The Universal House of Justice
Ridván 2019
To the Bahá’ís of the World
Dearly loved Friends,
మహత్తర పర్వదినం సమీపించడంతో, మేము కృతజ్ఞతాపూర్వక, ఆశాభావయుత అనుభూతులతో పరవశించాం——కృతజ్ఞత, బహాఉల్లా తన అనుయాయులతో సాధింపచేసిన అద్భుతాలకూ; ఆశాభావం, సమీపభవిష్యత్తు సన్నద్ధం చేసి ఉంచిన దానికీని.
ప్రపంచవ్యాప్త బహాఉల్లా ద్విశతజయంత్యుత్సవాలు కలిగించిన ప్రేరణ, ఆనాటినుండీ పెరుగుతూనే వచ్చింది. బహాయి సమాజపు సత్వరాభివృద్ధీ, విస్తరిస్తున్న దాని సామర్ధ్యమూ, తన సభ్యులలో అధిక సంఖ్యాకుల శక్తిసామర్ధ్యాలను వినియోగించుకోవడంలో దానికి గల దక్షతా, ఈ మధ్యకాలంలో దాని అంతర్జాతీయ ఫలిత సాధనల సారాంశంనుండి విస్పష్టంగా వెల్లడౌతున్నాయి. వీటిల్లో, సమాజనిర్మాణ కార్యకలాపాలలో పెరుగుదల, ప్రత్యేకించి ఆకట్టుకుంటున్నది. ఈ కార్యకలాపాలను సక్రమవిధానంలో సంస్కరించి, హెచ్చించడానికి బహాయి ప్రపంచం ఇరవయ్యేళ్లుగా చేస్తూ వచ్చిన కృషిని, ప్రస్తుత పంచవర్ష ప్రణాళిక అనుసరిస్తున్నది. అయితే, ఆశ్చర్యకరంగా, ప్రణాళిక తొలి రెండున్నర సంవత్సరాలలోనూ, ప్రధానకార్యక్రమాల సంఖ్యే సగాన్ని మించిపోయింది. ఆధ్యాత్మిక వాస్తవాలను సంశోధించి, స్పందించడంలో పది లక్షలకన్నా ఎక్కువమందికి తోడ్పడుతూ, అటువంటి కార్యకలాపాలలో వారు ఏ సమయంలోనైనా పాల్గొనేలాచేసే సామర్ధ్యాన్ని ప్రపంచవ్యాప్త బహాయి సమాజం ప్రదర్శించింది. ఆ కొద్దిపాటి సమయంలోనే, ప్రార్థనాసమావేశాల సంఖ్య దాదాపుగా రెండింతలైంది. ఆశాభావానికీ, అనుగ్రహానికీ ‘మూలమూర్తి’ పట్ల మానవులలో పెరుగుతున్న విముఖతకు అత్యంతావశ్యకమైన ప్రతిస్పందన యిది. ఆధ్యాత్మిక సమావేశాలు సమాజజీవితంలో నవ్యస్ఫూర్తిని నింపుతాయి కనుక, ఈ పరిణామంలో ఒక విశేషసూచన ఉన్నది. అన్ని వయస్సులవారి విద్యాయత్నాలతో సమ్మిళితాలైన అవి: దైవారాధన, మానవసేవలపరంగా తమకంటూ ఒక విశిష్టతను సంతరించుకున్న సమాజాలను ప్రోత్సహించడం లాంటి యత్నాల ఉదాత్తాశయాన్ని పటిష్టపరుస్తాయి. బహాయి కార్యకలాపా లలో అధికసంఖ్యాకుల భాగస్వామ్యం స్థిరంగా కొనసాగింపు కాబడుతున్నటువంటి, మిత్రులు సమాజాభివృద్ధికి సంబంధించిన మూడవ మజిలీని దాటినటువంటి సముదాయాలలోకన్నా, ఇదింకెక్కడా యింత ప్రస్ఫుటంగా లేదు. అభివృద్ధి ప్రక్రియ ప్రణాళికారంభంనుండి ఈ స్థాయికి పురోగమించిన సముదాయాల సంఖ్య రెండింతలను మించిపోయి, ఇప్పుడు దాదాపు ఐదువందల దగ్గర నిలిచి ఉండడం మాకు సంతోషంగా ఉంది
ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరివర్తనాస్థాయికి, ఈ సంగ్రహ పరిశీలన న్యాయం చేయజాలదు. ప్రణాళికలో మిగిలిన రెండేళ్ల భవితా మహోజ్జ్వలంగా ఉంది. మేమనుకున్నట్టే, పరిజ్ఞానానికీ, వనరులకూ భాండారాలైన సముదాయాలలోని దృఢతర అభివృద్ధి కార్యక్రమాల నుండి నేర్చుకున్న పాఠాలకు విస్తృత ప్రచారాన్ని కల్పించడంద్వారా, గత సంవత్సరంలో ఎంతో సాధించడం జరిగింది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలోని మిత్రులూ ఈ జ్ఞానార్జనావేగంవల్ల లబ్ధిని పొందగలిగేలా, ఏర్పడుతున్న అవగాహనలను తమ వాస్తవస్థితులకు అనువర్తించుకునేలా చూడడంలో అంతర్జాతీయ బోధనాకేంద్రం, సలహాదారులు, అలుపెరగని - వారి సహాయకులు ఎంతవరకైనా వెళ్లారు. తమ పరిసరాలలో అభివృద్ధిప్రక్రియ పురోగమించేందుకు, ఏ నిర్దిష్ట సమయంలో, ఏం కావాలో కార్యరూపేణానూ, సమీక్షాత్మకంగానూ తెలుసుకుంటూ ఉండే మిత్రుల కేంద్రకం - సంఖ్యాత్మకంగా పెరుగుతున్న సముదాయాలలోనూ, వాటిలోని సామీప్యప్రాంతాలోనూ, గ్రామాలలోనూ - ఏర్పడుతూ ఉండడం మాకు ఆనందంగా ఉంది. సమాజపు టాధ్యాత్మిక, భౌతికాభ్యుదయానికి తోడ్పడే సామర్ధ్యాన్ని పెంపొందించిన శిక్షణాసంస్థానమనే శక్తివంతమైన సాధనాన్ని వారు వినియోగించుకుంటున్నారు; వారు (తదనుగుణంగా) వ్యవహరించేకొద్దీ వారితో కలిసివచ్చేవారి సంఖ్య పెరుగుతూ ఉంది. సహజంగానే, ప్రదేశానికీ ప్రదేశానికీ అభివృద్ధిపరమైన లక్షణాలలాగే, పరిస్థితులూ వేరువేరుగా ఉంటాయి, అయినా, సక్రమకృషితో, ప్రస్తుత కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఎంతో ప్రభావపూర్వకైమెన తోడ్పాటును అందించగలరు. ఎదుటివారిని, వెనువెంటనేకానీ, క్రమక్రమంగా కానీ, సున్నిత ఆధ్యాత్మిక భావసంచలనానికి దారితేసే అర్ధవంతమైన, ఉత్తేజపూరితములైన చర్చల్లో నిమగ్నులను చేయడంలోని నిజమైన ఆనందం ప్రతిచోటా, నెలకొనే ఉంది. విశ్వాసి మనస్సులో అగ్ని ఉజ్జ్వలంగా రగుల్కొల్పబడేకొద్దీ, దాని వెచ్చదనం సోకినవారికి అనుభవైక వేద్యమయ్యే ఆకర్షణాశక్తి అంత మహత్తరంగానూ ఉంటుంది. ఇక బహాఉల్లా పట్ల ప్రేమతో నిండిపోయిన మనస్సుకు - భావసారూప్యులకై అన్వేషించడం, వారు సేవాపథంలో ప్రవేశిస్తున్నప్పుడు వారిని ప్రోత్సహించడం, వారు అనుభవాన్ని సంతరించుకుంటున్నప్పుడు వారికి తోడ్పాటును అందించడం, ఇంకా——బహుశః, అన్నింటికన్నా మహదానందకరం——వ్యక్తులు తమ విశ్వాసపరంగా దృఢీకృతులై, స్వతంత్రంగా సముద్యమించి, సాటివారికీ అదే పయనంలో తోడ్పాటునందించడాన్ని చూడడానికన్నా - సముచితమైన మరే వ్యాసంగాన్ని ఊహించవచ్చు! ఈ అశాశ్వతజీవితం కల్పించగల ఘట్టాలన్నింటిలోకి ఇవెంతో అపురూపమైనవి.
