84నన్ను దక్క సర్వమును త్యజియించి, నా దివ్యసామ్రాజ్యమున నా దివ్యధర్మమునకు సాహాయ్యమొనరింప నుద్యమించు రాజునకై నిరీక్షించు వదాన్యత ఎంతటి ఘనమైనది! అట్టి రేడు బహాజనులకై భగవంతుడు సంసిద్ధము గావించిన శోణమహానౌక యందలి సహచరుల యందొక్కనిగ గణియింపబడును. సర్వులును ఆతని నామమును కీర్తింపవలె; ఆతని స్థాయిని గౌరవింపవలె; గోచరాగోచర లోకస్థితమగు సకలమునకు బలయుత సంరక్షకుడనగు నా నామమనెడు తాళములతో నగరసీమలను వివృతమొనరించుటకై యాతనికి తోడ్పడుడు. అట్టి భూపాలుడు సమస్తమానవజాతికిని నేత్రము, సృష్టిశిఖరమున ప్రభవిల్లు భూషణము, సమస్త జగత్తునకును శుభాశీస్సుల మూలమగు స్రవంతి. ఓ బహాజనులారా, ఆతనికి సాహాయ్యము గావించుటకై మీ సంపత్తిని, కాదు మీ జీవితములనే యర్పింపుడు.
85ఓ ఆస్ట్రియా చక్రవర్తీ: నీవు అఖ్సా మసీదు సందర్శనార్థమై వెడలినప్పుడు, భగవజ్జ్యోతిఃప్రత్యూషమగు ‘ఆయన’ అక్కా కారాగారవాసిగ నున్నాడు. నీవాయనను గమనింపవైతివి, ప్రతి గృహమును మహోన్నత మొనరించి, ప్రతి ఘనద్వారమును వివృత మొనరించినయట్టి ఆయనను గురించి విచారణ సైతము గావింపవైతివి. నిశ్చయముగ, మేమీ తావును సకల జగమును ఆశ్రయించునటుల, జగజ్జనులు నన్ను స్మరియింపునటు లొనరించినాము; అయినను, ఈ యారాధనకు పరమావధియగు ‘ఆయన’ - నీ ప్రభుడును, సకలలోకాధీశుడును అయిన భగవంతుని దివ్యసామ్రాజ్యముతోకూడి ప్రత్యక్ష మైనపుడు, ‘ఆయన’ ను విస్మరించినాడవీవు. మేము సదా నీతోడ నుండి, నీవు అలక్ష్యమూలమును, దాని శాఖను అంటిపెట్టుకుని యుండుటను గాంచితిమి. నా వచనములకు నీ దైవమే సాక్షి. మేము నీ ఎదుటనుండినను, మమ్మెఱుగక, మా నామము చుట్టును పరిభ్రమింప జూచి దుఃఖితులమైతిమి. నీ నేత్రములను దెరువుము, తద్వారా - ఈ మహోజ్జ్వల దృశ్యము నవలోకించి, దివారాత్రములును నీవారాధించునట్టి ‘ఆయన’ ను చూడవచ్చును; ఉజ్జ్వల దిఙ్మండలముపై శోభిల్లు దివ్యజ్యోతిని గాంచవచ్చును.
86వచించు : ఓ బెర్లిను రాజా! “సత్యముగా, అనంతుడను, అసమాను డను, దినప్రాచీనుడను అగు నేను తప్ప అన్యదైవము లే”డని ఈ ప్రత్యక్షీకృత దేవళము నుండి వెలువడుచున్న దైవవాణి నాలింపుము. దివ్యావిష్కరణ ప్రత్యూషమును గుర్తించుటలో నీ యహంకారము నిన్నాటంక పరచునేమో, భూస్వర్గముల సింహాసనాధీశుని నుండి ఐహిక వాంఛలు తెరవోలె నిన్నావరించు నేమో, జాగరూకుడవు కమ్ము. పరమోన్నతుని లేఖిని నీకీరీతిగ యుపదేశింపు చున్నది. సత్యముగా, ‘ఆయన’ మహోదారుడు, సకల వదాన్యుడు. నిన్ను మించిన యధికారముగల, నిన్ను మించిన స్థాయినొందిన యాతడు (మూడవ నెపోలియన్) నీకు జ్ఞాపకమేనా? అతడెక్కడ? ఆతడి స్వాధీనమందలి వస్తుసంచయ మెటకు పోయినది? హెచ్చరికగ నుండుము, గాఢనిద్రాపరవశులలో జేరకుము. క్రౌర్యాతి ధేయులు మమ్మెటుల బాధించిరో మేమెరుక పరచినపుడు భగవత్ఫలకమును వెనుకకు విసిరినదాతడే. కావుననే, దురదృష్టమన్ని వైపుల నుండియు తన నావరింప, ఆతడెంతయో నష్టినొంది మట్టిపాలైనాడు. ఓ రాజా ! ఆతనిని గురించియును, నగరములను జయించి నీ వలె ప్రజలను శాసింపు చున్న వారిని గురించియును - సుదీర్ఘముగ యోచింపుము. సకల దయామయుడు వారిని, వారి సౌధములను భ్రష్టతనొందిచి సమాధుల పాలొనరించినాడు. హెచ్చరిక నొందియుండుము, ఆలోచనాపరుల యందొకడవు కమ్ము.
87మేము మిమ్మర్ధించిన దేమియు లేదు. ఓ రాజసముదాయమా ! మాకు మీ మూలమున సంభవించిన దానిని సత్యముగా, భగవంతుని కొఱకు మేమెటుల సైరించితిమో, నటులే సహిష్ణులై యుండవలెనని యుద్బోధింపు చున్నాము.
88ఓ అమెరికా పాలకులారా, అందలి గణతంత్ర రాజ్యాల అధ్యక్షులారా! “నిరంతరుడును, క్షమాశీలియును, సమస్తౌదార్యుడును అగు నేను తప్ప అన్యదైవము లే”డని అనంతత్వశాఖపై నుండి కూయుచున్న ఈ కపోతము నాలింపుడు. మీ రాజ్యమును న్యాయాభరణము చేతను, దైవభీతి చేతను, దాని మస్తకమును స్వర్లోకస్రష్టయగు భగవంతుని స్మరియించుటయను మకుటముతోడను - అలంకరింపుడు. సర్వజ్ఞుడును, సకల వివేకియును అగు ‘ఆయన’ యానతిచే, దివ్యనామములకు ఉషోదయమగు ఆయన మీకీ విధముగ నుపదేశింపుచున్నాడు. వాగ్దత్తపురుషుడీ మహనీయస్థానమునం దవతరించుట గాంచి, సమస్త గోచరాగోచర ప్రాణులును సంతసము నొందినవి. దివ్యయుగ ప్రయోజనము ననుభవింపుడు. సత్యముగా, సూర్యరశ్మి సోకిన సమస్తవస్తుదర్శనమునకన్న మీకాయన సందర్శనమెంతయో మేలని గ్రహియింపుడు. ఓ పాలక సముదాయమా! దివ్యవైభవప్రత్యూషము నుండి: “యదార్ధమునకు వాగ్దైవమును, సర్వజ్ఞమును అగు నేను తప్ప అన్యదైవము లే” డని వెలువడిన వాణి నాలింపుడు. అణగారినవారిని న్యాయహస్తములతో దరిజేర్చుకొనుడు, ఎగసిపడు పీడకుని - నిర్దేశకుడును, సకల వివేకియును అగు మీ ప్రభుని యాజ్ఞాదండముచే - అణచివేయుడు.
89ఓ కాన్‌స్టాంటినోపుల్ ప్రజలారా! అదిగో! మీ మధ్యనుండి భయానకములైన ఉలూకపు కూతలను మేమాలించినాము. మనోవికారపు మైకము మిమ్మావరించినదా, లేక అలక్ష్యము నందడగి యుంటిరా? సముద్ర ద్వయ తీరములపైనున్న యో దివ్యస్థలీ! ఊర్ధ్వలోక దేవగణములును, మహోన్నతాసనమును పరివేష్టించిన వారును దుఃఖితులై రోదించునటుల నిరంకుశత్వాసనము నిక్కముగ నీపై స్థాపితమైనది, నీ యెదలో ద్వేషాగ్నిజ్వాలలు రగిలింపబడినవి. వివేకులను మూర్ఖులు పరిపాలించుటను, అంధకారము కాంతిపై గొప్పలుపోవుటను మేము నీయందవలోకింపుచున్నాము. యదార్ధమునకు నీ వహంభావపూరితవైతివి. నీ బాహ్యశోభ నిన్ను దురహంకారిని గావించినదా? మానవాళికి ప్రభుడగు ఆయన సాక్షిగా! ఇది యంతయును అచిరకాలములోనే అంతమొందును; నీ పుత్రికలు, విధవలు, నీ యందలి సమస్తవాసులును విలపింతురు. సర్వజ్ఞుడును, సకల వివేకియును మీకిట్లు తెలుపుచున్నాడు.
90ఓ రైన్ నదీతీరములారా! దండనా ఖడ్గములు మీపై దూయబడుటచే రక్తసిక్తములైన మిమ్మవలోకించినాము; అయినను, మీకింకొక యవకాశమున్నది. బెర్లిన్ నేడు పూర్ణవైభవముతోనున్నను దాని యాక్రందనలు మాకు విననగుచున్నవి.
91ఓ తా (తెహరాన్) ధాత్రీ! నీకెద్దియును వేదనను కలిగింపకుండు గాక, ఏలయన భగవంతుడు సకల మానవాళికి సంతోషదాయినిగ నిన్నెంచుకొనినాడు. ‘ఆయన’ మునుపు తోడేళ్లు చెల్లాచెదరొనంచిన దేవదేవుని మందను సమైక్యపరచి, న్యాయపరిపాలన గావించువానిని నీ సింహాసనము నందధిష్టింపజేసి యాశీర్వదించు గాక ! అట్టి పాలకుడు, ఆనందోత్సాహములతో, బహాజనుల కభిముఖుడై, వారికి తన యనుగ్రహముల నందింపగలడు. ఆతడు, వాస్తవమునకు భగవంతునిదృష్టియందున మానవజాతికి మణిభూషణముగ గణియింపబడును. దైవమహిమయును, ఆయన దివ్యావిష్కరణా సామ్రాజ్య వాసులందరి కీర్తియును అతనికి శాశ్వతముగ లభియించును.
92మహదానందము నొందుము; ఏలయన, తన దివ్యవైభవావతారము నీ యందావిర్భవించుటచే భగవంతుడు నిన్ను “తన శోభాప్రత్యూషము” గావించినాడు. కారుణ్యప్రభాత నక్షత్రము ప్రభవిల్లినయట్టి, భూమియును, స్వర్గమును శోభిల్లినయట్టి - ఈ నామము నీకనుగ్రహింపబడినందుకు సంతసిల్లుము.
93అచిరకాలమునకే, నీ యంతర్గత వ్యవహారముల స్థితి మారి, అధికార పగ్గాలు ప్రజల చేతికి రాగలవు. సత్యమునకు, నీ దైవము సర్వజ్ఞుడు. ఆయన యధికారము సమస్త వస్తువులను ఆవరించియున్నది. నీ ప్రభుని దయానుగ్రహములను విశ్వసింపుము. ప్రేమోపేతమగు దయాదృష్టి నీపైననే కేంద్రీకృతమై యుండును. నీ యావేదన, ప్రశాంతతగ, పరిపూర్ణశాంతిగ మార్పునొందు దినము రానైయున్నది. అద్భుతమగు దివ్యగ్రంథమునందీ విధముగ నిర్దేశితమైనది.
94ఓ ఖా(ఖురాసాన్) ప్రదేశమా! సకల సంపన్నుడును, మహోన్నతుడును అగు నీ దైవమును ఘనరీతిన శ్లాఘించుటకుద్యుక్తులైన మహావీరుల వాణి నీ నుండి మాకు విననగుచున్నది. సకల మహిమాన్వితుడనగు నా దివ్యనామమున, సృష్టిసామ్రాజ్యమునందు దివ్యనామ ధ్వజారోహణము జరుగు దినము శుభదాయకము. విశ్వాసులు ఆ దినమున దైవవిజయమునకు మోదమొంద, అవిశ్వాసులు ఖేదమొందుదురు.
95ప్రజలపై అధికారమును చెలాయించువారితో నెవ్వరును కలహింప రాదు. వారిని వారి దారికి విడిచిపుచ్చి, మీ దృష్టిని మానవ హృదయముల వైపుకు సారింపుడు.
96ఓ మహాశక్తిసమన్విత పయోనిధీ! దివ్యసార్వభౌమత్వమగు ‘ఆయన’ చే నీకనుగ్రహీతమైన దానిని దేశములపై సంప్రోక్షించి, ‘ఆయన’ న్యాయవస్త్రముతో సకల భూలోకవాసుల ఫాలములను అలంకరింపుము, తద్వారా సమస్త హృదయములును సంతసిల్లును, సకల నేత్రములును మిన్నగా మెరయును.
