Return   Facebook   Zip File

బహాఉల్లా దివ్యలేఖన సంహిత

Gleanings from the Writings of Bahá’u’lláh

(in Telugu)

. ఓ ప్రభూ, నా దేవా! నీవు శ్లాఘనీయుడవు, సంస్తవనీయుడవు; నీ నామధేయము నెంతటి యపార విజ్ఞతాన్విత జిహ్వయైనను సముచితముగ సంకీర్తింపజాలదని, ఎంతటి ప్రగాఢాపేక్షాన్విత మానవహృదయ విహంగమైనను నీ మహనీయతా జ్ఞానముల స్వర్గము నధిరోహింపగలనని ఎన్నటికినీ, ఆశింపజాలదని యెఱిగియుండియు, నిన్నేమని స్తుతియింపను!

ఓ నా దేవా, సర్వజ్ఞుడైన ఆయనయే నీ వని యభివర్ణించితినేని, మహోన్నతజ్ఞానస్వరూపులగు దివ్యులు నీ యాజ్ఞానుసారము సృజియింపబడిరని నే నంగీకరింపక తప్పదు. అటులే, సకలవివేకియైన ఆయనయే నీ వని నిన్ను సంకీర్తించితినేని, నీ యిచ్ఛానిర్వహణమున తమను సృజియించుకొనిన వివేకోల్బణములను సైతము నేను గుఱుతింపక తప్పదు. ఇక, నీ వతులితుడవని చాటితినేని, ఏకత్వపు టంతర్లీనసారమైన దివ్యులు నీద్వారా భువికంపబడినారనియు, వారు నీ హస్తకళాచాతుర్య ప్రతీకలే ననియు శీఘ్రమే గ్రహియింతును. మరి, నీవు సకలాంశముల నెఱిగినవాడవని యభినందించితినేని, నీ విజ్ఞానసారమైన దివ్యులు కేవలము నీ సృష్టియును, నీ దివ్యలక్ష్యసాధనములును దక్క అన్యులు కాదనియు తప్పక నే నంగీకరింపవలె.

నీ మర్మమును వెల్లడించుటకేని, నీ యశస్సును కీర్తించుటకేని, నీ దివ్యతత్త్వస్వభావమును సూచించుటకేని గావింపబడు నశ్వరమానవ యత్నముల కతీతుడవైన నీవు - ఉత్కృష్టుడవు; అప్రమేయోత్కృష్టుడవు. ఏలయన, అట్టి యత్నములు - అవి సాధించునదేదైనను - నీ సృజితప్రాణులకు విధియింపబడిన పరిమితుల నధిగమింపగలమని యెన్నటికినీ ఆశింపజాలవు; ఏలయన, ఈ యత్నములు నీ యాజ్ఞాప్రేరితములు, నీ కల్పనాసంజనితములు. సుజన పుంగవులు నీ సంకీర్తనమున వ్యక్తము సేయగల మహత్తర భావములును, విద్వద్వరేణ్యులు నీ తత్త్వమును గ్రహియించు యత్నమున వ్యక్తీకరింపగల ప్రగాఢవిజ్ఞతయును - సకలమును, సంపూర్ణముగ నీ సార్వభౌమత్వాధీనములై, నీ సౌందర్యము నారాధించు దివ్యకేంద్రము చుట్టును పరిభ్రమింపుచు, నీ దివ్యలేఖినీ చాలన మూలమున సంప్రేరితము లగుచున్నవి.

అంతియేగాక, ఓ నా దేవా, నీ దివ్యావిష్కరణాలేఖినికిని, సమస్త సృజితాంశముల సత్త్వమునకును మధ్యన యే ప్రత్యక్షసంబంధపు టునికినైనను సూచించు వాక్కుల నవసరార్ధముగ నుచ్చరింతునేమో, దానిని నిషేధింపుము. అట్టి సంబంధభావనకు నీ సంబంధీకులగు దివ్యులు దూరులు, బహుదూరులు! సమస్త సామ్యములునూ, సాదృశములునూ నీ దివ్యావిష్కరణా మహీజమునకు న్యాయమును చేయజాలవు; అంతియేగాక, స్వకీయ ప్రత్యక్షీకరణకు, నీ దివ్య సౌందర్యప్రభాత పరిజ్ఞానార్జనామార్గము ప్రతిదియూ నిరోధితమైనది.

నశ్వరమానవుడు నీ గురించి నిర్ధారింపగల దానికిని, నీ కాపాదింపగల దానికిని, నీ కొనరింపగల ప్రస్తుతికిని - నీ వైభవము అప్రమేయాతీతము. నీ మహనీయతను, యశస్సును సంపూర్ణముగ సంకీర్తింపుడని నీ సేవకులకు నీపు నిర్దేశించిన కర్తవ్యము - వారికి నీ యనుగ్రహప్రతీక దక్క వేరొండు కాదు; తన్మూలమున వారు స్వీయాంతరికాస్తిత్వమున కనుగ్రహీతమైన స్వకీయ జ్ఞానస్థాయి నధిరోహింపగలుగవచ్చును.

నీవు దక్క ఏ యొక్కరును, ఏ కాలముననైనను, నీ మర్మము నెఱుగుటయో, సముచితముగ నీ యౌన్నత్యమును సంకీర్తించుటయో చేయలేక పోయినారు. మానవప్రస్తుతికిని, అన్వేషణకును సర్వదా నీ వతీతుడవు, సమున్నతుడవు. దుర్లభుడవు, సర్వశక్తిమంతుడపు, సర్వజ్ఞుడపు, పరమపవిత్రుడవును నగు నీవు దక్క అన్యదైవము లేడు.

II

సకలాంశముల కాద్యము దైవజ్ఞానమే; ఇక, స్వర్లోకస్థితసర్వమునూ, భూవలయస్థిత సమస్తమునూ ఆవరించిన దివ్యేచ్ఛాతేజోమండలము నుండి భువి కనుగ్రహీతమైన దానిని సుదృఢముగ ననుసరించుటయే సమస్తాంశముల కంత్యము.

III

ఆది నుండియూ సమస్త దైవప్రవక్తల వాగ్దానముగా, లక్ష్యముగా శ్లాఘితమును, ఆయన దివ్యవార్తావహుల అత్యంతప్రియాభీష్టమును నగు దివ్యావిష్కరణ మిపుడు సర్వశక్తిమంతుని సకలవ్యాపిత దివ్యేచ్ఛానువర్తినియై, ఆయన యప్రతిహతాదేశానుసారముగ మానవుల కావిష్కృతమైనది. సమస్త పవిత్ర గ్రంథముల యందునను, అట్టి దివ్యావిష్కరణాగమన ముద్ఘోషితమైనది. అట్టి ప్రకటనమునకు కట్టువడక, తన పథమును వీడి, మానవజాతి తనకు తానుగ తద్వైభవమున కెట్లు దూరస్థత నొందినదో విలోకింపుము.

వచించు: ఓ నిజైకదైవ ప్రియతములారా! నిశ్చయముగ మీ రాయనను గుఱుతించి, యెఱుగుటకును, ఆయన ధర్మసూత్రములను సముచితముగ పాటించుటకును కృషి సల్పుడు. ఈ దివ్యావిష్కరణ మెట్టిదనిన, యే మానవుడైనను దీని నిమిత్త మెుక్క రక్తబిందువును చిందించినను, దశసహస్ర మహాసాగరము లాతడికి ప్రతిఫలమగును. ఓ మిత్రులారా! ఇంతటి యమూల్యతర లబ్ధిని కోలుపోవక, దీని మహోత్కృష్టస్థాయి నలక్ష్యము సేయక జాగరూకులు కండు. కేవలము, జను లూహించిన వ్యర్ధోహల భ్రమచే వంచితయైన ప్రపంచమున బలియైన, బలియగుచున్న జనబాహుళ్యమును గురించి యోచింపుడు. భగవంతునకు ప్రణతుల నర్పింపుడు, ఏలయన మీరు మీ మనోవాంఛితుని చేరి, సకలజాతుల దివ్యవాగ్దానమైన ఆయనయం దైక్యత నొందినారు. మీరందిన స్థాయీ సమగ్రతను నిజైకదైవ సాహాయ్యమున సంరక్షించుకొనుడు—సమున్నత మాయన వైభవము; ఆయన దివ్యధర్మమునకు ప్రాచుర్యము నొసగు దానికి విధేయులు కండు. మనుష్యస్థాయి సముద్ధరణము నకు సముచితమైన, సానుకూలమైన దానిని, ఆయన నిశ్చయముగ మీ కనుగ్రహింపగలడు. ఈ మహాద్భుత దివ్యఫలకావిష్కర్తయైన సకల దయాన్వితుడు సంకీర్తితుడు.

IV

భగవంతుని మహామహోపకృతులు మానవులపై యభివర్షితమైనయట్టి, ఆయన మహాకృప సమస్త సృజితాంశములకును అనుగ్రహీతమైనయట్టి దివ్యయుగమిది. తమ విభేదములను పరిష్కరించు కొని, ఆయన సాదరమృదుకారుణ్య మహీజచ్ఛాయన పరిపూర్ణ శాంతిసమైక్యతలతో వసియించుట సమస్త ప్రపంచవాసులకును విధాయకము. ఈ యుగమున తమ స్థానౌన్నత్యమునకును, తమ పరమ ప్రయోజనాభివృద్ధికిని దోహదకారియగు దానికి విధేయులై యుండుట వారికి యుక్తము. సకల వైభవోపేతదివ్యలేఖిని స్మరియింప నెంచినవారు సంతోషాన్వితులు, మా నిగూఢ నిర్ణయానుసారముగ మేము గుప్తపరుపనెంచిన నామధేయులు ధన్యులు.

మా దృష్టియం దామోదనీయమగు దానిని నెరవేర్చుటకు సమస్త మానవులును కృపతో సహకరింపబడుట ననుగ్రహింపుమని నిజదైవము నర్ధింపుము. సత్వరమే యీనాటి సంవిధానము చుట్టివేయబడి, దాని స్థానమున నవీనమైనది విస్తారితమగును. నిశ్చయముగా, నీ ప్రభుడు సత్యమునే వచియింపుచున్నాడు; అగోచర విషయముల నెఱిగినవా డాయనయే.

V

భగవంతుని కరుణాంబుధి మానవులకు ప్రత్యక్షమైనదియును, ఆయన మృదుకారుణ్య భానుడు తన తేజమును వారిపై ప్రసరించినదియూ, ఆయన యనంతానుగ్రహ మేఘములు సమస్తమానవాళినీ సమాచ్ఛాదిత మెునరించినదియూ అయిన దివ్యయుగమిది. సౌహార్దానురాగముల శక్తిసమన్విత మలయ పవనములతోడను, మైత్రీవదాన్యతల జీవజలములతోడను పతితులను సేదదీర్చి పరవశులను గావింప వలసిన సమయమిది.

భగవత్ప్రియతము లెచట సమకూడినను, ఎవ్వరితో సమావేశమైనను, భగవంతునియెడ వారి ప్రవర్తనయందునను, ఆయన ప్రస్తుతీవైభవములను వారు శ్లాఘించు రీతియందునను - వారి పదధూళి యందలి ప్రతి యణువూ వారి భక్తిస్థాయి నభివ్యక్తము సేయగల - వినయవిధేయతలు ప్రదర్శితములు కావలె. ఈ పవిత్రమూర్తు లొనరించు సంభాషణమునకు, తత్ప్రభావమున, తదణువులు సైతము సముద్వేగపూరితము లగునంతటి శక్తి చేకూరవలె. తాము నడయాడిన భూమి, “నీకన్నను నాకే ప్రాధాన్యత లభియింపవలె. కర్షకుడు నాపై యుంచిన భారమును భరియించుటయందున నే నెంతటి యోరిమిని ప్రదర్శించి యుందునో పరికింపుము. సకలౌదార్యభాండారమైన భగవంతుడు నా కొప్పగించిన యనుగ్రహములను సర్వప్రాణులకును నిర్విరామముగ నందించు సాధనమును నేను. నా కనుగ్రహీతమైన గౌరవమును, సమస్త సృష్ట్యావసరములను సమృద్ధిగ దీర్పగల యైశ్వర్య నిదర్శనములును - అగణితముగ నా కున్నను, నా వినమ్రతా పరిమాణము నవలోకింపుము; మనుష్య పాదములక్రింద నలుగుట కెంతటి పూర్ణవినమ్రతతో నన్నర్పించుకొంటినో తిలకింపు. . .” మని తమ నెన్నడును సంబోధింపకుండునటుల వారు వర్తింపవలె.

ఒండొరు లోరిమిని, దయను, ప్రేమను ప్రదర్శించుకొనవలె. మీయందెవ్వడేని సత్యము నొక్కదానిని గ్రహియించుట కశక్తుడైనను, దానిని గ్రహియింప శ్రమనొందుచున్నను, ఆతడితో సంభాషించునపు డపార కారుణ్యమును, సుహృద్భావస్ఫూర్తిని ప్రదర్శింపుడు. ఆతడి కన్నను మీ రధికులనియో, మహత్తర శక్తులు మీ యధీనములై యున్నవనియో, స్వల్పాతిస్వల్పముగ నైనను యెంచక, సత్యము నవలోకించి, గుఱుతించుటయం దాతడికి సాహాయ్య మెునరింపుడు.

ఈ దివ్యయుగమున మానవుని కర్తవ్యమెల్లయు, తన నిమిత్తము భగవంతు డభివర్షించిన కారుణ్యఝరి యందున తన భాగము నొందుటయే. కావున, ఎవ్వరునూ తమ కందిన భాండవిస్తృతినో, తదల్పతనో గణియింపకుందురు గాక. కొందరికి దొరికిన భాగ మెుక మనుజుని కరతలమునం దిముడవచ్చును, మరికొందరికి లభియించిన భాగ మెుక చిరుపాత్రను పూరింపవచ్చును; ఇక మిగిలినవారి దొక బృహత్పాత్రపరిమాణము కలదియునై యుండవచ్చును.

ఈ దివ్యయుగమున, ప్రతి నేత్రమూ భగవంతుని దివ్యధర్మము నుత్తమముగ పరివ్యాప్త మెునరింప యత్నింపవలె. నిత్యసత్యమైన ఆయన, నాకు సాక్ష్యమును వహియించును! ఈ యుగమున భగవత్ప్రియతములయందలి విరోధము, కలహము, పోరాటము, విరక్తి, నిర్లిప్తతలు దక్క వేరేదియును, ఈ దివ్యధర్మమునకు తీవ్రతరహానిని కలిగింపజాలవు. భగవంతుని శక్తితో, ఆయన సమున్నత సాహాయ్యముతో వానిని పారద్రోలి, ఏకీకరణుడును, సర్వజ్ఞుడును, సకలవివేకియును నగు ఆయన దివ్యనామధేయమున మానవహృదయములను మమేక మొనరించుటకు కృషి సల్పుడు.

ఆయన పథమున నిర్వర్తితములైన కార్యముల స్వాదువు నాస్వాదించి, ఆయనకై ప్రదర్శితములైన వినయవిధేయతల మాధుర్యమున భాగము నొందవలెనని నిజైకదైవము నర్ధింపుడు. మిమ్ములను విస్మరించుకుని, మీ నేత్రమును మీ సామీప్యుని దెసకు మరలింపుడు. మీ శక్తిసామర్ధ్యములను మానవుల జ్ఞానాభివృద్ధికి తోడ్పడుదాని నిమిత్త ముపయోగింపుడు. భగవంతుని దృష్టికి గోప్యము గావింపబడిన దేదియూ లేదు; ఉండబోవ దెన్నటికిని. ఆయన పథమును మీ రనుసరించితిరేని, ఆయన యగణిత, అనశ్వరాశీస్సులు మీపై వర్షితము లగును. సకలలోకాధీశుని సజీవ దివ్యలేఖినీ ప్రావాహిత సూక్తీసమన్వితమైన సముజ్జ్వల దివ్యఫలకమిది. దీనిని మీ హృదయములయందున పర్యాలోచించి, ఇందలి యాదేశముల ననుసరించు వారలు కండు.

VI

ప్రపంచమునందలి భిన్నప్రజయును, తత్సంబంధీకులును వాగ్దత్త పురుషుని యాగమనార్ధ మెటుల నిరీక్షింపుచు వచ్చిరో వీక్షింపుడు. సత్యసూర్యుడు ప్రత్యక్షీకృతు డగుటతోడనే, భగవంతుడు పథనిర్దేశము గావింపనెంచినవారు దక్క, అన్యులెల్లరును ఆయనకు పరాఙ్ముఖులైనారు, చూడుడు. ఈ దివ్యయుగమున, ప్రతి నిజవిశ్వాసియు సాధింపగల సమున్నతస్థానము నాచ్ఛాదించియుండు ముసుపును తొలగించు సాహసమును మే మెునరింపజాలము; ఏలయన, అట్టి యావిష్కరణము రేకెత్తించు యానందము, నిక్కముగా కొందరిని మూర్ఛితులను జేసి, మృత్యువు పాలొనరింపవచ్చును.

బయాన్‌ మూలపురుషుడును, కేంద్రమును నగు ఆయన: “రానున్న దివ్యావిష్కరణశక్తులను తనయం దిముడ్చుకొనిన యంకురము, న న్ననుసరించు వారల సంయుక్తశక్తులకన్నను మహోన్న సామర్ధ్యము నొందియుండు,” నని లిఖియించినాడు. ఇంకను, ఇట్లనుచున్నా డాయన: “నా యనంతర మరుదెంచ నున్న ఆయనకు నే నర్పించిన సమస్తనివాళులకన్నను ఘనతరమైనది, ఈ నా లిఖితపూర్వకాంగీకృతి: ‘నా వాక్కులెవ్వియును ఆయనను సముచితముగ వర్ణింపనూజాలపు, నా గ్రంథమునం దాయనను గురించిన ప్రస్తావన మెద్దియును ఆయన దివ్యధర్మమునకు న్యాయమును చేయనూ జాలదు.’”

ఈ మహోన్నతవాక్కులయందున గుప్తములైయున్న సంద్రముల యగాధముల నన్వేషించి, వాటి ప్రాధాన్యతను గ్రహియించినవారలు యీ శక్తిసమన్విత, మహనీయ, పరమపవిత్ర దివ్యావిష్కరణమున కనుగ్రహీతమైన అనిర్వచనీయ వైభవపు మినుకు నొక్కదానిని కనుగొనగలిగి రనవచ్చును. అంతటి ఘనతర దివ్యావిష్కరణౌన్నత్యమున, విశ్వసనీయులగు తదనుయాయులను గ్రహింపబడ వలసిన గౌరవమును చక్కగ యూహింపవచ్చును. నిజైకదైవ ధార్మికత్వముపై యాన! సమస్త ప్రాపంచికైశ్వర్యములకన్నను కేవలము, ఈ పుణ్యాత్ముల యూపిరియే సుసంపన్నము. దాని నొందిన మానవుడు సంతోషాత్ముడు; దాని నలక్ష్య మొనరించిన వానిని విషాద మావరించును.

VII

మానవాళి వాగ్దత్తపురుషుని పవిత్రవదనము నవలోకించి, ఆయన యమరవాణి నాలింపగల దివ్యయుగమిదియేనని నిక్కముగ వచియింపుచున్నాడను. భగవంతుని యామంత్రణ మీయబడినది, ఆయన వదనదీప్తి మానవుల మీదికి ప్రసారితమైనది. తన హృదయఫలకమునుండి ప్రతి వ్యర్ధపద చ్ఛాయను తుడిచివైచి - నిశ్చిత, నిష్పాక్షిక మానసముతో ఆయన దివ్యావిష్కరణ సంకేతములను, ఆయన మహత్కార్య నిదర్శనములను, ఆయన దివ్యవైభవ పురస్కృతులను విలోకించుట ప్రతి మనుజునికిని యావశ్యకమైయున్నది.

వాస్తవమున కెంతయేని ప్రశస్త మీయుగము! భగవంతుని దివ్యయుగమని దీనిని గురించి సమస్త పవిత్ర గ్రంథములయందునను గావింపబడిన ప్రస్తావములు దీని యౌన్నత్యమును ధృవీకరింపుచున్నవి. భగవంతుని ప్రతి దివ్యప్రవక్త ఆత్మయును, ప్రతి దివ్యవార్తావహుని ఆత్మయును తపించినది, ఇయ్యద్భుత యుగము నిమిత్తమే! తదనుగుణముగనే, భువియందలి భిన్నజాతీయు లెల్లరును దీనిని సాధింప నభిలషించినారు. అయినను, భగవంతుని దివ్యావిష్కరణా దిత్యుడు స్వయముగ తన యిచ్ఛాస్వర్గమునం దవతరించినయంతనే, ఆయన మార్గదర్శకత్వమును వహింప నిచ్చగించినవారు దక్క, సర్వులును నిశ్చేష్టులై, మూగవోయినారు.

ఓయీ, నన్ను స్మరియించినవాడా! ఘోరతమమైన ముసువొక్కటి ప్రపంచ జనులకు ఆయన వైభవము నగుపడనీయక నిరోధించి, ఆయన పిలుపు నాలింప నీయక వారల నవరోధించినది. దేవా! ఐకమత్యజ్యోతితో సమస్తభూమిని ఆవరించునటుల, దాని సమస్తప్రజల లలాటములపై “రాజ్యము భగవంతు నిది” అన్న చిహ్నము ముద్రిత మగునటుల యనుగ్రహింపుము.

VIII

భగవంతుని ధార్మికత్వముపై యాన! తన దివ్యవార్తావహుల, దివ్య ప్రవక్తల సమూహసమస్తము యొక్క, ఇంకను వారల కావల - తన పవిత్ర, అనశ్వర పుణ్యస్థానమునకు సంరక్షకులై నిలచినవారల, స్వర్లోకమండపవాసుల, దివ్య వైభవపటవేశ్మనివాసుల యొక్క ఆంతర్యములను భగవంతుడు వెల్లడి గావించిన సుదినములివి. ఇక, దైవసన్నిభులు లోనుకావలసిన పరీక్ష యెంతటి తీవ్రతమమో!

IX

ఓ హుసేన్‌! గతకాలములయందున, ఖాయిమ్‌ అవతరణానంతరము, భగవంతుడు—ప్రకీర్తిత మాయన కీర్తి—ఎంచుకొనినవారిచే నుద్ఘోషితమైన వాగ్దత్త ఇమామ్‌ హుసేన్‌ పునరాగమనము నకై కొందరు జనులును, దేశములును ఎంతటి యాతురతతో నిరీక్షింపనైనదో పరికింపుము. అదియునుగాక, భగవంతుని బహుళానుగ్రహప్రభాతమైన ఆయనయే ప్రత్యక్షీకృతుడైనయపుడు, వాగ్దత్తపురుషు డావిష్కరించు పవిత్రధ్వజచ్ఛాయన ఖాయిమ్‌తో సహా, సమస్త దివ్యప్రవక్తలును, వార్తావహులును సమావిష్టులగుదురని యీ పవిత్రమూర్తులు ప్రకటించినారు. ఇప్పు డరుదెంచిన దాతరుణము. ఆయన ప్రభాసమానవదన తేజమున ప్రపంచము శోభిల్లినది. అయినను, ప్రపంచజను లాయన పథమున కతిదూరులై యెటుల గతి దప్పిరో వీక్షింపుము! దివ్యనామాధీశుని శక్తితో తమ దుర్వాంఛా, వ్యర్ధోహాప్రతిమలను ధ్వంసము గావించి, నిర్ధారణానగరమున ప్రవేశించిన వారలు దక్క, ఆయన నెవ్వరును విశ్వసింపలేదు. ఆయన దివ్యావిష్కరణ మనబడు యిష్టమధుకలశపు మూత, స్వయమాధారు డైన ఆయన పేరిట, ఈ దివ్యయుగమున తెఱువబడినది. తదనుగ్రహము మనుజులపై వర్షిత మగుచున్నది. పరమపవిత్రుడును, సకలసంకీర్తితుడును నగు ఆయన దివ్యనామము పేరిట నీ చషకమును నింపుకొని, సేవింపుము.

X

అవనీజనులకును, తత్సంబంధీకులకును పూర్వనిర్దేశిత సమయ మిపుడరుదెంచినది. పవిత్ర గ్రంథములయందున లిఖియింపవడిన యటుల, భగవంతుని వాగ్దానము లన్నియూ నిర్వర్తితములైనవి. జియోను నుండి భగవంతుని శాసనము వెలువడినది; యెరూషలేము గిరులూ, తద్భూభాగమునూ-ఆయన దివ్యావిష్కరణవైభవావృతములైనవి. ఆపత్సాహాయ్యుడునూ, స్వయంస్థితుడునూ నగు భగవంతుని దివ్యగ్రంథములయం దావిష్కృతమైనదానిని తన మానసమున మననము జేయు మానపుడు సంతోషాత్ముడు. ఓ భగవత్ప్రియతములారా, దీనిపై యోచింపుడు; ఆయన దివ్యవాక్కులపట్ల మీ శ్రవస్సుల నప్రమత్తములను కానిండు; తద్వారా, ఆయన కరుణాకటాక్షములతో, స్వచ్ఛములగు స్థైర్య జలములనుండి మీ వంతును గ్రోలి, ఆయన దివ్యధర్మమున పర్వతసదృశులై, అచలురునూ, సుస్థిరులునూ కావచ్చును.

యెషయా గ్రంథమున:“ప్రభునియెడ భీతికొలదియును, ఆయన మహిమావైభవ నిమిత్తమును శిలయందున ప్రవేశించి, ధూళియందున దాగు కొను,” మని లిఖియింపనైనది. ఈ సూక్తిపై పర్యాలోచన మొనరించిన మానవుడెవ్వడును యీ దివ్యధర్మవిశిష్టతను గుఱుతించుటయందున వైఫల్యము నొందడు, సాక్షాత్తూ భగవంతునిదేయైన యీ దివ్యయుగపు మహోదాత్త స్వభావమును శంకింపడు. ఈ సూక్తినే యనుసరించి వెలువడినవి యీ వాక్కులు: “ఆ దివ్యయుగమున యిక ప్రభుడే సంకీర్తితుడు.” పరమోన్నతుని దివ్యలేఖిని సమస్త పవిత్రగ్రంథముల యందునను ప్రకీర్తితమైన దివ్యయుగమిది. వాటియం దాయన పవిత్రనామవైభవము నుద్ఘోషింపని సూక్తియూ లేదు; ఈ మహోన్నతాంశపు టుదాత్తతను ధృవీకరింపని దివ్యగ్రంథమూ లేదు. తత్పవిత్ర గ్రంథముల యందునను, పావనలేఖనముల యందునను యీ దివ్యావిష్కరణపరముగ నావిష్కృతమైన దానినెల్లయు ప్రస్తావింప నెంచితిమేని, యీ దివ్యఫలక మసాధ్యపరిమాణము నొందును. తన యావద్విశ్వాసమునూ భగవంతుని యనుగ్రహ బాహుళ్యముపై యుంచి, ఆయన దివ్యధర్మసత్యములను పరిపూర్ణవిజ్ఞతతో ప్రకటిత మొనరింప నుద్యమించుట యీ దివ్యయుగమున ప్రతి మనుజునికిని విధాయకము. అప్పుడే, కేవలమప్పుడే, భువి యెల్లయూ, ఆయన దివ్యావిష్కరణోదయ ప్రభాసావృత యగును.

XI

సకల సృజితాంశముల పైకిని కారుణ్యసౌరభములు ప్రసారితము లైనయట్టి, పూర్వయుగములును, శతాబ్దములును యెన్నటికిని సాటి రా నాశింప జాలనటుల యాశీఃకృతమైనయట్టి, యుగప్రాచీనుని వదన మాయన పవిత్రాసనము దెస కున్ముఖమైనయట్టి - ఈ దివ్యయుగమునకు సకలప్రశస్తి. తత్పర్యవసానముగ, సకల సృజితముల స్వరములునూ, ఊర్ధ్వలోక దివ్యగణాతీతుల స్వరములునూ, ఉచ్చైస్వనమున యివ్విధముగ నామంత్రింపుచుండుట విననైనది: “ఓ కార్మెల్‌, శీఘ్రత నొందుము, ఏలయన, అదిగో! దివ్యనామసామ్రాజ్య పరిపాలకుడూ, స్వర్గముల స్రష్టయూ నగు భగవంతుని వదనశోభ నీపై ప్రసారిత మైనది.”

ఆమె యానందోద్వేగపరవశయై, తన గళమునెత్తి యిట్లుద్ఘోషించినది: “నీవు నీ దృష్టిని నాపై నిల్పినందులకునూ, నీ యౌదార్యమును నా కనుగ్రహించి నందులకునూ, నీ పదములను నాదెసకు నిర్దేశితముల నొనరించినందులకునూ నా ప్రాణము నీ కర్పితమగుగాక! ఓ అమరజీవనమూలమా, నీతో నా యెడబాటు నన్ను క్షీణత కెంతయో చేరువ గావించినది, నీ సాన్నిధ్యమునుండి నా దూరస్థత నా యాత్మను దహియించి వైచినది. నన్ను నీ పిలుపు నాలింపగలుగునటు లొనరించినందులకును, నాదెసకు నీ పదములను నిర్దేశించినందులకును, జీవప్రదాయినియగు నీ దివ్యయుగపరిమళముతో నీ జనావళియందున నీ కాహళధ్వానముగ నీపు నిర్దేశించినయట్టి నీ దివ్యలేఖిని తీక్షణస్వనముతో నా యాత్మ నుత్తేజిత మెునరించినందులకును - నీకు సకలప్రస్తుతి. ఇక, నీ యప్రతిహత దివ్యధర్మమును ప్రత్యక్షీకృత మొనరింపవలసిన ఘంటిక మ్రోగినయపుడు, నీ దివ్యలేఖినికి నీ స్ఫూర్తిశ్వాస నందించి నాడవు; అంతట, సమస్తసృజితాధిపతి యగు ఆయన భాండారస్థిత నిక్షిప్తమర్మములను మానవాళికి వెల్లడింపుచు, సృష్టిమూలములే కంపించినవి.”

ఆమె స్వరము ఆ మహోత్కృష్ట దివ్యస్థలిని చేరినయంతనే మే మిటుల ప్రత్యుత్తరము నిచ్చినాము: “ఓ కార్మెల్‌, నీ ప్రభునకు కృతజ్ఞతల నర్పింపుము. నీ నేత్రములనూ, సకలసృష్టి నేత్రములనూ రంజిల జేయుచు, గోచరాగోచర వస్తు సమస్తమును సమ్మోదభరిత మెునరింపుచు, నీ నేత్రములయెదుట నా సాన్నిధ్య మహాసాగర ముప్పొంగిన తరుణమున, నాతో నీ వియోగాగ్ని, తీవ్రముగ నిన్ను దహియింపు చున్నది. భగవంతుడు యీ దివ్యయుగమున, నీపై తన సింహాసనమును ప్రతిష్ఠించినందులకును, నిన్ను తన చిహ్నములకును, తన దివ్యావిష్కరణ ప్రతీకలకును ఉద్గమనస్థాన మెునరించినందులకును సంతసిల్లుము. నీ చుట్టును పరిభ్రమించువానికిని, నీ కీర్త్యావిష్కరణము నుద్ఘోషించువానికిని, నీపై నీ దేవదేవుని కృపావర్షితమును వర్ణించువానికిని శుభమగును. సకలయశస్వి యగు నీ ప్రభుని పేరిట యమృతకలశమును పరిగ్రహించి, నీయెడ తన కారుణ్యమునకు ప్రతీకగా, నీ దుఃఖమును మహదానందముగా పరివర్తిత మెునరించిన యందులకు, ఆయనకు ధన్యవాదముల నర్పింపుము. తన సింహాసన పీఠము గావింపబడిన, తన పదములు నడయాడిన, తన సాన్నిధ్యగౌరవము నొందిన, తన పిలుపును వెలువరించిన, తన యాశ్రుపుల నొలికించినయట్టి స్థలిని ఆయన నిశ్చయముగ ప్రేమించును.

“ఓ కార్మెల్‌, జియోనుకు పిలుపునిమ్ము; సంతోషవార్తలను ప్రకటింపుము. మానవనేత్రముల కగుపించని ఆయన యేతెంచినాడు! ప్రస్ఫుటమైన దాయన సకల విజయసార్వభౌమత్వము; ఆవిష్కృతమైన దాయన సర్వావృత వైభవము. సంశయింతువేమో, స్తంభింతువేమో, జాగ్రత్త. దైవానుగ్రహీతులును, నిష్కల్మషహృదయులును, మహోన్నతదివ్యదూతాగణమును భక్తిపూర్వకముగ పరివేష్టించియున్న దివ్యస్థానమగు స్వర్గావరోహిత యమరపురికి, శీఘ్రమే ప్రదక్షిణ మెునరింపుము. అహో! సైనాయి శిఖరాకర్షితమును, ‘భువర్లోక, సువర్లోక సామ్రాజ్యములు దేవాధిదేవుడగు భగవంతునివే,’ నను జ్వలననికుంజ సంబోధితమును నగు యీ దివ్యావిష్కరణ శుభసందేశములను యిలాతలస్థితమగు ప్రతి స్థానమునకును, పురమునకును అందించుట కెంతగా, నే నాకాంక్షింపు చున్నాడనో. నిక్కముగా అవనియునూ, అంబుధియునూ యీప్రకటనమున సమ్మోదము నొందు దివ్యయుగమిది; ఆవిష్కరణోద్దేశితాంశములను మానవ మేధాదృష్టిపథమున కతీతమైన యనుగ్రహమున భగవంతుడు సుభద్రము గావించిన దివ్యయుగమిది. భగవంతు డచిరకాలమునకే నీపై తన దివ్యనావను పయనింపచేసి, దివ్యనామగ్రంథప్రస్తావితులైన బహాజనుల నావిర్భూతుల నొనరించును.”

ఎవ్వరి నామోచ్చారణమున సమస్తమృత్తికాణువులును ప్రకంపితము లైనవో, ఎవ్వరి జ్ఞానాచ్ఛాదితయై శౌర్యాగారగుప్తీకృతమైయున్న దానిని వెల్లడింప దివ్యవైభవజిహ్వ ప్రచలితమైనదో, అట్టి సకలజననాథుడు పావనుడు. మహాబల సమన్వితుడును, సర్వశక్తిమంతుడును, మహోన్నతుడును నగు ఆయన నామధేయశక్తి మూలమున, స్వర్గస్థితసమస్తమునకును, అవనిపైనున్న సకలమునకును పాలకుడు నిశ్చయముగా - ఆయనయే.

XII

ఓ జనులారా, వాగ్దత్తసమయ మిప్పు డరుదెంచినందున, దివ్యన్యాయాన్విత దివసములకై నిరీక్షణాయత్నము గావింపుడు. తత్ప్రాధాన్యత నెఱుగుట యందున విఫలురై యపరాధులుగ పరిగణనము నొందెదరేమో, జాగరూకులు కండు.

XIII

గతమును తలపోయుము. భగవంతు డెంచుకొనిన పుణ్యాత్ములయం దాయన దివ్యావతారముల యాగమనమునకై శ్రేష్ఠులునూ, నిమ్నులునూ ఎందరు సర్వకాలములయందునా - ఉత్కంఠపూర్వకముగ నిరీక్షించియుండలేదు! ఆయన యాగమనము నెన్ని పర్యాయములు వా రాశించియుండలేదు, దైవానుగ్రహపవనము వీయునేమోననియు, వాగ్దత్తసౌందర్యుడు గోప్యతావగుంఠనమునుండి బయల్వెడలి సర్వప్రపంచమునకును సాక్షాత్కృతుడగునేమో ననియు వా రెన్నిమారులు ప్రార్ధించియుండలేదు! మరి, అనుగ్రహద్వారములు తెఱచుకొని, దివ్యవదాన్యతా పర్జన్యములు మానవజాతిపై వర్షించి, అగోచరుని ప్రభ పవిత్రశక్తి క్షితిజముపై శోభిల్లినయపుడెల్ల, వారెల్లరును - ఆయనను తిరస్కరించి, సాక్షాద్భగవద్వదనమైన ఆయన ముఖసీమకు తిరోఙ్ముఖులైరి. . . .

అట్టి చేష్టలకు హేతు వేమైయుండునో యోచింపుము? సకల వైభవాన్వితుని సౌందర్యావిష్కర్తల యెడ, అట్టి ప్రవర్తనమునకు ప్రేరక మేమైయుండును? గత దివసములనాటి జనుల తిరస్కరణకును, వ్యతిరిక్తతకును కారణమైనది - ఈ యుగజనావళి యున్మత్తత కిపుడు దారితీసినది. భగవత్సంకల్పిత ప్రమాణ మసమగ్రమనియు, కాపుననే ప్రజాతిరస్కరణ కది హేతువైనదనియు వాదము సేయుట ప్రత్యక్ష దైవదూషణమే దక్క వేఱొండు కాదు. ఆయన, సమస్తమానవుల నుండియు, తన ప్రాణుల మార్గదర్శనమునకై యొకనిని యెంచుకొనుటయును, ఒకవంకన తననుండి తన పూర్తిస్థాయి దివ్యప్రమాణము నుపసంహరించుటయును, ఇంకొకవైపున తా నెంచుకొనిన దివ్యునికి దూరులైనందున తన ప్రజలకు తీవ్రశిక్షను విధించుటయును - సర్వవదాన్యుని కృపకును, ఆయన వాత్సల్యాన్విత సంరక్షణ కును, మృదుకారుణ్యములకును యెంతటి విరుద్ధము! లేదు; సకల జీవరాశ్యధిపతియగు ఆయన యగణిత వదాన్యతలు, ఆయన దివ్యావతారముల ద్వారా భువినీ, అందు వసియించు సమస్తమునూ సర్వకాలములయందునను ఆవరించియేయున్నవి. క్షణమాత్రమేని ఆయన కృప ప్రతిరోధితమునూ కాలేదు, ఆయన ప్రేమోపేతకారుణ్యవృష్టి మానవజాతిపై వర్షించుట స్తంభింపనూ లేదు. కావున, అట్టి వర్తనమును గర్వాహంకారముల లోయన పయనింపుచూ, తమ వ్యర్ధోహామార్గముల యందున చరియింపుచూ, తమ మతవిశ్వాసనేతల యాదేశములను పాటింపుచూ దూరస్థతారణ్యముల యందున త్రోవదప్పినవారి బుద్ధిహైన్యతకు దక్క , అన్యమున కాపాదింపతగదు. వారి ప్రధానోద్దేశ్యము వట్టి శత్రుత్వమే; సత్యము నుపేక్షించుటయే వారి యేకైక లక్ష్యము. సత్యసూర్యుని ప్రతి దివ్యావతార కాలముననూ, ఈ ప్రజలు తా మవలోకించి, ఆలకించి యనుభవించిన దానినుండి తమ కన్నులనూ, చెవులనూ, హృదయములనూ పునీతములను గావించుకొనియుండినచో, భగవంతుని సౌందర్యవీక్షణా భాగ్యమును వారు కోలుపోయి యుండెడివారునూ కాదు, వైభవోపేతస్థానములకు దూరులై యుండెడి వారునూ కా దనునది విజ్ఞుడైన ప్రతి పరిశీలకునికిని సుస్పష్టము, సువిశదము. భగవత్ప్రమాణమును తమ మతనేతల బోధనలనుండి యేర్పరచు కొనిన స్వీయజ్ఞానస్థాయిలో గణనము సేయుట చేతను, అది తమ పరిమితావగాహనమునకు విరుద్ధముగ నగుపించుటచేతను వా రట్టి యనుచితకృత్యములకు పాల్పడినారు. . . .

మోషేను తలచుకొనుము! పునీతసామ్రాజ్యదండపాణియై, దైవజ్ఞాన శ్వేతహస్తాలంకృతుడై, భగవద్వాత్సల్య పారానునుండి ముందున కేగుచు, శాశ్వత దైవమహిమాధికార సర్పమును ఝళిపింపుచు, జ్యోతిర్మయ సైనాయినుండి ప్రపంచముపై, ఆయన భాసిల్లినాడు. సమస్త భూప్రజలనూ, తత్సంబంధీకులనూ - అమరధామమున కామంత్రించి, వారలను విశ్వాసవృక్షఫలాస్వాదనమున కాహ్వానించినా డాయన. ఇక, ఫారోయెుక్క, ఆతడి ప్రజలయెుక్క ప్రబల వ్యతిరేకతయును, నాస్తికహస్తము లామహనీయమహీజము మీదికి విసరిన వ్యర్ధశిలలును నిక్కముగా నీ వెఱిగినవే. ఇంకనూ చెప్పవలెననిన, దివ్యవివేక జ్వాలను, అనశ్వరసామ్రాజ్యదీపికను ఏ భౌమజలమైనను, ఏ నశ్వర ఝంఝామారుతములైనను ఆర్పివేయలే వనునది సత్యమేయైనను, తుదకు ఫారోయును, ఆతడి ప్రజలును విజృంభించి - కాపట్య, తిరస్కారజలములచే తత్పవిత్ర వృక్షజ్వాలను మలుపుటకు తమ పూర్ణబలమును ప్రయోగించినారు. నిజమునకు, విచక్షణాదృష్టితో పరికించి, భగవంతుని పవిత్ర యిచ్ఛాసౌఖ్యపథమున పయనించితివేని, అట్టి జలములు జ్వాలను చల్లార్పకపోగా దాని నుధృత మెునరింప గలవనియూ, అట్టి ఝంఝామారుతములు దీపిక నార్పకపోగా దానిని పరిరక్షింప గలవనియూ ఎఱుగుదువు. . . .

మోషే జీవితకాలము సమాప్తినొందినయంత, దివ్యస్ఫూర్తిప్రభాతము నుండి శోభిల్లుచు, యేసుదీప్తి ప్రపంచము నావరించినయపుడు ఇజ్రాయేలీయు లెల్లరును ఆయనకు వ్యతిరేకముగా నినదింపుచూ ఉద్యమించినారు. ఎవ్వని యాగమనము నంతకుమునుపే బైబిలు ప్రస్తావించినదో ఆయన, మోషే ప్రవచించిన న్యాయశాసనముల నుద్ఘోషించి నెరవేర్పవలసియుండగా, దిప్యుడైన మెస్సయ్యను తానేనని ప్రకటించుకొనిన ఈ యువనజరేయుడు విడాకుల శాసనములనూ, మోషే శాసనసమస్తమున సర్వప్రధానమైన సబ్బాత్‌ దినమునూ తొలగించినాడని వా రలజడి చేసినారు. అయినను, దివ్యావతారసంకేతముల యం దింకేది యరుదెంచవలె? బైబిలులోని పూర్వప్రస్తావిత దివ్యావతారమునకై యీ ఇజ్రాయేలీయు లీనాటికినీ ప్రతీక్షింపుచునే యుండిరే! మోషే కాలమునుండి యెందరు దివ్యావతారములు, ఎందరు శాశ్వతజ్యోతిప్రకాశకులు అవతరించి యుండలేదు! అయినను అసత్యోహల, దుర్మోహ, పైశాచిక విలాసముల దళసరి ముసువులతో నావృతయై, తానై రూపొందించుకొనిన రూపముతో, తా నూహించుకొనిన చిహ్నములతో తన యాదర్శమూర్తి ప్రత్యక్షమగు నని, ఇజ్రాయేలు యీ నాటికిని ప్రతీక్షింపుచునేయున్నదే! భగవంతు డవ్విధముగ, వారి దుష్కృత్యము లకు వారినే బాధ్యుల నొనరించి, వారియందలి విశ్వాసజ్యోతిని మలిపి, కాఠిన్యాగ్నిజ్వాలలతో వారిని దహియించినాడు. ఇది యెల్లయు, కేవలము బైబిలు నందున భగవంతుని ఆగామి దివ్యావతారచిహ్న సంబంధితముగ వెల్లడింపబడిన ప్రవచనార్ధమును గ్రహియింప తిరస్కరించిన కతమున దక్క , వేరొండు హేతువున కాదు. వాటి నిజప్రాధాన్యతను తా నెన్నడును గ్రహియించి యుండనందునను, బాహ్య పరిశీలనమున కట్టి ఘటన లెన్నడును చోటుచేసుకొని యుండలేదు కనుకను, ఇజ్రాయేలు యేసు దివ్యసౌందర్యమును గుఱుతింపక, భగవద్వదనము నవలోకించు భాగ్యమును కోలుపోయినది. ఇంకనూ, వా రాయన యాగమనమునకై నిరీక్షింపుచునే యుండిరే! ఆనాటి నుండి యీనాటి వరకును, భువియందలి సర్వజనులూ, సకలజాతులూ, అట్టి విచిత్ర, సందేహాస్పద భావనల నంటిపెట్టుకొనియుండి స్వచ్ఛతా, పవిత్రతాస్రవంతులనుండి వెలువడుచున్న నిర్మలోదకములను తమకుతాముగ చేజార్చుకొనిరి. . . .

యేసు వాత్సల్యాగ్ని యూదు పరిధుల ముసువులను దహియించివైచి, ఆయన యధికారము స్పష్టీకృతమై, పాక్షికముగ నమలుపరుపబడిన యపుడు, అదృశ్యదివ్యసౌందర్యావిష్కర్తయైన ఆయన, ఒకనాడు తన శిష్యుల నుద్దేశించి ప్రసంగింపుచు, తన నిష్ర్కమణమును ప్రస్తావించి, వారి హృదయములయందున వియోగజ్వాలను రగుల్కొల్పుచు: “నేను వెడలిపోయి, మరల మీ చెంతకు వత్తు,” నని వారితో యనుట, జ్ఞానానుగ్రహీతులకు సుస్పష్టము, సువిశదము. వేరొక తావున యిట్లనినా డాయన: “నేను వెడలుదును, మీకు నేను వచియింపని దాని నెల్లయు మీకు వచియించి, నేను వచియించిన దానిని నెరవేర్చునట్టి యింకొక డరుదెంచును.” భగవంతుని యేకత్వమూర్తులగు దివ్యావతారముల పరముగ, పవిత్రావగాహనాన్వితులై మీరు పర్యాలోచించితిరేని, యీ ప్రబోధద్వయ భావ మెుక్కటియే.

ఖురాను దివ్యపాలనాకాలమున యేసు దివ్యగ్రంథమూ, దివ్యధర్మమూ ధృవీకృతములైనవని విజ్ఞతాన్వితుడైన ప్రతి పరిశీలకుడూ గుర్తింపగలడు. ఇక నామధేయముల విషయమున, “నేను యేసు,”నని మహమ్మదు స్వయముగా ప్రకటించినాడు. యేసు సంకేతముల, భవిష్యవాణుల, వాక్కుల సత్యమును గుఱుతించుటయే గాక, అవి యన్నియూ దైవదత్తములేయని ధృవీకరించినా డాయన. ఈ యర్థమున, యేసు మూర్తిమత్వమైనను, ఆయన రచనలైనను - మహమ్మదు తోడనూ, ఆయన పవిత్రగ్రంథముతోడనూ విభేదింపలేదు; ఏలయన, ఇరువురునూ భగవంతుని దివ్యధర్మమును సమర్ధించి నారు; ఆయనను సంకీర్తించి, ఆయన యాదేశముల నావిష్కరించినారు. కావుననే, యేసు స్వయముగా, “నేను వెడలిపోయి, మరల మీచెంతకు వత్తు,” నని ప్రకటించినాడు. సూర్యుని పరికింపుము: సూర్యు డిప్పుడు, “నేను నిన్నటి సూర్యుడి,”నని చెప్పెనేని, సూర్యుడు సత్యమునే వచియించె నన్నమాట. ఒకవేళ సూర్యుడు, సమయక్రమమును దృష్టియం దుంచుకొని తా నాసూర్యుడిని కాదనినచో, దానిని సైతము సత్యమనియే పరిగణింపవలె. అవ్విధముగనే, దివసము లన్నియు నొక్కటేయని సూర్యు డనినచో, అదియును యథార్ధమే, వాస్తవమే. ఇక, వాటి విశేషనామముల, స్థాయులదృష్ట్యా అవి భిన్నములని చెప్పబడెనేని, అదియునూ వాస్తవమనియే గ్రహియింపవలె. ఏలయన, ఒక్కటియే యైనను ఒక్కొక్క దానియం దొక విశిష్టస్థాయిని, విశేషలక్షణమును, విలక్షణగుణమును మనము గుఱుతింపవచ్చును. వివిధ పవిత్రావతారమూర్తుల విశిష్ట, వైవిధ్యాన్విత సమైక్యతాలక్షణము నవ్విధముగనే గ్రహియింపుము; తద్వారా, వారి విలక్షణ, ఏకత్వముల మర్మములను గురించి సకలనామధేయముల, లక్షణముల స్రష్ట గావించిన పరోక్షసూచనలను నీవు గ్రహియింపవచ్చును; ఇంకను, నిత్యసౌందర్యుడు తనను వివిధ కాలములయందునను వేరువేరు నామములతో, బిరుదములతో యేల వ్యవహరించుకొనెనను నీ ప్రశ్నమున కుత్తరమును కనుగొనవచ్చును. . . .

అనునిత్యుడును, దివ్యసత్త్వమును నగు అగోచరుడు జ్ఞానక్షితిజముపై మహమ్మదను దివ్యాదిత్యుని యుదయింపచేసినపుడు, మోషే యనంతరము ఏ దివ్యప్రవక్తయును భగవంతునినుండి యేతెంచ డనునది యూదు ధార్మిక ప్రముఖు లాయనకు విరుద్ధముగ చేసిన దుష్టారోపణలయం దొకటి. అవును, దివ్యాత్మ తప్పక ప్రత్యక్షీకరింపబడుననియు, ఆయన దివ్యధర్మమును పురోగమింప చేయుననియు, మోషే జనుల ప్రయోజనములను పరిరక్షించుననియు, తద్వారా, సమస్త భూవలయమునూ మోషే దివ్యపాలన మావరింపవచ్చుననియు పవిత్రగ్రంథములయందున ప్రస్తావిత మైనది. దూరస్థతాదోషముల లోయన సంచరించువారనిన మాటలను, తన పవిత్రగ్రంథమున శాశ్వత వైభవరాజన్యు డిటుల ప్రస్తావించినాడు: “ ‘భగవంతుని హస్తమునకు సంకెలలు వేయబడిన,’ వని యూదు లందురు. వారి స్వీయహస్తములే శృంఖలాబద్ధములగు గాక! తా మటు లనినందులకు వారు శాపగ్రస్తులైనారు. అంతియేకాదు, ఆయన హస్తద్వయము విస్తరించియే యున్నది!” “భగవంతుని హస్తము వారి హస్తములకు, ఎగువన యుున్నది.” ఖురాను వ్యాఖ్యాతలు యీ సూక్త్యావిష్కరణ సంబంధిత పరిస్థితులను వివిధరీతులలో వర్ణించిననూ, తదుద్దేశ్యమును గ్రహియించుటకు నీవు యత్నించి తీరవలె. ఆయన యిట్లనుచున్నాడు: యూదులు భావించిన దెంత దోషభూయిష్టము! మోషే వదనమును సాక్షాత్కృత మొనరించి, ఆయనకు ప్రవక్తృత్వ వస్త్రము ననుగ్రహించిన నిజరాజన్యుని హస్తము—శృంఖలాబద్ధ మెట్లు కాగలదు? ఆయన మోషే యనంతర మింకొక దివ్యవార్తావహుని సృజియించుటకు శక్తిరహితుడని యెట్లూహించుట? వీక్షింపుము, వారి వాదపు టసంబద్ధతను; అది జ్ఞానావగాహనల పథము నెట్లు తప్పినదో! ఈ దివ్యయుగమున సైతము, అట్టి పెడసరపు టసంబద్ధతలతో యీ జనులెల్లరును యెటుల జీవింపుచుంటిరో విలోకింపుము. సహస్రవర్షములకుపైగా యీ సూక్తిని వారు వల్లింపుచునే యున్నారు; యూదుల మనోభావములనూ, విశ్వాసమునూ బహిరంగముగనూ, రహస్యముగనూ-తామే ప్రస్తావింపుచున్నది యెంతమాత్రమూ ఎఱుగక, యూదులకు వ్యతిరేకముగ తమ యసమ్మతిని వెళ్లగ్రక్కుచునే యుండిరే! ఆ దివ్యావిష్కరణము ముగిసినదనియూ, దివ్యానుగ్రహ ద్వారములు మూయవడినవనియూ, నిత్యపవిత్రప్రభాతములనుండి యిక ఏ దివ్యభానుడూ ఉదయింప డనియూ, అనంతానుగ్రహమహాసంద్రము శాశ్వతనిశ్చలత నొందినదనియూ, ప్రాచీనవైభవ పటవేశ్మమునుండి భగవంతుని దివ్యవార్తాహరుల యవతరణ మాగిపోయినదనియూ వా రొనరించు శుష్కవాదమును నిక్కముగా నీ వెఱుగుదువు. అల్పబుద్ధులైన యీ నీచమానవుల అవగాహనాస్థాయి అట్టిది! సర్వావృతమైన భగవంతుని యనంతకారుణ్యానుగ్రహవాహిని, ఏ మేధయేని యూహింపనటుల స్తంభించినదని యీ జనులు భావించినారు. శక్తిగోళము తన యభేద్యదుర్గమున భగవంతుని దివ్యజ్యోతిని సంరక్షించునని యెఱుగక, వా రన్ని దెసలనుండియు విజృంభించి, నిరంకుశత్వపు కటిసీమను బిగియించి, భగవంతుని జ్వలననికుంజకీలను తమ వ్యర్ధవ్యామోహ విషజలములతో నార్పుటకు బృహద్యత్న మొనరించినారు . . .

భగవద్వార్తాహరుడైన మహమ్మదు ఔన్నత్యము ప్రజలయం దీనాడెంతగా ప్రస్ఫుటమో, అభివ్యక్తమో విలోకింపుము. ఆయన దివ్యపాలనాకాలపు తొలి నాళ్లయం దాయన దివ్యధర్మమున కేమి వాటిల్లెనో, నీవు బాగుగనే యెఱుగుదువు. ఆ యాధ్యాత్మిక దివ్యతత్త్వమునకు, ఆ పరమపవిత్రపావనునకు ఆనాటి నాస్తిక, దుర్జనహస్తమును, మతాధిపతులును, తదనుయాయులును యెంతటి తీవ్రక్లేశములను గలిగించిరో! ఆయన పథమున వారు చల్లిన కంటకములెన్నియో, ముండ్లతీగ లెన్నియో! తమ కుటిల, పైశాచి కాడంబరము కొలది, ఆ దుష్టతరము ఆ దివ్యమూర్తికి తానొనరించిన ప్రతి యభిద్రోహముును శాశ్వతానందసాధనా మార్గముగ భావించినది; ఏలయన, అబ్దుల్లా-ఇ-ఉబయ్యే, సన్యాసి అబూ- అమీర్‌, కాబ్‌-ఇబ్న్-ఎ-అష్రఫ్‌, నజ్ర్‍-ఇబ్న్-ఎ- హారిత్‌ వంటి ఆనాటి ప్రముఖ మతాధిపతు లెల్లరును ఆయనను అసత్యవాదిగ పరిగణించినారు; ఆయన నొక యున్మాదిగా, దోషిగా నిర్ధారించినారు. ఆయనకు వ్యతిరేకముగా వారు గావించిన బాధాకరారోపణముల వర్ణనమునకు భగవంతుడు మా సిరా ప్రావాహికతను, మా లేఖినీచాలనమును, పుటయందున తత్ప్రస్తావనమును నిషేధించును. ఈ విద్వేషపూరితారోపణములు, ఆయనను వేధింప నుద్యమించుటకు ప్రజలను పురికొల్పినవి. ఆనాటి మతనేతలే చిత్రహింసకు ముఖ్యప్రేరకులై, తమ అనుయాయుల దృష్టియం దాయన స్థాయిని దిగజార్చి, ఆయనను వారినుండి వెలివైచి, దుండగీడుగ ప్రకటించిరనిన, ఇక ఆ హింస యెంత వేదనాభరితమో! ఈ సేవకునికి సైత మిట్టివి సంభవిల్లి యుండలేదా, ఎల్లరును కనులార గాంచలేదా?

ఈ కారణముననే, మహమ్మదు: “ఏ భగవత్ప్రవక్తయును నే ననుభవించిన యంతటి హింస ననుభవించి యుండలే,” దని ఆక్రందించినాడు. ఆయనపై గావింపబడిన దుర్వ్యాఖ్యలునూ, దూషణలునూ, ఆయన యనుభవించిన సమస్త క్లేశములునూ ఖురానుయందున లిఖితములైనవి. వాటిని పరిశీలింపుడు, తద్వారా ఆయన దివ్యావిష్కరణమున కేమి వాటిల్లెనో బహుశః, మీ రెఱుగవచ్చును. ఆయన దుస్థితి యెంతటి వ్యధాభరితమనిన, ఒకప్పు డాయనతోడను, ఆయన సహచరులతోడను అనుబంధము నెల్లరును త్రెంచుకొనినారు. ఆయన సాహచర్యము నొందినవారు, ఆయన విరోధుల కర్కశక్రౌర్యమునకు బలియైనారు. . . .

ఈనాటి పరివర్తన మెంత మహత్తరమో యోచింపుము! ఆయన నామ ధేయమునకు ప్రణమిల్లిన చక్రవర్తులెందరో వీక్షింపుము! ఆయన ఛాయయం దాశ్రయము నాశించి, ఆయన దివ్యధర్మమునకు సంఘీభావమును ప్రకటించి, దానిని స్వీయగౌరవముగ నెంచుకొనిన దేశములును, సామ్రాజ్యములును యెన్ని యని! ఈనాడు, ప్రసంగవేదికాగ్రము నుండి ఆయన పుణ్యనామము నత్యంత వినయముతో కీర్తించు ప్రశంసావాక్కులు వెలువడుచున్నవి; ఆయన నారాధింపుడని ఆయన ప్రజాసమూహము నామంత్రించు పిలుపు, మీనారుల యగ్రముల నుండి ప్రతిధ్వనింపుచున్నది. ఆయన దివ్యధర్మము నవలంబించుటకును, అవిశ్వాసాంబరమును వీడుటకును తిరస్కరించిన నృపాలురు సైతము, అపరాధము నంగీకరించి తత్ప్రేమాన్వితకారుణ్యాదిత్యుని యుదాత్తతను, మహత్వమును గుఱుతింపు చున్నారు. ఆయన యైహికసార్వభౌమత్వ మట్టిది; అందులకు నిదర్శనముల నన్నిదిశలయందునను నీ వవలోకింపుచున్నాడవు. తదౌన్నత్యము భగవంతుని ప్రతి దివ్యావతార జీవితకాలముననో, ఆయన తన యూర్ధ్వలోకస్థిత నిజవాసమున కారోహించిన యనంతరమో, తదౌన్నత్యము సునిశ్చయముగ నావిష్కృతమును, సుస్థిరమును కావలె. . . .

ప్రతి దివ్యపాలనమునను గావింపబడిన మార్పులయందున, మానవుని జ్ఞాననేత్రమునకును, దివ్యతత్త్వపు టుషస్సునుండి భాసిల్లు దివ్యతేజస్వికిని మధ్యన ప్రతిబంధకములై నిలుచు కారుమేఘము లుండుననునది స్పష్టము. తరతరములుగ మానవులు గ్రుడ్డిగ తమ పూర్వీకుల నెట్లనుసరింపుచు, వారి దివ్యధర్మాదేశములు నిర్దేశించియుంచిన మార్గములకును, విధానములకును అనుగుణముగ శిక్షణము నొందుచూ వచ్చిరో పర్యాలోచన మొనరింపుము. తమ దివ్యధర్మము యేర్పరచిన ప్రతి స్థిరీకృత సిద్ధాంతమును-శతాబ్దములుగ తాము సుశిక్షితులగుచూ వచ్చిన సిద్ధాంతములను; ప్రతి వ్యతిరేకినీ, తిరస్కారినీ, నాస్తికునిగనూ, దుర్వర్తనునిగనూ, కుటిలునిగనూ పరిగణించినయట్టి తమ సిద్ధాంతమును - తొలగించుటకై, ప్రతి మానవపరిమితికి సంబంధించినంతవరకు తమకు సమానునిగా తమయందే వసియింపుచుండిన మానవు డొక డుద్యుక్తుడయ్యెనని, ఈ మానవు లాకస్మికముగ కనుగొనినయపు డాయన సత్యము నెఱుగుటయందున, నిశ్చయముగ వా రవగుంఠితులును, అవరోధితులును అగుదురు. అట్టి యంశములు, ఎవరి యాంతరికాస్తిత్వములు పరిత్యాగ సల్‌ సబీల్‌ను చవిచూడలేదో, లేదా భగవత్‌జ్ఞాన కవ్థార్‌ ను గ్రోలలేదో వారి నేత్రముల నాచ్ఛాదించు “మేఘముల” వంటివి. అట్టి మానవుల కాపరిస్థితు లెదురైన యపు డెంతగా వా రవగుంఠితులగుదురనిన, నిస్సంశయముగా, వారు భగవంతుని దివ్యావతారమును దైవద్రోహిగ ప్రకటించి, ఆయనకు మరణశిక్షను విధియింతురు. యుగయుగములుగా చోటుచేసుకొనుచూ వచ్చిన, అట్టి ఘటనలను గురించి వినియుందువు; వాటిని యీ దినములయం దవేక్షింపుచున్నాడవు.

కావున, ఆయన వదనప్రభాస సౌందర్యమును తిలకింపనీయక యీ నల్లని ముసుపులు, ఈ దైవనిర్దేశిత విపన్మేఘములు మనలను ప్రతిరోధింప కుండుటకును, కేవలము ఆయన స్వీయతతోడనే మన మాయనను గుఱుతింప జాలుటకును, భగవంతుని యదృశ్యసాహాయ్యమున పూర్ణయత్న మొనరిం చుట మనకు సముచితము.

XIV

ఓ మహోత్కృష్ట దివ్యలేఖినీ, దివ్యవసంతబుుతు వరుదెంచినది, ఏలయన, సమస్త కారుణ్యమూర్తి దివ్యపర్వదినము సత్వరమే సమీపింపుచున్నది. కార్యోన్ముఖుడవై, సృజితాంశము లన్నియునూ పునరుత్పాదితములును, నవీకృతములును అగునటుల, సమస్తసృష్టియెదుట భగవంతుని దివ్యనామమును ప్రవృద్ధ మెునరింపుము; ఆయన సంకీర్తనమును సాగింపుము. మౌనము దాల్పక, మాటాడుము. స్వర్లోకస్రష్టయగు నీ దేవదేవుని నామధేయభూషణమున భగవంతుని మహానామ సామ్రాజ్య మలంకృతమగుటచే మోదము నొందిన మా నామధేయదిఙ్మండలముపై మహదానంద ప్రభాతనక్షత్రము తళుకులీనుచున్నది. భువియందలి దేశముల యెదుట విజృంభించి, ఈ మహాఘననామ శక్తిని ఆయుధముగ ధరియింపుము; ఆలసించు వారి పక్షమున యుండవలదు.

నీవు నా దివ్యఫలకముపై నిలచి, ముందుకు సాగుటలే దనుకొందును. దివ్యవదనప్రభాసము నిన్ను దిగ్భ్రాంతుని గావించెనా, లేక మూర్ఖుల వ్యర్ధాలాపము నిన్ను విషాదభరితుని జేసి నీ చలనమును నిర్వీర్య మెునరించెనా? మహిమాధికారముల దివ్యాంగుళి పునర్మిలనమధుకలశపు మూతను తెఱచి, భూస్వర్గ వాసులెల్లరకునూ పిలుపు నిచ్చినయట్టి—ఈ దివ్యయుగపు టౌన్నత్యమును సంకీర్తింపనీయక, ఏదేని నిన్నవరోధింపుచున్నదేమో, జాగరూకుడవు కమ్ము. భగవంతుని దివ్యయుగమును ప్రకటించు పవన మిప్పటికే నీపైకి వీచియుండగ, ఆలసింపనెంతువా, లేక అవగుంఠితులవలె ఆయనను చూడనొల్లని వారియం దొకడ వౌదువా?

ఓ సర్వనామాధిపతీ, స్వర్గములస్రష్టా! సకల ప్రపంచమునకును పథనిర్దేశక దీపికయును, తద్వాసు లెల్లరకును యుగప్రాచీనుని ప్రతీకయును అగు—నీ దివ్యయుగవైభవములను గుఱుతింప నీయక నన్ను ప్రతిరోధించు యవకాశమును, ఏ ముసువునకును నే నీయలేదు. నిన్ను వీక్షింపనీయక నీ ప్రాణుల నేత్రముల నాచ్ఛాదించిన ముసువులే, నా మౌనకారణము. నీ సత్యమును గుఱుతింప నీయక నీ ప్రజలను ప్రతిరోధించిన యవరోధములే నా నిశ్శబ్దహేతువు. నాలోని దానిని నీ వెఱుగుదువు, కాని, నీయందలి దానిని నేనెఱుగను. సర్వజ్ఞుడవీవు, సకలవిదితుడవీవు. అన్యనామ సమస్తమునకన్నను సమున్నతమగు నీ నామధేయముపై యాన! సర్వాతిక్రమణమును, సర్వప్రేరకమును నగు నీ యాదేశ మెన్నడేని నన్ను చేరెనేని, నీ కీర్తిసామ్రాజ్యమున నీ శక్తియుతజిహ్వ పలుకగ నే నాలించిన నీ మహోత్కృష్టవచన సాహాయ్యమున, సమస్తజనుల యాత్మలను పునరుజ్జీవింప చేయునటుల నన్నది సశక్తీకరించును. విస్పష్టుడవును, సర్వోన్నత సంరక్షకుడవును, స్వయంజీవనుడవును నగు నీ నామధేయమున ప్రదర్శితమై, మనుష్య నేత్రములకు గుప్తీకృతమైన నీ శోభాయమాన వదనపు టావిష్కృతిని - అది నాచే యుద్ఘోషిత మెునరించును.

ఓ దివ్యలేఖినీ, ఈ దివ్యయుగమున నన్ను దక్క నీ వింకెవ్వరినీ యెఱుగ జాలవా? సృష్టికిని, తద్వ్యక్తీకరణములకును యేమైనది? నామధేయముల, వాటి సామ్రాజ్యము యొక్క విషయమేమి? గోచరాగోచర సమస్తసృజిత వస్తుసంచయ మెట కేగినది? విశ్వమునకును, తదావిష్కరణములకును సంబంధించిన నిగూఢ మర్మముల కేమైనది? అదిగో, సమస్తసృష్టియును అంతరించినది! నిత్యసుస్థిరమును, దేదీప్యమానమును, సమస్తవైభవోపేతమును నగు నా వదనము దక్క వే రెద్దియును మిగులలేదు.

అనుగ్రహశీలియును, మహావదాన్యుడును నగు నీ దేవదేవుని వదనము నుండి భాసిల్లు ప్రభావైభవము దక్క వేరెద్దియునూ కానరానట్టి దివ్యయుగమిది. సత్యముగా, అప్రతిహతమూ, అజేయమూ నగు మా సార్వభౌమాధికారమున ప్రతి జీవిని అంతము నొందజేసినాము. అటుపై, మనుజులయెడ మా కారుణ్య ప్రతీకగా, మేమెుక నవీనసృష్టి నావాహన మెునరించినారము. నిక్కముగా, నేను సకలవదాన్యుడను, దివ్యయుగప్రాచీనుడను.

“ఓ ధరణీ, మహత్తరము నీ ధన్యత, ఏలయన నీవు నీ దైవమునకు పాదపీఠివి గావింపబడినాపు, ఆయన శక్తిసమన్విత భద్రాసనపీఠముగ నెంచుకొనబడినా,” వని యగోచరప్రపంచ మెలుగెత్తి ఘోషించు దివ్యయుగమిది. “భూత భవితల ప్రాణుల కన్నింటికినీ వాగ్దత్తమైన ఆయన దివ్యనామధేయ శక్తితో, సకలకరుణాన్వితుని పరమప్రియుడు తన సార్వభౌమాధికారమును నీపై సంస్థాపించినయందులకు, నీకు నా జీవిత మర్పితమౌ,” నని సంభ్రమాశ్చర్యాన్వితయై వైభవసామ్రాజ్యము ఘోషింపుచున్నది. సకలసృష్టిపైనను తన పరిమళమును పరివ్యాపన మెునరించిన మదీయ వస్త్రమునుండి ప్రతి సుమధుర సుగంధభరితాంశమూ తన సౌరభము నుత్పన్నమెునరించుకొనిన దివ్యయుగమిది. సకలదయాన్వితుని యిచ్ఛనుండి శాశ్వత జీవవాహినీజలములు స్రవించిన దివ్యయుగమిది. ఓ యూర్ధ్వలోక దివ్యగణమా! మనఃపూర్వకముగ శీఘ్రతనొంది, నీ భాగము గ్రోలుము.

వచించు: మీరు గ్రహియింపగలిగిరేని, అగోచరుల కగోచరుడునూ, అవిదితుడునూ అగు భగవంతుని దివ్యావతార మాయనయే. ఎఱుగనెంచితిరేని, నిగూఢనిక్షిప్తదివ్యరత్నమును మీకు బహిర్గత మెునరించిన దాయనయే. భూత, భవితలయందలి సకలాంశముల పరమప్రియు డాయనయే. మీరు మీ మానసములనూ, ఆశయములనూ ఆయనపై నిలుపుకొందురు గాక!

ఓ దివ్యలేఖినీ, నీ యభ్యర్ధనాన్విత స్వరము నాలకించి, నీ మౌనమును మన్నింపుచున్నాము. అంతటి తీవ్రదిగ్భ్రమకు నిన్ను గురి కావించిన దెయ్యది?

ఓ సకల ప్రపంచముల పరమప్రియా, నీ సాన్నిధ్యపారవశ్యము న న్నావహించి, వశపరచుకొనినది. లెమ్ము, సకల దయామయుడైన ఆయన రిద్వాన్‌ దిశగా తన యడుగులను వైచి, అందు ప్రవేశించినాడను సమాచారమును సకలసృష్టికిని ప్రకటింపుము. ఇక భగవంతుడు తన స్వర్గసింహాసన మెునరించుకొనిన యట్టి ఆనందోపవనమునకు జనులను నడిపింపుము. తన రావముతో సమస్త మానవజాతి పునరుత్థానమును సూచింపవలసిన మా బృహత్కాహళగా, నిన్ను మే మెంచుకొని నారము.

వచించు: “మానవనేత్రములకు ప్రచ్ఛన్న మెునరింపబడిన ఆయన - సార్వభౌమత్వాధికార పరివేష్టితుడై, బహిర్గతుడైనా,” డను ప్రమాణమును వాఙ్మధువు ముద్రించినది యీ స్వర్గస్థితపత్ర సంచయము పైననే. “ఓ స్వర్లోక, భూలోకవాసులారా! ఇతఃపూర్వమెన్నడును కానరానిది గోచరమైనది. సృష్టి వీక్షణమునుండి తన వదనమును చిరకాలముగ ప్రచ్ఛన్నమెునరించుకొని యుండిన ఆయన యిప్పుడేతెంచినా,” డని యుద్ఘోషింపుచున్నది యీ స్వర్గసంస్థిత పల్లవమర్మరధ్వానము. తత్ప్రవాహ జలము నుండి “సమస్త నేత్రములును సంప్రీతినొందినవి; ఏలయన, ఎవ్వరును విలోకించి యుండని ఆయన, ఎవ్వరును తెలియజాలని మర్మయోగి దివ్యవైభవజాలికను తొలగించి, శుభసౌందర్యుని ముఖమండలము నావిష్కరించె,” నను గలగలరావము విననగుచుండ, తచ్ఛాఖల యందున వీయు మలయపవనములనుండి “సర్వలోకైకనాథుడైన ఆయన ప్రత్యక్షీకృతుడైనాడు, దైవసామ్రాజ్యము భగవంతునిదే,” యను వాణి వెలువడినది.

ఈ దివ్యస్వర్గమున, ఇందలి సమున్నతమందిర శిఖరములనుండి స్వర్లోకసేవిక లిటుల యుచ్చైస్వనమున చాటినారు: “ఊర్ధ్వలోకవాసులారా, సంతసిల్లుడు, ఏలయన యుగప్రాచీనుని యంగుళులు స్వర్లోకమధ్యమున సమస్త వైభవాన్వితుని పేరిట బృహద్ఘంటికను మ్రోయింపుచున్నవి. వదాన్యతాహస్తము లనంత జీవన కలశము నావరించినవి. రండు, మీ భాగమును గ్రోలుడు. ఓ వాంఛాస్వరూపులారా, ప్రబలకాంక్షాప్రతిరూపులారా, మహోత్సాహమున సేవింపుడు.”

భగవన్నామముల దివ్యావిష్కర్తన ఆయన, వైభవపటవేశ్మమునుండి వెలికివచ్చి: “స్వర్లోకచషకము లనూ, వానియందలి సకలజీవప్రదాయక జలములనూ ఆవలనుంచుడు; ఏలయన, అదిగో, బహాజనులు దివ్యసాన్నిధ్యప్రమోద ధామమున ప్రవేశించి, సకలాధిపుడును, సర్వోన్నతును నగు తమ దివ్యప్రభుని సౌందర్యచషకమునుండి పునస్సమాగమ మధువును సేవించినా,”రని స్వర్లోక భూలోక వాసులెల్లరికిని ప్రకటించిన దివ్యయుగమిది.

ఓ దివ్యలేఖినీ, సృజితప్రపంచమును విస్మరించి, సర్వనామాధిపతియగు నీ దేవదేవుని వదనము దెస కభిముఖుడవు కమ్ము. అనంతకాలముల దివ్యవల్లభుడగు నీ ప్రభుని యనుగ్రహభూషణముతో ప్రపంచము నిక యలంకరింపుము. ఏలయన, సకలజాతుల దివ్యాకాంక్షయైన ఆయన, గోచరాగోచర సామ్రాజ్యములపై తన పరమోత్కృష్ట నామప్రభావైభవమును ప్రసరిల్లజేసి, సకలసృష్టికిని సర్వశక్తి సమన్విత సంరక్షకుడైన ఆయన దక్క అన్యు డెఱుగజాలని తన పరమదయాన్వితానుగ్రహ ప్రభాసముల శోభతో, వానిని సమావృతమెునరించిన దివ్యయుగసౌరభమును మే మాస్వాదింపుచున్నాము.

భగవంతుని సృజితజీవులను వాత్సల్య, కారుణ్యప్రపూరితముగ దక్క, వేరొండు దృష్టితో నవలోకింపవలదు, ఏలయన, మా సంరక్షణ సకలసృజితములకూ పరివ్యాపితమే; ఇక, మా కటాక్షము భూస్వర్గసమావృతము. భగవంతుని నిజదాసులు పునస్సమాగమపు జీవప్రదాయక జలములను గ్రోలు దివ్యయుగమిది; ఆయన సామీప్యులు అమరత్వపు నిర్మలప్రావాహికస్రవంతినుండియును, ఆయన యేకత్వమును విశ్వసించినవారలు “దివ్యసామ్రాజ్యము నాది, నాకుగల హక్కు కొలది నేనే తత్పరిపాలకుడ,” నని దివ్యమహిమాన్విత వైభవజిహ్వ ఎవ్వని యందున యెలుగెత్తి ఘోషించెనో, ఆ సర్వోన్నత, సకలాంత్యమైన ఆయనను గుఱుతించుట ద్వారా, ఆయన సాన్నిధ్యమధువును - పానముచేయగల దివ్య యుగమిది.

ఏకైకప్రియతముడైన ఆయన పిలుపుతో మానవహృదయముల నాకర్షింపుడు. వచించు: మీ రాలించితిరేని, భగవద్వాణియిది. ఎఱిగితిరేని భగవంతుని దివ్యావిష్కరణప్రభాతమిది. గుఱుతించితిరేని, భగవంతుని దివ్యధర్మోదయస్థలి యిది. నిష్పాక్షికముగ నిర్ణయించితిరేని, దైవాజ్ఞామూలమిది. గ్రహియించితిరేని ప్రత్యక్ష, నిక్షిప్తదేవరహస్యమిది. ఓ ప్రపంచ జనులారా! అన్యనామసమస్తము నధిగమించిన నా నామధేయము పేరిట, మీ స్వాధీనస్థితము లన్నింటినీ పరిత్యజింపుడు. తన యగాధములయందున వివేక, భాషణ మౌక్తికములను నిక్షిప్తమొనరించుకొనినయట్టి, సకల కరుణాన్వితుడనగు నా నామధేయమున యుప్పొంగినయట్టి - ఈ మహాసముద్రమున విలీనులుకండు. మాతృగ్రంథకర్త యివ్విధముగ మిమ్ముల నాదేశింపుచున్నాడు.

పరమప్రియు డఱుదెంచినాడు. ఆయన దక్షిణహస్తమునం దాయన నామధేయపు సురక్షిత దివ్యమదిర యున్నది. ఆయన నాశ్రయించి, పూర్ణముగ తన వంతును సేవించి, “ఓ భగవచ్ఛిహ్నముల దివ్యావిష్కర్తా! నీకు ప్రస్తుతి,” యని యుద్వేగమున పలుకు మానవుడు సంతోషాత్ముడు. సర్వశక్తి మంతుని ధార్మికత్వముపై యాన! సత్యశక్తిచే ప్రతి నిగూఢాంశమూ ప్రదర్శితమైనది. భగవంతుని సర్వవదాన్యతలూ, ఆయన కరుణకు ప్రతీకగా భువి కంపబడినవి. అమరజీవనజలములు సంపూర్ణముగా మానవుల కొసగబడినవి. పరమప్రియుని హస్తమునుండియే ప్రతి చషకమూ గ్రహియింపబడినది. చేరువ కండు, క్షణమాత్రమేని జాప్యము చేయవలదు.

భగవన్నిర్దేశానుసారముగ వైరాగ్యపు ఱెక్కలపై విహరించి, సమస్త సృష్ట్యావృతస్థానము నందు కొనిన వారు ధన్యులు. ఆయన దివ్యధర్మమునుండి తమను తప్పించుటయందున విద్వాంసుల వ్యర్ధభావన లేని, భౌమాతిధేయుల సమూహమేని విజయమును సాధింపజాలవు. ఓ జనులారా! ప్రపంచమును పరిత్యజించి, సకలనామాధీశుడైన భగవంతునికి చేరువయ్యెడువా డెవ్వడు, మీయందున? సకల సృజితముల నధిగమించు మదీయ నామధేయశక్తితో మానవార్జితాంశముల నావలకు త్రోసివేయు వానిని, గోచరాగోచరవిదుడగు భగవంతుడు, పాటింపుమని తన కాదేశించిన యంశములకు తన యావచ్ఛక్తి తోడను కట్టువడియుండు వానిని, ఎచట కనుగొనవలె? ఆయన యౌదార్య మవ్విధముగ మానవుల కనుగ్రహీతమైనది; నెరవేరిన దాయన నిరూపణము, శోభిల్లినది కారుణ్యక్షితిజమునం దాయన నిదర్శనము. ఆయనను విశ్వసించి, “ఓ సకల ప్రపంచముల పరమ ప్రియా! శ్లాఘితుడ వీవు, ఓ ప్రత్యవగాహనాన్విత హృదయాభీష్టమా! ప్రవృద్ధము నీ నామధేయ,”మని యెలుగెత్తి పల్కునాతడు సాధించుకొను బహూకృతి మహనీయము.

సకలదయాన్వితుడైన ఆయన, తాను సకలసృష్టిపైనను తన నామధేయశోభలను ప్రసరింపచేసి యున్నట్టి దివ్యస్థలికి వెడలుచూ, తన గృహమును వీడిన తరుణమున, యుగప్రాచీనునిజిహ్వ ప్రస్తావించిన పరమోన్నత పురస్కృతయుగ స్మరణమునకు మీ రాహ్వానితులైన యందులకు, ఓ బహా జనులారా, మహదానందమున సమ్మోదము నొందుడు. భగవంతుడు మాకు సాక్షి. మే మాదివ్యయుగ నిగూఢమర్మములను వెల్లడించియుండిన, సకలశక్తియుతుడూ, సర్వజ్ఞుడూ, సమస్తవివేకియూ అగు భగవంతునిచే పరిరక్షితులగువారు దక్క, భూస్వర్గవాసు లెల్లరును మూర్ఛిల్లి, మృతులై యుందురు.

భగవంతుని నిస్సంశయాస్పద నిదర్శనముల దివ్యావిష్కర్తయైన ఆయనపై, భగవద్వచనముల సమ్మోహనప్రభావ మెట్టిదనిన, ఇక సాగజాల దాయన దివ్యలేఖిని. మహోన్నతుడనూ, మహాశక్తియుతు డనూ, మహోత్కృష్టుడనూ, సర్వజ్ఞుడనూ నగు నేను దక్క అన్యదైవము లేడను వాక్కులతో ఆయన తన దివ్యఫలకమును ముగియింపుచున్నాడు.

XV

“ఈ దివ్యయుగమున సామ్రాజ్యము భగవంతునిదే!”యని దివ్యావిష్కరణలేఖిని యుద్ఘోషింపు చున్నది. “సకలసార్వభౌమత్వము వాస్తవమున కీదివ్యయుగమున భగవంతునితోనే యున్న,” దని శక్తియుతజిహ్వ ప్రకటింపుచున్నది. “సకలఘనతరవైభవ మప్రమేయుడునూ, సర్వప్రేరకుడునూ అయిన భగవంతునికే చెందు,” నని యూర్ధ్ధ్వధామముల అమరవిహంగము, నిత్యత్వ తరుశాఖనుండి యాలపింపుచున్నది. “సర్వౌదార్యభాండ మీనాడు యేకైకుడునూ, క్షమాశీలియునూ అగు భగవంతుని నుండి జనియించిన,” దని దివ్య మార్మికకపోతము తన శాశ్వతస్వర్గసంస్థిత మహోల్లాస లతానికుంజము నుండి ప్రకటింపుచున్నది. “ఈ దివ్యయుగమున పరమాధిక్యత తుల్యరహితుడునూ, అసమానుడునూ, మహాశక్తిమంతుడునూ, సకలవిజేతయునూ అగు భగవంతునికి దక్క యింకెవ్వరికినీ వర్తింప,”దని భద్రాసనవిహంగము తన పవిత్రస్థావరముల నుండి మధురస్వనముతో గానము సేయుచున్నది. “ఈ దివ్యయుగమున క్షమాసమస్త మెల్లయు, సకలజనుల సర్వోన్నతసంరక్షకుడునూ, వారి దోషములను గోప్యపరచువాడునూ అయిన, ఎవ్వనితోడను బోల్పరాని, యెవ్వడును సమానుడు కాజాలని – భగవంతునినుండి యనుగ్రహీత మగుచున్న,” దను నిదర్శనమును సకలాంశముల యంతర్గతసారము - సకల వస్తువుల యందునను ధ్వనియింపుచున్నది. “భగవంతుడు నాకు సాక్షి! అనంత కాలప్రాచీనుడు మాహాత్మ్య, శక్తిసమన్వితుడై యరుదెంచినాడు. సమస్తకీర్తియుతుడునూ, సర్వశక్తుడునూ, సర్వోన్నతుడునూ, సర్వవివేకియూ, సర్వవ్యాపియూ, సర్వద్రష్టయూ, సర్వజ్ఞుడునూ, సర్వోత్తమ సంరక్షకుడునూ, శాశ్వతశోభామూలమునూ అగు ఆయన దక్క వేరు దైవము లే,”డని నా శిరముపైనుండి దివ్యవైభవసారము తన స్వరమునెత్తి లేఖినియైనను, జిహ్వయైనను యేరీతిగనూ వర్ణింప జాలనంతటి సమున్నతశిఖరముల నుండి యుద్ఘోషింపుచున్నది.

అంతర్దృష్ట్యానుగ్రహీతులైన కొందరు దక్క , అందరును భగవంతునినుండి విడిపోయినయట్టి దివ్యయుగమున, ఆయన హృదయోల్లాసము నాశించి ఆయన వాత్సల్యము నంటిపెట్టుకొనియున్న ఓ నా సేవకుడా! నేత్రముల కంధత్వము సంప్రాప్తించిన యీ దివ్యయుగమున నీవు తన నన్వేషించినందున, భగవంతుడు, తన యనుగ్రహముకొలది యౌదార్యాన్విత, అనశ్వర, శాశ్వత బహూకృతి నొక్క దానిని ప్రతిఫలముగ నీ కనుగ్రహించు గాక. దైవనిర్ణయానుసారముగ, ఈర్ష్యాసూయాగ్రస్తుల హస్తముల యందున, మాపై కురియింపవడిన వృష్టుల యందలి బిందువు నొక్కదానినైనను, నీకు వెల్లడించితిమేని అనంతవిషాదముతో దుఃఖింతువనియు, మా దుర్గతి కహోరాత్రములును విలపింతువనియు నెఱుగుము. ఆహా, భగవత్సార్వభౌమత్వమునూ, తదధికారౌన్నత్యమునూ ప్రకటింపగల, ఈ యావిష్కరణ వైచిత్య్రము లను గుఱుతింపగల వివేకియూ, నిష్పాక్షికుడూ అగువా డగుపింపడే. అట్టి మానవుడు - కేవలము భగవంతుని నిమిత్త ముద్యమించి, దైవవశమున ప్రజలు సంప్రేరితులై, దోషాచరణులచే తీవ్రముగ వేధింపవడిన యట్టి యీ దూషితునికి తోడ్పడునటుల, ఏకాంతముగను, బహిరంగముగను జనులను ప్రబోధించునా!

నీ వదనముపై తన దృష్టిని కేంద్రీకరించిన వాని హృదయము విషణ్ణము గాకుండుటకై, నీ విషయమును మార్చివైచి, నీ స్వరమును పరివర్తిత మెునరింపుమనుచు పవిత్రాత్మ దివ్యవాణి నా వెనుక నుండి పిలుపునిచ్చుట నాకు వినవచ్చిన యట్లనిపింపుచున్నది. వచించు: భగవంతుని యనుగ్రహమున, ఆయన శక్తివలన, గతమున యెవ్వని సాహాయ్యమునూ నే నాశింపలేదు, భావియం దెవ్వరి తోడ్పాటునూ కోరబోవను. ఈరాకులో నా బహిష్కరణ సమయమున, సత్యశక్తితో, నాకు తోడ్పడిన దాయనయే. భూప్రజలు నాతో కలహించు తరుణమున తన రక్షణతో న న్నాచ్ఛాదించిన దాయనయే. నగరమునుండి నిర్గమించుటకు నన్ను సమర్ధుని గావించిన దాయనయే; తిరస్కారియో, విద్వేషియో దక్క ప్రతియెుక్కడూ అంగీకరింప గలుగునంతటి మాహాత్మ్యాంబరధారిని గావించిన దాయనయే.

వచించు: భగవంతునియెడ నా విశ్వాసమే నా సేన; ఆయనయందున నా విశ్వాసశక్తియే నా ప్రజ. నా ప్రేమయే నా ధ్వజము, సకలసార్వభౌమాధిపతియూ, మహాశక్తిశాలియూ, సకలవైభవోపేతుడూ, అనియంత్రితుడూ అగు భగవంతుని స్మరణము నా సహచరుడు.

భగవత్ప్రేమపథమందలి ఓ బాటసారీ! ఆయన దివ్యధర్మమునకు సాహాయ్య మెునరించుట కుద్యమింపుము. వచించు: ఓ జనులారా, ఈ దివ్య తరుణుని యీ ప్రాపంచిక భోగములకో, స్వర్గసౌఖ్యములకో, వినిమయ మెునరింపవలదు. నిజైకదైవ ధార్మికత్వముపై యాన! భువిపైనున్న సకలమునకన్ననూ, స్వర్గములయందలి సమస్తమునకన్ననూ ఆయన శిరోజమెుక్కటి మిన్న. ఓ మానవులారా, మీరొందియున్న సువర్ణ, రజతముల నిమిత్త మాయనను దూరము గావించుకొను ప్రలోభమునకు లోనగుదురేమో, జాగరూకులు కండు. ఆయనదక్క వేరెద్దియూ మీకు లబ్ధిని చేకూర్పని దివ్యయుగమున, ప్రతి స్తంభమూ ప్రకంపించు దివ్యయుగమున, మానవచర్మములే వైదొలగుచుండ సకలనేత్రములూ భీతితో వీక్షించునపుడు, ఆయన వాత్సల్యమునే మీ యాత్మలకు ఐశ్వర్యాగారము కానిండు. వచించు: ఓ ప్రజలారా! భగవంతునియెడ భీతి నొందుడు. అలక్ష్యముతో, ఆయన దివ్యావిష్కరణమునకు విముఖులు కావలదు. నిజవదనములతో భగవంతుని మ్రోలన ప్రణమిల్లి, దివారాత్రము లాయనను సంకీర్తింపుడు.

ప్రపంచపు మూలకేంద్రమున జ్వలియించు యీ నిత్యాగ్నిజ్వాలతో, నీవు నీ యాత్మ నెంతగా ప్రజ్జ్వలిత మొనరింపవలెననిన, దాని యుధృతి నుపశమింప చేయుటకు విశ్వజలము లశక్తములు కావలె. ఇక, దైవవశమున, మా సేవకుల యందలి లక్ష్యహీనులు, నీ వాక్కులచే ప్రబోధితులు కావలెననియూ, ధార్మిక హృదయములు రంజిల్లవలెననియూ నీ ప్రభుని స్మరియింపుము.

XVI

వచించు: ఓ మానవులారా! అసమాన దివ్యయుగమిది; అటులే, సకలజాతుల దివ్యాభీష్టవై భవమును కీర్తించు జిహ్వయూ, ఆయన దృష్టియం దంగీకృతము కానెంచు కార్యమూ అప్రతిమానములే. దైవవశమున, తన స్థానమునకు సుయోగ్యమగు దానిని నెరవేర్పవచ్చుననియును, తన గమ్యమున కర్హత నొందవచ్చుననియును ఈ దివ్యయుగమునకై సమస్త మానవజాతియూ ఆకాంక్షించినది. సకలవిషయ వల్లభుడగు ఆయనను గుఱుతించుటనుండి, ప్రాపంచిక వ్యవహారములు ఎవని దృష్టి నవరోధించుట యందున వైఫల్యమునొందినవో, అట్టి మనుజుడు ధన్యుడు.

మానవహృదయ మెంతగా జడత్వము నొందినదనిన, దాని స్తబ్ధతను - నగరవిధ్వంసముగానీ, పర్వతము పిండియగుటగానీ, ధరాతలము బీటలు వారుట గానీ విదళింపజాలకున్నవి. పవిత్రరచనల యందలి సూచితము లన్నియు వివరింపబడినవి, తత్ప్రస్తావిత సంకేతము లావిష్కృతములైనవి, ప్రవక్తృత్వవాణి యింకనూ అవిచ్ఛిన్నముగా వెలువరింపబడుచునే యున్నది. అయినను, భగవంతుడు మార్గదర్శనము గావింప నిచ్చగించినవారు దక్క, ఎల్లరును తమ యుపేక్షామైకమున విభ్రాంతులైతిరే!

అనుదిన మెుక నూతనవిపత్తుతో యీ ప్రపంచమెటుల వేధింపబడు చున్నదో తిలకింపుము. దాని క్లేశము తీవ్రతరమగుచున్నది. సురే-ఇ-రాయీస్ యావిష్కృతమైన క్షణమునుండి నేటివరకును, ప్రపంచము శాంతినొందనూ లేదు, తత్ప్రజాహృదయములకు సాంత్వనమునూ లేదు. ఒక తరుణమునం దది - స్పర్ధావివాదకల్లోలితయైనది, ఇంకొక తఱి - సమరములతో విలవిలలాడి, దీర్ఘవ్యాధి పీడిత యైనది. ఔషధమును ప్రయోగింపనివ్వక దివ్యవైద్యుడు నిరోధితు డైనందునను, అయోగ్యచికిత్సకులు పక్షపాతపూరిత యుపకృతులనొంది, స్వేచ్ఛా వ్యవహరణమునకు పూర్ణస్వతంత్రత నొందిన హేతువు నను, దాని రుగ్మత పూర్తి నిరాశాన్వితదశ నొందుచున్నది. . . . విద్రోహధూళి మనుజుల మానసముల నాచ్ఛాదించినది, వారి నేత్రములను కప్పివైచినది. భగవంతుని దివ్యయుగమున తమ హస్తము లొనరించినదాని పర్యవసానమును వా రచిరకాలమునకే గ్రహియింతురు. మహాధిపతియును, సర్వశక్తిమంతుడును నగు ఆయన నిర్దేశించినటుల, సర్వవిదుడు మిమ్ముల నివ్విధముగ హెచ్చరింపుచున్నాడు.

XVII

మహాప్రకటనమగు ఆయనపై యాన! సునిశ్చిత సార్వభౌమాధికారా లంకృతుడై సకల దయాన్వితు డరుదెంచినాడు. దివ్యతుల నియుక్తమైనది, భువియందున వసియించువారెల్లరును సమీకృతులైనారు. కాహళ పూరింపవడినది; అదిగో, భీతితో సమస్తనేత్రములూ వీక్షించినవి, భగవత్ప్రవచనముల యుచ్ఛ్వాసము సచేతన మెునరించినవారూ, సమస్తవస్తుజాలమునుండి తమను విముక్తుల నొనరించుకొనిన వారూ దక్క, భువియందునను, స్వర్గముల యందునను యున్నవా రెల్లరును కంపించినారు.

ధరణి తన సమాచారమును వెల్లడించు దివ్యయుగమిది. మీరు గ్రహియించితిరేని, ఆమెకు భారము దుర్వర్తనులే. వ్యర్ధభావనా చంద్రగోళము ఛిద్రితయైనది, ఆకస మటుపై విస్పష్టధూమమును వెలువరించి నది. సర్వశక్తిమంతుడును, మహాబలయుతుడును నగు నీ ప్రభునియెడ భయభ్రాంతులై యెుదిగిన జనులను మే మవలోకింపుచున్నాము. దివ్యప్రవాచకు డెలుగెత్తి ఘోషింప, మానవులు చీల్చివేయ బడినారు, అంతటి యుధృతముగా నుండిన దాయన క్రోధావేశము. వామహస్తప్రజ నిట్టూర్చుచు, రోదింపుచున్నది. దక్షిణహస్తజను లుదాత్తసదనముల యందున వసియింపుచున్నారు: సకల కరుణాన్వితుని హస్తములనుండి సాక్షాత్‌ దివ్యజీవన్మధువునే సేవింపుచూ, వారు నిక్కముగా మహదానందభరితులై యున్నారు.

భూమి ప్రకంపితమైనది, గిరు లంతరించినవి, దేవదూతలు మా యెదుట శ్రేణులు దీరినారు. ప్రజలయం దనేకులు తమ మైకమున కలవరమునొంది, వదనములపై క్రోధచ్ఛాయలను దాల్చినారు. అవ్విధముగ, మేము దుష్కర్ములను సమీకరించినాము. వారు తమ ప్రతిమదెసకు పరువిడుట నవలోకింపుచున్నాము. వచించు: ఈ దివ్యయుగమున దైవవిధినుండి యెవ్వడును తప్పించుకొనజాలడు. నిశ్చయముగా, వేదనాభరిత దివ్యయుగమిది. వారికి, తమను పెడత్రోవ బట్టించిన వారిని చూపుచున్నాము. వారు తమ కగుపింపుచున్నను, వారు గుఱుతింపరు. వారి కన్నులు మత్తిల్లినవి; నిక్కముగ వా రంధులే. వారొనరించిన దూషణలే వారి నిదర్శనములు; ఆపత్సహాయకుడును, స్వయంజీవనుడును నగు భగవంతుడు వారి దూషణలను ఖండించినాడు. దుష్టాత్మ, కుటిలతను వారి హృదయముల యం దెగద్రోసినాడు, ఇక యెవ్వరును నివారింపజాలని చిత్రహింసకు గురియైనారు. దుష్కర్ముల పట్టికను గైకొని, నీచులదెసకు వారు పరువిడుచున్నారు. అటులున్నవి వారి కర్మములు.

వచించు: స్వర్గములు కలిపి మణిచివేయబడినవి, ధరణి ఆయన పిడికిలియం దున్నది, దుష్కర్ములు తమ ముంగురులచే బంధితులైనారు; అయిననూ వారు గ్రహియింపరు. వారు కలుషితజలమును సేవింతురు; అుుననూ, దానిని తెలిసికొనరు. వచించు: పెనుగర్జన వెలువడినది, జనులు తమ సమాధుల నుండి బయల్వెడలినారు; ఉత్తిష్ఠులగుచూ, తమ చుట్టునూ పరికింపుచున్నారు. కొందరు కరుణాన్వితు డగు భగవంతుని సన్నిధినొంద వేగిరపడ, మరికొందరు తమ వదనములను నరకాగ్నియందు పడవైచు కొనినారు. ఇంకనూ మరికొందరు దిగ్భ్రమలో పడిపోయినారు. భగవద్వచనము లావిష్కృతములైనవి, అయిననూ, వాటికి వారు విముఖులైనారు. ఆయన సత్యనిదర్శనము ప్రదర్శితమైననూ, వారు దాని నెఱుగరైరి. సకలకరుణాన్వితుని ముఖసీమను వీక్షించినపుడు, విలాసమున తేలియుండు వారి స్వీయ వదనములు వ్యాకులపాటు నొందినవి. నరకాగ్నిదెసకు వారు పరువిడి, దానిని దీపికయని పొరబడు దురు. అపేక్షగ వా రూహించునది, దైవదత్తము కాదు! వచించు: మీ రానందించిననూ లేక, ఆగ్రహోదగ్రులైననూ, స్వర్గములు విధ్వంసములైనవి, ప్రభాసమానసార్వభౌమత్వమున భగవంతు డధీకృతుడై భువి కరుదెంచినాడు. “సమస్త శక్తిసమన్వితుడును, సర్వజ్ఞుడును, సకలవివేకియును నగు భగవంతునిదే దివ్యసామ్రాజ్య,” మని సృజితవస్తు సంచయ మెల్లయు నినదించుట నాలింపనైనది.

అంతియేగాక, నాస్తికహస్తము లొనరించినదాని పర్యవసానముగా, మే మెుక దుర్భర కారాగారమున త్రోయబడి, క్రూరజనసందోహ పరివేష్టితులమైతిమని తెలియుము. అయినను, దివ్యతరుణు డనుభూతిచెందిన యాహ్లాద మెట్టి దనిన, ఐహికానందము నెద్దానినీ దానితో పోల్పనలవి కాదు. భగవంతునిపై యాన! బాధకుని హస్తములయం దాయన యనుభవించు హింస, ఆయన మానసము నెన్నడూ బాధింపదు, అంతియేకాదు, ఆయన సత్యమును తిరస్కరించిన వారి ప్రాబల్య మాయనను విచారగ్రస్తుని చేయనూజాలదు.

వచించు: విపత్తు నా దివ్యావిష్కరణమునకు దిగంతము. అనుగ్రహప్రభాత నక్షత్రము దానిపై భాసిల్లి, మానపుల శుష్కోహామేఘములైనను, దుష్టుని వ్యర్ధభావనలైనను ఆచ్ఛాదింపజాలనంతటి వెలుగును వెదజల్లును.

నీ ప్రభుని యడుగుజాడల ననుసరింపుము; ఆయన నిన్ను తన స్మృతి యం దుంచుకొనినటులే, అలక్ష్యుల యలజడిచేనైనను, శాత్రవఖడ్గముచేనైనను ప్రతిరోధితుడవు గాక, నీవు సైత మాయన భృత్యులను మదియందుంచు కొనుము . . . . నీ దేవదేవుని మధురసౌరభములను దేశాంతరముల యందున విస్తరిల్లజేయుము, ఆయన దివ్యధర్మసేవయం దిక క్షణమాత్రమేని వెనుదీయవలదు. నిత్యక్షమాశీలియూ, మహానుగ్రహమూర్తియూ అగు నీ ప్రభుని విజయము ఘోషితమగు సుదినము చేరువ యగుచున్నది.

XVIII

వచించు: మీ హృద్భూమి నుండి విజ్ఞతావగాహనము లనబడు లే బ్రాయపు టోషధులు మెులకెత్తవచ్చునని, మేము దివ్యవాగ్ఝరులను మా సింహాసనమునుండి ప్రవహింపజేసినాము. మీరు కృతజ్ఞులు కారా? తమ దేవదేవుని యారాధింప నుపేక్షించువారు, తిరస్కృతు లగుదురు. వారు తమకు మా సూక్తు లెప్పటికప్పుడు ప్రకటితములగుచున్నను, గర్వాహంకారులై, ధిక్కారవైఖరితో మెలగుచు, ఆయన శాసనములను పూర్ణముగ నుల్లంఘింపుచు, తదంశమును సైత మెఱుగరు. ఇక, ఆయనను విశ్వసింపని వారిని గురించి: వారు కాలధూమ చ్ఛాయన యుండవలె. వారు విలాసతన్మయులై యుండ, “మహాఘడియ” వారల కాసన్నమైనది. తమ ముంగురులతో వా రవరోధితులైనారు; అయినను, వారు దాని నెఱుగరు.

అరుదెంచవలసినది యాకస్మికముగ నరుదెంచినది; విలోకింపుడు, దాని నుండి వారెట్లు పరువిడుచుంటిరో! అనివార్యమైనది వాటిల్లినది; అవలోకింపుడు, దానిని వారెట్లు త్రోసిపుచ్చిరో! ప్రతి మనుజుడును తననుతాను త్యజియించుకొను దివ్యయుగమిది, ఆతడు యిక తనవారల నెంతగ పరిత్యజించునో నీవు గ్రహియింపక తప్పదు. వచించు: భగవంతునిపై యాన! కాహళధ్వానమును వెలువరింపనైనది; అదిగో, మానవాళి మా మ్రోలన మూర్ఛిల్లినది! మహాగ్రగామి యుద్ఘోషించినాడు, అటుపై దివ్యాహ్వానకుడు: “మహాశక్తిమంతుడును, ఆపత్సహాయకుడును, స్వయంజీవనుడును నగు భగవంతునిదే దివ్యసామ్రాజ్య,” మనుచు నుచ్చైస్వనమున తన గళము నెత్తినాడు.

సమస్త నేత్రములును భయాతిరేకముున తేఱిచూచునట్టి దివ్యయుగమిది; సర్వజ్ఞుడునూ, సకల వివేకియునూ అగు నీ ప్రభుడు విముక్తుల నొనరింప నిచ్చగించిన వారి హృదయములు దక్క భూమిపై వసియించువారి హృదయము లన్నియునూ ప్రకంపిల్లునట్టి దివ్యయుగమిది. దయాన్వితుడైన భగవంతుడు జ్యోతిర్మయహృదయము ననుగ్రహించియున్నవారివి దక్క , తక్కిన వదనము లన్నియునూ కాంతివిహీనములైనవి. సకలయశస్వియునూ, సమస్తసంకీర్తితుడునూ అగు భగవంతుని వదనమును వీక్షించుటకు బాహాటముగ తిరస్కరించిన వారి కన్నులు, మత్తిల్లియున్నవి.

వచించు: మీరు ఖురాను నధ్యయనము చేయలేదా? నిక్కముగా బుుజుపథ మాపవిత్రగ్రంథము; కనుక, దానిని పఠియింపుడు; దివ్యసత్యమును దైవవశమున గ్రహియింతురేమో. ధరణిపైనను, స్వర్గముల యందునను వసియించు వా రెల్లరకును భగవంతుని దివ్యపథమిదియే. మీరు ఖురాను నుపేక్షించి యుండిన, బయాను మీకు దూరమగునని యెంచదగదు. తిలకింపుడు, అది మీ కన్నుల యెదుట తెఱువబడి యున్నది. తత్సూక్తులను పఠియింపుడు, భగవంతుని దివ్యవార్తాహరుల విశోక విలాపములకు హేతువగు దానికి, బహుశః మీరు పాల్పడక పోవచ్చును.

మీ సమాధులనుండి వైళమ వెలికి రండు. ఎంతకాలము నిదురింతురు మీరు? ద్వితీయ కాహళ ధ్వానమును వెలువరింపనైనది. మీరు పాఱజూచుచున్న దెవరిని? ఈయన, కరుణాన్వితదైవమగు మీ ప్రభుడే. ఈయన సంకేతములను మీ రెటుల తిరస్కరింపుచుంటిరో విలోకింపుడు! మహాకంపనమున భువి ప్రకంపించి, తన భారములను దిగవిడిచినది. దీనిని మీ రంగీకరింపరా? వచించు: పర్వతము లున్నిపింజలవలె యెటులైనవో, భగవంతుని దివ్యధర్మపు భీషణ తేజమున జను లెంతటి మహాక్లేశము నొందిరో మీరు గుఱుతింపరా? వారి యావాసము లెంతటి శూన్యశిధిలములో, వా రెంతటి నిర్భాగ్య సమూహమో వీక్షింపుడు.

జ్ఞానమేఘములయందున సకలకరుణాన్వితుడు ప్రత్యక్ష సార్వభౌమత్వాంబరధారియై, భువి కరుదెంచిన దివ్యయుగమిది. మనుష్యకర్మము లాయనకు చక్కగా తెలియును. ఆయన సంశయాతీత యశస్వియని మీరు గ్రహిుుంపక తప్పదు. ప్రతి మతస్వర్గమూ భగ్నీకృతమైనది, మనుష్యావగాహనా ధరణి వ్రయ్యలైనది; అటుపై, దేవదూతల యవరోహణ మగుపించినది. వచించు: పరస్పరవంచనా ప్రపూరిత దివ్యయుగమిది; మీరు పాఱున దెటకు? పర్వతము లంతరించెననియూ, స్వర్గములు ముకుళీభవించినవనియూ, అవనీసమస్త మాయన హస్తగతమైనదనియూ మీరు గ్రహియింపక తప్పదు. మిమ్ము రక్షింపగల వా డెవ్వడు? సకలదయాన్వితుడైన ఆయనపై యాన; ఎవ్వడునూ లేడు! సర్వశక్తి మంతుడునూ, సకలవైభవాన్వితుడునూ, ప్రదాతయునూ అగు భగవంతుడు దక్క, ఇంకెవ్వడునూ లేడు. గర్భభారమున్న ప్రతి మహియూ, తన భారము నావల వైచినది. మనుజులును, దేవదూతలును సంఘటితులైనయట్టి యీ దివ్య యుగమున - మనుజులు మత్తిల్లియుండుటను మే మవలోకింపు చున్నాము.

