(బహాఉల్లా మూడు అనివార్య ప్రార్థనలను వెలువరించాడు. ప్రతి విశ్వాసి వాటిలో ఒక దానిని ఎంచుకొని, దానికి గల ప్రత్యేక నిర్దేశాలకు అనుగుణంగా 24 గంటల కొక్కసారి పఠించాలి. పైన ఇవ్వబడినది - ఈ మూడింటిలోనూ బాగా చిన్నది. ఈ ప్రార్థనకు సంబంధించిన నిర్దేశం: దీనిని రోజుకొకసారి - మధ్యాహ్నానికీ, సూర్యాస్తమయానికీ మధ్యకాలంలో పఠించాలని.)
ఓ దేవా ! నిన్నరయుటకు, నిన్నారాధించుటకు నన్ను సృజియించితివందుకు నేనే సాక్షి. నీ శక్తికిని, నా యశక్తతకును, నీ కలిమికిని, నా లేమికిని సాక్ష్యము నిత్తు నీక్షణాన.
ఆపత్సహాయకుడవు, స్వయమాధారుడవు అయిన నీవు తప్ప అన్యదైవము లేడు.
ఆయనే దేవుడు.
ఓయీ ఊర్ధ్వగణ పరివృత పావనసీమకు ఆరాధనా భావయుతుడవై పరిభ్రమణ మొనరించు వాడా! నిజైకదైవ సింహద్వారసీమ యెదుట కృతజ్ఞతతో కరములనెత్తి వచియింపు మిటుల: మహాభి మాను లెల్లరి పరమాభిలాషా! దారిదప్పి చరియించు యెల్లరకును దివ్యమార్గదర్శీ! ఈ నిస్సహాయభృత్యునికి నీ యనంతాశీస్సుల ననుగ్రహించి, ఇ య్యదృష్టహీనుని, ఈ యధముని నీ యేకేశ్వరత్వ దివ్యద్వారమునకు నడిపినావు. ఈ శుష్కితయధరములకు నీ మృదుకారుణ్య జీవజలము నొసగి, అలసి సొలసిన ప్రాణమును దివ్యకారుణ్య మందమారుతములతో పునర్జీవిత నొనరించినావు. నాకు నీ మహౌదార్యానుగ్రహ పూర్ణభాగము నొసగి, నీ పావన సింహద్వారప్రాప్తి నొందు మాన్యతతో న న్ననుగ్రహించినందులకు నీకు ధన్యవాదముల నర్పింతును. నీ విభవ సామ్రాజ్యాశీస్సులయం దంచిత సంవిభాగమునకై యర్ధింతును. నీ సాహాయ్యము ననుగ్రహింపుము. నీ దయాపూర్ణానుగ్రహమును ప్రసాదింపుము.
ఓ అజ్ఞాతహితుడా! ప్రకృత ప్రపంచ, ఆగామి ప్రపంచవాసు లెల్లరి యపేక్షా! ఓ అనుకంపాన్విత ప్రియతమా! ఈ నిస్సహాయులు నీ ప్రేమకు సమాకర్షితులు; ఈ దుర్బలురు నీ సింహద్వారాశ్రితులు. నీ యెడబాటునకు వారు ప్రతి రాత్రియు నిట్టూర్చుచూ, మూల్గుచూ యున్నారు; దుర్జనుల దురాక్రమణల కతమున ప్రతి ఉదయమునను దుఃఖింపుచూ, రోదన సేయుచున్నారు. క్షణమున కొక నూతన వ్యధచే వేధింపవడుచున్నారు; అనుక్షణమూ దుష్టదురితుల క్రౌర్యమునకు గురి యగుచున్నారు. అయినను, అగ్నిదేవళము వలె వారు ప్రజ్జ్వలింపుచూ, సూర్యచంద్రులవలె విరాజిల్లుచున్నందులకు ప్రకీర్తితుడ వీవు. వారు భగవంతుని దివ్యధర్మమున యూర్ధ్వీకృత ధ్వజమువలె నిలిచి, సాహసాశ్వికులవలె రంగప్రవేశమునకు వేగిర పడుచున్నారు. సుందర సుమములవలె వికసించి, హసియించు గులాబివలె వా రానందభరితులైనారు. కావున, ఓ సాదర ప్రదాతా, నీ దివ్యసామ్రాజ్య ప్రసాదితమైన నీ దివ్యానుగ్రహముచే, కృపతో యీ పుణ్యాత్ములకు సహకరించి, పరమోన్నతుని చిహ్నములను ప్రదర్శించునటుల యీ పావనజీవనుల ననుగ్రహింపుము. నీవు సకలౌదార్యుడవు, కరుణాన్వితుడవు, సకల దయామయుడవు, ఆనుకంపాన్వితుడవు.
ఓ అప్రమేయ, ప్రేమాస్పద విభో! యోగ్యతాసామర్ధ్యములు కొఱవడినను, సంకటముల నెదిరించుట బహుదుర్లభమైనను, సామర్థ్యయోగ్యతా పురస్కృతుల నొసంగినాడవు. ఓ ప్రభూ! మే మనంతస్థైర్యమును ప్రదర్శించి, ఈ జగత్తును, తత్ప్రజాసమస్తమును పరిత్యజించి, నీ ప్రేమాగ్నిని రగిలించి, దహియించు జ్వాలతో, క్రొవ్వొత్తులవలె తేజోమయులమై జ్వలించి, మా తేజమును దూరభూములకు పరివ్యాప్తము సేయు సామర్ధ్యము నొసంగి, మమ్ము యోగ్యులను గావింపుము.
ఓ దివ్యసామ్రాజ్యవిభుడా! ఈ నిష్ఫల మాయామోహ ప్రపంచమునుండి మమ్ము విముక్తులను గావించి అనంతలోకమునకు నడిపింపుము. మమ్ముల నీనిమ్నజీవనమునుండి సంపూర్ణముగా విముక్తులను గావించి, దివ్యసామ్రాజ్య పురస్కృతులను బడయజేయుము. ఈ సత్యాభాస విభ్రమకారక లోకమునుండి మాకు ముక్తి నొసగి, అనంతజీవనము ననుగ్రహింపుము. మాకు హర్షోల్లాసములను ప్రసాదించి, ప్రమోదసంతుష్టతలను దయసేయుము. మా మనస్సులకు సాంత్వన నిచ్చి, మా యాత్మలకు శాంతిసౌఖ్యముల నిమ్ము, తద్వారా నీ దివ్యసామ్రాజ్యమున కధిరోహించిన యంత, నీ సాన్నిధ్యము నొంది యూర్థ్వలోకముల యందున సమ్మోదము నొందుదుము. నీవు దాతవు, ప్రదాతవు, సర్వశక్తియుతుడవు.
ఓ నా అమరప్రియతమా, నా ఆరాధ్యమిత్రమా! నీ సాన్నిధ్య విహీనుడనై, నీ యెడబాటుతో తీవ్రవ్యాకులుడనై యెన్నినా ళ్లుండవలె? నన్ను నీ పవిత్ర సామ్రాజ్యాశ్రయమునకు నడిపించి, నాపై నీ యూర్ధ్వ లోకసాక్షాత్కారఘట్టమున నీ మృదుకారుణ్యదృష్టిని సారింపుము.
సర్వశక్తిమంతుడవైన ఓ ప్రభూ! నన్ను దివ్యసామ్రాజ్యవాసుల యందున గణియింపుము. నా యావాస మీనశ్వర ప్రపంచము; స్థితిరహిత లోకములయం దొక గేహమును నా కనుగ్రహింపుము. ఈ ధరాతలనివాసిని నేను; నీ మహిమాన్విత సుప్రకాశ తేజోదీప్తిని నాపై కురియింపుము. ఈ ధూళిప్రవంచవాసిని నేను; నన్ను నీ స్వర్లోక వాసిని గావింపుము, తద్వారా నా జీవితమును నీ పథమున కర్పించి నా మనోభీష్టము దీర్చుకొని, నా మస్తకముపై దివ్యానుగ్రహ మకుటమును ధరియించి, ‘ఓ దైవమహిమా, మహామహిమాన్వితా' యని విజయధ్వానము నొనరింతును.
ఓ దయాన్విత వల్లభా! సమావిష్టులైన వీరు, నీ ప్రేమతో పారవశ్యము నొందిన భవదీయ మిత్రులు. వారు నీ సౌందర్యమయూఖ ముగ్ధులు, నీ కస్తూరీవిలేపిత కేశపాశసమాకర్షితులు. వారు తమ హృదయములను నీ కర్పించి, నిమ్నులై, నిస్సహాయులై, నీ పథమున చరియింపుచున్నారు. శత్రుమిత్రుల నొక్కతీరుననే విడనాడి, వా రారాధనాపూర్వకముగ నీ మ్రోలన వినమ్రులగుచు, నీ యేకత్వమును విశ్వసించినారు
వా రీయధోలోకవాసులు; నీ దివ్యసామ్రాజ్యములోనికి వారల నాహ్వానించినావు. వారు అభాగ్యతావిహీనతల కాననమున వడలిన మొక్కలవంటి వారు; వారిని నీ జ్ఞానావగాహనోద్యానపు టంకురములను గావించినావు. వారి స్వరములు మూగవోయినవి; వారిని భాషింప జేసినావు. వారు నిస్తేజులు; తేజమును వారిపై ప్రసరించినావు. బీటలు వారిన బీడుభూమి వలె వా రుండినారు; అంతర్భావయుత గులాబీవనముగ వారిని మార్చినావు. వారు మానవప్రపంచమున పసివారలై యుండినారు; వారిని దివ్యపరిపక్వతా సమన్వితులను గావించినావు.
ఓ దయామయా! నీ రక్షణాశ్రయమున వారల కావాసమును, శరణమును ప్రసాదించి, విచారణ నుండియు, విపత్తు నుండియు వారిని రక్షింపుము. నీ యగోచరోపకారమును వారల కొనరించి, నీ యమోఘకృప ననుగ్రహింపుము.
ఓ దయాన్విత, ప్రియతమ విభుడా! దేహసదృశులు వారు, జీవాత్మవు నీవు. దేహము తన నవ్యతాసౌందర్యములకై యాత్మ కటాక్షముపై యాధారపడును. కావుననే, ఈ నవ్యదివ్యావిష్కరణమున వారు నీ యాశీస్సుల యావశ్యకత నొందియుండి, పవిత్రాత్మ యఖండ శక్తి నాకాంక్షింపుచున్నారు. మహనీయుడ వీవు. నీవు దాతవు, ప్రదాయకుడవు, అనుగ్రహశాలివి, క్షమాశీలివి. అగోచర దివ్యలోకము నుండి సముజ్జ్వలముగ తేజరిల్లు దివ్యుడవు.
ఓ దివ్యవిధాతా! దుష్కర క్లేశములు తలయెత్తినవి, విపత్కర విఘ్నములు దాపురించినవి. ఓ ప్రభూ! ఈ క్లేశములను రూపుమాపి, నీ శౌర్యపరాక్రమ నిదర్శనములను ప్రదర్శింపుము. ఈ కడగండ్లను శమింపజేసి, ఈ విపత్కరపథమున మా దారిని సుగమము గావింపుము. ఓ దివ్యవిధాతా! అవాంతరము లణగుట లేదు, ఆయాస ప్రయాసములు వేనవేల వైరుధ్యసమ్మిళితము లైనవి. నీవు దక్క సాహాయ్యుడు లేడు, నిను వినా సంరక్షకుడు లేడు. మా యాశల నన్నింటినీ నీ మీదనే నిలిపి, మా సమస్త వ్యవహారములనూ నీ యధీన మొనరింతుము. నీవు దివ్యమార్గదర్శివి, సకల విపన్నివారకుడవు, విజ్ఞుడవు, వీక్షకుడవు, శ్రోతవు.
ఓ కరుణాన్విత దైవమా! ఓ సర్వశక్తిమంతుడా! నేను దుర్బల సేవకుడను, బలహీనుడను, నిస్సహాయుడను; అయినను నీ దాక్షిణ్యానుగ్రహ రక్షణమున సంరక్షితుడనై, నీ కారుణ్యవక్షమున పోషితుడనై, నీ ప్రేమాన్విత హృదయమున పరిపోషితుడ నైతిని. ఓ ప్రభూ! నేను నిరుపేదనే, అభ్యాగతినే; అయిననూ, ప్రతి నిరుపేదయూ నీ వదాన్యతచే భాగ్యశాలి గావింప వడుచుండ, ప్రతి సంపన్నుడూ, నీ యనుగ్రహవిహీనుడయ్యెనేని, నిక్కముగ నిరుపేదయే, దుఃఖభాజనుడే యగును.
ఓ దివ్యవిధాతా! ఈ పెనుభారమును వహియించు శక్తిని నా కనుగ్రహింపుము, న న్నీయుత్కృష్టానుగ్రహమును పరిరక్షింపనిమ్ము; పరీక్షల యుధృతి యెంతటి దృఢమనిన, విపత్తుల యఘాత మెంతటి భీషణమనిన ప్రతి కొండయూ శకలములై మంటి పాలైనది, సమున్నత గిరిశృంగము నిశ్శేషమైనది. నీ స్మరణమును దక్క నా హృదయమున అన్యము నాశింపనని పరిపూర్ణముగా యెఱుగుదువు; నీ ప్రేమను దక్క నా మానసమున అన్యము నాశింపను. నీ ప్రేమికులను సేవించుటకు న న్నుద్యుక్తుని గావింపుము, నీ సింహద్వారసీమన సేవాభావనతో నిత్యనివాస ముండనిమ్ము. ప్రేమాస్పదుడ వీవు. బహుళానుగ్రహవిభుడ వీవు.
ఓ దివ్యవిధాతా! నన్ను జాగృతుం జేసి, సచేతనుని గావింపుము. నీవు దక్క సమస్తము నుండియు విముక్తుం జేసి, నీ సౌందర్యానురాగబద్ధుని గావింపుము. నాపై పరమాత్మ పవనమును ప్రసరిల్ల జేసి, అభా దివ్యసామ్రాజ్యామంత్రణమును న న్నాలింపనిమ్ము. దివ్యశక్తిని నా కనుగ్రహించి, నా హృదయాంతరాళమున యాత్మజ్యోతిని ప్రజ్జ్వలిత మొనరింపుము. నీ సమ్మోదము దక్క అన్యకామితము నుండనీయక, నీ వదనమును వినా అన్యము నాశింపక, నన్ను నీ పథమున దక్క వేరొండు పథమున పయనింప కుండునటుల సకలబంధవిముక్తుని, సర్వవ్యామోహముక్తుని గావింపుము. ప్రమత్తుల నప్రమత్తులను జేసి, సుషుప్తులను జాగృత మొనర్చునటుల, తీవ్ర దాహార్తులకు జీవజలము నొసంగి, అస్వస్థతారుగ్మతాయుతులకు దివ్యౌషధము నిచ్చునటుల న న్ననుగ్రహింపుము.
నే నధముడను, హీనుడను, అల్పుడను, అయినను నీవే నా ఆశ్రయము, నా శరణ్యము; నా పోషకుడవు, నా యుపకారివి. సర్వులును సంభ్రమము నొందునటుల నాకు నీ సాహాయ్యము ననుగ్రహింపుము. ఓ దేవా, నిక్కముగా నీవు సర్వశక్తిమంతుడవు, మహాధిపతివి, దాతవు, ప్రదాతవు, సర్వసాక్షివి.
ఆయనే దేవుడు
ఓ దేవా, నా దేవా! నేను నీ కభిముఖుడను; నీ చికిత్సా సంద్రపు వెల్లువకై ప్రార్థింతును. ఓ ప్రభూ, నీ జనులను సేవించుటకును, వారికి చికిత్స జేయుటకును కృపతో నాకు సాహాయ్య మొనరింపుము. నాకు తోడ్పడితివేని, నే జేయు నివారణోపాయము ప్రతి రుగ్మతకును నివారణౌషధమై, ప్రతి తీక్ష్ణదాహార్తికిని జీవజలబిందువై, ఆరాటవడు హృదయమున కుపశమన లేపనమగును. నాకు దోడ్పడ కున్నచో, అదియే సంక్షోభమై, నే నెవ్వరకును స్వస్థత జేకూర్పజాలను.
ఓ దేవా, నా దేవా! నీ రుజానివారణాశక్తితో నాకు తోడ్పడి, సహకరింపుము. నిక్కముగా నీవు చికిత్సకుడవు, సంతుష్ట ప్రదాయకు డవు, సకల వేదనాజాడ్య నివారకుడవు, సమస్తపాలనావిభుడవు.
ఓ ప్రభూ! నా జీవితదివసముల యవసానము తదారంభమున కన్నను విలక్షణత నొందునటుల, నా జీవితచరమాంకము నీ బహువిధాశీస్సుల ద్వారములను దెఱచునటుల, నాకు నీ యనుగ్రహాన్విత కారుణ్యముల, నీ యాదరణా సంరక్షణల, నీ యాశ్రయౌదార్యములయం దొక వంతును ప్రసాదింపుము. నీ సాదర దాక్షిణ్యౌదార్యము లనుక్షణమును నా కనుగ్రహీతములగు గాక, నీ యూర్ధ్వీకృత ధ్వజపతాకచ్ఛాయన సకలశ్లాఘితుని దివ్యసామ్రాజ్యమునకు నేను మరలు నందాక, ప్రతి నిశ్వాసమునను నీ క్షమాకారుణ్యములు నాకు ప్రసాదితములగు గాక. నీవు ప్రదాతవు, నిత్యప్రేమికుడవు; నిక్కముగా దయానుగ్రహాధీశుడ వీవు.
ఓ ప్రదాతా, ఓ క్షమాదాతా! ధన్యజీవి యొక్కడు దివ్యసత్య సామ్రాజ్యమున కధిరోహించి, ఐహిక ధూళీప్రపంచమునుండి నిత్యవైభవ లోకమునకు వేగిరపడనైనది. ఇప్పు డరుదెంచిన యతిధి స్థానమును సముద్ధరింపుము; నవీనాద్భుత చేలముతో యీచిరకాల సేవకు నలంకరింపుము.
ఓ అప్రమేయ ప్రభూ! ఈ యాత్మ నీ మార్మికాశ్రయములోనికి ప్రవేశించి, తేజోమయుల సందోహమునం దాత్మీయ సాహచర్యము నొందునటుల నీ క్షమాదరణములను ప్రసాదింపుము. నీవు దాతవు, ప్రదాతవు, నిత్యప్రేమికుడవు. నీవు క్షమాశీలివి, ఆర్ద్రహృదయుడవు, మహాశక్తిశాలివి.
ఆయనే దేవుడు
క్షమాశీలివైన ఓ ప్రభూ! ధన్యజీవు లీసేవకులు; వీరు నీ మార్గదర్శనదీప్తిచే సుప్రకాశితులు, జ్యోతిర్మయులు. పూర్ణచషకమునుండి నీ యనురాగమధువును గ్రోలి, నీ జ్ఞానమధురగీతికా పరివ్యాపితములైన యనంతమర్మముల నాలించినారు. వీరు తమ హృదయములను నీ కర్పించి, వైమనస్యపాశవిముక్తులై నీ యేకత్వము ననుసరించినారు. ఈ యుత్తములను స్వర్లోకవాసులకు సహచరులను జేసి, నీ సన్నిహితుల వర్గమున జేరనిమ్ము. నీ యూర్ధ్వలోకస్థిత మర్మములకు వారిని సుపరిచితులను జేసి, జ్యోతిఃసాగరమున నిమజ్జనులను గావింపుము. నీవు ప్రదాతవు, ప్రదీప్తుడవు, ప్రసన్నుడవు.
ఓ దివ్యవిధాతా! ఈ నీ ద్వారసీమదాసుని జననీజనకులను నీ క్షమాంబుధిన నిమజ్జన మొనరించి, సమస్త దుష్కృతోల్లంఘనముల నుండియు వారిని ప్రక్షాళించి, పవిత్రులను జేయుము. నీ క్షమాకారుణ్యములను వారల కనుగ్రహించి, దయతో మన్నింపుము. నిక్కముగా, నీవు క్షమాశీలివి, నిత్యక్షమాపకుడవు, అనంతానుగ్రహ ప్రదాయకుడవు. ఓ సహిష్ణుతాధిపా! పాపాత్ములమైననూ, మా యాశలను నీ వాగ్దానాభయప్రదానములపై నిల్పినాము. అపరాధ తిమిరావృతులమైననూ, మా వదనములను సర్వకాలముల యందునను నీ యౌదార్యాన్వితానుగ్రహముల ప్రాతఃసమయము దెసకు మరలించినాము. నీ దివ్యద్వారసీమోచితముగ మాతో వ్యవహరించి, నీ దివ్యాస్థాన సముచితమును మా కనుగ్రహింపుము. నీవు నిత్యక్షమాశీలివి, సహనుడవు, సర్వదోషసైరివి.
ఓ దయాన్విత వల్లభా! సమస్తానుబంధముల నుండియు నా మనస్సును పునీత మొనరింపుము. ఆనందోపదేశముతో నా యాత్మను సంతసింపజేయుము. పూర్ణముగ నీకు వశుడనై, అత్యుత్సాహపరవశుడ నగునటుల; నినువినా అన్యుని కాంక్షింపక, నిన్ను దక్క యింకెవ్వరినీ ఆశ్రయింపక, నీ పథమును గాక వేరొండు మార్గము నవలంబింపక, నీతోనే సంభాషించునటుల; నీ ప్రేమకు ముగ్ధుడనై, దివారాత్రములును నిట్టూర్చి, విలపించి, రోదింపుచు "యా బహాఉల్-అభా" యని, కోయిలవలె నినదించునటుల ఆప్తుల, అన్యుల సాన్నిహిత్యము నుండి యొక్క తీరుననే నన్ను విముక్తుని జేసి, నీ ప్రేమతో పరవశు నొనరింపుము.
ఓ ప్రభూ! ఎంతటి యౌదార్యప్రవాహము ననుగ్రహించితి వీవు, ఎంతటి యనంతానుగ్రహ వెల్లువ నొసంగితి వీవు! ఎల్ల మనమ్ముల నొక్క హృదయము గావించినావు, అన్ని యాత్మల నొక్క యాత్మగా ననుసంధానించినావు. నిర్జీవకాయములకు జీవానుభూతుల నిచ్చినావు, విగతదేహము లకు చేతనత్వము నొసగినావు. సకల దయామయుని దినకరప్రసారిత జ్యోతిర్మయూఖములచే యీ మృత్కణములకు ప్రత్యక్షజీవితము ననుగ్రహించినావు, ఏకత్వసంద్రపు టుత్తుంగ తరంగములచే నీయగణిత బిందువుల నుప్పొంగి, ఘోషించునటు లొనరించినావు.
గడ్డిపోచకు కొండంత బలము నిచ్చి, మంటిమరకచే దీప్తిమత్సూర్యప్రకాశమును ప్రతిఫలింపజేయు ఓ శక్తిశాలీ! మేము నీ దివ్యధర్మమును సేవించుట కుద్యుక్తుల మగునటుల, ప్రపంచజనుల యెదుట లజ్జితులము గాకుండునటుల, నీ మృదుకారుణ్యాను గ్రహములను మాకు ప్రసాదింపుము.