. ఎవ్వడేని శతమిష్కల్‌ల స్వర్ణము నార్జించినచో, అందలి పంధొమ్మిది మిష్కల్‌లు, భూస్వర్గముల స్రష్టయగు భగవంతునివి; ‘ఆయన’ కు సమర్పింపవలసినవి. ఓ జనులారా! ఇంతటి మహావదాన్యతను మీరు కోల్పోవుదురేమో, అప్రమత్తులు కండు. మేము మీతోడను, సమస్త భూస్వర్గ వాసుల తోడను వ్యవహరింప సర్వసమర్ధులమైనను, మిమ్ముల నీవిధముగ నాదేశించినాము; సర్వజ్ఞుడును, సమస్తము నెరిగినవాడును అగు భగవంతునికి దక్క, అన్యుని స్ఫురణకందని ప్రతిఫలములును, వివేకములును ఇందు గలవు. వచించు : ఈ విధముగ మీయార్జనలను పునీతమొనరించుటకును, మిమ్ములను భగవదేచ్ఛాపాత్రులకు దక్క అన్యుల యవగాహనకందని స్థానముల నందుకొన సమర్ధుల నొనరించుటకును ఆయన ఆకాంక్షించినాడు. సత్యమునకు! ఆయన ఉపకారి, ఉదారుడు, ప్రదాత. ఓ ప్రజలారా! భగవంతుని హక్కు యెడ అవిశ్వాసముతో వర్తింపనూ వలదు, ఆయన యనుజ్ఞ లేనిదే యధేచ్ఛగా దానిని వినియోగింపనూ వలదు. పావన ఫలకములయందున, ఈ పరమోన్నత గ్రంథము నందున ఆయన యాదేశ మివ్విధముగ నిర్ధారితమైనది. భగవంతునితో నవిశ్వాసముతో వ్యవహరించు నాతడు, తానును అవిశ్వాసమునకే గురియగును. భగవదాజ్ఞానుసారము వర్తించునాతడు - ఔదార్యుడును, వరప్రదాతయును, దాతయును, దినప్రాచీనుడును అగు తన ప్రభుని వదాన్యతా స్వర్గము నుండి ఆశీర్వచనము నొందును. నిక్కముగా, ‘ఆయన’ మీకై మీ జ్ఞానమునకు అతీతమైనదానినే, ఈ క్షణభంగుర జీవితానంతరము మీ యాత్మలు స్వర్గము దెసకు సముద్గమించి, మీ యైహికానంద బంధనములు భగ్నమైనపుడు మీకు గ్రాహ్యమగునట్టి దానినే ఆశించినాడు. దివ్యనిక్షిప్త ఫలకము నొందియున్న ‘ఆయన’ మిమ్ముల నీవిధముగ హెచ్చరింపుచున్నాడు.
97గోచరాగోచరములకు అధినాథుడును, సకలలోకాధిపతియును అగు దేవదేవుని శాసనముల గురించి ఎన్నియో విజ్ఞాపనములు విశ్వాసుల నుండి మా సింహాసన సమక్షమునకు వచ్చినవి. పర్యవసానముగా, మేమీ పావన ఫలకము నావిష్కరించి, జనులదృష్టవశమున తమ ప్రభుని యాజ్ఞల ననుసరింతురని, దానిని ‘ఆయన’ శాసనవస్త్రములో నిక్షిప్తము గావించినాము. అట్టి అభ్యర్ధనలు పూర్వమనేక వర్షముల నుండియు మాకు చేయబడినవి; అయినను, మా వివేకముతో, ఈమధ్య కాలములో, మిత్రుల నుండి లేఖలు అసంఖ్యాకముగ వచ్చునంత వరకు, మా లేఖినిని ఆపి యుంచినాము; కావుననే మానవ హృదయములను చైతన్యవంతము గావింపగల సత్యశక్తితో స్పందించినాము.
98వచించు: ఓ మతాధిపతులారా! మీ వర్తమాన ప్రమాణములతోడను, విజ్ఞానముతోడను భగవంతుని దివ్యగ్రంథమును ప్రామాణీకరింపవలదు; ఏలయన, ఆ గ్రంథమే మానవులయందేర్పరుపబడిన దోషరహిత మగు త్రాసు. మానవులును, వారి సంతతియును తమ స్వాధీనమందలి దేనినైనను, నిర్దుష్టమగు ఈ దివ్య తులతో కొలువవలసినదేననియు, దాని భారము తత్ప్రమాణానుసారమే పరీక్షింపబడవలెననియు తెలియుడు.
99రేయింబవళ్లును, ఉదయ,సాయంసంధ్యాసమయముల యందునను మీరెవ్వరి నామంత్రింపుచుంటిరో ఆయనను గుఱుతించుటలో మీరు వైఫల్యము నొందుటను గాంచి, నా వాత్సల్యాన్విత నయనము బాధాతప్తమై కన్నీరిడుచున్నది. ఓ జనులారా! “సత్యముగా, సర్వశక్తియుత సంరక్షకుడను, స్వయమాధారుడను అగు నాతో బోల్పదగిన అన్యదైవము లే”డని సద్రత్- ఉల్-ముంతహా పిలుపునిచ్చుచున్న శుభ ‘శోణితస్థలి’ వైపుకు హిమశ్వేత వదనములతో, జ్యోతిర్మయ హృదయములతో పురోగమింపుడు.
100ఓ మతనేతలారా! దార్శనికతయందున గాని, బుద్ధికుశలత యందున గాని మీలో నన్నెదిరించు వాడెవ్వడు? వాగ్పటిమయందున గాని, వివేకమున గాని నాకు సమయుజ్జీనని చెప్పుకొనువాడెందు కానవచ్చును? సమస్త దయాళువగు నా దైవము సాక్షిగా! లేడు; వసుధయందలి సమస్తమును సమసి పోవును; శక్తివంతుడును, పరమప్రియుడును అగు మీ భగవంతుని వదన మిదియే.
101జనులారా! సమస్త విజ్ఞానమునకును మూలాధారుడగు ఆయనను తెలియుటయే సకలవిజ్ఞానార్జనకును పరమోన్నత పరమావధి యని మేము నిర్దేశించినాము; అయినను, ఈ దివ్యజ్యోతికి ప్రత్యూషమును, ప్రతి గుప్త విషయావిష్కర్తయును అగు ‘ఆయన’ నుండి మీ విజ్ఞానము తెరయై మిమ్మెటుల తొలగద్రోచినదో యవలోకింపుడు. ఈ విరళీకృత వాక్ప్రభా మూలము నెరిగితిరేని, మీరీ జగమందలి జనులను, వారి యాధీనమందలి సర్వమును త్రోసిపుచ్చి ఈ పావన మహాన్వితపీఠ సామీప్యమున కేతెంతురు.
102వచించు: నిక్కముగా నిది, మాతృగ్రంథము భద్రపరుపబడిన స్వర్గమని గ్రహియింపుడు. “సర్వజన సార్వభౌముడును, సర్వాధికార ప్రపూర్ణుడును, ప్రేమోపేతుడును అగు దేవదేవునిదే సామ్రాజ్య” మని పవిత్ర భూమిస్థిత యగు మహాశైలముపై పాషాణముద్ఘోషించునటుల, హుతాశన నికుంజము ఎలుగెత్తి చాటునటుల గావించినదాయనయే.
103మేమే విద్యాలయమునను అభ్యసింపనులేదు, మీ వ్యాఖ్యానము లెవ్వియును పఠియింపనులేదు. నిరంతరుడగు పరమేశ్వరుని చెంతకు మిమ్ముల నాహ్వానింపుచున్న ఈ నిరక్షరుని పలుకుల నాలింపుడు. గ్రహియింపజాలితిరేని, వసుధపైగల సమస్త సంపదల కన్న యిది మీకు మిన్న.
104దివ్యావిష్కరణాస్వర్గమునుండి యనుగ్రహీతమైనదానిని అనుచితముగ వ్యాఖ్యానించి, దాని వాస్తవార్థమును వక్రీకరించు నాతనిని నిక్కముగా భగవంతుని మహోత్కృష్ట ప్రవచనమును భ్రష్టతనొందించిన వానిగ, పావన గ్రంథమునందు మృతునిగ గణియింప వచ్చును.
105నఖచ్ఛేదనము గావించుకొనుట, దేహమునావరించిన మాలిన్యమును వారమునకొక పర్యాయము జలకముతో అభిషేచన మాచరించుటయును, ప్రక్షాళనకై మున్ను మీరవలంబించినదాని నాచరించుటయును - మీకు విధియింపబడినది. తుల్యరహితుడును, ఉదారుడును అగు ‘ఆయన’ మీకై నిర్దేశించిన దాని నలక్ష్యము చేయుదురేమో జాగరూకులు కండు. పరిశుభ్ర జలమునందే మునక వేయుడు; ఒకసారి ఉపయోగింపబడిన నీటిలో మరల స్నానమాడుట కనుమతి లేదు. పారశీక ప్రజాస్నానవాటికలను సమీపింపవలదు; అట్టి స్నానఘట్టములకేగు నాతడు, వానియందున ప్రవేశించక పూర్వమే దుర్గంధ భూయిష్టుడగును. ఓ జనులారా! వానిని వర్జింపుడు, అట్టి నికృష్టత ననుసరించు నీచులయందు చేరవలదు. వాస్తవమునకు, వారు అశుచిత్వ మాలిన్యములయందున మునిగి యున్నారని గ్రహియింపుడు. అవ్విధముగనే, పారశీక గృహప్రాంగణముల యందలి దుర్గంధభూయిష్టములగు జలాశయము లను వర్జించి, స్వచ్ఛముగా, పవిత్రముగా నుండుడు. యదార్ధము నకు, దైవానుగ్రహీత హృదయులను రంజిల్లజేయు పరిమళములు మీ నుండి వెలువడ, మీరు భూమిపై స్వర్గవాసులంబోలి సంచరింప జూడ నెంచితిమి. స్నానాభిలాషి నీటిలో మునుగుటకన్న, నీటిని తన దేహముపై బడునటుల పోసికొనుట ఉత్తమము, అంతియేకాదు, దేహనిమజ్జనము నుండి విముక్తి యును కలుగును. యదార్ధమునకు, దేవదేవుడు - మీరు తనయెడ కృతజ్ఞులగునటుల - తన సాన్నిధ్యానుగ్రహముగ మీ జీవనములను సుఖప్రదములు గావింప నెంచినాడు.
106మీ తండ్రుల పత్నులను పరిణయమాడుట మీకు నిషేధింపబడినది. బాలుర విషయ చర్చకు మేము లజ్జతో వెనుదీయుదుము. ఓ జగజ్జనులారా, దయామయునియెడ భీతిని కలిగియుండుడు! మా పవిత్రఫలకమునందు మీకు నిషిద్ధమైనదాని నాచరింపవలదు. త్రోవదప్పి, వాంఛలదిగ్భ్రమయందు సంచరింపబోకుడు.
107జనబాహుళ్యము వీక్షింప, వీధుల వెంట, విపణియందు విహరింపుచు దివ్యప్రవచనములను వల్లించుటకెవ్వరును అనుమతింప బడలేదు; అట్లుగాక, దైవసంకీర్తనాభిలాషి - తానందుకై ఏర్పరుపబడిన ప్రదేశముల యందునగాని, నిజగృహమున గాని అవ్విధముగ నాచరించుట యుక్తము. నిజాయితీని, దివ్యత్వమును కలిగియుండుటకిది యెంతేని అవశ్యము. ఇవ్విధముగ, మా యాజ్ఞాభానుడు మా దివ్యోచ్చారణాదిఙ్మండలము నుండి శోభిల్లినాడు. మరి, మా యాజ్ఞానువర్తులు ధన్యులు.
108వీలునామా వ్రాయుట ప్రతి యొక్కరికిని విధియుక్తమై యున్నది. వీలునామాకర్త, తన శాసనమునకు మహోన్నత నామమును శీర్షిక గావించి, ఆ శాసనమందున - భగవంతుని దివ్యావిష్కరణోదయమున ఏకేశ్వరత్వమునకు సాక్ష్యము వహియించి, సృష్ట్యావిష్కరణ లోకముల యందున తనకు ప్రతీకయై, పరమ రక్షకుడును, విశ్వసనీయుడును అగు తన భగవంతుని వద్ద యొక నిక్షిప్తసంపద యగునటుల, తాను శ్లాఘనీయమని యెంచిన దానిని లిఖియింపవలె.
109సమస్త పర్వదినములును మహోన్నత పర్వదినద్వయమునను, దినద్వయమున సంభవించు మరి రెండు పండుగలయందునను సమ్మిళితమైనవి; మహోన్నత పర్వదినములలో మొదటిది : సకల దయామయుడు, సమస్త సృష్టిపైనను తన యుత్కృష్ట నామధేయముల, తన మహోన్నత స్వభావముల దేదీప్యమాన మహిమను వర్షింపజేసిన దినములలో సంభవింప, రెండవది : మృతులను పునరుజ్జీవితులను గావించి, సమస్త భూస్వర్గవాసులను సమీకృత మొనరించిన ఈ దివ్యనామపు సంతోషదాయక వర్తమానమును మానవాళికి ఘోషించిన ‘ఆయన’ ను మేము ఉత్తిష్ఠుని గావించినట్టిది. నిర్దేశకుడును, సర్వజ్ఞుడును అగు ‘ఆయన’ చే నివ్విధముగ నాదేశింపబడినది.
110భగవంతుడీ మహోన్నత నామమునకు అంకితమొనరించినయట్టి ‘బహా’ మాసపు తొలి దినమున ప్రవేశించిన వాడు సంతోషాత్ముడు. భగవంతుడు తనకనుగ్రహించిన యౌదార్యములకు ఈనాడు సాక్షీభూతుడైనట్టి యాతడు ధన్యుడు; యదార్ధమున కాతడు సమస్తలోకముల నావరించినయట్టి దేవదేవుని దాతృత్వమునకు కృతజ్ఞతా చిహ్నముగ నభివాదముల నర్పించువారలయందున గణియింపబడును. ప్రవచించు: వాస్తవమునకీ దినము సమస్త మాసములకును, వాటి మూలములకును మకుటము; సమస్తసృష్టి పైనను జీవన పవనములను ప్రసరింపచేసినయట్టి దినమిది. ఆనందాతిరేకమున దీనికభివాదము చేయు నాతడు ధన్యుడు. యదార్ధమునకాతడు, పరమానందభరితులలో నెన్నదగునని మేము సాక్ష్యమిత్తుము.
