Return   Facebook   Zip File

The Kitáb-i-Aqdas

1

భగవంతుడు తన భృత్యులకు విధియించిన ప్రథమ కర్తవ్యము: తన దివ్యావిష్కరణమునకు అరుణోదయమును, తన శాసనోద్భవము నకు స్రవంతియును, తన దివ్యధర్మ సామ్రాజ్యము, సృష్టి ప్రపంచము రెండింటియందునను దివ్యత్వమునకు దౌత్యకర్తయగు ‘ఆయన’ ను గుర్తించుట. ఈ కర్తవ్యమును నెరవేర్చినయాతడు సకల శుభసాధకుడు; తద్విహీనుడెంతటి సత్కార్యకర్తయైనను, దాని నుండి వైదొలగినట్లే. ఈ మహోత్కృష్ట స్థానమును, ఈ మహామహిమోపేత శిఖరమును అందుకొనిన ప్రతియొక్కడును, లోకాపేక్షితుడగు ‘ఆయన’ ప్రతి శాసనమును పాటింపవలె. ఈ కర్తవ్యద్వయ మవిభాజ్యము. ఇందేదియును రెండవది లేకుండ అంగీకారయోగ్యము కాదు. దివ్యప్రేరణకు మూలాధారుడగు ‘ఆయన’ చే నివ్విధముగ నాదేశింపబడినది.

2

భగవంతునిచే నంతర్దృష్టి ప్రసాదింపబడినవారు, ఈ ప్రపంచ సంవిధాన సంరక్షణకు, దీని ప్రజాభద్రతకు అత్యుత్తమ సాధనములుగ భగవంతుడేర్పరచిన ధర్మసూత్రములను యిట్టే గ్రహియింతురు. వాటినుండి వైదొలగినవా డధములయందునను, అవివేకుల యందునను ఒకనిగ గణియింపబడును. మీ దుర్మోహముల, నికృష్ట వాంఛల యాదేశములను తిరస్కరింపుడనియు, మహోన్నతుని దివ్యలేఖిని స్థిరీకృతమొనరించిన హద్దులు సకల సృజితములకును జీవనశ్వాస యగుటచే, వాటిని మీరవలదనియు, మేము నిశ్చయముగ మిమ్మాదేశించినాము. సకల దయామయుని ఉచ్ఛ్వాసమారుతమునుండి దివ్య జ్ఞాన, దివ్యభాషణా సాగరము లుద్భవించినవి. ఓ విజ్ఞులారా ! అత్యధికముగా సేవించుటకై త్వరనొందుడు. భగవంతుని యాదేశముల నతిక్రమించుట ద్వారా ‘ఆయన’ దివ్యఒడంబడిక నుల్లంఘించి తిరోగమించిన వారు సమస్త సంపన్నుడూ, సర్వోన్నతుడూనగు భగవంతుని దృష్టియందున మహాపరాధము నొనరించినారు.

3

ఓ ప్రపంచ జనులారా! నా యాదేశములు నా భృత్యుల యెడ నా ప్రేమాన్వితానుగ్రహ దీపికలనియు, నా సృజితజీవులకు నా కరుణాన్విత కుంచిక(తాళపుచెవి) లనియు నిశ్చయముగ తెలిసికొనుడు. ఆవిష్కరణాధిపతి యగు భగవంతుని యిచ్ఛాస్వర్గము నుండి ఇవ్విధముగ నిది యనుగ్రహీతమైనది. సకల దయామయుని యధరము లుచ్చరింపనెంచిన పదముల మాధుర్యము నే మానవుడైనను చవిచూచెనేని, ‘ఆయన’ ఔదార్యోపేత సంరక్షణ, ప్రేమోపేత కారుణ్యముల అరుణోదయముపై శోభిల్లు ‘ఆయన’ యాదేశముల యందలి ఏ యొక్కదాని సత్యనిరూపణకైనను - భూలోకమందలి సకలసంపదలును తన యాధీనమందున్నను వానినన్నింటిని త్యజియించును.

4

వచించు : నా శాసనముల నుండి, నా వస్త్రపు సుమధురపరిమళము నాఘ్రాణింపవచ్చును, వాటి సాహాయ్యమున మహోన్నత శిఖరములపై విజయధ్వజములను నిలుపవచ్చును. నా సర్వశక్తియుతమహిమాన్విత స్వర్గమునుండి నా యధికారవాణి నా సృష్టి నుద్దేశించి ఇవ్విధముగ పలికినది: “నా సౌందర్యాపేక్షకై నా యనుశాసనముల ననుసరింపుడు.”౎ ఏ జిహ్వయును వర్ణింపజాలని కారుణ్యసౌరభ ప్రపూరితములగు యీ ప్రవచనముల నుండి పరమప్రియతముని దివ్యపరిమళము నాఘ్రాణించిన ప్రేమికుడు సంతోషాన్వితుడు. నా జీవితము సాక్షిగా ! నా దయానుగ్రహయుత హస్తముల నుండి న్యాయమను శ్రేష్ఠమధువును గ్రోలిన యాతడు నా సృష్ట్యోదయమున కెగువన శోభిల్లు నా యనుశాసనముల చుట్టును పరిభ్రమించును.

5

మేము మీకై కేవలమొక ధర్మస్మృతిని వెలువరించితిమని యెంచ వలదు. వాస్తవమునకు, శక్త్యధికారములనెడు యంగుళులచే దివ్యమదిరా భాండమును వివృత మొనరించినాము. దివ్యావిష్కరణ లేఖిని వెలువ రించినదే ఇందుకు సాక్ష్యమును వహియింపుచున్నది. అంతర్దృష్టియుతులారా! ఇందుపై పర్యాలోచింపుడు.

6

దివ్యప్రవచనావిష్కర్తయగు భగవంతునికి ఉదయ, మాధ్యాహ్నిక, సాయంకాలములయందున అర్పించుటకై తొమ్మిది ‘రకాహ్’ లతో అనివార్య ప్రార్థనను మీకు నిర్దేశించినాము. భగవంతుని దివ్యగ్రంథము నందలి యాదేశముగా, అసంఖ్యాక ప్రార్థనల నుండి మిమ్ము విముక్తులనొనరించినాము. నిశ్చయముగా, ‘ఆయన’ నిర్దేశకుడు, సర్వశక్తివంతుడు, అనిర్బంధనుడు. మీరీ ప్రార్థన చేయనెంచినప్పుడు - ఊర్ధ్వలోక నివాసులు ప్రదక్షిణ మొనరించునదియును, అమరపురజనుల కారాధనా కేంద్రముగ నిర్దేశిత మైనదియును, సమస్త భూ స్వర్గవాసులకు ఆదేశమూలమును అగు ఈ పునీత స్థానము దెసకు, నా పరమ పవిత్ర ప్రత్యక్షతా స్థానము వంకకు అభిముఖులు కండు; దివ్యసత్య, దివ్యోచ్చారణా సూర్యుడస్తమించినపుడు, మేము మీకై నిర్దేశించిన యట్టి దివ్యస్థలి వైపునకు మీ వదనములను సారింపుడు. నిశ్చయముగ, ‘ఆయన’ సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు.

7

అప్రతిహతమగు ‘ఆయన’ యాదేశమునుండియే సమస్తమును ఆవిర్భవించినది. నాదగు ఉచ్చారణా స్వర్గమున సూర్యుని వోలె నా శాసనము లగుపించునపుడు, అవి - నా తీర్పు ప్రతి మతధర్మపు స్వర్గమును ఛిన్నాభిన్నమగు నట్లొనరించునదైనను - ప్రతి యొక్కనిచేతను విధేయతా పూర్వకముగ ననుసరింపబడవలె. ‘ఆయన’ తనకు ప్రమోదకరమగు దానినే నిర్వర్తించును. ఎంచుకొనువా ‘డాయన’, ఆయన ఎంపిక నెవ్వరును ప్రశ్నింపలేరు. పరమ ప్రియతముడగు ‘ఆయన’ నిర్దేశించినదేదైనను, నిశ్చయముగ ప్రియతమమే. సకలసృష్ట్యాధినాధుడగు ‘ఆయన’ నన్నిందులకు సాక్ష్యముగ నిలిపినాడు. సకల దయామయుని మధుర పరిమళము నాఘ్రాణించి, ఈ ఉచ్చారణామూలమును గ్రహియించిన యాతడు తన స్వీయనేత్రములతో శత్రుశూలములను స్వాగతించును, తద్వారా దైవశాసనముల సత్యమును మానవాళియందున సంస్థాపింపగలడు. వాని నాశ్రయించి, ‘ఆయన’ స్థిరనిర్ణయపు టాంతర్యమును గ్రహియింప గల్గినవానికి శుభమగు గాక !

8

అనివార్య ప్రార్థనా వివరములను మేమింకొక దివ్యఫలకమునందు వెల్లడించినాము. సకల జనపాలకుడగు ‘ఆయన’ యాజ్ఞాపితమును పాలించు నాతడు ధన్యుడు. దివంగతుల కొరకైన ప్రార్థన యందలి ఆరు నిర్దిష్ట గ్రంథ భాగములు దివ్యప్రవచనావిష్కర్తయగు భగవంతునిచే ననుగ్రహింపబడినవి. పఠియింపగలవా డీరచనా భాగములకు పూర్వభాగముగ వెలువరింపబడిన దానిని రాగయుక్తముగ నాలపింపవలె; అట్లొనరింపలేని యాతని నా యావశ్యకత నుండి భగవంతుడు విముక్తుని గావించినాడు. సత్యముగా ‘ఆయన’ శక్తివంతుడు, క్షమాపకుడు.

9

కేశములైనను, జీవరహితములగు నస్తికలవంటివైనను నీ ప్రార్థనను భంగము గావింపనేరవు. బీవరు (మూషిక జాతికి చెందిన ఒక విధమైన జంతువు), ఉడుత, యింకను యితర జంతువుల యున్నిని మీరు ధరియింపవచ్చును. వీని యుపయోగముపై గల నిషేధము, ఖురాన్ నుండి కాక, మతాచార్యుల విపరీత వ్యాఖ్యల మూలమున వచ్చినది. నిశ్చయముగా, ‘ఆయన’ సకల మహిమాన్వితుడు, సర్వజ్ఞుడు.

10

యుక్తవయస్సారంభమైననాటి నుండి ప్రార్థన చేయుమని, ఉపవ సింపుమని మేము నిన్నాదేశించినాము; నీ ప్రభుడును, నీ పూర్వీకుల ప్రభుడును అగు భగవంతునిచే నిది నిర్దేశితమైనది. అనారోగ్యముచే, లేక వృద్ధాప్యముచే దుర్బలులైన వారిని ‘ఆయన’ తన సాన్నిధ్యానుగ్రహముగ, దీనినుండి మినహాయించినాడు; ‘ఆయన’ క్షమాదాత, దయాళువు. పరిశుభ్రమగు స్థానమెందైనను సాష్టాంగ ప్రణామము నొనర్చుటకు భగవంతుడు మీ కనుమతి ననుగ్రహించినాడు, ఏలయన ఇందుకు సంబంధించి దివ్య గ్రంథమునందేర్పరుపబడిన నియమమును మేము తొలగించినాము; మీరెరుగనిది, సత్యముగ భగవంతుని కవగతమే. శుద్ధీకరణకు జలము అలభ్యమైన యాతడు “పరమ పావనుడగు, పరమ పావనుడగు భగవంతుని దివ్యనామము పేరిట” యను పదముల నైదు పర్యాయములు పలికి, ఆపై తన ప్రార్థనాదికముల కుపక్రమింపవలె. సకల లోకాధిపతి యానతిట్టిది. దివారాత్రముల యవధి సుదీర్ఘముగ నుండు ప్రదేశములయందున గడియారముల, లేదా కాలగమనము నెరుకపరచు సాధనముల వలన ప్రార్థనా సమయములు తెలిసికొనబడు గాక. నిశ్చయముగ ఆయన ప్రదాత, వివేకి.

11

సంకేత ప్రార్థన గావించవలసిన యావశ్యకత నుండి మిమ్ములను విముక్తుల నొనరించినాము. భయానక ప్రకృతి వైపరీత్యములు దృగ్గోచరము లైనప్పుడు సర్వవీక్షకుడును, సకలశ్రోతయును అగు మీ దేవుని శక్తిని, శౌర్యమును స్మరియించుకొని, యిట్లు పల్కుడు: “గోచరాగోచరములకు ఈశుడును, జగత్పతియును అగు భగవంతునిదే సామ్రాజ్యము”.

12

మీలో ప్రతి యొక్కరును వ్యక్తిగతముగా అనివార్య ప్రార్థనను చేయవలెనని నిర్దేశింపబడినది. దివంగతులకు నిర్దేశితమైన ప్రార్థనయందు తప్ప సామూహిక ప్రార్థనాచారము తొలగింపబడినది. సత్యముగ ‘ఆయన’ నిర్దేశకుడు, సకల వివేకి.

13

బహిష్టైన మహిళలను - అనివార్య ప్రార్థనను, ఉపవాసములను చేయుట నుండి భగవంతుడు మినహాయించినాడు. వారందుకు బదులుగా, ప్రక్షాళన మొనరించుకుని, పిదప, నాటి మధ్యాహ్నమునకు మరునాటి మధ్యాహ్నమునకు మధ్యకాలములో “దేవుడు మహిమాన్వితుడు శోభా సౌందర్యాల విభు”౎ డని తొంబదియైదు పర్యాయములు పఠియింపవలె. గ్రహియింపగలవారేని - దివ్యగ్రంథమునందిది నిర్దేశితమైనదని - గ్రహియింపుడు.

