Return   Facebook   Zip File

Arabic

1

ఓ ఆత్మపుత్రా!

నా మొదటి యుపదేశమిది: సనాతనమూ, అవినాశమూ, శాశ్వతమూ అయిన పరమాధికారము నీదగుటకు శుద్ధమైన, దయాపూర్ణమైన, జ్యోతిర్మయ హృదయమును సంతరించుకో.

2

ఓ ఆత్మపుత్రా!

నా దృష్టిలో సమస్తవస్తువులయందున న్యాయమే నాకత్యంత ప్రియమైనది; నన్నుకాంక్షించితివేని దానికి విముఖుడవు కావలదు, నేను నిన్ను విశ్వసింపవచ్చును గాన దాని నలక్ష్యము చేయవలదు. దాని సహాయముచే నీవన్యుల కన్నులచే గాక, నీ చక్షువుల చేతనే వీక్షింతువు, నీ పొరుగువాని జ్ఞానముచే గాక, నీ ఎఱుకచేతనే నీవెఱిగెదవు. ఇక నీకేది సముచితమో నీ హృదయమున యోచించు. నిశ్చయముగా, న్యాయమే నీకు నేనిచ్చు కానుక, నా ప్రేమాదరణలకు ప్రతీక. మరి, దీనిని నీ దృష్టి యందుంచుకో.

3

ఓ మనుష్యతనయా!

తెరమరుగై యున్న నా స్మృత్యతీత జీవమునను, నా పురాతన నిత్యసారమునను నీపై నాకుగల ప్రేమను తెలిసియుంటిని; అందుకే నీపై నారూపమును చెక్కి, నా సౌందర్యమును నీకు వెలువరించి, నిన్ను సృష్టించితిని.

4

ఓ మనుష్యతనయా!

నిన్ను సృష్టించుటను ప్రేమించినందుననే, నిన్ను సృజించితిని. నీకు నామకరణముచేసి, నీ యాత్మను జీవసారముతో నింపు నిమిత్తము నన్ను ప్రేమింపుము.

5

ఓ అస్తిత్వకుమారా!

నేను నిన్ను ప్రేమింపవలెనని నన్ను ప్రేమింపుము. నీవు నన్ను ప్రేమింపవేని, ఎవ్విధముగను నిన్ను చేరదు నా ప్రేమ. ఓ సేవకుడా, తెలిసికొనుము.

6

ఓ అస్తిత్వకుమారా!

నా ప్రేమయే నీ స్వర్గము; నాతో పునస్సమాగమమే నీ స్వర్గధామము. తాత్సార మొనరింపక, అందు ప్రవేశింపుము. ఇది మా దివ్యసామ్రాజ్యమున, మహాతీతలోకమున నీ గమ్యస్థానమై యున్నది.

7

ఓ మనుష్యతనయా!

నీవు నన్నుప్రేమించితివేని, నీకు నీవు విముఖుడవు కమ్ము; మరి నా యానందము నభిలషించితివేని, నీ యానందమును తృణీకరింపుము; నీవు నాయందు మృతినొందితివేని, నేను నీ యందు సదా జీవింపవచ్చును.

8

ఓ ఆత్మపుత్రా!

నిన్ను నీవు పరిత్యజించి నన్నాశ్రయింపకున్న నీకు శాంతియే లేదు; ఏలయన, నీ పేరున గాక నీకు నా నామముననే కీర్తి కల్గును; అన్నింటను నీవు కేవలము నన్నుమాత్రమే ప్రేమింపవలె ననునదే నా యాకాంక్ష గనుక, నీవు నీయందు గాక నాయందు విశ్వాసము నుంచుము.

9. ఓ అస్తిత్వకుమారా!

నా ప్రేమయే నా సబలదుర్గము; దానియందు ప్రవేశించినవాడు సురక్షితుడు, నిర్భీకుడు, మరి దానికి విముఖుడగువాడు నిశ్చయముగ త్రోవదప్పి, నాశము నొందును.

9

ఓ వాక్పుత్రుడా!

నీవు నా సబలదుర్గము; సురక్షితముగ వసియించుటకందు ప్రవేశింపుము. నీలోనే నా ప్రేమ యిమిడియున్నదని తెలి యుము, తద్వారా, నేను నీకతి చేరువలో యుంటినని గ్రహి యింతువు.

10

ఓ అస్తిత్వకుమారా!

నీవే నా దివ్వె, నీయందున్నది నా దీప్తి. అందుండి నీ ప్రకాశము నొందుము, ననువినా అన్యుల నరయవలదు. ఏలయన, నిన్ను సమృద్ధునిగా సృజియించి, నీపై నా యౌదా ర్యానుగ్రహములను వర్షించినాను.

11

ఓ అస్తిత్వకుమారా!

శక్తియుతహస్తముచే నిన్ను రూపొందించితిని, బలయు తాంగుళులచే నిన్ను సృజియించితిని; నీలో నా కాంతిసత్త్వము నుంచితిని. దానితో సంతృప్తినొందు, మరి దేనినీ కాంక్షింపకు; ఏలయన, నా సృష్టి సంపూర్ణము, ఇక నా యాజ్ఞ యనుల్లంఘ నీయము. దానిని ప్రశ్నింపకు, దాని ననుమానింపకు.

12

ఓ ఆత్మపుత్రా!

నిన్ను సంపన్నునిగనే సృజియించితిని, నిన్ను నీవెందుకు పేదరికములోనికి దిగజార్చుకొనెదవు? నిన్ను ఉత్కృష్టునిగనే జేసితిని, నిన్ను నీవెందుకు హీనపరచుకొనెదవు? జ్ఞానసారము చేతనే నీకు జీవము నొసంగితిని, నన్నువీడి వేరెవరినుండియో జ్ఞానప్రభాసము నాశింతువేల? ప్రేమయనెడు మట్టినుండి నిన్ను మలచితిని, మరి నీవితరులతో నిరతుడవగుదువేల? నీ దృష్టిని నీదెసకు సారించు, నేను నీలోనే మహాశక్తియుతుడనై, అధికారపరిపూర్ణితుడనై, స్వయంజీవనుడనై యుండుట నవలోకింపవచ్చును.

13

ఓ మనుష్యతనయా!

నీవు నా సామ్రాజ్యానివి, మరి నా సామ్రాజ్యము నశియింపదు; నశియింతునని నీవు భీతిల్లెదవేల? నీవు నా జ్యోతివి, మరి, నా జ్యోతి యెన్నటికిని ఆర్పబడదు; మరి, ఆరిపోవుదునని నీవు వెఱచెదవేల? నీవు నా కీర్తివి; నా కీర్తి యెన్నటికిని మఱుగున పడదు. నీవు నా వస్ర్తానివి; నా వస్త్ర మెన్నటికిని చిరిగిపోవదు. మరి, మహిమాన్వితలోకమున నన్ను గాంచుటకై, నీకు నాయందుగల ప్రేమలో వసియింపుము.

14

ఓ వాక్పుత్రుడా!

నీ వదనమును నాదెసకు మరల్చి, సర్వస్వమును పరిత్యజింపుము, ఏలయన నా సామ్రాజ్య మనశ్వరము, నా సార్వభౌమాధికార మాద్యంతరహితము. నన్నుగాక, అన్యు నాశించి నీవీ విశ్వమును నిరవధికముగ నన్వేషించినను, నిశ్చయముగ, నీ శోధన నిరర్థకమే.

15

ఓ జ్యోతిర్పుత్రుడా!

నన్నుదప్ప సకలమును మరచి నా యాత్మతో సంభా షింపుము. ఇది నా యాజ్ఞాసారము కనుక, దీని నాశ్రయింపుము.

16

ఓ మనుష్యతనయా!

నాతోనే సంతుష్టినొంది, మరి అన్యసహాయకు నాశింపవలదు. ఏలయన, నేను దప్ప నిన్ను సంతృప్తుని గావింపగల వా రెవ్వరును లేరు.

17

ఓ ఆత్మపుత్రా!

నీకై మేము వాంఛింపనిదానిని నన్నడుగవలదు; అయితే, నీకై మేము నిర్దేశించిన దానితోనే సంతృప్తి నొందుము; దానితో సంతుష్టి నొందినయెడల నీకది లబ్ధిని చేకూర్చును.

18

ఓ అద్భుతదృష్టియుత సుతుడా!

నీవు నా ప్రేమికుడ వగుదువని నా స్వీయాత్మజీవమును నీలో నిలిపినాను. మరి, నన్ను వదలివైచి వేరొక ప్రియునికై వెదకెద వేల?

19

ఓ ఆత్మపుత్రా!

నీపై నా స్వామ్యాధికారము గొప్పది, విస్మరింపరానిదది. నీకు నా యనుగ్రహ మపారము, మఱుగుపరచరానిదది. నా ప్రేమ నీలోనే వసియించి యున్నది, దాచరానిదది. నా కాంతి నీకు కన్పట్టుచునే యున్నది, అంధకారమయము గావింప రానిదది.

20

ఓ మనుష్యతనయా!

దేదీప్యమాన దివ్యవృక్షముపై శ్రేష్ఠఫలములను నీకై ఫలియింప జేసినాను, పరోన్ముఖుడవై అపక్వఫలములతో తృప్తుడవైతివేల? ఊర్థ్వలోకమున నీకు శ్రేష్ఠమగుదానిని బడయుటకై, యిక వెనుదిరిగి రమ్ము.

21

ఓ ఆత్మపుత్రా!

నిన్ను ఉత్కృష్టునిగనే సృజియించితిని, అయినను నిన్నునీవు హీనపరచుకొనినాడవు. ఇక, నిన్ను సృష్టించినదాని నిమిత్త ముద్గమింపుము.

22

ఓ పరమోన్నతుని పుత్రుడా!

నేను నిన్ను అమరత్వమునకు రమ్మనుచున్నను, నీవు మర్త్యము నన్వేషింపుచున్నాడవు. నిన్ను మా యాకాంక్షకు విముఖుని గావించి, నీ వాంఛ నన్వేషించునటు లొనరించినది యేది?

23

ఓ మనుష్యతనయా!

నీ మేరలను మీరవలదు, నీకు యుక్తముకాని దానిని కోరవలదు. సకలబలవంతుడును, సర్వశక్తివంతుడును నగు నీ దేవదేవుని ముఖారవిందము ముందు ప్రణమిల్లుము.

24

ఓ ఆత్మపుత్రా!