వచించు: భగవంతుని గురించిన సందియ మేదేని యున్నదా? అధికార పరివృతుడై, సార్వభౌమాధికార సమలంకృతుడై, ఆయన యెవ్విధముగ తన యనుగ్రహ స్వర్గమునుండి భువిపై యవతరించెనో వీక్షింపుడు. ఆయన సంకేతములపై సందియ మేదేని కలదా? మీ నేత్రములను తెఱచి, ఆయన ప్రత్యక్షనిదర్శనమును పరికింపుడు. స్వర్గము మీ దక్షిణహస్తము దెసన యున్నది, అది మీ దరికి చేర్చబడినది; వేరొకవైపున, నరకము దగ్ధము గావింపవడినది. క్రమ్ముకు వచ్చుచున్న తదగ్నిజ్వాల నవలోకింపుడు. మీపట్ల మా కారుణ్యమునకు ప్రతీకగా, స్వర్గప్రవేశమునకు త్వరనొంది, సకలదయాన్వితుని హస్తములనుండి, యథార్థ జీవన దివ్యమధువును సేవింపుడు.

ఓ బహాజనులారా, పరిపూర్ణోత్సాహమున సేవింపుడు. నిక్కముగా, దానితో శుభము నొందు వారలు మీరే. భగవత్సామీప్యత నందినవారొందినది యిదియే. దయాన్విత దైవమైన మీ ప్రభునినుండి పరిహారముగా, ఖురానుననూ, అటుపై బయాన్‌ననూ, మీకు వాగ్దత్తమైన ప్రావాహిక జలమిది. దీనిని గ్రోలినవారు ధన్యులు.

నా వదనమున కభిముఖుడవైన ఓ నా భృత్యుడా! సకలవైభవాన్వితుడునూ, సర్వవిదుడునూ అగు నీ ప్రభుని కాలమునాటి ప్రజలకు జ్ఞప్తిని జేతువని, ఈ దివ్యకారాగారమున, ఈ దివ్యఫలకమును నీకై యంపినందులకు భగవంతునికి ధన్యవాదముల నర్పింపుము. అవ్విధముగ మేము, నీకై మా వివేక వాగ్జలములతో విశ్వాసమూలముల నేర్పరచినాము. నిక్కముగ, నీ ప్రభుని సింహాసనము ప్రతిష్ఠితమైన జలమిది. “నీరములపై నెలకొనిన దాయన సింహాసనము.” దీనిని నీ మానసమున పర్యాలోచించినచో, తదర్ధమును నీవు గ్రహియింపవచ్చును. వచించు: సకలలోకాధీశుడగు భగవంతునికి ప్రస్తుతి.

XIX

దైహికాస్తిత్వము, ఆరోహణావరోహణములు, ప్రవేశనిష్ర్కమణములు వంటి మానవ లక్షణము లన్నింటికన్ననూ అతీతముగా దుర్ర్గాహ్యదివ్యసత్త్వమూ, దివ్యమూర్తియూ అగు భగవంతుడు సర్వసమున్నతుడని విజ్ఞతాయుతమును, జ్యోతిర్మయమును నగు ప్రతి హృదయమునకును సువిశదమే. మనుష్యజిహ్వ ఆయన ప్రస్తుతి నెంతయుక్తముగా అభివర్ణించిననూ, ఆయన యనంతమర్మమును మానవ హృదయమెంతగా యెఱిగియుండిననూ, ఆయన యశోవిభవమునకు అది సత్యదూరమే. ఆయన తన దివ్యతత్త్వపు ప్రాచీన నిత్యత్వమునం దాచ్ఛాదితునిగనే యుండినాడు, ఉన్నాడు, తన దివ్యవాస్తవికత యందున మనుష్యదృష్టికి నిత్యనిక్షిప్తునిగ సంస్థితుడై యుండును. “ఏ దృష్టియూ ఆయన నేమార్పజాలదు, కాని యావద్దృష్టినీ ఆయన యేమార్చును; ఆయన సూక్ష్మజ్ఞుడు, సర్వజ్ఞుడు.”. . .

దివ్యయుగప్రాచీనుని జ్ఞానద్వార మవ్విధముగ సర్వప్రాణుల దృష్టికీ మూయవడి యుండుట వలన, అనంతానుగ్రహ మూలమూర్తి, “సమస్తవస్తువులనూ ఆయన యనుగ్రహ మధిగమించినది; వాటి నెల్లయూ, నా యనుగ్రహ మావరించిన,” దను తన వాక్కు ననుసరించి, ఆత్మలోకమునుండి పావన శోభాన్విత దివ్యరత్నములను - వారు నిర్వికారుని మర్మములను ప్రపంచమున కెఱుక పరచగలరని, తన యనశ్వర దివ్యసత్త్వసూక్ష్మతలను వర్ణింపగలరని - అవతరింప చేసి, మనుష్యదేహాలయపు టుత్కృష్ట రూపమున సమస్తమానవులకూ దృగ్గోచర మొనరించినాడు.

ఈ పవిత్రీకృత దివ్యదర్పణములూ, ఈ ప్రాచీనవైభవ ప్రత్యూషముల యందలి ప్రతియొక్కరూ, విశ్వమునకు కేంద్రబిందువునూ, తన్మూలసత్త్వమునూ, తత్పరమావధియునూ అగు ఆయనకు భువిపై దివ్యవ్యాఖ్యాతలు. ఆయననుండి వారి జ్ఞానాధికారము లుద్భవిల్లును; వారి యాధిపత్య మాయన నుండి యుత్పన్న మగును. వారి వదనసౌందర్యము ఆయన మూర్తిమత్వపరావర్తనము, వారి దివ్యావిష్కరణము - ఆయన యమరవైభవప్రతీక దక్క వేరొండు కాదు. వారు దివ్యజ్ఞానకోశములు, అలౌకిక విజ్ఞతా భాండములు. అనంతకారుణ్యము వారి ద్వారా పరివ్యాప్తమైనది, ఎన్నటికినీ తేజోవిహీనము కాజాలని దివ్యద్యుతి వారిచే యుత్పాదితమైనది. . . . ఈ పవిత్రతా పటవేశ్మములు, శాశ్వతయశోదీప్తిని ప్రతిఫలించు ఈ ప్రాథమ్యదర్పణములు అగోచరులకే యగోచరుడగు ఆయన వ్యక్తీకరణములు దక్క, అన్యములు కాపు. ఈ దివ్యలక్షణరత్నముల యావిష్కరణమున భగవంతుని సకలనామములునూ, విజ్ఞానాధికారములు, సార్వభౌమత్వ సామ్రాజ్యములు, కారుణ్యవివేకములు, వైభవము, వదాన్యత, అనుగ్రహము వంటి దైవలక్షణములునూ అభివ్యక్తీకృతములైనవి.

ఈ దైవలక్షణము లెన్నడును, విశేషించి, కొందరు దివ్యప్రవక్తలకే యనుగ్రహీతములును కావు; ఇతరుల కవరోధితములును కావు. అంతియేకాదు, భగవంతుని సమస్తప్రవక్తలునూ, ఆయన యనుగ్రహ పాత్రులునూ, ఆయన నియుక్త దివ్యవార్తావహులునూ - ఆయన నామధేయధారులే, ఆయన లక్షణస్వరూపులే. వారి యావిష్కరణోధృతిపరముగను, జ్యోతిఃసామర్ధ్యమునను మాత్రమే, తులనాత్మకముగ, వారియందున వ్యత్యాస ముండును. ఆయన సైతము వెల్లడించిన యటుల, “ధర్మదూతల యందలి కొందరి నన్యులకన్ననూ సమున్నతులను గావించినాము.”

కావున, భగవంతుని దివ్యప్రవక్తల, నియుక్త దివ్యమూర్తుల పటవేశ్మముల యందున, ఆయన యనంతనామముల, మహోదాత్త లక్షణముల దీప్తి - వీటి యందలి కొన్నింటి ద్యుతి, ఆయా జ్యోతిర్మయ దేహాలయములనుండి మనుష్యనేత్రములకు బాహాటముగా అగుపించును, అగుపింపకున్నను - ప్రతిఫలీకృతమైన దనునది వాస్తవము, విస్పష్టము. అయినను, ఈ వైరాగ్యదివ్యసారములచే ఏ దైవలక్షణమైనను బాహాటముగా అభివ్యక్తీకృతము కాకపోవుట యనునది, దైవలక్షణప్రభాతములకునూ, ఆయన పవిత్రనామభాండారములకునూ వాస్తవమున కది లేదని యెవ్విధముగనూ సూచింపజాలదు. కావున, బాహ్యముగా భౌమమహత్తు పూర్ణముగా లేనివారివలె యగుపించిననూ, ఈ జ్యోతిఃస్వరూపులు, ఈ దివ్యసుందరవదనులు, ఎల్లరూ - సార్వభౌమత్వము, సామ్రాజ్యమువంటి సమస్తదైవలక్షణములతో ననుగ్రహీతులే. . . .

XX

అగోచరుడు తన దివ్యసత్త్వము నెవ్విధముగను అవతరింపచేయ జాలడనియు, మానవులకు దానిని వెల్లడింపడనియు నిక్కముగా యెఱుగుము. వర్ణనమునకేని, అవగాహనమునకేని సాధ్యమగు సమస్తమునకన్నను నిత్యమహోదాత్తు డాయన. “నిక్కముగా, నేనే భగవంతుడను. సర్వవిదుడను, సకలవివేకిని యగు నేనువినా వేరొండు దైవము లేడు. మానవులకు ప్రత్యక్షీకృతుడనై, నా దివ్యావిష్కరణ చిహ్నప్రభాతమైన ఆయనను భువి కంపినాడను. అతులితుడును, సర్వజ్ఞుడును, సకలవివేకియును నగు ఆయన దక్క వేరు దైవము లే డని సకల సృష్టిచేతను నిరూపిత మెునరించితి,” నని ఆయన వాణి ఆయన యశోలోకము నుండి, సదా యుద్ఘోషిత మగుచున్నది. మానవనేత్రములకు నిత్యనిగూఢుడైన ఆయనను, భగవంతుని దివ్యావతారమూలమున దక్క, ఎన్నడును యెఱుగ నలవికాదు; ఆయన దివ్యావతారము తన దివ్యలక్ష్యసత్యమునకు - స్వస్వరూపమునకన్నను బృహన్నిదర్శనమును చూపజాలడు.

XXI

ఓ సల్మాన్‌! ప్రాచీనాస్తిత్వ జ్ఞానద్వారము మనుష్యదృష్టికి యింత వరకూ మూయబడియే యున్నది, ఎన్నటికినీ మూయబడియేయుండును. ఏ మానవమేధయూ, ఆయన పవిత్రాస్థానప్రవేశము నొంద జాలదు. అయిననూ, ఆయన తన కారుణ్యచిహ్నముగా, తన వాత్సల్యప్రతీకగా, మానవులకు తన దివ్యపథనిర్దేశక దినకరులను, తన దివ్యైక్యతాచిహ్నములను ప్రత్యక్షీకరించి, ఆ పవిత్రమూర్తుల పరిజ్ఞానము తన స్వీయజ్ఞానసదృశమై యుండవలెనని నిర్దేశించినాడు. వారిని గుఱుతించు నాతడు భగవంతుని గుఱుతించినాడు. వారి పిలుపు నాలించు నాతడు, భగవద్వాణి నాలకించినాడు, వారి దివ్యావిష్కరణ సత్యమునకు సాక్ష్యమును వహియించు నాతడు, సాక్షాత్తూ భగవంతుని సత్యమునకు సాక్షీభూతుడు. వారియెడ విముఖతను వహియించు నాతడు, భగవంతునికి విముఖుడు; ఇక వారి యందున విశ్వాసము నుంచనివాడు, భగవంతుని యందుననూ విశ్వాసమునుంచలేదు. వారి యందలి ప్రతి యెుక్కరును, ఊర్ధ్వలోకములతో యీ ప్రపంచము ననుసంధానించు భగవంతుని దివ్యపథమే, భూలోక, స్వర్లోక సామ్రాజ్యవాసులయందలి ప్రతియెుక్కరికిని, ఆయన దివ్యసత్యధ్వజమే. వారు మానవులయందున, భగవంతుని దివ్యావతారములు; ఆయన దివ్యసత్య ప్రతీకలు; ఆయన యశోచిహ్నములు.

XXII

భగవంతుని దివ్యవిశ్వాసధరు లొక నవీన ధర్మప్రబోధకులుగా, నవ్య సందేశావిష్కర్తలుగా ప్రపంచజనులకు సాక్షాత్కృతులైనారు. ఈ స్వర్గసింహాసన దివ్యవిహంగములన్నియూ దైవేచ్ఛాస్వర్గము నుండి భువి కంపబడినను, ఆయన యప్రతిహత దివ్యధర్మమును ప్రకటించుటకూ వా రెల్లరునూ ఉద్యుక్తులగుటచే, వారల నొకే యాత్మగా, ఒకే మూర్తిగా గణియింపనైనది. ఏలయన, వారెల్లరునూ ఒకే భగవద్వాత్సల్యకలశమునుండి సేవన మొనరింతురు; ఒకే దివ్యైక్యతావృక్ష ఫలభాగస్వామ్యము నొందుదురు.

ఈ భగవదవతారములు ప్రతి ఒక్కరికీ - ద్వివిధస్థానములు గలవు. ఒకటి - పరిపూర్ణ పరిత్యాగ, ప్రధానైక్యతా సంబంధిత స్థాయి. ఈ విషయమున, వారల నొకే నామమున సంబోధించి, ఒకే విధమగు లక్షణములను వారల కాపాదించితివేని, సత్యమునకు నీవు దూరుడవు కావు. ఆయన సైతము వెల్లడించి నటుల: “మే మాయన దివ్యవార్తావహులయం దెట్టి యంతరమును యేర్పరుపము.” ఏలయన, వారు ప్రతియెుక్కరునూ, భగవదైక్యత నంగీకరింపుడని సమస్త భూప్రజలనూ ఆమంత్రించి, అనంతకారుణ్య వదాన్యతల కవ్థార్‌ను వారల కనుగ్రహింతురు. వారెల్లరును ప్రవక్తృత్వాంబరగ్రహీతలు, యశోవస్త్ర సమ్మానితులు. ఖురాను మూలబిందువైన మహమ్మదు, “సమస్త ప్రవక్తలును నేనే,” యని వెల్లడించినాడు. అటులే, “తొలి ఆదామును, నోవా ను , మోషేను, యేసును నేనే,” ననియు ఆయన యనుచున్నాడు. ఇమామ్‌ ఆలీ సైతము, ఇట్టి ప్రకటనలను గావించియున్నాడు. ఆ దివ్యైక్యతాప్రబోధకుల సునిశ్చితైక్యతను సూచించు యీ పారమార్ధిక సుభాషితములు భగవంతుని దివ్యోచ్చారణా మాధ్యమముల నుండియూ, దివ్యజ్ఞానరత్నభాండారముల నుండియూ జనియించినవై, దివ్యగ్రంథముల యందున లిఖియింపనైనవి. ఈ దివ్యవదనములు భగవంతుని యాజ్ఞాగ్రహీతలు; ఆయన దివ్యావిష్కరణప్రభాతములు. ఈ దివ్యావిష్కరణము అవగుంఠనా బాహుళ్యమునకునూ, సంఖ్యావశ్యకతలకునూ అతీతమైనది. “మా దివ్యధర్మ మెుక్కటియే,” ననుచున్నా డాయన. దివ్యధర్మ మెుక్కటియే కనుక, తత్ర్పబోధకులు సైత మెుక్కటియే కావలె. అవ్విధముగనే, మహమ్మదీయ దివ్యధర్మపు ఇమామ్‌లు, ఆ నిర్ధారణ దీపికలు: “మహమ్మదు మాకాద్యము, మహమ్మదు మాకంత్యము, మహమ్మదు మాకంతయు,” ననినారు.

సమస్త ప్రవక్తలూ - భిన్నాహార్యాలంకృతులై యవతరించిన దివ్యధర్మ దేవళములనునది నీకు సుస్పష్టము, సువిదితము. విచక్షణాయుత నేత్రములతో పరికింతువేని, వారెల్లరును ఒకే పటవేశ్మమున యధివసింపుచు, ఒకే స్వర్గమున విహరింపుచు, ఒకే సింహాసనాసీనులై, ఒకే ప్రసంగమును గావింపుచు, ఒకే దివ్య ధర్మము నుద్ఘోషింపుచుండుట నవలోకింతువు. ఆ దివ్యాస్తిత్వసత్త్వముల, ఆ యనంత, అమేయ వైభవతేజోమూర్తుల యేకత్వమట్టిది! కావున, యీ పవిత్రావతారములయం దేయెుక్కరేని, “ నేను సకలప్రవక్తల పునరాగమనము,” నని యుద్ఘోషించినచో, ఆయన, నిక్కముగా సత్యమునే వచియింపు చున్నాడు. అవ్విధముగనే, ప్రతి యనంతర దివ్యావిష్కరణమునను, పూర్వదివ్యావిష్కరణ పునరావృతి యనునది, సత్యనిరూపిత యథార్థము. . . .

వేరొకటి విశిష్టస్థాయి; సృజితప్రపంచమునకును, తత్పరిమితులకును సంబంధించినది. ఈ విషయమున ప్రతి దివ్యావతారమునకును విలక్షణ వ్యక్తిత్వమును, నిర్దిష్టసూచిత కార్యమును, పూర్వనిర్దేశితావిష్కరణమును, విశేష నియుక్త పరిమితులును కలపు. వారియందలి ప్రతియెుక్కరును ఒక్కొక్క విశిష్ట నామవ్యవహృతులు, విశేషలక్షణవర్ణితులు, నిర్దిష్టలక్ష్యనిర్వాహకులు; వారి యధీనమున విశిష్ట దివ్యావిష్కరణ మెుక్కదాని నుంచనైనది. స్వయముగా, ఆయనయే నుడివినటుల, “ధర్మదూతల యందలి కొందరిని యితరులకన్నను సమున్నతుల నొనరించినాము. భగవంతుడు కొందరితో భాషించి, కొందరి నుద్ధరించి, యుదాత్తుల నొనరించినాడు. మేరీసుతుడైన యేసునకు మేము ప్రత్యక్షచిహ్నముల నొసంగి, ఆయనను పవిత్రాత్మతో సశక్తీకరించినాము.”

ఈ దివ్యజ్ఞానస్రవంతులయొక్క స్థానముల, కార్యములయందలి వ్యత్యాస కారణమున, వారినుండి వెలువడు వాక్కులును, భాషణలును వైవిధ్య, వైరుధ్య భరితములై యగుపించును. దివ్యవివేకమర్మముల లోనికి దృష్టిని సారించినవారి కన్నులకు వారి భాషణలన్నియును - వాస్తవమునకు ఒకే దివ్యసత్యపు టభివ్యక్తీ కరణములు. మేము ప్రస్తావించిన ఆ స్థానముల నవగత మెునరించుకొనుటలో జనులయం దనేకులు విఫలురగుటచే, దివ్యావతారము లుద్ఘోషించిన వైవిధ్య భరితవాణులకు—వాస్తవమున కవి యెుక్కటే అయినను—వారు విభ్రాంతి నొంది, విస్మితులైనారు.

ఈ భాషణాసంబంధిత వైరుధ్యము లన్నియునూ, స్థాయీభేదములకే ఆపాదితములు కావలె ననునది సర్వదా సువిదితమే. ఆ విధముగా, దివ్యజీవ సారము లొకే దివ్యావిష్కరణ సింహాసనస్థితులై, దివ్యనిగూఢతాసనమున యుప విష్టులైనందున, వారి యేకత్వ, పూర్ణవైరాగ్యముల దృక్కోణమునుండి పరికించిన యపుడు, పరమాత్మ లక్షణములైన దివ్యత్వము, మహైక్యత, అంతఃతత్త్వములు వారల కనువర్తితములైనవి, అగుచున్నవి. వారి యావిర్భావముతో, భగవంతుని దివ్యావిష్కరణ మభివ్యక్తీకృత మైనది, వారి ముఖసీమల ద్వారా భగవంతుని దివ్యసౌందర్యము ప్రత్యక్షీకృతమైనది. ఆ విధముగా, ఈ దివ్యాస్తిత్వావతారములు సాక్షాత్తూ భగవంతుని మహోక్తులనే యుద్ఘాటింపగ నాలింపనైనది.

తమ ద్వితీయస్థాయి—వైవిధ్యతలతో, వైరుధ్యతలతో, భౌతికపరిమితులతో, స్వభావములతో, ప్రమాణములతో కూడిన స్థాయి—దృష్ట్యా పరికించినపుడు వారు సంపూర్ణ సేవానిరతిని, దుర్భర దారిద్య్రమును, సంపూర్ణ ఆత్మపరిత్యాగమును ప్రదర్శింతురు. ఆయనయే యనుచున్నాడు, “నేను భగవ త్సేవకుడను, మీవలె వట్టి మానవుడను,” అని. . . .

భగవంతుని యీ సర్వావృత దివ్యావతారములయం దెవ్వరేని: “నేను దేవుడ,” నని ప్రకటించి యుండిన, ఆయన నిశ్చయముగా సత్యమునే పల్కుచున్నాడు; అందుల కెట్టి సందియమును లేదు. ఏలయన, భగవంతుని దివ్యావిష్కరణమును, ఆయన నామములును, ఆయన లక్షణములును వారి దివ్యా విష్కరణము, లక్షణముల, నామముల ద్వారా - లోకమునకు పదేపదే ప్రత్యక్షీకృతములైనవి. “ఆ ప్రభలు భగవంతునివి, నీవి కా,” వని వెల్లడించినా డాయన. అంతియేగాక, ఆయన “వాస్తవమునకు నీయెడ తమ స్వామిభక్తి నభివ్యక్త మెునరించిన వారు, నిక్కముగా, భగవంతునియెడ తమ స్వామిభక్తిని వెల్లడించి,” రనుచున్నాడు. అటులే, వారియం దెవ్వరేని: “నేను భగవత్సందేశవహుడ,” నని ప్రకటించి నచో, ఆయనయు సత్యమును, సునిశ్చితసత్యమును పల్కినట్లే. ఆయన యనినటుల: “మహమ్మదు మీయం దెవ్వరికినీ తండ్రి కాడు; అయితే, ఆయన భగవత్సందేశవహుడు.” ఈ దృక్కోణమున పరికించిన యపుడు వారెల్లరునూ, ఆ నిర్వికారసారమూ, ఆ ఆదర్శరాజన్యుడూ అయిన ఆయన దూతలే. వా రెల్లరునూ “నేను ప్రవక్తల ముద్ర,” నని ప్రకటించియుండిరేని, నిశ్చయముగ, నిజమును దక్క వా రన్యమును వచియించిరను ఛాయామాత్రపు టనుమానమునకైనను అవకాశము లే దనవలె; ఏలయన, వా రెల్లరునూ ఒకే మూర్తియు, ఒకే ఆత్మయు, ఒకే స్ఫూర్తియు, ఒకే అస్తిత్వమును, ఒకే ఆవిష్కరణయును. వారెల్లరునూ - భావముల కంతర్భావమును, సత్త్వముల యనంత సత్త్వమునునైన ఆయన “మెుదలు” నకును, “తుది”కిని, “ఆద్యము”నకును, “అంత్యము” నకును, “దృశ్యము”నకును, “అదృశ్యము,” నకును ప్రత్యక్షీకరణలే. మరి, “మేము భగవత్సేవకుల,”మని వారు చెప్పనెంచిరేని, అదియును ప్రస్ఫుట నిర్వివాదసత్యమే. ఏలయన, వారు - బహుశః, ఏ మానవుడూ అందజాలనంతటి సంపూర్ణసేవానిరతి యందున ప్రత్యక్షీకృతులైనారు. ఆ విధముగా, ఈ యస్తిత్వసత్త్వములు, తాము - ప్రాచీన శాశ్వతపవిత్ర సాగరముల యట్టడుగునకు లోతుగా వెడలియుండిన క్షణముల యందుననో, దివ్యమర్మముల మహోన్నత శిఖరాగ్రముల నధిరోహించిన యపుడో - తమ ప్రవచనములను దివ్యత్వవాణి యనియు, సాక్షాద్భగవంతుని యామంత్రణమనియు నుద్ఘోషించినారు.

జ్ఞాననేత్రము వివృతి గావింపబడుచో, అది – వా రీదశయందే, సర్వవ్యాపియును, నిష్కళంకుడును నగు ఆయన యెదుట తమను పరిపూర్ణముగ నప్రధానులుగను, అస్తిత్వరహితులుగను గణియించుకొని రని యెఱుగగలదు. ఆ దివ్యసాన్నిధ్యమున వారు తమను పరమశూన్యులుగను, తమ ప్రస్తావనమును దైవద్రోహకార్యముగను భావించి రనుకొందును. ఏలయన, అట్టి పావన న్యాయస్థానమున లేశమాత్రపు స్వీయప్రస్తావనము ఆత్మనిశ్చయమునకూ, స్వతంత్రజీవనమునకూ నిదర్శనము. అట్టి సూచనయూ, ఆ దివ్యసన్నిధానము నొందినవారల దృష్టియందున ఘోరాతిక్రమణమే. మరి, ఆ దివ్యసమక్షమున వేరొండు ప్రస్తావన మొనరింపవలసి వచ్చెనేని - మానవుని హృదయమూ, జిహ్వయూ, మనస్సూ, ఆత్మయూ పరమప్రియునితోగాక, అన్యునితో ననుసంధానితము లయ్యెనేని, ఆతడి నేత్రములు భగవత్సౌందర్యమును గాక అన్యవదనము నవలోకించెనేని, ఆతడి శ్రవస్సు భగవద్వాణినిగాక యితరము నాలించెనేని, ఆయన దివ్యపథమునుగాక, వేరొండుమార్గము నాతడి పదము లనుసరించెనేని, అది యిం కెంతటి ఘోరతరమగునో. . . .

ఈ స్థాయీ విశిష్టతదృష్ట్యా తమది దివ్యత్వవాణియని వా రుద్ఘోషించినారు; ఆ విధముగనే, తమ సందేశవాహకస్థాయి వలన, వారు తమను భగవంతుని దివ్యదూతలుగా ప్రకటించుకొనినారు. ప్రతి సమయమునను, సందర్భావశ్యకతల కనుగుణముగా, వా రొక ప్రవచనమును వెల్లడించినారు; దివ్యావిష్కరణలోకము నుండి సృష్టిలోకము వరకును, దివ్యత్వసామ్రాజ్యము నుండి భౌతికాస్తిత్వ సామ్రాజ్యము వరకు విస్తరిల్లిన ప్రకటన లన్నింటినీ తమవిగనే వా రభివర్ణించినారు. ఆ విధముగా దివ్యత్వము, ప్రభుత, ప్రవక్తృత్వ, వార్తావహత, ధర్మసంరక్షణ, ధర్మదౌత్య, సేవానిరతి సామ్రాజ్య సంబంధితమైన సమస్తమునను, వారి ప్రవచన మేదియైనను, అంతయూ - సంశయాతీత సత్యమే. కావున, అగోచరుని దివ్యావతారముల, దివ్యత్వప్రభాతముల విభిన్నప్రవచనములు ఆత్మను కలవరపరచి, మనస్సును విభ్రాంతికి గురిచేయకుండుటకై, మా వాదమునకు సమర్ధనగా మేము ప్రస్తావించిన యీ దివ్యప్రవచనములపై శ్రద్ధగా పర్యాలోచింపవలె.

XXIII

పూర్వతరములను తలపోయుము. దివ్యానుగ్రహాదిత్యుడు తన యావిష్కరణప్రభను ప్రపంచముపై ప్రసరింపచేసిన ప్రతి పర్యాయమును, ఆయన సమకాలీనజను లాయన కెవ్విధముగ వ్యతిరిక్తులై యుద్యమించి, ఆయన సత్యమును తిరస్కరించిరో విలోకింపుము. మానవనేతలుగ గణుతింపబడిన వారు, తమ అనుయాయులను భగవంతుని యనంతానుగ్రహసముద్రుడైన ఆయన నాశ్రయింపకుండ ప్రతిరోధించుటకు నిర్విరామముగ యత్నించినారు.

భగవన్మిత్రుడైన అబ్రహామును - ఆయన కాలమునాటి మతాధిపతుల తీర్పు పర్యవసానముగ, ప్రజ లెవ్విధముగ అగ్నియందున పడవైచిరో; సర్వశక్తునితో సంభాషించిన మోషేని - అసత్యవాదిగను, అపవాదిగను యెటు లాక్షేపించిరో వీక్షింపుము. దైవాత్మయగు యేసుపట్ల - ఆయన సంపూర్ణసౌమ్యతా సహృదయతలను గణియింపక, ఆయన శత్రువులు యేవిధముగా వర్తించిరో వీక్షింపుము! అస్తిత్వసత్త్వమును, దృశ్యాదృశ్యప్రభుడును నగు ఆయన యెదుర్కొనవలసివచ్చిన ప్రాతికూల్యత యెంతటి దారుణమైన దనిన, తలదాచుకొన తావైన లేకపోయిన దాయనకు. స్థిరనివాసరహితుడై యెుక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు నిర్విరామముగ సంచరించినా డాయన. ప్రవక్తల ముద్రయగు మహమ్మదు —ఆన్యులెల్లరి జీవితమూ ఆయన కర్పితమగు గాక—నకు వాటిల్లిన వానిని పరికింపుము. ఏకేశ్వరత్వమును, ఆయన సందేశజ్యోతిని యుద్ఘోషించిన ఫలితముగ, యూదునేతలును, విగ్రహారాధకు లును, సమస్త సార్వభౌమాధిపతియైన ఆయనపై వర్షిల్ల జేసిన విపత్తులు యెంతటి ఘోరతరములు! నా దివ్యధర్మ ధార్మికత్వముపై యాన! భగవంతుని దివ్యయెుడంబడిక నతిక్రమించి, ఆయన శాసనము నుల్లంఘించి, ఆయన నిరూపణములను తిరస్కరించి, ఆయన చిహ్నములను త్రోసిపుచ్చిన వారి హస్తములయం దాయన యనుభవించిన వ్యధల ఫలితముగా, నా దివ్యలేఖిని రోదింపుచున్నది, సకలసృజితములును శోకాతిరేకతప్తము లగుచున్నవి. గతకాలమున సంభవిల్లిన దానిని దైవవశమున గ్రహియింతువేమోయని, తద్గాథ నిటుల నీకు వర్ణింపుచున్నారము.

భగవంతుని దివ్యప్రవక్తలును, ఆయన సందేశవాహకులును, ఆయన ప్రాథమ్యులును యెంత దారుణముగ హింసితులైతిరో నీ వెఱుగుదువు. అట్టి దారుణహింసకు మూలములైన లక్ష్యమును, హేతువును గురించి కొంత తడవు యోచింపుము. భగవంతుని దివ్యప్రవక్తలు యే కాలములోనూ, ఏ ధార్మిక యుగములోనూ, ఎన్నడునూ తమ విరోధుల దైవద్రోహము నుండియు, తమ పీడకుల క్రౌర్యము నుండియు, ఉదాత్తత, భక్తి యనెడి వేషమును ధరియించిన తమ సమకాలిక విద్వాంసుల యధిక్షేపణముల నుండియు తప్పించుకొని యుండలేదు. ఆయన వైభవము ప్రకీర్తితమగుగాక, నిజైకదైవ జ్ఞానము దక్క యెవ్వడును, ఎన్నడును వర్ణింపజాలని వ్యధల నహోరాత్రములు తరబడి వా రనుభవించినారు.

ఈ దూషితుని గురించి యోచింపుము. ప్రస్ఫుటనిదర్శనములు తన దివ్యధర్మసత్యమును ధృవీకరింపుచున్నను; దోషరహితభాషయందున తాను వెలువరించిన భవిష్యవాణులు నెరవేర్పబడినను; విజ్ఞులయందున తాను పరిగణింపబడకున్నను, విద్యాభ్యాసమును తా నొనరింపకున్నను, నాటి మతాధి పతుల వివాదములయందున తా ననుభవరహితుడైనను, తన యపార భగవత్ప్రేరిత జ్ఞానమును ఆయన మానవులపై వర్షించినాడు; అయిననూ, ఆయన యధికారమును యీ తర మెట్లు తిరస్కరించి, ఎదిరించి నదో వీక్షింపుము! తన జీవితమందలి యధికాంశ మాయన, తన శాత్రవుల కబంధహస్తముల యందున క్రూరముగా హింసితుడైనాడు. తన బాధకులు దురన్యాయపూర్వకముగ తనను పడవైచిన యీ దుర్భర కారాగారమునం దిపు డాయన బాధలు పరాకాష్ఠ నందినవి. ఇప్పటికి నీకు ఘటిల్లినవాటినీ, ఘటిల్లుచున్న వాటినీ సునిశిత దృష్టితో జ్యోతిర్మయ హృదయముతో నీవు పరికించుటనూ, నీ మనమున వాటిని యోచించుటనూ, అటులనే, మానవు లెందరో యీ దివ్యయుగమున గ్రహియింప విఫలురైన దానిని గుఱుతించుటనూ భగవంతు డనుగ్రహించును. నీవు ఆయన దివ్యయుగ సుమధుర సుగంధముల నాఘ్రాణించుచు, ఆయన యవధిరహిత కారుణ్యఝరులయందున భాగము నొందుచు, ఈ యుగమున ప్రాచీనరాజన్యుని నామమున యుప్పొంగు మహోత్కృష్ట సాగరమునుండి - ఆయన దయానుగ్రహముతో - సంతుష్టిగ గ్రోలుచు, ఆయన దివ్యధర్మమున శైలమువలె సుస్థిరుడవై, అచంచలుడవై నిలుచునటు లొనరించుటకై భగవంతుని సమ్మోదింప జేయుము.

వచించు: శక్తిసమన్వితమగు నీ యావిష్కరణాబాహుళ్యము మ్రోల పావను లెల్లరిచేతనూ తమ నిస్సహాయత నంగీకరింపజేసిన, నీ శాశ్వత వైభవప్రభయెడ ప్రతి దివ్యప్రవక్తచేతనూ తన యభావత్వమును స్వీకరింపజేసిన నీకు ప్రశస్తి. నన్ను యీ దివ్యయుగమున నిన్ను సేవించుకొన జేయుమని, నీ దివ్యగ్రంథమున నీవు నిర్దేశించినదాని ననుసరించుటకు నన్ను శక్తుని గావింపుమని - స్వర్గద్వారములను తెఱచి యూర్ధ్ధ్వలోకదివ్యగణమును మహదానందాన్విత నొనరించిన నీ నామ ధేయము పేరిట నిన్నర్థింతును. ఓ నా ప్రభూ, నాయందలి దానిని నీ వెఱుగుదువు; కాని, నీయం దున్నదేమో నేనెఱుగను. నీవు సర్వజ్ఞుడవు, సకలవిదుడవు.

XXIV

భగవంతుని యేకేశ్వరత్వ విశ్వాసులారా! ఆయన దివ్యధర్మావతారముల మధ్యన వ్యత్యాసము నారోపించుటకో, వారి దివ్యావిష్కరణము ననుసరించి, అభివ్యక్తములైన చిహ్నములయెడ వివక్షను చూపుటకో సంప్రేరితులగుదురేమో జాగ్రత్త. మీరు యీ సత్యమును గ్రహియించి, విశ్వసించినవారేని, దివ్యైక్యతా పరమార్ధము వాస్తవమున కిదియే. అంతియేగాక, భగవంతుని యీ దివ్యావతారముల యందలి ప్రతియెుక్కరి సమస్త కార్యకలాపములును - వారికి చెందినది యేదైనను, మున్ముందు వారు ప్రదర్శించునది యేదైనను - దైవనిర్దేశితములేననియూ, ఆయన దివ్యేచ్ఛా పరమలక్ష్యముల యభివ్యక్తీకరణమనియూ దృఢముగా విశ్వసింపుడు. వారి వ్యక్తిత్వముల, వారి వాక్కుల, వారి సందేశముల, వారి కలాపముల, వారి విధానములయందున లేశమాత్ర విభేదమునేని కల్పించిన వాడు, నిక్కముగా భగవంతుని యెడ విశ్వాసహీనుడైనాడు; ఆయన చిహ్నములను తిరస్కరించి, ఆయన దివ్యసందేశవాహకుల ధర్మమునకు ద్రోహ మెునరించినాడు.

XXV

భగవంతుని దివ్యావతారము జీవించిన ప్రతి యుగమూ దైవనిర్దేశితమే యనునది సుస్పష్టము; దాని నొక విధముగా, భగవన్నిర్దేశిత దివ్యయుగమని యభివర్ణింపవచ్చును. అయిననూ, విలక్షణ మీదివ్యయుగము; తన పూర్వయుగములకన్ననూ, ఇది వైశిష్ట్యత నొందవలసియున్నది. “ప్రవక్తల ముద్రా,” స్థానము, తన యుత్కృష్టస్థాయిని సంపూర్ణముగా ప్రదర్శించును. నిక్కముగా, ప్రవక్తృత్వపుటావృత్త మిక పరిపూర్ణత నొందినది. అనంతసత్యము యిప్పుడరుదెంచినది. ఆయన అధికారధ్వజమును యెత్తి, ప్రపంచముపై తన దివ్యావిష్కరణ పూర్ణప్రభాసము నిపుడు ప్రసరింపజేయుచున్నాడు.

XXVI

సర్వసమన్వితుడును, అసదృశ వైభవరాజన్యుడును నగు భగవంతునికి సకలసృజిత ప్రాణుల జ్ఞానమున కతీతమూ, మానవమేధల యవగాహన కతీతమహోన్నతమూ నగు ప్రస్తుతి. ఆయన ప్రస్తుతిని ఆయన దక్క యింకెవ్వడునూ, ఎన్నడునూ, సముచితరీతిన గావించియూ యుండలేదు, ఆయన వైభవమును పూర్ణస్థాయియం దభివర్ణించుటయం దేమనుజుడూ, ఏ కాలముననూ విజయము నొందనూ బోవడు. ఆయన మహోన్నత తత్త్వశిఖరముల నందితినని యెవడు చాటగలడు, ఆయన దుర్ర్గాహ్యమర్మపు లోతుల నేమేధస్సు కొలువగలదు? ఊహాతీత వైభవపు పవిత్ర, నిత్యనిదర్శనములు - ఆయన వైభవ మూలమునుండి జనియించిన ప్రతి యావిష్కరణమునుండియూ గోచరమైనవి; శాశ్వతప్రభా సముద్రములు ఆయన అజేయశక్తి వ్యక్తీకరణముల యందలి ప్రతిదానినుండియూ ఉప్పొంగినవి. ఆయన పరమాద్భుత శక్తిసమన్విత సార్వభౌమత్వ ప్రమాణము లెంతటి మహోదాత్తములు! వాటి మినుకొక్కటి - స్పర్శామాత్రముననే - భూ, స్వర్గస్థిత సమస్తమునూ సంపూర్ణముగ నాహరించును. ఆయన పరిపూర్ణశక్తి నిదర్శనము లెంతటి వర్ణనాతీత మహోన్నతములనిన, వాటి సంకేతమెుక్కటి - అది యప్రధానమైనదే యైనను - జ్ఞానమును—అది, అనాదిగా అస్తిత్వము లోనికి తేబడినదైనను, అంత్యరహితాంతము వరకు సృజియింపబడునదైనను—అధిగమింపవలసినదే. ఆయన దివ్య నామధేయముల స్వరూపులెల్లరునూ, ఆయన దివ్యసత్త్వ సంశోధనాతృష్ణతో, ఉత్సుకతతో అన్వేష ణారణ్యమున సంచరింతురు; అంతియేకాదు, తన వైచిత్ర్యమును వెల్లడిసేయుమని, పవిత్రతా సైనాయి నుండి, సమస్త దివ్యలక్షణావతారమూర్తులూ ఆయన నభ్యర్ధింతురు.

ఉప్పొంగుచున్న ఆయన యనంతకారుణ్యాంబుధి బిందు వొక్కటి సమస్తసృష్టినీ అస్తిత్వ భూషణముతో అలంకరించినది; ఆయన యతులిత స్వర్గము నుండి వీచిన సమీర మెుక్కటి సర్వప్రాణు లకూ ఆయన పవిత్రతావైభవముల యంబరమును ప్రసాదించినది; ఆయన సార్వభౌమత్వ సమస్తా వృత యిచ్ఛాసంద్రపు టగాధాంతరమందలి తుంపర యొక్కటి, అనంతస్థాయీ సమన్వితమూ, అమరజీవన సంయుతమూ అయిన సృష్టిని పూర్ణశూన్యమునుండి యస్తిత్వములోనికి గొనివచ్చినది. ఆయన వదాన్యతాద్భుతము లెన్నటికినీ స్తంభింపవు, ఆయన కారుణ్యానుగ్రహస్రవంతి ప్రతిరోధిత మెన్నటికినీ కానేరదు. ఆద్యంతరహిత మాయన సృష్టిప్రక్రియ.

స్వర్గములయందునను, భూమిపైనను తన దివ్యయశోచిహ్నములను ప్రతిఫలించునది యేదియును తన యనుగ్రహఝరులను కోల్పోవరాదని, తన యనుగ్రహప్రవాహముల యెడ నిస్పృహులు కారాదని, ప్రతి యుగమునను, శకమునను, తన మహాద్భుత దివ్యతత్త్వావతార ప్రసారిత ప్రస్ఫురశోభతో సమస్త వస్తువులనూ పునఃసృష్టించినా డాయన. ఎంతటి సర్వవ్యాపితము లాయన అపారానుగ్రహ వైచిత్ర్యములు! సమస్తసృష్టినీ, అవి యెటులావరించినవో వీక్షింపుము. వాటి లక్షణ మెట్టిదనిన, ఈ సమస్తవిశ్వముననూ ఆయన శక్తినిదర్శనములను ప్రకటింపని, ఆయన పవిత్రనామమును కీర్తింపని, ఆయన మహోజ్జ్వల యేకత్వజ్యోతి నభివ్యక్తము సేయని యణు వొక్కటేని యగుపింపదు. భగవంతుని సృష్టి యెంత సర్వసమగ్రమూ, ఎంతటి విస్తారమూ అనిన, ఎంతటి సునిశితమేధస్సైననూ, స్వచ్ఛ మానసమైననూ, ఆయన ప్రాణులయం దత్యల్పమైనదాని స్వభావము నెన్నటికీ యెఱుగజాలదు. ఇక సత్యభానుడూ, అగోచరమూ, అజ్ఞాతసారమూ అయిన ఆయన మర్మపులోతుల నది యసలే అందుకొనజాలదు. మర్మజ్ఞశ్రేష్ఠుని భావములూ, మనుజులయందలి సిద్ధసాధ్యుని సాధనలూ, మానుషజిహ్వయేని, లేఖిని యేని గావింపగల మహోన్నత ప్రశంసయూ—అన్నియునూ మానవుని పరిమిత మేధా జనితములే, మేధోపరిధి నియంత్రితములే. “నీ వెన్నటికినీ నన్ను వీక్షింప వల,”దను ఆయన తీవ్రస్వరమునకు మోషే సన్నిభులైన సందేశవహులు పదివేవురు తమ యన్వేషణా సైనాయిపై నివ్వెరపడి నిలచినారు; వేరొకవంకన, “నీవు నా దివ్యసత్త్వము నెన్నటికినీ గ్రహియింప,” వను కఠోరశాసనమున, యేసువంటి మహాదూతలు సహస్రాధికులు తమ పవిత్రాసనములపై నిశ్చేష్టత నొందినారు. స్మృత్యతీత కాలమునుండియూ, ఆయన తన స్వీయౌన్నత్యపు టనిర్వచనీయ పావనతయం దావృతుడై యుండినాడు; తన యభేద్య అజ్ఞాతసారమున శాశ్వతముగ నాచ్ఛాదితునిగనే యుండును. ఆయన దుర్లభతత్త్వజ్ఞాన లబ్ధికై యొనరించిన ప్రతి యత్నమూ పూర్ణదిగ్ర్భమతోడనే ముగిసినది; అటులే, ఆయన మహనీయమూర్తిని చేరి, ఆయన దివ్యసత్త్వము నూహించుట కొనరించిన ప్రతి యత్నమూ నైరాశ్యము గనూ, వైఫల్యముగనూ పరిణమించినది.

నేను అల్పుడనగుటచే, నాకు నీ జ్ఞానపు పావనాగాధములను కనుగొను యత్న మెంతటి దిగ్ర్భమాన్వితము! నీ కరకృతి—నీ సృజనాత్మక శక్త్యావిష్కరణము—యం దంతర్లీనమైన శక్త్యాధిక్యతను సంవీక్షించుటకు నే గావించిన యత్నము లెంతటి నిరర్ధకములు! తన శక్తినే గ్రహియింప జాలని నా నేత్రము నీ సత్త్వము నెఱిగితినని యెట్లు చెప్పుకొనగలదు? స్వీయసామర్ధ్యముల ప్రాముఖ్యత నెఱుగజాలని నా మానసము నీ స్వభావమును గ్రహియించితినని యెటుల నటియింపగలదు? నీ వైచిత్ర్యమున సమస్తసృష్టియూ భ్రాంతి నొందియుండ, నిన్నెఱిగితినని యెవ్విధముగ నే ననగలను; విశ్వమెల్లయూ, నీ యస్తిత్వము నుద్ఘోషింపుచు నీ సత్యమునకు ప్రతీకయగుచుండ, నిన్నెఱిగి యుండ లేదని యెటుల నే నంగీకరింపగలను? నీ కారుణ్యద్వారము లనాదిగా వివృతములై యున్నవి, నీ సాన్నిధ్య సామీప్యతనొందు మార్గములు సకలసృజితములకును లభ్యత నొందింపవడినవి; మరి, సమస్త దృశ్యాదృశ్యప్రాణుల వాస్తవికతలపై నీ యసమాన దివ్యసౌందర్యావిష్కరణములు సదా ముద్రితములే. అయిననూ, ఈ మహానుగ్రహోపకృతి, ఇంతటి సమగ్ర, సంపూర్ణవితరణ యుండినను, నీ పావన వైభవాన్విత సన్నిధానము నీ విజ్ఞానమునకు దక్క, సమస్త జ్ఞానశేషమున కన్నను సమున్నత మనియూ, నీ సాన్నిధ్యమర్మము నీకు దక్క ప్రతి మేధస్సునకును ప్రచ్ఛన్నమే ననియూ నిరూపణ సేయుట కుద్యుక్తుడ నైతిని. నీవు దక్క అన్యు డెవ్వడునూ, నీ స్వభావమర్మమును కనుగొనజాలడు; అటులే, నీ సమస్తావృత దివ్యసత్త్వము దక్క, సంశోధనాతీతమగు నీ యస్తిత్వము నింకేదియూ గ్రహియింపజాలదు. తమ జీవిత కాలమంతయూ, నీ వియోగారణ్యమున సంచరించి, నిన్ను కనుగొనుట యందున తుదకు విఫలురైన మహనీయుల, యశస్వుల సంఖ్యాధిక్యత యెంతటి విస్తృతము! నీ వదనవీక్షణమునకై, అన్వేషణపు టెడారిలో త్రోవదప్పి, కళవళపడిన పవిత్రీకృత అమృతమూర్తుల సంచయ మెంటి మహత్తరము! నీ యెడబా టనబడు విదగ్ధాగ్నిజ్వాల వలన కృశించి, నశియించిన ప్రగాఢప్రేమికు లసంఖ్యాకులు; ఇక, నీ వదనశోభావీక్షణాభిలాషులై యిచ్ఛాపూర్వకముగా తమ ప్రాణముల నర్పించిన విధేయు లనేకులు. తపియించుచూ నిన్ననుసరింపుచున్న, ఈ పరితప్తహృదయుల దీర్ఘనిశ్వాసములునూ, మూల్గులునూ - ఎన్నటికీ - నీ పవిత్రసన్నిధానము నొందనూ జాలవు, నీ కట్టెదుట యగుపింపవలెనను తృష్ణ నొందియున్న యీ పథికుల విలాపములు నీ వైభవపీఠమును చేరనూ జాలవు.

XXVII

భగవంతుని యేకత్వమునకు సకలప్రస్తుతి; సంపూర్ణశూన్యమునుండి సకలాంశముల వాస్తవికతను సృజియించిన, అభావమునుండి తన సృష్టియందలి నిర్మలతమ, సూక్ష్మతర యంశముల నస్తిత్వములోనికి తెచ్చిన, తన ప్రాణుల దూరస్థతావమానమునుండియూ, తుదివినాశపు విపత్తుల నుండియూ రక్షింపుచు, తన పావన వైభవాన్వితరాజ్యములోనికి వారల నాహ్వానించిన సార్వభౌమా ధీశుడును, తుల్యరహితుడును, సకలయశోవిశ్వనాథుడును నగు ఆయనకు సమస్తమాన్యత! ఆయన సర్వావృతానుగ్రహమునకును, ఆయన సర్వవ్యాప్త దాక్షిణ్యములకును తీసిపోయిన దేదియూ, బహుశః, దీనిని సాధింపగలిగి యుండెడిది కాదు. లేనియెడల తన యస్తిత్వరహితస్థితినుండి యస్తిత్వప్రపంచము లోని కరుదెంచు యోగ్యతాదక్షతల నొందజాలుట, సంపూర్ణశూన్యత కెటుల సాధ్యమై యుండెడిది?

ఆయన ప్రపంచమునూ, అందు జీవించు, చరియించు సమస్తమునూ సృజియించినందున, తన నరసి, తనను ప్రేమింపగల యపూర్వవిశిష్టతను, సామర్ధ్యమును—సకలసృష్టికిని స్ఫూర్తిజనకముగ, సర్వప్రధానలక్ష్యముగ గణియించి తీరవలసిన సామర్ధ్యమును—తన యప్రతిహత, సార్వభౌమేచ్ఛా ప్రత్యక్ష ప్రయోగమూలకముగ మానవున కనుగ్రహింప నెంచినాడు. . . . ఆయన ప్రతి సృజితాంశపు టంతర్గత వాస్తవికతపైనను తన నామధేయములయం దొకదాని తేజమును ప్రసరింపచేసి, దానిని తన లక్షణములయం దొకదాని వైభవగ్రాహక మొనరించినాడు. కాగా, ఆయన తన సమస్తనామముల, లక్షణముల శోభను మానవుని యధివాస్తవికతపై ప్రసరింపజేసి, దానిని సాక్షాత్తూ తనకే దర్పణ మొనరించినాడు. మానవుడు మాత్రమే, సృజితాంశసమస్తమునుండి యంతటి మహోపకృతికీ, శాశ్వతానుగ్రహమునకూ పాత్రత నొందినాడు.

అయినను, దివ్యానుగ్రహభానుడూ, దివ్యలోకపథనిర్దేశనమూలమూ మానవుని వాస్తవికత కనుగ్రహించిన యీ శక్తులు - కొవ్వొత్తియందున జ్వాల నిక్షిప్తమై యున్నటుల, దివ్వెయందున కాంతిపుంజములు సహజముగ నెలకొని యున్నటుల - ఆతడియం దంతర్లీనములై యున్నవి. దర్పణము నాచ్ఛాదించు ధూళిచేతను, మకిలివలనను సూర్యప్రభ మఱుగునవడిన యటుల, ప్రాపంచిక వాంఛలచే యీ శక్తులశోభ మసకబార్పబడవచ్చును. కొవ్వొత్తియైనను, దివ్వె యైనను, తమ నిస్సహాయ ప్రయత్నములచే ప్రజ్జ్వలితములూ కాజాలవు, దర్పణమునకు తన మకిలిని తనకుతానై వదిలించుకొనుట యెన్నటికినీ సాధ్యమూ కాదు. అగ్ని ప్రజ్జ్వలితము కానిదే దివ్వె యెన్నటికీ వెలుగనేరదని, తన ముఖోపరితలము నుండి మకిలి తొలగింపు కానంతవరకు, అద్దము సూర్యబింబ ప్రదర్శనమునైనను, తద్వైభవ ప్రతిఫలనమునైనను గావింపజాల దనునది స్పష్టము, నిక్కము.

నిజైకదైవమును ఆయన సృష్టితో అనుసంధానింపగల ప్రత్యక్షబంధము ఉండజాలదు కనుకను; అనిత్యతకును, నిత్యునికిని, అనిశ్చితికిని, నిశ్చితునకును మధ్యన సాదృశ్య మేదియూ ఉండజాలదు కనుకను; భూ, స్వర్గ సామ్రాజ్యముల యందున ప్రతి యుగమునను, పాలనాకాలమునను - స్వచ్ఛమూ, నిష్కంకమూ అగు ఒక దివ్యాత్మ యవతరింపవలెనని ఆయన నిర్దేశించినాడు. ఆయన యీ సూక్ష్మజ్ఞునికి, ఈ మార్మికునికి, ఈ యలౌకికప్రాణికి స్వభావద్వయమును—విషయప్రపంచ సంబంధిత భౌతిక స్వభావమును, సాక్షాత్తూ భగవత్తత్త్వజనితమగు ఆధ్యాత్మిక స్వభావమును—అనుగ్రహించినాడు. ఇంకను, ద్వివిధస్థానము లాయన కనుగ్రహింపబడినవి. ఆయన అంతఃసత్యసంబంధిత ప్రథమస్థానము ఆయనను - సాక్షాత్తూ భగవద్వాణియే వాణియైన ఆయనగా సూచించును. “భగవంతునితో నా సంబంధము బహుముఖీనము, మర్మగర్భితము. నేను నేను, ఆయన ఆయన యనునది దక్క, ఆయనయే నేను, నేనే ఆయన,” నను సాంప్రదాయవచన మిందుకు నిదర్శనము. ఆ విధముగనే: “ఓ మహమ్మద్‌, ఉత్తిష్ఠుడపు కమ్ము, వీక్షింపు మదిగో, ప్రియుడును, పరమ ప్రియుడును నీ యందున విలీనమైనా,”రను వాక్కులును. అటులే: “వారు నీ సేవకు లనునది దక్క , నీకును, వారికిని యెట్టి వ్యత్యాసమును లే,” దనుచున్నా డాయన. ఇక: “నీ వలె నేనును మానవుడను.” “వచించు, నా ప్రభునకు ప్రస్తుతి! మానవున కన్నను నే నధికుడనా, ధర్మదూతనా?” యను సూక్తులతో సూచితమైన మనుష్యస్థానమే ద్వితీయ స్థానము.ఈ పరిత్యాగసత్త్వములును, ఈ సముజ్జ్వల సత్యములును భగవంతుని సర్వావృత దాక్షిణ్య ఝరులు. ఐహిక భారముల ధూళినుండియు, మకిలినుండియు, పరిమితులనుండియు ప్రతి వాంఛాన్విత హృదయమునూ, ప్రతి గ్రహణశీలాత్మనూ ప్రక్షాళన మెునరించుటకై యప్రతిహత మార్గదర్శన ప్రభానిర్దేశితులై, పరమోన్నత సార్వభౌమాధికారానుగ్రహీతులై తమ ప్రవచన స్థితమైన భగవత్ర్పేరిత జ్ఞానమునూ, తమ దోషరహితానుగ్రహ స్రవంతులనూ, తమ పావన దివ్యావిష్కరణావీచికనూ వినియోగించుటకు వారాజ్ఞాపితులైనారు. మనుష్యవాస్తవికత యందున గుప్తమైయున్న భగవద్విశ్వాస మప్పుడే, కేవలమప్పుడే - ప్రభవించు దివ్యావిష్కరణమండలమువలె, ప్రచ్ఛన్నతావగుంఠనము వెనుకనుండి వెలికివచ్చి, తన యావిష్కృత వైభవధ్వజపతాకను మానవహృదయ శిఖరములపై ప్రతిష్ఠింపవచ్చును.

సాక్షాత్‌ దివ్యత్వమే తానెయైన సమస్తసార్వభౌమత్వాధీశుని యనుగ్రహ పరివ్యాపనమున కొక దివ్యమాధ్యమముగా, దివ్యావతారముగా వర్తించు దివ్యసత్త్వ మెుక్కటి భూ స్వర్గ సామ్రాజ్యములయం దావిర్భవింపచేయబడవలె ననునది పూర్వోదాహృతపరిచ్ఛేదముల వలనను, పరోక్షప్రస్తావనముల వలనను సందేహాతీతముగా స్పష్టీకృతమైనది. ఈ దివ్యసత్యాదిత్యుని పవిత్రబోధనలతో ప్రతి మానవుడును, తన యంతర్గత నిజతత్త్వమున కనుగ్రహీతములైన సమస్త నిగూఢశక్తులనూ అభివ్యక్త మొనరించు స్థానమును తా నొందునంతవరకు పురోగమించి, పురోభివృద్ధి నొందగలడు. ఈ లక్ష్యసాధన నిమిత్తమే ప్రతి యుగముననూ, పాలనాకాలముననూ, భగవత్ర్పవక్తలూ, ఆయన యనుగ్రహపాత్రులూ మానవులయం దవతరించి, సాక్షాత్‌ భగవజ్జనితసన్నిభమైన యధికారమునూ, కేవల మనంతుడు మాత్రమే వీక్షింపజేయగల శౌర్యమునూ ప్రదర్శించినారు.

నిశ్చలచిత్తులయం దొక్కడు, తానర్ధము చేసికొనజాలని కొన్ని వాక్కుల దృష్ట్యా, భగవంతుని యనంతమార్గదర్శనద్వార మెన్నటికినీ మానవులకు మూయవడియే యుండునని, నిజమున కెన్నడేని యూహింపగలడా? ఈ దివ్యతేజోమూర్తుల, ఈ సముజ్జ్వలజ్యోతుల యాద్యంతముల నెన్నడేని యాత డాకళించు కొనగలడా? ఆయన సర్వవ్యాపిత కారుణ్యస్రవంతితో యే వఱదవెల్లువ సరిపోలగలదు, అంతటి మహత్తర సర్వవ్యాపిత కారుణ్యనిదర్శనముల నేయాశీస్సు అధిగమింపగలదు? ఆయన కరుణా కటాక్ష తరంగమును క్షణమాత్రమేని ప్రపంచమున కుపసంహరింపవలసి వచ్చెనేని, అది సంపూర్ణముగా అంతరించు ననుట కెట్టి సందియమూ లేదు. ఈ హేతువుననే దివ్యానుగ్రహద్వారము లనాదిగా సమస్త సృజితములకును సువిశాలముగ తెఱువబడి యున్నవి; ఇక, దివ్యసత్య మేఘములు మానవసామర్ధ్య, యథార్ధతా వ్యక్తిత్వముల యవనిపై, అంత్యరహితాంత్యము వరకు తమ యుపకృతులను, అనుగ్రహము లను వర్షింపుచునే యుండును. నిత్యతనుండి నిత్యతవరకు కొనసాగుచూ వచ్చిన దైవవిధాన మట్టిది.

XXVIII

నా దివ్యధర్మమును సేవించుట కుద్యమించి, నా మనోజ్ఞనామధేయమును సంకీర్తించు నాతడు సంతోషాత్ముడు. నా శౌర్యశక్తితో నా దివ్యగ్రంథమును చేబూని, నిర్దేశకుడూ, సకలవివేకీయగు నీ దేవదేవు డందున సూచించిన యే ఆదేశమునకైనను దృఢముగా నిబద్ధుడవు కమ్ము. ఓ మహమ్మద్‌, షియా ఇస్లాము అనుయాయుల మాటలును, చేతలును దాని తొలినాళ్ల యానందోత్సాహముల నెట్లు నిర్వీర్య మెునరించి, తత్ర్పభాస నవ్యతను వివర్ణ మొనరించినవో తిలకింపుము. దాని తొలి దినముల యందున, మానవాధీశుడైన తమ దివ్యప్రవక్త నామధేయమునకు సంబంధించిన నియమములను వారింకనూ పాటింపుచుండగా, వారి జీవితము నిత్యవిజయోత్సవ పరంపరతో విశిష్టత నొందినది. క్రమముగా, వారు తమ యాదర్శాధిపుని, విభుని పథము నుల్లంఘించి, భగవంతుని శోభకు విముఖులై, ఆయన దివ్యైక్యతా సిద్ధాంతము నపవిత్రమెునరించి, ఆయన దివ్యవాక్శక్తిని వెల్లడించు వారలపైననే అధికముగా తమ దృష్టిని కేంద్రీకరించినకొలదీ, వారి శక్తి యశక్తతగా, వారి కీర్తి యపకీర్తిగా, వారి ధైర్య మధైర్యముగా పరిణమించినవి. వా రెట్టి స్థితి కరుదెంచిరో తిలకింపుచున్నాడవు. దివ్యైక్యతాకేంద్రబిందు సదృశులమని వా రెటుల చాటుకొనిరో వీక్షింపుము. పునరుత్థానదినమున సత్యవాక్కును—సమున్నత మాయన వైభవము—గుఱుతింపనీయక, వారి దుష్కృత్యము లెట్లు వారల నవరోధించినవో పరికింపుము. ఇకపై, యీ జనులు, నిష్ఫలాశయముల నుండియూ, శుష్కవాంఛలనుండియూ ఆత్మరక్షణ మొనరించుకొని, దివ్యైక్యతాభావపు యథార్ధావగాహనము నొందుదురను ఆశాభావము మాకున్నది.

దివ్యావతారస్వరూపుడు సర్వదా భగవంతుని ప్రతినిధియే, భగవంతుని ప్రవాచకుడే. నిజమున కాయన, భగవంతుని మహోత్కృష్టబిరుదప్రభాతము, ఆయన మహోన్నతలక్షణోదయస్థానము. ఆయన కింకెవ్వరేని సరిసములుగా యేర్పరుపవడి, ఆయన మూర్తిమత్వసన్నిభులుగా గణియింపబడిరేని, ఇక భగవంతు డొక్కడే ననియూ, అసదృశుడనియూ, ఆయన దివ్యతత్త్వ మవిభాజ్య మనియూ, అసమాన మనియూ సమర్ధించుట యెట్లు? సత్యశక్తి మూలమున, మేము నీకావిష్కరించిన దానిని పర్యాలోచించి, తద్భావగ్రాహకులగు వారియం దొకడవు కమ్ము.

XXIX

మానవుని సృజియించుటయందున భగవంతుని యుద్దేశ్య మానాటికీ, యేనాటికైననూ ఆతడు తన దివ్యస్రష్ట నరసి, ఆయన పావనసాన్నిధ్యము నొందునటు లొనరించుటయే. ఈ మహోన్నతాశయమునకు, ఈ పరమలక్ష్యమునకు సమస్త దివ్యగ్రంథములును, దివ్యావిష్కృతములూ, ప్రాధాన్యతాయుతములూ అగు పవిత్ర లేఖనములును నిర్ద్వంద్వముగా, సాక్ష్యమును వహియింపుచున్నవి. దివ్యమార్గదర్శన ప్రభాతమును గుఱుతించి ఆయన పావన సభాంగణమున ప్రవేశించిన యాతడు భగవత్సామీప్యుడై, యథార్థముగా స్వర్గమే—సంకేతములు దక్క వేరొండుకాని సమున్నత సౌధాన్విత స్వర్గమది—యగు, ఆయన సాన్నిధ్యము నొందినాడు; అట్టి మానవుడు “రెండు ధనువుల దవ్వు” న యున్న సద్రతుల్‌ ముంతహాకు, ఆవల నిలచినయట్టి ఆయన స్థాయినందినాడు. ఆయనను గుఱుతించుట యందున వైఫల్యము నొందినవాడు దూరస్థతా—అనంత శూన్యమును, అధోలో కాగ్నితత్త్వమును దక్క వేరొండు కానట్టి యేకాంతమది—దురవస్థయందున తనను తాను పడవైచుకొనును. ఆతడు భువియందలి మహోన్నతస్థానముల నధిష్ఠించినటులను, దాని సమున్నతాసనములపై ప్రతిష్ఠితు డైనటులను పై కగుపించిననూ ఆతడి ప్రారబ్ధ మట్టిదియే యగును.

దివ్యసత్యప్రభాతమైన ఆయన - విధేయతాహీనులను, అట్టి యేకాంతము నుండి కాపాడుటకును, వారలను ఆయన సాన్నిధ్యసామీప్యుల నొనరించుటకును, ఆయన ప్రత్యక్షత నొందజేయుటకును సర్వసమర్ధుడనుటకు సందియము లేదు. “తా దలచియుండిన, భగవంతుడు జనులెల్లరను తప్పక యేకైకప్రజను గావించి యుండెడివాడు.” అయిననూ, పవిత్రాత్ములనూ, పరిత్యాగహృదయులనూ వారి సహజశక్తుల మూలమున, పరమోత్కృష్ట మహాంబుధి తీరముల దరి జేరునటు లొనరించినయెడల, సకలవైభవాన్వితుని సౌందర్యాన్వేషకులు - విధేయతాహీనులకన్నను, విపరీతబుద్ధులకన్నను - విలక్షణులునూ విశిష్టులునూ కావచ్చునని, ఆయన యుద్దేశ్యము. సకలవైభవసమన్విత, ప్రభాసమాన లేఖినిచే యివ్విధముగ నాదేశితమైనది. . . .

మానవుల యందున దివ్యన్యాయస్వరూపులును, స్వర్గౌదార్యప్రభాతములును అవతరించిన యపుడు, వారు సదా సమస్తభౌమసామ్రాజ్యపరిత్యాగులే, ప్రాపంచికాభ్యుదయసాధన తిరస్కారులే యను దానిని, దివ్యలక్ష్యప్రేరకమగు యీ వియోగ, విశిష్టతాసూత్రమునకే యనువర్తింపవలె. దివ్యనిత్యసత్త్వము తన యందలి నిక్షిప్తసర్వస్వమును ప్రదర్శించి, తన పూర్ణవైభవవిస్తృతితో భాసిల్లెనేని, ఆయన యధికారమును ప్రశ్నించు, ఆయన సత్యమును వ్యతిరేకించువా డెవ్వడునూ కానరాడు. అంతియేకాదు, ఆయన శోభానిదర్శనములవలన, సమస్త సృజితములును పూర్ణశూన్యగ్రస్తములైనటుల దిగ్ర్భమనొంది, అశనిపాతమునకు లోనగును. అట్టి పరిస్థితులయం దిక, దుర్జనులనుండి సజ్జనులను వేర్పచుట యెట్లు?

ఈ నియమము ప్రతి పూర్వదివ్యపాలనాకాలముననూ, అనుసరింపబడి, విస్తృతముగా నిరూపితమైనది. . . . ప్రతి యుగమునను, నవీన దివ్యావతార మావిర్భవించి, భగవంతుని మహనీయ శక్త్యావిష్కరణ మానవుల కనుగ్రహీతమైనపుడు, ఆయనను విశ్వసింపనివారు అసమాన శాశ్వతదివ్య సౌందర్యుని నశ్వర మానవరూపదర్శనమునకు భ్రమసి, ఆయనను గుఱుతించుటయందున వైఫల్యము నొందినది యీ హేతువుననే. వారు, ఆయన మార్గమును తప్పి—భగవత్సామీప్య సంకేతమైన—ఆయన సాహచర్యమును వర్జించినారు; విధేయ శ్రేణులయం దధికాంశము నంతమొందించి, ఆయనను విశ్వసించినవారలను నిర్మూలించుట కుద్యమించినారు.

ఈ దివ్యపాలనాకాలమున దైవశక్తిహస్తము ప్రజ్జ్వలిత మెునరించిన దివ్యజ్యోతిని నరమేధము, విధ్వంసము, బహిష్కరణమువంటి సాధనములతో నార్పివేయగలమనో, శాశ్వతవైభవాదిత్యుని ప్రచ్ఛాదింపగలమనో అల్పులూ, అవ్యక్తులూ ఎంతటి మౌఢ్యపూర్వకముగ నూహించిరో వీక్షింపుడు. అట్టి విపత్తు, ఈ దీపశిఖకు శక్తినొసగు తైలమను యథార్థ మేమాత్రమునూ వారికి తెలియనట్లున్నదే! భగవంతుని పరివర్తనాశక్తి యట్టిది. ఆయన తా దలచిన దానిని మార్చివేయును; సకలాంశముల పైననూ ఆయన కధికారమున్నది . . . .

ఆదర్శరాజన్యుడు సర్వకాలములయందునను వహియించిన సార్వభౌమత్వమును గణియింపుడు; ఆయన యధికార, మహత్తరప్రభావ నిదర్శనములను పరికింపుడు. తిరస్కారస్వరూపుల, హింసోద్రేకప్రేరకుల వ్యర్థాలాపముల నుండి మీ వీనులను ప్రక్షాళన మొనరించుకొనుడు. సమస్త సృజితములపైననూ నిజైకదైవాధికారమునూ, ఆయన సమస్త సృష్ట్యావృత సార్వభౌమత్వశక్తి సంకేతము లనూ మీ రవలోకించు తరుణ మాసన్నమగుచున్నది. ఆ సుదినమున, ఆయన దక్క అన్యమెల్లయు నెటుల విస్మృతమగునో, పూర్ణశూన్యతగ నెటుల గణియింపవడునో మీ రెఱుగుదురు.

అయినను, భగవంతుడూ ఆయన దివ్యావతారమూ - తమ స్వతస్సిద్ధౌన్నత్య, దివ్యత్వములతో నెట్టి పరిస్థితులయందుననూ విడివడిపోవజాలరని మదియం దుంచుకొనవలె. అంతియేకాదు, మీ దృక్కులతో గాక, నా దృష్టితో విలోకింపనెంతురేని, ఔన్నత్యదివ్యత్వము లాయన దివ్యవాక్సంజనితములే.

XXX

దయాన్వితుడూ, పరమప్రియుడూ అయిన తాను దక్క వేరు దైవము లే డనుటకు భగవంతుడు సాక్ష్యమును వహియించును. సమస్తౌదార్యాను గ్రహములూ ఆయనవే. తా నిచ్చగించినవానికి, ఆయన తా దలచిన దాని నొసంగును. నిక్కముగా, ఆయన సకలాధీశుడు, సర్వసమర్ధుడు, ఆపత్సహాయకుడు, స్వయంజీవనుడు. రాజాధిరాజుయు, సకలసంకీర్తితుడును నగు నిజైకదైవము యొక్క యిచ్ఛానుసారముగ, “బాబ్‌” మూర్తిమత్వమున భువి కంపవడిన ఆయనను మేము నిక్కముగా విశ్వసింతుము. అంతియేగాక, “ముస్తఘాత్‌ కాలము”న ప్రత్యక్షీకృతునిగా నిర్ధారితుడైన ఆయనకును, అటులే, అంత్యరహితాంత్యము వరకు ఆయన ననుసరించి యరుదెంచు దివ్యులకును - మేము ప్రభుభక్తిని ప్రకటింతుము. మీరు గ్రహియింపగలవారేని, వారిలో ప్రతి యెుక్కరి ప్రత్యక్షీకరణమునను – బాహ్యముగానైనను, అంతర్గతముగానైనను - సాక్షాత్తూ భగవంతుని దివ్యావతారమును దక్క, మే మన్యమును దర్శింపము. మీ రవగత మెునరించుకొనెదరేని, వారియందలి ప్రతియెుక్కరూ - ఆయన స్వీయతను, ఆయన దివ్యసౌందర్యమును, ఆయన శక్తిని, కీర్తిని దక్క అన్యమును ప్రతిఫలింపని భగవద్దర్పణమే. మీ రవగాహనాశూన్యులు గాకుండిరేని, వారుదక్క అన్యు లెల్లరునూ దివ్యాస్తిత్వ మూలదర్పణములైన యీ దివ్యావతారముల వైభవమును ప్రతిఫలింపగల అద్దములుగ పరిగణింప బడవలె. వారల నెవ్వరునూ, యెన్నడునూ తప్పించుకొని యుండనూలేదు; వారు తమ లక్ష్యసాధనయం దవరోధితులునూ కారు. ఒకరి ననుసరించి యొకరుగ, నిరంతర మీదివ్యదర్పణము లవతరింపుచునే యుందురు; యుగప్రాచీనుని శోభను ప్రదర్శింపుచునే యుందురు. అదే రీతిన, వారి వైభవమును ప్రతిబింబించువారు, శాశ్వతులై నిలుతురు, ఏలయన, దైవానుగ్రహవాహిని యెన్నటికినీ స్తంభింపదు. ఎవ్వరునూ కాదనజాలని సత్యమిది.

XXXI

ఆదాము దివ్యావతారమును బాబ్‌ దివ్యావతారముతో ననుసంధానించిన క్రమానుగత దివ్యావిష్కరణ పరంపరను, నీ యంతర్నేత్రముతో వీక్షింపుము. ఈ దివ్యావతారములయందలి ప్రతి యెుక్కరును భగవంతుని యిచ్ఛా లక్ష్యముల మూలమున భువికంపబడినారనియూ, ప్రతియెుక్కరును ఒక విశిష్ట సందేశధారియేననియూ, ప్రతియెుక్కరును ఒక దివ్యావిష్కరణ గ్రంథానుగ్రహీత యనియూ, మహత్తర దివ్యఫలక మొకదాని మర్మములను వెల్లడించుటకు నియుక్తుడనియూ భగవంతుని యెదుట నిరూపింపుచున్నాడను. నిక్కముగా, వారియందలి ప్రతియెుక్కరి దివ్యావిష్కరణ పరిమాణమూ పూర్వ నిర్దేశితమే. నీవు యీ సత్యమును గ్రహియించినవాడవేని, ఇది నిక్కముగా, వారియెడ మా యభి మానమునకు ప్రతీక. . . . ఇక, యీ పురోగామి దివ్యావిష్కరణ ప్రక్రియ, మానవనేత్రములకు తన యతులిత, పరమపావన, హర్షాన్వితవదనము వివృతము కావలసిన తరుణముతో మమేకమైనపుడు - అపవిత్ర, నశ్వరనేత్రములు తన ప్రభను కనుగొనునేమోయని - సహస్రావగుంఠనములతో ఆయన తన స్వీయతను ప్రచ్ఛాదన మొనరించుకొన నెంచినాడు. భగవన్నియుక్త దివ్యావిష్కరణాచిహ్నములూ, ప్రతీకలూ—నీ దైవమూ, సకలలోకాధిపతియూ అగు నీ ప్రభుడు దక్క యితరులు గణియింపజాలని చిహ్నములు, ప్రతీకలవి—తనపై వర్షితము లగుచున్నయపుడు, అట్లొనరించినా డాయన. ఇక, నిర్ణీత ప్రచ్ఛన్నతావ్యవధి పరిపూర్ణమగుటతోడనే, వేనవేల ముసువులయం దింకనూ సమాచ్ఛాదితుడై యుండగ, దివ్యతరుణుని వదనము నావరించియున్న సముజ్జ్వలప్రభాసపు సూక్ష్మద్యుతి నొక్కదానిని మేము ప్రసరింపచేయగనే యూర్ధ్వలోకజన సమూహమెల్లయూ తీవ్రసంక్షోభాన్విత కాగా, అదిగో, దైవానుగ్రహీతు లాయన మ్రోల భక్తిపూర్వకముగా ప్రణమిల్లినారు. తన దివ్యధర్మమును స్వర్గముల యందలి వారెల్లరకునూ, భువిపైయున్న వారందరికినీ స్వయముగా ఉద్ఘోషించుట కుద్యమించినటుల, నిక్కముగా సమస్తసృష్టియం దేయెుక్కడును వీక్షించియుండని వైభవమును ప్రదర్శించినా డాయన.

XXXII

సకల కరుణాన్వితుని దివ్యమిత్రుడైన అబ్రహామును గురించి నీవు వినియున్నది సత్యము; దానిని గురించి సందియ మెద్దియూ లేదు. బలిదానముగా ఇష్మాయిలు నర్పింపుమనియూ, తద్వారా, భగవంతుని దివ్యధర్మముపట్ల ఆయన స్థైర్యము, భగవంతుడు దక్క అన్యమంతటి పట్లను ఆయన నిస్సంగత్వము మానవులకు ప్రదర్శితము లగుననియూ భగవద్వాణి ఆయన నాదేశించినది. అంతియే కాదు, సమస్త భూలోకవాసుల దుష్కృత్యములకును, దుర్నయములకును పరిహారముగా ఆతడిని బలిదాన మిచ్చుటయే భగవంతుని లక్ష్యము. ఈ మాన్యతనే తన కనుగ్రహింపుమని మేరీ తనయుడైన యేసు నిజైక దైవమును—సమున్నతము లాయన నామధేయ వైభవములు—వేడినాడు. ధర్మదూత యైన మహమ్మదు, ఇదే హేతువున, హుసేనును బలిసమర్పణ మొనరించినాడు.

నిగూఢమూ, అనంతమూ అగు భగవంతుని యనుగ్రహ స్వభావమును గ్రహియించితినని యే మానవుడును, ఎన్నటికిని చెప్పనూలేడు; ఎవ్వడూ ఆయన సర్వావృతకారుణ్యము నెఱుగనూజాలడు. మానవుల విపరీతబుద్ధియూ, వారి యుల్లంఘనములూ యెట్టివనిన, భగవత్ర్పవక్తలూ, వారి యనుగ్రహ పాత్రులూ గురి కావింపబడిన వ్యధ లెంతటి ఘోరతరములనిన - అందులకు మానవాళి యంతయూ హింసావినాశముల పాలబడవలసినదే. అయినను, నిగూఢమును, నిత్యవాత్సల్యాన్వితమును నగు దైవవిధి, దానిని గోచరాగోచర సాధనములతో, దాని దౌష్ట్యఫల దండనములనుండి రక్షించినది, రక్షింపుచునే యుండును. సత్యము నీకు వెల్లడియై, ఆయన పథమున నీవు స్థైర్యముతో నుండుటకై, దీనిని నీ హృదయమున పర్యాలోచింపుము.

XXXIII

సర్వజ్ఞుడునూ, సకల వివేకియూ అగు ఆయన పూర్వాదేశిత నియమములకు నిష్కర్షాన్వి తానుమోదమున - మానవులకు భగవద్వచనమూ, తదంతర్గత సమస్తశక్తులూ ప్రదర్శితములు కావలెనని మే మాదేశింపనైనది. అంతియేగాక, దాని ప్రచ్ఛన్నతావగుంఠనము కేవలము దాని స్వీయతయే దక్క , వేరొండు కారాదని మేమాదేశించినాము. నిజమునకు మా లక్ష్యసాధనకు, మాకుగల దివ్యశక్తి యంతటిది. భగవద్వచనమును - తనయం దంతర్లీనములైయున్న యావచ్ఛక్తులనూ ఆకస్మికముగా వెలువరింపనిచ్చిన పక్షమున, ఏ మానవుడును అంతటి మహత్తర దివ్యావిష్కరణ భారమును భరియింపజాలడు. వాస్తవమునకు, స్వర్గమునను భువియందునను గల సమస్తమూ, దాని యెదుటనుండి సంభ్రమమున పలాయితము లగును.

భగవంతుని ధర్మదూతయగు మహమ్మదున కనుగ్రహీతమైన దానిని పర్యాలోచింపుడు. ఆయన స్వయముగ వహియించిన యావిష్కరణ పరిణామము సకలబలుడును, సర్వశక్తిమంతుడును నగు ఆయన ప్రస్ఫుట పూర్వనిర్దేశితమే. అయినను, ఆయన వాణి నాలించినవారు ఆయన లక్ష్యమును తమ స్థాయి కనువుగ, తమ యాధ్యాత్మిక సామర్ధ్యముమేరకు మాత్రమే గ్రహియింప గలిగినారు. ఆవ్విధము గనే, తన మహాసందేశభారమును వహియింపగల వారి సామర్ధ్యమున కనురూపముగ దివ్యవివేక వదనమును, అనాచ్ఛాదిత మెునరించినా డాయన. మానవజాతి పరిణితస్థాయి నందినంతనే, భగవద్వచనము తన కనుగ్రహీతములైన అంతఃశ్శక్తులను—ప్రాచీనసౌందర్యు డరువదియవ సంవత్సరమున బాబ్‌ యగు ఆలీ మహమ్మదు రూపున యవతరించిన యపుడు, స్వీయతేజ సంపూర్ణత యందున తామై యుద్భవించిన శక్తులను—మనుష్యనేత్రములకు బహిర్గత మెునరించినది.

XXXIV

శూన్యతానగ్నత్వమునుండి, స్వీయశౌర్యపరాక్రమముతో తన సృష్టిని విముక్త మెునరించి, జీవనాంబరముతో దానిని పరివేష్ఠన గావించిన భగవంతునికి సమస్త ప్రస్తుతియు, ప్రకీర్తియును. పవిత్రమూ, అమూల్యమూ అయిన మనుష్య జీవనయథార్థతను సమస్త సృజితాంశములనుండి తన విశేషానుగ్రహమునకై యెంచుకొని, తన నరయగల, తన యశోవిభవమును ప్రతిఫలింపగల విలక్షణ శక్తిని దానికి ప్రసాదించినా డాయన. ఆతడి కనుగ్రహీతమైన యీ వైశిష్ట్యద్వయ మాతడి హృదయమునుండి వ్యర్ధేచ్ఛాలోహజమును ప్రక్షాళించి, ఆతడికి తన సృష్టికర్త ధరియింప జేయనెంచిన వసనమున కాతడిని యోగ్యుని గావించినది. అజ్ఞానపు దుర్దశనుండి అతడి యాత్మను రక్షించుట కది యుపకరించినది.

తన శరీరమూ, ఆత్మయూ అలంకృతములైన యీ వసనమే మానవుడి సంక్షేమాభ్యుదయములకు మూలము. అహో, నిజైకదైవానుగ్రహ బలముల సాహాయ్యమున ప్రపంచపు దాస్యదుర్నీతులనుండియూ, తత్సమస్తమునుండియూ మానవుడు విముక్తుడై దివ్యజ్ఞానవృక్షచ్ఛాయ యందున, నిజమగు నిత్య విశ్రామము నొందగలుగు దివస మెంతటి పవిత్రమో!

నీ మనోవిహంగము తన మిత్రులయెడ ప్రేమాతిరేకత కొలదియు నాలపించిన గీతికలు వారి వీనులను చేరి, నన్ను నీ ప్రశ్నలకు ప్రత్యుత్తరమిచ్చుటకును, నన్ను వివృత మెునరింపనిచ్చిన రహస్యముల నటుపై నీకు వెల్లడించుటకును ఉద్యుక్తుని గావించినవి. భగవంతుని దివ్యప్రవక్తలయం దెల్లరి కన్నను శ్రేష్ఠునిగా యెవ్వరి నెంచదగునని నీ యనర్ఘలేఖయం దడిగినాడవు. సమస్త దివ్యప్రవక్తల సత్త్వమూ ఒక్కటియేనని నిక్కముగా, నీ వెఱుగవలె. వారి యేకత్వము పరిపూర్ణమైనది. సృష్టికర్తయగు భగవంతుడు యిట్లనుచున్నాడు: నా సందేశవహులయం దెట్టి తారతమ్యమూ లేదు. ఒకే లక్ష్యము వారెల్లరకూ యున్నది; వారి మర్మము సైత మొక్కటియే. ఒకరిని మించిన గౌరవము నింకొకరి కిచ్చుటయూ, కొందరి కన్యులకన్నను ఉదాత్తత నాపాదించుటయూ ఎవ్విధముగనూ ఆమోదితము కాదు. ప్రతి నిజప్రవక్తయూ తన సందేశమును మౌలికముగా, తనకు పూర్వము నిష్ర్కమించిన ప్రతి దివ్యప్రవక్త యావిష్కరణ వంటిదిగనే గణియించినాడు. కావున, ఈ సత్యమును గ్రహియించుటయం దేమానవుడేని విఫలుడై , తత్పర్యవసానముగా, అనుచిత, నిరర్ధక భాషకు స్వాధీనుడైనచో, అట్టి వ్యర్ధా లాపమునకు - తన విశ్వాసమును చాంచల్యమునకు లోనుగావించు యవకాశమును నిశితదృష్టి సమన్వితుడూ, జ్ఞానశోభితుడూ అయిన వా డెన్నటికీ యివ్వడు.

అందుచే, భగవత్ర్పక్తల యావిష్కరణము యీ ప్రపంచమున, పరిమాణపరముగ, భిన్నతాయుతమై యుండవలసినదే. వారియందలి ప్రతి యెుక్కరును విశిష్టదివ్యసందేశవహుడే; నిర్దిష్టకార్యములతో నభివ్యక్తీకృతుడగుట కాజ్ఞాపితుడే. ఈ కారణముననే యవి తమ యౌన్నత్యమున విభిన్నములై యగుపించును. వారి దివ్యావిష్కరణములను భువిపై తన వెలుగును ప్రసరించు చంద్రుని ప్రభతో పోల్పవచ్చును. దృగ్గోచరమైన ప్రతి పర్యాయమును, చంద్రు డొక నవ్యప్రమాణములో కాంతిని వెదజల్లినను, తత్సహజప్రభాస మెన్నటికీ మ్లానమునూ కాదు, తత్కాంతి వినాశమునూ చెందదు.

అందుచే, వారి శోభాతీక్ష్ణత యందున యే విస్పష్టవ్యత్యాస మగుపించినను, కేవల మది శోభయందే లేదు; దానిని, నిత్యపరివర్తక ప్రపంచగ్రాహ్యతా వైవిధ్యమునకే యారోపింపవలె ననునది సుస్పష్టము, సువిశదము. సర్వశక్తిమంతుడును, అతుల్యుడును నగు సృష్టికర్త, భూలోకవాసుల నిమిత్త మంపుట కుద్దేశితుడైన ప్రతి ప్రవక్తకును దివ్యసందేశము నొకదానిని యొప్పగింపనైనది; తా నవతరించిన యుగావసరములు సముచితముగ తీరునటుల వ్యవహరించుటను, ఆయనకు విధియుక్త మొనరింప నైనది. మానవులచెంతకు తన దివ్యావతారముల నంపుటయందున భగవంతుని యుద్దేశ్యము ద్విముఖీనము. మెుదటిది: మనుష్యసంతతి నజ్ఞానతిమిరమునుండి విముక్త మొనరించి, నిజావగాహనా జ్యోతి దెసకు వారిని నడిపించుట. రెండవది: మానవాళి శాంతిసౌఖ్యముల ననివార్య మొనరించి, వాటి స్థాపనకు సకలసాధనములనూ సమకూర్చుట.

భగవంతుని దివ్యప్రవక్తలు ప్రపంచ, తత్ర్పజానీక సంక్షేమ పరిరక్షణమే విధియైయున్న దివ్య వైద్యులుగ పరిగణనము నొందవలె. విచ్ఛిన్నమానవజాతి రుగ్మతను యేకత్వస్ఫూర్తితో వారు నివారింతురు. వారి వాక్కులను ప్రశ్నించుటకైనను, వర్తన నవమానించుటకైనను, హక్కెవ్వనికిని యివ్వబడలేదు. ఏలయన, రోగిని అధ్యయనము చేసి, ఆతడి వ్యాధులను సరిగా నిర్ధారించితిమని చెప్ప గలుగునది వారే. దివ్యవైద్యు డందుకొనియున్న విజ్ఞాన, మేధాశక్తి శిఖరములను యే మానవుడైనను - తా నెంతటి గ్రహణశీలియైనను అగుగాక - చేరగలనని యాశింపజాలడు. అయినను, ఈ దివసమున వైద్యుడు సూచించిన చికిత్స, ఆత డంతకు మునుపు సూచించినదానివలె యుండకపోవుటయం దాశ్చర్యము లేదు. బాధితుని వేధింపుచున్న రుగ్మతలు తత్సంబంధితమగు ప్రతి దశ యందునను విలక్షణమగు నివారణోపాయము నాశింపుచుండగా, ఒక్క తీరున అది యెట్లుండగలదు? ఆ విధముగనే, దివ్యజ్ఞానదివాకరుని దీప్తిమత్కాంతితో తాము ప్రపంచమును భాసిల్లజేసిన ప్రతి పర్యాయమును, తా మవతరించిన యుగావశ్యకతలకు అత్యంత యోగ్యములైన సాధనములతో, భగవత్శోభ ననుసరింపుడని తత్ర్పజానీకమును నిర్ద్వంద్వముగా భగవత్ర్పవక్త లామంత్రించినారు. ఆ విధముగా, వా రజ్ఞాన తిమిరమును పారద్రోలి, ప్రపంచముపై తమ స్వీయజ్ఞాన ప్రకాశమును ప్రసరింపగలిగినారు. కావున, ప్రతి వివేచనాపూర్వక మానవ నేత్రమూ సారింపబడవలసినది, ఈ దివ్యప్రవక్తల యంతఃసత్త్వము దెసకే; ఏలయన, గతితప్పినవారికి మార్గదర్శన మెునరించి, దుఃఖభాజనులకు సర్వదా, శాంతి ననుగ్రహించుటయే వారి యేకైకలక్ష్యము. వికాస, విజయదివసములు కావివి. సమస్తమానవజాతియూ రుగ్మతాబాహుళ్యపు గుప్పిటియందున్నది. కావున, అమోఘవైద్యుని సర్వశక్తియుతహస్తము సంసిద్ధ మెునరించిన దివ్యౌషధముతో దాని ప్రాణమును కాపాడ యత్నింపుడు.

ఇక మతస్వాభావికతా సంబంధితమగు నీ ప్రశ్నను గురించి. యథార్థ జ్ఞానులు ప్రపంచమును మానవాలయముతో పోల్చిరని గ్రహియింపుము. మనుష్య దేహాచ్ఛాదనమునకు వస్త్ర మావశ్యకమైనటులే, మానవాళి యనబడు దేహము సైతము న్యాయవివేకము లనబడు వస్త్రముతో సునిశ్చయముగ నలంకృతము కావలె. తనకు భగవంతుడు ప్రసాదించిన దివ్యావిష్కరణమే దాని యుడుపు. ఈ యుడుపు తన ప్రయోజనమును సాధించినయపుడు, సర్వశక్తిమంతుడు నిక్కముగా, దానిని నవీకరించును. ప్రతి యుగమునకును భగవత్ర్పకాశ మొక నవ్యపరిమాణమున యావశ్యకమగును. ప్రతి దివ్యావిష్కరణమునూ, తదావిర్భావ కాలపరిస్థితుల కనుగుణముగా భువి కంపనైనది.

పూర్వమతముల నేతల భాషణములకు సంబంధించిన నీ ప్రశ్నను గురించి. వివేకియును, శ్లాఘనీయుడును నగు ప్రతి మనుజుడూ, నిస్సంశయముగా, అట్టి వ్యర్ధ, నిష్ఫల సంభాషణమును వర్జించును. అప్రతిమానుడైన దివ్యస్రష్ట - సమస్తమానవులనూ ఒకే పదార్ధమునుండి సృజియించి, తన యన్యప్రాణులకన్నను వారి యథార్థతను మిన్న గావించినాడు. కావున, జయాపజయములైనను, లాభనష్టములైనను మనుజుని స్వయంకృతములపైననే ఆధారితములు కావలె. ఆత డెంత యధికముగా ప్రయత్నించిన, అంత మహత్తరముగ నుండు నాతడి పురోగమనము. దైవానుగ్రహమనెడు తొలకరి జల్లులు మానవుల హృద్భూమియందున నిజావగాహనా కుసుమములను వికసింపజేసి, ఐహిక మాలిన్య సమస్తము నుండి వానిని ప్రక్షాన మొనరింపవలెనని సహర్షముగ మే మాశింతుము.

XXXV

యోచింపు డించుక తడవు. ప్రతి దివ్యపాలనాకాలమునను సమస్త దయాన్వితుని దివ్యావతారము నలక్ష్యము సేయునటుల భూలోకవాసుల నేది పురికొల్పినది? ఆయనకు విముఖులై, ఆయన యధికారము నెదిరించుటకు వారిని ప్రేరేపింపజాలిన దేమైయుండును? దివ్యాదేశకుని పావనలేఖిని నుండి వెలువడిన యీ వాక్కులపై మానవులు పర్యాలోచన మొనరించిరేని, ఈ భగవత్ప్రసాదిత సత్యమును, ఈ యవిచ్ఛిన్న దివ్యాష్కరణమును అనుసరించుటకు వారు వేగిరపడి, సాక్షాత్తూ ఆయనయే ప్రమాణపూర్వకముగ చేసిన ధృవీకరణకు సాక్ష్యమును వహియింతురు. భగవంతుని దివ్యైక్యతావతారముల, ఆయన యనశ్వర వైభవాదిత్యుల కాలమున - వారికిని, శేషించిన మానవజాతి కిని మధ్యన అవరోధమైనదియూ, అగుచునేయుండునదియూ - వ్యర్ధోహల ముసువే. ఏలయన, నిత్యసత్యమైన ఆయన, ఆ దివసముల యందున మానవుల ఆకాంక్షలకును, అపేక్షలకును తగినటుల కాక, స్వయముగా తానే లక్ష్యముగా యేర్పరచుకొనినదాని కనుగుణముగ తానై అవతరించును. ఆయనయే ప్రకటించినటుల: “ఇక, మీ యాత్మ లాకాంక్షింపని దానితో మీచెంత కొక ధర్మదూత యరుదెంచిన యపుడెల్ల, మీరు గర్వాతిశయులై, కొందరిని వంచకులుగ పరిగణింతురు, ఇతరులను చంపివైతురు.”

మానవహృదయములు పూర్వయుగములయందునను, శకముల యందునను యేర్పరచుకొనిన వ్యర్థోహల కనుగుణముగా యీ ధర్మదూతలు అవతరించియుండిన పక్షమున, ఈ ధన్యజీవుల సత్యము నేయెుక్కడును నిరాకరించి యుండెడివాడు కాడనుటకు సందియము లేదు. అట్టి మానవులు దివా రాత్రములును నిజైకదైవమును స్మరియించుకొనుచూ, తమ ఆరాధనా కార్యముల నిర్వహణ యందున శ్రద్ధాసక్తులతో నిరతులైననూ, భగవత్సంకేత ప్రభాతములను, ఆయన అప్రతిహత నిదర్శనముల దివ్యప్రతీకలను గుఱుతించి, తదనుగ్రహమున పాలుపంచుకొనుటయం దంతిమముగా వైఫల్యము నొందినారు. పవిత్రగ్రంథము లిందులకు సాక్ష్యమును వహియింపుచున్నవి. నిస్సంశయముగా, దానిని గురించి నీ వెఱుగుదువు.

యేసుక్రీస్తు దివ్యపాలనాకాలమును పరికింపుడు. ఆ తరమునాటి విద్వాంసు లెల్లరును, తాము వాగ్దత్తపురుషుని రాక నిమిత్తము ఆతురతతో నిరీక్షింపుచున్నను, ఆయన నెట్లు తిరస్కరించిరో వీక్షింపుడు. ఆయన సమకాలిక మతాధిపతులలో మహావిద్వాంసుడైన అన్నా, ప్రధానార్చకుడైన కైఫా—ఇరువురునూ, ఆయనను నిందించి, ఆయనకు మరణశిక్షను విధియించినారు.

ఆ విధముగనే, భగవత్ప్రవక్తయైన మహమ్మదు—మానవు లెల్లరును ఆయనకు బలిదాన మగుదురు గాక—అవతరించినపుడు, ఆయన దివ్యావిష్కరణపు తొలినాళ్ల యందున మక్కా , మదీనాలకు చెందిన పామరులాయనను గుఱుతించి, ఆయన దివ్యధర్మము నవలంబింపగా, విద్వాంసు లాయనకు విరుద్ధముగా ఉద్యమించి, ఆయన దివ్యసందేశమును తిరస్కరించినారు. యోచింపు మొకింత తడవు. ఆయనను వ్యతిరేకించుటకు విద్వత్ప్రముఖుడైన అబ్దుల్లా ఉబయ్యే విద్వేషముతో పెనగుచుండ, నిరక్షరాస్యుడైననూ, బలాల్‌ అను ఇథియోపియనుడు విశ్వాస-నిర్ధారణా స్వర్గమున కెవ్విధముగ ప్రస్థాన మెునరించెనో పరికింపుము. విజ్ఞానవివేకగర్వితులు దైవపథదూరులై ఆయన యనుగ్రహ భాగ్యమును కోలుపోవగా, సాధారణ గొఱ్ఱెలకాపరి యొకడు భగవద్వచన పారవశ్యమున యెంతగా ముగ్ధుడై, తన పరమప్రియుని యావాసప్రవేశము నొంది, మానవజాత్యధినాధునితో యెట్లనుసంధానితుడయ్యెనో వీక్షింపుము. ఈ హేతువుననే: “మీ యందలి యుదాత్తు డవమానితుడగును, అవమానితు డుదాత్తుడగు,” నని లిఖియించినా డాయన. తద్విషయ ప్రస్తావనములను, అనేక దివ్యగ్రంథముల యందునను, భగవత్ప్రక్తల, సందేశవాహుల సుభాషితముల యందునను కనుగొనవచ్చును.

ఈ దివ్యధర్మమహనీయత యెట్టిదనిన, తండ్రి తనయు నధిగమింపగ, తనయుడు తండ్రి నధిగమించునంతటిదని నిశ్చయముగ వచియింతును. నోవా, కనానుల గాథను స్ఫురణకు దెచ్చు కొనుడు. ఇయ్యలౌకికానందయుత దివసములయందున, సకలమహిమోపేతుడైన భగవంతుని సుమధుర స్వాదువులను కోలుపోవక, ఈ యాధ్యాత్మిక వసంతకాలమున తన కారుణ్య ప్రవాహమున భాగము నొందునటుల, దైవము మిమ్ముల ననుగ్రహించును. సమస్తజ్ఞానలక్ష్యమగు ఆయన నామముతో నుద్గమించి లౌకికజ్ఞానపూర్ణ పరిత్యాగులై, మీ గళముల నెత్తి ఆయన దివ్యధర్మము నుద్ఘోషింపుడు. దివ్యావిష్కరణాదిత్యునిపై ప్రమాణ మొనరింతును! మీ రుద్యుక్తులైనయంతనే మీ హృదయములనుండి దివ్యజ్ఞానపు వెల్లువ యెట్లు వెల్లివాఱునో మీ రవలోకింతురు; తమ సంపూర్ణవైభవ సహితముగా మీ యెదుట ప్రకటితములైనయట్టి ఆయన దివ్యజ్ఞానాద్భుతములను వీక్షింతురు. సకలదయాన్వితుని ప్రబోధ మాధుర్యము నాస్వాదింప నెంచితిరేని, నిస్సంశయముగ మిమ్ములను మీరు త్యజియించుకొందురు; పరమప్రియునికై మీ ప్రాణములను యిచ్చివైతురు.

ఈ భగవత్సేవకుడు తన హృదయమునం దెన్నడైనను, ఏదేని ప్రాపంచిక గౌరవమునో, ప్రయోజనమునో ఆశించియుండెనని యెవ్వరైనను, ఎన్నడైనను విశ్వసింపగలరా? ఐహికములగు యీ క్షణభంగురాంశములకన్నను, ఆయన దివ్యనామమున కనుసంధానితమైన దివ్యధర్మ మెంతయేని సమున్నతము. ప్రవాసియును, నియంతృత్వపీడితుడును నగు ఆయనను ఈ మహత్తర కారాగారమునం దవలోకింపుము. అన్ని దెసలనుండియూ ఆయన శత్రువు లాయనను ముట్టడించినారు; జీవితాంతము వరకు వా రాయనను ముట్టడింపుచునే యుందురు. భూలోకవాసులు, దైవవశమున తమ హృదయములను దుర్వాంఛా మాలిన్యమునుండి ప్రక్షాళన మొనరించుకొని, తద్వాంఛా ముసువుం జించివైచి, యే మానవుడైనను కాంక్షింపగల పరమోత్కృష్ట స్థానమగు నిజైకదైవజ్ఞానము నొందవచ్చును కనుక, ఆయన మీతో వచియింపుచున్న దేదియైననూ, పరిపూర్ణముగా భగవన్నిమిత్తమే; నా దివ్యధర్మముపట్ల వారి విశ్వాసావిశ్వాసములు, నాకు మేలునో, కీడునో చేయజాలవు. సంపూర్ణముగా, భగవన్నిమిత్తమే మేము వారల నామంత్రింపుచున్నారము. నిశ్చయముగా, ఆయన సకలప్రాణులనూ త్యజియింపగలడు.

XXXVI

మనుష్యకుమారుడు తన యూపిరిని భగవంతుని యధీన మొనరించినయపుడు, సమస్తసృష్టియూ, మహాశోకమున విలపించినదని నీ వెఱుగుదువు. అయిననూ, ఆయన యాత్మపరిత్యాగముతో సకలసృజితములకును నూతనశక్తి సంప్రాప్తితమైనది. సమస్త భూలోకవాసుల యందునను గోచరమైన యటుల, సంబంధిత నిదర్శములిపుడు నీ కభివ్యక్తములగుచున్నవి. పుణ్యాత్ము లొనరించిన జ్ఞానబోధ, ఏ మేధస్సైనను ప్రదర్శించిన ప్రగాఢతమ విజ్ఞానము, నిపుణహస్తములు సృజియించిన కళాకృతులు, పాలకశ్రేష్ఠుడు కల్గించిన ప్రభావము వంటివి - ఆయన సర్వోత్కృష్ట, సమస్త పరివేష్టిత, ప్రభాసమానస్ఫూర్తి సంజనిత చైతన్యశక్తికి నిదర్శనములే.

ప్రపంచమునకు తా నరుదెంచినయపు డాయన, సమస్త సృజితాంశముల పైనను తన యశఃప్రభాసమును ప్రసరణమొనరించెనని మేము సాక్ష్యము నిత్తుము. ఆయన వలన కౌటిల్యాజ్ఞానకుష్ఠము నుండి తద్వ్యాధిగ్రస్తుడు నివారణ నొందినాడు. ఆయన ద్వారా దుశ్శీలురును, మూఢులును స్వాస్థ్యము నొందినారు. సమస్తశక్తిమంతుడగు భగవంతునిచే జనియించిన ఆయన శక్తితో అంధుల నేత్రములు తెఱచుకొనినవి, పాపిష్టుని యాత్మ పవిత్రతనొందినది.

కుష్ఠమును: మానవునకును, ఆతడి ప్రభుడగు భగవంతుని గుర్తించుటకును మధ్యన యవరోధమై నిలచు యే ముసువుగానైననూ వ్యాఖ్యానింపవచ్చును. నిజమునకు, ఆయనను చూడ నొల్లనివాడు మహోన్నతుడును, సకలసంకీర్తితుడును నగు భగవంతుని సామ్రాజ్యమున, స్మరణీయుడుకాని కుష్ఠు రోగియే. భగవద్వచనశక్తిచే ప్రతి కుష్ఠురోగియూ ప్రక్షాళితుడై, ప్రతి రుగ్మతయూ శమించి, ప్రతిమానవ దౌర్బల్యమూ పారద్రోలబడెననుటకు మేము సాక్ష్యమును వహియింతుము. ప్రపంచమును పునీత మెునరించిన దాయనయే. తేజోవిరాజిత వదనుడై, ఆయన నాశ్రయించిన మనుజుడు ధన్యుడు.

XXXVII

భగవంతుని యందునను, ‘ఆయన’ సంకేతముల యందునను తనకు గల విశ్వాసము నంగీకరించి, “ ‘ఆయన’ తన చర్యలకు ప్రశ్నింపబడ” డని గ్రహియించిన యాతడు ధన్యుడు. అట్టి గుర్తింపు, భగవంతునిచే ప్రతి విశ్వాసమునకు ఆభరణముగను, దానికి మూలముగను గావింపబడినది. ప్రతి సత్కర్మావలంబనమును అందుపై ఆధారితమై యుండవలె. తిరుగుబాటుదారుల మంతనములు మిమ్ముల నాకస్మికపతనము నొందనీయకుండునటుల దానిపై మీ దృష్టిని స్థిరముగా నిలుపవలె.

అనాదిగా నిషిద్ధమైన దానిని న్యాయబద్ధమైనదిగ నిర్దేశించుటకును, సర్వదా న్యాయసమ్మతమని విశ్వసింపబడుతూ వచ్చిన దానిని నిషేధించుటకును ‘ఆయన’ నిర్ణయించెనేని, ‘ఆయన’ అధికారమును ప్రశ్నించు హక్కెవ్వరికిని యెుసంగబడలేదు. క్షణమాత్రమేని సందేహించిన వాడెవ్వడైనను అవిధేయునిగ గణియింపబడును.

పరమోన్నతమును, మూలాధారమును అగు ఈ సత్యమును గుర్తింపక, ఈ మహనీయస్థాన ప్రాప్తినొంద విఫలుడైన వానిని, అనుమానవు పెనుగాలులు కలవరపెడతాయి. అవిశ్వాసుల ప్రలాపము లాతని యాత్మను పెడత్రోవ పట్టించును. ఈ నియమమును గుర్తించిన వానికి మహాపరిపూర్ణ స్థిరత్వము ప్రసాదింపబడును. ప్రతి విశిష్ట ఫలకమును అలంకరించు దానిని స్మరియించుటయే ఈ సకల మహనీయస్థానమునకు అఖిలగౌరవము. మిమ్ము సకలవిధ సంశయ, సంకోచములనుండి విముక్తుల గావించి, ఇహపరములయందు మోక్షప్రాప్తి దాయకమగు ప్రబోధమునే భగవంతుడు మీకు అనుగ్రహించినాడు. ‘ఆయన’, నిశ్చయముగా, నిత్యక్షమాశీలి, మహోదారుడు.

XXXVIII

ప్రతి దివ్యపాలనాకాలమునను దివ్యావిష్కరణదీప్తి మానవులకు వారి యాధ్యాత్మిక సామర్ధ్యమునకు ప్రత్యక్షానుపాతమున యనుగ్రహీతమగునని నిశ్చయముగా తెలిసికొనుము. సూర్యుని గమనింపుము. దిఙ్మండలముపై యగుపించిన క్షణమున, సూర్యకిరణము లెంత లలితములై యుండును! మెండుకొను తన కిరణతీవ్రతను సమస్తసృజితముల కలవడజేయుచు సూర్యుడు నభోమండలమధ్యము నందుకొలదియు, క్రమేణా తదుష్ణిమయును, తచ్ఛక్తియును యెటుల ప్రవృద్ధమగును! తా నస్తాద్రిని జేరువరకు, సూర్యుడు క్రమముగ నెటుల దిగబాఱును! సూర్యుడు తన యంతర్లీనశక్తుల నాకస్మికముగ ప్రదర్శింపనెంచెనేని, అది నిస్సంశయముగా సమస్త సృజితాంశములకూ హానిని కలుగజేయును. . . . ఆ విధముగనే, దైవవిధి తన కనుగ్రహించియున్న శక్తులను సత్యసూర్యుడు తానుదయించిన తొలిదశల యందున, సంపూర్ణస్థాయియందభివ్యక్త మొనరించెనేని, మనుజుని యవగాహనాధరణి నిర్వీర్యమై నశియించును. ఏలయన, మానవహృదయములు తదావిష్కరణోధృతిని భరియింపనూజాలవు, తత్కాంతి ప్రభను ప్రతిఫలించనూజాలవు. అవి - భయవిస్మితములై, పరాభవమునొంది యునికిం గోలుపోవును.