111వచించు: యదార్ధమునకు, మహోన్నత పర్వదినమున, ‘పర్వదిన వల్లభుడే’. ఓ జనులారా! భగవంతుడు మీకనుగ్రహించిన యౌదార్యమును స్ఫురణకు దెచ్చుకొనుడు. మీరు సుషుప్తియందున్నారు; అదిగో అవలోకింపుడు! ‘ఆయన’ తన దివ్యావిష్కరణయను చైతన్యపూరిత పవనములతో మీకు చేతనత్వమునొసగి ఆవిష్కృతమును, అద్వితీయమును అగు తన దివ్యపథమును మీకు తెలియపరచినాడు.
112అస్వస్థతావస్థలయందు సమర్ధులగు వైద్యులనాశ్రయింపుడు; మేము భౌతిక సాధనముల వినియోగము నలక్ష్యము గావింపలేదు; భగవంతుడు తన యుజ్జ్వల, మహిమాన్విత ధర్మమునకు ప్రత్యూషస్థలిగ నియమించిన ఈ దివ్యలేఖినితో దీనినామోదించితిమి.
113ఇతఃపూర్వము - విశ్వాసులలో ప్రతి యొక్కడును తన సముపార్జనల యందలి యమూల్య పురస్కృతులను మా యాసనముమ్రోల సమర్పింపవలెనను కర్తవ్యమును భగవంతుడు విధియించి యున్నాడు. ప్రస్తుతము, మా దయాన్వితాను గ్రహమునకు ప్రతీకగా ఈ యనివార్యత కుద్వాసన చెప్పినాము. సత్యమునకు, ‘ఆయన’ మహాదాత, సర్వౌదార్యుడు.
114ప్రత్యూషఘడియలో, తన యాలోచనలను దైవముపై కేంద్రీకరించి, ఆయన దివ్యనామస్మరణమున మగ్నుడై, ఆయన క్షమనర్ధింపుచు, మష్రిఖుల్ -అఝ్కార్ దిశగా తన యడుగులనువైచి, అందు ప్రవేశించి, సార్వభౌముడును, శక్తివంతుడును, సమస్తసంకీర్తితుడును అగు భగవంతుని ప్రవచనములను మౌనముగ నాలకించుటకై యాసీనుడగునాతడు ధన్యుడు. వచించు : నా సంకీర్తనమునకై గ్రామములయందునను, నగరములయందునను నెలకొల్పబడిన ప్రతి భవనమును మష్రికుల్- అఝ్కార్ యే. ఈ నామము కీర్త్యాసనమున కెదుట సూచితమైనట్టిదని గ్రహియింపుడు.
115సకల దయామయుని ప్రవచనముల నత్యంత మధుర స్వరములతో నాలపించు వారు, భూస్వర్గముల యౌన్నత్యము సైతము వాటికి సమతూగదని గ్రహియింతురు. వారు వాటినుండి - ఉత్కృష్టమును, శోభాయమానమును అగు దివ్యావిష్కరణాదృక్పథము అనుగ్రహింపబడిన వారు దక్క అన్యులవలోకింప జాలనట్టి నా ప్రపంచముల దివ్యసౌరభము నాఘ్రాణింతురు. ప్రవచించు: ఈ పావనప్రవచనములు పవిత్రహృదయములను, ఆనిర్వచనీయములును, ఊహాతీతములును అగు ఆధ్యాత్మికలోకముల కతిచేరువగా కొనిపోవును. ఆలకింపుచున్నవారు ధన్యులు.
116ఓ నా జనులారా! నా సృష్టియందున నన్ను ప్రస్తుతించుటకును, నా సామ్రాజ్యవ్యాప్తముగ నా దివ్యవాక్కును సముద్ధతి నొందించుటకును ఉద్యుక్తులైన నా సంచిత సేవకులకు సాహాయ్యము గావింపుడు. వీరు యదార్ధమునకు, మానవజాతికి నా ప్రేమాన్విత స్వర్గపు తారకలు, నా మార్గదర్శక దీపికలు. కాని నా పావన ఫలకములయం దనుగ్రహీతమైన దానికి విరుద్ధముగ పలుకునాతడు నావాడు కాడు. ఏ దుష్కపటినైనను మీరనుసరింతురేమో, జాగరూకులు కండు. భూ స్వర్గముల నడుమ తన వాణిని వెలువరించునాతడును, ఉషోదయ కారకుడును అగు ‘ఆయన’ ముద్రచే ఈ దివ్యఫలకములు అలంకృతములైనవి. నిక్కమగు ఈ పిడిని, శక్తిసమన్వితమును, దుర్భేద్యమును అగు నా దివ్యధర్మ పాశమును బలముగ చేబూనుడు.
117దివ్యధర్మసందేశమును ప్రాక్పశ్చిమములయందున విస్తరిల్లజేసి హృదయములు పునరుజ్జీవమునొంది, విగతాస్థిక చేతనత్వమునొందు నటుల ప్రపంచజనులయందున, వారి మిత్రులయందున తన దివ్యనామము నుచ్చరించు నిమిత్తమై వివిధ భాషల నభ్యసించనెంచు నాతనికి భగవాను డనుమతి ననుగ్రహించినాడు.
118విచక్షణాజ్ఞానవరప్రసాదియగు మానవుడు, ఆ జ్ఞానమును హరియించు దానిని గ్రహియింపతగదు. మానవస్థాయికి తగిన విధముగ తప్ప, అలక్ష్యపరుల, అస్థిరచిత్తుల యకార్యముల ననుసరించి ప్రవర్తింపరాదని యాతనికి నిర్దేశింపబడినది.
119మీ శిరములను విశ్వసనీయత, సౌశీల్యములనెడు సుమహారముల తోడను, మీ మనములను దైవభీతితోడను, మీ జిహ్వలను సంపూర్ణ సత్యసంధత తోడను, మీ దేహములను సౌజన్యాంబరము తోడను అలంకరింపుడు. మీరు పర్యాలోచింపగలవారేని, యదార్ధమునకు, మానవ దేహాలయమునకు తగిన భూషణములివి. ఓ బహాజనులారా! సత్యస్వరూపుడగు భగవంతుని శుశ్రూషా పాశమును చేబూనుడు; ఏలయన, ఆపై మీ స్థానములు వెల్లడియగును; మీ నామములు లిఖియింపబడి, భద్రపరుపబడును, మీ బిరుదము లౌన్నత్యము నొందును; భద్రఫలకమున మీ స్మరణ సంకీర్తితమగును. మహిమాన్వితమును, సమున్నతమును అగు ఈ స్థానమునుండి భూలోకవాసులు మిమ్ము ప్రతిరోధింతురేమో, జాగరూకులు కండు. మా యనేక లేఖలయందునను, మీ దైవమును, అధికారవంతుడును, సకలవివేకియును అగు భగవంతుని శాసనప్రభాత నక్షత్రము ప్రకాశితమైనట్టి మా యీ పవిత్ర ఫలకమున మిమ్మీ విధముగ ప్రబోధించినాము.
120నా ప్రత్యక్షతా పయోనిధి క్షీణతనొంది, మా దివ్యావిష్కరణాగ్రంథము సమాప్తినొందినపుడు, దైవసంకల్పితుడును, ఈ ప్రాచీనమూలోద్భవుడును అగు ‘ఆయన’ వంకకు మీ వదనములను సారింపుడు.
121మానవ మస్తిష్కములెంతటి యల్పములో యోచింపుడు. వారు తమకు హానికారకముల నపేక్షింతురు, తమకు లాభకరముల నుపేక్షింతురు. వారు యదార్ధమునకు సన్మార్గదూరులు. కొందరు స్వేచ్ఛనభిలషింపుచు, దానియం దహంకారపూరితులగుటను మేమవలోకించినాము. అట్టివారజ్ఞానపు టగాధమందున్నారు.
122స్వేచ్ఛ - తుద కెవ్వరును ఆర్పివేయజాలని విప్లవాగ్నికి దారి తీయును. గణకుడును, సర్వవిదుడును అగు ‘ఆయన’ మిమ్ములనీ విధముగ హెచ్చరింపు చున్నాడు. స్వేచ్ఛాస్వరూపమనినను, దానికి ప్రతీకయనినను చతుష్పాద జంతువేనని తెలియుడు. స్వీయ అజ్ఞానము నుండి పరిరక్షించునవి, దుర్మార్గు డొనరించు హాని నుండి సంరక్షించునవి యగు పరిధులకు లోబడియుండుట మానవునకు సముచితము. స్వేచ్ఛ మానవుని ఔచిత్యావధుల నతిక్రమింపచేసి, ఆతని స్థాయీగౌరవమునకు భంగము వాటిల్లజేయును. అది యాతనిని భ్రష్టత, దుష్టతల స్థాయికి దిగజార్చివేయును.
123మానవులను తమ సంరక్షణకు కాపరి యవసరమైన గొఱ్ఱెల మంద వలె గణియింపుడు. నిక్కముగా నిది సత్యము, పరమ సత్యము. నిర్దిష్ట స్థితుల యందున స్వేచ్ఛను మేమామోదింతుము, తక్కిన స్థితులయందున తిరస్క రింతుము. యదార్ధమునకు, మేము సర్వవిదులము.
124వచించు : నిజమగు స్వేచ్ఛ, నా యాజ్ఞలకు లోబడియుండు మానవుని విధేయతయందున్నది, స్వల్పముగనైనను తెలియుడు. మానవులు దివ్యావిష్కరణ స్వర్గమునుండి తమకనుగ్రహీతమైన దానిని పాటించిరేని వారు నిశ్చయముగ పరిపూర్ణస్వేచ్ఛ నొందగలరు. సృజిత వస్తు సమస్తమును ఆవరించినయట్టి తన యభీష్టస్వర్గము నుండి భగవంతునిచే నావిష్కృతమైన ప్రయోజనమును గ్రహియించిన యాతడు ఆనందభరితుడు. వచించు: నిత్యసత్యమగు భగవంతుని పరిపూర్ణ సేవయందు తప్ప నీకు లబ్ధినిచ్చు స్వేచ్ఛ యింకెందునను కానరాదు. దాని మాధుర్యము నాస్వాదించిన యాతడు దానిని సమస్త భూ స్వర్గ సామ్రాజ్యముల వినిమయమునకైనను విక్రయింపడు.
125మీరు మమ్ము ప్రశ్నలనడుగుట బయాన్‌నందు నిషేధించ బడినది. పూర్వీకులు అలవాటుగావేయు వ్యర్ధప్రశ్నలను గాక, మీరడుగదగిన ప్రశ్నలనడుగు స్వేచ్ఛయుండునటుల, ఇప్పుడు దేవదేవుడా నిషేధమునుండి మిమ్ము విముక్తులను గావించినాడు. దైవభీతిని కలిగి యుండుడు, ధార్మికులు కండు! దివ్యధర్మమునను, ‘ఆయన’ దివ్యసామ్రాజ్యమునను మీకు ఫలప్రదాయకము లగు ప్రశ్నలనే వేయుడు; ఏలయన, ‘ఆయన’ మృదుకారుణ్య ద్వారములు సమస్త భూస్వర్గవాసులకును తెరువబడినవి.
126ఒక సంవత్సరమందలి మాసముల సంఖ్య పంధొమ్మిదియని భగవంతుని దివ్యగ్రంథమున నిర్దేశితమైనది. వీనియందలి ప్రథమ మాసము సమస్త సృష్ట్యావృతమగు ఈ దివ్యనామముచే నలంకృత మైనది.
127మృతులను గాజుతో గాని, దృఢమగు రాతితోగాని, మేలైన మన్నికైన దారువుతో గాని చేయబడిన శవపేటికల యందుంచవలెనని, అక్షరములు చెక్కిన అంగుళీయములను వారి వ్రేళ్లకు తొడుగవలెనని పరాత్పరుడు నిర్దేశించినాడు. ‘ఆయన’ యదార్ధమునకు, పరమ నిర్దేశకుడు, సర్వవిదుడు.
128ఈ యంగుళీయకములపై పురుషులకు : “స్వర్గముల యందునను, భూమిపైనను, వాటి మధ్యనుగల సమస్తమును భగవంతునిది; వాస్తవమున కాయన సమస్త విషయజ్ఞుడు” అనియు, స్త్రీలకు : “స్వర్గముల యందునను, భూమిపైనను, వాటి మధ్యనుగల సామ్రాజ్యము భగవంతునిది; వాస్తవమున కాయన సకలాంశముల పైనను అధికారయుతుడు” అనియు అక్షరము లుండవలె. ఈ దివ్య ప్రవచనములు ఇతఃపూర్వమే యావిష్కృతములైనవి; అయినను, చూడుడు, ప్రస్తుతము బయాన్ కేంద్రము: “ఓ లోకముల శ్రేష్ఠప్రియుడా ! వాటి స్థానమున సమస్తమానవాళిపైనను నీ దయానుగ్రహముల పరిమళములను ప్రసరించు ప్రవచనముల నావిష్కరింపుము. నీ నుండి వెలువడు ఒక్క పదము బయాన్ నందనుగ్రహీతమైన సమస్తమును అధిగమించునని మేము ప్రతియొక్కరికిని ప్రకటించినాము. వాస్తవమునకు, నీవు నీకు సంప్రీతికరమైన దానినొనరింప సమర్ధుడవు. నీ భృత్యులను నీ కారుణ్యసాగరము నుండి పొంగిపొరలు అనుగ్రహములకు దూరము చేయకు. వాస్తవమునకు, నీవు అపారకరుణాన్వితుడవు,” అని ఘోషింపుచున్నది. అవలోకింపుడు, మే ‘మాయన’ పిలుపు నాలించి, ‘ఆయన’ ఇచ్ఛనిపుడు నెరవేర్చినాము. ‘ఆయన’, యదార్ధముగా, సర్వోత్తమ ప్రియుడు, ప్రార్థనల సమాధానకర్త. ఈ క్షణమున, భగవత్ప్రసాదితమైన ఈ క్రింది ప్రవచనము స్త్రీ, పురుషుల ఖననాంగుళీయములపై చెక్కబడుటయనునది వారికి యింకను శుభప్రదము; నిశ్చయముగ, మేము పరమనిర్దేశకులము : “నేను దైవము నుండి ఆగమించి, దయాళువును, కరుణాళువును అగు ‘ఆయన’ దివ్యనామమును దృఢముగ చేబూని, ‘ఆయన’ వినా సర్వమును త్యజియించి, ఆయన కడకే తిరోగమించు చుంటిని.” పరాత్పరుడీ విధముగ తన సాన్నిధ్యానుగ్రహమునకై యెంచుకొనిన వారిని ప్రత్యేకించినాడు. ‘ఆయన’, సత్యముగా, శక్త్యధికారముల కధిదేవుడు.