పేదవానిపై పెత్తనము చేయవలదు, ఏలయన, వాని తెరువున వానిని నేనే నడిపింపుచు, నిన్ను నీ దుర్దశయం దవలోకింపుచు, నిన్ను నిరంతర విస్మితు నొనరింపుచున్నాడను.

25

ఓ అస్తిత్వకుమారా!

నీ దోషములను మరచి యితరుల దోషములయెడ నిరతుడవగుదువేల? ఇట్లగు నాతడు, నా శాపమునకు గురియగును.

26

ఓ మనుష్యతనయా!

నీవు పాపివై యున్నంతవరకు, యితరుల పాపముల నుచ్చరింపకు. ఈ యాజ్ఞను మీరితివేని శపియింపబడెదవు, ఇందుకు మరి నేనే సాక్ష్యమును వహియింతును.

27

ఓ ఆత్మపుత్రా!

నీవొక సత్యమును తెలిసికొనుము: తానన్యాయకృత్యములకు పాల్పడుచూ, సాటి మానవులను న్యాయవర్తనులై మెలగుడని యాదేశించునాతడు నా నామమును తలదాల్చినను, నావాడు కాడు.

28

ఓ అస్తిత్వకుమారా!

ఎట్టి నిందాస్తుతిని నీ పరముగ నారోపింప నిచ్చగింపవో, అట్టి యారోపణ నెవ్వరిపట్లను గావింపకు; నీవాచరింపని దానిని వచియింపకు. నీకిది నా యాజ్ఞ, పాలించు.

29

ఓ మనుష్యకుమారా!

నా భృత్యుడు నిన్నేదేని ఆర్ధించిన త్రోసిపుచ్చకు, ఏలయన ఆతడి ముఖమే నా ముఖము; మరి, నా యెదుట నీవు బిడియ పడవలసి వచ్చును.

30

ఓ ఆస్తిత్వకుమారా!

నిన్ను పరిగణనకు పిలుచుటకు ముందుగనే, ప్రతి దినమున నిన్నునీవే గణనకు తెచ్చుకో; ఏలయన, మృత్యువు, అప్రకటిత ముగ, నిన్నావరించును, నీ చేష్టలకు వివరణ నిచ్చుటకు పిలువబడుదువు.

31

ఓ పరమోన్నతుని పుత్రుడా!

నీకు మృత్యువును సంతోషవార్తావాహుని గావించితిని. మరి, దుఃఖింతువేల? కాంతి తన ప్రభను నీపై ప్రసరించు నటులొనరించితిని. మరి, దానినుండి వైదొలగి, తెరమఱుగున దాగెదవేల?

32

ఓ ఆత్మపుత్రా!

ఆనందదాయక జ్యోతిస్సందేశముతో నిన్నభినందించు చుంటిని: ఆనందించు! పావన న్యాయస్థానమునకు రమ్మని నిన్నాజ్ఞాపించు చుంటిని; ఆద్యంతము శాంతియుతముగ జీవింపవచ్చును గాన, అందు వసియింపుము.

33

ఓ ఆత్మపుత్రా!

పునరైక్యతానంద సందేశమును పవిత్రాత్మ నీకై తెచ్చుచున్నది; మరి, దుఃఖింతువేల? ఆత్మశక్తి నిన్నాయన ధర్మమునం దనుగ్రహించుచున్నది; నిన్ను మఱుగుపరచుకొనెదవేల? ఆయన ముఖప్రకాశము నీకు మార్గదర్శన మొనరింపుచున్నది; నీవు దారెటుల తప్పగలవు?

34

ఓ మనుష్యతనయా!

మాకు దూరముగా నుంటివనితప్ప విచారము నొందకు. మా వైపుకు పురోగమింపుచు, మమ్ము చేరవచ్చుచుంటివని తప్ప ప్రమోదము నొందకు.

35

ఓ మనుష్యతనయా!

నన్ను దర్శించి, నా సౌందర్యమును ప్రతిబింబించుట కర్హుడ వగుదువు, కనుక నీ హృదయోల్లాసముతో ఆనందింపుము.

36

ఓ మనుష్యతనయా!

నా సౌందర్యవస్త్రమును త్యజింపకు; నీకెన్నటికిని దాహము గాకుండునటుల, నా యద్భుతస్రవంతి యందలి నీ భాగమును కోల్పోవకు.

37

ఓ అస్తిత్వకుమారా!

నా ప్రేమకై నా శాసనముల ననుసరింపుము; నా యానందము నాశించితివేని, నీ వాంఛలను నీవే త్రుంచివేయుము.

38

ఓ మనుష్యతనయా!

నీవు నా సౌందర్యమును ప్రేమించితివేని, నా యాజ్ఞల నలక్ష్యము చేయకు; నా మహదానందము నాశించితివేని నా యుపదేశములను మరువకు.

39

ఓ మనుష్యతనయా!

అపారగగనముగుండా, సువిశాలస్వర్గతలమున కభిముఖముగ, అత్యంత వేగపూరితముగ పయనించినను, మా యాజ్ఞలకు బద్ధుడవై మా వదనము ముందు వినమ్రుడ వైననే దప్ప నీవు విశ్రాంతి నొందజాలవు.

40

ఓ మనుష్యతనయా!

నా ధర్మాభ్యుత్థానము నొనరించితివేని, నీకు నా మహనీయ తాద్భుతములను వెల్లడించి, నీపై యనంతకాంతితో ప్రకాశింతును.

41

ఓ మనుష్యతనయా!

నా ధర్మాభ్యుత్థానము నొనరించితివేని, నీకు నా మహనీయతాద్భుతములను వెల్లడించి, నీపై యనంతకాంతితో ప్రకాశింతును.

42

ఓ మనుష్యతనయా!

నేను నిన్ననుగ్రహపూర్వకముగ సందర్శించుటకై, నా యెదుట వినమ్రుడవు కమ్ము. ఈ భువిపై వసియించి యుండగనే విజయము నొందుటకు, నా కార్యసిద్ధికి యుపక్రమింపుము.

43

ఓ అస్తిత్వకుమారా!

నేను నా స్వర్గమున నిన్ను జ్ఞప్తియం దుంచుకొనుటకు, నా పృథివిపై నా ప్రస్తావన మొనరింపుము; మన యుభయుల నేత్రము లవ్విధముగ సాంత్వన మొందును.

44

ఓ సింహాసనాత్మజా!

నీ వినికిడియే నా వినికిడి, దానితో వినుము. నీ దృష్టియే నాదృష్టి, దానితో వీక్షింపుము; అవ్విధముగ నీ యంతరాత్మ యందున నా మహోన్నత పవిత్రస్థితికి నీవు సాక్ష్యము నిచ్చి నటులే, నా యందున నీ పరమోన్నతస్థితికి నేను సాక్ష్యమును వహియింతును.

45

ఓ అస్తిత్వకుమారా!

నా సంతసముననే సంతుష్టుడవై, నా నిర్దేశమునకు కృతజ్ఞుడవై, నా పథమున హుతాత్ముడ వగుటకు యత్నింపుము; తద్వారా, నీవు నాతో ప్రకీర్తి పటవేశ్మము వెనుక, మహిమాన్విత మండపమున విశ్రాంతి నొందవచ్చును.

46

ఓ మనుష్యతనయా!

పర్యాలోచింపుము, పరిశీలింపుము. నీ శయ్యపైననే మృతుడవగుట కిచ్చగింతువా లేక నీ జీవరుధిరమును ధూళియందున చిందించి, నా పథమున హుతాత్ముడవై, నా యాదేశసదృశుడవై, నా జ్యోతిని మహోన్నతస్వర్గమున బహిర్గత మొనరించువాడ వగుదువా? ఓ భృత్యుడా, సరిగా నిర్ణయించుకో.

47

ఓ మనుష్యతనయా!

నా సౌందర్యము సాక్షిగా! విశ్వమును సృష్టించుటకన్నను, లోకద్వయమునకు వెలుగు నిచ్చుటకన్నను, నీ కేశములను నీ రక్తముతో తడియజేయుటయే నా దృష్టియందున మహోన్నతము. మరి, యో సేవకుడా! దీనినొంద యత్నింపుము.

48

ఓ మనుష్యతనయా!

ప్రతి యంశమునకును కలదొక ప్రతీక. నా యాజ్ఞపట్ల స్థైర్యమును, నా పరీక్షల యందున క్షమను వహియించుటయే ప్రేమకు ప్రతీక.

49

ఓ మనుష్యతనయా!

ద్రోహి క్షమాభిక్షను, పాపి దయానుగ్రహమును వేడినటుల, సత్ప్రేమికుడు సంకటమునే యాశించును.

50

ఓ మనుష్యతనయా!

నా పథమున నీకు ప్రతికూలవిపత్తు కలుగనిచో, నా సంతసమే తమ సంతుష్టిగా జీవించువారి దారులయం దెటుల పయనింపగలవు? నా సందర్శన సంప్రాప్తాకాంక్షివైనపుడు కష్టములు కలుగనిచో, నా సౌందర్యమునకై నీ ప్రేమలో కాంతినెటుల పొందగలవు?

51

ఓ మనుష్యతనయా!

నా విపత్తు నా విధికృత భవితవ్యము; అది బాహ్యముగా అగ్ని, ప్రతీకారము; అంతర్గతముగా నది కాంతి, కారుణ్యము. నీవొక యనంతకాంతిగ, అమృతాత్మగ విలసిల్లునటుల అట్టిదానికై వేగిరపడుము; నీకు నేనిచ్చు ఆదేశమిది, పాటింపుము.

52

ఓ మనుష్యతనయా!

నీకు సంపద ప్రాప్తించిన సమ్మోదమునొందకు, దారిద్య్రము నిన్నావరించిన ఖేదమునొందకు; ఈ యుభయస్థితు లెప్పటికిని యుండక, గడిచిపోవును.

53

ఓ అస్తిత్వకుమారా!

తరుణమున ధనాధిపతి నిన్ను దర్శించునుగాన, పేదరికము నిన్నధిగమించినపుడు వెతనొందకు. నీవొకనాటికి కీర్తివంతుడ వగుదువుగాన అపకీర్తికి భీతిల్లకు.

54

ఓ అస్తిత్వకుమారా!

ఈ శాశ్వత, అనశ్వరసామ్రాజ్యముపై యీ సనాతన, అనంత జీవితముపై నీ మనస్సును నిలుపనుంటివేని, యీ నశ్వర, క్షణభంగుర సార్వభౌమాధికారమును పరిత్యజించు.