ఓ సర్వశక్త్యధిపతీ! మేమెల్లరము నీ యధికారవశ్యుల వైునాము. నీవు మా పరిపోషకుడవు, సాహాయ్యుడవు. మాకు నీ మృదుకారుణ్యమును ప్రసాదింపుము, నీ యౌదార్యమును మాకు కటాక్షించి యనుగ్రహద్వారములను వివృత మొనరింపుము, నీ యనుగ్రహాన్విత దృక్కును మాపై సారింపుము. మాపై జీవప్రదాయక పవనమును వీయనిమ్ము, మా వాంఛాతప్త హృదయములను సచేతనముల నొనరింపుము. మా నయనములను శోభిల్లజేసి, మా మనోమందిరమును సమస్త వికాసనికుంజములకును మత్సరహేతువు గావింపుము. ప్రతి యొక్కనినీ పరవశుం జేసి, ప్రతి యాత్మను రంజిల్ల జేయుము. నీ ప్రాచీనశక్తిని వెల్వరించి, నీ మహాసత్త్వమును ప్రదర్శన మొనరింపుము. మనుష్యాత్మావిహంగములను నవ్యశిఖరముల కెగయ జేయుము; ఈ మర్త్యప్రపంచస్థితులైన నీ యాంతరంగికులను నీ దివ్యసామ్రాజ్యమర్మముల లోతుల నెఱుగనిమ్ము. మా యడుగులను స్థిరపరచి, దృఢచిత్తములను మా కనుగ్రహింపుము. పాపాత్ములము మేము, నిత్యక్షమాశీలి వీవు. నీ సేవకులము మేము, సార్వభౌముడ వీవు. అగమ్యనిర్వాసితులము మేము, మా శరణ్యాశ్రయము వీవు. నీ మధురపరిమళములను ప్రసరిల్ల జేయుటకును, నీ దివ్యవాక్కును ప్రవృద్ధపరచుటకును దయతో మాకు దోడ్పడి, సాహాయ్యమొనరింపుము. ఉద్వాసితుల స్థానము నుద్ధరింపుము; అభాగ్యుల కనంతైశ్వర్యము ననుగ్రహింపుము. బలహీనులకు నీ బలిమినొసగి, దుర్బలురకు నీ దివ్యశక్తి నిమ్ము. ప్రదాత వీవు, దయాన్వితుడ వీవు, సమస్తమునేలెడు ప్రభుడ వీవు.
ఆయన పరమపావనుడు, మహామహిమాన్వితుడు.
అనుకంపాన్వితుడును, కరుణాన్వితుడునునగు భగవంతుని పేరిట! సకలలోకాధీశుడగు భగవంతుడు ప్రకీర్తితుడు!
ఓ ప్రభూ, నా దేవా, నా ఆశ్రయణమా, నా శరణ్యమా! ఓ సర్వశక్తిశాలీ, క్షమాశీలీ, నీ సర్వశక్తి చిహ్నములయం దొక్క దానినైనను సంకీర్తించుటకేని, నీచే సృజితమైన దివ్యవాక్కు నొక్కదానిని ప్రస్తుతించుటకేని గావించు యత్నమున వాగ్ధారాన్వితవక్త జిహ్వ తడవడునని, మానుషలేఖిని దైనను, జిహ్వదైనను ప్రతి వ్యక్తీకరణయు కలవరపాటునకు లోనగునని యెఱిగియు, అద్భుత శ్లాఘాన్వితోక్తులతోనైనను, మహాశబ్దచాతురీయుత సంస్తవగీతికలతోనైనను సముచితముగ ని న్నెటుల ప్రస్తుతింప జాలుదును. నీ దివ్యపావిత్య్రత కెగయు ప్రయత్నమున మానవమేధో విహంగముల పక్షములు భగ్నములైనవి, తదీయ జ్ఞానమండపపు సర్వోత్కృష్టశిఖరములపై సున్నితములైన తమ గూళ్ల నల్లుటకు వ్యర్ధోహాశాలికలు* శక్తిహీనములు. నా శక్తిహైన్యతను, లోపము లను అంగీకరించుట వినా అన్యధా నాకిక శరణము లేదు, అభాగ్య, అభావముల యగాధముల యందున దక్క నా కావాసమూ లేదు. నిక్కముగా, నిను గ్రహియింప శక్తిహైన్యతయే అవగాహనా తత్త్వము, దోషముల నొప్పుకొనుటయే నీ సాన్నిధ్యసాధనకు యేకైక మార్గము, లేమి నంగీకరించు టయే నిజైశ్వర్య మూలము.
ఓ ప్రభూ! నీ మహోన్నత సింహద్వార సంసేవనమున నాకునూ, నీ విధేయసేవకులకునూ కృపతో సహకరింపుము; నీ దివ్య పావనతా ప్రార్థనముతో మమ్ము సశక్తీకరింపుము, నీ ఏకేశ్వరత్వ ద్వారము యెదుట వినయవిధేయతలతో మమ్ములను మననిమ్ము. ఓ నా ప్రభూ, నా యడుగు లను నీ పథమున స్థిరీకరించి, నీ మహిమా స్వర్గశోభిత జ్యోతిర్మయ మయూఖములతో నా మనస్సు నుద్దీపిత మొనరింపుము. నీ క్షమాసహిష్ణుతల స్వర్గవ్యాపిత చైతన్యానిలముతో నా యంతరంగము నుత్తేజిత మొనరింపుము, నీ పవిత్రతా వైుదాన పరివ్యాపిత పునరుజ్జీవన పవనముతో నా యాత్మను సంతసిల్ల జేయుము. నీ యేకత్వ దిఙ్మండలముపై నా వదనమును శోభిల్లజేసి, నన్ను నీ విధేయసేవకుల యందున గణియింపుము, నీ నిష్ఠాగరిష్ఠ దాసుల యందున పరిగణన మొనరింపుము.
------------------
* వ్యర్థాలోచనలనే సాలీళ్ళు
ఓ ప్రభూ, మా దైవమా! మే మసహాయులము, నీవు శక్త్యధికార వల్లభుడవు. మే మధము లము, నీవు సర్వశక్తిమంతుడవు, సకల మహిమాన్వితుడవు. మేము దీనులము; నీవు సకల సంపన్నుడవు, మహోదారుడవు. మాకు నీ పునీత సింహద్వార సంసేవనమున కృపతో సహకరిం పుము; నీ శక్తిప్రదాయ కానుగ్రహముతో నీ సంస్తవప్రభాత స్థలమున ని న్నారాధింప సాహాయ్య మొనరింపుము. నీ మహాఘన నామము దెసకు సకలదేశములకును దారిని జూపి, నీ మహిమాన్విత ఏకేశ్వరత్వ మహాంబుధి తీరములకు సర్వజనులకును మార్గదర్శన మొనరించునటుల, తదీయ పావనసౌరభములను నీ జీవుల యందున మమ్ము పరివ్యాప్త మొనరింపనిమ్ము, నీ సేవకుల యందున నిన్ను సేవించుటకు మా కటిసీమలను సశక్తీకరింపుము.
ఓ ప్రభూ! నీ దివ్యవాక్కును సంతోషాతిరేకమున సంకీర్తించుట కుద్యమించి, దివారాత్రముల యందునను నీ ప్రస్తుతి నొనరించునటుల; సమస్తప్రజలను మార్గదర్శనపథమున కామంత్రించి, వారిని ధర్మనిరతికి బద్ధుల నొనరించునటుల; నీ సమస్తసృష్టి యందునను నీ యేకేశ్వరత్వ సుభాషితముల నాలపించునటుల - ప్రాపంచిక బంధనముల నుండియు, తత్ప్రజల నుండియు, పూర్వోల్లంఘనల నుండియు, ఇంకను వాటిల్లనున్న సంక్షోభముల నుండియు మమ్ము విముక్తుల నొనరింపుము. నీకు సంప్రీతికరమైన దానిం జేయ శక్తుడవు. నిక్కముగా నీవు సర్వశక్తిశాలివి, మహాధికారయుతుడవు.
ఆయనే దేవుడు
ఓ దయాన్విత ప్రియతమ ప్రభూ! ఈ మిత్రులు దివ్య ఒడంబడి కాసవపరవశులు, నీ యనురాగారణ్య సంచారులు. నీ వియోగాగ్నిజ్వాలకు వారి హృదయము లాహుతి యైనవి, నీ ప్రభాసముల యావిష్కృతికై యుత్కంఠతో వా రాకాంక్షింపుచున్నారు. ఆగోచరుని దివ్యలోకమైన నీ యదృశ్యసామ్రాజ్యము నుండి నీ యనుగ్రహపు సముజ్జ్వల వైభవమును వారల కావిష్కరింపుము. క్షణమున కొక నవ్యాశీస్సు ననుగ్రహించి, నూతనోపకృతిని ప్రసాదింపుము.
ఓ దివ్యవిధాతా! దుర్బలురము మేము, మహాబలాఢ్యుడవు నీవు. చిరుచీమల వంటివారము మేము, విభవలోక రాజన్యుడవు నీవు. మే మొక జ్యోతిని ప్రజ్జ్వలింపజేసి, తత్ప్రభాసమును దూరభూములకు ప్రసరిల్ల జేయునటుల, సత్త్వమును జూపి, యొకింత సేవ జేయునటుల మాకు నీ యనుగ్రహము నొసగి, నీ యౌదార్యమును ప్రసాదింపుము. మే మీ తమోభూమికి జ్యోతిస్సును, ఈ నశ్వర మృత్తికా ప్రపంచమున కాధ్యాత్మికతను జేకూర్చునటుల యనుగ్రహింపుము. క్షణమేని మమ్ము విశ్రామము నొందనీయవలదు, ఈ జీవిత క్షణభంగుర విషయకలుషితులను కానీయ వలదు. మేము మార్గదర్శ నాతిధ్యము నేర్పరచి, మా జీవనరుధిరముతో ప్రేమగీతికలను లిఖియించి, భయాందోళనముల నెంచక, ఫలయుత వృక్షసములమై, ఈ నశ్వరప్రపంచమున మానవపరిపూర్ణత లను ప్రదర్శించునటు లొన రింపుము. యథార్థముగ, నీవు సర్వౌదార్యుడవు, అమేయానుకంపాన్వితు డవు, నిత్యక్షమాశీలివి, సహిష్ణుడవు.
ఆయన సకల మహిమాన్వితుడు!
ఓ నా ప్రభూ, నా రాజన్యా, నా ఏలికా, నా సార్వభౌమా! ఈ సేవకుని తదీయ సంరక్షణా చేలముతో, నీ నిత్యసాహాయ్య వస్త్రముతో, నీ సంరక్షణకవచముతో నాచ్ఛాదింపుమని మనసా, వాచా, ఆత్మేణా అర్థింపుచున్నాను. నీ జనులయందున నిన్ను ప్రస్తావించి, నీ సద్గుణములను వక్కాణించి, నీ యేకేశ్వరత్వమును, పావనతను సంకీర్తించుటకై జరిగిన ప్రతి సమ్మేళనమునను నీ శ్లాఘన, ప్రశంసల నొనరించునటుల యీతడి జిహ్వకు స్వేచ్ఛ నిమ్ము. సత్యమునకు, నీవు శక్తిమంతుడవు, బలయుతుడవు, సకలమహిమాన్వితుడవు, స్వయంపరిపోషితుడవు .
ఓ నా దయాన్విత ప్రభూ, నా యంతఃకరణాభీష్టమా! నీ మిత్రులకు నీ సాదరకారుణ్యము ననుగ్రహించి, వారికి నీ యమేయ కృపను కటాక్షింపుము. నీ ప్రగాఢప్రేమికులకు సాంత్వనవై, ని న్నపేక్షించు వారలకు హితుడవు, ఆశ్వాసకుడవు, సాదర సహచరుడవు కమ్ము. నీ ప్రేమాగ్నిచే వారి హృదయములు జ్వలియింపుచున్నవి, నీ యెడ భక్తిజ్వాలచే వారి మనస్సులు దహియింప వడుచున్నవి. మనః పూర్వకముగ తమ ప్రాణముల నర్పించుటకై, నీ యనురాగ బలి పీఠము చెంతకు వా రెల్లరును వేగిరపడ నపేక్షింపుచున్నారు.
ఓ దివ్యవిధాతా! వారికి నీ యనుగ్రహము నొసగి, సన్మార్గమున నడిపించు, ఆధ్యాత్మిక విజయసాధనమున వారికి దయతో తోడ్పడు, దివ్యవరములను వారల కొసగు. ఓ ప్రభూ! వారికి నీ కృపాదాతృత్వములతో సాహాయ్యమొనరించి, వారి మోములను తదీయ జ్ఞానసముపార్జనా సమ్మేళనముల యందున మార్గదర్శన జ్యోతులను, నీ సుభాషితములు సువిశదములగు సమావేశముల యందున దివ్యౌదార్య చిహ్నములను గావింపుము. నిక్కముగా, నీవు దయామయుడవు, సర్వౌదార్యుడవు, సర్వజన సాహాయ్యాపేక్షితుడవు.
ఆయన సకల మహిమోపేతుడు, మహాతేజోమయుడు.
ఓ దివ్యప్రదాతా! ఓ క్షమాధిపా! నే నెన్నడు యెటుల, సముచితముగ నీ ప్రస్తుతి గావింపగలను, సంపూర్ణముగ ని న్నారాధించి, సంకీర్తింపగలను? నీ వర్ణనము నేజిహ్వ గావించినను, అది దోషభూయిష్టమే దక్క వేరొండు కాదు; నీ యభివర్ణనము నేలేఖిని జేసినను, అది యీ దుర్లభకృత్యయత్నమున తద్వైఫల్యతా నిదర్శనమే. జిహ్వ యనునది ధాతునిర్మిత సాధనము దక్క వేరొండు కాదు, స్వరవాచికములు యాదృచ్ఛిక లక్షణములు దక్క అన్యములు కావు. ఇక, అనన్యుడును, అద్వితీయుడును నగు ఆయన కీర్తిని ఐహిక స్వరయుత సాధనముతో యేనెటుల సంకీర్తింపగలను? నే ననగలదైనను, అన్వేషించునదైనను మానవమేధకు పరిమిత మైనది, మనుష్య లోకపరిధులచే నావృతమైనది. మానవమేధ దివ్యపావనతా యుత్కృష్ట శిఖరముల నెన్నటికైనను యెటు లధిరోహింపగలదు, మిథ్యాభ్రమల శాలిక నునుపగు తన గూడును పవిత్రతా సదనములపై యెవ్విధముగ నల్లగలదు? నా శక్తిహైన్యత నంగీకరించి, నా వైఫల్యము నొప్పుకొనుట దక్క యేమియు చేయజాలను. నిక్కముగా, నీవు సకల సంపన్నుడవు, దుర్లభుడవు, అవగాహనాప్రసాదితుల గ్రాహ్యతాతీత సమున్నతుడవు.
ఓ దివ్యవిధాతా, నిత్యక్షమాశీలి వీవు! ఓ సర్వశక్తియుత దేవా, కృపాన్వితుడ వీవు! నీ విభవచ్ఛాయన యీ ప్రియతమదాసుని మన నిమ్ము, నీ కారుణ్యప్రాంగణమున యీ నిస్సహాయ నిమ్నుని యెదిగి వర్ధిల్లనిమ్ము. నీ సామీప్యతాచషకము నుండి యీతడిని గ్రోలనిచ్చి, ధన్యవృక్ష చ్ఛాయన వసియింపనిమ్ము. ఈతడికి నీ సాక్షాత్కార భాగ్యమును ప్రసాదించి యనంతానందము నొసంగుము. తన ప్రియజనకుని యడుగుజాడల ననుసరించి, ఆతడి ప్రవర్తనానువర్తనలను సకలజనులకును అభివ్యక్త మొనరించి, నీ పథము ననుసరించి, నీ ప్రమోదము నపేక్షించి, నిన్ను శ్లాఘించుటకు యీ ధన్యజీవి యౌరస సంతతికి కృపతో సహకరింపుము. నీవు నిత్యవాత్సల్య వేలుపువు, వితరణాధీశుడవు.
ఓ నిరుపమాన దైవమా! నీ విధేయభృత్యులము మేము, నిఖిలమహిమాన్వితుడవు నీవు. దుష్కృతులము మేము, నిత్యక్షమాశీలివి నీవు. మేము బానిసలము, దీనులము, నిమ్నులము, మరి నీవు మా శరణువు, సాహాయ్యివి. మేము చిరుచీమల వంటివారమైయుండ, సమున్నత స్వర్గసింహాసనాభిషిక్త మహనీయతాధీశుడవు నీవు. నీదు దయాచిహ్నముగ మమ్ము గావుము, మాకు నీ సంరక్షణా సాహాయ్యముల నుపసంహరింప వలదు. ఓ ప్రభూ! యథార్థమునకు నీ పరీక్షలు తీవ్రతరములు. నీ శోధనలు శిధిల పునాదులను లోహసదృశములను జేయగలవు. మమ్ము కాపాడి, సశక్తీకరింపుము; మా మనస్సులను ప్రమోదానంద భరితములను గావింపుము. నీ పవిత్రసింహద్వార సీమను అబ్దుల్-బహా వలె సేవించుటకు, కృపతో మాకు తోడ్పడుము.
ఆయనే దేవుడు
ఓ దేవా, నా దేవా! నీ దీప్తిమత్ప్రభాతసమయమున, నీ సంరక్షణాశ్రయమునొంద వేగిరపడి, నీ భద్రసదనమున, సబలదుర్గమున శరణును గోరిన యీ పరివారమునకు సకలాభీష్టశ్రేష్ఠమును, సర్వకార్యోత్తమమును విధియించి, నిఖిలప్రతిష్ఠాపరిపూర్ణతలను, అనుగ్రహమనోజ్ఞతలను, శ్రేయోమోక్షములను ప్రసాదింపుమని వినయాతిరేకతతో, ఔత్సుక్యతతో, అణకువతో, భక్తితో, మనసా వాచా, మనశ్చేతనలతో, మేధోమస్తిష్కములతో నిను వేడుచున్నాడను. వీరు నిక్కముగా, నీ యాహ్వానము నాలించి, నీ సింహద్వారసీమను సమీపించి, నీ ప్రేమాగ్నిజ్వలితులై, నీ పావన నిగూఢాలాపములకు పరవశులైనారు. వీరు నీ దివ్యధర్మసేవ యందున సుస్థిరులు, నీ దివ్యానన వినమ్రులు, నీ రక్షణచ్ఛాయోదాత్తులు. ప్రజలలో వారు నీ నామధారులుగ ప్రసిద్ధులై, నీ సేవకులయందున నిన్ను ప్రస్తుతింపుచున్నారు.
ఓ దేవా, నా దేవా! వారిని నీ సనాతన వైభవముతో సముద్ధరించి, నీ మహత్తరసామ్రాజ్యమున మన్నన జేసి, వారల కీమహనీయ యుగమున నీ యనుగ్రహ సేనాగణములతో దోడ్పడుము. ఓ ప్రభూ, నా దేవా! నీ బహువిధానుగ్రహదీపికకు గాజుకవచ మగునటుల, నీ సాదరౌదార్యానుగ్రహ వ్యాపకులగునటుల వారి కేతనము నూర్ధ్వీకరించి, వారికి నీ సంరక్షణ యందలి సింహభాగము ననుగ్రహించి, వారి చిహ్నములను సుదూరభూములకు విస్తరించి, వారి తేజమును ప్రవృద్ధ మొనరింపుము.
ఓ ప్రభూ, నా దేవా! వారికి తమ యొంటరిపాటున సహచరుడవై, వారిని పరితాప తరుణమున నీ సాహాయ్యపరివృతులను జేయుము. వారికి నీ దివ్యగ్రంథమును ప్రసాదించి, పరిపూర్ణముగ నీ పురస్కృతుల ననుగ్రహింపుము. యథార్థముగా, నీవు మహాబలుడవు, శక్తియుతు డవు, కృపాన్వితుడవు, ఔదార్యుడవు; నిక్కముగా నీవు కరుణామయుడవు, అనుకంపాన్వితుడవు.
వితరణాధిక్యమౌ విభుదుడ వీవు
పరిపూర్ణ యాదరణ పాలకుడ వీవు
ఉదయాన మనమున కూరట నీవు
నా కష్టనష్టాల నరయుదు వీవె
నీ నివాళి నిమిషం నిలిపిన మనసు
నినుగాక వేరొండు నేస్తమున్ గొనక
ఇష్టాన తనకుతా నిక్కట్లె గోరు
భవదీయ సంస్తుతి భజియింతు మదిని
ముదమున తనకునై ముప్పునే గోరు
నినుగని నిట్టూర్ప నిలువగలేని
హృదయము శుష్కించి ఆరిపో గాక
నినుగని విలపింపనొవ్వని కన్ను
అవిటిదగుటె మేలు అంతకు మున్ను
తీవ్రతాపమువేళ దీనుని గావు
అఖిలబలుడవంచు అర్ధింతు దేవ
ఆద్యంతరహితమై అలరించునట్టి
తేజస్సు నాయందు దేదీప్యమవగ
అర్హతానర్హతల యౌచితి వీడి
దయగల విభుడవు దయజూపు దేవ
పక్షము విఱిగిన పక్కి యెట్లేగు
కరుణించి క్రొత్తది గైజేయమయ్య
సమావేశ మందిరములోనికి నీవెప్పుడు ప్రవేశించిననూ, అఖండ విజయసాధనమున సమస్త శక్తిశాలి నీకు ఔదార్యపూర్వకముగా సహకరింపవలెనని, భగవంతునిపట్ల అనురాగ ప్రకంపిత హృదయముతోను, ఆయన స్మరణతప్ప సమస్తమునుండి ప్రక్షాళితమైన జిహ్వతోను ఈ ప్రార్థనను గావించు:
ఓ దేవా, నా దేవా! నీ పవిత్రవదనము వంకకు భక్తితో అభిముఖులమై, ఈ మహిమాన్విత యుగమున, నీనుండి తప్ప సమస్తమునుండి మమ్ములను విముక్త మొనరించు కొనిన నీ సేవకులము. మా దృక్పథ భావాల పరముగా సమైక్యతనొంది, మానవ జాతి మధ్య నీ ప్రవచనాన్ని సమున్నత మొనరించడానికి మా ఏకీకృత లక్ష్యముతో ఈ సమావేశ మందిరమున సమావేశమైనాము. ఓ ప్రభూ, మా దేవా! మమ్ము దివ్యమార్గ దర్శకత్వ ప్రతీకలనుగా, మానవుల మధ్య నీ మహోన్నత ధర్మధ్వజాలనుగా, నీ శక్తివంతమైన ఒడంబడికకు సేవకులనుగా, మా యత్యున్నత ప్రభుడవైన ఓ దేవా! నీ అభా సామ్రాజ్యము నందలి నీ దివ్యైక్యతా స్వరూపులనుగా, సమస్తసీమలపై ప్రకాశించే దేదీప్యమాన నక్షత్రాలనుగా రూపొం దించు. ప్రభూ! నీ ఆశ్చర్యకర అనుగ్రహతరంగాలతో మేము ఉప్పొంగే సాగరాలు కావడానికీ, నీ సర్వమహిమోన్నత శిఖరాలనుండి ప్రవహించే వాహినులు కావడానికీ, నీ దివ్యధర్మ వృక్షముపై గల సుందరఫలాలు కావడానికీ, నీ దివ్య ద్రాక్షాక్షేత్రమున, నీ ఔదార్య మందమారుతాలచే కదలాడే తరువులు కావడానికీ మాకు సహాయము గావించు. ప్రభూ! ఒకే సముద్రపు కెరటాల వలె మేము ఐక్యత నొందడానికీ, నీ శోభాప్రపూర్ణ కాంతికిరణాలుగా విలీనము నొందడానికీ, ఐకమత్యసారాన్ని ప్రపంచమంతటా ప్రకటిస్తూ, మా తలపులు, మా భావాలు, మా దృక్పథాలు ఒకే వాస్తవికతగా రూపొందడానికీ - మా ఆత్మలను నీ భగవదేకత్వ వాక్కులపై ఆధారితముల నొనరించి, మా హృదయాలను నీ యౌదార్యానుగ్రహాలతో ఆహ్లాదపరచు. నీవు అనుకంపా న్వితుడవు, వదాన్యుడవు, ప్రదాతవు, సర్వశక్తివంతుడవు, కృపాన్వితుడవు, దయానిధివి.