14

ప్రయాణము చేయునపుడు, ఏదేని సురక్షితప్రదేశమందు ఆగి విశ్రమింపవలసివచ్చెనేని, మీరు - స్త్రీ పురుషులొకే విధముగ - చేయలేకపోయిన ప్రతి అనివార్య ప్రార్థన స్థానము నందొక్క సాష్టాంగ ప్రణామము నాచరింపవలె; అట్లొనరించునపుడు “దయానుగ్రహముల సార్వభౌముడును, శక్తివంతుడును అగు భగవంతుడు మహిమాన్వితు”౎ డని పలుకవలె. ఇట్లాచరింపలేని యాతడు “భగవంతుడు మహిమాన్వితు”౎ డని పలుకుగాక; నిశ్చయముగ ఆతనికది చాలును. సత్యముగా ‘ఆయన’ సకల సంపన్నుడు, అనంతుడు, క్షమాశీలి, కరుణామయుడు. మీ సాష్టాంగ ప్రణామముల యనంతరము స్త్రీ పురుషు లొకేవిధముగ నర్ధపద్మాసనాసీనులై “భూస్వర్గ సామ్రాజ్యాధిపతియగు భగవంతుడు మహిమాన్వితు”౎ డని పదునెనిమిది పర్యాయములు పఠియింప వలె. ఏకైక పథమగు నీ దివ్య ఋజుమార్గమునకు దారితీయు సత్యనిర్దేశనా రీతులను, భగవంతుడివ్విధముగ సరళీకృత మొనరించినాడు. ఈ మహాదయా నుగ్రహమునకు భగవంతునికి ధన్యవాదముల నర్పింపుడు; భూ స్వర్గావృతమగు ఈ వదాన్యతకు ‘ఆయన’ ను ప్రస్తుతింపుడు; సమస్తసృష్టినీ ఆవరించిన ఈ కారుణ్యమునకు ‘ఆయన’ ను సంకీర్తింపుడు.

15

వచించు : భగవంతుడు నిగూఢమగు నా ప్రేమను దివ్యైశ్వర్యమునకు తాళపుచెవిని గావించినాడు, మీరెరుగుదురా! అయినను, ఆ దివ్యైశ్వర్యము తాళపుచెవికిని శాశ్వతముగ నగోచరమైయుండెడిది, విశ్వసింపగలరా! వచించు: దివ్యావిష్కరణకు మూలాధారమిది. దివ్యవైభవమునకు తన దీప్తిచే జగద్దిఙ్మండలములను శోభిల్లజేసిన ఉషోదయమిది. మీకవగతమైనదా! నిశ్చయముగ, న్రపతిహత నిర్ణయములకు మూలమగు నా యప్రతిహత నిర్ణయమిది.

16

ఓ మహోన్నతుని దివ్యలేఖినీ! వచించు: ఓ ప్రపంచజనులారా! మీకు స్వల్పకాలముపాటు ఉపవసించుటను విధియించి, తదంత్యమును నౌరూజ్ పండుగగా నిర్ధారించినాము. ఆద్యంతముల కధినాధుడగు ‘ఆయన’ చే నాదేశింపబడినటుల ఉద్గ్రంథ దిఙ్మండలోపరితలమున ఉచ్చారణ ప్రభాతనక్షత్రమీ విధముగ శోభిల్లినది. మాసములయందలి అధిక దినములు ఉపవాస మాసమునకు ముందుంచబడు గాక. ఈ రేయింబవళ్లన్నియును, “హా”౎ యక్షరస్వరూపములని నిర్దేశించినాము. అవ్విధముగా నవి సంవత్సర, మాస పరిమితులకు నిబద్ధము గావింపబడలేదు. ఈ దినములలో తమకును, స్వజనులకును, అందరికి మించి పేదలకు, ఆర్తులకు ఉల్లాసమును కలిగింపజేసి, ఆనందోత్సాహములతో భగవంతుని శ్లాఘించి, ప్రస్తుతించి, సంకీర్తించి ‘ఆయన’ నామమును బృహత్తరము గావింపవలెనని బహాప్రజలకు విధియింప నైనది; నిగ్రహకాలమునకు మునుపు వచ్చునట్టి ఈ దాతృత్వ దినములు ముగిసిన పిదప వారు ఉపవాసమున కుపక్రమింతురు గాక. సమస్తమానవాధిపతియగు ‘ఆయన’ చే నివ్విధముగ నాదేశింపబడినది. ప్రయాణికులు, రోగులు, గర్భవతులు, స్తన్యముచ్చు తల్లులు ఉపవాస నియమమునకు బద్ధులు కారు; భగవంతుడు తన యనుగ్రహమునకు ప్రతీకగ వారిని మినహాయించినాడు. నిశ్చయముగా, ‘ఆయన’ సర్వశక్తి వంతుడు, మహోదారుడు.

17

దివ్యగ్రంథముల యందునను, దివ్యఫలకముల యందునను భగవంతుని మహోన్నత లేఖినిచే నిర్దేశితములగు దైవశాసనములివి. తమ వ్యర్థపుటూహలను, నిరర్ధక భావనలను అనుసరింపుచు, తామేర్పరచుకొనిన ప్రమాణములను పట్టివ్రేలాడుచు, భగవత్ప్రమాణములను వెనుకకుద్రోసియుంచు వారివలె కాక, ఆయన శాసనములకును, ఆదేశములకును దృఢముగా కట్టువడియుండుడు. సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకును అన్నపానాదులను వర్జింపుడు; దివ్యగ్రంథ ప్రస్తావితమగు నీ యనుగ్రహమును ఐహికవాంఛ మీకు దక్కనీయదేమో, జాగరూకులు కండు.

18

న్యాయాధీశుడగు భగవంతుని విశ్వసించు ప్రతియొక్కడును అను దినమును తన హస్తములను, ఆపై ముఖమును ప్రక్షాళనమొనరించుకుని, ఉపవిష్టుడై భగవంతుని వైపుకు తిరిగి “అల్లా ‘హో’ అభా” ను తొంబదియైదు పర్యాయములుచ్చరింపవలె. వైభవాధికారములతో తన దివ్యనామముల సింహాసనములపై నాసీనుడైనప్పుడు దివ్యలోకముల సృష్టికర్త యిచ్చిన యాదేశమట్టిది. అటులే, అనివార్య ప్రార్థనకై శుద్ధీకరణములను గావింపుడు; అతులితుడును, అప్రతిబంధితుడును అగు భగవంతుని యాదేశమిది.

19

హతమార్చుట లేక వ్యభిచరించుట, పరోక్షనింద, మిధ్యారోపణల యందు నిమగ్నులగుటనుండి మీరు నిషేధింపబడినారు; మరి, మీరు పవిత్ర గ్రంథములు, దివ్యఫలకములయందలి నిషిద్ధములను వర్జింపుడు.

20

మేము వారసత్వపుటాస్తిని ఈ రీతిగ సప్తవర్గములుగ విభజించినాము: ఐదువందల నలభై రెండు వాటాలు గల తొమ్మిది భాగములను పిల్లలకును; నాలుగు వందల ఎనభై వాటాలు గల ఎనిమిది భాగములను భార్యకును; నాలుగు వందల ఇరవై వాటాలు గల ఏడు భాగములను తండ్రికిని; మూడు వందల అరవై వాటాలు గల ఆరు భాగములను తల్లికిని; మూడు వందల వాటాలు లేదా ఐదు భాగములను సోదరులకును; రెండువందల నలభై వాటాలు లేదా నాలుగు భాగములను సోదరీమణులకును; నూట ఎనభై వాటాలు లేదా మూడు భాగములను ఉపాధ్యాయులకును కేటాయించినాము. నిశీధియందునను, ఉషఃకాలమునందునను మా దివ్యనామమును కొనియాడు నా యగ్రగామి శాసనమట్టిది. గర్భస్థశిశువుల యార్తనాదముల నాలకించినయంత, వారి వాటాను ద్విగుణీకృత మొనరించి, మిగిలినవారి వాటాలను తగ్గించినారము. సత్యముగా, ‘ఆయన’ కు తన యాకాంక్షానుసారము శాసించు శక్తి కలదు; ‘ఆయన’ తన సార్వభౌమాధికారముచే తన యిచ్ఛానుసారము వ్యవహరింప గలడు.

21

మృతినొందినవానికి సంతానము లేనిచో, వారి వాటా - అది అనాధల నిమిత్తమును, వైధవ్యమునొందినవారి నిమిత్తమును, జనబాహుళ్య ప్రయోజనముల నిమిత్తమును, సకలదయామయుడును, క్షమాశీలి యును అగు తమ దైవమునకందరును ధన్యవాదములనర్పించు రీతిన దయాన్వితుని ధర్మకర్తలచే వ్యయపరుపబడునటుల, న్యాయమందిరమునకు చెందవలె.

22

మృతునకు పిల్లలుండి, దివ్యగ్రంథమునందు పేర్కొనబడిన ఇతర ఔరసవర్గీయులెవ్వరును లేనియెడల, వారికి మూడింట రెండు వంతుల యాస్తి సంక్రమింపవలె; మిగిలిన మూడవ వంతు న్యాయమందిరమునకు మరలింప బడవలె. సకల సంపన్నుడును, సర్వోన్నతుడును అగు ‘ఆయన’ చే తేజో వైభవములతో నొసంగబడిన యాదేశమిట్టిది.

23

మృతునకు - బంధువులయందున అన్నదమ్ముల, అక్కచెల్లెండ్ర పిల్లలు దక్క పేర్కొనబడిన వారసులెవ్వరును లేనియెడల, వారసత్వపుటాస్తిలో వారికి మూడింట రెండు వంతులు చెందును; వీరు సైతము లేనియెడల, అది యాతని తల్లిదండ్రుల తోబుట్టువులకును, వారి యనంతరము వారి కుమారులకును, కుమార్తెలకును చెందును. మిగిలిన మూడవవంతు వారసత్వపుటాస్తి, ఏ పరిస్థితియందైనను, న్యాయసింహాసనమునకు మరలింపబడవలె. సర్వజన పాలకుడగు ఆయనచే దివ్యగ్రంథమునందీ రీతిగ నిర్దేశితమైనది.

24

మహోన్నతుని లేఖినిచే లిఖితములగు నామములు గల యే వారసులును మృతునకు లేనియెడల, ఆతని యవదాస్తియును దైవనిర్దేశితము నకు వ్యయపరచుటకై, పూర్వప్రస్తావిత సింహాసనమునకు మరలింపబడును. నిశ్చయముగా ఆయన, నిర్దేశకుడు, సర్వశక్తిశాలి.

25

మృతుని నివాసమును, వ్యక్తిగత వస్త్రములను, స్త్రీ సంతతికో, అన్య వారసులకో కాక, పురుషసంతతికే ప్రత్యేకించినాము. నిశ్చయముగ ఆయన ప్రదాత, సకల వదాన్యుడు.

26

మృతుడు జీవించియుండగనే, సంతానవంతుడగు ఆతని కుమారుడు దివంగతుడయ్యెనేని, భగవంతుని దివ్యగ్రంథ నిర్దేశితానుసారము ఆ సంతతి తమ తండ్రి వాటాకు వారసులగుదురు. పరిపూర్ణన్యాయముతో వారి వాటాను వారికి పంచియిండు. సమస్త మానవాధినాధునిచే నిర్ణీతములగు శాసన మౌక్తికములను వెదజల్లుచు, ఉచ్చారణోదధి పెనుకెరట మావిధముగ నువ్వెత్తున పైకెగసినది.

27

మృతుని పిల్లలు పసివారైనచో, వారసత్వపుటాస్తియందలి వారి వాటాను వారు యుక్తవయస్కులగునంత వరకు వారి పక్షమున వ్యాపారమునందో, వాణిజ్యమునందో మదుపుచేయుటకై ఒక విశ్వాసపాత్రునికి లేదా వాణిజ్యసంస్థకు అప్పగింపవలె. అట్లేర్పరుచుటచే దానికి సమకూరిన లాభమునందలి సముచిత వాటానొకదానిని, తద్ధర్మకర్తకు కేటాయింపవలె.

28

హుఖుఖుల్లా చెల్లించబడి, ఋణములేవైనను పరిష్కృతములై, అంత్యక్రియల, ఖననముల వ్యయములు జరుపబడి మృతుడు సమాధిస్థలికి గౌరవ మర్యాదలతో కొనిపోబడిన పిదపనే ఆస్తిపంపిణీ జరుగవలె. ఆద్యంతాధినాథుడగు ‘ఆయన’ చే నిట్లు నిర్దేశితమైనది.

29

వచించు: గోచరాగోచర సూచక సంకేతమును, నిరతిక్రమణమును, అత్యంత విశిష్టనామమును అగు తొమ్మిదితో నారంభింపబడుటచే యెన్నడును మార్పునొందని మర్మజ్ఞానమిది. మేము బాలలకు సముచితమని ఏర్పరచిన యట్టిది - దయాళువును, కరుణామయుడును అగు తమ దైవమునకు వారు కృతజ్ఞతలను తెల్పుకొనునటుల భగవంతుడు వారికి అనుగ్రహించినది. నిశ్చయముగా దైవశాసనములివి; క్షుద్ర, స్వార్ధవాంఛాప్రేరితులై వాని నతిక్రమింప వలదు. దివ్యోచ్చారణోద్భవస్థానమగు ఆయన మీకిడిన యాజ్ఞలను పాలింపుడు. దైవసేవకులయందలి నీతివంతులు ఆయన వెలువరించిన శాసనములను, ప్రతి మతావలంబకులకును జీవనతోయములుగను, సమస్త భూస్వర్గ వాసులకు వివేకజ్యోతిగను, సాదరానుగ్రహముగను పరిగణింతురు.

30

బహా సంఖ్యకు సరిపడునంతమంది సలహాదారులు గల ప్రతి నగరమునను న్యాయమందిరమొక్కటి స్థాపింపబడవలెనని, ఆ సంఖ్య అధికమైనను సరియేననియు భగవంతు డాదేశించినాడు; తామందు ప్రవేశించినపుడు, ఘనత వహించినవాడును, పరమోన్నతుడును అగు భగవంతుని సాన్నిధ్యమను సభాంగణమున కేగుచున్నటుల, అగోచరుడగు ‘ఆయన’ నవలోకింపుచున్నటుల వారు భావించుకొనవలె. మానవులయందున దయామయుని విశ్వాసపాత్రులుగ వ్యవహరించుటయును, సమస్త భూలోకవాసులకును దైవనిర్దేశిత మార్గదర్శకులుగ మెలగుటయును వారికి విధియింపబడినది. సంఘటితముగ సమాలోచనలను గావించుటయును, తమ స్వప్రయోజనములను గణియించినటులే, భగవంతునికై, ఆయన సేవకుల ప్రయోజనములను సైతము గణియింపుట యును, సయుక్తమూ, సముచితమూనగు దాని నెంచికొనుటయును వారికి అనివార్యమైయున్నది. సర్వాధిపతియగు మీ దైవము మిమ్మీవిధముగ నాజ్ఞాపించినాడు. విస్పష్టముగ ఆయన దివ్యఫలకమునం దావిష్కృతమైనట్టి దానినలక్ష్యమొనరింతురేమో, జాగ్రత్త. ఓ వివేకులారా, దైవభీతిని కలిగి యుండుడు.