55

ఓ అస్తిత్వకుమారా!

పసిడిని అగ్నితో పరీక్షించినటుల మా భృత్యులను పసిడిచే పరీక్షింతుము గాన, నీవీ యైహిక లోకనిమగ్నుడవు కావలదు.

56

ఓ మనుష్యతనయా!

నీకు బంగారముపై ఆసక్తి, నేనాశించునది దానినుండి నీ విముక్తి. తత్సంగ్రహణమున సిరివంతు డ నైతినని నీవెంతువు; మరి, నీవు దానినుండి వైదొలగుటలో పవిత్రత యున్నదని నేనెఱుగుదును. నాజీవితముపై యాన! నా జ్ఞానమిది, నీ భ్రమయది; నీ మార్గముతో నాదెటుల యేకీభవింపగలదు?

57

ఓ మనుష్యతనయా!

స్వర్గధామస్థిత నిత్యప్రకాశితాగారమునుండి, అమృతకీర్తి భాండారమునుండి నీవు గ్రహియింపవచ్చునుగాన, నా సంపత్తిని నా పేదల కర్పింపుము. కాని, నా జీవితము సాక్షిగా! నా దృష్టితో దర్శింపగలిగితివేని, నీ యాత్మార్పణమే పరమోత్కృష్టము.

58

ఓ మనుష్యతనయా!

సజీవదేహాలయమే నా సింహాసనము; నేనచట ప్రతిష్ఠింపబడి, వసియించు నిమిత్తము, సమస్త విషయసంచయమునుండి దానిని ప్రక్షాళన మొనరింపుము.

59

ఓ అస్తిత్వకుమారా!

నీ హృదయసీమయే నా గృహసీమ; నా యవరోహణార్ధమై దానిని పవిత్రము గావించు. నీ యాత్మయే నా ఆవిష్కరణస్థానము; నా ప్రత్యక్షీకరణమునకై దానిని ప్రక్షాళన మొనరించు.

60

ఓ మనుష్యతనయా!

నేను జ్యోతిర్మయుడనై, దేదీప్యమానుడనై నీపై యుద్గమింప వచ్చునుగాన, నా హృదయముపై నీ హస్తము నుంచుము.

61

ఓ మనుష్యతనయా!

పునరైక్యతానందమునొంది, అనంతకీర్తికలశమునుండి అనుపమానమధువును సేవింప వచ్చునుగాన, నా స్వర్గధామము దెస కధిరోహింపుము.

62

ఓ మనుష్యతనయా!

నీవు మిధ్యాభ్రమలలో, వ్యర్ధాలోచనలలో నిరతుడవైయుండ, ఎన్నియో దినములు నీపైనుండి గడచిపోయినవి. ఇంకెంతకాలము నీ శయ్యపై సుషుప్తుడవై యుందువు? నిదుర మేల్కాంచి తలయెత్తి చూడు, భానుడు నభోమధ్యమున ప్రకాశింపుచున్నాడు; ఆ సౌందర్యరశ్మి బహుశః నీపైననూ ప్రసరింపవచ్చును.

63

ఓ మనుష్యతనయా!

పావన పర్వతక్షితిజమునుండి నీపైకి కాంతి ప్రసరించినది, నీ హృదయమను సైనాయి శైలమున ఆత్మజ్ఞానప్రకాశము నిలుపబడినది. కావున, మిధ్యాభ్రమల ముసువులనుండి వైదొలగి నా యాస్థానమున ప్రవేశింపుము; తద్వారా, నీవు అమరజీవనమున కర్హుడవై, నన్ను దర్శింప యోగ్యత నొందెదవు. అవ్విధముగ మృత్యు, క్లేశ, బడలికలు నీ దరిజేరవు.

64

ఓ మనుష్యతనయా!

నా సృష్టియే నా నిత్యత్వము, నీ నిమిత్తము దానిని సృజియించితిని. దానిని నీ దేహాలయ వస్త్రము గావించుకొనుము. నా ఏకత్వము నా కరకృతి; నీకై దానిని విరచించితిని; నీవెన్నటికిని నా శాశ్వత అస్తిత్వావిష్కరణము కావచ్చును గాన, దానిని వస్త్రముగా ధరియింపుము.

65

ఓ మనుష్యతనయా!

నా మహత్త్వమే నీకు నా బహుమతి, మరి, నా వైభవమే నీకు నా కారుణ్యచిహ్నము. నాకేది సముచితమో యెవ్వరును గ్రహియింపనూ లేరు, వర్ణింపనూ జాలరు. నిశ్చయముగా, నా భృత్యులయెడ నాకుగల ప్రేమాదరణమునకు, ప్రజలపట్ల నాకుగల దాక్షిణ్యమునకు ప్రతీకగా, అట్టి వస్తువులను నా గుప్తభాండాగారముల యందున, నా యనుజ్ఞాకోశమున సుభద్రమొనరించితిని.

66

ఓ దివ్య, అగోచరాంశా శిశువుల్లారా!

నన్ను ప్రేమించుటనుండి మీరు నిరోధింపబడుదురు, నా నామమును స్మరియించునపుడు ఆత్మలు కలవరపెట్ట బడతవి. ఏలయన, మేధస్సులు నన్నవగాహన చేసికొననూ లేవు, హృదయములు నన్ను నిలుపుకొననూ జాలవు.

67

ఓ సౌందర్యాత్మజా!

నా యాత్మసాక్షిగా, నా యనుగ్రహసాక్షిగా! నా కరుణసాక్షిగా, నా సౌందర్యముసాక్షిగా! నా శక్తిసమన్వితజిహ్వచే నుడివి, మహాలేఖినితో నీకై లిఖియించిన దెల్లయు నా స్థితికి, ,నా స్వరమధురిమ కనుగుణముగా కాక, నీ యవగాహనా పటిమల కనువుగనే యున్నది.

68

ఓ మనుష్యసంతానమా!

మేము మిమ్మందరిని ఒకే ధూళిమూలమున ఏల సృజియించితిమో మీరెరుగరా? ఒకడింకొకనిపై యాధిక్యత వహియింపరాదనియే. మీ రెవ్విధముగ సృజియింపబడిరో సదా మీ హృదయములలో పర్యాలోచింపుడు. మేము మిమ్మందరినీ ఒకే పదార్థమునుండి సృజియించి నందున, ఒకే ఆత్మగ నిలిచి, ఐక్యపాదములుగ నడిచి, ఏకకుహరమున కుడిచి, ఏకధరిత్రిన వసించి, వాచా కర్మణా వైరాగ్య ఏకత్వముల చిహ్నసారము ప్రదర్శితమగునటుల మనుట మీ విద్యుక్తధర్మమై యున్నది. ఓ జ్యోతిస్సముదాయమా, మీకు నా యుపదేశ మిట్టిది. నా యద్భుత కీర్తివృక్షమునుండి పావన ఫలములను మీరందుకొనవచ్చునుగాన, ఈ యుపదేశము నాలింపుడు.

69

ఓ ఆత్మపుత్రులారా!

నేను మీయందున మదీయ గోప్యమౌక్తికములను, జ్ఞానరత్నములను నిక్షిప్తపరచి యున్నందున మీరే నా కోశాగారము. నా సేవకుల మధ్యనున్న ఆగంతుకులనుండి, నా ప్రజల యందలి నాస్తికుల బారినుండి వాటిని సంరక్షింపుడు.

70

ఓయీ స్వీయరాజ్యాన స్వయంస్థితుడై నిలచినవాని సుతుడా!

నీపై నా సమస్త పావనసౌరభములను ప్రసరింపజేసి, నా వాక్కును సంపూర్ణముగ నీకు ప్రవచించి, నీద్వారా నా యౌదార్యమును పరిపూర్ణ మొనరించి, నాకొరకై వాంఛించినదానినే నీకై యాకాంక్షించితినని తెలియుము. మరి, నా యానందములో సంతుష్టతనొంది, నాయెడ కృతజ్ఞతను వహించు.

71

ఓ మానవాత్మజా!

నీకు మేము ప్రవచించిన దానినంతయూ నీ యాత్మఫలకముపై జ్యోతిఃసిరాతో లిఖియింపుము. ఇందుకు నీ శక్తి చాలకున్న నీ హృదయాంశమునే సిరా గావింపుము. ఇదియును చేయలేకున్న నా పథమున చిందింపబడిన రక్తవర్ణపు సిరాతో లిఖింపుము. దాని కాంతి నిర్విహీనము గాక సదా వెలుగొందవచ్చును గాన, యథార్ధముగా నాకన్నింటికన్నను మధురమైనది యిదియే.

Persian

1

శక్తిమంతుడగు వాగ్దేవుని పేరిట

ఆకలనపుటాంతర్యము, ఆకర్ణించు వీనులుగల ఓ జనులారా!

ప్రియతముని తొలి పిలుపిది: ఓ అద్భుతకోయిలా! తేజోభరితమగు గులాబి యుపవనమున తప్ప వేరొకచోట వసింపకుము. ఓ ప్రేమజ్ఞానదూతా! ప్రీతిపాత్రుని వాగ్దానచ్ఛాయక్రింద తప్ప వేరొక ఆశ్రయము నాశింపవలదు; మరి, యో అమరవిహంగమా! విశ్వసనీయగిరిపై తప్ప వేరొకచోట జీవింపకుము. నీవు నీ యాత్మపక్షములతో అసీమితసామ్రాజ్యముదెసకు విహరించి నీ లక్ష్యమును చేరనెంచితివేని, నీ యావాస మచటనే యున్నది.

2

ఓ ఆత్మపుత్రా!

పక్షి తన గూటిని, కోయిల గులాబిపుష్ప రమణీయతను అపేక్షింపుచుండ, ఆ మానవహృదయ విహంగములు క్షణభంగురధూళిచే తృప్తినొందుచు, నిత్యమగు గూటికి దూరముగ తప్పిపోయి, ఉదాసీనతాపంకమువంకకు దృష్టిని మరలించి, దివ్యసాన్నిధ్యకీర్తిని కోల్పోయినవి. అయ్యో! ఎంత చిత్రమెంత దయనీయమో; వారొక్క చిరుపాత్రకు సరిపడునట్టి దానికాశపడి, మహోన్నతుని ఉత్తుంగతరంగ పయోనిధులకు తిరోన్ముఖులై, దేదీప్యమాన దిఙ్మండలమునకు దూరమైనారు.

3

ఓ స్నేహితుడా!