ఓ నా దేవా, నీ దివ్యనామము నాకు ఆరోగ్యకరణము; నీ స్మరణమే నాకు దివ్యౌషధము. నీ సామీప్యమే నా ఆశ. నీ యెడ ప్రేమే నాకు సహచరుడు. నాయెడ నీ కారుణ్యము నాకు ఆరోగ్యకరణము, ఇహపర ప్రపంచాలలో నాకు సహాయము. నిశ్చయంగా, నీవు సర్వ ఔదార్యుడవు, సమస్త విజ్ఞానివి, సకల వివేకివి.
ఓ నా దేవా, నీ ఆశ్రయములో నేను మేల్కొ న్నాను, తదాశ్రయాన్వేషి అధివసించుట కది నీ సంరక్షణ పుణ్యస్థానము, నీ రక్షణ దుర్గమగును. ఓ నా ప్రభూ, నీవు నా బాహ్యాస్తిత్వమును నీ అనుగ్రహ-ఉదయ కాంతితో శోభింపజేసినటులే, నా ఆంతరికాస్తిత్వమును నీ దివ్యావిష్కరణ- ఉషోదయ ప్రభలతో ప్రకాశవంతము గావించు.
ఓ నా దేవా, ఈ ఉదయాన, నీ కృపతో మేల్కొన్నాను; నిన్ను పరిపూర్ణముగా విశ్వసింపుచు, నీ సంరక్షణాధీనుడనై, నా గృహమునుండి బయల్వెడలితిని. నీ వైపున, నీ కృపాస్వర్గము నుండి నాపై వదాన్యతలను వర్షించు. నా భావములను నీపై స్థిరముగ నిలిపి, నీ సంరక్షణలో ఉత్క్రమించుటకు నన్ను సమర్థుని గావించినటులే, మదీయ గృహోన్ముఖుడ నగుటకు సైతము నన్ను సమర్థుని గావించు.
ఏకైకుడవు, సామ్యరహితుడవు, సమస్త విజ్ఞానివి, సర్వవివేకివియగు నీవుతప్ప అన్యదైవము లేడు.
ఓ దేవా, నా ప్రభూ! నేను నీ సేవకుడను, నీ సేవకాత్మజుడను. నీ దివ్యశాసనగ్రంథము లలో విధియించినటుల, నీ యిచ్ఛారుణోదయము నుండి నీ సమైక్యతా ప్రభాతనక్షత్రము ప్రభవిల్లి ప్రపంచ సమస్తముపై ప్రభాసమును ప్రసరించినపుడు నా శయ్యపై నుండి జాగృతుడనైతిని.
ఓ నా దేవా, నీ జ్ఞానతేజఃప్రకాశాలకు మేల్కొనినాము గనుక నీకు ప్రశస్తి. ఓ నా ప్రభూ, నీతో తప్ప వేరెవనితోనైనా విడివడి పోవడానికీ, నీతోతప్ప సకల బంధాలనుండీ విముక్తి నొందడానికీ మమ్ము శక్తివంతులను గావించుదానిని మాకనుగ్రహించు. నా కోసం, నాకు ప్రియమైన వారి కోసం, నా స్వజనుల కోసం - స్త్రీ పురుషులకు ఏకరీతిగా - ఇహపర శుభాలను లిఖించు. సకల సృష్టిప్రియుడవు, సమస్త విశ్వాభీష్టానివి అయిన ఓ దేవా, మానవహృదయాలకు దుర్బోధను చేయు దుష్టులుగా నీవు రూపొందించిన వారి నుంచి, నీ అప్రతిహత సంరక్షణతో మమ్ము రక్షించు. నీవు నీ అభీష్టానుసారము వర్తింప సమర్ధుడవు. సత్యముగా, నీవు సర్వశక్తిమంతుడవు, ఆపత్సహాయకుడవు, స్వయంజీవనుడవు.
ఓ ప్రభూ, నా దేవా, నీ మహోన్నత బిరుదములను వర్తింపజేసి, సజ్జనులనూ, దుర్జనులనూ విభజింపజేసిన ఆయనను ఆశీర్వదించు; నీవు ప్రేమించి, ఆసక్తి వహించిన వాటిని నిర్వర్తించడానికి కృపతో మాకు సహకరించు. ఓ నా దేవా, అంతియేకాక, నీ దివ్యవాక్కులు, నీ దివ్యాక్షరములు అయినవారిని, తమ వదనములను నీపై నిలిపి, నీ వదనమున కభిముఖులై నీ పిలుపు నాలించిన వారిని ఆశీర్వదించు.
నిక్కముగా నీవు విభుడవు, సకలజన వల్లభుడవు, వస్తుసమస్తమునకు అధినాథుడవు.
ఓ నా దేవా! ఇతడు నీయందున, నీ సంకేతముల యందున విశ్వాసము కలవాడు, నిన్ను తప్ప సమస్తము నుండీ విడివడజేసికొని తన ముఖమును నీవైపుకు నిబద్ధము చేసిన నీ సేవకుడు, నీ సేవక పుత్రుడు. నిశ్చయముగా, నీవు దయాప్రదర్శకులలోని వాడవు, అత్యుత్తమ కరుణాప్రపూరితుడవు.
మానవుల పాపాలను క్షమించేవాడివీ, వారి లోపాలను గుప్తపరిచేవాడివీ అయిన ఓ దేవా, అతడికి నీ యౌదార్యస్వర్గము, నీ యనుగ్రహసాగరము అగుపించునటుల వ్యవహరించు. భూ, స్వర్గాల స్థాపనకు పూర్వమే నెలకొనియున్న నీ సర్వోత్కృష్ట దయాప్రాంగణ ప్రవేశము నాతనికనుగ్రహించు. నిరంతర క్షమావర్తనుడవు, పరమోదారుడవు అయిన నీవుతప్ప అన్య దైవము లేడు.
తరువాత, ఆతడు “అల్లా ‘హో’ అభా” అభివాదమునూ, ప్రత్యేక వాక్యములనూ ఈ విధముగా పలుకవలె:
“అల్లా ‘హో’ అభా” (ఒక సారి)
- మేమెల్లరమూ, నిశ్చయముగా, భగవంతుని ఆరాధిస్తున్నాము. (19 సార్లు)
“అల్లా ‘హో’ అభా” (ఒక సారి)
- మేమెల్లరమూ, నిశ్చయముగా, భగవంతుని ముందు వినమ్రుల మౌతున్నాము. (19 సార్లు)
“అల్లా ‘హో’ అభా” (ఒక సారి)
- మేమెల్లరమూ, నిశ్చయముగా, భగవంతునికి అంకితుల మౌతున్నాము. (19 సార్లు)
“అల్లా ‘హో’ అభా” (ఒక సారి)
- మేమెల్లరమూ, నిశ్చయముగా, భగవంతుని సంకీర్తిస్తున్నాము. (19 సార్లు)
“అల్లా ‘హో’ అభా” (ఒక సారి)
- మేమెల్లరమూ, నిశ్చయముగా, భగవంతునికి వందనములను సమర్పిస్తున్నాము. (19 సార్లు)
“అల్లా ‘హో’ అభా” (ఒక సారి)
- మేమెల్లరమూ, నిశ్చయముగా, భగవంతుని యందున ఓరిమి వహిస్తున్నాము. (19 సార్లు)
(మరణించినది స్త్రీ అయితే, అతడు: “ఈమె నీ సేవిక, నీ సేవికాపుత్రిక....”ఇత్యాదిగా పలుకుగాక)
ఓ నా దేవా! దుష్కృతాలను క్షమించేవాడివీ, బహుమతులను అనుగ్రహించేవాడివీ, వ్యధలను నివారించేవాడివీ అయిన ఓ దేవా!
భౌతిక వస్త్రమును పరిత్యజించి, ఆధ్యాత్మిక లోకాలకు ఆరోహించిన వారి అపరాధములను మన్నింపుమని, నిక్కముగా నిన్ను అర్ధిస్తున్నాను.
ఓ నా ప్రభూ! అతిక్రమణల నుండి వారిని పునీతులను గావించు, వారి వ్యధలను పరిహరించు, వారి అంధకారాన్ని జ్యోతిగా పరివర్తన గావించు. వారిని నీ యానందోపవనమున ప్రవేశింపనిమ్ము. పరమ పావన జలములతో వారిని ప్రక్షాళన గావించి, నీ మహోన్నతాద్రిపై నీ శోభాదర్శనమును వారికి ప్రసాదించు.
భగవన్మిత్రులందరూ ... తమ అర్పణ ఎంత సామాన్యమైనదైనా అవకాశమున్నంత వరకూ యిచ్చితీరవలె. ఏ వ్యక్తిమీదా భగవంతుడు సామర్ధ్యాన్ని మించిన భారం నిలుపడు. ఇటువంటి సమర్పణలు సమస్త కేంద్రాల నుండి, సర్వవిశ్వాసుల నుండి వచ్చితీరవలె... ఓ భగవన్మిత్రులారా! ఈ సమర్పణల స్థానంలో సుందరమైన బహుమతులతో, ప్రదానాలతో మీ వ్యవసాయం, మీ పరిశ్రమ, మీ వ్యాపారం బహుముఖీనంగా అభివృద్ధి చెందేటందుకు అనుగ్రహించటం జరుగుతుందని మీరు నిశ్చయించుకోండి. ఎవడైతే అత్యుత్తమ కార్యంతో ముందుకు వస్తాడో, అతడు దశవిధ ప్రతిఫలాలను పొందుతాడు. ఎవరైతే తమ సంపదను ఆయన మార్గంలో వ్యయం చేస్తారో, వారికి భగవంతుడు ఘనంగా ప్రదానం చేస్తాడనడంలో సందేహం లేదు.
ఓ దేవా, నాదేవా! నీ నిజప్రేమికుల లలాటములను దీప్తివంతము గావించు; నిశ్చిత విజయులైన దివ్యాతిథేయులచే పరిపోషించు. వారి పాదాలను నీ ఋజుమార్గమున సుస్థిరము గావించు. నీ విశ్వాసాన్ని సంరక్షిస్తూ, నీ స్మరణతో వారి విశ్వాసాన్ని పరిరక్షించుకుంటూ, నీ ప్రేమకోసం వారి హృదయాలను సమర్పిస్తూ, నీ దివ్యసౌందర్యారాధన కోసం, నిన్ను ఆనందపరిచే మార్గాలను అన్వేషించడానికి, తాము కలిగియున్న దానిని నిరోధించకుండా, నీవు వారికి అనుగ్రహించిన దానిని నీ మార్గంలో వ్యయం చేస్తున్నారు కాబట్టి, నీ ప్రాచీన వదాన్యత నుండి నీ అనుగ్రహ ద్వారాలను వారి ముందు వివృతం గావించు.
ఓ నా ప్రభూ! వారికి ఘనమైన భాగాన్నీ, నిర్ణీత ప్రతిఫలాన్నీ, నిశ్చిత బహుమతినీ ప్రదానం గావించు.
సత్యముగా, నీవు స్వయంపోషకుడవు, సహాయకుడవు, ఉదారుడవు, వదాన్యుడవు, నిత్య ప్రదాతవు.
ఓ దేవా! ఈ శిశువును నీ అనురాగ వక్షమున లాలించు, నీ కారుణ్య వక్షోజం నుంచి క్షీరాన్ని ప్రసాదించు. ఈ నూతనలతను నీ వాత్సల్య జపాపుష్పవనమున పరిపోషించు. నీ ఔదార్యజలధారల ద్వారా వృద్ధినొందుటకు సహకరించు. ఈ బిడ్డను దివ్య సామ్రాజ్య సంతానాన్ని గావించి, నీ స్వర్గధామమునకు నడిపించు. నీవు శక్తివంతుడవు, కరుణాన్వితుడవు; నీవు ప్రదాతవు, ఉదారుడవు, అతులిత కారుణ్య విభుడవు.
ఓ దేవా! ఈ బాలలకు విద్యను నేర్పు. ఈ బాలలు నీ ఉపవనలతలు, నీ కేదార కుసుమాలు, నీ ప్రసవవన జపాపుష్పాలు. నీ వర్షాన్ని వారిమీద వర్షింపనిమ్ము; నీ ప్రేమతో వారిపై వాస్తవికతా భాస్కరుని భాసింపనిమ్ము. సుశిక్షితులై, పెరిగి అభివృద్ధి నార్జించి, అత్యుత్తమ సౌందర్యముతో అగుపించడానికి, నీ మందమారుతమును వారికి విశ్రాంతిని కలిగించనిమ్ము. నీవు ప్రదాతవు. నీవు కృపాన్వితుడవు.
ఓ ప్రభూ! ఈ యువకుని తేజోవంతుని గావించు. ఈ దీనునికి నీ వదాన్యతను అనుగ్ర హించు. ఇతడికి విజ్ఞానాన్ని ప్రసాదించు; ప్రతి ప్రభాత - ఉదయవేళ అధికబలము ననుగ్రహించు; ఈతడు దోషవిముక్తుడు కావడానికీ, నీ ధర్మసేవలో నిమగ్నుడు కావడానికీ, దుర్లలితులను సక్రమంగా నడపడానికీ, అభాగ్యులకు దారిని చూపడానికీ, బంధితులను విముక్తులను గావించ డానికీ, ప్రమత్తులను జాగృత మొనరించడానికీ, అందరినీ నీ జ్ఞాపక ప్రఖ్యాతులతో అనుగ్రహింప బడేలా చేయడానికీ ఇతడిని నీ సంరక్షణ శిబిరంలో పరిరక్షించు. నీవు మహాశక్తియుతుడవు, అధికార పరిపూర్ణితుడవు.
ఓ దేవా! నన్ను నడిపించు, నన్ను రక్షించు; నన్నొక శోభాదీపికను, ఉజ్జ్వలతారను గావించు. నీవు మహాశక్తి యుతుడవు, అధికార పరిపూర్ణితుడవు.
ఓ దేవా, మానవజాతిమీద ప్రేమను ప్రత్యక్షీకరించినందున విఖ్యాతుడవీవు! మా జీవానివీ, జ్యోతివీ అయిన ఓ దేవా, నీ సేవకులను నీ దివ్యపథమున నడిపించు. మమ్ము నీ యందున సంపన్నులను గావించి, నీవు తప్ప సమస్తమునుండి విముక్తులను గావించు.
ఓ దేవా, మాకు నీ యేకత్వమును బోధించి, నీ ఏకైకత గురించిన గ్రహింపును మాకు ప్రసాదింపుము. నీవు దయాన్వితుడవు, వరదాతవు!
ఓ దేవా, నీ ప్రియతముల హృదయాలలో నీవు తప్ప సమస్త యోచనలను దహింపచేయు నీ ప్రేమాగ్నిని సృష్టించు.
ఓ దేవా, నీవు భూతకాలము నందుంటివను, భవిష్యత్కాలము నందుందువను, నీవుదక్క అన్యదైవము లేడను నీ మహనీయ నిత్యత్వమును మాకు వెల్లడించు. నిక్కముగా, నీయందున మేము సౌఖ్యమును, శక్తిని దర్శింతుము.
ఓ నా దేవా! ఓ నా దేవా! నీ సేవకుల హృదయాలను సమైక్యము కావించి, వారికి నీ ఘన ప్రయోజనాన్ని వెల్లడించు. వారు నీ యాజ్ఞల ననుసరించి, నీ న్యాయశాస్త్ర విధానంలో సుస్థిరులగునటుల, ఓ దేవా, వారి యత్నాలలో నీవు వారికి తోడ్పడు, నిన్ను సేవించడానికి వారికి శక్తిని అనుగ్రహించు. ఓ దేవా, వారిని వారికే వదలివేయక, వారి యడుగులను నీ జ్ఞానతేజస్సులో నడిపించు. నీ ప్రేమతో వారి హృదయాలను ఉల్లాసపరచు. నిశ్చయముగా, నీవు వారి సహాయకుడవు, వారి ప్రభుడవు.
ఇలా వచించు : ఓ దేవా, నా దేవా! న్యాయమకుటముతో నా శిరస్సును, న్యాయాభరణముతో నా నుదుటిని అలంకరించు. నిశ్చయముగా, నీవు, సర్వ బహుమతులకు, ఔదార్యాలకు అధిపతివి.
ఓ నా దేవా! నీ సేవకుల వ్యవహారాలను పెంపొందించడానికీ, నీ నగరాలను వృద్ధి పొందించడానికీ నాకు సహాయపడమని నేను నిన్ను నీ మహనీయ విఖ్యాత నామముతో అర్ధిస్తున్నాను. నీవు నిశ్చయంగా సమస్త సామ్రాజ్యాధిపతివి.
దేవా! ఐకమత్యజ్యోతితో సమస్త భూమిని ఆవరించునటుల, దాని సమస్త ప్రజల లలాటములపై “రాజ్యము భగవంతునిది” అన్న చిహ్నం ముద్రిత మగునటుల అనుగ్రహించు.
దేవుడుతప్ప కష్టనివారకుడు ఎవడైనా ఉన్నాడా? ప్రవచించు: దేవుడు ప్రశంసితుడు! ఆయన దేవుడు! అందరూ ఆయన సేవకులు, అందరూ ఆయన ఆజ్ఞకు బద్ధులు!
ఓ దేవా! నా ఆత్మను ప్రఫుల్లితంచేసి, ఆనందపరచు. నా హృదయాన్ని పవిత్రం గావించు. నా అధికారాలను శోభింపచెయ్యి. నేను నా వ్యవహారాల నన్నింటినీ నీ హస్తంలో ఉంచు తున్నాను. నీవు నా మార్గదర్శివి, నా శరణ్యుడివి. నేనిక ఏమాత్రమూ శోకింపను, వ్యధపొందను; నేను సంతోషాత్ముడను, ఉల్లాససహితుడను ఔతాను. ఓ దేవా! నేను ఇక ఏమాత్రం చింతా పరుడను కాను, వ్యాకులతకు నన్ను క్లేశపరిచే అవకాశమివ్వను; జీవితపు ఉల్లాసరహిత విషయాల ఎడ వర్తించను.
ఓ దేవా! నాకన్నా నీవే నాకు పరమ మిత్రుడవు. ఓ ప్రభూ, నన్ను నీకు అర్పించుకొను చున్నాను.
ఓ నా ప్రభూ, నా ప్రియతమా, నా ఆకాంక్షా! నా ఏకాంతమున నాతో మైత్రిని వహించు, నా ప్రవాసవేళ నన్ను అనుసరించు. నా దుఃఖాన్ని తొలగించి, నన్ను నీ సౌందర్యారాధకుడిని గావించు, నీవు తప్ప ఇతరమంతటి నుంచి నన్ను విముక్తుని గావించు. నీ పవిత్రతా పరిమళముతో నన్ను ఆకర్షించు. నీవు తప్ప మిగిలిన అంతటినుండి ఎవరు విముక్తి పొందారో, నీ పవిత్ర ద్వారసీమలో సేవచేయడానికి ఎవరు ప్రీతిని వహిస్తున్నారో, ఎవరు నీ ధర్మములో కృషి చేయడానికి వర్తిస్తున్నారో, వారితో నాకు నీ రాజ్యంలో కలిసి ఉండడాన్ని కలిగించు. నీ మహోల్లాసాన్ని పొందిన నీ కన్యాసేవికలలో ఒకతెనై ఉండడానికి నాకు సామర్థ్యమివ్వు. సత్యంగా, నీవు మహామహిముడవు, మహోదారుడవు.
ఓ దేవదేవా! నీ విశ్వాసంలో స్థిరంగా ఉండడానికీ, నీ మార్గాలలో పయనించడానికీ, నీ ధర్మంలో దృఢత్వం వహించి ఉండడానికీ - నీ ప్రీతికి పాత్రులైన వారికి తోడ్పడు. ఆత్మ, మనోభావాల దండయాత్రలను ఎదుర్కోవడానికీ, దివ్యమార్గదర్శన జ్యోతిని అనుసరించడానికీ వారికి నీ ఔదార్యాన్ని అనుగ్రహించు. నీవు అధికారవంతుడవు, మహోదారుడవు, స్వయం పోషణుడవు, సర్వప్రదాతవు, కృపాన్వితుడవు, సకలశక్తియుతుడవు, సమస్తదయాపరుడవు.
ప్రభూ! మేము దుఃఖితులము, మాకు నీ అనుగ్రహాన్ని కలిగించు; అభాగ్యులము, నీ సంప త్సముద్రం నుంచి ఒక భాగాన్ని మాకు ప్రసాదించు; దీనులము, మమ్ము సంతృప్తులను గావించు; అధములము, నీ కీర్తిని మాకు అనుగ్రహించు. పశుపక్ష్యాదులు ప్రతిదినము తమ నిత్యాహారాన్ని నీవద్ద నుండి పొందుతున్నవి; సమస్త ప్రాణులు నీ భద్రతా ప్రియదాక్షిణ్యాల నుండి భాగాన్ని పొందుతున్నవి.
నీ అద్భుతౌదార్యము నుండి ఈ దుర్బలుని తొలగించకు; ఈ నిస్సహాయ ఆత్మకు నీ శక్తితో ఔదార్యాన్ని ప్రసాదించు.
నీమీద తప్ప అన్యులెవ్వరిమీదనూ మేము ఆధారపడకుండా ఉండేటందుకూ, పరిపూర్ణంగా నీతోనే సంభాషించేందుకూ, నీ మార్గాలలో పయనించేందుకూ, నీ వైచిత్య్రాలను ప్రకటించేందుకూ మాకు నిత్యాహారాన్ని ప్రసాదించు, మా జీవితావసరాలలో నీ సంపదను వృద్ధినొందించు. నీవు సకల శక్తియుతుడవు, ప్రేమికుడవు, సమస్త మానవజాతికి ఉపకార పరుడవు.