31

ఓ జగజ్జనులారా! సకల మతాధీశుడగు ‘ఆయన’ పేరిట, సమస్త భూభాగముల యందుననూ ఆరాధనామందిరములను నిర్మింపుడు. ఐహిక ప్రపంచమున వానిని సాధ్యమైనంత నిర్దుష్టముగ నిర్మింపుడు; చిత్రములతోడనో, ప్రతిమలతోడనో కాక, సముచితరీతిన వాని నలంకరింపుడు. వానియందున పరమ దయామయుడగు మీ భగవంతుని సంకీర్తనము నానందోత్సాహములతో గావింపుడు. వాస్తవమున ‘కాయన’ స్మరణమున నేత్రపర్వమగును, హృదయములు జ్యోతిర్మయములగును.

32

మీలో స్తోమతగల వారు పవిత్రగృహమునకు తీర్ధయాత్రను గావింప వలెనని దేవాధిదేవు డాదేశించినాడు; ఆయన తన కారుణ్యము కొలది మహిళల నిందుండి మినహాయించినాడు. నిజమున కాయన సకలౌదార్యుడు, మహాదాత.

33

ఓ బహాజనులారా! ఏదో ఒక వృత్తి - అనగా కళ, వర్తకము లేదా తత్సమానమగు వ్యాసంగము - లో ప్రవేశించుట మీలో ప్రతియొక్కరికిని విధియుక్తము. మీరట్టి కార్యమునం దవలగ్ను లగుటను నిజదైవారాధన స్థాయికి సముద్ధరించినాము. ఓ ప్రజలారా! మీ దేవుని యనుగ్రహమును, ఆశీస్సులను స్మరియించుకొనుచు, ఉదయసాయంసంధ్యలయం దాయనకు ధన్యవాదముల నర్పింపుడు. నిర్వ్యాపారముతో, అలసత్వముతో మీ కాలమును వ్యర్థమొనరింపక మీకును, అన్యులకును ఫలదాయకమగు దానినొనరింపుడు. ఈ దివ్యఫలక దిఙ్మండలము నుండి వివేకోచ్చారణలనెడు ఉదయతార ప్రభవిల్లినది; ఇట్టి ఫలకమునుండి ఈ విధముగ నిర్దేశితమైనది. క్రియాశూన్యులై కూర్చుని, భిక్షాటనమొనరించువారు భగవంతుని దృష్టిలో పరమనీచులు. సాధనలనెడి రజ్జువును దృఢముగ చేబూని సర్వసాధనాప్రదాతయగు భగవంతునియెడ మీ విశ్వాసమును నిలిపియుంచుడు.

34

కరచుంబనము దివ్యగ్రంథమున నిషేధింపబడినది. తదాచరణ, మహిమాదేశముల కధినాధుడగు దేవదేవునిచే నిషేధింపబడినది. తమ పాప విముక్తికై అన్యుల క్షమనాశించుటకెవ్వరునూ అనుమతింపబడలేదు; పశ్చాత్తాపము మీకును, మీ దైవమునకు మధ్యనే యుండు గాక. నిక్కముగా ఆయన క్షమాపకుడు, ప్రదాత, దయామయుడు, పశ్చాత్తప్తుల మోక్షకుడు.

35

ఓ దయామయుని భృత్యులారా! దివ్యసంకేతోదయమును విశ్వసింపని వారు కలిగించు క్లేశములును, వేదనలును మిమ్ము క్షోభింపచేయకుండునటుల దివ్యధర్మసేవకై ఉద్యుక్తులు కండు. వాగ్దానము నెరవేర్పబడి, వాగ్దత్తపురుషుడు ప్రత్యక్షీకృతుడైనపుడు భూప్రజల మధ్య వైరుధ్యములు పొడసూపినవి; ప్రతి యొక్కరును తమతమ మిధ్యాభ్రమల ననుసరించినారు.

36

తన మనమునం దగ్రాసనము నపేక్షింపుచు ద్వారసీమ చెంతగల పాదరక్షల మధ్య ఆసీనుడైన వాడొకడు జనులయందు గలడు. వచించు: వాస్తవవిరుద్ధముగ నగుపించు ఓ యహంభావీ, అలక్ష్యపరుడా! ఎట్టి మనుష్యుడ వీవు? అంతర్జ్ఞ్ఞానకోవిదుడనని, ఇంకను నిగూఢ జ్ఞానమందు నిక్షిప్తమైయున్నదని చెప్పుకొనువాడును జనులయందే గలడు. వచించు: నీ వసత్య మాడుచున్నాడవు. దైవసాక్షిగా, నీయొద్దనున్నది - శునకములకు పారవైచిన శల్యములవోలె - నీకు మేము వైచిన తాలు తప్ప వేరొండు కాదు. ఏకైక నిజ దైవజ్ఞాన సాక్షిగా! ఎవ్వడైనను సర్వమానవ పాదప్రక్షాళన మొనరించినను, వనములయందునను, లోయలయందునను, పర్వతముల యందునను, ఉన్నత గిరులపైనను, మహోన్నత శిఖరములపైనను దైవము నారాధించినను, తదారాధనకు సాక్ష్యముగ ప్రతి శిలను, తరువును, మృత్శకలమును వదలక నిలిపినను, ఆతని నుండి మా సంప్రీతి పరిమళము లాఘ్రాణితములు కానేరవు, ఆతని కార్యములెన్నటికిని భగవంతుని యంగీకృతినొందజాలవు. సకలాధీశుడగు ‘ఆయన’ చే నివ్విధముగ నిర్దేశితమైనది. భరతఖండపు పర్వతసానువుల యందెందరు - న్యాయ బద్ధములని దైవము నిర్దేశించిన శాసనములకు దూరులై సర్వసంగ పరిత్యాగులై, కఠోర నియమములను విధియించుకొని, దివ్యపదావిష్కర్తయగు భగవంతుని స్మృతికి దూరులు కాలేదు. మీ విషయ వాంఛాసాధనకై మీ కార్యములను జాలములను గావింపవలదు; అంతియే కాక భగవత్సాన్నిధ్యమునందినవా రందరును అనవరతము పరితపించినయట్టి పరమోన్నత లక్ష్యమునకు మీరు దూరులు కావలదు. వచించు : నా సంప్రీతిని వడయుటయే సకల కార్యములకు జీవము; సర్వమును నాదగు యామోదము పైననే ఆధారపడి యుండును. సకల వైభవోపేతుడును, సర్వౌదార్యుడును అగు భగవంతుని దివ్యగ్రంథముల యందేమున్నదో తెలిసికొనవచ్చును గాన మా ఫలకములను పఠియింపుడు. నా ప్రీతికి పాత్రుడైనవాడు, స్వర్ణాసనమునకును, సకల ప్రపంచ గౌరవమునకును అర్హుడగును; తత్ప్రీతి విహీనుడు ధూళిపై నాసీనుడైనను, ఆ ధూళి సైతము సకల మతాధీశుడగు భగవంతుని శరణువేడును.

37

సహస్రవర్షముల పరిపూర్తికి పూర్వమే భగవదావిష్కరణకర్తగా ప్రకటించుకొనువాడు నిక్కముగ వంచకుడు. అట్టి ప్రకటనను ఉపసంహరించు కొనుటకును, పరిత్యజించుటకును ఔదార్యముతో నాతడికి తోడ్పడుమని మేము భగవంతుని వేడుచున్నాము. ఆతడు పశ్చాత్తాపము నొందెనేని, పరమాత్ముడు నిస్సంశయముగా మన్నించును. అయితే ఆతడు మూర్ఖత్వముకొలది తన పట్టును వీడనిచో, ఆతనియెడ నిర్దాక్షిణ్యముగ వ్యవహరించు నాతనిని భగవంతుడు నిశ్చయముగ పంపగలడు. శిక్షించుటయందు భగవంతుడు యదార్థముగ చండప్రచండుడు! ఈ ప్రవచనమును - దీని విస్పష్టార్థమునకు విరుద్ధముగ - వ్యాఖ్యానించు నాతడు, సమస్త జీవకోటిని యావరించిన దైవతేజస్సునకును, ‘ఆయన’ కరుణకును పాత్రుడు కాజాలడు. దైవభీతిని కలిగియుండుడు, మీ వ్యర్ధభ్రమల ననుసరింప వలదు. సర్వశక్తివంతుడును, సకల వివేకియును యగు మీ పరమాత్ముని యాజ్ఞను పాలింపుడు. అనేక ప్రదేశములయం దచిరకాలములోనే ధిక్కారస్వరములు వెలువడును. ఓ నా జనులారా! మరి, పాపాత్ములను, దుస్స్వభావులను అనుసరింపవలదు. ఇరాక్ నందు వసియించునప్పుడును, మరి ఆపై మార్మికభూమి(అడ్రియానోపుల్) యందుండగను మేము మీకు ముందుగా హెచ్చరిక చేసినదియును, ఇప్పుడీ దేదీప్యమానస్థలి నుండి హెచ్చరింపుచున్నదియును ఇదియే.

38

ఓ జగజ్జనులారా! నా సౌందర్యప్రభాతనక్షత్ర మస్తమించినప్పుడు, నా స్వర్గధామము మీ నేత్రముల కగోచరమొనరింపబడినప్పుడు వెఱపునొందవలదు. నా దివ్యధర్మపురోగతికిని, మానవులయందున నా ప్రవచనోద్ధతికిని ఉద్య మింపుడు. మేము సర్వదా మీతో నుందుము, సత్యబలముచే మిమ్ము శక్తి వంతులనొనరింతుము. సత్యముగా మేము సర్వశక్తివంతులము. నన్ను గుర్తించిన యాతడు, భూస్వర్గ శక్తులు సైతము తన యుద్దేశ్యమును నిరోధింప జాలనంతటి దృఢసంకల్పముతో నన్ను సేవించుట కుద్యుక్తుడగును.

39

ప్రపంచజనులు గాఢనిద్రావస్థయందున్నారు. వారు తమ సుషుప్తి నుండి మేల్కాంచిరేని సర్వజ్ఞుడును, సర్వవివేకియును అగు భగవంతుని దెసకు ఆత్రమున పరువిడుదురు. తమ ప్రభుడు తమనుద్దేశించి కేవలమొక్క పదము నుచ్చరించు నటుల గుర్తుంచుకొనుటకై తమ సర్వమును - అది భూమి పైనున్న సకలసంపదలైనను - పరిత్యజింతురు. సమస్త జ్ఞానమును నికిప్తమైనట్టిదియును, సృష్టినేత్రము గాంచియుండనిదియును, సాక్షాత్త్తు తనకుతప్ప అన్యులకు అనావిష్కృతమును అగు దివ్యఫలకమున సర్వశక్తివంతుడు, సకల జగద్రక్షకుడు యిచ్చిన యాదేశమిట్టిది. తమ దుర్వాంఛల మైకమున వారెంతటి విభ్రమము నందుండిరనిన “పరాక్రమశాలిని, సకలవివేకిని యగు నేనుతప్ప అన్యదైవము లే”౎డని వారి ప్రభునివాణి అన్ని వైపులనుండియు యెలుగెత్తి పిలచినను గ్రహియించుట కశక్తులైనారు.

40

వచించు: మీ యాధీనమందలి వస్తుసంచయము పట్ల మురియ వలదు, ఈ రేయికవి మీవి, రేపటికవి పరుల పాలగును. సర్వజ్ఞుడును, సకల విదుడును అగు ‘ఆయన’ మిమ్మీవిధముగ హెచ్చరింపుచున్నాడు. వచించు: మీ స్వాధీనమందున్నది శాశ్వతమని, సుభద్రమని యనగలరా? లేదు! సకలదయాళువునగు నా సాక్షిగా, న్యాయబద్ధముగ నిర్ణయించు వారలైనచో, అనలేరు. మీ జీవితకాలము, ప్రాణవాయువు వోలె కరగిపోవును, మీకు ముందు చనిన వారి కీర్తివైభవముల వోలె మీ కీర్తివైభవములును అంతరించును. ఓ జనులారా! యోచింపుడు మీ గతించిన దినములకు, శతాబ్దముల కేమైనది? దైవస్మరణకు అంకితములైన దినములు ఆనందదాయకములు, సకల వివేకియగు ‘ఆయన’ ను స్తుతించుటకు వెచ్చించిన ఘడియలు శుభప్రదాయినులు. నా జీవితము సాక్షిగా ! బలవంతుల యాడంబరము గాని, సంపన్నుల సంపద గాని, దుష్టుల ప్రాబల్యము గాని నిలువబోవు. ‘ఆయన’ నుండి వెలువడు ఏకైక వాక్కుతో సర్వమును నశించును. నిశ్చయముగా ‘ఆయన’ సర్వాధికార పరిపూర్ణుడు, సమస్తప్రేరణకర్త , సర్వశక్తివంతుడు. మానవులు సమకూర్చుకొను భౌమవస్తువుల వలన ప్రయోజనమేమి? వారు తమకు ప్రయోజనకరమగు దానిని పూర్తిగా నలక్ష్యము గావించినారు. అనతికాలమునకే వారు తమ గాఢనిద్రనుండి మేల్కాంతురు; సర్వశక్తివంతుడును, సమస్త శ్లాఘనీయుడును అగు తమ ఈశుని జీవితకాలములో తమకు దక్కియుండని దానినిక పొందలేమని తెలిసికొందురు. వారికి తెలిసి యుండెనేని, ‘ఆయన’ సింహాసన సమక్షమున తమ నామప్రస్తావనకైై సమస్తమును పరిత్యజించియుండెడి వారు. నిశ్చయముగా, వారు మృతసదృశులు.

41

పాండిత్యముచే గర్వమునొంది, స్వయమాధారుడనగు నా దివ్య నామమును గుర్తించుట నుండి తిరస్కరింపబడినవాడై, తనను వెన్నంటివచ్చు పాదరక్షల సవ్వడిని వినినంతనే స్వీయౌన్నత్యమున నిమ్రోదుకన్న తానే యధికుడనని అహంకరించునాతడు జనబాహుళ్యమున కలడు. ఓయి తిరస్కృతుడా! ఇప్పుడాతని యావాసమెక్కడ? దైవసాక్షిగా, అధోలోకాగ్ని యది. వచించు : ఓ దివ్యజ్ఞానుల సముదాయమా! నా పరమోన్నతలేఖిని చేయు తీవ్ర ధ్వని నాలకింపలేకున్నారా? సమస్త కీర్తి దిఙ్మండలోపరితలమున ఈ భానుడు దేదీప్యమానముగ శోభిల్లుటను కాంచలేకున్నారా? మీ దుష్ట మనోవికార ప్రతిమల నింకెంత కాలమారాధింతురు? మీ శుష్కభ్రమలను వీడి అనంతజీవనుడగు మీ భగవంతుని దెస కభిముఖులు కండు.