నీ హృదయోప వనమున ప్రేమయను గులాబినితప్ప వేరొక మొక్కను నాటవలదు; వాత్సల్యాపేక్షా కోయిలయెడ నీ పట్టును సడలనీయకు. ధార్మికసాంగత్యము నార్జించి, నాస్తిక సాహచర్యమును వర్జించు.

4

ఓ న్యాయతనయా!

ప్రియుడు తన ప్రియురాలి దేశమునకు గాక ఎచటి కేగును? తన మనోభీష్టము నెడబాసిన యన్వేషి ప్రశాంతత నెటులొంద గలడు? సత్ప్రేమికునికి పునస్సమాగమమే జీవనము, విరహమే మరణము. ఆతడి మది యోరిమి లేమియై, హృదయము శాంతిలేశ మగును. తన ప్రియురాలి గృహమును శీఘ్రగతిన చేరుటకై అగణితజీవితముల నాతడు తృణీకరించును.

5

ఓ ధూళీపుత్రుడా!

నీకు నిక్కముగ వక్కాణింపుచుంటిని: వ్యర్ధముగ కలహించు వాడు, తన యనుజునిపై నాధిక్యత నాశించు నాతడు మనుష్యులలోకెల్ల యుపేక్షితుడు! వచించు, ఓ సోదరులారా! మాటలను కాదు, కార్యములను మీకలంకరణములు కానిండు!

6

ఓ పృథ్వీపుత్రా!

ఏ హృదయమునం దణుమాత్రమేని మాత్సర్యశేషముండునో యది, నా యనంతసామ్రాజ్యాధిపత్యము నొందనూ జాలదు, నా పావనసామ్రాజ్యమునుండి వెలువడు మధురపరిమళముల నాఘ్రాణింపనూ జాలదని, నిశ్చయముగాతెలియుము.

7

ఓ ప్రణయాత్మజా!

ఊర్ధ్వమహిమోన్నతస్థానమునకు, దివ్యప్రణయతరువునకు, కేవల మొకేయొక్క అడుగు దవ్వున నీవున్నావు. ముందున కొక్క అంగనువేయుము. రెండవ దానితో ననశ్వరసామ్రాజ్యము నందలి యమరధామ మండపములోనికి నీవడుగిడగలవు. మహిమాన్విత లేఖిని వెలువరించిన యట్టిదానికి నీ చెవి యొగ్గుము.

8

ఓ యశస్సుతుడా!

పావనపథమున శీఘ్రతను వహియించి, నాతో అన్యోన్య సంభాషణాస్వర్గములోనికి ప్రవేశింపుము. ఆత్మప్రభాసముచే నీ హృదయమును ప్రక్షాళన మొనరించుకొని, పరమోన్నతుని సాన్నిధ్యము నొందుటకై త్వరపడుము.

9

ఓ క్షణికపుఛాయా!

సంశయమనెడు నిమ్నదశలను దాటి దృఢనిశ్చయమను మహోన్నతశిఖరముల నధిరోహింపుము. సత్యనేత్రమును దెఱచి, తద్వారా అనాచ్ఛాదిత దివ్యసౌందర్యమును గాంచి, దేవదేవుడు పావనుడని, సృష్టికర్తలందరియందున ప్రశస్తుడని, సంతోషాతిరేకమున కొనియాడుము.

10

ఓ వాంఛాసుతుడా!

ఇది చెవియొసంగి వినుము: మర్త్యలోచన మెన్నటి కిని అమరసౌందర్యమును గుర్తింపజాలదు; నిర్జీవ హృదయము జీర్ణకుసుమములయందే యానందించును. ఏదైనను, తనవలెనుండు సామ్యమునే యభిలషించి తత్సాహ చర్యముననే సంతసిల్లునుకదా!

11

ఓ ధూళీపుత్రుడా!

నా సౌందర్యమును దర్శించుటకు నీవంధుడవు కమ్ము; శ్రవణపేయముగ నా స్వరమాధుర్యము నాలకించుటకు నీవు బధిరుడవు కమ్ము; నా జ్ఞానమున పాలుపంచుకొనుటకు నీవు సకలజ్ఞానవిహితుడవు కమ్ము; నా అనశ్వరైశ్వర్య మహాంభోధి యందున శాశ్వతభాగము నొందుటకు, నీవు సంపదల నెడ బాసి పునీతుడవు కమ్ము; నా సౌందర్యమునకు తప్ప సర్వస్వమునకు నీ వంధుడవైతే, నా ప్రవచనములకు తప్ప సకలాంశములకు నీవు బధిరుడవైతే, నా జ్ఞానసర్వస్వమును తప్ప తక్కిన విషయములను నీవు విస్మరిస్తే - విస్పష్టదృష్టితో, పవిత్ర హృదయముతో, శ్రద్ధాసక్తియుతశ్రవస్సుతో నా పవిత్ర న్యాయాలయములోనికి ప్రవేశింప గలుగుదువు.

12

ఓ ద్వంద్వదృష్టియుత మానవుడా!

ఒక నేత్రమును మూసి వేరొక నేత్రమును తెరువుము. ప్రపంచమును, దానియందలి సకలమును అవలోకింపక యొక కంటిని మూయుము, ప్రియతముని పవిత్రసౌందర్యమును వీక్షించుటకై వేరొక చక్షువును వివృతమొనరింపుము.

13

ఓ నా సంతానమా!

స్వర్గకపోత సుస్వరమాధుర్యము నెడబాసి, సమూల నష్టపూరిత ఛాయలలో మునిగిపోవుదురేమోనని, గులాబిసౌందర్యముపైకి దృష్టిని యెన్నటికిని సారింపక, మట్టి, ఉదకములవంకకు మీరు తిరోన్ముఖులగుదురేమోననియే నా భీతి.

14

ఓ మిత్రులారా!

అంతముగాక తప్పని యందమునకై అనంతసౌందర్యమును పరిత్యజింపవలదు; ఈ ధూళియుతమర్త్యలోకముపై మీ మమకారములను నిలుపవలదు.

15

ఓ ఆత్మపుత్రా!

పావనకోయిల అంతర్మర్మములను యింకెంతమాత్రము వివరింపలేని, మీరెల్లరును దివ్యగాన సుమధురస్వరమును, ఊర్ధ్వలోకవాణిని వినలేని తరుణము వస్తుంది.

16

ఓ ఉపేక్షాసారమా!

ఏకభాషణమున దశసహస్రజిహ్వలు పల్కి, అగణిత నిగూఢమర్మము లొక్కస్వరమున వెల్లడియైనవి. అయ్యో, ఆలకించు శ్రవస్సైనను ఆకళింపు చేసుకొను హృదయమైనను లేదాయెను

17

ఓ సహచరులారా!

అనంతోపరిమహాద్వారములు విశాలముగ తెరువబడి యున్నవి, ప్రియతముని ఆవాసము ప్రేమికుల రక్తముచే నలంకృతమైనది, అయినను, కొందరుతప్ప తక్కినవారు యీ దివ్యనగరికి దూరముగ నున్నారు; ఆ కొందరిలోను అత్యల్పసంఖ్యాకులే నిష్కళంక హృదయులని, పవిత్రాత్ములని తెలియనైనది.

18

ఓ సర్వోన్నత స్వర్గనివాసులారా!

పుణ్యలోకములలో, సర్వోత్కృష్టస్వర్గ సామీప్యమున నవ్యదివ్యోపవనమొక్కటి ప్రభవించిన దనియు, ఊర్ధ్వలోకవాసులును, అమరలోకనివాసులును దానిచుట్టును పరిభ్రమింపుచున్నారనియు, విశ్వాసాన్వితసంతతికి ప్రకటింపుడు. మరి, అట్టిస్థాయినొందుటకును, దాని పవనకుసుమముల మర్మముల నెఱుగుటకును, దాని యుత్కృష్టఫలములనుండి దివ్య అగోచరత్వమును, పూర్ణవివేకమును గ్రహించుటకును యత్నింపుడు. ఆ దివ్యోపవనమున ప్రవేశించి, వసించువారి నేత్రములకు సాంత్వనమబ్బును.

19

ఓ నామిత్రులారా!

సకలమహిమాన్వితస్వర్గమున నాటబడిన ఆ దివ్యజీవనవృక్షచ్ఛాయక్రింద, ఆ పుణ్యపావనక్షేత్రముల యందున, నా సమక్షమున మీరెల్లరును సమావేశమైన ఆ దేదీప్యమాన నిత్యప్రత్యూషమును మరచితిరా? ఓ మిత్రులారా! ' నా యభీష్టమునకు భిన్నులై స్వీయేచ్ఛావర్తనులు కావలదు', 'మీకై నేను వాంఛింపనిదాని నాశింపవలదు', ' ఐహికవాంఛలచే, కాంక్షలచే కల్మషమైన నిర్జీవహృదయము లతో నన్ను సమీపింపవలదు', అని నేనుచ్చరించిన ఈ పరమ పవిత్ర వాక్యత్రయమును భక్తిశ్రద్ధలుట్టిపడ మీరాలకించితిరి కదా. మీరు మీ హృదయములను పవిత్రము గావించుకొనిరేని ఆ పావనస్థలిని, ఆ క్షేత్రములను యీ ప్రస్తుత తరుణమున పునరావలోకన మొనరించుకొనెదరు, మీ యెల్లరకును నేను వచియించినదాని సత్యము సాక్ష్యాధార సమన్విత మగును.

పంచమస్వర్గఫలకమునందలి పరమపవిత్రమగు అష్టమపంక్తి యందాయన ఇట్లు ప్రవచించినాడు:

20

అశ్రద్ధయను శయ్యపై, శవములవోలె పడియున్న ఓ మనుష్యులారా!

యుగములు గడచిపోయినవి, అమూల్యములైన మీ ఆయువులు రమారమి అంతమైనవి, అయినను మీనుండి ఒక్క పవిత్రప్రస్తావనయైనను మా పావనస్థానమును చేరరాలేదు. అంధవిశ్వాస సంద్రమున మునింగియు, మీరు మీ యధరములతో భగవద్విశ్వాసమును బాహాటముగ వచింపు చున్నారు. నేను యేవగించుకొనువానిని మీరు చేరదీసినారు, నా శత్రువునుచేరి మైత్రి చేసినారు. అయినను, నా ధరిత్రిపై మీరు సుప్రసన్నులై, ఆత్మతృప్తులై, అజాగరూకులై వర్తించితిరేని, మీవలన బడలిన నా ధరణి తన సమస్తవస్తుసంచయసహితముగ మిమ్ముతరిమికొట్టును. కన్నులుదెఱచి గాంచితిరేని, ఈ సౌఖ్యమునకుమారు, వేనవేల క్లేశములనే మీరాశింతురు, ఈ జీవితముకన్నను పరమపదప్రస్థానమే మేలని యెంతురు.