XXXIX

ఓ ప్రభూ, నా దేవా, నీ దుర్గ్రాహ్యశాసనపు టద్భుతావిష్కరణములకునూ, నీవు నాకై యుద్దేశించిన పలువిధ వ్యధలకునూ, పరీక్షలకునూ నీకు ప్రస్తుతి. నన్నొకపరి, నిమ్రోదు హస్తగత మెునరించినాడవు; ఇంకొకతఱి, ఫారో దండముచే నన్ను వేధింపజేసినాడవు. నేను వారి చేతులయం దనుభవించిన అగణిత వ్యధలను నీవే, నీ సర్వావృతజ్ఞానమున, నీ యిచ్ఛానువర్తనమున గణింపగలవు. నీ జ్ఞానముతో నాకు ప్రేరణనిచ్చి, తద్భావమును నీ శౌర్యశక్తితో నాకు వెల్లడిగావించిన దార్శనికతా సందేశమును, నీ యనుగ్రహమును వడసిన నీ దివ్యసామ్రాజ్యవాసుల వీనుల కందింపనెంచినంత మాత్రముననే, మరల నన్ను నాస్తికుల కారాగార కక్ష్యయందున పడవైచినాడవు. ఇంకను, దైవద్రోహుల కరవాలముచే నాకు శిరచ్ఛేదము జరుగవలెననియూ శాసించినాడవు. అటుపై, నీ వైభవాన్విత యేకత్వపు నిగూఢరత్నములను మనుష్యనేత్రములకు బహిర్గత మెునరించినందులకును, నీ మహాద్భుత సార్వభౌమత్వ శాశ్వతాధికార సంకేతములను వారల కభివ్యక్తము గావించినందులకును - శిలువ వేయబడినాను. తదనంతర కాలమున, కర్బిలా మైదానమున నాపై వర్షితములైన పరిభవము లెంతటి కఠోరములు! నీ జనులమధ్యన, ఎంతటి యెుంటరిపాటును నే ననుభవించితిని! ఆ ధాత్రిపై, ఎంతటి నిస్సహాయస్థితి కడగితినని! నా హింసకులట్టి యవమానములతో సంతుష్టులుగాక నాకు శిరచ్ఛేదమెునరించి నా శిరమును యెత్తిపట్టి, ఒకచోటి నుండి యింకొకచోటికి గొనిపోయి, అవిశ్వాసుల సందోహముల యెదుట ప్రదర్శించి, పాషండుల, విధేయహీనుల, యాసనములపై బడవైచినారు. అనంతరయుగమున నన్ను వ్రేలాడ దీసినారు, నా వక్షము నా విరోధుల విద్వేషాన్విత క్రౌర్యాస్త్రములకు లక్ష్యమైనది. తూటాలతో నా యంగములు తూట్లువడినవి, నా దేహమును ఛిద్రముగావించి యావలవైచినారు. తుదకు, కుత్సితులైన నా విరోధులు యీ దివ్యయుగమున, నాకు వ్యతిరేకముగా సంఘటితులై నీ సేవకుల హృదయముల నసూయాద్వేషములతో విషపూరితముల నొనరించుట కెటుల కుట్రలను చేయుచునేయుండిరో పరికింపుము. వారు తమ లక్ష్యసాధనకై, తమ యావచ్ఛక్తితోడనూ కుతంత్రములను పన్నుచునే యున్నారు. . . . ఓ దేవా, నా పరమప్రియా! నా స్థితి దుర్భరమైనందులకు, నీకు నా ధన్యవాదముల నర్పింతును; నాకు నీ మహదానందపథమున వాటిల్లినదానికి, నా యాత్మ కృతజ్ఞతాన్వితము. నీవు నాకు విధియించినదానికి మహదానందభరితుడను; విపత్కరములేయైనను, నన్ననుభవింపజేసిన కష్టములనూ, కడగండ్లనూ స్వాగతింతును.

40. ఓ నా పరమప్రియా! నీవు నాకు నీ దివ్యోచ్ఛ్వాసము నొసగి, నా స్వకీయతనుండి నన్ను విముక్తుని గావించినాడవు. అటుపై, నాలోని నీ దివ్య వాస్తవికత - ఒక వివర్ణ ప్రతిబింబమునకు, కేవలము సంకేతమాత్రతకు మించి యధికముగా - విపరీతబుద్ధులయందునను, విద్వేషులయందునను ఉండ రాదని యాదేశించినాడవు. వారు యీ సంకేతమునకు భ్రమసి, నాకు విరుద్ధముగ నెటుల యుద్యమించి, నాపై తమ తిరస్కృతులను గ్రుమ్మరించిరో వీక్షింపుము. కావుననే, ఓ నా పరమప్రియా, అభివ్యక్తుడవై, నా దుస్థితినుండి నన్ను రక్షింపుము.

అటుపై, ఒక దివ్యస్వర మిట్లు ప్రత్యుత్తరము నిచ్చినది: “నేను యీ సంకేతము నభిమానింతును, ప్రేమింతును. నా నేత్రములే యీ సంకేతము నవలోకించుననియు, నా హృదయము దక్క మరి యే హృదయమూ దీనిని గుఱుతింపదనియు, ఎటుల నేనంగీకరింతును? నీ సౌందర్యసదృశమగు నా సౌందర్యముపై యాన! నా స్వీయనేత్రములకే యగుపింపకుండ నిన్ను ప్రచ్ఛన్నుని గావించుటయే నా యభీష్టము, ఇక నీ వన్యుల కంటబడరాదని యింకెంతగ నే నాశింతునో!”

ప్రత్యుత్తరమిచ్చుటకు నే నుద్యుక్తుడ నగుచుండ, నా యుద్దేశ్యము నసంపూర్ణ మొనరింపుచు, తంతుపునుండి నా వ్యాఖ్యామౌక్తికమును జార్చివేయుచు, ఇదిగో, దివ్యఫలక మాకస్మికముగ పరిసమాప్తి నొందినది.

XLI

ఓ జనులారా, భగవంతుడే నాకు సాక్షి! నేను నా శయ్యపై శయనించి యుండ, పరమాత్ముని పవనము నా మీదుగా పయనింపుచూ, నా నిద్రావస్థ నుండి నన్ను మేల్కొలిపినది. చేతననిచ్చు ఆయన శక్తిసారము నన్ను పునరుజ్జీవితుని చేసినది; అటుపిమ్మట, ఆయన యామంత్రణము నుద్ఘోషించుటకై నా జిహ్వ స్తంభింపచేయబడినది. భగవంతునికి వ్యతిరేకముగా, పరిధి నతిక్రమించితినని నన్ను నిందింప వలదు. మీ కన్నులతోగాక, నా కన్నులతో నన్నవలోకింపుడు. దయామయుడును, సర్వజ్ఞుడును నగు ఆయన మీకిటుల యుపదేశింపుచున్నాడు. ఓ జనులారా, భగవంతుని పరమ యిచ్ఛాలక్ష్యముల నియంత్రణమును నా గుప్పిటియం దుంచుకొంటినని మీరు భావింపుచుంటిరా? అట్లని చెప్పుకొనుట నా యుద్దేశ్యము కాదు. సమస్తశక్తిసమన్వితుడును, ప్రకీర్తితుడును, సర్వవిదుడును, సకలవివేకియును నగు భగవంతుని యెదుట నే నిందులకు సాక్ష్యము నిత్తును. భగవంతుని దివ్యధర్మపు పరమలక్ష్యము నా హస్తములయం దుండినయెడల, క్షణమాత్రమేని మీ యెదుట ప్రత్యక్షీకృతుడ నగుట కంగీకరించి యుండెడివాడనూ కాను, నా యధరములనుండి ఒక్క వాక్కునైననూ, వెలువడనిచ్చి యుండెడివాడనూ కాను. నిక్కముగా, భగవంతుడే ఇందులకు సాక్షి.

XLII

ఓ న్యాయపుత్రుడా! యామినివేళయందున అనంతజీవన సౌందర్యుడు విశ్వాసమరకత శిఖరమునుండి సద్రతుల్‌-ముంతహా వైపుకు వెడలి, యెంతగ విలపించెననిన, ఆయన విలాపమును గాంచి ఊర్ధ్వలోక దేవసముదాయము, సమున్నతలోకవాసులు సహితము రోదించిరి. అటుపై యా విలాపములు, శోకములేల? యని యడుగనైనది. ఇటుల బదులిడినా డాయన: ఆజ్ఞాబద్ధుడనై, ఆకాంక్షతో విశ్వసనీయతాశైలముపై నిరీక్షించితిని; కాని, భూలోక వాసులనుండి విధేయతా పరిమళమును నే నాఘ్రాణింపలేదు. మరలిరమ్మను పిలుపునొంది బయల్వెడలునంత, అదిగో! భౌతిక శునకముల నఖపంజరముల యందున చిక్కి, మిక్కిలి వెతనొందుచున్న పవిత్రకపోతములను కొన్నింటిని వీక్షించితిని. తదనంతరము, స్వర్లోకపరిచారిక ముసువును వీడి, తన మర్మహర్మ్యమునుండి ప్రజ్జ్వలితయై వెలికివచ్చి, వాటి నామము లేమనియడుగ, ఒక్కటి తప్ప అన్నియును చెప్పబడినవి. అభ్యర్థింపగా, దాని ప్రథమాక్షర ముచ్చరింపబడినది; వెంటనే యుత్కృష్టగృహవాసులు తమ యమరధామముల నుండి పరువిడి ముందుకు వచ్చిరి. ద్వితీయాక్షర ముచ్చారితమైనయంతనే వారందరికందరు మట్టిలో పడి పోయిరి. ఆ క్షణమున దైవపీఠాంతరాళము నుండి: “ఇంతియ చాలు, ఇక ముందుకు లే,” దను స్వరమెుక్కటి విననైనది. నిశ్చయముగ, వా రొనరించినదానికిని, యొనరింపుచున్న దానికిని మేము సాక్ష్యమును వహియింపుచున్నాము.

XLIII

నా ప్రాచీనవంశవృక్షోద్భవులగు ఓ అఫ్నాన్‌! నా వైభవమును, నా వాత్సల్యమును మీకున్నవి. ఎంతటి సువిశాలము భగవంతుని దివ్యధర్మ పటవేశ్మము! అది సర్వప్రపంచజనులనూ, తత్సంబంధీకు లనూ ఆచ్ఛాదించినది; అనతికాలమునకే తన యాశ్రయమున సమస్తమానవాళినీ, అది సంఘటిత మొనరించును. నీ సేవాదివస మిపు డరుదెంచినది. అసంఖ్యాక దివ్యఫలకములు - నీ కనుగ్రహీతములైన పురస్కృతులకు సాక్ష్యమును వహియించును. నా దివ్యధర్మ విజయమున కుద్యుక్తుడవై, నీ వాక్శక్తితో మానవహృదయములను వశపఱచుకొనుము. దీనులకును, పీడితులకును శాంతిసౌఖ్యప్రదాయినిని నీవు ప్రదర్శించి తీరవలె. దైవవశమున, నీవు బంధితు నాతని శృంఖలములనుండి విముక్తుని గావించి, ఆతడు నిజమగు స్వేచ్ఛ నొందునటు లొనరింపవచ్చునేమో, నీ ప్రయత్నపు కటిసీమను బిగియింపుము.

తన దుస్థితికి ధర్మ మీనాడు దురపిల్లుచున్నది, అన్యాయభారమున న్యాయ మాక్రోశింపుచున్నది. దట్టములగు నియంతృత్వ మేఘములు ధరాతలము నంధకారబంధుర మెునరించి తత్ప్రజానీకము నావరించినవి. సర్వశక్తుడగు దివ్యనిర్దేశకుని యనుజ్ఞానుసారము మా మహిమాన్విత లేఖినీచాలనమున, ప్రతి మానవదేహమునకును మేము నవచైతన్యము నొసగి, ప్రతి పదమునకును నవశక్తిని సమకూర్చినారము. సృజితములన్నియూ, ఈ జగద్వ్యాపిత పునరుజ్జీవన దృష్టాంతములను ప్రదర్శింపు చున్నవి. ఈ దూషితుని దివ్యలేఖిని మానవాళికి ప్రకటించిన మహత్తర, మహదానంద సమన్విత శుభసమాచారమిది. ఓ నా ప్రియతములారా! మరి, భీతిల్లెదరేల? మీ భయకారకు లెవరు? ఈ మూఢజనులు మలచబడిన కఠినీకృతమృత్తికను ద్రవీకరించుటకు ఆర్ద్రతాయుత సంస్పర్శనమొండు సరియగు. నిష్ఫల, నిరర్ధక ప్రజాసేనలను పారద్రోలుటకు, మీ సమావేశ కార్యము తగయగు. . . .

ప్రపంచాభ్యుదయమును, తత్ప్రజోన్నతిని సుప్రభావిత మెునరింపగల యమోఘచాలనశక్తి యీ దూషితుని లేఖినీయావిష్కృతోపదేశముల కున్నదని, అంతర్దృష్టియుతుడగు ప్రతి మనుజుడును యీనాడు మనఃపూర్వకముగ నంగీకరించును. ఓ జనులారా, ఉద్యుక్తులు కండు; భగవంతుని శౌర్యశక్తితో మీపై విజయమును సాధింప కృతనిశ్చయులు కండు; తన్మూలమున, బహుశః, భూవలయమంతయూ తన శుష్కవ్యామోహజనిత దేవతల—నిర్భాగ్యులైన తమ యారాధకుల కంతటి నష్టిని కలుగజేసి, వారి దైన్యతకు బాధ్యులైన దేవతల—సేవనుండి విముక్తయూ, పునీతయూ కావచ్చును. ఈ మూర్తులు – మానవుడు పరిపూర్ణతాపథమున పురోగమించుట కొనరించు యత్నములను ప్రతిరోధించు యవరోధము. భగవచ్ఛక్తిహస్తము మానవాళికి తన సాహాయ్యము నందించి, ఆ ఘోరావమానకర స్థితినుండి దానిని రక్షింపవచ్చునను ఆశ మా కున్నది.

ఒకానొక దివ్యఫలకమున యీ వాక్కు లావిష్కృతములైనవి: ఓ భగవత్ప్రజలారా! మీ స్వీయ వ్యవహారనిరతులు కావలదు; మానవాళి యైశ్వర్యములను పునరుద్ధరించు, మానవహృదయములనూ, ఆత్మలనూ పునీత మొనరించునట్టి దానిపై మీ యాలోచనలను నిలువనిండు. స్వచ్ఛసత్కార్యములతో, ధార్మిక జీవనముతో, సత్ప్రవర్తనముతో లెస్సగ దీనిని సాధింపనగును. సాహసకృత్యము లీధర్మమునకు విజయమును సునిశ్చిత మెునరించును; పావనగుణ మాశక్తిని సుదృఢపరచును. ఓ బహాజనులారా! ధార్మికతకు కట్టువడియుండుడు. ఇది నిక్కముగా, ఈ దూషితుడు మీకొసగిన యనుజ్ఞ, మీయందలి ప్రతి యెుక్కరికిని ఆయన యప్రతిహత దివ్యాభీష్టపు తొలి యెంపిక.

ఓ మిత్రులారా! ఈ దివ్యభావస్ఫోరక వసంతకాలమున మీపై వర్షితము లగుచున్న యౌదార్యోపకృతులతో మీ యాత్మలను ప్రఫుల్లితములను, పునరుజ్జీవితములను గావించుకొనుట మీకు యుక్తము. ఆయన మహావైభవాదిత్యుడు తన ప్రభాసమును మీపై ప్రసరింపగా, ఆయన యనంత కారుణ్య మేఘములు మిమ్ముల నావరించినవి. అంతటి మహత్తరానుగ్రహమును కోలుపోవక, తన పరమప్రియుని సౌందర్యమును, ఆయన యీ నూతనాహార్యమున - గుఱుతించుటయందున వైఫల్యము నొందనివాని ప్రతిఫల మెంతటి మహోదాత్తము! మిమ్ములను కాపాడుకొనుడు, ఏలయన, దుష్టాత్మ మిమ్ము వశ పఱచుకొన సన్నద్ధుడై నిరీక్షింపుచున్నాడు. ఆతడి దుస్తంత్రములకు ప్రతిగా సంసిద్ధులై, సర్వవీక్షకుడగు భగవంతుని నామప్రభాసచోదితులై, మిమ్ముల నావరించిన తిమిరము నుండి బయల్వెడలుడు. మీ దృక్పథమును మీకే పరిమిత మెునరించుకొనక, ప్రపంచావృతము కానిండు. అభివృద్ధిని ప్రతిరోధించి, మనుజుల యాధ్యాత్మిక ప్రగతి నవరోధించువాడే దుష్టాత్మ.

ఈ దివ్యయుగమున సకలదేశముల, తత్ప్రజల, న్యాయబద్ధ ప్రభుతల ప్రయోజనములకు ప్రాధమ్యత నిచ్చుచు, వాటి స్థాయిని సమున్నతీకరించుదానికి సుదృఢముగా కట్టువడియుండుట, ప్రతి మానవునకును అనివార్యమే. పరమోన్నతుని లేఖిని వెల్లడించిన ప్రతి సూక్తిమూలముననూ, మానవులకు ప్రేమైక్యతా ద్వారములు గడియలు తీయబడి తటాలున తెఱువబడినవి. “సర్వమతానుయాయులతో స్నేహసౌహార్దస్ఫూర్తితో సహవాసము చేయు,” డని మే మితః పూర్వమే వాక్రుచ్చినారము—మా వాక్కు యథార్థము. ఒకరినొక రసహ్యించు కొనునటుల మానవులను పురికొల్పి, వారియందున వివాదవిభేదము లకు హేతువైనది యేదైననూ, ఈ వాక్కుల యావిష్కరణముతో నిర్వీర్యతనొంది, నిర్మూలితమైనది. జీవప్రపంచమును సమ్మానించి మానవమేధలను, ఆత్మలను సమున్నతీకరించు నిమిత్తము, సమస్త మనుష్యజాతి విద్యకు సర్వసమర్ధమైన సాధనమును భగవంతుని దివ్యేచ్ఛాస్వర్గమునుండి భువి కంపనైనది. పూర్వీకులు వచియించిన లేదా లిఖియించిన దాని మహోన్నతసత్త్వమూ, సంపూర్ణాభివ్యక్తీ కరణమూ - సర్వసమన్వితుడునూ, నిత్యనివాసియునూ అగు భగవంతుని దివ్యేచ్ఛా స్వర్గమునుండి - ఈ మహత్తర శక్తిసమన్విత యావిష్కరణ ద్వారమున, భువి కంపబడినవి. “తనదేశమును ప్రేమించుట భగవంతుని దివ్యధర్మమున ముఖ్యాంశ,” మని పూర్వము వెల్లడింపనైనది. అయినను, “ప్రగల్భించుట తన దేశమును ప్రేమించువానికి కాక, ప్రపంచమును ప్రేమించు వానికే తగు,”నని, దివ్యవైభవ జిహ్వ తన ప్రత్యక్షీకరణ దినమున ప్రకటింపనైనది. ఈ యుదాత్తవచన సంజనితశక్తితో ఆయన – మానవహృదయ విహంగములకు నూతనోత్తేజము నిచ్చి, నవ్యదిశానిర్దేశ మొనరించి, భగవంతుని పవిత్రగ్రంథమునుండి ఆంక్షాపరిధుల ఛాయాసమస్తమునకు, ఉద్వాసనమును పలికినాడు.

ఓ న్యాయమూర్తులారా! జ్యోతివలె ప్రకాశవంతముగ, జ్వలననికుంజ ప్రజ్జ్వలితాగ్నివలె సముజ్జ్వలముగ భాసిల్లుడు. విరోధవైషమ్యముల యుగ్రత యుద్ధమును, వినాశమును దక్క వేరొండు ఫలితము నీయని తరుణమున, కలహించుకొను జనులనూ, ప్రపంచజనావళినీ మీ ప్రేమాగ్నిప్రభ నిస్సంశయముగ సంఘీభవింపజేసి, సమైక్యము గావించును. తన శాత్రవ కుతంత్రములనుండి తన జీవులను రక్షించుకొమ్మని భగవంతుని మే మర్ధింపుచున్నాము. నిశ్చయముగా, ఆయన సమస్త విషయాధీశుడు.

నిజైకదైవమునకు సకలప్రస్తుతి—సమున్నత మాయన వైభవము; ఏలయన, మానవుల హృదయ ద్వారములను మహోన్నతుని దివ్యలేఖినితో వివృత మెునరించినా డాయన. ఈ దివ్యలేఖిని వెలువరించిన ప్రతి సూక్తియూ పునీత, సజ్జనజీవితము యొక్క స్వచ్ఛ, దోషరహిత కార్యవైభవములను ప్రదర్శించు సముజ్జ్వల ప్రకాశమానద్వారమే. మే మెుసంగిన యామంత్రణా సందేశము లెన్నడును కేవలమెుక దేశమును, జాతిప్రజను చేఱుటకో, వారికి ప్రయోజనమును చేకూర్చుటకో లక్షింపబడినవి కావు. సమస్తమానవాళియూ తన కావిష్కృతమై, యనుగ్రహీతమైన దానికి స్థిరముగ నొడంబడవలె. అప్పుడే, కేవల మప్పుడే, అది నిజమగు స్వేచ్ఛనొందును. భువియెల్లయూ, భగవంతుని దివ్యావిష్కరణ మహిమా భాసితమైనది. అరువదియవ సంవత్సరమున, దివ్యమార్గర్శన జ్యోత్యావిష్కర్తయైన ఆయన—సకలసృష్టియూ, ఆయన కర్పణమగుగాక—దివ్యాత్మ యొక్క నవ్యావిష్కరణమును ప్రకటించుట కుద్యమించిన యిరువది వర్షముల యనంతరము, ప్రపంచము యీ ప్రతిజ్ఞాపిత కీర్తికిని, ఈ యద్భుతానుగ్రహమునకును పాత్ర మొనరింపబడుటకు కారణభూతు డరుదెంచినాడు. భగవంతుని మహోత్కృష్టవాక్కును—సకల జనసమీకరణమూ, ఆధ్యాత్మిక పునరుత్థానమూ ఆధారితములై తీరవలసిన దివ్యవాక్కును—ఆలకించు సామర్ధ్యము జనసామాన్యమున కెట్లు ప్రసాదితమైనదో విలోకింపుము.

ఓ భగవజ్జనులారా! మీ నిజ, నిరుపమానమిత్రుని యుపదేశములపై మీ మనస్సులను లగ్నము కానిండు. భగవద్వచనమును మానవహృద్భూముల యందున వేళ్లూనుకొనిన చిఱుమెులకతో పోల్పవచ్చును. విజ్ఞతాయుత, పవిత్రీకృత, పావనవాగ్జలములతో తదభివృద్ధికి తోడ్పడుట మీ విధి; తద్వారా, దాని మూలము సుస్థిరమై, తత్శాఖలు స్వర్గములయంత సమున్నతములుగను, తదతీతములు గను విస్తరింపవచ్చును.

ఓ భూలోకవాసులారా! ఈ మహోన్నత దివ్యావిష్కరణము యొక్క సర్వశ్రేష్ఠ స్వభావసూచక విలక్షణస్వభావము, ఒక వంకన - మేము మానవజాతియందలి కలహ, ద్వేషానర్ధహేతువును భగవంతుని పవిత్రగ్రంథ పుటలనుండి తుడిచివైచుట యందునను, వేరొకవంకన - సానుకూలత, జ్ఞానము, పరిపూర్ణ శాశ్వతైక్యతలకు విశిష్టపూర్వావశ్యకతల యందునను కలదు. నా శాసనముల ననుసరించు వాడు ధన్యుడు.

కౌటిల్యదుర్గంధము నెందున పసిగట్టినను, దానిని వర్జింపుడనియు, దానికి సుదూరముగ తొలగిపొండనియు పలుమారులు మా ప్రియతములకు బుద్ధిని గఱపినాము. ప్రపంచము మహా సంక్షోభమున యున్నది, తత్ప్రజాహృదయములు తీవ్రసందిగ్ధమున యున్నవి. తన దివ్యన్యాయద్యుతితో వారల ననుగ్రహపూర్వకముగ శోభిల్లజేసి, వారు సర్వకాల సర్వావస్థలయందునను తమకు లబ్ధిప్రదమగు దానిని గ్రహియించునటు లొనరింపుమని సర్వశక్తిమంతు నర్ధింపుచున్నాము. నిక్కముగా, ఆయన సర్వసమన్వితుడు, మహోన్నతుడు.

XLIV

ఓ ప్రపంచ విజ్ఞానులారా! దైవభీతి నలక్ష్యము సేయవలదు. అంతియే కాదు, సంరక్షకుడును, స్వయంజీవనుడును నగు భగవంతుని దివ్యగ్రంథము లన్నియును ధృవీకరించిన - ఈ యక్షరహీనుని దివ్యధర్మమును నిష్పాక్షికముగ న్యాయవిమర్శన మెునరింపుడు. . . . దైవాగ్రహభీతియూ, అతుల్యుడును, అసమానుడును నగు ఆయనపట్ల వెఱపూ, మిమ్ము జాగృతులను గావింపవా? ఈ జనదూషితు డేనాడునూ మీతో సహవాసము చేసియుండలేదు; ఎన్నడూ, మీ గ్రంథముల నధ్యయన మెునరించియూ ఉండలేదు, మీ వివాదముల యందున పాల్గొననూలేదు. ఆయన వాక్కుల యథార్థతను - ఆయన ధరియించిన యుడుపుయు, జాలువారెడు ఆయన శిరోజములును, ఆయన శిరోవేష్టనమును ధృవీకరించును. ఎంతకాల మధర్మముగ పంతము బూనెదరు? ధర్మస్వరూపుడైన ఆయన వసియింప నిర్బంధితుడైన యావాసము నవలోకింపుడు. మీ నేత్రములను తెఱచి ఆయన దుస్థితి నవలోకింపుచు, మీ హస్తము లొనరించిన దానిని శ్రద్ధగ పర్యాలోచన సేయుడు; తన్మూలమున, దైవవశమున, మీరు భగవంతుని దివ్యభాషణదీప్తినంది, ఆయన జ్ఞానసాగరమున మీ భాగము నొందవచ్చును.

ఈ దూషితుడు మతాధిపతుల పరంపరాగతుడో, ప్రవక్తల వారసుడో కాడని సామాన్యులలోని, అభిజాతుల యందలి వరిష్టులు కొంద రభ్యంతర పెట్టినారు. వచించు: న్యాయస్తులమని చెప్పుకొను ఓ జనులారా! ఒకింత యోచింపుడు. ఆయనదని మీ రనుకొను స్థాయికన్నను, ఆయన ప్రస్తుత స్థాయి యెంతటి మహోన్నతమో మీరు గుఱుతింపవలె. మతాధిపతులును, విద్వాంసులును, సాధువులును, పండితులును సర్వసాధారణముగ సంతరించుకొనియుండున వెవ్వియును, ఏమాత్రమును లేని వంశమునుండి ఆయన దివ్యధర్మ మావిర్భూతము, ప్రత్యక్షీకృతము కావలెనని దైవేచ్ఛ యాదేశించినది.

దివ్యశక్తి యుచ్ఛ్వాసము లాయనను మేలుకొలిపి, ఉద్యమింపుమనియు, తన దివ్యావిష్కరణమును ప్రకటింపుమనియు నాదేశించినవి. సుషుప్తి నుండి జాగృతు డగుటతోడనే, తన గళమునెత్తి, సమస్త మానవజాతినీ సకలలోకాధిపతి యగు సర్వేశ్వరునిదెస కామంత్రించినా డాయన. మే మీవాక్కులను మానవదౌర్బల్య, వైకల్యముల కతమున వెలువరింప సంప్రేరితులమైనాము; లేదేని, మే ముద్ఘోషించిన దివ్యధర్మము యే లేఖినికైననూ, ఎన్నటికైననూ వర్ణనాతీతమే; ఏ మేధకేని తదౌన్నత్యము గ్రాహ్యాశక్యమే. మాతృగ్రంథాధిపతి యిందులకు సాక్ష్యమును వహియింపుచున్నాడు.

XLV

ప్రాచీనసౌందర్యుడు, మానవజాతిని బానిసత్వంనుండి విముక్తం చేయడంకోసం శృంఖలాలతో బంధింపబడుటకు అంగీకరించాడు; సర్వప్రపంచము నిజమైన స్వాతంత్య్రాన్ని పొందడం కోసం, ఈ అత్యంత దృఢదుర్గంలో కారాగారనివాసి గావింపబడేందుకు ఒప్పుకున్నాడు. భూమిమీద ప్రజలందరూ ఎదురుచూసే సౌఖ్యాన్ని పొందడానికీ, వారు సంతోషపరిపూర్ణితులు కావడానికీ ఆయన ప్రపంచ కాలుష్యాల దుఃఖచషకాన్ని పానం చేశాడు. ఇది దయాన్వితుడు, మహానుగ్రహుడు అయిన మీ ప్రభుని కారుణ్యము. ఓ ఏకేశ్వరత్వంలో విశ్వాసం కలవారలారా, మీరు సమున్నతులు గావింపబడటానికి మేము అవమానాన్ని, మీరు సఫలతను పొంది వర్ధిల్లడానికి మేము బహుముఖీన వ్యధల వల్ల బాధలనూ అనుభవించాము. దైవసమానులమని చెప్పుకొనినవారు, సర్వప్రపంచాన్నీ అతి నూతనంగా నిర్మింప వచ్చిన ఆయనను, అతి నిర్జననగరాలలో నివాసం చేయించడంకోసం ఎలా బలవంతపెట్టారో పరికించండి!

XLVI

నా కారాగారవాసవ్యధకు నేను వాపోవను. నా యవమానమునకైనను నా శాత్రవ హస్తములయం దనుభవించు విపత్తునకైనను నేను వ్యధనొందను. నా జీవితముపై యాన! అవి నా యశస్సు; భగవంతుడు స్వాలంకృతుడైన యశస్సది. మీ రెఱిగినదే కద యిది!

నన్ననుభవింప జేసిన యవమానము సమస్తసృష్టికిని యనుగ్రహీతమైన కీర్తి ననాచ్ఛాదిత మెునరించినది; నేను భరియించిన క్రౌర్యముల మూలమున, స్వయముగ న్యాయాదిత్యుడే ప్రత్యక్షీకృతుడై మానవులపై తన తేజమును ప్రసరిల్ల జేయనైనది.

నా విచారములన్నియూ - తమ దుర్వ్యామోహములయందున మగ్నులై, దయాళువును, సకలసంకీర్తితుడును నగు భగవంతుని దివ్యధర్మానుయాయులమని చెప్పుకొనువారి గురించియే.

తాము భౌమవస్తువులయెడ పరిపూర్ణముగా నిస్సంగతులగుటకై - తమ వస్త్రములనుండి పవిత్రతా మధురసౌరభమును స్వర్లోకవాసు లాఘ్రాణించునటుల, తమ వదనములయందున సకలదయాన్వితుని తేజమును భూలోక వాసులెల్లరును గుఱుతించునటుల, సర్వశక్తిమంతుడును, సకలవివేకియును నగు భగవంతుని సంకేతములు తమ ద్వారా దేశాంతరములయందున విస్తారితము లగునటుల – ప్రపంచమునకును, తత్సమస్తమునకును పరాఙ్ముఖులగుట బహాజనులకు యుక్తము. విషయ వాంఛానుసారులై భగవంతుని దివ్యధర్మ సత్కీర్తికి నష్టిని కలిగించినవారలు—నిస్సంశయముగా దోషులే.

XLVII

ఓ యూదులారా! భగవదాత్మయైన యేసును మీ రింకొకపరి శిలువ వేయనెంతురేని, నన్ను వధియింపుడు; ఏలయన, నా మూర్తిమత్వమున ఆయన యింకొక పరి మీకు సాక్షాత్కృతు డైనాడు. నాయెడ మీ యిచ్ఛానుసారము వర్తింపుడు; ఏలయన, నా ప్రాణమును దైవపథమున యర్పిత మెునరింతునని ప్రతిన బూనినాడను. భూ, స్వర్గసేనలు నాకు వ్యతిరిక్తముగ సంఘటితమైనను, నే నెవ్వనికిని భీతిల్లను. సువార్తానుయాయులారా, భగవంతుని ధర్మదూతయగు మహమ్మదును వధియింపవలెనను యిచ్ఛ మీకుండెనేని, బంధింపుడు నన్ను, ముగింపునిండు నా జీవితమునకు; ఏలయన, నే నాయనను; నే ననిన ఆయనయే. వర్తింపుడు నాయెడ మీ యిచ్ఛానుసారము; ఏలయన, నా పరమ ప్రియుని యశోసామ్రాజ్యస్థితమగు ఆయన సన్నిధానము నొందుటయే నా ప్రగాఢ మనోవాంఛ. మీరు గ్రహియించితిరేని, దైవశాసన మట్టిది. మహమ్మదు అనుయాయులారా! తన దివ్యగ్రంథమగు బయాన్‌ను మీ కనుగ్రహింపజేసిన ఆయన హృదయమును మీ శరములతో ఛిద్రము గావించుట మీ యభిలాషయేని, నన్ను పట్టి, హింసింపుడు; ఏలయన, నే నాయన పరమప్రియుడను, నా నామమాయన నామధేయము కాకున్నను, నేను సాక్షాత్తూ ఆయన దివ్యాభివ్యక్తీకరణమునే. వైభవపర్జన్యచ్ఛాయలయం దరుదెంచినాడను, భగవంతునిచే అజేయ సార్వభౌమత్వానుగ్రహీతుడను. ఆయన నిశ్చయముగా, అగోచర విషయజ్ఞుడైన దివ్యసత్యము. నాకు పూర్వ మవతరించిన ఆయనయెడ మీరు చూపిన యాదరణమునే, మీనుండి నిక్కముగ నే నాశింతును. మీ రాలించు వారేని, నిశ్చయముగా, సకలాంశములును యిందులకు సాక్ష్యమును వహియించును. ఓ బయాన్‌ జనులారా! బాబ్‌ యెవ్వరి రాకడ నుద్ఘోషించెనో, ఎవ్వరి యాగమనమును మహమ్మదు సూచించెనో, సాక్షాత్తూ యేసుక్రీస్తు ఎవ్వరి దివ్యావిష్కరణమును ప్రకటించెనో, ఆయన రక్తమును చిందింప మీరు నిశ్చయించు కొనిరేని, సంసిద్ధుడనై, నిస్ససహాయునిగ నేను మీ యెదుట నిలచియుండుట నవలోకింపుడు. మీ స్వీయాకాంక్షల మేరకు, నాతో వ్యవహరింపుడు.

XLVIII

భగవంతుడు నాకు సాక్షి! భగవంతుని దివ్యఫలకములు నిర్దేశించిన దానికి విరుద్ధము గాకుండినయెడల, పరమప్రియుని పథమున మదీయ రుధిరమును చిందింపజూచిన వారి హస్తములను మోదముతో ముద్దిడుకొని యుందును. అంతియేగాక, ఈ చర్యకు బాల్పడిన యాతడు, సర్వశక్తిమంతుని యాగ్రహము నుధృత మెునరించినను, ఆయన శాపమునకులోనై, సర్వసమన్వితుడును, నిష్పాక్షికుడును, సకలవివేకియును నగు భగవంతుని యనంత సామ్రాజ్యమున శిక్షార్హుడైనను, భగవంతుడు నే నొందుట కనుమతించిన యైహిక సంపదలయం దొక్క వంతు నాతడికి బహూకరించి యుండెడివాడను.

XLIX

ఈ దివ్యతరుణుడు తన నేత్రములను తన స్వకీయత దెసకు సారించినయపుడు, అది సమస్త సృష్టియం దత్యంత ప్రాధాన్యతారహితమైనదని యాతడు గ్రహియించునని నిక్కముగ నెఱుగుము. అయిననూ, అభివ్యక్తీకరించుటకు తన కధికార మెుసగబడియున్న దీప్తిమత్ప్రభలపై ఆయన పర్యాలోచించిన యపుడదిగో, అదియే - ఆయన యెదుట సమస్త గోచరాగోచర వస్తుతత్త్వమున ప్రవేశమునొందు సార్వభౌమశక్తిగ రూపుదిద్దుకొనినది. సత్యశక్తితో తన స్వీయావతారమును భువికంపి, ఆయనకు తాను సమస్తమానవజాతికీ యుద్దేశించిన సందేశము నొప్పగించిన భగవంతునిదే యశస్సు.

L

ఓ ప్రమత్తులారా! నిర్లక్ష్యపు నిదురను విదళించుకొనుడు, తద్వారా, ప్రపంచవ్యాపితమైన, ఆయన వైభవశోభను మీ రవలోకింపవచ్చును. ఆయన యకాలజనిత శోభకు విరుద్ధముగ వ్యర్ధాలాపములాడు వా రెంతటి మూర్ఖులు. ఓ అంతర్గతాంధులారా! ఆయన దేదీప్యమాన వైభవదృష్టాంతము లిపుడు, అతి శీఘ్రముగనో, అత్యాలస్యముగనో, యథార్ధముగ ప్రదర్శితము లగుచున్నవి. అట్టి జ్యోతి యవతరించెనోలేదో ప్రస్ఫుటముగ నెఱుగుట మీకు సముచితము. దాని యావిర్భావ సమయనిర్ధారణము మీ యధీనముననో, నా యధికారపరిధి యందుననో లేదు. దుర్గ్రాహ్యమగు భగవద్విజ్ఞత, ఎన్నడో నిశ్చయించిన దా ఘడియను. ఓ జనులారా, భగవంతుడు మీకై యభిలషించి, పూర్వనిర్ధారణ మెునరించిన దానితో సంతుష్టులు కండు. . . . ఓ నా వినాశాభిలాషులారా! నిత్యమార్గదర్శనాదిత్యుడు నాకు సాక్షి: నా యధికారపరిధిలోనుండిన పక్షమున, ఎట్టి పరిస్థితులలోను, మానవుల యందున విశిష్టీకృతుడనగుట కంగీకరించి యుండెడివాడను కాను; ఏలయన, కల్మష జిహ్వులును, కుటిలమనస్కులునునైన యీ జనులతో ననుసంధానితమగుటకు, నేను వహియించిన దివ్యనామధేయము నిర్ద్వంద్వముగ నిరాకరించును. ఇక నేను మౌనముగ, ప్రశాంతముగ నుండనెంచిన యపుడెల్ల, నా దక్షిణహస్తము దెసన నిలచియుండిన పవిత్రాత్మవాణి న న్నుత్తేజపరచినది; పరమాత్మ నా కట్టెదుట సాక్షాత్కరింపనైనది; గ్యాబ్రియేలు నన్నాచ్ఛాదింప నైనది; లెమ్మని, మౌనమును వీడుమని నన్నాదేశింపుచు, దివ్యవైభవాత్మ నా మానసము నుత్తేజపరచినది. మీ వినికిడి ప్రక్షాళితమేని, మీ వీను లప్రమత్తము లేని, నా దేహమునందలి ప్రత్యంగమూ, కాదుకాదు, నా యస్తిత్వపు టణువు లన్నియూ: “తానుగాక వేరొండు వేలుపులేనట్టి భగవంతుడు; ఇక, సమస్త భూస్వర్గవాసులకును ఆయన వైభవ ప్రతిఫలనము, ఇపుడు స్వీయసౌందర్య మభివ్యక్తమైన ఆయన,” యని యుద్ఘోషించి, తదామంత్రణము నకు సాక్ష్యము నిచ్చుటను మీరు తప్పక గ్రహియింతురు.

LI

ఓ జనులారా! నిజైకదైవముపై ప్రమాణమెునరింతును! సంద్రములన్నియును వెలువడిన యట్టి, అవి యంత్యమున లీనమగునట్టి - దివ్యమహాసాగర మిది. ఆయననుండి దివ్యాదిత్యు లావిర్భవించినారు; వారెల్లరునూ, ఆయన చెంతకే తిరోగమింతురు. ఆయన శక్తితో దివ్యావిష్కరణ వృక్షములు తమ ఫలముల నొసగినవి; వానియందలి ప్రతిదానిని - దైవప్రవక్త రూపున, తన సర్వవ్యాపిత దివ్యజ్ఞానమున దేవదేవుడు మాత్రమే లెక్కింపగల సమస్తలోకములయందలి భగవత్ప్రాణుల నిమిత్త మెుక సందేశముతో - భువి కంపనైనది. దీనిని తన దివ్యలేఖినీ యావిష్కృత పవిత్రవాక్కునందలి దివ్యాక్షర మొక్కదానితో సాధించినా డాయన; ఆయన నిర్దేశాంగుళీ ప్రచలిత మాదివ్యలేఖిని. సాక్షాత్‌ భగవంతుని సత్యశక్తిచే పరిపోషిత మాయన యంగుళి.

LII

వచించు: ఓ జనులారా! భగవంతుని కరుణాకటాక్షములకు మిమ్ములను ప్రతిరోధితులను గావించుకొనవలదు. వానికి తన నవరోధించుకొను నాతడు నిక్కముగ, నష్టభాజనుడే. ఓ జనులారా, ఏమది! ధూళి నారాధింపుచు, దయాన్వితుడును, సకలవదాన్యుడును నగు మీ దేవదేవునికి మీరు పరాఙ్ముఖులగుచుంటిరా? భగవద్భీతులు కండు, భ్రష్టులు కావలదు. వచించు: ఈ దివ్యతరుణుని రూపున భగవద్గ్రంథమును భువి కంపనైనది. కావున, స్రష్టలయం దుత్తముడైన భగవంతుడు పూజనీయుడు! ఓ ప్రపంచజనులారా! మీ రాయన మ్రోలనుండి పరువిడిపోవుదురేమో, శ్రద్ధగ నాలింపుడు; ఆయన సన్నిధాన సంప్రాప్తికి త్వరనొంది, ఆయన దెసకు తిరోఙ్ముఖులు కండు. ఓ జనులారా! భగవంతునిపట్ల మీ విధినిర్వహణమున విఫలత నొందినందులకును, ఆయన దివ్యధర్మము పట్ల యపచార మొనరించినందులకును మన్నింపుమని ప్రార్థింపుడు, మూర్ఖులు కావలదు. మిమ్ములను సృజియించిన దాయనయే; మిమ్ములను సర్వశక్తిమంతుడును, పరమప్రకీర్తితుడును, సర్వజ్ఞుడును నగు ఆయనను గుఱుతింప సమర్ధుల గావించి, మీ యాత్మలను తన దివ్యధర్మముతో పరిపోషించిన దాయనయే. మీ నేత్రములకు తన జ్ఞానభాండారములను సాక్షాత్కరింపజేసి, నిర్ధారణ—తన యప్రతిహత, ఖండనాతీత పరమోత్కృష్ట దివ్యధర్మము పట్ల సుదృఢనిర్ధారణ మది—స్వర్గమునకు మిమ్ముల నధిరోహింపజేసిన దాయనయే. దైవానుగ్రహమును మీరుగ కోలుపోవక, మీ కార్యములను నిష్ఫలముల నొనరింపక, యీ మహాప్రస్ఫుట, మహోన్నత, శోభాయమాన, ప్రకీర్తియుత దివ్యావిష్కరణ సత్యమును తిరస్కరింపక జాగరూకులు కండు. మీ సృష్టికర్తయగు భగవంతుని దివ్యధర్మమును నిష్పాక్షికముగ విమర్శ చేయుడు; ఊర్ధ్వస్థిత సింహాసనమునుండి భువికంపబడిన దాని నవలోకింపుడు; అమలిన, విమలమనస్కులై దానిని గురించి పర్యాలోచన మెునరింపుడు. అప్పుడు, సూర్యుడు తన మాధ్యాహ్నికతేజమును ప్రదర్శించినయటుల - ఈ దివ్యధర్మ సత్యము మీ కభివ్యక్తమగును. అప్పుడు, మీ రాయనను విశ్వసించిన వా రగుదురు.

వచించు: ఆయన యథార్థతను ప్రతిష్ఠాపించు ప్రప్రథమ నిదర్శనము సాక్షాత్తూ ఆయనయే. ఈ నిదర్శనమునకు తదుపరిది, ఆయన దివ్యావిష్కరణము. వీనిలో దేనిని గుఱుతించుటయందైనను వైఫల్యము నొందినవారి నిమిత్తము, తన యధివాస్తవికతా సత్యమునకు నిదర్శనముగా, ఆయన తా నావిష్కరించిన వాక్కులను స్థిరీకృత మెునరించినాడు. మానవులయెడ ఆయనకు గల మృదుకారుణ్యమున కిది నిశ్చయముగ నొక ప్రతీకయే. భగవత్సంకేతములను గుఱుతించు సామర్ధ్యమును, ఆయన ప్రతి యెుక్కనికీ యనుగ్రహించినాడు. అటుల గాక, మీరు మీ మనముల యందున తన దివ్యధర్మముపై పర్యాలోచింపు చుండిన పక్షమున, ఆయన యిక మానవులయెడ తన ప్రమాణము నెవ్విధముగ నెరవేర్పగలిగి యుండెడివాడు? ఆయన యెన్నడూ, ఎవ్వని తోడనూ ధర్మవిరుద్ధముగా వ్యవహరింపడు, సామర్ధ్యాతీతకార్యము నేవ్యక్తికీ నిర్దేశింపడు. నిశ్చయముగా, ఆయన దయామయుడు, సకల కరుణాన్వితుడు.

వచించు: భగవంతుని దివ్యధర్మ మెంతటి మహత్తరమైనదనిన, అంధులు సైతము దానిని గ్రహియింపగలరు; సునిశితదృక్కులును, పవిత్రదార్శనికులును యింకెంతగ దానిని తెలియుదురో! అంధులు సూర్యరశ్మి నవలోకింపజాలకున్నను, దాని నిరంతరోష్ణిమ ననుభవింపగలరు. కాని, దివ్యాదిత్యుడు తమపై యెంతకాలము భాసిల్లినను, బయాన్‌ జనుల యందలి మానసికాంధులు—ఇందులకు భగవంతుడే నాకు సాక్షి—తద్వైభవశోభ నవలోకించుటకైనను, తత్కిరణోష్ణిమ నాస్వా దించుటకైనను సత్త్వహీనులే.

వచించు: ఓ బయాన్‌ జనులారా! మమ్ముల నరసి, గుఱుతించుటకు యీలోకమున మిమ్ముల నెంచుకొనినారము. “సర్వశక్తిమంతుడను, మహోన్నతుడను నగు నేను దక్క వేరు దైవము లే,” డని, నిత్యాగ్ని బహువిధస్వరములతో ఘోషించిన పవిత్రస్థలికి, దివ్యస్వర్గపు దక్షిణదెసకు మిమ్ములను సామీప్యుల నొనరించినాము. అల్పానల్పములన్నింటినీ ఆవరించి, సకల కరుణాన్వితుడగు మీ దేవదేవుని యిచ్ఛాప్రభాతమున కెగువనభాసిల్లుచున్న యీ దివ్యాదిత్యు డగుపింపకుండునటుల, మీరు ముసువులయం దాచ్ఛాదితు లగుదురేమో, జాగరూకులు కండు. మీ స్వీయనేత్రములతో తద్వైభవము నవలోకించుటకు - మీ దృష్టిని నిష్కల్మష మెునరించుకొనుడు, మీ స్వీయదృష్టిపై దక్క అన్యుల దృష్టిపై యాధారపడవలదు; ఏలయన, భగవంతు డెవ్వనిపైనను, ఎన్నడును, ఆతడి శక్తికి మించిన భారమును మోపియుండలేదు. ఇది యివ్విధముగా, పూర్వ దివ్యప్రవక్తలకును, దివ్యవార్తావహులకును ప్రసాదిత మైనది, సమస్త పవిత్ర లేఖనముల యందునను లిఖియింప వడినది.

ఓ జనులారా! భగవంతు డాద్యంతములను నిర్దేశించియుండనియట్టి, ఆయన వాణి సమున్నతీకృతమైనయట్టి పావన, యశోమయ, సుమధుర సుగంధము లభివ్యాప్తములైనయట్టి - ఈ సువిశాల విశ్వమున ప్రవేశమునొంద యత్నింపుడు. మీరు దివ్యవైభవాంబర విహీనులు కావలదు; మీ ప్రభుని స్మరణమునకు మీ హృదయములనూ, ఆయన మహాద్భుత, మహోదాత్త, సర్వప్రేరక, సువిదిత, మహోధృతవాణీ జనిత మధురవచనముల శ్రవణమునకు మీ వీనులనూ - అవరోధింపవలదు.

LIII

ఓ నాసిర్‌, ఓ నా భృత్యుడా! నిత్యసత్యమగు భగవంతుడు నాకు సాక్షి. ఈ యలౌకిక దివ్యతరుణుడు యీ దివ్యయుగమున, మానవశీర్షముల కెగువగ వైభవాన్విత యమృతకలశము నెత్తి, ఏ నయనము తన దివ్యవైభవమును గుఱుతించునో యనియు, ఏ హస్తము తన హిమధవళహస్తమునుండి తత్కలశమును పరిగ్రహించి పరిపూర్తి గావించుటకు వెనుదీయక ముందునకు చాచబడునో యనియు నుత్సుకమున ప్రతీక్షింపుచు తన పీఠముపై నిలచియున్నాడు. అయినను, ప్రాచీనరాజన్యుని యీ అసమాన, ఈ మృదుప్రావాహిక కారుణ్యమును గ్రోలినవారు కొందరే. వీరు మహోన్నత స్వర్గసౌధముల నాక్రమించి, అధికారపీఠములపై స్థిరముగ ప్రతిష్ఠాపితులైనారు. భగవంతుని ధార్మికత్వముపై యాన! మీరీ సత్యమును గ్రహియించువారేని, వారికన్ననూ - ఆయన యశోదర్పణములైనను, ఆయన నామముల యావిష్కర్తలైనను, మునుపటిదో, మునుముందు విలసిల్లునదో నగు మరి యే సృజితాంశ మైనను, ఎన్నటికీ యౌన్నత్యము నొందజాలవు.

ఓ నాసిర్‌! మనుష్యవిజ్ఞానమెంత విస్తృతమైననూ, వారి యవగాహన మెంత ప్రగాఢమైననూ, వారి గ్రహణశీలత కందనంతటి మహోన్నత మీదివ్యయుగ మహనీయత. తత్ప్రభాసమునకు దూరులై, తద్వైభవమును దర్శింపని వారి యూహల కది యింకెంతటి యతీతమో! నీ దృష్టి నవరోధించు తీవ్రాచ్ఛాదనమును భగ్నము గావించితివేని - ఆదిరహితాద్యమునుండి యంత్యరహితాంత్యము వరకును - అట్టి వదాన్యత కెద్దియును సదృశము కాని, సమము కాని కాజాలదని గ్రహియింతువు. అవగుంఠనాచ్ఛాదితులవలె తనకు దూరులైన వారు తన వైభవమును గుఱుతింప గలుగవలెననిన, భగవత్ప్రతినిధియైన ఆయన, యెంచుకొనవలసినది, ఏ భాషను? నా సకలప్రకీర్తిత నామమున, ధార్మికులును, ఊర్ధ్వస్థిత దివ్యసామ్రాజ్యవాసులును పవిత్రతామధువును తనివార సేవింపవలె. వారు దక్క , తత్ప్రయోజనములయం దెవ్వరును భాగము నొందరు.

LIV

నా పరమప్రియుడగు భగవంతుని ధార్మికత్వముపై యాన! లౌకిక నేతృత్వము నెన్నడును నే నపేక్షింపలేదు. అభివ్యక్తము గావింపుమని దయాన్వితుడును, సామ్యరహితుడును నగు భగవంతుడు నా కాజ్ఞాపించిన దానిని, మానవులకు - అది యీ లౌకికసంబంధిత సమస్తమునుండియూ వారలను, నిర్లిప్తుల గావించి, నాస్తికులు గ్రహియింపలేని, మూఢు లూహింపజాలని మహోన్నత శిఖరముల నందుకొను నట్లొనర్చునటుల- సంక్రమింప జేయుట నా పరమావధియై యున్నది.

LV

ఓ తా ధాత్రీ! నీ ప్రభుడు నిన్ను తన సింహాసనపీఠిని గావించి, తన వైభవశోభావృత నొనరించిన పూర్వదివసములను స్ఫురణకు దెచ్చుకొనుము. నీయెడ ప్రగాఢానురక్తి కొలది తమ యసువుల నర్పించి, నీకై తమ సమస్తమునూ త్యాగ మెునరించిన ఆ పునీతాత్ముల, ఆ దృఢనిశ్చయ ప్రతీకల సంఖ్యాధిక్యత యెంతటిదని! ఆనందము నీది, మహదానందము నీయం దధివసించు వారిది. ప్రపంచాభీష్టమైన ఆయన జీవశ్వాస—ప్రతి వివేచనాన్విత హృదయమూ యెఱిగిన యటుల—నీనుండి వెలువడు ననుటకు సాక్ష్యము నిత్తును. అగోచరుడు నీయం దావిర్భూతుడైనాడు, మనుష్య నేత్రముల కగోచరముగనుండినది నీనుండి వెలువడనైనది. నీ ద్వారసీమలయందున తమ రుధిరమును చిందించి, నీ మంటి యడుగున ధూళియైన నీ విశ్వసనీయ ప్రియతముల సమూహమునం దెవ్వరినని మేము సంస్మరింపవలె? భగవంతుని ప్రియసౌరభములు నీపై యవిచ్ఛిన్నముగ పరివ్యాప్తములైనవి; పరివ్యాప్తము లగుచునేయుండునవి నిరంతరము. నిన్ను స్మరియించుటకును, నియంతృత్వపీడితులై నీ మంటికి యడుగున నిద్రాణులైన ఆ స్త్రీపురుషులను సంకీర్తించుటకును - మా దివ్యలేఖిని యుద్యుక్త మైనది.

వారియందున - మా విధేయతాచిహ్నముగ, తనయెడ మా వాత్సల్యాన్విత కారుణ్యమునకు నిదర్శనముగ మేమిప్పుడు స్ఫురణకు తెచ్చుకొనుచున్న మా స్వీయసహోదరియు కలదు. ఎంతటి దయనీయ మామె పరిస్థితి! ఎంతటి పరిత్యక్తావస్థయందున తన దైవమును చేరుకొనినదామె! మా సర్వావృత జ్ఞానము కొలదియు, మేము మాత్రమే దాని నెఱుగుదుము.

ఓ తా దాత్రీ! భగవత్కృపవలన, నీ వింకనూ, ఆయన ప్రియతములు సమావిష్టులైన కేంద్రస్థలివే. సంతోషాత్ములు వారు; ఇయ్యద్భుత దివ్యయుగమున కధినాథుడైన భగవంతుని పథమున, తన క్లేశములయందున, నీ యాశ్రయము నాశించు ప్రతి శరణార్ధియూ సంతోషాత్ముడే! నిజైకదైవమును స్మరియించు వారును, ఆయన నామము నారాధించి, ఆయన దివ్యధర్మమును మనఃపూర్వకముగ సేవింపనెంచువారలును ధన్యులు. ప్రాచీన పవిత్రగ్రంథ ప్రస్తావితులు యీ మానవులే. “మే మిపు డాస్వాదించు ధన్యతకన్నను, వారికై నిరీక్షించు ధన్యత మిన్న” యనుచు, విధేయుల సేనాని తన ఘనతర ప్రస్తుతిని వర్షింపజేసినది వారిపైననే. నిక్కముగ, యథార్థమును పలికినా డాయన; దీనిని మేమిపుడు ధృవీకరింపుచున్నాము. అయినను, వారి స్థాయీవైభవ మింకనూ, అవ్యక్తసమమే. నిశ్చయముగ, దైవశక్తిహస్తము - ఆ ముసువును తొలగించి, లోకనేత్రమున కాహ్లాదము నిచ్చి శోభిల్లజేయు దానిని మనుష్యదృష్టికి బహిర్గత మెునరించును.

మీరింతటి యద్భుతానుగ్రహమునకు పాత్రులై, భగవంతుని ప్రశంసాభరణముతో నలంకృతు లైనందున, శాశ్వతసత్యమగు భగవంతునికి—సమున్నత మాయన వైభవము—కృతజ్ఞతల నర్పింపుడు. ఈ దివసముల ప్రాశస్త్యము నవగాహన మొనరించుకొని, ఈ దివ్యావిష్కరణ కనుమోదమగు దానికి కట్టువడి యుండుడు. నిక్కముగా, ఆయన యుపదేశకుడు, దయామయుడు, సర్వజ్ఞుడు.

LVI

ఓ తా ధాత్రీ! నీకెద్దియును వేదనను కలిగింపకుండు గాక, ఏలయన భగవంతుడు సకల మానవాళికిని సంతోషదాయినిగ నిన్నెంచుకొనినాడు. ‘ఆయన’ మునుపు తోడేళ్లు చెల్లాచెదరొనంచిన దేవదేవుని మందను సమైక్యపరచి, న్యాయపరిపాలన గావించువానిని నీ సింహాసనమునం దధిష్టింపజేసి యాశీర్వదించు గాక! అట్టి పాలకుడు, ఆనందోత్సాహములతో, బహాజనుల కభిముఖుడై, వారికి తన యనుగ్రహముల నందింపగలడు. ఆతడు, వాస్తవమునకు భగవంతుని దృష్టియందున మానవజాతికి మణిభూషణముగ గణియింపబడును. దైవమహిమయును, ఆయన దివ్యావిష్కరణా సామ్రాజ్యవాసు లందరి కీర్తియును ఆతడికి శాశ్వతముగ లభియించును.

మహదానందము నొందుము; ఏలయన, తన దివ్యవైభవావతారము నీయం దావిర్భవించుటచే భగవంతుడు నిన్ను “తన శోభాప్రత్యూషము” గావించినాడు. కారుణ్యప్రభాతనక్షత్రము ప్రభవిల్లినయట్టి, భూమియును, స్వర్గమును శోభిల్లినయట్టి - ఈ నామము నీ కనుగ్రహింపబడినందుకు సంతసిల్లుము.

అచిరకాలమునకే, నీ యంతర్గత వ్యవహారముల స్థితి మారి, అధికార పగ్గాలు ప్రజలచేతికి రాగలవు. సత్యమునకు, నీ దైవము సర్వజ్ఞుడు. ఆయన యధికారము సమస్తవస్తువులను ఆవరించి యున్నది. నీ ప్రభుని దయానుగ్రహములను విశ్వసింపుము. ప్రేమోపేతమగు దయాదృష్టి నీపైననే కేంద్రీకృతమై యుండును. నీ యావేదన, ప్రశాంతతగ, పరిపూర్ణశాంతిగ మార్పునొందు దినము రానై యున్నది. అద్భుతమగు దివ్యగ్రంథమునం దీవిధముగ నిర్దేశితమైనది.

LVII

ఓ మహమ్మద్‌, నా సాన్నిధ్యాస్థానమునుండి నిష్ర్కమించిన తఱి, నీ పదములను నా గృహము దెసకు నిర్దేశించి, నీ ప్రభుని పక్షమున దానిని సందర్శింపుము. తద్వారమును చేరినయంత, దాని యెదుటనిలచి యిట్లనుము: ఓ మహత్తర భగవత్సదనమా, ఆరాధింపుచున్న ప్రపంచమున కెవ్వరి ద్వారా భగవంతుడు నిన్నొక ధృవతారను గావించెనో ఆయన, భూస్వర్గస్థితు లెల్లరకును నిన్ను తన స్మృతిచిహ్నముగ నుద్ఘోషించిన తత్ర్పాచీన సౌందర్యుడు, యెట కేగినాడు? అయ్యహో! ఓ భగవన్మందిరమా, నీవు ఆయన పాదపీఠము గావింపబడిన పూర్వదినములు, సమస్తకరుణాన్వితుని స్వరమాధురి నీనుండి బయల్వెడలిన నిత్యక్లేశ దివసములు! ఏమైనది, సమస్తసృష్టిని శోభిల్లజేసిన నీ రత్నమునకు? ఎటకేగినవి, ప్రాచీనరాజన్యుడైన ఆయన నిన్ను తన దివ్యవైభవ సింహాసనము గావించుకొనిన దినములు, భువికిని, స్వర్గమునకును మధ్యన విమోచనాజ్యోతిగ వర్తించుటకు నిన్ను మాత్రమే యెంచుకొని, ప్రభాతప్రదోషములయందున, సకలప్రకీర్తితుని సుమధురసౌరభమును నీచే పరివ్యాప్త మెునరింపజేసిన దివసములు?

ఓ దైవనిలయమా! ఎక్కడ, తన సాన్నిధ్యప్రకాశముతో నిన్నావరించు కొనిన వైభవాధికారభానుడు? ఏడీ, నీ కుడ్యముల మధ్యన తన యాసనమును స్థాపించిన యనిర్బంధనుడగు నీ ప్రభుని సాదర కారుణ్యప్రత్యూషమైన ఆయన? ఓ భగవత్సింహాసనమా! ఎయ్యది, నీ ముఖచిత్రమును వికృత మెునరించి, నీ స్తంభములను ప్రకంపిల్లజేసినది? అత్యంతాసక్తులై నిన్ను అన్వేషింపవచ్చువారి ముఖముపై, నీ ద్వారమును మూసివైచిన దేదైయుండునో? ఏమది, నిన్నింతగ నిర్మానుష్య మెునరించినది? శాత్రవఖడ్గములు విశ్వప్రియుని వెన్నాడినవని నీ కెఱుకపరుపవడి యుండునే? తన సమస్త విషాదక్లేశముల యందునను తన సహచరిణిగ నిలచినయందులకు నిన్నును, నీ విశ్వసనీయతను దేవదేవు డాశీర్వదించును.

నీ వాయన దివ్యవైభవమునకు వేదికవనియూ, ఆయన పరమపవిత్రా వాసమువనియూ నిరూపింతును. సమస్తసృజితములపైనను పరివ్యాపితమైన సకలయశస్వి నిశ్వాసము నీనుండి వెలువడి, స్వర్గహర్మ్యవాసులైన భక్తుల హృదయముల నానందభరితముల నొనరించినది. నీకై యూర్ధ్వలోక దివ్యగణమును, భగవంతుని దివ్యనామధేయ నగరములవాసులును విలపింతురు; నీకు వాటిల్లిన విపత్తులకు దుఃఖింతురు.

భూస్వర్గాధిపతి నేత్రసారితకేంద్రమగు సర్వశక్తియుతుని నామములకును, లక్షణములకును నీవింకనూ సంకేతానివే. భగవంతుని రక్షణవాగ్దానము భద్రపరుపవడిన యా దివ్యమందసమునకు సంభవించినది, నీ కచట సంభవిల్లినది. ఈ వాక్కుల యాంతర్యమును గ్రహియించి, సమస్త సృష్ట్యధిపతి యైన ఆయన లక్ష్యమును గుఱుతించిన వానికి శుభమగును.

నీనుండి కరుణాన్వితుని సుమధురసౌరభముల నాస్వాదించువారూ, నీ యౌన్నత్యమును గుఱుతించువారూ, సర్వకాలములయందునా నీ పవిత్రతను, నీ మాన్యతను, నీ స్థానమును సంరక్షించువారూ - సంతోషాన్వితులు. నీకు విముఖులై నీ యర్హతను గ్రహియించుటయందున వైఫల్యమునొందిన వారి కన్నులు తెఱువబడవలెననియూ, నిన్నూ, సత్యశక్తితో సమున్నత స్థాయికి నిన్ను సముద్ధరించిన ఆయననూ - వారు నిజముగా గుఱుతింపవలెననియూ సర్వశక్తిమంతుని మే మర్ధింతుము. నిశ్చయముగా, వారు నీపట్ల నిర్లిప్తులే, ఈ దివసమున నిన్నెవ్విధముగనూ యెఱుగని వారలే. నిక్కముగా, నీ దేవదేవు డనుగ్రహాన్వితుడు, క్షమాశీలి.

భగవంతుడు తన భృత్యుల హృదయములను, నీ ద్వారా నిరూపించెననుటకు సాక్ష్యమును వహియింతును. నీ దెసకు పదములను నిర్దేశించి, నిన్ను సందర్శించు మనుజుడు ధన్యుడు. నీ హక్కును ధిక్కరించువానిని, నీకు విముఖుడగు వానిని, నీ నామము నగౌరవించువానిని, నీ పవిత్రతను దూషించువానిని- క్లేశ మావరించును.

ఓ భగవన్మందిరమా! నాస్తికులు నీ పవిత్రతాచ్ఛాదనమును భగ్నము గావించితిరేని ఖేదము నొందవలదు. భగవంతుడు సృష్టిప్రపంచమున నిన్ను తన స్మరణాభరణముతో విభూషిత నొనరించినాడు. అట్టి యాభరణము నెన్నడేని, ఏ మానవుడేని యపవిత్ర మొనరింపజాలడు. సర్వావస్థల యందునను, నీ ప్రభుని దృక్కులు నీదెసకు నిర్దేశితములై యుండును. నిన్ను దర్శించునట్టి, నీకు ప్రదక్షిణ మెునరించి నీ నామమున తన నామంత్రించునట్టి ప్రతియెుక్కని ప్రార్థనమునకును, ఆయన తన శ్రవస్సుల నొగ్గును. నిజమునకు, ఆయన క్షమాశీలి, సమస్త కరుణాన్వితుడు.

ఓ నా దేవా, నీ వియోగముచే నింతగ మార్పునొంది, నీ సాన్నిధ్యమునకు దూరమై విలపించు, నీకు వాటిల్లిన వ్యధలకు శోకించు యీ దివ్యగృహము సాక్షిగా నన్నును, నా మాతాపితరులను, నా సంతతిని, నిన్ను విశ్వసించిన నా సాటివారలను మన్నింపుమని నిన్ను వేడుచున్నాడను. ఓ దివ్యనామధేయాధిపతీ, నీ యనుగ్రహమున నా యవసరములన్నియూ తీరునటులనుగ్రహింపుము. నీవు వరదులకు వరదుడవు, సకలలోకాధిపతివి.

LVIII

మార్మికభూమికి మా బహిష్కరణ తొలివత్సరమున, మా సేవకుడైన మిహ్దీకి వెల్లడింపబడిన దానిని స్ఫురణకు దెచ్చుకొనుము. మా గృహముపై యిప్పటికే సాగింపబడిన చౌర్యహింసాకాండల యెడ, తాను విచారగ్రస్తుడగునేమో యని, రానున్న దివసములయం దాసదనమునకు వాటిల్లితీరవలసినదానిని ముందుగనే మేమాతడి కెఱుకపరచినాము. నిశ్చయముగా, నీ దైవమగు నీ ప్రభుడు స్వర్గస్థిత సమస్తమును, భువిపైనున్న సకలమును యెఱుగును.

ఇవ్విధముగ లిఖియించినా మాతడికి: నా గృహమున కొనరింపవడిన తొలి యనాదరణము కాదిది. గతియించిన దివసములయందున నిరంకుశ హస్తము దానిపై యవమానములను వర్షించినది. నిక్కముగా, ప్రతి విచక్షణాన్విత నయనమునుండియూ అశ్రువులొల్కునటుల, రానున్న దినములయం దది యవమానిత యగును; ముసువున కావల నిగూఢములై, సర్వశక్తిమంతుడును, సకల ప్రకీర్తితుడును నగు భగవంతునికి దక్క యెల్లరకును దుర్ర్గాహ్యములై యున్న యంశముల నివ్విధముగ నీకు బహిర్గత మెునరించినారము. కాలము పరిపూర్ణ మైనయపుడు పరమాత్ముడు, సత్యసత్త్వమున, సమస్త మానవుల దృష్టి యందునను దానికి యుత్కృష్టత నొనగూర్చును. ఆయన దానిని తన దివ్యసామ్రాజ్య ధ్వజముగ, విధేయసమూహ ప్రదక్షితక్షేత్రముగ చేయును. విలాపదివస మరుదెంచకమునుపే, నీ ప్రభుడగు భగవంతు డటుల వాక్రుచ్చినాడు. శాత్రవఘాతములతో మా గృహమునకు సంభవిల్లిన దానికి విచారగ్రస్తుడ వగుదువేమోనని, మా పవిత్రఫలకమున ఈ యావిష్కరణమును నీ కనుగ్రహించినాము. సర్వజ్ఞుడును, సమస్త వివేకియును నగు భగవంతునికి సకల ప్రస్తుతి!

LIX

ఈ దూషితుడు తన దివ్యావిష్కరణోదయమునుండి - సమస్త మానవులనూ తమ వదనములను దివ్యవైభవప్రభాతము దెసకు మరల్పుడని యాహ్వానించెననియు, నీతిబాహ్యతను, అసూయను, అణచివేతను, కుటిలతను నిషేధించెననియు ప్రతి నిష్పాక్షిక విశ్వాసీ యిచ్ఛాపూర్వకముగ నంగీకరించును. అయినను, నిరంకుశుని హస్త మొనరించిన నిర్వాహకమేమో తిలకింపుడు! ఆతడి నియంతృత్వమును వర్ణించుటకు, ఏ లేఖినియూ సాహసింపదు. నిత్యత్వసత్యమైన ఆయన లక్ష్యము సమస్తమానవులకును అమరజీవనము ననుగ్రహించి, వారి శాంతిభద్రతలను సునిశ్చితమెునరించుటయే అయినను, ఎటుల వా రాయన ప్రియతముల రక్తమును చిందించుట కుద్యుక్తులై, ఆయనకు మరణశిక్షను విధియించిరో వీక్షింపుడు.

అజ్ఞులయ్యును, విజ్ఞులయం దగ్రగణ్యులుగ విఖ్యాతులైన వారే యీ క్రౌర్యమునకు ప్రేరకులు. వారి యంధత్వ మెట్టిదనిన, ఎవ్వరి దివ్యద్వారసీమ సేవకుల నిమిత్తము ప్రపంచమును సృజియింపనైనదో ఆయనను, అత్యంత క్రౌర్యముతో యీ దృఢీకృత, వేదనాభరిత కారాగారమున పడవైచినంతటిది. అయినను, వారికిని, యీ “మహత్తరప్రకటన” సత్యమును తిరస్కరించిన వారికిని అతీతముగ సర్వశక్తిమంతుడు - యీ దివ్యకారాగృహమును పరమ ప్రకీర్తిత దేవభూమిగను, స్వర్గములకు స్వర్గముగను పరివర్తిత మెునరించినాడు.

మా వెతలనుండి మా కుపశమనము నివ్వగల యైహికప్రయోజనములను మేము నిరాకరింప లేదు. ఏమైనను, అట్టి భౌతికప్రయోజనములనుండియును, వాటి కతీతముగను, మా పావనాస్థానము పవిత్రీకృత మొనరింపబడినదనుటకు మా సహచరులయందలి ప్రతియెుక్కరును మాకు సాక్ష్యమును వహియింతురు. అయినను, అవిశ్వాసులు మా కొనగూర్పకుండుటకై పెనగిన ప్రయోజనములను, ఈ దివ్యకారాగారమున మేము నిర్బంధితులమైయుండగా స్వీకరించినాము. ఏ మానవుడేని మా నామధేయమున, శుద్ధ సువర్ణ లేదా రజితమందిరమునో, అమూల్య రత్నఖచితసదనమునో నిర్మింప నెంచుచో, నిస్సంశయముగ నట్టి యభిమత మనుగ్రహీతమగును. నిక్కముగా, ఆయన తా దలచుదాని నొనరించును, తా ననుమోదించు దాని నాదేశించును. అంతియేకాక, పవిత్ర గ్రంథములయందున మహోన్నతుని దివ్యలేఖినీవిలిఖిత భవిష్యవాణులు నెరవేర్పబడునటుల, సకలలోకాధిపతియైన భగవంతుడు యీ మహోత్కృష్ట, పరమపవిత్ర, బలయుత, మహాద్భుత దివ్యావిష్కరణమున యుద్దేశించినవి నిర్వర్తితము లగునటుల మహోత్తమ, మహోన్నత నిర్మాణములను యీ దేశమునం దెల్లెడలను నిర్మించుటకును, జోర్డానుకు చేరువగను, తత్సామీప్యమునను గల సుసంపన్న, పావన భూభాగములను నిజైకదైవము—సమున్నత మాయన వైభవము—యెుక్క సేవారాధనముల కంకిత మెునరించుటకును సమ్మతి ననుగ్రహింపనైనది.

మే మీ పూర్వవాక్కులను పల్కినారము: ఓ యెరూషలేమ్‌! నీ పరిధిని విస్తరింపుము; ఓ బహా జనులారా, దీనిని మీ హృదయముల యందున పర్యాలోచింపుడు; దివ్యవ్యాఖ్యాతయును, సర్వాంతర్యామి యును నగు మీ దేవదేవునకు ధన్యవాదముల నర్పింపుడు.

భగవంతునికి దక్క అన్యున కెఱుకవడని మర్మములు వెల్లడింపవడి యుండెనేని, సమస్త మానవజాతియూ సంపూర్ణ, సమగ్ర న్యాయనిదర్శనముల నవలోకించియుండెడిది. ఎవ్వడును ప్రశ్నింప జాలనంతటి నిర్థారణముతో, మానవు లెల్లరును ఆయన యాదేశములకు బద్ధులై, నిష్ఠగా వానిని పాటించి యుందురు. క్రౌర్యవిముఖులై సచ్ఛీల, సజ్జనజీవితమును గడుపువారలకు సుప్రశస్త, వదాన్యతాయుత ప్రతిఫలమును మా దివ్యగ్రంథమున విధియించినాము. ఆయన వాస్తవమునకు మహాప్రదాత, సకల వదాన్యుడు.

LX

నా నిర్బంధము నా కవమానమును కల్గింపజాలదు. నిజముగా, నా జీవితముపై యాన, నా కది యశస్సు ననుగ్రహించును. నన్ను ప్రేమింపుచుంటిమని చాటి, వాస్తవమునకు దుష్టాత్మ ననుసరించు నా అనుయాయుల ప్రవర్తనయే నన్ను లజ్జితుని గావింపగలదు. నిక్కముగా, వారు నష్టభాజనులు.

ఈ దివ్యావిష్కరణకు నిర్దేశిత సమయ మాసన్నమై, ఈరాకున లోకాదిత్యు డావిర్భవించిన యంతనే, సమస్త ప్రపంచమాలిన్యముల నుండియు తమను పునీతుల గావించుదాని ననుసరింపుడని ఆయన తన అనుయాయుల కాజ్ఞాపించినాడు. కొందరు ధార్మిక, సత్యప్రపూరిత పథమున సముచితముగ నిర్దేశితులు కాగా, మరికొందరు తమ యనైతికాభిరుచియుత వాంఛల ననుసరించుటకు ప్రాధాన్యము నిచ్చినారు.

వచించు: తన యైహికవాంఛల ననుసరింపుచునో, తన డెందమును ప్రాపంచికాంశములపై నిల్పుచునో యుండువానిని బహాజనులయందున గణియింపతగదు. తా నొక స్వచ్ఛమైన సువర్ణలోయను చేరినయపుడు, మేఘము వలె నిర్లిప్తుడై, దానియందున నేరుగ ముందునకు సాగుచు, యిక వెనుదిరగని, నిలువని యాతడు నా నిజసహచరుడు. నిక్కముగా, అట్టి మానవు డస్మదీయుడే. ఊర్ధ్వలోక దివ్యగణ మాతడి వస్త్రమునుండి పవిత్రతాపరిమళము నాఘ్రాణింప గలదు. . . ఇక, మిగుల రూపసియును, మహాసౌందర్యవతియును నగు మానినీ తిలక మాతడికి తారసిల్లెనేని, ఆమె యందమున కాతడి మానస మించుకయేని సమ్మోహితము కానేరదు. అట్టి మనుజుడు, నిక్కముగ, నిష్కళంక సచ్ఛీలతకు ప్రతిరూపమే. సర్వశక్తిమంతుడును, సర్వౌదార్యుడును నగు నీ దేవదేవు డాదేశించిన యటుల, దివ్యయుగప్రాచీనుని లేఖిని యివ్విధముగ నీకు నిర్దేశింపుచున్నది.

LXI

ప్రపంచము ప్రసవావస్థయం దున్నది. దాని యావేదన దినదినమునకును హెచ్చిల్లుచున్నది. మూర్ఖత, అవిశ్వాసముల దెసకు దాని వదనము మరల్పవడి యున్నది. దాని దుస్థితి యిట్లుండునని వెల్లడిసేయుట, ఇప్పుడు యుక్తమూ కాదు, సముచితమూ కాదు. దాని బుద్ధివైపరీత్యము సుదీర్ఘమై సాగును. మరి, నిర్ణీతఘడియ సమాసన్నమైనయపుడు మానవజాత్యంగములను ప్రకంపిత మెునరించున దాకస్మికముగ ప్రత్యక్షమగును. అప్పుడు, కేవల మప్పుడే, దివ్యధ్వజపతాక మావిష్కృతమై, స్వర్లోకపు కోయిల తన మధురగీతిక నాలపించును.

LXII

నా దుఃఖములను, నా చింతావ్యాకులతలను, నా యిక్కట్లను, విమర్శనమును, నా నిర్బంధావస్తను, నేను కురియించిన యశ్రువులను, నా పరితాపోధృతిని, ఈ సుదూరస్థలియందున యిప్పటి నా కారావాసమును స్ఫురణకు దెచ్చుకొనుము. ఓ ముస్తఫా, భగవంతుడు నాకు సాక్ష్యమును వహియించును. ప్రాచీనసౌందర్యునికి సంభవిల్లినదానిని నీకు చెప్పవలసివచ్చెనేని, మరుభూమికి పరువిడి బిగ్గరగ రోదింతువీవు. నీ యావేదనకొలది నీ శిరమును మోదు కొనుచు, విషసర్పదంష్ర్టా దష్టునివలె యాక్రందింతువు. పరమాధికారియును, మహాశక్తిశాలియును నగు నీ ప్రభుని యిచ్ఛాస్వర్గము నుండి మా కంపవడిన యనన్వేషణీయ శాసనముల రహస్యములను మేము నీకు బహిర్గత మొనరింప దిరస్కరించినందులకు భగవంతునికి కృతజ్ఞుడవు కమ్ము.

భగవంతుని ధార్మికత్వముపై యాన! ప్రతి యుదయమునను, నా శయ్య నుండి యుత్తిష్ఠుడ నైనయపుడు, నా ద్వారమున కావల యగణిత వ్యధాసంచయములు సమీకృతములగుట నవలోకించి నాడను; చూడుము, ప్రతి రాత్రియును, నేను శయనించునవుడు, నా హృదయము తన శత్రువుల నిర్దాక్షిణ్యక్రౌర్యముతో ననుభవించిన వ్యధతో ఛిద్రితమైనది. ప్రాచీనసౌందర్యుడు త్రుంచునట్టి ప్రతి రొట్టెముక్క తోడను నూతనోపద్రవ విజృంభణ మెుకటి ముడివడినది; ఆయన సేవించు ప్రతి జలబిందువూ తీవ్రవేదనామయ పరీక్షల తిక్తతాన్వితమే. ఇక్కట్ల దండ్లు తనను వేధింపుచూ వెన్నంటి యుండ, తాను వేయు ప్రతి యడుగునకు ముందర, ఆయన కనూహ్యోపద్రవముల సేనయుండును.

నీవు నీ హృదయమున పర్యాలోచించియుండిన, నా యవస్త యట్టిది. అయినను, భగవంతుడు మాపై కురియించిన దానికి, నీ యాత్మను వ్యథనొంద నీయవలదు. ఆయన సమ్మోదముతో నీ యిచ్ఛను మిళితము గావింపుము; ఏలయన, మే మాయన దివ్యాభీష్టమును దక్క , అన్యమగు దేనినీ యెన్నడునూ కాంక్షింపక, ఆయన యనుల్లంఘనీయ శాసనముల నన్నింటినీ స్వాగతించినాము. నీ హృదయమును సాంత్వన మెుందనిమ్ము; వ్యాకులపాటు నొందవలదు. తీవ్రసంక్షుభితుల మార్గము ననుసరింపవలదు.

LXIII

నా దెసకు మోమును మరలించినవాడా! సుదూరమునుండి నీ కన్నులు నా స్వనగరిని వీక్షించినయంతనే, నిలచి యిట్లనుము: “ ఓ తా ధాత్రీ, ఆపత్సాహాయ్యుడును, స్వయంపోషకుడును నగు భగవంతుని సందేశముతో, దివ్యకారాగారమునుండి యరుదెంచినాడను. ఓ లోకమాతా, లోకజన జ్యోతిర్మూలమా, నీకు నీ ప్రభుని సాదరానుగ్రహముల నుద్ఘోషించి, నిత్యసత్యమును, అగోచరాంశజ్ఞుడును నగు ఆయన నామధేయమున - నీ కభివాద మెునరింతును. నిగూఢదివ్యనామమైన ఆయన నీయం దావిర్భూతుడనియూ, అగోచర నిధి బహిర్గత మొనరింపబడెననియూ నిరూపింతును. నీ ద్వారా, భూతభవిష్యత్సంబంధిత సకలాంశముల రహస్యమూ వివృతమైనది.

ఓ తా ధాత్రీ! దివ్యనామముల కధిపతియగు ఆయన - నిన్ను తన వైభవాన్వితస్థానమున స్మరియింపుచున్నాడు. భగవంతుని దివ్యధర్మప్రభాతమువీవు; ఆయన దివ్యావిష్కరణోద్గమనస్థానము వీవు, మానవహృదయములను, ఆత్మలను ప్రకంపితముల నొనరించిన మహాఘననామస్వరూపిణివీవు. నీ ప్రాకారముల మధ్యన, దైవపథమున తమ ప్రాణముల నర్పించి, తమ దుస్థితి మాననీయుడగు ప్రతి భగవత్సేవకునీ దుఃఖితు నొనరించిన యంతటి క్రౌర్యముతో నీ ధూళికి దిగువన భూస్థాపిత మొనరింప బడిన నిరంకుశత్వపీడిత స్త్రీ పురుషుల సంఖ్య యెంత విస్తారమో!

LXIV

పరమప్రియుని పరిమళము పరివ్యాప్తితమును, ఆయన చిహ్న ములు విస్తారితములును, ఆయన వైభవనిదర్శనములు బహిర్గతములును, ఆయన ధర్మధ్వజము లూర్ధ్వీకృతములును, ఆయన పటవేశ్మము ప్రతిష్ఠాపితమును, ఆయన విజ్ఞతాన్విత శాసనములయందలి ప్రతిదియు వివృతమును నైన పవిత్ర, దేదీప్యమాననగరమగు—మహదానందధామమును, స్మరియించుట మా యీప్సితము.

నిష్కల్మష భగవత్ర్పియులను ఆయన దరిజేర్చి పవిత్ర, సుందర దివ్యావాస స్థానసామీప్యత నొందజేసిన పునస్సమాగమ సుమధుర సౌరభములు పరివ్యాప్తితములైన నగరమిది. ఈ నగరికి తన పదములను నిర్దేశించి, తత్ర్పవేశమునొంది కరుణాన్వితుడును, సకలప్రకీర్తితుడును నగు తన ప్రభుని కారుణ్యస్రవంతి నుండి పునస్సమాగమ మధువును సేవించిన పథికు డానందాన్వితుడు.

ఓ మనోభీష్టధాత్రీ! భగవంతుని సందేశములతో నరుదెంచినాడను; ఆయన కారుణ్యౌదార్య దాక్షిణ్యములను నీకు ప్రకటించి, ఆయన నామధేయముతో ని న్నభినందింపుచూ, సంకీర్తింపుచున్నాడను. ఆయన నిక్కముగా, అనంతౌదార్యశుభకరుడు. నీ దెసకు తన వదనమును సారించి, నీనుండి సకల లోకాధీశుడగు భగవంతుని దివ్యసాన్నిధ్యసౌరభము నాఘ్రాణించు మనుజుడు ధన్యుడు. భగవంతుడు తన సేవకులకు నిన్నొక స్వర్గము గావించి, తన దివ్యప్రవక్తలును, తన సందేశవహులును ఆవిష్కరించిన పవిత్రగ్రంథములయందున తానే ప్రస్తావిత మెునరించియున్న పావన ధన్యభూమిగ నిన్నుద్ఘోషించుటం జేసి, ఆయన యశస్సు నీపై వర్ధిల్లినది; ఆయన జ్ఞానప్రభాసము ని న్నావరించినది.

ఓ జ్యోతిర్మయ వైభవప్రపూరిత ధాత్రీ, “ఆయన దక్క వేరుదైవము లే,” డను ధ్వజము వివృత మైనది, “నిక్కముగా నేను దివ్యసత్యమును, అగోచరాంశవిదుడ,” నను పతాకము ఊర్ధ్వీకృతమైనది. నిన్నును, నీ యందున వసియించువారలను, నా వంశవృక్షావిర్భూతులను, తత్పత్రములను, నా యశో చిహ్నములను, న న్ననుసరించువారలను, నా ప్రియతములను, మహాశక్తి సమన్వితసంకల్పులై తమ వదనములను నా వైభవాన్వితస్థానముదెసకు సారించిన వారలను- సంకీర్తించుట, నిన్ను సందర్శించు ప్రతి యెుక్కనికిని - సముచితమగును.

LXV

ఈ నగరికి నీ వరుదెంచినయపుడు సుల్తాను మంత్రులు తమ చట్టములకును, నిబంధనల కును యెట్లు ని న్నపరిచితునిగ పరిగణించి, యజ్ఞానిగ భావించిరో జ్ఞప్తికి తెచ్చుకొనుము. వచించు: అవును, నా ప్రభునిపై యాన! భగవంతుడు తన వదాన్యతాన్వితోపకృతి మూలమున నాకు బోధింప నిచ్చగించిన దానిని దక్క సకలాంశముల నెఱుగుటయందునను నే నజ్ఞానినే. నిశ్చయముగా మే మిందులకు సాక్ష్యము నిత్తుము, నిస్సంకోచముగా దీని నంగీకరింతుము.

వచించు: మీరు విధేయులైయున్న చట్టములును, నిబంధనలును మీ స్వకీయకల్పనములైనచో, ఎవ్విధముగను వాటిని మే మనుసరింపము. సర్వవివేకియును, సకలవిదుడునునగు ఆయనచే యివ్విధముగ నే నాజ్ఞాపితుడను. భగవంతుని సత్త్వశక్తులవలన పూర్వము నే ననుసరించియుండిన, భవిష్యత్తునం దనుసరింపనున్న తెఱవిది. నిక్కముగా, ఇదియే సత్యపథము, సవ్యమార్గము. మీరు సత్య మాడువారేని, మీ నిదర్శనములు దైవాదేశితములేని - వాటిని ప్రదర్శింపుడు. వచించు: వారు నీ కాపాదించిన దానినెల్లయును, నీ కొనరించిన దెల్లయును, ఏ మానవుని చర్యనైనను - అది యెంతటి అల్పతమమైనను - అప్రస్తావితముగ వదలివేయని గ్రంథ మొకదానియందున మేము లిఖియించినాము.

వచించు: ఓ సామ్రాజ్యసచివులారా, భగవంతుని యుపదేశములను పాటించుటయును, మీ స్వీయశాసననియమములను త్యజియించి సవ్యమార్గానువర్తితులగుటయును మీకు శ్రేయస్కరము. ఎఱిగితిరేని, మీ యావత్సముపార్జితమున కన్నను మీకు శ్రేష్ఠతరమిది. మీరు భగవంతుని యాదేశము నతిక్రమించితిరేని, మీ సమస్తకార్యముల యందలి యిసుమంతయేని, లేశమాత్రమేని ఆయన దృష్టియం దామోదనీయము కాదు. అచిరకాలమునకే, మీ రీనిష్ఫల జీవితమున మీ రొనరించినదాని పర్యవసానములను గ్రహియింతురు, తత్ర్పారబ్ధమును సైత మనుభవింతురు. నిక్కముగా, ఇది సత్యము; నిష్ఠురసత్యము.

స్థాయీపరముగ మిమ్ములను మించినవారైననూ, మీరు పాల్పడిన వాటికే పూర్వయుగముల యందున పాల్పడి తుదకు మంటిపాలై, అపరిహార్యమైన తమ దుర్విధికి బలియైనవారి సంఖ్యాధిక్యత యెంతటిదని! భగవంతుని దివ్యధర్మమును గురించి మీ మానసములయందున యోచించియుందురా! మీరు సైతము, వారల ననుసరించియే సాగి, మీతో నెయ్యమెుందుటకేని మీకు సాహాయ్య మెునరించుట కేని యెుక్కడైనను కానరాని తావున ప్రవేశితు లగుదురు. వాస్తవమునకు, మీరు మీ కృత్యములను గురించి ప్రశ్నితులగుదురు; భగవంతుని దివ్యధర్మమున మీ కర్తవ్యపాలనా వైఫల్యమునకును, ప్రస్ఫుట నిష్కల్మషులై మీచెంత కరుదెంచిన ఆయన ప్రియతములను దురహంకారమున తిరస్కరించి నందులకును మీరు పరిగణనమునకు పిలువబడుదురు.

వారిని గురించి సమాలోచనముం జేపట్టినవారును, మీ స్వీయేచ్ఛా ప్రేరణల ననుసరించుటకు ప్రాధాన్యతనిచ్చినదియును, ఆపత్సాహాయ్యుడూ, శక్తిమంతుడూ అయిన భగవంతుని యాదేశము నలక్ష్య మెునరించినదియును - మీరే.

వచించు: ఏమీ! మీ స్వీయోపాయములకు కట్టువడి, దైవోపదేశముల నావల వైతురా? నిక్కముగా, మీరు దూషితులై, అన్యులను సైత మటులొనరించినారు. దానిని మీరు గ్రహియింప గలుగుదురా! వచించు: మీ నియమనిబంధనలు ధర్మబద్ధముగనే యేర్పరుపబడి యుండెనేని, మీ దురాలోచనల కనుగుణముగనుండు వాని ననుసరింపుచు, మీ వాంఛావిరుద్ధములగు వానిని త్రోసి పుచ్చుట యేలనో? మానవులయందున నిష్పాక్షికముగ న్యాయనిర్ణయ మొనరింతుమని యే హక్కుతో మీ రనగలరు? మీ యాదేశానుసారము స్వయముగ మీ యెదుట కరుదెంచినయట్టి ఆయనను మీరు వేధించుటను, ఆయనయెడ మీ తిరస్కృతిని, ఆయనకు మీ రనుదినమును కలుగజేయు తీవ్రవేదనను - సమర్ధించునవేనా, మీ నియమనిబంధనలు? ఆయన మిమ్ముల నెన్నడేని, క్షణమాత్రమేని ధిక్కరించెనా? ఈరాకు ప్రజలెల్లరును, విచక్షణాన్వితుడగు ప్రతి పరిశీలకుడును నా వాక్కుల యథార్థ్యతకు సాక్ష్యమును వహియించును.

ఓ సామ్రాజ్యామాత్యులారా! మీ నిర్ణయమున, నిష్పాక్షికముగ వర్తింపుడు. మా బహిష్కృతికి సమర్ధకమగు ఏ యకృత్యమును మే మెునరించితిమి? మా వెలివేత కాదేశించిన యకార్యమేమి? మిమ్ములను చూడవచ్చినది మేము; అయినను వీక్షింపుడు, మమ్ముల నాదరించుటకు మీరెట్లు నిరాక రించిరో! భగవంతునిపై యాన! ఇది మీరొనరించిన ఘోరదురన్యాయము—ప్రాపంచికమగు ఏ యన్యాయముతోడను సరిపోల్పగరాని దురన్యాయ మిది. సర్వశక్తిమంతుడే యిందుల కొక సాక్షి. . . .

ప్రపంచమూ, దాని యాడంబరములూ, తత్పటాటోపములూ అంతరించునని తెలిసికొనుడు. సమస్తసార్వభౌమవిభుడును, ఆపత్సాహాయ్యుడును, సకలవైభవాన్వితుడును, సమస్త శక్తిమంతుడును నగు ఆయనకు చెందియున్న భగవత్సామ్రాజ్యము దక్క, ఇంకేదియూ స్థిరము కాదు. మీ జీవిత దివసములు దొరలిపోవును, మీరు నిరతులైనవియును, అతిశయిల్లినవియును—అన్నియూ నశియిం చును; సృష్ట్యంగముల నన్నింటినీ ప్రకంపితముల నొనరించునట్టి, ప్రతి నిరంకుశునీ భీతిల్లజేయునట్టి స్థలికి - వచ్చి యగుపింపుమని ఆయన దేవదూతా సందోహ మెుక్కటి, నిశ్చయముగా మిమ్ముల నాదేశించును. మీ యీ శుష్క జీవిత కాలమున మీ హస్తనిర్వాహకములను గురించి మీరు ప్రశ్నితు లగుదురు; మీ కృత్యములకు ప్రతిఫలము సైతము సిద్ధించును. ఇది మీకై యనివార్యముగ నరుదెంచు దివసము; ఎవ్వరును యథాస్థానమున కంపజాలని ఘడియ. సత్యమును భాషించు సర్వవిషయజ్ఞుని జిహ్వ, ఇందులకు సాక్ష్యము నిచ్ఛినది.

LXVI

నగరవాసులారా! భగవద్భీతులు కండు, మనుజులయందున కలహ బీజములను వేయవలదు. దుష్టాత్మ మార్గములయందున పయనింపవలదు. అల్పశేషితములైన మీ జీవిత దివసములలో, నిజైకదైవపథముల యందున పయనింపుడు. మీ పూర్వీకుల దివములవోలె, మీ దివసములును గతియించును. మీ పితరు లేగిన యటులే, మీరు సైతము మంటిలోని కరుగుదురు.

భగవంతునికి దక్క నేనింకొకనికి భీతిల్లనని తెలియుడు. నా విశ్వాసమును, ఆయనపై గాక అన్యునియం దుంచలేదు; ఆయనకు దక్క , అన్యునకు నేను బద్ధుడను కాను, ఆయన నాకై యభిలషించిన దానిని గాక యింకెద్దానినీ నే నాశింపను. మీరు గ్రహియించితిరేని, నిక్కముగా నా మనోభీష్టమిది. సకల లోకాధీశుడగు భగవంతునికి నా యాత్మను, నా దేహమును నివేదనముగ నర్పించినాడను. భగవంతుని యెఱిగినవారు, ఆయనను దక్క యింకెవ్వనినీ ఎఱుగరు; భగవంతునికి వెఱచు నాతడు, యావత్ప్రపంచ శక్తులూ విజృంభించి, తనకు వ్యతిరేకముగ శ్రేణులు దీరిననూ, ఆయనకు దక్క అన్యునకు భీతిల్లడు. ఆయన యాదేశమున దక్క, నే నెద్దానినీ వక్కాణింపను, దైవబలముతో, శక్తితో - ఆయన సత్యమును దక్క, ఇతరము ననుసరింపను. ఆయన, సత్యవర్తనులకు నిక్కముగా ప్రతిఫలము ననుగ్రహించును.

ఓ సేవకుడా, నగరికి నీ వరుదెంచినయపు డవలోకించిన వాటిని - మానవులయందున శాశ్వతముగ నిలచునటుల, నమ్మినవారికి హెచ్చరికగ నుపకరించునటుల - వర్ణింపుము. మేము నగరములోనికి ప్రవేశించినయంత, తత్పాలకులును, పెద్దలును మంటియందునకూడి, యాడుకొను చుండిన బాలలవలె మా కగుపించినారు. వారియం దేయెుక్కరికినీ, భగవంతుడు మా కుపదేశించిన సత్యములను మానుండి పొందునంతటి పరిణితియేని, మా యద్భుతవిజ్ఞతాన్విత ప్రవచనముల కనువగు పరిపక్వతయేని లేదని గ్రహియించినాము. తా మెందునిమిత్తము సృజియింపబడిరను యంశముపట్ల వారి పూర్ణయలక్ష్యమునకును, వారి యుల్లంఘనలకును, వారికై మా యంతర్నేత్ర మెంతయేని విలపించినది. మే మానగరమున పరిశీలించినదియూ, వారికిని, శేషించిన మానవాళికిని హెచ్చరికగ నుపకరింపవచ్చునేమోయని మా దివ్యగ్రంథమున ప్రస్తావింప నెంచుకొనినదియూ - ఇదియే.

వచించు: మీరు యీజీవితమును, తదాడంబరములను వాంఛించువారలేని, మీ మాతృ గర్భములయం దున్నపుడే వాటిని మీ రన్వేషించియుండ వలసినది; ఏలయన, గ్రహియింపగల్గితిరేని, మీ రాతరుణమున వాటి కవిచ్ఛిన్నముగ చేరువయగుచునే యుండినారు. వేరొకవంక, మీరు జనియించి, యుక్తవయస్కులైన నాటినుండియు, ఈ ప్రపంచమునుండి సర్వదా తిరోగమింపుచు, ధూళికి సన్నిహితులగుచునే యున్నారు. మీ దివసములు నిర్ణీతములును, మీ యవకాశము దరిదావుగ ముగియనుండగను, భౌమసంపదల నపారముగ సంచిత మెునరించుకొనుటయం దత్యాశను ప్రదర్శింతురేల? ఓ అజాగరూకులారా! మీ నిద్రావస్థ నిక మీరు విదళించుకొనరా?

భగవన్నిమిత్తమై యీ భృత్యుడు మీ కిడుచున్న యుపదేశములకు మీ వీనుల నొగ్గుడు. నిక్కముగా, ఆయన మీనుండి యెట్టి ప్రతిఫలమునూ అర్ధించుటలేదు; తనకు భగవంతు డాదేశించిన దానికి ఆయన బద్ధుడు, దైవేచ్ఛకు పూర్ణవిధేయుడు.

ఓ జనులారా, గణనీయముగ మీ జీవితదివసములు గడచిపోవ, సత్వరమే మీ యవసానము చేరువయగుచున్నది. కావున, మీ రేర్పచుకొని, అవలంబించు వాటి నావలకు త్రోసివైచి భగవంతుని ధర్మసూత్రములయందున దృఢీకృతులు కండు. తద్వారా, ఆయన మీకై యుద్దేశించిన వానిని, దైవవశమున సాధించి, మీరు సన్మార్గానుసారులు కావచ్చును. ఐహికాంశముల యందునను, దాని నిరర్ధకాలంకారములపట్లను హర్షితులు కావలదు, వానిపై యాశలనూ నిలుపుకొనవలదు. మహోన్నతుడును, మహామహుడును నగు భగవంతుని స్మరణపైననే మీ నమ్మిక నుండనిండు. మీ సముపార్జితములైన సమస్తవస్తువులనూ, అనతి కాలమునకే, ఆయన శూన్యము గావించును. ఆయనను మీ భయహేతువు కానిండు; మీతో ఆయనకుగల యొడంబడికను విస్మరింపవలదు; ఆయన కానరాకుండునటుల ముసువుతో నాచ్ఛాదితులైన వారివలె యుండవలదు.

భగవంతుని యెదుట గర్వాతిశయులై, ఆయన ప్రియతములను మీ రవహేళనాపూర్వకముగ తిరస్కరించేరు, జాగ్రత్త. భగవంతునీ, భగవత్సంకేతములనూ విశ్వసించినవారికిని, ఆయన యేకేశ్వరత్వ వీక్షణాహృదయులును, ముఖతః ఆయన యేకత్వము నుద్ఘోషించువారును, ఆయన యానతితో దక్క సంభాషింపని వారును నగు విశ్వసనీయులకును - వినమ్రపూర్వకముగ మీరు విధేయులు కండు. దైవవశమున మీరు జాగృతులగుదురని, మిమ్ముల నిట్లు ధర్మయుతముగ నుద్బోధింపుచు, సత్య పూర్వకముగ హెచ్చరింపుచున్నాము.

మీరు మీపై మోపుకొన నిచ్చగింపని భారము నెవ్వనిపైనను మోపనూ వలదు, మీకై మీ రాకాంక్షించుకొనని వాటి నెవ్వనికినీ కాంక్షింపనూవలదు. పాటించితిరేని, మీకు నా పరమోపదేశ మిదియే.

మీ యందున తమ వృత్తులకనుగుణమగు వర్తనగలవారును, దైవనిర్థారిత పరిధుల నతిక్రమింపనివారును, ఆయన దివ్యగ్రంథావిష్కృతములైనట్టి ఆయన యాజ్ఞలతో నేకీభవించు నిర్ణయములను గైకొనువారును నగు మతాధిపులను, విద్వాంసులను గౌరవింవుడు. వారు స్వర్గముల యందునను, భూమిపైనను నివసించు వారలకు మార్గదర్శకదీపికలని తెలియుడు. తమ మధ్యన వసియించు మతాధిపులను, విద్వాంసులను నిరాదరించి, నిర్లక్ష్యమెునరించిన వారలు—భగవంతుడు తమ కనుగ్రహించిన యుపకృతిని, నిక్కముగ, మార్చివైచిరి.

వచించు: భగవంతుడు మీకు తన యనుగ్రహమును మార్చునంత వరకూ నిరీక్షింపుడు. ఆయన నుండి యేదియూ తప్పించుకొనదు. ఆయన భూ, స్వర్గములు—రెండింటి రహస్యములనూ యెఱుగును. ఆయన జ్ఞానము సమస్తాంశములనూ ఆవరించును. మీ రొనరించిన లేక భవిష్యత్తునం దొనరించు దానితో సంతసిల్లనూ వలదు, మాకు మీరు కల్పించిన విపత్తునకు మోదిల్లనూ వలదు, ఏలయన, పూర్ణవిచక్షణాన్వితులై మీ చర్యలను సమీక్షించుకొనిరేని, తద్విధానములు మీ స్థాయిని సమున్నత మెునరింపనూ జాలవు, మా స్థాయీ యౌన్నత్యమును చిన్నబుచ్చుటకు మీరు సమర్థులునూ కారు. వాస్తవమునకు, మేము మా కొదవిన వేదనలను మెుక్కవోని సహిష్ణుతతో భరియించినందున, భగవంతుడు తాను మాకు బహూకరించు ప్రతిఫలమునకు అదనముగ చేకూర్చును. సహనముతో భరియించు వారిదగు బహూకృతిని, ఆయన, నిక్కముగా ప్రవృద్ధ మెునరించును.

కష్టములూ, కడగండ్లూ - భగవంతు డెంచుకొనినవారల, ఆయన ప్రియతముల, ఆయన దక్క సకలమునుండియూ విముక్తులైన ఆయన సేవకుల, అటులే వస్తూత్పత్తులతోనో వాణిజ్యముతోనో సర్వశక్తిమంతుని స్మరణమును యేమఱ నట్టి, ఆయన పలుకనంతవరకు పలుకనట్టి, ఆయన యాదేశానుగుణముగ వ్యవహరించునట్టి వారల సంచయమునకు స్మృత్యతీతకాలము నుండియూ సంప్రాప్తితములే యని తెలిసికొనుడు. అనాదిగా, నిర్వర్తితమగుచూ వచ్చిన దైవవిధానమట్టిది; భవిష్యత్తుననూ, అటులే యుండునది. తమకు సంభవిల్లు దానికి చింతిల్లక, పరిత్యాగపథమున గమింపుచూ క్షోభాసంక్షోభముల యందున సహిష్ణుతను వహియింపుచూ, స్థైర్యమున సహియించు వారు ధన్యులు. . . .

మా రోజులను జ్ఞాపకముంచుకొనుటకు పిలుపునిచ్చు, మా వ్యధాభరిత గాథను వర్ణించు, ఇసుమంతయేని సాక్ష్యములేకయే మాయెడ దురన్యాయ పూర్వకముగ వర్తించినవారలనుండి మా హక్కుల పునరుద్ధరణమును దృఢముగ నభ్యర్ధించు - ప్రజానీకమును భగవంతుడు సమాయత్త మెునరించు దివస మాసన్న మగుచున్నది. మమ్ములను దూషితుల నొనరించిన వారి జీవితములను నిశ్చయముగ, భగవంతుడు శాసించును; ఆయన వారి చేష్టలను బాగుగా యెఱుగును. వారి యపరాధములకు, ఆయన నిస్సంశయముగా వారికి దండనను విధియించును. నిక్కముగా, ఆయన ప్రతీకారులయం దుగ్రతముడు.

దైవవశమున మీ రాయన క్షమ నర్ధింపవచ్చుననియూ, ఆయన చెంతకు మరలవచ్చుననియూ, పశ్చాత్తప్తులు కావచ్చుననియూ, మీ దుశ్చర్యల నెఱుగ వచ్చుననియూ, మీ నిద్రావస్థను విదళించుకొన వచ్చుననియూ, మీ యలక్ష్యత నుండి అప్రమత్తులు కావచ్చుననియూ, మీ చేజారినవానికి ప్రాయశ్చిత్తము జేసికొనవచ్చుననియూ, శుభంకరులు కావచ్చుననియూ - మీ కివ్విధముగ నిజైకదైవ గాథలను వివరించి, ఆయన పూర్వనిర్దేశితాంశములను మీ కనుగ్రహించినాము. నా వాక్కుల సత్యమును గుఱుతించువానిని గుఱుతింపనిండు; అందుల కిచ్చగింపని వానిని వైదొలగనిండు. దైవవశమున మీరు నా యెచ్చరికము నాలించు వారేని, భగవంతుని దివ్యధర్మముపట్ల మీ కర్తవ్యవైఫల్యతను జ్ఞప్తికి దెచ్చుట నా యేకైకవిధి. కావున, నా భాషణము నాలించి, భగవంతుడు తన యనుగ్రహము కొలది మీపై కరుణను వహియించి, మీ దుష్కృత్యములను ప్రక్షాళన మెునరించి, మీ యుల్లంఘనలను మన్నించునటుల, ఆయన వంకకు మరలి, పశ్చాత్తప్తులు కండు. ఆయన క్రోధాగ్నికన్నను, ఆయన కారుణ్యోత్కృష్టత మిన్న; అస్తిత్వములోని కామంత్రితులై, జీవితవస్త్రధారులైన భూత, భవిష్యత్కాలికుల నెల్లరనూ, ఆయన యనుగ్రహ మావరించును.

LXVII

మునుపెన్నడూ కానరానిది, ఈ దివ్యావిష్కరణమున యగుపించినది. దృగ్గోచరితమును గాంచిన యవిశ్వాసులైనచో, గుజగుజలువోయి, “నిక్కముగా, భగవంతునికి విరుద్ధముగా అసత్యము నల్లిన మాయావి యిత,” డందురు. వాస్తవమునకు వారొక బహిష్కృతప్రజ.