42

ధర్మకార్యార్ధమై యర్పించిన దానధర్మములు సంకేతములకర్తయగు భగవంతునికే చెందును. ఆవిష్కరణకు అరుణోదయస్థానమగు ‘ఆయన’ యానతిలేనిదే దానిని వినియోగించు హక్కెవ్వరికిని లేదు. ‘ఆయన’ యనంతరము అఘ్సాన్‌కును, ఆపై న్యాయమందిరమునకును ఈయధికార మబ్బును. ఈ ప్రపంచము నందది స్థాపితమైనప్పుడు వారీ దానధర్మములను ఈ దివ్యధర్మపరముగ నౌన్నత్యమునొందిన ప్రదేశములయందున శక్త్యధికారాధి నాధుడు తమకు నిర్దేశించిన దానికై వినియోగింపవచ్చును. అట్లు కాదేని, ‘ఆయన’ ఆజ్ఞ లేనిదే మాట్లాడనివారు, ‘ఆయన’ ఫలకమునందు నిర్దేశింపబడిన దాని ననుసరించి తప్ప వేరు తీర్మానించని బహాజనులకు, ఈ దేవాదాయములు మరలింపబడును. అదిగో చూడుడు, వారు భూ స్వర్గముల మధ్య విజయాగ్రేసరులు. శక్తివంతుడును, ఔదార్యుడును అగు భగవంతునిచే దివ్యగ్రంథమునందు పొందుపరచబడినటుల వారు దానిని వినియోగింప వచ్చును.

43

పరీక్షాసమయమున పరితాపమునొందక, సంబరపడక, ఆపత్కా లమున నన్ను స్మరియించుట, భవిష్యత్తులో మీకు సంభవింపనున్నదాని గురించి యోచించుట యను మధ్యేమార్గము నెంచికొనుడు. సమస్తజ్ఞాని, సకలమును ఎరిగినట్టి ఆయన* - ఈ విధముగా తెలుపుచున్నాడు.

44

మీ శిరములకు సంపూర్ణ ముండన మొనరింపవలదు. భగవంతుడు వానిని కేశములతో నలంకరించినాడు. ప్రకృతి యవసరములను గ్రహియింప గల్గిన వారికిందు సృష్టికర్త గావించిన సంకేతములున్నవి. ‘ఆయన’ నిశ్చయముగా బలవివేకములకు దేవుడు. అయిననూ, కేశములను కర్ణసీమలను మించి పెరగనీయుట యుక్తము కాదు. జగదీశుడగు భగవంతుడీ విధముగ నాదేశించినాడు.

45

చోరునకు ప్రవాసమును, కారాగారవాసమును శిక్షగా నిర్ణయింప బడినవి; నేరము మూడవమారు పునరావృతమయ్యెనేని, భగవంతుని నగరములలోనికిని, ‘ఆయన’ రాజ్యములలోనికిని అనుమతింప బడకుండు నటుల, ఆతని నుదుటిపై నొక ముద్రను వేయుడు. వాత్సల్యము కొలది మీరు దైవశాసనముల నమలుచేయుట నుపేక్షింతురేమో, దయాళువును, కరుణా మయుడును అగు ‘ఆయన’ చే మీకై విధియింపబడిన దానిని నిర్వర్తింపుడు. తండ్రి తనయునకు బుద్ధిగరపునటుల - జ్ఞాన, శాసనములను దండముతో మేము మీకు బుద్ధిగరపునది మీ స్వీయరక్షణకు, అభివృద్ధికే తప్ప వేరొండు కాదు. నా జీవితము సాక్షిగా : పవిత్ర శాసనావిష్కరణ మూలమున మీకై మేమభిలషించినదానిని మీరెరిగియుంటిరేని విమలమును, శక్తియుతమును, మహోన్నతమును నగు ఈ దివ్యధర్మమునకై ఆత్మార్పణమొనరింతురు.

46

ఎవ్వరైనను సువర్ణ, రజత పాత్రముల నుపయోగింప నెంచినచో స్వేచ్ఛగా వాడుకొనవచ్చును. నలుగురితోకూడి ఆహారస్వీకరణము గావించునపుడు పాత్రములు, పళ్లెరముల యందలి పదార్ధములలోనికి చేతులను జొప్పింతురేమో, జాగరూకులు కండు. అత్యంత పరిశుభ్రతకనువగు తీరుల నవలంబింపుడు. నిశ్చయముగా, ‘ఆయన’, మీరు పరమోన్నత సామ్రాజ్యమందలి స్వర్గవాసుల లక్షణములను మీయందు వీక్షింప నభిలషింపుచున్నాడు. మీకును, స్వర్గలోక నివాసులకును ఏహ్యమగు దాని నవేక్షించుట నుండి మీ నేత్రములు సురక్షితము లగుటకై సర్వావస్థలయందునను స్వచ్ఛత కత్యధిక ప్రాధాన్యతనిండు. దానినుండి వైదొలగిన యాతడి కార్యము తక్షణమే నిష్ఫలమగును. అయినను, తగు హేతువున్నచో భగవంతు డాతడిని మన్నించును. ‘ఆయన’ నిక్కముగా దయామయుడు, మహాప్రదాత.

47

పరమోన్నత నిష్కళంకత్వమున, భగవంతుని దివ్యధర్మపు టుషోదయోత్పన్న స్థానమగు ‘ఆయన’ కు భాగస్థుడెవ్వడును లేడు. సృష్టి సామ్రాజ్యమందలి “స్వీయేచ్ఛావర్తను” ని దివ్యావతార మాయనయే. భగవంతుడీ వైశిష్ట్యమును తనకై ప్రత్యేకించుకొని, అట్టి మహోత్కృష్ట స్థానము నందెవరికిని భాగనిర్దేశనము చేయలేదు. ఇతఃపూర్వ మభేద్యమర్మపు జాలికయందు నిక్షిప్తము గావింపబడిన దైవనిర్ణయమిది. ఈ దివ్యావిష్కరణమునందు వెల్లడించి, ఆపై భగవంతుని దివ్యగ్రంథమునందలి సత్యమును గ్రహియింపలేక, అలక్ష్యపరులయందున గణియింపబడుటకు కారణమగు తెరలను చింపి పారవైచితిమి.

48

పఠన, లేఖన కళను, భగవంతుని పవిత్ర దివ్యఫలక నిర్దేశితము నంతటిని తన కుమారునికిని, కుమార్తెకును నేర్పింపవలసిన బాధ్యత ప్రతి తండ్రికిని విధియింపబడినది. తనకాజ్ఞాపితమైనట్టి దానిని త్రోసిపుచ్చిన వాని నుండి - ఆతడు సంపన్నుడైనచో - వారి విద్యాబోధన కవసరమగు ధనమును దివ్య ధర్మకర్తలు రాబట్టుకొనవలె; ఆతడు సంపన్నుడు కాడేని, న్యాయమందిరమే ఆ బాధ్యతను వహియింపవలసి యుండును. నిశ్చయముగా, దానిని మేము నిరుపేదలకును, ఆర్తులకును ఆశ్రయము గావించినారము. తన కుమారుని లేదా అన్యుని కుమారుని వృద్ధిలోకి తెచ్చిన, అది నా తనయుని వృద్ధిలోనికి తెచ్చినయట్లే యగును. అట్టి వానికి, లోకావృతమగు నా వైభవమును, నా ప్రేమాన్వితానుగ్రహమును, నా కారుణ్యమును ఉపలబ్ధములగును.

49

ప్రతి జారుడును, జారిణియును న్యాయమందిరమునకు చెల్లింవ వలసిన అపరాధ శుల్కమును తొమ్మిది మిష్కల్‌ల సువర్ణముగా భగవంతుడు నిర్దేశించినాడు; వారా నేరమును పునరావృత మొనరించిరేని అది రెండింత లగును. దివ్యనామాధిపతి యగు ‘ఆయన’ వారికీ ప్రపంచమున విధియించిన అపరాధశుల్కమట్టిది, కాగా, ఆగామిలోకము నందత్యంత యవమానకరమగు వేదనను విధియించి నాడాయన. ఎవ్వడైనను పాపద్రష్టుడయ్యెనేని, దానియెడ పశ్చాత్తప్తుడై భగవంతు నాశ్రయించుట యుక్తము. ‘ఆయన’ నిశ్చయముగా, తాదలచిన యాతనికి క్షమాభిక్ష నొసంగును; ‘ఆయన’ సంప్రీతుడై గావించిన నిర్దేశము నెవ్వరును ప్రశ్నింపతగదు. వాస్తవమునకు, ‘ఆయన’ సర్వదా క్షమాపకుడు, సర్వశక్తివంతుడు, సమస్త శ్లాఘనీయుడు.

50

సజీవమగు ఈ విమలోదక దివ్యస్రవంతి నుండి మీ వంతునొంద నీయక విభవపు తెఱలు - మిమ్ము నిరోధించేను జాగ్రత్త. అరుణోదయ కారకుడగు ఆయన పేరిట మోక్షకలశము నందుకొని, సకల మహిమాన్వితు డును, ఉపమానరహితుడును అగు ఆయనను సంకీర్తింపుచు, మెండుగా గ్రోలుడు.

51

సంగీతశ్రవణమును, గానమును మీకు శాసనబద్ధము గావించినాము. అయినను, తత్శ్రవణము మిమ్ము గౌరవమర్యాదల పరిధుల నతిక్రమింప చేయకుండునటుల జాగరూకులు కండు. హృదయములను పరవశింపజేసి, భగవంతుని సాన్నిధ్యమునొందిన వారందరిని పరమానందభరితులను గావించు నా మహోన్నత దివ్యనామ సంజనితానందమే నీ యానందమగు గాక ! నిశ్చయముగ మేము, సంగీతమును మీ యాత్మల కొక నిశ్రేణిగ, అవి మహోన్నత దివ్యధామమునకు సముద్ధరింపబడు సాధనముగ నొనరించినాము; కావున, దానిని స్వార్ధమోహములకు ఱెక్కలుగా కానీయవలదు. యదార్ధమునకు, మీరు బుద్ధిహీనుల యందెంచబడగ జూడవలెనన్న మాకసహ్యము.

52

సకల అపరాధశుల్కముల యందలి తృతీయ భాగము న్యాయ సింహాసనమునకు చెందవలెనని మేమాదేశించినాము; అట్టి సంచితమును - సకల వివేకియును, సర్వజ్ఞుడును అగు ‘ఆయన’ తమకు విధియించిన కార్యముల నిమిత్తము వెచ్చించుటయందున పూర్తిన్యాయమును పాటింపవలెనని దాని సభ్యులకు ప్రబోధింపుచున్నాము. ఓ న్యాయపురుషులారా! మీరు మీ కొమరులను కాపాడుకొనునటుల, భగవంతుని దివ్యధామమునం దాయన గొఱ్ఱెలకు సంరక్షకులు కండు; ప్రచ్ఛన్నములై యాకలిగొనియున్న తోడేండ్ల నుండి వానిని రక్షింపుడు. దివ్యోపదేశకుడు, విశ్వసనీయుడు మీకిటుల ఉద్బోధింపుచున్నాడు.

53

ఏ యంశము గురించి యైనను మీలో విభేదములు తలయెత్తెనేని, వానిని యీ దివ్యస్వర్గపు నభోమండలముపై సత్యసూర్యుడింకను ప్రకాశింపు చుండగనే భగవంతునికి నివేదింపుడు; తత్సూర్యుడస్తమించినప్పుడు ఆయనచే ననుగ్రహీతమైనట్టి దానికి నివేదింపుడు. నిశ్చయముగ నిది సమస్త ప్రపంచ జనులకును సముచితమైనది. వచించు : ఓ ప్రజలారా ! నా ప్రత్యక్షతావైభవ మంతరించినపుడు, నా యుచ్చారణాసాగరము స్తబ్ధతనొందినపుడు మీ హృదయములను కలవరమొందనీయకుడు. మీ మధ్యనగల నా యుపస్థితి యందొక వివేకమున్నది; తుల్యరహితుడును, సర్వజ్ఞుడును అగు భగవంతునికి దక్క అన్యుల కర్థముగానట్టి దింకొక్కటి నా యనుపస్థితి యందున్నది. మేము మా దివ్యవైభవధామము నుండి నిశ్చయముగ, మిమ్మవలోకింతుము; మా దివ్యధర్మ విజయమున కుద్యమించు వారికి మా దివ్యగణాతిథేయులతో, మా యనుగ్రహమునొందిన దేవదూతలతో సాహాయ్యము గావింప జేయుదుము.

54

ఓ భూ ప్రజలారా! అనిర్బంధితుడైన మీ ఈశునిచే నుచ్చరింపబడిన ప్రవచన మధురిమచే గండశిలలనుండి స్వచ్ఛవిమలోదక స్రవంతులు ఉప్పొంగినవనుటకు - శాశ్వతసత్యమగు భగవంతుడే నాకు సాక్ష్యము; అయినను, మీరింకను సుషుప్తి యందున్నారు. మీ యాధీనమందలి సర్వస్వమును త్యజియించి, నిస్సంగత్వమనెడు పక్షములపై సమస్త సృజిత ప్రాణుల కతీతముగ విహరింపుడు. తన లేఖినీచలనముచే మానవజాతి యాత్మను పరివర్తితమొనరించిన యా సృష్ట్యాధిపతి మిమ్ముల నీ విధముగ నాదేశింపుచున్నాడు.