21

ఓ సంచలనధూళీస్వరూపా!

నేను నీతో అన్యోన్యసంసర్గము నాకాంక్షింపుచుండ, నీవు నాయం దణుమాత్రమేని విశ్వాసమునుంచవు. నీ తిరస్కారఖడ్గము నీ యాశాతరువును నరికివైచినది. సర్వకాలముల యందునను, నేను నీకతి చేరువలో యున్నాను; కాని నీవు సర్వదా నాకెంతయో దూరముగ నున్నావు. నీకై శాశ్వతకీర్తిని నేనెంచినను, మితిలేని అపకీర్తినే నీవెంచుకొనినాడవు. కాలమింకనూ మించిపోవక మునుపే మరలిరమ్ము, నీ సౌభాగ్యయోగమును కోల్పోవకు.

22

ఓ వాంఛాసుతుడా!

బుధులుత్తములు ఆ సకలమహామహుని సాన్నిధ్యము నొందనెంచి సుదీర్ఘకాలము యత్నించి విఫలురైనారు; వారాయన యన్వేషణమున తమ జీవితములనే వెచ్చించినను, ఆయన వదనసౌందర్యము నవలోకింపలేదు. లేశమాత్రయత్న మేమియులేకయే నీవు నీ పరమావధి నందుకొంటివి, అన్వేషింపకయే నీవభిలషించినదాని నొందితివి. అయినను నీవింకను అహంకారపు మేలిముసువున దాగియుండ, నీ నయనములు దివ్యప్రియుని వదనసౌందర్యమును తిలకింపనూ లేదు, నీ హస్తము ఆయన ఘనవస్త్రపు టంచును స్పృశించనూ లేదు. చక్షువులున్న మీరు వీక్షించి అచ్చెరువొందుడు

23

ఓ ప్రేమనగరవాసులారా!

క్షణికపుపెనుగాలులు అనంతత్వపుజ్యోతి నావరించినవి, ధూళీ తిమిరమున దివ్యయువకుని సౌందర్యము తెరమఱుగైనది. ప్రేమైకాధిపతుల అధినాయకుడు క్రూరజనులచే ' దోషి' గావింపబడినాడు, ఉలూకముల నఖపంజరమున పవిత్ర కపోతము బంధితయైనది. మీరలసత్వలోకమున విశ్ర మింపుచు, మిమ్ముమీరు గొప్పవారమని చాటుకొనుచు, నిజ మిత్రుల మనుచుండ, ఆ మహిమాన్విత మండపవాసులును, ఉత్కృష్టదేవసముదాయ మెల్లయును విషణ్ణులై విలపింపు చున్నారు. మీ యూహలెంత మిధ్యయో!

24

వివేకులనబడు నామాంతరముగల యో మూర్ఖులారా!

నా మందపై బడనుద్దేశించి, అంతర్గతముగ తోడేళ్లై యుండిన మీకు గొఱ్ఱెలకాపరుల మాయవేషము లెందులకు? ఉషోదయత్పూర్వమే ఉదయించి ధగధగ ప్రకాశింపుచున్నను, నా నగరబాటసారులను పెడద్రోవ బట్టించి, అధోగతికిజేర్చు నక్షత్రము వంటివారు మీరు.

25

అందముగా నగుపించు ఓ అంతర్మలినులారా!

మీరు తేటగా నగుపించు చేదునీటివంటి వారు; అవి పైకి స్ఫటికమువలె స్వచ్ఛముగ నున్నను, దివ్యపరిశీలకుడు పరీక్షించిన యప్పుడొక్కబిందువైనను అంగీకృతము కాదు. అవును! సూర్యకిరణము ధూళిపైనను, దర్పణముపైనను సమముగనే ప్రసరించినను, అవి ప్రతిఫలింపచేయు ప్రకాశమునందలి వ్యత్యాసము భూమిపై నక్షత్రపరావర్తనము వలె యుండును; ఆ యంతర మపారము.

26

ఓ నా నామమాత్రపు మిత్రుడా!

క్షణకాలము పర్యాలోచింపుము. శత్రుమిత్రు లొకేహృదయమున సహవసింతురని యెన్నడేని వినియుంటివా? హితైషి తన గృహమున ప్రవేశించుటకు, ఆగంతుకుని ఆవల కంపివేయుము.

27

ఓ ధూళీపుత్రుడా!

నా సౌందర్యమునకును, మహిమకును ఆవాసమొనరించు కొనిన మనుష్యహృదయమును తప్ప, భూస్వర్గస్థితమగు సమస్తమును నీకొఱకే నిర్దేశించినాను; అయినను నా గృహమును, నా యావాసస్థానమును నాకుగాక వేరెవరికో నీవొసంగినాడవు; నా పవిత్రావతారమూర్తి తన యావాసము నపేక్షించినపుడెల్ల, ఆయన అచట నొక ఆగంతుకుని గాంచి, ఆవాసరహితుడై శీఘ్రముగ పరమప్రియుని పుణ్యస్థానమునకు వేగమె వెనుదిరిగినాడు. అయినను, నేను నీ రహస్యమును గోప్యముగ నుంచుటయేకాదు, నీకవమానము కల్గుటనూ అపేక్షింపలేదు.

28

ఓ అపేక్షాసారమా!

ఎన్నియో ప్రాతఃకాల వేళలయందున నేను నా పావనసామ్రాజ్యమునుండి నీ నికేతనమున కేతెంచి చూడగ నీవు సుఖశయ్యపై, నాతోగాక, వేరెవరితోనో నిరతుడవైయుంటివి. తదుపరి, నేను జీవస్ఫూరిత విద్యుల్లతవోలె మహోత్కృష్టసామ్రాజ్యముదెసకు వెనుదిరిగితిని. నా తిరోగమనముల యందెన్నడును దేవగణములతో నీ యంశమును ప్రస్తావింపలేదు.

29

ఓ వదాన్యతాపుత్రుడా!

అభావత్వపు రిత్తపదార్థములనుండి, నా యాజ్ఞయను మట్టితో నీకు రూపమునిచ్చి, నీకు శిక్షణ గరపుటకు అస్తిత్వప్రపంచము నందలి ప్రతి యణువును, సకలజీవరాశితత్త్వమును ఆదేశించినాను. నీవు నీ మాతృగర్భమునుండి వెలువడుటకు పూర్వమే నీకై సుప్రకాశిత క్షీరధారలనిడు వక్షోరుహ ద్వయమును, నిన్ను వీక్షించి సంరక్షించు చక్షువులను, నిన్నపేక్షించు హృదయములను యేర్పరచినాను. నా ప్రేమోపేతకారుణ్యముతో, నా యనుగ్రహచ్ఛాయలో నిన్ను పోషించి, నా దయాభిమానములతో సంరక్షించినాను. దీనంతటియందున నా యుద్దేశ్యము: నీవు నా యనంత సామ్రాజ్యమునొంది, నా యగోచరౌదార్యములకు పాత్రుడవు కావలయు ననునదే. అయినను, నీవు పరిపూర్ణముగ నెదుగగనే, నిలువక, ప్రమత్తుడవై, నా యౌదార్యములను త్రోసిపుచ్చి, నీ వ్యర్ధోహలకు లోనైతివి; ఇవ్విధముగ, నీవు పూర్తిగ మతిహీనుడవై, హితైషి గృహద్వారమునుండి వైదొలగి, నా వైరికూటమునజేరి వసియింపుచుంటివి.

30

ఓ భవపాశబంధిత బానిసా!

ఎన్నియో ప్రభాతవేళలలో నా ప్రేమోపేతమందమారుతము నీపైకి వీచిరాగా, నీవు అలసత్వపుశయ్యపై గాఢనిద్రయందున్నావు. అప్పటి నీ స్థితినిగాంచి విషణ్ణయై, అది నిజవాసమునకు వెనుదిరిగినది.

31

ఓ పృథ్వీపుత్రా!

నా ప్రాప్తిని కాంక్షించితివేని, ననువినా అన్యుల నాశింపకు; నా సౌందర్యమును దర్శించుటకై, యీ ప్రపంచమునకును, యిందలి సమస్తమునకును నీ నేత్రములను మూయుము; అగ్నియును, జలమును కలిసియుండనటులే నా యభీష్టము, అన్యుని యిష్టము ఏ హృదయమునను మనజాలవు.

32

ఓ ఉపకృతినొందిన అపరిచితుడా!

నా శక్తియుతహస్తముచే నీ హృదయజ్యోతిని వెలిగించితిని; స్వార్థ, మోహములనెడి విరుద్ధపవనములతో దానిని ఆర్పివేయకు. నన్ను స్మరియించుటయే నీ సకలరుగ్మతలకు నివారణోపాయమని మరువకు. నా ప్రేమను నీ నిక్షేపనిధి గావించుకొని, అదియే నీకు దృష్టి, జీవన మనునటుల దానిని ప్రవర్థమానము గావించు.

33

ఓ నా సోదరుడా!

తేనెలూరు నా జిహ్వయొక్క ప్రమోదప్రవచనముల నాలింపుము. మాధుర్యమునొలుకు నా యధరములనుండి జాలువారు పావన, అద్భుతసెలయేటిని పానము చేయుము. నా జ్ఞానవివేకము లను పద్మరాగపుష్పరత్నములు నీ పావన హృదయసీమలో పచ్చగా పెరిగి, వికసించుటకై, నా దివ్యవివేక బీజములను నీ నిష్కపటపు హృద్భూమిలో విత్తి, వాటికి దృఢ నిశ్చయజలమును పోయుము.

34

ఓ నా స్వర్లోకవాసులారా!

మీ ప్రేమ, మైత్రియను లేతమొక్కను నా స్వర్గపు పావనోప వనమున ప్రేమోపేతకరములతో నాటి, దయాన్విత, మృదు వర్షపుజల్లులతో నీరిడి పెంచితిని; అది ఫలములీను సమయ మరుదెంచినది, దానిని కాపాడ యత్నింపుడు; ఆశా, మోహాగ్నిజ్వాలలకు ఆహుతి కావలదు.

35

ఓ నా మిత్రులారా!