129అంతియేగాక, పట్టు లేదా నూలు వస్త్రము లైదింటి యందున మృతుని చుట్టవలెనని భగవంతు డాదేశించినాడు. పరిమిత వనరులు గలవారు వీటియందే రకముదైనను ఒక్క వస్త్రములో చుట్టిన చాలును. ఇవ్విధముగ సర్వజ్ఞుడును, సకలవిదుడును అగు ‘ఆయన’ చే నిర్దేశితమైనది. నగరము నుండి ప్రయాణకాలము ఒక గంటకు మించునట్టి దూరమునకు మృతదేహమును తరలించుట మీకు నిషేధింపబడినది. అట్లుగాక, అది యానందముతో, ప్రశాంతముగ ఒక సమీప ప్రదేశమున ఖననము గావింప బడవలె.
130ప్రయాణమునకు సంబంధించి బయాన్ గ్రంథమునందు విధియింప బడిన ఆంక్షలను దేవుడు తొలగించినాడు. ‘ఆయన’ యదార్ధమునకు అనిర్బంధనుడు; ‘ఆయన’ తనకు ప్రియమైనదానినొనర్చును, తన యభీష్టమును నిర్దేశించును.
131ఓ జగజ్జనులారా! మహత్తర కారాగారమందలి తన యావాసము నుండి : “యదార్ధమునకు, అధికారపరిపూర్ణుడు, శక్తివంతుడును, సమస్తాధీనుడును, సర్వోత్తముడును, సర్వజ్ఞుడును, సకల వివేకియును అగు నేను దక్క దైవము లే” డని మీకు చాటుచున్న దివ్యనామాధిపతి పిలుపు నాలింపుడు. సర్వశక్తి వంతుడును, సమస్తలోకపాలకుడును అగు ‘ఆయన’ తప్ప నిజమునకు వేఱు దైవము లేడు. ‘ఆయన’ యభిలషించిన, తన సాన్నిధ్య జనితమగు ఒకే ఒక్క వాక్కుతో, సమస్తమానవాళిపైనను అధికారమును సాధింపగలడు. జాగ్రత్త, దేని యెదుట స్వర్లోక దేవగణమును, దివ్యనామముల నగరాలవాసులును మ్రోకరిల్లిరో, ఆ దివ్యధర్మము నంగీకరించుటకు శంకింతురేమో, జాగ్రత్త. భగవద్భీతిని కలిగియుండుడు; తెరమరుగైన వారి చందమున యుండవలదు. తెరలను నా ప్రేమానలముచే దహియింపుడు. సమస్తసృష్టిని లోబరచుకొనిన ఈ దివ్యనామముచే వ్యర్ధపుటూహల మంచు తెరలను త్రెంచివేయుడు.
132పావనప్రదేశములు రెండింటియందునను గల గృహద్వయమును, సకల దయామయుడగు మీ దేవుని సింహాసనము సంస్థాపితమైన యితర స్థలములను ప్రవృద్ధమొనరించి, ప్రస్తుతింపుడు. అవగాహనాయుత మనస్కులగు ప్రతి యొక్కరి దైవము ఈ విధముగ నాజ్ఞాపింపుచున్నాడు.
133శక్తివంతుడును, విశ్వసనీయుడును అగు ‘ఆయన’ మీకు విధియించినదానిని పాటించుట నుండి ఐహిక బంధములును, బాధ్యతలును మిమ్ము ప్రతిబంధించునేమో, జాగరూకులు కుండు. శక్తిప్రపూరితమగు సార్వభౌమత్వ స్వరూపుడై, స్వయంస్థితుడై ప్రత్యక్షమైనపుడు ఆయనను విశ్వసింపనివారు వెలిబుచ్చిన శంకలతో వెనుకంజవేయక, మానవులయందున పట్టుదలకు ప్రతీకలు కండు. “సత్యముగా, మహాశ్రేష్ఠుడను, సమస్త సంకీర్తితుడను అగు నేను తప్ప దేవుడు లే” డను సత్యము నుగ్గడించు ఈ సజీవ దివ్యగ్రంథము చెప్పుదానిని ఆలకింపనీయక, దివ్యగ్రంథమున పొందుపరుప బడిన ఇంకేదైనను మీకు అవరోధము కలిగించునేమో జాగరూకులై వర్తింపుడు. దివ్యేచ్ఛాశక్తులనెడు స్వర్గము నవరోహించిన ‘ఆయన’పై న్యాయ దృక్కులను సారింపుడు, అన్యాయ వర్తనులు కాబోకుడు.
134ఇక, ఈ దివ్యావిష్కరణకు నివాళిగ నా యగ్రదూతయగు ‘ఆయన’ లేఖిని నుండి, జాలువారిన ఈ ప్రవచనములను స్ఫురణకు దెచ్చుకొని, నా యావజ్జీవితకాలమునను దమనకారుల హస్తములు ఎట్టి దుశ్చర్యలను కొన సాగించినవో యోచింపుడు. సత్యమునకు, వారు గతియించినవారియందున గణియింపబడినారు. ‘ఆయన’ యిట్లు పలికినాడు : “మేము ప్రత్యక్షీకరించు ‘ఆయన’ సమక్షప్రాప్తి నొందితిరేని, ఔదార్యముతో మీ పర్యంకములపై నాసీనుడగు వరప్రదాన మొనరింపుమని భగవంతుని యర్ధింపుడు. అట్టి చర్యే మీ పై అసమాన గౌరవాతిశయములను కురియించును. ఆయన మీ గృహముల యందొక్క చిరుపాత్ర యుదకమును సేవించినను సకల విశ్వాసులకే కాదు, సమస్త జీవకోటికి జీవనజలమును సమర్పించిన దానికన్న మిన్నయైన ఫలము దక్కును. ఓ నా భృత్యులారా! తెలిసికొనుడు.”
135మదీయాస్తిత్వమును నుతియించిన నా యగ్రగామి ప్రవచనము లిట్టివని గ్రహియింపుడు. ఆ దివ్యప్రవచనములను ధ్యానించి, వాటియందలి నిక్షిప్తమౌక్తికములును గ్రహించినవారు, భగవంతుని ధర్మజ్ఞత సాక్షిగా, ఈ కారా గృహము దిశనుండి వీయుచున్న సకలదయామయుని సౌరభమును గ్రహియించి, భూస్వర్గముల సేనలు సైతము నిరోధింపలేని అత్యాతురతతో, మనఃపూర్వకముగ ‘ఆయన’ వైపుకు పరువిడుదురు. వచించు: ఈ దివ్యావిష్కరణము చుట్టును ప్రతి నిదర్శనమును, దృష్టాంతమును పరిభ్రమింపుచున్నది. ధర్మనిర్ణేత లైనచో, మీ పరంధామునిచే, కరుణేశునిచే ఇవ్విధముగ ననుగ్రహింపబడినదని గ్రహియింపుడు. వచించు : సమస్త సృష్ట్యావృతమగు నా ప్రియకారుణ్య మృదు పవనములచేతను, నా యౌదార్య మధుర సౌరభములచేతను పారవశ్యము నొందినవారు తప్ప, సమస్త జీవులను సంభ్రమాశ్చర్యభరితులను గావించినయట్టి మహోన్నతుని దివ్యలేఖినికి అనుగ్రహీత మైన నిఖిల నిగమముల నిగ్గిది.
136ఓ బయాన్ జనులారా! మహోదారునియెడ భీతిని గలిగియుండుడు; మరియొక గ్రంథభాగమున : “భగవంతుడు సాక్షాత్కరింప జేయునట్టి ‘ఆయన’ యే యదార్ధముగా ‘ఖిబ్లేహ్’; ‘ఆయన’ శాశ్వతముగ విశ్రాంతినొందు వరకును, ‘ఆయన’ చలియించినపుడెల్ల అదియును స్థానచలనము నొందు” నని ‘ఆయన’ నుడివినదానిని గణియింపుడు. పరమ నిర్దేశకుడీ మహత్తర సౌందర్యమును ప్రస్తావింపనెంచినపుడు, ‘ఆయన’ చే నివ్విధముగ నిర్దేశింపబడినది. ఓ ప్రజలారా! దీనిపై పర్యాలోచింపుడు; కాని దోషారణ్యమున, ద్రోవతప్పి చరియించు వారివలె కావలదు. ఓ నిర్లక్ష్య సముదాయమా! మీ వ్యర్ధపుటూహల యానతిన మీరాయనను తిరస్కరించిరేని, మరి, మీరు ఆశ్రయించు ‘ఖిబ్లేహ్’ ఎక్కడ? ఈ దివ్యప్రవచనముపై దీర్ఘాలోచనము గావించి, భగవంతుని యెదుట ధర్మనిర్ణయము గావింపుడు; తద్వారా, అదృష్టవశమున, సమస్త మహిమో పేతుడను, పరమోన్నతుడను అగు నా దివ్యనామము పేరిట ఉప్పొంగు సంద్రమునుండి మార్మికమౌక్తికములను మీరు సమీకరించు కొనవచ్చును.
137ఈ యుగమందెవ్వడును, ఈ దివ్యావిష్కరణమునందు వెలువరింప బడిన దానిని తప్ప మరిదేనినీ సుస్థిరముగా నవలంబింపరాదు. ఇది భూత భవిష్యత్కాలములకు భగవంతుని నిర్దేశము; పూర్వపు దివ్యవార్తాహరుల పవిత్రలేఖనములు అలంకృతములైనట్టి నిర్దేశమిది. ఇది భూతభవిష్యత్కాలములకు భగవంతుని ప్రబోధము; దివ్యజీవనగ్రంథ ప్రవేశికను ప్రవృద్ధమొనరించిన ప్రబోధమిదియని గ్రహియింతురు గాక. ఇందుకు బదులు అజ్ఞానావమానముల నెంచుకొందురేమో జాగరూకులు కండు. ఈ దినమున భగవంతుడు దక్క ఎవ్వరును మీకు ఉపకరింపరు; సర్వజ్ఞుడును, సకల వివేకియును అగు ‘ఆయన’ తప్ప వేరొండు ఆశ్రయమును లేదు. నన్ను తెలిసికొనిన వారు సమస్త వాంఛల లక్ష్యమును తెలిసికొనినట్లే; నన్నాశ్రయించినవారు, సమస్త ఆరాధనాలక్ష్యము నాశ్రయించినట్లే. సకల జగన్నాయకుడు దివ్యగ్రంథమునం దివ్విధముగ నిర్దేశించి నిర్ధారించినాడు. భూత, వర్తమానతరములయందలి గ్రంథసమస్తమును గ్రాహ్యమొనరించు కొనుటకన్న కేవలము నా ప్రవచన మొక్కదానిని పఠియించిన చాలును. మీకు చెవులుండి వినజాలితిరేని, సకల దయామయుని వాణి యిది! వచించు: జ్ఞానసారమిదియేనని గ్రహియింపుడు.
138ఇక ఇప్పుడు, దైవవశమున మీ స్వీయభావనలను త్యజియించి, అస్తిత్వ ప్రభుడగు భగవంతునిదెసకు మీ వదనములను సారింప వచ్చునని వేరొక రచనాభాగమునందు వెలువరింపబడిన దానిని గుఱించి యోచింపుడు. ‘ఆయన’ (బాబ్) యిలా ప్రవచించినాడు: “బయాన్ విశ్వాసిని దక్క అన్యులను వివాహమాడుట శాసనవిరుద్ధము. వివాహకాలమునకు కేవలమొక పక్షమే దివ్యధర్మమునవలంబించి యుండెనేని, అతని లేదా ఆమె సంపదలు రెండవ పక్షమునకు - దివ్యధర్మములోనికి పరివర్తనమొందనంత వరకును - శాసనవిరుద్ధము లగును. అయినను, ఈ శాసనము యదార్ధమునకు - మేము ప్రత్యక్షీకరించునట్టి ‘ఆయన’ దివ్యధర్మము కాని, న్యాయమునకు యితః పూర్వమే ప్రత్యక్షీకరింపబడినది కాని ఔన్నత్యమునొందినపుడే అమలు జరుగును. ఇందుకు ముందుగా, మీ యభీష్టానుసారముగ వివాహబంధము నేర్పరచు కొనవచ్చును, ఈ విధానముతో మీరు దివ్యధర్మమునకు ఔన్నత్యమును సముపార్జింప వచ్చును. సకలౌదార్యుడగు తన దైవమును సంకీర్తింపుచు, ఉత్కృష్ట శాఖనుండి కోకిల మధురస్వరముతో నాలపింపుచున్నది. ఆలకించు వారికి శుభమగు గాక.