ఈ ఆధ్యాత్మిక బృహత్కార్యాన్ని కొనసాగించడానికి గల అవకాశాలు బాబ్ ద్విశతజయంతి సమీపిస్తుండడంతో మరింత ఉద్వేగ భరితాలైనాయి. దానికి ముందు వచ్చిన ద్విశతజయంతి లాగే, ఈ వార్షికోత్పవ మొక అపూర్వసందర్భం. తమ చుట్టూ ఉన్నవారిని - భగవంతుని మహాయుగానికీ, ప్రపంచ దిఙ్మండలాన్ని శోభాయమానం గావించిన మహాతేజోమూర్తులైన, భగవంతుని రెండు దివ్యావతారాల ఆవిర్భావంతో సూచితమైన పరమానుగ్రహపు టసాధారణ స్రవంతికీ - మేల్కొల్పగలిగే మహాద్భుతావ కాశాలను యిది బహాయిలందరికీ కల్పిస్తుంది. రెండేళ్లక్రితంనాటి ద్విశతజయంతి అనుభవం దృష్ట్యా, రాబోయే రెండు ఆవృత్తాలలోనూ సాధ్యపడనున్న దాని పరిమాణం అందరికీ తెలిసిందే; ఇక ఆ సందర్భంగా నేర్చుకున్న దంతా, ఈ ఏడాది పవిత్రజయంతుల ద్వయానికి వేయబోయే ప్రణాళికలలో వినిమయం కాబడాలి. ద్విశతవత్సర వార్షికం సమీపిస్తుండగా, బాబ్‌ను సముచిత రీతిన గౌరవించడానికి మీరు చేసే యత్నాలు, ఆయనచే పూర్వసూచితమైన దివ్యధర్మాన్ని పురోగమింప చేయడంలో విజయవంత మౌతాయని పవిత్రసమాధుల సమక్షంలో, మీ పక్షాన ఎప్పటికప్పుడు ప్రార్థనలను అర్పిస్తాం.
రచనాత్మక యుగపు తొలి శతాబ్దానికి ముగింపుకు రెండున్నరేళ్ల వ్యవధి ఉంది. దివ్యధర్మపు ధీరోదాత్తయుగంలో వేయబడిన త్యాగప్రపూరిత పునాదిని దృఢీకరించి, విస్తరించడానికి సంబంధించిన నూరేళ్ల నిబద్ధతాయుత కృషికి అది ముగింపును పలుకుతుంది. ఆ సమయంలో బహాయి సమాజం అబ్దుల్-బహా దివ్యారోహణ (నిర్యాణం) - అలౌకిక యశోలోకములయందున్న తన తండ్రి ని తిరిగి కలుసుకునేందుకై ఈ ప్రాపంచిక బంధాలనుండి ప్రియగురువర్యుడు విముక్తుడైన ఘడియ - శతవార్షికాన్ని పాటిస్తుంది. ఆ మరునాడు జరిగిన, ఆయన అంత్యక్రియలవంటి ఘట్టాన్ని – “పాలస్తీనా ఎన్నడూ చూసి ఉండలేదు”. దాని తుది అంకంలో, ఆయన భౌతికావశేషాలను బాబ్ స్మారకమందిరం (దివ్యసమాధిమందిరం) లోని ఒక భూగర్భపుటరలో స్థాపితం చేయడం జరిగింది. అయితే, షోఘి ఎఫెండీ దానినొక తాత్కాలికైమెన ఏర్పాటుగానే పరిగణించడం జరిగింది. అబ్దుల్-బహా విశిష్ట స్థానానికి సముచిత స్వాభావికతతో, దివ్యసమాధి ఒకటి, తగిన సమయంలో నిర్మితం కావలసి ఉన్నది.
ఆ సమయం వచ్చింది. ఆ పవిత్రావశేషాలను శాశ్వతంగా నిక్షిప్తపరచుకునే కట్టడాన్ని నిర్మించవలసిందిగా బహాయి ప్రపంచానికి పిలుపు నివ్వడం జరుగుతున్నది. రిద్వాన్ ఉద్యాన సమీపంలో, శుభసౌందర్యుని అడుగుజాడలతో పునీతమైన భూభాగంమీద అది నిర్మితం కావాలి; అబ్దుల్-బహా దివ్యసమాధి ఆ విధంగా అక్కా, హైఫాలలోని పవిత్ర దివ్యసమాధులకు మధ్యగా అన్వేషితమైన చంద్రవంక మీద నెలకొంటుంది. నిర్మాణప్రణాళికలపై పని సాగుతున్నది, రాబోయే మాసాలలో మరింత సమాచారాన్ని పంచుకోవడం జరుగుతుంది.
రానున్న సంవత్సరం గురించీ, అది సూచిస్తున్న దాన్నంతటి గురించీ సమాలోచిస్తున్నకొద్దీ, అంతులేని ఆనందానుభూతులు మాలో ఎగసిపడుతున్నాయి. దేశదేశానా శాంతి ఉద్యమానికై శ్రమిస్తూ, బహాఉల్లాకు సేవలను అందించడంలో నిమగ్నులై ఉన్న మీలో ప్రతి ఒక్కరూ, మీ మహోదాత్త లక్ష్యాన్ని నెరవేరుస్తారని ఆశిస్తున్నాం.
- The Universal House of Justice