దోషమను దీపమునార్పి, దివ్యమార్గదర్శన శాశ్వతజ్యోతిని మీ హృదయములయందున ప్రజ్జ్వలింప చేయుడు. ఏలయన, అచిరకాలమునకే, పరమపూజ్యుని సమక్షమున మానవగుణ పరీక్షకులు నిర్మలసద్గుణమును, నిష్కళంక పవిత్రకృత్యము లను దక్క అన్యము నామోదింపరు.

36

ఓ ధూళీపుత్రుడా!

విననెంచు శ్రోత లభించిననేతప్ప మాటాడనివారు, అర్ధించువా డగుపింపనంతవరకు అర్పింపని పాత్రధరుడు, తన ప్రియురాలి సౌందర్యము నవలోకించిగాని తన హృదయాంత రాళము నుండి యెలుగెత్తి పిలువని ప్రియుడు - వీరే వివేకులు. అందుకే, నైర్మల్యపు హృద్భూమియందున జ్ఞానవివేకబీజములను విత్తి, బురదనుండి, మట్టినుండి కాక, హృదయమునుండి దివ్యవివేకపు టద్భుతపుష్పములు వికసించువరకు వాటిని గోప్యముగ నుంచుము.

ఇది ఫలకపు ప్రథమపంక్తి యందున లిఖితమై, గ్రంథస్తము గావింపబడి, భగవంతుని పుణ్యమండపమున గుప్తపరుప బడినది:

37

ఓ నా భృత్యుడా!

అంతరించుదానికై అనంతసామ్రాజ్యము నుపేక్షింపకు, ప్రాపంచికవాంఛకై సర్వోన్నత సార్వభౌమత్వమును త్రోసిపుచ్చకు. దయామయుని పావనలేఖినీమూలమునుండి ప్రవహిల్లిన అనంతజీవనది యిది; దీనిని గ్రోలినవారు ధన్యులు!

38

ఓ ఆత్మపుత్రా!

నీ పంజరమును చీల్చి దూరముగ విసరివైచి, ప్రేమవిహంగమువోలె పావిత్య్రపు గగనతలములోనికి ఎగసిపొమ్ము. నిన్ను నీవు పరిత్యజించి, కరుణాస్ఫూర్తి యుతుడవై, శాశ్వతపునీతలోకమున వసియింపుము.

39

ఓ ధూళీసంజాత సంతానమా!

దైనందినసౌఖ్యముననే సంతుష్టుడవై శాశ్వతవిశ్రాంతిని కోల్పోవకు. ధూళియుతమగు మర్త్యప్రపంచమునకై సదానందోపవనమును వినిమయ మొనరింపకు. నీ చెఱనుండి యుత్తిష్టుడవై, ఊర్ధ్వమహిమోద్యానమున కధిరోహించి, నీ భౌతికపంజరమునుండి విడివడి అనంతస్వర్గధామము దెస కెగసిపొమ్ము.

40

ఓ నా భృత్యుడా!

ఈ ప్రాపంచిక శృంఖలములనుండి విముక్తుడవై, అహమను చెఱనుండి నీ యాత్మకు స్వేచ్ఛనిమ్ము. నీకిక తిరిగిరాని ఈ యవకాశమును దక్కించుకొనుము.

41

ఓ నా సేవికాపుత్రుడా!

నీవు అమరసార్వభౌమత్వమును వీక్షించితివేని, ఈ క్షణభంగుర ప్రపంచమునుండి ప్రస్థానమునకు యత్నింతువు. అయినను నీకొకదానిని కనుమఱుగొనరించి, మరియొకదానిని నీకగపడు నటుల చేయుటయే మర్మము. పునీతహృదయము దక్క వేరెద్దియును దీనిని పసిగట్టజాలదు.

42

ఓ నా భృత్యుడా!

ఈర్ష్యాద్వేషములనుండి నీ హృదయమును ప్రక్షాళిత మొనరించి, దివ్యపావన సభాంగణమున ప్రవేశింపుము.

43

ఓ నా మిత్రులారా!

హితైషికి ఆనందము కలుగు పథముననే పయనింపుడు; తన సృజితుల యానందముననే ఆయన కానందమున్నదని గ్రహియింపుడు. అనగా: ఏ మనుజుడును తన మిత్రుడు సంతసించిననేతప్ప ఆతడి గృహమున ప్రవేశించుటయో, ఆతడి సంపదలను స్పృశించుటయో, ఆతడి యిష్టమునకు మారు తన యభీష్టము నెంచుటయో, ఆతడినుండి ప్రయోజనము నాశించుటయో ఎవ్విధముగను తగనిది. అంతఃజ్ఞానముగల మీరు దీనిపై సుదీర్ఘముగ యోచింపుడు!

44

ఓ నా సింహాసన సహచరుడా!

చెడు వినకు, చెడు కనకు, ఆత్మహైన్యత చేసికొనకు, నిట్టూర్చకు, విలపించకు. నీ పరముగ పల్కెడు చెడుమాటలు నీకు వినపడకుండుటకు, నీవు చెడు అనకు; నీ దోషములు పెద్దవిగా నగుపడకుండుటకు, పరుల దోషములను బృహత్తర మొనరింపకు; నీ నైచ్యము బహిర్గతము గాకుండుటకు, ఏ యొక్కరి నైచ్యమును ఆశింపకు. నీ బుద్బుదప్రాయ జీవితమును నిష్కల్మష మనస్కుడవై, నిష్కళంక హృదయముతో, సదాలోచనలతో, పవిత్రప్రవృత్తిని కలిగి, అపరాధీనుడవై, సంతుష్టుడవై, ఈ నశ్వరదేహమును వదలి అద్భుతస్వర్గము నధిరోహించి అనంతసామ్రాజ్యమున సదా వసియించుట కర్హుడవగునటుల జీవింపుము.

45

అయ్యయ్యో! ఓ ఐహికవాంఛా ప్రేమికులారా!

మెఱపుచందమున శీఘ్రముగ ప్రేమమూర్తినుండి వైదొలగి పైశాచిక తలంపులపై మీ మనస్సులను నిలుపుకొనినారు. నిక్కమను తలంపుతో, శుష్కవికారములయెదుట మోకఱిల్లి నారు. కంటకముదెసకు చూపును సారించి, అదియే పుష్ప మని యెంచినారు. ఒక్క పావిత్య్రపు నిశ్వాసమునైనను మీరు వెలువరింపనూ లేదు, మీ హృదయక్షేత్రములనుండి పరిత్యాగ పవనములు వీయనూ లేదు. పరమప్రియుని సదుపదేశము లను గాలికి వదలి, మీ హృదయఫలకముల నుండి వాటిని సమూలముగ తుడిచివైచి, జంతువులవలె గ్రాసముకొఱకు వాంఛామోహములనెడు పచ్చికబయళ్లలో మసలుచున్నారు.

46

ఓ సహబాటసారులారా!

ప్రేమమూర్తి బోధనల నలక్ష్యమొనరించి, ఆయన పావన సాన్నిధ్యమునకు దూరమైతిరేల? ఆయన సౌందర్యసారము సామ్యరహిత వితానమున, మహిమాన్వితసింహాసనమున తీర్చబడి యుండ, మీరు మిధ్యావివాదములయందున మగ్నులై యున్నారు. పవిత్రమధురసౌరభములు వెలువరింప బడుచుండ, ఔదార్యానుగ్రహము మిమ్మావరించినది, అయినను మీరెల్లరును బాధ, క్లేశతప్తులై దానిని కోల్పోయి నారు. అయ్యో పాపము! మీరును, మీ బాటలలో నడచుచు, మీ యడుగుజాడల ననుసరించువారును త్రోవదప్పిరే!

47

ఓ వాంఛాసంజనిత సంతానమా!

శుష్కకీర్తియను వస్త్రమును తొలగించుకొని, దురహంకారమను దుస్తులకు దూరులు కండు.

అగోచరుని లేఖినిచే రత్నఫలకమున వ్రాయబడి, గ్రంథస్థము గావింపబడియున్న పవిత్ర పంక్తులయందిది వెలువరింపబడినది:

48

ఓ సోదరులారా!

మీరు పరస్పరము ఓరిమి వహియింపుడు, నైచ్యాంశములపై మనములను నిలుపవలదు. మీ కీర్తికి గర్వితులు కావలదు, హైన్యత కవమానితులు కావలదు. నా సౌందర్యము సాక్షిగా! నేను సకలాంశములను మట్టితోనే సృజియించితిని, వాటిని మరల మట్టిలోనికే చేర్చుదును.

49

ఓ ధూళీసంజాత సంతానమా!

నిరుపేదల నడిరేయి నిట్టూర్పులను ధనికులకు తెలియచెప్పు; జాగ్రత్త సుమా, అలక్ష్యము వారి నధోగతికి గొంపోయి భాగ్యతరువునకు దూరము గావించునేమో. ప్రదానము చేయుట, ఔదార్యము వహించుట యనునవి నా విశేషగుణస్వభావములు; నా సద్గుణాలంకృతుడు ధన్యుడు.

50

ఓ అపేక్షాతత్త్వసారమా!

దురాశను వీడి సంతృప్తి నాశ్రయింపుము; ఏలయన, దురాశాపరుడెపుడూ దురదృష్టవంతుడే, సంతుష్టుడెప్పుడును ప్రీతిపాత్రుడే, ప్రకీర్తితుడే.

51

ఓ నా సేవికాపుత్రుడా!

పేదరికమున కలత నొందకు, సిరిసంపదలను విశ్వసింపకు; ఏలయన, కలిమిలేములు ఒకదానినొకటి అనుసరించి సంభ వించును. అయినను, భగవంతుడు వినా, అన్నింటా పేదరి కమే ఒక అద్భుతవరము, దాని పవిత్రవిలువ నపహాస్యము చేయకు, ఏలయన, కడపటికది నిన్ను భగవత్సాన్నిధ్య శ్రీమంతుని గావింపగలదు; అవ్విధముగ నీవు, "యథార్థముగా మీరందరూ నిరుపేదలే," యని ప్రవచింప బడిన పవిత్రోచ్చారణములకు, "భగవంతుడే సకలసంపన్ను," డను పావనప్రవచనములకు అర్థమును – ప్రియతముని హృదయదిఙ్మండలముపై ఉషోదయకాంతులు విరజిమ్మి నటుల - గ్రహియించి, భాగ్యాసనాసీనుడవై సురక్షితముగ వసియింతువు.