139ఓ బయాన్ జనులారా, సత్యశక్తిచే యనుగ్రహీతమైన ఈ వాణిని న్యాయదృష్టితో పరికింపుడనియు, దైవనిదర్శనమును వీక్షించియు దాని నుపేక్షించి, తిరస్కరించు వారలు కావలదనియు సర్వేశ్వరుడును, కారుణ్య దైవమును అగు మీ భగవంతునిసాక్షిగా నేను మీకు సూచింపుచున్నాడను. వారు వాస్తవమునకు తప్పక నశియించు వారు. ఈ దివ్యప్రవచనమున బయాన్ కేంద్రము తన స్వీయదివ్యధర్మ సమక్షమున నా దివ్యధర్మౌన్నత్యమును విస్పష్టముగ ప్రస్తావించినది; ఇందుకు ధర్మబద్ధమును, అవగాహనాయుతమును అగు ప్రతి మనస్సును సాక్ష్యము వహియించును. మీరీ దినమున స్వయముగ తక్షణమే విలోకింప గలుగుచున్నటుల, దీని ఘనత యెంతటిదన - నశ్వరజీవిత మైకమున అంధులైనవారును, తదనంతర జీవితమున తమకై అవమానకరమైన దండన నిరీక్షింపుచున్నయట్టి వారును దక్క అన్యులెవ్వరును కాదనలేనట్టిది.
140వచించు: భగవంతుని ధర్మబద్ధత సాక్షిగా! సత్యముగ, ‘ఆయన’(బాబ్) పరమప్రియుడను నేను; ఆయన దివ్యావిష్కరణాస్వర్గమునుండి ఈ క్షణమందున అవరోహితమగుచున్న దివ్యప్రవచనముల నాలింపుచు, మీరీదినముల యందొనరించిన దుష్కృత్యములకు విలపింపుచుండును. భగవద్భీతిని కలిగియుండుడు, దమనకారుల దరి చేరవలదు. వచించు : ఓ జనులారా ! మీరు ‘ఆయన’ (బహాఉల్లా) ను విశ్వసింపనెంచనిచో, కనీసము, ఆయనను వ్యతిరేకించుట నైనను మానుడు. దైవసాక్షిగా ! ఆయనకు వ్యతిరేకముగ సముద్యమించిన క్రూరసేనల దుశ్చర్యలు చాలును.
141ఈ దివ్యసంవిధానమున, పరమోన్నతుని లేఖిని తన మహోన్నత స్థానమును, తన మహోజ్జ్వలసౌందర్యమును దక్క అన్యమును సంకీర్తింప నవసరము లేకుండునటుల ‘ఆయన’ (బాబ్) కొన్ని శాసనములను నిశ్చయముగ నావిష్కరించినాడు. అయినను, మీయెడ మాకుగల అనుగ్రహమును చూపనెంచుటచే, మీరు పాటింపవలెనని - సత్యబలముచే, సుస్పష్టముగ ఈ శాసనములనేర్పరచినాము. మీరు పాటింపవలెనని - మేమభిలషించిన దానిని సులభము గావించినాము. నిక్కముగా, ‘ఆయన’ అనుకంపానిధి, వదాన్యుడు.
142ఈ దివ్యవివేక ప్రత్యూషముచే నుచ్చరింపబడిన దానిని ‘ఆయన’(బాబ్) ఇతఃపూర్వమే మీకు విశదీకరించినాడు. ‘ఆయన’ (బాబ్) ఇట్లు సెలవిచ్చినాడు : “మరి ‘ఆయన’ సత్యమునే వచించును : ‘యదార్ధమునకు, ఏకైకుడను, తుల్యరహితుడను, సర్వజ్ఞుడను, సకల ప్రాజ్ఞుడను అగు నేను తప్ప వేరొక దేవుడు లే’ డని, సర్వావస్థలయందునను ప్రకటించగల వాడు ‘ఆయన’ యే.”(బహాఉల్లా) ఈ పరమోన్నత, ఈ యమూల్యాద్భుత దివ్యావిష్కరణమునకు పరమేశ్వరుడు ప్రత్యేకించి ప్రసాదించిన స్థానమిది. ‘ఆయన’ ఔదార్యాన్వితానుగ్రహానికిది ప్రతీకయని, అప్రతిహతమగు ‘ఆయన’ తీర్మానమునకు సంకేతమని మీరు గ్రహియింపగల్గినచో గ్రహియింపుడు. ఇది ‘ఆయన’ పరమోన్నత నామమని, పరమోత్కృష్ట ప్రవచనమని, ఆయన మహోత్కృష్ట బిరుదముల ప్రత్యూషమని గ్రహియింపుడు. అంతియే కాదు, ప్రతి స్రవంతి మూలమును, ప్రతి దివ్య మార్గదర్శన ఉషోదయస్థానమును ‘ఆయన’ మూలముననే ఏర్పరుపబడినది. ఓ ప్రజలారా, సత్యముగా అనుగ్రహీతమైనట్టి దానిని గురించి దీర్ఘముగ నాలోచింపుడు, అందుపై పర్యాలోచింపుడు, కాని అతిక్రమించువారు కావలదు.
143సర్వమతస్థులును మీ నుండి భగవంతుని మధుర సౌరభముల నాఘ్రాణించుటకై, వారితో మీరు మైత్రీభావమున, సామరస్యమున సహజీవన మొనరింపుడు. మానవులయందలి మూర్ఖత్వపుటజ్ఞానజ్వాల మిమ్ములను జయింపకుండ జాగరూకులు కండు. సమస్తవస్తు సంచయమును భగవంతుని నుండే వెలువడును, తిరిగి ‘ఆయన’ చెంతకే తిరోగమించును. సమస్త విషయములకును ‘ఆయన’యే మూలాధారము. సమస్తమును ‘ఆయన’ యందే సంలీనమగును.
144గృహయజమాని లేని సమయమున, ఆతని యనుమతి లేకుండ, అందెవ్వరును ప్రవేశింపరాదని యెరుగుడు. మీరు సర్వావస్థలయందునను మర్యాదతో మెలగవలెనే కాని, మూర్ఖులుగా వర్తింపవలదు.
145మీ జీవనాదాయములను, అట్టి యితర జీవనోపాధులను జకాత్ సమర్పణతో పవిత్రీకరించుకొనుట మీకు నిర్దేశితమైనది. దివ్యప్రవచనావిష్కర్త యగు ‘ఆయన’ చే ఈ మహత్తర ఫలకమునందీ విధముగ సూచితమైనది. దైవేచ్ఛయును, సంకల్పమును అయినచో, దాని గణనకు ప్రమాణమును మేమచిర కాలములోనే నిర్దేశింతుము. యదార్ధముగా, ‘ఆయన’ తన యభీష్టమై, తన స్వకీయజ్ఞానమున వాంఛించిన దానినే వ్యాఖ్యానించును; సత్యమునకు, ‘ఆయన’ సర్వజ్ఞుడు, సకల వివేకి.
146భిక్షాటన శాసనవిరుద్ధము, భిక్షువునకిడుట నిషిద్ధము. జీవనోపాధి నార్జించుకొనుట ప్రతియొక్కరికిని నిర్దేశితమై యున్నది. అట్లొనరించుకొనలేని వారికి తగు సౌకర్యమును కల్పించుట భగవంతుని ప్రతినిధులపైనను, సంపన్నులపైనను మోపబడిన బాధ్యత. భగవంతుని శాసనములను, ఆజ్ఞలను పాలింపుడు; అంతియే కాదు వానిని మీ కన్నులవలె సంరక్షింపుడు, దారుణమగు హానికి లోనగు వారు కావలదు.
147మీరు విరోధ వివాదములయందున తలదూర్చుట, యితరులను దండించుట, మనస్సులకును, ఆత్మలకును విషాదకారకములగు చర్యలకు పాల్పడుట వంటివి భగవంతుని దివ్యగ్రంథమునందు నిషేధింపబడినవి. పరుల దుఃఖమునకు కారకులైన వారెవ్వరి కైనను ఇతఃపూర్వము పంధొమ్మిది మిష్కల్‌ల సువర్ణము అపరాధశుల్కముగా సర్వేశ్వరుడగు ‘ఆయన’ చే విధియింపబడినది; అయినను, ఈ దివ్యసంవిధానమున ‘ఆయన’ మిమ్ము దానినుండి విముక్తులను గావించి, న్యాయవర్తనతో, ధార్మికతతో వర్తింపుడని బోధింపు చున్నాడు. ‘ఆయన’ ఈ ప్రజ్జ్వలిత ఫలకమునం దాజ్ఞాపించి, మీకు విధియించి నట్టిదిది.. మీకై యాశించుకొనని దానిని అన్యులకై వాంఛింపవలదు; దైవభీతిని కలిగి యుండుడు, గర్వాంధులు కావలదు. మీరందరును, జలమునుండి సృజియింపబడినారు, ధూళివైపునకు తిరోగమింతురు. మీకై వేచియున్న అంత్యమును గురించి యోచింపుడు. దమనకారుల మార్గముల ననుసరింప వలదు. ‘పవిత్ర జీవనవృక్ష’ మగు ‘ఆయన’ ఆలపింపుచున్న దివ్య ప్రవచనములకు చెవియొగ్గుడు. నిశ్చయముగా నవి, ఇహ పరముల ప్రత్యగాత్మ యగు భగవంతునిచే నేర్పరుపబడిన దోషరహిత తుల వంటివి. మానవాత్మ వానిమూలమున దివ్యావిష్కరణ ప్రత్యూషము దెసకు పయనించును; ప్రతి నిజవిశ్వాసి హృదయమును తేజరిల్లును. భగవంతుడు మీకు విధియించిన శాసనములిట్టివి; ‘ఆయన’ దివ్యఫలకమున మీకు సూచితములైన యాదేశము లిట్టివి; హర్షోల్లాసములతో వానిని పాలించినచో, మీకు శుభమగునని తెలియుడు.
148ఉదయ సాయంసంధ్యల యందున భగవత్ప్రవచనములను ఆలపింపుడు. వాటి నాలపింపుటయందు విఫలమైన వారు ‘ఆయన’ దివ్య ఒడంబడికకును, ‘ఆయన’ దివ్య శాసనమునకును నిబంధనకును అవిధేయులు; ఇంకను, ఈ పావన ప్రవచనములకు విముఖుడు దైవమునకు శాశ్వతముగ విముఖుడైనట్లే. ఓ నా సేవకులారా ! ప్రతి యొక్కరును దైవభీతిని కలిగి యుండుడు. దివ్యప్రవచనముల నధికముగ అధ్యయనము చేయుటచేతను, అహర్నిశలనేక పుణ్య కార్యములొనరించుట చేతను గర్వింపవలదు; ఏలయన, సంకటహరుడును, స్వయమాధారుడును అగు భగవంతుని దివ్యగ్రంథ సమస్తమును ప్రయాసతో అధ్యయనము గావించుటకన్న ఆనందోత్సాహములతో నొక్క ప్రవచనమును పఠియించుట యెంతయో ఉత్తమము. నిరాశ, బడలిక మిమ్ముల నావరించనంత వరకే పవిత్ర ప్రవచనములను పఠియింపుడు. అలుపు, సొలపులతో కృంగదీయు వానితో మీ యాత్మలపై భారమును మోపక, వానిని తేలికపరచి, ఉత్తేజభరితములు గావింపుడు; తద్వారా, అవి దివ్య ప్రవచనములనెడు పక్షములతో ‘ఆయన’ ప్రత్యక్షతా ప్రతీకల ప్రత్యూష స్థానము దెసకు విహరింపవచ్చును. గ్రహియించిరేని, మిమ్మిది భగవంతుని దరి జేర్పగలదు.
149దివ్యవైభవాధికార స్వర్గమునుండి వెలువరింపబడిన పావన ప్రవచనములను మీ చిన్నారులకు బోధింపుడు; తద్వారా, వారు మష్రికుల్ -అఝ్కార్‌ల మండపముల యందున, అత్యంత మధురస్వరములతో సకల దయాళువు దివ్యఫలకములను పఠియింప గలరు. అనుకంపాన్వితుడనగు నా దివ్యనామసంకీర్తనాజనితమైన ఆనందముతో పారవశ్యమునొందినవారు గాఢనిద్రా పరవశుల హృదయములను సైతము ఆకట్టుకొందురు. మహోత్కృష్టములును, మహోన్నతములు నగు పర్వతములను ధూళిగా మార్చినయట్టి నా దివ్యనామము పేరిట దయామయుడగు తన దేవుని వాక్కులనుండి అనంత జీవనమను మార్మిక ద్రాక్షాసవమును సేవించిన యాతడు ధన్యుడు.
150ప్రతి పంధొమ్మిది సంవత్సరములు గడిచిన పిదప, మీ గృహోపకరణములను నవీకరించుకొనుట మీకు నిర్దేశితమైనది; సకల విదితుడును, సర్వజ్ఞుడును అగు ‘ఆయన’ చే మీకీవిధముగ నాదేశితమైనది. యదార్ధమునకు, ‘ఆయన’ మీయొక్క, మీ యాస్తిపాస్తులయొక్క పరిశుద్ధత నభిలషింపుచున్నాడు. దైవభీతిని త్రోసిపుచ్చవలదు, అలక్ష్యపరులు కావలదు. తమ యార్ధిక వనరులిందుకు చాలకపోవుటచే, దీనిని పాటించలేకపోయిన వారు నిరంతర క్షమాశీలియును, మహౌదార్యుడును అగు భగవంతునిచే క్షమియింప బడినారు.
151మీ పాదములను - గ్రీష్మమున దినమున కొకపర్యాయమును, శిశిరమున దినత్రయంబున కొకపర్యాయమును - ప్రక్షాళన మొనరింపుడు.
152ఎవ్వడేని నీపై కినుకను వహించిన, ఆతనికి సౌమ్యచిత్తుడవై సమాధానము నీయవలె; ఎవ్వడేని నిన్ను నిందించిన, ప్రతినిందింపక ఓరిమి వహించి, ఆతని నాతనికే వదలివైచి, ప్రతీకారదక్షుడును, న్యాయ శౌర్యాధిదేవుడును అగు భగవంతుని యందు విశ్వాసమునుంచుము.