యుగప్రాచీనుని ఓ దివ్యలేఖినీ, ఈరాకున వాటిల్లిన ఘటనలను దేశములకు వెల్లడింపుము. మమ్ము కలిసికొనుటకు ఆ దేశమతాధిపుల బృందము తమకు ప్రతినిధిగా నిర్దేశించి పంపగా వచ్చి, మా సాన్నిధ్యమునొంది, శాస్త్రసంబంధిత ప్రశ్నములను కొన్నింటిని మమ్ములనడిగి, మా సహజసిద్ధ జ్ఞాన సాహాయ్యమున మే మెుసంగిన ప్రత్యుత్తరముల నందికొనిన దూతనుగురించి వాటికి చెప్పుము. నిక్కముగా, నీ ప్రభు డగోచరవిషయజ్ఞుడు. “మీ రొందిన జ్ఞాన మెవ్వరును యెదిరింపజాలనిదని మేము సాక్ష్యము నిత్తుము. అయినను, మీకు ప్రజలాపాదింపుచున్న మహోత్కృష్టస్థాన నిరూపణమున కట్టి జ్ఞానము చాలనిది. మీరు పల్కునది సత్యమేయైనచో, ప్రపంచజనసమీకృతశక్తులు ప్రదర్శించుట కశక్తములైన దానిని ప్రదర్శింపు,”డనినా డాతడు. సకలప్రకీర్తితుడూ, ప్రేమాస్పదుడూ నగు నీ ప్రభుని సాన్నిధ్యాస్థానమునం దప్రతిహతముగ నిటు లాదేశిత మైనది.

“విలోకింపుము! ఏ మగుపింపుచున్నది నీకు?” ఆత డవాక్కైనాడు. తా దేఱుకొనినయంత: “సర్వప్రకీర్తితుడును, సకలప్రశంసితుడును నగు భగవంతుని నిజముగ విశ్వసింతు,” ననినా డాతడు. “నీవు జనులచెంత కరిగి వారితో నిట్లనుము: ‘మీ యిచ్చవచ్చిన దానినడుగుడు, తా దలచుదాని నొనరింప శక్తిసమన్వితు డాయన. భూతభవిష్య త్సంబంధిత మేదియూ భంగము కల్గింపజాల దాయన దివ్యేచ్ఛకు. . .’ వచించు: ‘ఓ మతాధిపుల సముచ్చయమా! మీ రభిలషించు యే యంశమునైనను యెంచుకొని, దానిని మీ కావిష్కరింపుమని కరుణాన్వితుడైన మీ దేవదేవు నర్ధింపుడు. ఆయన మీ యిచ్ఛను, తన సార్వభౌమత్వశక్తితో నెరవేర్చెనేని, అప్పుడు మీ రాయనను విశ్వసింపుడు; ఆయన సత్యమును తిరస్కరించు వారలు కావలదు.’ ” ఆత డిట్లనినాడు: “ జ్ఞానోదయ మైన దిపుడు, నెరవేరినది సకలదయాన్వితుని ప్రమాణము.” లేచి నిలచి, తన నంపినవారి చెంతకు - సకలప్రకీర్తితుడును, పరమప్రియతముడును నగు భగవంతుని యానతితో - మరలిపోయినా డాతడు.

రోజులు దొరలిపోయిననూ, ఆతడు మా చెంతకు మరలిరాలేదు. తుద కింకొక దూత యరుదెంచి, ముందుగ తా ముద్దేశించినదానిని జనులు వదలు కొనినారని మాకు దెల్పినాడు. నిజముగా, భీరులు వారు. ఈరాకున జరిగినది యిది; నే గావించు వెల్లడికి నేనే సాక్షిని. దూరభూములయం దీసంఘటన మలజడిని కలిగించినను, తద్భావమును గ్రహియించినవా డొక్కడేని యగుపింపలేదు. మే మవ్విధముగ నిర్దేశించితిమి. మీ రెఱిగినదే కద యిది!

నాపై యాన! గత యుగముల యందున దైవనిదర్శనములను ప్రదర్శింపుమని మమ్ముల నడిగినవారు, వాటిని మే మాతడి కావిష్కరించుటతోడనే భగవత్సత్యమును తిరస్కరించినారు. ఏమైననూ, జనులయందలి యధికాంశము ప్రమత్తులుగనే యుండిపోయిరి. జ్ఞానజ్యోతిశ్శోభితనేత్రులు సకలకరుణాన్వితుని సుమధురసుగంధములను గ్రహియించి, ఆయన సత్యము ననుసరింతురు. నిక్కముగా, వారు న్యాయవర్తనులు.

LXVIII

ఓ నా దివ్యవృక్షఫలమా, తత్పత్రమా! నా వైభవమూ, నా కరుణయూ నీకున్నవి. నీకు వాటిల్లినదానికి, నీ మదిని వ్యధ నొందనీయవలదు. దివ్యజీవనగ్రంథపుం బుటలను పరిశీలించితివేని, నిస్సంశయముగ నీ విషాదములను పారద్రోలి, నీ యావేదన నుపశమింపజేయుదాని నవలోకింతువు.

ఓ నా దివ్యమహీజఫలమా! దైవవిధి, ప్రారబ్ధములపరముగ సర్వోన్నత శాసకుని శాసనములు ద్వివిధములని తెలియుము. రెండునూ శిరోధార్యములే; ఆమోదనీయములే. వీనియం దొకటి అనివార్యము; ఇంకొకటి, మానవులు పేరిడినటుల సంభవనీయము. ధృవీకృతమును, స్థిరీకృతమును నగుటచే తొలిదాని కెల్లరును అత్యంత యిచ్ఛాపూర్వకముగ నొడంబడుదురు. అయినను, దానిని పరివర్తిత మొనరించుటయో, ఉపసంహరించుటయో భగవంతుడే చేయగలడు. అట్టి మార్పువలన సంభవిల్లు పరిణామము, నిర్ణయమున మార్పు లేనందున వాటిల్లు దాని కన్నను తీవ్రమైయుండును గనుక, ఎల్లరును, ఆయన యభీష్టము నకు యిచ్ఛాపూర్వకముగ సమ్మతించి, పూర్ణవిశ్వాసముతో బద్ధులు కావలె.

అయినను, ప్రార్థనయూ, అభ్యర్థనయూ - సంభవనీయ నిర్ణయమును ప్రతిరోధించుటయందున సఫలము కాగలిగినవే.

దాని దుష్పరిణామములనుండి - నా దివ్యవృక్షఫలమైన నీవును, నీతో సహచరించువారలును సంరక్షితులగునటుల భగవంతు డనుగ్రహించును.

వచించు: ఓ దేవా, నా దేవా! నీదైన నిధి నొకదానిని నా హస్తములయం దుంచియుంటివి; నీ యిచ్ఛాసంప్రీత్యనుసారము, దాని నిపుడు నీదెస కుపసంహరించుకొనినాడవు. నీ సమస్తవర్తనల యందునను నీవు ప్రకీర్తితుడవును, నీ నిర్ణయపరముగ శిరోధార్యుడవును అగుటంజేసి, ఇది యెటనుండి, ఏల సంభవిల్లినదని నీ సేవికనైన నే ననదగదు. ఓ నా ప్రభూ, నీ సేవిక, తన యాశలను నీ యౌదార్యానుగ్రహములపై బెట్టుకొనినది. నీ సామీప్యత నొందజేయుట కుపయుక్తమగునట్టి, నీ సకలలోకములయందున తనకు లబ్ధిని చేకూర్చునట్టి దానిని పొందునటుల తన ననుగ్రహింపుము. నీవు క్షమాశీలివి, సర్వౌదార్యుడవు. దివ్య నిర్దేశకుడవును, యుగప్రాచీనుడవును నగు నీవు దక్క వేరుదైవము లేడు.

ఓ ప్రభూ, నా దేవా, మనుజులయెదుట నీ వాత్సల్యమధువును గ్రోలిన వారికిని, నీ శత్రువుల కతీతముగ నీ యేకేశ్వరత్వము నంగీకరించి, నీ యేకత్వమునకు సాక్ష్యమును వహియించి, నీ ప్రాణుల యందలి పీడకుల దేహాంగములను ప్రకంపిల్లజేసిన దానియందునను, భువియందలి గర్విష్ఠుల దేహములను కంపింపజేసిన దానియందునను తమ విశ్వాసము నంగీకరించిన వారికిని - నీ యాశీస్సుల ననుగ్రహింపుము. నీ సార్వభౌమత్వ మెన్నటికీ నశియింపదనియూ, నీ దివ్యేచ్ఛ పరివర్తితము కాదనియూ సాక్ష్యమును వహియింతును. నీ దెసకు తమ మోముల నభిముఖ మెునరించినవారికిని, నీ పావనపాశమును దృఢముగ చేబూనిన నీ సేవికలకును - నీ యౌదార్యాంబుధికిని, నీ కారుణ్య స్వర్గములకును యుక్తమైన దానిని - విధియింపుము.

ఓ దేవా, ఐశ్వర్యాధీశునిగా తన నుద్ఘోషించుకొని, తనను సేవించు వా రెల్లరినీ పేదసాదలని యభివర్ణించిన ఆయనవు నీవు. నీవే లిఖియించినటుల: “ఓ విశ్వాసులారా! మీరు కేవలము దైవావశ్యకత గల నిర్ధనులు; కాని, భగవంతుడు సమస్తైశ్వర్యశాలి, సకలప్రకీర్తితుడు.” నా లేమి నంగీకరించి నందునను, నీ కలిమిని గుఱుతించినందునను, నన్ను నీ యైశ్వర్యవైభవ భాగ్యవిహీనుని గావింపవలదు. నిశ్చయముగా, నీవు సర్వోన్నత పరిరక్షకుడవు, సర్వజ్ఞుడవు, సకల వివేకివి.

LXIX

జా ధాత్రిపై, తన ప్రాణార్పణ మెునరించిన అష్రఫ్‌ మాతృమూర్తి స్పందనను స్ఫురణకు దెచ్చుకొనుము. మహాధీశుడును, సర్వశక్తిమంతుడును నగు ఆయన సాన్నిధ్యమునం దాతడు, నిస్సంశయముగ సత్యపీఠస్థితుడై యున్నాడు.

ఆతడి నత్యంత యధర్మముగ నిహతుని జేయ నిర్ణయించినపుడు, అవిశ్వాసు లాతడి తల్లిని - బహుశః కొమరునకు హితవు జెప్పి, తన విశ్వాసమును వీడుమనియు, సర్వలోకాధిపతియగు భగవంతుని సత్యమును తిరస్కరించిన వారి యడుగుజాడల ననుసరింపుమనియు నాతడిని ప్రోద్బలపరచునేమోనని - పిలువనంపి, రప్పించినారు.

తన పుత్రుని మోమును జూచినయంతనే - భగవత్ప్రియతములను, అంతకుమించి, ఊర్థ్వలోకగణస్థితుల మానసములను నాక్రందిల్లజేసి యనంత బాధాతప్తములను గావించు మాటలతో - ఆతడితో భాషించిన దామె; నిక్కముగ, నా నాల్క యుచ్చరించునదేమో, నీ దేవదేవు డెఱుగును. ఆయనయే నా వాక్కులకు సాక్ష్యమును వహియించును.

ఇక ఆతడి నుద్దేశించి మాటడునపు డిట్లనిన దామె: “నా కుమారా, నా ప్రియకుమారా! నీ ప్రభుని పథమునం దాత్మార్పణ గావించుకొనుటలో వైఫల్యము నొందవలదు. భూస్వర్గవాసు లెల్లరును భక్తిపూర్వకముగ ప్రణమిల్లిన ఆయనయెడ విశ్వాసఘాతుకమున కొడిగట్టక జాగరూకుడవు కమ్ము. ఓ నా కుమారా! నేరుగ సాగిపొమ్ము, నీ దైవమగు ప్రభుని పథమున స్థైర్యముతో వర్తింపుము. సర్వలోక ప్రియతముని సాన్నిధ్యమునొంద వేగిరపడుము.”

ఆమెకు నా యాశీస్సులును, నా కారుణ్యమును, నా ప్రశంసయు, నా యశస్సును కలవు. ఆమెకు గల్గిన పుత్ర—నా మహత్త్వ, వైభవప్రపూరిత పట వేశ్మమున యిపు డధివసింపుచు దివ్యత్వకక్ష్యాస్థితులగు స్వర్లోకసేవికలనూ, అటుపై మదీయ స్వర్లోకవాసులనూ, పావిత్ర్యపురజనులనూ సమాచ్ఛాదించునట్టి ప్రభాసముతో సంశోభితవదనుడైన పుత్రుని—వియోగమునకు నేనే పరిహార మగుదును. నేత్రము నాతడిమీదికి సారించినవా డెవ్వడేని, సంభ్రమమున యెలు గెత్తి పల్కును: “అదిగో, ఆతడు మహోన్నత దేవదూత గాక అన్యుడు కా,”డని.

LXX

బృహత్తరమును, నవీనమును, మానవనేత్రములు ఇతఃపూర్వ మెన్నడును వీక్షించి యెఱుగనట్టిదియును నగు ఈ దివ్యప్రపంచ సంవిధానపు ప్రకంపనా ప్రభావమున ప్రపంచ సమతౌల్యతాస్థితి తలక్రిందులైనది. అద్వితీయమును, అత్యద్భుతమును నగు, ఈ సంవిధానమూలమున మానవజాతి జీవనసరళియే సమూలముగ పెనుమార్పులకు లోనైనది.

నా ప్రవచన పయోనిధియందున నిమజ్జనము కండు, తద్వారా మీరు దాని రహస్యములను ఛేదింపవచ్చును, దాని యగాధములయందున దాగియున్న వివేకమౌక్తికములను కనుగొనవచ్చును. భగవంతుని శక్తిసామర్ధ్యములు వెల్లడి గావింపబడి, ఆయన సార్వభౌమాధికారమును స్థిరీకృత మెునరించిన ఈ దివ్యధర్మపుసత్యమును సమాశ్రయించుటయందున మీ సంకల్పము వికల్పము కాకుండ జాగరూకులు కండు. ప్రమోదముతో వెలుగొందు వదనములతో ఆయన దరిజేర వేగిరపడండి. భూత, భవిష్యత్తులయందున, నిరంతరమును మార్పునొందనిది ఈ భగవద్ధర్మము. తదన్వేషకుడు దాని ప్రాప్తి నొందుగాక; తదన్వేషణను తిరస్కరించిన వాని విషయమున భగవంతుడు, నిశ్చయముగ, తాను సృజియించిన ప్రాణుల సర్వావశ్యకముల కతీతముగా స్వయంసంపన్నుడు.

వచించు: మీ రీసత్యమును విశ్వసించి, గుర్తించినవారేని, భగవంతుడు చేబూనినయట్టి ఈ త్రాసు దోషరహితమైనది; భూమిపైనను, స్వర్గమునను వసియించు వారందరును యిందు తూచబడి, వారి ప్రారబ్ధము నిర్ణయింప బడును. వచించు: మీ రీసత్యమును విశ్వసించి గుర్తించినవారేని, ప్రతి నిదర్శన ప్రమాణమును తరతరములుగ స్థిరీకృతమెునరించినయట్టి మహత్తర నిదర్శన మిది. వచించు: మీరు విశ్వసించిరేని, దాని వలన పేదలు సంపన్నులైనారు; పండితులు జ్ఞానసంపన్నులై, ప్రకర్షితులైనారు, జిజ్ఞాసువులు దైవసాన్నిధ్యమున కధిరోహించినారు. దానిని మీమధ్య కలహకారక మెునరింతురేమో, జాగరూకులు కండు. ప్రేమాస్పదుడును, శక్తిశాలియును నగు మీ పరమేశ్వరుని పరమధర్మమున దృఢముగ నిలిచిన పర్వతమువలె యుండుడు.

LXXI

ఓ జగజ్జనులారా! నా సౌందర్యప్రభాతనక్షత్ర మస్తమించినప్పుడు, నా స్వర్గధామము మీ నేత్రముల కగోచరమెునరింపబడినప్పుడు వెఱపు నొందవలదు. నా దివ్యధర్మపురోగతికిని, మానవుల యందున నా ప్రవచనోద్ధతికిని ఉద్యమింపుడు. మేము సర్వదా మీతో నుందుము, సత్యబలముచే మిమ్ము శక్తివంతుల నొనరింతుము. సత్యముగా మేము సర్వశక్తివంతులము. నన్ను గుర్తించిన యాతడు, భూస్వర్గశక్తులు సైతము తన యుద్దేశ్యమును నిరోధింపజాల నంతటి దృఢసంకల్పముతో నన్ను సేవించుట కుద్యుక్తుడగును.

ప్రపంచజనులు గాఢనిద్రావస్థయందున్నారు. వారు తమ సుషుప్తినుండి మేల్కాంచిరేని సర్వజ్ఞుడును, సర్వవివేకియును నగు భగవంతుని దెసకు, ఆత్రమున పరువిడుదురు. తమ ప్రభుడు తమ నుద్దేశించి కేవల మెుక్క పదము నుచ్చరించు నటుల గుర్తుంచుకొనుటకై తమ సర్వమును - అది భూమిపైనున్న సకలసంపదలైనను - పరిత్యజింతురు. సమస్తజ్ఞానమును నిక్షిప్తమైనదియును, సృష్టినేత్రము గాంచియుండనిదియును, సాక్షాత్తూ తనకుగాక యితరులకు అనావిష్కృతమును నగు దివ్యఫలకమున సర్వశక్తివంతుడు, సకలజగద్రక్షకుడు యిచ్చిన యాదేశ మిట్టిది. తమ దుర్వాంఛల మైకమున వా రెంతటి విభ్రమమునం దుండిరనిన “పరాక్రమశాలిని, సకలవివేకినియగు నేనుగాక అన్యదైవము లే,” డని యన్ని వైపులనుండియు వారి ప్రభుని వాణి యెలుగెత్తి పిలచినను, గ్రహియించుట కశక్తులైనారు.

వచించు: మీ యధీన మందలి వస్తుసంచయముపట్ల మురియవలదు, ఈ రేయికవి మీవి, రేపటికవి పరుల పాలగును. సర్వజ్ఞుడును, సకలవిదుడును నగు ‘ఆయన’ మిమ్మీవిధముగ హెచ్చరింపు చున్నాడు. వచించు: మీ స్వాధీన మందున్నది శాశ్వతమని, సుభద్రమని యనగలరా? లేదు! సకల దయాళువునగు నా సాక్షిగా, న్యాయబద్ధముగ నిర్ణయించువారలైనచో, అనలేరు. మీ జీవిత కాలము, ప్రాణవాయువువోలె కరగిపోవును, మీకు ముందు చనినవారి కీర్తి వైభవముల వోలె మీ కీర్తివైభవములును అంతరించును. ఓ జనులారా! యోచింపుడు. మీ గతించిన దినములకు, శతాబ్దములకు ఏమైనది? దైవస్మరణకు అంకితములైన దినములు ఆనందదాయకములు, సకలవివేకియగు ‘ఆయన’ను స్తుతించుటకు వెచ్చించిన ఘడియలు శుభప్రదాయినులు. నా జీవితము సాక్షిగా! బలవంతుల యాడంబరము గాని, సంపన్నుల సంపదగాని, దుష్టుల ప్రాబల్యము గాని నిలువబోవు. ‘ఆయన’ నుండి వెలువడు ఏకైకవాక్కుతో సర్వమును నశించును. నిశ్చయముగా ‘ఆయన’ సర్వాధికారపరిపూర్ణుడు, సమస్తప్రేరణకర్త, సర్వశక్తిమంతుడు. మానవులు సమకూర్చుకొను భౌమవస్తువులవలన ప్రయోజన మేమి? వారు తమకు ప్రయోజనకరమగు దానిని పూర్తిగా నలక్ష్యము గావించినారు. అనతికాలమునకే వారు తమ గాఢనిద్రనుండి మేల్కాంతురు; సర్వశక్తిమంతుడును, సమస్తశ్లాఘనీయుడును అగు తమ ఈశుని జీవితకాలములో తమకు దక్కియుండనిదాని నిక పొందలేమని తెలిసికొందురు. వారికి తెలిసి యుండెనేని, ‘ఆయన’ సింహాసనసమక్షమున తమ నామప్రస్తావనకై సమస్తమును పరిత్యజించి యుండెడివారు. నిశ్చయముగా, వారు మృతసదృశులు.

LXXII

ఏ యంశము గురించియైనను మీలో విభేదములు తలయెత్తెనేని, వానిని యీ దివ్యస్వర్గపు నభోమండలముపై సత్యసూర్యు డింకను ప్రకాశింపు చుండగనే భగవంతునికి నివేదింపుడు; తత్సూర్యు డస్తమించినప్పుడు ఆయనచే ననుగ్రహీతమైనట్టి దానికి నివేదింపుడు. నిశ్చయముగ నిది సమస్త ప్రపంచజనులకును సముచితమైనది. వచించు: ఓ ప్రజలారా ! నా ప్రత్యక్షతావైభవ మంతరించినపుడు, నా యుచ్చారణాసాగరము స్తబ్ధతనొందినపుడు మీ హృదయములను కలవర మెుందనీయకుడు. మీ మధ్యనగల నా యుపస్థితియందొక వివేకమున్నది; తుల్యరహితుడును, సర్వజ్ఞుడును అగు భగవంతునికి దక్క అన్యుల కర్థముగానట్టి దింకొక్కటి నా యనుపస్థితియం దున్నది. మేము మా దివ్యవైభవ ధామము నుండి నిశ్చయముగ, మి మ్మవలోకింతుము; మా దివ్యధర్మ విజయమున కుద్యమించు వారికి మా దివ్యగణాతిథేయులతో, మా యనుగ్రహము నొందిన దేవదూతలతో సాహాయ్యము గావింపజేయుదుము.

ఓ భూ ప్రజలారా! అనిర్బంధితుడైన మీ ఈశునిచే నుచ్చరింపబడిన ప్రవచనమధురిమచే గండశిలలనుండి స్వచ్ఛవిమలోదక స్రవంతులు ఉప్పొంగిన వనుటకు - శాశ్వతసత్యమగు భగవంతుడే నాకు సాక్ష్యము; అయినను, మీ రింకను సుషుప్తియం దున్నారు. మీ యధీనమందలి సర్వస్వమును త్యజియించి, నిస్సంగత్వమనెడు పక్షములపై సమస్త సృజితప్రాణుల కతీతముగ విహరింపుడు. తన లేఖినీచలనముచే మానవజాతి యాత్మను పరివర్తిత మెునరించిన యా సృష్ట్యధిపతి మిమ్ముల నీవిధముగ నాదేశింపుచున్నాడు.

సకలకీర్తివంతుడగు మీ ప్రభుడు ఎట్టి మహోన్నతసీమలనుండి పిలుచుచున్నాడో యెఱుగుదురా? సకలనామాధిపతియగు మీ సర్వేశ్వరుడు దేనితో మిమ్ము శాసింపుచున్నాడో ఆ దివ్యలేఖినిని గుర్తించితి మని భావింపుచుంటిరా? లేదు, నా జీవితముపై యాన! దీనిని మీరెఱిగియుంటిరేని ఈ జగమును త్యజియించి, హృదయపూర్వకముగ దివ్యప్రియతముని సమక్షమునకు వేగిరపడి యుండెడువారు. ఘనతరమగు జగమును సంక్షోభములో పడద్రోయునటుల మీ యాత్మలు ‘ఆయన’ వాక్కునకు పరవశించెడివి, ఇక ఈ యల్పప్రపంచ మెంత! నా యనుగ్రహమునకు ప్రతీకగా, నా ప్రేమాన్విత కారుణ్యధామమునుండి నా యౌదార్యతుషారములు మీరు కృతజ్ఞులగునటుల భువిపై వర్షించినవి. . . .

దైహికములును, నీతిబాహ్యములును అగు వాంఛలు, మీయందున విభేదములను రేకెత్తించు నేమో జాగరూకులు కండు. ఒకే హస్తపు టంగుళులవలె, ఒకే దేహపు టంగములవలె ప్రవర్తిల్లుడు. మీరు విశ్వసింతురని, దివ్యావిష్కరణా లేఖిని మీ కీవిధముగ నుపదేశింపుచున్నది.

భగవంతుని సౌహార్దమును,‘ఆయన’ పురస్కారములను గణియింపుడు. ఆయన సమస్తప్రాణు లను తానై త్యజియింపజాలినను మీకు లబ్ధి నొసంగు వానిని మీకు విధియించినాడు. మీ దుష్కార్యములు మాకెన్నడును హానిని కలిగింప జాలపు; అట్లని, మీ సత్కార్యములు మాకు లబ్ధినీ చేకూర్చవు. కేవలము పరమాత్ముని కొరకే మి మ్మాహ్వానింపుచున్నారము. అవగాహనాపరుడును, అంతర్దృష్టియుతుడును నగు ప్రతి మనుష్యుడును యిందుకు సాక్షీభూతుడే.

LXXIII

భగవంతుని నామధేయముల, లక్షణముల-కాదుకాదు-సమస్త దృశ్యాదృశ్యసృజితముల వాస్తవికతలను కప్పియుంచు ముసువులు చింపివేయ బడినయపుడు, ఆ వాస్తవికతలయందున, స్వయముగా ఆయనయే ఏర్పరచిన సంకేతముదక్క, వేరెద్దియూ శేషింపదనునది స్పష్టము, విస్పష్టము. ఈ సంకేతము - భువికిని స్వర్గములకును అధిపతియైన నీ దైవముయొక్క, నీ ప్రభునియొక్క యిచ్ఛ యైనంత కాలము నిలచియుండును. సమస్తసృజితప్రాణుల కనుగ్రహీతములైన యాశీస్సులట్టివి యైనచో, ఇక తన యునికియూ, మనుగడయూ సమస్త సృష్టికీ మూలహేతువుగ పరిగణింపబడవలసి యున్నట్టి నిజవిశ్వాసి గమ్యము యింకెంత మహోన్నతముగ నుండవలె! విశ్వాసభావ మాదిరహితాద్యము నుండియు విలసిల్లి, అంత్యరహితాంత్యము వరకు పరిఢవిల్లునటులే, నిజవిశ్వాసియూ శాశ్వతముగ జీవించును, సహిష్ణువగును. ఆతడి యాత్మ దైవేచ్ఛ చుట్టూ నిరవధికముగా పరిభ్రమించును. ఆతడు సాక్షాత్తూ భగవంతుడు ఉండునంత కాలము జీవించును. భగవంతుని దివ్యావిష్కరణతో నాత డభివ్యక్తీ కృతుడై, ఆయన యాదేశానుసారము గుప్తగతుడైనాడు. భగవంతునీ, భగవత్సంకేతములనూ నిక్కముగా విశ్వసించినవారలకు అమరలోకస్థిత సమున్నతహర్మ్యములు నివాసములుగ నిర్దేశితము లైనవనునది యథార్థము. మృత్యువు తత్పుణ్యపీఠము నెన్నటికినీ ఆక్రమింపజాలదు. నీ ప్రభునియెడ నీప్రేమయందున సుస్థిరుడవై, ఈ సత్యమును గ్రహియించినవాడ వగుదువని, ఆయన సంకేతముల నిటుల నీ కొప్పగించినాము.

LXXIV

మీ రీసత్యమును గ్రహియింతురేని, భగవంతుని ముఖతః వెలువడు ప్రతి వాక్కును, ప్రతి మానవదేహమునకును నవజీవమునిచ్చు శక్తితో అనుగ్రహీతమైనది. ఈ ప్రపంచమున మీ రవలోకింపుచున్న విచిత్రసృజనలన్నియూ, ఆయన సర్వోత్కృష్ట మహోన్నతాభీష్టమున, ఆయన పరమాద్భుత, సుదృఢ సంకల్పచాలనమున ప్రత్యక్షీకృతములైనవి. ఆయన యధరములనుండి వెల్వడుచు, మానవజాతికి ఆయన లక్షణములను ప్రకటింపుచు, కేవలము “స్రష్ట” యను పద మావిష్కృతమైనయంతనే, మానవహస్తము లనంతరయుగములయం దభివృద్ధిచేయు బహువిధకళలను సృజియింపగల శక్తి యుత్పాదితమైనది. నిక్కముగా, ఇది నిశ్చయసత్యము. ఈ యుజ్జ్వలపద ముచ్చారిత మైనయంతనే, దాని చాలనశక్తులు - సృజితసమస్తమున సంచలనము కలిగింపుచూ, అట్టి కళల నుత్పాదించి సమగ్రతనిచ్చు సాధనసంపత్తుల నావిర్భవింపజేయును. మీరు యిప్పు డవలోకింపుచున్న చిత్రవిచిత్ర ఫలితసాధనలన్నియూ, ఈ దివ్యనామధేయావిష్కరణ ప్రత్యక్షపర్యవసానములే. భావి దినముల యందున, పూర్వమెన్నడూ వినియుండని వస్తువులను మీరు నిక్కముగా వీక్షింతురు. భగవంతుని దివ్యఫలకములయం దిటుల నిర్ణీతమైనది; సునిశితదృక్కులు దక్క , అన్యుడు దానిని గ్రహియింపజాలడు. అవ్విధముగనే, మదీయ లక్షణమును వ్యక్తీకరించు “సర్వజ్ఞు,” డను సంకేతపదము నా ముఖతః వెలువడిన క్షణమున, ప్రతి సృజితమునకును - తత్సామర్ధ్య, పరిమితుల కనుగుణముగ - మహాద్భుత శాస్త్రపరిజ్ఞానావిష్కరణ శక్తి ప్రసాదితమై, కాలక్రమమున - సర్వశక్తిమంతుడును, సర్వవిదుడును నగు పరమాత్ముని యాదేశానుసారము - తత్ర్పదర్శనాధికార మనుగ్రహీత మగును. ప్రతి యన్యనామావిష్కరణమునకును అట్టి దివ్యశక్త్యభివ్యక్తీకరణము తోడైయున్నదను యథార్థము నెఱుగుడు. వాస్తవమునకు, భగవంతుని ముఖతః వెల్వడు ప్రతి వర్ణమూ మాతృవర్ణమే, దివ్యావిష్కరణ స్రవంతి యగు ఆయన యుచ్చరించిన ప్రతి పదమూ మాతృపదమే; ఇక, ఆయన దివ్యఫలకమూ మాతృఫలకమే. ఈ సత్యమును గ్రహియించు వారికి శుభమగును!

LXXV

మీ దృష్టికి తీవ్రముగా అవరోధము గల్పించిన ముసువులను, నా దివ్యనామధేయము పేరిట చింపివైచి, భగవంతుని యేకేశ్వరత్వముపట్ల మీ విశ్వాసజనితశక్తితో - వ్యర్థానుకరణ ప్రతిమలను చెల్లాచెదురొనరింపుడు. సకల దయాన్వితుని సంప్రీతిస్వర్గమునం దిక ప్రవేశింపుడు. మీ యాత్మలను దైవసంబంధితము కాని దానినుండి పవిత్రీకరించుకొని, ఆఖండమును, అమేయమును నగు ఆయన దివ్యావిష్కరణాధామమున, మహోన్నతమును, సర్వసమగ్రమునునగు ఆయన యధికారచ్ఛాయన - విశ్రామమాధురిం జవిచూడుడు. నా కరకృత్యౌన్నత్యము సంపూర్ణముగ మానవుల కావిష్కృతమగునని, నేను మీలోని ప్రతి యెుక్కరియందుననూ నా సృష్టిని సర్వసమగ్ర మెునరించిన హేతువున, మీ స్వార్థవాంఛలనెడు దళసరి ముసువులతో మిమ్ముల నాచ్ఛాదించుకొనవలదు. కావుననే, సంస్తవనీయు డగు భగవంతుని దివ్యసౌందర్యమును ప్రతి మానవుడూ స్వయముగా ఆస్వాదించినాడు; ఇకపైననూ ఆస్వాదింపుచునే యుండును. అట్టి సామర్ధ్యముతో ననుగ్రహీతుడై యుండనియెడల, తన వైఫల్య గణనమున కాత డెవ్విధముగ నామంత్రితుడు కాగలడు? సమస్త భూలోకవాసులూ సమీకృతులైన దివసమున, ఏ మానవుడేని, భగవత్సాన్నిధ్యమున నిలచి, “నా దివ్యసౌందర్యమున విశ్వాసమునొంది నాకు తిరోఙ్ముఖుడవైతి వేల,” యని ప్రశ్నితుడై, ప్రత్యుత్తరముగ: “ఏలయన, ఎల్ల జనులును పొర బడుటవలనను, ఎవ్వడును సత్యము దెసకు తన మోమును మరల్చుట కిచ్చగింప నందునను, నేను సైతము వారి మార్గమునే యనుసరించి, శాశ్వత సౌందర్యమును గుఱుతించుటయందున ఘోరముగ విఫలుడ నైతి,”నని నుడివెనేని యట్టి సమర్ధనము సునిశ్చయముగ తిరస్కృతమగును; ఏలయన, ఏ మనుజుని విశ్వాసమైననూ ఆతడివలననే దక్క, అన్యునిచే ప్రభావితము కాజాలదు.

నా యావిష్కరణమున సుభద్రములైయున్న యథార్థములయం దిది యెుకటి—నేను సమస్త దివ్యగ్రంథములయందునను వెల్లడించి, మహిమాన్వితుని జిహ్వచే వచియింపజేసి, దివ్యాధికారలేఖినిచే లిఖియింపజేసిన యథార్థ మిది. మీ బాహ్యాంతర్నేత్రములతో దివ్యవివేకసూక్ష్మములను గ్రహియించి, ఈ మహిమాన్విత, అనశ్వర దివ్యఫలకమున విస్పష్టమును, విశిష్టమునునైన భాష యందున నేను బహిర్గత మొనరించిన దివ్యజ్ఞానరత్నములను గ్రహియించునటుల, సర్వోన్నత భద్రాసనమునకును, ఆవల మార్గమనునది లేనట్టి దివ్యవృక్షమునకును, అనశ్వరశక్తివైభవధామమునకును దూరులు కాకుండు నటుల, కొంతతడ వద్దానిపై పర్యాలోచన మొనరింపుడు.

భగవంతుని చిహ్నములు, ఆయన జీవుల కార్యములయందున భానుని వలె ప్రస్ఫుటముగ, దేదీప్యమానముగ విరాజిల్లుచున్నవి. ఆయననుండి యనుగ్రహీతమగున దేదైననూ, మానవావిష్కరణముల కతీతమై, సదా విశిష్టమై విలసిల్లును. ఆయన జ్ఞానభాండారమునుండి విద్వద్విజ్ఞానతేజోమూర్తు లసంఖ్యాకముగ నుదయించినారు; ఇక, సమస్తదయాన్వితుని పరిమళ మాయన దివ్య లేఖినీస్వర్గమునుండి యఖండముగ మానవుల యాత్మలకును, హృదయములకును పరివ్యాప్తితమైనది. ఈ సత్యమును గుఱుతించినవారు సంతోషాత్ములు.

LXXVI

ఓ నా సేవకుడా, దుర్లభుడును, మహోన్నతుడును నగు నీ ప్రభుని భద్రాసనమునుండి నీకనుగ్రహీతమగుచున్న దానికి చెవియెుగ్గుము. ఆయన దక్క వేరు దైవము లేడు. దయామయుడును, సమస్తకరుణాన్వితుడును నగు తన నరయుదురని, ఆయన తన జీవుల నస్తిత్వమున కాహ్వానించినాడు. మానవులకు తన మహోల్లాస స్వర్గసందేశముల నుద్ఘోషించి, వారిని తన నిత్యపవిత్రతా పీఠమైన సర్వశ్రేష్ఠవైభవాన్విత దృఢసంరక్షణాశ్రయ సామీప్యమునకు జేర్చుడని, సకలదేశముల నగరములకును, తన దివ్యవార్తావహుల నాదేశించి, పంపినా డాయన.

దైవజ్యోతిచే పథనిర్దేశితులై, కొంద రాయన సాన్నిధ్యాస్థాన ప్రవేశము నొంది, పరిత్యాగహస్తము నుండి యనశ్వర జీవజలములను గ్రోలి, నిజముగ ఆయనను గుఱుతించి విశ్వసించినవారిగ పరిగణింపబడినారు. అన్యు లాయనను ధిక్కరించి పరమాధికారయుతుడును, మహాశక్తిమంతుడును, సర్వవివేకియును నగు భగవంతుని చిహ్నములను తిరస్కరించినారు.

సాక్షాత్తూ బయాన్‌ భానుడే కారుణ్యదిఙ్మండలమున ప్రత్యక్షీకృతుడైన దివ్యయుగమును, మహాద్వారమైన ఆలీ మహమ్మదు మహనీయ రూపమున సకలవైభవప్రపూరితసౌందర్యము భాసిల్లిన పావనయుగమును నగు యీ దినాగ్రణితో సంలీనము లగునంత వరకు—యుగములు గడచినవి. ఆయనయే స్వయముగ ప్రత్యక్షీకృతుడైనయంత, ఆయనకు వ్యతిరేకముగా జనులెల్లరూ ఉద్యమించినారు. సర్వశక్తిమంతుడును, దివ్యయుగప్రాచీనుడును నగు భగవంతుని ధిక్కరించి దుర్భాషల నాడినవాడని, కొంద రాయనను నిందించినారు. మరికొంద రాయన నున్మాదబాధితునిగ పరిగణించినారు; ఇయ్యభియోగము నొక మతాధిపతి ముఖతః, స్వయముగ నేనే యాలించినాడను. ఇంకొందరు, ఆయన తాను భగవత్ర్పవాచకుడనని గావించిన ప్రస్తావముతో విభేదించుటయే గాక, సర్వశక్తిమంతుని వాక్కులం దస్కరించి, తదర్ధమును వక్రీకరించి, వాటిని తన వాక్కులతో సమ్మిళిత మొనరించినవాడని, ఆయన నధిక్షేపించినారు. తమ యధికారపీఠములపై వారు సమ్మోదము నొందుచుండ, వారి ముఖతః వెలువడిన మాటలయెడ దివ్యమహనీయతానేత్ర మెంతయేని దురపిల్లుచున్నది.

“ఓ జనులారా! భగవంతుడు నాకు సాక్షి. మీ దైవమును, మీ పూర్వపితరుల కధినాథుడును నగు దేవదేవునినుండి దివ్యావిష్కరణ మొకదానితో మీచెంత కరుదెంచినాడను. ఓ జనులారా, మీ యధీనస్థిత వస్తువులను విలోకింపవలదు. మీకై భగవంతు డంపినవానిని తిలకింపుడు. గ్రహియింప గల్గితిరేని, సమస్తసృష్టికన్నను నిక్కముగా మీకిదియే సుయోగ్యమగును. ఓ జనులారా, పునర్వీక్షింపుడు; మీ యధీనమునయున్న భగవన్నిరూపణమును, ఆయన నిదర్శనమును చక్కగ పర్యాలోచించి, వాటిని - సత్యము, నిష్ఠురసత్యము, నిస్సంశయముగ స్పష్టీకృత మగునటుల - ఈ దివ్యయుగమున మీ కనుగ్రహీత మైన దివ్యావిష్కరణముతో పోల్చిచూడుడు; ఓ జనులారా, దుష్టాత్మ యడుగుజాడల ననుసరింపక, సమస్తకరుణాన్వితుని దివ్యధర్మము ననుసరించి నిజవిశ్వాసులు కండు. మానవుడు భగవంతుని దివ్యావిష్కరణమును గుఱుతించుట యందున వైఫల్యము నొందినచో, నాతడి కది యొనగూర్చు ప్రయోజనమేమి? ఏదియు నుండదు. శక్తిసమన్వితుడను, సర్వజ్ఞుడను, సర్వవివేకియును నగు నేనే స్వయముగ సాక్ష్యమును వహియింతు నిందుల,” కనినా డాయన.

ఆయన యెంతగ, వారల కుద్బోధించినను, వారి శత్రుత్వము భీషణతరమై, అంతిమముగ లజ్జాన్వితక్రౌర్యముతో వా రాయనను వధియించినారు. నిరంకుశులకు దైవశాపమున్నది!

ఆయనను కొద్దిమంది విశ్వసించినారు; మా సేవకులయందలి కొందరు కృతజ్ఞులు. వాగ్దత్త దివ్యావిష్కరణా యుగమున - స్వర్గస్థితమేని, ధరణీస్థితమేని - దేనికినీ లోబడవలదని తన సమస్త దివ్యఫలకముల యందునను—కాదు కాదు, తన ప్రతి యద్భుతలేఖన భాగమునను—వీరల కుపదేశించినా డాయన. “ఓ జనులారా! ఆయన దివ్యావతార నిమిత్తము బహిర్గతుడనై, అన్యలక్ష్యమునకు గాక, ఆయన దివ్యధర్మసత్యసంస్థాపనకై నా దివ్యగ్రంథమైన బయాన్‌ను మీ కనుగ్రహింప జేసినాడను. భగవద్భీతులు కండు; ఖురాను జనులు నాతో స్పర్ధించిన యటుల, ఆయనతో స్పర్ధింపవలదు. ఆయన గురించి యే తరుణమున తెలియవచ్చినను, మీ రాయన చెంతకు త్వరనొంది, ఆయన మీ కావిష్కరించు దానికి బద్ధులు కండు. ఆదినుండి యంతమువరకు మీ పూర్వీకులందరి ప్రమాణములను ప్రదర్శించిననూ, ఆయన దక్క వేరెద్దియూ, ఎన్నటికినీ, మీకు లబ్ధిని చేకూర్ప జాల,” దని ఆయన వాకృచ్చినాడు.

మరి కొన్ని వత్సరములు గడచిన పిదప, దివ్యాజ్ఞాస్వర్గము భగ్నీకృతయై, బాబ్‌ దివ్యసౌందర్యము నవీనాంబరాలంకృతయై భగవన్నామధేయ పర్జన్యముల యందున గోచరమైనయపుడు, సమస్తసృజితావృత ప్రభాసమానుడైన ఆయనకు విరుద్ధముగా, ఈ మానవులు విద్వేషముతో నుద్యమించి నారు. వా రాయన యెుడంబడిక నుల్లంఘించి, ఆయన సత్యమును తిరస్కరించి, ఆయనతో విభేదించి, ఆయన చిహ్నముల నాక్షేపించి, ఆయన ప్రామాణికత నసత్యమని యెంచి, అవిశ్వాసుల సాంగత్యము నాశ్రయించినారు. తుద కాయన ప్రాణము దీయ కృతనిశ్చయులైనారు. మహాపరాధమగ్నుల స్థితి యట్టిది.

లక్ష్యసాధనమున తమ యశక్తతను గ్రహియించిన తఱి, వా రాయనపై కుట్రను పన్నుట కుద్యుక్తు లైనారు. భగవంతుని దివ్యధర్మమును క్షతమొనరించి, అప్రతిష్ఠ పాలొనరింపవలెనని, ఆయనకు హాని జేయుటకు క్షణమున కొక వినూత్న పధకమును వా రెట్లు విరచింపుచుంటిరో వీక్షింపుము. వచించు: దుఃఖము వాటిల్లును మీకు! దైవముపై యాన! మీ కుయుక్తులు మిమ్ము లజ్జితులను గావించును. కరుణాన్వితుడగు మీ ప్రభుడు, సమస్తసృజితములతోడనూ సముచిత ముగ వ్యవహరింపగలడు. ఆయన యధీనస్థితముల, నేదియూ విస్తరింపనూ జాలదు, కుదియింపనూజాలదు. మీరు విశ్వసింతురేని, స్వీయలబ్ధికే విశ్వసింతురు; విశ్వసింపరేని మీరే వ్యధనొందుదురు. అవిశ్వాసి హస్తమెన్నటికినీ, ఆయన దివ్యవస్ర్తాంచలమును కళంకిత మొనరింపజాలదు.

భగవంతునిలో విశ్వాసమునుంచిన ఓ నా సేవకుడా! సర్వశక్తిమంతుని ధార్మికత్వముపై యాన! నాకు వాటిల్లిన వాని గాథను నీకేను వర్ణింపవలసి వచ్చెనేని, మానవహృదయములూ, ఆత్మలూ తద్భారమును భరియింపజాలవు. భగవంతుడే నాకు సాక్ష్యమును వహియించును. నిన్ను నీవు రక్షించు కొనుము; ఈ జనుల యడుగుజాడల ననుసరింపవలదు. నీ దేవదేవుని దివ్యధర్మమును గురించి, శ్రద్ధగ యోచింపుము. అన్యుల ద్వారమున గాక, సాక్షాత్తూ ఆయన మూలముననే ఆయన నెఱుగ యత్నింపుము. ఏలయన, ఆయన గాక యింకెవ్వడును నీకు లబ్ధిని చేకూర్పజాలడు. గ్రహియింపగలిగితివేని, సమస్త సృజితములూ యిందులకు సాక్ష్యమునిచ్చును.

సకలవైభవసమన్వితుడును, మహాశక్తిప్రపూరితుడును నగు నీ ప్రభుని యానతిన ముసువునుండి బయల్వెడలి దుర్లభుడును, మహోన్నతుడును నగు నీ ప్రభుని పేరిట, స్వర్గములయందునను, అవనిపైనను నున్నవారి కన్నుల మ్రోల యమృతకలశమును గ్రహియించి తనివార గ్రోలుము; తాత్సారుల యందొకడవు కావలదు. భగవంతునిపై ప్రమాణ మెునరింతును! నీ యధరములతో నీవు చషకమును స్పృశియించినయంతనే, “సత్యముగ భగవంతుని విశ్వసించిన ఓ మానవుడా! మనసార సేవింపు,” మని యూర్ధ్వలోక దివ్యగణము నిన్ను శ్లాఘింపగా, “ఆయన ప్రేమచషకమును రిక్తము గావించిన ఓ మానవుడా, ప్రమోదము నీదె,” యని యమరత్వనగరములవాసు లుద్ఘోషింతురు; “ఓ నా భృత్యుడా, మహత్తరము నీకై నిరీక్షించు భాగ్యము, ఏలయన, అవనీస్థిత సకలమును, స్వర్గస్థితసమస్తమును పరిత్యజించినవారలును, నిజవైరాగ్య చిహ్నములును దక్క, అన్యు డొందియుండని దాని నందితి,” వని, దివ్యవైభవ జిహ్వ నిన్నభినందించును.

LXXVII

ఇప్పుడిక, మానవసృష్టి సంబంధితమగు నీ ప్రశ్నమును గురించి. సంరక్షకుడును, స్వయమాధారుడును నగు భగవంతు డేర్పరచిన ప్రకృతి యందున సమస్తమానవులును సృజియింపబడిరని తెలియుము. భగవంతుని మహత్తర, సుభద్ర దివ్యఫలకములయందున యాదేశిత మైనయటుల, పూర్వనిర్దేశిత ప్రమాణము నొక్కదానిని ప్రతి యెుక్కనికీ విధియింపనైనది. అయినను, వస్తుతః, నీకున్న దెల్లయును నీ స్వీయేచ్ఛాఫలితముగనే ప్రకటితమగును. ఈ సత్యమును మీ స్వకార్యములే నిరూపించును. ఉదాహరణమునకు, బయాన్‌ నందున మానవులకు నిషిద్ధమైన దానిని పరిశీలింపుము. భగవంతు డాదివ్యగ్రంథమున, తన యానతిన, తాను నిర్దేశింప నిచ్చగించినది న్యాయబద్ధమని నిర్దేశించినాడు; నిషేధింపనెంచిన దానిని తన సర్వోత్కృష్ట శక్త్యధికారముతో నిషేధించి నాడు. ఇందుల కాదివ్యగ్రంథపాఠమే సాక్ష్యము నిచ్చును. మీరు వహియింపరా, సాక్ష్యమును? అయిననూ, మానవులు బుద్ధిపూర్వకముగా ఆయన శాసనము నుల్లంఘించినారు. అట్టి ప్రవర్తనము నారోపింపవలసినది భగవంతునికా, ఆ ప్రత్యేక వ్యక్తులకా? నిష్పాక్షికముగ నిర్ణయింపుడు. ప్రతి శుభమూ భగవంతునిదే, ప్రతి యశుభమూ మీదే. దీనిని మీరు గ్రహియింపరా? మీ రవగత మెునరించుకొను వారేని, సమస్త పవిత్రగ్రంథములయందుననూ, అభివ్యక్తీకృతమైన సత్యమిదియే. మీరు పర్యాలోచన గావించు ప్రతి చేష్టయూ, అంతకుమునుపే ముగిసినదానివలె ఆయనకు ప్రస్ఫుటమే. ఆయన దక్క వేరొండు దైవము లేడు. సృష్టియంతయూ, తత్సామ్రాజ్యమూ ఆయనవే. సకలమూ ఆయన మ్రోల బహిర్గతమే; సమస్తమూ, ఆయన పవిత్ర నిగూఢ దివ్యఫలకములయందున విలిఖితమే. అయినను, జరుగవలసిన ఘటన జరుగుటకు, దానిని గురించిన మీ పూర్వపరిజ్ఞానమో, అది ఘటిల్లవలసినదేనను మీ యాకాంక్షయో యెటుల హేతువు కాదో, ఎన్నటికీ కానేరదో, అటులే - మానవచర్యలను యిట్టి భగవత్సంబంధిత పూర్వజ్ఞానము ప్రేరేపించినదని యెంచతగదు.

LXXVIII

సృష్టిమూల సంబంధితమగు నీ ప్రశ్నమును గురించి: దైవసృష్టి అనాదిగా నున్నదనియు, అనవరత ముండుననియు నెఱుగుము. తదారంభమున కాదియును లేదు, తదంతమున కంత్యమును దెలియదు. ఆయనకు గల జననాథ బిరుదముతో భృత్యుని యునికి ముడివడియుండినటులే , స్రష్ట యను ఆయన నామధేయ మెుక సృష్టిని యభిదర్శించును.

పూర్వప్రవక్తల కారోపితములైన: “అదియందు దేవుడుండెను. ఆయన నెఱుగుట కేప్రాణియును లేదు,” “తన నారాధించుట కొక్కడును లేక, ప్రభు డొంటరిగ నుండెను,” వంటి ప్రవచనముల యర్ధము స్ఫుటము, ప్రస్ఫుటము; వాటి నెన్నడును, అపార్థము జేసికొనరాదు. “భగవంతు డొంటిగ నుండెను; ఆయన వినా అన్యుడు లేకుండెను. ఆయన మున్నెటులుండెనో నిరంతర మటులే యుండు,” నని ఆయన వెలువరించిన వాక్కులు సైతము, ఈ సత్యమునకే సాక్షీభూతములు. ఈనాడు ప్రభుడు సాక్షాత్కరించి నాడనియు; అయినను, ఆయన వైభవమును గుర్తించుట కొక్కరేని లేరనియు ప్రతి విచక్షణాన్విత నేత్రమూ నిస్సంకోచముగ గ్రహియించును. దివ్యాస్తిత్వ మధివసించు నివాస మాయనకు దక్క , అన్యుని సామీప్యతావగాహనల కెంతయో దవ్వున యున్నదని, దాని భావము. దీనికి విధియింపబడిన పరిమితులను, ఈ యనిశ్చిత ప్రపంచమున వెల్లడికాబడిన లేదా గ్రహియింపబడిన యట్టిది ఏదైననూ - తన సహజస్వభావ హేతువున - ఎన్నటికినీ మీరజాలదు. భగవంతుడు మాత్రమే, అట్టి మేరల నతిక్రమించును. నిశ్చయముగా, అనంతాత్మజు డాయన. ఆయనతో సరిసమానునిగనో, సమభాగస్వామి గనో యెవ్వడును, ఎన్నడును చేరియుండ లేదు, చేరడు. ఏ నామమైననూ, ఆయన దివ్యనామధేయముతో పోల్పజాలినది కాదు. ఏ లేఖినియూ ఆయన స్వభావమును వర్ణింపజాలదు; ఏ జిహ్వయూ ఆయన వైభవమును వ్యక్తీకరింపజాలదు. ఆయన - తనకన్నను దక్క, ఏ యెుక్కనికన్నను, ఎన్నటికిని - అమేయ మహోన్నతునిగనే యుండును.

భగవంతుని సర్వోన్నత దివ్యావతారము తనను మానవుల కావిష్కృత మొనరించుకొనిన ఘడియను గమనింపుము. తద్ఘడియ అరుదెంచుటకు పూర్వము - మనుజుల నింకను యెఱుగని, ఇంకను భగవద్వచనమున వాగ్రూపము నిచ్చి యుండని ప్రాచీనాస్తిత్వమే—తన నెఱిగిన మానవు డెవ్వడును లేని ప్రపంచమున—సర్వజ్ఞుడు. ఆయన, యథార్థమునకు సృష్టిరహితస్రష్ట. ఏలయన, ఆయన దివ్యావిష్కరణత్పూర్వక్షణముననే, ప్రతి సృజితమూ తన యాత్మను భగవంతుని యధీనము గావించునటు లొనరింపబడవలె. వాస్తవమునకు: “దివ్యసామ్రాజ్య మెవ్వరి దీయుగమున?” యని లిఖియింపవడిన దివ్య యుగమిది. మరి, ప్రత్యుత్తరమునీయ సంసిద్ధుడైన వాడెవ్వడును, అగుపింపడే!

LXXIX

దైవలోకములకు సంబంధించిన నీ ప్రశ్నమును గురించి. సంఖ్యాపరముగ దైవలోకము లసంఖ్యాకములు, విస్తృతిపరముగ ననంతములు - అను సత్యము నెఱుగుము. సర్వజ్ఞుడును, సర్వవివేకియును నగు భగవంతుడు దక్క యింకెవ్వడును వాటిని గణియింపనూజాలడు, గ్రహియింపనూజాలడు. నిదురించునప్పటి నీ స్థితిని యోచన సేయుము. మానవులు తమ మానసములలో పర్యాలోచించితిరేని, వారియందలి దైవనిదర్శనములలోనికెల్ల, ఇది విస్మయతమ స్థితియని, నిక్కముగా వచియింతును. నీవు నీ స్వప్నమున జూచియున్నది- కొలదికాలమునకు తదుపరి యెటుల పూర్ణసాకారత నొందినదో వీక్షింపుము. నీవు స్వప్నమున వీక్షించిన లోకము, నీవున్న ప్రపంచము వంటిదియేయైనచో, ఆ స్వాప్నికఘటనము అది జరుగుచుండిన క్షణముననే, ఈ ప్రపంచముననూ సంభవిల్లుట యావశ్యకమై యుండెడిది. అటుల జరిగియున్నచో, నీవే దానికి సాక్ష్యమును వహియించి యుందువు. అయిననూ, సందర్భమది గాకుండుటచే, నీవున్న ప్రపంచము భిన్నమైనదనియు, నీవు స్వప్నమునం దనుభూతి నొందినట్టిది కా దనియు, అవశ్యమే తెలియరావలె. ఈ యలౌకిక ప్రపంచ మాద్యంతరహితము. సకలప్రకీర్తితుడును, సర్వశక్తియుతుడును నగు భగవంతు డాజ్ఞాపించినటుల, ఇదే లోకము ప్రత్యేకించి నీయం దున్నదనియు, నీయందే చుట్టిపెట్టబడినదనియు వాదించితివేని, అది సత్యమే యగును. నీ యాత్మ నిద్రాపరిధుల నధిగమించి, యావత్ర్పాపంచికానుబంధమును త్రెంచుకొని, ఈ ప్రపంచపు టంతర్గత యథార్థత యందున నిక్షిప్తమైయున్న లోకమొక దానియందున, దైవలీలచే పయనింపచేయబడిన దనుటయూ, అంతియే సత్యమని చెప్పదగును. దైవసృష్టి యీ లోకమునే గాక అన్యలోకములను, ఈ ప్రాణులనేగాక అన్యప్రాణులను సైత మావరించుకొని యుండునని నిక్కముగా వచియింతును. సమస్తాన్వేషియును, సర్వవివేకియును నగు తాను దక్క , అన్యు డన్వేషింపజాలని యంశములను ప్రతిలోకముననూ యేర్పరచినా డాయన. నీవు నీ ప్రభుడును, సకలలోకా ధీశుడును నగు భగవంతుని పరమార్ధము నెఱుగవచ్చును గాన, మేము నీ కావిష్కరించిన దానిని మననము సేయుము. ఈ వాక్కులయందున దివ్యజ్ఞానమర్మములు నిక్షిప్తములై యున్నవి. మీరు మా యమరవాణి నాలించు వారేని, మా వాక్సృజితుల చేష్టలవలన మమ్ముల నావరించుకొనిన వ్యధకొలది, ఈ యంశముపై యోచించుట నాపివైచినాము.

LXXX

ఈ ప్రపంచమున తన జీవితమునకు స్వాభావికతను చేకూర్చు వ్యక్తిత్వ మూర్తిమత్వము లనూ, చైతన్యవివేకములనూ మానవుడు - భగవంతుని దివ్యప్రవక్తల, ఆయన ప్రాథమ్యులవలెనే - తన భౌతికమరణానంతరము నిలుపు కొనునాయని న న్నడిగినాడవు. విషయ మిదియగుచో, మానవుని మానసికశక్తులకు వాటిల్లు మూర్ఛ, తీవ్రయస్వస్థతల వంటి స్వల్పబాధ లాతడి వివేక చైతన్యములను గోల్పోవజేయుననియూ, ఆతడి శరీరశైధిల్యమును, తదంశీభూతముల విచ్ఛిత్తిని అనివార్య మొనరించు నట్టి యాతడి మృత్యువు తద్వివేకమును నశియింప జేయుటకేని, తచ్ఛైతన్యము నంతమొందించుటకేని శక్తిరహితమనియూ - ఎట్లనినాడవు? మానవుని చైతన్యవ్యక్తిత్వములు తమ యస్తిత్వమునకూ, విధులకూ ఆవశ్యకములైన అవయవములే పూర్ణముగ విఘటితములగు నపుడు సైతము వర్ధిల్లుచునే యుండునని యెవ్వడేని, ఎవ్విధముగ నూహింపగలడు?

మానవుని యాత్మ మహోత్కృష్టమైనదనియూ, అది సమస్త దైహిక, మానసికదౌర్బల్యరహిత మనియూ నెఱుగుము. వ్యాధిగ్రస్తుడు బలహీన లక్షణములను ప్రదర్శించుటయనునది, ఆతడి యాత్మ కును శరీరమునకును మధ్యన నెలకొను ప్రతిబంధకముల వలననే; ఏలయన, ఆత్మ - దైహికరుగ్మతా ప్రభావిత కాదు. దీపకాంతిని పరికింపుము. ఏ బాహ్యవస్తువు తన ప్రకాశము నవరోధించినను, తరగని శక్తితో దీపము ప్రకాశింపుచునే యుండును. అవ్విధముగనే, మానవదేహమును బాధించు ప్రతి రుగ్మతయూ, ఆత్మను తన సహజ శక్తిసామర్ధ్యములను ప్రదర్శింపనీయక నిరోధించు ప్రతిబంధకమే. అయిననూ, దేహమును వీడునపు డది, భూమిపైగల యేశక్తియూ సాటిరాజాలనంతటి యుత్కృష్టతను ప్రదర్శించి, ప్రభావమును కనపరచును. స్వచ్ఛమును, నిర్మలమును, పవిత్రీకృతమును నగు ప్రతి యాత్మయూ, అద్భుతశక్త్యనుగ్రహీతయై మహదానంద పరవశయగును.

గఱిసెకు దిగువన గుప్తీకృతమైన దీపికను పరిశీలింపుము. తత్కాంతి భాసిల్లుచున్ననూ, తత్ర్పకాశము మానవుల కగుపింపదు. అవ్విధముగనే, మేఘావృతసూర్యుని గమనింపుము. యథార్థమునకు సూర్యకాంతిమూలము మార్పులేనిదయ్యును, తత్ర్పభాస మెవ్విధముగ మసకవారిన యట్లగుపించునో పరికింపుము. మనుజుని యాత్మను భానునితోడను, ఆతడి దేహమును భూమిపై నున్న సమస్తము తోడను పోల్పవలె. వాటి మధ్యన యే బాహ్యావరోధమూ ప్రతిబంధకము కానంతవరకు, శరీరమంతయూ, ఆత్మజ్యోతిని ప్రతిఫలింపుచూ, తచ్ఛక్తిచే పరిపోషిత మగుచునే యుండును. అయినను, వాటి మధ్యన ముసువొక్కటి యడ్డుగ నిలచినపుడు, ఆ జ్యోతిశ్శోభ మ్లానత నొందినయ ట్లగుపించును.

సంపూర్ణముగ మేఘములమాటున దాగియున్న సూర్యుని మరల గమనింపుము. సూర్యకాంతిచే భూమి యింకనూ ప్రకాశభరితముగనే యున్నను, అది గ్రహియించు తేజోపరిమాణము గణనీయముగా తగ్గును. మేఘములు వైదొలగునంత దనుక, సూర్యుడు పూర్ణస్థాయిలో తన రశ్మిని తిరిగి ప్రసరించుట జరుగజాలదు. మేఘపుటునికియో, మేఘరాహిత్యమో సూర్యుని సహజప్రభాసము నెవ్విధముగనూ ప్రభావిత మెునరింపజాలదు. మానవుని యాత్మ ఆతడి దేహమును భాసిల్లజేయు సూర్యుడనియూ, తత్సూర్యునినుండియే అది తన భుక్తి నొందుననియూ ఎంచవలె.

ఇంకను, తాను రూపుదిద్దుకొనుటకు పూర్వము, వృక్షమున ఫలమెటుల సుభద్రమైయుండునో గమనింపుము. వృక్షము ఖండములు గావింపబడిన యపుడు ఫలభాగమేని, తత్సూచనయేని యించుక యైనను కానరాదు. అయినను, తా నగుపించియపు డది తన యద్భుతసౌందర్యముతో, ప్రభాసమాన పరిపక్వతతో ప్రత్యక్షమగుట నవలోకింతువు కద. యథార్ధమునకు, కొన్ని ఫలములు, వృక్షమునుండి త్రెంపబడిన పిదపయే పూర్ణపరిపక్వత నొందును.

LXXXI

ఇప్పు డిక మానవుని యాత్మకును, మరణానంతరము దాని మనుగడకును సంబంధించిన నీ ప్రశ్నమును గురించి. శరీరముతో తన వియోగానంతరమది, తాను భగవత్సాన్నిధ్యము నొందునంత వరకు యుగముల, శతాబ్దుల పరిభ్రమణములైనను, యీ ప్రాపంచికపరివర్తనములైనను, అవకాశము లైనను మార్పును చెందింపలేనట్టి స్థితిలో పురోగమనమును సాగింపుచునే యుండునని సత్యవాక్కుగ నెఱుగుము. భగవంతుని దివ్యసామ్రాజ్యము, ఆయన సార్వభౌమత్వము, ఆయన మహత్తు, ఆయన యధికారము నెలకొనియున్న పర్యంతమది పరిఢవిల్లును. అది భగవంతుని సంకేతములను, లక్షణము లను ప్రదర్శన మెునరించును; ఆయన దాక్షిణ్యానుగ్రహముల నభివ్యక్తము చేయును. ఆయన ప్రియకారుణ్యౌదార్యములను వెల్లడించును. ఆత్మసంబంధిత మహోత్కృష్ట వైభవనమును, తన్మహనీయతను సముచితరీతిగ నభివర్ణించు యత్నము గావించినయపుడు, మదీయ లేఖీనీచలనము స్తంభించినది. ఆత్మకు దయాన్వితుని హస్త మనుగ్రహించిన మన్నన యెట్టిదనిన, ఏ జిహ్వయూ దానిని సముచితరీతిన వెల్లడింపనూజాలదు, యే భౌమశక్తియును వర్ణింపనూజాలదు. తాను దేహమును యెడబాసిన ఘడియ యందున, ప్రపంచజనుల నిష్ఫలభావములనుండి ప్రక్షాళితమైన యాత్మ ధన్యము. అట్టి యాత్మ తన సృష్టికర్త యిచ్ఛానుసారము జీవించి, చరియించి, సర్వోన్నత స్వర్గమున కేగును. స్వర్లోక దివ్యసేవికలును, మహాప్రాసాదవాసులును దానిని పరివేష్టింతురు; భగవంతుని దివ్యప్రవక్తలును, ఆయన యభిమానపాత్రులును తత్సాహచర్యము నపేక్షింతురు. వారితో, ఆ యాత్మ స్వేచ్ఛగా సంభాషించును, సమస్తలోకాధిపతియైన భగవంతుని పథమున తనను సుస్థిరముగ నిలిపినదానిని, వారల కది వర్ణించును. భువికి యూర్ధ్వాధోలోకస్థితయైన సింహాసనమున కధిపతియగు భగవంతుని లోకములయం దట్టి యాత్మకు నిర్దేశితమైన దానిని గురించి యే మానవునకేని వెల్లడించిన యెడల మహోత్కృష్టమును, పవిత్రీకృతమును, వైభవాన్వితమును నగు తత్‌ స్థానము నొందవలెనను ప్రబలవాంఛ కొలది యాతడి యస్తిత్వ మెల్లయూ, ఆకస్మికముగ దహియించుకు పోవును. . . . మరణానంతరపు టాత్మ స్వభావ మెన్నటికీ వర్ణితమూ కాజాలదు, తత్పూర్ణ స్వభావమును జననేత్రములకు దర్శింపచేయుట యుక్తమూ కాదు; అందుల కామోదమూ లేదు. మానవాళిని దివ్యసత్యపు బుుజుపథమునకు నిర్దేశించుటయను ఏకైక లక్ష్యనిమిత్తము భగవత్ర్పవక్తలనూ, దివ్యవార్తాహరులనూ భువి కంపనైనది. తమ మృత్యుఘడియన పూర్ణ స్వచ్ఛతాపవిత్రతలతో, సంపూర్ణ పరిత్యాగముతో, మహోన్నతుని సింహాసనము నధిరోహింప గలుగు నటుల సమస్త మానవులకూ జ్ఞానమును గఱపుటయే వారి యావిష్కరణోద్దేశ్యముగ నుండినది. వారు వెలువరించు తేజస్సు ప్రపంచాభ్యున్నతికిని, తత్ర్పజాభివృద్ధికిని హేతు వగును. జీవప్రపంచమును పులియబెట్టు ఫేనక సదృశులు వారు; ప్రాపంచిక కళలనూ, వైచిత్ర్యములనూ ప్రత్యక్షీకరించు ప్రేరణశక్తి వారల కుండును. మేఘములు వారిద్వారా తమ వదాన్యతను మానవులపై వర్షించును, ధరణి తన ఫలముల నిచ్చును. సమస్తవస్తు జాలమున కొక హేతువును, ఒక ప్రేరణ శక్తియు, ఒక చైతన్యసూత్రమును యుండుట యావశ్యకము. వీరు, ఈ పరిత్యాగ ప్రతీకలు - జీవప్రపంచమున సర్వోత్కృష్ట చలనస్ఫూర్తిని ప్రసాదించినారు; ప్రసాదింపుచునే యుందురు. ఇంకను స్వమాతృగర్భముననేయున్న శిశువునకు, ఆ ప్రపంచమునకన్నను, ఈ ప్రపంచము వైవిధ్యభరితముగ నుండునటులే, ఈ ప్రపంచమునకును, అలౌకిక ప్రపంచమునకును వైవిధ్యముండును. దైవసాన్నిధ్యము నొందినయపుడు - ఆత్మ, తన యమరత్వమున కనువగు, తన యలౌకిక దివ్యావాసమునకు యుక్తమగు రూపునొందును. అట్టి జీవన మశాశ్వతము దక్క, శాశ్వతము కాదు. ఏలయన, తొలిదానికి పూర్వ మెుక హేతువుండగ, తదుపరిదాని కట్టిది లేదు. నిత్యజీవనము నిక్కముగ భగవంతునికే—సమున్నతమాయన వైభవము—పరిమితము. ఈ సత్యమును గ్రహియించినవారికి శుభమగును. భగవత్ర్పవక్తల వర్తనను గురించి నీ హృదయమున పర్యాలోచించితివేని, అన్యలోకములు తోడైయుండుట ఈ ప్రపంచమున కావశ్యకమని నిస్సంకోచముగ నంగీకరింతువు. యశోలేఖిని వివేకఫలకమున లిఖియించినటుల, నిజమగు విజ్ఞులును, పండితులయం దధిక సంఖ్యాకులును భగవంతుని యాజ్ఞావివృతి సత్యమునకు యుయుగములుగ సాక్ష్యమును వహియించినారు. భగవన్నిర్దేశితుల, వార్తావహుల విజ్ఞతను - భౌతికవాదులు సైతము తమ రచనల యందున ధృవీకరించి, స్వర్గమునకును, నరకాగ్నికిని, భవిష్యత్ర్పతిఫలమునకును, శిక్షకును సంబంధించి దివ్యప్రవక్త లొనరించిన ప్రస్తావనలను - మానవాత్మలను చైతన్యపరచి, సముద్ధరింపవలె నను ఆకాంక్షతో ప్రేరితమైనవిగ పరిగణించినారు. కావున, తమ విశ్వాసములును, సిద్ధాంతములును ఏమైనను, సాధారణప్రజానీకము, ఈ భగవత్ర్పవక్తల మహనీయత నెటుల గుఱుతించి, వారి యాధిక్యత నంగీకరించినదో పర్యాలోచింపుముు. ఈ పరిత్యాగశిరోమణులను కొందరు జ్ఞానస్వరూపులని పరిగణింపగా, సాక్షాత్‌భగవత్ర్పవాచకులని మరికొందరు విశ్వసించినారు. భగవంతుని లోకము లన్నియూ, ఈ ప్రాపంచిక జీవితమునకే పరిమిత మెునరింపబడినవని విశ్వసించియుండిన పక్షమున, అట్టి దివ్యమూర్తులు, శత్రువులకు వశులగుట కేల సమ్మతించి యుండెడివారు? ఎన్నడును, ఏ మానవుడును అనుభవించియో, అవలోకించియో యుండియుండని సంక్షోభములను, వ్యధలను యిచ్ఛాపూర్వకముగ వారనుభవించి యుండెడివారా?

LXXXII

ఆత్మ స్వభావమును గురించి న న్నడిగినావు. సత్యముగా, ఆత్మ భగవత్సంకేతమనియూ, మహామేధావులైనను గ్రహియింపగలేని యథార్థతాన్విత దివ్యమణియనియూ, తన్మర్మమును వెల్లడింపగలనని యెంతటి సునిశితమేధయేని, ఎన్నటికినీ ఆశింపజాలదనియూ నిక్కముగా దెలియుము. సృజితవస్తు సమస్తమునను, తన సృష్టికర్త మహోన్నతిని వెల్లడించువానియందున మొదటిది యది; ఆయన వైభవమును గుఱుతెఱిగి, ఆయన సత్యమునకు నిబద్ధయై, ఆయన యెదుట ఆరాధనాపూర్వకముగా తొలుత ప్రణమిల్లునదది. అది భగవంతునికి విధేయమైనచో, ఆయన శోభను ప్రతిఫలించి, తుద కాయన చెంతకు మరలిపోవును. అయినను, తన సృష్టికర్తయెడ స్వామిభక్తియం దది వైఫల్యము నొందెనేని, స్వార్థవ్యామోహపీడితయై, అంతిమముగ తదగాధముల యం దడగిపోవును.

ఈ దివ్యయుగమున, నిత్యసత్యమగు ఆయనకు తనను విముఖుని గావించు మనుష్య శంకలకును, భ్రమలకును తావీయ తిరస్కరించినయట్టి, ఆయన దివ్యసందేశమును తాను గుఱుతింప కుండుటకై ధార్మిక, లౌకిక ప్రముఖులు ప్రేరేపించిన సంక్షోభమునకు లోబడనియట్టి మానవుడు - సకల మానవాధీశుడైన భగవంతునిచే ఆయన మహోన్నత చిహ్నములయం దొక్కటిగా మన్నన సేయబడి, సర్వోన్నతుని దివ్యలేఖిని తన దివ్యగ్రంథమున లిఖియించిన నామధేయులయం దొకనిగ గణియింప బడును. అట్టి యాత్మ నిజస్థాయిని గుఱుతించి, తత్‌స్థానము నంగీకరించి, తత్‌సుగుణములను కనుగొనిన యాతడు ధన్యుడు.

ఆత్మాభ్యున్నతి సంబంధితములగు కామము, శీఘ్రక్రోధము, స్ఫూర్తి, భూతదయ, సంతుష్టి, దైవప్రీతి వంటి వివిధదశలను గురించి ప్రాచీనగ్రంథములయం దెంతయేని లిఖియింపనైనది; అయినను, పరమోన్నతుని దివ్యలేఖిని వానిని ప్రస్తావింప నిచ్చగింపలేదు. ఈ దివ్యయుగమున, వినయాన్వితయై తన దైవముతో పయనింపుచు, ఆయనకు నిబద్ధయగు ప్రతి యాత్మయూ సమస్త శ్రేష్ఠతరనామముల, స్థానముల యశోగౌరవములతో ననుగ్రహీత యగును.

మానవుడు నిదురించునపుడు, ఆతడి యాత్మ ఏ బాహ్యవస్తువుచేనైనను సహజముగనే ప్రభావిత మగుననుట యెవ్విధముగను సరికాదు. తన యథార్ధస్థితి, స్వభావముల పరముగా, అది యెట్టి మార్పునకూ లోనుకాదు. దాని కర్మల యందలి యెట్టి వైవిధ్యతనైననూ బాహ్యకారణములకే యారోపింప వలె. తత్పర్యావరణ, తదవగాహన, తత్‌జ్ఞాన సంబంధిత వైవిధ్యములు వేటినైననూ వర్తింపవలసినది, యీ బాహ్యప్రభావములకే.

మానవనేత్రము గురించి యోచింపుము. దానికి సమస్త సృజితములను వీక్షించు సామర్ధ్య మున్ననూ, అది యే వస్తువునైనను విలోకించు శక్తిని కోలుపోవునటుల, స్వల్పతమ యవరోధము దానిని ప్రతిరోధింపవచ్చును. ఈ కారణములను కల్పించి, వాటికి మూలహేతువైన యట్టి; మనుష్యప్రపంచ స్థితమై యుండిన ప్రతి పరివర్తనయును, వైవిధ్యమును, వాటిపై యాధారితము కావలెనని నిర్దేశించిన యట్టి - అయన నామము ప్రకీర్తితము. యావద్విశ్వస్థితమగు ప్రతి సృజితమూ - ఆయన జ్ఞానమునకు దారితీయు ద్వారము, ఆయన సార్వభౌమత్వ సంకేతము, ఆయన నామముల యావిష్కృతి, ఆయన వైభవ ప్రతీక, ఆయన యధికారచిహ్నము, ఆయన బుుజుమార్గ ప్రవేశసాధనము దక్క - వేరొండు కాదు. . . .

మానవాత్మ, మౌలికముగా, భగవంతుని సంకేతములయం దొకటనియు, ఆయన వైచిత్ర్యముల లోనికెల్ల వైచిత్ర్యమనియు నిక్కముగ వచియింతును. సర్వశక్తిమంతుని మహాశక్తిసమన్విత సంకేతములయం దది యెుకటి; భగవంతుని సకల లోకముల యథార్థత నుద్ఘోషించు సూచిక యది. ప్రపంచ మిపుడు పూర్ణముగ గ్రహియింపజాలనిది, అందున విలీనమై యున్నది. భగవంతుని సమస్త న్యాయశాసనముల నావరించియుండునట్టి ఆయన దివ్యావిష్కరణమును నీ హృదయమున పర్యాలోచించి; దానిని - ఆయనకు విద్రోహము గావించినయట్టి, దివ్యనామధేయముల కధినాథు నాశ్రయింపనివ్వక మానవులను ప్రతిరోధించునట్టి, తమ వాంఛాదౌష్ట్యముల ననుసరింప ప్రేరేపించునట్టి - నీచ, దైహికవాంఛా ప్రవృత్తితో పోల్చిచూడుము. అట్టి యాత్మ వాస్తవమున కపసవ్యమార్గమున కడు దూరము కదలిపోయినది. . . .

అదియును గాక, శరీరవియోగానంతరపు టాత్మస్థితిని గురించి నన్నడిగినావు. మనుష్యాత్మ భగవన్మార్గములయందున పయనించి యుండెనేని, అది నిస్సంశయముగా, తిరిగి పరమప్రియతముని వైభవమున యుత్తిష్ఠత నొందునని సత్యప్రమాణముగ నెఱుగుము. భగవంతుని ధార్మికతపై యాన! ఏ లేఖినియును వెల్లడింపజాలని, ఏ జిహ్వయును వర్ణింపజాలనియట్టి స్థాయినది సాధించును. భగవంతుని దివ్యధర్మవిధేయుడై, ఆయన దివ్యపథమున యచంచలుడై స్థిరముగ నిలచిన యాతడు తన నిర్యాణా నంతరము భగవత్సృజితలోకము లన్నియును తన మూలమున లబ్ధినొందగల్గునంతటి శక్తిని సముపార్జించుకొనును. అట్టి యాత్మ - నిష్కళంకరాజన్యుని, దివ్యశిక్షకుని యాదేశానుసారము ప్రపంచాస్తిత్వమును సువిస్తృతమెునరించు స్వచ్ఛఫేనకమును సమకూర్చి, లౌకిక కళలను, వైచిత్ర్యములను ప్రదర్శితమెునరించు శక్తిని చేకూర్చును. బోనము పులియుటకు ఫేనకమెంత యావశ్యకమో యోచింపుము. పరిత్యాగప్రతీకలగు వారలు, ప్రపంచమునకు ఫేనకమే. ఇందు గురించి పర్యాలోచించి, కృతజ్ఞతాన్వితులయం దొకడవు కమ్ము.

మా దివ్యఫలకములు పెక్కింటియందున మేమీ యంశమును ప్రస్తావించి, ఆత్మాభ్యుదయము లోని వివిధదశలను నిర్దేశించినాము. నిర్గమన, తిరోగమనము లన్నింటికన్నను మానవాత్మ యుదాత్త మైనదని నిశ్చయముగ వచియింతును. నిశ్చలమైనను పైకెగయునది; చలియించుచున్నను నిశ్చలమది. అనిశ్చితప్రపంచాస్తిత్వమునకును, ఆద్యంతరహిత ప్రపంచయథార్థతకును సాక్ష్యమును వహియించు ప్రామాణ్యమే యది. నీవు గాంచిన స్వప్నము, పలువత్సరములు గడచిన పిదప యెటుల నీ కన్నుల యెదుట పునఃప్రదర్శితమైనదో విలోకింపుము. నీకు నీ స్వప్నమునం దగుపించు లోకవైచిత్రి యెంత విచిత్రమో యోచింపుము. నీ మానసమున భగవంతుని యనన్వేషణీయ విజ్ఞతను స్మరియించి, తద్బహువిధా విష్కరణలను గురించి పర్యాలోచింపుము. . . .

భగవంతుని యద్భుత రచనానిదర్శనములను తిలకించి తత్స్వభావ, పరిధులను సమీక్షింపుము. ప్రవక్తలముద్రయగు ఆయన: “ఓ దేవా! నీపట్ల నా విస్మయమును, విభ్రాంతిని వృద్ధి గావింపు,” మనినాడు.

భౌతికప్రపంచ మేవేని పరిమితులకు లోబడియున్నదా యను నీ ప్రశ్నమును గురించి: తద్విషయ గ్రాహ్యత పరిశీలకునిపైననే యాధారితమగునని తెలియుము. అది యెుకవిధముగ పరిమితము; ఇంకొక విధముగ యావత్పరిమితుల కన్నను సమున్నతము. నిజైకదైవము నిత్యుడు, శాశ్వతుడు. అటులే, ఆయన సృష్టి కాదియును లేదు, అంతమును నుండదు. అయిననూ, సృజిత మంతటికిని పూర్వహేతు వుండును. ఈ యథార్థమే, సృష్టికర్త యేకేశ్వరత్వమును సంశయాతీతముగ చాటుచున్నది.

ఇంకను, నక్షత్రమండలముల స్వభావమును గురించి న న్నడిగినాడవు. వాటి స్వభావమును గ్రహియించుటకు నక్షత్రమండలములను గురించియు, లోకములను గురించియు పూర్వగ్రంథ ప్రస్తావిత పరోక్షసూచనల భావములను మధించుటయును, ఈ భౌతిక ప్రపంచముతో వాటి సంబంధ స్వభావమును, అవి దానిపై చూపెడు ప్రభావము నెఱుగుటయును ఆవశ్యకమగును. దిగ్ర్భమము గొల్పు నొక్కొక్క యితివృత్తముతో ప్రతి హృదయమూ విస్మయాన్విత యగును, ప్రతి మేధయూ తద్వైచిత్రికి భ్రాంతచేతస్క యగును. దైవమే తత్ర్పాధాన్యతను గ్రహియింపగలడు. ఈ భూమి జీవితకాల మెన్నియో సహస్రాబ్దములని ధృవీకరించిన విజ్ఞానులు, తమ సుదీర్ఘ పరిశీలనాకాలమున, అన్యగ్రహముల సంఖ్య నైనను, వాటి వయస్సులనైనను గణియించుట యందున వైఫల్యము నొందినారు. అంతియేకాదు, వారి ప్రతిపాదిత సిద్ధాంతముల పర్యవసానముగ నభివ్యక్తములైన బహువిధ భిన్నాభిప్రాయములను పరికింపుము. ప్రతి సుస్థిర తారకును తనవగు గ్రహములును, ప్రతి గ్రహమునకును తనవగు ప్రాణులును కలవనియు, వాటి సంఖ్యను యేమానవుడును గణియింపజాలడనియు నెఱుగుము.

నా వదనముపై నీ నయనములను నిల్పినవాడా! ఈ యుగమున దివ్యవైభవప్రభాతము తన దీప్తిని ప్రదర్శించినది, మహోదాత్తుని వాణి యామంత్రింపుచున్నది. మేము పూర్వమే వాక్రుచ్చినాము: “ఏ మానవుడును తన ప్రభుని ప్రశ్నించు యుగము కాదిది. భగవంతుని యామంత్రణము నాలించిన యాతడికి, దివ్యవైభవప్రభాత మభివ్యక్తము గావించినయటుల, ఉద్యమించి, ‘ఓ సకల నామముల యధినాథుడా, ఇందుంటి నిందుంటిని; ఓ స్వర్గములస్రష్టా, ఇందుంటి నిందుంటిని! నీ దివ్యావిష్కరణ ద్వారమున భగవద్ర్గంథ నిక్షిప్తాంశములు బహిర్గతము లైనవనియు, నీ దివ్యవార్తావహులు పవిత్ర లేఖనముల యందున లిఖియించిన దెల్లయును నెరవేరినదనియు సాక్ష్యము నిత్తు’ నని యుద్ఘోషించుట నీకు సముచిత,” మని.

LXXXIII

మనుష్యతత్త్వమునకు భగవంతు డనుగ్రహించిన తార్కికశక్తిని తల పోయుము. ఆత్మానుశీలన మెునరించుకొని, నీ చలనాచలనములును, నీ యిచ్ఛాలక్ష్యములును, నీ దృక్ర్శవణములును, నీ ఘ్రాణేంద్రియవాక్శక్తులును, ఇంకను, నీ దైహికవాంఛా, ధార్మిక భావనా సంబంధితములేమి, తదతీతములేమి - సకలమును యీ శక్తినుండియే, ఎవ్విధముగ నభివ్యక్తమగుచు, ఎటుల దీనినే తమ యస్తిత్వమూలముగ నెంచి వర్తింపుచున్నవో వీక్షింపుము. అవి దీనితో నెంతటి సన్నిహిత సంబంధమును కలిగియున్నవనిన, మానవదేహమునకు దీనితోగల సంబంధమునకు లిప్తమాత్రమైనను విఘాతము కల్పింపబడెనేని, ఈ జ్ఞానేంద్రియములయందలి ప్రతియెుక్కటియూ తన విధినిర్వహణము నుపసంహరించి, తన క్రియానిదర్శనముల నభివ్యక్త మొనరించు శక్తిని కోలుపోవును. ఈ పూర్వప్రస్తావిత జ్ఞానేంద్రియములయం దొక్కొక్కటియు తన సక్రమవిధి నిర్వహణమున - సమస్తమునకును సార్వభౌముడగు ఆయన యావిష్కరణ చిహ్నముగ నెంచవలసిన - ఈ తార్కికశక్తి పైననే యాధారిత మనునదియూ, సదా యాధారితముగనేయుండు ననునదియూ స్పష్టము, విస్పష్టము. దాని యభి వ్యక్తీకరణ మూలముననే, ఈ సమస్త నామధేయములును, లక్షణములును ఆవిష్కృతములైనవి; తత్ర్కియాస్తంభనముతో నవి యన్నియును కృశించి, నశించును.

దృక్శక్తి దీనినుండియే యుత్పన్నమై, దీనిపైననే యాధారితమై వర్తించును కనుక, ఇదియును దృక్శక్తి వంటిద ననుట పూర్తిగా అసత్యమగును. అటులే, శ్రవణేంద్రియము తన విధుల నిర్వహణమున కవసరమగు దారుఢ్యమును యీ తార్కికశక్తినుండియే గ్రహియించును కనుక, ఈ శక్తిని శ్రవణేంద్రియముతో గుఱుతింపవచ్చునని వాదించుటయూ వ్యర్థమే యగును.

ఇదే యనుబంధ మీతార్కికశక్తిని మానవదేహాలయమునందలి నామముల, లక్షణముల గ్రహీతతో ననుసంధానించును. ఈ విభిన్ననామములును, ఆవిష్కృత లక్షణములును యీ భగవత్సంకేత మాధ్యమజనితములే. తన తత్త్వ, యాథార్థ్యతల పరముగా, ఈ సంకేతము అట్టి సమస్తనామ, లక్షణముల కన్ననూ అనంతమహోదాత్తము. అంతియేకాదు, తద్వైభవముతో తులనమొనరించిన యపుడు, ఇదిదక్క, శేషించిన దెల్లయు పూర్ణశూన్యతనొంది, విస్మృతమగును.

ఈ దైవనిర్దేశితసూక్ష్మ యాథార్థ్యతను, సకలశాశ్వతుడును, సమస్తవైభవ ప్రపూరితుడును నగు భగవంతుని యీ యావిష్కరణ సంకేతమును - మహామేధావులు గతమున సముపార్జించినవో, మునుముం దార్జించునవో యగు సునిశిత బుద్ధి, వివేకములతో - ఇప్పటినుండి యనంతము వరకు నీ హృదయమున పర్యాలోచన మొనరించినను, తద్వైచిత్రిని గ్రహియించుటయందున నేమి, తత్స్వభావ విశ్లేషణముననేమి విఫలుడ వగుదువు. నీలోని తద్యదార్థతా సంబంధిత సముచితజ్ఞానము నార్జించుట యందున నీ శక్తిహైన్యతను గ్రహియించినందున, అనశ్వర యశోభానుడును, అనంతయుగ ప్రాచీనుడును నగు ప్రత్యక్షదైవము యొక్క వైచిత్రిని కనుగొనుటకు నీవేని, అన్యసృజిత మెద్దియేని గావించి యుండిన యత్నముల నిరర్ధకతను యిచ్ఛాపూర్వకముగ నంగీకరింతువు. పరిపక్వతాన్విత పర్యాలోచన మంతిమముగ ప్రతిమేధస్సునూ ప్రేరేపించి గావింపజేయు యీ అసహాయతాంగీకృతియే మనుష్యావగాహనమునకు పరాకాష్ఠ, మానవాభ్యున్నతి యుత్కృష్టతా సూచకము.

LXXXIV

నిజైకదైవమును సమస్తసృజితములకన్నను విశిష్టునిగ, అమేయ సంకీర్తితునిగ సంభావింపుము. ఆయన తన సృజితముల కన్నను స్వతంత్రునిగను, సమున్నతునిగను నుండగ, విశ్వ మెల్లయూ ఆయన యశస్సును ప్రతిఫలించును. దివ్యైక్యతకు నిజార్ధ మిదియే. అప్రతిహత సార్వభౌమత్వమును జీవప్రపంచముపై ప్రదర్శించు శక్తియుతుడు - సమస్త సృష్టిదర్పణమునను ప్రతి ఫలించు నిత్యసత్యమైన ఆయనయే. అస్తిత్వసమస్తమూ ఆయనపైననే ఆధారితము; సకలప్రాణుల జీవాహార మాయననుండియే యుత్పాదితము. దివ్య యేకత్వమున కర్ధమిది; తన్మూలసూత్రమిది.

స్వీయనిష్ఫలభావ వంచితులై, సృజితాంశముల నన్నింటినీ భగవత్సంబంధితము లనియు, తత్సమానములనియు భావించి, తా మాయన యేకత్వమునకు వ్యాఖ్యాతలమని కొందరు భావించుకొనినారు. నిజైకదైవముపై యాన! అట్టి మానవు లంధానుకరణ పీడితులు; పీడితులుగనే శేషింతురు; దైవభావనను నియంత్రించి, పరిమిత మెునరించిన వారిగ, వారల నెంచవలె.

ద్వైతమును యేకత్వమని భ్రమనొందక, తన భగవదేకత్వభావనను మఱుగుపరచు యే వాదము నైనను తిరస్కరింపుచు, దివ్యాస్తిత్వమును - ఆయన స్వభావరీత్యా - సాంఖ్యకపరిమితుల కతీతునిగ సంభావించు నాతడే నిజవిశ్వాసి.

భగవంతుని దివ్యావతారమూ, ఇంకనూ అగోచరుడును, దుర్లభుడును, దుర్ర్గాహ్యతత్త్వమును నగు ఆయనయూ - ఒక్కడే, ఒక్కరే యని పరిగణించుటయే దివ్యైక్యతా విశ్వాససారము. తద్భావ మేమనిన, దివ్యావతార సంబంధిత మేదైనను, ఆయన సమస్త క్రియాకలాపములును, ఆయన నిర్ణయ నిషేధములయం దెద్దియైనను, సంబంధిత సకలాంశములపరముగను, సర్వావస్థలయందునను, ఎట్టి మినహాయింపులును లేక, సాక్షాత్తూ భగవంతుని యిచ్ఛాసదృశములుగనే పరిగణనము నొందవలె. నిజవిశ్వాసి భగవంతుని యేకత్వమున ఎన్నటికేని, అందనెంచగల మహోతృష్టస్థానమిది. ఈ స్థానము నొందు నాతడు ధన్యుడు, స్థిరవిశ్వాసులయం దొకడు.

LXXXV

ఓ నా సేవకులారా! దివ్యమును, ఆత్మోద్దీపకమును నగు యీ వసంత కాలమున మీపై వర్షిల్లు యనుగ్రహోపకృతులతో మీ యాత్మలను ప్రఫుల్లితములను చేసికొని, పునరుత్తేజితములను గావించుకొనుట మీకు యుక్తము. ఆయన మహావైభవదివ్యాదిత్యుడు మీపై తన తేజమును ప్రసరించి నాడు; ఆయన యనంతానుగ్రహమేఘములు మిమ్ముల నావరించినవి. అట్టి మహౌదార్యమును తానై కోలుపోవని, ఈ వినూత్నాహార్యమున తన విశిష్టప్రియుని సౌందర్యమును గుఱుతించుటయందున వైఫల్యము నొందని యాతడి ప్రతిఫల మెంతటి మహత్తరము!

వచించు: ఓ జనులారా! భగవద్దీపిక జ్వలియింపుచున్నది. దాని శోభ ప్రచండములగు మీ యవిధేయతావాయువు లంతరింపచేయునేమో, జాగరూకులు కండు. ఉద్యుక్తులై, మీ దేవదేవుని ప్రస్తుతింపవలసిన తరుణమిది. దైహికసౌఖ్యములకై యత్నింపక, మీ మానసమును నిర్మలముగ, నిష్కళంకముగ నుంచుకొనుడు. దుష్టాత్మ మిమ్ములను చేజిక్కించుకొన సంసిద్ధుడై నిరీక్షింపుచున్నాడు. వాని దుస్తంత్రముల నెదిరింప సన్నద్ధులుకండు; మిమ్ముల నావరించుకొనియున్న తిమిరమునుండి - నిజైకదైవ నామధేయప్రభా పథనిర్దేశితులై - విముక్తులు కండు. మీ యాలోచనములను మీపైగాక, పరమ ప్రియునిపై కేంద్రీకృత మెునరింపుడు.

వచించు: త్రోవదప్పిన ఓ పథికులారా! సత్యమును దక్క యితరమును బలుకని దివ్యవార్తావహుడు మీకు పరమప్రియుని యాగమనము నుద్ఘోషించినాడు. వీక్షింపుడు, ఇపు డరుదెంచినా డాయన. ఖిన్నులై, కృంగితిరేల? పవిత్రుడును, నిగూఢుడును నగు ఆయన, ముసువులను తొలగించుకొని మీమధ్యన యవతరింప, నైరాశ్యము నొందితిరేల? ఆద్యంతములును, చరాచరములును, చేతనాచేతనములును తానెయైన ఆయన, ఇప్పుడు మీ కన్నులయెదుట ప్రత్యక్షీకృతుడైనాడు. ఈ దివ్యయుగమున, ఆద్య మంత్యమునం దెట్లు ప్రతిఫలించెనో, నిశ్చలతనుండి చలన ముద్భవించెనో వీక్షింపుడు. సర్వశక్తిమంతుని వాక్కులు సమస్తసృష్టి యందునను వెలువరించిన ప్రబలశక్తులతో నుత్పాదిత మీచలనము. దాని జీవప్రేరకశక్తిచే సచేతనుడైన యాతడు, ప్రియతముని యాస్థానప్రవేశ ప్రేరితుడగును; దానిని తానై కోలుపోయినవాడు దుర్భరనైరాశ్యమునం దడగిపోవును. ఈ దివ్యయుగ జ్యోతిని గుఱుతించుటయందున ప్రాపంచికసమస్తము తన కవరోధమును కల్పింపని, ధర్మమార్గము నుండి తనను తప్పించుటకు మనుష్య వ్యర్థాలాపముల కవకాశము నీయని యాతడు నిజముగా విజ్ఞుడే. ఇయ్యద్భుతావిష్కరణోద్గమనమున, ఆ యాత్మప్రఫుల్లక పవనముచే సచేతనుడగుటయందున వైఫల్యము నొందినవాడు నిక్కముగా నిర్జీవుడే. సర్వోన్నత మోక్షప్రదాతను గుఱుతింపక, తన యాత్మను నిర్బంధించి, స్వీయవాంఛాశృంఖలముల యందున, దుఃఖమునకును, నిస్సహాయతకును లోనుగావించినవాడు వస్తుతః బందీయే.

ఓ నా సేవకులారా! ఈ దివ్యప్రస్రవము నాస్వాదించినవా డనంత జీవితము నొందినాడు; దానిని సేవింప తిరస్కరించినవాడు మృతప్రాయుడు. వచించు: ఓ అధర్మవర్తనులారా! సర్వసమన్వితుని సుమధురస్వరము నాలింపనీయక దురాశ మిమ్ముల నవరోధించినది. ఆయన దివ్యరహస్యము మీ కెఱుక వడుటకు, దానినుండి మీ హృదయములను ప్రక్షాళన మెునరింపుడు. ఆయన పూర్ణభాసుర భాస్క రునివోలె ప్రత్యక్షుడై, తేజరిల్లుట నవలోకింపుడు.

వచించు: ఓ అవగాహనాశూన్యులారా! కఠినపరీక్షణ మెుక్కటి మిమ్ముల ననుసరింపుచున్నది; అది యాకస్మికముగ మిమ్ముల నధిగమించును. ప్రయత్నింపుడు, దైవవశమున, మీ కది యెట్టి హానినీ చేయకయే గడచిపోవచ్చును. తన సంపూర్ణ మహనీయతాసమన్వితుడై మీచెంత కేతెంచినయట్టి, తదీయ దైవమగు దివ్యాధీశుని నామపు టుత్కృ ష్ట్తస్వభావము నంగీకరింపుడు. నిక్కముగ, ఆయన సర్వజ్ఞుడు, సమస్తాధిపతి, సర్వోన్నత సంరక్షకుడు.

LXXXVI

ఇప్పుడిక తమ శరీరముల నుండి విడివడిపోయిన తదుపరి, మానవాత్మలు ఒండొరులను గురించిన స్పృహతోనే యుండిపోవునా యను నీ ప్రశ్నమును గురించి. శోణమహానౌకలోని కేగి, అందున యుపస్థితులైన బహా జనుల యాత్మలన్నియూ, ఒండొరులతో మమేకములై, సల్లాపములాడుకొనుచు, తమ జీవితాశయముల, తమ లక్ష్యముల, తమ యత్నముల పరముగ నొకే యాత్మవలె వర్తించును. అవి నిజమున కభిజ్ఞములు, సూక్ష్మదృక్కులు, జ్ఞానప్రసాదితములు. సర్వజ్ఞుడును, సకలవివేకియును నగు ఆయన, దీని నివ్విధముగ నిర్దేశించినాడు.

దైవనౌక నివాసులగు బహాజనుల యాత్మలన్నియూ, ఒండొరుల స్థితి గతులను లెస్సగ దెలియును; సాన్నిహిత్యసాహార్దబంధములతో ననుబంధితములగును. అయిననూ, అట్టి స్థితి వాటి విశ్వాసము పైనను, వాటి వర్తనలపైనను ఆధారితము కావలె. ఒకే స్థాయియును, ఒకే స్థానమునుగల యాత్మలకు ఒండొరుల సామర్ధ్యస్వభావములును, సాఫల్యతాయోగ్యతలును సంపూర్ణముగ తెలియును. కాని, నిమ్నస్థాయి యాత్మలు తమకన్నను సమున్నతస్థితినొందిన యాత్మల స్థానమునైనను, యోగ్యతల నైనను తగువిధముగ నవగత మెునరించు కొనుట కశక్తములు. నీ ప్రభునినుండి ప్రతియెుక్కడును తన పాలునొందును. తన యాత్మ సర్వజనసార్వభౌముడును, మహాశక్తియుతుడును, నిత్యసహిష్ణువును, సకల కరుణాన్వితుడును నగు భగవంతుని సాన్నిధ్యము నొందునంత దనుక, ఆయన దెసకు తన వదనమును మరలించి, ఆయన ప్రేమయందున స్థైర్యముతో పయనించిన మనుజుడు ధన్యుడు.

అయిననూ, అవిశ్వాసుల యాత్మలు, తా మంతిమశ్వాసను తీసికొనునపుడు తమ చేజారిన సద్విషయములపై యెఱుకపరుపవడి—నే నిందులకు సాక్షీభూతుడను—తమ దుస్థితికి దుఃఖించి, భగవంతుని యెదుట లజ్జితములు కావలె. తమ యాత్మలు తమ దేహముల నెడబాసిన యనంతరమును, వా రటులగుచునే యుండవలె.

మానవు లెల్లరును, తమ భౌతికమరణానంతరము తమ కర్మముల విలువను సమీక్షించుకొని, తమ హస్తము లొనరించిన దానిని గ్రహియింపవలె ననుట సుస్పష్టము, సువిశదము. దివ్యశక్తి దిఙ్మండలమున భాసిల్లు దినకరునిపై ప్రమాణ మెునరింతును! ఈ జీవితమునుండి తాము నిష్ర్కమించిన క్షణమున, నిజైకదైవానుయాయులు వర్ణనాతీతములగు సంతసోల్లాసముల ననుభవింప, పాపిష్ఠు లితర మధిగమింపజాల నంతటి యతులితభయమున విహ్వలురై, వ్యాకులపాటు నొందెదరు. సకల ధర్మాధినాథుడగు ఆయన యనుగ్రహవదాన్యతలతో, బహుముఖీన యౌదార్యములతో, అనశ్వర విశ్వాసపు టిష్టమధువును గ్రోలిన వానికి శుభము. . . .

భగవత్ప్రియులు తమ కన్నులను, ఆయన దివ్యావతారము దెసకు సారించి, ఆ దివ్యావతార మావిష్కరింప నిచ్చగించిన వానిపై యవలగ్న మెునరింప వలసిన దివ్యయుగమిది. పూర్వతరము లనుసరించి, తమ గ్రంథములయందున లిఖియించుకొనినయట్టి నియమములు చాలవరకు దురుద్దేశ్య ప్రభావితములు కాగా, పూర్వయుగములనాటి కొన్ని సాంప్రదాయముల కెట్టి యాధారములును లేవు. మానవులయం దిపుడు ప్రాచుర్యము నొందియున్న భగవద్వచన సంబంధిత భాష్య, వ్యాఖ్యానముల యందలి అధికాంశ మెంత సత్యవిహీనమో సూక్ష్మదృష్టితో పరికింపుము. వాటి యసత్యము, కొన్ని సందర్భములయం దాచ్ఛాదనలు చింపివేయబడిన యపుడు వెల్లడియైనది. భగవత్ప్రవచనముల యందలి దేని యర్ధమునైననూ అవగత మెునరించుకొనుటలో తమ వైఫల్యమును, వారే యంగీకరించినారు.

మా యుద్దేశ్యము, పూర్వకాలప్రబోధిత వ్యర్థభాషితములనుండి భగవత్ప్రియతములు తమ మనస్సులను, శ్రవస్సులను పునీతములను గావించుకొని, భగవంతుని దివ్యావిష్కరణప్రభాతమగు ఆయనను, ఆయన యభివ్యక్తీకృతములను తమ యంతరాత్మలతో నాశ్రయించితిరేని, భగవంతుని దృష్టియం దట్టి ప్రవర్తన మెంతయేని యుత్తమమైనదిగ సంభావితమగునని నిరూపించుటయే . . . .

ఆయన దివ్యనామమును సంకీర్తించి, కృతజ్ఞులయం దొకడవు కమ్ము. భగవంతుడు తన వాత్సల్యనిమిత్త మెవ్వరి నెంచుకొని, వారిచే వారి లక్ష్యములను సాధింపజేయించెనో, ఆ నా ప్రియతము లకు నా యభినందనల నందింపుము. సకలలోకాధీశుడగు భగవంతునికి సమస్త ప్రశస్తి.

LXXXVII

ఇప్పుడిక, “మానవ జాతిపితయగు ఆదామునకు పూర్వ మవతరించిన దివ్యప్రవక్తలవేని, తత్ప్రవక్తల సమకాలీన రాజన్యులవేని, అభిలేఖ్యము లేలకానరా,” వను నీ ప్రశ్నమును గురించి. వారి ప్రస్తావన మెద్దియును లేకుండుట యనునది, యథార్థమునకు వారే లేరనుటకు తార్కాణము కాదని యెఱుగుము. వారికి సంబంధించిన యభిలేఖ్యములిప్పు డలభ్యము లగుటను, వారి బహుప్రాచీనతకును, వారి కాలమునుండియు భూమి లోనగుచూ వచ్చిన విస్తృత పరిణామములకును - ఆరోపింపవలె.

అంతియేగాక, మానవులయం దిప్పుడున్న వ్రాయసపు తీరుతెన్నులు ఆదాము పూర్వతరము లెఱిగియుండనివి. మానవులు వ్రాయసకళ నసలే యెఱిగి యుండని, ఇప్పుడు వీ రుపయోగించు విధానమునకు పూర్తి విభిన్నమైన దానిని వా రనుసరించినకాలము సైతమెుండు కలదు. తత్సంబంధిత సముచిత వ్యాఖ్యకు, సుదీర్ఘవివరణ మావశ్యకము.

ఆదాము కాలమునుండి తలయెత్తిన విభేదములను పరిశీలింపుము. యథార్థమునకు ప్రపంచ మానవులు, ఈనాడు మాటలాడుచున్న విస్తృత ప్రాచుర్యతాయుతములగు బహుభాషలును - వీరియం దిప్పుడు ప్రబలముగ నున్న పలువిధ ఆచారవ్యవహారములవలెనే - ఆనాటి వా రెఱుగనివి. ఇప్పు డెఱుకవడి యున్న వానికి భిన్నమైన భాష నొకదానిని అప్పటి ప్రజలు మాట్లాడుచుండెడు వారు. అనంతర కాలమున, వివిధభాషలును బేబెల్‌గ వ్యవహృత మగుచుండిన ప్రాంతమునం దావిర్భవించినవి. బేబెలు యను పదము “భాషా సందిగ్ధత తల యెత్తిన ప్రదేశ,” సూచకమగుటచే, తత్ప్రాంతము నాపేరిట వ్యవహరింపనైనది.

అటుపై, యునికిలోనికి వచ్చిన భాషలయందున, సిరియా ప్రాముఖ్యత నొందినది. ప్రాచీనకాల పవిత్రలేఖనము లాభాషయందున యావిష్కృతములైనవి. తదుపరి, భగవన్మిత్రుడగు అబ్రహా మవతరించి దివ్యావిష్కరణ ప్రభను ప్రపంచముమీదికి ప్రసరింపచేసినాడు. ఆయన జోర్డానును దాటునపుడు మాటలాడిన భాష హీబ్రూ—అనగా “నిస్తరణభాష”-గా ప్రసిద్ధినొందగా, భగవద్గ్రంథములును, పవిత్రలేఖనములును, బహుకాలపర్యంత మా భాషయందుననే, అరబ్బీ దివ్యావిష్కరణభాష యగునంత దనుక, ఆవిష్కృతములగుచూ వచ్చినవి. . . .

కావున, ఆదాము కాలమునుండియు భాషా, భాషణ, లేఖనముల యందున చోటుచేసుకొనుచు వచ్చిన విస్తృతపరిణామము లెంత లెక్కకు మిక్కిలిగ నున్నవో గమనింపుము. ఆయనకు పూర్వ పరిణామములు, ఇంకెంతటి బృహత్తరములై యుండనోపు!

ఈ వాక్కులను వెల్లడించుటయందున మా యుద్దేశ్యము: తన సకల సమున్నత దివ్యస్థాన పరముగ స్వీయప్రశస్తికిని, భావనకును దక్క శేషించిన సమస్తము యొక్క భావనాప్రశస్తులకన్నను - అనాదిగను, ఎన్నటికిని నిజైకదైవము మహోన్నతుడని నిరూపించుటయే. ఆయన సృజన శాశ్వతమై యున్నది; ఆయన దివ్యయశోప్రత్యక్షీకరణులును, నిత్యపవిత్రతాదివ్యప్రభాతములును, స్మృత్యతీత కాలమునుండియును భువికంపబడి, నిజైకదైవము దెసకు మానవాళి నామంత్రించుట కాజ్ఞాపితులైనారు. వారియందలి కొందరి నామధేయములు విస్మృతములై, వారి జీవితసంబంధిత యభిలేఖ్యము లంతరించుటను, ఆనాటి ప్రపంచము నావరించుకొనిన సంక్షోభ విపరిణామములకే యారోపింపవలె.