55

సకల కీర్తివంతుడగు మీ ప్రభుడు ఎట్టి మహోన్నత సీమల నుండి పిలుచుచున్నాడో యెఱుగుదురా? సకల నామాధిపతియగు మీ సర్వేశ్వరుడు దేనితో మిమ్ము శాసింపుచున్నాడో ఆ దివ్యలేఖినిని గుర్తించితిమని భావింపు చుంటిరా? లేదు, నా జీవితముపై యాన! దీనిని మీరెరిగియుంటిరేని ఈ జగమును త్యజియించి, హృదయపూర్వకముగ దివ్యప్రియతముని సమక్షమునకు వేగిరపడి యుండెడువారు. ఘనతరమగు జగమును సంక్షోభములో పడద్రోయు నటుల మీ యాత్మలు ‘ఆయన’ వాక్కునకు పరవశించెడివి, ఇక ఈ యల్పప్రపంచ మెంత ! నా యనుగ్రహమునకు ప్రతీకగా, నా ప్రేమాన్విత కారుణ్య ధామము నుండి నా యౌదార్యతుషారములు మీరు కృతజ్ఞులగునటుల భువిపై వర్షించినవి.

56

ఒకనిని గాయపరచినందుకు లేక కొట్టినందుకు విధియింపబడు అపరాధశుల్కము - గాయపు తీవ్రతపై నాధారపడియుండును; ఏలయన దివ్యన్యాయాధీశుడు ప్రతి స్థాయికిని, విశేషపరిహారమును సూచించినాడు. సత్యముగా, ‘ఆయన’ నిర్దేశకుడు, శక్తివంతుడు, మహోన్నతుడు. మా కభీష్టమయ్యెనేని ఈ చెల్లింపులను వాటి సముచిత పరిమాణములలో నిర్దేశింతుము -- మేమిచ్చు వాగ్దానమిది; ‘ఆయన’ యదార్ధమునకు, తన ప్రతిజ్ఞాపాలకుడు, సమస్త విషయజ్ఞుడు.

57

మాసమునకొక్క పర్యాయము విందును గావించుట, కేవలమది జలసమర్పణమైనను సరియే, నిశ్చయముగ మీకు విధియింపబడినది; ఏలయన, పరమాత్ముడు భూస్వర్గ సాధనములు రెండింటి సాహాయ్యమునను హృదయములను సమైక్యము గావింపదలచి యున్నాడు.

58

దైహికములును, నీతిబాహ్యములును అగు వాంఛలు, మీ యందున విభేదములను రేకెత్తించునేమో జాగరూకులు కండు. ఒకే హస్తపుటంగుళుల వలె, ఒకే దేహపుటంగముల వలె ప్రవర్తిల్లుడు. మీరు విశ్వసింతురని, దివ్యావిష్కరణాలేఖిని మీకీ విధముగ నుపదేశింపుచున్నది.

59

భగవంతుని సౌహార్ద్రమును, ‘ఆయన’ పురస్కారములను గణియింపుడు. ఆయన సమస్త ప్రాణులను తానై త్యజియింప జాలినను మీకు లబ్ధినొసంగు వానిని మీకు విధియించినాడు. మీ దుష్కార్యములు మాకెన్నడును హానిని కలిగింపజాలవు; అట్లని, మీ సత్కార్యములు మాకు లబ్ధినీ చేకూర్చవు. కేవలము పరమాత్ముని కొరకే మిమ్మాహ్వానింపుచున్నారము. అవగాహనా పరుడును, అంతర్దృష్టి యుతుడునునగు ప్రతి మనుష్యుడును యిందుకు సాక్షీభూతుడే.

60

మీరు ఆహారయోగ్యములగు మృగములనో, పక్షులనో వేటాడవలసి వచ్చెనేని, వానిని వెన్నంటునపుడు భగవన్నామమును స్మరియింపవలె; ఏలయన, అటుపై పట్టుబడినదేదైనను - అది విగతజీవిగ దొరికినను సరియే - మీకు ఆమోదనీయమే యగును. ‘ఆయన’, సత్యముగా సర్వజ్ఞుడు, సమస్త పరిజ్ఞాని. అయినను, మితిమీరి వేటాడతగదని తెలియుడు. సర్వవిషయముల యందునను న్యాయపథమును, సమతౌల్యతను అనుసరింపుడు. దివ్యా విష్కరణోదయస్థానమగు ‘ఆయన’ మిమ్మిటుల ఆదేశింపుచున్నాడని గ్రహియింపుడు.

61

నా వారియెడ కరుణను చూపుమని పరంధాముడు మిమ్మాదేశించి నాడు; కాని అన్యుల యాస్తిపై వారికెట్టి హక్కును ‘ఆయన’ యనుగ్రహింపలేదు. సత్యముగా భగవంతుడు తన సృజితజీవుల యావశ్యకతల కతీతముగ స్వయం సమృద్ధుడు.

62

ఎవ్వడైనను ఉద్దేశ్యపూర్వకముగ నొక గృహమును అగ్నికి ఆహుతి గావించెనేని, మీరును వానినట్లే దహియింపుడు; బుద్ధిపూర్వకముగ నెవ్వడైనను యింకొకని ప్రాణమును తీసెనేని మీరును వానిని పరిమార్పుడు. మీ సర్వశక్తి సామర్ధ్యములతో భగవంతుని ప్రబోధముల ననుసరింపుడు; అజ్ఞానుల విధానములను విడనాడుడు. గృహదగ్ధ కారకునకును, హంతకునకును ఆజన్మ కారావాసమును మీరు విధియించినచో నది దివ్యగ్రంథ నియమముల ప్రకార మామోదనీయమే. ‘ఆయన’ కు, నిశ్చయముగ, తన యిచ్ఛానుసార మాదేశించు అధికారమున్నది.

63

పరమేశ్వరుడు మీకు వివాహమును నిర్దేశించినాడు. ఇరువురుకన్న ఎక్కువమంది భార్యలను వివాహమాడుదురేమో, జాగ్రత్త. ఎవ్వడైనను భగవంతుని పరిచారికలయందొక్కరిని జీవిత భాగస్వామిగా పరిగ్రహించి సంతుష్టి నొందెనేని ఆతడు, ఆమె - యిరువురును సామరస్యముతో జీవింతురు. తన సేవకై యొక సేవికను గైకొను నాతడు సముచితరీతిన వర్తింపవలె. సత్యముగ, న్యాయముగ దివ్యావిష్కరణాలేఖినిచే పొందుపరుపబడిన నిర్దేశమిట్టిది. నా సేవకుల యందున నన్ను స్మరియించువానికి జన్మమునీయవచ్చును కనుక, ఓ మానవులారా ! వివాహితులు కండు. మీకిది నాయానతి; మీకు సహాయకారి యగుటకై దీనిని స్థైర్యముతో పాలింపుడు.

64

ఓ జగజ్జనులారా! స్వార్ధప్రేరణల ననుసరించవలదు; ఏలయన, నిక్కముగా నవి క్రౌర్యమును, కామోద్రేకమును రేకెత్తించును. అందుకు బదులుగా భక్తిని, దైవభీతిని ప్రదర్శింపుడని మిమ్మాదేశించు సమస్తసృజిత వస్త్వాధిపతియగు ఆయన ననుసరింపుడు. ‘ఆయన’ యదార్ధమునకు, తన ప్రాణిసర్వస్వముకును సార్వభౌముడు. క్రమబద్ధీకృతమైన పిదప భువియం దనర్ధములను రెచ్చగొట్టరాదని తెలిసికొనుడు. ఇట్లు వర్తించునాతడు మావాడు కాడు, మేమాతనిని వర్జించినాము. దివ్యావిష్కరణాధామము నుండి సత్యబలముచే, ప్రకాశితమైన యాదేశమిట్టిది.

65

వివాహము ఉభయపక్షముల సమ్మతిపై నాధారపడి యుండునని బయాన్ నందు పేర్కొనబడినది. మా సేవకుల యందున ప్రేమ, ఐక్యత, సామరస్యములను కలిగింపనెంచి, వారి మధ్య వైరమును, విద్వేషమును తల యెత్తునేమోనని, వివాహమాడనెంచిన జంట యభీష్టము తెలిసినతోడనే, అది వారి జననీజనకుల సమ్మతిన జరుగవలెనని మేము నియమబద్ధము గావించి నాము. మాకిందు వేరు ఉద్దేశ్యములును కలవు. మా యాదేశ మీవిధముగ నిర్దేశితమైనది.

66

నగరవాసులకు పంధొమ్మిది మిష్కల్‌ల స్వచ్ఛమైన సువర్ణముగను, గ్రామీణులకు అంతే పరిమాణముగల రజతముగను నిర్ధారితమైనట్టి వివాహశుల్క సమర్పణ లేకుండ ఏ వివాహమును కుదర్పబడరాదు. ఈ మొత్తము నెవ్వరేని పెంచనెంచిన, దానినాతడు తొంబదియైదు మిష్కల్‌ల పరిమితి నధిగమిపనీయతగదు. మహత్వాధికారపూర్వకముగ పేర్కొనబడినయట్టి యాదేశ మిది. అయినను, అత్యల్పస్థాయి చెల్లింపుతో సంతుష్టుడయ్యెనేని, దివ్యగ్రంథాను సార మది యాతనికి సముచితమే యగును. లోకేశుడు, యదార్ధమునకు, తా దలచిన వారిని ఇహపర సాధనముల మూలమున సుసంపన్నుల నొనరించును; ‘ఆయన’ కు సత్యముగా, సకలాంశములపై నధికారమున్నది.

67

తన సేవకులయందెవడైనను ప్రయాణము చేయనెంచిన, ఆతడు తాను గృహమునకు తిరిగివచ్చు సమయమును తన యర్ధాంగికి నిర్దుష్టముగ తెలుపవలెనని సర్వేశ్వరుడు తీర్మానించినాడు. వాగ్దత్త సమయమునకే తిరిగి వచ్చెనేని, ఆతడు దేవదేవుని యాదేశమును పాలించివాడగుటయే కాక, ‘ఆయన’ యధీకృత లేఖిని మూలమున ధార్మికులయందున గణియింప బడును; అట్లుగాక, ఆలస్యమునకు తగు కారణముండెనేని, తన కళత్రమునకా వర్తమానమునంపి, సకాలమునకామె చెంతకు వచ్చుటకు శాయశక్తుల యత్నింపవలె. వీటియందేదియును సంభవింపనిచో నామె నవమాసముల పర్యంతము నిరీక్షించుట యుక్తము; తదనంతరమామె పునర్వివాహము చేసికొనుట కెట్టి యవరోధమును ఉండబోదు. అయినను ఆమె సుదీర్ఘ కాలము నిరీక్షించెనేని - ఓరిమిని వహియించు స్త్రీ, పురుషులను భగవంతుడు నిశ్చయముగ, ప్రేమించును. నా యాజ్ఞల ననుసరింపుడు, భగవంతుని పవిత్ర ఫలకము నందపరాధులుగా గణియింపబడిన దుష్టుల ననుసరింప వలదు. ప్రతీక్షా సమయము నందొకవేళ, తన భర్తనుండి వార్తయందెనేని, శ్లాఘనీయ విధానము నామె యవలంబింపవలె. సత్యమునకు తన సేవికాసేవకులు పరస్పర మన్యోన్యముగ నుండవలెననునది ‘ఆయన’ యాకాంక్ష; మీలో పంతములు చెలరేగునట్లు వర్తింతురేమో, జాగరూకులు కండు. ఇవ్విధముగ తీర్మానము ధృవీకృతమై వాగ్దానము నెరవేరినది. అయితే, ఒకవేళ తన పతి మరణ లేదా హత్యా సమాచార మామెకు చేరెనేని, సాధికారిక నివేదికవలననో, ధర్మపరులగు యిరువురు సాక్షుల సాక్ష్యమువలననో నిర్ధారితమగునంత వరకు పునరుద్వాహము గాకుండుట యామెకు విధియింపబడినది; ఆపై నిర్ణీత మాసముల యనంతరము, తానెంచుకొనిన విధానమునామె యవలంబింప వచ్చును. శాసనకర్త యును, శౌర్యశాలియును అగు ‘ఆయన’ యాదేశమిట్టిది.

68

భార్యాభర్తల మధ్య రోషద్వేషములు తలయెత్తెనేని, యాతడామెకు విడాకులనీయక ఒక సంవత్సరకాలము ఓరిమిని వహియింపవలె, ఏలయన, బహుశః వారియందనురాగ సౌరభములు పునఃపరిమళింవ వచ్చును. ఒకవేళ ఈ వ్యవధి పూర్తయి, వారి మధ్య ప్రేమ పునరుజ్జీవము నొందనిచో విడాకులు చోటుచేసుకొనుట విధాయకమే. నిక్కముగా, భగవద్వివేకము సమస్త వస్తు జాలమును ఆవరించినది. మీరు ముమ్మారు పలికి స్త్రీకి విడాకులనిచ్చు పూర్వ విధానము నవలంబించుటను పరమాత్ముడు తన తన యాజ్ఞాలేఖినిచే లిఖియింప బడిన యొక ఫలకమునందు నిషేధించినాడు. మీరు కృతజ్ఞులుగా పరిగణింప బడవలెనని, ఆయన తన పరముగ అనుగ్రహించినట్టిదిది. ఒక్కొక్క మాసము గడచుకొలది పరస్పరానురాగమును, అభీష్టమును ఒనగూడి నపుడు, విడాకులిడిన వాడు తన యర్ధాంగిని, ఆమె వేరెవ్వరినీ మనువాడియుండనిచో, పునరుద్వాహమగుటకు నిర్ణయించుకొనవచ్చును. ఆమె మరల వివాహిత కాకపోయిన పక్షముననూ, ఆమె పరిస్థితి మారనట్లు స్పష్టమైననూ తప్ప, ఈ నవ్యసమాగమముతో వియోగము నిర్ధారణయై విషయము ముగిసిపోవును. దివ్యసౌందర్యోదయ స్థానమగు ఆయనచే, రాజసముట్టిపడ, ఈ మహిమాన్విత ఫలకమునం దీవిధముగ తీర్మానము లిఖియింపబడినది.

69

భార్య భర్తననుసరించి ప్రయాణించునప్పుడు దారిలో వారి మధ్య విభేదములు తలయెత్తెనేని ఆమెకొక సంపూర్ణ వత్సరము వ్యయములకు ధనము నాతడేర్పరుపవలసి యుండును; ఇంకను, ఆమెను వచ్చినచోటికి పంపివేయవలె, లేనిచో నామె ప్రయాణమునకు వలయు ఏర్పాట్లన్నియు చేసి ఒక విశ్వసనీయుని తోడిచ్చి గృహమున కంపవలె. మీ ఈశుడు, యదార్ధముగా, భూజనులందరినీ ఆవరించినయట్టి సార్వభౌమాధికారముతో తన యభీష్టానుసారము ఆదేశించును.