153మీరు అధ్యాసనము (మెట్లతోకూడిన అత్యున్నతమైన ఆసనం) లను ఉపయోగింప నిషేధించబడినారు. మీకై దైవప్రవచనము నాలపింపనెంచిన యాతడు వేదికపై నేర్పరుపబడిన కుర్చీలో కూరుచుండి, సమస్త మానవజాతికిని, తనకును ప్రభువగు దేవదేవుని స్తుతి యించు గాక. ఆయన యెడలను, మూర్తీభవించిన ‘ఆయన’ మహనీయ, జ్యోతిర్మయ దైవధర్మము యెడలను మీ ప్రేమకు గౌరవసూచకముగ, కుర్చీలలోను, బల్లలపైనను మీరు ఆసీనులగుట భగవంతుని కెంతయో సమ్మోదకరము.
154జూదమును, నల్లమందు సేవనమును మీకు నిషేధింపబడినవి. ఓ ప్రజలారా ! అతిక్రమించువారి ననుసరింపక, ఆ రెండింటిని వర్జింపుడు. మానవదేహమునకు మాంద్యమును, భారమును కలిగించి, హానిచేయు ఎట్టి పదార్ధమును ఉపయోగింపక జాగరూకులు కండు. మేము, సత్యముగా, మీకు ప్రయోజనకరమగునది దక్క అన్యము మాకు అభిలషణీయము కాదు. సమస్త సృష్టియును ఇందుకు సాక్ష్యము, చెవులుండిన యాలకింపుడు.
155విందునకు గాని, పండుగ వేడుకకు గాని ఆహ్వానితులైనపుడు ఆనందో త్సాహములతో స్పందింపుడు; తన వాగ్దానమును నిలుపుకొను నాతడు నిందారోపణ నుండి సురక్షితుడు. వివేచనాయుతమగు భగవన్నిర్దేశము లన్నియును విశదీకరింపబడిన దినమిదియే.
156అవలోకింపుడు : “మహావ్యత్యస్తమర్మము సార్వభౌమ చిహ్నముగ” ఇప్పుడు వెల్లడియైనది.” ‘ధర్మబద్ధమైన’ ఈ ‘అలీఫ్’ సద్గుణముచే పెంపొందింపబడిన “షష్ఠి” ని గుర్తెఱుగుటలో భగవంతునిచే సహకరింపబడిన వాడు ధన్యుడు; నిశ్చయముగా, సత్యమైనవిశ్వాసము కలవారిలో ఆతడొకడు. “ఓ ప్రపంచముల యభీష్టమా! నీకు సకల కీర్తి వర్తించుగాక!” యని సంభ్రమాశ్చర్యములతో పల్కుచు, ‘ఆయన’ ను సమీపించిన మూర్ఖులెందరు, విముఖులైన బాహ్యపవిత్రులెందరు ! తాను ఆశించిన దానిని, తాను అభిలషించిన వారి కొసంగుటయూ, తాను ఇచ్చగించిన వానికి తాను ప్రీతించిన దానిని ఇవ్వకుండుటయు, యదార్ధముగా దేవుని హస్తవశమై యున్నది. హృదయాంతరాళముల రహస్యములను, కపటి కనుసైగ యందలి నిగూఢ మర్మమును ‘ఆయన’ గుర్తెఱుగును. హృదయ నైర్మల్యముతో మా దరిజేరవచ్చిన అలక్ష్యమూర్తులనెందరిని అంగీకారాసనముపై ప్రతిష్ఠించ లేదు; వివేక ప్రతినిధు లెందరిని మా సకల న్యాయనిర్ణయమున అగ్నిదగ్ధుల గావింపలేదు. మేము, సత్యముగా, న్యాయనిర్ణేతలము. “అభీష్టాను వర్తను” డన భగవంతునిదివ్యావతారమే; “అభీష్టానుసార నిర్దేశిత సింహాసనము” నధిష్ఠించునదియు ‘ఆయన’ యే.
157అవలోకింపుడు : “మహావ్యత్యస్తమర్మము సార్వభౌమ చిహ్నముగ” ఇప్పుడు వెల్లడియైనది.” ‘ధర్మబద్ధమైన’ ఈ ‘అలీఫ్’ సద్గుణముచే పెంపొందింపబడిన “షష్ఠి” ని గుర్తెఱుగుటలో భగవంతునిచే సహకరింపబడిన వాడు ధన్యుడు; నిశ్చయముగా, సత్యమైనవిశ్వాసము కలవారిలో ఆతడొకడు. “ఓ ప్రపంచముల యభీష్టమా! నీకు సకల కీర్తి వర్తించుగాక!” యని సంభ్రమాశ్చర్యములతో పల్కుచు, ‘ఆయన’ ను సమీపించిన మూర్ఖులెందరు, విముఖులైన బాహ్యపవిత్రులెందరు ! తాను ఆశించిన దానిని, తాను అభిలషించిన వారి కొసంగుటయూ, తాను ఇచ్చగించిన వానికి తాను ప్రీతించిన దానిని ఇవ్వకుండుటయు, యదార్ధముగా దేవుని హస్తవశమై యున్నది. హృదయాంతరాళముల రహస్యములను, కపటి కనుసైగ యందలి నిగూఢ మర్మమును ‘ఆయన’ గుర్తెఱుగును. హృదయ నైర్మల్యముతో మా దరిజేరవచ్చిన అలక్ష్యమూర్తులనెందరిని అంగీకారాసనముపై ప్రతిష్ఠించ లేదు; వివేక ప్రతినిధు లెందరిని మా సకల న్యాయనిర్ణయమున అగ్నిదగ్ధుల గావింపలేదు. మేము, సత్యముగా, న్యాయనిర్ణేతలము. “అభీష్టాను వర్తను” డన భగవంతునిదివ్యావతారమే; “అభీష్టానుసార నిర్దేశిత సింహాసనము” నధిష్ఠించునదియు ‘ఆయన’ యే.
158దేని చలనమున భగవంతుని మందమారుతమువీచి సమస్త జగత్తును ఆవరించినదో, దేని స్తబ్ధతచే సమస్త అస్తిత్వ ప్రపంచమునను ప్రశాంతత గోచరించునో అట్టి లేఖినినుండి జాలువారిన రచనల అంతరార్ధపరిమళమును గ్రహియించిన యాతడు ధన్యుడు. అగణితానుగ్రహావిష్కర్తయగు సకల దయామయుడు ప్రకీర్తితుడు. వచించు : ‘ఆయన’ అన్యాయమును సహియించుటచే భూమిపై న్యాయమావిర్భవించినది; ‘ఆయన’ అవమానమును మన్నించుటచే మానవాళి యందున భగవంతుని మహనీయత శోభిల్లినది.
159అత్యవసరమైతే తప్ప సాయుధులై చరియించుట మీకు నిషేధింప బడినది; పట్టువస్త్రములను ధరియించుకొనుట మీ కనుమతింప బడినది. దేవదేవుడు తన యౌదార్యము కొలది వస్త్రధారణ, గడ్డపు కత్తిరింపుల విషయమున పూర్వానువర్తిత ప్రతిబంధకముల నుండి మిమ్ము విముక్తులను గావించినాడు. యదార్ధమునకు ‘ఆయన’ నిర్దేశకుడు, సర్వజ్ఞుడు. ప్రాజ్ఞులును, న్యాయవర్తనులును అంగీకరింపని దేదియును మీ ప్రవర్తనయం దగుపింపకుండు గాక; మీరజ్ఞానులకు ఆట వస్తువులు కావలదు. సత్ప్రవర్తన తోడను, శ్లాఘనీయ వర్తన తోడను అలంకృతుడగు నాతనికి శుభమగుగాక! ఆతడు నిక్కముగా, తమ దైవమునకు విశిష్ట, విలక్షణ కార్యములతో సహకరించు వారియందున గణియింప బడును.
160భగవంతుని నగరముల, దేశముల యభివృద్ధిని పెంపొందించి, వానియం ‘దాయన’ శుభానుగ్రహప్రాప్తినొందిన వారి ఉచ్చైస్వనములతో ‘ఆయన’ మహనీయతను చాటుడు. గృహములు, నగరములు హస్తము తదితర సాధనములచే నిర్మింపబడినటుల, వాస్తవమునకు, మానవ హృదయములు జిహ్వశక్తి నిర్మితములు. ప్రతి లక్ష్యసాధనకును మేమొక విధానము నేర్పరచితిమి; వినియోగించుకొని, సర్వజ్ఞుడును, సకల వివేకియును అగు దేవుని యందు నమ్మికను, విశ్వాసమును కలిగియుండుడు.
161భగవంతుని యందునను, ‘ఆయన’ సంకేతముల యందునను తనకు గల విశ్వాసము నంగీకరించి, “ ‘ఆయన’ తన చర్యలకు ప్రశ్నింపబడ” డని గ్రహియించిన యాతడు ధన్యుడు. అట్టి గుర్తింపు, భగవంతునిచే ప్రతి విశ్వాసమునకు ఆభరణముగను, దానికి మూలముగను గావింపబడినది. ప్రతి సత్కర్మావలంబనమును అందుపై ఆధారితమై యుండవలె. తిరుగుబాటుదారుల మంతనములు మిమ్ముల నాకస్మికపతనము నొందనీయ కుండునటుల దానిపై మీ దృష్టిని స్థిరముగా నిలుపవలె.
162అనాదిగా నిషిద్ధమైన దానిని న్యాయబద్ధమైనదిగ నిర్దేశించుటకును, సర్వదా న్యాయసమ్మతమని విశ్వసింపబడుతూ వచ్చిన దానిని నిషేధించుటకును ‘ఆయన’ నిర్ణయించెనేని, ‘ఆయన’ అధికారమును ప్రశ్నించు హక్కెవ్వరికిని యొసంగబడలేదు. క్షణమాత్రమేని సందేహించిన వాడెవ్వడైనను అవిధేయునిగ గణియింప బడును.
163పరమోన్నతమును, మూలాధారమును అగు ఈ సత్యమును గుర్తింపక, ఈ మహనీయస్థానప్రాప్తినొంద విఫలుడైన వానిని, అనుమానపు పెనుగాలులు కలవరపెడతాయి. అవిశ్వాసుల ప్రలాపములాతని యాత్మను పెడత్రోవ పట్టించును. ఈ నియమమును గుర్తించిన వానికి మహాపరిపూర్ణ స్థిరత్వము ప్రసాదింపబడును. ప్రతి విశిష్ట ఫలకమును అలంకరించు దానిని స్మరియించుటయే ఈ సకల మహనీయ స్థానమునకు అఖిలగౌరవము. మిమ్ము సకలవిధ సంశయ, సంకోచముల నుండి విముక్తుల గావించి, ఇహపరముల యందు మోక్షప్రాప్తిదాయకమగు ప్రబోధమునే భగవంతుడు మీకు అనుగ్రహించి నాడు. ‘ఆయన’, నిశ్చయముగా, నిత్యక్షమాశీలి, మహోదారుడు. “శక్తివంతుడను, సకలవివేకిని యగు నేను దక్క అన్యదైవము లే” డని ఉద్ఘోషించుటకై దివ్యదూతలను, దివ్యగ్రంథములను పంపినది ‘ఆయన’ యే.
164ఓ కాఫ్, రా (కిర్మాన్) భూభాగమా! మేము, నిశ్చయముగా నీవు భగవంతుని యెడ అసంతోషముతో నుండుటనూ వీక్షింతుము, అటులనే సర్వజ్ఞుడును, సకల గ్రాహియును అగు ‘ఆయన’ కు దక్క అన్యులెవ్వరికిని గ్రాహ్యము కానిది నీ నుండి వెడలిపోవుటనూ అవలోకింతుము; నీ నుండి గోప్యముగ, అపహృతమై వెలువడు దానిని సైతము గ్రహియింతుము. పవిత్ర ఫలకమున లిఖితమైన సమస్త వస్తు పరిజ్ఞానమును మాయొద్ద నున్నది. నీకు సంభవించిన దానికి చింతిల్లకు. మతగురువుల దుష్ట సలహాలు నిరోధించలేనటుల, అనుమాన బీజములను నాటువారి కపటోపాయములచే వెనుదీయ లేనటుల, నా శక్తియుత నామమును సుస్థిర మొనరించునట్టి శక్తివంతులను, పరాక్రమశాలురను భగవంతు డనతికాలములోనే నీయందావిర్భవింపజేయగలడు. వారు తమ స్వీయ నేత్రములతో దేవుని దర్శించి, తమ స్వీయజీవితములనొడ్డి ఆయన*కు విజయమును చేకూర్చెదరు. వాస్తవమునకు వారు దృఢచిత్తులు.
165ఓ మతాధిపతుల సమూహమా! నా దివ్యప్రవచనములు అనుగ్రహింపబడి, నా విస్పష్టచిహ్నములు వెల్లడియైనపుడు, నీవు తెర మరుగునయుండ గాంచితిమి. నిజమునకిది వింతయే. నా నామమున కీర్తింప బడుచున్నను, సకలాధార సమన్వితముగ, నిదర్శనా పూర్వకముగ పరమేశ్వరుడు మీమధ్య ప్రత్యక్షమైనప్పుడు గుర్తించరైతిరి. మేము తెరలను చీల్చి దూరముగ విసరి వైచితిమి. జనులను వేరొక ముసుగులో కప్పివేయుదురేమో, జాగ్రత్త. సకల జననాధుని పేరిట వ్యర్ధపుటూహల శృంఖలములను త్రుంచి వేయుడు; అంతియేతప్ప, వంచకులు కావలదు. మీరు భగవంతుని ఆశ్రయించి, ‘ఆయన’ దివ్యధర్మము నవలంబించిరేని, అందున అశాంతిని వ్యాపింప చేయవలదు, భగవంతుని దివ్యగ్రంథమును మీ స్వార్ధపూరిత వాంఛలతో తులనము గావింపవలదు. నిశ్చయముగా, భూత భవిష్యత్తుల యందున భగవంతుని యుపదేశమిది; అవును, భగవంతుడును, ‘ఆయన’ యనుగ్రహప్రాప్తినొందినవారును, ‘మా’ యందలి ప్రతి యొక్కరమును ఇందుకు సాక్ష్యమును వహించి ధృవీకరింతుము.