ఓ ప్రభూ! మేము శక్తిహీనులము; మమ్ము శక్తియుతులను గావించు. ఓ దేవా! మేము అజ్ఞానులము; మమ్ము జ్ఞానసమృద్ధులను గావించు. ఓ ప్రభూ! మేము భాగ్యహీనులము; మమ్ము భాగ్యవంతులను గావించు. ఓ దేవా! మేము నిర్జీవులము; మమ్ము సజీవులను గావించు. ఓ ప్రభూ! అపకీర్తియే మేము; నీ దివ్యసామ్రాజ్యములో మాకు కీర్తిని కల్పించు. నీవు మాకు తోడ్పడితే, ఓ ప్రభూ, మేము తళతళ ప్రకాశించే తారకల మౌతాము. నీవు మాకు సహాయపడకపోతే, మేము ధూళికంటే అధములమౌతాము. ఓ ప్రభూ! మమ్ము బలోపేతులను గావించు. ఓ దేవా! మాకు విజయాన్ని ప్రసాదించు. ఓ దేవా! స్వార్థాన్ని జయించడానికీ, వాంఛను అధిగమించటానికీ మాకు సామర్ధ్యము నిమ్ము. ఓ ప్రభూ! భౌతికప్రపంచ బంధనాల నుండి మాకు విముక్తిని ప్రసాదించు. ఓ ప్రభూ! నిన్ను సేవించేందుకు ఉద్యమించడానికీ, నీ ఆరాధనలో నిమగ్నులం కావడానికీ, నీ దివ్య సామ్రాజ్యములో పరిశ్రమించడానికీ, పవిత్రాత్మశ్వాస ద్వారా, మమ్ము సచేతనులను గావించు. ఓ ప్రభూ! నీవు అధికార పరిపూర్ణితుడవు! ఓ దేవా! నీవు క్షమాపకుడవు! ఓ ప్రభూ! నీవు దయాన్వితుడవు!
ఓ దేవా, నా దేవా ! నీ విశ్వసనీయ సేవకులను స్వార్ధవ్యామోహ దుష్కర్మలనుండి పరిరక్షించు; సమస్త అభిద్రోహ, ఈర్ష్యాద్వేషాలనుండి వారిని నీ ప్రణయ కారుణ్య సావధాననేత్రముతో కాపాడు; నీ రక్షణ దుర్గంలో వారిని సంరక్షించు; అనుమానపుటస్త్రాల నుండి వారికి భద్రతను కల్పించు; నీ మహోదార సంకేతాలకు వారిని ప్రతిరూపాలను గావించు; నీ దివ్యైక్యతారుణోదయము నుండి వెదజల్లబడే దీప్తిమత్కిరణాలతో వారి వదనాలను శోభింప చేయి; నీ పవిత్ర సామ్రాజ్యము నుండి ఆవిష్కరింపబడిన దివ్యవాక్కులతో వారి హృదయాలను ఉల్లాసపరచు; నీ వైభవోపేత లోకమునుండి ఉద్గమించు సర్వపాలనాధికారముతో వారి కటిసీమలను బలకరం గావించు. నీవు సర్వోదారుడవు, సంరక్షకుడవు, శక్తివంతుడవు, మహిమాతిశయుడవు.
ఓ దేవా! ఇది యొక రెక్కలు విరిగిన విహంగము, ఇతడి యుద్గమన మెంతయో నెమ్మదైనది. సౌభాగ్య, మోక్షశిఖరము దెస కెగయునటుల, అనంత విశ్వాంతరాళమున పరమానందోత్సాహములతో పయనించునటుల, సకల రాజ్యములయందున నీ సర్వోన్నత నామ సంకీర్తనము నుచ్చైస్వనమున గావించునటుల, ఈ పిలుపుతో తన శ్రవస్సులను ఉల్లాసపరచుకొనునటుల, మార్గదర్శక సంకేతములను విలోకించి నేత్రములను తేజోభరిత మొనరించుకొనునటుల ఇతడికి సహాయము చేయుము.
ఓ ప్రభూ! నేను అసహాయుడను, ఏకాంతవర్తనుడను, అధముడను. నాకు నీవు దక్క సహాయకుడు లేడు. నాకు నీవు దక్క వేరొక పరిపాలకుడు లేడు. నీ సేవలో నన్ను దృఢపరచు. నీ దేవదూతాగణములతో నాకు తోడ్పడు. నీ దివ్యప్రవచనాన్ని విస్తరించడంలో నాకు విజయము నొనగూర్చు. నీ ధర్మాన్ని నీ ప్రజలతో ప్రసంగించేందుకు నాకు అనుమతిని ప్రసాదించు. నిశ్చయంగా, నీవు అశక్తుల సహాయకుడవు, అల్పుల సంరక్షకుడవు; నిశ్చయముగా, నీవు అధికారపూరితుడవు, శక్తిమంతుడవు.
ఓ నా దేవా, వైభవమస్తు! ఈ నీ సేవకుడు, ఈ నీ సేవిక నీ కారుణ్యచ్ఛాయలో సమావిష్టులై, నీ యౌదార్యానుగ్రహాలతో ఏకమైనారు. ఓ ప్రభూ! వారికి ఈ నీ ప్రపంచముననూ, నీ దివ్యసామ్రాజ్యముననూ సహకరించి, నీ కరుణాకటాక్షములతో వారికి సకల శుభములను అనుగ్రహించు. ఓ ప్రభూ! నీ సేవాధర్మమున వారిని నిశ్చితులను గావించి, వారికి సహకరించు. నీ ప్రపంచమున నీ దివ్యనామధేయములకు వారిని ప్రతీకల నొనరించి, ఇహపరములలో నీ యనంతానుగ్రహములతో వారిని సంరక్షించు. ఓ ప్రభూ! వారు నీ కారుణ్య దివ్యసామ్రాజ్యమునకు ప్రణమిల్లుచు, నీ యేకత్వ దివ్యధామమును వేడుకుంటున్నారు. నిక్కముగా, నీ యాజ్ఞాబద్ధులై వారు వివాహితులైనారు. వారిని సతతము సమతాసామరస్య సంకేతములను గావించు. నిక్కముగా, నీవు సమస్త శక్తిమంతుడవు, సర్వాంతర్యామివి, సకల బలయుతుడవు.
ఓ నా దేవా, నా స్వామీ, నా అభీష్టలక్ష్యమా! ఈ నీ సేవకుడు నీ కృపాశ్రయమున శయనించుటకు, నీ భద్రతను, నీ సంరక్షణను అభ్యర్ధింపుచు నీ యౌదార్యమండపమున విశ్రమించుటకు ఆకాంక్షింపుచున్నాడు.
ఓ ప్రభూ, నిదురవోని నీ నేత్రముతో, నిన్ను దక్క అన్యము నవలోకింపకుండునటుల నా కన్నులను కాపాడుమని వేడుదును. నీ సంకేతములను గ్రహించి, నీ యావిష్కరణ దిఙ్మండలము నవలోకించగలుగు నటుల వాటి దృష్టిని దృఢీకృతము గావించు. సత్త్వసారము ప్రకంపిత మొనరించిన సర్వశక్తియుతుని యావిష్కరణముల కాద్యుడవీవు.
సమస్త బలవంతుడవు, సకల విజేతవు, అనిర్బంధనుడవు అయిన నీవు తప్ప అన్యదైవము లేడు.
ఓ ప్రభూ, నా దేవా, నీకు ప్రశస్తి! నీ సర్వాతిరిక్త వైభవస్వర్గములలోనికి మమ్ముల నుద్గమింపజేసి, నీ దివ్యైక్యతా పటవేశ్మములోనికి ప్రవేశించుటకు సంశయగ్రస్తులను నిరోధించు సందిగ్ధమాలిన్యము నుండి మమ్ము ప్రక్షాళన గావించు దానిని నాకును, నా సాహచర్యము నందున్న వారికిని అనుగ్రహింపుమని - అంధకారము జ్యోతిస్సుగా పరివర్తితము, పునస్సందర్శిత దేవాలయము నిర్మితము, లిఖిత దివ్యఫలకమావిష్కృతము, బాహ్యప్రసారిత వ్యావర్తిని వివృతము కాబడిన ఈ దివ్యావిష్కరణ నామమున ప్రార్థిస్తున్నాను.
ఓ నా ప్రభూ, నేను నీ ప్రేమాన్విత రజ్జుబంధాన్ని దృఢముగా చేపట్టి, నీ దయానుగ్రహ వస్త్రాంచలాన్ని పరిగ్రహించినవాడిని. నా కోసం, నా ప్రియజనులకోసం ఇహపర శుభము ననుగ్రహించు. నీవు సృజియించినవారియం దొకరిగా యెన్నుకోబడిన వారికి ప్రదానం చేయడానికి నీవు నిర్ణయించిన గుప్త బహుమానాన్ని ప్రసాదించు.
ఓ నా ప్రభూ! నీ సేవకులను ఉపవసింపుమని నీవు ఆజ్ఞాపించిన సుదినములివి. సంపూర్ణంగా, కేవలము నీ కొరకై నినువినా సమస్త వస్తువులయెడ పరిపూర్ణ విరాగముతో ఉపవసించువాడు ధన్యుడు. ఓ నా ప్రభూ, నీయెడ విధేయతను వహించి, నీ అనుశాసనముల ననుసరించుటకు నాకునూ, వారికినీ సహాయమొనరింపుము. నిక్కముగా నీవు ఆకాంక్షించు దాని నొనర్ప శక్తియుతుడవు.
సర్వవిజ్ఞానివీ, సర్వవివేవికీ అయిన నీవు తప్ప, అన్యదైవము లేడు. సమస్త ప్రపంచాధినాథుడగు దేవునికి సకలప్రశస్తి.
ఓయీ భగవద్దిశాముఖుడా! నీ నేత్రాలను ఇతరములగు సర్వవస్తువులకును మూసివైచి, సర్వోదారుని రాజ్యము దెసకు వాటిని వివృతమొనరించు. ఏది వలసినను నీవాయననే అర్ధించు; దేని నాశించినను ఆయననుండియే ఆశించు. ఆయన ఒక్క చూపుతో నూరు వేల ఆశయముల ననుగ్రహిస్తాడు, ఒక్క దృష్టి తో శతసహస్ర అసాధ్యవ్యాధులను శమింపచేస్తాడు, వీక్షణ మాత్రాన ప్రతి గాయానికీ లేపనాన్ని అనుగ్రహిస్తాడు, ఒక్క శిరః కంపంతో హృదయాలకు సంక్షోభపు సంకెలల నుండి స్వేచ్ఛను కలిగిస్తాడు. ఆయన తానొనర్చునదే యొనర్చును, మనకిక మార్గాంతర మేమున్నది? ఆయన తన అభీష్టాన్ని నెరవేర్చుకుంటాడు, తన అభిప్రీతిని నిర్దేశిస్తాడు. ఇక, వినయంతో నీ శిరస్సును వినమ్రము చేయుట, సర్వౌదార్య ప్రభునిలో నీ విశ్వాసము నుంచుట నీకెంతయేని సముచితములు.
“ఈ దైనందిన అనివార్యప్రార్థనలకు - ఆరోగ్యకరణ ప్రార్థన, అహ్మద్ ఫలకమువంటి కొన్ని నిర్దిష్ట లేఖనాలతో సహా - ఒక విశేషశక్తినీ, ప్రాధాన్యతనూ బహాఉల్లా అనుగ్రహించినాడు; కనుక అవి ఆ విధముగానే అంగీకరింపబడి, ‘వాటి ద్వారా భగవంతునితో మరింత సన్నిహిత సంభాషణలలోనికి ప్రవేశింపవచ్చును, ఆయన శాసనములతో, ఉపదేశములతో మరింత పరిపూర్ణముగా గుర్తింపును పొందగలము’ అన్న ప్రశ్నింపదగని నమ్మికతో, దృఢ విశ్వాసముతో విశ్వాసులు వాటిని పఠించాలి.”
- షోఘి ఎఫెండీ
ఆయన యధీశుడు, సర్వజ్ఞుడు, వివేకి! దేవుని సామీప్యతానంద సందేశమును నిష్కళంకులకు ప్రకటింపుచు, భగవదేకత్వ విశ్వాసులను ఔదార్యోపేతుని ప్రత్యక్షతాస్థానము నకు రమ్మనుచు రాజన్యుడును, మహిమాన్వితుడును, అతులితుడును నగు దేవునిచే వెలువరింపబడిన దివ్యసందేశమును దూరీకృతుల కందింపుచు, ఈ పుణ్యస్థానమునకు, ఈ దేదీప్యమాన సౌందర్యము దెసకు ప్రేమికులకు దారిని చూపుచు, అక్షయ వృక్షోపశాఖలపై పావన మధురస్వనముతో స్వర్గపుకోయిల గానము చేయుచున్న దదిగో!
నిశ్చయముగా దైవదూతల గ్రంథములయందున పూర్వప్రవాచితమై, దోషమునుండి సత్యమును వేరొనరించి, ప్రతి యాదేశవివేకమును వివేచించు పరమోన్నత సౌందర్యమిదియే. నిశ్చయముగా, మహనీయుడును, శక్తిమంతుడును, ఉన్నతుడును నగు దేవుని ఫలముల నీయగల జీవనవృక్ష మాయనయే.
ఓ అహ్మద్! నిశ్చయముగ ఆయనయే దేవుడు; రాజన్యుడును, సంరక్షకుడును, నిరుపమానుడును, సర్వశక్తిమంతుడును, ఉపమానరహితుడునునగు ఆయనయే తప్ప అన్యదైవము లేడనియు, అలీ యను నామమున ఆయన యెవ్వనినంపెనో, యెవ్వని యాజ్ఞ లను మనమెల్లర మనుసరింపుచుంటిమో, ఆ దివ్యుడే భగవంతుని నుండి యరుదెంచిన నిజమైన వాడనియు సాక్ష్యము వహింపుము.
వచించు: ఓ ప్రజలారా! మహిమాన్వితుడును, సర్వవివేకియును నగు ఆయనచే, బయానునం దాదేశితములైన భగవదాజ్ఞలకు విధేయులు కండు. గ్రహియింప గల్గిరేని, నిశ్చయముగ, ఆయన వార్తావహుల రాజన్యుడు, ఆయన గ్రంథము మాతృగ్రంథము.
ఆయన సందేశము నివ్విధముగ కోయిల ఈ కారాగారమునుండి నీకుచ్చరింపు చున్నది. ఆయన ఈ విస్పష్ట సందేశమును తప్పక వెలువరింప వలసియే యున్నది. ఈ యుపదేశమునకు విముఖుడు కానెంచువాని నటులే కానిమ్ము, తనప్రభుని మార్గము నెంచుకొను నాతని నటులే చేయనిమ్ము.
ఓ జనులారా, మీరీ దివ్యవాక్కులను నిరాకరించిరేని, మరి, యే నిదర్శనముతో మీరు దైవమును విశ్వసించితిరి! ఓ అసత్యసమూహమా, దానిని ప్రదర్శించు. నా యాత్మను తన హస్తమునందుంచు కొనిన ఆయనపై యాన! వారు దానిని ప్రదర్శింప జాలరు; అంతియేకాదు, వారొకరికొకరు సహాయ మొనరించుకొనుటకు యేకమైననూ, అటులెన్నటికిని యొనర్ప జాలరు.
ఓ అహ్మద్! నా యనుపస్థితి యందున, నా వదాన్యతలను మరువకు. నీ జీవితకాలమున నా రోజులను, నా దుఃఖమును, నా ఈ దూరస్థ కారావాసమును జ్ఞాపకముంచుకొనుము. శత్రుఖడ్గములు నీపై ప్రహారములను వర్షించిననూ, సమస్త భూ స్వర్గములు నీకు వ్యతిరేకముగ నుద్యమించిననూ, నీ హృదయమును చలియింపనివ్వక నా ప్రేమయందు సుస్థిరుడవు కమ్ము.
నా విరోధుల కగ్నిజ్వాలవు, నా ప్రియతములకు శాశ్వత జీవనస్రవంతివి కమ్ము; శంకితులయం దొకడవు కావలదు.
నా పథమునం దాపదలును, నా కొరకై యప్రతిష్ఠయు నిన్నావరించెనేని నీవందుకు వ్యధ చెందకు.
నీ దైవమును, నీ పితరుల దైవమును నగు పరమాత్ముని విశ్వసింపుము. తాము మిధ్యామార్గముల యందు సంచరిస్తున్నందున, వారు తమ స్వీయ నేత్రములతో భగవంతుని దర్శించుటకు కాని, ఆయన మధురస్వనమును తమ స్వీయశ్రవణములతో ఆలకించుటకు కాని వివేకహీనులు. నీవు వీక్షింపుచున్నటులే మేమునూ, అవ్విధముగనే వారిని పరికించితిమి.
వారి యంధవిశ్వాసము లవ్విధముగ వారికిని, వారి స్వీయహృదయములకును మధ్య ముసువులై, మహాప్రకీర్తితుడును, మహోన్నతుడును నగు భగవంతుని మార్గమునకు వారిని దూరము గావించినవి.
ఈ దివ్యసౌందర్యమునకు విముఖుడు, పూర్వ వార్తావహులకును విముఖుడే ననియు, సమస్తానంతము నుండి సమస్తానంతము వరకు పరమాత్ముని యెడ అహంకారమును ప్రదర్శిస్తున్నాడనియు నీవు నిశ్చయముగ విశ్వసింపుము.
ఓ అహ్మద్, ఈ దివ్యఫలకమును కంఠస్థముగ నేర్చుకొనుము, నీ జీవితకాలమున దీని నాలపింపుము; మానవలదు. ఏలయన, దీని నాలపించు నాతనికి శతహుతాత్ముల త్యాగఫలమునూ, ప్రపంచద్వయ సేవాఫలమునూ భగవంతుడు నిశ్చయముగ విధియించి యున్నాడు. కృతజ్ఞతాబద్ధుల యందొకడ వగుదువని, మేమీ యనుగ్రహములను మా పక్షమున వరముగ, మా సాన్నిధ్యాశీస్సుగ నీకనుగ్రహించినాము.
భగవంతునిపై యాన! ఎవ్వడేని దుఃఖముననో, సంకటముననో యున్నచో ఈ ఫలకమును పరిపూర్ణ శ్రద్ధతో పఠియించినయెడల పరమాత్ముడాతడి దైన్యమును తొలగించును; ఆతడి కష్టములను పరిష్కరించును; ఆతడి బాధలను తొలగించును.
నిశ్చయముగ, ఆయన కరుణాన్వితుడు, దయాన్వితుడు. సమస్తప్రపంచములకును అధిపతి యగు పరమాత్మునికి ప్రశస్తి!
[యునైటెడ్ స్టేట్స్ కు చెందిన తొమ్మిది ఉత్తరీశాన్య రాష్ట్రాలు: మెయిన్, మసచుసెట్స్, న్యూ హ్యాంప్షర్, రోడ్ ఐలండ్, కనెడికట్, వెర్మాంట్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, న్యూయార్క్ నివాసులైన బహాయిల నుద్దేశించి 1916 సం. మార్చి 26 న బహజీ సౌధంలోని అబ్దుల్-బహా గదిలో దీనిని వెలువరించడం జరిగింది.]
ఓ స్వర్గదూతలారా!
నౌరూజ్ పర్వదినములివి. సహృదయులైన ఆ మిత్రులను గురించి సదా నేను ఆలోచిస్తూనే ఉంటాను. అమెరికన్ రిపబ్లిక్కులలో జరుగుతున్న ఆ సమావేశాలు - హృదయాలలో భగవంతుని ప్రేమజ్యోతి తేజరిల్లేలా, మైనపువత్తులవలె ప్రజ్జ్వలించి, దివ్యబోధనాకిరణములు ఆ విధముగా అమెరికన్ రాష్ట్రాలను మహత్తర మార్గదర్శకత్వ తారాసమన్వితమైన సువిస్తృతాంతరిక్షము వలె రత్నాలంకృతను, శోభాసమన్వితను గావింపవలెనని - మీలో ప్రతి ఒక్కరి నిమిత్తమూ ఏకత్వద్వారసీమ నుండి అనుగ్రహ, సహకారముల నర్థిస్తున్నాను.
అట్లాంటిక్ తీరంలోని ఉత్తరీశాన్యరాష్ట్రాలు: మెయిన్, న్యూ హ్యాంప్షర్, మసచుసెట్స్, రోడ్ ఐలండ్, కనెడికట్, వెర్మాంట్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, న్యూయార్క్. ఈ రాష్ట్రములలోని కొన్నింటిలో విశ్వాసులున్నారు, అయితే, ఈ రాష్ట్రముల నగరములలో కొన్ని, ఇంకనూ దివ్యసామ్రాజ్యప్రభలతో శోభిల్లనూ లేదు, దివ్యబోధనల నెఱుగనూ లేదు. అందువల్ల, మీలోని ప్రతి ఒక్కరూ వీలున్నప్పుడల్లా ఆ నగరములకు త్వరత్వరగా తరలి, మహత్తర మార్గదర్శకత్వ తేజోసమన్వితులై తారల వలె ప్రకాశింపవలె. భగవంతుడు ఖురాన్‌లో ఇలా ప్రవచించినాడు:“భూమి నల్లని బీడుగా వుండేది. మే మప్పుడు దానిపై వర్షమును కురియింపచేయగా, తక్షణమే అది హరితము, సస్యశ్యామలము అయినది, సర్వవిధములైన మొక్కలూ సమృద్ధిగా మొలకెత్తినవి.”1 వేరొక విధముగా చెప్పవలెనంటే, నేల నల్లనిదనీ, వసంత కాలపు వర్షపుజల్లులు తనపై వర్షించినప్పు డది సచేతనమైనదనీ, వివిధవర్ణముల పుష్పములూ వికసించాయనీ అంటున్నా డాయన. ప్రాకృత్రిక ప్రపంచమందలి మానవ హృదయాలు మట్టివలె నల్లనివని దీనికి అర్థం. అయితే, దివ్యత్వవాహినులు భువికి దిగివచ్చి, సముజ్జ్వల ప్రభలు సాక్షాత్కరించినప్పుడు హృదయములు పునరుజ్జీవనము నొందుతాయి, ప్రకృతి అనబడే అంధకారము నుండి విముక్తినొందుతాయి, దివ్యమహిమాన్విత కుసుమములు వృద్ధిచెంది, సమృద్ధతను సంతరించుకుంటాయి. పర్యవసానముగా, మానవుడు మనుష్యప్రపంచమునకు చైతన్య కారకుడై, దైవస్ఫూర్తితో పావనగ్రంథావిష్కృత పవిత్రబోధనలను పరివ్యాప్తము సేయుచూ ఉండవలె. మీరు తూర్పు, పడమరలకు పయనించి, మహత్తర మార్గదర్శకత్వకాంతితో ప్రజలను జ్ఞానవంతులను గావింపుడు, తద్వారా, వారు అమరజీవితమునం దొక పాలు నొందెద,2 రని పవిత్ర సువార్తలో ప్రస్తావితమైనది. ఉత్తరీశాన్యరాష్ట్రములు అపార సామర్థ్యమును సంతరించుకొని నందులకు భగవంతుడు శ్లాఘనీయుడు. ఏలయన, భూమి సారవంతము; దివ్యజలధార వర్షిస్తున్నది. మీ రిప్పుడు దివ్యహాలికులై, సిద్ధము సేయబడిన నేలలో స్వచ్ఛబీజములను చల్లవలె. ప్రతి విత్తనపు దిగుబడీ పరిమితమే, అయినను, దివ్యబోధనా బీజముల అనుగ్రహాశీస్సు లపరిమితములు. రానున్న శతాబ్దిలో, కాలావృత్తమునం దింకెన్నియో పంటదిగుబడుల సమీకరణము జరుగ గలదు. దీనిని పూర్వతరముల కృషి యని పరిగణింపుడు. యేసుక్రీస్తు జీవిత కాలమునం దాయనను విశ్వసింపుచుండిన స్థిరచిత్తులు లెక్కకు కొందరే అయినను, దైవాశీస్సు లెంత సమృద్ధిగా వర్షించినవనిన, కొద్ది సంవత్సరములలోనే, లెక్కకు మిక్కిలిగ జనులు సువార్తచ్ఛాయలోనికి ప్రవేశించినారు. “ఒక్క గింజ ఏడు కంకుల నిచ్చును, ప్రతి కంకియు నూరేసి గింజల నొంది యుండు,”3 నని ఖురాన్‌లో, భగవంతుడు ప్రవచింపనైనది. వేరొక విధముగ చెప్పవలె ననిన, ఒక్కటే ధాన్యపుగింజ ఏడువందల గింజలగును; భగవంతుడు తలచుకొనినచో, వాటిని రెండింతలైనను చేయగలడు. ధన్యజీవి యొక్కడు దేశమునకే మార్గదర్శన హేతువగుట సకృత్తుగా జరుగుతూ వచ్చినదే. మనమిప్పుడు మన శక్తిసామర్ధ్యములను గణనము సేయరాదు; తద్భిన్నముగా, బిందువునుండి అంబుధినీ, అణువునుండి ఆదిత్యుడినీ సృజియించిన భగవంతుని ఉపకృతుల పైనను, అనుగ్రహముల పైనను మన మీనాడు దృష్టిని కేంద్రీకరింపవలె.