భువియందలి సమస్తమును, చారిత్రకాభిలేఖ్యములను, తదితరములను విధ్వంస మొనరించిన జలప్రయ మెుకదాని ప్రస్తావనము కొన్ని గ్రంథములయం దున్నది. అంతియేగాక, వైపరీత్యము లింకెన్నియో వాటిల్లి, పలు సంఘటనముల యానవాళ్లను తుడిచిపెట్టినవి. అటులే, లభ్యమగుచున్న చారిత్రకపత్రములలో భేదము లగపడుచున్నవి, ప్రపంచ ప్రజానీకములయం దొక్కొక్క దానికిని తనదగు భౌగోళిక, వయో, చారిత్రక వివరణమున్నది. తమ చారిత్ర మెనిమిదివేల వత్సరములకు పూర్వపుదని కొంద రనుచుండ, తమది ద్వాదశ సహస్రాబ్దుల నాటిదని మరికొందరు నిర్ణయింతురు. వివిధగ్రంథము లొసగిన వివరణము లొకదానితో నొకటి యెంతగా విభేదించునో, జూక్‌ గ్రంథమును పఠియించిన యెవ్వనికేని - సుస్పష్టము, సువిదితము.

భగవంతుని సంప్రీతు నొనరింపుము; నీ దృక్కులను మహోత్కృష్టదివ్యావిష్కరణము దెసకు సారించి, ఈ వివాదాస్పద గాథలను, సాంప్రదాయములను సంపూర్ణముగ నుపేక్షింతువు.

LXXXVIII

మీరు యీ సత్యమును గుఱుతించినవారేని, మానవులయందున సాక్షాత్తూ భగవంతుని దివ్యావతారమగు ఆయన విధియించిన శాసనముల యందున న్యాయసత్త్వమును, తన్మూలమును నిక్షిప్తములై యున్నవని నిశ్చయముగా తెలిసికొందురు. నిక్కముగా ఆయన, సమస్తసృష్టికిని మహోన్నత, దోషరహిత న్యాయధ్వజపతాకము నవతరింపచేయును. ఆయన శాసనము సమస్త భూస్వర్గవాసుల డెందములకును భీతిని గొల్పునంతటిదైనచో, ఆ శాసనము న్యాయప్రత్యక్షీకరణమే దక్క వేరొండు కాదు. మీరు గ్రహియించువారలేని, ఈ శాసనావిష్కరణము మానవహృదయముల యందున రేకెత్తించు భయాందోళనములను, నిక్కముగ, స్వమాతృక్షీరమును గ్రోలుటనుండి ప్రతిరోధితుడైన పసిపాపడి రోదనములతో పోల్పనగును. తమకు భగవంతుని దివ్యావిష్కరణ ప్రేరణోద్దేశ్య మెఱుకవడి యుండినచో మానవులు నిశ్చయముగ, తమ భయములను వీడి, కృతజ్ఞతాన్వితహృదయులై, హర్షాతిరేక పరవశు లగుదురు.

LXXXIX

భగవంతుని—సమున్నతమాయన వైభవము—దివ్యవచనము శాశ్వతముగ విలసిల్లునని నీవు దృఢముగ విశ్వసింపుచున్నయటులే, తద్భావము సైత మెన్నటికైనను నిర్వీర్యాశక్యమేయని మొక్కవోని విశ్వాసముతో నీవు నమ్మవలె నని యెఱుగుము. అయినను, నియుక్తవ్యాఖ్యాతలూ, తద్రహస్య భద్రమంజూషా హృదయులూ మాత్రము తద్బహుముఖీన విజ్ఞత నవగత మెునరించుకొనగలరు. పవిత్రలేఖనములను పఠియించునపుడు వాటినుండి మానవులయం దావిర్భూతుడైన భగవత్ప్రతినిధి యధికారము నెదిరించుట కనువైన దేనినైనను యెంచుకొన నుత్సహించు నాతడు తన సామీప్యులతో సహపయన మెునరింపుచు, భాషింపుచు, వారితో అన్నపానాదులను పంచుకొనుచుండిన యట్లగుపింపు చున్నను, నిక్కముగ మృతప్రాయుడే.

అహో, ప్రపంచము నన్ను విశ్వసింపగల్గునే! బహా మానస నిక్షిప్తాంశముల నన్నింటినీ, సకలనామాధీశుడును, ఆయన దైవమును నగుప్రభు డుద్బోధించిన దానిని మానవాళికి బహిర్గత మెునరింపవలసి వచ్చెనేని, అవనిపైనున్న ప్రతి మనుజుడును నిశ్చేష్టత నొందును.

శబ్దవస్త్ర మెన్నటికిని పొందియుండజాలని, ఈ యథార్థముల హేరాళమెంతటి మహత్తరమని! ఏ యభివ్యక్తీకరణమునకైనను సముచితముగ వర్ణించుట కశక్యమైనవియును, స్వీయప్రాథమ్య మెన్నటికిని యప్రకటితముగనే యుండునవియును, ఛాయామాత్రముగనైనను సూచితములు కానివియును నగు జీవితసత్యముల సంఖ్య యెంతటి విస్తృతమని! నిర్ణీతసమయ మరుదెంచునంత దనుక, అనుద్ఘోషితములుగనే యుండితీరవలసిన నిజము లెన్నియని! మున్ను వక్కాణితమైన యటుల: “మానవు డెఱుగు ప్రతిదియూ, అభివ్యక్తము కాజాలదు; ఆత డభివ్యక్తము గావింపగల ప్రతిదియూ కాలానుగుణ్య మని మన్నింపనూ తగదు; కాలానుగుణ్యమగు ప్రతి ప్రసంగమూ శ్రోతల సామర్ధ్యమున కనువైనదేనిని గణియింపనూ తగదు.”

ఈ నిజములయందలి కొన్ని, మా జ్ఞానప్రభాసభాండారముల, మా నిగూఢానుగ్రహస్వీకర్తల శక్యతమేరకు మాత్రమే అభివ్యక్తీకృతములు కాగలవు. నిన్ను తన సత్త్వమున శక్తుని గావించి—“సకల జ్ఞానలక్ష్యమగు ఆయన నిదివరకే కనుగొని గుఱుతించిన తఱి, జ్ఞానార్జనమునకై శ్రమియించుట యే మనుజున కైనను యెట్టి లబ్ధిని జేకూర్చును?” కనుక—మనుష్యజ్ఞానసమస్త విముక్తుడవగుటకై, సకలవిజ్ఞానమూలమగు తనను గుఱుతించునటు లొనరింపుమని భగవంతుని మే మర్ధింతుము. మనుష్యజ్ఞానకోవిదులమని ప్రతిపాదించుకొను నట్టి, తమ ప్రతిపాదనమును యే విస్పష్టాధారమేని, ఏ యుపదేశగ్రంథ ప్రమాణమేని సమర్ధింపజాలని యట్టి వారలనుండి విముక్తుడవు కావచ్చును గనుక, జ్ఞానాద్యునకును, తత్ప్రస్రవణమగు ఆయనకును విధేయుడపు కమ్ము.

XC

భగవంతుని యావిష్కృతికి విస్పష్టనిదర్శన సంకేతములు ప్రత్యణువునను అంతర్లీనములై యుండుటంజేసి, స్వర్గములయందలి దేదియైనను, భువిలోని దెద్దియైనను, తనయందలి ఆ మహోత్కృష్టజ్యోతి నామ, లక్షణముల యావిష్కృతికి ప్రత్యక్షనిదర్శనమే. తదావిష్కరణ బలమున దక్క, ఏ ప్రాణియేని, ఎన్నటికేని మనగలిగియుండెడిది కాదని యెంతును. అణువున శోభిల్లు జ్ఞానతేజము లెంతటి దీప్తిమంతములని, జలబిందువునం దెగయు విజ్ఞానసాగరము లెంతటి విస్తృతములని! సమస్త సృజితములయందునను తానే యట్టి పురస్కృతాంబరముతో ననుగ్రహీతుడై, అట్టి విలక్షణవైభవమునకు ప్రత్యేకితుడైన మానవుని పరముగ సర్వోత్కృష్ట యథార్థమిది. ఏలయన, ఏ యన్యప్రాణికేని యధిగ మించుటకైనను, అతిశయించుటకైనను అశక్యమైన స్థాయిలో, సమస్త దైవలక్షణములును, నామధేయములును సంభావ్యపూర్వకముగ నాతడియం దభివ్యక్తములైనవి. ఆతడికి యీ సమస్త లక్షణ, నామధేయము లనువర్తించును. ఆయనయే యనినటుల: “మానవుడు నా మర్మము, నే నాతడి మర్మమును.” ఈ సూక్ష్మ, సమున్నతాంశమున కభివ్యక్తీకరణముగ సమస్త దివ్యగ్రంథముల యందునను, పవిత్రలేఖనముల యందునను పునఃపునఃవ్యక్తీకృతములైన ప్రవచనము లసంఖ్యాకములు. “ప్రపంచము నను, వారియందునను గల మా చిహ్నములను వారల కనివార్యముగ ప్రదర్శింతు,” మని ఆయన ప్రకటించినాడు. వేరొకమా రాయన: “మరి, ఇక మీయందున సైతము భగవచ్ఛిహ్నముల నవలోకింపరా?” యని ప్రశ్నించినాడు. అయినను: “తనను విస్మరించిన హేతువున, భగవంతు డాత్మవిస్మృతులను గావించినవారివలె కావల,” దని మరల యుద్ఘోషింపుచున్నా డాయన. తత్సంబంధమై, “తనను తానెఱిగిన వాడు, భగవంతు నెఱిగిన వా,” డని నిత్యత్వ రాజన్యుడు—సమస్త గుప్తపటవేశ్మ వాసుల యాత్మ లాయన కర్పితములగు గాక—వచియించినాడు.

. . . పూర్వప్రస్తావితమును బట్టి, సమస్తవస్తువులును తమ యంతర్గత యథార్థత పరముగ భగవన్నామధేయముల, లక్షణముల యభివ్యక్తీకరణమును ధృవీకరించునని ప్రస్ఫుటమగుచున్నది. ప్రతిదియును, తన సామర్ధ్యము మేరకు భగవత్‌ జ్ఞానసూచకమే, జ్ఞానాభివ్యక్తీకరణమే. ఎంతటి శక్తి సమన్విత మెంతటి విశ్వవ్యాపిత మీ యావిష్కృతి యనిన, దృశ్యాదృశ్య వస్తుసమస్తావృతమిది. “నీవు దక్క యింకేది, నీవొందియుండని ఏ యావిష్కరణశక్తి - నిన్నావిర్భూతు నొనరించి యుండగలదు? నిను గానని నేత్ర మంధనేత్ర,” మనినా డాయన. అటులే, నిత్యత్వరాజన్యుడును పల్కినాడు: “తనయందునను, తన ముందునను, తన వెనుకను భగవంతుడు దక్క అన్యు డగుపింపని యెద్దానినీ, నే నవలోకింప లే,” దని. “వీక్షింపుము, నిత్యత్వోదయము నుండి కాంతిపుంజ మెుక్కటి వెలువడి, చూడు మదిగో, సమస్త మానవుల యంతఃసత్యములోనికి దాని తరంగములు చొచ్చుకు పోయిన,” వని కుమేయల్‌ సాంప్రదాయముననూ లిఖియింపనైనది. ఈ యావిష్కరణోధృతియందు వాటి నన్నింటినీ - సృజితవస్తు సమస్తమున సమున్నతుడును, శ్రేష్ఠతముడును నగు మానవు డధిగమించును, తద్వైభవపు సంపూర్ణతరాభివ్యక్తీకరణము జరుగును. సమస్తమానవుల యందునను సాధకశ్రేష్ఠులు, సర్వవిశిష్టులు, సర్వోత్కృష్టులు - సత్యసూర్యుని దివ్యావతారములే. ఇక, ఈ దివ్యావతారములు దక్క అన్యులెల్లరును, వారి దివ్యేచ్ఛావిన్యాసమున జీవించి, వారి కారుణ్యఝరుల యందున చరించి, తమ యస్తిత్వము నొందెదరు.

XCI

ప్రతి యుగమునను, దివ్యపాలనాకాలమునను అదృశ్యతత్త్వ మాయన దివ్యావతార స్వరూపమున యవతరించినయపుడు, సమస్తభవబంధ సంశయాళవులును, విముక్తులును నగు కొందరు ప్రవక్తృత్వసూర్యునినుండియు, దివ్యమార్గదర్శకచంద్రునినుండియు జ్ఞానము నపేక్షించి, దివ్యసాన్నిధ్యము నొందుదు రనునది, ఈ యావిష్కరణ సత్యము ప్రదర్శించు నిదర్శనములయం దున్నది. తత్కారణమున, ఆనాటి మతగురువులును, ఐశ్వర్యవంతులును వారిని నిరసించి యపహసించెడువారు. అపరాధులైనవారలను గురించి, ఆయనయే వెల్లడించిన యటుల: “విశ్వసింపని, ఆయన జనాధినేత లపుడు, ‘మాకు నీయందున మావంటి మనుష్యుడే కానవచ్చుచున్నాడు; మాయందలి, చెచ్చెర నిర్ణాయకులై ని న్ననుసరించిన అల్పులు దక్క వేరెవ్వరును మా కగుపింపనూలేదు, మమ్ము మించిన యే ఔన్నత్యమూ నీయందున మాకు గోచరింపనూ లేదు; నిశ్చయముగ, ని న్నబద్ధీకునిగ నెంచుచుంటి,’ మనినారు.” వారు ఆ పవిత్రదివ్యావతారముల నధిక్షేపించి, ఇంకను, “మాలోని యధములును, ఉపేక్షితులును దక్క యెవ్వడును ని న్ననుసరింపలే,” దనుచు, నిరసించినారు. విద్వాంసులేమి, విత్తవంతు లేమి, విఖ్యాతులేమి—తమయందలి వారెవ్వరూ, వారిని విశ్వసింపలేదని నిరూపించుటయే వారి యుద్దేశ్యము. యథార్థమును దక్క , అన్యమును పలుక నొల్లని ఆయన కాపట్యమును వారు దీనితోడను, ఇట్టివియే యగు దృష్టాంతముల తోడను నిర్థారింప నుంకించినారు.

అయినను యీ మహోజ్జ్వల దివ్యపాలనమున, ఈ మహాశక్తిసమన్విత సార్వభౌమత్వమున యెందరో చైతన్యభాసిత మతాధిపతులును, పూర్ణవిజ్ఞానవిదులును, పరిణితవిజ్ఞులును ఆయన యాస్థాన ప్రవేశము నొంది, ఆయన పావన సాన్నిధ్యచషకము నాస్వాదించి, ఆయన మహోత్కృష్టమాన్యతకు పాత్రులైనారు. పరమప్రియునికై ప్రపంచమును, తత్సర్వమును వారు త్యజియించినారు. . . .

వా రెల్లరును దివ్యావిష్కరణ భానుతేజపథనిర్దేశితులై యపరాధము నొప్పుకొని, ఆయన సత్యము నంగీకరించినారు. వారి విశ్వాస మెట్టిదనిన, వారియం దనేకులు తమ సంపదను, సంబంధీకులను వర్జించి సకలవైభవాన్వితుని సంప్రీతికి కట్టువడినారు. తమ పరమప్రియునికై స్వీయప్రాణముల నర్పించి, ఆయన పథమున తమ సర్వస్వము నర్పించినారు. వారి వక్షములు వైరి శరములకు లక్ష్యములైనవి; వారి శిరములు అవిశ్వాసుల భల్లముల నలంకరించినవి. ఆ త్యాగధనుల రక్తము నాస్వాదింపని స్థలమును లేదు, వారి కుత్తుకలను చిదుమని ఖడ్గమును లేదు. వారి వాక్సత్యమునకు వారి కృత్యములే సాక్ష్యము నిచ్చును. తమ యాత్మత్యాగవిధికి లోకమెల్లయు నచ్చెరు వొందునటుల స్వీయప్రాణములను తమ పరమ ప్రియుని కర్పణమెునరించుటకు అంతటి మహదానందమున యుద్యుక్తులైన తత్పుణ్యాత్ముల దృష్టాంత మీనాటి ప్రజలకు చాలదా? స్వల్పవిషయమునకై విశ్వాసఘాతుక మెునరించిన, అనిత్యమునకై నిత్యత్వమును వినిమయ మెునరించిన, ఉప్పునీటి యూటలకై భగవత్సాన్నిధ్య కవ్థార్‌ను వర్జించిన, పరద్రవ్యాపహరణ మెుక్కటియే తమ జీవితలక్ష్యమైన వారల విశ్వాసహైన్యత కిది సరియగు సాక్ష్యము కాదా? స్వీయప్రాపంచి కాడంబరమగ్నులై ప్రభుడును, పరమోన్నతుడును నగు ఆయనకు వారెల్లరును యెట్లు దూరులైతిరో మీరును వీక్షింతురు.

న్యాయస్థులై మెలగుడు: మాటలు చేతలతో నేకీభవించెడు, బాహ్యప్రవర్తన మంతర్గత జీవితమున కనుగుణముగ నుండెడువారల ప్రమాణ మామోద యోగ్యమా, సమాదరణీయమా? వారి కృత్యములతో మానసము దిగ్ర్భాంతయైనది; వారి ధైర్యమునకును, దైహికసహిష్ణుతకును - ఆత్మ విస్మిత యగుచున్నది. స్వార్ధవాంఛాప్రస్తావన దక్క , వేరొండు ప్రసక్తి లేక తమ వ్యర్థోహాపంజర బంధితులై పడియున్న యీ విశ్వాసహీనుల ప్రమాణ మామోదయోగ్యమా? చీకటియందున్న బుుషిపక్షులవలె, నశ్వర ప్రాపంచి కాంశముల ననుసరించుటకు గాక, స్వీయపర్యంకమునుండి వారు తమ శీర్షముల నెత్తరు; తుచ్ఛములైన తమ జీవితలక్ష్యముల సాకారమునకై శ్రమియించునపుడు దక్క , రేయిన విశ్రామము నొందరు. తాము స్వార్ధప్రణాళికా నిమగ్నులగుటం జేసి, దైవనిర్ణయము నెఱుగరు. పగ లైహిక ప్రయోజనములకై వారు మనఃపూర్వకముగ శ్రమియింతురు, రాత్రియందిక స్వీయదైహికవాంఛాపరితోషణమే వారి యేకైక వ్యాసంగము. అట్టి యల్పబుద్ధుల ఖండనలను విశ్వసింపుచు, తమ ధనప్రాణములను, కీర్తిప్రతిష్ఠలను, గౌరవమర్యాదలను భగవత్సంప్రీత్యర్ధ్యమై త్యజియించిన వారి విశ్వాసము నుపేక్షించు జనులు, ఏ శాసన ప్రమాణమున సమర్ధనీయులు? . . .

సకలయశస్వి పథమున యెంతటి ప్రేమతో, ఎంతటి భక్తితో, ఎంతటి ప్రహర్షమున, అలౌకిక పారవశ్యమున వారు తమ జీవితముల నర్పించిరి! తత్సత్యమున కెల్లరును సాక్ష్యమే. ఇక యీ దివ్యావిష్కరణము నెటుల వా రపహసింపగలరు? ఏ యుగమేని యట్టి మహత్తరఘటనల నవలోకించెనా? ఈ సహచరులు నిజమైన భగవత్సాధకులు కాదేని, ఇంకెవ్వరిని నీపేరిట వ్యవహ రింపదగును? ఈ సహచరు లధికారమునో, యశమునో కాంక్షించిరా? ఎన్నడేని యైశ్వర్యముల నపేక్షించిరా? భగవత్సంప్రీతి దక్క వేరొక యీప్సితము వారల కుండెనా? ఇన్ని మహాద్భుత నిరూపణము లును, విస్మయాన్విత కృత్యములును గల యీ సహచరు లబద్ధికులైన, యిక నిబద్ధికుడనని చెప్పుకొన యోగ్యు డెవ్వడు? భగవంతునిమీద ప్రమాణ మెునరింతును! మానవులు దైవావిష్కరణ వైచిత్ర్యములను తమ మనములయందున పర్యాలోచన మొనరింతురేని, వారి చేతలే సముచితసాక్ష్యము; సమస్త భూలోకవాసుల కఖండనీయ ప్రమాణము. “తమకై నిరీక్షింపుచున్నదాని నధర్మవర్తను లిక వైళమ దెలియుదురు!” . . .

సందిగ్ధాతీతమైన స్వకీయసత్యనిష్ఠకు పవిత్రగ్రంథ ప్రస్ఫుటపాఠమే సాక్ష్యమైనయట్టి యీ అమరవీరులను, ఇంకను నీవు సైత మవలోకించినయటుల, తమ ధనప్రాణములను, తమ యాలుబిడ్డ లను, తమ సర్వస్వమును వర్జించి స్వర్లోకస్థిత సమున్నత కక్ష్యలను చేరినవారిని—ఎల్లరను స్ఫురణకు దెచ్చుకొనుము. ఈ సర్వశ్రేష్ఠసముజ్జ్వల దివ్యావిష్కరణ సత్యమునకు - యీ పరిత్యాగుల, ఈ మహోదాత్తుల తార్కాణమును తిరస్కరించి - సువర్ణమునకై స్వధర్మమును పరిత్యజించి, నేతృత్వమునకై యావత్ర్పజావళికిని ఆదినాథుం ద్రోసిపుచ్చిన యీ విశ్వాసహీనులు, ఈ శోభాజ్యోతికి విరుద్ధముగ నొనరించిన యధిక్షేపణముల ననుమోద్యములుగ నెంచుట న్యాయమా? వీరు తమ లౌకికాధికారము నందలి యావంత కాదు, అణుమాత్రమునైనను, ఎవ్విధముగను భగవంతుని పవిత్రధర్మమునకై త్యజియింపబోవరని గుఱుతించిన జనులెల్లరకును వీరి స్వభావ మిపుడు బహిర్గతమే యనగ, ఇక వీరి ధనప్రాణముల ప్రస్తావనమేల?

XCII

భగవంతుని దివ్యగ్రంథము పూర్తిగ దెఱువబడి యున్నది; ఆయన దివ్యవచనము మానవాళిని ఆయనదెస కామంత్రింపుచున్నది. అయినను, ఆయన దివ్యధర్మమునకు కట్టువడియుండుట కేని తత్ర్పచారసాధనము లగుటకేని, ఏ కొందరికోమించి యెవ్వరును యిచ్చగింపలేదు. లౌకిక మాలిన్యమును మేలిమి బంగారముగ పరివర్తిత మెునరించు దివ్యరసాయనము వీరల కనుగ్రహీతము; మానవులను వేధించు సమస్తరుగ్మతలకును దివ్యౌషధము నొసగు యధికారమును వీరల కొప్పగింప నైనది. ఇయ్యపూర్వ, పరమాద్భుత, మహనీయ దివ్యావిష్కరణ సత్యమును తా నంగీకరింపనంత దనుక యే మానవుడేని శాశ్వత జీవితము నొందజాలడు.

ఓ భగవన్మిత్రులారా! ప్రపంచముచే దూషితుడైన ఆయన వాణికి మీ వీనుల నొగ్గి, ఆయన దివ్యధర్మమునకు మాన్యతనొసంగు దానిని నిష్ఠగ బాటింపుడు. తా నిచ్చగించినవారి నెవ్వరినైనను, ఆయన తన బుుజుపథమునకు నిక్కముగ నిర్దేశించును. దుర్బలులకు సత్త్వమునొసగి, భాగ్యహీనులను భాగ్యానుగ్రహీతల నొనరించు దివ్యావిష్కరణమిది.

సంపూర్ణ స్నేహభావముతోడను, సర్వసమగ్ర సాహచర్యస్ఫూర్తితోడను కలిసికట్టుగ సమాలోచన మెునరింపుడు; మీ జీవితములయందలి యమూల్యదినములను ప్రపంచాభ్యుదయమునకును, ప్రాచీనుడును, సమస్త సార్వభౌమాధీశుడునునగు ఆయన దివ్యధర్మాభ్యుదయమునకును అంకిత మెునరింపుడు. నిశ్చయముగ, ఆయన సకలజనులకును యుక్తమగుదాని ననుగ్రహించును;వారి స్థానము నధఃకరించు దానిని నిషేధించును.

XCIII

ప్రతి సృజితమూ భగవదావిష్కరణ సంకేతమేయని యెఱుగుము. ప్రతిదియూ, తన సామర్ధ్యానుగుణముగ సర్వశక్తిమంతునికి ప్రతీకయై, నిత్యత్వము నొందును. సకలజనమహాపాలకుడు నామధేయముల, లక్షణముల రాజ్యమున దన సార్వభౌమత్వము నభివ్యక్తము చేయనెంచినందున, దివ్యేచ్ఛాప్రదర్శనముతో ప్రతి సృజితాంశమునూ, ఆయన యశోచిహ్నము గావింపనైనది. ఎంతటి సర్వావృత మెంతటి సార్వత్రిక మీయావిష్కరణమనిన, యావద్విశ్వమునను ఆయన శోభను ప్రతిఫలింపని దేదియూ గోచరింపదు. అట్టి పరిస్థితుల యందున సామీప్యతాదూరస్థతా సంబంధిత భావన ప్రతిదియూ భగ్నీకృత మగును. . . . దైవశక్తిహస్త మీమహోన్నత పురస్కృతిని సమస్తసృజితముల నుండియు ఉపసంహరించియుండిన, విశ్వమెల్లయు నిర్జనమై, శూన్యత నొందియుండును.

సకల సృజితములకన్నను, నీ దైవమగు ప్రభు డెంతటి మహోన్నతుడో వీక్షింపుము! అవలోకింపు మాయన సార్వభౌమత్వ, పరమాధికార మహత్త్వముల యౌన్నత్యమును. ఆయన—ప్రవర్థిత మాయన యశస్సు—సృజియించి, తన నామములకును, లక్షణములకును వ్యక్తీకరణలుగ నిర్దేశించినయట్టివి, తమ కనుగ్రహీతమైన కారుణ్యస్వభావ హేతువున సామీప్యతాదూరస్థత లన్నింటి కన్నను మహోదాత్తములై నిలచిన పక్షమున, యిక వాటి కస్తిత్వము ననుగ్రహించిన దివ్యతత్త్వ మింకెంతటి మహోన్నతమై యుండవలె?

“నాకన్ననూ నా పరమప్రియుడు నాకు చేరువయైనచో, అచ్చెరువొందకు; అట్టి సామీప్యత యున్ననూ, నే నింకను ఆయనకు దూరునిగనే యున్నందుల కచ్చెరువొందు,” మని కవి లిఖియించిన దానిని పర్యాలోచింపుము. . . . “మానవున కాతడి జీవనాడికన్నను మేమే సన్నిహిత,” మను భగవద్వ్యక్తీకరణమును స్ఫురణకు దెచ్చుకొనుచు, తత్సూక్తిం బ్రస్తావింపుచు: నా జీవనాడికన్నను నా పరమప్రియుడు నాకు సన్నిహిత మగునంతగా, ఆయన యావిష్కరణము నా యస్తిత్వము నావరించి నను, ఆ యధివాస్తవికతను దృఢముగా నేను విశ్వసించినను, నా స్థాయిని గుఱుతెఱిగినను; ఇంకను, ఇంతవరకును, ఆయనకు దూరముగ తొలగద్రోయబడియేయుంటి ననినాడు కవి. అట్లనుట యందున సకలకరుణాన్వితుని యాసనమును, ఆయన యావిష్కరణ ప్రభాసమున కధివాసమును నగు తన హృదయము తన స్రష్టను విస్మరించినదనియు, ఆయన పథమును తప్పినదనియు, ఆయన యశస్సుకు ప్రతిరోధితమై, ఐహికవాంఛా కళంక కలుషితయైనదనియు నాతడి భావము.

ఇందుకు సంబంధించి, సామీప్యతాదూరస్థతలకు సాక్షాత్తూ నిజైకదైవము మాత్రమే అతీతుడనియు, మహోన్నతుడనియు స్మృతియం దుంచుకొనవలె. అట్టి పరిధుల కతీత మాయన యధివాస్తవికత. తన ప్రాణులతో ఆయన యను బంధ మేస్థాయినీ యెఱుగదు. ఆయనకు కొన్ని సామీప్యములనియు, మరికొన్ని కావనియు ననుటను, ఆయా అభివ్యక్తులకే యారోపింపదగు.

హృదయమనిన, సకలకరుణాన్వితుడగు భగవంతుని దివ్యావిష్కరణము కేంద్రీకృతమైన యాసనమని, మా పూర్వావిష్కృత పవిత్రభాషణా ధృవీకృతము. “భువియందునను, దివియందునను నేనుండను, నన్ను విశ్వసించి, నా దివ్యధర్మమునకు విధేయుడగువాని మానసమునం దధివసింతు,” నను సూక్తి, తద్భాషణాస్థితము. దైవజ్ఞానగ్రహీతయును, సకలకరుణాన్వితుని యావిష్కరణా పీఠమును నగు మానవహృదయము, తత్‌జ్ఞానభాండమును, తదావిష్కరణ మూలమునునైన ఆయన పథమున కెన్నిమారు లెంతగ దూరమైనది! భగవంతుని నుండి మానవహృదయమును తొలగద్రోచి దూరస్థత పాల్జేయునది, దాని మౌఢ్యమే. అయిననూ, ఆయన దివ్యసాన్నిధ్యము నెఱిగిన మానసము లాయనకు సన్నిహితములే; ఆయన యాసనసామీప్యములుగనే అవి పరిగణనము నొందవలె.

ఇంకను, తన సర్వావృతజ్ఞానము కొలది, భగవంతు డొకవంకన తన ప్రాణి నెఱిగియుండియు, మానవునిపై తన విస్పష్ట వైభవప్రభను ప్రసరింపుచునే యుండ, అవలోకింపు మింకొక దెసన మానవుడు తన స్వీయతపరముగ నెంత తఱచుగ విస్మృతి నొందుచుండునో. కావున, అట్టి పరిస్థితులయం దాయన, ఆతడి కాతని స్వకీయతకన్నను చేరువై యుండెననునది విస్పష్టము. యథార్థమున కెన్నటికిని, ఆయన యటులే యుండును; ఏలయన, నశ్వర మానవుడు దోషాసక్తుడై, తనయం దంతర్లీనములైయున్న వైచిత్ర్యముల నెఱుగకపోవుచుండ, నిజైకదైవము సమస్తాంశముల నరయుచు, సమస్తాంశములం దెలియుచు, సమస్తాంశముల నవగత మెునరించుకొనుచుండును. . . .

సమస్తసృజితములును దైవావిష్కరణచిహ్నములేయను మా వక్కాణమున కర్థము - సజ్జనులేని, దుర్జనులేని, ఆస్తికులేని, నాస్తికులేని—జనులెల్లరును—భగవంతుని దృష్టియందున సమానులేయని యెవ్వడును భావింపకుండునటుల భగవంతుడు నిరోధించు గాక. దివ్యాస్తిత్వము—ప్రవర్ధిత మాయన నామము, సమున్నత మాయన వైభవము—మనుష్యతుల్యమనియు, తన జీవులతో సహ వసించు ననియు నెట్టి పరిస్థితుల యందునను సూచితము కాదు. తమ వ్యర్ధభ్రమల స్వర్గముల నధిరోహించి, సృజితము లన్నియును దైవచిహ్నములనియు, అందుచే, వాటి మధ్యన యే వైరుధ్యమును లే దను యర్ధమున యేకేశ్వరత్వమును వ్యాఖ్యానించిన యవివేకులు కొంద రీయపరాధము గావించినారు; ఈ చిహ్నములు సాక్షాత్తూ భగవత్సదృశములనియు, సరిజోడులనియు సమర్ధించి కొంద రింకను ముందున కేగినారు. దయాన్విత దైవమా! నిక్కముగా, ఆయన యవిభాజ్యుడు, ఏకైకుడు; తన తత్త్వమునను యేకైకుడే, తన లక్షణములపరముగను యేకైకుడే. ఆయన దక్క ప్రతిదియూ - కేవల మాయన నామధేయములయం దొక్కదాని శోభాన్విత యభివ్యక్తీకరణమున కభిముఖముగ కొనితేబడినయపుడు ఆయన వైభవమునకు, అల్పతమానుకరణమే దక్క అన్యము కాదనిన, ఇక సాక్షాత్తూ ఆయనకే యెదురు వడినయపు డది, ఇంకెంతటి యల్పత నొందునో!

సకలకరుణాన్వితుడనగు నా దివ్యనామధార్మికత్వముపై యాన! ఈ వచనముల యావిష్కృతితో పరమోన్నతుని దివ్యలేఖిని మహాకంపనప్రకంపితయై, విషాదసంచలిత యగుచున్నది. పరమాత్ముని యనంత నిత్యసముద్ర తరంగములతోడను, అలలతోడను పోల్చినయపుడు, అనిత్యమగు జలబిందు వెంత సూక్ష్మము, అప్రధానము; నిత్యుని యసృజితానిర్వచనీయ వైభవమున కభిముఖితయైన యపుడు, అనిశ్చితమును, నశ్వరమును నగు ప్రతిదియు నెంత హీనమై యగుపింపవలె! అట్టి నమ్మకముల నాదరించు వారలకును, అట్టి వాక్కుల నుచ్చరించు వారలకును, సకలశక్తిసమన్వితుడగు భగవంతుని క్షమాభిక్షను మే మర్ధింతుము. వచించు: ఓ జనులారా! క్షణికవాంఛకు స్వయమాధారునితో సామ్య మేమి, సృష్టికర్త దివ్యలేఖినీలేఖనము దక్క వేరొండుకాని ప్రాణులకు ఆయనతో సాపత్యమేమి? వాస్తవమున కాయన లేఖనము - సమస్త విషయమహనీయము, సర్వజీవపవిత్రము, అప్రమేయోత్కృష్టము.

ఇక, దైవావిష్కరణ చిహ్నములయం దొండొరులకు గల యనుబంధము నవలోకింపుము. కేవలము, ఈ చిహ్నములయం దొకటగు సూర్యుని, స్థాయీపరముగ తిమిరసదృశుడని గణియింప వచ్చునా? నిజైకదైవము నాకు సాక్ష్యమును వహియించును! సంకుచితమనస్కుడైననో, వంచిత నయనులయందలి వాడైననో దక్క, మానవుడెవ్వడును దానిని విశ్వసింపడు. వచించు: మిమ్ముల జూచుకొనుడు. మీ నఖములును, మీ నేత్రములును మీ శరీరభాగములే. వాని స్థాయీవిశిష్టతలు సరిసమానములేయని యెంతురా? అవునని మీ రందురేని; ఇక వచియింపుడు: మీ రొకనిం దృణీకరించి, ఇంకొకని మీ ప్రాణసమునిగ మన్నన సేయునటుల, సకలకరుణాన్వితుడగు నా ప్రభునకు, నా దైవమునకు, నిక్కముగ, వంచకత్వము నారోపించినారు.

ఒకరి వైయక్తికస్థాయీ, స్థానసంబంధిత పరిమితుల నతిక్రమించుట యెవ్విధముగనూ, అనుమోదనీయము కాదు. ప్రతి స్థాయీ, స్థానసంబంధిత సమగ్రతయూ పరిరక్షితము కావలె. తదర్ధము: ప్రతి సృజితమూ, అది యెుందవలెనని నిర్దేశితమైన స్థాననేపధ్యముననే పరిగణనము నొందవలెనని.

అయినను, సర్వవ్యాపినగు నా దివ్యనామధేయప్రభ, తత్కాంతిని విశ్వముపై ప్రసరించినయపుడు, ప్రతి సృజితమును ఒక నిర్ణీతస్థాయిప్రకార మెుక విశేషప్రభావప్రదర్శనా సామర్ధ్యముతో ననుగ్రహీతయైన దనియు, ఒక విశిష్ట లక్షణ ప్రసాదితయైనదనియు మదియం దుంచుకొనవలె. విషప్రభావము నవలోకిం పుము, ప్రాణాంతకమేయైనను కొన్ని పరిస్థితులయందది యుపయుక్త ప్రభావ ప్రదర్శనాశక్తి నొంది యుండును. సమస్త సృజితములలోనికిని ప్రవేశితమైన శక్తి యీ మహాశుభనామావిష్కరణ ఫలితమే. సకలనామ, లక్షణస్రష్టయైన ఆయన ప్రకీర్తితుడు! క్రుళ్లి, కృశియించిన తరువు నగ్నిన బడవైచి, హరితరమ్యవృక్షచ్ఛాయను జేరి, తత్ఫలము నాస్వాదింపుడు.

భగవంతుని దివ్యావతారముల కాలములలో జీవింపుచుండిన జనులు, చాలవరకు, అట్టి యనుచిత వ్యాఖ్యల నొనరించినారు. సందర్భానుసార మవి యావిష్కృత దివ్యగ్రంథముల యందునను, పవిత్రలేఖనముల యందునను లిఖితములైనవి.

నిజమునకు భగవదేకత్వవిశ్వాసి యనగ, శాశ్వతసత్యమగు ఆయన యావిష్కరణ లక్షణమును ప్రతి సృజితమునను దర్శించువాడు దక్క, సృష్టికర్త నుండి సృజిత మవిభాజ్యమని సమర్ధించుకొనువాడు కాదు.

విద్యావేత్తయగు భగవంతుని దివ్యనామశోభావిష్కరణమును పరిశీలింపుము. అట్టి యావిష్కరణ నిదర్శనములు సమస్తవస్తువులయం దెవ్విధముగ వ్యక్తీకృతములైనవో, దానిపై సకలజీవాభ్యుదయ మెటుల యాధారితమై యున్నదో పరికింపుము. ఈ విద్య యిరు తెఱగులు. ఒకటి సార్వత్రికము. తత్ర్పభావము సమస్తవస్తువుల నావరించి సంరక్షించును. భగవంతుడు “సకలలోకాధీశ,” బిరుదమును వహియించినది యీ హేతువుననే. వేరొకటి, ఈ దివ్యనామచ్ఛాయ కఱుదెంచి, ఈ మహాశక్తి సమన్వితావిష్కరణాశ్రయము నాశించినవారికి పరిమితము. అయినను, తదాశ్రయాన్వేషణమున వైఫల్యత నొందినవారలు యీ భాగ్యమును తాముగ కోలుపోయి, ఈ మహాఘననామ దివ్యానుగ్రహ ప్రసాదితయై యంపవడిన ఆధ్యాత్మికాహార లబ్ధినొందుట కశక్తులైనారు. ఎంతటి బృహత్తర మెుండొంటికిని మధ్యగ యేర్పడిన యగాధము? ముసువు దీయవడి, పరిపూర్ణముగ భగవంతు నాశ్రయించి, ఆయనయెడ ప్రేమకొలది ప్రపంచమును పరిత్యజించిన వారి సంపూర్ణస్థాయీ వైభవము ప్రత్యక్షీకృతమైనచో, సృష్టి యెల్లయూ నిశ్చేష్టయగును. మునుపే వాక్రుచ్చినయటుల, భగవంతుని యేకత్వమున నిజముగ విశ్వాసమున్నవాడు యీ దివ్యనామద్వయావిష్కరణమునకు తార్కాణములను విశ్వాసియందునను, అవిశ్వాసియందునను గుఱుతించును. ఈ యావిష్కరణ ముపసంహృతమైనచో నంతయూ నశియించును.

అవ్విధముగనే, అసదృశుడగు భగవంతుని దివ్యనామధేయశోభావిష్కరణమును పరిశీలింపుము. వీక్షింపు మీశోభ సకలసృష్టిని యెటు లావరించినదో, ప్రతిదియును - ఆయన యేకత్వచిహ్నము నెట్లభివ్యక్తము సేయుచున్నదో, నిత్యసత్యమగు ఆయన యథార్ధత కెటుల సాక్ష్యము నిచ్చుచున్నదో, ఆయన సార్వభౌమత్వమును, ఆయన యేకత్వమును, ఆయన శక్తిని యెట్లు ప్రకటింపుచున్నదో. ఈ యావిష్కరణ మాయన సమస్తసృజితావృత కారుణ్యమునకు చిహ్నము. అయినను, ఆయనకు సమానుల మని చెప్పుకొనినవారు, అట్టి యావిష్కరణము నెఱుగక, ఆయనకు తమను సామీప్యుల నొనరించునట్టి, ఆయనతో తమ నైక్యము గావించునట్టి దివ్యధర్మముం గోలుపోయినారు. విలోకింపుము - భువియందలి భిన్నప్రజయును, జాతులును, ఆయన యద్వైతమున కెట్లు సాక్ష్యమును వహియించి ఆయన యేకత్వమును గుఱుతింపుచున్నవో. తమలోని భగవదేకత్వ సంకేతహేతువున దక్క, వారెన్నటికిని, “భగవంతుడు గాక వేరొండు దైవము లే,”డను వాక్కుల సత్యము నంగీకరించి యుండెడివారు కారు. ఇంకను, వారెంతటి ఘోరాపరాధ మెునరించి, ఆయన పథమునకు దూరముగ వైదొలగి పోయిరో పరికింపుము. సర్వోన్నతావిష్కర్తను గుఱుతించుటయందున వైఫల్యము నొందుటచే, భగవదేకత్వమున వారు నిజవిశ్వాసులుగ పరిగణితులగుటయూ నిలచిపోయినది.

భగవంతునితో సమానులమని ప్రకటించుకొనినవారియందలి యీ దివ్యాస్తిత్వావిష్కరణా సంబంధిత లక్షణము నొకవిధముగ, విధేయులను విజ్ఞుల నొనరించిన వైభవమునకు ప్రతిఫలనమని యెంచవచ్చును. అయినను, జ్ఞానానుగ్రహీతలైన మానవులుదక్క, అన్యులు యీ సత్యమును గ్రహియింప జాలరు. నిజముగా భగవదేకత్వమును గుఱుతించినవారలు యీ దివ్యనామధేయమునకు మౌలికాభివ్యక్తీకరణములుగ పరిగణితులు కావలె. వారే - దైవహస్తము తమ కనుగ్రహించిన చషకమునుండి దివ్యైక్యతా మధుసేవన మెునరించి, ఆయన నాశ్రయించిన వారు. ఈ పవిత్రమూర్తు లనూ, దైవదూరులనూ వేరొనరించు యంతర మెంత విస్తృతము! . . .

నీవు నిశితదృష్టితో సమస్తవస్తువులయందునను ప్రాచీనరాజన్యుడగు ఆయన యావిష్కరణ సంకేతమును సందర్శించి, సమస్తసృష్టికన్నను ఆ పరమ పావన, పునీతాస్తిత్వ మెంతటి మహోన్నతమో, పవిత్రీకృతయో గుఱుతెఱుగు నటుల భగవంతు డనుగ్రహించు గాక. యథార్థమునకు భగవంతుని యద్వైత, ఏకత్వములయెడ విశ్వాసమునకు మూలమును, మూలతత్త్వమును యిదియే. “భగవంతు డొంటిగ నుండెను; ఆయన వినా యితరుడు లేకుండెను.” ఆయన యిప్పుడూ, ఎప్పటివలెనే యున్నాడు. ఏకైకుడును, సామ్యరహితుడును, సర్వశక్తిమంతుడును, మహోన్నతుడును, మహాత్కృష్టుడును నగు ఆయన దక్క వేఱుదైవము లేడు.

XCIV

ఇరు దైవముల యస్తిత్వ సంబంధితమగు నీ ప్రస్తావనను గురించి: జాగ్రత్త, జాగ్రత్త నీ దైవమగు లోకాధీశునకు సమానుడనని భావించుకొన సంప్రేరితుడ వగుదువేమో. అనాదిగను, ఇపుడును - ఆయన యెుక్కడే, యేకైకుడే, అసమానుడే, అసదృశుడే, భూతభవితలయం దనంతుడే, సర్వసంగపరి త్యాగియే, నిత్యోపస్థితుడే, నిర్వికారుడే, స్వయంసమృద్ధుడే. ఆయన తన సామ్రాజ్యమున తనకు సహచరునిగా యెవ్వనినీ, తనకుపదేశించు సచివునిగా యెవ్వనినీ, తనతో పోల్పబడుట కెవ్వనినీ, తన యశస్సముడగుట కెవ్వనినీ - నిర్దేశింపలేదు. విశ్వస్థితమగు ప్రత్యణువును, అంతకుమించి యూర్ధ్వ సామ్రాజ్యవాసులును, మహోన్నత పీఠారూఢులును, దివ్యవైభవాసనసమక్షమున స్వీయనామము ప్రస్తావితమైన వారును, ఇందులకు సాక్ష్యమును వహియింతురు.

తాను దక్క అన్యదైవము లేడనియు, తానుగాక అన్యములన్నియూ తన యాజ్ఞాసృజితము లనియు, తన యాదేశ వినిర్మితములనియు, తన శాసనవిధేయములనియు, తన వైభవాన్విత యద్వైత నిదర్శనములతో తులనము గావించిన యపుడు విస్మృతాంశమువంటివనియు, తన యద్వైత యశోచిహ్నముల మ్రోలకు గొనిరాబడినయపుడు శూన్యసదృశములనియు - భగవంతుడు తానుగ, తనకై యుద్ఘోషించుకొనిన యీ ప్రామాణ్యమునకు నీ హృదయాంతరాళమున సాక్ష్యమును వహియింపుము.

వాస్తవమున కాయన తన దివ్యతత్త్వమున యేకైకునిగనే, తన లక్షణములయం దేకైకునిగనే, తన కృత్యములయందునను యేకైకునిగనే యుండినాడు. సాదృశమేదియైనను, ప్రతిదియును, కేవల మాయన ప్రాణులకే వర్తించును; సాన్నిహిత్యభావనలన్నియూ సంపూర్ణముగా, ఆయనను సేవించువారల భావనలే. ఆయన ప్రాణులు గావించు వర్ణనలకన్ననూ, ఆయన తత్త్వ మప్రమేయో త్కృష్టము. సర్వాతిరిక్త శోభాయమానమును, సర్వోత్కృష్ట సామీప్యదుర్లభమును నగు దివ్యాసనమును, కేవల మాయనయే అధిష్టించును. మానవహృదయ విహంగములెంత యెత్తున కెగసినను, అవి యాయన దుర్ర్గాహ్య దివ్యతత్త్వ శిఖరముల నధిరోహింపగలమని, ఎన్నటికిని యాశింపజాలవు. సృష్టిస్థిత సమస్తము నస్తిత్వములోని కరుదెంచునటు లొనరించిన యాతడును, తన యాజ్ఞానుసారము ప్రతి సృజితమును ఆవిర్భవింప జేసినవాడును - ఆయనయే. మరి, ఆయన దివ్యలేఖిని వెలువరించిన వాగ్హేతుజనితమూ, ఆయన యిచ్ఛాంగుళీ నిర్దేశితమూ - ఆయనకు సమముగనే, సాక్షాత్తూ ఆయనగనే పరిగణనీయమా? ఆయన వైచిత్రిని మానవలేఖినియో, జిహ్వయో సూచించుట, ఆయన దివ్యతత్త్వమును మానవ హృదయము గ్రహియించుట యనునవి ఆయన యశస్సున కపవాదము. ఆయన గాక అన్యులెల్లరును, ఆయన ద్వారముచెంత నిలువబడు దీనులే, దుఃఖితులే; ఎల్లరూ, ఆయన శక్త్యోద్ధతి యెదుట దుర్బలులే; ఎల్లరూ, ఆయన దివ్య సామ్రాజ్యమున బానిసలే. ఆయన - సకలజీవరాశులను పరిత్యజించు నంతటి యైశ్వర్యశాలి.

ఆరాధకునికిని, ఆరాధితునికిని మధ్యన, సృజితమునకును, సృష్టికర్తకును మధ్యన నెలకొనియున్న సేవాభావబంధమును మానవులయెడ ఆయన యనుగ్రహోపకృతికి తార్కాణముగనే దక్క, వారొందియున్న యే విశిష్టతకును సూచకముగ నెంచదగదు. బుద్ధిశాలియైన ప్రతి నిజవిశ్వాసియు, ఇందులకు సాక్ష్యమును వహియించును.

XCV

సకలజనవిభుడగు నీ ప్రభుడు తన దివ్యగ్రంథమున నిర్దేశించిన దాని ననుసరించి, ఆయన మానవజాతి కనుగ్రహించిన యుపకృతు లింత దనుకను, ఇక ముందెన్నటికిని తమ స్థాయీపరముగ నసీమితములే యని దెలియుము. సర్వశక్తిమంతుడు మానవునకు ప్రసాదించిన యీ యుపకృతుల యందున మేధోపురస్కృతి ప్రప్రథమమును, అగ్రగణ్యమును. అట్టి పురస్కృతిని ప్రసాదించుటయందున ఆయన యాంతర్యము: తన జీవిని, నిజైకదైవము—సమున్నత మాయన వైభవము—నరసి, గుఱుతించునటు లొనరించుటయే దక్క వేరొండు కాదు. ఈ పురస్కృతి మానవునకు సమస్త విషయ సత్యమును గ్రహియించు శక్తి నొసగి, సముచితమగుదాని దెసకు పథనిర్దేశము గావించి, సృష్టి రహస్యముల నెఱుగుటయం దాతడికి దోడ్పడును. స్థాయీపరముగ తరువాయిది, ఆతడి మేధను పనిచేయింపగల ముఖ్యసాధనమైన దృక్శక్తి. శ్రవణ, హృదయ, తత్సదృశ సంబంధిత జ్ఞానముల వంటివి మనుష్యదేహమున కనుగ్రహీతములైన పురస్కృతులుగనే గణనము నొందవలె. ఈ శక్తులను సృజియించి, మానవదేహమునం దావిష్కృత మెునరించిన సర్వశక్తిమంతుడు, అప్రమేయ ప్రకీర్తితుడు.

ఈ పురస్కృతులయందలి ప్రతిదియు నిజైకదైవము—సమున్నత మాయన వైభవము—యెుక్క మహత్తునకును, శక్త్యధిపత్యములకును, సర్వావృతజ్ఞానమునకును ప్రస్ఫుటనిదర్శనమే. స్పర్శజ్ఞానమును పరిశీలింపుము. దాని శక్తి మానవదేహమునం దెల్లయు తానై యెటుల పరివ్యాప్తమైనదో తిలకింపుము. దృక్‌, శ్రవణసామర్ధ్యము లొక నిర్దిష్టస్థానమున కేంద్రీకృతములై యుండగ, స్పర్శజ్ఞానము మానవ దేహమునం దంతటను విస్తరించుకొనియుండును. ప్రకీర్తిత మాయన శక్తి, ప్రవర్ధిత మాయన సార్వభౌమత్వము.

ఈ పురస్కృతులు మానవునియందుననే యంతర్లీనములై యున్నవి. దివ్యావిష్కరణ పురస్కృతి, అన్యపురస్కృతు లన్నింటికన్నను - సర్వప్రధానము, స్వాభావికముగ నిష్కళంకము, సాక్షాత్ భగవత్సంబంధితము. మానవునకు సృష్టికర్త ప్రసాదించిన ప్రతి వదాన్యతయూ - భౌతికమైనను, ధార్మికమైనను - దానికి విధేయమే. స్వీయతత్త్వమున, దివినుండి భువి కనుగ్రహీతమైన శాశ్వత దివ్యభోజనమది. భగవంతునికి సర్వోత్కృష్టప్రతీక యది; ఆయన సత్యమునకు ప్రస్ఫుటనిదర్శనము; ఆయన పరిపూర్ణౌదార్యసంకేతము; ఆయన సర్వావృత కారుణ్యతార్కాణము, ఆయన వాత్సల్యతమ దార్శనికతానిదర్శనము, ఆయన సంపూర్ణానుగ్రహచిహ్నము. ఈ యుగమున, ఆయన దివ్యావతారమును గుఱుతించిన యాతడు, నిక్కముగా, భగవంతుని యీ మహోన్నతపురస్కృతికి పాత్రుడే.

నీ కింతటి మహానుగ్రహమును ప్రసాదిత మొనరించినయందులకు నీ ప్రభునకు కృతజ్ఞతల నర్పింపుము. నీ గళమునెత్తి పల్కుము: ప్రతి యవగాహ నాన్వితమానసదివ్యాభీష్టమైన ఓ దేవా, సమస్తప్రస్తుతియు నీకే యని.

XCVI

మహోన్నతుని దివ్యలేఖిని యవిరామముగ పిలుపు నిచ్చుచున్నది; అయినను, తద్వాణికి తమచెవి యెుగ్గినవారు కొందరేనే! చూడ కన్నులును, విన వీనులును గల ప్రతి మనుజుడును ప్రాపంచిక విలాసమయ విశేషవస్త్ర వర్ణము లెంతటి క్షణభంగురములో గుఱుతింపక తీరదనుటను విస్మరించి, నామధేయ సామ్రాజ్యవాసులు దానికి మోహితులైనారు.

ఈ యుగమున, ప్రపంచజను లెల్లరియందునను నవ్యజీవనమెుకటి సంచలనమును కలిగింపు చున్నది; అయినను, ఎవ్వరునూ తద్హేతువు నరయనూ లేదు, తదుద్దేశ్యము నెఱుగనూ లేదు. పాశ్చాత్య ప్రజల నవలోకింపుడు. వ్యర్ధమును, శుష్కమును నగు దానికై గావించు స్వీయశోధనమున, దాని నిరూపణ, ప్రచారముల కసంఖ్యాక జీవితములను వారు త్యాగము చేసినారు; చేయుచునే యున్నా రింకను. ఇంకొకవంకన ప్రస్ఫుట, ప్రభాసమాన దివ్యావిష్కరణ భాండారపు టౌన్నత్య ప్రఖ్యాతులు యావద్భువినీ పరివృత మెునరించినను, పారశీకప్రజలు నిర్లిప్తులై యనంతౌదాసీన్యమునం దడగినారు.

ఓ మిత్రులారా మీ కనుగ్రహీతములైన సుగుణములపరముగ అశ్రద్ధాళువులో, మీ యుదాత్త భవితపట్ల నిర్లక్ష్యులో కావలదు. మీ యత్నములను, కొన్ని మనస్సులు కల్పించిన శుష్కభ్రమలతో, వమ్ము కానీయవలదు. మీరు జ్ఞానాంబర తారకలు; ప్రాతఃకాల మందానిలము; సకలజనజీవనమే సమాశ్రితము కాక తప్పని మృదుప్రావాహికజలములు, ఆయన పవిత్రలేఖ్యస్థిత విలిఖితాక్షరములు. పరిపూర్ణైక్యత తోడను, సంపూర్ణస్నేహభావమునను, ఈ భగవద్యుగమునకు యుక్తమగు దానిని సాధింపజాలుట కుద్యమింపుడు. విరోధవిభేదములును, మానవుని మేధాతిరస్కృత మెద్దియైనను, ఆతడి స్థానమునకు సంపూర్ణముగా అయోగ్యములని, నిక్కముగ, చెప్పుచున్నాడను. మీ శక్తులను భగవంతుని దివ్యధర్మ ప్రవర్థనముపై కేంద్రీకృతమెునరింపుడు. అంతటి మహత్తరామంత్రణార్హుని, ఉద్యమించి దానిని ప్రవర్థిత మెునరింపనిండు. అట్లొనరింప జాలని యాతడి విధి: ఉత్కృష్టతమ వ్యవస్థలను ప్రకంపిత మెునరించి, ప్రతి శైలమును ధూళిగా చూర్ణితమెునరించి, ప్రతి యాత్మను నిశ్చేష్టిత గావించిన యీ శక్తిప్రపూరి తావిష్కరణమును ప్రకటించు నాతడిని, తనకు ప్రత్యామ్నాయముగా నియుక్త మెునరించుట. పూర్ణస్వరూపమున ఈ దివ్యయుగమహత్త్వ మావిష్కృతమైన పక్షమున, తద్ఘనకీర్తియందున క్షణ మాత్రమేని పాలునొందవలెనను ఆకాంక్ష - ఈ లోకమును, దీని యశాశ్వతైశ్వర్యములను యింకెంతగా తృణీకరించునో!

మీ సమస్తకార్యములయందునను విజ్ఞతానిర్దేశితులై, దానికి దృఢముగా బద్ధులుకండు. భగవంతుని సంప్రీతుని గావింపుడు; దైవేచ్ఛయైన దానిని నిర్వర్తించుటకు మీ రెల్లరును దృఢీకృతు లగుదురు గాక; ఆయనను సేవించుటకును, ఆయన నామధేయమును ప్రవర్ధిల్లజేయుటకును ఉద్యుక్తులైన ఆయన ప్రియతమతుల్యులకు ప్రసాదితమైన స్థాయిని గుఱుతించుట కనుగ్రహపూర్వకముగ సాహాయ్యము నొందుదురు గాక. భగవద్వైభవమును, భూస్వర్గస్థిత సమస్తపు వైభవమును, స్వర్గములకు స్వర్గమైన పరమోత్కృష్ట స్వర్గధామవాసుల వైభవమును - వారలకున్నవి.

XCVII

భగవత్సములమని చెప్పుకొనినవారు యీ దేశప్రజాహృదయముల యందున కలుగజేసిన సందియములను పరికింపుము. “సువర్ణముగ పరివర్తిత మగుట తామ్రమున కెన్నటికేని సాధ్యమా?” యని వారడుగుదురు. అవును, నా ప్రభునిపై యాన, సాధ్యమే ననుము. అయినను, తద్రహస్యము మా జ్ఞానమున నిక్షిప్తమైయున్నది. మేము వెల్లడిసేయు వారికి దానిని వెల్లడింతుము. మా శక్తిని శంకించు నాతడిని, తన కాయన రహస్యమును వెలువరించి, తత్సత్యమును ధృవీకరింపుమని తన దైవమైన ప్రభు నడుగనిమ్ము. వా రీసత్యమును గ్రహియింప జాలినవారేని, తామ్రమును సువర్ణముగా రూపాంతర మెుందింప వచ్చుననునదే, సువర్ణమును సైత మత్తీరున తామ్రముగా పరివర్తిత మెునరింప వచ్చు ననుటకు సరియగు నిదర్శనము. ప్రతి ఖనిజమును, ప్రతి యన్యఖనిజపు పదార్ధ, రూప, సాంద్రతల నొందునటు లొనరింపవచ్చును. తత్సంబంధిత జ్ఞానము మాతో, నిగూఢదివ్యగ్రంథమున యున్నది.

XCVIII

వచించు: ఓ మతాధిపతులారా! మీ వర్తమాన ప్రమాణములతోడను, విజ్ఞానముతోడను భగవంతుని దివ్యగ్రంథమును ప్రామాణీకరింపవలదు; ఏలయన, ఆ గ్రంథమే మానవులయం దేర్పరుపబడిన దోషరహితమగు త్రాసు. మానవులును, వారి సంతతియును తమ స్వాధీనమందలి దేనినైనను, నిర్దుష్టమగు ఈ దివ్యతులతో కొలువవలసినదే ననియు, దాని భారము తత్ర్పమాణాను సారమే పరీక్షింపబడవలెననియు తెలియుడు.

రేయింబవళ్లును, ఉదయ, సాయంసంధ్యాసమయముల యందునను మీరెవ్వరి నామంత్రింపు చుంటిరో ఆయనను గుఱుతించుటలో మీరు వైఫల్యము నొందుటను గాంచి, నా వాత్సల్యాన్విత నయనము బాధాతప్తమై కన్నీరిడుచున్నది. ఓ జనులారా! “సత్యముగా, సర్వశక్తియుత సంరక్షకుడను, స్వయమాధారుడను అగు నాతో బోల్పదగిన అన్యదైవము లే” డని సద్రతుల్‌- ముంతహా పిలుపు నిచ్చుచున్న శుభ ‘శోణితస్థలి’ వైపుకు హిమశ్వేత వదనములతో, జ్యోతిర్మయహృదయములతో పురోగమింపుడు.

ఓ మతనేతలారా! దార్శనికతయందునగాని, బుద్ధికుశలతయందున గాని మీలో న న్నెదిరించువా డెవ్వడు? వాగ్పటిమయందునగాని, వివేకమునగాని నాకు సమయుజ్జీనని చెప్పుకొనువా డెందు కానవచ్చును? సమస్త దయాళువగు నా దైవము సాక్షిగా! లేడు; వసుధయందలి సమస్తమును సమసి పోవును; శక్తివంతుడును, పరమప్రియుడును అగు మీ భగవంతుని వదన మిదియే.

జనులారా! సమస్తవిజ్ఞానమునకును మూలాధారుడగు ఆయనను తెలియుటయే సకలవిజ్ఞానార్జన కును పరమోన్నత పరమావధియని మేము నిర్దేశించినాము; అయినను, ఈ దివ్యజ్యోతికి ప్రత్యూషమును, ప్రతి గుప్తవిషయావిష్కర్తయును అగు ‘ఆయన’ నుండి మీ విజ్ఞానము తెరయై మిమ్మెటుల తొలగ ద్రోచినదో యవలోకింపుడు. ఈ విరళీకృత వాక్ప్రభామూలము నెరిగితిరేని, మీ రీజగమందలి జనులను, వారి యాధీనమందలి సర్వమును త్రోసిపుచ్చి ఈ పావన మహాన్వితపీఠసామీప్యమున కేతెంతురు.

వచించు: నిక్కముగా నిది, మాతృగ్రంథము భద్రపరుపబడిన స్వర్గమని గ్రహియింపుడు. “సర్వజనసార్వభౌముడును, సర్వాధికార ప్రపూర్ణుడును, ప్రేమోపేతుడును అగు దేవదేవునిదే సామ్రాజ్య” మని పవిత్రభూమిస్థితయగు మహాశైలముపై పాషాణ ముద్ఘోషించు నటుల, హుతాశననికుంజము ఎలుగెత్తి చాటునటుల గావించిన దాయనయే.

మేమే విద్యాలయమునను అభ్యసింపనులేదు, మీ వ్యాఖ్యానము లెవ్వియును పఠియింపనులేదు. నిరంతరుడగు పరమేశ్వరుని చెంతకు మిమ్ముల నాహ్వానింపుచున్న ఈ నిరక్షరుని పలుకుల నాలింపుడు. గ్రహియింపజాలితిరేని, వసుధపైగల సమస్తసంపదల కన్న, యిది మీకు మిన్న.

XCIX

ప్రతి దేశమునను, భగవంతునిపట్ల జనవిశ్వాసచేతన యంతరింపు చున్నది; దానిని, ఆయన యొసగు ఆరోగ్యప్రదౌషధమునకు తీసిపోవున దేదియును, ఎన్నటికినీ పునరుద్ధరింపజాలదు. నాస్తికత్వ క్షారత మానవసమాజపు టాయుపుపట్లను దినివైచుచున్నది; సర్వశక్తిప్రపూరితమగు ఆయన దివ్యావిష్కర ణామృతము దక్క , దానిని యింకేది ప్రక్షాళించి పునర్జీవిత నొనరింపగలదు? ఓ హకీమ్‌, పదార్ధమునం దంశీభూతమైయుండు సూక్ష్మమును, అవిభాజ్యమును నగు యే మూలకణమున నైనను పూర్ణపరివర్తనను —అది స్వచ్ఛతమ సువర్ణముగ రూపాంతర మెుందునంతటి సంపూర్ణ పరివర్తనను—కలుగజేయుట మానవశక్తియం దున్నదా? అసాధ్యముగను, దుర్లభముగను నగుపింప వచ్చునుగాని, దుష్టశక్తిని దైవబలముగ పరివర్తిత మెునరించుటయను మహత్కార్యసాధనాధికారము, మా కనుగ్రహీతమైనది. అంతటి పరివర్తనను కలిగింపగల మహాశక్తి, దివ్యరసాయన శక్తికే యతీతమై యుండును. భగవద్వచనము మాత్రమే - తన వైశిష్ట్యము, అంతటి మహత్తర సర్వప్రభావక పరివర్తనమున కావశ్యకమైన సామర్ధ్యముతో ననుగ్రహీతమైనదని వక్కాణింపగలదు.

C

భగవంతుని యాసనమునుండి బయల్వెడలు దివ్యాగ్రగామి స్వర మివ్విధముగ నుద్ఘోషింపు చున్నది: ఓ నా ప్రియతములారా! నా పావన వస్ర్తాంచలమును, ఈ ప్రాపంచికాంశములతో కలుషితమును, పంకిలమును కానీయవలదు; మీ దుష్ట, తుచ్ఛవాంఛాప్రేరణల ననుసరింపనూ వలదు. ఈ దివ్యకారాగృహ స్వర్గమున, తన పూర్ణవైభవమున భాసిల్లు దివ్యావిష్కరణాదిత్యుడు నాకు సాక్ష్యమును వహియించును. ఈ దివ్యయుగమున, సకల సృష్ట్యారాధనాలక్ష్యమైన ఆయన దెసకు తమ హృదయము లను సారించినవారలు సమస్తగోచరాగోచరముల నధిగమించి, వాటినుండి ప్రక్షాళితులు కావలె. వారు నా దివ్యధర్మమును బోధింప నుద్యమించిరేని, అప్రతిహతుడగు ఆయన స్ఫూర్తిని వెలువరించి, వాటిని జాగృతముల నొనరించి, సుదృఢసంకల్పులై, ఆయనయెడ పూర్ణావలగ్నిత మనస్కులై, సకలవస్తుసంపూర్ణ పరిత్యాజ్య, విమోచితహృదయులై, యావత్ప్రాపంచికాడంబర ప్రక్షాళితాత్ములై - దానిని భువియందలి సుదూర దేశములకు పరివ్యాప్తము గావింపవలె. భగవద్విశ్వాసమును తమ ప్రస్థానమునకు ప్రధాన సంభారముగ నెంచుకొని, మహోన్నతుడును, సమస్తయశస్వియును నగు తమ దివ్యప్రభుని యనురా గాంబరమును ధరియించుట వారికి విధియుక్తము. అట్లొనరించిరేని, వారి వాక్కులు శ్రోతలను ప్రభావితులను గావించును.

ఈ దివ్యయుగమున, స్వీయ దుర్వ్యామోహవ్యగ్రులై ప్రపంచ సంబంధితాంశములపైనను, నశ్వరమగు తత్కీర్తిపైనను తమ యాశలను బెట్టుకొనిన వారికి మమ్ము దూరుల గావింపుచున్న యగాధ మెంత విస్తృత మెంత సువిస్తృతము! సకలకరుణాన్వితుని కత్యంత సన్నిహితముగ మనినవార లెంతటి తీవ్రదారిద్య్రమున తపియించిరనిన, ఆయన యాస్థాన మెన్నియోమారు లైశ్వర్యహీనగ పైకగుపించినది. వారి యాతన లట్లుండినను, ఎన్నడును, ఈ ప్రపంచమును గురించియేని, తదైశ్వర్యముల గురించియేని ప్రస్తావించుటకైనను, సూక్ష్మతమసూచన గావించుటకైనను మహోన్నతుని దివ్యలేఖిని యిచ్చగింపలేదు. ఇక, ఆయన కెన్నడేని, ఏ కానుకయైనను బహూకృతమైనయపు డది తత్సమర్పకునియెడ, ఆయన కృపకు ప్రతీకగనే స్వీకృతమైనది. సకలభువనైశ్వర్యములను మా స్వీయవినియోగమునకై వశపరచు కొనుట యనున దెన్నడేని మా యభీష్టమైన పక్షమున, మా ప్రాభవము నెదిరించుటకేని, మా హక్కును ప్రశ్నించుటకేని, ఎవ్వనికీ అధికార మివ్వబడలేదు. నిజైకదైవముపేరిట, మనుజుల కలిమి నర్ధించుట కన్నను హేయతర కార్యము నూహింప నశక్యము.

యావత్ప్రాపంచిక వస్తువ్యామోహమునుండియు తమను పవిత్రీకరించి, తన్మాలిన్యముల నుండి తమను ప్రక్షాళనమెునరించుదాని దెసకు - సమస్త వైభవాన్వితుని పరిధానమధురసౌరభము, ఆయనను ప్రేమించువా రెల్లరినుండియు నాఘ్రాణిత మగునటుల - సకలజనుల నాహ్వానించుటయను విధి - నీది, నిత్యసత్యమైన ఆయన అనుయాయులది.

అయిననూ, ఐశ్వర్యముల నొందియున్నవారు, పేదలయెడ పరమాదరమును కలిగియుండవలె, ఏలయన, సహనమునం దచంచలులైన దీనులకు భగవంతు డుద్దేశించిన మాన్యత మహత్తరము. నా జీవితముపై యాన! భగవంతు డానందమున ప్రసాదింప నెంచునది దక్క , ఈ మాన్యతకు సరియగు మాన్యత వేరొండు లేదు. సహనముతో స్వీయవ్యధల నోర్చుకొను, అణచుకొను దీనులకై ప్రతీక్షించు ధన్యత మహత్తరము; ఇక, తమ కలిమిని లేమియం దున్నవారల కిచ్చివైచి, తమకు మించిన ప్రాధాన్యతను వారలకిచ్చు సంపన్నులకు శుభమగును.

భగవంతుని సంప్రీతుని గావింపుడు; పేదలు తాముగ శ్రమియించి తమ జీవనోపాధి సాధనములను చేకూర్చుకొన యత్నింతురు గాక. ఈ మహోత్కృష్ట దివ్యావిష్కరణమున ప్రతి యెుక్కనికిని, ఇది నియుక్తకర్తవ్యము; సత్కార్యముగా భగవంతుని దృష్టి యందున పరిగణితము. నిశ్చయముగా, ఈ కర్తవ్యపాలకున కగోచరుని సాహాయ్యము తోడ్పడును. ఆయన తాను సంప్రీతించిన వానిని, తన యౌదార్యమున సుసంపన్నుని గావించును. నిక్కముగా, సకలాంశములపైనను, ఆయన కధికారమున్నది. . . .

ఓ ఆలీ, మనుష్యలక్షణములయం దత్యంతప్రధానమైనది, న్యాయమేనని భగవత్ప్రియతములకు చెప్పుము. సకలాంశమూల్యాంకనమునకు ప్రాతిపదిక యిదియే కావలె. ఈ కారాగృహవాసి భరియించిన క్షోభాసంక్షోభముల నించుక తడవు పర్యాలోచింపుము. నా జీవితకాలమంతయూ, నా శాత్రవుల దాక్షిణ్యాశ్రితుడనైతిని; భగవత్ప్రేమపథమునం దనునిత్యమెుక నూతనవ్యధ ననుభవించినాడను. యావత్ప్రపంచమునను దివ్యధర్మకీర్తి పరివ్యాప్తిత మగునంత వరకు సహనమున భరియించితిని. ఇప్పుడెవ్వడేని యుద్యమించి, స్వీయమనోకల్పిత వ్యర్ధోహాప్రేరితుడై, మానవులయందున వివాదబీజము లను విత్తుటకు, బాహాటముగనో, గూఢముగనో యత్నించెనేని, అట్టి మనుజుడు న్యాయవర్తను డనవచ్చునా? సకలవిషయాతీతసత్త్వుడైన ఆయనపై యాన; అనరాదు! నా జీవితము సాక్షి! భగవంతుని దివ్యధర్మనిమిత్తమును, తా మనుదాని తాత్పర్యము నెఱుగని, తమ కవగతము కానిదాని నూహించుకొను వారల నిమిత్తమును నా మానస మాక్రోశింపుచున్నది; అవిరళముగ నా నేత్రము లశ్రువులను వర్షింపు చున్నవి.

ఈ దివ్యయుగమున మహాఘననామమును స్థిరముగ ననుసరించి, సకలజనసమైక్యతా సంస్థాపన మెునరించుట సర్వులకును సముచితము. ఆయన దక్క పాఱతావేని, కోర నాశ్రయమేని, వేరొండు లే దెవ్వనికిని. ఏ మనుజుడైనను - జనులను భగవంతుని యనంతసాగరతీరములకు విముఖుల గావించుటకును, వారు మానవపరిమితుల కనువగు రూపును దాల్చిన యీ వైభవప్రపూరిత ప్రత్యక్షాస్తిత్వముపైగాక మరి దేనిమీదనైనను తమ హృదయములను నిల్పెడు వాక్కుల నుచ్చరించుటకును ప్రేరితుడైనచో—అట్టివా డెంతటి సమున్నత స్థానమునం దుపవిష్టుడైనను, సకలకరుణాన్వితుని సుమధుర సౌరభములను కోలుపోయిన వానిగ, సమస్తసృష్టిచే యధిక్షేపితుడగును.

వచించు: అవగాహనాన్వితహృదయులైన ఓ జనులారా! మీ నిర్ణయమున న్యాయమును పాటింపుడు. తన నిర్ణయమున యధర్మముతో వర్తించు నాతడు మనుష్యస్థాయికి మాన్యతనొసగు లక్షణముల పరముగ నిర్ధనుడే. నిత్యసత్యమైన ఆయన, మానవహృదయములు గుప్తమొనరించు దానిని లెస్సగ నెఱుగును. నియుక్తసమయ మరుదెంచునంత దనుక యేముసువునూ భగ్నము సేయడు గనుక, ఆయన సుదీర్ఘసహిష్ణుత ఆయన ప్రాణులను ధైర్యస్థుల నొనరించినది. ఆయన క్రోధతీవ్రతను ఆయన కారుణ్యాధిక్యత ప్రతిరోధించి, తా మేకాంతమున పాల్పడినవానిని నిజైకదైవ మెఱుగడని అత్యధికులను భ్రమియింపజేసినది. సర్వజ్ఞుడును, సకలనివేదితుడును నగు ఆయనపై యాన! సమస్త మానవకర్మలనూ, ఆయన జ్ఞానదర్పణము పూర్ణస్పష్టతతో, నిర్దుష్టతా విధేయతలతో ప్రతిఫలించును. వచించు: అశక్తుల, నిస్సహాయుల దుష్కృతాచ్ఛాదకుడ వగు ఓ దివ్యమూర్తీ, ప్రస్తుతి నీకు! నీ కపకృతియెునర్చు ప్రమత్తులను సైరించు ఓ సహిష్ణువూ, స్తవనీయము నీ నామము!

సకలజ్ఞానమూలమును, లక్ష్యమును నగు ఆయనను మానవులు గుఱుతించి, ఆయన యావిష్కరింపనెంచుదానిని గ్రహియింపవలెనని - స్వీయమనోభ్రాంతుల ననుసరించుటను వారికి నిషేధించినాము; వీక్షింపుము, శుష్కవ్యామోహములయందునను, వ్యర్ధోహలయందునను వా రెటుల చిక్కిరో! నా జీవితము సాక్షిగ! తమ స్వీయహృదయములు పన్నిన కుయుక్తులకు తామే బలిపశువు లైనను, వారు దానిని తెలిసికొనరు. తమ నోటిమాట నిరర్ధకము, నిష్ఫలమయ్యును, వారు గ్రహియింపరు.

సకలజనులకును ఔదార్యపూర్వకముగ తన కారుణ్యము ననుగ్రహించి, వారిచే తన, తమ సంబంధితమైన పరిజ్ఞానము నొందజేయుమని భగవంతుని మే మర్ధింతుము. నా జీవితము సాక్షిగ! ఆయన నెఱిగినయాత డాయన వాత్సల్యవిస్తృతిలోని కెగసి, ప్రపంచమునుండియు, తత్సర్వస్వము నుండియు విముక్తుడగును. ఆతడి పయనగతిని భువియందలి దేదియూ మరల్పజాలదనగ, ఇక స్వీయవ్యర్ధోహాప్రేరితులై భగవన్నిషేధితాంశములను ప్రసంగించు వారెంత?

వచించు: ఆయన వాణిపట్ల ప్రతి శ్రవస్సుయూ, అప్రమత్తమై తీరవలసిన దివ్యయుగమిది. మీరు యీ దూషితుని పిలుపు నాలించి, నిజైకదైవనామమును సంకీర్తించి, ఆయన స్మరణాభరణవిభూషితులై, ఆయన యనురాగదీప్తితో మీ మానసములను జ్యోతిర్మయములను గావించుకొనుడు. మానవ హృదయములను తెఱచు కుంచిక యిది; ఇది సమస్తప్రాణుల యాత్మలకు మిసిమిని జేకూర్చు మెఱుగుఱాయి. భగవంతుని దివ్యేచ్ఛాంగుళిజనితము నలక్ష్యము జేయువాడు నిక్కముగా, భ్రాంతచేతస్కుడే. విభేదానుచితవర్తనములకన్నను, స్నేహసద్వర్తనములే నిజవిశ్వాస నిదర్శనములు.

సత్యవాచకుడును, భగవద్విశ్వాసధరుడును నగు ఆయన ని న్నవలంబింపుమని యాదేశించిన దానిని మానవుల కుద్ఘోషింపుము. నా నామమును స్మరియింపుచున్న, నా యాస్థానము దెసకు దృక్కులను సారింపుచున్న, ప్రదాత యగు నీ ప్రభుని నోరార సంకీర్తింపుచున్న ఓయీ, నీతో నా యశస్సున్నది.

CI

ప్రతి దివ్యగ్రంథావిష్కరణమునను, కాదుకాదు, దివ్యావిష్కృతయైన ప్రతి సూక్తియందునను నిగూఢమైయున్న లక్ష్యము: సమస్తప్రజలయందునను శాంతిసౌఖ్యములు స్థిరముగ నెలకొనునటుల - వారికి ధార్మికతాజ్ఞానములను కలుగజేయుటయే. మానవహృదయముల కాశ్వాసనము నిచ్చునట్టిది – వారి స్థానమును సమున్నత మెునరించునదేని, వారి సంతుష్టతను ప్రవృద్ధము గావించునదేని - ఏదియైనను—భగవంతుని దృష్టియం దామోదయోగ్యమే. ఇక, తన సమున్నత లక్ష్యసాధనను దక్క అన్యమునెంచని మానవు డొందగల స్థాన మెంతటి యుదాత్తమో! క్షుద్రతమజీవు లెన్నటికిని చేరజాలని ఏ యధఃపతనపు లోతులలోని కాతడు కృంగిపోవునో! ఓ మిత్రులారా, ఈ దివ్యయుగము మీ కొసగుచున్న యవకాశము నందిపుచ్చుకొనుడు; ఆయన యవిరళానుగ్రహధారలను కోలుపోవలదు. ఈ దివ్యమంగళప్రదయుగమున, పునీతములును, పవిత్రములును నగు కార్యభూషణములతో మీయందలి ప్రతియెుక్కరిని, ఔదార్యపూర్వకముగ నలంకృతులను కానిమ్మని భగవంతుని ప్రార్ధింతును. నిక్కముగ, ఆయన తా దలచినదానిం జేయును.

CII

ఓ జనులారా, నేను, సత్యముగ, మీకు వచియించుదాని నాలించుటకు మీ వీనుల నొగ్గుడు. నిజైకదైవము—సమున్నత మాయన వైభవము—మానవహృదయములను సదా తనవిగ , తన విశేష సంపదగ మన్నింపుచు వచ్చినాడు; ఇక ముందును మన్నింపుచునేయుండును. అన్యము నెల్లయు—అది భువిదేని, అంబుధిదేని; ఐశ్వర్యమేని, యశస్సేని—రాజన్యులకును, భూపాలురకును సంక్రమింప జేసినా డాయన. ఆదిరహితాద్యమునుండియు “తా దలచు దాని నొనరించు,” నను వాక్కుల నుద్ఘోషించు కేతనము, ఆయన దివ్యావతారమున కభిముఖముగ, తన పూర్ణవైభవమున యావిష్కృతమై యున్నది. అధికారమున్న వారియెడ విధేయతయును, విజ్ఞతారజ్జువునకు వినమ్రపూర్వకముగ కట్టువడి యుండుటయును - మానవజాతి కీనాటి యవసరము. మానవాళి తక్షణసంరక్షణకును, భద్రతా సాంత్వనములకును ఆవశ్యకములగు సాధనములు మానవసమాజ పాలకుల హస్తస్థితములు గావింప వడి, వారల యాధిపత్యమునందున్నవి. దైవేచ్ఛ యిది; దైవశాసనమిది. . . . భగవంతుని నిమిత్త మీ నృపాలురయం దొక్కడు యీ దూషితుల, ఈ పీడితుల విజయమున కుద్యమించునను ఆశ మా కున్నది. అట్టి రాజన్యుడు శాశ్వతముగ శ్లాఘితుడగును, సంకీర్తితుడగును. తమకు తోడ్పడువానికి తోడ్పడవలసిన, ఆతడి విశిష్టప్రయోజనములను నెరవేర్పవలసిన, ఆతడియెడ తమ నిత్యవిధేయతను ప్రదర్శింపవలసిన విధిని భగవంతుడు యీ ప్రజలకు నిర్దేశించినాడు. న న్ననుసరించువారలు, నా దివ్యధర్మవిజయమున కుద్యుక్తుడగు నాతడి క్షేమమునకు సర్వావస్థలయందునను, తోడ్పడుటకు శ్రమియింపవలె; సర్వకాలములయందునను ఆతడియెడ తమ భక్తివిశ్వాసములను నిరూపించుకొనవలె. నా యుప దేశము నాలించి, పాలించు నాతడు సంతోషాత్ముడు. నా యాకాంక్షను నెరవేర్ప విఫలుడు దుఃఖభాజనుడు.

CIII

“ఆభా యశోధామమున వసియించు వాడను నే,” నను వాక్కులను, సత్యము బలుకు తన జిహ్వతో, భగవంతుడు తన సమస్త దివ్యఫలకముల యందునను ధృవీకరించినాడు.

భగవంతుని ధార్మికత్వముపై యాన! ఈ యుత్కృష్ట, ఈ పవిత్ర, ఈ మహత్తర దివ్యస్థానపు టున్నతశిఖరములనుండి సమస్తవస్తువుల నవలోకింపుచు, సకలాంశముల నాలింపుచు, ఈ తరుణమునం దిట్లనుచున్నా డాయన: ఓ జవాద్‌, నీకు పూర్వము యే మనుజుడును సాధించియుండని దానినందిన యందులకు ధన్యుడవీవు. నిత్యసత్యమగు ఆయనపై ప్రమాణ మెునరింతును! మహోత్కృష్ట స్వర్గవాసుల నేత్రములు నీవలన సమ్మోదితములైనవి. అయినను, ప్రజలు శుద్ధప్రమత్తులు. మేము నీ స్థానమును వెల్లడింపవలసివచ్చినచో, మానవహృదయములు తీవ్రముగ నాందోళితము లయ్యెడివి; వారి యడుగులు తడవడి యుండెడివి; అతిశయమూర్తులు నిశ్చేష్టులై, నేల గూలియుందురు; వినవెఱపున, ప్రమత్తతాంగుళులను తమ చెవులలోనికి గ్రుక్కుకొని యుండెడివారు.

ఈ ప్రాపంచిక విషయమగ్నులై, మహోన్నతుడగు భగవంతుని స్మరణను విస్మరించిన వారియెడ ఖేదము నొందవలదు. నిత్యసత్యమైన ఆయనపై యాన! సర్వశక్తిమంతుని తీవ్రక్రోధము వారలను ప్రభావిత మెునరించు దివస మాసన్న మగుచున్నది. నిశ్చయముగ, ఆయన సకలబలుడు, సమస్తవిజేత, మహాసత్వుడు. ఆయన వారి దుర్ణయమాలిన్యమునుండి ప్రపంచమును ప్రక్షాళించి, తన చెంతనున్న తన సేవకులకు దాని నొక వారసత్వముగ ననుగ్రహించును.

వచించు: ఓ జనులారా! దివ్యుడగు జోసెఫ్‌ను స్వల్పతమ మూల్యమునకు వినిమయ మెునరించి వైచిన యందులకు మీ నోళ్లు భూపరాగపూర్ణములగును; మీ కన్నులు భస్మావరోధితములగును. అహో, సన్మార్గదూరులారా, ఏమి దురవస్థ మీకు! ఆయనను, ఆయన దివ్యధర్మమును అధిగమింపగల శక్తి మీకున్నదని, మీ మానసములయం దూహించితిరా? సత్యదూరమది! ఇందులకు సకలసత్వుడును, మహోదాత్తుడును, మహోన్నతుడును నగు ఆయన, కేవల మాయనయే, సాక్ష్యమును వహియించును.

శీఘ్రమే, భగవంతుని శిక్షాప్రభంజనములు మీపై వీయును; నరకధూళి మిమ్ములను క్రమ్మి వేయును. ప్రాపంచికాడంబరములను, ఆభరణములను సమీకరించుకొనుటం జేసి, అహంకారము కొలది భగవద్విముఖులైనవారలు - ఇహపరములను కోలుపోయినవారే. భగవంతు డచిరకాలమునకే, దివ్యాధికారహస్తముతో వారల నైశ్వర్యరహితులను, తన యౌదార్యాంచల విహీనులను గావించును. ఇందులకు వారే, సత్వరమే సాక్ష్యమును వహియింతురు, నీవు సైతము వాఙ్మూలము నిత్తువు.

వచించు: ఓ జనులారా! ఈ జీవితమును, దీని జాలములను - మిమ్ములను వంచింపనీయ వలదు; ఏలయన, ప్రపంచమూ, తత్‌స్థితమూ ఆయన దివ్యేచ్ఛానియంత్రణమున సుస్థిరముగ నున్నవి. ఆయన తా దలచినవారికి, తన యుపకృతి ననుగ్రహించును; తా దలచిన వారికి దాని నపకర్షించును. ఆయన తానెంచిన దానిం జేయును. ఈ భౌతికప్రపంచమునకు తన దృష్టియం దేయోగ్యతయేని యుండియుండిన పక్షమున, ఆయన నిశ్చయముగ దాని నెన్నటికిని - సర్షపబీజమాత్రమైనను - తన శాత్రవాధీన మగుట కవకాశము నిచ్చి యుండడు. అయినను, తన దివ్యధర్మపరముగ మీ హస్తము లొనరించిన దానికి మారుగ, ఆయన మిమ్ములను తద్వ్యవహారముల యందున చిక్కువడ జేసినాడు. గ్రహియించితిరేని, నిక్కముగ, మీ స్వీయేచ్ఛకొలది, మీకుగ మీరు విధియించుకొనిన దండనమిది. భగవంతుని దృష్టియందున—సంశయాళువుల హృదయములను ఆయన నిరూపితముల గావించు —నీచములును, నిరర్ధకములును నగు వానితో మీ రుప్పొంగుచుంటిరా?

CIV

ఓ ప్రపంచజనులారా! ఊహింపరాని యుపద్రవము మి మ్మనుసరింపుచున్న దనియు, ఘోరదుష్పరిణామము మీకై నిరీక్షింపుచున్నదనియు నిశ్చయముగ తెలిసికొనుడు. మీరొనరించినది నా దృష్టినుండి చెఱిగిపోయినదని భావింపవలదు. నా సౌందర్యము సాక్షిగా! మీ చేష్టల నన్నింటినీ నా లేఖిని చంద్రకాంతమణి ఫలకములపై విస్పష్టవర్ణములతో చెక్కియుంచినది.

CV

ఓ ధరణీశులారా! సకలసార్వభౌమాధినాథు డేతెంచినాడు. సర్వశక్తిమంతుడును, సంరక్షకుడును, స్వయంభువును అగు భగవంతునిదే దివ్యసామ్రాజ్యము. ఆయననుదక్క అన్యు నారాధింపవలదు; సమస్తనామాధిపతి యగు మీ దైవమువంకకు జ్యోతిర్మయహృదయములతో వదనములను సారింపుడు. మీ స్వాధీనమందలి దేనికిని సాటిరానట్టి దివ్యావిష్కరణ మిదియని తెలియ గలరు.

మీ రన్యులకై సంగ్రహించియుంచిన దానితో మీ రానందపరవశులగుటను, నా నిక్షిప్తఫలకము దక్క అన్యమెద్దియును గణుతింపలేని లోకములనుండి మిమ్ము మీరు దూరము గావించుకొనుటను మే మవేక్షింపుచున్నాము. మీరు సమీకరించుకొనిన సంపదలు మీ పరమలక్ష్యమునుండి మిమ్ము బహు దూరమున కాకర్షించినవి. ఈ రుగ్మత మీకు సముచితమైనదేనని గ్రహియింపుడు. ఐహికములగు సకల మాలిన్యములనూ మీ మనస్సులనుండి క్షాళన మెునరింపుడు; సర్వమునూ త్యజియించి నిక్షిప్తఫలక నిర్దేశితమును పాటించినవారిని దక్క తక్కిన ప్రపంచమును ప్రకంపింపజేసి, సమస్తజనులనూ శోకతప్తుల నొనరించిన భూలోక స్వర్లోకస్రష్టయగు మీ భగవంతుని సామ్రాజ్యమున కేగుటకు త్వరనొందుడు.

భగవంతునితో సంభాషించిన యాతడు యుగప్రాచీనుని ప్రభను గాంచి, సాగరముల నుప్పతిల్ల జేసిన ఈ దివ్యపాత్రమునుండి పునర్మిలనమను విమలోదకమును గ్రోలిన దివ్యదివసమిది. వచించు: ఏకైకుడగు నిజదైవము సాక్షిగా! దివ్యసామ్రాజ్యశిఖరములనుండి పరమాత్ముని వాణి: “భువియందలి యో గర్విష్ఠులారా, కార్యోన్ముఖులు కండు, ఆయనచెంతకు త్వరనొందు” డని ప్రకటించుట విన నగుచుండ దివ్యావిష్కరణాప్రత్యూషము చుట్టును సైనాయి పరిభ్రమింపుచున్నది. ఈ దినమున, కార్మెల్‌ ఆయన సాన్నిధ్యమునకు భక్తితత్పరతతో త్వరనొందుచుండ, జియోన్‌ హృదయమునుండి: “వాగ్దానము నెరవేరినది. మహోన్నతుడును, సర్వశక్తిమంతుడును, పరమప్రియతముడును అగు భగవంతుని పవిత్రాదేశమునం దుద్ఘోషితుడైన యాతడు ప్రత్యక్షీకృతుడైనా,” డను ప్రకటన వెలువడుచున్నది.

ఓ మహీపతులారా! ఈ స్థానమున, భావాతీతప్రభాస్థలియగు ఇప్ప్రదేశమున - మహోన్నతశాసన మావిష్కృతమైనది. చంద్రు డెవ్వరిచే ఛిద్రము గావింపబడెనో, అప్రతిహతమగు ప్రతి తీర్మానమును ఎవ్వరిచే విశదీకృతమైనదో, తుదిఘడియల నెవ్వరారంభించిరో ఆ పరమనిర్దేశకుని యిచ్ఛామూలమున ప్రతి నిక్షిప్తవిషయమును వెలుగులోనికి తేబడినది.

ఓ రాజన్యులారా! మీరు సామంతులు మాత్రమే. తన మహాద్భుత కీర్తితో కొలువై, సంకట హరుడును, స్వయంభువును అగు తన చెంతకు మిమ్మాహ్వానింపుచు, రాజాధిరాజగు ‘ఆయన’ ప్రత్యక్షమైనాడు. దివ్యావిష్కరణామూలము నెరుగుటలో మీ యహంకారము మిమ్ము నిరోధించేను జాగ్రత్త; స్వర్గస్రష్టయగు ‘ఆయన’ నుండి మిమ్ము ప్రాపంచిక విషయములు తెరలవోలె త్రోసివేయునేమో జాగరూకులు కండు. సమస్తజాతుల ఆకాంక్షయును, మిమ్ము తన ఏకైకవాక్కుచే సృజించి, తన సార్వభౌమత్వమునకు శాశ్వతప్రతీకలను గావించిన ‘ఆయన’ను సేవించుట కుద్యుక్తులు కండు.

భగవంతుని ధార్మికత్వము సాక్షిగా! మీ రాజ్యములపై ఆధిపత్యమును నెరపుట మా యాకాంక్ష గాదు. మానవహృదయములను జయించి, స్వాధీన మెునరించుకొనుటయే మా కార్యము. బహా నేత్రములు వానిపైననే స్థిరముగా నిలిచినవి. దివ్యనామముల సామ్రాజ్యమిందులకు సాక్ష్యము వహియించునని మీరు గ్రహియించిన చాలును. తన దైవము ననుసరించు నాతడు ప్రపంచమును, తత్సర్వమును త్యజియించును; మరి యంతటి మహోన్నతస్థానము నొందియున్న ఆయన నిస్సంగత్వ మెంతటి యుత్కృష్టమై యుండవలె! మీ సౌధములను వీడి ఆయన దివ్యసామ్రాజ్యప్రవేశప్రాప్తికై త్వర నొందుడు. వాస్తవమునకు, మీకిది ఇహపరములు రెండింటియందునను ఫలదాయకము. ఊర్ధ్వలోకాధిపతి యిందుకు సాక్ష్యము వహియించునని తెలియుడు.

నన్ను దక్క సర్వమును త్యజియించి, నా దివ్యసామ్రాజ్యమున నా దివ్యధర్మమునకు సాహాయ్య మెునరింప నుద్యమించు రాజునకై నిరీక్షించు వదాన్యత ఎంతటి ఘనమైనది! అట్టి రేడు బహాజనులకై భగవంతుడు సంసిద్ధము గావించిన శోణమహానౌక యందలి సహచరులయం దొక్కనిగ గణియింప బడును. సర్వులును ఆతని నామమును కీర్తింపవలె; ఆతని స్థాయిని గౌరవింపవలె; గోచరాగోచర లోకస్థితమగు సకలమునకు బలయుత సంరక్షకుడనగు నా నామమనెడు తాళములతో నగరసీమలను వివృతమెునరించుటకై యాతనికి తోడ్పడుడు. అట్టి భూపాలుడు సమస్తమానవజాతికిని నేత్రము, సృష్టిశిఖరమున ప్రభవిల్లు భూషణము, సమస్తజగత్తునకును శుభాశీస్సుల మూలమగు స్రవంతి. ఓ బహా జనులారా, ఆతనికి సాహాయ్యము గావించుటకై మీ సంపత్తిని, కాదు, మీ జీవితములనే యర్పింపుడు.

CVI

సర్వజ్ఞుడగు దేవవైద్యుడు తన యంగుళిని మానవాళి నాడిపై యుంచినాడు. వ్యాధిని గ్రహియించి, తన యప్రమేయ విజ్ఞతతో, యౌషధమును సూచింపగలడాయన. ప్రతి యుగమునకును తనదగు సమస్య యుండును, ప్రతి యెుక్కనికిని విశేషలక్ష్యముండును. ప్రపంచము తన యీనాటి వ్యధల కాశించు పరిష్కారము తదుపరి యుగరుగ్మత కెన్నటికిని యుపయుక్తము కా జాలదు. మీరు వసియించు యుగపు టవసరములను గురించి తీవ్రముగ యోచింపుడు; మీ చర్చలను దాని యావశ్యకతల మీదను, అవసరముల మీదను కేంద్రీకరింపుడు.

అగణిత మహావేదనలతో సమస్త మానవజాతియు నెటు లావృతయైనదో మేము బాగుగ గ్రహియింప గలము. అది తన యస్వస్థతా పర్యంకముపై తీవ్రవేదనలతో, భ్రమలు తొలగి క్షీణించుట నవేక్షింపుచున్నాము. దానికిని, అమోఘ దివ్యవైద్యునికిని మధ్యన, ఆత్మస్తుతితో మైమరచినవా రడ్డునిలచినారు. పరికింపుము, తమతోపాటుగ సమస్తమానవులను వా రెత్తీరున తమ కుతంత్రముల జాలమున చిక్కువడచేసిరో. రుగ్మతాహేతువును వా రెఱుగనూజాలరు, వారల కెట్టి చికిత్సా పరిజ్ఞానమునూ లేదు. వారు, అవక్రులను వక్రబుద్ధులుగ నెంచినారు, తమ మిత్రుని శత్రువని భ్రమసినారు.

ఈ కారాగారవాసి మధురగీతికి మీ వీనుల నొగ్గుడు. లెండు, దైవవశమున, గాఢనిద్రాళువులు జాగృతులగుదురేమో; మీ గళముల నెత్తుడు. వచించు: ఓ మృతప్రాయులారా! దివ్యౌదార్యహస్తము జీవజలమును మీ కనుగ్రహింపుచున్నది. త్వరనొంది, సంతుష్టిగ నాస్వాదింపుడు. ఈ దివ్యయుగమున పునర్జీవితు డెన్నటికిని మృతినొందడు; మృతు డెన్నటికిని జీవింపడు.

CVII

సకల కరుణాన్వితుడును, నీ ప్రభుడును నగు ఆయన, సమస్త మానవజాతిని యేకైకాత్మగ, ఒకే దేహముగ నవలోకింపవలెనను యిచ్ఛను తన మానసమున నిలుపుకొనియున్నాడు. సృజిత దివ్యయుగముల నన్నింటినీ క్రమ్మివేయు యీ దివ్యయుగమున భగవంతుని మహదనుగ్రహ, కారుణ్యముల యందున నీ వంతును సాధింప వేగిరపడుము. భగవద్విషయసాధనాకాంక్షతో, తనకున్నదాని నంతయు పరిత్యజించు మనుజునికై ప్రతీక్షించు సమ్మోద మెంత మహత్తరము! అట్టి మానవుడు దైవానుగ్రహీతుడని ధృవీకరింపుచున్నాము.

CVIII

ఓ జనులారా! మేమొక నిర్దిష్ట వ్యవధిని మీకు నిర్ధారించినాము. నిర్ణీతఘడియకు భగవంతు నాశ్రయించుటయందున మీరు వైఫల్యము నొందిరేని, ఆయన, నిక్కముగ, మిమ్ములను కఠినముగ నియంత్రించి, మిమ్ములను కల్లోలితులం జేయుట కన్నిదెసలనుండియు దుర్భరవేదనలను కలిగించును. వాస్తవమున కప్పుడు, మీ ప్రభుడు మీకు విధియించు దండనమెంత తీవ్రముగ నుండునో!

CIX

ఓ కమాల్‌! ఈ దివ్యయుగమున, భగవంతుని మహౌదార్యానుగ్రహమున, నశ్వర మానవుని దృష్టికి తా నందుకొనగల శిఖరములింకనూ, అనావిష్కృతములే. అస్తిత్వప్రపంచమున కట్టి యావిష్కరణాసామర్ధ్య మితఃపూర్వ మెన్నడును లేదు; ఇప్పుడును లేదు. అయినను, ఘనతర మహదనుగ్రహ మొక్కటి, ఆయన యానతిన, మానవులకు ప్రత్యక్షీకృతమగు దివసము చేరువ యగు చున్నది. ఆయనకు వ్యతిరిక్తముగ దేశముల సేనలు శ్రేణులు దీరినను, భూపాలు రాయన దివ్యధర్మమును తుదముట్టింప సంఘటితమైనను, అచంచల మాయన యధికారబలము. నిక్కముగ, సత్యము బలుకుచు, అసదృశుడును, సర్వవివేకియును నగు ఆయన పథమునకు సమస్తమానవాళినీ ఆమంత్రింపుచున్నా డాయన.

సమస్త మానవులును నిత్యపురోగమనశీల నాగరికత నొక్కదానిని పురోగమింపజేయ సృజియింప బడినారు. పరమాత్ముడు నన్ను సాక్షీభూతుని గావించినాడు: వన్యమృగములవోలె వర్తించుట మానవునికి తగదు. ఆతడి యౌన్నత్యమునకు సముచిత సుగుణములు - సహనము, కరుణ, సమాదరము, లోకజనుల యెడలను, సాటివారిపట్లను అభిమానము. వచించు: ఓ మిత్రులారా! దివ్యనామధేయా ధీశుని పవిత్రానుగ్రహమున ప్రవహిల్లు యీ నిర్మలవాహినినుండి సంతుష్టిగ మీ వంతును గ్రోలుడు. నిత్యసత్య మావిష్కృతమైన హేతువును, తమ స్వీయసృష్టి కారణమును ప్రతిదేశపు జననేతలును పరిపూర్ణముగ నంగీకరించునటుల, దాని జలములయందున, నా నామధేయమున, అన్యులను పా లొందనిండు.

CX

మహాస్తిత్వ మిట్లనుచున్నాడు: ఓ మానవ బాలలారా! దైవధర్మాన్నీ, ఆయన మతాన్నీ సృష్టించటంలోగల ప్రధానఉద్దేశ్యం - మానవాళి ప్రయోజనాలను పరిరక్షించడం, మానవజాతి మధ్య ఐక్యతను పెంపొందించడం, మానవుల మధ్య ప్రేమభావాన్ని, సాహచర్యాన్ని పెంపొందించడమే. దానిని అసహ్యశత్రుత్వాలకూ, కలహానికీ, అనైక్యతకూ కారణం కానివ్వకండి, సుస్థిర నిశ్చితపునాదికి ఇది ఋజుమార్గము. ఈ పునాదిమీద యేది అభివృద్ధి పొందినా ప్రపంచపరివర్తనలు, అవకాశాలు దాని బలాన్ని క్షీణింపచేయలేవు, లేదా అగణిత శతాబ్దాల పరిభ్రమణము దాని నిర్మాణాన్ని క్రుంగదీయలేదు. ఈ యుగసంస్కరణమునకును, తదైశ్వర్య పునరుద్ధరణమునకును ప్రపంచధార్మికనేతలును, తత్పాలకు లును సమిష్టిగ నుద్యమింతు రనునది మా యాకాంక్ష. దాని యవసరములం జింతించిన పిదప, సంయుక్తముగ సమాలోచించి, సోత్సుక, సమగ్రచర్చాపూర్వకముగ, ఈ యస్వస్థ, మహాసంక్షుభిత ప్రపంచమున కావశ్యకౌషధమును ప్రయోగింపనిండు. . . . అధికారమున యున్నవారల కన్నింటను మధ్యేమార్గావలంబన మనివార్యవిధియై యున్నది. మధ్యేమార్గపు మేరలను మీరునట్టిది, లబ్ధిదాయక ప్రభావమును చూపదు. ఉదాహరణమునకు స్వేచ్ఛ, నాగరికతవంటి యంశములం బరికింపుడు. జ్ఞాను లెంత సుముఖతతో వాటి నాదరించినను, మితిమీరి యనుసరింప వడెనేని, మనుజులపై యవి దుష్ర్పభావముం జూపును . . . . భగవంతుని సంప్రీతుం గావింపుడు; తమ పాలకులును, జనవిజ్ఞాను లును, విద్వాంసులును గావించిన యుదాత్తయత్నముల ఫలితముగ ప్రపంచప్రజలు తమ యుత్తమ ప్రయోజనములను గుఱుతించునటు లొనరింపబడవచ్చును. మానవాళి తన యవిధేయత కొలది, ఎంత వరకు మౌఢ్యమున యుండును? ఎంతకాల మధర్మము కొనసాగును? అవ్యవస్థయు, అనిశ్చితియు మానవులయం దెంతదనుక రాజ్యము సేయును? ఎంతవరకు విరోధము సమాజప్రతిష్ఠను కలవర పరచును? అయ్యో, నిరాశాపవనము లన్నిదెసలనుండియు వీయుచున్నవి; మానవజాతిని విచ్ఛిన్న మెునరించి యావేదన పాలొనరించు విద్వేషము దినదినప్రవర్ధమాన మగుచున్నది. వర్తమానవ్యవస్థ దుర్భరలోపభూయిష్టముగ నగుపింపుచుండుటం జేసి, సంభవిల్లనున్న యాందోళనములకును, అనిశ్చితికిని సంకేతములను ప్రస్ఫుటముగ నిపు డవలోకింపవచ్చును. ప్రపంచజనులను జాగృతులను గావించి, వారికి తమ ప్రవర్తన పరమావధి లబ్ధిప్రదమగుటకును, వారు తమ స్థాయికి సముచితమగు దానిని సాధించుకొనుటకును అనుగ్రహపూర్వకముగ తోడ్పడుమని, భగవంతుని—సమున్నత మాయన వైభవము—అర్ధింపుచున్నాడను.

CXI

కలహించుకొనుచున్న ఓ ప్రపంచజనులారా, తత్సంబంధీకులారా! మీ వదనములను సమైక్యత దెసకు సారించి, తత్‌జ్ఞానప్రభను మీపై భాసిల్లనిండు. సమావిష్టులై, భగవంతుని నిమిత్తము, మీ కలహమూలమును పెకలించివేయుడు. అప్పుడు ప్రపంచపు టమోఘతేజస్వి శోభ, అవనీసమస్తము నావరించును; తద్వాసు లెల్లరును ఒకే నగరపౌరులును, ఏకైక సామ్రాజ్యవాసులును అగుదురు. ఈ దూషితుడు తన జీవితపు తొలినాళ్లనుండియు తన మానసమున దీనినిదక్క వేరొండు యిచ్ఛను సుభద్రము గావించి యుండనూలేదు; ఈ యాకాంక్షను దక్క వేరొండు కాంక్షను గణనము సేయనూ బోవడు. ఏ జాతీయులైనను, ఏ మతస్థులైనను, ప్రపంచజనులెల్లరును - ఒకే దివ్యమూలమునుండి తమ స్ఫూర్తినొందెద రనుటకును, వా రెల్లరును ఒకే దైవానుయాయులనుటకును సందియ మేదియు నుండరాదు. వారు నిబద్ధతను వహియించు శాసనముల వ్యత్యాసము నారోపింపవలసినది, అవి యావిష్కృతములై యుగసంబంధిత బహువిధావశ్యకతలకును, అగత్యములకును. మనుష్యవైపరీత్య పర్యవసానములగు యేకొన్నియో దక్క, అవి యన్నియూ దైవాదేశితములే; ఆయన దివ్యేచ్ఛా, పరమ లక్ష్యప్రతిఫలనమే. లెండు, విశ్వాసశక్త్యాయుధులై, మీయం దనైక్యతా బీజావాపములైన మీ శుష్కోహా ప్రతిమలను శకలములను గావింపుడు. మిమ్ములను సంఘటితపరచి, సమైక్యమొనరించు దానికి బద్ధులు కండు. నిక్కముగ, మాతృగ్రంథము మీ కనుగ్రహించి యావిష్కృత మొనరించిన మహోదాత్త దివ్యవచన మిది. వైభవాన్వితజిహ్వ తన యశోవాసమునుండి యిందులకు సాక్ష్యమును వహియించును.