70

విశ్వాసఘాతుక వర్తన నిరూపితమగుటచే పరిత్యక్త అయిన పడతి ప్రతీక్షాకాలము నందెట్టి మనోవర్తిని పొందజాలదు. ఇవ్విధముగ, న్యాయాంబరము నుండి మా శాసనప్రభాతనక్షత్రము దేదీప్యమానముగ ప్రజ్జ్వలించినది. వాస్తవము నకు, పరాత్పరుడు సమైక్యతను, సామరస్యమును అభిలషించును, వియోగమును, విడాకులను అభిశంసించును. ఓ జనులారా, ఒండొరులు ఆనందోత్సాహములతో మెలగుడు. నా జీవితము సాక్షిగా! ఉర్వి యందలి సమస్తమును సమసిపోవ సత్కర్మలే సజీవములై వర్ధిల్లును; నా వాక్కులు సత్యమనుటకు సర్వేశ్వరుడే సాక్షి. ఓ నా పరిజనులారా! మీ విభేదములను పరిష్కరించుకొనుడు; దురహంకారులను, ముష్కరులను అనుసరింపక, మా మహనీయలేఖిని ప్రబోధమును పాటింపుడు.

71

మీ పూర్వీకులను మోసగించినటుల, మిమ్ము సైతమీ ప్రపంచము మోసగించునేమో, జాగరూకులు కండు! మీ పరమేశుని శాసన నియమములను పాలింపుచు, మీ ముందేర్పరుపబడిన సత్య, ధర్మయుతపథము ననుసరింపుడు. అసమానతను, అపరాధమును త్యజియించి సుగుణము నలవరచుకొనినవారు భగవంతుని దృష్టియం దాయన ప్రాణులలోకెల్ల శ్రేష్ఠులు. వారి నామములు ఊర్ధ్వలోకవాసుల సముదాయము చేతను, భగవన్నామమున సమున్నత మొనరింపబడిన ఈ దివ్యగుడారమునం దధివసించు వారందరిచేతను వినుతింపబడును.

72

స్త్రీ, లేక పురుష బానిసల వ్యాపారము చేయుట మీకు నిషేధించ బడినది. తానే సేవకుడైయుండిన వానికి భగవంతుని సేవకుల క్రయము తగనిది. ఆయన పవిత్ర ఫలకమునందిది నిషేధ్ధము. ఆయన కారుణ్యముకొలది న్యాయలేఖినిచే ఈ రీతిగ యాజ్ఞ లిఖియింపబడినది. ఎవ్వడును ఇంకొకనిపై యాధిక్యతను వహియింపకుండు గాక; అందరును భగవంతుని యెదుట కట్టు బానిసలే; అంతియేకాక, ఆయన తప్ప అన్యదైవము లేడను సత్యము నెల్లరును సోదాహరణముగ చాటుదురు. సత్యముగా, ఆయన సమస్తవిజ్ఞాని; ఆయన విజ్ఞానము సర్వావృతము.

73

మీరు సత్కర్మ వస్ర్తాభూషితులు కండు. ఎవని కార్యములు భగవంతునికి సంప్రీతిపాత్రములగునో, అట్టివాడు నిక్కముగా, బహా జనుల యందొకడై ఆయన సింహాసన సమక్షమున స్మరియింపబడును. సద్వివేచన, సద్వివేక, సద్ధర్మపూరిత కార్యములతో సమస్తసృష్ట్యాధిపతికి సహకరింపుడు. సకల దయామయుడగు ‘ఆయన’ పలు దివ్య ఫలకములం దీరీతిగ మీరు ఆదేశింపబడినారు. యదార్ధమునకు, నేను వచించునదంతయూ ‘ఆయన’ కు విదితమే. అన్యునితో నెవ్వడును కలహింపకుండు గాక, ఆతనిని వధియింప కుండు గాక; సత్యముగా నిది ఈ మహనీయ దివ్యగుడారమునం దగోచరముగ నుంచబడిన గ్రంథమునందు ప్రతిషేధితమైనది. ఏమీ! భగవంతుడు చేతనత్వమునిచ్చి, తన శ్వాసచే యూపిరిపోసిన వానిని వధియింతురా? అట్లయిన, ఈ మీ యుల్లంఘనము ‘ఆయన’ భద్రాసన సాన్నిధ్యమున తీవ్రమైనదిగా గణియింపబడును సుమా! దైవభీతిని కలిగి యుండుడు, ‘ఆయన’ పరిపోషితమును నాశనమొనరించుటకై అన్యాయ, దౌర్జన్య హస్తముల నెత్తక, నిత్యుడగు భగవంతుని మార్గము ననుసరింపుడు. దివ్యప్రబోధ కేతనధరులై దివ్యజ్ఞానాతిథేయ సమూహము లగుపించినయంతనే, సకల వైభవోపేతుడనగు ఆయన యూపిరిచే సృజియింపబడిన స్వర్గమునందలి యనంత జీవనస్రవంతి నుండి పానముచేయ నెంచిన వారు దక్క, మతవర్గములు పారద్రోలబడును.

74

భగవంతుడు తన జీవకోటిపై తనకుగల దయకు ప్రతీకగా, వీర్యము ఏహ్యకరమైనది కాదని తీర్మానించినాడు. సంతోషాతిరేకముతో, ‘ఆయన’ కు కృతజ్ఞతల నర్పింపుడు, ఆయన సాన్నిహిత్యమను ఉదయస్థానమునకు దూరముగనుండువాని ననుసరింపకుడు. సర్వావస్థలయందునను దివ్య ధర్మమును సేవించుట కుద్యుక్తులు కండు; ఏలయన, భగవంతుడు, నిక్కముగా, సకల జగాచ్ఛాదితమగు తన సార్వభౌమాధికారముచే మీకు సహకరింపగలడు. మీ వస్త్రములపై మాలిన్య మిసుమంతైనను అగుపింపకుండు నటుల పారిశుధ్యపాశమును దృఢముగ చేబూనుడు. సకల పరిశుద్ధతల కతీతముగ పవిత్రీకృతుడైన ‘ఆయన’ యాదేశమిట్టిది. ఈ ప్రమాణము ననుసరింప లేకపోవుటకు తగు కారణమున్నచో నట్టి యాతడు నింద్యుడు కాడు. నిజమునకు, భగవంతుడు క్షమాశీలి, కరుణాళువు. మలినమైన ప్రతిదానిని, పేర్కొన బడిన మువ్విధములయం దేవిధముచేతను మార్పునొందని జలముతో ప్రక్షాళన మొనరింపుడు; గాలియందుంచుట చేతనో, మరియే అన్యమూలకముల వలననో మార్పునొందిన యుదకము నుపయోగింపక జాగరూకులు కండు. మానవాళి యందున పరిశుభ్రతకు పరమార్ధము కండు. అతులితుడును, సకల వివేకి యును అగు పరమేశ్వరుడు, సత్యమునకు మీకై యభిలషించినదిదియే.

75

ఆ ప్రకారముగ, భగవంతుడు తన యౌదార్యసమక్షము నుండి వెలువడిన యనుగ్రహముగ, వివిధాంశములకును, జనులకును అశుచిని ఆపాదింపుచున్న “మలినత్వ”౎ భావన నుద్వాసించినాడు. నిశ్చయముగా, ‘ఆయన’ సదా క్షమాశీలి, మహోదారుడు. సత్యముగా, మేము మా మహోత్కృష్టనామముల, మా విశేషస్వభావముల శోభలను సమస్త జగముపైనను భాసిల్లజేసిన నాటి, రిద్వాన్ ప్రథమ దివసమున, సమస్తసృష్టియును విమలాంబుధి యందున స్నానమాడినది. సమస్తభువనావృతమగు నా దయానుగ్రహమునకిది యదార్ధముగ నొక సంకేతము. మరి, సర్వమతస్థులతోడను సన్నిహితముగ వ్యవహరింపుడు; పరమకరుణాళువగు మీ యమరేశుని దివ్యధర్మము నెలుగెత్తి చాటుడు; అవగాహనా పరులైనచో సకల కార్యములకును మకుటాయమాన మిదియేనని యెరుంగుడు.

76

ధూళిచే మలినమైన దానిని ప్రక్షాళనచేయవలెననుచు, సంపూర్ణ పరిశుభ్రతావలంబనను పరంధాముడు మీకు నిర్దేశించియుండ, ఇక పేరుకు పోయిన మురికిని, తత్సదృశ మాలిన్యమును గురించి వేరుగ చెప్ప నవసరము లేదు. దైవభీతిని కలిగి, పరిశుభ్రదేహులు కండు. ఎవ్వని వస్త్రమైనను మురికిగనున్నట్లగుపించినచో నాతని ప్రార్థనలు భగవంతుని దరి చేరజాలవు. ఉత్కృష్ట దేవగణము లాతనినుండి దూరముగ వైదొలగిపోవును. గులాబీజలమును, స్వచ్ఛములగు సుగంధద్రవ్యములను వినియోగింపుడు; తుల్య రహితుడును, సకల వివేకియును అగు మీ దేవదేవుడు వాస్తవమునకు వాంఛించినది మీ నుండి పరిమళింపవలెనని భగవంతు డనాదిగ నాశింపు చున్నాడు.

77

బయాన్‌నందు గ్రంథ వినాశన పరముగ నిర్దేశితమైన శాసనము నుండి భగవంతుడు మిమ్ము విముక్తులను గావించాడు. వ్యర్థవివాద కారకములు గాక, మీకుపయుక్తములగు శాస్త్రముల నధ్యయనము గావించుట కనుమతించినాము; గ్రహియింపగలిగిరేని, మీకిది మేలొనర్చును.

78

ఓ ధరణీశులారా! సకల సార్వభౌమాధినాధు డేతెంచినాడు. సర్వశక్తి వంతుడును, సంరక్షకుడును, స్వయంభువును అగు భగవంతునిదే దివ్య సామ్రాజ్యము. ఆయనను దక్క అన్యునారాధింప వలదు; సమస్తనామాధిపతి యగు మీ దైవము వంకకు జ్యోతిర్మయ హృదయములతో వదనములను సారింపుడు. మీ స్వాధీనమందలి దేనికిని సాటిరానట్టి దివ్యావిష్కరణమిది యని తెలియగలరు.

79

మీరన్యులకై సంగ్రహించియుంచిన దానియెడ మీరానంద పరవశు లగుటను, నా నిక్షిప్తఫలకము దక్క అన్యమెద్దియును గణుతింపలేని లోకముల నుండి మిమ్ముమీరు దూరముగావించు కొనుటను మేమవేక్షింపు చున్నాము. మీరు సమీకరించుకొనిన సంపదలు మీ పరమలక్ష్యము నుండి మిమ్ము బహుదూరమున కాకర్షించినవి. ఈ రుగ్మత మీకు సముచిత మైనదేనని గ్రహియింపుడు. ఐహికములగు సకల మాలిన్యములను మీ మనస్సులనుండి క్షాళన మొనరింపుడు; సర్వమును త్యజియించి నిక్షిప్తఫలక నిర్దేశితమును పాటించిన వారిని దక్క తక్కిన ప్రపంచమును ప్రకంపింపజేసి, సమస్త జనులను శోకతప్తులనొనరించిన భూలోకసువర్లోకస్రష్టయగు మీ భగవంతుని సామ్రాజ్యమున కేగుటకు త్వరనొందుడు.

80

భగవంతునితో సంభాషించిన యాతడు యుగప్రాచీనుని ప్రభను గాంచి, సాగరముల నుప్పతిల్లజేసిన ఈ దివ్యపాత్రమునుండి పునర్మిలనమను విమలోదకమును గ్రోలిన దివ్యదివసమిది. వచించు : ఏకైకుడగు నిజదైవము సాక్షిగా! దివ్యసామ్రాజ్యశిఖరముల నుండి పరమాత్ముని వాణి : “భువియందలి యో గర్విష్టులారా, కార్యోన్ముఖులు కండు, ఆయన చెంతకు త్వరనొందు” డని ప్రకటించుట విననగుచుండ దివ్యావిష్కరణాప్రత్యూషము చుట్టును సైనాయ్ పరిభ్రమింపుచున్నది. ఈ దినమున, కార్మెల్ ఆయన సాన్నిధ్యమునకు భక్తి తత్పరతతో త్వరనొందుచుండ, జియోన్ హృదయము నుండి: “వాగ్దానము నెరవేరినది. మహోన్నతుడును, సర్వశక్తివంతుడును, పరమ ప్రియతముడును అగు భగవంతుని పవిత్రాదేశమునం దుద్ఘోషితుడైన యాతడు ప్రత్యక్షీకృతుడైనా,”౎డను ప్రకటన వెలువడుచున్నది.

81

ఓ మహీపతులారా ! ఈ స్థానమున, భావాతీతప్రభాస్థలియగు ఇప్ర్పదేశమున మహోన్నత శాసన మావిష్కృతమైనది. చంద్రు డెవ్వరిచే ఛిద్రము గావింపబడెనో, అప్రతిహతమగు ప్రతి తీర్మానమును ఎవ్వరిచే విశదీకృతమైనదో, తుదిఘడియల నెవ్వరారంభించిరో ఆ పరమ నిర్దేశకుని యిచ్ఛామూలమున ప్రతి నిక్షిప్త విషయమును వెలుగులోనికి తేబడినది.

82

ఓ రాజన్యులారా ! మీరు సామంతులు మాత్రమే. తన మహాద్భుత కీర్తితో కొలువై, సంకటహరుడును, స్వయంభువును అగు తన చెంతకు మిమ్మాహ్వానింపుచు, రాజాధిరాజగు ‘ఆయన’ ప్రత్యక్ష మైనాడు. దివ్యావిష్కరణా మూలము నెరుగుటలో మీ యహంకారము మిమ్ము నిరోధించేను జాగ్రత్త; స్వర్గస్రష్టయగు ‘ఆయన’ నుండి మిమ్ము ప్రాపంచికవిషయములు తెరలవోలె త్రోసివేయునేమో జాగరూకులు కండు. సమస్త జాతుల ఆకాంక్షయును, మిమ్ము తన ఏకైకవాక్కుచే సృజించి, తన సార్వభౌమత్వమునకు శాశ్వత ప్రతీకలు గావించిన ‘ఆయన’ ను సేవించుట కుద్యుక్తులు కండు.