మీకు ప్రశంసాభినందనలు!
[యునైటెడ్ స్టేట్స్ లోని తొమ్మిది ఉత్తరీశాన్యరాష్ట్రాలు: మెయిన్, మసచుసెట్స్, న్యూ హ్యాంప్షర్, రోడ్ ఐలండ్, కనెడికట్, వెర్మాంట్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, న్యూయార్క్ నివాసు లైన బహాయిలను ఉద్దేశించి 1917 సం. ఫిబ్రవరి 2న హైఫాలో, అబ్దుల్-బహా నివాసంలోని ఇస్మాయిల్ ఆఖా గదిలో దీనిని వెలువరించడం జరిగింది.]
ఆయన భగవంతుడు!
ఓ నిజ మిత్రులారా:
నిజైకదైవ దృష్టిలో దేశములన్నియూ ఒక్కటే దేశము, సకల నగరములదీ, గ్రామములదీ ఒకే ప్రాతిపదిక. ఏదియూ ఇంకొకదానిని మించిన విశిష్టత నొంది యుండలేదు. అవన్నియూ దైవక్షేత్రములే, జనావాసములే. అయితే, విశ్వాసముతో, దృఢనిశ్చయముతో, ఒకరిపై ఒకరు సాధించిన ప్రాధాన్యతతో, నివాసి - ఆవాసమునకు గౌరవమును చేకూరుస్తాడు. కొన్ని దేశములు విశిష్టతను సంతరించుకుని, ఉదాత్తస్థాయి నందుకుంటాయి. ఉదాహరణకు: యూరోపియన్, అమెరికన్ దేశముల యందలి కొన్ని - పర్యావరణ రమ్యతలోనూ, జలసమృద్ధిలోనూ, పర్వతముల, మైదానముల, పచ్చికబీళ్ల మనోజ్ఞతలోనూ కొన్ని దేశములను అధిగమించినప్పటికీ, పాలస్తీనా మాత్రము - అబ్రహామ్ నాటి నుండి ప్రవక్తల ముద్ర1 అవతరణము వరకూ, పవిత్రావతారములు ఆ దేశమున వసించడమో, అచటకు తరలిపోవడమో, ఆ దేశము ద్వారా పయనించడమో జరిగినందున - దేశములకే తలమానికమైనది. అటులే, ప్రవక్తృత్వ జ్యోతి భాసిల్లినందున మక్కా, మదీనాలు అనంతకీర్తిని సముపార్జించుకొని యున్నవి. ఈ కారణముననే అన్య దేశములకన్ననూ పాలస్తీనా, హిజాజ్ లకు విశిష్టత చేకూరినది.
ఆ విధముగనే, నిజైక దైవదృష్టిలో అమెరికా ఖండము: ఆయన జ్యోతిర్వైభవ మావిష్కృతము కావలసిన, ఆయన దివ్యధర్మమర్మములు ప్రదర్శితములు కావలసిన, ధర్మవర్తనులు వసింపవలసిన, స్వేచ్ఛాజీవులు సమీకృతులు కావలసిన భూభాగము. అందువలన, అక్కడి ప్రతి ప్రాంతమూ ఆశీఃకృతమైనది; అయితే, విశ్వాస, అభయప్రదానముల పరముగా ఈ తొమ్మిది రాష్ట్రములూ అనుగ్రహీతము లైనందున, తత్ప్రాముఖ్యతతో అవి - ఆధ్యాత్మిక మహద్భాగ్యమునకు పాత్రత నొందినవి. ఈ అనుగ్రహప్రాధాన్యత నవి గ్రహియించి తీరవలె: ఎందులకనగా, అవి అంతటి బహూకృతికి పాత్రమైనవి, ఈ ఘనతరానుగ్రహమునకు ధన్యవాదముల నర్పించుటకై - అవి దివ్యసౌరభముల పరివ్యాపనమున కుద్యమింపవలె. తద్వారా: “స్వర్గమునకూ, భూమికీ జ్యోతి భగవంతుడే: ఆయన జ్యోతి అనురూపత గోడ గూటిలోని దివ్వె; గాజుపేటికలో దాచి ఉంచబడిన దాదీపము; ప్రకాశమయ నక్షత్రము వలె కానవచ్చు నాగాజు. అది ఒక ధన్యవృక్షపు – ప్రాక్పశ్చిమములలో దేనికీ చెందని ఆలివ్ వృక్షపు – తైలముతో ప్రజ్జ్వలితమైనది; అది ఆశించునది అల్పమే, కాని, ఏ అగ్నీ తనను స్పర్శించకున్ననూ ఆ తైలము వెలుగు నిచ్చును. ఈ వెలుగు ఇంకొక తేజముతో మిళితమైనది. భగవంతుడు తన తేజమును తనకు ఇష్టులైనవారి వంకకే ప్రసరించు,”2 నను ఖురాన్ పవిత్రవాక్కులు సాకారము కావచ్చును.
ఇట్లనుచున్నా డాయన: ప్రాకృతిక ప్రపంచ మంధకారమయ ప్రపంచము, ఏల యనగా, సహస్రభ్రష్టత్వములకు మూలమది; అంతియకాదు, చీకటికి తోడైన చీకటి యది. ప్రాకృతిక ప్రపంచశోభ సత్యసూర్యుని తేజముపై ఆధారితము. మార్గదర్శన కారుణ్యము, జ్ఞానవిజ్ఞతలనబడు గాజుగోళమున ప్రజ్జ్వలితమైన మైనపువత్తి వంటిది; మానవహృదయ దర్పణమే ఆ జ్ఞానవిజ్ఞతల గాజుగోళము. ఆ దేదీప్యమాన దీపిక తైలము ధన్యవృక్ష ఫలము నుండి స్వీకృతమైనది; ఆ తైలము అగ్నిలేకనే వెలుగు నటుల శుద్ధీకృతమైనది. దీపిక కాంతితీవ్రతనూ, గాజుగోళపు పారదర్శకతనూ, దర్పణ నైర్మల్యమునూ సమీకృత మొనరించినప్పుడు, దీప్తికి దీప్తి చేకూరిన యట్లగును.
సూక్ష్మముగా చెప్పవలెననిన, ఈ తొమ్మిది ఆశీఃకృత రాష్ట్రములయందునా అబ్దుల్-బహా - పర్యటించినాడు, ఒకచోటినుండి వేరొకచోటికి వెడలినాడు, దివ్యగ్రంథ జ్ఞానవ్యాఖ్యానము గావించినాడు, పరిమళ పరివ్యాపన మొనరించినాడు. రాష్ట్రములలో దివ్యసదనమును చాలవరకు నెలకొలిపి, బోధనాద్వారము దెరచినాడు. స్వచ్ఛబీజము లను ఆ రాష్ట్రములలో చల్లి, అనుగ్రహవృక్షములను నాటినాడు.
ఇక ఇప్పుడు, భగవద్విశ్వాసులును, దయామయుని సేవికలును ఈ క్షేత్రములకు నీటిని పెట్టి, ఈ దివ్యసస్యముల సేద్యమున అధికశక్తితో నిమగ్నులు కావలె. తద్వారా, బీజములు మొలిచి, ప్రవృద్ధములై, సౌభాగ్యానుగ్రహము సాకారమై, పంట దిగుబడు లెన్నియో పుష్కలముగ సమకూడవచ్చును.
స్వచ్ఛమైన సారవంతభూమికి, స్వామి అయిన కర్షకుని వంటిది - భగవంతుని దివ్యసామ్రాజ్యము. అందున దివ్యబీజములు వేయబడతాయి, దైవేచ్ఛామేఘములు వర్షిస్తాయి, సత్యసూర్య కిరణములు ప్రసరిస్తాయి.
ఈ అనుగ్రహములన్నియూ ఇప్పుడు ఈ తొమ్మిది రాష్ట్రములలోనూ నెలకొని, పరిపూర్ణముగా దృగ్గోచర మౌతాయి. దివ్యవనపాలుడు ఆ పుణ్యభూమిని జేరి, ఆ మహోదాత్త బోధనాబీజముల నాక్షేత్రమున వైచినాడు; భగవంతుని అనుగ్రహ జలధార వర్షితమైనది, సత్యసూర్యోష్ణిమ - అనగా దయాన్వితుని ఆశీస్సులు - పూర్ణతేజముతో ప్రసరింపనైనది. ఆ ధన్యజీవులయందలి ప్రతి ఒక్కరూ అప్రమేయుడైన ఏకైక జలప్రదాత కాగా, ప్రాక్పశ్చిమ అమెరికాలు మనోహర స్వర్గముగా పరివర్తన మొందవచ్చును. తద్వారా, సర్వోత్కృష్ట దేవగణమునుండి “ధన్యులు మీరు, మరియొకమారు, ధన్యులు మీరు,”3 అను ఉద్ఘోషణమును మీ రాలకింపవచ్చును.
మీకు ప్రశంసాభినందనలు.
ఈ ప్రార్థన బోధకులకూ, మిత్రులకూ నిత్యపఠనీయము:
దయాన్వితుడవైన ఓ దేవదేవా! నీకు ప్రస్తుతి - మాకు మార్గదర్శన మహాపథ దర్శనము గావించి, సామ్రాజ్యద్వారములను దెరచి, సత్యసూర్యునిచే సాక్షాత్కృతుడ వైనావు. అంధులకు దృష్టినిచ్చినావు; బధిరులకు వినికిడి ననుగ్రహించినావు; నిర్జీవులను సజీవులను గావించినావు; దీనులను శ్రీమంతులను జేసినావు; పెడద్రోవ బట్టిన వారికి పథదర్శన మొనరించినావు; నోరెండిన వారిని మార్గదర్శక ప్రస్రవణము దెసకు నడిపినావు; దాహార్తి నొందిన మత్స్యమును సత్యసముద్రపు దరిజేర్చినావు; త్రిమ్మరుచున్న పక్షులను కృపయను గులాబి వనములోని కాహ్వానించినావు.
ఓ సర్వశక్తిశాలీ! మేము నీ సేవకులము నీ దీనులము; ఒంటరులము - నీ సాన్నిధ్యాకాంక్షులము, నీ స్రవంతీజల దాహార్తులము, అస్వస్థులము – నీ వొన గూర్చు స్వస్థత నభిలషిస్తున్నాము. నీ పథమున పయనిస్తు న్నాము, నీ సౌరభపరివ్యాపనము దక్క మా కింకొక లక్ష్యమో, ఆశయమో లేదు; కనుక ఆత్మ లన్నియూ: “ఓ దేవా, మమ్ము సన్మార్గమునకు నిర్దేశింపు,”2 మని ఆక్రందింపవచ్చును. వెలుగును జూచుటకై వారి నేత్రములు తెరువబడు గాక; వా రజ్ఞానాంధకార విముక్తు లగుదురు గాక. వారు నీ మార్గదర్శకజ్యోతిని పరివేష్టింతురు గాక. భాగము నొందని ప్రతి యొక్కరునూ భాగము నొందెదరు గాక. అభాగ్యులు నీ మహిమల సాన్నిహిత్యము నొందెదరు గాక.
ఓ సర్వశక్తిమంతుడా! వాత్సల్యదృష్టితో మమ్ము వీక్షించు, దైవానుగ్రహములను మాకు ప్రసాదించు, పవిత్రాత్మ నిశ్వాసమును మా కనుగ్రహించు, తద్వారా, మేము నీ సేవయందున సాహాయ్యమునొంది, నీ మార్గదర్శనజ్యోతితో ఈ ప్రాంతముల యందున సముజ్జ్వలతారల వలె ప్రకాశింపవచ్చును.
నిశ్చయముగా, నీవు శక్తిసమన్వితుడవు, శౌర్యశాలివి, విజ్ఞుడవు, సంవీక్షకుడవు.
[కెనడా – అంటే న్యూ ఫౌండ్లాండ్, ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలండ్, నోవా స్కోటియా, న్యూ బ్రన్స్విక్, క్విబెక్, సాస్కట్కెవన్, మనిటోబా, అంటారియో, అల్బర్తా, బ్రిటిష్ కొలంబియా, యుకాన్, మెకంజీ, కీవాటిన్, ఉంగావా, ఫ్రాంక్లిన్ ఐలండ్స్– ఇంకా గ్రీన్‌ల్యాండ్ నివాసులైన బహాయిలకు 1916 సం. ఏప్రిల్ 5న బహాఉల్లా దివ్యసమాధికి చేరువగా ఉన్న ఉద్యాన వనంలో దీనిని వెలువరించడం జరిగింది.]
ఆయన భగవంతుడు!
ఓ దివ్యసామ్రాజ్య నందినీ నందనులారా:
భగవంతునకు ప్రస్తుతి, ఆయన సౌరభములు యునైటెడ్ స్టేట్స్ కు చెందిన పలునగరములలో పరివ్యాప్తములై, అనేకులు దివ్యసామ్రాజ్యము దెస కభిముఖులై, అటుగా పురోగమిస్తున్నప్పటికీ, కొన్ని నగరములలో సమైక్యతా పతాక మింకనూ ఆశించినంత ఎగువకు ఎగురవేయబడుటయేని, బైబిల్, సువార్త, ఖురాన్ వంటి పవిత్రగ్రంథముల మర్మములు వెల్లడింపబడుటయేని జరుగనే లేదు. యావన్మిత్రుల అవిరళ కృషితో సమైక్యతాపతాక మారాష్ట్రములయం దావిష్కృతమై, దివ్యబోధనల ప్రచారము జరుగవలసిన అవసరమున్నది, తద్వారా, ఆ రాష్ట్రములు సైతము, దివ్యాశీస్సులలో తమ పాలునూ, మహోదాత్త మార్గదర్శన భాగమునూ స్వీకరింపవచ్చును. అదే విధముగా - న్యూ ఫౌండ్లాండ్, ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలండ్, నోవా స్కోటియా, న్యూ బ్రన్స్విక్, క్విబెక్, అంటారియో, మనిటోబా, సాస్కట్కెవన్, అల్బర్తా, బ్రిటిష్ కొలంబియా, ఉంగావా, కీవాటిన్, మెకంజీ, యుకాన్, ఇంకా ఆర్కిటిక్ సర్కిల్ లోని ఫ్రాంక్లిన్ ఐలండ్స్ వంటి కెనడా పాలిత ప్రాంతములకు చెందిన భగవద్విశ్వాసులు - ఆత్మత్యాగనిరతులై మార్గదర్శకత్వ మనబడు మైనపు వత్తులవలె కెనడా పాలిత ప్రాంతముల యందున ప్రజ్జ్వలింపవలె. వా రటువంటి ఔదార్యమును ప్రదర్శించిన పక్షంలో, నిస్సంశయముగా - సార్వత్రిక దైవానుగ్రహములకు పాత్రులౌతారు, అమరలోక సహచరు లవిచ్ఛిన్నముగా వారిని బలోపేతుల నొనరింపగలరు, మహత్తర విజయసాధన జరుగుతుంది. దైవేచ్ఛ అయితే, దివ్యసామ్రాజ్యాహ్వానము కెనడా ఉత్తర భాగంలోని ఫ్రాంక్లిన్ ద్వీపనివాసులూ, గ్రీన్‌ల్యాండ్ వాసులూ అయిన ఎస్కిమోల వీనులను సైతము చేర వచ్చును. గ్రీన్‌ల్యాండ్‌లో కనుక భగవంతుని ప్రేమాగ్ని ప్రజ్జ్వలితమైతే, ఆ దేశపు మంచు యావత్తూ కరిగిపోయి, దాని శీతల వాతావరణం ఉష్ణిమను సంతరించుకుంటుంది– అంటే, భగవత్ప్రేమ అనబడే వెచ్చదనంతో హృదయములను స్పర్శించిన పక్షంలో ఆ భూభాగము పవిత్రగులాబీవనముగా, దివ్యస్వర్గముగా రూపొందుతుంది; ఆత్మలు ఫలభరితవృక్షములై, అత్యంతాహ్లాదసౌందర్యములను సంతరించుకుంటాయి. అయితే – కృషి, అపార కృషి – అవసరం. మీరు కనుక కృషి సల్పినట్లైతే, తద్వారా ఎస్కిమోలకు భగవత్పరిమళముల పరివ్యాపనము జరుగవచ్చును. తత్ప్రభావము మహత్తరమూ, సువిస్తృతమూ అవుతుంది. మహనీయ ఖురాన్‌లో భగవంతుడు ఇలా వచిస్తున్నాడు: సమైక్యతాజ్యోతులు సమస్తప్రపంచాన్నీ శోభిల్లజేసే రోజు వస్తుంది. “పృథివి తన ప్రభుని జ్యోతితో భాసిల్లును”1 మరోలా చెప్పవలెనంటే, దైవజ్యోతితో భూమి ప్రకాశితమౌతుంది. ఆ జ్యోతి సమైక్యతాజ్యోతి. “భగవంతుడు దక్క వేరొక దేవుడు లేడు.” ఆ ఖండమూ, ఎస్కిమోల దీవులూ ఈ ప్రపంచములోని భాగములే. అవి సైతము, ఆ తీరుననే - మహత్తర మార్గదర్శకత్వ మున భాగము నొందవలె.
మీకు ప్రశంసాభినందనలు!
[యునైటెడ్ స్టేట్స్ కు చెందిన పదహారు దక్షిణాది రాష్ట్రాలు: డెలవేర్, మేర్లండ్, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, నార్త్ కరొలైనా, సౌత్ కరోలైనా, జార్జియా, ఫ్లారిడా, అలబేమ, మిసిసిపి, టెనెసీ, కెంటకీ, లుయిజియానా, అర్కన్సా, ఓక్లహోమా, టెక్సస్ నివాసులైన బహాయిల నుద్దేశించి 1916 సం. మార్చి 27న బహాఉల్లా దివ్యసమాధికి చేరువనున్న ఉద్యానవనంలో దీనిని వెలువరించడం జరిగింది.]
ఓ భగవత్సామ్రాజ్య దూతలారా!
కొన్ని దినములకు పూర్వ మాభగవద్విశ్వాసుల కొక ఉపదేశమును వ్రాయనైనది, అయితే, ఇవి నౌరూజ్ పర్వదినము లైనందున, మీరు నాకు జ్ఞప్తికి వచ్చినారు; ఈ వైభవప్రపూరిత విందు సందర్భమున మీకు ఈ అభినందనలను పంపుతున్నాను. దినములన్నయూ ధన్యత నొందినవే, కానీ, పర్షియాకు ఈ విందు - జాతీయ పర్వ దినము. దీనిని పర్షియనులు గత వేలాది వత్సరములుగా జరుపుకుంటూ వస్తున్నారు. వాస్తవమునకు - భగవత్స్మరణమున, భగవత్పరిమళ పరివ్యాపనమున, భగవత్సామ్రాజ్యమునకు ప్రజల నాహ్వానించుట యందున తాను గడుపునట్టి ప్రతి రోజూ మానవునకు పర్వదినమే. మీరు భగవత్సామ్రాజ్య సేవలో నిమగ్నులై, భగవన్మత సముద్ఘోషణ మందున నిరతులై ఉన్నందులకు భగవంతునకు ప్రస్తుతి. కనుక, మీ వన్నియూ పర్వదినములే. భగవంతుని సహకారానుగ్రహములు మీపై వర్షించు ననుటకు సంశయము లేదు.
యునైటెడ్ స్టేట్స్ లోని దక్షిణాది రాష్ట్రాలైన -- డెలవేర్, మేర్లండ్, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, నార్త్ కరొలైనా, సౌత్ కరోలైనా, జార్జియా, ఫ్లారిడా, అలబేమ, మిసిసిపి, టెనెసీ, కెంటకీ, లుయిజియానా, అర్కన్సా, ఓక్లహోమా, టెక్సస్ లకు చెందిన మిత్రులు కొందరే. కనుక, ఆయా రాష్ట్రములకు స్వయముగా మీరే వెళ్లడమో, పలువురు ధన్యజీవులను పంపించడడమో చేసిన పక్షంలో, వారు - ప్రజలను దివ్యసామ్రాజ్యము నాశ్రయించేలా పథనినిర్దేము గావింపగలరు. పవిత్ర దివ్యావతారమూర్తులయం దొకరు ఒక విశ్వాసిని ఉద్దేశించి, ఒక వ్యక్తి ఒక ఆత్మచైతన్యమునకు కారణభూతు డైనచో — అది అనంతైశ్వర్యమున కన్ననూ మిన్నయని చెప్పనైనది. “ఓ ఆలీ! భగవంతుడు నీ ద్వారా ఒక్కనికి మార్గదర్శన మొనరించెనేని, సమస్త సంపదల కన్ననూ సర్వోత్తమ మది.” ఇంకా, ఇలా అంటున్నా డాయన: “మమ్ము ఋజుపథమునకు నిర్దేశింపుము.”1 అనగా, మాకు సరియైన దారిని చూపమని. “మీరు ప్రపంచము నందలి ప్రాంతము లన్నింటికీ పయనించి, దేవుని రాజ్యావతరణ శుభసమాచారమును వెల్లడింపు,”2 డని సువార్తలో సైతము ప్రస్తావితమైనది.
సంక్షిప్తముగా, మీరీ విషయమున బృహద్యత్న మొనరించి, వదాన్యతను ప్రదర్శింతురని భావింతును. మీరు తోడ్పాటునొంది, అనుగ్రహీతులు కాగలరనునది సునిశ్చయము. దివ్యసామ్రాజ్యపు టధివాస్తవికల, ప్రాధాన్యతల ప్రత్యక్షతా శుభవర్తమానమును ప్రకటించు నాతడు, సారవంతమైన భూమిలో స్వచ్ఛబీజములను చల్లు కర్షకుని వంటి వాడే. వాటిపై వసంతమేఘ మనుగ్రహవర్షమును కురియించును; ఇక, కర్షకుని స్థాయి గ్రామాధిపతి దృష్టిలో సమున్నతమై, పంట దిగుబడు లెన్నియో సమకూడుతవి.