CXII

పలు సుదీర్ఘ వత్సరములుగ ప్రపంచము నల్లకల్లోల మొనరించిన యలజడులనూ, తత్ర్పజలయం దలముకొనిన కలవరమునూ వీక్షింపుము. అది యుద్ధవిధ్వంసిత యగుటయో, ఆకస్మిక, అనూహ్యోపద్రవపీడిత యగుటయో జరిగినది. ప్రపంచము విషాదవ్యాకులములతో నావరింపబడిననూ, తత్కారణమేని, తన్మూలమేని యేమైయుండునోయని యోచించుట కెవ్వడును యత్నింపలేదు. నిజోపదేశకు డుపదేశపూర్వకముగ నొక వాక్కు నుచ్చరించిన యపుడెల్ల, వా రెల్లరును, ఆయన నొక కుచేష్టాచాలకునిగ దూషించి, ఆయన ప్రతిపాదనము నెట్లు తిరస్కరించిరో తిలకింపుము. ఎంత భయానక మెంత విస్మయపూర్వక మట్టి ప్రవర్తన! ఏ యిరువురును బాహ్యముగను, అంతర్గతముగను మమేకమైనారని చెప్పనలవికాదు. సమైక్యతాసామరస్యముల నిమిత్తమే యెల్లరును సృజితులైనను, విద్వేషప్రతీకార దృష్టాంతము లెల్లెడల బ్రస్ఫుటము లగుచున్నవి. మహాస్తిత్వ మిట్లనుచున్నాడు: “ఓ ప్రియతములారా! ఐక్యతాపటవేశ్మము నిర్మితమైనది; మీ రొండొరుల నపరిచితులుగ భావించుకొన వలదు. మీ రొకే వృక్షఫలములు; ఒకే శాఖపత్రములు. న్యాయజ్యోతి ప్రపంచముపై తేజరిల్లి, దానిని నియంతృత్వ ప్రక్షాళిత మెునరింపవచ్చునను యాశ మా కున్నది. సమస్తమానవాళి మహోన్నతాశయము లను ప్రవృద్ధినొందించు దానికి తమ్ము తా మర్పించుకొనుటకై, భగవంతుని—సమున్నత మాయన వైభవము—శక్తికి ప్రతీకలైన ప్రపంచపాలకులును, రాజన్యులును సమాయత్తులై, దృఢముగ సంకల్పించుకొనిరేని, మానవాళియందున న్యాయసామ్రాజ్యము నిస్సంశయముగ సంస్థాపితమై, తత్‌జ్యోతిఃప్రకాశము, అవనియం దెల్లెడల విస్తరింపవచ్చును. మహాస్తిత్వ మిట్లనుచున్నాడు: ప్రపంచపు స్థిరత్వ, క్రమరీతుల నిర్మితి, శిక్షాబహూకృతులనబడు స్తంభద్వయముపై యాధారితమైయున్నది, దాని పైననే యవిచ్ఛిన్నముగ పరిపోషితమగుచుండును . . . . మరియొక లేఖన భాగమునం దిటుల వ్రాసినా డాయన: ఓ ప్రపంచపాలకవర్గమా, శ్రద్ధగ నాలకింపుము! విజయసాధన సామర్ధ్యపరముగ, న్యాయవిజ్ఞతల శక్తికి సాటిరాగల శక్తి, భువిపై యింకొకటి లేదు. తన కభిముఖముగ విజ్ఞతాకేతనమును వివృతమెునరించుకొని, న్యాయసేనాదళ పరివేష్టితుడై పరాక్రమించు రాజన్యుడు ధన్యుడు. నిక్కముగ, ప్రశాంతతా ఫాలమును, భద్రతావదనమును - హవణించు భూషణ మాతడు. నియంతృత్వ మేఘాచ్ఛాదితుడైన న్యాయభానుడు తన దీప్తిని మనుజులపై ప్రసరించి యుండిన, ఇలాతల మఖండముగ పరివర్తితమైయుండెడి దనుట కెట్టి సందియమును లేదు.

CXIII

దివ్యనగర స్థితుడవైన ఓ రాయసచివా, భగవంతుని దివ్యధర్మపు టంతిమలక్ష్యమును నా యధీనమునం దుంచుకొంటినని భావింపుచుంటివా? నా కారాగారవాసమో, నా కొనరింపబడిన పరాభవమో, మరి నా సమాప్తియో, నా సర్వనాశనమో దాని గమనమును మరల్పగలవని యనుకొను చుంటివా? హీనము, నీవు నీ మానసమున యూహించినది! నిక్కముగ, హృదయము కల్పించు వ్యర్ధోహల ననుసరించువాడవీవు. ఆయన దక్క అన్యదైవము లేడు; తన దివ్యధర్మమును ప్రత్యక్షీకృత మొనరించుటకును, తన నిదర్శనమును ప్రవర్ధిత మొనరించుటకును, తన దివ్యాభీష్టము దేనినైనను - నీ స్వీయహస్తములేని, నిన్ను తిరస్కరించినవారి హస్తములేని, దాని నెన్నటికిని, స్పృశియించి, కీడు సేయ జాలనంతటి మహోదాత్తస్థాయికి - సముద్ధరింప శక్తిమంతుడాయన.

ఆయన దివ్యేచ్ఛను వమ్ముగావించునట్టి, ఆయన నిర్ణాయకపు నిర్వహణము నాపివేయునట్టి, తన పరిపాలనాధికార వినియోగమునం దాయన నవరోధించునట్టి - శక్తి, నీకున్నదని నమ్ముచుంటివా? భూ, స్వర్గములయందలి దేదైననూ ఆయన దివ్యధర్మమును ప్రతిఘటింపగలదని భ్రాంతినొందు చుంటివా? వలదు, నిత్యసత్యమగు ఆయనపై యాన! సృష్టిసమస్తమునందలి దేదియూ, ఆయన లక్ష్యమునకు విఘాతమును కలిగింపజాలదు. కావున, యావల నుంచుము నీ ప్రల్లదనమును; ఏలయన, ప్రల్లదనమే సత్యస్థానము నొందజాలదు. నిన్ను సృజియించి, పరిపోషించి, నిన్ను నీ ధర్మానుయాయులయం దొక సచివుని గావించిన యట్టి భగవంతుని - నిజముగ పశ్చాత్తప్తులై యాశ్రయించిన వారియం దొకడవు కమ్ము.

అంతియేకాదు, తన స్వీయాదేశమున భూస్వర్గస్థిత సమస్తమును సృజియించిన దాయనయేనని తెలియుము. మరి, ఆయన యాజ్ఞాసృజిత మాయనకు విరుద్ధముగ నెటుల మనగలదు? ఓ విద్వేషులారా, మీ రూహింపుచున్నదాని కన్నను భగవంతుడు మహనీయుడు, మహోన్నతుడు! ఇది భగవంతుని దివ్యధర్మమేయైన, ఏ మనుజుడును తద్విరుద్ధముగ మనజాలడు; ఇక యిది భగవత్సంబంధితము కాదేని - మీయందలి మతాధిపతులును, వారి నీతిబాహ్యాకాంక్షల ననుసరించువారును, ఆయనను ధిక్కరించిన వారును - దీనిమీద, నిక్కముగ పైచేయిని సాధింపజాలినవారే యగుదురు.

ఎఱుగవా, ఫారో కుటుంబపు మనిషియగు విశ్వాసియొకడు - పూర్వమును గురించియు, భగవంతుడు సమస్త మానవులనుండియు నెంచుకొని, తన దివ్యసందేశము నొప్పగించి, భువిపై వసియించు వా రెల్లరకును తన యనుగ్రహభాండమును గావించినయట్టి తన ధర్మదూతకు తెలిపిన దానిని గురించి యే మనెనో? నిక్కువముగ ఆయన సత్యమునే బల్కుననుచు: “తన లక్ష్యనిరూపణము లతో యిప్పటికే మీచెంతకొక డఱుదెంచి, భగవంతుడు నా ప్రభుడనినందుల కాతడిని వధియింతురా? ఆత డనృతవాదియేని, ఆతడి యనృత మాతడిదే యగును; మరి యాతడు సత్యవాదియేని, ఆతడి యెచ్చరికము నందలి కొంతయైనను మీకు వాటిల్లు,” ననినా డాతడు. ఇది భగవంతుడు తన యమోఘ దివ్యగ్రంథమున, తన పరమప్రియున కావిష్కృత మొనరించిన యట్టిది.

అయినను, మీ రాయన యాదేశమునకు వీనుల నొగ్గుటయందున వైఫల్యము నొందినారు; ఆయన శాసనము నుపేక్షించినారు; ఆయన దివ్యగ్రంథమున లిఖియింపవడిన ఆయన యుపదేశమును తిరస్కరించినారు; ఆయన కతిపయ దూరముగ తొలగబాఱినారు. ప్రతి సంవత్సరమునను, మాసము నను మీ మూలమున హతమారినవా రెందరని! సృష్టిలోచన మెన్నడును వీక్షించి యుండనివై, ఐతిహాసికు డెవ్వడును, ఎన్నడును లిఖియించియుండనివై—మీ రొనరించిన యన్యాయము లెన్నియని! ఓ అధర్మపరులారా! మీ క్రౌర్యమున యనాధలైన శిశువులును, పసికందులును యెందరని, కొమరుల గోలుపోయిన తండ్రు లెందరని! తన సోదరునికై యొక తోబుట్టు వెంతగ కృశించి యాక్రోశించినదని; తన యేకైకపోషకుడైన పతికై యొక సతి యెంతగా శోకించినదని!

మహోత్కృష్టుడును, మహోన్నతుడును నగు భగవంతుని వదనమునుండి తన నేత్రముల నెన్నడును మరల్పని ఆయనను వధియించునంతవరకు, మీ దౌష్ట్య మింతింతై యుధృతి నొందినది. అలవాటు కొలది, మానవు లొండొరులను చంపుకొనునటుల, మీ రాయనను హతమార్చితిరా! ఏది యేమైనను, ఎవ్వడును, ఎన్నడును చూచియుండని పరిస్థితులయందున మీ రాయనను వధియించినారు. ఆయనకై దివ్యలోకము లెంతయేని దుఃఖించినవి, భగవత్సామీప్యుల యాత్మ లాయన క్లేశమునకు దురపిల్లినవి. ఆయన, మీ దివ్యప్రవక్త ప్రాచీనవంశజుడు కాడా? ధర్మదూతకు ప్రత్యక్షవారసునిగ ఆయన కీర్తి, మీయందున విస్తృతవ్యాప్తి నొందలేదా? మరి, గతమును మీరెంతగ మథించి చూచినను, ఏ మానవుడును యింకొకనికి కల్గించియుండనిదానిని మీ రాయనకేల వాటిల్లజేసినారు? భగవంతునిపై యాన! మీబోటివారలను సృష్టిలోచన మెన్నడును విలోకించి యుండలేదు. మీ దివ్యప్రవక్త ప్రాచీనవంశ వారసుని వధియించి, మీ విశిష్టపీఠములపై యాసీనులై యుల్లాసమున కేరింత లాడుదురా! మీ యెదుటి వారికిని, మీ శాపమును శపియించినవారికిని మీరు శాపనార్ధములను బెట్టినారు; ఎన్నడును, మీ యకృత్యముల నెఱుగరైతిరి.

మీ నిర్ణయమున ధర్మబద్ధులు కండు. మీరు శపియించి, కీడొనరించిన వారు మీకు భిన్నముగా వ్యవహరించిరా? మీరు మీ దివ్యప్రవక్త వంశజుని హతమార్చినయటుల, వారుసైతము తమ దివ్యప్రవక్త వంశస్థుని వధియింపలేదా? వారి ప్రవర్తనవంటిదే కాదా, మీ ప్రవర్తనయు? మానవులయందున కలహములకు అంకురార్పణ మొనరించు మీరు, వారికన్నను విభిన్నులమని చెప్పుకొనెదరేల?

మీ రాయన ప్రాణము దీసినయపు డాయన యనుయాయులయం దొకడు, ఆయన మృతికి ప్రతీకారము దీర్ప నుద్యుక్తుడైనాడు. ఎఱుగడు మనుజుల నాతడు; గుఱుతింపలే దాతడు రచియించిన పథకము నెవ్వరును. తుదకు, పూర్వనిర్ణాయకమునకే పాల్పడినా డాతడు. కావున, ధర్మముగ నిర్ణయింతు రేని, మీరు పాల్పడినవాటికి నిందను అన్యులకుగాక, మీ కంటగట్టుకొనుటయే మీకు యుక్తము. యావత్ర్పపంచమునను మీవలె వర్తించినవా డెవ్వడు? సకల లోకాధీశుడగు ఆయనపై యాన, ఎవ్వడును లేడు!

మీరు గ్రహియింపగల్గితిరేని, అవనిపైనున్న సమస్తపాలకులును, రాజన్యులును తమ దివ్యప్రవక్తల వంశజులను, పవిత్రమూర్తులను గౌరవించి యాదరింతురు. తద్భిన్నముగా, మీ రెన్నడును, ఏ మనుజుడును పాల్పడియండని కృత్యములకు బాధ్యులైనారు. ప్రతి విజ్ఞతాయుత హృదయమును విషాదభరిత మొనరించినవి మీ యకృత్యములు. మీ రింకనూ, మీ యజ్ఞానముననే మునిగి యున్నారు, మీ చర్యాక్రౌర్యత నెఱుగుటయందున వైఫల్యము నొందినారు.

మేము మీ విరోధమును సహేతుక మొనరించు దానికి పాల్పడకున్నను, మాపైకి విజృంభించు నంతటి మూర్ఖత్వమున మీరు వ్యవహరింపుచు వచ్చినారు. మిమ్ము సృజియించి, మీకు రూపునిచ్చి, మిమ్ము శక్తిని సముపార్జించుకొనజేసి, ఆయనకు తమ నర్పించుకొనిన వారితో మిమ్ముల ననుసంధాన మొనరించిన దైవమునకు మీరు భీతిల్లరా? మూఢత్వమునం దెన్నినాళ్లుందురు? ఎంత కాలము యోచింపనొల్లరు? ఎంతకుముందుగ సుషుప్తిని విదళించుకొని యలక్ష్యజాగృతులగుదురు? ఎంతకాల ముందురు, సత్యము నెఱుగక?

నీ హృదయమున యోచనచేయుము. నీ వ్యవహరణ మెట్లున్నను, నీ హస్తక్రియ లెవ్వియైనను - దైవాగ్నిని చల్లార్చుటయందేని, ఎగసిపడు నిత్యత్వ సంద్రములయందున నిమజ్జనులైన వారిని తన దీప్తితో నావరించి, ఆయన యేకత్వమును నిజముగ విశ్వసించి, సమర్థించునట్టివారల నాకర్షించిన యాయన దివ్యావిష్కరణ జ్యోతి నార్చుటయందేని - సఫలుడవైతివా? భగవంతుని హస్తము మీ హస్తముల కెగువ దనియు, ఆయన యప్రతిహతనిర్ణయము మీ సకలతంత్రముల నధిగమించుననియు, ఆయన తన సేవకులకన్ననూ సమున్నతుడనియు, ఆయన దివ్యలక్ష్యమున కాయనయే సరియనియు, ఆయన తా దలచిన దాని నొనరించుననియు, తా దలచిన దేదియైనను దాని కాయన ప్రశ్నితుడు కాడనియు, తా నిచ్చగించుదానినే ఆయన యాదేశించుననియు, ఆయన మహాసత్త్వుడనియు, సర్వశక్తిమంతుడనియు - మీ రెఱుగరా? అయినచో, ఇది సత్యమని విశ్వసింతురేని, వేధించుట నాపివైచి, ఇక శాంతింతురా?

నేను మీ వ్యవహారములయం దెన్నడును జోక్యము చేసికొన యత్నింపకున్నను, మీ రనునిత్య మెుక నూతన దుర్నయమునకు పాల్పడుచు, పూర్వము నాతో వ్యవహరించినయటులే, ఇప్పుడు సైతము వర్తింపుచున్నారు. నేను మిమ్ముల నెన్నడును కాదననూలేదు, మీ శాసనముల నధఃకరింపనూలేదు. వీక్షింపుడు, తుదకు నే నీదూరభూమియం దెవ్విధముగ మీచే కారాగారబద్ధుడ నైతినో! అయినను, మీ హస్తములైనను, అవిశ్వాసుల హస్తములైనను యేమేమి యొనరించినను, అవి పూర్వమువలె, భగవంతుని దివ్యధర్మమును మార్చుటయో, ఆయన విధానములను సవరించుటయో యెన్నటికినీ చేయవని నిశ్చయ ముగ దెలియుడు.

ఓ పారశీక ప్రజలారా! నా యెచ్చరికము నాలింపుడు. నేను మీ హస్తముల యందున నిహతుడనైతినేని, నా మరణముతో శూన్యమైన పీఠము నధిష్ఠించు వాని నొకనిని భగవంతుడు నిక్కముగా అవతరింపజేయును; ఏలయన, పూర్వవిధిని భగవంతుడు నిర్వహించిన రీతి యది; ఇక, ఆయన వ్యవహార సరళియం దెట్టి వ్యత్యాసమునూ మీ కగుపింపదు. భగవంతుని భువిపై భాసిల్లునట్టి, ఆయన జ్యోతిని మీ రార్పజూతురా? భగవంతుడు మీ కాంక్షకు ప్రతికూలుడు. ఆయన జ్ఞానమును మీ హృదయముల లోతులలో మీ రసహ్యించుకొనినను, ఆయన దానికి పరిపూర్ణతనిచ్చును.

ఓ అమాత్యా, ఇంచుక నిదానించి, యోచింపుము; నీ నిర్ణయమున నిష్పాక్షికుడవు కమ్ము. రాయసచివుల యెదుట మమ్ముల నపకీర్తి పాల్జేయుట యందునను, నీ యభీష్టములను నెరవేర్చుకొనుట యందునను, నిజమును వక్రీకరించుటయందునను, మాపై దూషణలను గావించుటయందునను నీ వొనరించినదెల్లయు సరియైనదేనని నీ వనుకొనుటకు, మేము పాల్పడిన యకార్యమేమి? ఇమామ్‌ హుసేన్‌ బలిదాన సంస్మరణ సమయమున మేము నీ తండ్రి యింట నీ కెదురగుట తప్ప, మన మొకరికొకర మెన్నడును తటస్థపడిన వారము కాదు. తత్సందర్భములయందున – సంభాషణవశమున నేమి, చర్చాపూర్వకముగ నేమి - స్వీయాభిప్రాయములను, స్వీయవిశ్వాసములను యెదుటివారికి వ్యక్త పరచు యవకాశ మెవ్వరికిని లేకపోయినది. సత్యసంధుడవేని, నా వాక్కుల యథార్థమునకు నీవు సాక్ష్యమును వహియింతువు. నీవు నా యాంతర్యము నెఱుగుటకైనను, వేరొకరు తెలిసికొనుటకైనను నేను యే సమావేశములకును వెడలియుండలేదు. మరి, నా ముఖతః నా వాఙ్మూలము నాలింపకయే, నాపై నీ తీరుపునెట్లు ప్రకటించితి వీవు? “నీ కెదురగు ప్రతివానిని, ‘నీవు విశ్వాసివి కా,’ వను సంబోధనతో పల్కరింపకు,” మను భగవంతుని—సమున్నత మాయన వైభవము—వాక్కులను నీ వాలింపలేదా? “తమ ప్రభుని ముఖావలోక నాభిలాషతో, ఉదయ సాయంసమయములయం దాయనకు మొఱ వెట్టుకొను వారి నావలకు ద్రోసివేయకు.” నిక్కముగ, భగవద్ర్గంథ నిర్దేశితమును విస్మరించియు, ని న్నొక విశ్వాసిగ నెంచుకొనుచుంటివే!

నీ వేమి యొనరించినను, నీవలనను, అన్యులవలనను భగవదేకత్వ విశ్వాసియైన యెవ్వనికేని దుర్భరమేయగు వేదనను మే మొందినను, నీపట్ల నైనను, ఇంకెవ్వనిపట్లనైనను యెట్టి దుర్భావమూ నాకు లే దనుటకు భగవంతుడే నాకు సాక్షి. భగవంతుని హస్తమున దక్క , నా ధర్మ మింకెవ్వని హస్తమునను లేదు; నా విశ్వాస మాయనయందున దక్క, అన్యునియందున లేదు. ఈనాడు గర్వాతిరేకమున తమ సామీప్యునియెడ దర్పము జూపు వారి దినములవలె, నీవి సైత మచిరకాలమునకే ముగిసిపోవును. సత్వరమే, భగవంతుని సమక్షమున మీరు సమీకృతులగుదురు; మీ కలాపములపై ప్రశ్నితులగుదురు; చేజేతుల మీ రొనరించిన దానికి పరిహారము నొందుదురు; దుష్కర్ముల యావాసము దుర్భరమే!

భగవంతునిపై యాన! నీ వొనరించినదేమో యెఱిగియుంటివేని, నీ గురించి, నిశ్చయముగ నెంతయేని శోకించియుందువు, భగవంతుని యాశ్రయమునకై పరువిడి యుందువు; నిక్కముగ భగవంతుడు మహోదారుడును, సకలవదాన్యుడును అగుటం జేసి, ఆయన నిన్ను మన్నించునంత దనుక, నీ జీవితకాల మంతయూ వ్యధార్తుడవై యాక్రోశించియుందువు. అయినను, నీ హృదయ పూర్వకముగా, నీ యాత్మేణా, నీ యంతరంగమున ప్రాపంచిక వ్యామోహమగ్నుడ వగునంతగ, నీ మృత్యుఘడియ వరకు, మూర్ఖముగా నీ యజ్ఞానముననే యుందువు. నీకు మా యావిష్కృతమును, నీ నిష్ర్కమణానంతర మెఱిగెదపు; అణువుకన్నను అల్పములైనను, అనల్పతరములైనను - భువిపై వసియించు సకల జనకృత్యములును లిఖితములైనయట్టి ఆ దివ్యగ్రంథమున, నీ చేష్టలన్నియూ ప్రస్తావితములై యుండుటం దెలియుదువు. కావున, నా యుపదేశము నలక్ష్యము సేయక, నీ మనఃశ్రవణానుసారముగ నా ప్రసంగము నాలింపుము. నా వాక్కుల పట్ల అజాగరూకుడవు కావలదు, నా సత్యమును తిరస్కరించు వాడవూ కావలదు. నీ కనుగ్రహీతములైన వానితో మురియవలదు. నీకును, నీవంటి వారలకును యీ ప్రపంచద్వారములను, అందలి సకలాభరణములను తెఱచియుంచిన యటుల “వా రిక తమ హెచ్చరికను మరచినయపుడు, సమస్త విషయద్వారములను వారికి దెఱతు,” మను - ఆపత్సాహాయ్యుడును, సకల యశస్వియును నగు - భగవంతుని దివ్యగ్రంథస్థితావిష్కృతముపై నీ దృక్కులను సారింపుము. కావున, ఈ పవిత్రసూక్తి యుత్తరభాగమున వాగ్దత్తమైన దానికై నిరీక్షింపుము; ఏలయన, సర్వశక్తిమంతుడును, సకలవివేకియును నగు ఆయన వాగ్దానమిది—అనృతముగ నిరూపితము కాబోవని వాగ్దానమిది.

ఓ నా వినాశాభిలాషకవర్గమా! నీ వెంచుకొని, పయనించు మార్గము నెఱుగను నేను. నిన్ను భగవంతుని దెస కామంత్రింపుచున్నాము, ఆయన దివ్యయుగమును నీకు జ్ఞప్తికి దెచ్చుచున్నాము, ఆయనతో నీ పునస్సమాగమ సమాచారమును నీకు ప్రకటింపుచున్నాము, ఆయన యాస్థానమునకు నిన్ను చేరువ గావింపుచున్నాము, ఆయన యద్భుతవిజ్ఞతాచిహ్నములను నీ కనుగ్రహింపుచున్నాము; అయినను, వీక్షింపుడు! మీరు మమ్మెటుల తిరస్కరింపుచుంటిరో, మీ యసత్యపు నోటిమాటలతో మమ్మొక నాస్తికునిగ నెట్లు నిందింపుచుంటిరో, మాపై మీ కుతంత్రముల నెట్లు పన్నుచుంటిరో! ఇక, భగవంతుడు తన యౌదార్యానుగ్రహముల కొలది మా కనుగ్రహించినదానిని మీకు మేము సాక్షాత్కృత మొనరించినయపుడు మీ రందురు, అది: “వట్టి యింద్రజాల,” మని. గ్రహియించితిరేని, మీ పూర్వతరములుసైత మీమాటలనే పలికియున్నవి. తత్పర్యవసానముగ, మీరు భగవంతుని యనుగ్రహమును, ఆయన కృపను కోలుపోయినారు. భగవంతుడు మాకును, మీకును న్యాయము జెప్పు దివసము దనుక, ఎన్నటికీ వాటిని మీ రొందరు; న్యాయమూర్తులయందున, నిశ్చయముగ, సర్వోత్తము డాయన.

“భగవంతుడనని చెప్పుకొనిన దీతడే,” యని మీలోని కొంద రనినారు. భగవంతునిపై యాన! శుష్కనింద యిది. నేను కేవల మాయనయందునను, ఆయన చిహ్నములయందునను, ఆయన దివ్యప్రవక్తలయందునను, ఆయన దూతలయందునను విశ్వాసమున్న భగవత్సేవకుడను మాత్రమే. ఆయన దక్క వేరుదైవము లే డనుటకును, అన్యులెల్లరూ ఆయన యానతిన సృజియింపవడి రనుటకును, ఆయన యిచ్ఛాప్రయోగమున మలచవడి రనుటకును నా జిహ్వయు, నా హృదయమును, నా యంతర్బహిరస్తిత్వములును సాక్ష్యము నిచ్చును. సృష్టికర్తయును, మృతులకు పునఃప్రాణదాతయును, స్ఫూర్తిప్రదాతయును, సంహారకుడును నగు ఆయనదక్క అన్యదైవము లేడు. భగవంతుడు తన యౌదార్యము కొలది, నాకు ప్రసాదించిన యనుగ్రహములను సుదూర భూముల కెఱుకపరచువాడను నేను. ఇదియే నా యతిక్రమణమేని, నిక్కముగ, అతిక్రామకులయందున ప్రథముడను నేనే యగుదును. నేనును, నా వారలును మీ దాక్షిణ్యముపై యాధారపడి యున్నాము. మీ యిచ్ఛానుసార మెునరింపుడు, సంకోచింపవలదు; తద్వారా, నేను నా ప్రభుడగు భగవంతుని చెంతకు మరలి, మీ వదనముల నిక యేమాత్రమును వీక్షింపజాలని తావును జేరవచ్చును. యథార్థమున కిది నా ప్రియతమాభిలాష, నా ప్రగాఢతమాభీష్టము. నిక్కముగ, భగవంతుడు సమగ్రసంవేదియు, సూక్ష్మగ్రాహియు.

ఓ అమాత్యా! భగవంతుని కనుసన్నలయం దున్నయటుల ని న్నూహించుకొనుము. నీ కాయన యగుపింపకున్నను, నిజమున కాయన స్పష్టముగా ని న్నవలోకించును. నిశితదృక్కువై, మా దివ్యధర్మము గురించి నిష్పాక్షికముగ తీర్మానింపుము. న్యాయస్థుడవైతివేని, మాపైకి విజృంభించి ప్రజల యెదుట మమ్ముల నపనిందల పాల్జేయుమని - మేము పాల్పడిన దెయ్యది, నిన్ను ప్రేరేపించినది? రాజాజ్ఞానుసారముగ తిహరానును వీడి, ఆయన యానతితో మా నివాసమును యీరాకునకు దరలించు కొనినాము. ఆయనతో నే ననుచితముగ వర్తించి యుండినచో, నన్నేల విముక్తుని గావించినా డాయన? మరి, నిర్దోషినేయైన పక్షమున, మమ్ము - మీ ధర్మానుయాయులయం దెవ్వడును అనుభవించి యుండని దురవస్థల పాలొనరించితిరేల? ఈరాకునకు నా యాగమనానంతరము, నా కార్యములయం దేదైనను ప్రభుత్వాధికారమునకు భంగము వాటిల్ల జేయునట్లుండెనా? ఎవ్వడు, మా ప్రవర్తనమున నిందార్హమైన దానిం గనుగొంటి ననువాడు? తత్ర్పజలను గురించి నీవే విచారణ మొనరింపుము; నిజమును గ్రహియించిన వాడవగుదుపు.

ఆ అమాత్యుడు—మదిరాలోలుడును, తన దైహికవాంఛలం దీర్చుకొనినవాడును, క్రౌర్యత కొడిగట్టినవాడును, నీతిబాహ్యుడై, ఈరాకు నవినీతిమయ మొనరించినవాడునునైన యాతడి నామప్రస్తావనము, మా లేఖిని కసహ్యము—మీ ప్రభుతకు ప్రతినిధిగా యేతెంచునంతదనుక, పదకొండు వత్సరములపాటు, తద్భూభాగమున మేము వసియించినాము; విచారణ జేయనెంచితివేని, సత్యము నెఱుగనెంచువాడవేని బాగ్దాదువాసులయం దెందరో, ఇందులకు సాక్ష్యమును వహియింతురు. ఆతడు సాటివారి సొత్తు నక్రమముగ సంగ్రహించి, భగవంతుని సమస్తాదేశముల నుపేక్షించి, ఆయన నిషేధించినవాటిని వర్ధిల్లజేసిన వాడు. తుదకు, స్వీయవాంఛావిధేయుడగుచు, మామీదికి విజృంభించి, అధర్మమార్గముల నవలంబించినా డాతడు. నీకు బంపిన లేఖయం దాతడు మమ్ము నిందించినాడు; ఇక, నీ వాతడిని నమ్మి, ఏ నిదర్శమునేని, విశ్వసనీయసాక్ష్యమునేని యడుగక, ఆతడి మార్గమునే యనుసరించినావు. అసత్యమునుండి సత్యము నీ దృష్టి కానుటకేని, నీ వివేచనకు స్పష్టత జేకూరుటకేని ఆతడినుండి యే వివరణనూ నీవు కోరనూ లేదు, విషయశోధనమునకేని, నిజనిర్ధారణమునకేని యత్నింపనూ లేదు. ఆత డెట్టివాడను సత్యము నీ కెఱుకవడి, విషయము ప్రస్ఫుట మగునేమో, ఈరాకునందలి యప్పటి సచివులనేని, నగరపాలకుడినేని, తదున్నత సలహాదారుడినేని యడిగి, లెస్సగ నీవే దెలిసికొనుము.

భగవంతుడు మా సాక్షి! మే మెట్టి పరిస్థితులయందునను ఆతడినేని, అన్యులనేని వ్యతిరేకింపలేదు. భగవంతుని న్యాయసూత్రములను సర్వావస్తల యందునను పాటించినాము, అలజడుల నెన్నడును తెచ్చిపెట్టినవారము కాము. ఇందులకు కాతడే సాక్ష్యమును వహియించును. మాపై పట్టును సాధించి, మమ్ము పర్షియాకు ద్రిప్పిపంపివైచినచో, తాను తన కీర్తిప్రతిష్ఠలను పెంపొందించు కొనవచ్చునని యాతడి యుద్దేశ్యము. నీవుసైత మదే నేరమునకు, అదే లక్ష్యముతో పాల్పడినాడవు. సర్వోన్నతప్రభుడును, సర్వజ్ఞడును నగు భగవంతుని దృష్టి యందున - మీ యిరువురి స్థానము సమానమే.

ఈ వాక్కులతో నిన్ను సంబోధించుటయందున మా యుద్దేశ్యము, మా దుఃఖభారము నుపశమింపజేసికొనుటయో, మాకై యెవరితోనో మధ్యవర్తిత్వమును నెరపించునటుల నిన్ను ప్రభావితు నొనరించుటయో కాదు. కానే కాదు, సకలలోకాధీశుడగు ఆయనపై యాన! బహుశః నీ వొనరించిన దానిని గ్రహియింతువేమోననియూ, మాకు నీవు కలిగించిన వ్యధ నన్యులకు కలుగజేయక మానెదవేమో ననియూ, నిన్నును, సకలవస్తుజాలమును సృజియించిన భగవంతుని మ్రోల సత్యముగ పశ్చాత్తప్తులైన వారియం దొకడవగుదువేమోననియూ, భవిష్యత్తున వివేచనాపూర్వకముగ వ్యవహరింతువేమోననియూ - యావద్విషయమునూ నీ ముందట యుంచినాము. మరి, నీ వొందియున్న సమస్తమున కన్నను, రోజులు చేరువయైన నీ మంత్రిత్వమునకన్నను, నీ కిదియే మేలుతరము.

ఉద్దేశ్యపూర్వకముగ, అన్యాయము నుపేక్షింప సంప్రేరితుడవగుదువేమో, జాగ్రత్త. న్యాయముపై నీ మనస్సు నుంచుము. భగవంతుని దివ్యధర్మమును వ్యత్యస్తము గావింపవలదు. ఆయన దివ్యగ్రంథావిష్కృతాంశములపై దృక్కులను సారించినవాడవు కమ్ము. ఏ స్థితియందునను, నీ దుర్వాంఛాప్రేరణముల ననుసరింపవలదు. నీ ప్రభుడును, ప్రదాతయును, దివ్యయుగప్రాచీనుడును నగు భగవంతుని శాసనమును పాటింపుము. నిస్సంశయముగ ధూళిపాలౌదు వీవు; సమ్మోదితుడ వగుచున్న సకలాంశములవలెనే నశియింతు వీవు. ఇది సత్యవైభవ సమన్విత దివ్యజిహ్వ వాకృచ్చిన యట్టిది.

జ్ఞప్తి లేదా నీకు, నీవు తన హెచ్చరికను లక్ష్యము సేయువాడవు కావచ్చునని గతమున భగవంతుడు గావించిన యెచ్చరికము? ఆయన:“దీని నుండి నిన్ను సృజియించినాము; దీనికే నిన్ను త్రిప్పిపంపుదుము; రెండవ పరి నిన్ను వెలికిదెత్తు,” మనినాడు; నిక్కముగా, సత్యమునే బల్కు చున్నాడాయన. మాన్యులేని, సామాన్యులేని—భువిపై వసియించువా రెల్లరకును భగవంతుడు విధియించినదిది. కావున, మంటినుండి సృజితుడై, దానికే త్రిప్పిపంపబడి, దాని నుండియే మరల వెలికిదీయబడువానికి - భగవంతుని యెదుట గర్వాతిరిక్తుడగుటయేని, ఆయన ప్రియతములను, వారి యెదుటనే, అహంభావయుతుడై నిరసించుట యేని, దర్పముతో నహంకరించుటయేని - యుక్తము కాదు. అంతకన్నను భగవదేకత్వావతారములకు వశులగుటయును, భగవంతునికై సర్వమును పరిత్యజిం చినయట్టి, మనుష్యదృష్టి నాకట్టుకొని, సమస్తయశస్వియును, సకలప్రశంసితుడును నగు భగవంతుని పథమునుండి పెడత్రోవకు తమను ప్రేరేపించు వాటిని విదళించుకొనినయట్టి విధేయుల నాదరించుటయును - నీకును, నీవంటివారికిని సముచితము. నీకును, తమ పూర్తి నమ్మికను, పూర్ణవిశ్వాసమును తమ ప్రభునియం దుంచినవారికిని లబ్ధిప్రదాయినిని, ఇట్లు నీ కనుగ్రహింపు చున్నాము.

CXIV

ఓ రాజన్యా, సత్యవాదియును, భగవంతుడు నీ కనుగ్రహింప నెంచిన వాటికి తనకు పరిహారము నిమ్మని నిన్నడుగనివాడును, నిర్దోషియై బుుజుపథమున పయనించు నాతడును నగు ఆయన ప్రసంగము నాలింపుము. నిజసమ్మోదమునకు గొనిపోవు మార్గమైన ధర్మపథము శుభప్రదమగు వారియం దొకడ వగుదువని, దానిని నీకుచూపు నీ ప్రభుడైన భగవంతుని దెసకు ని న్నామంత్రింపు చున్నవా డాయనయే.

ఓ రాజన్యా, దురపేక్షాకాంక్షల ననుసరింపుచు, తమ హస్తస్థిత మెునరింప బడినదాని నావలవైచి, తమయందున యుంచబడిన విశ్వాసమునకు ప్రత్యక్ష విఘాతము గల్పించిన యమాత్యులతో పరివేష్టితుడవు కాక, జాగరూకుడవు కమ్ము. నీపట్ల భగవంతుడు వదాన్యుడైనయటుల, నీవు సైత మన్యులయెడ వదాన్యుడవు కమ్ము; నీ ప్రజాప్రయోజనములను, ఇట్టి మంత్రుల పాలొనరింప వలదు. దైవభీతి నలక్ష్యము సేయక, ధర్మవర్తనుడవు కమ్ము. ధర్మ, విశ్వాస సౌరభము నెవ్వరినుండి యాఘ్రా ణింతువో, అట్టి యమాత్యులతో పరివేష్టితుడవై, వారితో మంత్రాంగమును నెఱపి, నీ దృష్టియం దుత్తమ మైన దాని నెంచుకొని, ఔదార్యవర్తనుడవు కమ్ము.

భగవంతుని విశ్వసింపనివా డెవ్వడైనను - విశ్వసనీయుడును, సత్యసంధుడును కాడని నిశ్చయముగ దెలియుము. యథార్థముగ, సత్యమిది; నిశ్చయసత్యమిది. భగవంతునియెడ కపటముగ వర్తించు నాతడు, తన పాలకునిపట్లను కపటముగనే వర్తించును. అట్టి వానిని దౌష్ట్యమునుండి యేదియూ మరల్పజాలదు, తన సామీప్యుని వంచించుటయం దాతడి నెద్దియును ప్రతిరోధింపజాలదు, ధర్మముగ వర్తించుట కాతడి నేదియూ సంప్రేరితు నొనరింపజాలదు.

నీ దేశీయ వ్యవహారపగ్గములను పరహస్తగతము గావింపకయు, నీ విశ్వాసమును చూరగొనని మంత్రులను విశ్వసింపకయు - జాగరూకుడవుకమ్ము; ఉపేక్షాభావమున వ్యవహరించువాడవు కావలదు. నీయెడ తిరోఙ్ముఖ మనస్కులను విడనాడుము; వారియందున నమ్మిక నుంచవలదు. వ్యవహారములను—నీవియైనను, నీ ధర్మానుయాయులవైనను—వారికి ఒప్పగింపవలదు. తోడేలును భగవత్ర్పజాసంరక్షణ కనుమతింపక, ఆయన ప్రియతముల భవితను దుశ్చింతుల దాక్షిణ్యమునకు వదలివేయక - జాగరూకతను వహియింపుము. భగవచ్ఛాసనముల నుల్లంఘించువారు- తా మవలం బించు ధర్మముపట్ల విశ్వసనీయులగుదురనియో, చిత్తశుద్ధితోనుందురనియో ఆశింపవలదు. వారిని దూరముగనుంచి, వారి దుర్వ్యూహములును దుర్వర్తనములును నీకు హానిని సేయకుండునటుల పటిష్టమగు రక్షణ నేర్పరచుకొనుము. వారికి విముఖుడవై, నీ ప్రభుడును, సకలయశస్వియును, మహోదారుడును నగు భగవంతునిపై నీ దృష్టిని కేంద్రీకరింపుము. పరమాత్మునకు తనను సంపూర్ణముగ నర్పించుకొనువానికి, ఆయన నిక్కముగా తోడైయుండును; తనయందున పరిపూర్ణవిశ్వాసమునుంచు వానిని, ఆతడికి కీడొనరించు దేనినుండియైనను, భగవంతుడు నిశ్చయముగా రక్షించును; దుష్టుడగు ప్రతి విద్రోహి దౌష్ట్యమునుండియు నాతనిం గాపాడును.

నా ప్రసంగమునకు శ్రవస్సునొగ్గి, నా యుపదేశమును పాటించియుండిన పక్షమున, నిన్ను యావద్భువియందలి యేమనుజుని కుతంత్రములైనను, ఎన్నడైనను స్పృశియింపలేని, నొప్పింపజాలని యంతటి మహోన్నతస్థానమునకు భగవంతుడు నిన్ను సముద్ధరించియుండును. ఓ రాజన్యా, నీ యంతఃకరణ పూర్వకముగ, నీ సంపూర్ణాస్తిత్వముతో భగవంతుని ధర్మసూత్రముల ననుసరింపుము; నిరంకుశుని తీరుల ననుసరింపవలదు. నీ ప్రజావ్యవహారముల పగ్గముల నొడిసిపట్టి, నీ శౌర్యపు బిడికిటియం దుంచుకొనుము; వారలదగు దేనినైనను వైయక్తికముగ సమీక్షింపుము. నీ నుండి దేనినీ జారిపోనీయవలదు, ఏలయన, అందుననే యున్నది మహాశుభము.

యావత్ర్పంచమునుండియూ ని న్నెంచుకొని, నీ ధర్మము నవలంబించిన వారికి నిన్ను రాజును గావించిన యందులకు, భగవంతునకు కృతజ్ఞతల నర్పింపుము. ఆయన నీకు ప్రసాదించిన యద్భుతోపకృతుల నవగత మొనరించుకొని, ఆయన నామధేయము నఖండముగ ప్రకీర్తితమెునరించుట నీ కెంతయేని సముచితము. ఆయన ప్రియతముల నాదరించి, ఇక యెవ్వడును పీడింపకుండునటుల, వంచకుల కుటిలతనుండి ఆయన సేవకులను కాచి, రక్షించితివేని, ఆయనను సముచితముగ సంకీర్తించిన వాడవగుదువు. అంతియేగాక, నీవు భగవంతుని శాసనపరముగ సుస్థిరస్థానము నొందవచ్చును గనుక, వారియం దాశాసనమును ప్రవర్తిల్లజేయుట కుద్యుక్తుడవు కమ్ము. న్యాయవాహినులు నీ పాలితులయందున తమ నీరములను ప్రవహిల్లజేయు నట్లొనరించితివేని, గోచరాగోచర సేనానివహములతో భగవంతుడు నీకు నిశ్చయముగ సాహాయ్య మొనరించి, నిన్ను నీ వ్యవహారములయందున శక్తిసమన్వితుని గావించును. ఆయన దక్క వేరొండు దైవము లేడు. సృష్టి యంతయూ, తత్సామ్రాజ్యసమస్తమూ ఆయనవే. విధేయుల పూనిక లాయన చెంతకు మరలి పోవును.

నీ నమ్మికను నీ యైశ్వర్యములపై యుంచుకొనవలదు. నీ యావద్విశ్వాసమునూ నీ ప్రభుడైన భగవంతుని మహదనుగ్రహమునం దుంచుము. నీ వొనరించు యే కార్యముననైనను, ఆయనయే నీ విశ్వాసము కావలె, ఆయన యిచ్ఛావిధేయులయం దొకడవు కమ్ము. ఆయన తోడనే భూస్వర్గముల కోశాగారములన్నియును యుండుటంజేసి, ఆయననే నీకు సాహాయ్యునిగ నుండనిమ్ము; ఆయన సంపదలతో సుసంపన్నుడవు కమ్ము. ఆయన వాటిని, తా దలచువారి కనుగ్రహించును, తా నెంచువారి నుండి యుపసంహరించును. సమస్తైశ్వర్యశాలియును, సకలప్రకీర్తితుడునునైన ఆయన దక్క వేరొండు దైవము లేడు. సర్వులును ఆయన కారుణ్యద్వార సమీపమున శుద్ధ నిర్ధనులే; ఆయన సార్వభౌమత్వపు టావిష్కృతి మ్రోల యెల్లరును, అసహాయులై, ఆయన యనుగ్రహము నర్ధింతురు.

సమతౌల్యతా పరిమితుల నతిక్రమింపక, నిన్ను సేవించు వారిపట్ల ధర్మముగ వ్యవహరింపుము. వారి యవసరముల కనుగుణముగనే దక్క—తమకై సంపదలను సమీకరించుకొను, తమ దేహములను శృంగారించుకొను, తమ గేహములను ప్రవృద్ధమొనరించుకొను, తమకు లబ్ధిని గూర్పనివానిం జేకూర్చు కొను, దుర్వ్యయపరులుగ పరిగణనమునొందు నంతటి స్థాయి దనుక —వారల ననుగ్రహింపవలదు. వారియందలి యే యొక్కడును దారిద్ర్యబాధితు డగుటయో, భోగలాలసు డగుటయో సంభవింపకుండు నటుల, సుస్థిరన్యాయముతో వారియెడ వర్తింపుము. ప్రత్యక్షన్యాయ మిదియే.

ఉత్తములను, మాన్యులను పరిపాలించుటకును, వారిపై యధికారము నెఱపుటకును - అధముల ననుమతింపవలదు. మహామేధావులను, నల్పుల, అయోగ్యుల దాక్షిణ్యమునకు వదలివైచి వ్యధ నొందింప వలదు. ఏలయన, మేము నగరిని ప్రవేశించినయపు డవేక్షించిన పరిస్థితి యిది; సాక్ష్యమును వహియింతు మిందులకు. ఈ నగరవాసులు కొంద రమితభాగ్యవంతులై యనంతైశ్వర్యములతో మనుచుండ, శేషించినవారలు కడునిర్ధనులై దుర్భరదారిద్ర్యమున మ్రగ్గుట నవలోకించినాము. ఇది నీ సార్వభౌమత్వమున కయుక్తము; నీ స్థాయి కయోగ్యము.

నీకు నా యుపదేశము నంగీకృతము కానిమ్ము; భగవంతుడు నీ నామధేయమును శ్లాఘించి, యావత్ర్పపంచమునను నీ న్యాయప్రతిష్ఠను పరివ్యాప్త మొనరించునటుల, ధర్మముగ ప్రజలను పాలింప బూనుము. జాగ్రత్త, నీ ప్రజల వెచ్చముతో నీ యమాత్యులను ప్రవర్ధిల్ల జేయుదువేమో. తమ దుస్థితికి, ప్రతి ప్రభాతమునను, మనమున దురపిల్లు దీనుల, ధర్మబద్ధుల నిట్టూర్పులకు భీతుడవు కమ్ము; వారికి దాక్షిణ్యవల్లభుడవు కమ్ము. వారు, నిక్కముగ, నీ యైహిక సంపదలు. కావున, నిన్ను దోచుకొనజూచువారి దాడులనుండి నీ సంపదలను రక్షించుకొనుట నీకు యుక్తము. వారి వ్యవహారములను పరామర్శించి, వారి స్థితిగతులను ప్రతి వత్సరమును, కాదుకాదు, ప్రతి మాసమును ధృవీకరించుకొనుము; స్వీయకర్తవ్యము నుపేక్షించువారియం దొకడవు కావలదు.

భగవంతుని యమోఘ దివ్యతులను, నీ కన్నుల మ్రోలన, ఆయన సాన్నిధ్యమున నిలచినవానివలె, నిలుపుకొని, నీ జీవితపు టనుదిన, యనుక్షణ కార్యముల నా దివ్యతులయందున తూచుము. ప్రమత్తుల మానసములు ప్రకంపితములగు దివ్యదివసమున, ఏ మానవునకును - దైవభీతికొలది - నిలచుటకు శక్తి యుండని మహాదివసమున, పరిగణనమున కామంత్రితుడ వగుటకు మునుపే ఆత్మవిమర్శను చేసికొనుము.

సమస్తప్రాణుల యభివృద్ధికిని దోహదమొనరించునట్టి మహాబలయుతుడును, సర్వశక్తిమంతుడును నగు ఆయన యాదేశితములు వినా, సహజ సిద్ధముగ తనయం దేయుపకృతియు లేకున్నను, దేని కీయవలసిన దాని నద్దాని కొనగూర్చునట్టి సూర్యునివలె వదాన్యునిగ నుండుట ప్రతి రాజన్యునకును యుక్తము. సర్వోత్కృష్ట శాసకుడును, సర్వజ్ఞుడును నగు ఆయన యాజ్ఞానుసారము తమ వదాన్యతాజలధారలను ప్రతి దేశముపైనను వర్షించు మేఘముల వలె, తన దాతృత్వపరముగ రాజు- వితరణశీలియై, ఉదారవాదియై యుండవలె.

నీ రాజ్యవ్యవహారములను సంపూర్ణముగా అన్యుని హస్తగత మెునరింపక జాగరూకతను వహియింపుము. నీ విధులను నీకన్నను లెస్సగా, యింకెవ్వడును నిర్వర్తింపజాలడు. మా విజ్ఞతాన్వితవచనముల నివ్విధముగ నీకు స్పష్టము గావించి, నీవు న్యాయమను దక్షిణహస్తమునకై నియంతృత్వమను వామహస్తము నుపేక్షించి, ఆయన యుపకృతుల సముజ్జ్వలసాగరమును చేరునటు లొనరింప గల దానిని నీకనుగ్రహింపుచున్నాము. తమ పాలితులయెడ సమభావపూర్వకముగ వ్యవహ రించి, సుస్థిరన్యాయవిధానముల ననుసరించిన నీ పూర్వరాజన్యులు పయనించిన పథమిట్టిది.

భువిపై నీవు భగవంతుని ఛాయవు. కావున యంతటి మహోదాత్త, మహనీయస్థాయికి యుక్తమగు రీతిన వ్యవహరింప నుద్యమింపుము. నీకు మే మనుగ్రహింపజేసి, బోధించిన వాటి ననుసరింప మానితివేని, నిశ్చయముగ తదనర్ఘ, మహత్తర మాన్యత నుపేక్షించినవాడ వగుదువు. కావున, భగవంతునికి పరిపూర్ణముగ నిబద్ధుడవై, ప్రపంచమునుండియు, తదాడంబరములనుండియు నీ మనస్సును క్షాళన గావించుకొనుము; అన్యుని యనురక్తి నందు ప్రవేశించి, అధివసింపనీయవలదు. నీవు నీ హృదయమును, అట్టి యనురాగచ్ఛాయా సమస్తమునుండి ప్రక్షాళిత మొనరింపనంత దనుక, దానిపై భగవద్దీపికాద్యుతి తన ప్రభను ప్రసరింపచేయజాలదు; ఏలయన, ఎవ్వనికేని ఒక్క హృదయమునకు మించి భగవంతు డనుగ్రహింపలేదు. నిక్కముగా, ఇది ఆయన ప్రాచీన గ్రంథమున నిర్ణీతమై, లిఖితమై యున్నది. ఇక, భగవంతుడు రూపకల్పన మొనరించిన యటుల, మానవహృదయ మఖండమును, అవిభాజ్యమును అగుటంజేసి, తదనురాగములు సైత మఖండములనియూ, అవిభాజ్యములనియూ శ్రద్ధగా యెఱుగుట నీకు విధియుక్తము. కావున, పరిపూర్ణానురాగ ప్రపూరిత హృదయముతో, ఆయన వాత్సల్యసామీప్యత నొందుము; తన సమైక్యతాసాగరమున నిమజ్జితుడవై, తన యేకేశ్వరత్వమునకు నిజసమర్ధకుడ వగునటుల నీ కాయన సాహాయ్య మొనరింపవచ్చును గాన, ఆయన వాత్సల్యమునకు గాక, ఇంకెవ్వని యనురాగమునకును దానిని పాత్రము కానీయవలదు. భగవంతుడు నాకు సాక్షి. నిన్ను ప్రాపంచిక నశ్వరవిషయప్రక్షాళితుని గావించి, అనంతయశోసామ్రాజ్య స్థితులై, స్థిరపడువారియందున, భగవంతుని యాదేశానుసారము, నీ వొకడవగు నటుల, తత్సామ్రాజ్యప్రవేశమున నీకు దోడ్పడుటయే, ఈ వాక్కులను నీకు వెల్లడించుటయందున నా యేకైక లక్ష్యము. . . .

ఓ రాజన్యా! భగవంతునిపై ప్రమాణ మొనరింతును. నా యభిమతము, నన్ను వేధించువారిపై నీకడ యభియోగమును మోపుట కాదు. నన్నును, వారిని సృజియించి, మా స్థితిని లెస్సగ దెలియుచు, సమస్తాంశముల నవేక్షింపుచున్న భగవంతునకు నా యార్తిని, నా వ్యాకులతను చెప్పుకొనుచున్నాడను. నాతో వ్యవహరించినయటుల, ఇతరులపట్లను వ్యవహరించుటను, దైవవశమున విరమించి, నా యెచ్చరికమును లక్ష్యముసేయువా రగుదురేమోయని, వారి చేష్టల పర్యవసానములపై వారిని హెచ్చరించుటయే నా యభిలాష.

వారు సమ్మోదితులగుచున్న విలాసములును, వా రనుభవింపుచున్న యైశ్వర్యసమృద్ధియు గతియించునటులే, మమ్ము దాకిన విపత్తులును, మే మనుభవించు హైన్యతయును, మమ్ములను చుట్టు ముట్టిన బహువిధ సంక్షోభములును—అన్నియును, అంతరించును. భువియందలి మానవు డెవ్వడును తిరస్కరింపజాలని సత్యమిది. వారు గౌరవపీఠముల నాక్రమించిన దినము లంతమగునటుల, మేము ధూళియం దధివసింప నిర్బంధితులమైన దినములు సైత మంతమగును. భగవంతుడు మాకును, వారికిని - నిశ్చయముగ, సత్యముతో న్యాయము చేయును; నిక్కముగ, న్యాయమూర్తులయం దుత్తము డాయన.

మాకు వాటిల్లిన దానికి, భగవంతునికి ధన్యవాదముల నర్పింతుము; ఆయన పూర్వ మాదేశించిన, భావియం దాదేశించు వాటిని యోరిమితో భరియింతుము. ఆయన యందున నా విశ్వాసము నుంచినాడను, ఆయన హస్తములకు నా దివ్యధర్మమును స్వాధీన మొనరించినాడను. తన యందున తమ విశ్వాసము నుంచి యోరిమితో భరియించువా రెల్లరకును, నిశ్చయముగ, ఆయన ప్రతిఫలము నిచ్ఛును. సృష్టియూ, తత్సామ్రాజ్యమూ ఆయనవే. ఆయన తా నెంచు వారిని సముద్ధ రించును, తా దలచువారల నణచివేయును. ప్రశ్నింపరా దాయన చర్యలను. ఆయన, నిక్కముగా సకల యశస్వి, సర్వశక్తిమంతుడు.

ఓ రాజన్యా, నిన్నుద్దేశించి మేముగ్గడించిన వాక్కులకు చెవియెుగ్గుము. నిరంకుశునిచే నాతడి నియంతృత్వమునకు స్వస్తిని జెప్పించి, నీ విశ్వాసానుయాయులనుండి యధర్మప్రేరకులను త్రుంచివేయ నిమ్ము! భగవంతుని ధార్మికత్వముపై యాన! మే మనుభవించిన వ్యధ లెట్టివనిన, తద్వర్ణన మొనరించు యేలేఖినియైనను - ఆవేదనతో నిశ్చేష్టితయగును. వాటి పఠనావేదనను - యథార్థముగ యేకేశ్వరత్వమును విశ్వసించి, సమర్ధించువారలయం దెవ్వడును, భరియింపజాలడు. మా క్లేశము లెంతటి తీవ్రములై యుండెననిన, మా శాత్రవనేత్రములును, అంతకుమించి, వివేకియైన ప్రతి మనుజుని కన్నులును మాకై యాక్రందించినవి. మేము నిన్ను కలిసికొనుటకును, ఏకేశ్వరత్వమును విశ్వసించి, యనుసరించు వారలకు నీవొక సురక్షితదుర్గమగుదువేమోయని, జనులను నీ ఛాయలోని కేగుమని నిర్దేశించుటకును - యత్నము గావించినను, ఈ సమస్త పరీక్షలకును లోనైతిమి.

ఓ రాజన్యా, ఎన్నడేని నీ కవిధేయుడ నైతినా? ఏ తరుణముననైనను, నీ శాసనములయం దెద్దాని నేని యుల్లంఘించితినా? ఈరాకున నీకు ప్రాతినిధ్యమును వహియించిన నీ మంత్రులయం దెవ్వరేని, నీయెడ నా విశ్వాసరాహిత్యమును ధృవీకరింపగల యే నిదర్శనమునైనను చూపగలరా? చూపజాలరు, సకలలోకాధీశుడగు భగవంతునిపై యాన! నీమీదనేని, నీ మంత్రులయం దెవ్వరిపైననేని, క్షణమాత్రమైనను, మేము తిరుగుబాటును చేయలేదు. గతమున మే మనుభవించినవానికన్నను తీవ్రతర పరీక్షలకు గురికావింపబడినను, నీపై మే మెన్నడును తిరుగుబాటును చేయము; అటుపై దైవేచ్ఛ.

తనకు విధేయుడవై, తన యాదేశము ననుసరించుట కనుగ్రహపూర్వకముగ నీకు తోడ్పడు మనియు, దుష్టగణములనుండి నిన్ను కాపాడుమనియు, నీ పక్షమున రేయింబవళ్లును, ఉదయ సాయం సంధ్యల యందునను భగవంతుని ప్రార్ధింతుము. కావున, నీ యిచ్ఛానుసార మొనరింపుము, నీ స్థాయికి సముచిత మగునటుల, నీ యౌన్నత్యమునకు తగునటుల మాతో వర్తింపుము. ఇప్పుడేని, ఆగామి దివసములయందేని, నీ వెద్దానిని సాధింపదలచినను దైవశాసనమును పరాకుపడవలదు. వచించు: సకలలోకాధీశుడగు భగవంతునికి ప్రస్తుతి!

CXV

ఓ ధాబీ, దివ్యావిష్కరణలేఖిని యీ వాక్కుల ననేక దైవావిష్కృత ఫలకములయందున ప్రస్తావింపనైనది: మా పావనవస్త్రాంచలము, అనైతిక చేష్టా మాలిన్యముతో కళంకితము కాకుండునటుల, గర్హనీయప్రవర్తనాధూళితో కలుషితము కాకుండునటుల జాగరూకులుకండని భగవత్ర్పేమికుల నెల్లరకును మే ముద్బోధించినాము. ఇంకను, తమ దృష్టిని మా దివ్యఫలకావిష్కృతములపై నిలుపుడని వారల కుపదేశించినాము. సకలకరుణాన్వితుని లేఖినీప్రభాత ప్రకాశిత దివ్యోపదేశములయెడ వారి యంతఃశ్రవణము లప్రమత్తములై, ఆయన దివ్యస్వరము నాలించియుండిన – ఈ సరికి భూలోకవాసు లెందరో, ఆయన మార్గదర్శ నాభరణవిభూషితులై యుండెడివారు. ఏమైనను, పూర్వనిర్దేశితమే జరిగినది.

దివ్యయుగప్రాచీనునిజిహ్వ మహత్తరకారాగారమునందుండి, మరి యొకమారు, ఈ హిమశ్వేతపత్ర లిఖితవాక్కుల నావిష్కరింపుచున్నది: ఓ నిజైకదైవ ప్రియతములారా! సంకుచితములైన మీ దుష్ట, కుటిలవాంఛాగహ్వరములను దాటి, భగవంతుని సువిశాల బృహత్సామ్రాజ్యమున కరిగి, పవిత్రతాపరిత్యాగము లనబడు హరితక్షేత్రములయం దధివసింపుడు; సమస్త మానవజాతికిని, మీ కార్యసౌరభ మవ్విధముగ, వైవర్ణ్యమునొందని భగవద్వైభవసాగరమునకు మార్గము జూపవచ్చును. ఈ లౌకికవ్యవహారములతోడను, తత్సంబంధిత సమస్తము గురించియును ఆందోళనమొందుటకో, తద్బాహ్యనేతల కలాపములతో నంటక్రాగుటకో మీరు పాల్పడవలదు.

నిజైకదైవము—సమున్నత మాయన వైభవము—భూపాలనను రాజన్యుల కనుగ్రహించి నాడు. అధికారమునయున్నవారల నిర్దిష్టాభిప్రాయములకు భిన్నముగ వర్తిల్లు యేతీరుననైనను ప్రవర్తించు హక్కెవ్వరికిని యీయబడలేదు. ఆయన తన నిమిత్తము ప్రత్యేకించుకొనినది మానవుల హృదయసీమ లనే; వారియందలి సర్వోన్నతసత్యమైన ఆయన ప్రియతములు, ఈ యుగమున కుంచికల వంటివారు. భగవంతుని సంప్రీతుని గావింపుడు; మహాఘననామశక్తితో వా రెల్లరును, ఈ సీమలద్వారములను తెఱువగలరేమో. ప్రభాతకారకుడైన ఆయన దివ్యలేఖిని, తన దివ్యగ్రంథసమస్తమునను, దివ్యఫలకముల యందునను ప్రస్తావించిన మూలభావమగు—నిజైకదైవమునకుం దోడ్పడుట యనుదాని యర్థమిదియే.

అటులే, భగవత్ర్పియతములు తమ సాటిమానవులయెడ సహిష్ణువు లగుచు, పరమపావనులును, లౌకిక విషయసమస్త విముక్తులును నగుటయును, భువియందలి జనులెల్లరును తమను మనుజుల యందున భగవంతుని ధర్మకర్తలుగ గుఱుతించునంతటి చిత్తశుద్ధిని, నిష్పాక్షికతను వ్యక్తము సేయుట యును - యుక్తమగును. సకలశక్తిమంతుని యాదేశము లెంతటి మహోన్నతశిఖరముల నధిరోహించి నవో, ఈ దుర్బలులు యిపుడధివసింపుచున్న యావాస మెంతటి నికృష్టమో యోచింపుము. సమస్త కరుణాన్వితుడగు నీ ప్రభుని దివ్యలేఖిని విస్తృతస్వర్గముల యందున, నిర్ధారణపక్షములపై విహరణ మెునరించిన వారు ధన్యులు.

ఓ ధాబీ, సర్వోన్నత సత్యమగు భగవంతుడు కర్తృత్వమును వహియించిన కార్యముల నవలోకింపుము. వచించు: ఎంత ఘన మెంతటి ఘనతర మాయన సర్వలోకావృత శౌర్యశక్తి! ఎంత యుదాత్త మెంతటి మహోదాత్తము సృష్టి సమస్తపుదృక్‌జ్ఞానపరిధుల కతీతమైన ఆయన నిస్సంగత్వము! ఎంత కీర్తిత మెంతటి ప్రకీర్తితము భగవత్సామీప్యప్రవేశితుల హృదయములను ద్రవింపజేసిన ఆయన సాత్వికత!

మాకు మా శాత్రవహస్తములు కల్పించిన యగణితక్లేశములతో పీడితులమైనను, తన లక్ష్యమును సాధించుటయందున యుగప్రాచీనుని దివ్యలేఖిని నెవ్విధమగు విపత్తైనను ప్రతిరోధింప జాలదని దేశము లన్నియు నెఱుగునటుల, భగవంతు డుద్ఘోషింప నెంచిన దానిని సమస్తభూపాలురకును ప్రకటించి నాము. క్రుళ్లికృశియింపుచున్న శల్యములకు రూపమునిచ్చు భగవంతుని యనుశాసనానుసారము సాగుచున్న దాయన దివ్యలేఖిని.

ఈ బృహత్కార్యక్రమమును గణనము సేయుచు, ఆయనను ప్రేమించు వారలకు హీన, గర్హనీయ కృత్యములకు పాల్పడుటకన్నను, తమ యత్నపు కటిసీమను బిగియించుకొని, దైవకార్యమునకు నిశ్చయవిజయమును చేకూర్చు దానిపైననే తమ యోచనలను నిలుపుట యుక్తము. శాశ్వతసత్యమైన ఆయన బాహ్యక్రియాకృత్యముల నొకింత పరికించితివేని, నేలంగూలి: ‘ఓ దేవదేవా! నీవు సకల సృష్ట్యాధినాథుడ వనియును, గోచరాగోచర జీవసమస్తమున కాచార్యుడ వనియును వాఙ్మూలము నిత్తును. యావద్విశ్వమును నీ యధికార మావరించె ననియూ, ప్రాపంచికసేనలు నిన్నెన్నటికీ భీతిల్లనూ జేయలేవనియు, నిన్ను నీ లక్ష్యమును సాధించుకొనుటయందున సకల జన, జాతుల సామ్రాజ్యాధికార మవరోధింపనూ జాలదనియు సాక్ష్యము నిత్తును. యావత్ర్పపంచ పునర్నిర్మితియును, తత్ర్పజాసమైక్యత ప్రతిష్ఠాపనయును, తద్వాసు లెల్లరి ముక్తియును దక్క వేరొండు కాంక్ష నీకు లేదనియూ నే నంగీక రింతు,’ నని యాక్రోశింతువు.

యోచింపు మొకింతతడవు; భగవత్ర్పేమికులైనవా రెటుల వర్తింపవలెనో, యే యుదాత్తస్థానము లను వా రధిరోహింపవలెనో పర్యాలోచన మొనరింపుము. వారలకు, తన యభీష్టమును నెరవేర్చుట యందున తోడ్పడుమని కరుణాధిదైవతమగు నీ ప్రభుని సర్వకాలములయందునను అభ్యర్థింపుము. నిక్కముగ, ఆయన మహాశక్తివంతుడు, సకలవైభవసమన్వితుడు, సర్వజ్ఞుడు.

ఓ ధాబీ, ఈ దూషితునికి విధియింపబడిన కారాగారవాస మాయన కేయెగ్గునూ చేసియుండలేదు; చేయజాల దెన్నటికిని; తన యైహికవస్తుసమస్త నష్టియేని, తన ప్రవాసమేని, తన బలిదానమేని, బాహ్యావమానమేని—ఏ హానినీ చేయ వాయనకు. ఆయనను నొప్పింపజాలినవి - భగవత్ర్పియతములు తాముగ పాల్పడి, సర్వోన్నతసత్యమైన తన కాపాదించు దుష్కృత్యములే. ఇదియే నే ననుభవింపుచున్న వ్యధ; సకలాంశములపైనను ఆధిపత్యమున్న ఆయన, కేవలమాయనయే - నా కిందులకు సాక్ష్యమును వహియించును. నన్ను తీవ్రముగ నొప్పించునవి బయాన్‌ జనులను నిత్యము ప్రతిపాదించు వాదములే. కొందరు మా శాఖలయం దొకనియెడ స్వామిభక్తిని చాటుకొనగ, కడమవారలు స్వతంత్రముగనే తమవగు ప్రకటనములను జేసి, స్వీయేచ్ఛావర్తనులైనారు.

ఓ ధాబీ! దివ్యవైభవజిహ్వయిట్లనుచున్నది: సత్యమును వచియించు నాపై యాన! పూర్వ దివ్యపాలనాకాలములు యీ మహత్తర దివ్యావిష్కరణమున తమ సర్వోత్కృష్ట, సంపూర్ణ లక్ష్యసిద్ధి నొందినవి. ఆయన గావించిన దివ్యావిష్కరణము తనదని వాదించు మనుజుడు నిశ్చయముగ, అసత్యము నాడుచున్న వంచకుడే. అట్టివానికి తన వాదము నుపసంహరించుకొని, పరిత్యజించుట కనుగ్రహ పూర్వకముగ తోడ్పడుమని మేము భగవంతుని ప్రార్ధింతుము. ఆతడు పశ్చాత్తప్తుడయ్యెనేని, నిస్సంశయముగ భగవంతు డాతడిని సైరించును. అయినను, తన తప్పిదమున యాతడు మొండిగ సాగినచో, నిర్దాక్షిణ్యముగ నాతడితో వ్యవహరించువాని నొకనిని, భగవంతుడు నిశ్చయముగ భువి కంపును. నిక్కముగ, ఆయన సర్వశక్తిమంతుడు, మహాబలసమన్వితుడు.

నా పూర్వదివ్యావతారమును, నా దివ్యసౌందర్యమున కగ్రగామియును నగు ఆయనచే ప్రకటిత మైన దాని యేకైకలక్ష్యము నా దివ్యావిష్కరణమే ననియు, నా దివ్యధర్మోద్ఘాటనయేననియు గ్రహియించుటయందున బయాన్‌ జనులెంత ఘోరముగ వైఫల్యము నొందిరో, వీక్షింపుము. తాను నాకు ప్రకటించిన దానిని, నాకుగానిచో ఆయన యెన్నటికిని—సర్వోన్నతసత్యమగు ఆయన నన్నిందులకు సాక్ష్యముగ వహియించును—ప్రకటించి యుండెడివాడుకాడు. సర్వసమృద్ధుడును, అలభ్యుడును నగు ఆయన దివ్యధర్మమును యీ మూఢజను లెట్లొక క్రీడగ, వినోదముగ పరిగణించిరో విలోకింపుము! వారి డెందము లనునిత్య మొక నూతన పధకరచనము గావించును. వారిచే వారి యాడంబర మొక వినూత్నస్థావరము నన్వేషింప జేయును. వారనునది యథార్థమేయైన, ఇక నీ ప్రభుని దివ్యధర్మసుస్థిరత ధృవీకృత మెటుల కాగలదు? నీ మానసమున దీనిం బర్యాలోచింపుము; సునిశితదృక్కుల, సావధానసంశోధకుల, స్వకీయలక్ష్య సుస్థిరచిత్తుల, స్వీయవిశ్వాససంతుష్టులయం దొకడవు కమ్ము. నీ నిర్ధారణ మెటులుండవలెననిన, ఎన్నడును యే మానవుడేని గావించియుండని, ఏ మేధస్సేని స్వప్నించి యుండని యట్టి యారోపణములను గావింప సమస్త మానవాళియు నుంకించినను, వాటిని నీవు సంపూర్ణముగ నుపేక్షింతువు, వాటికి నీనుండి యుద్వాసన బల్కుదువు, సకలలోకముల యారాధనా లక్ష్యమగు ఆయన దెసకు నీ మోమును సారింతువు.

సాక్షాత్తూ నా ధార్మికత్వముపైననే యాన! ఉత్కృష్టము, మహోత్కృష్ట మీదివ్యధర్మము! ప్రభావశీల మనూహ్యప్రభావశీల మీదివ్యయుగము! సకల విషయ పరిత్యాజ్యమెునరించి, స్వర్గముల యందునను, భువియందునను వసియించు వారెల్లరి పట్లను స్వీయతేజోప్రసారితవదనుడగు ఆయనపై తన నేత్రములను స్థిరముగ నిల్పిన—మానవుడు నిజముగ ధన్యుడు.

ఓ ధాబీ, మనుష్యహృదయములయందున గుజగుజలువోవు స్వార్థవాంఛల దాడులకు చలియింపదలపవేని, నీ దృష్టి నిశితమై, నీయాత్మ నిశ్చలమై, నీ పదములు లోహసదృశములై యుండవలె. ప్రాచీనరాజన్యుని యిచ్ఛానుసారము, మహాఘననామదివ్యలేఖిని యావిష్కరింప నుంకిం చిన సుస్థిరాదేశమిది. నీ కంటి పాపవలె దీనిం గాపాడుకొనుచు, కృతజ్ఞుడవు కమ్ము. నిత్యసత్యమగు ఆయన దివ్యధర్మమును సేవించుట కహర్నిశలును కృషి సల్పుము. ఆయన దక్క సమస్తమునుండియు విముక్తుడవు కమ్ము. నాపై యాన! నీ వీదివ్యయుగమున వీక్షింపుచున్నది క్షయించును. నీ దేవదేవుని దివ్యధర్మమున సుస్థిరుడవై నిలచితివేని నీ స్థానము మహోన్నతమగును. నీ యవిశ్రాంత పద చాలనములు, ఆయన దెసకు నిర్దేశితములు; నీ యంతిమశయనస్థలి ఆయన యందే కలదు.

CXVI

ఓ క్రైస్తవలోక రాజన్యులారా! “నేను వెడలిపోయి, మరల మీ చెంతకు వత్తు,” నను దైవాత్మ యేసు వచనమును మీ రాలింపలేదా? మరి, మీరు తన వదనము నవలోకించి, తన సాన్నిధ్యము నొందుదురని, ఆయన దివ్యమేఘములపై మరల మీచెంత కరుదెంచినయపు డాయనను సమీపించుటయం దేల వైఫల్యము నొందితిరి? వేరొక లేఖనభాగమున యిట్లనుచున్నా డాయన: “సత్యతత్త్వమగు ఆయన యేతెంచినయపుడు, సకల సత్యములోనికి ఆయన మిమ్ము నడిపించును.” ఆయన సత్యమును కొనితెచ్చినయపుడు, ఆయన దెసకు మీరు మీ వదనములను మరల్చుటకు తిరస్కరించి, మీ వినోద విలాసముల యందున యోలలాడుచు, మీ క్రీడామగ్నత నెట్లు కొనసాగించితిరో వీక్షింపుడు. ఆయన ముఖతః దైవసూక్తుల నాలించి, సకలవైభవాన్వితుడును, సమస్తవివేకియును నగు సర్వశక్తిమంతుని బహుముఖీనజ్ఞానము నాస్వాదించి యుందురనుటకు - ఆయనను మీరు స్వాగతింపనూ లేదు; ఆయన సాన్నిధ్యము నాశింపనూ లేదు. మీ వైఫల్యహేతువున, దైవోచ్ఛ్వాసమును మీపై ప్రసరింపనీయక నిరోధించుకుని, తత్పరిమళ మధురిమను మీ యాత్మల కవరోధించినారు. మీ కలుషితవాంఛల లోయన మహదానందమున విహరింపుచునేయున్నారు. మీరును, మీకున్న దెల్లయును గతియించును. మీరు, సునిశ్చయముగ, భగవంతుని చెంతకు మరలివెడలి, సృష్టినెల్లయూ సంయుక్తముగ సమావేశిత మొనరించునట్టి ఆయన సాన్నిధ్యమున, మీ చేష్టల గణనమున కామంత్రితు లగుదురు. . . .

ఓ రాజన్యులారా, మే మనుదినమొక నూతన సంక్షోభపుటావేదనను చవిచూచుచుండగనే, గడచిన విరువదివత్సరములు. మాకు పూర్వమెవ్వరును, మేము సహియించిన వాని ననుభవించి యుండ లేదు. గ్రహియించితిరా! మా వ్యతిరిక్తులు మమ్ము నిహతుల గావించినారు, మా రుధిరమును చిందించినారు, మా యైశ్వర్యమును దోచుకొనినారు, మా మాన్యత నవమానించినారు. మా సంక్షోభాతి రేకత నెఱిగియు, దురాత్ముని హస్తము నవరోధించుటయందున మీరు వైఫల్యము నొందినారు. మరి, దురాత్ముని దౌర్జన్యమును ప్రతిరోధించుటయును, సమస్తమానవాళికిని మీ యుదాత్త ధర్మనిరతి సంపూర్ణముగ ప్రదర్శిత మగునటుల మీ పాలితులతో ధర్మముగ వ్యవహరించుటయును - మీ విస్పష్టవిధి కాదా?

న్యాయముగ జనులను పాలింతురనియును, పీడితుల హక్కులను పరిరక్షింతురనియును, దుర్వర్తనులను దండింతురనియును - ప్రజాపరిపాలనా బాధ్యతలను భగవంతుడు మీ హస్తస్థిత మెునరించినాడు. ఆయన తన దివ్య గ్రంథమున మీకు నిర్దేశించిన విధి నలక్ష్య మెునరించితిరేని, మీ నామములు భగవంతుని దృష్టియం దన్యాయవర్తనులైనవారితో పరిగణనము నొందును. నిశ్చయముగ, మీ యపరాధము దుస్సహమగును. మీ యూహాకల్పనములకు బద్ధులై, పరమ ప్రకీర్తితుడును, దుర్లభుడును, సర్వప్రేరకుడును, సకలశక్తిమంతుడును నగు భగవంతుని యాదేశములను మీవెనుకకు విసరివైతురా? మీరొంది యున్న వానిని విసర్జించి, మీ రనుసరించుటకై భగవంతు డాదేశించినదానికి బద్ధులు కండు. ఆయన యనుగ్రహము నర్ధింపుడు; ఏలయన, దాని నర్ధించు నాతడు, ఆయన బుుజు పథమున బయనించును.

మేమున్న స్థితిని పరిశీలింపుడు, మమ్ము పరీక్షించిన యిడుములను, ఇక్కట్లను వీక్షింపుడు. క్షణమాత్రమేని మమ్ముల నలక్ష్యముసేయక మాకును, మా శాత్రవులకును న్యాయముగ తీర్పునిండు. నిశ్చయముగ, మీకిది ప్రత్యక్షలబ్ధి యగును. మా క్లేశములను బాపి, మా భారమును తగ్గింతురని మా గాథను మీకివ్విధముగ దెల్పుచు, మాకు వాటిల్లిన వాటిని వర్ణింపుచున్నాము. మా విపత్తు నుండి మమ్ము విముక్తునిజేయు నాతని నట్లొనరింపనిండు; చేయనివానికి, నా ప్రభుడు నిశ్చయముగ సాహాయ్యుల యందున సర్వోత్తముడు.

ఓ దైవభృత్యుడా, మేము నీ కనుగ్రహించి యంపినవానితో జనులను హెచ్చరించి, వాటిని వారికి సుపరిచితముల నొనరింపుము; ఎవ్వనివలని భయమునూ, నిన్ను విహ్వలుని గావింపనీయవలదు; శంకితుడవును కావలదు. భగవంతుడు తన దివ్యధర్మమును మహోన్నత మెునరించి, భువియందునను, స్వర్గముల యందునను యున్నవా రెల్లరి దృష్టియందునను తన నిరూపణమును శ్లాఘిత మొనరించు దివస మరుదెంచుచున్నది. నీ యావద్విశ్వాసమును, సర్వా వస్థలలోను, నీ దేవదేవునియందున యుంచి, నీ దృష్టిని ఆయనపై నిలిపి, ఆయన సత్యమును తిరస్కరించు వా రెల్లరకును పరాఙ్ముఖుడవు కమ్ము. నీ ప్రభుడగు భగవంతుని, నీకు సుయోగ్యసాహాయ్యునిగ, సహకారిగ నుండనిమ్ము. నీ దెసకు మోమును సారించు రా జెవ్వడును కానరాకున్నను, భువిపై నీ విజయమును సుస్థిరమెునరించుటకును, సకలజనుల కతీతముగ మా దివ్యధర్మమును సమున్నతీకరించుటకును మేము ప్రతిన బూనినాము.

CXVII

ప్రపంచము యొక్క శాంతి, ప్రశాంతతలకును, తత్ప్రజాభ్యుదయమునకును పూర్వావశ్యకతల నావిష్కరింప నెంచుచు మహాస్తిత్వ మిటుల లిఖియింపనైనది: సువిస్తృతమును, సర్వామోదితమును నగు మానవసమ్మేళన మొకదాని నిర్వహణపు టనివార్యావశ్యకత విశ్వవ్యాప్తముగ గ్రహియింపబడు తరుణము వచ్చితీరవలె. వెడలవలె నద్దానికి - భువియందలి పాలకులును, రాజన్యు లును; పరిశీలింపవలె - దాని చర్చలలో పాల్గొనుచు మానవులయందున, మహత్తర ప్రాపంచికశాంతికి పునాదులనువేయు విధానములను, సాధనములను. ప్రపంచజన ప్రశాంతత నిమిత్త మగ్రరాజ్యములు, ఒండొరులతో సంపూర్ణముగ నొడంబడుటకు నిర్ణయ మొనరించుకొనవలె. ఏ రాజన్యుడైనను ఇంకొకనిపై యాయుధములను చేబూనినచో, ఎల్లరును సమిష్టిగ నుద్యమించి యాతని నవరోధింపవలె. ఇట్లొనరింప వడెనేని, తమ భూభాగముల భద్రతా పరిరక్షణమునకును, తమ రాజ్యములయం దంతర్గతశాంతి నమలు పరచుటకును దక్క, ఇక ప్రపంచదేశముల కాయుధముల యావశ్యకత యుండదు. ఇది, ప్రతి జనసంచయ, ప్రభుత్వ, జాతి సంబంధిత శాంతిస్థైర్యములను ధృవీకరించును. ఔదార్యప్రపూరితమును, శక్తిసమన్వితమును నగు భగవన్నామదర్పణములైన ప్రపంచరాజన్యులును, పాలకులును - ఈ స్థాయి నొంది, నియంతృత్వపు ముట్టడినుండి మానవాళిని సంరక్షింతురని మనఃపూర్వకముగ మే మాశింపు చున్నాము. . . . ప్రపంచప్రజలెల్లరును ఒకే విశ్వభాషనూ, ఒకే సార్వత్రిక లిపినీ యవలంబించు దివస మరుదెంచనున్నది. ఇది నెరవేరినయపుడు, మానవు డేనగరి కేగినను, స్వగృహమున కరిగినయటులే యుండును. ఈ యంశము లనివార్యములు, అత్యంతావశ్యకములు. లిఖియింపబడిన దానిని వాస్తవము గావించుట, ఆచరణగా పరివర్తిత మొందింప యత్నించుట యనునది, ఆంతర్దృష్టియుతుడును, అభిజ్ఞుడును నగు ప్రతి మానవునకును విహితము. వాస్తవమున కీనాడు, సమస్త మానవాళి సేవకును తన నంకిత మెునరించుకొను వాడే మానవుడు. మహాస్తిత్వ మిట్లననైనది: ప్రపంచదేశముల, జాతుల విశిష్ట ప్రయోజనములను ప్రవృద్ధమెునరింప నుద్యమించు మానవుడు ధన్యుడు, సంతోషాత్ముడు. మరియొక పరిచ్ఛేదమునం దిటుల ప్రకటింపుచున్నాడాయన: ఒకడు తన స్వదేశమును ప్రేమించుట ఘనత కాదు, తద్భిన్నముగా అఖిలప్రపంచమును ప్రేమించుట యందే ఘనత కలదు. ప్రపంచమెుక దేశము, తత్పౌరులే మానవాళి.

CXVIII

ఓ భూమీశులారా, దైవభీతి నలక్ష్యము సేయవలదు; జాగ్రత్త, మీరు సమస్తశక్తిశాలి నిర్దేశితములైన మేరలను మీరుదురేమో. ఆయన తన గ్రంథమున మీకు విధియించిన యనుశాసనము లను పాలించి, తత్పరిధుల నతిక్రమింపక జాగరూకులు కండు. అన్యాయము నావగింజంతయేని యెవరికిని గావింపక, అప్రమత్తులు కండు. న్యాయమార్గము ననుసరింపుడు, ఏలయన, నిక్కముగ సత్పథమిదియే.

మీ విభేదములను పరిహరించుకొని, మీ యుద్ధసామగ్రిని కుదియించుకొనుడు; తద్వారా, మీ వ్యయభారము తగ్గి, మీ హృదయములును, మీ యోచనలును ప్రశాంతత నొందవచ్చును. మిమ్ము విభజించు విరోధముల నుపశమింప జేసికొనుడు; అవ్విధముగ, ఇకపై మీ నగరముల, పాలిత ప్రాంతముల పరిరక్షణమునకు దక్క, మీ కెట్టి యాయుధముల యావశ్యకతయూ ఉండదు. పరిమితుల నతిక్రమింపక, అతివ్యయపరులుగ గణుతికెక్కక, భగవద్భీతులు కండు.

ఏడాది కేడాదియు, మీ వ్యయమును ప్రవృద్ధమొనరింపుచున్నా రనియు, తద్భారమును మీ ప్రజలపై మోపుచున్నారనియు గ్రహియించినాము. నిక్కముగ, వారలకిది దుర్భరమును, వారియెడ ఘోరదురన్యాయమున్ను. ప్రజలయెడ న్యాయవర్తనులై, వారికి న్యాయప్రతీకలు కండు. ధర్మముగ తీర్మానించితిరేని మీకును, మీ స్థాయికిని సముచితమిది.

మిమ్ముల నర్ధించు, మిమ్ముల నాశ్రయించువా డెవ్వడైనను, అధర్మముగ నాతడియెడ వ్యవహ రింపక జాగరూకులు కండు. దైవభీతులై వర్తింపుచు, సన్మార్గజీవులు కండు. మీ యధికారముపై, సైనిక బలముపై, సంపదలపై యాధారపడవలదు. మీ సంపూర్ణవిశ్వాసమును మిమ్ము సృజియించిన భగవంతునియందుంచి, మీ సమస్తవ్యవహారములయందునను ఆయన తోడ్పాటు నాశింపుడు. సాహాయ్య మాయననుండియే లభియించును. ఆయన తా దలచువారికి, భూ స్వర్గముల సేనా నివహముతో సాహాయ్య మెునరించును.

భాగ్యవిహీనులు మీమధ్యనున్న దైవనిధియని గ్రహియింపుడు. మీ రాయన నిధిని వంచింపక, అన్యాయముగ వారియెడ వర్తింపక, విశ్వాసఘాతుకుల విధానముల ననుసరింపక - జాగరూకులు కండు. ధర్మకాటా నెలకొలుపవడిన దినమున ధనికులైనను, నిరుపేదలైనను—ఎల్లరకును వారివారి పరిహారము లొసగబడు దివసమున, యావన్మంది కర్మలును గణుతింపబడునపుడు, ఆయన నిధి విషయమున ప్రత్యుత్తరము నిచ్చుటకు, నిక్కముగా, మీ రామంత్రితు లగుదురు.

అప్రతిమానమును, ప్రస్ఫుటమును నగు భాషలో మే మీ దివ్యఫలకమున వెలువరించిన యుపదేశముల నలక్ష్య మొనరించితిరేని, దైవదండన మన్నిదెసల నుండియును మిమ్ములను చుట్టు ముట్టును; మీకు ప్రతికూలముగ ఆయన న్యాయనిర్ణయ తీర్మాన ముద్ఘోషితమగును. ఆ దివసమున, ఆయన నవరోధించు శక్తి మీకుండదు; మీ యశక్తతను మీరు గుఱుతెఱుగుదురు. మీపట్లను, మీ యనుజనుల యెడలను దయగలిగి యుండుడు. తాను ప్రతి యంశమునకును నిర్ణీతప్రమాణము నేర్పరచి, సకలవిషయసంబంధిత వివరణమును విలక్షణముగ ననుగ్రహించి, తనను విశ్వసించువారికి ప్రత్యక్షోపదేశముగ తా ననుగ్రహించిన పరమపవిత్ర మహోత్కృష్ట ఫలకమున - భగవంతుడు విధియించిన శాసనముల ననుసరించి వారలను తీర్మానింపుడు.

మా దివ్యధర్మమును పరిశీలింపుడు; మాకు సంభవిల్లినవాటిపై విచారణ జరిపి, మాకును, మా విరోధులకును న్యాయముగ నిర్ణయమును గావించి, తమ సాటివారి యెడ సమన్యాయముతో వర్తించు వారు కండు; నియంతహస్తమును మీరు నిలువరింపకుండిన , పీడితుల హక్కుల పరిరక్షణమున మీరు వైఫల్యము నొందిన, ఇక మానవులతో మీపరముగ ప్రగల్భములం బల్కుటకు మీకేమి హక్కున్నది? వాస్తవమున కెద్దానిని గురించి మీరు ప్రగల్భింపగలరు? మీ యాహారపానీయములను, మీ కోశాగార సమీకృతైశ్వర్యములను, మీరు విభూషితులైన బహువిధ యాభరణములను, తన్మూల్యములను జూచుకొనియా గర్వించుట? అట్టి యశాశ్వత వస్తుసంచయముననే నిజమగు యశస్సుండిన పక్షమున, మీరు సంచరించు ధరణి మీకన్నను యెంతగ ప్రగల్భింపవలె? ఏలయన, మీకు వీటిని సమకూర్చు చున్నదియు, సర్వశక్తిమంతుని తీరుమానము ననుసరించి మీ కనుగ్రహింపుచున్నదియు అదియే. దైవనిర్ణాయకముగ మీ రొందినదెల్లయు తద్గర్భస్థితమే. అందుండి, ఆయన కారుణ్యచిహ్నముగ మీరు సంపదల నొందుచున్నారు. ఇక మీరు మిడిసివడుచున్నయట్టి, మీ స్థాయి నవలోకింపుడు! గ్రహియింప గలరా మీ రద్దానిని!

లేదు! సమస్తసృష్టిసామ్రాజ్యహస్తుడగు ఆయనపై యాన! మీరు భగవంతుని నియమావళికి దృఢముగ బద్ధులగుటయందునను, ఆయన శాసనములను మనఃపూర్వకముగ ననుసరించుట యందునను, వాటి యాచరణము స్తంభింపరాదను మీ సంకల్పమునను, స్థైర్యముతో సత్పథగాములగుట యందునను దక్క - మీ యథార్థ, శాశ్వతయశ మింకెచ్చోటనూ లేదు.

CXIX

ఓ భూపాలకులారా! దివ్యభానుని తేజము నాచ్ఛాదిత మొనరించి, తత్ప్రకాశమును మ్లాన మొనరించితిరేల? దైవవశమున మీరును, పాలితులును శాంతిసౌహార్దముల నొందునటుల, మహోన్నతుని దివ్యలేఖిని మీ కనుగ్రహించిన యుపదేశము నాలింపుడు; ప్రపంచరాజన్యులకు భువిపై శాంతిసంస్థాపనార్థమై సాహాయ్య మెునరింపుమని భగవంతుని మే మర్ధింతుము. నిక్కముగ, ఆయన తా దలచుదాని నొనరించును.

ఓ ధరణీశులారా! మీ రేడాది కేడాదియు మీ వ్యయములం బెంచుకొనుచు, తద్భారమును మీ ప్రజలపై మోపుచుండుటను మే మవలోకింపుచున్నాము. నిక్కముగ పూర్ణ, ఘోరదురన్యాయ మిది. ఈ దూషితుని నిశ్వసనాశ్రువులకు భీతిల్లుడు; మితిమీరిన భారములను మీ ప్రజలపై మోపవలదు. వారిని మీ ప్రాసాదముల పరిపోషణార్ధమై దోచుకొనక, మీకై యెంచుకొనిన దానినే వారికిని యేర్పరుపుడు. మీరు గ్రహియించితిరేని, అవ్విధముగ, మీకు లబ్ధిని జేకూర్చు దానిని మీ కన్నులయెదుట సాక్షాత్కృత మెునరింపుచున్నాము. మీ ప్రజలే మీ సంపదలు. జాగ్రత్త, మీ పరిపాలన భగవదాజ్ఞల నతిక్రమింపగ, మీరు మీ ప్రజలను దోపరి హస్తగత మొనరింతురేమో. మీరు వారి వలన యేలుదురు, వారి వనరులతో జీవింతురు, వారి సాహాయ్యమున జయింతురు. అయినను, వారి యెడ మీరెంత నీచముగ వర్తింపు చుంటిరి! ఎంత చిత్ర మెంతటి విచిత్రమది!

మీ రిపుడు మహత్తరశాంతిని తిరస్కరించితిరి; దైవవశమున, మీరు మీ స్థితిని, మీ పోషితుల స్థితిని కొంతమేరకు మెఱుగుపరచుకొనవచ్చును గాన, లఘుతరశాంతికేని బద్ధులు కండు.

ఓ అవనీశులారా! మీ రాజ్యముల, పాలితప్రదేశముల రక్షణపరిమితికి మించిన ఆయుధముల యావశ్యకత మీ కెంతమాత్రమును లేకుండునటు లొండొరులు సమన్వయీకృతులు కండు. జాగ్రత్త! సర్వజ్ఞుడును, విశ్వసనీయుడును నగు ఆయన యుపదేశమును మీ రుపేక్షింతురేమో.

ఓ ధరణీశులారా! ఏకము కండు, గ్రహియింపగలిగిరేని, మీ యందలి విద్వేషఝంఝామారుత మవ్విధముగ నుపశమించును; మీ ప్రజలు సాంత్వన నొందుదురు. మీయం దెవ్వడేని యింకొకనిపై యాయుధములను పూనిన యెడల, ఆతడిపై మీ రెల్లరును విజృంభింపుడు; ఏలయన, ప్రత్యక్షన్యాయ మిది గాక వేరొండు కాదు.

CXX

దేశదేశములయందలి, ఓ నిర్వాచిత ప్రజాప్రతినిధులారా! సమిష్టిగ సమాలోచింపుడు; మీరు జాగరూకతతో పరిశీలించువారేని, మీ దృక్పథమును మానవాళికి లబ్ధిప్రదమును, దాని స్థితికి శ్రేయస్కరమును కానిండు. సృజియింపవడిన యపుడు సర్వసమగ్రత నొందియున్ననూ, వివిధహేతువు లచే, తీవ్రాందోళనా, రుగ్మతాపీడితయైన మానవదేహముగ - ప్రపంచమును గణింపుడు. ఎన్నడును స్థిమితము నొందియుండలేదది; తమ స్వార్థవాంఛలను నియంత్రించుకొనక, ఘోరాపరాధ మెునరించిన యవ్యక్తవైద్యుల చికిత్సయం దుండుటచే, దాని రుగ్మత యింకనూ యుధృతమైనది; సమర్ధుడగు నొక వైద్యుని సంరక్షణమునం దొకతరి, దాని శరీరాంగమెుకటి స్వస్థతనొందినను, తక్కినవి యథాతథముగ వ్యాధిగ్రస్తములుగనే యున్నవి. సర్వజ్ఞుడును, సకలవివేకియును నగు ఆయన - మీ కివ్విధముగ నెఱిగింపుచున్నాడు.

తమ ప్రధానప్రయోజనమును ప్రస్ఫుటముగ నెఱుగజాలకపోగా, ఇంతటి మహాద్భుత, మహాసంక్లిష్ట దివ్యావిష్కరణమును సైతము గుఱుతింపజాల నంతగా గర్వోన్మత్తులైన పాలకుల దాక్షిణ్యముపై, యీ నాడిది యాధారితయై యుండుట నవలోకింపుచున్నాము. వారియం దెవ్వడేని, దీని స్థితిని చక్కబరుప నుంకించినయపు డాతడి లక్ష్యము, ఆత డంగీకరించినను లేకున్నను, స్వప్రయోజనమే యైనది; ఈ లక్ష్యపు టయోగ్యత, ఆతడి చికిత్సోపశమనశక్తుల నవరోధించినది.

సమస్తప్రపంచమునకును పరమౌషధముగను, ప్రధానసాధనముగను దేవదేవుడు నిర్దేశించినది - ఒకే విశ్వమతమున, ఒకే సార్వత్రిక దివ్యధర్మమున తత్ప్రజ లెల్లరి యేకీకరణమే. నిపుణుడును, సర్వశక్తిమంతుడును నగు సంప్రేరిత దివ్యవైద్యుని శక్తి మూలమున దక్క, ఇది యింకెవ్విధముగను సాధింపబడదు. నిశ్చయముగ, నిజ మిదియే; తక్కినదెల్లయు నపోహయే దక్క, వేరొండు కాదు.

CXXI

వచించు: నన్ను ద్వేషించు నా యరిష్టాకాంక్షులారా! నాయెడ మీ క్రోధావేశము మీమీదికే విజృంభించును! వైభవాదిత్యుడు నా దివ్యావిష్కరణాదిఙ్మండలమున ప్రభవించి, తన తేజముతో మానవాళినంతయు నావృత మొనరించినాడు. అయినను, విలోకింపుడు: తద్వైభవదూరులై, శుద్ధప్రమత్తతయం దెటుల మీ రడగితిరో! మీయెడ దాక్షిణ్యమును వహియింపుడు; మీ రెవ్వరి యథార్థత నీసరికే గుఱుతించిరో, ఆయన యుద్ఘోషణమును తిరస్కరించి, ధిక్కారులు కావలదు.

నిజైకదైవ ధార్మికత్వముపై యాన! సర్వోత్కృష్ట సంరక్షకుడును, మహాశక్తిమంతుడును, సకలమహిమాన్వితుడును, సర్వజ్ఞుడును నగు భగవంతుని నిదర్శనములను మీ దివ్యధర్మసత్య నిరూపణోద్దేశ్యమున, వారి కట్టెదుట నిలిపినది మీరే యగుటం జేసి మీ రీదివ్యావిష్కరణమును తిరస్కరించితిరేని, భువియందలి దేశములన్నియూ, అపహాస్యాధిక్షేపణ పూర్వకముగ మిమ్ములను పరిహసించును. అయినను, ప్రమత్తులుగ పరిగణనమునొందిన ఓ జనులారా, సకలశాసక సార్వభౌమ వైభవాలంకృతయై, ఆయన తదుపరి దివ్యావిష్కరణము మీ కనుగ్రహీతమైన యంతనే, మీరు దానిని త్రోసిపుచ్చితిరే!

ఏమీ! దివ్యభానుని ప్రభాసము నార్పజాలిన, తత్ప్రభ నంతర్హిత మొనరింపగలిగిన శక్తి మీ కున్నదని, మీ మానసములయం దూహింపుచుంటిరా? వలదు, నా జీవితముపై యాన! మీ సాహాయ్యమునకై భూస్వర్గస్థితసమస్తము నామంత్రించుకొనినను, మీ సంకల్పము నెన్నటికిని మీరు సాధింపరు, సాధింపజాలరు. దైవభీతితో వర్తింపుడు, మీ కార్యములను రిత్తవోనీయవలదు. ఆయన వాక్కులకు మీ వీనులనొగ్గుడు; ముసువును గప్పుకొనినవలె దూరులు కావల దాయనకు. వచించు: భగవంతుడే నాకు సాక్షి! నేను నా నిమిత్త మెద్దానినీ అభిలషింపలేదు. నే నాశించినది భగవద్విజయమునే, ఆయన దివ్యధర్మ జయమునే. నాకును, మీకును ఆయనయే ప్రత్యక్షసాక్షి. మీరు మీ నేత్రములను ప్రక్షాళితముల నొనరించుకొనియుండిన యెడల, నా వాక్సత్యమునకు నా కార్యములులెట్లు సాక్ష్యమును వహియించునో, తక్షణమే గ్రహియించి యుందురు.

మీ కన్నుల కంధత్వ మేర్పడినది! మీరు భగవంతుని శక్త్యధికారముల యుత్కృష్టత నవలోకింప లేదా? ఆయన యశోమహనీయతలు మీ కగుపింపలేదా? ఓ అసూయాద్వేషపూరిత సమాజమా, నీ కిక విషాదమే! నా ప్రసంగము నాలింపుము; క్షణమునకు తక్కువగనైనను, తాత్సారము చేయకు. మీరు మీ స్వాధీనవిషయములయెడ, దైవవశమున, విరాగులై ఆయన దివ్యావిష్కరణా పరిరక్షితయైన సమస్తసృష్టినీ వీక్షింపగల సమున్నతస్థానముల కధిరోహింపవచ్చునని, సకల కరుణాన్వితుని దివ్యసౌందర్యమగు ఆయన మిమ్ముల నాదేశింపుచున్నాడు.

వచించు: మీరు భగవంతుని దివ్యావిష్కరణచ్ఛాయ నాశ్రయించిననే గాని, మీ కాయన క్రోధాగ్నినుండి శరణమైనను, మీరు పలాయనమగుట కాశ్రయమైనను లేవు; మిమ్ముల నీదివ్యయుగమున రక్షించి కాపాడువారును లేరు. ఈ దివ్యతరుణుని స్వరూపసాక్షాత్కృత దివ్యావిష్కరణమే యిది. ఇంతటి యమూల్యాద్భుత జ్యోతిర్మయ దార్శనికతకు, భగవంతుడు శ్లాఘనీయుడు.

నేను దక్క సమస్తమునుండియు విముక్తులై, మీ మోములను నా వదనము వంకకు సారింపుడు; ఏలయన, మీ రొందియున్న దానికన్నను మీ కిదియే యుత్తమోత్తమము. సత్యవాచకమును, సకలవిషయ సంయుతమును, సర్వజ్ఞమును నగు నా దివ్యవాగ్ద్వారమున భగవజ్జిహ్వ, నా వాక్సత్యమునకు సాక్ష్యమును వహియించును.

వచించు: తన దివ్యధర్మముపట్ల మీ విధేయత, ఆయన కెన్నడేని లబ్ధిని చేకూర్చుననియో, తత్సత్య తృణీకరణ మాయన కేదేని నష్టిని గావించుననియో భావింపుచుంటిరా? తగదది; సకలవిజేతను, దుర్లభుడను, సమున్నతుడను నగు నాపై యాన! నామధేయముల ముసువులం జీల్చివైచి, తత్సామ్రాజ్యమునకు విధేయులు కండు. నా సౌందర్యముపై యాన! అనాదిగా తన యాదేశముతో ప్రతి నామధేయమునూ సృష్టించి, వాటిని తన యిచ్ఛానుసారము సృజియింపుచునేయుండు సకలనామధేయ సార్వభౌము డరుదెంచినాడు. ఆయన నిక్కముగ, సర్వశక్తిమంతుడు, సకలవివేకి.

దివ్యమార్గదర్శనాంబరమును మీకై మీరు కోలుపోవుదురేమో, జాగ్రత్త. స్వర్లోకస్థిత దివ్యయువత మీశీర్షోపరిభాగమున యుత్సాదించిన దివ్యచషకము నుండి సంతుష్టిగ మీ వంతును గ్రోలుడు. మీ యెడ మీకన్నను మిగుల దయాన్వితుడగు ఆయన, మీనుండి పరిహారమునో, కృతజ్ఞతనో యాశింపని ఆయన - ఇవ్విధముగ మిమ్ముల నాదేశింపుచున్నాడు. ఆయన పురస్కృతి - సత్యసత్త్వమూలమున తనను మీచెంతకంపి, తన నెంపిక గావించి, తనను సమస్తసృష్టికిని స్వకీయచిహ్నముగ నుద్ఘోషించిన యాయన నుండియే యనుగ్రహీతమగును. ఆయనకు, తన సమస్తసంకేతముల యభివ్యక్తీకరణశక్తి నొసంగిన దాయనయే. దైవవశమున మీరు యథార్ధజ్ఞులు కావచ్చును కనుక, యుగప్రాచీనుని జిహ్వ మిమ్ముల నామంత్రితుల నొనరించిన యంశములను గ్రహియించుటకు - మీ దృక్కులను పునఃసారింపుడు. ప్రత్యక్ష, పరమోత్కృష్టాధికార ప్రసాదితుడై, తన దక్షిణహస్తమున భగవంతుని దివ్యసామ్రాజ్యమును, వామహస్తమునం దాయన యనంతలోకవైభవమును వహియించి, సకలశక్తిమంతుడును, సర్వవిజేత యును, పరమాధీశుడును నగు భగవంతుని సేనాసమూహములు ముందుగ నడువ, మహావిద్వజ్జనుల కేని, విజ్ఞులకేని దుర్గ్రాహ్యములగు సూక్తుల నవిరామముగ వెలువరింపుచు, ఆవిష్కరణ మేఘములయం దరుదెంచినయట్టి యే వాహకుడు దెచ్చిన సందేశమైనను భగవంతునిది కాదని మీ పూర్వీకులేని, తత్పూర్వతరములేని మీకైనను, ప్రథమ ఆదామునకైనను, ఎన్నడేని నివేదించినయటుల మీరు విని యుంటిరా? నీతిమంతులమని, ఉదాత్తమనస్కులమని మిమ్ములను మీ రనుకొనినచో గ్రహణశీలురై, నిజమును - నిక్కమగు నిజమును పలుకుడు.

వచించు: మే మావిష్కరించిన సూక్తులు పూర్వదివ్యాష్కరణమున బాబ్‌న కొసంగబడినయన్ని యున్నవి. పరమాత్మ ప్రవచితవచనములను శంకించు వానిని మా సాన్నిధ్యాస్థానము నాశ్రయించి, మా దివ్యావిష్కృత సూక్తుల నాలించి, మా సాధికారతకు ప్రత్యక్షసాక్షిని కానిండు.

వచించు: సర్వశక్తిమంతుని ధార్మికత్వముపై యాన! భగవంతుని యుపకృతుల పరిమాణము పూర్ణతనొందినది, సమగ్రతనొందిన దాయన దివ్యవాక్కు, ఆవిష్కృతమైన దాయన ముఖమండలప్రభ, సమస్తసృష్ట్యావృతమైన దాయన సామ్రాజ్యాధికారము, సాక్షాత్కృతమైన దాయన దివ్యావిష్కరణ వైభవము; ఇక సమస్తమానవాళిపైనను వర్షించిన వాయన యనుగ్రహములు.

CXXII

మానవు డొక మహారక్షరేఖ. అయినను, సముచిత విద్యాహైన్యత - ఆతడు స్వతస్సిద్ధముగ సముపార్జించుకొని యున్నదాని నాతనికి దూరము గావించినది. ఆతడు భగవంతుని ముఖతః వెలువడు నట్టి వచన మెుక్కదాని మూలమున సృష్టిలోని కాహ్వానితుడైనాడు; ఇంకొక వచనముతో దివ్యమగు తన జ్ఞానమూలమును గ్రహియింప నిర్దేశితుడైనాడు; వేరొక వాక్కుచే నాతని స్థానమును, లక్ష్యమును పరిరక్షితములైనవి. మహాస్తిత్వ మిట్లనుచున్నాడు: అమూల్య మణిమయసంపన్నమగు ఖనిగ మానవుని పరిగణింపుడు. కేవలము విద్యమాత్రమే - అది తన యైశ్వర్యములను వెల్లడించి, తన్మూలమున మానవాళి లబ్ధినొందునటు లొనరింపగలదు. భగవంతుని దివ్యాభీష్టస్వర్గమునుండి యనుగ్రహీతములైన పవిత్రలేఖనము లావిష్కరించినదాని నేమానవుడైనను పర్యాలోచించెనేని, వాటి లక్ష్యము - మానవు లెల్లరును ఒకే యాత్మగ పరిగణింపబడవలెననియు, తద్వారా, ప్రతి మానసముపైనను “ సామ్రాజ్యము భగవంతుని,” దను పదసహితముద్ర యంకిత మెునరింపబడుననియు, సమస్త మానవాళిని దైవానుగ్రహ, కారుణ్య, దాక్షిణ్యతేజ మావరించుననియు ఆతడు తక్షణమే గ్రహియింపగలడు. నిజైక దైవము—సమున్నత మాయన వైభవము—తన నిమిత్తము దేనినీ ఆశింపలేదు. మానవాళి విధేయత ఆయన కెట్టి లబ్ధినీ చేకూర్పదు, తద్వైపరీత్యము నష్టినీ కలిగింపదు. “నీకై సకలాంశముల నభిలషించి తిని, నిన్ను సైతము నీ నిమిత్తమే,” నని దివ్యభాషణ సామ్రాజ్యవిహంగ మవిచ్ఛిన్నముగ పలుకుచునే యున్నది. ఈ యుగవిబుధులును, లోకజ్ఞానులును - మానవాళిని, స్నేహానురాగ సౌరభము నాఘ్రాణింప నిచ్చియుండిన పక్షమున, ప్రతి యవగాహనాన్విత హృదయమూ, నిజస్వేచ్ఛాభావము నెఱిగి, అఖండ శాంతి, సంపూర్ణసాంత్వనముల రహస్యమును తెలిసికొని యుండెడిది. భువి యీ స్థాయి నొంది, తత్ర్పభా శోభితమైన యెడల, దానిని గురించి నిక్కముగ ననదగును: “నీవు దాని యందున నిమ్నోన్నతములను గాంచ,” వని.

CXXIII

మీకు పూర్వము గడచిన తరములు—ఎటకేగినవవి? ఇక, జీవితమున స్థానిక సౌందర్యవతులచే, లావణ్యాన్వితలచే పరివేష్టితులైన వారలు —ఎటనున్నా రిపుడు వారు? ఓ జనులారా, వారి యనుభవమున లబ్ధి నొందుడు; దారి తప్పినవారు కావలదు.

మీ స్వాధీనాంశము లచిరకాలమునకే యన్యుల హస్తగతమై, వారు మీ యావాసములలోని కరుదెంతురు. నా మాటలకు చెవి యొగ్గుడు; మూర్ఖుల మనిపించుకొనవలదు.