166తన సమకాలీన మతాధిపతులలో మహాపండితునిగా గణుతికెక్కిన మహమ్మద్ హసన్ నామధేయము గల షేఖ్‌ను స్ఫురణకు దెచ్చికొనుడు. సత్యసంధుడు సాక్షాత్కరించినవేళ, గోధుమలను, బార్లీని జల్లించు నాతడొక్కడు ‘ఆయన’ నంగీకరించి దేవదేవుని వైపుకు తిరుగగా, ఈ షేఖ్ తనవంటి మరికొందరితో పాటుగా ‘ఆయన’ ను తిరస్కరించాడు. దైవశాసనములని, నియమములని తాను భావించినవాటిని క్రోడీకరించుట యందాతడు రేయింబవళ్లు నిమగ్నుడైయున్నను, అనిర్బంధనుడగు దేవుడు ప్రత్యక్షమైనపుడు, వాటి యందలి యొక్క అక్షరమైనను ఆతనికి అక్కరకు రాలేదు, లేనిచో నాతడు - దైవానుగ్రహీతుల వదనములను శోభిల్లజేసిన ‘ఆయన’ దివ్యముఖారవిందము నుండి వైదొలగి యుండెడువాడు కాడు. భగవంతుడు ప్రత్యక్షీకృతుడైనప్పుడు మీ ‘రాయన’ ను విశ్వసించియుండిన, ప్రజలు ‘ఆయన’ నుండి వైదొలగి పోవువారును కారు, ఈనాడు మీరవలోకింపుచున్నవి మాకు సంభవించెడివి కావు. భగవద్భీతిని కలిగి యుండుడు, అలక్ష్యపరులు కావలదు.
167సకల నామాధిపతియగు ‘ఆయన’ ను దరిచేరనీయక ఏ నామమైనను మిమ్ము నిరోధించునేమో, మీ వివేకములకు మూలాధారమగు ‘ఆయన’ స్మరణను ఏ పదమైనను విస్మరింప జేయునేమో జాగరూకులు కండు. ఓ మతగురువుల సముదాయమా! భగవంతుని కభిముఖులై ‘ఆయన’ సంరక్షణను అర్ధింపుడు; నాకును, నా సృష్టికిని మధ్య అడ్డుతెఱలు కావలదు. మీ చర్యలు సమసిపోవలెననియు, మీ స్థితిని మీరే మఱచితిరనియు మీ ప్రభుడీ విధముగ మిమ్ములను న్యాయవర్తనులై మెలగుడని ఉద్బోధింపుచూ, ఆజ్ఞాపింపుచున్నాడు. ఈ దివ్యధర్మతిరస్కారకుడు, సమస్తసృష్టియందలి మరే దివ్యధర్మపు సహేతుకతనైనను నిరూపింపగలడా? లేదు, విశ్వరూపకర్తయగు దేవుని సాక్షిగా, నిరూపింపలేడు. ఆయినను ప్రజలింకను దృగ్గోచరమగు ముసుగులో కప్పివేయ బడినారు. వచించు: ఈ దివ్యధర్మము ద్వారా ప్రామాణిక ప్రభాతనక్షత్రము ఉదయించినది. నిదర్శనాప్రకాశము ప్రపంచ జనులందరిపైనను ప్రసరిల్లినది. ఓ అంతర్దృష్టియుతులారా, భగవద్భీతిని కలిగి యుండుడు, నన్ను విశ్వసింపనివారు కావలదు. “ప్రవక్త” యను పదము ఈ పరమోన్నత ప్రకటన నుండి మిమ్ము నిరోధించునేమో, లేక సమస్త లోకావృతమగు భగవంతుని సార్వభౌమత్వమున కధీకృత ప్రతినిధి యగు ‘ఆయన’ నుండి “ప్రాతినిధ్య” పరమైనదేదైనను, మిమ్ము నిలిపివేయునేమో జాగరూకులు కండు. ప్రతి నామమును ‘ఆయన’ దివ్యవాగ్జ్జనితమే; ప్రతి ధర్మము, అప్రతిహతమును, శక్తివంతమును, అద్భుతమును అగు ‘ఆయన’ దివ్యధర్మాధారితమే. వచించు: సమస్తలోకముల సంరక్షణాదక్షుడగు ‘ఆయన’ దక్క వేరెద్దియును ప్రస్తావితము గానట్టి దివ్యదినమిది. మీ యంధవిశ్వాసములను, విగ్రహములను ప్రకంపిల్లజేసిన దివ్యధర్మమిది.
168సంకటహరుడును, స్వయంభువును అగు, దైవమును ఖండించుటకై ఇతరమగు ప్రతి దివ్యధర్మపుటనుయాయులును తమ పవిత్ర గ్రంథముల యందున హేతువులకై యన్వేషించిన చందముననే, భగవంతుని దివ్యగ్రంథమును చేబూని అందుండి నిదర్శనములను, వాదములను ఎత్తి చూపుచు తన దైవమును పరిత్యజింపచేయజూచు వానిని నిశ్చయముగా మీయందే మేమవలోకింపు చున్నాము. వచించు: “యదార్ధమునకు సర్వజ్ఞుడను, సకల వివేకవంతుడను అగు నేను తప్ప వేరు దైవము లే” డని సృష్టి హృదయాంతరాళము నం దుద్ఘోషింపుచున్నయట్టి ఈ సజీవ దివ్యగ్రంథము దక్క, ప్రపంచమందలి పవిత్ర గ్రంథావళి గాని, సమస్త పుస్తకములు, రచనలు ఎవ్వియునుగాని ఈ దివ్యదినమున ఇందుకై మీకుపకరింపవు.
169ఓ మతాధిపతుల సముదాయమా! దివ్యధర్మపు తొలి దినముల యందున మీరు దాని నిరాకరణకు కారకులైనటులే, భూమిపై కలహములకు కారకులగుదురేమో, జాగరూకులు కండు. “సకల సంకేతములకును ప్రత్యూషస్ధానమగు భగవంతునిదే సామ్రాజ్య” మని గులకరాళ్లను సహితము ఘోషిల్లజేసిన ఈ దివ్యప్రవచనము చుట్టును ప్రజలను సమీకరింపుడు. మీ దేవదేవుడు తనయౌదార్యములో ఒక భాగముగ ఆయన మిమ్మీవిధముగ హెచ్చరింపుచున్నాడు; వాస్తవమునకు ఆయన నిత్యక్షమాశీలి, పరమోదారుడు.
170భగవంతుని చెంతకు మేమాహ్వానించిన వేళ, స్వీయవాంఛా ప్రేరితుడై, తిరస్కారభావమును పెంపొందించుకొనినయట్టి కరీమ్‌ను స్ఫురణకు దెచ్చికొనుడు; అయినను, మేమాతనికి అస్తిత్వ ప్రపంచమున సాక్ష్యనేత్రమునకు సాంత్వనమును, సమస్త భూస్వర్గవాసులకును భగవంతుని వాగ్దానపరిపూర్తి ప్రమాణమును సైతము పంపినాము. సకల సంపన్నుడును, పరమోన్నతుడును అగు ‘ఆయన’ యనుగ్రహమునకు సంకేతముగ, దివ్యసత్యము నవలం బింపుమని ఆతని నాదేశించినాము. కాని భగవంతుని న్యాయబద్ధచర్యగా ఆగ్రహదేవత లాతనినావహించునంత వరకు అతడు తిరస్కరించినాడు. యదార్ధమునకు, మేమే ఇందులకు సాక్షులము.
171దివ్యసామ్రాజ్యవాసులకు సైతము వినిపించునటుల అడ్డుతెఱలను చీల్చివేయుడు. భూత, భవిష్యద్దివసముల కిది భగవదాజ్ఞ. తన కాజ్ఞాపితమైన దానిని పాలించునాతడు ధన్యుడు; అలక్ష్యపరుని దుఃఖమావరించును.
172నిశ్చయముగా ఈ భూలోకమున పరంధాముని ప్రత్యక్షీకరింపజేసి ‘ఆయన’ సార్వభౌమత్వమును సాక్షాత్కరింపచేయుట తప్ప మాకు వేరొండు పరమార్ధము లేదు; నాకు సాక్షిగా నుండుటకు భగవంతుడే తగినవాడు. సత్యముగా ఉత్కృష్ట సామ్రాజ్యమునం ‘దాయన’ దివ్యధర్మమును సమున్నత మొనరించి, ‘ఆయన’ ప్రఖ్యాతిని శ్లాఘించుట తప్ప మాకు వేరొండు యుద్దేశ్యము లేదు; నాకు రక్షకుడగుటకు దేవుడే తగినవాడు. యదార్ధమునకు, భగవంతుని, ‘ఆయన’ యనుగ్రహించిన దానిని స్తుతించుట వినా దివ్య సామ్రాజ్యమున మాకు వేరొండు కాంక్ష లేదు; నాకు సహాయకారి యగుటకు దేవదేవుడే తగినవాడు.
173ఓ బహా పండితులారా! మీరు సంతోషాత్ములు. దైవసాక్షిగా ! మీరు మహాసముద్రపుటుత్తుంగ తరంగములు, కీర్త్యాకాశ తారకలు, భూ స్వర్గముల నడుమన ఎగయు విజయకేతనములు. వసుధపై వసియించు వారందరికిని మీరు స్థైర్యతామూర్తులు, దివ్యవాణీ ప్రభాతములు. మిమ్మనుసరించు నాతనికి శుభమగును, వక్రగతి నేగినవాడు దుఃఖభాజనుడగును. దయాళువును, పరమాత్ముడును అగు భగవంతుని కరుణాన్వితహస్తముల నుండి అనంతజీవన మార్మికమధువును గ్రోలినయాతడు, తనచే ప్రపంచమును, ప్రతిహతమైన ప్రతి అస్తికయును చేతనత్వము నొందునటుల మానవజాతియను దేహమందలి ధమనియై ప్రకంపించును.
174ఓ ప్రపంచ ప్రజలారా! మార్మికకపోతము తన దివ్యసంకీర్తనా శ్రయము నుండి బయల్వెడలి, తన సుదూర గమ్యమునకు, తన నిగూఢఆవాసమునకు ఎగసిపోయినపుడు, దివ్యగ్రంథము నందేదైనను మీకవగతము కానిచో, ఈ మహావృక్షము నుండి యావిర్భవించిన శాఖయగు ‘ఆయన’ కు నివేదింపుడు.
175ఓ పరమోన్నతుని లేఖినీ: స్వర్గముల స్రష్ట యగు నీ యధినాధుని యానతిన, దివ్యఫలకముపై చలియింపుము; సర్వోత్కృష్ట ఏకత్వ సాంప్రదాయము దెసకు, దివ్యైక్యతాప్రత్యూషమగు ‘ఆయన’ యడుగిడనెంచిన కాలమును గురించి ప్రస్తావింపుము; శక్తివంతుడును, సర్వజ్ఞుడును అగు నీ సర్వేశ్వరునివి యును, తెరమరుగున దాగియున్నట్టివియును అగు మర్మములను సహృదయులు దైవవశమున సూచీరంధ్రమంతైనను, లిప్తపాటు పరికింతురు గాక. వచించు: మేము, యదార్ధముగా, సమస్తసృష్టి గ్రహియింపక పూర్వమే అంతర్భావము, అర్ధవివరణము అను విద్యాలయమునం దడుగిడితిమి. సకల దయామయుడగు ‘ఆయన’ చే యనుగ్రహింపబడిన దివ్యప్రవచనములను గాంచితిమి, ‘ఆయన’ (బాబ్) మాకు సమర్పించిన ఫలకమునందలి యాపద్బాంధవుడును, స్వయంభువును అగు భగవంతుని దివ్యప్రవచనములను స్వీకరించితిమి; ‘ఆయన’ ఆ ఫలకమున ధృవీకరించినదంతయును శ్రవణము గావించితిమి. నిశ్చయముగా, దీనిని మేము అవలోకించితిమి. మా యానతితో ఆయన యభీష్టము నామోదించితిమి; ఏలయన, యదార్ధమునకు మేము ఆజ్ఞాపింప సమర్థులము.
176ఓ బయాన్ జనులారా! వాస్తవమునకు మీరు జాగ్రదావస్థ యందుండగ మేము భగవంతుని విద్యాలయమునం దడుగిడితిమి; మీరు గాఢనిద్ర యందుండగ దివ్యఫలకమును పారాయణము గావించితిమి. సత్యైకదేవుని సాక్షిగా! మీకింకను దెలియక మునుపే, ఆవిష్కరణకు పూర్వమే దివ్యఫలకమును పఠియించినాము; మీరింకను జనియింపక మునుపే, మాకు దివ్యగ్రంథమును గుఱించిన సంపూర్ణపరిజ్ఞానమున్నది. ఈ వాక్కులు, మీ ప్రామాణికతకే తప్ప భగవంతుని ప్రామాణికీకరణకు కాదు. మీరు గ్రహియింప గలవారేని, ఆయన జ్ఞానమునందు నిక్షిప్తమైనట్టిదే ఇందుకు నిదర్శనము; మీరు అవగాహనాపరులైనచో సర్వశక్తివంతుడగు దేవాధిదేవుని జిహ్వయే ఇందుకు సాక్ష్యము వహియించును. భగవంతునిపై ప్రమాణము ! మేము తెఱను తొలగించినమీరు నిశ్చేష్టులగుదురు.