కనుక, ఓ భగవన్మిత్రులారా! దివ్యాశీస్సులనూ, దేవదేవుని అనుగ్రహమునూ అందుకొనుటకై, మీరు ఈ సమయపు విలువను దెలిసికొని, బీజములను చల్లుటలో నిమగ్నులు కండు.
బహాఉల్-ఆభా మీతో నున్నాడు!
[యునైటెడ్ స్టేట్స్ లోని పదహారు దక్షిణాది రాష్ట్రాలు: డెలవేర్, మేర్లండ్, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, నార్త్ కరొలైనా, సౌత్ కరొలైనా, జార్జియా, ఫ్లారిడా, అలబేమ, మిసిసిపి, టెనెసీ, కెంటకీ, లుయిజియాన, అర్కన్సా, ఓక్లహోమా, టెక్సస్ నివాసులైన బహాయిలను ఉద్దేశించి 1917 సం. ఫిబ్రవరి 3న హైఫాలో, ఇస్మాయిల్ ఆఖా గదిలో దీనిని వెలువరించడం జరిగింది.]
ఓ ధన్యజీవులారా, మాన్యులారా!
జనుల నివాసమున కత్యంత సముచితస్థలము సమశీతోష్ణమండలము, ఎందులకనగా, పరిపక్వతాపరముగా ఈ ప్రాంతమున మేధాశక్తులూ, మనోభావములూ ఉదాత్తస్థితి నొందుతాయి, నాగరికతా సంబంధిత ప్రతిభా పాటవములు పరిపూర్ణ స్థాయిలో వికసిస్తాయి - అను వాస్తవమును ప్రాచీన తత్త్వవేత్తలూ, మధ్యయుగ మేధావులూ, ప్రస్తుత, పూర్వశతాబ్దుల శాస్త్రజ్ఞులూ - సర్వులూ సమ్మతించినారు. మీరు విమర్శనాపూర్వకముగా, సునిశితదృష్టితో చరిత్రాధ్యయన మొనరించినప్పుడు, ప్రముఖులయందలి పలువురు - సమశీతోష్ణమండలమున జన్మించి, వృద్ధిలోనికి వచ్చి తమ కృషిని కొనసాగించిన వారేననీ, అత్యుష్ణ, అతిశీతలమండలవాసులు బహు కొద్దిమందేననీ స్పష్టమౌతున్నది.
ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ లోని ఈ పదహారు దక్షిణాది రాష్ట్రములూ సమశీతోష్ణ మండలస్థితములే. ఈ ప్రాంతమున ప్రాకృతికప్రపంచ పరిపూర్ణతలు సర్వసమగ్రముగా వెల్లడియైనవి. ఎందులకనగా, పర్యావరణ సమతుల్యతా, ప్రకృతి సౌందర్యమూ, గ్రామసీమల భౌగోళిక విన్యాసమూ మేధస్సులలోనూ, మనోభావముల యందునా మహత్తర ప్రభావమును ప్రదర్శిస్తాయి. పరిశీలనాత్మకముగ, అనుభవపూర్వకముగ, ప్రస్ఫుటముగ వెల్లడియైన వాస్తవమిది.
పవిత్ర దివ్యావతారమూర్తులు సైతము, అత్యంత సమతులన స్వభావులై యుండెడివారు; వారి శరీరారోగ్యమూ, సర్వసమగ్రతా అత్యంత పరిపూర్ణములై, వారి భౌతికతత్త్వములు దేహదార్ఢ్యతాయుతములై, వారి శక్తులు నిర్దిష్టసరళీ సమన్వితములై, వారి బాహ్యస్పందనలు అంతర్లీన గ్రహణశక్త్యనుసంధానితములై, అసాధారణ శీఘ్రతాయుతములై, సమన్వయ ప్రపూరితములై యుండెడివి.
అందువలన, ఈ పదహారు రాష్ట్రాలలోనూ- వాటి వాతావరణము అత్యంత సమతులనయుతము కనుక, నిస్సందేహముగా దివ్యబోధనలు సముజ్జ్వలప్రభతో ఆవిష్కృతములు కావలె, పవిత్రాత్మనిశ్వాసములు మహోధృతిని ప్రదర్శింపవలె, ఉత్తుంగతరంగములతో భగవద్వాత్సల్యసాగర ముప్పొంగవలె, దివ్యానురాగమను ఉపవన మలయపవనములు మహోధృతవేగమున వీయవలె, పవిత్రతాసౌరభములు సత్వరమే శీఘ్రగతిన పరివ్యాప్తములు కావలె.
భగవంతునికి ప్రస్తుతి, దివ్యప్రవాహము లనంతములై, ఉదాత్తసూత్ర మధురిమ పరమప్రభావశీలమై, మహత్తరకక్ష్య పరిపూర్ణశోభా ప్రభాసితమగుచూ, సర్వోత్కృష్టగణ సైనికదళములు అప్రతిహతశక్తితో ముట్టడిస్తుండగా, జిహ్వలు ఖడ్గముల కన్నను నిశితములై, హృదయములు విద్యుత్కాంతి కన్నను తేజోభరితములై, మిత్రుల యౌదార్యము పూర్వాపర తరముల వదాన్యతల నధిగమిస్తుండగా - ఆత్మలు దైవసంకల్ప సమాకర్షితములై - భగవంతుని ప్రేమాగ్ని ప్రజ్జ్వలితమైనది.
ఈ సమయాన, ఈ సందర్భాన, మన మీమహదవకాశమును తప్పక వినియోగించుకొనవలె. క్షణమేని స్తబ్ధులము కారాదు; స్థిమితము, విశ్రామము, ప్రశాంతత, వస్తుజాలము, జీవితము, ప్రాపంచిక విషయవ్యామోహముల నుండి బంధవిముక్తులము కావలె. పరమోన్నతుడైన జీవాధినాధునికై సమస్తమును త్యాగము సేయవలె, తద్వారా దివ్యసామ్రాజ్యశక్తులు మహత్తర బుద్ధిసూక్ష్మతలను ప్రదర్శిత మొనరింప, ఈ నవీనావృత్తస్థిత తేజోభాసము - మేధో, లక్ష్య ప్రపంచములను శోభిల్లజేయ వచ్చును.
అమెరికాలో దైవసౌరభములు పరివ్యాప్తములై దరిదాపుగా ఇరువదిమూడు వత్సరములైనది, కాని సముచిత, సయుక్తస్పందన సాధింపబడలేదు, మహత్తర ప్రశంసా, వేగాధిక్యతా అగుపించలేదు. ఇప్పుడిక దైవశక్తితో, దయాన్వితుని పరిమళములతో, చైతన్యాకర్షణముతో అలౌకిక వర్షధారలతో, దైవసేనాదళములతో, భగవద్వాత్సల్య ప్రస్రవణపు వెల్లువతో, భగవద్విశ్వాసు లుద్యమింతురని, మహాశుభము అనతి కాలమునకే తన ముసువును తొలగించునని, ప్రాకృతిక ప్రపంచాంధకారము సంపూర్ణముగ పటాపంచలై, పారద్రోలబడునంతటి తీక్ష్ణతతో సత్యసూర్యుడు ప్రకాశించునని; సకల దిశలనుండియు మహాద్భుత మధురగీతిక వెలువడునని, మానవాళి సచేతనయై, పురోగమించునటుల, ఘనపదార్థములు ద్రవీభవించునటుల, వజ్ర కఠినులు తమ రెక్కలను విప్పార్చుకుని భగవంతుని అనురాగోష్ణిమలో స్వర్గసీమ దెస కెగయునటుల - ప్రాతఃకాల విహంగములు గళములనెత్తి గానము సేయునని నా యాశ.
రమారమి రెండువేల వత్సరములకు పూర్వము ఆర్మీనియా నిబిడాంధకార సమావృతమై యుండెడిది. క్రీస్తు శిష్యులయందలి ధన్యజీవి యొక్కడు, సత్వరమే తరలినా డాప్రాంతమునకు; ఆతడి కృషితో అచిరకాలమునకే ఆ దేశము చైతన్య ప్రపూరితమైనది. ఆ విధముగ దివ్యసామ్రాజ్యశక్తి క్రియాశీలకత ప్రస్ఫుటమైనది.
కనుక, దయామయుని ఆశీస్సులూ, మహోన్నతుని సాహాయ్యమూ సునిశ్చితములని విశ్వసింపుడు; ఈ ప్రపంచమున కతీతముగ, ప్రపంచవాసులనుండి ప్రక్షాళితులూ, పునీతులూ కండు; మీ లక్ష్యములను సకలజన హితార్థమై వ్యవహరింప నిండు; మీ ప్రాపంచిక వ్యామోహమును త్రెంచుకుని, ఉత్తేజసారమై లాఘవమును, సౌకుమార్యమును సంతరించుకొనండి. అటుపై, దృఢసంకల్పముతో, నిర్మలహృదయముతో, సముల్లాసస్ఫూర్తితో, వచోధారాసమన్విత భాషతో, దివ్యసూత్ర ప్రకటనమునకై మీ సమయమును వెచ్చింపవలె, తద్వారా మానవప్రపంచ ఏకత్వము తన మండపమును అమెరికా శిఖరాగ్రముపై నెలకొలుపవచ్చును, ప్రపంచదేశము లన్నియూ దైవవిధానము ననుసరింపవచ్చును. దైవవిధానమనగా సకలజనావళికీ న్యాయము, కృపలే యనునది సునిశ్చయము. ఎందులకనగా, ప్రపంచదేశము లన్నియూ భగవంతుని గొఱ్ఱెలే, భగవంతుడే ప్రేమాస్పదుడైన కాపరి. ఆయన ఈ గొఱ్ఱెలను సృష్టించి, సంరక్షించి, పరిపోషించి, శిక్షణ నొసగినాడు. ఇంతకుమించిన అనంతవాత్సల్య మేమున్నది? భగవంతునకు ప్రస్తుతి, మనము సమస్త జ్ఞానవిహీన వివక్షలనుండీ విముక్తులమై, భగవంతుని గొఱ్ఱె లన్నింటిపట్లనూ కారుణ్యముతో ఉన్నందులకూ; ప్రతి ఒక్కరినీ సేవింపవలె, దయాన్విత పితరునివలె ప్రతి ఒక్కరికీ శిక్షణ నీయవలె ననునది మన పరమావధి అయినందులకూ - దశసహస్ర ధన్యవాదముల ననుక్షణమూ అర్పింపవలె.
మీకు ప్రశంసాభినందనలు!
ఈ రాష్ట్రముల యందలి నగరములకు, గ్రామములకు, కుగ్రామములకు వెడలి, భగవత్సౌరభములను పరివ్యాపన మొనరించుట యందు నిమగ్నతనొందెడు ప్రతి వ్యక్తీ, ప్రతి ఉదయమూ - ఈ వినతిని ధ్యాన పూర్వకముగా పఠింపవలె.
ఓ నా దేవా! ఓ నా దేవా! నీ వాక్కును జనసామాన్యమున ప్రవృద్ధ మొనరించి, నీ జనులయందున నీ బోధనలను పరివ్యాపనము గావింప సంకల్పించి, మహత్తరకార్యమున మగ్నుడనైన నన్ను, నా అల్పత్వమున, అశక్తత యందున వీక్షింపుచున్నాడవు. పవిత్రాత్మ నిశ్వాసముతో నీవు నాకు సాహాయ్యపడకుండినచో, విజయము నొందుటకు నీ సువిఖ్యాత సామ్రాజ్యసేనలతో నాకు తోడుపడకుండినచో, మక్షికమును పక్షీంద్రునిగ, జలబిందువును నదులుగ, సముద్రములుగ, అణువును దీపికలుగ సూర్యులుగ పరివర్తన గావింపగల నీ యనుగ్రహములను నాపై కురియింప నిచో నే నెటుల సాఫల్యత నొందగలను. ఓ నా ప్రభూ! నా జిహ్వ సర్వజనులయందుననూ నీ ప్రస్తుతులను, విశిష్టతలను వచియించునటుల, నీ ప్రేమ, పరిజ్ఞానముల మధువుతో నా మనస్సు ఉప్పొంగునటుల నీ విజయ ప్రదాయక, కార్యసాధకశక్తితో నాకు తోడ్పడు.
నీవు సర్వశక్తియుతుడవు, నీ ఇచ్ఛానుసార వ్యవహర్తవు.
దివ్యఫలకము
[యునైటెడ్ స్టేట్స్ లోని పదకొండు పశ్చిమ రాష్ట్రాలు: న్యూ మెక్సికో, కొలరాడో, అరిజోనా, నెవాడ, కాలిఫోర్నియా, వయోమింగ్, యూటా, మంటానా, ఐడహో, ఓరెగన్, వాషింగ్టన్ ల నివాసులను ఉద్దేశించి 1917 సం. ఫిబ్రవరి 15న అక్కాలో అబ్బుద్ గృహంలోని బహాఉల్లా గదిలో దీనిని వెలువరించడం జరిగింది.]
ఆయన భగవంతుడు!
ఓ మిత్రులారా, దయామయుని సేవికలారా, దివ్య సామ్రాజ్య నియుక్తులారా,
ఆశీఃకృతమైన కాలిఫోర్నియా రాష్ట్రమునకూ, పవిత్రభూమికీ - అనగా పాలస్తీనా దేశమునకూ -- ఎంతో సారూప్యత ఉన్నది. అక్కడి గాలి అత్యంత సమశీతలమై, పీఠము సువిశాలమై ఉంటాయి, పాలస్తీనా ఫలము లెంతో నవనవలాడుతూ, నాజూకుగా ఉంటాయి. ఆ రాష్ట్రములలో పర్యటిస్తున్నప్పుడు తాను పాలస్తీనాలో ఉన్నట్లే అనుభూతిని చెందినాడు – అబ్దుల్-బహా; ఎందులకనగా ఈ ప్రాంతమునకూ ఆ రాష్ట్రమునకూ ప్రతి కోణంలోనూ మంచి పోలిక ఉన్నది. పసిఫిక్ సముద్రతీరములు సైతం, కొన్ని సందర్భములలో, సంపూర్తిగా పవిత్రభూమి తీరములను తలపిస్తాయి; పవిత్రభూమిలోని వృక్షజాలమూ ఆ తీరములలో అభివృద్ధి చెందినదే. ఈ అనుశీలన మత్యద్భుతమూ, ఆశ్చర్యజనకమూ కూడ.
అదే విధముగా కాలిఫోర్నియాలోనూ, తక్కిన పశ్చిమ రాష్ట్రములయందునా, మానవమేధలను మంత్రముగ్థము గావించు ప్రాకృతిక ప్రపంచపు టద్భుత దృశ్యములు గోచరిస్తాయి. బృహత్పర్వతములూ, లోతైన లోయలూ, మహోత్తుంగ జలపాతములూ, మహావృక్షములూ అన్నిచెరగులా అగుపిస్తాయి, ఇక దాని నేల అత్యంత సారవంతమూ, సర్వసమృద్ధమూ. ఆశీఃకృతమైన ఆ రాష్ట్రము పవిత్రభూమి వంటిదే; ఆ ప్రాంతమూ, ఆ జనపదములూ మనోహర స్వర్గతుల్యములే. పలు విధములుగా అది పాలస్తీనా వంటిదే. ప్రాకృతిక సారూప్యతలున్నవి కనుక, ఇప్పుడిక, దివ్యత్వ సారూప్యతలు సైతము సాధింపబడవలె.
పాలస్తీనాలో దివ్యత్వ ఛాయాప్రభలు అభివ్యక్తమౌతున్నాయి. ఇజ్రాయేలీయ దివ్యప్రవక్తలయందలి పలువురు ఈ పావనస్థలినుండియే భగవత్సామ్రాజ్యాహ్వానమును వెలువరించినారు. ఆధ్యాత్మిక బోధనలు పరివ్యాపన మగుటచే, ధార్మికహృదయుల నాసికా రంధ్రములు పరిమళభరితములైనవి, చైతన్యవంతుల నేత్రములు తేజోవంతములైనవి, వీనులు యీ గీతికతో పులకించినవి, హృదయములు భగవంతుని దివ్యసామ్రాజ్య మనోల్లాస మారుతముతో సచేతనములై, సత్యసూర్యుని ప్రభ నుండి మహోత్కృష్ట ప్రభాసము నొందినవి. అటుపై, ఈ ప్రాంతమునుండి ఐరోపా, అమెరికా, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలకు జ్యోతి పరివ్యాప్త మొందినది.
కాలిఫోర్నియా, తక్కిన పశ్చిమ రాష్ట్రములూ - పవిత్రభూమితో ఇప్పుడు మరింత చక్కని సారూప్యతను సంతరించుకొనవలె, ఆ రాష్ట్రమునుండి, ఆ ప్రాంతమునుండి అమెరికా, ఐరోపాలకు పవిత్రాత్మ నిశ్వాసములు విస్తరింపవలె; తద్వారా – భగవంతుని దివ్యసామ్రాజ్యాహ్వానము, సమస్త శ్రవస్సులకూ సంతసోల్లాసములను కలిగింప వచ్చును, దైవసూత్రములు నవజీవనము ననుగ్రహించవచ్చును, భిన్నపక్షము లేకపక్షము కావచ్చును, వైమనస్య భావన లంతరించి ఒకే విశిష్టకేంద్రము చుట్టూ పరిభ్రమణ మొనరింపవచ్చును, ప్రాక్పశ్చిమ అమెరికాలు పరస్పర మాలింగన మొనరించుకొన వచ్చును, మానవప్రపంచ సమైక్యతాగీతిక మానవబాల లెల్లరకూ నవచేతనను ప్రసాదింప వచ్చును, విశ్వశాంతి పటవేశ్మము అమెరికా శిఖరాగ్రమున ప్రతిష్ఠితము కావచ్చును; ఆ విధముగా ఐరోపా, ఆఫ్రికాలు పవిత్రాత్మ నిశ్వాసములతో చైతన్యము నొందవచ్చును, ఈ ప్రపంచ మింకొక ప్రపంచము కావచ్చును, రాజ్యవ్యవస్థ నూతనోల్లాసము నొందవచ్చును, ప్రాకృతికప్రపంచపు టద్భుతదృశ్యములు కాలిఫోర్నియా రాష్ట్రములో వలె, తక్కిన పశ్చిమ రాష్ట్రములలో వలె ప్రత్యక్షములూ, ప్రస్ఫుటములూ కావచ్చును, భగవంతుని దివ్యసామ్రాజ్య బృహత్సంకేత ములు సైత మభివ్యక్తములై, తద్వారా దేహము ఆత్మకు ప్రతిరూపము కావచ్చును. బాహ్యప్రపంచము మనో ప్రపంచమునకు ప్రతీక కావచ్చును, భూమియను అద్దము స్వర్లోక సుగుణములను ప్రతిఫలించు దివ్యసామ్రాజ్య దర్పణము కావచ్చును.
ఆ ప్రాంతములలో నా పయన, పర్యటనల సందర్భమున మహాద్భుత ప్రాకృతిక ప్రదేశములనూ, సువిస్తృత విహంగవీక్షణ దృశ్యములనూ, ఉద్యానములనూ, వాహినులనూ వీక్షించినాడను; జాతీయ పార్కులూ, సార్వత్రిక సమావేశములూ; ఎడారులూ, మైదానములూ, పచ్చికబయళ్ళూ; ఇంకా ఆ ప్రాంతీయ ధాన్యములూ, ఫలములూ నా దృష్టి నెంతో ఆకట్టుకున్నాయి; ఈ క్షణము వరకూ నా మదిలో నిలిచే ఉన్నాయి.
ప్రత్యేకించి, శాన్‌ఫ్రాన్సిస్కో, ఓక్లండ్ లలో జరిగిన సభలతోనూ, లాస్ ఏంజెలెస్ లో జరిగిన సమావేశములతోనూ, అన్యరాష్ట్ర విశ్వాసులతోనూ నేనెంతో సంతుష్టుడనైనాను. వారి ముఖసీమలు లెప్పుడు స్ఫురణకు వచ్చినా, అప్పటికప్పుడు నాకు అంతులేని ఆనందం కలుగుతుంది.
అందువల్లనే, దివ్యబోధనలు సూర్యకిరణములవలె పశ్చిమ రాష్ట్రములన్నింటా ప్రసరింపవలెనని, “శుభనగర మిది, ప్రభుడు క్షమాదాత!”1 యను ఖురాన్ సుభాషితము సాకారము కావలెనని - ఆశిస్తున్నాను. ఆ విధముగనే, “మీరు దేశ మంతటా పయనింపరా?”2 యను ఖురాన్ సుభాషితమూ, “భగవత్కృప ఛాయల నవ లోకింపు,”3 డను వేరొక సుభాషితమూ మహాశోభాయమానముగా ఆవిష్కృతమగు గాక.
దైవానుగ్రహముతో, విధివశాత్తూ సేవాక్షేత్ర మాప్రాంతమున సువిస్తృతినొంది నందులకూ, బుద్ధికుశలత, పురోగమనముల పరముగా మానవమేధలు మహోన్నత స్థాయిలో ఉన్నందులకూ, శాస్త్రవిజ్ఞానములూ, కళలూ ప్రోత్సహింపబడుతున్నందులకూ, హృదయములు దర్పణసదృశములై, అనంతనిర్మలములై, పారదర్శకస్థితిలో ఉన్నందులకూ, భగవన్మిత్రులు పరిపూర్ణముగా పరస్పరాకర్షితులై ఉన్నందులకూ గాను - భగవంతునికి ప్రస్తుతి. అందువల్ల, బోధనాసమావేశములు నిర్వహింపబడుననీ, మొదలిడబడుననీ, భగవత్సౌరభ పరివ్యాపనమునకై విజ్ఞులైన బోధకులను నగరములకూ, గ్రామములకూ పంపుట సైతము జరుగుననీ ఆశింపనైనది.
దివ్యధర్మబోధకులు - పావనులూ, సమున్నతులూ, జ్యోతిర్మయులూ కావలె. వారు స్ఫూర్తిస్వరూపులూ, విజ్ఞానమూర్తులూ కావలె; సుదృఢనిశ్చయులై, స్థైర్యవంతులై, ఆత్మత్యాగనిరతులై సేవాపూర్వకముగ వా రుద్యమింప వలె. వారు తమ పర్యటనలలో ఆహార, వస్త్రధారణలకు సమ్మోహితులు కారాదు. వారు తమ ఆలోచనలను భగవ త్సామ్రాజ్య జలధారలపై కేంద్రీకరించి, పవిత్రాత్మ అనుగ్రహముల నర్థింపవలె. ఒక దివ్యశక్తితో, చైతన్యాకర్షణముతో, దివ్యలోక శుభసమాచారముతో, అలౌకిక పావిత్య్రతతో - అభా దివ్యస్వర్గసౌరభములతో నాసికా రంధ్రములను వారు పరిమళభరిత మొనరింపవలె.
ఈ క్రింది వినతిని వా రనునిత్యమూ ధ్యానపూర్వకముగ పఠింపవలె.