అన్యు డెవ్వడును అతిక్రమింపని, ఏ యొక్కడును తననుండి హరియింపని యట్టిదానిని తన నిమిత్త మెంచుకొనుటయే మీయందలి ప్రతియెుక్కని సర్వోత్తమకర్తవ్యము; మీరు గ్రహియించితిరేని, అది—సర్వశక్తిమంతుడే నా కిందులకు సాక్ష్యము—భగవంతుని ప్రేమయే.

వర్షమేని, వరదలేని యెన్నటికిని విధ్వంసము గావింపజాలనివియును, ఈ జీవనస్థితిగతులనుండి మిమ్ములను రక్షింపగలవియును నగు గృహములను మీకై నిర్మించుకొనుడు. ప్రపంచదూషితుడును, పరిత్యక్తుడును నగు ఆయన యాదేశమిది.

CXXIV

సచేతనుడును, శాశ్వతుడును నగు భగవంతుని యేకేశ్వరత్వము, సమస్తావధులకన్నను సమున్నతమును, సకలసృజితముల యవగాహన కతీతమును నగు యేకేశ్వరత్వము—ఎంత విచిత్రము! సామీప్యదుర్లభమైన తన పావనయశోధామమునం దాయన వసియించినాడు; తన సర్వస్వతంత్ర పరిపాలనావైభవపు సమున్నతస్థానములపై యనంతము దనుక, ఆయన ప్రతిష్ఠాపితు డగును. ఆయన దివ్యవిమలతత్త్వ మెంత యుదాత్తము, సమస్తసృజిత విషయ పరిజ్ఞానమునకన్నను యెంత విశిష్టము, సకలభూస్వర్గవాసుల ప్రస్తుతికన్నను యెంత సమున్నతము!

తాను సృజియించిన ప్రాణులయం దేయెుక్కటియును స్వీయస్థాయీ సామర్ధ్యముల మేరకు సృజితవస్తుజ్ఞానము నభివ్యక్తీకరించుటయందున తన భూమికకు దూరము గాకుండునటుల – ఉత్కృష్ట మూలమునుండియు, తన యౌదార్యానుగ్రహసత్వమునుండియు, ప్రతి సృజిత వస్తువునకును తచ్ఛిహ్నము నొకదాని ననుగ్రహించినా డాయన. ఈ చిహ్నము, సృష్టియం దాయన సౌందర్యదర్పణము. ఈ మహనీయ, మహోత్కృష్ట దర్పణమును మెఱుగువెట్టు ప్రయత్న మెంత మహత్తరముగనుండిన, అది యంతటి విశ్వసనీయముగను భగవంతుని నామధేయముల, లక్షణముల వైభవమును ప్రతిఫలించి, ఆయన చిహ్న, జ్ఞాన వైచిత్ర్యముల నభివ్యక్తము సేయును. ప్రతి సృజితాంశమును, తన పూర్వనిర్దేశిత స్థాయియొక్క సామర్ధ్యముల నభివ్యక్తము (మహత్తర మీప్రతిఫలనశక్తి) సేయునటు లొనరింపవడును; తన సామర్ధ్య, పరిధులను గుఱుతించును, “నిక్కముగ భగవంతు డాయన; వేరు దైవములే డాయన దక్క,” యను సత్యమునకు సాక్షీ భూతమగును. . . .

ప్రతి మానవుడును, తాను విచక్షణాపూర్వకముగ సేయు ప్రయత్నముల పర్యవసానముగను, తన స్వీయ ఆధ్యాత్మిక లక్షణముల యనువర్తన ఫలితముగను - దుర్ర్భమాప్రక్షాళితుడై, నిత్యపవిత్రతయను హరితభూములం జేరి, శాశ్వత సాహచర్యసభాంగణ సామీప్యుడగు నంతగా, ఐహికమాలిన్య కళంకము నుండి యీ దర్పణము ప్రక్షాళిత యగుననుట కెట్టి సందియమేని యుండబోవదు. అయినను, అట్టి వదాన్యతా సంలీనశక్తులు ప్రతి యంశపు కాలనిర్దేశ, ప్రతిఫలపు బుుతునిర్ణాయక క్రమమున యుత్తమముగ నభివ్యక్తీకృతములగును; కేవలము, భగవంతుని దివ్యయుగములయందుననే తత్పురస్కృతీ వసంతవైభవము సాక్షాత్కృతమగును. ప్రతి యుగమూ భగవంతుని యద్భుతౌదార్య స్థితమైన తన పూర్వాదేశిత భాగముతో ననుగ్రహీతయేయైనను, ఆయన దివ్యావతారమున కత్యంత సన్నిహితములైన దివ్యయుగములొక యపూర్వవైశిష్ట్యమును కల్గి, ఏ మేధస్సునకేని, ఎన్నటికేని దుర్ర్గాహ్యమేయగు విలక్షణస్థాయి నందియుండును. ఆ యనశ్వరానంద యుగములయందున భూస్వర్గవాసు లెల్లరి హృదయములును నిత్యవైభవాన్విత దివ్యాదిత్యుని సమక్షమునకు కొనిరాబడి, ఆయన యిచ్ఛావిధేయములు గావింపబడెనేని, వాటియందలి ప్రతిదియును ఆయన తేజమున భాసిల్లుచు, ఆయన యనుగ్రహపునీతయై, ప్రాపంచికాంశసమస్తమున కతీతముగ మహోత్కృష్టస్థానము నొందితినని గ్రహియించు లక్షణము వాటియం దంతర్లీనమై యున్నది. ఎంతటి మహదాశీస్సైనను అధిగమింపజాలని యీ కరుణకు సకల ప్రస్తుతి, సృష్టినేత్రమెన్నడును గాంచియుండని యీ సంప్రీతికి సమస్తమాన్యత! అవి తన కర్పించు ప్రశంసలకన్నను, తనను గురించి యొనరించు స్మరణములకన్నను - ఆయన సమున్నతుడు.

ఆ యుగములయం దెవ్వడును, ఎన్నడును తన సామీప్యుని యావశ్యకతకై నిరీక్షింపకుండుట, యీ హేతువుననే. అట్టి భగవన్నిర్దేశిత పవిత్రయుగమునం దాయన పవిత్రాంగణము నాశించి, దాని నొందినవారియం దత్యధికులు—పావనులును, పుణ్యాత్ములును నగు తాము దక్క అన్యుడెవ్వడును - ఆతడెంత దీర్ఘకాలిక ప్రబోధితుడైనను, అధ్యయనశీలియైనను - అందలి బిందువు నొక్కదానినేని యెన్నడును గ్రహియించీయుండని, ఇంకెన్నటికిని యెఱుగనూ జాలని యట్టి—విజ్ఞానవివేకములను ప్రదర్శించిరని, ఈ సరికే సవిస్తారముగ నిరూపితమైనది. దివ్యయథార్థభానుని సాక్షాత్కృత దివసముల యందున భగవత్ర్పియతములు మనుష్యజ్ఞాన సమస్తమునకన్నను సమున్నతీకృతులును, విశిష్టీకృతులును నైనది యీ శక్తి మూలముననే. అంతియేగాక, వారి హృదయముల నుండియు, వారి యంతర్గత శక్తులఝరులనుండియు- మనుష్య విజ్ఞాన వివేకముల యంతఃసత్త్వ మవిచ్ఛిన్నముగ వెల్లిగొనినది.

CXXV

ఓ నా సోదరుడా! నిజమైన యన్వేషి యుగప్రాచీనుని జ్ఞానమునకు దారితీయు పథమున కాలిడ నిర్ణయించుకొనిన యప్పుడు, ఆతడు భగవంతుని యంతర్మర్మముల యావిష్కరణాపీఠమైన తన హృదయమును, మునుముందుగ, సముపార్జితమైన సందిగ్ధజ్ఞానధూళీసమస్తము నుండియు, పైశాచిక వ్యామోహస్వరూపప్రతీకలనుండియు క్షాళన మొనరించుకొనవలె. పరమప్రియతముని నిరతానురాగము నకు ఆవాసమగు తన హృదయమును ప్రతి మాలిన్యము నుండియు క్షాళితమొనరించి, తన యాత్మను సమస్తజల, మృత్తికాసంబంధితములనుండియు, ప్రచ్ఛన్నములును, ఐహకములును నగు సకలానుబంధముల నుండియు - పునీత మెునరించుకొని తీరవలె నాతడు. రాగద్వేషముల యవశేష మెద్దియును మిగులకుండునటుల, అనురాగము గ్రుడ్డిగ తనను దోసమున కొగ్గనీయకుండునటుల, ద్వేషము సత్యమునుండి తన నావలకు త్రోసివేయకుండునటుల తన హృదయము నాతడు క్షాళన మొనరించుకొనవలె. ఈ దివ్యయుగమున, నీవు సైతము వీక్షింపుచున్నయటుల, అట్టి రాగద్వేషముల వలన జనులయం దధికసంఖ్యాకులు అమరాననమునకును, దివ్యమర్మ స్వరూపములకును దూరులై, విస్మృత్యపరాధ విపినమున, సంరక్షక రహితులై యెటుల ద్రిమ్మరుచుంటిరో!

ఆ జిజ్ఞాసువు, సర్వకాలములయందునను, తన విశ్వాసమును భగవంతునియందున యుంచవలె, లోకులను పరిత్యజింపవలె, మృత్తికాజగత్తునుండి స్వయంవిముక్తుడై, దేవాధిదేవుడగు ఆయనకు విధేయుడై యుండవలె. ఆతడెన్నడును, ఎవ్వనికన్నను, తనకే యాధిక్యత నాపాదించుకొన చూడరాదు, తన హృదయఫలకమునుండి గర్వాడంబర యవశేషము ప్రతిదానినీ ప్రక్షాళన గావింపవలె; సహనవైరాగ్యములకు విధేయుడు కావలె, మౌనమును వహియించి, వ్యర్ధభాషణమును వర్జింపవలె. ఏలయన, నివురుగప్పిన నిప్పు జిహ్వ; ప్రాణాంతక విష మధికప్రసంగము. ఐహికాగ్ని దేహమును దహియింప, జిహ్వాగ్ని మనస్సును, ఆత్మను సైతము దగ్ధము సేయును. తొలిదాని శక్తి స్వల్పకాలికమే యైనను, మలిదాని ప్రభావము లొక శతాబ్దము వరకుండును.

పరోక్షనింద హృదయజ్యోతి నార్పివైచి, ఆత్మజీవనము నంతమెుందించును గనుక, ఆ జిజ్ఞాసువు దానిని మహాపరాధముగ నెంచి, తత్ర్పాబల్యమునకును దూరము కావలె. ఆత డలతిన సంతుష్టుడై, ఆత్యాశా సమస్తమునుండి విముక్తుడు కావలె. విషయవాంఛాపరిత్యాగుల సాహచర్యము నార్జించి, స్వాతి శయులగు లోకజనులను వర్జించుట నొక యమూల్యప్రయోజనముగ నెంచవలె నాతడు. అనుదిన ప్రభాతమునను, ఆతడు భగవంతునితో సంభాషింపవలె, తన పరమప్రియుని యన్వేషణమున నిష్ఠాగరిష్ఠుడు కావలె. ఆయన సాదరస్మరణాగ్నితో సమస్తవ్యర్ధాలోచనములను దగ్ధము గావింపవలె; ఆయనను దక్క అన్యమునంతటినీ మెఱపువేగముతో నధిగమింపవలె. అభాగ్యుల కాతడు సాహాయ్య మొనరింపవలె, అనాధలయెడ యనాదరము నెన్నడును జూపరాదు. ఆతడు జంతువులపట్లనే కరుణను చూపవలెననగ, ఇక వాక్పటిమానుగ్రహీతుడైన తన సాటిమానవునిపట్ల యింకెంతటి యాదరణ నాతడు ప్రదర్శింపవలె! తన పరమప్రియునికై యాత్మార్పణ మెునరించుట కాతడు జంకనూరాదు, తనను సత్యవిముఖుని గావింపనెంచు జననింద కవకాశమునూ కల్పింపరాదు. తనకై యాశించుకొనని దాని నాత డన్యుల నిమిత్త మభిలషింపనూరాదు, నిలుపుకొనజాలని వాగ్దానము గావింపనూరాదు. ఆతడు దుర్జనసాంగత్యమును మనఃపూర్వకముగ వర్జించి, దుష్కృత్యములనుండి వారి విముక్తికై ప్రార్ధింపవలె. ఆతడు పాపిని క్షమియింపవలె, ఆతని యధోగతి నెన్నడును అసహ్యించుకొనరాదు, ఏలయన తన స్వీయాంత మెటులుండునో యెవ్వడును యెఱుగడు. మృత్యుఘడియలో పాపి విశ్వాసతత్త్వమును గ్రహియించి, అమరజలమును పుక్కిట గ్రోలుచు, ఊర్ధ్వలోక గణసముదాయము చెంతకు తన పయనము నారంభించుట యెన్ని సారులు జరిగియుండలేదు! మరి, భక్తిపరాయణుడగు విశ్వాసి, తన యాత్మారోహణ ఘడియయందున, అధోలోకాగ్నియం దణగునటుల మారిపోవుట యెంత తఱచుగ చోటుచేసుకొని యుండలేదు!

భగవంతుడువినా సర్వమూ నశ్వరమేనని గ్రహియించి, సమస్తారాధనకును లక్ష్యమగు ఆయనను దక్క సకలాంశములనూ శూన్యమని యెంచవలెనను భావనను జిజ్ఞాసువునకు కలిగించుటయే, ఈ యప్రతిహత, సాధికారిక వచనముల నావిష్కరించుటయందున మా యభిమతము.

ఉత్తముల లక్షణములలోనివి యివి; ధార్మికహృదయులకు విశిష్టతను జేకూర్చునవి యివి. సవ్యజ్ఞానమార్గమున పయనించు పథికుల యావశ్యకతల పరముగ యీసరికే ప్రస్తావితములైనవి యివి. విరాగపథికుడును, యథార్థ జిజ్ఞాసువునునగువా డీప్రధాన నియమములను పాటించిన యప్పుడు, కేవల మప్పుడే, ఆతడి నొక యథార్థాన్వేషిగ వ్యవహరింపవచ్చును. “మా కొరకు యత్నములం జేయు నాత,” డను సూక్తియందలి సూచితనిబంధనలను నిర్వర్తించినయపు డాతడు, “నిశ్చయముగ మా పథములయం దాతడికి నిర్దేశము గావింతు,” మను వాక్కులచే ప్రసాదితములైన యాశీస్సుల నాస్వాదించును.

జిజ్ఞాసువు మానసమునం దన్వేషణ, మనఃపూర్వకయత్నము, ప్రగాఢాభిలాష, నిశ్చలభక్త్తి, అవ్యాజానురాగము, మహదానందము, విషాదము లనబడు జ్యోతి ప్రజ్జ్వలితమై, ఆయన సంప్రీతిసమీర మాతడి యాత్మపైకి వీచినయపుడే దోషాంధకారము పారద్రోలబడి, శంకాసందిగ్ధములనెడు పొగమంచు తెరలు తొలగింపు కాబడి, జ్ఞాననిర్ధారణప్రభ లాతడి యస్తిత్వము నావరించును. మార్మికయగ్రగామి యా తరుణమున పరమాత్ముని శుభవార్తలను గైకొని, దైవనగరి నుండి ప్రభాతదీప్తివోలె తేజరిల్లి అలక్ష్యసుషుప్తినుండి హృదయమును, ఆత్మను, స్ఫూర్తిని జ్ఞానకాహళాధ్వానముతో జాగృత మొనరించును. అప్పుడు తనకొక నవ్యనేత్రమును, నవ్యశ్రవస్సును, నవ్యహృదయమును, నవ్యచిత్తమును అనుగ్రహీతములైనవని యన్వేషకు డెఱుగునటుల పవిత్ర, శాశ్వత దివ్యాత్మ బహువిధోపకృతులను, కారుణ్యవర్షమును, నవజీవనమును ఆతడికి ప్రసాదించును. ఆతడు విశ్వముయొక్క ప్రత్యక్షనిదర్శనము లను గురించి పర్యాలోచించి, ఆత్మయెుక్క నిగూఢమర్మముల లోతులను తెలిసికొనును. దైవచక్షువుతో వీక్షింపుచు, తనను సంపూర్ణనిర్ధారణా స్థానములకు గొనిపోవు ద్వారము నాతడు ప్రతి యణువునను వీక్షించును. ఆతడికి సమస్తాంశములయందునను దివ్యావిష్కరణా వైచిత్ర్యములును, అమరదివ్యావతార నిదర్శనములును కానవచ్చును.

భగవంతునిమీద ప్రమాణ మొనరింతును! మార్గదర్శనపథమున పయనించి, ఈ వైభవాన్విత మహోత్కృష్టస్థాయి నందుటకై ధార్మికశిఖరముల నధిరోహింప నెంచియుండిన పక్షమున, సహస్ర యోజనముల దూరమునుండియే దివ్యసౌరభము నాఘ్రాణించి, సకలాంశప్రభాతమున కెగువన యుద్భవిల్లు సుప్రకాశ మార్గదర్శనావతరణమును తిలకించి యుండెడివా డాతడు. ఆతడికి, ప్రతిది యును—అది యెంతస్వల్పమైనదైనను—తన యన్వేషణాలక్ష్యమైన పరమప్రియుని దెసకు తనను గొనిపోవు నవ్యావిష్కరణయే. ఈ జిజ్ఞాసువు యవగాహనమెంత మహత్తరమగు ననిన, వెలుగునీడల వ్యత్యాసము నెఱిగిన యటులే, సత్యాసత్యముల నాతడు గ్రహియించుకొనును. భగవంతుని మధుర సుగంధము లెచటనో దూరప్రాచ్యపరివ్యాప్తితములైననూ, ఆతడు తత్సౌరభమును - తాను సుదూర పశ్చిమమున వసియింపుచున్నను - నిశ్చయముగ గుఱుతెఱిగి యాఘ్రాణించును. అవ్విధముగనే, శిల యందలి రత్నమును రత్నపరీక్షకుడును, శిశిరవసంతముల, శీతోష్ణముల వ్యత్యాసమును మానవుడును యెఱుగునటులే, మనుష్యచర్యల, వాక్కుల, విధానములనుండి భగవంతుని సమస్తసంకేతములను—అనగా, ఆయన మహాద్భుత ప్రవచనములు, మహత్కృతులు, మహత్కార్యములు—ఆతడు స్పష్టముగ వింగడించుకొనును. యావత్ర్పాపంచిక, ప్రతిరోధకానుబంధములనుండియు ప్రక్షాళితయైనయపుడు మానవాత్మామాధ్యమము, అనంతదూరములనుండియే, నిర్నిరోధితముగ పరమప్రియుని జాడను గ్రహియించి, తత్పరిమళమున పథదర్శనమెుంది, నిర్ధారణా నగరమును చేరి, అందు ప్రవేశించును.

ఆత డందున, ఆయన ప్రాచీనవిజ్ఞతా వైచిత్ర్యముల నెఱిగి, తత్పవిత్ర నగరమున వికసించిన దివ్యమహీజ పత్రముల మర్మరధ్వానమునుండి సమస్త నిగూఢబోధనలనూ గ్రహియించును. తద్ధూళి నుండి దేవాధిదేవుని జేరు వైభవ ప్రపూరితసంకీర్తనలను బాహ్యాంతర్గత శ్రవస్సులతో నాలించి, “తిరోగమన”, “పునరుజ్జీవన” వైచిత్య్రములను, ఆతడు తన యంతర్దృష్టితో నవలోకించును.

దివ్యనామధేయములకును, సుగుణములకును రాజన్యుడగు ఆయన యా దివ్యనగరికి లక్షించిన చిహ్నములును, సంకేతములును, ఆవిష్కరణములును, ప్రాశస్త్యములును - ఎంతటి యనిర్వచనీయ వైభవప్రపూరితములు! ఆ నగరప్రవేశము తోయము లేకనే దాహము దీర్చును, అగ్ని లేకయే భగవత్ప్రేమను రగిలించును. ప్రతి గడ్డిపోచయందునను, అమోఘ విజ్ఞతామర్మములు నిక్షిప్తములై యున్నవి, ప్రతి గులాబిగుల్మముపైనను లెక్కకుమిక్కిలిగ కోయిలలు తమ మధురగీతిని, ఆనందపారవశ్యమున యాలపింపుచున్నవి. అందలి మనోహర తులిప్‌ కుసుమములు జ్వలననికుంజ నిరతాగ్ని మర్మముం దెలుపును; తత్పవిత్ర మధురపరిమళములు మెస్సయ్య స్ఫూర్తిసుగంధమును వెదజల్లును. అది స్వర్ణరహితైశ్వర్యమును, మృత్యురహిత యమరత్వమును ప్రసాదించును. అనిర్వచనీయానందములు దాని ప్రతి పత్రమునను సుభద్రములు; అసంఖ్యాక వైచిత్య్రములు ప్రతి శుద్ధాంతమునను నిక్షిప్తములు.

దైవాన్వేషణమున ధీరోదాత్తులై శ్రమియించువా రొక్కపరి, ఆయనను దక్క అన్యము నంతటినీ పరిత్యజించినప్పుడు, వారు ఆ దివ్యనగరితో క్షణమాత్రపు టెడబాటేని తమకు యూహాతీతమే యగు నంతగ ననుబంధము నేర్పరచుకొని, దానికే యంకితమగుదురు. ఆ జనసందోహపు హ్యాసింత్‌ నుండి యమోఘతార్కాణములను వా రాలింతురు; దాని గులాబియందము నుండియు, దాని కోయిల మధుర స్వనము నుండియు ప్రబలనిదర్శనములను గ్రహియింతురు. సహస్రవర్షముల కొకపరియగు నీనగరము పునర్నవీకృతమును, పునరలంకృతమును . . .

ప్రతి యుగమునను, ప్రతి దివ్యపాలనాకాలముననను ఆవిష్కృతమగు భగవద్వచనమే దక్క వేరొండుకా దాదివ్యనగరము. మోషే కాలమున గ్రంథ పంచకమది; యేసు కాలమున సువార్త యది; దైవదూతయైన మహమ్మదు కాలమునం దది ఖురాన్‌; ఈనా డది బయాన్‌; ఇక, భగవత్ప్రత్యక్షీకృతుని యీ దివ్యపాలనాకాలమున, పూర్వదివ్యపాలనాకాలిక పవిత్రగ్రంథములన్నియును నివేదితములు కావలసినదియును, వాటన్నింటి యందునను సర్వశ్రేష్ఠ, సర్వోత్కృష్ట దివ్యసంహితయైన - ఆయన స్వీయగ్రంథము.

CXXVI

మే మెటకు బహిష్కృతులమైననూ, మే మనుభవించు వేదన యెంత తీవ్రమైననూ, భగవత్ప్రజలు స్థిరసంకల్పముతో, సంపూర్ణవిశ్వాసముతో దివ్యవైభవప్రభాతము దెసకు తమ దృక్కులను సారించి, లోకకళ్యాణమునకును, లోకుల శిక్షణకును సముచితమగు దానియందున నిరతులు కావలె. పూర్వము మాకు వాటిల్లినవన్నియు మా దివ్యావిష్కరణ ప్రయోజనములను ప్రవృద్ధమెునరించి, తత్కీర్తిని శోభిల్లజేసినవి; మునుముందు మాకు సంభవిల్లువాని పర్యవసానము సైత మటులే యుండును. నిర్దేశకుడును, సకలవివేకియును నగు ఆయన యనుగ్రహించిన భగవంతుని దివ్యధర్మమునకు అంతఃకరణపూర్వకముగ బద్ధులు కండు. నిజమగు లబ్ధిని చేకూర్చుదాని దెసకు సమస్తప్రజలను, దేశము లను అత్యంత వాత్సల్యానుగ్రహములతో నామంత్రించి, నిర్దేశించినాము.

తన మధ్యందినప్రభాసమున శోభిల్లు సత్యభానుడు మాకు సాక్ష్యమును వహియించును! ప్రపంచ పునరుజ్జీవనమును, లోకజీవనోద్ధరణయును, తత్ప్రజల పునరుత్తేజమును దక్క భగవత్ప్రజలకు వేరొండు లక్ష్యము లేదు. సత్యసంధతయును, సౌహార్దమును వారి సమస్త మానవసంబంధములకును సదా విశిష్టత నిచ్చును. వారి బాహ్యప్రవర్తనము - వారి యంతర్గతజీవిత ప్రతిబింబము; వారి యంతర్గతజీవితము - వారి బాహ్యప్రవర్తనాదర్పణము. ఏ ముసువైనను వారి దివ్యధర్మమున కాధారభూతములైన ప్రబోధముల నాచ్ఛాదించి, మఱుగు పరచదు. సమస్త మానవనేత్రములకును ఈ ప్రబోధములు విశదీకృతములు, ప్రస్ఫుటగ్రాహ్యార్హములు. వారి కార్యములే యీ వాక్కుల యాథార్థ్యతను ధృవీకరించును.

ఈ దివ్యయుగమున ప్రతి వివేచనాయుతనేత్రమూ భగవంతుని దివ్యావిష్కరణోద్గమనప్రభను వీక్షింపగలదు; ప్రతి శ్రద్ధాన్వితశ్రవస్సూ జ్వలననికుంజ వాణిని గుఱుతింపగలదు. దివ్యకారుణ్యజలముల యుధృతి యెట్టిదనిన, భగవచ్ఛిహ్నముల ప్రత్యూషమును, ఆయన వైభవనిదర్శనముల యావిష్కర్త యును నైన యాయన, గోప్యతాచ్ఛాదనలు లేకయే ప్రపంచజనులతోడను, జనసంతతి తోడను సన్నిహితముగ మెలగుచు సంభాషింపుచుండును. మా దివ్యసాన్నిధ్యమున విద్వేషాన్వితహృదయులై ప్రవేశించి, యందుండి విధేయులుగను, ఆత్మీయులుగను నిష్ర్కమించిన మిత్రులెందరో! కారుణ్యద్వార ములు సమస్తజనులకును సువిశాలముగ దెరువబడియున్నవి. దురాత్ముడు సైతము, దైవవశమున, భగవంతుని యనంతక్షమాసాగరము నొందవచ్చునని పుణ్యాత్ములనూ, పాపాత్ములనూ మా బాహ్య వ్యవహారములయం దొక్కతీరుననే యాదరించినాము. “వరదు,”డను మా నామధేయము మానవుల కెట్టి భావమును కలిగించిన దనిన, తనను సైతము ధార్మికునిగనే బరిగణింపవచ్చునని మూర్ఖుడు భావించు కొనునంతగ. మమ్ముల నాశ్రయించువాని నెన్నడును మేము నిరుత్సాహపరుపము, తన వదనమును మాపై నిలిపిన వానికి మా సన్నిధి నిరాకృతమూ కాదు. . . .

ఓ మిత్రులారా! నిజైకదైవము—సమున్నత మాయన వైభవము—నకు మీ సత్కార్యముల తోడనూ, ఆయన దృష్టియం దామోదనీయములైన వ్యవహరణానువర్తనాదులతోడనూ సాహాయ్యము నందింపుడు. ఈ దివ్యయుగమున భగవత్సహాయకుడు కానెంచు నాతడిని, తన చక్షువులతో తన స్వాధీనమునయున్న దేనినీ విలోకింపనీయక, దైవికాంశముల నవలోకింపనిండు. తనకు లబ్ధిదాయకము లైన వాటితో నిరతుడు గాక, సర్వశక్తిమంతుని సర్వప్రేరకనామధేయమును సమున్నతీకరించు దానికి, ఆతడిని ప్రాధాన్యత నివ్వనిండు. దైవభీతి తనకు విజయమును చేకూర్చునట్టి యాయుధమును, తనకు లక్ష్యము నొనగూర్చు ప్రధానసాధనమును అగుటం జేసి, సమస్త దుర్వ్యామోహముల నుండియును, దుర్వాంఛల నుండియును తన హృదయము నాతడు క్షాళన మొనరించుకొనవలె. దైవభీతి, ఆయన దివ్యధర్మమును రక్షించు ఘనఫలకము; ఆయన యనుయాయులకు విజయమునిచ్చు లఘుఫలకము. ఈ కేతనమును సమ్మానించుట యెవ్వనికైనను అశక్యమే; ఏ యధికారమునకును సరిపోలని శక్తి యిది. తత్సాహాయ్యమున, దివ్యదళాధిపతి యానతిన, భగవత్సామీప్యులు మానవహృదయదుర్గములను జయించి వశపరచుకొనగలిగినారు.

CXXVII

ఓ ప్రజలారా, భగవంతుని తెలిసికొనుటయును, ఆయన శక్త్యాధిక్యత నెఱుగుటయును మీ యభీష్టమేని, నన్ను నా నేత్రములతో దక్క, అన్యుని కన్నులతో నిక వీక్షింపవలదు. అటుల కాదేని, నా దివ్యధర్మమును గురించి నా దివ్యసామ్రాజ్యము పరిఢవిల్లునందాక పర్యాలోచించినను సమస్త సార్వభౌముడును, సర్వశక్తిశాలియును, అమరుడును, సకలవివేకియును నగు భగవంతుని సర్వాంతరిక సృజితవస్తుసమస్తమును ధ్యానించినను, మీ రెన్నటికిని నన్ను గుఱుతింపజాలరు. దైవవశమున, జను లౌదాసీన్యజాగృతులును, అవగాహనాన్వితులును కావచ్చునేమో యని, ఇవ్విధముగ మా దివ్యావిష్కరణ సత్యము నభివ్యక్తమొనరించినాము.

మానవుల హృదయములు భయకంపితములైన దినములయందున, వారు భగవత్ప్రియతముల కును, ఆయన విరోధులకును కనుపింపక దాగుకొని తమ వైయక్తిక శాంతిభద్రతలయెడనే శ్రద్ధను వహియించుకొనిన దినముల యందున - నా విరోధులు నన్నెటుల ముట్టడించిరో, ఆయనయెడల మానవుల విశ్వాసమును పరిరక్షించుటకై నన్నును, నా వారలను దైవపథమున స్వయముగ నెటుల సమర్పించుకొంటినో పరిపూర్ణముగ నెఱిగియున్న యీ జనుల దీనస్థితి నవలోకింపుము.

తుదకు భగవంతుని దివ్యధర్మమును స్థాపించుటయందున మేము సఫలీకృతులమై, దానిని - యీ దివ్యతరుణునికి వ్యతిరిక్తులై తమ హృదయముల యందున దుర్బుద్ధిని ప్రవృద్ధ మొనరించుకొని, సమస్తశక్తిమంతునికి సమానులమని చెప్పుకొనినవారు దక్క జనులెల్లరును భగవంతుని సార్వభౌమత్వమును, ఆయన మహాసామ్రాజ్యమును గుఱుతెఱుగునంతటి ప్రముఖస్థానమునకు – సముద్ధరించినాము. అయినను, నీ సమస్తసృష్ట్యావృత ప్రభావశీలయైన యీ దివ్యావిష్కరణను గ్రహియింపక, తమ యందలివా డెవ్వడును, ఎన్నడును వీక్షించి యుండని యీ దివ్యజ్యోతిర్ప్రభాసము నలక్ష్యముచేసి, బయాన్‌ జనులు నన్నెటుల తిరస్కరించి, నాతో వితర్కించిరో చూడుము. కొందరు దైవపథవిముఖులై, తాము విశ్వసించినట్టి ఆయన యధికారమును తిరస్కరించి, మహాశక్తియుతుడును, పరమపరిరక్షకుడును, మహోదాత్తుడును, మహనీయుడును నైన భగవంతుని యెడ అమర్యాదగ వర్తించి నారు. మరికొందరు సందియము నొంది, ఆయన దివ్యపథమున నిలిచిపోయి, నా దివ్యేచ్ఛాప్రయోగ సృజితుని యామోదముతో నిరూపితమగునంత దనుక, సృష్టికర్త దివ్యధర్మపు మూలసత్యమును, విలువ మాలినదిగ పరిగణించినారు. తమ కృత్యము లావిధముగ నిష్ర్పయోజనములైనను, దానిని గ్రహియించుటయందున వారు వైఫల్యము నొందినారు. వారి యందున - స్వీయప్రమాణానుసారము భగవంతుని గణియింపనెంచి, నాకు విరుద్ధముగ నుద్యమించునంతగ భగవన్నామధేయములచే భ్రమనొంది, మరణ దండనకు తగుదునని నన్ను దూషించి, తా నకృత్యములకు పాల్పడియు, వాటిని నా కాపాదించినవాడును కలడు.

కావున, నన్ను సృజియించి, నాకు తన దివ్యసందేశము నొప్పగించిన ఆయనకు నా వ్యథా విషాదములను నివేదింతును. నా కాయన విధియించిన వానికిని, నా యేకాంతమునకును, ఆయనకు దూరముగ తొలగబాఱిన యీ మనుజుల బారినవడి నే ననుభవింపుచున్న యావేదనకును - ఆయనకు కృతజ్ఞతల నర్పించి, ప్రస్తుతింతును. నాకు వాటిల్లిన సంక్షోభమును సహిష్ణువునై సహియించితిని, సహియింపుచునే యుందును; నా నమ్మికను, పూర్ణవిశ్వాసమును భగవంతునియందే నిలిపియుంతును. ఆయనను: ‘ఓ ప్రభూ, నీ సేవకులను నీ యౌదార్యానుగ్రహ సంస్థానమునకు నిర్దేశింపుము; నీ కారుణ్య వైచిత్య్రములకును, నీ బహువిధానుగ్రహములకును వారిని దూరుల గావింప వలదు. నీ సమస్త సృష్ట్యావృత దాక్షిణ్యము కొలది నీవు తమ కనుగ్రహించిన దానిని వా రెఱుగరు. ఓ ప్రభూ, బాహ్యముగ వారు బలహీనులు, అసహాయులు; అంతర్గతముగ యనాధలే. నీవు సకలవదాన్యుడవు, ప్రదాతవు, మహోన్నతుడవు, మహాఘనుడవు. ఓ నా దేవా, వారిపై నీ క్రోధాతిరేకతను ప్రదర్శింపవలదు; దైవవశమున వారు నీ చెంతకు మరలివచ్చి, నీయెడ తా మెునరించిన వానికి నీ క్షమ నర్ధింతురేమో, నీ కారుణ్యవైచిత్య్రములు ప్రదర్శితము లగునందాక, వారు ప్రతీక్షించునటు లొనరింపుము. నిక్కముగా, నీవు క్షమాపకుడవు, సకల కరుణాన్వితుడ,’ వని వేడుదును.

CXXVIII

వచించు: సకల కరుణాన్వితుడైన తన ప్రభుని యనుయాయినని జెప్పుకొనుచు, తన హృదయమున దుష్టాత్మకృత్యములను జేయుట మానవునకు తగునా? తగదు, అది యుక్తముకా దతడికి; సకలసంకీర్తితుని దివ్యసౌందర్యమగు ఆయన న న్నిందులకు సాక్షీభూతుని గావించును. దానిని మీరు గ్రహియింప గలిగెదరా.

లౌకికవిషయవ్యామోహమును మీ హృదయములనుండియు, దైవస్మరణమును దక్క వేరొండు స్మరణమును మీ జిహ్వలనుండియు, ఆయన వదనమును వీక్షింపనీయక మిమ్ములను ప్రతిరోధించు వాటినేని, దుష్టములును, నీతిబాహ్యములును నగు మీ వాంఛాప్రేరణల ననుసరించునటుల మిమ్ము ప్రలోభపెట్టువాటినేని మీ సంపూర్ణాస్తిత్వమునుండియు - తొలగింపుడు. ఓ జనులారా, దైవమునకు భీతిల్లుడు, ధర్మపథగాములు కండు.

వచించు: ఓ జనులారా, మీ వర్తనము మీ ప్రకటనములకు భిన్నముగ నుండుచో, తమ ప్రభుడగు దేవదేవునియందు తమ విశ్వాసమును వెల్లడింపుచునే, ఆయన తమ చెంతకు పవిత్రతామేఘములపై యరుదెంచినయంతనే, ఆయన నంగీకరింపనొల్లక, ఆయన సత్యమును తిరస్కరించిన వారికన్నను విభిన్నులమని మీ రెటుల భావింతురు? ఈ ప్రపంచముపట్లను, తదాడంబరముల పట్లనుగల సమస్త వ్యామోహములనుండియు విముక్తులు కండు. మీ వైయక్తికలాలసలను, మీ కుటిలవాంఛలను వెన్నంటి సాగునటుల మిమ్ములనవి ప్రేరేచి, వైభవప్రపూరిత బుజుపథమున ప్రవేశింపనివ్వక మిమ్ము నిరోధించును కనుక, వాటిని సమీపింపక, జాగరూకులు కండు.

“ప్రపంచ,” మనగా, మీ సృష్టికర్తపరముగ మీ యజ్ఞతయనియు, ఆయన దక్క యన్యమున వ్యగ్రతయనియు - అర్ధమని తెలియుడు. కాగా, “ఆగామి జీవితము,” సకలవైభవాన్వితుడును, అప్రమేయుడును నగు భగవంతుని దరిజేర్చు సురక్షితమార్గము జూవు యంశములను మీకు సూచించును. ఈ దివ్యయుగమున భగవంతుని ప్రేమించనీయక మిమ్ము నిరోధించునది కేవలము ప్రపంచమే. మీ రనుగ్రహీతులుగ పరిగణింపబడవచ్చును గాన, దానిని త్యజియింపుడు. స్వర్గముల యందేని, భువియందేని సృజితమైన ప్రతి సముచితాంశమును, భగవంతుడు తన సేవకులయందున నిజముగ తనను విశ్వసించినవారి నిమిత్తము నిర్దేశించినందున, ఆయనకును తనకును మధ్యగ నడ్డు రానంత దనుక, ఐహికాభరణములతో తన నలంకరించు కొనవలెననియు, సంబంధిత వస్త్రములను ధరియింపవలెననియు, అది యెునగూర్చు ప్రయోజనముల నొందవలెననియు - ఏ మనుజుడైనను యెంచెనేని, ఆతడి కెట్టి కీడును వాటిల్లజాలదు. ఓ మానవులారా! భగవంతుడు మీ కనుమతించిన సముచితాంశముల ననుభవింవుడు, ఆయన యద్భుత బహూకృతులకు మీకుగ మీరు దూరులు కావలదు. ఆయనకు ధన్యవాదముల నర్పింపుడు, ప్రస్తుతింపుడు; సత్యముగ కృజ్ఞులు కండు.

నిజగృహమును వీడి, దైవసాన్నిధ్యము నర్ధించినవాడా! మానవులకు నీ ప్రభుని సందేశము నుద్ఘోషింపుము; తద్వారా, అది వారిని దుర్వాంఛాప్రేరణల ననుసరింపనీయక, దైవవశమున, ప్రతిరోధించి, వారిచే - మహోత్కృష్టుడును, మహాఘనుడును నగు భగవంతుని స్మరణము జేయింప వచ్చును. వచించు: ఓ జనులారా, దైవభీతిని వహియింపుడు; ఎవ్వని రుధిరమునైనను చిందింపవలదు. మీ సామీప్యునితో కలహింపవలదు; సత్కర్మాచరణులు కండు. భువిపై క్రమవిధానము స్థాపితమైన వెనుక, దానిపై యిక మీరెట్టి యక్రమములకును పాల్పడక, జాగరూకులు కండు; పెడత్రోవ బట్టినవారి యడుగుజాడల ననుసరింప వలదు.

మీ యందున తన దేవదేవుని దివ్యధర్మమును బోధించుట కుద్యుక్తుడగు నాత డందరికన్నను మునుముందుగ తనకుతాను బోధించుకొనవలె; తన్మూలమున, ఆతడి సంభాషణ మాతడి పల్కులను వినువారి హృదయముల నాకట్టుకొనవచ్చును. ఆతడు తనకు తాను బోధించుకొననిచో, ఆతడి ముఖతః వెలువడిన వాక్కు లన్వేషకుని హృదయమును ప్రభావిత మెునరింపవు. ఓ జనులారా, ఒక వంకన యితరులకు సదుపదేశములను చేయుచునే, ఇంకొక వంకన వాటి యనుసరణను విస్మరించువారలు గాక, జాగరూకులు కండు. ఇట్టి మాటలును, మాటల కన్నను సమస్తాంశముల యాథార్ధ్యతలును, ఈ యాథార్ధ్యతలకన్నను భగవత్సామీప్య దేవదూతలును - వారల కసత్యవాదులను అపనిందను తెచ్చిపెట్టును.

అట్టి మానవు డెవ్వనినేని ప్రభావిత మెునరించుటయం దెన్నడైనను సాఫల్యము నొందినచో, తద్విజయమును - ఆతడికి గాక, సర్వశక్తిమంతుడును, సకలవివేకియును నగు ఆయన నిర్దేశించిన యటుల, భగవద్వచనముల ప్రభావమునకే యాపాదింపవలె. భగవంతుని దృష్టియం దాతడు సదా తననుతాను దహియించుకొనుచునే వెలుతురు నిచ్చునట్టి దీపికగ మన్నన నొందును.

వచించు: ఓ జనులారా, మీ కవమానమును కలుగజేయునట్టి, మనుజుల దృష్టి యందున భగవంతుని దివ్యధర్మము నధఃకరించునట్టి దానికి మీరు సమకట్టవలదు; వంచకులును కావలదు. మీ మనస్సు లసహ్యించుకొను వాటి దరిజేరవలదు. సకల దుర్వర్తనారీతులనూ వర్జింవుడు; ఏలయన, అట్టివి - భగవంతుడు సమస్తాపరాధముల దుష్ర్పభావమునుండియు ప్రక్షాళితులం గావించి, వునీతుల యందున పరిగణించినవారలు దక్క వేరెవ్వరును స్పృశియించి యుండని దివ్యగ్రంథమున - మీకు నిషిద్ధములు.

మీ చర్యలవలన మా విధేయ పరిజనులయందున ధర్మప్రతీక లభివ్యక్తము లగునటుల మీపట్లను, అన్యుల యెడలను నిష్పాక్షికులు కండు. మీ సామీప్యుని సొత్తుపై దురాక్రమణ మొనరింతురేమో, జాగ్రత్త. ఆతడి నమ్మికకును, విశ్వాసమునకును మిమ్ముల నర్హులుగ నిరూపించుకొనుడు; మీకు దైవానుగ్రహ ప్రసాదితములైన బహూకృతులను, దీనుల కందనీయక నిరోధింపవలదు. నిక్కముగ, దాతల కాయన పరిహారమునిచ్చి, వా రొసంగిన దానికి ద్విగుణముగ ననుగ్రహించును. ఆయన దక్క అన్యదైవము లేడు. సమస్తసృష్టియూ, తత్సామ్రాజ్యమూ - ఆయనవే. ఆయన తన బహూకృతులను, తా నభిలషించువారల కొసంగును; ఉపసంహరింపనెంచు వారల కుపసంహరించును. ఆయన మహాదాత, పరమోదారుడు, దయాళువు.

వచించు: ఓ బహా ప్రజలారా, భగవంతుని దివ్యధర్మమును బోధింపుడు; ఏలయన తన దివ్యసందేశ ప్రకటనాకర్తవ్యమును భగవంతుడు ప్రతి యెుక్కరికిని నిర్దేశించినాడు. సకలకార్యముల యందునను యిది మహోన్నతమైనదిగ పరిగణింపబడినది. దివ్యధర్మబోధన మొనరించునాత డంతకు మునుపే, మహోన్నత పరిరక్షకుడును, దూయాళువును, సర్వశక్తిమంతుడునునైన భగవంతునియందున ప్రగాఢవిశ్వాసియైనపుడే - అట్టి కార్య మామోదనీయము. అంతియేగాక, తన దివ్యధర్మము ప్రబోధితము కావలసినది మానవుల వాక్శక్తితో దక్క, హింసా ప్రయోగముతో కాదని బోధించినా డాయన. జాగ్రత్త, పరమప్రకీర్తితుడును, సకల వివేకియును నగు ఆయన సామ్రాజ్యమునుండి ఆయన నిర్దేశ మవ్విధముగ భువికంపబడినది. మీ రెవ్వరితోనైనను కలహింతురేమో; వలదు, కరుణాన్వితవిధానముతో, ఆత్యం తామోదయోగ్య ప్రబోధముతో సత్యము నాతడి కెఱుకపరుప శ్రమియింపవలె. మీ శ్రోత స్పందించుచో, తన వైయక్తికలబ్ధికై స్పందింపవచ్చును; లేనిచో నాతడికి తిరోఙ్ముఖులై దేదీప్యమాన పావనపీఠమైన భగవంతుని పవిత్ర సాన్నిధ్యమువంకకు మీ వదనములను కేంద్రీకరింపుడు.

ప్రాపంచికవిషయములనూ, తద్వ్యవహారములనూ—వాటిపై తమ మక్కువను నిలువుకొనిన వారి నిమిత్తమే భగవంతుడు వదలివైచినాడు గనుక, ఇక వానిని గురించి ఏ యొక్కనితోడను వితర్కింప వలదు. ఆవిష్కరణోచ్చారణా గణములు జయింపగల జనహృదయములను యావత్ప్రపంచము నుండియు తననిమిత్త మెంచుకొనినా డాయన. సర్వోత్కృష్టనిర్దేశకుడును, సర్వజ్ఞుడును నగు భగవంతుని యానతిన, ఆయన యప్రతిహత నిర్ణయదివ్యఫలకమున బహా దివ్యాంగుళు లిట్లు శాసించినవి.

CXXIX

భగవన్మార్గము నందలి ఓ పథికుడా! ఆయన కారుణ్యాంబుధి యందలి నీ భాగమును గ్రహియింపుము, తదగాధములయందున నిగూఢముగ దాగియున్నవాటిని గోలుపోవలదు. తదైశ్వర్య పరిగ్రహీతవు గమ్ము. భూస్వర్గముల యందలి సర్వులపైనను సంప్రోక్షితమైన యెడల, యీ మహాంభోధి బిందు వొక్కటియే సర్వశక్తిమంతుడును, సమస్తజ్ఞానియును, సకలవివేకియును నగు భగవంతుని యనుగ్రహముతో వారిని సుసంపన్నుల నొనరింపవచ్చును. దాని జీవప్రదానజలములను పరిత్యాజ్య హస్తములతో సంగ్రహించి సమస్తసృజితముల పైనను సత్వరమే చిల్కరింవుము. తన్మూలమున, మానవనిర్దేశిత పరిధులనుండి యవి ప్రక్షాళితములై, భగవంతుని మహాపీఠమగు యీ పరమపవిత్ర, మహోజ్జ్వల దివ్యస్థలి సామీప్యత నొందవచ్చును.

నీవు మాత్రమే దీనిని నెరవేర్పవలసివచ్చెనేని, విచారింపవలదు. నీకు భగవంతుడినే సర్వస్వము కానిమ్ము. ఆయన దివ్యాత్మతో ననురక్తితో సంభాషించి, కృతజ్ఞులయం దొకడవు కమ్ము. సమస్త భూస్వర్గవాసులకును నీ ప్రభుని దివ్యధర్మము నుద్ఘోషింపుము. నీ పిలుపున కెవ్వడైనను స్పందించెనేని, నీ దివ్యప్రభుని, నీ భగవంతుని దివ్యాత్మ నీ కనుగ్రహించినయట్టి ఆయన విజ్ఞానమౌక్తికముల నాతడి యెదుట ప్రదర్శించి, యథార్థవిశ్వాసివి కమ్ము. ఎవ్వడైనను నీ ప్రతిపాదనముం దిరస్కరించెనేని, ఆతడిని వీడి, నీ దైవమును, సకలలోకాధీశుడును నగు దేవదేవునియందున నీ నమ్మికను, విశ్వాసమును నిల్పుము.

భగవంతుని ధార్మికత్వముపై యాన! ఈ దివ్యయుగమున తన యధరములం దెరచి తన దేవదేవుని నామప్రస్తావన మొనరించు నాతడికై, దైవస్ఫూర్తి సేనలు సర్వజ్ఞుడను, సకలవివేకియునునగు నా నామధేయస్వర్గమునుండి దిగి వచ్చును. ఊర్ధ్వలోకదివ్యగణము సైతము - ఒక్కొక్కరును స్వచ్ఛతమ తేజోకలశము నూర్ధ్వీకృత మొనరింపగ - ఆతడి నిమిత్త మవరోహించును. సకల కీర్తిసమన్వితుడును, మహాశక్తియుతుడునునగు ఆయన యానతిమేరకు, భగవంతుని దివ్యావిష్కరణ సామ్రాజ్యమునం దిటుల పూర్వనిర్దేశితమైనది.

మానవులకు ప్రత్యక్షీకృతులును, ఆయన దివ్యధర్మమునకు తోడ్పడు వారును, సమస్త మానవజాతియు వ్యతిరిక్తముగ నుద్యమించి పోరుసల్పినను భీతిల్లకయుండు వారును నైనయట్టి ఆయన నియుక్తుల దళమెుక్కటి పవిత్రాచ్ఛాదనా నిక్షిప్తయై భగవత్సేవకు సంసిద్ధము గావింపబడియున్నది. భూ స్వర్గవాసుల కన్నుల యెదుట యుద్యుక్తులై, ఉచ్చైస్వనమున సమస్తశక్తిశాలి నామధేయము నుద్ఘోషింపుచు, సమస్తకీర్తియుతుడును, సకలప్రశంసితుడును నగు భగవంతుని పథమునకు మానవుల నామంత్రింపువారు - వారే. వారి పథము ననుసరింపుము; ఎవ్వరికినీ వెఱవవలదు. ఎవరిని వారి సృష్టికర్తపథమున యెంతగ వేధించినను ప్రపంచ కలకలము వారల నెన్నటికినీ విషణ్ణులను గావింప జాలదో, దోషారోపకుని యారోపణ మెవరి లక్ష్యము నెన్నటికినీ భగ్నము గావింప జాలదో -అట్టి వాడవు కమ్ము.

భగవంతుని దివ్యఫలకముతోడను, ఆయన చిహ్నములతోడను బయల్వెడలి, నన్ను విశ్వసించిన వారితో పునస్సమాగమమునొంది, పరమపావనమగు మా దివ్యస్వర్గసమాచారమును వారల కుద్ఘోషింపుము. అటులే, భగవత్సముల మని ప్రకటించుకొనినవారిని హెచ్చరింవుము. వచించు: ఓ జనులారా, మహాబలోపేతుడును, మహాప్రకీర్తితుడును, మహామహిమాన్వితుడును నగు భగవంతుని కడ నుండి మీకై యొక సందేశముతో, కీర్త్యాసనమునుండి మీ చెంతకు పంపవడినాడను; నా హస్తమున - మీకును, మీ పూర్వీకులకును ప్రభుడైన భగవంతుని ప్రామాణ్య మున్నది. మీ చెంతనున్న దైవప్రవక్తల, దివ్యదూతల ప్రామాణిక న్యాయతులతో దానిని ప్రమాణీకరింవుడు. అది సత్యనిరూపితమని యెంతురేని, దైవసంబంధితమని విశ్వసింతురేని, ఇక దానిపై వితండవాద మొనరించి, మీ కార్యములను వ్యర్ధము గావించుకొని, నాస్తికు లనిపించుకొనెదరేమో, జాగ్రత్త. నిక్కముగ, భగవంతుని సృజితజీవుల కాయన దివ్యధర్మప్రామాణికతను ప్రదర్శించి భూ, స్వర్గములకు మధ్యన స్వచ్ఛతాప్రతీకలను సముద్ధరించిన సత్యసత్త్వమున, భువికంపవడిన దైవచిహ్నమిది.

వచించు: దివ్యాంగుళీసూచిత వాక్సమన్వితయై, భగవంతుని యప్రతిహత శాసనభాండారమై, అభేద్యవైచిత్య్రపు ముసువుతో నాచ్ఛాదితయై, సర్వశక్తియుతుడును, యుగప్రాచీనుడునునగు ఆయన యనుగ్రహచిహ్నముగ నిపుడు భువి కంపవడిన సుభద్ర, మార్మిక శ్రీముఖ మిది. సమస్త భూస్వర్గవాసుల భవితవ్యములను నిర్ణయించి, సమస్తవస్తు పరిజ్ఞానపు టాద్యంతముల నిందున మేము లిఖియించినాము. గ్రహియింప జాలితిరేని, పూర్వసృ జితమైనను, భావి కాలమున సృజితము కానున్నదైనను ఆయననుండి పలాయితమూ కాజాలదు; ఆయన నవరోధింపనూ జాలదు.

వచించు: దైవానుగ్రహీతమైన దివ్యావిష్కరణ మనివార్యముగా, పునరావృత మెునరింపబడినది; మా విస్ఫారిత శక్తిసమన్విత హస్తము సమస్త భూస్వర్గ వాసులనూ సమాచ్ఛాదించినది. సత్యము, కేవలము సత్యము యొక్క శక్తి తోడనే, మా యభేద్యవైచిత్య్రపు సూక్ష్మాతిసూక్ష్మతేజోమయూఖము నొక్కదానిని మేము వెలువరించినాము; గతియించిన సైనాయి వైభవప్రకాశమును గుఱుతించిన వారలు, అదిగో, మా దివ్యావిష్కరణ సైనాయి నావరింవుచున్న యీ శోణప్రభాస విద్యుల్లతను లిప్తమాత్రమున వీక్షించినయంతనే, క్షయించినారు. సకల కరుణాన్వితుని దివ్యసౌందర్యమైన ఆయన, అవ్విధముగ తన నిదర్శనమేఘముల యందవతరించినాడు; సమస్తవైభవోపేతుడును, సర్వవివేకియును నగు భగవంతుని యిచ్ఛానుసారము నిర్ణయ సాకారమైనది.

వచించు: మహోన్నత దివ్యలోకవాసినివైన ఓ స్వర్లోకసేవికా, నీ పావన కక్ష్యనుండి వెలికిరమ్ము. నీకు నచ్చినయటు లమరత్వచీనాంబరాచ్ఛాదితవై, సకలవైభవోపేతుని నామధేయమున, సాలంకృత ప్రభాసాంచలమును ధరియింపుము. అటుపై, దుర్లభుడును, మహోన్నతుడును నగు నీ ప్రభుని యాసనము నుండి వినవచ్చు మహాద్భుత దివ్యస్వరాలాపనము నాలింపుము. నీ వదనము ననాచ్ఛాదిత మెునరించి, వినీలనేత్రవిలాసిని సౌందర్యమును ప్రదర్శింపుము, భగవత్సేవకులను, నీ ప్రదీప్త ముఖవర్చస్సు నవలోకింపజాలని యభాగ్యుల నొనరింపవలదు. భూలోకవాసుల నిట్టూర్పులనైనను, స్వర్లోకవాసుల విలాపవాణినైనను ఆలించితివేని చింతింపవలదు. వినాశధూళిపై వారిని నశియించి పోనిమ్ము. వారి హృదయములయందున మత్సరజ్వాల ప్రజ్జ్వలితమగుటం జేసి, వారిని, నిశ్శేషులను గానిమ్ము. అటుపై, భగవన్నామధేయ గుణవిశేషణముల రాజన్యుడగు ఆయనను స్మరియించుటకై - భూ, స్వర్గవాసుల యెదుట, సుశ్రావ్యస్వరమున సంస్తవగీతి నాలపింపుము. నీ పరమావధి నా విధముగ నిర్ణయించినాము. మేము మా లక్ష్యమును సాధించుకొన సర్వసమర్థులము.

దివ్యపావనతాసారమగు నీవు, నీ మహాతేజాన్విత యశోవస్త్రరహితుడ వగుదువేమో, జాగరూకుడవు కమ్ము. అంతియేగాక, సృజితాంశసమస్తమునను, నీద్వారా సర్వశక్తిమంతుని మనోజ్ఞ స్వరూపము ప్రతిఫలించునటుల, నీ ప్రభుని కారుణ్యము సమస్త సృష్టియందునను తన పూర్ణశక్తితో సుప్రవేశితమగునటుల, నీ ప్రభుని విమలవసనములతో సృష్టిసామ్రాజ్యమునం దనంతభాగ్యశాలివి కమ్ము.

నీవు నీ దేవదేవుని వాత్సల్యసౌరభము నెవ్వనియందేని యాఘ్రాణించుచో, ని న్నాతడి కర్పించు కొనుము; ఏలయన, ఈ లక్ష్యసాధనకై నిన్ను మేము సృజియించి, మా శుభానుగ్రహపాత్రుల సమూహ సమక్షమున స్మృత్యతీతకాలము నుండియు నీతో యొడంబడి యున్నారము. అంధమనస్కులు నీపై తమ శుష్క వ్యామోహశూలములను ప్రయోగించిరేని, సహనము గోలుపోవలదు. దుష్ప్రేరణల ననుసరింపు చున్నారు కనుక, వారిని వారికే వదలివేయుము.

భూస్వర్గవాసులు తేరిచూడ, ఇవ్విధముగ నుద్ఘోషింపుము: నేను బహాతత్త్వ సంజనిత సంతతినైన స్వర్లోకదివ్యసేవికను. సకలవైభవోపేతుడగు ఆయన దివ్య నామధేయసౌధమే నా యావాసము. ఊర్ధ్వలోక దివ్యగణసమక్షమున ఆయన నామధేయాభరణ విభూషితనైతిని. అనుల్లంఘనీయ భద్రతాచ్ఛాదనా పరిరక్షితనై మానవనేత్రముల కగుపింపకుండునటుల నిక్షిప్తితనైతిని. దాక్షిణ్యవల్లభుని దక్షిణ హస్తము నుండి యుద్గమింపుచు, అసదృశమాధురీసమన్విత కంఠస్వరమొక్కటి వినవచ్చిన యటుల నా మదికి తోచినది; చూడు మిక, తత్‌స్వరాలాపముల నాలింపవలెనను యపేక్ష కొలదియు, వానిని గావించిన యా దివ్యుని సౌందర్యము నవలోకింపవలెనను యాకాంక్షకొలదియు - స్వర్గమంతయూ నా సమక్షమున చైతన్యాన్వితయు, ప్రకంపితయు నైనది. నిత్యత్వజిహ్వ ఖయ్యూముల్‌- ఆస్మా యందున ప్రవచింప నుంకించిన సూక్తులను ఈ జ్యోతిర్మయ దివ్యఫలకమున, మధురతమమగు భాషలో మే మావిష్కరించినాము.

వచించు: ఆయన తన సార్వభౌమత్వముతో, తన యభీష్టానుసార మాదేశించును; తా నిచ్ఛయించుదానిని తన యాదేశానుసారమే నెరవేర్చును. ఆయన యాజ్ఞాపింప నభిలషించువానిని గురించి, ఆయన నడుగదగదు. సత్యముగా, ఆయన యనిర్బంధనుడు, సకలశక్తిమంతుడు, సర్వవివేకి.

భగవంతుని విశ్వసింపక, ఆయన సార్వభౌమత్వము నెదిరించిన వారలు, తమ నీచవాంఛాభీష్టముల కసహాయ బలిపశువులు. వారు తమ నరకాగ్ని స్థితావాసమునకు మరలవలె: తిరస్కారుల యావాసము దుఃఖభాజనమే!

CXXX

నీవు సంపదయం దౌదార్యమును వహియింపుము. ప్రాతికూల్యతకు ప్రణతుల నర్పింపుము. నీ సన్నిహితుని విశ్వాసమునకు పాత్రుడవగు యోగ్యత నొందుము. తేజోవంతమును, మైత్రీయుతమును నగు మోముతో నాతడిని పరికింపుము. పేదలపాలిట సంపదవై వ్యవహరింపుము. ధనవంతుల కుపదేశకుడవు కమ్ము. ఆవశ్యకతగలవారి యాక్రందనకు సమాధానపరుడవు కమ్ము. నీ ప్రతిజ్ఞాపవిత్రతను సంరక్షించుకొనువాడవు కమ్ము. న్యాయనిర్ణయమున సముచితుడవై వర్తింవుము. సంభాషణయం దప్రమత్తుడవై యుండుము. ఏ మానవుడియెడలను నధర్మపరత్వముతో వ్యవహరింప వలదు. సమస్త మానవులపట్లను అత్యంత వినయమును ప్రదర్శింపుము. అంధకారమున పయనించు వారికి దీపికవై వర్తింపుము. దుఃఖితునికి సంతోషానివీ, దాహపరునికి సాగరానివీ, క్లేశపరునికి ఆశ్రయానివీ కమ్ము; పీడితునికి రక్షకత్వమును వహియింపుము. సమైక్యత, ధార్మికత నీ సకల చర్యల కును ఘనతను కలిగించుగాక! పరకీయునికి గేహానివి, వేదనాపరునికి ఉపశమనౌషధివి, పలాయితుని కాలంబనవు కమ్ము. అంధులకు నయనములు కమ్ము. పెడమార్గమున పయనించు పాదములకు మార్గదర్శన మెునరించు కాంతివి కమ్ము. సత్యముఖమునకు అలంకారానివీ, నిష్కాపట్యనిటలమునకు కిరీటానివీ, ధార్మికత్వ దేవాలయానికి స్తంభానివీ, మానవజాతిదేహానికి జీవితశ్వాసవూ, న్యాయగణము లకు సంకేతానివీ, ధర్మాచరణ క్షితిజరేఖపై జ్యోతివీ, మానవహృదయస్థలికి నీహారానివీ, జ్ఞానసాగరము మీది మహానౌకవీ, ఔదార్యాంబర సూర్యునివీ, వివేకమకుటముపై మణివీ, నీ సమతరమువారి నభోమండలమున శోభిల్లు కాంతివీ, వినయతరువుపై పండిన ఫలానివీ కమ్ము.

CXXXI

ప్రాచీనరాజన్యుని దివ్యలేఖిని భగవత్ర్పేమికులను స్మరియించుట నెన్నడును మానలేదు. కారుణ్యతరంగిణు లొక తరుణమునం దాయన దివ్య లేఖినినుండి ప్రవహింపగ, తచ్ఛలనమున, ఇంకొక పరి భగవంతుని ప్రస్ఫుటగ్రంథ మావిష్కృతమైనది. సామ్యరహితుడును, భాషణమున తనకు సరిజోదుగ మర్త్యు డెన్నటికిని కాజాలని దివ్యుడును - ఆయనయే. నిత్యత్వమునుండియూ, ఔన్నత్య, శౌర్యపీఠ ప్రతిష్ఠితుడును, స్వీయాధరములనుండి సమస్తమానవజాతి యావశ్యకతలను దీర్పగల యుపదేశము లను, వారికి లబ్ధిప్రదములైన యాదేశములను వెలువరించిన కర్తయును - ఆయనయే.

నేను క్షణమాత్రమేని మనుష్యనేత్రములకు ప్రచ్ఛన్నుడనైయుండనూ లేదనుటకును, వా రొనరించు హానినుండి నా దేహమును రక్షించుకొనుట కంగీకరింపనూ లేదనుటకును - నిజైకదైవము నాకు సాక్ష్యమును వహియించును; ఆయన ప్రాణులు వాఙ్మూలము నిచ్చును. నేను సమస్తమానవుల మ్రోలన యవతరించి, నా యభీష్టమును నెరవేర్పుడని వారల నాదేశించినాడను. నా యభిమతము – ప్రపంచ శుభమును, తత్ర్పజాసాంత్వనయు దక్క వేరొండు కాదు. మానవజాతి యైక్యత సుస్థిరముగ సంస్థాపితము కానంతవరకు తత్సంక్షేమమును, శాంతిసంరక్షణలును సాధ్యపడనివి. మహోదాత్తుని దివ్యలేఖిని యావిష్కరించిన యుపదేశముల నలక్ష్యము గావించినంత దనుక, ఈ సమైక్యతను సాధించుట యెన్నటి కైనను అశక్యమే.

సమైక్యతాజ్యోతితో సకల మానవజాతినీ భాసిల్లచేయవచ్చుననియు, అంతియేగాక, తన నామస్మరణము సమస్త మానవుల హృదయములను జ్వలియింపచేసి, వారికిని తన వైభవమునకును మధ్య ప్రతిబంధకములైన ముసువులను దహియింపగలదనియు వాక్శక్తి మూలమున ప్రకటించినా డాయన. ధూళిని సైతము స్వర్లోకముల లోకము నధిగమించున ట్లొనరింపగల సత్త్వ మొక్క ధర్మకార్యమున కనుగ్రహీతమైనది. ప్రతి బంధనమునూ అది విచ్ఛిన్నము గావింప గలదు; తానే వెచ్చించి, కోలుపోయిన శక్తిని పూర్వస్థితికి కొనిరాగల సత్త్వము దానికి కలదు. . . .

పునీతులు కండు ఓ భగవత్ర్పజలారా, పునీతులు కండు; ధార్మికులు కండు, ధార్మికులు కండు. . . . వచించు: ఓ భగవత్ర్పజలారా! నిత్యసత్యమగు ఆయనకును, భువియందలి ఆయన సేనలకును, సాహాయ్యకులకును సునిశ్చిత విజయసాధనములను – పవిత్ర గ్రంథములయందునను, దివ్యలేఖనముల యందునను - సూర్యరశ్మియంత స్పష్టముగ, సుస్పష్టముగ ప్రస్తావింపనైనది. ఆ సేన: ఆయన దృష్టియం దంగీకృతములైన ధర్మకార్యాచరణములును, ప్రవర్తనయును, సౌశీల్యములును. ఈ దివ్యయుగమున మా పావన ధర్మమునకు తోడ్పడ నుద్యమించి, తన సాహాయ్యమునకై యుదాత్తవర్తనము, శ్లాఘనీయ స్వభావము లనబడు సేనల నాహ్వానించు నాతడి యొక్క, అట్టి కార్యోద్భవప్రభావము యావత్ర్పపంచము నను, నిస్సందేహముగా, పరివ్యాప్తమగును.

CXXXII

నిజైకదైవము—సమున్నత మాయన వైభవము—మానవులకు స్వయంప్రకటితుడగుట యందలి పరమార్థము వారి యథార్థాంతర్యముల ఖని యందలి నిక్షిప్తమణులను బహిర్గత మెునరించుటయే. ఈ దివ్యయుగమునం దెన్నడును, ప్రపంచము నందలి వివిధమతవర్గములను, విభిన్న ధార్మిక వ్యవస్థలను, మానవులయందున శత్రుభావములం బ్రోత్సహింపనీయ రాదనునది భగవంతుని దివ్యధర్మసత్త్వము; ఆయన పవిత్ర మతతత్త్వము. ఈ నియమములును, శాసనములును, ఈ సుస్థిర సంస్థాపిత, శక్తిసమన్విత విధానములును ఆవిర్భవించినది - దివ్యమూలమునుండి; అవి యొకే దివ్యప్రభాకిరణములు. అవి యెుండొరులతో విభేదించుటకు హేతువును - అవి యుద్ఘోషితములైన యుగముల వైవిధ్యభరితావశ్యకతలకే యాపాదింపవలె.

ఓ బహాజనులారా, ప్రపంచజనులను కలవరపరచు మతవైషమ్యముల, విద్వేషముల యలజడి - దైవవశమున - స్తంభించి, దాని యానవాళ్లన్నియు సంపూర్ణముగ రూపుమాయవచ్చును గనుక, మీ ప్రయత్నమను కటిసీమను బిగియింపుడు. భగవంతునియొక్క, ఆయన సేవకులయొక్క ప్రేమ నిమిత్తమై, ఈ సమున్నత, సర్వప్రధానావిష్కరణకు సాహాయ్య మొనరింప నుద్యమింపుడు. మతమౌఢ్యము, విద్వేషము లనబడు ప్రపంచవిధ్వంసాగ్ని యుధృతి నెవ్వరును శమింపచేయజాలరు. దైవశక్తిహస్తము మాత్రమే, ఈ దయనీయక్లేశమునుండి, మానవాళికి విమోచనము నివ్వగలదు. . .

భగవద్వాణి యొక దీపిక; ఆ దీప్తియే, ఈ వాక్కులు: మీ రొకే వృక్ష ఫలములు, ఒకే శాఖపత్రములు. ఒండొరులతో, అత్యంత ప్రేమానురాగములతో, స్నేహసౌహార్దములతో వ్యవహరింపుడు. సత్యాదిత్యుడు నాకు సాక్ష్యమును వహియించును! ఐక్యతాజ్యోతి యెంతటి శక్తివంతమైనదనిన, అది సమస్తభూమినీ జ్యోతిర్మయ మెునరింపగలదు. వస్తుసమస్తము నెఱిగిన నిజైకదైవము, ఈ వాక్కుల యాథార్ధ్యతకు సాక్ష్యమును వహియించును.

సకలమానవాళికీ భద్రతాసంరక్షణలను చేకూర్పగల యీ సర్వోత్కృష్ట, మహోదాత్తస్థాయి నొంద పరిశ్రమింపుడు. సమస్తలక్ష్యములకును అతీత మీలక్ష్యము, సమస్తాశయములయందునను సర్వోత్తమ మీయాశయము. అయినను, న్యాయాదిత్యు నాచ్ఛాదించు నియంతృత్వపు కారుమబ్బులు పారద్రోల బడనందాక, మనుష్యనేత్రమున కీస్థాయీవైభవ మావిష్కృతమగుట దుర్లభము. . . .

ఓ బహా జనులారా! సమస్తమానవులతోడను మైత్రీ, సాహచర్యస్ఫూర్తితో సహవాస మెున రింపుడు. మీ రొక సునిశ్చిత సత్యము నెఱిగి, అన్యుల కలభ్యమైన మణి నొందియుంటిరేని, దాని నత్యంత సౌజన్యప్రపూరితమైన భాషలో, సద్భావనాపూర్వకముగ వారితో పంచుకొనుడు. అది యంగీకృతమై, తత్పరమావధిని సాధించెనేని, మీ లక్ష్యము సాధింపబడినట్లే. దాని నెవ్వడేని తిరస్కరించుచో, ఆతడి నాతడికే వదలివైచి, ఆతడికి పథనిర్దేశము గావింపుమని భగవంతుని ప్రార్ధింపుడు. మీ రాతడియెడ నిర్దాక్షిణ్యముగ వర్తింతురేమో, జాగరూకులు కండు. దయాన్వితజిహ్వ మానవహృదయముల కయస్కాంతము. ఆత్మ కాహారమది, వాక్కుల నర్ధవంతము గావించునదది, జ్ఞానవివేకములదీప్తికి మూల స్థానమది.

CXXXIII

భగవంతుని యాదేశములు, ఆయన మహోత్కృష్ట దివ్యావిష్కరణా స్వర్గమునుండి భువి కంపబడినవి. ఎల్లరును వాటిని శ్రద్ధాపూర్వకముగ పాటింపవలె. మానవుని ప్రధానవైశిష్ట్యమును, ఆతడి వాస్తవాభ్యుదయమును, ఆతడి యంతిమవిజయమును - సదా వాటిపైననే యాధారితములై యుండినవి, ఇక ముందునూ యుండునవి. భగవదాజ్ఞాపాలకులు నిత్యసమ్మానము నందుదురు.

భగవంతుని యేకేశ్వరత్వ ప్రభాతమును గుఱుతించి, ఆయన యేకత్వ సాక్షాత్కార సత్యము నంగీకరించినవానికి ద్విముఖీనకర్తవ్యముండును. మొదటిది—ఆయన ప్రేమయందున స్థైర్యము; నిత్యసత్యమైన ఆయన నాశ్రయింపనీయక తనను ప్రతిరోధించుటకు - విరోధి యలజడికైనను, వంచకుని ప్రగల్భమునకైనను అవకాశమునీయని, అట్టివారల నెవ్వరిని లెక్కసేయని స్థైర్యమది. ఇక రెండవది—ఆయన నిర్దేశించిన శాసనములను, అనగా మానవుల కాయన సదా విధియింపుచు వచ్చినవియును, విధియింపుచునే యుండునవియును, అసత్యమునుండి సత్యమును వేర్పరచి, విశిష్టత నిచ్చునవియును నగు శాసనములను—నిష్ఠగా పాటించుట.

CXXXIV

నిత్యసత్యమగు ఆయనను గుఱుతించిన పిదప, మానవులకు నిర్దేశితమైన ప్రప్రథమ కర్తవ్య మాయన దివ్యధర్మమున స్థైర్యము. దానికి బద్ధుడవై, భగవంతునియెడ స్థిరచిత్తులై వెలయువారియం దొకడవు కమ్ము. మరి యే కార్యమును, అది యెంతటి శ్లాఘనీయమైనను, ఎన్నడును దీనికి సరిరాలేదు, రాజాలదు. సకలకార్యములయందునను శ్రేష్ఠతమమిది; సర్వోన్నతుడును, మహాశక్తిమంతుడును నగు - నీ ప్రభుడు యిందులకు సాక్ష్యమును వహియించును. . . .

భగవంతుని గుణవిశేణములు పూర్ణప్రస్ఫుటములు, సుప్రత్యక్షములు; సమస్త దివ్యగ్రంథముల యందునను ప్రస్తావితములు, వర్ణితములు. వాని యందలివే: భగవంతునితో సంభాషించునపుడు విశ్వసనీయతయు, సత్యపరాయణతయు, హృదయనైర్మల్యమును; సమస్తశక్తిమంతుని నిర్ణాయకముపట్ల సహిష్ణుతయు, విరాగమును; ఆయన యిచ్ఛానుగ్రహీతములయెడ సంతుష్టతయు, సంక్షోభ కాలమున సహనమును . . . కాదు కాదు . . . కృతజ్ఞతాభావమును; సర్వావస్తల యందునను ఆయనయెడ పరిపూర్ణ విశ్వాసమును. ఇవి భగవంతుని దృష్టియందున సమస్త కార్యసమున్నతములుగను, మహాప్రశంస నీయములుగను గణుతింపవడును. అన్యకార్యసమస్త స్థాన మిప్పటికిని, ఎప్పటికిని ద్వితీయమే, అంతకు దిగువదే. . . .

మానవహృదయమునకు చైతన్యస్ఫూర్తి - భగవత్పరిజ్ఞానమే. “ఆయన తా దలచుదానిం జేయును, తా నిచ్ఛయించుదాని నాదేశించు,” నను సత్యమును గుఱుతించుటయే దాని యథా ర్థాలంకరణము. దాని వస్త్రము - దైవభీతి. తత్పరిపూర్ణత - ఆయన దివ్యధర్మమున స్థైర్యము. తన నాశించు వా రెవ్వరికైనను యివ్విధముగనే భగవంతు డాదేశింపుచున్నాడు. నిశ్చయముగ, ఆయన తన నాశ్రయించువానిని ప్రేమించును. క్షమాశీలియును, మహౌదార్యుడును నగు ఆయన దక్క అన్యదైవము లేడు. సర్వలోకాధీశుడైన భగవంతునికి సకలప్రశస్తి.

CXXXV

ఓ జీవాక్షరమా! భగవంతుని శ్రవస్సు నీ యాక్రందనము నాలించినది; ఆయన నేత్రములు నీ లిఖితపూర్వక నివేదనము నవలోకించినవి. ఆయన తన యశోపీఠమునుండి ని న్నాహ్వానింపు చున్నాడు; ఆపత్సాహాయ్యుడును, స్వయంపోషకుడును నగు ఆయన యనుగ్రహించిన సూక్తులను నీకు వెల్లడింపుచున్నాడు.

సర్వోన్నత సంరక్షకుడును, సమస్త శక్తిమంతుడును, ఏకైక ప్రియతముడును నగు నీ ప్రభుని శౌర్యశక్తితో స్వార్ధ, వ్యామోహము లనబరగు ప్రతిమను సమూలముగ నిర్మూలించినందులకును, నిష్ఫల భావాచ్ఛాదనను భగ్నము గావించినందులకును ధన్యుడవీవు. నిక్కముగా, నీవు ప్రతి యన్య దివ్యాక్షరమున కన్నను మిన్నయగు దివ్యాక్షరములయందున గణనము నొందవలె. కావుననే, తన వదన ప్రభాసముతో సృష్టినంతటినీ పరివేష్టించి, పరివృతమొనరింపుచునే యుండు నీ ప్రభుడగు బాబ్‌ వాణి ద్వారా, భగవంతుడు ని న్నెంచుకొనినాడు. స్వర్గములయందలి, భువియందలి నివాసుల హృదయము లను ప్రకంపిత మెునరించినదియును, సృష్టిరాజ్యముల, దివ్యావిష్కరణ సామ్రాజ్యముల నివాసుల నాక్రోశింపజేసినదియును, మానవహృదయాంతరాళ నిగూఢమర్మముల నన్వేషించి శోధించినదియును నైన దివ్యధర్మమును గుఱుతించుటయందున నీకు తోడ్పడినయందులకు సమస్తశక్తిమంతునకు కృతజ్ఞతల నర్పించి, ఆయన నామధేయమును సంకీర్తింపుము.

మహోన్నతుడైన నీ ప్రభుడు, నిన్ను తన వైభవసామ్రాజ్యమునుండి, ఈ వాక్కులతో సంబోధింపు చున్నాడు: ఓ జీవాక్షరమా! నీవు సత్యముగా నన్ను విశ్వసించినందులకును, ఊర్ధ్వలోక దివ్యగణ సమక్షమున నన్ను లజ్జితు నొనరింప తిరస్కరించినందులకును, నీ వాగ్దానమును నెరవేర్చినందులకును, శుష్కయోచనల ముసువు నావలవైచినందులకును, గోచరాగోచరుల ప్రభుడును, పునస్సందర్శిత దేవాలయనాథుడును నగు నీప్రభునిపై నీ దృష్టిని నిలిపినందులకును నీకై ప్రతీక్షించు ధన్యత మహత్తరము. మోములు వివర్ణములును, వినీలములును గావింపబడిన దివ్యయుగమున, నీ ముఖము తేజోశోభితమగుచుండుట నవలోకించి, నీయెడ సంప్రీతుడనైతిని.

వచించు: ఓ బయాన్‌ జనులారా! మీ దుర్వాంఛలనేని, నీతిబాహ్యాలోచనలనేని యనుసరింపక, మహోన్నత శక్తిసమన్విత ‘తుల’ యేర్పరుపవడిన యట్టి దివ్యయుగమున, సర్వశక్తియుత సంరక్షకుడును, సర్వాధికారియును, పరమ పావనుడునునైన మీ దేవదేవుని సింహాసన దక్షిణహస్తమునుండి పరమాత్ముని మధురగీతిక లనుగ్రహీతములగు దివ్యయుగమున - మీ నేత్రములను, అనుపమాన వైభవదృశ్యముపై నిల్పుడని మా సమస్త దివ్యఫలకములయందుననూ, మా నిగూఢదివ్యలేఖనము లన్నింటియందుననూ మిమ్ములను మే మాదేశించి యుండలేదా? మా దివ్యసౌందర్యపు టభివ్యక్తీకరణకు మిమ్ములను దూరుల గావించువానికి—అవి, తదభివ్యక్తీకరణానంతర దివ్యావిష్కరణమున భగవంతుని నామధేయముల, తద్వైభవ స్వరూపములైనను, ఆయన లక్షణముల, తత్సామ్రా జ్యాభివ్యక్తీకరణములైనను—విధేయతను వహియించుటను మీకు నిషేధింపలేదా? నేను సాక్షాత్కరించినయంత, మీరు నా సత్యము నెటుల తిరస్కరించి, నాకు విముఖులై, భగవచ్ఛిహ్నముల నొక యాటవిడుపుగను, కాలక్షేపముగను గణియించినవారైతిరో వీక్షింపుడు!

నా దివ్యసౌందర్యముపై యాన! భగవంతుని సామ్రాజ్యనిత్యత్వమున, ఆయన మ్రోలన మోకరిల్లి యారాధింపుచునే యుండినను, ఈ దివ్యయుగమునం దెద్దియును మీనుండి యంగీకృతము కాదు. ఏలయన, సకలాంశములును ఆయన దివ్యేచ్ఛాధారితములు; సర్వకార్యముల యోగ్యతయు ఆయన యంగీకృతికిని, ఆయన సంప్రీతికిని లోబడియుండును. యావద్విశ్వమూ, ఆయన పిడికిటి యందలి మంటిముద్ద దక్క వేరొండు కాదు. ఈ దివ్యయుగమున తనను గుఱుతించి, తనను ప్రేమించునంత దనుక, భగవంతుడు మానవుని యాక్రందనము నాలింపడు. గ్రహియించితిరేని, ఆయన దివ్యధర్మతత్త్వ మిదియే.

మైదానతుషార సదృశముతో మీరు సంతృప్తులై, తన పావనతోయములతో, దైవేచ్ఛానుసారము, మనుష్యుల సేదదీర్చు దివ్యమహాంబుధిం గోలుపోవ నిచ్చగింతురా? దైవానుగ్రహమున కంతటి నిరర్థక, ధిక్కారపూర్వకాంశముతో ప్రతిఫలము నిచ్చినయందులకు దుఃఖము మిమ్ముల నావరించును. మీరు నిక్కముగ, నా పూర్వదివ్యావిష్కరణమున, నన్ను తిరస్కరించిన వారలే. గ్రహియించునా, మీ హృదయము లద్దానిని!

ఉత్తిష్ఠులై, భగవన్నియంత్రణమున, ఆయనయెడ మీ కర్తవ్యనిర్వహణా వైఫల్యములకు నిష్కృతి జేసికొనుడు. మీరు మా యాదేశమునకు వీనుల నొగ్గి యుండిన, మీకు నా యాదేశమిది. నాపై యాన! ఖురాన్‌ జనులేని, తోరా లేక ఎవాంజలు అవలంబకులేని, మరి యే ధార్మిక గ్రంథానుయాయులేని - చేజేతులా మీరొనరించినదానికి పాల్పడియుండలేదు. నా జీవితమంతటినీ, ఈ దివ్యధర్మ సత్య నిరూపణమున కంకిత మొనరించినాడను. నా సమస్త దివ్యఫలకములయం దాయన దివ్యావిష్కర ణావతరణమును స్వయముగా, నేనే యుద్ఘోషించినాడను. అయినను, తన తదుపరి దివ్యావిష్కరణమునం దాయన బహా వైభవాంబరధారియై, తన మహత్త్వకూర్పాసకమున ప్రత్యక్షమైనయంతనే, మీరు - సర్వోన్నత సంరక్షకుడును, స్వయంపోషకుడునునైన ఆయనను ధిక్కరించితిరే! ఓ జనులారా, జాగరూకులు కండు! మీ హస్తములయందున, దైవపథమున, నాకు వాటిల్లినదానికి మీరు సిగ్గిలవలె. జాగ్రత్త, భగవంతుని సర్వాతీతవైభవ స్వర్గము నుండి తమకై యంపబడిన దానిం దిరస్కరించినవారు కావలదు.

ఓ జీవాక్షరమా! నీ ప్రభుడు పల్కిన, ఊర్ధ్వలోకములనుండి నీ కుపదేశించిన వాక్కు లిట్టివి. ఆయన సేవకులు తమ నిద్రావస్థను విదళించుకుని, తమకు రూపమునిచ్చి, తీర్చిదిద్ది, తమకు తన మహాప్రకాశమాన, పరమపవిత్ర, ప్రత్యక్ష దివ్యసౌందర్యావిష్కరణము ననుగ్రహించిన సర్వేశ్వరుని క్షమ నర్ధింప వచ్చును గనుక, వారికి నీ ప్రభుని వాక్కులను ప్రకటింపుము.

CXXXVI

వచించు: ఓ ప్రజలారా,‘నే’నను దాస్యమునుండి మీ యాత్మలను విముక్త మొనరించి, ‘నా’నుండి దక్క సమస్తబంధనములనుండియు వానిని ప్రక్షాళన మొనరింపుడు. గ్రహియింపగల్గితిరేని, నా స్మరణము సమస్తమునూ కాలుష్యప్రక్షాళిత నొనరించును. వచించు: సకలసృజితములూ సంపూర్ణముగా ప్రాపంచికభోగలాలసల ముసుపునుండి యనాచ్ఛాదితములై యుండినచో, దైవహస్తము -సమస్తవస్తువుల యందునను తన మహనీయతాసంకేత మభివ్యక్తమగునటుల, వాని నన్నింటినీ యీ దివ్యయుగమున “సృష్టిసామ్రాజ్యమున ఆయన తా దలచిన దానిం జేయు,” నను యుడుపుతో నలంకరించియుండును. అందులకు సకలసార్వభౌముడును, సమస్తశక్తిమంతుడును, మహారక్షకుడును, సకల వైభవోపేతుడును, మహాబలయుతుడును నగు ఆయనకు ప్రస్తుతి.

ఓ నా సేవకుడా, నీ వందుకొనిన దైవసూక్తులను, ఆయనకు చేరువయైన వా రాలపించిన యటుల, నీ స్వరమాధుర్యము నీ యాత్మ నుత్తేజపరచి సకలజన హృదయముల నాకట్టుకొనునటుల యాలపింపుము. భగవదావిష్కృతసూక్తుల నెవ్వడేని తన యేకాంతకక్ష్యయందున శ్రావ్యముగ నాలపించె నేని, ఆతడి ముఖతః వెలువడిన పదసౌరభములను, సర్వశక్తియుతుని సువిస్తృత పరివ్యాపిత దూతలు సుదూరప్రాంతములకు పరివ్యాపనమెునరించి, ధార్మికహృదయములను స్పందింపజేయుదురు. తొలుత వాటి ప్రభావము నాతడు గ్రహియింపకున్నను, తన్మూలమున యాతడి కనుగ్రహీతమైన కారుణ్య స్వభావము తన ప్రభావము నాతడి యాత్మపై తక్షణమో, తదుపరియో ప్రదర్శించును. విజ్ఞతకును, అధికారమునకును మూలమూర్తియైన భగవంతుని యిచ్ఛానుసార మాయన దివ్యావిష్కరణమర్మము లివ్విధముగ నావిష్కృతములైనవి.

ఓ ఖలీల్‌! భగవంతుడే నాకు సాక్ష్యమును వహియింపుచున్నాడు. నా పావనఫలకముపై నా దివ్యలేఖిని సాగుచున్నను, తన యాంతర్యమునం దది విలపింపుచూ, తీవ్ర వ్యాకులపాటుకు లోనగు చున్నది. ఆయన దివ్యాసనమున కెదురుగ జ్వలియింపుచున్న దీపికసైత మటులే, ఆయన యభీష్ట సృజితుల హస్తముల యందున ప్రాచీనసౌందర్యు డనుభవించినవానికి రోదిల్లుచూ, ఆక్రందింపుచున్నది. భగవంతుడు మాత్రమే నా వాక్కుల యాథార్థ్యత నెఱిగి, వాటిని ధృవీకరించును. నాస్తికుల తీవ్రాందోళన నుండి తన శ్రవస్సును క్షాళన మొనరించి, దానిని సమస్తసృజితాంశముల దెసకు సారించిన యే మానవుడైనను, మా సేవకులలో మమ్ము విశ్వసింపక యెదిరించినవారి హస్తములయందున మాకు వాటిల్లినదానియెడ, వాటి యావేదనాక్రందనాన్విత స్వరము నాలింపక యుండజాలడు. నీవు మా యావేదనలం దెలిసికొని, నీ వేదనల నోరిమితో భరియింపవచ్చునని, మాకు వాటిల్లిన వ్యధల నిట్లు రేఖా మాత్రముగ, నీకు వెల్లడించినాము.

సర్వకాల సర్వావస్థలయందునను నీ దేవదేవునికి తోడ్పడుట కుద్యుక్తుడవై, ఆయన సాహాయ్యులయం దొకడవు కమ్ము. ఈ శోభాన్విత, దేదీప్యమాన దివ్యఫలకమున భగవంతుని దివ్యాత్మ వచియించిన వాక్కులకు చెవియెుగ్గుడని, ఇక జనులకు ప్రబోధింపుము. వచించు: ఓ జనులారా, మనుష్యులయందున వైరుధ్య బీజములను వేయవలదు, మీ సామీప్యునితో కలహింపవలదు. సర్వావస్థల యందునను సహనమును వహియించి, మీ పూర్ణవిశ్వాసమును, నమ్మికను భగవంతునియందున యుంచుడు. విజ్ఞత, భాషణములనబడు ఖడ్గముతో మీ ప్రభునకు సాహాయ్య మొనరింపుడు. నిక్కముగా, ఇదియే మానవుని స్థానము. దానినుండి వైదొలగుట - సకలసార్వభౌమాధినాథుడును, వైభవాన్వితుడును నగు భగవంతుని దృష్టి యందున యుక్తము కాదు. అయినను, జను లపమార్గనిర్దేశితులై, నిజముగనే ప్రమత్తులైనారు.

ఓ జనులారా, భగవంతుని దివ్యస్మరణమును, మీ యందలి విజ్ఞతాభాండారమును నగు ఆయన స్మరణయను కుంచికలతో మానవుల హృదయ ద్వారములను వివృత మెునరింపుడు. సమస్త ప్రపంచము నుండియు తన సేవకుల హృదయముల నెంచుకుని, వానియందలి ప్రతిదానినీ తన వైభవావిష్కరణ పీఠము గావించినా డాయన. కావున, వాటిని - తమ నెందు నిమిత్తమై సృజియింపనైనదో తదంశములే తమపై చెక్కవడునటుల - సమస్తమాలిన్య ప్రక్షాళితముల నొనరింపుడు. నిక్కముగ, భగవంతుని వదాన్యతానుగ్రహమున కిదియొక సంకేతము.

ఓ జనులారా, మీ జిహ్వలను సత్యసంధతతో శోభాయమాన మెునరింపుడు, న్యాయాభరణముతో మీ యాత్మల నలంకరించుకొనుడు. ఓ జనులారా, మీ రెవ్వనియెడలనూ విశ్వాసఘాతకులై వర్తింపక జాగరూకతను వహియింపుడు. భగవంతుని ప్రాణులయం దాయన ధర్మకర్తలును, ఆయన ప్రజలయం దాయన యౌదార్యమునకు ప్రతీకలును కండు. తమ యనైతికభావనలను, దుర్వాంఛలను అనుసరించు వార లపరాధులై, తమ యత్నములను వ్యర్థమొనరించినారు. నిక్కముగా, వా రభాగ్యులు. ఓ ప్రజలారా, భగవంతుని యనుగ్రహము దెసకు మీ నేత్రములు సారితము లగునటుల, మీ హృదయము లాయన యద్భుత స్మరణమునకు సుపరిచితము లగునటుల, నిశ్చయముగా మీ యాత్మ లాయన కారుణ్యానుగ్రహములతో సాంత్వనము నొందునటుల, మీ పదము లాయన మహదానంద పథమున పయనించునటుల - కృషి సల్పుడు. నేను మీ కనుగ్రహించు యుపదేశము లట్టివి. పాటింతురు కదా, నా యుపదేశములను!

CXXXVII

తమ సామీప్యుని ధనబలిమి నుల్లంఘించుట ధర్మబద్ధమని యెంచి, భగవద్గ్రంథ సూచితమైనట్టి ఆయన యాదేశమును కొందరు చులుకన గావించినారు. వారల కమంగళమగు; సర్వాధికారియును, సమస్త శక్తిమంతుడును నగు భగవంతుని దండనకు వారు గురియగుదురు. పవిత్రతాప్రభాతోపరిశోభితునిపై యాన! యావత్ర్పపంచమూ రజతముగ, సువర్ణముగ పరివర్తితమైనను, దానిని విశ్వాసము, నిర్ధారణలనబడు స్వర్గమునకు నిక్కముగా అధిరోహించిన వానిగ గణుతింపవడిన యే మానవుడూ, మన్ననసేయ నొల్లడు; ఇక దానిని దోచుటయు, దాచుటయు కూడనా? మేమీ యంశము నితఃపూర్వము, అరబ్బీ భాష యందున మనోజ్ఞవాగ్విన్యాసముతో వెల్లడించినాము. భగవంతుడు మాకు సాక్షి! ఆ వాఙ్మాధుర్యము నాస్వాదించినవా డెవ్వడేని, ఎన్నడైనను భగవన్నిర్ధారి తావధుల నతిక్రమించుట కంగీకరింపడు, తన పరమప్రియునివంకకు దక్క యింకెవ్వనిపైకిని తన దృష్టిని సారింపడు. అట్టి మానవుడు, తన యంతర్నేత్రముతో యీ ప్రాపంచిక విషయసమస్త మెంత వ్యర్ధమో, క్షణభంగురమో తక్షణమే గ్రహియించి, తన యపేక్షల నుదాత్తాంశములపై నిలుపుకొనును.

వచించు: ప్రాచీనసౌందర్యుని ప్రియతములమని చెప్పుకొను ఓ జనులారా, లజ్జితులు కండు! ఆయన యనుభవించిన క్లేశముతో, భగవంతుని నిమిత్త మాయన వహియించిన వేదనాభారముతో - మీ రభిశంసితులైనారు. మీ కన్నులను దెఱచుకొననిండు! ఆయన సహియించిన బహువిధ వేదనలు, అంత్యమున కట్టి నీచవ్యాసంగములకును, అట్టి హైన్యవర్తనమునకును దారితీసిన యెడల, ఆయన యిక యే లక్ష్యమునకై ప్రయాసము నొందినట్లు? నా దివ్యావిష్కరణత్పూర్వ దివసములయందున - చోరులును, దుష్కర్ములును యీ పలుకులనే పలికి, ఈ చేష్టలనే గావించినారు.

నిక్కముగ, వచియింపుచున్నాడను: నా మధురస్వరమునకు మీ వీనుల నొగ్గి, మీ దుర్వ్యామోహముల, నీతిబాహ్యవాంఛల మాలిన్యమునుండి పునీతులు కమ్మని. భగవత్పటవేశ్మమున వసియింపుచు, అనంతయశోపీఠములపై ప్రతిష్ఠితులైన వారు, తా మాకలితో మరణింపుచున్నను, తమ హస్తములను జాచి తమ సామీప్యుని సొత్తును - ఆతడెంత దుష్టుడైనను, వ్యర్ధుడైనను - అన్యాయముగ ననుభవింప తిరస్కరింతురు.

నిజైకదైవము స్వయముగా అవతరించుటయందలి యుద్దేశ్యము సమస్త మానవాళిని సత్యసంధత, నిష్కాపట్యముల దెసకును, భక్తివిశ్వసనీయతల వంకకును, దైవేచ్ఛయెడ విధేయతా వైరాగ్యముల వైపుకును, సహిష్ణుతాసౌమ్యతల వంకకును, ధర్మవర్తన, విజ్ఞతల దెసకును ఆమంత్రించుటయే. ప్రతి మానవుడినీ సాధుప్రవృత్తి యను చేలాంచలముతో నలంకృతుం జేసి, స్వచ్ఛతా సత్కార్యము లనబడు భూషణముతో విభూషితుని గావించుట ఆయన లక్ష్యము.

వచించు: మీ యెడలను, మీ సాటివారిపట్లను దయగల్గియుండుడు; భగవంతుని దివ్యధర్మమును—పవిత్రతామూలసారమున కన్నను అప్రమేయముగ ప్రశంసితమైన దివ్యధర్మ మది—మీ వ్యర్ధోహల, మీ అయుక్త, నీతిబాహ్యభావనల మాలిన్యముతో కలుషిత మొనరింపవలదు.

CXXXVIII

ఓ దయాన్వితదైవమా, సమస్త సృజితాంశావృత శక్తిసమన్వితుడవైన నీవు, నీ దివ్యేచ్ఛాసంప్రీత్యనుసార మాదేశించిన యుపవాస నియమమును పగటివేళయం దనుసరింపుచున్న యట్టి, నీ నామమును స్మరియించుటకును, నీ కారుణ్యానుగ్రహకోశములయందున సుభద్ర మెునరింప బడిన విశిష్టాంశముల యందలి తమ భాగము నొందవలెనను యాశతో నీ యశస్సును సమ్మానించుటకును అరుణోదయత్పూర్వమే మేల్కాంచినయట్టి - నీ సేవకులను, నీ దాసులను విలోకింపుచున్నాడవు. సకలసృష్ట్యధికారములను స్వహస్తములయందున యుంచుకొనిన, నీ దివ్యనామముల, దివ్యలక్షణముల సామ్రాజ్యమునంతటిని నీ గుప్పిట యుంచుకొనిన ఓ దేవా! నీ సేవకులను నీ దివ్యయుగమున - నీ కారుణ్యపర్జన్యములనుండి వెలువడు వర్షధారలకు దూరుల గావింపవల దనియు, నీ సంప్రీత్యాంబుధి యందలి తమ భాగము నొందనీయక, వారలను ప్రతిరోధింప వలదనియు - నిన్ను వేడుచున్నాడను.

ఓ నా ప్రభూ, భువియందలి సమస్తాణువులును నీ సార్వభౌమత్వాధికార మహనీయతలకు సాక్ష్యమును వహియింపుచున్నవి; విశ్వసంకేతములన్నియు నీ రాజసశౌర్యములను ధృవీకరింపుచున్నవి. సకలజన సార్వభౌమా, శాశ్వత యుగముల రాజన్యా, సకలదేశాధీశా! నీ యనుజ్ఞాపాశమును చేతబూని, నీ దివ్యేచ్ఛాస్వర్గమునుండి భువి కంపవడిన నీ శాసనముల యావిష్కరణలకు శిరముల నొగ్గిన యీ నీ సేవకులపై కృప జూపుము.

ఓ నా ప్రభూ, నీ ప్రేమోపేతకారుణ్యోదయస్థలి దెసకు వారి నేత్రము లెవ్విధముగ సారితమైనవో, నీ యనుగ్రహమహాసాగరములపై వారి మనస్సు లెత్తీరున నిలుపవడినవో, సకలవైభవాన్వితుడవగు నీ నామమున, సర్వోతృష్ట స్థానమునుండి యాహ్వానించు నీ మధురతమస్వరజనిత విలక్షణభాషితముల మ్రోల వారి స్వరము లెటుల చిన్నవోయినవో వీక్షింపుము. ఓ నా ప్రభూ, తాము నీ స్వాధీనాంశముల నొందవచ్చునని తమ సమస్తమును త్యజియించి, ప్రపంచమును పరిత్యజించి, తమ యపేక్షలను నీ వైభవసామ్రాజ్యముపై నిలుపుకొనిన హేతువున శోధనసంక్షోభావృతులైన నీ ప్రియతములకు సాహాయ్య మెునరింపుము. ఓ నా ప్రభూ, తమ దుర్వ్యామోహవాంఛల దాడులనుండి వారిని కాచి, తమకు యిహపరముల యందున తమకు లబ్ధిం జేకూర్చువానిని సాధించుటలో వారికి తోడ్పడుమని నిన్ను వేడుచున్నాడను.

ఓ నా ప్రభూ, నీ స్మరణము దక్క సమస్తము నుండియు మమ్ము ప్రక్షాళన మెునరించి, నీ యనుగ్రహసాగరతీరముల దరికి మమ్ముల జేర్చునటుల నీ యనంతకారుణ్యవృష్టిని మాపైనను, నీ సేవకులపైనను కురియింపుమని - దేని తదుపరి, ఏ తెఱవూ లేదో, ఆ దివ్యవృక్షము దెసకు సృష్టి సామ్రాజ్యమున యుచ్చైస్వనమున యాహ్వానింపుచు, సర్వోతృష్టవైభవ పీఠము దెసకు సాధికారికముగ సకలజనుల నామంత్రించు నీ నిగూఢ నిక్షిప్తనామధేయమున - నిన్ను ప్రార్ధింపుచున్నాడను. ఓ ప్రభూ, నీ మహోన్నతలేఖినితో మా యాత్మలకు దివ్యవైభవసామ్రాజ్యమున యమరత్వము నొసంగునట్టి, మా నామధేయములకు నీ దివ్యలోకమున శాశ్వతత్వము ననుగ్రహించునట్టి, మా ప్రాణములను నీ రక్షణ కోశములయందునను, మా దేహముల నభేద్యపటిష్టదుర్గమునను సంరక్షణ మొనరించునట్టి దానిని నిర్దేశింపుము. నీవు సకల భూతభవిష్యదంశములకన్నను శక్తిశాలివి. సర్వశక్తిసమన్విత సంరక్షకుడవును, స్వయంపోషకుడవును నగు నీవు గాక వేరొండు దైవము లేడు.

ఓ నా ప్రభూ, నీ యౌదార్యానుగ్రహ స్వర్గముదెస కూర్ధ్వీకృతములైన మా ప్రార్థనాపూర్వక హస్తముల నవలోకింపుచున్నాడవు. అవి నీ యౌదార్యానుగ్రహైశ్వర్యప్రపూరితము లగునటుల యనుగ్రహింపుము. మమ్ములనూ, మా మాతాపితరులనూ మన్నించి, నీ దాక్షిణ్యౌదార్య మహాంబుధి నుండి మే మాశించిన దాని ననుగ్రహింపుము. ఓ మా మనోవల్లభా, నీ పథమున మే మాచరించు సమస్త కర్మలనూ స్వీకరింపుము. నిక్కముగా, నీవు మహాశక్తిశాలివి, మహోత్కృష్టుడవు, అప్రమేయుడవు, ఏకైకుడవు, క్షమాశీలివి, కృపాన్వితుడవు.

CXXXIX

ఓ నబీల్‌-ఎ-ఆజమ్‌, తన సకలవైభవసమన్విత సామ్రాజ్యము నుండి నీకు పిలుపునిచ్చు యుగప్రాచీనుని యమరవాణికి నీ శ్రవస్సునొగ్గుము. “నిక్కముగ, భగవంతుడను నేను; నేను దక్క అన్యదైవ మెవ్వడును లేడు. అనాదిగా, సకలసార్వభౌమాధికారమూలమును నేనే, శాశ్వతముగ స్వీయరాజసమును ప్రదర్శింపుచు, సృజితసర్వస్వమును స్వకీయసంరక్షణావృత మొనరించు వాడను నేనే. నా సమస్తసృష్ట్యావృత శౌర్య, సార్వభౌమత్వముల మహోదాత్తతయే నా నిదర్శన,” మని యూర్ధ్వస్థిత దివ్యలోకముల నుండియు, సకలసృజితముల యంతర్లీనాస్తిత్వమునను - ప్రస్తుత ముద్ఘోషింపుచున్న దాయనయే. . . .

ఓ నా నామధేయమా, నా దివ్యనావలోని కరుదెంచి, నా సార్వభౌమ, సర్వోత్కృష్టశక్తితో, వైభవసాగరముపై వైళమ పయనింపుచు, భగవంతుని దివ్యాంగుళిచే నామధేయములు లిఖితములైన యట్టి నా యనుగ్రహపాత్రుల యందున గణనమునొందిన యందులకు ధన్యుడ వీవు. సకలవైభవోపేతుని దివ్యావతారములు పరిభ్రమించునట్టి, అహోరాత్రముల యందునను కారుణ్యప్రభాతములచే తన సాన్నిధ్యప్రభాసము సంకీర్తితమగునట్టి యీ దివ్యతరుణుని హస్తస్థితమైన జీవప్రదాయక చషకమునుండి, నిక్కముగ, పానము చేసినాడవు.

నీవు భగవంతుని నుండి భగవంతుని చెంతకుపయనించి, నశ్వర మానవు డెన్నటికినీ వర్ణింప జాలని దివ్యభూమియగు అనశ్వర వైభవప్రాంగణ పరిధులలోనికి ప్రవేశించినందున, ఆయన యశస్సు నీకు తోడైయున్నది. తత్పరిధుల యందున, నీ ప్రభుని వాత్సల్యపరిపూర్ణితయై, నీలోని స్ఫూర్తిని ప్రఫుల్లిత మెునరించిన పవిత్రతానిలమున్నది; దూరస్థతా, నాస్తికతా కళంకములనుండి జ్ఞానోదకములు నిన్ను ప్రక్షాళితు నొనరించినవి. మానవుల యందున భగవన్నామస్మరణ స్వరూపుడగు ఆయనను నీవు గుర్తించి నందున, తన్నామస్మరణ స్వర్గప్రవేశము నొందినాడవు.

కావున, నిన్ను తన దివ్యధర్మమునకు సాహాయ్యమొనరింప శక్తిసమన్వితుని గావించి నందులకును, నీ హృదయోపవనమున మేధోజ్ఞానప్రసూనములను ప్రభవిల్ల జేసినందులకును భగవంతునకు కృతజ్ఞుడపు కమ్ము. అవ్విధముగ, ఆయన కారుణ్యము ని న్నావరించినది; సృష్టిసమస్తము నావరించినది. జాగ్రత్త, నిన్ను వ్యధ నొందించు యవకాశము నెద్దానికేని యిత్తువేమో. మానవుల శుష్కోహా వ్యామోహసమస్తమును వర్జింపుము, భగవంతుని గానక ముసువులయం దాచ్ఛాదితులైనవారి నిష్ఫల, కుటిల తర్కములం ద్రోసిపుచ్చుము. ఇక, సమస్త మానవాత్మల నుత్తేజపరచుటకును, సర్వ శుభప్రదమును, సమస్తవైభవప్రపూరితమును నగు యీ యాస్థానము దెసకు వారి మనస్సులను మరలించుటకును, నీ ప్రభుని ధర్మసేవ యందున ప్రస్తావింపుమని, పరమాత్మ నిన్ను ప్రేరేపించు దానిని యుద్ఘోషింపుము. . . .

మా ధర్మమునకు సాహాయ్యముగ ఖడ్గసిద్ధాంతమును ప్రతిషేధించి, అందుకు ప్రత్యామ్నాయముగ జనవాక్య సంజనితాధికారమును నెలకొల్పితిమని తెలియుము. మే మవ్విధముగ మా కారుణ్యముకొలది నిర్ద్వంద్వముగ నాదేశించినాము. వచించు: ఓ జనులారా! మానవులయందున విద్వేషబీజములను విత్త వలదు, మీ సామీప్యునితో కలహింపవలదు; ఏలయన మీ ప్రభుడు ప్రపంచమును, ప్రపంచనగరములను రాజన్యుల రక్షణయందున యుంచి, వారిని - వారికి తా ననుగ్రహింపనెంచిన సార్వభౌమత్వముతో, తన స్వీయాధికార చిహ్నములను గావించినాడు. ఆయన, ఈ ప్రాపంచికసామ్రాజ్యస్థిత మెద్దానినీ తనకై ప్రత్యేకించుకొనుటకు తిరస్కరించినాడు. ఇందులకు, నిత్యసత్యమే తానెయైన ఆయనయే సాక్ష్యము నిచ్చును. ఐహికమాలిన్యసమస్తము నుండి తాను పునీత మొనర్పవచ్చుననియు, నాస్తికహస్తము లెన్నటికిని కలుషితమొనరింప జాలని పవిత్రస్థలికి జేర్పవచ్చుననియు, తన నిమిత్త మాయన ప్రత్యేకించు కొనినది - కేవలము మానవుల హృదయసీమలనే. ఓ ప్రజలారా! మానవ హృదయసీమను మీ భాషణా కుంచికతో వివృతమెునరింపుడు. మీ కర్తవ్యమును, పూర్వనిర్దేశిత ప్రమాణానుసారముగ, మీ కిటుల విధియించినాము.