177మీరు భగవంతుని గుఱించియును, ఆయన దివ్యధర్మమును గుఱించియును వ్యర్ధముగ కలహింపరాదని తెలిసికొనుడు; ఏలయన, అదిగో వీక్షింపుడు! భూత వర్తమానస్థితములగు వస్తుసమస్తమును ఆవరించినయట్టి మహా దివ్యావిష్కరణముతో ‘ఆయన’ సాక్షాత్కరించినాడు. దివ్యసామ్రాజ్య వాసుల భాషలో మేము ప్రసంగింపవలసి వచ్చినయట్లైన “సత్యముగా, భగవంతుడు ఆ దివ్యవిద్యాలయమును, భూస్వర్గముల సృష్టికి పూర్వమే సృజియించినాడు. అ మరియు గు అక్షరములను జతగూర్పక మునుపే, మేమందు ప్రవేశించితి” మని పలుకుదుము. మా దివ్యసామ్రాజ్యమున మా పరిజనులభాష యిట్టిది. మా యుత్కృష్ట దివ్యధామవాసుల భాష యెటు లుండునో యోచింపుడు, ఏలయన వారికి మేము మా పరిజ్ఞానము ననుగ్రహించినాము, దైవజ్ఞాన నిక్షిప్తమైన సకలమును వెల్లడించినాము. కనుక భగవంతుని సర్వవైభవసామ్రాజ్యమున శౌర్యవైభవ జిహ్వ యుచ్చరించునదేమో యూహింపుడు.
178ఈ దివ్యధర్మము మీ వ్యర్థభ్రమలకై క్రీడావస్తువు గావింపరానట్టిది; అవివేకులకును, భయాన్వితహృదయులకును స్థానములేని క్షేత్రమిది. దైవసాక్షిగా అంతర్దృష్టికిని, అసంగతత్వమునకును, దార్శనికతకును నెలవైనదియును, మర్త్యజగత్తునుండి సర్వమును ఎడబాసిన దయామయుని ధీరాశ్వికులు దక్క అన్యుడెవ్వడును చొరజాలనిదినియును నగు రణభూమి యిది. అవనియందున భగవంతునికి విజయమును చేకూర్చువారును, మానవాళి యందాయన సార్వభౌమప్రతాపమునకు ప్రత్యూష స్థానములును నిక్కముగా వీరే.
179బయాన్ గ్రంథమునం దావిష్కృతమైనది యేదైనను, పరమ కరుణాన్వితుడగు మీ ప్రభుని నుండి మిమ్ము దూరము గావించునేమో జాగరూకులు కండు. నా కీర్తిని యుగ్గడించుటకు తప్ప అన్యప్రయోజనమునకై బయాన్ అనుగ్రహీతము కాలేదనుటకు భగవంతుడే నాకు సాక్షియని యెరుంగుడు ! నిష్కల్మష హృదయులిందున నా ప్రేమపరిమళములనే కనుగొందురు, గోచరా గోచర సమస్తమును ఆచ్ఛాదించిన నా దివ్యనామధేయమునే గాంచెదరు. వచించు: ఓ ప్రజలారా! నా మహోన్నత లేఖిని నుండి వెలువడినట్టి దాని నాశ్రయింపుడు. అందుండి దైవసౌరభముల నాఘ్రాణించినచో, ఆయనకు వ్యతిరేకముగ వర్తింపనూవలదు, ఆయన ప్రేమాన్విత ఉపకృతులయందలి, ఆయన అగణిత ఔదార్యానుగ్రహముల యందలి భాగమును విస్మరింపనూ వలదు. భగవంతుడు మిమ్మీ విధముగ హెచ్చరింపుచున్నాడు; నిశ్చయముగా ఆయన ఉపదేశకుడు, సర్వజ్ఞుడు.
180బయాన్ గ్రంథాంశముల యందేదైనను మీ కవగతము కానియెడల, మీ ప్రభుడును, మీ పూర్వీకుల ప్రభుడును అగు భగవంతుని యర్ధింపుడు. ‘ఆయన’ అభిలషించెనేని, అందావిష్కృతమైన దానిని వ్యాఖ్యానించి, దాని ప్రవచనమహాబ్ధియందు నిక్షిప్తములైయున్న దివ్యజ్ఞాన, వివేక మౌక్తికములను మీకు వెల్లడింపగలడు. ‘ఆయన’ నిశ్చయముగా, సకల నామాధిపతి; సంకట హరుడును, స్వయంభువును అగు ‘ఆయన’ తప్ప దైవము లేడు.
181బృహత్తరమును, నవీనమును, మానవనేత్రములు ఇతఃపూర్వ మెన్నడును వీక్షించి ఎఱుగనట్టిదియును యగు ఈ దివ్యప్రపంచ సంవిధానపు ప్రకంపనా ప్రభావముచే ప్రపంచ సమతౌల్యతాస్థితి తలక్రిందులైనది. అద్వితీయమును, అత్యద్భుతమును అగు ఈ సంవిధానమూలమున మానవజాతి జీవనసరళియే సమూలముగ పెనుమార్పులకులోనైనది.
182నా ప్రవచన పయోనిధి యందున నిమజ్జనము కండు, తద్వారా మీరు దాని రహస్యములను ఛేదింపవచ్చును, దాని యగాధముల యందున దాగియున్న వివేకమౌక్తికములను కనుగొనవచ్చును. భగవంతుని శక్తిసామర్ధ్యములు వెల్లడిగావింపబడి, ఆయన సార్వభౌమాధికారమును స్థిరీకృతమొనరించిన ఈ దివ్యధర్మపు సత్యమును సమాశ్రయించుటయందున మీ సంకల్పము వికల్పము కాకుండ జాగరూకులు కండు. ప్రమోదముతో వెలుగొందు వదనములతో ఆయన దరిజేర వేగిరపడండి. భూత, భవిష్యత్తులయందున, నిరంతరమును మార్పునొందనిది ఈ భగవద్ధర్మము. తదన్వేషకుడు దాని ప్రాప్తినొందుగాక; తదన్వేషణను తిరస్కరించిన వాని విషయమున భగవంతుడు, నిశ్చయముగ, తాను సృజియించిన ప్రాణుల సర్వావశ్యకములకు అతీతముగా స్వయం సంపన్నుడు.
183వచించు : మీరీ సత్యమును విశ్వసించి, గుర్తించినవారేని, భగవంతుడు చేబూనినయట్టి ఈ త్రాసు దోషరహితమైనది; భూమిపైనను, స్వర్గమునందును వసియించు వారందరును యిందు తూచబడి, వారి ప్రారబ్ధము నిర్ణయింపబడును. వచించు : మీరీ సత్యమును విశ్వసించి గుర్తించిన వారేని, ప్రతి నిదర్శన ప్రమాణమును తరతరములుగ స్థిరీకృతమొనరించినయట్టి మహత్తర నిదర్శనమిది. వచించు : మీరు విశ్వసించిరేని, దాని వలన పేదలు సంపన్నులైనారు; పండితులు జ్ఞానసంపన్నులైనారు, ప్రకర్షితులైనారు, జిజ్ఞాసువులు దైవసాన్నిధ్యమున కధిరోహించినారు. దానిని మీ మధ్య కలహకారక మొనరింతురేమో జాగరూకులు కండు. ప్రేమాస్పదుడును, శక్తిశాలియును అగు మీ పరమేశ్వరుని పరమ ధర్మమున దృఢముగ నిలిచిన పర్వతమువోలె యుండుడు.
184వచించు: ఓ దుస్స్వభావమూలమా! నీ స్వాతిశయాంధకారమును విస్మరించి ప్రజలయందు సత్యమునే వచింపుము. నీవు నీ స్వార్ధమనో వికారములకులోనై, నిన్ను మలిచి నీకు ఉనికిని ప్రసాదించిన ‘ఆయన’ ను పరిత్యజింపగా పరికించి పరితాపమునొందితినని భగవంతునిపై ప్రమాణము చేయుదును. దివ్యధర్మసేవకై మేము అహర్నిశలు నిన్ను పోషించిన విషయమును, పరమాత్ముని మృదుకారుణ్యమును స్ఫురణకు దెచ్చికొనుము. దైవభీతినొంది, యదార్ధముగా పశ్చాత్తాపగ్రస్తుడవై వర్తింపుము. నీ స్థాయిని గని లోకులు భ్రాంతినొందిరనుకొన్నను, నీవు సైతము నీ విషయమున అటులే భ్రాంతినొందితి వనుకొనవచ్చునా? భగవానుని యెదుట భయకంపితుడవై, మా సింహాసన పార్శ్వమున నిలిచి, మేము ప్రవచించిన ప్రవచనములను, సంరక్షణాదక్షుడును, శక్త్యధికారాధి నాథుడును నగు దేవుడు ప్రసాదించిన ప్రవచనములను మేము వక్కాణింపుచుండ నీవు లిఖించిన దినములను పునరావలోకనము గావించుకొనుము. భగవంతుని పవిత్రసాన్నిధ్యప్రాప్తి నొందుటకు, నీ యహంకారాగ్ని నిన్ను ఆటంకపరచునేమో, జాగరూకుడవు కమ్ము. నీ కృత్యము లకు దిగులుచెందకు, ‘ఆయన’ నాశ్రయింపుము. సత్యముగా, ‘ఆయన’ తన వదాన్యతగా, తానపేక్షించిన వారిని, ఔదార్యవశమున క్షమియించును; నిరంతరక్షమాశీలియును, సకలౌదార్యుడును నగు ‘ఆయన’ తప్ప దేవుడు లేడు. దేవుని కొఱకే నిన్ను ప్రబోధింపుచున్నాము. నీవీ యుపదేశము నంగీకరించియుండిన నీ ప్రయోజనమునకై వర్తించి యుండెడివాడవు; నీవు తిరస్కరించితివేని, ‘ఆయన’ నిశ్చయముగ నిన్నును, నిన్ననుసరించి భ్రాంతికి లోనైనవారందరిని పరిత్యజించును. నిన్ను పెడదారి పట్టించిన వానిపై దేవుడు నియంత్రణను కలిగియుండుట నవలోకింపుము! వినయముతో, అణకువతో, దైన్యముతో భగవంతుని చెంతకు తిరోగమింపుము; నిశ్చయముగా, ఆయన నీ పాపములను పోద్రోలును, ఏలయన నీ దేవదేవుడు నిక్కముగా క్షమాశీలి, శక్తివంతుడు, సకలదయాళువు.
185మీరాలించితిరేని ఇదియే దైవోపదేశము! మీరొందితిరేని ఇదియే దైవానుగ్రహము! మీరెరిగితిరేని ఇదియే దైవవాణి! మీరు గ్రహియించితిరేని ఇదియే దివ్యైశ్వర్యము !
186ప్రపంచమునకు నిరంతరదీపికయైన మహాగ్రంథమిది, భూ ప్రజలయందున ‘ఆయన’ అనుల్లంఘనీయ ఋజుమార్గము. వచించు: మీరు గ్రహించితిరేని, ఇదియే దివ్యపరిజ్ఞానప్రత్యూషము, మీరు అవగాహనాపరులేని, ఇదియే దైవశాసనములకు ప్రభాతస్థలియని తెలియుడు.
187భరియింప గలిగినదానికన్న అధికభారమును జంతువుపై మోపవలదు. మేము, సత్యముగా, దివ్యగ్రంథమునందొక నిబద్ధైక నిషేధముగా పరిగణించి అట్టి యనుసరణను నిషేధించినాము. న్యాయమునకును, నిష్పాక్షికతకును ప్రతిరూపములై మెలగుడు.
188ఉద్దేశ్యరహితముగ, ఎవ్వడేని వేరొకని ప్రాణమును తీసిన, మృతుని కుటుంబమునకు నూరు మిష్కల్‌ల సువర్ణమును పరిహారముగా నిచ్చుట ఆతని విధి. ఈ దివ్యఫలకమున నిర్దేశింపబడిన దానిని పాటింపుడు, దీని పరిధులను అతిక్రమించు వారు కావలదు.
189ప్రపంచమందలి సమస్త చట్టసభల సభ్యులారా! ఉర్విజనులందరి యుపయోగార్ధమై యొక భాషను, అటులే, ఒక సామాన్యలిపిని ఎంచికొనుడు. భగవంతుడు, నిశ్చయముగా, మీకు ప్రయోజనకరమగు దానిని, మిమ్ములను పరులనుండి స్వతంత్రులను గావింపగల దానిని మీకు విశదీకరింపగలడు. ఆయన, సత్యముగా మహోదారుడు, సమస్తజ్ఞాని, సకల విదితుడు. మీరవగాహన చేసికొనినచో, ఐక్యతకు సాధనమిది; మీరర్థము చేసికొనినచో, నాగరికతను, సామరస్యమును పెంపొందించుటకు మహోపకరణమిది. మానవజాతి యుగాగమనమునకు మేము రెండు సంకేతములను ఏర్పరచినాము. మొదటిది, మా వేరొక దివ్యఫలకమున మేమేర్పరచిన సుస్థిరమగు పునాది; రెండవది, ఈ యద్భుత గ్రంథమునందే వెలువరించబడినది.
190గంజాయి సేవనము మీకు నిషేధింపబడినది. మేము, నిశ్చయముగా, ఈ యలవాటును గ్రంథము నందొక అనివార్య శాసనమూలమున నిషేధించి నాము. ఎవ్వడైనను అందుకు పాల్పడెనేని, ఆతడు నిస్సంశయముగ అస్మదీయుడు కాడు. అవగాహనా వరప్రసాదితులారా, భగవద్భీతిని కలిగి యుండుడు.
Bahá'u'lláh
Bahá'u'lláh
Bahá'u'lláh