ఓ దేవా! ఇది యొక రెక్కలు విరిగిన విహంగము, ఇతడి యుద్గమన మెం తయో నెమ్మదైనది. సౌభాగ్య, మోక్షశిఖరము దెస కెగయునటుల, అనంత విశ్వాంతరాళమున పరమానందోత్సాహములతో పయనించునటుల, సకలరాజ్యముల యందున నీ సర్వోన్నత నామసంకీర్తనము నుచ్చైస్వనమున గావించునటుల, ఈ పిలుపుతో తన శ్రవస్సులను ఉల్లాసపరచుకొనునటుల, మార్గదర్శక సంకేతములను విలోకించి నేత్రములను తేజోభరిత మొనరించు కొనునటుల ఇతడికి సహాయము చేయుము.
ఓ ప్రభూ! నేను అసహాయుడను, ఏకాంతవర్తనుడను, అధముడను. నాకు నీవు దక్క సహాయకుడు లేడు. నాకు నీవు దక్క వేరొక పరిపాలకుడు లేడు. నీ సేవలో నన్ను దృఢపరచు. నీ దేవదూతాగణములతో నాకు తోడ్పడు. నీ దివ్యప్రవచన విస్తరణలో నాకు విజయము నొనగూర్చు. నీ ధర్మాన్ని నీ ప్రజలతో ప్రసంగించేందుకు నాకు అనుమతిని ప్రసాదించు. నిశ్చయంగా, నీవు అశక్తుల సహాయకుడవు, అల్పుల సంరక్షకుడవు; నిశ్చయముగా, నీవు అధికారపూరితుడవు, శక్తిమంతుడవు, నిర్నిరోధితుడవు.
[యునైటెడ్ స్టేట్స్ కు చెందిన పదకొండు పశ్చిమ రాష్ట్రాలు: న్యూ మెక్సికో, కొలరాడో, అరిజోనా, నెవాడ, కాలిఫోర్నియా, వయోమింగ్, యూటా, మంటానా, ఐడహో, ఓరెగన్, వాషింగ్టన్ ల నివాసుల నుద్దేశించి 1916సం. ఏప్రిల్ 1న బహజీ సౌధంలోని అబ్దుల్-బహా గదిలో దీనిని వెలువరించడం జరిగింది.]
ఆయన భగవంతుడు!
ఓ దివ్యసామ్రాజ్య నందినీ, నందనులారా:
నా హృదయాంతరాళమునుండి మిత్రుల పక్షాన ప్రార్థిస్తూ, భగవంతుని దివ్యసామ్రాజ్యానుగ్రహము నర్ధిస్తూ, పవిత్రాత్మ నిగూఢాలాపముల ప్రత్యక్షప్రభావమును యాచిస్తూ, వారిని గుర్తు చేసుకొనుట తప్ప రేయింబవళ్లూ నా కింకొక వ్యాపకము లేదు. పరమపూజ్యుడైన వదాన్యతాధీశుని ఆశీస్సులతో, ఆ సమయములో ఆత్మలకు భగవన్మిత్రులు జీవశ్వాస నందిస్తూ మానవకోటి మనోచైతన్యమునకు నిగూఢహేతువు కాగలరను ఆశతో ఉన్నాను; తత్ప్రశంసనీయ పర్యవసానములు మానవాళి వైభవమునకూ, మహదానందమునకూ శాశ్వతప్రయోజనకరములగు గాక. కాలిఫోర్నియా, ఓరెగన్, వాషింగ్టన్, కొలరాడో వంటి పశ్చిమ రాష్ట్రములు కొన్నింటిలో పవిత్రతా సౌరభములు పరివ్యాపితములై, నిత్యజీవనస్రవంతినుండి పలువురు భాగమునొంది, భగవత్కృపకు పాత్రులై, దైవానురాగమదిరతో పొంగులు వారెడు కలశమునుండి సేవన మొనరించి మహోన్నత దివ్యగణమాధురి నాలించినారు. భగవంతుని ప్రేమజ్యోతిని న్యూ మెక్సికో, వయోమింగ్, మంటానా, ఐడహో, యూటా, అరిజోనా, నెవాడ రాష్ట్రాలలో సముచిత, సానుకూల విధానమున ప్రజ్జ్వలన మొనరించుట ఇంకనూ జరుగలేదు, భగవంతుని దివ్యసామ్రాజ్యాహ్వానము నెలుగెత్తి ఘోషించుట జరుగలేదు. వీలైతే, ఈ దిశగా ఇప్పుడు కృషి చేయండి. ఆ రాష్ట్రాలలో వ్యక్తిగతంగా మీరైనా పర్యటించండి, కానియెడల ఇంకెవరినైనా ఎంపికచేసి పంపిన పక్షంలో, వారు వారికి బోధించగలరు. ప్రస్తుతమున కారాష్ట్రములు మృతదేహములవలె నున్నవి: వారు వాటికి జీవశ్వాస నందించి, దివ్యస్ఫూర్తిని ప్రసాదింపవలె. తారలవలె వా రాదిఙ్మండలమున ప్రకాశింప వలె, ఆవిధముగా దివ్యవాస్తవికతా సూర్యకిరణములు ఆ రాష్ట్రములను సైతము జ్యోతిర్మయ మొనరింపవచ్చును.
మహనీయ ఖురాన్‌లో భగవంతుడు ఇలా వచిస్తున్నాడు: “నమ్మినవారికి, నిక్కముగా భగవంతుడు సహాయకుడే. ఆయన వారిని చీకటినుండి వెలుగులోనికి నడిపించును.”1 దాని అర్ధం: విశ్వాసులను భగవంతుడు ప్రేమిస్తాడనీ; కనుక, ఆయన వారిని చీకటినుండి విముక్తిచేసి, తేజోమయ ప్రపంచంలోనికి కొనితెస్తాడనీ.
పావన సువార్తలో సైతం: “మీరు ప్రపంచమంతటా పర్యటించి ప్రజలను దేవుని రాజ్యానికి పిలవం,”2 డని చెప్పనైనది. మీరు ఉద్యమించి, ఈ మహత్తరసేవ నందించి, పలువురికి మార్గదర్శన కారకులు కావలసిన తరుణమిది. ఆ విధంగా ఈ మానవాతీతసేవతో - సమస్తప్రాంతములనూ సేవాసఖ్యతా కిరణములు శోభింప చేయగా, మానవప్రపంచము శాంతినీ, ఆత్మస్థైర్యమునూ పొందవచ్చును.
నేను అమెరికాలో ఉండగా, ప్రతి సమావేశంలోనూ విశ్వశాంతి సిద్ధాంతముల ప్రచార నిమిత్తం యెలుగెత్తి చాటి, ప్రజలకు పిలుపును ఇవ్వనైనది. ఐరోపా ఖండము ఆయుధాగారము వలె అయినదనీ, భీషణాగ్నికది ఆహుతి యగుట కేవల మొక్క అగ్నికణముపై ఆధారితమై ఉన్నదనీ, రానున్న కాలంలో, అనగా రెండు మూడేళ్లలో యోహాను ప్రకటనగ్రంథంలోనూ, దానియల్ గ్రంథంలోనూ ప్రస్తావితమైన దెల్లయూ నెరవేరుననీ, సాకారమగుననీ నేను స్పష్టముగా చెప్పనైనది. ఈ అంశము అక్టోబర్ 12, 1912 నాటి శాన్ ఫ్రాన్సిస్కో బులెటిన్ లో ప్రచురితమైనట్లున్నది. మీరు దానిని చూసినచో, వాస్తవము స్పష్టమూ, సువిదితమూ అవుతుంది; ఆ విధముగా, సుపరిమళ పరివ్యాపనా సమయ మిదియేనని సంపూర్ణముగా తెలిసికొనవచ్చును.
మానవుని ఔదార్యము భగవత్సంబంధితమై ఉండవలె, వేరొక తీరున చెప్పవలెనంటే, అది దైవానుగ్రహ సాహాయ్యము నందుకొనుచూ ఉండవలె తద్వారా, మనుష్య ప్రపంచమున కాతడు చైతన్యహేతువు కాగలడు.
మీకు ప్రశంసాభినందనలు!
మానవాళి వాగ్దత్తపురుషుని వదనాన్ని దర్శించి, ఆయన వాణిని ఆకర్షించగలిగే సుదినమిదేనని నిశ్చయంగా నేను వచిస్తున్నాను. భగవద్వాణి సమున్నతం గావించబడి, ఆయన ముఖకాంతి మానవులపైకి ప్రసరించబడింది. అది ప్రతి మానవుడిని తన హృదయ ఫలకము నుంచి, ప్రతి వ్యర్ధపద చిహ్నాన్నీ ప్రక్షాళనం చేయమనీ, విస్పష్టమూ, నిష్పక్షపాతమూ అయిన మనస్సుతో ఆయన కార్యార్ధ నిదర్శనాలను, ఆయన కీర్త్యభిజ్ఞానాలను తిలకించమనీ తెలియ జేసినది.
ఓ మానవ బాలలారా! దైవధర్మాన్నీ, ఆయన మతాన్నీ సృష్టించటంలోగల ప్రధానఉద్దేశ్యం - మానవాళి ప్రయోజనాలను పరిరక్షించడం, మానవజాతి మధ్య ఐక్యతను పెంపొందించడము, మానవుల మధ్య ప్రేమభావాన్ని, సాహచర్యాన్ని పెంపొందించడమే. దానిని అసహ్య శత్రుత్వా లకూ, కలహానికీ, అనైక్యతకూ కారణం కానివ్వకండి. సుస్థిర, నిశ్చిత పునాదికి ఇది ఋజు మార్గము. ఈ పునాది మీద యేది అభివృద్ధి పొందినా ప్రపంచ పరివర్తనలు, అవకాశాలు దాని బలాన్ని క్షీణింపచేయలేవు, లేదా అగణిత శతాబ్దాల పరిభ్రమణం దాని నిర్మాణాన్ని క్రుంగదీయ లేదు.
మిమ్మల్ని మీరు నా ప్రవచన పయోనిధియందు ముంచివేసుకొనండి. తద్వారా, దాని యందు నిక్షిప్తం కాబడియున్న రహస్యాలను బహిర్గతం చేయవచ్చును. మరియు, దాని అగాధాలలో దాగియున్న వివేక మౌక్తికాలను కనుగొనవచ్చును. ఈ ధర్మసత్యాన్ని అవలంబించే సంకల్పంలో, మీరు చాంచల్యం వహించకుండా జాగ్రత్తపడండి. ఎందుకంటే, ఈ ధర్మం ద్వారా భగవంతుని శక్తిసామర్థ్యాలు వెల్లడింపబడి, ఆయన సార్వభౌమత్వం నిరూపింప బడినది. సంతోషాన్ని విరజిమ్మే వదనాలతో మీరు ఆయన వద్దకు వేగిరపడండి. ఇది మార్పు చెందని దివ్యధర్మం. భూత భవిష్యత్తులలో నిత్యమైనది. అన్వేషించువాడు దానిని పొందుగాక ! తదన్వేషణకు తిరస్కరించినవాని యెడ - నిశ్చయంగా, దేవుడు స్వయంసమర్ధుడు, ఆయన సమస్త ప్రాణుల అవసరాలకు అతీతుడు.
మీరు ఈ సత్యాన్ని నమ్మి, గుర్తించిన వారైతే ఇలా ప్రవచించండి: ఇది దైవహస్తము చేపట్టిన దోష రహితమైన త్రాసు; ఇందు సమస్త భూ, స్వర్గాల వాసులు తూచబడినారు. తర్వాత, వారి అదృష్టం నిర్ణయించ బడింది. ఇలా ప్రవచించండి: దీని ద్వారా పేదవారు శ్రీమంతులు గావింపబడినారు, విద్యావంతులు జ్ఞానసంపన్నులు చేయబడినారు; అన్వేషకులు ఆయన ప్రత్యక్షతను అధి రోహించడానికి సమర్ధులు గావింపబడినారు. జాగ్రత్త, దీనిని మీలో మీరు వైరుధ్యానికి హేతువుగా చేసుకునేరు. శక్తివంతుడూ, కరుణామూర్తీ అయిన మీ దేవుని ధర్మంలో మీరు సుస్థిరపర్వతం వలె దృఢంగా ఉండండి.
నీవు సంపదలో ఔదార్యాన్ని వహించు, ప్రాతికూల్యతకు వందనం సమర్పించు. నీ సన్నిహితుని విశ్వాసానికి పాత్రుడవయ్యే యోగ్యత నొందు. అతడిని తేజోవంతము, మైత్రియుతము అయిన ముఖముతో పరికించు. దరిద్రుల పాలిటి సంపదవై వ్యవహరించు. ధనవంతులకు ఉపదేశకుడవు, ఆవశ్యకతకలవారి కేకకు సమాధానపరుడవు, నీ ప్రతిజ్ఞాపవిత్రతను సంరక్షించు కొనేవాడవు కమ్ము. న్యాయనిర్ణయంలో సముచితుడవై వర్తించు. సంభాషణలో భద్రతను వహించు. ఏ మానవుడియెడా అధర్మపరత్వంతో వ్యవహరించ వద్దు. మానవులందరి పట్లనూ సమస్త వినయాన్నీ సక్రమంగా ప్రదర్శించు. అంధకారములో పయనించే వారికి దీపికవై వర్తించు. దుఃఖితునికి సంతోషం, దాహార్తునికి సాగరం, క్లేశపరునికి ఆశ్రయం కమ్ము; పీడితునికి రక్షకత్వం వహించు. సమైక్యత, ధార్మికత్వము నీ సమస్తచర్యలకు ఘనత కలిగించు గాక ! పరకీయునికి గేహానివి, వేదనా పరునికి ఉపశమనోషధివి, కాందిశీకునికి శక్తి గోపురానివి కమ్ము. అంధులకు నేత్రదృష్టివి, దోషాచరణుల పాదాలకు నడిపించే కాంతివి కమ్ము. సత్యముఖానికి అలంకారానివి, నిష్కాపట్యభ్రుకుటికి కిరీటానివి, ధార్మికత్వదేవాలయానికి స్తంభానివి, మానవజాతి దేహానికి జీవితశ్వాసవి, న్యాయాతిథేయులకు సంకేతానివి, ధర్మాచరణ క్షితిజరేఖ మీద జ్యోతివి, మానవ హృదయ స్థలానికి నీహారానివి, జ్ఞానసాగరం మీది మహానౌకవి, ఔదార్యస్వర్గంలో సూర్యునివి, వివేక కిరీటంమీద మణివి, నీ సమతరంవారి నభోమండలంలో శోభించే కాంతివి, వినయ తరువుపై పండిన ఫలానివి కమ్ము.
ప్రాచీన సౌందర్యుడు, మానవజాతిని బానిసత్వం నుంచి విడుదల చేయడం కోసం శృంఖలాలతో బంధింపబడుటకు అంగీకరించాడు; సర్వప్రపంచము నిజమైన స్వాతంత్య్రాన్ని పొందడం కోసం, ఈ అత్యంత దృఢదుర్గంలో కారాగారనివాసి గావింపబడేందుకు ఒప్పుకున్నాడు. భూమిమీద ప్రజలందరూ ఎదురు చూసే సౌఖ్యాన్ని పొందడానికీ, వారు సంతోష పరిపూర్ణితులు కావడానికీ ఆయన ప్రపంచ కాలుష్యాల దుఃఖచషకాన్ని పానం చేశాడు. ఇది దయాన్వితుడు, మహానుగ్రహుడు అయిన మీ ప్రభుని కారుణ్యము. ఓ ఏకేశ్వరత్వంలో విశ్వాసంకల వారలారా మీరు సమున్నతులు గావింపబడటానికి మేము అవమానాన్నీ, మీరు సఫలతను పొంది వర్ధిల్లడానికి మేము బహుముఖీన వ్యధలవల్ల బాధలనూ అనుభవించాము. దైవ సమానులమని చెప్పుకొనినవారు, సర్వప్రపంచాన్నీ అతి నూతనంగా నిర్మింప వచ్చిన ఆయనను, అతి నిర్జన నగరాలలో నివాసం చేయించడంకోసం ఎలా బలవంత పెట్టారో పరికించండి!
[యునైటెడ్ స్టేట్స్ కు చెందిన పన్నెండు మధ్య రాష్ట్రాలు: మిషిగెన్, విస్కాన్సన్, ఇలినోయీ, ఇండియాన, ఒహాయో, మినెసోట, అయ్వా, మిజోరీ, నార్త్ డకోట, సౌత్ డకోట, నెబ్రాస్క, కాన్సస్ ల నివాసులైన బహాయిల నుద్దేశించి 1916 సం. మార్చి 29న బహజీ సౌధానికి వెలుపల దీనిని వెలువరించడం జరిగింది.]
ఓ దివ్యాత్మలూ, ఓ ఆధ్యాత్మిక సభలూ, ఓ సర్వోత్కృష్ట సమావేశములూ :
గతంలో కొంతకాలం పాటు ఉత్తరప్రత్యుత్తరముల కాలస్యమైనది, అందుకు కారణం ఉత్తరముల రాకపోకలకు గల ఇబ్బంది. అయితే, ఇప్పుడనేక సౌకర్యము లందుబాటులో ఉన్నందువల్ల, ఈ సంక్షిప్త లేఖారచనలో నిమగ్నుడ నయ్యాను. అలా, మిత్రస్మరణతో నా మనస్సూ, ఆత్మా సంతోష, సౌరభాల నాస్వాదిస్తున్నాయి. పరమపూజ్యుడైన దివ్యమూర్తి ద్వారసీమ చెంతన, ఈ సంచారి - అనవరతమూ ప్రార్థిస్తూ, విశ్వాసుల పక్షాన సాహాయ్యోపకృతులనూ దైవానుగ్రహములనూ అర్ధిస్తూ ఉంటాడు. మీరు నా ఆలోచనలలో సదా మెదులుతూనే ఉంటారు, ఇప్పుడూ, ఎప్పుడూ మఱపునకు రారు. పరమపూజ్యుడైన సర్వశక్తిశాలి అనుగ్రహముతో, అనునిత్యమూ మీరు మీ విశ్వాసమున కాశ్వాసననూ, ధైర్యస్థైర్యములనూ ఆలంబన గావించుకుని దివ్యపరిమళ పరివ్యాపనా సాధనములు కాగలరని ఆశిస్తున్నాను.
భగవంతునకు ప్రస్తుతి–ఇలినోయీ, విస్కాన్సన్, ఒహాయో, మిషిగెన్, మినెసోట రాష్ట్రాలలో పరిపూర్ణ ధైర్యస్థ్తైర్యములతో పరస్పరము కలిసిమెలిసి వ్యవహరిస్తున్న విశ్వాసులున్నారు–భగవత్పరిమళముల పరివ్యాపనము తప్ప రేయైనను పవలైనను వేరొక లక్ష్యము వారికి లేదు, దివ్యబోధనల విస్తరణము తప్ప వారికి ఇంకొక ఆశయం లేదు. భగవంతుని ప్రేమదీప్తితో వారు మైనపువత్తులవలె జ్వలిస్తున్నారు, భగవత్ జ్ఞానమనే గులాబీవనాన, కృతజ్ఞతా న్విత విహంగములవలె చైతన్యస్ఫోరక, హర్షప్రపూరిత గీతికల నాలపిస్తున్నారు. అయినప్పటికీ – ఇండియానా, అయ్వా, మిజోరీ, నార్త్ డకోట, సౌత్ డకోట, నెబ్రాస్క, కాన్సస్ రాష్ట్రాలలో ఉన్న విశ్వాసులు కొందరే. ఈ రాష్జ్రాలలో భగవత్సామ్రాజ్యాహ్వాన ప్రకటననూ, మానవప్రపంచపు టేకత్వ సముద్ఘోషణనూ సక్రమవిధానంలో, సోత్సాహపూర్వక ముగా చేయుట యనునది ఇంతవరకూ జరిగి ఉండలేదు. ధన్యజీవులూ, త్యాగధనులూ అయిన బోధకులు సైత మీప్రాంతములలో పదేపదే పర్యటించనూ లేదు; అందువలన, ఇంకనూ అలక్ష్యాన్విత స్థితియందే ఉన్నవి - ఈ రాష్ట్రములు. భగవన్మిత్రుల కృషితో ఈ రాష్ట్రవాసులు సైతం, అదే తీరున ఆయన ప్రేమాగ్నితో ప్రజ్జ్వలితులూ, ఆయన దివ్యసామ్రాజ్యమునకు సమాకర్షితులూ కావలె, తద్వారా, ఆ ప్రాంతము సైతం జ్యోతిర్మయమై, దివ్యసామ్రాజ్య గులాబీ వనపు మనోజ్ఞమృదుపవనము స్థానికుల నాసికారంధ్రములను పరిమళభరితము గావిస్తుంది. అందువల్ల, సాధ్యమైతే - భగవంతునితో తప్ప అన్యమంతటినుండీ బంధములను త్రెంచుకుని ప్రక్షాళితులూ, పావనులూ అయిన బోధకులను ఆ ప్రాంతములకు పంపగలరు. ఈ బోధకుల ఆకర్షణ మత్యుత్తమ స్ధాయిలో ఉన్నట్లైతే, అమోఘ ఫలితములు రాగలవు. సామ్రాజ్యనందినీ, నందనులు నిజమైన కర్షకుల వంటివారు. ఏ రాష్ట్రమునకు వారేగినా, ఏ దేశమున కేగినా ఆత్మత్యాగమును ప్రదర్శిస్తూ, దివ్యబీజములను విత్తెదరు. ఆ బీజమునుండి పంటల దిగుబడి లభిస్తుంది. మహనీయ సువార్తయం దీయంశమును గురించి: “చక్కని క్షేత్రాన స్వచ్ఛబీజములు వేయబడి నప్పుడు దైవానుగ్రహమూ, దీవెనా దొరకు,”1 నని ప్రస్తావితమైనది. మీరు తోడ్పాటు నందుకొని, అనుగ్రహీతులై, దైవబోధనల విస్తరణలో ధైర్యము నెన్నడూ వీడరని భావిస్తున్నాను. అనునిత్యమూ మీరు మీ యత్నమునకు శ్రమనూ, ఉదాత్త మనస్తత్వమునూ చేకూర్చుకోగలరు గాక.
మీకు ప్రశంసాభినందనలు!
[యునైటెడ్ స్టేట్స్ లోని పన్నెండు మధ్య రాష్ట్రాలు: మిషిగెన్, విస్కాన్సన్, ఇలినోయీ, ఇండియాన, ఒహాయో, మినెసోట, అయ్వా, మిజోరీ, నార్త్ డకోట, సౌత్ డకోట, నెబ్రాస్క, కాన్సస్ ల నివాసులైన బహాయిల నుద్దేశించి, 1917 సం. ఫిబ్రవరి 8న అక్కాలో అబ్బుద్ గృహంలోని బహాఉల్లా గదిలో దీనిని వెలువరించచడం జరిగింది.]
ఆయన భగవంతుడు!
ఓ వృద్ధవిశ్వాసులారా, సన్నిహిత మిత్రులారా!