52

ఓ అలసత్వ, వ్యామోహముల సంతానమా!

మీ హృదయములలో నాపైకాక వేరొకరిపై ప్రేమను నిలిపి, నా గృహములోనికి నా శత్రువును రావించి, నా మిత్రుని వెడలగొట్టి నారు. హితైషి ప్రవచనములకు చెవియొగ్గి ఆయన స్వర్గము నాశ్రయింపుడు. స్వలాభాపేక్షులైన ప్రాపంచికమిత్రులు ఒకరి నొకరు ప్రీతించినట్లగుపింతురు, కాని నిజమైన హితైషి కేవలము మీ నిమిత్తమే మిమ్ము ప్రేమించినాడు, ప్రేమించును; యథార్థముగ, మీకు మార్గదర్శన మొన రించుటకై అగణిత క్లేశముల ననుభవించినా డాయన. అట్టి హితైషికి అవిధేయత నగుపరచక, ఆయన వైపుకు త్వర నొందుడు. సకలనామాధి నాథుడగు పరమేశ్వరుని లేఖినీ క్షితిజమునుండి ప్రభవిల్లిన సత్యవిశ్వాసముల వేగుచుక్క యిది. ఆపద్బాంధవుడును, స్వయంభువునునగు భగవంతుని ప్రవచనము నాలకించుటకు మీ శ్రవస్సులను తెఱవండి.

53

ఓ నశ్వరసిరి గర్వాంధులారా!

అన్వేషకునికిని, ఆతడి ఆశయమునకును, ప్రేమికునికిని, ప్రేమికకును మధ్యనున్న బలమైన అవరోధము సంపదయేయని నిక్కముగా తెలిసికొనుడు. ఏ కొందరో తప్ప, శ్రీమంతు లెవ్విధముగను ఆయన సాన్నిధ్యము నొందనూ లేరు, సంతృప్తి, పరిత్యాగములను నగరమున ప్రవేశింపనూ జాలరు. సిరిగల వాడయ్యును, తన సంపదలు తాను అనంతసామ్రాజ్యమునందుట కవరోధము కాకుండు నటుల, వాటి వలన అనశ్వర పరమపదమును తాను కోల్పోవకుండు నటుల వర్తించువాడు ధన్యుడు. మహాఘననామము సాక్షిగా! భానుడు భూలోకవాసులను శోభిల్లజేయు చందమున, అట్టి ధనికుని శోభ స్వర్గవాసులను భాసిల్లచేయును.

54

ఓ ధరణిపైనున్న ధనికులారా!

మీ మధ్యనున్న పేదవారు నా సంపత్తి; నా సంపత్తిని సంరక్షింపుడు, కేవలము మీ సౌఖ్యమునే తలంపవలదు.

55

ఓ వ్యామోహపుత్రుడా!

ఐశ్వర్యమాలిన్యమునుండి నిన్నునీవు ప్రక్షాళన మొనరించు కొని, పరిపూర్ణశాంతితో పేదరికమను ప్రపంచములోనికి పురోగమించు; తద్వారా నిస్సంగత్వపు టుల్బణమునుండి అమృత జీవన్మధువును గ్రోలవచ్చును.

56

ఓ నా పుత్రుడా!

నాస్తికుల సాంగత్యమున విచారము హెచ్చగుచుండ, ధార్మికసాహచర్యమున హృదయకల్మషము ప్రక్షాళితమగును. భగవంతునితో సంభాషింపనెంచు నాతడు, ఆయన ప్రీతి పాత్రుల సాహచర్యము నొందుగాక; మరి, భగవత్ప్రవచనముల నాలకించగోరువాడు, ఆయన ఎంచుకొనినవారి మాటల నాలించు గాక.

57

ఓ ధూళీపుత్రుడా!

జాగ్రత్త! భగవద్విరోధితో కలిసి చరియింపకు, వాని సాహచర్యము నాశింపకు; ఏలయన, అట్టి సాంగత్యము మనఃప్రకాశమును భీషణ హుతాశనకీలగా పరివర్తిత మొనరించును.

58

ఓ నా సేవికాపుత్రుడా!

పావనుడగు పరమాత్ముని యనుగ్రహము నాశించితివేని, ధార్మికుని సాహచర్యమున ప్రవేశించు; ఏలయన, ఆతడు అమృతభాండధరుని కరములయందలి అనంతజీవనపాత్రమునుండి పానము చేసినాడు, యథార్థప్రత్యూషమువలె మృతహృదయములను పునరుజ్జీవింపచేసి ప్రకాశింప చేయగలడు.

59

ఓ ఉదాసీనులారా!

మనోగతమర్మము లగోచరములని భావింపవలదు; కానేకాదు, విస్పష్టాక్షరములతో నవి చెక్కబడి, దివ్యసమక్షమున ప్రత్యక్షప్రదర్శితములని నిక్కముగా నెఱుగుడు.

60

ఓ మిత్రులారా!

మీ హృదయాంతరాళములయందున మీరు గుప్తపరచినది పగటివోలె మాకు పూర్ణబహిర్గతము, ప్రత్యక్షవివృతము; అయినను గోప్యములై యున్నవి మా కరుణాకటాక్షములేకాని, మీ యోగ్యతకాదని నేను నిక్కముగా వచియింపుచుంటిని.

61

ఓ మానవపుత్రా!

అగాధమగు నా యనుగ్రహసంద్రమునుండి హిమబిందువు నొక్కదానిని మానవలోకముపై రాల్చినాను, అయినను దాని నాశ్రయించివా డొక్కడును కానరాలేదు; అధికస్య, ప్రతి యొక్కడును ఐక్యతామధువును వీడి, కలుషితమాలిన్యశేషము దెసకే తిరిగినాడు; మృతపాత్ర పానముతో తృప్తినొంది, అమర సౌందర్యకలశమును దూరము చేసికొనినాడు. ఆతడు సంతుష్టినొందినది నైచ్యముతోనే.

62

ఓ ధూళీపుత్రుడా!

అమరప్రియుని అతులితమధువునుండి నీ నేత్రములను మరల్పకు, వాటితో దుర్గంధ భూయిష్ట కలుషితశేషము నవలోకింపకు. దివ్యపాత్రధరుని హస్తములనుండి అమృతజీవనకలశము నందుకో, తద్వారా సమస్తజ్ఞానము నీదగును, అగోచరప్రపంచపు టద్భుతస్వనమును నీవాలకింప వచ్చును. అల్పాశయము కలవారలారా, నినదింపుడు! బుద్బుదప్రాయపు నీరము నాశించి, నా పవిత్రామృతమధువునకు విముఖు లైతిరేల?

63

ఓ ప్రపంచజనులారా!

ఊహింపరాని యుపద్రవము మిమ్మనుసరింపుచున్నదనియు, ఘోరదుష్పరిణామము మీకై నిరీక్షింపుచున్నదనియు నిశ్చయముగ తెలిసికొనుడు. మీరొనరించినది నా దృష్టినుండి చెఱగి పోయినదని భావింపవలదు. నా సౌందర్యము సాక్షిగా! మీ చేష్టల నన్నింటినీ నా లేఖిని చంద్రకాంత మణిఫలకము లపై విస్పష్టవర్ణములతో చెక్కియుంచినది.

64

ఓ భూమిపైనున్న నిరంకుశులారా!

నిరంకుశత్వమునుండి మీ హస్తముల నుపసంహరింపుడు; ఏలయన, ఎవ్వని యన్యాయము నైనను సహియింపరాదని ప్రతిన బూనితిని. నేను భద్రఫలకమున తిరుగులేని విధముగ తీర్మా నించి, ముద్రాంకిత మొనరించిన యొడంబడిక యిది.

65

ఓ విద్రోహులారా!

మీరు వ్యామోహప్రేరితాశ్వమును ప్రేరేపించి, వినాశమునకు గొంపోవు హానికర మార్గముల యందున స్వారియై వెడలు నంతగా నా యోరిమి మిమ్ము ధైర్యస్తులను గావించినది, నా సుదీర్ఘ క్లేశము మిమ్ము నిర్లక్ష్యుల నొనరించినది. నేను ఉదా సీనుడననియో, అవగాహనాశూన్యుడ ననియో యెంచితిరా?

66

ఓ ప్రవాసులారా!

నన్ను స్మరియించు నిమిత్తము నేను సృజియించిన జిహ్వను నిందాస్తుతితో, మలినము గావింపవలదు. అహంకారాగ్ని మిమ్మా వరించినచో, మీ స్వీయాపరాధములనే మననము చేసికొనుడు, కాని నాసృజితుల దోషములను కాదు; ఎంత యేని, మీలో ప్రతి యొక్కడును అన్యుల దోషములకన్నను తన దోషములనే లెస్సగ నెఱుగును.

67

ఓ మోహపూరితసంతానమా!

అనంతపావనక్షితిజముపై ప్రభాతప్రకాశాగమనముతో పైశాచిక రహస్యములును, చీకటితెర మాటున గావించిన కృత్యములును పూర్ణబహిర్గతములై, ప్రపంచజనుల యెదుట ప్రత్యక్షీకృతము లగు నని నిశ్చయముగ తెలిసికొనుము.

68

ఓ మృణ్మయోద్భవ కలుపుమొక్కా!

నీ యీ మలినహస్తములు తొలుదొల్త నీ వస్త్రమును స్పృశియింపకనే, కలుషిత హృదయముతో, వాంఛాకాముకుడవై నాతో సంలీనత నొందవలెనని, నా పావనసామ్రాజ్యములోనికి ప్రవేశింపవలెనని యెంతువేల? నీవాశించిన దానికి నీవు దూరముగ, సుదూరముగ నున్నాడవు.

69

ఓ ఆదాముసంతానమా!

పవిత్రవచనములును, నిర్మల దైవికకృత్యములును మహోత్కృష్ట కీర్తిస్వర్గమున కధిరోహించును. మీ కార్యములు అహము, కపటముల ధూళినుండి క్షాళితములై, కీర్తి మండ పానుగ్రహము నొందునటుల యత్నింపుడు; ఏలయన, అచిరకాలమునకే పూజనీయుని సాన్నిధ్యమున పరిపూర్ణ సద్గుణములను, అమలిన నిర్మలకృత్యములనుదక్క దివ్య పరిశీలకు లన్యము నామోదింపరు. భగవదేచ్ఛా దిఙ్మండలముపై శోభిల్లిన దివ్యమర్మవివేకపు వేగుచుక్క యిది. దీని నాశ్రయించినవారు పునీతులు.