83

భగవంతుని ధార్మికత్వము సాక్షిగా! మీ రాజ్యములపై ఆధిపత్యమును నెరపుట మా యాకాంక్ష గాదు. మానవ హృదయములను జయించి, స్వాధీన మొనరించుకొనుటయే మా కార్యము. బహా నేత్రములు వానిపైననే స్థిరముగా నిలిచినవి. దివ్యనామముల సామ్రాజ్యమిందులకు సాక్ష్యము వహియించునని మీరు గ్రహియించిన చాలును. తన దైవము ననుసరించు నాతడు ప్రపంచమును, తత్సర్వమును త్యజియించును; మరి యంతటి మహోన్నత స్థానము నొందియున్న ఆయన నిస్సంగత్వమెంతటి యుత్కృష్టమై యుండ వలె ! మీ సౌధములను వీడి ఆయన దివ్యసామ్రాజ్యప్రవేశప్రాప్తికై త్వరనొందుడు. వాస్తవమునకు, మీకిది ఇహపరములు రెండింటియందునను ఫలదాయకము. ఊర్ధ్వలోకాధిపతి యిందుకు సాక్ష్యము వహియించునని తెలియుడు.

84

నన్ను దక్క సర్వమును త్యజియించి, నా దివ్యసామ్రాజ్యమున నా దివ్యధర్మమునకు సాహాయ్యమొనరింప నుద్యమించు రాజునకై నిరీక్షించు వదాన్యత ఎంతటి ఘనమైనది! అట్టి రేడు బహాజనులకై భగవంతుడు సంసిద్ధము గావించిన శోణమహానౌక యందలి సహచరుల యందొక్కనిగ గణియింపబడును. సర్వులును ఆతని నామమును కీర్తింపవలె; ఆతని స్థాయిని గౌరవింపవలె; గోచరాగోచర లోకస్థితమగు సకలమునకు బలయుత సంరక్షకుడనగు నా నామమనెడు తాళములతో నగరసీమలను వివృతమొనరించుటకై యాతనికి తోడ్పడుడు. అట్టి భూపాలుడు సమస్తమానవజాతికిని నేత్రము, సృష్టిశిఖరమున ప్రభవిల్లు భూషణము, సమస్త జగత్తునకును శుభాశీస్సుల మూలమగు స్రవంతి. ఓ బహాజనులారా, ఆతనికి సాహాయ్యము గావించుటకై మీ సంపత్తిని, కాదు మీ జీవితములనే యర్పింపుడు.

85

ఓ ఆస్ట్రియా చక్రవర్తీ: నీవు అఖ్సా మసీదు సందర్శనార్థమై వెడలినప్పుడు, భగవజ్జ్యోతిఃప్రత్యూషమగు ‘ఆయన’ అక్కా కారాగారవాసిగ నున్నాడు. నీవాయనను గమనింపవైతివి, ప్రతి గృహమును మహోన్నత మొనరించి, ప్రతి ఘనద్వారమును వివృత మొనరించినయట్టి ఆయనను గురించి విచారణ సైతము గావింపవైతివి. నిశ్చయముగ, మేమీ తావును సకల జగమును ఆశ్రయించునటుల, జగజ్జనులు నన్ను స్మరియింపునటు లొనరించినాము; అయినను, ఈ యారాధనకు పరమావధియగు ‘ఆయన’ - నీ ప్రభుడును, సకలలోకాధీశుడును అయిన భగవంతుని దివ్యసామ్రాజ్యముతోకూడి ప్రత్యక్ష మైనపుడు, ‘ఆయన’ ను విస్మరించినాడవీవు. మేము సదా నీతోడ నుండి, నీవు అలక్ష్యమూలమును, దాని శాఖను అంటిపెట్టుకుని యుండుటను గాంచితిమి. నా వచనములకు నీ దైవమే సాక్షి. మేము నీ ఎదుటనుండినను, మమ్మెఱుగక, మా నామము చుట్టును పరిభ్రమింప జూచి దుఃఖితులమైతిమి. నీ నేత్రములను దెరువుము, తద్వారా - ఈ మహోజ్జ్వల దృశ్యము నవలోకించి, దివారాత్రములును నీవారాధించునట్టి ‘ఆయన’ ను చూడవచ్చును; ఉజ్జ్వల దిఙ్మండలముపై శోభిల్లు దివ్యజ్యోతిని గాంచవచ్చును.

86

వచించు : ఓ బెర్లిను రాజా! “సత్యముగా, అనంతుడను, అసమాను డను, దినప్రాచీనుడను అగు నేను తప్ప అన్యదైవము లే”౎డని ఈ ప్రత్యక్షీకృత దేవళము నుండి వెలువడుచున్న దైవవాణి నాలింపుము. దివ్యావిష్కరణ ప్రత్యూషమును గుర్తించుటలో నీ యహంకారము నిన్నాటంక పరచునేమో, భూస్వర్గముల సింహాసనాధీశుని నుండి ఐహిక వాంఛలు తెరవోలె నిన్నావరించు నేమో, జాగరూకుడవు కమ్ము. పరమోన్నతుని లేఖిని నీకీరీతిగ యుపదేశింపు చున్నది. సత్యముగా, ‘ఆయన’ మహోదారుడు, సకల వదాన్యుడు. నిన్ను మించిన యధికారముగల, నిన్ను మించిన స్థాయినొందిన యాతడు (మూడవ నెపోలియన్) నీకు జ్ఞాపకమేనా? అతడెక్కడ? ఆతడి స్వాధీనమందలి వస్తుసంచయ మెటకు పోయినది? హెచ్చరికగ నుండుము, గాఢనిద్రాపరవశులలో జేరకుము. క్రౌర్యాతి ధేయులు మమ్మెటుల బాధించిరో మేమెరుక పరచినపుడు భగవత్ఫలకమును వెనుకకు విసిరినదాతడే. కావుననే, దురదృష్టమన్ని వైపుల నుండియు తన నావరింప, ఆతడెంతయో నష్టినొంది మట్టిపాలైనాడు. ఓ రాజా ! ఆతనిని గురించియును, నగరములను జయించి నీ వలె ప్రజలను శాసింపు చున్న వారిని గురించియును - సుదీర్ఘముగ యోచింపుము. సకల దయామయుడు వారిని, వారి సౌధములను భ్రష్టతనొందిచి సమాధుల పాలొనరించినాడు. హెచ్చరిక నొందియుండుము, ఆలోచనాపరుల యందొకడవు కమ్ము.

87

మేము మిమ్మర్ధించిన దేమియు లేదు. ఓ రాజసముదాయమా ! మాకు మీ మూలమున సంభవించిన దానిని సత్యముగా, భగవంతుని కొఱకు మేమెటుల సైరించితిమో, నటులే సహిష్ణులై యుండవలెనని యుద్బోధింపు చున్నాము.

88

ఓ అమెరికా పాలకులారా, అందలి గణతంత్ర రాజ్యాల అధ్యక్షులారా! “నిరంతరుడును, క్షమాశీలియును, సమస్తౌదార్యుడును అగు నేను తప్ప అన్యదైవము లే”౎డని అనంతత్వశాఖపై నుండి కూయుచున్న ఈ కపోతము నాలింపుడు. మీ రాజ్యమును న్యాయాభరణము చేతను, దైవభీతి చేతను, దాని మస్తకమును స్వర్లోకస్రష్టయగు భగవంతుని స్మరియించుటయను మకుటముతోడను - అలంకరింపుడు. సర్వజ్ఞుడును, సకల వివేకియును అగు ‘ఆయన’ యానతిచే, దివ్యనామములకు ఉషోదయమగు ఆయన మీకీ విధముగ నుపదేశింపుచున్నాడు. వాగ్దత్తపురుషుడీ మహనీయస్థానమునం దవతరించుట గాంచి, సమస్త గోచరాగోచర ప్రాణులును సంతసము నొందినవి. దివ్యయుగ ప్రయోజనము ననుభవింపుడు. సత్యముగా, సూర్యరశ్మి సోకిన సమస్తవస్తుదర్శనమునకన్న మీకాయన సందర్శనమెంతయో మేలని గ్రహియింపుడు. ఓ పాలక సముదాయమా! దివ్యవైభవప్రత్యూషము నుండి: “యదార్ధమునకు వాగ్దైవమును, సర్వజ్ఞమును అగు నేను తప్ప అన్యదైవము లే” డని వెలువడిన వాణి నాలింపుడు. అణగారినవారిని న్యాయహస్తములతో దరిజేర్చుకొనుడు, ఎగసిపడు పీడకుని - నిర్దేశకుడును, సకల వివేకియును అగు మీ ప్రభుని యాజ్ఞాదండముచే - అణచివేయుడు.

89

ఓ కాన్‌స్టాంటినోపుల్ ప్రజలారా! అదిగో! మీ మధ్యనుండి భయానకములైన ఉలూకపు కూతలను మేమాలించినాము. మనోవికారపు మైకము మిమ్మావరించినదా, లేక అలక్ష్యము నందడగి యుంటిరా? సముద్ర ద్వయ తీరములపైనున్న యో దివ్యస్థలీ! ఊర్ధ్వలోక దేవగణములును, మహోన్నతాసనమును పరివేష్టించిన వారును దుఃఖితులై రోదించునటుల నిరంకుశత్వాసనము నిక్కముగ నీపై స్థాపితమైనది, నీ యెదలో ద్వేషాగ్నిజ్వాలలు రగిలింపబడినవి. వివేకులను మూర్ఖులు పరిపాలించుటను, అంధకారము కాంతిపై గొప్పలుపోవుటను మేము నీయందవలోకింపుచున్నాము. యదార్ధమునకు నీ వహంభావపూరితవైతివి. నీ బాహ్యశోభ నిన్ను దురహంకారిని గావించినదా? మానవాళికి ప్రభుడగు ఆయన సాక్షిగా! ఇది యంతయును అచిరకాలములోనే అంతమొందును; నీ పుత్రికలు, విధవలు, నీ యందలి సమస్తవాసులును విలపింతురు. సర్వజ్ఞుడును, సకల వివేకియును మీకిట్లు తెలుపుచున్నాడు.

90

ఓ రైన్ నదీతీరములారా! దండనా ఖడ్గములు మీపై దూయబడుటచే రక్తసిక్తములైన మిమ్మవలోకించినాము; అయినను, మీకింకొక యవకాశమున్నది. బెర్లిన్ నేడు పూర్ణవైభవముతోనున్నను దాని యాక్రందనలు మాకు విననగుచున్నవి.

91

ఓ తా (తెహరాన్) ధాత్రీ! నీకెద్దియును వేదనను కలిగింపకుండు గాక, ఏలయన భగవంతుడు సకల మానవాళికి సంతోషదాయినిగ నిన్నెంచుకొనినాడు. ‘ఆయన’ మునుపు తోడేళ్లు చెల్లాచెదరొనంచిన దేవదేవుని మందను సమైక్యపరచి, న్యాయపరిపాలన గావించువానిని నీ సింహాసనము నందధిష్టింపజేసి యాశీర్వదించు గాక ! అట్టి పాలకుడు, ఆనందోత్సాహములతో, బహాజనుల కభిముఖుడై, వారికి తన యనుగ్రహముల నందింపగలడు. ఆతడు, వాస్తవమునకు భగవంతునిదృష్టియందున మానవజాతికి మణిభూషణముగ గణియింపబడును. దైవమహిమయును, ఆయన దివ్యావిష్కరణా సామ్రాజ్య వాసులందరి కీర్తియును అతనికి శాశ్వతముగ లభియించును.

92

మహదానందము నొందుము; ఏలయన, తన దివ్యవైభవావతారము నీ యందావిర్భవించుటచే భగవంతుడు నిన్ను “తన శోభాప్రత్యూషము”౎ గావించినాడు. కారుణ్యప్రభాత నక్షత్రము ప్రభవిల్లినయట్టి, భూమియును, స్వర్గమును శోభిల్లినయట్టి - ఈ నామము నీకనుగ్రహింపబడినందుకు సంతసిల్లుము.

93

అచిరకాలమునకే, నీ యంతర్గత వ్యవహారముల స్థితి మారి, అధికార పగ్గాలు ప్రజల చేతికి రాగలవు. సత్యమునకు, నీ దైవము సర్వజ్ఞుడు. ఆయన యధికారము సమస్త వస్తువులను ఆవరించియున్నది. నీ ప్రభుని దయానుగ్రహములను విశ్వసింపుము. ప్రేమోపేతమగు దయాదృష్టి నీపైననే కేంద్రీకృతమై యుండును. నీ యావేదన, ప్రశాంతతగ, పరిపూర్ణశాంతిగ మార్పునొందు దినము రానైయున్నది. అద్భుతమగు దివ్యగ్రంథమునందీ విధముగ నిర్దేశితమైనది.

94

ఓ ఖా(ఖురాసాన్) ప్రదేశమా! సకల సంపన్నుడును, మహోన్నతుడును అగు నీ దైవమును ఘనరీతిన శ్లాఘించుటకుద్యుక్తులైన మహావీరుల వాణి నీ నుండి మాకు విననగుచున్నది. సకల మహిమాన్వితుడనగు నా దివ్యనామమున, సృష్టిసామ్రాజ్యమునందు దివ్యనామ ధ్వజారోహణము జరుగు దినము శుభదాయకము. విశ్వాసులు ఆ దినమున దైవవిజయమునకు మోదమొంద, అవిశ్వాసులు ఖేదమొందుదురు.

95

ప్రజలపై అధికారమును చెలాయించువారితో నెవ్వరును కలహింప రాదు. వారిని వారి దారికి విడిచిపుచ్చి, మీ దృష్టిని మానవ హృదయముల వైపుకు సారింపుడు.

96

ఓ మహాశక్తిసమన్విత పయోనిధీ! దివ్యసార్వభౌమత్వమగు ‘ఆయన’ చే నీకనుగ్రహీతమైన దానిని దేశములపై సంప్రోక్షించి, ‘ఆయన’ న్యాయవస్త్రముతో సకల భూలోకవాసుల ఫాలములను అలంకరింపుము, తద్వారా సమస్త హృదయములును సంతసిల్లును, సకల నేత్రములును మిన్నగా మెరయును.