మహనీయ ఖురాన్‌లో భగవంతుడు ఇలా వచిస్తున్నాడు: “తా దలచిన వారి పట్ల తన కారుణ్యప్రదర్శనమున ప్రవీణు డాయన.”1
యునైటెడ్ స్టేట్స్ లోని ఈ పన్నెండు మధ్యరాష్ట్రాలూ అమెరికాకు హృదయము వంటివి; మానవుని సర్వావయవములకూ హృదయము అనుసంధానితమై ఉంటుంది. హృదయము బలపడితే సమస్త శరీరభాగములూ శక్తిసమన్వితములై, సత్త్వమును సంతరించుకుంటాయి, హృదయము బలహీనమైతే సమస్త శరీరాంగములూ దౌర్బల్యమునకు లోనౌతాయి.
షికాగో, దాని పరిసరములూ, భగవత్సౌరభముల పరివ్యాపన మారంభమైనప్పటినుండీ ఇంతవరకూ దృఢమనస్క యగుచూ వచ్చినందున, భగవంతునికి ప్రస్తుతి. భగవత్కృపతోనూ, విధాతానుగ్రహముతోనూ ఇది కొన్ని మహత్తరాంశములలో నిరూపితమైనది. .
మొదటిది: దివ్యసామ్రాజ్యాహ్వానము ప్రప్రథమముగా షికాగోనుండి వెలువడి నది. వాస్తవమునకు మహత్త రానుగ్రహమిది, ఏలననగా, భావిశతాబ్ద కాలములలో షికాగో ప్రతిష్ఠ కిది పరిభ్రమణ కేంద్రము వంటిది కాగలదు.
రెండవది: ఆ ధన్యభూమియందున మహాధైర్యశాలులూ, స్థైర్యవంతులూ అయిన వారెందరో భగవద్వచన ప్రచారార్థమై అవతరించి, ప్రతి భావననుండియూ ప్రక్షాళిత, పునీత మనస్కులై, దైవబోధనల పరివ్యాపనమున నిమగ్నులైనారు. కనుకనే, అవిచ్ఛిన్నముగా సర్వోత్కృష్ట దివ్యగణమునుండి ప్రశంసాధ్వానము వెలువడినది.
మూడవది: అమెరికా పర్యటనాక్రమములో అబ్దుల్-బహా పలుమారులు షికాగో మీదుగా వెళ్లడమూ, భగవన్మిత్రులతో సహవర్తి కావడమూ సంభవించినవి. ఆయన - కొంతకాలముపా టానగరమున వసించినాడు; సత్యస్వరూపుని సంకీర్తనమున రేయింబవళ్లు నిమగ్నుడై, ప్రజలను భగవత్సామ్రాజ్యమున కామంత్రించినాడు.
నాలుగవది: ప్రస్తుత సమయము వరకు, షికాగోయం దారంభింపబడిన ప్రతి ఉద్యమమూ, తత్ప్రభావమూ - హృదయములోనూ, హృదయమునుండీ ద్యోతకమౌతూ, అభివ్యక్తమౌతూ శరీరాంగములనూ, అవయవములనూ సమస్తమునూ ప్రభావిత మొనరిస్తూ ఉండే ప్రతిదాని వలెనే - సకల ప్రాంతములకూ, దిశలకూ విస్తరించినవి.
ఐదవది: అమెరికాలో తొలి మష్రికుల్-అఝ్కార్ షికాగోలో సంస్థాపితమైనది, అమూల్యము లాగౌరవప్రతిష్ఠలు. ఈ మష్రికుల్-అఝ్కార్ నుండి, నిస్సందేహముగా, వేలకొలదీ మష్రికుల్-అఝ్కార్ ల ఆవిర్భావము జరుగుతుంది.
ఆ విధముగనే, షికాగోలో - సార్వత్రిక వార్షిక సదస్సులూ, ది స్టార్ ఆఫ్ ది వెస్ట్ సంస్థాపనా, దివ్యఫలకముల ప్రచురణా, అమెరికాలోని అన్ని ప్రాంతములలోనూ వాటి వితరణలకై పబ్లిషింగ్ సొసైటీ ఏర్పాటూ జరిగినవి, భగవంతుని దివ్యసామ్రాజ్య స్వర్ణ శతాబ్ది వార్షికోత్సవ నిర్వహణకు ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నవి. ఈ దివ్యోత్సవమూ, ఈ దివ్యప్రదర్శనమూ అత్యంత నిర్దుష్టతతో జరుపుకొనబడునని, తద్వారా, “ఏకేశ్వరుడు దక్క వేరుదైవము లేడు, ఆది నుండి ప్రవక్తృత్వ ముద్రయైన మహమ్మదు వరకూ పంపబడిన సమస్త దివ్యవార్తావహులూ సత్యస్వరూపి యానతిన యేతెంచినా,” రను ప్రపంచ సమైక్యతాహ్వానము వెలువడవచ్చునని; మనుష్యప్రపంచపు టేకత్వపతాక మావిష్కృతమై, విశ్వశాంతి మధురగీతిక ప్రాక్పశ్చిమముల వీనులను జేరి, మార్గములన్నియూ నిర్నిరోధితములై, అవక్రములై, హృదయములన్నియూ భగవత్సామ్రాజ్య సమాకర్షితములై, అమెరికా శిఖరాగ్రమున సమైక్యతాపటవేశ్మము సంస్థాపితమై, సమస్త దేశములనూ, ప్రజలనూ భగవంతుని ప్రేమగీతిక హర్షోల్లసితులను సేయగా, ధరణీతలము అమరధామమై, కాలమేఘములు పారద్రోలబడి, సత్యసూర్యుడు సంపూర్ణ తీక్ష్ణతతో భాసిల్లవచ్చునని ఆశిస్తున్నాను.
ఓ భగవన్మిత్రులారా! మనఃపూర్వకముగ యత్నింపుడు, తద్వారా, హృదయముల మధ్యన సహవర్తన, వాత్సల్యము, సమైక్యత, ఏకీభావములు సాధింపబడ వచ్చును, లక్ష్యములన్నియూ ఒకే లక్ష్యము కావచ్చును, గీతిక లన్నియూ ఒకే గీతిక కావచ్చును, సమస్త ప్రాకృతిక ప్రపంచశక్తులనూ అధిగమించు నంతటి మహత్తర విజయమును పవిత్రాత్మశక్తి సాధింపవచ్చును. పరిశ్రమింపుడు; మీ లక్ష్యము అనిర్వచనీయ వైభవప్రపూరితము. విజయము మీ కృషికి మకుటమైనచో, అమెరికా - ఆధ్యాత్మిక శక్తితరంగముల ప్రాదుర్భావకేంద్రముగా తప్పక పరిణామము చెందును. తన అనంత యశోవైభవములతో భగవంతుని దివ్యసామ్రాజ్యసింహాసనము సుదృఢముగ ప్రతిష్ఠిత మగును.
ఈ అసాధారణ ప్రపంచము మార్పునకు లోనుకాని స్థితియందున స్వల్పకాలమైననూ ఉండదు. క్షణక్షణము నకూ మార్పుచెందుతూ, పరివర్తితమగుచునే యుండు నిది. అంత్యమునకు ప్రతి పునాదీ కదలి, ప్రతి శోభావైభవమూ కనుమరుగై, అదృశ్యత నొందును; అయితే భగవత్సామ్రాజ్యము నిత్యము; స్వర్లోక సార్వభౌమత్వ ప్రాభవములు సుస్థిరములు, శాశ్వతములు. కనుక, ఒక జ్ఞాని దృష్టిలో: ప్రపంచ ప్రభుత్వ సింహాసనమున కన్ననూ భగవత్పామ్రాజ్యమున యున్న చాపకే ప్రాథమ్యత.
భగవత్ప్రేమ ప్రభాతస్థలులూ, పవిత్రీకరణ, పావనత్వముల క్షితిజతారలూ, ఇంకా ఈ అంధకారమయ విశ్వమును తేజోమయ మొనరించి, ఈ జీవరహిత ప్రపంచమునకు ప్రాణదాతలూ అయిన కొందరు ధన్యజీవుల మధురగానము - బహుశః నాకు వినవచ్చునేమోయని నా కన్నూ, చెవీ మధ్య రాష్ట్రముల వైపునకే నిరంతరమూ సారింపబడి ఉంటాయి. అబ్దుల్-బహా ఆనందము దీనిపైననే ఆధారితమైనది! ఇందున మీ రనుగ్రహీతులు కాగల రని ఆశింతును.
కనుక, పరిపూర్ణ బంధవిముక్త స్థితినంది, ప్రాకృతిక ప్రాపంచిక లోపప్రక్షాళితులై, ఈ ఐహికవ్యామోహ పునీతులై, అమరజీవనశ్వాసతో సజీవులై, జ్యోతిర్మయ హృదయులై, దైవస్ఫూర్తిప్రపూరితులై, చైతన్యాకర్షణాన్వితులై, అలౌకిక వితరణశీలులై, వచోధారాన్వితజిహ్వులై, విస్పష్టవివరణాయుతులైన వారు సత్వరమే తరలి వెడలి, మధ్య రాష్ట్రీయ ప్రాంతములయం దంతటా పర్యటింపవలె. నగరనగరమునా, గ్రామ గ్రామమునా దివ్యప్రబోధముల, సూచనల పరివ్యాపనమున మగ్నులై, ఆత్మలకు పథనిర్దేశము గావింపుచూ, ప్రపంచ మానవాళి యేకత్వమునకు ప్రచురతను జేకూర్పవలె. ప్రతి బధిరుడూ శ్రవణశక్తి నొందునంతటి, మలిగిన ప్రతియొక్కడూ ప్రజ్జ్వలితు డగునంతటి, మృతినొందిన ప్రతి యొక్కడూ నవచేతన నొందునంతటి, ప్రతి నిర్లిప్తుడూ మహదానందభరితు డగునంతటి శక్తితో అంతర్జాతీయ సాంత్వనాగీతికను వా రాలపింప వలె. అదియే పరాకాష్ట యనునది సునిశ్చయము.
భగవత్సౌరభ పరివ్యాపకులను ప్రతి ఉదయమునా ఈ ప్రార్ధనను చేయనిండు:
ఓ ప్రభూ, నా దేవా! నీవు నన్ను సామ్రాజ్యమహాపథమునకు మరలించి, నన్ను ఈ అవక్ర, ఋజుమార్గమున పయనింపచేసి, నీ తేజఃప్రభాస వీక్షణముతో నా కంటికి వెలుగునిచ్చి, మార్మికసామ్రాజ్య పావనవిహంగముల మధురగానముల వంకకు నన్ను చెవియొగ్గజేసి, ధార్మికులయందలి నీ ప్రేమతో నా హృదయము నాకర్షించి నందులకు నీకు ప్రస్తుతి, కృతజ్ఞతా సమర్పణములు.
ఓ ప్రభూ! దేశములయందున నీ దివ్యనామధేయము పేరిట పిలుపునిచ్చి, నీ దివ్యసామ్రాజ్యావతరణ శుభవార్త నందించునటుల పవిత్రాత్మతో న న్ననుగ్రహించు.
ఓ ప్రభూ! నేను బలహీనుడను, నీ శక్తిసత్త్వములతో నన్ను సశక్తీకరించు, నా జిహ్వ తొట్రువడుచున్నది, నన్ను నీ స్మరణాప్రస్తుతులను గావింపనిమ్ము, అధముడను, నీ సామ్రాజ్యములోనికి న న్ననుమతించి ఆదరించు, దూరస్తుడను నీ కారుణ్య ద్వారము దరి జేరనిమ్ము.
ఓ ప్రభూ! నన్నొక సముజ్జ్వలజ్యోతిని, శోభయమాన తారకను, ఈ ప్రాంతముల నన్నింటినీ తన శాఖలతో సమాచ్ఛాదించు ఫలయుత ధన్యవృక్షమును గావింపుము. నిక్కముగా, నీవు శక్తిశాలివి, అధికారపరిపూరితుడవు, నిర్నిరోధితుడవు.
[యునైటెడ్ స్టేట్స్, కెనడాల బహాయిల నుద్దేశించి, బహాఉల్లా దివ్యసమాధికి వెలుపల ఉన్న ఉద్యానవనంలో 1916 సం. ఏప్రిల్ 8న దీనిని వెలువరించడం జరిగింది.]
అయన భగవంతుడు
ఓ ధన్యజీవులారా:
మీకై శాశ్వత విజయ సౌభాగ్యముల నాశిస్తూ, మీలోని ప్రతి ఒక్కరికీ భగవత్ప్రపంచాన పరిపూర్ణానుగ్రహము నర్ధిస్తున్నాను. ప్రపంచ దిఙ్మండలాన ప్రతి ఒక్కరూ ప్రభాత నక్షత్రముగా ప్రకాశింపగలరని, శాశ్వతఫలములను, ఫలితములను సముత్పన్న మొనరింపుచూ, భగవంతుని ఈ దివ్యవనమునం దొక ధన్యవృక్షము కాగలరనునది – మీ గురించి నా ఆశయము.
కనుకనే, భగవంతుని దివ్యసామ్రాజ్యమున మీకు దైవానుగ్రహ, జ్ఞానములను సంప్రాప్తింపచేయగల దాని దెసకు మిమ్ములను నిర్దేశిస్తున్నాను.
విషయమిది: అలాస్కా సువిశాల దేశము; కరుణాన్వితుని సేవికలయం దొక్క రాప్రాంతములకు సత్వరమే తరలిపోయి, ప్రజాగ్రంథాలయాధికారిణిగా సేవల నందిస్తూనే, తన శక్తి మేరకు దివ్యధర్మమును బోధించడానికి వెనుదీయకున్ననూ, ఆ సువిశాల ప్రాంతవ్యాప్తముగా భగవంతుని దివ్యసామ్రాజ్యాహ్వానము నెలుగెత్తి చాటడ మింకనూ జరుగనే లేదు.
పరమపూజ్యుడైన క్రీస్తు: “మీరు ప్రపంచాన తూర్పునకును, పడమరకును పయనించి ప్రజలను దేవుని రాజ్యమునకు ఆహ్వానింపు,”1 డని చెబుతున్నాడు. కనుక, భగవత్కృప సమస్త మానవాళినీ ఆవరింపవలె. అందువల్ల, మార్గదర్శకత్వ ప్రత్యూష పవనముల కాప్రాంతమును దూరము గావించుట అనుమోదనీయమని మీరు భావింప వలదు. ఆ కారణమున, భగవంతుని దక్క అన్యమంతటినీ పరిత్యజించి, భగవత్పరిమళములకు సమాకర్షితులై, సకల వాంఛావ్యామోహప్రక్షాళితులూ, పవిత్రులూ, అనర్గళ వచోసంపన్నులూ అయిన వక్తల నాప్రాంతములకు పంపేందుకై మీ శాయశక్తులా కృషిని సలుపవలె. దైవబోధనలు వారికి ప్రాణాధారమూ, ఆహారమూ కావలె. ముందుగా వా రాసూత్రముల కనుగుణముగ జీవింపవలె, అటుపై ప్రజలకు మార్గదర్శన మొనరింపవలె. బహుశః, భగవదేచ్ఛతో, మహత్తర మార్గదర్శకత్వ జ్యోతులు ఆ దేశమును శోభాయమాన మొనరింపవచ్చును; భగవద్వాత్సల్య గులాబీ వన మలయమారుతములు అలాస్కావాసుల నాసికాపుటములను పరిమళభరిత మొనరించును. అటువంటి సేవ నందించేందుకు మీకు తోడ్పాటు లభించిన పక్షంలో, అమర సార్వభౌమత్వ మకుటములతో మీ శిరస్సులు అలంకృతము లౌతాయి, ఏకత్వ ద్వార సమీపాన మీరు అభిమానిత, అంగీకృత సేవకులు కాగలరను ఆభయ ప్రదానము మీ కొసగ బడుచున్నది.
ఆ విధముగనే, మెక్సికో రిపబ్లిక్కు సైత మత్యంత ప్రధానమైనదే. ఆ దేశ వాసులయందలి అధికసంఖ్యాకులు నిబద్ధతయుత క్యాథలిక్కులు. బైబిల్, సువార్త, నవ్య దివ్యబోధనలు - వీటి యథార్థత పట్ల వారల కేమాత్రమూ అవగాహన లేదు. వారు భగవన్మతములకు ప్రాతిపదిక ఒక్కటేనని, పవిత్రావతారములు వివిధ ప్రదేశములలో ప్రభవించు సత్యసూర్యుని వంటివారని ఎఱుగరు. వారు ఆ భావజాల సముద్రమున మునిగియున్నారు. జీవశ్వాస ఒక్కటి వారి మీదికి వీచిన పక్షమున, మహత్తర ఫలితము లటుపై వెలువడుతవి. అయితే, బోధించు నిమిత్తమై మెక్సికోకు వెళ్లగోరు వారు, స్పానిష్ భాషతో పరిచయము నేర్పరచుకొనుట సముచితము.
అదే విధముగా, మెక్సికోకు దక్షిణాన ఉన్న ఆరు సెంట్రల్ అమెరికన్ రిపబ్లిక్కులు: గ్వాటెమాలా, హాండూరస్, సాల్వడార్, నికారాగ్వా, కోస్ట రీకా, పనామా ఇంకా ఏడవ దేశమైన బెలిజా లేక బ్రిటిష్ హాండూరస్. వీటికి తరలువారు సైతము స్పానిష్ భాషతో పరిచయము నేర్పరచుకొనవలె.
అమెరికా ఆదిమవాసుల జనాభాకు అధిక ప్రాధాన్యత నివ్వగలరు. ఎందులకనగా, వీరు - మహమ్మదు ప్రవక్త దివ్యలక్ష్యసాధనకు పూర్వ మనాగరికులవలె ఉండిన ఆదిమ అరేబియన్ ద్వీపకల్ప నివాసులవంటి వారు. అయితే, మహమ్మదు జ్ఞానప్రభ తమ మధ్యకు ప్రసరించుటతో, ప్రపంచమునకు శోభ నివ్వగల సముజ్జ్వలతను వారు – సంతరించుకొనినారు. ఈ ఇండియనుల నాతీరుననే విద్యావంతులను చేసి, దిశా నిర్దేశము గావించినచో, వారు ప్రపంచమును సముజ్జ్వలసమన్విత మొనరింపగల చైతన్యమును సంతరించుకొందు రనుటకు సందియము లేదు.
పై దేశములన్నింటికీ ప్రాధాన్యత ఉన్నప్పటికీ, ప్రత్యేకించి, పనామా కాలువతో అట్లాంటిక్, పసిఫిక్ మహా సముద్రములు ఒకదానితో నొకటి మమేకమైన పనామా రిపబ్లిక్కుది విశేష ప్రాముఖ్యత. అమెరికా నుండి ప్రపంచము నందలి అన్యఖండములకు పయనించడానికి - అది కేంద్రమూ, మార్గమూ కూడా. భవిష్యత్తునం దది విశేష ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది.
అలాగే క్యూబా, హెయ్తీ, పోర్టో రికో, జమైకా వంటి వెస్ట్ ఇండీస్ దీవులూ, లెస్సర్ ఆంటిలీస్ దీవులూ, బహామా దీవులూ, ఇంకా చిన్నదైన వాట్లింగ్ దీవి కూడా విశేష ప్రాధాన్యత కలవే; ప్రత్యేకించి గ్రేటర్ ఆంటిలీస్ సముదాయం లోని రెండు బ్లాక్ రిపబ్లిక్కులైన హెయ్తీ, సాంటో డొమీంగోలు. అలాగే, అట్లాంటిక్ మహాసముద్రంలోని బెర్ముడా దీవుల సముదాయానికీ ప్రాధాన్యత ఉన్నది.
ఆ విధంగానే - కొలంబియా, ఈక్వడోర్, పెరూ, బ్రెజిల్, బ్రిటిష్ గియానా, డచ్ గియానా, ఫ్రెంచ్ గియానా, బొలివియా, చిలీ, అర్జెంటినా, ఉరుగ్వయ్, పరగ్వయ్, వెనిజులా వంటి దక్షిణ అమెరికా ఖండ రిపబ్లిక్కులు; దక్షిణ అమెరికాకు ఉత్తర, తూర్పు, పశ్చిమ దిశలలోని ఫౌక్లాండ్ దీవులూ, గలపగోస్, హ్వన్ ఫెర్నాండెజ్, టొబాగో, ట్రినిడాడ్ దీవులూ. అలాగే, బ్రెజిల్ తూర్పు తీరనగరం - బహియా. కొంతకాలంగా, అందరూ దానిని ఆ పేరుతోనే ఎఱుగుదురు కనుక, తత్ప్రభావము దృఢతరమగును.
సంక్షిప్తముగా, ఓ భగవద్విశ్వాసులారా! మీ కృషిని విస్తరించి, మీ లక్ష్యములను సువిస్తృత మొనరించండి. పరమపూజ్యుడైన క్రీస్తు: “దీనులైనవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది,”2 అని చెప్పి ఉన్నాడు. వేరొక తీరున చెప్పవలెననిన, అనామకులూ, అవిఖ్యాతులూ అయిన దీనులు ధన్యులు, ఎందుకనగా మానవజాతి నేతలు వారు. ఆ విధముగనే, ఖురాన్‌లో కూడా: “మానవలోకాన హీనస్థితికి తేబడినవారి పట్ల అనుగ్రహమును జూపి, వారిని మానవులయం దాధ్యాత్మికనేతలను జేసి, మా వారసు లుగ చేయనెంతుము,” 3 లేక, దుర్బలుల ననుగ్రహించి వారిని దివ్యదూతల, దైవ ప్రవక్తల వారసులగునటుల చేయదలచితిమని చెప్పడమైనది.
నశియించిపోవు ఈ ప్రాపంచిక వ్యామోహపు టుడుపును వీడుటకూ, భౌతిక ప్రపంచవిముక్తులై, స్వర్లోకదూతలై ఈ దేశములకు తరలుటకూ మీకిదే తరుణము. మీ యందలి ప్రతి ఒక్కరూ దివ్యజీవన ఇస్రాఫిల్ 4 అయి, అన్యుల ఆత్మలకు జీవన శ్వాస నిత్తురని, తాను దక్క అన్యదైవములేని ఆయనపై ప్రమాణము చేస్తున్నాను.
మీకు ప్రశంసాభినందనలు.
ప్రార్థన
అతుల్యుడవైన ఓ దేవా! ఓ దివ్యసామ్రాజ్యాధీశా! వీరు నీ స్వర్లోకసేన. వీరికిని, మహోత్కృష్ట దివ్యగణసేనలకును సాహాయ్యమొనరించి, వారిని విజేతలను గావించు; తద్వారా, వారిలోని ప్రతి యొక్కరును సేనాదళమువలె రూపుదిద్దుకుని భగవద్వాత్సల్యముతో, దివ్యబోధనల తేజముతో యీ దేశములను జయింతురు.
ఓ దేవా! వారి సాహాయ్యుడవు, వారి హితుడవు కమ్ము; వారు- దివ్యసామ్రాజ్యశక్తితో, పవిత్రాత్మ నిశ్వాసమూలమున నిర్జన, పర్వత, లోయ, అరణ్య, మైదాన, సముద్ర స్థలముల యందునను ఎలుగెత్తి చాటునటుల, వారి అంతరంగికుడవు కమ్ము.
నీవు నిక్కముగా అధికారయుతుడవు, మహాబలుడవు, సర్వశక్తిశాలివి; విజ్ఞు డవు, శ్రోతవు, సంవీక్షకుడవు.