70

ఓ ప్రాపంచికపుత్రుడా!

సాధింప నెంచితివేని అస్తిత్వప్రపంచ మెంతయో మనోహరము; నశ్వరలోకము నధిగమింప నెంచితివేని, అనంతసామ్రాజ్య మత్యంతశోభాయమానము; పరమోత్కృష్ట యువకుని హస్తముల యందలి అద్భుతకలశస్థితమధువును గ్రోలితివేని, దివ్యానందము మధురతరము. ఈ స్థితి నొందితివేని, మృత్యు వినాశములనుండియు, వ్యధాపరాధములనుండియు నీవు ముక్తుడవగుదువు.

71

ఓ నా మిత్రులారా!

పరాను పర్వతముపై మీరు నాతో చేసికొనిన యొడంబడిక, పవిత్ర జామానుసీమలలో ప్రతిష్ఠితమైనదని స్మృతికి తెచ్చుకొనుడు. ఊర్ధ్వలోకవాసులను, అమరపురనివాసులను నేను సాక్షులుగా గైకొంటిని, అయినను, మీయందెవ్వడును ఒడంబడికకు విధేయుడై యుండుట నాకిప్పు డగుపించుటలేదు. నిక్కముగా గర్వము, తిరుగుబాటు – దీనిని లేశమాత్రపు టానవాలునైనను మిగులనీయక హృదయములనుండి చెఱిపివైచినవి; దీని నెఱిగియుండియు, నిరీక్షించితినే తప్ప, నేనెవ్వరికిని బహిర్గత మొనరింపలేదు.

72

ఓ నా భృత్యుడా!

చక్కగా పదునుపెట్టబడి, తన యొఱచీకటిలో దాచబడియున్న ఖడ్గమువంటి వాడవీవు; దాని శిల్పికి సహితము దాని విలువ తెలియదు. నీ విలువ ప్రజ్జ్వరిల్లి యావత్ప్రపంచమునకును విదితమగునటుల, ఆశాపాశముల యొఱనుండి వెలికి రమ్ము.

73

ఓ నా హితుడా!

నా పావనస్వర్గములకు వేగుచుక్కవీవు, దాని శోభను ఈ ప్రాపంచిక కలుషితముచే మఱుగున పడనీయకు. నీవు మేఘముల చాటునుండి శోభాయమానుడవై వెలికి వచ్చి, జీవితవస్త్రముచే సకలాంశములను చక్కదిద్దుకొనునటుల, ఉదాసీనతాముసువును చీల్చి దూరముగ విసరివేయుము

74

ఓ శుష్కకీర్తిసంతానమా!

నిమేషమాత్రపు టధికారమునకై, మీరు నా యనిమేషసామ్రాజ్యమును వదిలినారు, ప్రాపంచికములగు బహువర్ణవస్త్రములతో శృంగారించుకొని వట్టి గొప్పలను చాటుచుంటిరి. నా సౌందర్యము సాక్షిగా! నేను సకలమును ఏకవర్ణక ధూళీకవచములోనికి సమీకరించి, నేనెంచినవానిని, ప్రతివర్ణమునుండి బహిష్కృతములగుచున్న వానిని దక్క యీ భిన్నవర్ణము లన్నింటిని తుడిచివైచెదను.

75

ఓ నిర్లక్ష్యసంజాతులారా!

క్షణికపుటధికారముపై యపేక్షను పెంచుకొని, దానితోనే మోదము నొందవలదు. మృత్యువను బోయవాడు ఆకస్మికముగ తనను నేలగూల్చి రంగు, రాగము, రూపములనునవి మచ్చునకైనను మిగులకుండునటుల చేయునంతవరకు ప్రమత్తయై ప్రశాఖపై ప్రకంపనస్వనముతో పాడుకొను అజాగరూక పక్షి వంటివారు మీరు. కావున, ఓ భవపాశబంధిత బానిసలారా! జాగరూకులు కండు.

76

ఓ నా సేవికాపుత్రుడా!

మార్గదర్శనము సదా మౌఖికముగనే యివ్వబడుచున్నది తప్ప కార్యరూపముగ కాదు. మాటలు యెల్లరి సొత్తైనను, యిట్టి కార్యములు మా ప్రేమికులకే స్వంతము కనుక, మీలో ప్రతి యొక్కరును స్వఛ్ఛమైన, పవిత్రమైన కార్యములనే కనపరుపవలె. మనఃపూర్వకముగ మీ కార్యములచే శ్రేష్ఠతనొంద యత్నించి, ప్రత్యేకతను సంతరించుకొనుడు. ఇవ్విధముగ యీ శోభాయమాన పవిత్రఫలకమున మీకుపదేశింపుచుంటిమి.

77

ఓ న్యాయపుత్రుడా!

యామినివేళయందున అనంతజీవనసౌందర్యుడు విశ్వాసమరకతశిఖరమునుండి సద్రత్- ఉల్-ముంతహా వైపుకువెడలి, యెంతగ విలపించెననిన, ఆయన విలాపమును గాంచి ఊర్ధ్వలోక దేవసముదాయము, సమున్నతలోకవాసులు సహితము రోదించిరి. అటుపై యావిలాపములు, శోకములేల? యని యడుగనైనది. ఇటుల బదులిడినా డాయన: ఆజ్ఞా బద్ధుడనై, ఆకాంక్షతో విశ్వసనీయతాశైలముపై నిరీక్షించితిని; కాని, భూలోకవాసులనుండి విధేయతాపరిమళమును నేనాఘ్రా ణింపలేదు. మరలి రమ్మను పిలుపునొంది బయల్వెడలునంత, అదిగో! భౌతికశునకముల నఖపంజరములయందున చిక్కి, మిక్కిలి వెతనొందుచున్న పవిత్రకపోతములను కొన్నింటిని వీక్షించితిని. తదనంతరము, స్వర్లోకపరిచారిక ముసువును వీడి, తన మర్మహర్మ్యమునుండి ప్రజ్జ్వలితయై వెలికివచ్చి, వాటి నామములేమని యడుగ, ఒక్కటితప్ప అన్నియును చెప్పబడినవి. అభ్యర్థింపగా, దాని ప్రథమాక్షర ముచ్చరింప బడినది; వెంటనే యుత్కృష్టగృహవాసులు తమ యమర ధామములనుండి పరువిడి ముందుకువచ్చిరి. ద్వితీయాక్షర ముచ్చారిత మైనయంతనే వారందరికందరు మట్టిలో పడి పోయిరి. ఆ క్షణమున దైవపీఠాంతరాళమునుండి: "ఇంతియ చాలు, ఇక ముందుకులే," దను స్వరమొక్కటి విననైనది. నిశ్చయముగ, వారొనరించిన దానికిని, ఒనరింపుచున్నదానికిని మేము సాక్ష్యమును వహియింపుచున్నాము.

78

ఓ నా సేవికాపుత్రుడా!

దయామయుని జిహ్వనుండి జాలువారు దివ్యాద్భుత సెలయేరును పానము చేయుము; దివ్యోచ్చారణా ప్రభాతమునుండి, తెర దొలగిన వివేకపు వేగుచుక్కశోభను దర్శించుము. నా దివ్యవివేక బీజములను నిర్మలహృద్భూమియందున విత్తి, వాటిని దృఢవిశ్వాసనీరముతో పెంచుము; తద్వారా, జ్ఞానవివేకములను విశేషపుష్పములు పావనహృదయసీమనుండి స్వచ్ఛములై, హరితములై యుద్భవించు గాక.

79

This language is missing a translation for this Hidden Word

O SON OF DESIRE!

How long wilt thou soar in the realms of desire? Wings have I bestowed upon thee, that thou mayest fly to the realms of mystic holiness and not the regions of satanic fancy. The comb, too, have I given thee that thou mayest dress My raven locks, and not lacerate My throat.

80

ఓ నాసేవకులారా!

మీరు నా యుపవనతరులు; మీకును, ఇతరులకును ప్రయోజనకరములగు శ్రేష్ఠ, అద్భుతఫలముల నిండు. ఓ అవగాహనాశక్తిగల మనుష్యులారా! అవ్విధముగ వృత్తియందునను, కళలయందునను నియతులగుట ప్రతియొక్కరి విధి, ఏలయన సంపద్రహస్యములందే దాగి యున్నవి. ఫలితమునకు, వనరులపై యాధారపడవలె; భగవంతుని యనుగ్రహమిక మీపై సమృద్ధిగ నుండగలదు. ఫలములీనని తరువు లపుడును, ఇక ముందును దహనయోగ్యములే.

81

ఓ నా భృత్యుడా !

భువిలో నిష్క్రియాపరులు మానవులలోకెల్ల అతిక్షుద్రులు. నిక్కముగా, అట్టి మనుష్యులను మృతులుగ గణియింపనైనది, అంతియేకాదు, నిర్వ్యాపారులకన్నను, నిష్క్రియాపరులకన్నను మృతులే పరమాత్ముని దృష్టిలో మిన్న.

82

ఓ నా భృత్యుడా!

సకల లోకాధీశుడగు ఆ దేవదేవుని ప్రేమకై, తమ వృత్తిమూలమున జీవనభృతి నార్జించి, తమకై, తమవారి నిమిత్తమై వెచ్చించువారు మానవులయం దుత్తములు.

మున్ను ఉచ్చారణాచ్ఛాదనముక్రింద గుప్తపరుపబడిన అలౌకికాద్భుత దివ్యవధువిపుడు భగవదనుగ్రహాన్వితయై, ఆయన దివ్యవదాన్యతను వడసి పరమప్రియుని సౌందర్యతేజోకాంతులు విరాజిల్లగ ప్రత్యక్షీకరణము గావింపబడినది. ఓ మిత్రులారా! అనుగ్రహము పూర్ణమై, వాదము పరిపూర్ణమై, దృష్టాంత మభివ్యక్తమై, నిదర్శనము స్థాపితమైన దనుటకు సాక్ష్యమును వహియింతును. ఇప్పుడిక పరిత్యాగపథమున మీ యత్నము యేమి ఫలములీనునో చూడవలసి యున్నది. దివ్యానుగ్రహ మివ్విధముగ మీకును, భూ స్వర్గముల యందున్న వారికిని సంపూర్ణముగ ప్రదానము చేయబడినది. సకలప్రశస్తియు సమస్తలోకాధీశుడగు ఆ భగవంతునిదే!

Bahá'u'lláh

Windows / Mac