భగవంతుని ధార్మికత్వముపై యాన! ప్రపంచమును, తత్సుఖభోగములును, తద్వైభవమును, అది చేకూర్పగల యే ప్రమోదములైనను భగవంతుని దృష్టియందున ధూళివలె, భస్మమువలె నిరర్ధకములే; కాదు కాదు - అంతకన్నను హీనతమములు. గ్రహియింపగల్గునా మానవహృదయము లద్దానిని! ఓ బహా జనులారా, ప్రపంచమాలిన్యము నుండియు, తత్సంబంధిత సమస్తము నుండియు మిమ్ములను ప్రక్షాళన గావించుకొనుడు. స్వయముగ భగవంతుడే నాకు సాక్ష్యమును వహియించును. ఐహికాంశము లెంతమాత్రమును మీకు తగనివి. వానిని కాంక్షించువారలకు వాటిని పారవైచి – పరమ పవిత్రమును, ప్రభాసమానమును నైన యీ దివ్యదార్శనికతపై మీ నేత్రములం బరపుడు.

భగవంతుని ప్రేమయును, ఆయన దివ్యతత్త్వావతారుని ప్రేమయును, మీ కాయన నిర్దేశింపనెంచు దానిని పాటించుటయును మీకు యుక్తములని తెలియుడు.

వచించు: సత్యసంధతాసౌజన్యములను మీ కలంకారములను కానిండు. సహిష్ణుత, న్యాయము లనబడు యుడుపులం గోలుపోవలదు. తద్వారా, మీ హృదయములనుండి పవిత్రతా మధుర సుగంధములు సమస్త సృజితాంశముల మీదికిని విస్తరింపవచ్చును. వచించు: ఓ బహా జనులారా! మాటలకు చేతలు విరుద్ధముగనుండు వారి మార్గములను మీ రనుసరింతురేమో, జాగ్రత్త. భగవత్సంకేతముల నవనీజనసమస్తమునకును ప్రదర్శించి, ఆయన యాదేశములను ప్రతిఫలింప యోగ్యులగుటకు యత్నింపుడు. సకలజనావళికిని మీ కార్యములను మార్గదర్శిని కానిండు; ఏలయన, ఉన్నతములైనను నిమ్నములైనను - పలువురి వృత్తులు వారి ప్రవృత్తులకు భిన్నములై యుండును. మీ రన్యులకన్నను విశిష్టులు కాగలుగునది - మీ చేష్టల మూలముననే. వాటి మూలముననే, మీ జ్ఞానప్రభ పృథ్వియం దంతటను పరివ్యాప్తితమగును. మా యుపదేశమునకు విధేయతను వహియించి, సర్వజ్ఞుడును, సకలవివేకియును నగు ఆయన నిర్దేశించిన ధర్మసూత్రముల ననుసరించు మానవుడు సంతోషాత్ముడు.

CXL

ఓ మహమ్మద్‌ ఆలీ! సకలవైభవోపేతుడును, సర్వప్రకీర్తితుడును నగు నీ ప్రభుని వాత్సల్యాభరణముతో, నీ హృదయము నలంకృత మెునరించు కొనినందున, నీకై ప్రతీక్షించుచున్న ధన్యత మహోన్నతము. సకల శుభములును, ఈ యుగమున యీ స్థాయినందిన వానివే.

నీవు యీ దివ్యయుగమున భగవత్ప్రియతములకు వాటిల్లిన యవమానమును సరకుచేయవలదు. ఈ యవమానము - సమస్త నశ్వరగౌరవమునకు పరాకాష్ఠ; ప్రాపంచికౌన్నత్యమునకు ప్రకీర్తి. యుగప్రాచీనుని జిహ్వ తన మహత్తర కారాగారమున తన ప్రియతములను స్ఫురణకు దెచ్చుకొనిన యపుడు వారికి ప్రసాదించిన మాన్యత కన్నను మహత్తరమగు మాన్యత నూహింపశక్యమా? సర్వశక్తి మంతుని యిచ్ఛాదిఙ్మండలమున, “సమస్త మాన్యతయు భగవంతునకును, ఆయనను ప్రేమించు వారలకును చెందు,” నను వచనదీప్తి సూర్యునివలె విస్పష్టముగ గోచరమైనయపుడు, క్రమ్మియుండు మేఘములు సంపూర్ణముగ పారద్రోలి వేయబడు దివస మాసన్నమగుచున్నది.

ఉత్తములేని, యధములేని - జను లెల్లరును అంతటి మహోన్నత మాన్యతనే యాశించినారు; ఆశింపుచున్నా రింకను. అయినను, సత్యసూర్యుడు తన తేజస్సును భువిపైకి ప్రసరించిన యంతనే, నిజైక దైవముయొక్క అప్రతిహత దార్శనికతా రజ్జువును చేబూనినవారును, ఆయనయెడ దక్క సమస్తము పట్లను సంపూర్ణవిరాగముతో, ఆయన పవిత్రసాన్నిధ్యము దెసకు తమ వదనములను సారించినవారును దక్క, ఎల్లరును తత్ప్రయోజనములం గోలుపోయి, అవగుంఠ నాచ్ఛాదితులవోలె, తద్వైభవదూరులైనారు.

అంతటి మహత్తర గౌరవానుగ్రహీతుడవైన యందులకు, అఖిలలోకముల దివ్యాభీష్టమగు ఆయనకు ధన్యవాదముల నర్పింపుము. అచిరకాలమునకే ప్రపంచమును, తత్సమస్తమును విస్మృతాంశములై, సమస్తమాన్యతయు సకల యశస్వియును, మహౌదార్యుడును నగు నీ ప్రభుని ప్రియతములదే యగును.

CXLI

అంతర్దృష్టియుతులకై దివ్యగ్రంథమొక్కటి నిక్కముగ భువి కంపబడినది! న్యాయము ననుసరింపు డనియు, ధర్మానువర్తులు కమ్మనియు మానవుల నాదేశింపుచు, మనుష్యసంతతి నిద్రావస్థ నుండి, దైవవశమున, జాగృతమగునేమోయని, తమ క్షుద్రాభిరుచులనూ, దైహికవాంఛలనూ అనుసరింపవలదని వారలనది ప్రతిషేధింపుచున్నది.

వచించు: ఓ ప్రజలారా, మా దివ్యఫలకములయందున మీ కాదేశితమైన దాని ననుసరింపుడు; దౌష్ట్యమునకు పాల్పడి, పరమపవిత్రుడును, సకల వైభవోపేతుడును, మహోన్నతుడును నగు భగవంతునికి దాని నాపాదించు కుత్సితబీజావాపకుల కల్పనలను వెన్నంటి పోవలదు; వచించు: మీరు లౌకిక మాలిన్యసమస్త ప్రక్షాళితులగుదురని - క్లేశములును, వేదనలును మమ్ము పరీక్షించుట కంగీకరించినాము. మరి, మీ మనస్సులయందున మా లక్ష్యమును పర్యాలోచింప నిరాకరింతురేల? భగవంతుని ధార్మికత్వముపై యాన! మే మనుభవించిన వేదనలను స్మరియించువాని హృదయము నిశ్చయముగ దుఃఖముతో ద్రవించును. నా వాక్కుల యథార్థతకు మీ ప్రభుడే సాక్ష్యమును వహియింపు చున్నాడు. సమస్త లౌకికదుర్నీతినుండియూ మిమ్ము పవిత్రులను గావించుటకై, మేము సర్వోపద్రవ భారమును వహియించినాము; అయినను, మీరింకనూ ఉదాసీనులే.

వచించు: ఊర్ధ్వలోకదివ్యగణము విముఖమైయుండు దేనితోనైనను కళంకితుడు గాకుండుట - మా చేలపుటంచును దృఢముగ చేబూనిన ప్రతి యెుక్కనికిని సముచితము. సకల ప్రకీర్తితుడగు నీ ప్రభుడు, తన ప్రస్ఫుట దివ్యఫలకమునం దిటుల నిర్ణయించినాడు. వచించు: మీరు నా ప్రేమను త్రోసి పుచ్చి, నా మనస్సును క్షోభింపజేయుదానికే పాల్పడుదురా? సర్వజ్ఞుడును, సకలవివేకియును నగు ఆయన వెలువరించిన దానిని గ్రహియింపనీయక మిమ్ముల నేది నిరోధింపుచున్నది?

మేము నిక్కముగ, మీ చేష్టల నవలోకింపుచున్నాము. వాటినుండి స్వచ్ఛతా పవిత్రతల సుమధుర సారభము ననుభూతి చెందితిమేని, సునిశ్చయముగ మిమ్ముల నాశీర్వదింతుము. అటుపై స్వర్లోక వాసుల నాల్కలు, మీ ప్రశస్తిని యుగ్గడించి, భగవత్సామీప్యత నొందినవారియందున, మీ నామధేయము లను ప్రస్తుతించును.

భగవంతుని పావనవస్త్రపు టంచును చేపట్టి, ఎవ్వరును త్రెంపజాలనియట్టి, ఆయన దివ్యపాశమును దృఢముగ చేబూనుము. ఈ మహత్తరప్రకటనా ధిక్కారుల యలజడి నిన్ను నీ లక్ష్యసాధన కవరోధించునేమో, జాగ్రత్త. సకలజనులును ఉద్యమించి, నిన్ను వ్యతిరేకించినను, ఈ దివ్యఫలకమున నీకు సూచితమైన దాని నుద్ఘోషింపుము. నిక్కముగ, నీ ప్రభుడు సర్వప్రేరకుడు, నిత్యసంరక్షకుడు.

నా యశస్సు నీతోడను, నీ సహచరులగు నా ప్రియతములతోడను యున్నది. నిజమున కిది శుభప్రదమగునది వీరికే.

CXLII

పరమప్రియునిసౌందర్యముపై ప్రమాణ మొనరింతును! సమస్త సృష్ట్యావృత దివ్యకారుణ్య మిది; వస్తుసమస్తమునకును దైవానుగ్రహము విస్తరిల్లి, పరివ్యాపితమైన మహాసుదినమిది. ఓ ఆలీ! నా కారుణ్యజీవజలములు రయమున జాలువారుచున్నవి; మదీయార్ద్రతానురాగముల యుష్ణిమతో నా హృదయము ద్రవింపుచున్నది. నా ప్రియతములకు సంభవింపుచున్న వ్యధలనేని, వారి మనోల్లాసమును మఱుగుపరుపజాలిన యెట్టి యిక్కట్టునేని, ఎన్నడును నే నామోదించి యుండలేదు.

“సకల కరుణాన్వితు,” డను నా నామధేయము, తా నుచ్చారితయైన ప్రతి సందర్భమునను, నా ప్రియతములయం దొకడు నా యభీష్టమునకు విరుద్ధముగ వర్తించు పదమును బల్కెనని విచారగ్రస్తయై, భగ్నహృదయముతో నిజావాసమునకు మరలిపోయినది; మరి, నా యనుయాయులయం దొక్కడు తన సామీప్యుని లజ్జితు నొనరించెననియో, అధఃకరించెననియో గ్రహియించి నపుడెల్ల, నా నామధేయమైన “వరదుడు,” సైతము నిర్వేదమునొంది, విషణ్ణయై తన యశోధామములకు తరలి దుఃఖాతిరేకమున శోకించి, యాక్రోశించినది. ఇక, నా మిత్రులయం దెవ్వడేని, ఏ యుల్లంఘనమునకో పాల్పడెనని గ్రహియించి నపుడెల్ల, “నిత్యక్షమాపకు,” డను నా నామధేయము, వ్యధాన్వితయై విలపించి, వేదనా భరితయై యవనిపై కూలినయంత, దానిని యూర్ధ్వలోకముల యందలి నిజసదనమున కదృశ్య దూతాగణ మెుక్కటి మోసికొనిపోయినది.

ఓ ఆలీ! నిజైకుడనగు నాపై యాన! బహా మానసమును ప్రజ్జ్వలిత మెునరించిన యగ్ని, నీ హృదయమున జ్వలియింపుచున్న చిచ్చు కన్నను ప్రచండము; ఆయన విలాపము నీ యాక్రందనమున కన్నను తీవ్రతరము. వారియందలి, ఏ యెుక్కరో పాల్పడిన దుష్కార్యము తన సాన్నిధ్యాస్థానమున ప్రస్తావితమైన ప్రతి పర్యాయమును, ప్రాచీనసౌందర్యుడు తన ముఖదీప్తిని సకలజన నయనముల కగుపింపనీయక దాచుకొనవలె ననిపించునంతటి యవమానమునకు లోనగు చుండును; ఏలయన, సర్వకాలములయందునను, ఆయన తన దృష్టిని వారి విధేయతపైననే నిలిపి, తత్ర్పధానావశ్యకతలనే పరికించినాడు.

నీవు లిఖియించిన పదములు, నా సమక్షమున పఠితములైనయంత, మదీయ విధేయతా సాగరమును నాయం దుప్పొంగజేసి, నా క్షమానిలమును నీ యాత్మపై ప్రసరింపజేసి, నా సంప్రీతి వృక్షముతో ని న్నాచ్ఛాదితుని గావించి, నా యనుగ్రహమేఘములు నీపై తమ బహూకృతులను వర్షించునటు లొనరించినవి; నిత్యత్వక్షితిజశోభితుడైన దివ్యాదిత్యునిపై ప్రమాణము చేయుచున్నాడను; నీ వేదన యందున నీతో యావేదన చెందుచు, నీ వ్యధయందున నీతో వ్యధనొందుచున్నాడను. . . నీవు నా కొనరించిన సేవలకు సాక్ష్యమును వహియింపుచు, నాకై నీ వనుభవించిన బహువిధవ్యధలను ధృవీకరింపుచున్నాడను. భువియందలి సమస్తాణువులును నీపట్ల నా యనురాగము నుద్ఘోషింపుచున్నవి.

ఓ ఆలీ! నీ విచ్చిన పిలుపు, నా దృష్టియం దెంతయేని సహేతుకము. నీ జిహ్వాలేఖినులతో, నా దివ్యధర్మము నుద్ఘోషింపుము. సమస్తమానవులును నీచే ప్రజ్జ్వలితు లగునంతటి యుత్సాహోద్వేగములతో గళమునెత్తి, సకలలోకాధీశుడగు ఆయన దెసకు జనుల నామంత్రింపుము.

వచించు: ఓ నా ప్రభూ, నా పరమప్రియా, నా కార్యనిర్దేశకా, నా మానస ధృవతారా, నా యాంతర్యమున ధ్వనియించు దైవవాణీ, నా హృదయారాధనా లక్ష్యమా! నా ముఖమును నీ దెసకు సారింపజేసినయందులకును, నా యాత్మను నీ స్మరణముతో తేజోమయ మెునరించినయందులకును, నాకు నీ దివ్యనామధేయము నుద్ఘోషించి, నిన్ను సంకీర్తింప నాకు సాహాయ్య మొనరించిన యందులకును నీకు ప్రస్తుతి.

నా దేవా, నా దేవా! నీ పథమునుండి యెవ్వరును పెడద్రోవను పట్టకుండినచో, నీ దాక్షిణ్యధ్వజ మింకెటుల యావిష్కృతమై, తదీయ వదాన్యతానుగ్రహ పతాక మూర్ధ్వీకృతము కాగలదు? మరి, యధర్మము గావింపబడకుండినచో - మానవదోషములను మానసమున దాచుకొను వరదుడవనియు, నిత్యక్షమాశీలివనియు, సర్వౌదార్యుడవనియు, సకలవివేకివనియు ని న్నేది సంకీర్తింపగలదు? ని న్నుల్లంఘించు వారి యుల్లంఘనములకు నా యాత్మ సమర్పితమగు గాక; ఏలయన, అట్టి యుల్లంఘనములపై - దయామయుడవును, సమస్తకరుణాన్వితుడవును నగు నీ దివ్యనామ మృదుకారుణ్యముల సుమధురసౌరభములు ప్రసారితములైనవి. ని న్నతిక్రమించుటవంటి యతిక్రమణ లకు నా ప్రాణమర్పితమగు గాక; ఏలయన, తన్మూలమున నీ కారుణ్యనిశ్వాసమును, నీ దాక్షిణ్యాను రాగపరిమళమును వెలువడి, మానవులయందున పరివ్యాప్తములైనవి. నీపై దుష్కృత్యములకు పాల్పడినవారి దురంతములకు నా యంతరంగ మర్పితమగు గాక; ఏలయన, ఇది - నీ బహువిధోప కృతుల దివ్యాదిత్యుడు నీ యనుగ్రహ దిఙ్మండలమున సాక్షాత్కరించుట, సమస్తసృజితాంశముల వాస్తవికతలపైనను నీ యనంత దైవవిధి మేఘములు తమ పురస్కృతులను వర్షించుటవంటి దుష్కృతముల పర్యవసానము వంటిది.

ఓ నా ప్రభూ, నీ చెంత, ఏ మానవుడేని యొప్పుకొనియుండని స్వీయ దుష్కృత్యబాహుళ్యము నంగీకరించిన వాడను. నీ క్షమాసాగరముం జేర పరువిడి, నీ మహాదాక్షిణ్యానుగ్రహచ్ఛాయన రక్షణ నభ్యర్ధించినవాడను. ఓ నిత్యత్వ రాజన్యా, సర్వజన సర్వోన్నతసంరక్షకా, మానవహృదయములను, ఆత్మలను నీ యనంత వాత్సల్యనభమున కెగయజేసి, నీ దివ్యాత్మతో సంభాషించునటు లొనరింపగల దానిని ప్రదర్శించు సామర్ధ్యమును నా కనుగ్రహింపుమని, నిన్ను వేడుచున్నాడను. సమస్తసృజితములను నీ దివ్యావతారప్రభాతము దెసకు, నీ దివ్యావిష్కరణ మూలము దెసకు మరల్పగల్గునటుల నన్ను నీ సర్వోత్కృష్టాధికారముతో శక్తిసమన్వితుని గావింపుము. ఓ నా ప్రభూ, పరిపూర్ణముగా నీ దివ్యేచ్ఛా విధేయుడ నగుటకును, ఉద్యుక్తుడనై నిన్ను సేవించుటకును నాకు తోడ్పాటు నిమ్ము; ఏలయన, ఈ యైహికజీవితమును నే నాకాంక్షించునది కేవలము నీ దివ్యావిష్కరణ పటవేశ్మమునూ, నీ దివ్యవైభవ పీఠమునూ పరివేష్టించుటకు దక్క, వేరొండు హేతువున కాదు. ఓ నా దేవా, నిన్నుదక్క సమస్తమునూ పరిత్యజించినవాడనూ, నీ యిచ్ఛావిధేయుడనూ, స్వాధీనుడనూ అయిన న న్నవలోకింపుచున్నాడవు. నీవు యుక్తమని భావించినటుల, నీ ఘనకీర్త్యౌన్నత్యములకు తగునటుల నాతో వ్యవహరింపుము.

ఓ ఆలీ! సకలలోకాధీశుడైన ఆయన వదాన్యత నీ కనుగ్రహీతమైనది; అగుచున్నది. ఆయన శక్త్యధికారాయుధుడవై, ఆయన దివ్యధర్మమునకు తోడువడి, ఆయన పవిత్రనామధేయమును ప్రకీర్తిత మెునరింప నుద్యుక్తుడవు కమ్ము. నీ లోకజ్ఞానవిహీనతకును, పఠన, లేఖనసామర్ధ్య లుప్తతకును - నీ మనస్సును విషాదభరిత మొనరించు వ్యవధానము నీయవలదు. ఆయన బహువిధానుగ్రహ ద్వారములు నిజైకదైవశక్తి బృహన్నియంత్రణమున యున్నవి. తన సమస్తసేవకుల నిమిత్త మాయన వానిం దెఱచినాడు, తెఱచియేయుంచును. ఈ దివ్యమాధుర్యానిలమును, తత్ప్రభావములును సకల దేశముల యందునను అభివ్యక్తము లగునటుల, నీ మానసోద్యానమునుండి సర్వకాలముల యందునను, సమస్త ప్రపంచము మీదికిని - వీయుచునే యుండవలెనని, మహదానందముతో నే నాశింతును. సకలాంశముల పైనను అధికారముగలవా డాయనయే. నిక్కముగ, ఆయన మహాబలుడు, సకల వైభవోపేతుడు, సర్వశక్తిమంతుడు.

CXLIII

దివ్యసత్యమును గుఱుతించిన ఓ నా భృత్యుడా, సకలకరుణా న్వితుని ధిక్కరించి, దుష్టుడని మాతృఫలకమున గర్హితుడైనవానిని విడనాడుటం జేసి ధన్యుడ వీవు. దృఢచిత్తముతో భగవత్ప్రేమ యందున పయనింపుచు, బుజు మార్గమున ఆయన దివ్యధర్మము ననుసరింపుచు, ఆయనకు నీ వాక్పటిమతో దోడ్పడుము. క్రూరుల చేజిక్కి , కారావాసము ననుభవింపుచున్న సకలకరుణాన్వితుడు, ఇవ్విధముగ ని న్నాదేశింపుచున్నాడు.

నా నిమిత్తము నీకు విపత్తు వాటిల్లెనేని - నా యావేదనలను, వ్యధలను జ్ఞప్తియం దుంచుకొని, నా బహిష్కృతినీ, కారావాసమునూ స్ఫురణకు దెచ్చు కొనుము. సకలవైభవోపేతుడును, సర్వవివేకియును నగు ఆయననుండి మా కనుగ్రహీతమైనదానిని, నీ కిటుల ప్రసాదింపుచున్నారము.

నాపై యాన! మేము ప్రపంచమును, తత్‌సమస్తమును చుట్టగ జుట్టివైచి, తత్‌స్థానమునందొక నూతనవిధానముం బరుపవలసివచ్చు దివస మాసన్నమగు చున్నది. నిక్కముగ, ఆయన సకల విషయాధీశుడు.

నన్ను స్మరియింపవచ్చును గనుక, నీ మనస్సును పునీత మొనరింపుము; నా వాక్కుల నాలింప వచ్చును గనుక, నీ శ్రవస్సును ప్రక్షాళింపుము. అటుపై, కారుణ్యవల్లభుడగు నీ దేవదేవుని సింహాసనము స్థాపితమైన పవిత్రస్థలి దెసకు నీ మోమును సారించి యిట్లనుము: ఓ నా ప్రభూ, నాచే నీ దివ్యావతారమును గుర్తింపజేసినయందులకును, నా యాత్మ కారాధనాకేంద్రమగు నీ సాన్ని ధ్యాస్థానముపై నా మనస్సును నిలుప సాహాయ్య మొనరించిన యందులకును నీకు ప్రస్తుతి. నీకు దక్క సమస్తమునకును విముఖులై, తమ హృదయములను స్థిరముగ నీపై నిలిపినవారికి నీవు విధియించిన దానిని నాకు విధియింపుమని, స్వర్గములు ఛిద్రములై, భూమి బ్రద్దలగునటు లొనరించిన నీ దివ్యనామధేయము పేరిట ని న్నర్ధింపుచున్నాడను. దివ్యవైభవపటవేశ్మమున, నీ సాన్నిధ్యమున, సత్యపీఠికపై యాసీనుడ నగునటుల న న్ననుగ్రహింపుము. నీవు నీ వభిలషించు దానిం జేయ శక్తి యుతుడవు. సకలమహిమాన్వితుడవును, సర్వ వివేకివియును నగు నీవు దక్క వేఱు దైవము లేడు.

CXLIV

మహోన్నతుని దివ్యలేఖినీ, ఈ దివ్యధర్మమును బోధింపవలసిన యనివార్యకర్తవ్యమును ప్రతి యెుక్కరికిని నిర్దేశించి, విధియింపనైనది. . . . తనను దక్క సమస్తమునూ పరిత్యజించువానిని భగవంతుడు నిస్సందేహముగ నుత్తేజితు నొనరించి, ఆతడి హృదయమునుండి యపారముగ వాగ్వివేక పావ నోదకములను వెల్లిగొన జేయును. నిశ్చయముగా, సకలకరుణాన్వితుడగు నీ ప్రభుడు, తా దలచు దానిం జేయుటకును, తనకు సమ్మోదమగు దాని నాదేశించుటకును శక్తిమంతుడు.

ఈ ప్రపంచమునుగురించి యోచించి, తత్సంబంధితాంశము లెంతటి క్షణభంగురములో గ్రహియించితివేని, నీ ప్రభుని దివ్యధర్మపథమున పయనించుటను దక్క అన్యమార్గము నెంచుకొనవు. మనుజు లెల్లరును ని న్నెదిరించుట కుద్యుక్తులైనను, ని న్నాయన మహనీయత నుగ్గడింపనీయక ప్రతిరోధించుట కెవ్వడైనను శక్తిహీనుడే.

నేరుగా ముందునకు సాగి, ఆయన సేవయందున పూనికతో వ్యవహరింపుము. వచించు: ఓ ప్రజలారా! సమస్త పవిత్రగ్రంథములయందునను మీకు వాగ్దత్తమైన దివ్యయుగమిపు డరుదెంచినది. దైవభీతులు కండు; మీ సృష్టికి మూలమైనట్టి ఆయనను మీరు గుఱుతింపక యుండరాదు. వేగిరపడు డాయన దెసకు. ప్రపంచమునకన్నను, తత్‌సమస్తమునకన్నను, మీకెంతయేని యుత్తమమిది. దీనిని మీరు గ్రహియింతురా!

CXLV

హీనులైనను, దీనులైనను మీకు తారసిల్లితిరేని, ఉపేక్షాభావమున వారియెడ విముఖులు కావలదు, ఏలయన, వైభవరాజన్యుడు సదా వారల నవేక్షింపుచు వదాన్యుడును, సర్వవివేకియును నగు నీ ప్రభుని దివ్యాభీష్టముతో తమ కాంక్షాకాంక్షలను మమేకము గావించిన వారు దక్క, అన్యుడు గ్రహి యింపజాలనంతటి యార్ద్రతతో వారితో ననుబంధితుడై యుండును. భువిపై నున్న ఓ సంపన్నులారా! ధూళియందున పడియుండు దీనుని యెదుటనుండి పరువిడి పోవక,ఆతడితో మైత్రి జేసి, ఆతడిని - భగవంతుని రాగరహిత ధర్మనిర్ణయము తనను బాధాతప్తుని గావించిన వ్యధాకథనమును స్ఫురణకు దెచ్చుకొననిండు. భగవంతుని ధార్మికత్వముపై యాన! మీ రాతడితో సమయమును గడుపునపు డూర్ధ్వలోక దివ్యగణము మిమ్ముల నవలోకింపుచు, మీకై మధ్యస్థతను వహియింపుచు, మీ నామములను శ్లాఘింపుచు, మీ వర్తనను సంకీర్తింపుచుండును. తమ విద్వత్సాధనలవలన గర్విష్ఠులు కాని విద్వాంసులు ధన్యులు; పాపిష్ఠుల నపహసింపక - మానవనేత్రములకు తమ స్వీయలోపము లగుపింపకుండునటుల - వారి దుష్కర్మలను దాచుకొను ధార్మికులకు శుభమగును.

CXLVI

మీయందలి ప్రతి యెుక్కడును - మానవులకు సర్వశుభమూలమును, మానవాళికి ధర్మవర్త నాదర్శమును కావలెననునది మా యాశ, అభిలాష. జాగ్రత్త, మీ సామీప్యులకు గాక మీకే ప్రాథమ్యత నిచ్చుకొందురేమో. మానవాళియందలి భగవన్మందిరమైన ఆయనపై, నిల్పుడు మీ దృష్టిని. వాస్తవము నకు ప్రపంచ విమోచనమునకై తన జీవితము నర్పించినా డాయన. నిక్కముగ, ఆయన సకలవదాన్యుడు, కరుణాన్వితుడు, మహోన్నతుడు. మీయం దెట్టి వివాదము తలయెత్తినను, నేను మీ యెదుట నిలచి యుండుట నవలోకింపుడు; నా నామధేయ నిమిత్తమును, నా ప్రత్యక్షప్రభాసమాన దివ్యధర్మముపట్ల మీ ప్రేమకు సంకేతముగను - ఒండొరుల దోషముల నుపేక్షించుకొనుడు. సర్వ కాలములయందునను, మీరు నా సమ్మోదస్వర్గమున స్నేహసౌహార్దములతో సహవాసముచేయుట నవలోకింపవలెననియు, మీ కార్యములనుండి మైత్రీసమైక్యతల, సంప్రీతిసాంగత్యముల పరిమళముల నాఘ్రాణింపవలెననియు మే మభిలషింతుము. వినయశీలియైన సర్వజ్ఞుడు మీ కిటుల యుపదేశింపుచున్నాడు. మేము సర్వదా మీతో యుందుము; మీ స్నేహపరిమళము నాఘ్రాణించితిమేని, మా మానసము నిక్కముగ, మహోల్లాసము నొందును, ఏలయన మా కింకెద్దియును సంతుష్టత నొసంగజాలదు. యథార్థజ్ఞానియగు ప్రతి మనుజుడును, యిందులకు సాక్ష్యమును వహియించును.

CXLVII

మహాఘననామము నాకు సాక్ష్యమును వహియింపుచున్నది! ఈ దివ్యయుగమున యే మానవుడైనను తన హృదయమును యీప్రాపంచిక నశ్వరాంశములపై నిల్పియుంచినచో, ఎంతటి విచారకరమది! ఉద్యుక్తులై, భగవంతుని దివ్యధర్మమునకు దృఢముగ నిబద్ధులు కండు. అత్యం తానురక్తులై యొండొరులతో వర్తింపుడు. పరమప్రియునికై స్వార్ధపు ముసువును నిత్యాగ్నిజ్వాలతో నిశ్శేషముగ దగ్ధము గావించి, హర్షాన్విత జ్యోతిర్మయవదనులై మీ సామీప్యునితో కలసిపొండు. మీ యందలి సత్యవాక్కైన ఆయన ప్రవర్తనమును సకలాంశముల పరముగను, సునిశితముగ మీరు పరిశీలించియున్నారు. తన వలన భగవత్ప్రేమికులయం దెవ్వరి హృదయమేని, ఒక్క రాత్రియైనను, విచారగ్రస్తయగుట యీ దివ్యతరుణుని కెంత దుర్భరమో, లెస్సగ మీ రెఱుగుదురు.

భగవద్వచనము ప్రపంచహృదయమును జ్వలియింపచేసినది; దాని జ్వాలతో ప్రజ్జ్వలితులగుట యందున మీరు వైఫల్యము నొందితిరేని, ఎంతటి బాధాకరమది! భగవంతుని సంప్రీతుం గావింపుడు; మీ రీపుణ్యరాత్రమును, సమైక్యతా రాత్రముగా పరిగణించి, మీ యాత్మలను సంఘటితపరచి, మహత్తర, శ్లాఘనీయ ప్రవర్తనాభరణ విభూషితులగుటకు సంకల్పింతురు. రానున్న విలయస్థితినుండి పతితుని రక్షించి, భగవంతుని సనాతనదివ్యధర్మము ననుసరించుటయం దాతడికి సాహాయ్యమెునరించుటను మీ ప్రధానవిధి కానిండు. మీ సామీప్యునియెడ మీ ప్రవర్తన, నిజైకదైవచిహ్నములను ప్రస్ఫుటముగ ప్రదర్శించునటు లుండవలె; ఏలయన, మీ రాయన దివ్యస్ఫూర్తితో మానవులయందున పునఃసృజితులు కానున్న వారియం దాద్యులు, ఆయన నారాధించి, ఆయన మ్రోలన ప్రణమిల్లు వారి యందున ప్రథములు, ఆయన వైభవాసనమునకు ప్రదక్షిణమెునరించువారియం దగ్రగణ్యులు. తాను సంప్రీతించిన దానిని నాచే యభివ్యక్తము గావింపజేసిన ఆయనపై ప్రమాణము చేయుచున్నాను! ఊర్ధ్వలోక దివ్య సామ్రాజ్యవాసులు మిమ్ములను మీకన్నను బాగుగ నెఱుగుదురు. వ్యర్ధాలాపములని, శుష్కవచనములని భావింపుచుంటిరా, మీ రీవాక్కులను? సకల కరుణాన్వితుడగు మీ దేవదేవు డవలోకించు యంశములను —అనగా, మీ స్థానోత్కృష్టతను ధృవీకరించునవియును, మీ యోగ్యతాయౌన్నత్యమునకు తార్కాణ మగునవియును, మీ స్థాయీమహనీయత నుద్ఘోషించునవియును నగు వాటిని—గ్రహియింపగల శక్తి మీ కున్నదా! మీకు నిర్దేశితమైనదానినుండి మీ వాంఛలును, లజ్జావిహీన వ్యామోహములును మిమ్ముల నవరోధింపకుండ భగవంతు డనుగ్రహింపవలె.

CXLVIII

ఓ సల్మాన్‌! జ్ఞానులును, తాత్త్వికులును వచియించినవేని, రచియించినవేని—అన్నియును - మానవుని పరిమితమేధకు నిష్కర్షితములైన పరిధుల నెన్నడును మీరనూ లేదు; మీరవలె నని యెన్నటికినీ యాశింపనూ జాలవు. మానవులయందలి మహోన్నతుని మేధ స్సెంతటి మహోన్నత శిఖరముల నధిరోహింపజాలిననూ, వైరాగ్యపూర్వకమును, అవగాహనాన్వితమును నగు మానసము చొచ్చుకుపోగల యగాధము లెంతటి బృహత్తరములైననూ, అట్టి మేధస్సేని, మానసమేని - ఎన్నటికిని - తమ స్వీయోహల సృజనను, తమ స్వీయభావనల ఫలితమును మించిపోజాలవు. మహాతాత్త్వికుని ధ్యానములునూ, సాధుసత్తముని జపతపాదులునూ, మానవుని లేఖినీమూలముననో, మౌఖికముగనో గావింపబడిన మహోన్నత వ్యక్తీకరణములునూ - వారలు తమయందున, దేవదేవుడైన తమ ప్రభుని యావిష్కరణమున సృజియించుకొనిన దాని ప్రతి ఫలనము గాక, వేరొండు కాదు. ఈ సత్యమును తన మానసమున పర్యాలోచించు వా డెవ్వడేని, ఏ మానవుడైనను అతిక్రమింపజాలని నిర్దిష్టపరిమితు లున్నవని తక్షణమే యంగీకరించును. భగవంతుని సంవీక్షించి, ఆయన నెఱుగు నిమిత్తము, ఆదిరహి తాద్యమునుండియు గావింపబడుచున్న ప్రతి యత్నమూ, ఆయన స్వీయసృష్టి—స్వీయేచ్ఛా ప్రయోగమున, అన్యుని ప్రయోజనములకుగాక స్వప్రయోజన నిమిత్తమే ఆయన యునికిలోనికి దెచ్చిన యట్టి సృష్టి—యావశ్యకతలచే నియంత్రితమైనది. తన దివ్యతత్త్వమును గ్రహియించుటకు మానవమేధ యును, తన మర్మమును వర్ణించుటకు మనుష్యజిహ్వయును సల్పు యత్నముల కతీతు డాయన. ఆయన సృజియించిన వస్తుజాలముతో ఆయన నెన్నటికిని, ఏ ప్రత్యక్ష వ్యవహారానుబంధమైనను బంధింపనూ జాలదు; ఆయన ప్రాణులు ప్రయోగించు పరమనర్మగర్భ, పరోక్షతమయుత్ప్రేక్షలు ఆయన యస్తిత్వము నకు న్యాయమును చేయనూజాలవు. తన ప్రపంచావృతాభీష్టముతో సృజితవస్తుసమస్తమునూ ఉనికి లోనికి దెచ్చినా డాయన. అనాదిగను, ఇప్పుడును - ఆయన తన యవిభాజ్య, మహోదాత్త దివ్యసత్త్వము యొక్క ప్రాచీననిత్యత్వమునం దాచ్ఛాదితునిగనేయుండినాడు; తన దుర్లభమహనీయతావైభవములయం దాయన శాశ్వతప్రచ్ఛన్నునిగనే యుండును. ఆయన యాదేశము ననుసరించి - స్వర్గస్థిత మంతయు, భువియందలి దెల్లయు సృష్టిలోని కరుదెంచినవి; సమస్తమూ, ఆయన యిచ్ఛానుసారము పూర్ణరిక్తత నుండి యస్తిత్వప్రపంచములోని కడుగిడినది. మరి, భగవద్వచనమున పరికల్పితయైన ప్రాణి, దివ్యయుగ ప్రాచీనుడగు ఆయన స్వభావము నెటుల గ్రహియింపగలదు?

CXLIX

ఈ దివ్యయుగమున, ఏ మానవుడేని, తన యపేక్షలను భగవంతుని దివ్యావిష్కరణ ప్రభాతమగు ఆయనపై, భూస్వర్గస్థితసమస్తము పట్లనూ పూర్ణ విరాగముతో నిలిపెనేని - సర్వజ్ఞుడును, సకలవివేకియును నైన తన దైవమూ, తన ప్రభుడునూ అగు ఆయన నామధేయములయం దొక్కదాని సత్త్వముతో సమస్తసృజితాంశములను జయించుట కాతడు, నిక్కముగ , సశక్తీకృతుడగును. పూర్వయుగము లెన్నడును వీక్షించియుండని తేజమును సత్యసూర్యు డీదివ్య యుగమున లోకముపై ప్రసరింపజేసెనని నిక్కముగ దెలియుము. ఓ జనులారా! ఆయన యశఃప్రకాశమును మీపై భాసిల్లనిండు; ఉపేక్షాపరులు కావలదు.

CL

విజయము సమకూడునపుడు, ప్రతి మానవుడును విశ్వాసినని చెప్పుకొని, భగవంతుని దివ్యధర్మాశ్రయమునకై త్వరనొందును. ప్రపంచావృత పరీక్షాదివసములయందున, దివ్యధర్మమున సుస్థిరులై నిలచి, తత్సత్యమును వీడ నిరాకరించినవారు సంతోషాత్ములు.

. ఓ భగవద్వాసంతములారా! దుర్దశ, దైన్యతలనెడు కంటకముల నుండియు, కంటక వృక్షములనుండియు విముక్తులై, అనశ్వర వైభవప్రపూరిత గులాబీనందనమున కెగసిపొండు. ధూళిపై వసియించు ఓ నా మిత్రులారా! మీ యమరధామము దెసకు త్వరనొందుడు. “పరమప్రియతము డేతెంచినాడు! భగవంతుని దివ్యావిష్కరణ వైభవమకుటమును ధరియించి, తన సనాతనస్వర్గ ద్వారము లను మానవులకు వివృత మెునరించినా,” డను హర్షాన్విత వర్తమానము నొండొరులకు ప్రకటించు కొనుడు. సమస్త నేత్రములను సంతస మెుందనిండు, ప్రతి శ్రవస్సును సమ్మోదము నొందనిండు, ఏలయన, ఆయన సౌందర్యము నవలోకించుటకు తరుణమిది; ఆయన వాణి నాలించుటకు సముచిత సమయమిది. అభికాంక్షియైన ప్రతి ప్రియునకును, “వీక్షించు, నీ పరమప్రియుడు మానవులయం దవతరించినా,” డని ప్రకటింపుడు; “అదిగో, పూర్ణవైభవాంబర ధారియై పూజితు డవతరించినా,” డని ప్రేమసమ్రాట్టు దూతలకు వర్తమానము నిండు. ఆయన సౌందర్యప్రియులారా! ఆయనతో మీ వియోగ వేదనను, శాశ్వత పునస్సమాగమ ప్రమోదముగా పరివర్తిత మెునరించుకొని, ఆయన సాన్నిధ్య మాధుర్య మాయన యాస్థానదూరస్థతాతిక్తతను హరియింపనిండు.

దివ్యవైభవ మేఘములనుండి వర్షింపుచున్న, భగవంతుని బహువిధ యనుగ్రహ మీనాడు ప్రపంచము నెటు లావరించినదో వీక్షింపుడు. ఏలయన, పూర్వపు రోజులయందున ప్రతి ప్రియుడును తన పరమప్రియునికై యాశించి, అన్వేషించియుండగ, ఇప్పుడు తన ప్రియులకు పిలుపునిచ్చుచు, తన సాన్నిధ్యము నొందుడని వారల నాహ్వానింపుచున్నది సాక్షాత్తూ పరమప్రియుడే. అప్రమత్తులు కండు, అంతటి యమూల్యోపకృతిం గోలుపోవుదురేమో; జాగరూకులుకండు, ఆయన యనుగ్రహ విశేష ప్రతీకను కించపరతురేమో. శాశ్వత ప్రయోజనములను పరిత్యజింపవలదు; క్షణభంగురములతో సంతుష్టత నొందవలదు. మీ దృష్టి నాచ్ఛాదింపుచున్న ముసువుం దీసివైచి, దాని నావరించిన తిమిరమును పారద్రోలుడు; తద్వారా మీరు పరమప్రియుని నిజసౌందర్యము నవలోకింపవచ్చును, ఏ నేత్రమూ వీక్షించియుండనిదానిని వీక్షింపవచ్చును, ఏ శ్రవస్సూ వినియుండని దానిని వినవచ్చును.

ఓ మర్త్యవిహంగములారా, న న్నాలింపుడు! నిత్యవైభవప్రపూరిత గులాబీవనమున దివ్యప్రసూన మొక్కటి వికసింప దొడగినది; దానితో బోల్చిచూడ, ప్రతి పుష్పమును కంటకము గాక వేరొండు కాదు. దాని శోభావిభవము మ్రోల, సౌందర్యభావనయే దీనయై, కృశియింపవలె. కావున, ఉద్యమించి, మీ హృదయముల పూర్ణోత్సాహమున, మీ యాత్మల సంపూర్ణసంభ్రమమున, మీ పరిపూర్ణ యిచ్ఛాతిరేకతన, మీ యావదస్తిత్వపు శ్రద్ధాన్విత యత్నములతో - ఆయన సాన్నిధ్యస్వర్గము నొంద, దాని యమలిన దివ్యప్రసూన సుగంధమును మూర్కొన, పవిత్రతా సుమధుర పరిమళముల నాఘ్రాణింప, ఈ యమ రవైభవ సౌరభమున పాలునొంద - యత్నింపుడు. ఈ యుపదేశము ననుసరించిన యాతడు తన శృంఖలములం దుత్తునియలం జేసి, ప్రేమపారవశ్యపరిత్యాగము జవిచూచి, తన మనోభీష్టమును నెరవేర్చుకుని, తన యాత్మను తన ప్రియతముని హస్తాధీన మొనరించును. తన పంజరమును చీల్చుకుని బయల్వెడలి, చైతన్యవిహంగము వోలె తన పవిత్ర, నిత్యకులాయమున కెగసిపోవును.

ఒకదాని ననుసరించి యొకటిగ దివారాత్రము లరుదెంచుచునే యున్నవి; మీ జీవిత ఘడియలును, క్షణములును వచ్చిపోయినను, మీలోని ఏ యెుక్కడును నశ్వరమగు దానిని లిప్తమాత్రమేని విడనాడుట కిచ్చగింపలేదు. ప్రయత్నింపుడు, ఇంకను మీవియేయైన క్షణములు వ్యర్థములు కానేరవు. మెఱపువేగమున మీ దివము లంతమగును, మృత్తికాపటలమున కడుగున మీ దేహములు విశ్రామితములగును. అప్పుడిక, మీరు సాధింపగలుగునదేమి? మీ పూర్వవైఫల్యమున కెటుల ప్రాయశ్చిత్తము జేసికొందురు?

అమరదీపిక తన యనాచ్ఛాదితశోభతో భాసిల్లుచున్నది. ప్రాపంచికమైన ప్రతి ముసువునూ, అది యెట్లు దహియించినదో వీక్షింపుడు. ఆయన జ్ఞానజ్యోతిని శలభసదృశులై ప్రేమింపుచున్న ఓ జనులారా! ప్రతి సంక్షోభముపట్లను స్థైర్యమున వ్యవహరించి, తద్భీషణజ్వాలకు మీ యాత్మల నాహుతి గావింపుడు. ఆయనకై తృష్ణనొందినవారలారా! ప్రతి యైహికాపేక్షనూ విదళించుకొని, మీ పరమప్రియు నాలింగన మెునరించుకొన వేగిరపడుడు. ఆయనను సమీపించుటకై యనుపమానోత్సాహమున త్వరనొందుడు. ఇంతదనుక మనుష్యదృష్టికి గుప్తముగ నున్నట్టి యా దివ్యప్రసూనము మీ నేత్రముల కావిష్కృతయైనది. తన ప్రత్యక్షవైభవప్రభతో మీయెదుట నిలచినాడాయన. పునీతులను, పుణ్యాత్ములను—ఎల్లరను, వచ్చి ఆయనయం దైక్యము కమ్మని యామంత్రింపుచున్న దాయన వాణి; ఆ దెస కున్ముఖుడైన యాతడు సంతోషాత్ముడు; అంతటి యద్భుత వదనప్రభాస ప్రాప్త్యవలోకనముల నొందినవానికి శుభము.

CLII

నీ నేత్రము నా నిధి; వ్యర్ధవాంఛల ధూళితో తత్కాంతి నాచ్ఛాదితము కానీయవలదు. నీ శ్రవస్సు నా యౌదార్యమునకు ప్రతీక; అనుచిత లక్ష్యముల యలజడితో, సకలసృష్ట్యావృతయగు నా దివ్యవాక్శ్రవణమునకు దానిని దూరము గావింపవలదు. నీ మానసము నా కోశాగారము; నే నందున సుభద్ర మొనరించిన మౌక్తికములను దోచుకొను యవకాశమును స్వార్ధ మనబరగు విశ్వాసఘాతుక హస్తమున కీయవలదు. నీ హస్తము నా ప్రేమోపేత కారుణ్యమునకు సంకేతము; దానికి, నా సురక్షిత, నిగూఢదివ్యఫలకములను దృఢముగ చేతంబూని యుండుటయం దవరోధమును కల్పింపవలదు. . . . అడుగకయే, నీపై నా యనుగ్రహమును వర్షించినాడను. అభ్యర్ధింపకనే, నీ యభీష్టమును నెరవేర్చినాడను. అపారములును, అగణితములును నగు నా యుపకృతుల వితరణకు అయోగ్యుడవయ్యును, ని న్నెంచుకొని నాడను. . . . ఓ నా సేవకులారా! అవనివలె విరాగులును, విధేయులును కండు; తద్వారా, మీ యస్తిత్వధూళినుండి పరిమళభరితమును, పవిత్రమును, బహువర్ణశోభితమును నగు నా జ్ఞానపు హ్యాసింత్‌ కుసుమములు వికసింపవచ్చును. అలక్ష్యపు ముసువులను గాల్చివైచి, అవిధేయ, భయకంపిత మానసమును భగవత్ప్రేమయొక్క స్ఫూర్తిప్రదాయకశక్తులతో ప్రజ్జ్వలిత మొనరింప గలుగునటుల యగ్నివలె జ్వలియింపుడు. నా యాస్థాన ప్రాంగణమున, నా పావనాశ్రయమున ప్రవేశము నొంద గలుగుటకై, మలయమారుతమువలె భారరహితులును, నిర్నిరోధితులును కండు.

CLIII

ఓ బహిష్కృత, విధేయమిత్రమా! నా యనుగ్రహ మనబడు పవిత్రీకృత జలములతో నలక్ష్యపుతృష్ణం దీర్చుకొని, నా దివ్యసాన్నిధ్యప్రభాత శోభతో దూరస్థతాంధకారమును పారద్రోలుము. నీయెడ నా యమరప్రేమ నెలవై యుండు యావాసమును దుర్వాంఛల క్రౌర్యముతో నశియింపనీయకు; దివ్యతరుణుని సౌందర్యమును స్వార్ధవ్యామోహముల ధూళితో నావృతము కానీయవలదు. ధార్మిక సత్త్వవస్త్రమును ధరియింపుము; భగవంతునికి దక్క నీ హృదయము నన్యునకు భీతిల్లనీయవలదు. వ్యర్థ, దుర్వ్యామోహ కంటకములతో, ముండ్లపొదలతో నీ యాత్మయను శోభాయమాన వసంతమును ప్రతిరోధింపవలదు; నీ హృదయోల్బణస్రావిత జీవజ్జలప్రవాహము నవరోధింపవలదు. నీ యాశ నంతటినీ భగవంతునియందున యుంచి, ఆయన యమోఘానుగ్రహమునకు దృఢముగ బద్ధుడవు కమ్ము. ఆయన దక్క , దీనుల నెవ్వరు సంపన్నుల గావింపగలరు; పతితుని, ఆతడి యవమతి నుండి ముక్తుని గావింపగలరు?

ఓ నా సేవకులారా! మీరు నా యమలిన వైభవపు నిగూఢ, విస్తారాంబుధులను శోధించితిరేని, నిస్సంశయముగ, మీరీ ప్రపంచమును, కాదు కాదు, సమస్త సృష్టినీ శూన్యముగ పరిగణింతురు. మీ మహత్తర, మహోత్కృష్టలక్ష్యమును—మీరు మీ పరమప్రియుని సాన్నిధ్యమునొంది, ఆయనతో నైక్యమగు స్థాయిని —మీచే సాధింప జేయునంతటి ప్రచండముగ మీ హృదయములయం దన్వేషణ జ్వాలను జ్వలియింపనిండు. . . .

ఓ నా సేవకులారా! సకలవైభవాన్వితుడైన భగవంతునియెడ మీ విశ్వాస మూలములను—మీ నిరర్ధకాశయములతో, నిష్ఫలభావనలతో—భగ్నము కానీయవలదు; ఏలయన, అట్టి భ్రమలు మానవు లకు లబ్ధిప్రదములు కాకపోవుటయే గాక, వారి యడుగులను బుుజుపథమునకు నిర్దేశించుట యందునను వైఫల్యము నొందినవి. ఓ నా సేవకులారా, నా సర్వావృత, సమాచ్ఛాదిత, సర్వోత్కృష్ట హస్తము శృంఖలాబద్ధయైనదనియో, నా యవిచ్ఛిన్న, ప్రాచీన, సర్వవ్యాపిత కారుణ్యవాహిని ప్రతిరోధిత యైనదనియో, మహోన్నతములును, అమేయములును నగు నా యనుగ్రహమేఘములు తమ బహూకృతులను మానవులపై వర్షించుట నాపివైచినవనియో భావింపుచుంటిరా? అమరమును, అప్రతిహతమును నగు నా యధికారము నుద్ఘోషించిన మహాద్భుతరచన లుపసంహారితము లైనవనియో, నా యపేక్షాలక్ష్యముల సత్త్వము, మానవపరమావధులకు పథనిర్దేశ మొనరించుటయం దవరోధిత యైనదనియో, ఊహింపగలరా? అటుల కాదేని, నా యనుగ్రహాన్విత, పవిత్ర దివ్యవదనపుటమర సౌందర్యమును మానవనేత్రముల కావిష్కృతము కానీయక నిరోధింప యత్నించితిరేల? భువిపై తన దివ్యావిష్కరణ దీప్తిం బ్రసరింపనీయక సర్వశక్తిమంతుని, సకలవైభవాస్తిత్వపు దివ్యావతారము నవరోధింప బెనగితిరేల? మీరు మీ నిర్ణయమున నిష్పాక్షికులై యుండినచో యీ నవ్య, మహాద్భుత దివ్యావిష్కరణానందమున సకలసృజితాంశముల వాస్తవికత లెట్లు మైమరచినవో, తద్వైభవదీప్తితో సమస్తమృత్తికాణువు లెట్లు సుశోభితములైనవో తక్షణమే గ్రహియించియుందురు. మీ రూహించినది యును, ఇంకను యూహింపుచున్నదియును వ్యర్థము, గర్హ్యము!

ఓ నా సేవకులారా, మీ ప్రక్రియలను పునస్సమీక్షించుకొని, మీ మానసములను మీ సృష్టికి మూలమైనట్టి ఆయన దెసకు మరల్చుడు. మీ దుష్ట, నీతిబాహ్య వ్యామోహములనుండి విముక్తులై - మార్మికమును, మహోన్నతమును నగు యీ దివ్యావిష్కరణా సైనాయిపై ప్రజ్జ్వలించు నిరతాగ్నిదీప్తి ననుసరింప త్వరనొందుడు. పవిత్రమును, సర్వావృతమును నగు భగవంతుని ప్రథమ వచనమును భ్రష్టత నొందించి, తత్పవిత్రత నవమానించుటకో, తన్మహోదాత్తస్వభావము నధఃకరించుటకో యత్నింప వలదు. ఓ ఉపేక్షాపరులారా! నా కారుణ్యవైచిత్య్రములు గోచరాగోచర సృజితసమస్తము నావరించి యున్ననూ, నా దయానుగ్రహముల యభివ్యక్తీకరణలు ప్రతి విశ్వస్థితాణువు నావహించి యున్ననూ, దుష్ట శిక్షణకు నేనుపయోగించు హస్తదండము భీషణము, వారియెడ నా క్రోధాధిరేకత భయంకరము. నా కరుణాకటాక్షముల కొలది మీ కావిష్కరించిన యుపదేశములను శుష్కాడంబర, ప్రాపంచికవాంఛా ప్రక్షాళిత శ్రవస్సులతో నాలింపుడు; నా మహాద్భుత దివ్యాష్కరణ నిదర్శనములను మీ యంతర్బాహ్యావ గాహనలతో పర్యాలోచింపుడు. . . .

ఓ నా సేవకులారా! దివ్యవైభవ దీపికావిరాజిత ప్రభాసమాన శోభం గోలుపోవలదు. మీ జ్యోతిర్మయ హృదయములయందున భగవద్వాత్సల్యదీపశిఖను తేజోభరితమై జ్వలియింపనిండు, దివ్యమార్గదర్శనతైలముతో దానిని పరిపోషించి మీ యాత్మస్థైర్యాశ్రయమున సంరక్షింపుడు. నాస్తికుల దుర్బోధలు దాని దీప్తి నార్పివేయకుండునటుల భగవంతునిపట్ల విశ్వాసము, ఆయన దక్క సకలము పట్ల వైరాగ్యము లనబడు గోళమున దానిని సంరక్షింపుడు. ఓ నా సేవకులారా! పవిత్రమును, దైవనిర్దేశితమును నగు నా దివ్యావిష్కరణము - మహోత్కృష్ట ప్రభలను వెదజల్లు యమూల్యరత్నముల నసంఖ్యాకములుగ తన యగాథముల యందున నిక్షిప్తపరచుకొనియున్న మహాసముద్రము వంటిది. ఈ మహాసాగరతీరములను చేరుటకు జాగృతుడై, యత్నించుట ప్రతి యన్వేషకుని కర్తవ్యము; తద్వారా, ఆతడు తన యన్వేషణోత్సాహమునకును, తానొనరించిన యత్నములకును అనువుగ; భగవంతుని యనుల్లంఘనీయ, నిగూఢదివ్యఫలకములయందలి పూర్వనిర్దేశిత యుపలబ్ధములలో భాగము నొంద వచ్చును. దాని తీరముల దెస కడుగులను వేయుట కేయెుక్కడును యిష్టపడని యెడలను, ఉద్యుక్తుడై ఆయనను కనుగొనుటయందున ప్రతియెుక్కడును విఫలమైన పక్షమునను - అట్టి వైఫల్యము యీ మహాసాగరశక్తిని హరియించివైచిన దనియో, కొంత దనుక యేని తదైశ్వర్యములను కుదియించి వైచిన దనియో అనవచ్చునా? ఎంత వ్యర్థము లెంత హేయములు మీ హృదయములు కల్పించుకొనిన, కల్పించు కొనుచున్న యూహలు! ఓ నా సేవకులారా! నిజైకదైవము నాకు సాక్ష్యము! మహత్తరమును, దురవగాహాగాధమునునైన ఈ యుత్తుంగసాగర మాశ్చర్యకరముగ మీ సామీప్యముననే యున్నది. మీ జీవనాడికన్నను ఇదియే మీకెంత చేరువగనున్నదో వీక్షింపుడు. అభిలషించితిరేని, కనురెప్పపాటు వేగమున దానిం జేరి, ఈ యనశ్వరోపకృతికిని, ఈ భగవత్కృపకును, ఈ యమరపురస్కృతికిని, మహాశక్తిసమన్వితమును, అనిర్వచనీయమునునగు యీ మహదనుగ్రహమునకును పాత్రులు కండు.

ఓ నా సేవకులారా! మీ యాత్మల కెట్టి యౌదార్యానుగ్రహముల వైచిత్య్రములను ప్రసాదింప నిచ్చగించితినో గ్రహియింపగల్గితిరేని, సత్యముగ, మీరు సమస్త సృజితాంశ వ్యామోహమును విదళించు కొని, మిమ్ములను గురించిన యథార్థజ్ఞానము—నా యాత్మజ్ఞానావగాహన వంటి జ్ఞానము—నొంద గలరు. నానుండి దక్క సమస్తమునుండియు స్వతంత్రులై, మీయందున మలయు నా సంప్రీత్యనుగ్రహ సాగరములను మీ యంతర్బహిర్నేత్రములతో, నా సముజ్జ్వల నామధేయపు టావిష్కృతి యంత స్పష్టముగ, మీరే కనుగొందురు. అంతటి మహోన్నత స్థానప్రభాసమును మ్లానముగావించి, తత్పవిత్రతను కలుషిత మెునరించు యవకాశమును మీ వ్యర్ధోహలకును, మీ దుర్వ్యామోహములకును, మీ కాపట్యమునకును, మీ హృదయాంధతకును యీయవలదు. తన బృహత్పక్షముల పూర్ణబలముతో, ఆహ్లాదాన్విత విశ్వాసపరిపూర్ణతతో, సువిశాల స్వర్గమున విహరింపుచు, క్షుధను తీర్చుకొనుటకై, దిగువన భువియందలి పంకజలమును చూచి, లాలసకొలది దిగివచ్చి, అటుపై తత్సంబంధిత వాంఛాజాలమున చిక్కువడుటం జేసి, తాను బయల్వెడలియున్న యా దివ్యలోకములకు, తన యానమునకై పునరుపక్ర మించుట కశక్తనని గ్రహియించిన విహంగసదృశులు మీరు. అంత దనుక స్వర్గనివాసినియైన, ఆ విహంగ మిపుడు పక్షముల కళంకభారమును విదళించుకొన శక్తివిహీనయై, ధూళియం దావాసము నేర్పరచుకొనక తప్పలేదు. కావున, ఓ నా సేవకులారా మీ రెక్కలను మౌఢ్యముతో, నిష్ఫలవాంఛా పంకముతో మలినము గావించి, ఈర్ష్యాద్వేషముల ధూళితో కళంకితముల నొనరింప వలదు; తద్వారా, మీకు నా దివ్యజ్ఞానపు టాకసమున విహరించుట కవరోధ ముండదు.

ఓ నా సేవకులారా! భగవంతుని శౌర్యపరాక్రమములతో, ఆయన విజ్ఞాన వివేకభాండారముల నుండి, ఆయన యమరాంబుధి లోతులయందలి నిక్షిప్త మౌక్తికములను దెచ్చి మీ కావిష్కృత మొనరించి నాడను. ప్రచ్ఛన్నతావగుంఠనము వెనుకనుండి వెలికిరమ్మని స్వర్లోకసేవికల నామంత్రించి, ప్రపూర్ణాంతఃసత్వ విజ్ఞతాయుతములగు యీ నా వాగ్వస్త్రములను వారికి ధరియింప జేసినాడను. అదియును గాక, దైవశక్తిసమన్వితహస్తముతో నా దివ్యావిష్కరణమను యిష్టమధుకలశపు మూతను తెఱచి తత్పవిత్ర, నిగూఢ, కస్తూరిపరిమళమును సృజితవస్తు సమస్తముపైనను పరివ్యాప్త మొనరించి నాడను. సర్వోత్తమమును, సర్వవ్యాపృతమును నగు భగవంతుని దివ్యవదాన్యతా బృహద్వాహినితో, ఆయన మహాదీప్తిమయ, శోభాయమాన కారుణ్యావిష్కరణముతో ననుగ్రహీతులు కా నొల్లకుండిరేని, మిమ్ములను గాక యింకెవరిని నిందింపవలె? . . .

ఓ నా సేవకులారా! దివ్యమార్గదర్శన నిత్యప్రభాతశోభ దక్క వేరొండు నా హృదయమున భాసిల్లుటలేదు, దివ్యప్రభుడైన మీ దైవ ముద్ఘోషించిన సత్యసారము దక్క యితరము నా ముఖతః వెలువడుటలేదు. కావున, మీ యైహికవాంఛల ననుసరింపవలదు; భగవంతుని దివ్యఒడంబడిక నుల్లంఘింపనూ వలదు, ఆయనకు మీ రొనరించిన వాగ్దానమును భంగము గావింపనూవలదు. దృఢసంకల్పముతో, మీ సంపూర్ణహృదయాపేక్షతో, మీ పరిపూర్ణవచోశక్తితో ఆయన నాశ్రయింపుడు; మూర్ఖుల తీరుల ననుసరింపవలదు. ఈ ప్రపంచ మెుక ప్రదర్శనము; వ్యర్ధము, రిక్తము; వాస్తవముగ తోచునట్టి, వట్టి శూన్యము దక్క వేరొండు కాదు. దానిపట్ల యపేక్షల నేర్పరచుకొనవలదు. మీ సృష్టికర్తతో మిమ్ముల ననుసంధానించు బంధమును త్రెంచుకొని యపరాధులై, ఆయన మార్గములను వీడిపోవలదు. నిక్కముగా వచియింపుచున్నాడను, ఈ ప్రపంచము - ఎడారియందున దాహార్తుడు నీరమనియెంచి, తన యావచ్ఛక్తితో యత్నించి, దరిజేరినయంత, తనది వట్టి భ్రమయని యాతడు గ్రహియించునట్టి జలయూష్మము. అంతియేకాదు, తన సుదీర్ఘాన్వేషణానంతరము తుదకు, “తన తపనను పెంచనూ జాలదు, తీర్పనూజాల,” దని ప్రియుడు గ్రహియించుటకు హేతువైన, ఆతడి ప్రేమిక నిర్జీవప్రతిమతోడనూ దానిం బోల్పవచ్చును.

ఓ నా సేవకులారా! దైవము యీదినములయం దీయవనీతలమున మీవాంఛా విరుద్ధములగు వానిని విధియించి, కల్పించిన పక్షమున చింతిల్లవలదు; ఏలయన, మహదానందకర, దివ్యాహ్లాదయుత దినములు నిక్కముగ మీకై యరుదెంచనున్నవి. పవిత్ర, ఆధ్యాత్మిక వైభవప్రపూరిత దివ్యలోకములు మీ కన్నులకు సాక్షాత్కృతము లగును. ఈ ప్రపంచమునను, తదనంతరమునను తత్ప్రయోజన లబ్ధికి పాత్రులగుటను, తదాహ్లాదముల యందున పాలొందుటను, తన్నిత్యాను గ్రహమున భాగము నొందుటను - మీ కాయన నిర్దేశింపనైనది. వాటి యందలి ప్రతిదానినీ మీ రొందుదురు.

CLIV

ఓ సల్మాన్‌, మనుష్యభాషితములనూ, రచనలనూ తీవ్రవిమర్శనా దృష్టితో వీక్షింపవలదని నిజైకదైవ ప్రియతములను హెచ్చరింపుము. వారల నట్టి భాషితములనూ, రచనలనూ విశాలదృక్పథ స్ఫూర్తితో, సహానుభూతితో పరిశీలింపనిమ్ము. అయినను, ఈ దివ్యయుగమున, తమ విద్వేషపూరిత రచనలతో, భగవంతుని దివ్యధర్మ నియమముల నాక్షేపింప సమకట్టిన వారితో విభిన్నముగ వ్యవహరింప వలె. భగవంతుని దివ్యధర్మముపై దుర్విమర్శను గావించిన వారి వాదములను, తమతమ సామర్ధ్యముల మేరకు, ఖండించుట మానవు లెల్లరికిని విధాయకము. సకలబలుడును, సర్వశక్తిమంతుడును నైన ఆయన యివ్విధముగ నిర్ణయింపనైనది. నిజైకదైవము యొక్క దివ్యధర్మమును ప్రవృద్ధము గావింపనెంచు నాతడిని ఖడ్గమునో, హింసనో యెంచుకొననీయక, దానిని తన లేఖినితో, భాషతో ప్రవృద్ధము గావింప నిండు. ఈ యాదేశము నొక పూర్వసందర్భమున వెలువరించితిమి; గ్రహియింపగలుగు వారేని, ఇప్పుడు దానిని యివ్విధముగ ధృవీకరింపుచున్నారము. ఈ దివ్యయుగమున, సకలసృజితముల హృదయాంత రాళమున ఘోషించునట్టి ఆయన ధార్మికత పేరిట: “దేవా, నేను గాక వేరొండు వేలుపు లేడు!” ఏ మానవుడైనను భగవంతుని దివ్యధర్మపరిరక్షణమునకై, తద్విరోధులకు ప్రతిగా, తన రచనలతో నుద్యమించెనేని, అట్టి మానవుడు, తన ప్రమేయమెంత యప్రధానమైనను, ఊర్ధ్వలోక దివ్యగణములు తన యశస్సున కీర్ష్య నొందునటుల భావిప్రపంచమున సమ్మానితుడగును. ఆతడి స్థానౌన్నత్యము నేలేఖినియూ వివరింపనూజాలదు,తద్వైభవము నేజిహ్వయూ వర్ణింపనూ జాలదు; ఏలయన, ఈ పరమ పవిత్ర, మహిమాన్విత, మహోదాత్త దివ్యావిష్కరణమున ధైర్యస్థైర్యములతోనుండు నాతడికి – దివి యందలి, భువియందలి సమస్తమునూ యెదిరించి నిలువగల శక్తి యనుగ్రహీతమగును. సాక్షాత్తూ భగవంతుడే యిందులకు సాక్షి.

ఓ భగవత్ర్పియతములారా! మీ శయ్యలపై విశ్రమింపవలదు; స్రష్ట యగు మీ ప్రభుని గుఱుతించిన యంతనే యుత్తేజితులై, ఆయనకు వాటిల్లిన విపత్తుల నాలించి, ఆయన సాహాయ్యమునకై త్వరనొందుడు. మీ జిహ్వలను సడలించి, ఆయన దివ్యధర్మము నవిచ్ఛిన్నముగ నుద్ఘోషింపుడు. ఈ సత్యమును గ్రహియించు వారలేని, సమస్త భూత, భవిష్యదైశ్వర్యములకన్నను, ఇదియే మీకు యుక్తము.

CLV

భగవంతుడు తన భృత్యులకు విధియించిన ప్రథమకర్తవ్యము: తన దివ్యావిష్కరణమునకు అరుణోదయమును, తన శాసనోద్భవమునకు స్రవంతియును, తన దివ్యధర్మసామ్రాజ్యము, సృష్టి ప్రపంచము రెండింటి యందునను దివ్యత్వమునకు దౌత్యకర్తయగు ‘ఆయన’ ను గుర్తించుట. ఈ కర్తవ్యమును నెరవేర్చినయాతడు సకలశుభసాధకుడు; తద్విహీను డెంతటి సత్కార్యకర్తయైనను, దానినుండి వైదొలగినట్లే. ఈ మహోత్కృష్టస్థానమును, ఈ మహామహిమోపేతశిఖరమును అందుకొనిన ప్రతియెుక్కడును, లోకాపేక్షితుడగు ‘ఆయన’ ప్రతి శాసనమును పాటింపవలె. ఈ కర్తవ్యద్వయ మవిభాజ్యము. ఇందేదియును రెండవది లేకుండ అంగీకారయోగ్యము కాదు. దివ్యప్రేరణకు మూలాధారు డగు ‘ఆయన’చే నివ్విధముగ నాదేశింపబడినది.

భగవంతునిచే నంతర్దృష్టి ప్రసాదింపబడినవారు, ఈ ప్రపంచసంవిధాన సంరక్షణకు, దీని ప్రజా భద్రతకు అత్యుత్తమసాధనములుగ భగవంతు డేర్పరచిన ధర్మసూత్రములను యిట్టే గ్రహియింతురు. వాటినుండి వైదొలగినవా డధముల యందునను, అవివేకులయందునను ఒకనిగ గణియింపబడును. మీ దుర్మోహముల, నికృష్టవాంఛల యాదేశములను తిరస్కరింపుడనియు, మహోన్నతుని దివ్యలేఖిని స్థిరీకృతమెునరించిన హద్దులు సకలసృజితములకును జీవనశ్వాస యగుటచే, వాటిని మీరవలదనియు, మేము నిశ్చయముగ మి మ్మాదేశించినాము. సకలదయామయుని ఉచ్ఛ్వాసమారుతమునుండి దివ్యజ్ఞాన, దివ్యభాషణా సాగరము లుద్భవించినవి. ఓ విజ్ఞులారా! అత్యధికముగా సేవించుటకై త్వర నొందుడు. భగవంతుని యాదేశముల నతిక్రమించుటద్వారా‘ఆయన’ దివ్య ఒడంబడిక నుల్లంఘించి తిరోగమించినవారు సమస్తసంపన్నుడూ, సర్వోన్నతుడూనగు భగవంతుని దృష్టియందున మహాపరాధము నొనరించినారు.

ఓ ప్రపంచజనులారా! నా యాదేశములు నా భృత్యుల యెడ నా ప్రేమా న్వితానుగ్రహ దీపికలనియు, నా సృజితజీపులకు నా కరుణాన్విత కుంచికలనియు నిశ్చయముగ తెలిసికొనుడు. ఆవిష్కరణాధిపతియగు భగవంతుని యిచ్ఛా స్వర్గమునుండి ఇవ్విధముగ నిది యనుగ్రహీతమైనది. సకలదయామయుని యధరము లుచ్చరింపనెంచిన పదముల మాధుర్యము నేమానవుడైనను చవి చూచెనేని, ‘ఆయన’ ఔదార్యోపేత సంరక్షణ, ప్రేమోపేతకారుణ్యముల అరుణోదయముపై శోభిల్లు ‘ఆయన’ యాదేశములయందలి ఏ యెుక్కదాని సత్యనిరూపణకైనను - భూలోకమందలి సకల సంపదలును తన యాధీనమం దున్నను, వానినన్నింటిని త్యజియించును.

వచించు: నా శాసనములనుండి, నా వస్త్రపు సుమధురపరిమళము నాఘ్రాణింపవచ్చును, వాటి సాహాయ్యమున మహోన్నతశిఖరములపై విజయధ్వజములను నిలుపవచ్చును. నా సర్వశక్తియుత మహిమాన్విత స్వర్గమునుండి నా యధికారవాణి నా సృష్టి నుద్దేశించి ఇవ్విధముగ పలికినది: “నా సౌందర్యాపేక్షకై నా యనుశాసనముల ననుసరింపుడు.” ఏ జిహ్వయును వర్ణింపజాలని కారుణ్యసౌరభ ప్రపూరితములగు యీ ప్రవచనములనుండి పరమప్రియతముని దివ్యపరిమళము నాఘ్రాణించిన ప్రేమికుడు సంతోషాన్వితుడు. నా జీవితము సాక్షిగా ! నా దయానుగ్రహయుత హస్తములనుండి న్యాయమను శ్రేష్ఠమధువును గ్రోలిన యాతడు నా సృష్ట్యోదయమున కెగువన శోభిల్లు నా యనుశాసనముల చుట్టును పరిభ్రమించును.

మేము మీకై కేవల మెుక ధర్మస్మృతిని వెలువరించితిమని యెంచవలదు. వాస్తవమునకు, శక్త్యధికారములనెడు యంగుళులచే దివ్యమదిరాభాండమును వివృత మెునరించినాము. దివ్యావిష్కరణ లేఖిని వెలువరించినదే ఇందుకు సాక్ష్యమును వహియింపుచున్నది. అంతర్దృష్టియుతులారా! ఇందుపై పర్యాలోచింపుడు.

దివ్యప్రవచనావిష్కర్తయగు భగవంతునికి ఉదయ, మాధ్యాహ్నిక, సాయంకాలములయందున అర్పించుటకై తొమ్మిది ‘రకాహ్‌’ లతో అనివార్య ప్రార్థనను మీకు నిర్దేశించినాము. భగవంతుని దివ్యగ్రంథమునందలి యాదేశముగా, అసంఖ్యాక ప్రార్థనలనుండి మిమ్ము విముక్తుల నొనరించినాము. నిశ్చయముగా, ‘ఆయన’ నిర్దేశకుడు, సర్వశక్తిమంతుడు, అనిర్బంధనుడు. మీరీ ప్రార్థన చేయనెంచి నప్పుడు - ఊర్ధ్వలోకనివాసులు ప్రదక్షిణ మెునరించునదియును, అమరపురజనుల కారాధనా కేంద్రముగ నిర్దేశితమైనదియును, సమస్త భూస్వర్గవాసులకు ఆదేశమూలమును అగు ఈ పునీత స్థానముదెసకు, నా పరమపవిత్ర ప్రత్యక్షతాస్థానమువంకకు అభిముఖులు కండు; దివ్యసత్య, దివ్యోచ్చారణాసూర్యు డస్తమించినపుడు, మేము మీకై నిర్దేశించినయట్టి దివ్యస్థలివైపునకు మీ వదనములను సారింపుడు. నిశ్చయముగ, ‘ఆయన’ సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు.

అప్రతిహతమగు ‘ఆయన’ యాదేశమునుండియే సమస్తమును ఆవిర్భవించినది. నాదగు ఉచ్చారణా స్వర్గమున సూర్యునివోలె నా శాసనము లగుపించు నపుడు, అవి - నా తీర్పు ప్రతి మతధర్మపు స్వర్గమును ఛిన్నాభిన్నమగు నట్లొన రించునదైనను - ప్రతి యెుక్కనిచేతను విధేయతాపూర్వకముగ ననుసరింప బడవలె. ‘ఆయన’ తనకు ప్రమోదకరమగు దానినే నిర్వర్తించును. ఎంచుకొనువా ‘డాయన’, ఆయన ఎంపిక నెవ్వరును ప్రశ్నింపలేరు. పరమప్రియతముడగు ‘ఆయన’ నిర్దేశించిన దేదైనను, నిశ్చయముగ ప్రియతమమే. సకలసృష్ట్యధినాథుడగు ‘ఆయన’ నన్నిందులకు సాక్ష్యముగ నిలిపినాడు. సకలదయామయుని మధురపరిమళము నాఘ్రాణించి, ఈ ఉచ్చారణామూలమును గ్రహియించిన యాతడు తన స్వీయనేత్రములతో శత్రుశూలములను స్వాగతించును, తద్వారా దైవశాసనముల సత్యమును మానవాళియందున సంస్థాపింపగలడు. వాని నాశ్రయించి, ‘ఆయన’ స్థిరనిర్ణయపు టాంతర్యమును గ్రహియింపగల్గిన వానికి శుభమగు గాక!

CLVI

నిత్యసత్యమగు ఆయన, వైభవప్రభాతమునుండి, తన నేత్రములను బహాజనుల దెసకు సారించి యిట్లనుచున్నాడు: “మానవసంతతి శాంతి సంక్షేమముల ప్రవృద్ధికి సమాయత్తులు కండు. మానవాళిని విభజించు వైషమ్యములనుండి, దైవవశమున, మహాఘననామశక్తితో, పృథ్వీతలము ప్రక్షాళితమై, సమస్త మానవులును - ఒకే సంవిధాన సమాశ్రితులును, ఒకే దివ్యనగరవాసులును కాగలుగునటుల, మీ మేధస్సులనూ, అభీష్టములనూ భువియందలి ప్రజల, తత్సంబంధీకుల విద్యపై నిల్పుడు. మీ మానసములను జ్యోతిర్మయములుగ, పవిత్రములుగ జేసికొనుడు; విద్వేషకంటకములతో, మాత్సర్యపు ముండ్లకంపలతో వాటి నపవిత్రము గావింపవలదు. ఒకే ప్రపంచమున మీరు వసియింపు చున్నారు; ఒకే దివ్యేచ్ఛాప్రయోగమున సృజియింపబడినారు. సకలజనుల తోడను మహోదాత్త కరుణార్ద్రతాస్ఫూర్తితో మమేకమగు నాతడు ధన్యుడు.”

CLVII

మా దివ్యధర్మమును బోధించు లక్ష్యముతో తమ దేశమును వీడిన వారిని, దివ్యవిధేయాత్మ తన శక్తితో దృఢీకృతులను గావించును. మా నియుక్త దేవదూతాగణ మెుక్కటి—సర్వశక్తిమంతుడును, సకలవివేకియును నగు ఆయనచే నాజ్ఞాపితయై—వారల ననుసరించును. సర్వశక్తిమంతుని సేవా గౌరవము నొందిన యాతడికై నిరీక్షించు ధన్యత యెంతటి మహత్తరము! నా జీవితముపై యాన! సర్వాధికారియును, మహాశౌర్యశాలియును నగు భగవంతు డాదేశించిన కార్యములు దక్క, మరి యే కృత్యమూ - అది యెంత బృహత్తరమైననూ - దానికి సరిరాజాలదు. అట్టి సేవ, నిక్కముగా, సకల సత్క్రియలయందునను సర్వోత్తమమే, ప్రతి సత్కార్యమునకును భూషణమే. సర్వోన్నత దివ్యావిష్కర్తయును, యుగప్రాచీనుడును నగు ఆయనచే నిటు లాదేశితమైనది.

మా దివ్యధర్మమును బోధించుట కుద్యమించు నాతడు, ప్రాపంచిక విషయసమస్తవిముక్తుడై, సర్వకాలములయందునను, మా దివ్యధర్మవిజయమునే తన పరమలక్ష్యముగ పరిగణనము సేయవలె. నిక్కముగా, భద్రఫలకనిర్దేశిత మిది. తన ప్రభుని దివ్యధర్మనిమిత్తము స్వగృహమును వీడ నిర్ణయించు కొనునపు డాతడిని - తన ప్రస్థానమునకు విశిష్టావశ్యకముగ - తన పూర్ణవిశ్వాసమును భగవంతుని యందున యుంచి, సద్గుణాంబరధారిని కానిండు. సర్వశక్తిమంతుడును, సకలప్రకీర్తితుడును నగు భగవంతునిచే నివ్విధముగ నిర్దేశితమైనది.

ఆత డాయన ప్రేమానలప్రజ్జ్వలితుడై, సకల సృజితాంశములను పరిత్యజించెనేని, ఆతడు వాక్రుచ్చు వాక్కులు తమ శ్రోతల నుత్తేజితులను గావించును. నిక్కముగ, నీ ప్రభుడు సర్వజ్ఞుడు, సర్వవిదుడు; మా వాణి నాలించి, మా పిలుపునకు స్పందించిన మానవు డానందాన్వితుడు. ఆతడు వాస్తవమునకు, మా సన్నిధికిం గొనిరాబడు వారియం దుండవలె.

CLVIII

భగవంతుడు తన దివ్యధర్మబోధనావిధిని ప్రతి యెుక్కరికినీ నిర్దేశించినాడు. ఈ కర్తవ్యమును నెరవేర్ప నుద్యుక్తుడగు నాతడు, తా నాయన దివ్యసందేశము నుద్ఘోషింపకపూర్వమే సమున్నతమును, శ్లాఘనీయమును నగు సుగుణాభరణముతో తన నలంకరించుకొనవలె; తద్వారా, తన పిలుపునకు స్పందించువారి హృదయముల నాతడి వాక్కు లాకర్షింపవచ్చును. అట్లు కాదేని, తన శ్రోతలను ప్రభావితులం జేయగలనని యాత డెన్నటికీ ఆశింపజాలడు.

CLIX

మానవమస్తిష్కము లెంతటి యల్పములో యోచింపుడు. వారు తమకు హానికారకముల నపేక్షింతురు, తమకు లాభకరముల నుపేక్షింతురు. వారు యథార్థమునకు సన్మార్గదూరులు. కొందరు స్వేచ్ఛ నభిలషింపుచు, దానియం దహంకారపూరితులగుటను మే మవలోకించినాము. అట్టివా రజ్ఞానపు టగాధమందున్నారు.

స్వేచ్ఛ - తుద కెవ్వరును ఆర్పివేయజాలని విప్లవాగ్నికి దారి తీయును. గణకుడును, సర్వవిదుడును అగు ‘ఆయన’ మిమ్ముల నీవిధముగ హెచ్చరింపు చున్నాడు. స్వేచ్ఛాస్వరూపమనినను, దానికి ప్రతీకయనినను చతుష్పాద జంతువేనని తెలియుడు. స్వీయ అజ్ఞానమునుండి పరిరక్షించునవి, దుర్మార్గు డొనరించు హానినుండి సంరక్షించునవి యగు పరిధులకు లోబడియుండుట మానవునకు సముచితము. స్వేచ్ఛ మానవుని ఔచిత్యావధుల నతిక్రమింపచేసి, ఆతని స్థాయీగౌరవమునకు భంగము వాటిల్లజేయును. అది యాతనిని భ్రష్టత, దుష్టతల స్థాయికి దిగజార్చివేయును.

మానవులను తమ సంరక్షణకు కాపరి యవసరమైన గొఱ్ఱెలమందగ పరిగణింపుడు. నిక్కముగా నిది సత్యము, పరమసత్యము. నిర్దిష్టస్థితుల యందున స్వేచ్ఛను మే మామోదింతుము, తక్కిన స్థితుల యందున తిరస్కరింతుము. యథార్థమునకు, మేము సర్వవిదులము.

వచించు: నిజమగు స్వేచ్ఛ, నా యాజ్ఞలకు లోబడియుండు మానవుని విధేయతయం దున్నది, స్వల్పముగనైనను తెలియుడు. మానవులు దివ్యావిష్కరణ స్వర్గమునుండి తమకనుగ్రహీతమైన దానిని పాటించితిరేని, వారు నిశ్చయముగ పరిపూర్ణస్వేచ్ఛ నొందగలరు. సృజితవస్తుసమస్తమును ఆవరించిన యట్టి తన యభీష్టస్వర్గమునుండి భగవంతునిచే నావిష్కృతమైన ప్రయోజనమును గ్రహియించిన యాత డానందభరితుడు. వచించు: నిత్యసత్యమగు భగవంతుని పరిపూర్ణ సేవయందు తప్ప, నీకు లబ్ధినిచ్చు స్వేచ్ఛ యింకెందునను కానరాదు. దాని మాధుర్యము నాస్వాదించినయాతడు దానిని సమస్త భూ స్వర్గ సామ్రాజ్యముల వినిమయమునకైనను విక్రయింపడు.

CLX

మానవు లుపయోగించిన యుపమానములకును, సామ్యములకును భగవంతు డెంతయేని అతీతుడనియు, మహోన్నతుడనియు గణియించు నాతడు యీ దివ్యయుగమున, నిక్కముగా, ఏకేశ్వరత్వమును విశ్వసించినవాడు. ఈ యుపమానములనే, సామ్యములనే భగవంతుడని పొరబడిన వాడు ఘోరాపరాధ మొనరించినవాడే. హస్తకళాకారునకును, ఆతడి సృజనకును చిత్రకారుని కిని, ఆతడి చిత్రమునకును మధ్యనున్న సంబంధము ననుశీలింపుము. వారి హస్తసృజితము, వారివంటిదే యని యెన్నడేని భావింపదగునా? ఊర్ధ్వసింహాసనమునకును, అధోభువనమునకును అధీశుడగు ఆయనపై యాన! వాటిని పరిగణింపవలసినది, కేవలము వాటి స్రష్ట మహనీయతనూ, పరిపూర్ణతనూ ఘోషించు నిదర్శనములుగనే దక్క, వేరొండు ప్రాతిపదికన కాదు.

నీ యభీష్టమును దైవాధీనమొనరించిన ఓ షేయ్ఖ్‌! స్వీయార్పణము, భగవంతునితో శాశ్వత సమాగమము అనగా - మానవులు తమ యిచ్ఛను దైవేచ్ఛ యందున సంపూర్ణముగ విలీనమొనరించి, ఆయన దివ్యలక్ష్యము యెదుట తమ యాకాంక్షలను వట్టి శూన్యములని పరిగణించుటయే. అవలంబింపుడని, సృష్టికర్త తమ కాదేశించినదానిని శ్రద్ధతో, అత్యంతానందోత్సాహములతో ఆయన సృ జితు లుద్యుక్తులై పాటించితీరవలె. వారు తమ శుష్కోహ కెవ్విధముగను తమ నిర్ణయమును మఱుగు పరచు యవకాశము నీయనూ రాదు; తమ స్వీయభ్రమలను శాశ్వతుని వాణియని గణియింపనూ రాదు. మే ముపవాస ప్రార్థనయం దిటుల వెల్లడించినాము:“ ‘ఓ జనులారా, నా దివ్యసౌందర్యమునకై యుప వాసము ననుసరింపుడు, తద్వ్యవధి కెట్టి యవధినీ నిర్దేశింపవల,’దను వాక్కులు నీ ముఖతః వెలువడి, వారికి ప్రకటితములు కావలెనని నీ నిర్ణయ మాశించెనేని, దానిని వారియందలి ప్రతి యెుక్కరును విధేయతాపూర్వకముగ పాటింతురనియు, నీ శాసనము నుల్లంఘించు దేనినుండియైనను విరాగులగుదు రనియు, తమ యాత్మలను నీకర్పించునంతదనుక వా రటు లొనరింపుచునే యుందురనియు నీ వైభవౌన్నత్యముపై ప్రమాణ మొనరింతును.” మానవేచ్ఛ సంపూర్ణార్పణము దైవేచ్ఛకు కట్టువడుట యనునది యిందున్నది. దీనిపై పర్యాలోచన మెునరింపుము, తద్వారా నీవు సకలజననాథుని వాగ్ద్వారమున ప్రవహించు అమరజీవనతోయములం గ్రోలి, నిజైకదైవము సర్వకాలములయందునను, తన సృజిత జీవులకన్నను సమున్నతుడే యని నిరూపింపవచ్చును. నిక్కముగ, ఆయన యప్రతిమానుడు, నిత్యుడు, సర్వజ్ఞుడు, సకలవివేకి. సంపూర్ణస్వీయార్పణ స్థానము, ఏ అన్యస్థాయికన్నను మిన్నయును, సదా సమున్నతమును.

భగవదేచ్ఛకు ని న్నర్పించుకొనుట యుక్తము. ఆయన దివ్యఫలకములయం దావిష్కృతమైన దేదియైనను ఆయన దివ్యేచ్ఛాప్రతిఫలనమే. నీ సమర్పణ మెంతటి పరిపూర్ణమై యుండవలెననిన, ప్రతి ప్రాపంచికవాంఛాసూచన నుండియూ నీ మానసము ప్రక్షాళితము కావలె. నిజమైన యైక్యత కర్ధమిదియే.

ఈ పథమున నిన్ను సుస్థిరునిగ నుండనిమ్మనియు, ప్రత్యక్ష మహాపాలకుడై, విలక్షణాహార్యముతో నవతరించి, విశిష్ట దివ్యసందేశమునకు వాగ్ధార ననుగ్రహించినయట్టి ఆయనదెసకు ప్రపంచజనులకు దిశానిర్దేశ మొనరించునటుల నీకు తోడ్పడుమనియు భగవంతుని వేడుకొనుము. విధేయతా నిర్ధారణముల సారమిదియే. వాస్తవమునకు తమ భావనావినిర్మితప్రతిమ నారాధించు వారిని, దాని నంతర్గత పరమార్ధముగ నెంచువారిని ధర్మదూరులుగ గణియింపనైనది. తన దివ్యఫలకములయందున సకలకరుణాన్వితుడు, ఇందులకు సాక్ష్యమును వహియించును. నిక్కముగా, ఆయన సర్వజ్ఞుడు, సకలవివేకి.

CLXI

నీ ప్రయత్నమనెడు కటిసీమను బిగియింపుము, తద్వారా, బహుశః, నీవు నీ సామీప్యుని, మహాకరుణాన్వితుడగు భగవంతుని శాసనము దెసకు గొనిపోవచ్చును. సకలసంపన్నుడును, సమున్నతుడును నగు భగవంతుని దృష్టియం దట్టి చర్య, నిక్కముగ, అన్యకార్యము లన్నింటికన్నను యుత్కృష్ట మగును. భగవంతుని దివ్యధర్మమున నీ స్థైర్య మెట్లుండవలెననిన, నిన్ను కర్తవ్యవిముఖుని గావించు శక్తి, ఏ లౌకికాంశమునకును యుండబోవదు. సమస్తభౌమశక్తులును నీకు ప్రతిగా సంఘటిత మైనను, సకలజనులును నీతో విభేదించినను - నీ వచంచలుడవై యుండవలె.

దివ్యమార్గదర్శక ప్రభాతకారకుడైన భగవంతుని దివ్యసందేశమును గైకొని పోవునపుడు పవనమువలె అప్రతిహతుడవు కమ్ము. జనావాసములైనను, నిర్జనములైనను, పుడమిపైనున్న ప్రాంతము లన్నింటి మీదికిని, భగవన్నిర్దేశ విధేయమై, పవనమెటుల వీయుచున్నదో యోచింపుము. అభాగ్య దృశ్యమేని, సౌభాగ్యనిదర్శనములేని - దానిని నొప్పింపనూజాలవు, మెప్పింపనూజాలవు. అది తన సృష్టికర్త యాజ్ఞానుసార మన్నిదెసలకును వీయుచునే యుండును. అటు లుండవలె – నిజైకదైవారాధకుడ నని చెప్పుకొను ప్రతియొక్కడును. ఆయన దివ్యధర్మపు మౌలికసిద్ధాంతములమీదికి తన దృష్టిని సారించి, తత్పరివ్యాప్తి నిమిత్తము శ్రద్ధాళువై కృషిసల్పుట యుక్త మాతడికి. కేవలము భగవంతుని నిమిత్తమే, ఆయన సందేశము నాత డుద్ఘోషింపవలె; తన పల్కులు తన శ్రోతహృదయమున కల్గించు యెట్టి స్పందన నైనను, అదియే స్ఫూర్తితో స్వీకరింపవలె. స్వీకరించి, విశ్వసించు నాతడు తన ప్రతిఫలము నొందును; తిరస్కరించు నాతని కాతడి దండనము దక్క వేరొండు సిద్ధింపదు.

ఈరాకునుండి మేము బయల్వెడలు తరుణమున, నిశావిహంగముల రాకడకై నిరీక్షింపుడని విధేయులను హెచ్చరించినాము. ఇటీవలి వత్సరములలో వినవచ్చినయటుల, కొన్ని ప్రదేశముల యందున కాకోలపుకూత మిన్నంటజేయ బడుననుట కెట్టి సందియమును లేదు. ఏది సంభవించినను, నిజైకదైవ సాన్నిధ్యము నాశ్రయించితిరేని, వంచకుని కుతంత్రములనుండి, ఆయన మిమ్ములను రక్షింప వచ్చును.

ఈ మహత్తర దివ్యావిష్కరణమున సనాతన ధార్మికపాలనావిధానము లన్నియును తమ సర్వోత్తమ సమగ్రసాఫల్యము నందినవని, నిక్కముగ వచియింపుచున్నాడను. సర్వజ్ఞుడును, సమస్తవివేకి యును నగు నీ ప్రభుడు నీకిటుల యుపదేశింపుచున్నాడు. సకలలోకాధీశుడగు భగవంతునకు ప్రస్తుతి.

CLXII

సకలదయాన్వితుడు మానవునకు వీక్షణాదక్షత ననుగ్రహించినాడు; శ్రవణశక్తిని ప్రసాదించినాడు. వాస్తవమున కాతడిని “ఘనతరప్రపంచము,”గ పరిగణింపవలసియుండగ, కొంద రాతడిని “లఘుతరప్రపంచము,”గ నభివర్ణించినారు. భగవంతుని యీ దివ్యవాగ్దత్తయుగమున - మనుష్యస్థాయికి సహజములగు సామర్ధ్యములును, భువి యందున యాతడి లక్ష్యపు సంపూర్ణ ప్రమాణమును, ఆతడి వాస్తవికతా సహజౌన్నత్యమును - అభివ్యక్తములై తీరవలె.

మహోన్నతుని దివ్యలేఖిని సర్వకాలసర్వావస్థలయందునను, వాత్సల్యానురాగములతో, తన ప్రియతములను స్మరియించి, తన పథము ననుసరింపుడని వారల కుపదేశింపనైనది. భగవంతుని దివ్యైక్యతాప్రభాతమును గుఱుతింపనీయక తనను నిరోధించుటయందున యీ ప్రాపంచికపరివర్తనము లను, సంభావ్యతలను విఫలము గావించినయట్టి ఆయన దివ్యావిష్కరణా నిక్షిప్తమధువును – సుదృఢ సంకల్పముతో, స్వయమాధారునిపేరిట - సేవించినవానికి శుభమగును. అట్టి మానవుడు, సకల లోకాధీశుడగు భగవంతుని దివ్యగ్రంథమున, స్వర్లోకవాసులయం దొకనిగ, పరిగణనము నొందును.

CLXIII

తన సైనికదళము లెంతటి శక్తిసమన్వితములేని, తన యైశ్వర్య మెంతటి యపారమేని, తన ప్రభావమెంతటి ప్రగాఢమేని—ఏ భౌమశక్తియూ, హరియింపజాలని యాభరణముతో ప్రపంచము నలంకరించి, దానికి వస్త్రధారణ మొనరించిన భగవంతునికి సకల ప్రస్తుతి. వచించు: సమస్త శక్తితత్త్వమూ సృష్టియం దత్యున్నతుడును, అనంతుడును నగు భగవంతునిదే. సమస్త మహనీ యతామూలమూ, భూస్వర్గస్థిత సమస్తమున కారాధనాకేంద్రమైన భగవంతునిదే. ఈ మర్త్యప్రపంచమున స్వీయమూలములున్న శక్తులు, తమ సహజలక్షణ హేతువున - గణనీయములు కావు.

వచించు: ఈ విహంగముల జీవాధారప్రస్రవణములు యీ లోకసంబంధితములు కావు. వాటి మూలము, మనుష్య జ్ఞానావగాహనముల కందనంత యెగువన యున్నది. ఎవ్వడు, భగవంతుని హిమశ్వేతహస్తము వెలయించిన దీపిక నార్పగలవాడు? ఎక్కడ, సర్వాధికారియును, సకలప్రేరకుడును, సమస్తశక్తిమంతుడును నగు నీ దేవదేవుని శౌర్యప్రజ్జ్వలితాగ్నిని శమింపచేయగల శక్తిశాలి? వైషమ్య జ్వాలలను ప్రతిరోధించినది - దివ్యశక్తి హస్తమే. తా నిచ్చగించిన దానిని జేయ శక్తియుతు డాయనయే. ఆయన ‘అట్లగు,’ మని యనగ, ‘అటులే’ యైనది. వచించు: నా నియుక్తుల శిలాసదృశస్థైర్యమున కాధారభూతమైన పునాదిని ప్రాపంచిక చండమారుతములైనను, తత్ప్రజాచక్రవాతములైనను యెన్నటికిని సంచలింప చేయజాలవు. దయాన్విత దైవమా! నిత్యసత్యమైన ఆయన ప్రియతములను బానిసలను, కారాగారబద్ధులను గావించునటుల యీ జనులను ప్రేరేపించిన దేమైయుండునో కదా? . . . అయినను, న్యాయాదిత్యుడు దివ్యవైభవప్రభాతమునుండి తన పూర్ణశోభతో భాసిల్లుటను విశ్వాసులు వీక్షించు దివస మాసన్నమగుచున్నది. సకలాస్తిత్వనాథుడు తన యీ వ్యధాభరిత కారాగారమున, నీ కిటుల నిర్దేశింపు చున్నాడు.

CLXIV

మానవసమాజ సభ్యులారా! ఏ మనుష్యుడును ఛేదింపజాలని దివ్యపాశమును దృఢముగ చేతం బూనుడు. నిక్కముగా, ఇది మీ జీవితకాలమంతయూ మీకు లబ్ధిం జేకూర్చును, ఏలయన దాని శక్తి - సకలలోకాధిపతియగు భగవంతునిది. న్యాయమునకును, నిష్పాక్షికతకును బద్ధులు కండు. దైవముతో విభేదించి, జ్ఞానులనబడు భూషణమును తమ శిరములపై దాల్చి, జ్ఞానమూలమైన ఆయనను మృత్యువుపాలొనరించిన మూర్ఖుల జనాంతికములకు విముఖులు కండు. నా నామధేయము వారల నున్నతస్థానములకు సముద్ధరించినను, వారి కన్నులకు నే నగుపించినయంతనే, ప్రత్యక్ష దురన్యాయ పూర్వకముగ, నాకు మరణశిక్షను విధియించినారు. మా దివ్యలేఖిని యివ్విధముగ నిజమును వెల్లడించినను, జను లలక్ష్యముననే ముణిగి యున్నారు.

ధర్మమునకు బద్ధుడగు నాతడు యెట్టి పరిస్థితుల యందునను, సమతౌల్యతా పరిధుల నతిక్రమిం పడు. సకలవీక్షకుడగు ఆయన మార్గదర్శకత్వమున యాతడు సకలాంశములయందలి వాస్తవమును గ్రహియించును. శాస్త్రపారంగతులును, కళాకోవిదులును అత్యంతాతిశయమున పలుమారు లభివర్ణించిన నాగరికత, సమతౌల్యతా పరిధుల నతిక్రమించెనేని – మానవులకు మహాపదను కొని తెచ్చును. సర్వజ్ఞుడగు ఆయన, మిమ్ముల నిట్లు హెచ్చరింపుచున్నాడు. సమతౌల్యతాపరిమితులచే నియంత్రితమైన యపుడు శుభప్రదమైయుండిన నాగరికత, మేరమీరి యనుసరింపబడెనేని, అరిష్ట ప్రదముగ నిరూపితమగును. ఓ జనులారా, దీనిని పర్యాలోచింపుడు; అపరాధారణ్యమున మతిచెడి సంచరించువారు కావలదు. దాని జ్వాల నగరములను కబళించునట్టి, దివ్యవైభవజిహ్వ “సర్వశక్తి మంతుడును, సకలప్రకీర్తితుడును నగు భగవంతునిదే దైవసామ్రాజ్య,” మని యుద్ఘోషించునట్టి దివసము - ఆసన్నమగుచున్నది.

శేషించిన యంశములన్నియూ, ఈ సమతౌల్యతాసూత్రానుసరణములే. ఇయ్యద్భుత దివ్యఫలకమున నిన్ను స్మరియించిన నీ ప్రభునకు కృతజ్ఞతల నర్పింపుము. వైభవాసనాధీశుడైన భగవంతునికి సకలప్రస్తుతి.

సర్వోన్నతుని దివ్యలేఖినీ యావిష్కృతము నేమనుజుడైనను తన హృదయమున పర్యాలోచించి, తన్మాధుర్యము నాస్వాదించెనేని - ఆతడు నిక్కముగా స్వీయవాంఛారిక్తుడును, తద్విముక్తుడునునై సర్వశక్తిమంతుని దివ్యేచ్ఛకు పరిపూర్ణముగా దాసుడగును. అంతటి మహోదాత్తస్థాయినొంది, అంతటి యౌదార్యాన్వితానుగ్రహముం గోలుపోవని మానవుడు సంతోషాత్ముడు.

ఈ దివ్యయుగమున, తన విశ్వాసమును గోప్యముగ నుంచజూచు భీరుని వర్తనమును మే మామోదింపనూలేము, ఈ దివ్యధర్మముపట్ల తన విధేయత నట్టహాసముగ నొక్కి వక్కాణించు స్వయంప్రకటిత విశ్వాసి నడవడి నంగీకరింపనూ జాలము. విజ్ఞతను, నిర్దేశమును యిరువురును పాటింపవలె, మనఃపూర్వకముగ దివ్యధర్మ విశిష్ట ప్రయోజన సాధనకు శ్రమియింపవలె.

ఈ దూషితుని వర్తనమును ప్రతి మానవుడును పరిశీలించి పర్యాలోచించు గాక. ఈ దివ్యావిష్కరణపు టావిర్భావమునుండి యింతదనుక, మా శత్రువుల నుండి దాగుకొనుటకైనను, మా మిత్రుల సాహచర్యమును విడనాడుటకైనను మేము నిరాకరింపుచునే యున్నాము. వేనవేల ఖేదములును, క్లేశములును మమ్ముల నావరించియున్నను, ప్రపంచజనుల నపారవిశ్వాసముతో వైభవప్రభాతమున కామంత్రించినాము. తత్సంబంధమై, తా ననుభవించిన వేదనలను - మహోన్నతుని దివ్యలేఖిని వర్ణన చేయనిచ్చగింపలేదు. వానిని వెల్లడించుట యనునది - విశ్వాసులయందలి యనుగ్రహీతులను, భగవంతుని యేకేశ్వరత్వమును నిజముగా సమర్ధించువారిని, ఆయన దివ్యధర్మమునకు సంపూర్ణముగా తమ నర్పించుకొనినవారిని - నిస్సంశయముగా దుఃఖమున ముంచివేయును. నిక్కముగా, సత్యము బల్కుచున్నా డాయన; సకలశ్రోతయును, సర్వజ్ఞుడును ఆయనయే. మా జీవితపు టధికాంశమును, మా శత్రువుల మధ్యనే గడుపనైనది. ప్రస్తుత మెుక సర్పవల్మీకమునం దెటుల మే మధివసింపుచుంటిమో వీక్షింపుము.

ఈ పవిత్రభూమి - సమస్త పావనగ్రంథప్రస్తావితమును, ప్రకీర్తితమును. ఇచట భగవంతుని దివ్యప్రవక్తలును, ఆయన నియుక్తులును అవతరించినారు. భగవంతుని దివ్యసందేశవాహకు లెల్లరును సంచరించి, “ఓ నా దేవా, నేనిట నుంటి, నిట నుంటి,” నని ఘోషించిన దుర్గమారణ్యమిది. భగవంతుని దివ్యావిష్కరణమే తానెయైన ఆయన యవతరించుటకు నిర్ణీతమైన దివ్యవాగ్దత్తభూమి యిది. హిమశ్వేతస్థలియును, అవివర్ణయశోభూమియును నైన, భగవంతుని యనన్వేషణీయ నిర్ణయలోయ యిది. ఈ దివ్యయుగమున సంభవించినదేది యైనను ప్రాచీనపవిత్రలేఖన సూచితమే. అయిననూ తత్పవిత్రలేఖనములే, ఈ భూభాగమున వసియించు జనులను ముక్తకంఠముతో ఖండింపుచున్నవి. వారొకప్పుడు “విషసర్పసంతతి,”గా గర్హితులు. ఈ దూషితుడిపుడు - తాను “విషసర్పసంతతీ,” సమావృతుడై యుండగనే - ప్రపంచపు టేకైకాభీష్టమును, సమున్నత శిఖరమును, దివ్యవైభవ ప్రభాతమును నగు ఆయన చెంతకు సమస్త మానవాళినీ, ఎటుల యెలుగెత్తి పిలుచుచూ, ఆమంత్రింపు చున్నాడో వీక్షింపుము. వచోసామ్రాజ్యాధిపతియైన ఆయన వాణి నాలించిన మానవుడు సంతోషాత్ముడు, ఆయన సత్యమునకు దూరులైన యుదాసీనులు దుఃఖభాజనులు.

CLXV

నిర్మలముగ, నిష్కల్మషముగ నుంచబడెనేని, వినునట్టి ప్రతి శ్రవస్సును: “నిక్కముగ, మేము భగవంతుని సంబంధీకులము, ఆయన చెంతకు తిరోగమింపుచుంటి,” మను పవిత్రవాక్కులం బలుకు స్వరమును సర్వకాలముల యందునను, సమస్తదిశలనుండియును శ్రద్ధగ నాలించునని తెలియుము. మానవుని భౌతిక మరణ, తిరోగమన మర్మములు బహిర్గతములు కాలేదు; అవి యింకనూ దుర్గ్రాహ్యములే. భగవంతుని ధార్మికత్వముపై యాన! వెల్లడిసేయ వలసివచ్చెనేని, అవి యెంతటి భయవిచారములను రేకెత్తించుననిన - కొందరు నశియింపగ, మరికొందరు మృత్యువు నపేక్షించు నంతగ యానందభరితులై, తమ యంత్యమును వేగిరపఱపుమని, ఎడతెగనివాంఛతో నిజైకదైవము—సమున్నత మాయన వైభవము—నర్ధింతురు.

ఆత్మవిశ్వాసముగల ప్రతి విశ్వాసికిని, మృత్యువు సునిశ్చయముగ జీవన కలశమునే యందిం చును. అది యానందమునిచ్చును; ఆహ్లాదవాహకమది. అమరజీవనపురస్కృతి నది బహూకరించును.

నిజైకదైవము—సమున్నత మాయన వైభవము—ను గుఱుతించుటయను మానవుని యైహిక జీవనఫలమును రుచిజూచిన వారి యాముష్మిక జీవితము, మేము వర్ణింపజాలనిది. తత్సంబంధిత జ్ఞానమున్నది సమస్తలోకాధీశుడైన భగవంతునితోనే.

CLXVI

సహస్రవర్షముల పరిపూర్తికి పూర్వమే భగవదావిష్కరణకర్తగా ప్రకటించుకొనువాడు నిక్కముగ వంచకుడు. అట్టి ప్రకటనను ఉపసంహరించు కొనుటకును, పరిత్యజించుటకును ఔదార్యముతో నాతడికి తోడ్పడుమని మేము భగవంతుని వేడుచున్నాము. ఆతడు పశ్చాత్తాపము నొందెనేని, పరమాత్ముడు నిస్సంశయముగా మన్నించును. అయితే ఆతడు మూర్ఖత్వముకొలది తన పట్టును వీడనిచో, ఆతనియెడ నిర్దాక్షిణ్యముగ వ్యవహరించు నాతనిని భగవంతుడు నిశ్చయముగ పంపగలడు. శిక్షించుటయందు భగవంతుడు యథార్థముగ చండప్రచండుడు! ఈ ప్రవచనమును - దీని విస్పష్టార్థమునకు విరుద్ధముగ - వ్యాఖ్యానించు నాతడు, సమస్త జీవకోటిని యావరించిన దైవతేజస్సునకును, ‘ఆయన’ కరుణకును పాత్రుడు కాజాలడు. దైవభీతిని కలిగియుండుడు, మీ వ్యర్ధభ్రమల ననుసరింపవలదు. సర్వశక్తిమంతుడును, సకలవివేకియును నగు మీ పరమాత్ముని యాజ్ఞను పాలింపుడు.

Bahá'u'lláh

Windows / Mac