. ఎవ్వడేని శతమిష్కల్‌ల స్వర్ణము నార్జించినచో, అందలి పంధొమ్మిది మిష్కల్‌లు, భూస్వర్గముల స్రష్టయగు భగవంతునివి; ‘ఆయన’ కు సమర్పింపవలసినవి. ఓ జనులారా! ఇంతటి మహావదాన్యతను మీరు కోల్పోవుదురేమో, అప్రమత్తులు కండు. మేము మీతోడను, సమస్త భూస్వర్గ వాసుల తోడను వ్యవహరింప సర్వసమర్ధులమైనను, మిమ్ముల నీవిధముగ నాదేశించినాము; సర్వజ్ఞుడును, సమస్తము నెరిగినవాడును అగు భగవంతునికి దక్క, అన్యుని స్ఫురణకందని ప్రతిఫలములును, వివేకములును ఇందు గలవు. వచించు : ఈ విధముగ మీయార్జనలను పునీతమొనరించుటకును, మిమ్ములను భగవదేచ్ఛాపాత్రులకు దక్క అన్యుల యవగాహనకందని స్థానముల నందుకొన సమర్ధుల నొనరించుటకును ఆయన ఆకాంక్షించినాడు. సత్యమునకు! ఆయన ఉపకారి, ఉదారుడు, ప్రదాత. ఓ ప్రజలారా! భగవంతుని హక్కు యెడ అవిశ్వాసముతో వర్తింపనూ వలదు, ఆయన యనుజ్ఞ లేనిదే యధేచ్ఛగా దానిని వినియోగింపనూ వలదు. పావన ఫలకములయందున, ఈ పరమోన్నత గ్రంథము నందున ఆయన యాదేశ మివ్విధముగ నిర్ధారితమైనది. భగవంతునితో నవిశ్వాసముతో వ్యవహరించు నాతడు, తానును అవిశ్వాసమునకే గురియగును. భగవదాజ్ఞానుసారము వర్తించునాతడు - ఔదార్యుడును, వరప్రదాతయును, దాతయును, దినప్రాచీనుడును అగు తన ప్రభుని వదాన్యతా స్వర్గము నుండి ఆశీర్వచనము నొందును. నిక్కముగా, ‘ఆయన’ మీకై మీ జ్ఞానమునకు అతీతమైనదానినే, ఈ క్షణభంగుర జీవితానంతరము మీ యాత్మలు స్వర్గము దెసకు సముద్గమించి, మీ యైహికానంద బంధనములు భగ్నమైనపుడు మీకు గ్రాహ్యమగునట్టి దానినే ఆశించినాడు. దివ్యనిక్షిప్త ఫలకము నొందియున్న ‘ఆయన’ మిమ్ముల నీవిధముగ హెచ్చరింపుచున్నాడు.

97

గోచరాగోచరములకు అధినాథుడును, సకలలోకాధిపతియును అగు దేవదేవుని శాసనముల గురించి ఎన్నియో విజ్ఞాపనములు విశ్వాసుల నుండి మా సింహాసన సమక్షమునకు వచ్చినవి. పర్యవసానముగా, మేమీ పావన ఫలకము నావిష్కరించి, జనులదృష్టవశమున తమ ప్రభుని యాజ్ఞల ననుసరింతురని, దానిని ‘ఆయన’ శాసనవస్త్రములో నిక్షిప్తము గావించినాము. అట్టి అభ్యర్ధనలు పూర్వమనేక వర్షముల నుండియు మాకు చేయబడినవి; అయినను, మా వివేకముతో, ఈమధ్య కాలములో, మిత్రుల నుండి లేఖలు అసంఖ్యాకముగ వచ్చునంత వరకు, మా లేఖినిని ఆపి యుంచినాము; కావుననే మానవ హృదయములను చైతన్యవంతము గావింపగల సత్యశక్తితో స్పందించినాము.

98

వచించు: ఓ మతాధిపతులారా! మీ వర్తమాన ప్రమాణములతోడను, విజ్ఞానముతోడను భగవంతుని దివ్యగ్రంథమును ప్రామాణీకరింపవలదు; ఏలయన, ఆ గ్రంథమే మానవులయందేర్పరుపబడిన దోషరహిత మగు త్రాసు. మానవులును, వారి సంతతియును తమ స్వాధీనమందలి దేనినైనను, నిర్దుష్టమగు ఈ దివ్య తులతో కొలువవలసినదేననియు, దాని భారము తత్ప్రమాణానుసారమే పరీక్షింపబడవలెననియు తెలియుడు.

99

రేయింబవళ్లును, ఉదయ,సాయంసంధ్యాసమయముల యందునను మీరెవ్వరి నామంత్రింపుచుంటిరో ఆయనను గుఱుతించుటలో మీరు వైఫల్యము నొందుటను గాంచి, నా వాత్సల్యాన్విత నయనము బాధాతప్తమై కన్నీరిడుచున్నది. ఓ జనులారా! “సత్యముగా, సర్వశక్తియుత సంరక్షకుడను, స్వయమాధారుడను అగు నాతో బోల్పదగిన అన్యదైవము లే”౎డని సద్రత్- ఉల్-ముంతహా పిలుపునిచ్చుచున్న శుభ ‘శోణితస్థలి’ వైపుకు హిమశ్వేత వదనములతో, జ్యోతిర్మయ హృదయములతో పురోగమింపుడు.

100

ఓ మతనేతలారా! దార్శనికతయందున గాని, బుద్ధికుశలత యందున గాని మీలో నన్నెదిరించు వాడెవ్వడు? వాగ్పటిమయందున గాని, వివేకమున గాని నాకు సమయుజ్జీనని చెప్పుకొనువాడెందు కానవచ్చును? సమస్త దయాళువగు నా దైవము సాక్షిగా! లేడు; వసుధయందలి సమస్తమును సమసి పోవును; శక్తివంతుడును, పరమప్రియుడును అగు మీ భగవంతుని వదన మిదియే.

101

జనులారా! సమస్త విజ్ఞానమునకును మూలాధారుడగు ఆయనను తెలియుటయే సకలవిజ్ఞానార్జనకును పరమోన్నత పరమావధి యని మేము నిర్దేశించినాము; అయినను, ఈ దివ్యజ్యోతికి ప్రత్యూషమును, ప్రతి గుప్త విషయావిష్కర్తయును అగు ‘ఆయన’ నుండి మీ విజ్ఞానము తెరయై మిమ్మెటుల తొలగద్రోచినదో యవలోకింపుడు. ఈ విరళీకృత వాక్ప్రభా మూలము నెరిగితిరేని, మీరీ జగమందలి జనులను, వారి యాధీనమందలి సర్వమును త్రోసిపుచ్చి ఈ పావన మహాన్వితపీఠ సామీప్యమున కేతెంతురు.

102

వచించు: నిక్కముగా నిది, మాతృగ్రంథము భద్రపరుపబడిన స్వర్గమని గ్రహియింపుడు. “సర్వజన సార్వభౌముడును, సర్వాధికార ప్రపూర్ణుడును, ప్రేమోపేతుడును అగు దేవదేవునిదే సామ్రాజ్య” మని పవిత్ర భూమిస్థిత యగు మహాశైలముపై పాషాణముద్ఘోషించునటుల, హుతాశన నికుంజము ఎలుగెత్తి చాటునటుల గావించినదాయనయే.

103

మేమే విద్యాలయమునను అభ్యసింపనులేదు, మీ వ్యాఖ్యానము లెవ్వియును పఠియింపనులేదు. నిరంతరుడగు పరమేశ్వరుని చెంతకు మిమ్ముల నాహ్వానింపుచున్న ఈ నిరక్షరుని పలుకుల నాలింపుడు. గ్రహియింపజాలితిరేని, వసుధపైగల సమస్త సంపదల కన్న యిది మీకు మిన్న.

104

దివ్యావిష్కరణాస్వర్గమునుండి యనుగ్రహీతమైనదానిని అనుచితముగ వ్యాఖ్యానించి, దాని వాస్తవార్థమును వక్రీకరించు నాతనిని నిక్కముగా భగవంతుని మహోత్కృష్ట ప్రవచనమును భ్రష్టతనొందించిన వానిగ, పావన గ్రంథమునందు మృతునిగ గణియింప వచ్చును.

105

నఖచ్ఛేదనము గావించుకొనుట, దేహమునావరించిన మాలిన్యమును వారమునకొక పర్యాయము జలకముతో అభిషేచన మాచరించుటయును, ప్రక్షాళనకై మున్ను మీరవలంబించినదాని నాచరించుటయును - మీకు విధియింపబడినది. తుల్యరహితుడును, ఉదారుడును అగు ‘ఆయన’ మీకై నిర్దేశించిన దాని నలక్ష్యము చేయుదురేమో జాగరూకులు కండు. పరిశుభ్ర జలమునందే మునక వేయుడు; ఒకసారి ఉపయోగింపబడిన నీటిలో మరల స్నానమాడుట కనుమతి లేదు. పారశీక ప్రజాస్నానవాటికలను సమీపింపవలదు; అట్టి స్నానఘట్టములకేగు నాతడు, వానియందున ప్రవేశించక పూర్వమే దుర్గంధ భూయిష్టుడగును. ఓ జనులారా! వానిని వర్జింపుడు, అట్టి నికృష్టత ననుసరించు నీచులయందు చేరవలదు. వాస్తవమునకు, వారు అశుచిత్వ మాలిన్యములయందున మునిగి యున్నారని గ్రహియింపుడు. అవ్విధముగనే, పారశీక గృహప్రాంగణముల యందలి దుర్గంధభూయిష్టములగు జలాశయము లను వర్జించి, స్వచ్ఛముగా, పవిత్రముగా నుండుడు. యదార్ధము నకు, దైవానుగ్రహీత హృదయులను రంజిల్లజేయు పరిమళములు మీ నుండి వెలువడ, మీరు భూమిపై స్వర్గవాసులంబోలి సంచరింప జూడ నెంచితిమి. స్నానాభిలాషి నీటిలో మునుగుటకన్న, నీటిని తన దేహముపై బడునటుల పోసికొనుట ఉత్తమము, అంతియేకాదు, దేహనిమజ్జనము నుండి విముక్తి యును కలుగును. యదార్ధమునకు, దేవదేవుడు - మీరు తనయెడ కృతజ్ఞులగునటుల - తన సాన్నిధ్యానుగ్రహముగ మీ జీవనములను సుఖప్రదములు గావింప నెంచినాడు.

106

మీ తండ్రుల పత్నులను పరిణయమాడుట మీకు నిషేధింపబడినది. బాలుర విషయ చర్చకు మేము లజ్జతో వెనుదీయుదుము. ఓ జగజ్జనులారా, దయామయునియెడ భీతిని కలిగియుండుడు! మా పవిత్రఫలకమునందు మీకు నిషిద్ధమైనదాని నాచరింపవలదు. త్రోవదప్పి, వాంఛలదిగ్భ్రమయందు సంచరింపబోకుడు.

107

జనబాహుళ్యము వీక్షింప, వీధుల వెంట, విపణియందు విహరింపుచు దివ్యప్రవచనములను వల్లించుటకెవ్వరును అనుమతింప బడలేదు; అట్లుగాక, దైవసంకీర్తనాభిలాషి - తానందుకై ఏర్పరుపబడిన ప్రదేశముల యందునగాని, నిజగృహమున గాని అవ్విధముగ నాచరించుట యుక్తము. నిజాయితీని, దివ్యత్వమును కలిగియుండుటకిది యెంతేని అవశ్యము. ఇవ్విధముగ, మా యాజ్ఞాభానుడు మా దివ్యోచ్చారణాదిఙ్మండలము నుండి శోభిల్లినాడు. మరి, మా యాజ్ఞానువర్తులు ధన్యులు.

108

వీలునామా వ్రాయుట ప్రతి యొక్కరికిని విధియుక్తమై యున్నది. వీలునామాకర్త, తన శాసనమునకు మహోన్నత నామమును శీర్షిక గావించి, ఆ శాసనమందున - భగవంతుని దివ్యావిష్కరణోదయమున ఏకేశ్వరత్వమునకు సాక్ష్యము వహియించి, సృష్ట్యావిష్కరణ లోకముల యందున తనకు ప్రతీకయై, పరమ రక్షకుడును, విశ్వసనీయుడును అగు తన భగవంతుని వద్ద యొక నిక్షిప్తసంపద యగునటుల, తాను శ్లాఘనీయమని యెంచిన దానిని లిఖియింపవలె.

109

సమస్త పర్వదినములును మహోన్నత పర్వదినద్వయమునను, దినద్వయమున సంభవించు మరి రెండు పండుగలయందునను సమ్మిళితమైనవి; మహోన్నత పర్వదినములలో మొదటిది : సకల దయామయుడు, సమస్త సృష్టిపైనను తన యుత్కృష్ట నామధేయముల, తన మహోన్నత స్వభావముల దేదీప్యమాన మహిమను వర్షింపజేసిన దినములలో సంభవింప, రెండవది : మృతులను పునరుజ్జీవితులను గావించి, సమస్త భూస్వర్గవాసులను సమీకృత మొనరించిన ఈ దివ్యనామపు సంతోషదాయక వర్తమానమును మానవాళికి ఘోషించిన ‘ఆయన’ ను మేము ఉత్తిష్ఠుని గావించినట్టిది. నిర్దేశకుడును, సర్వజ్ఞుడును అగు ‘ఆయన’ చే నివ్విధముగ నాదేశింపబడినది.

110

భగవంతుడీ మహోన్నత నామమునకు అంకితమొనరించినయట్టి ‘బహా’ మాసపు తొలి దినమున ప్రవేశించిన వాడు సంతోషాత్ముడు. భగవంతుడు తనకనుగ్రహించిన యౌదార్యములకు ఈనాడు సాక్షీభూతుడైనట్టి యాతడు ధన్యుడు; యదార్ధమున కాతడు సమస్తలోకముల నావరించినయట్టి దేవదేవుని దాతృత్వమునకు కృతజ్ఞతా చిహ్నముగ నభివాదముల నర్పించువారలయందున గణియింపబడును. ప్రవచించు: వాస్తవమునకీ దినము సమస్త మాసములకును, వాటి మూలములకును మకుటము; సమస్తసృష్టి పైనను జీవన పవనములను ప్రసరింపచేసినయట్టి దినమిది. ఆనందాతిరేకమున దీనికభివాదము చేయు నాతడు ధన్యుడు. యదార్ధమునకాతడు, పరమానందభరితులలో నెన్నదగునని మేము సాక్ష్యమిత్తుము.

111

వచించు: యదార్ధమునకు, మహోన్నత పర్వదినమున, ‘పర్వదిన వల్లభుడే’. ఓ జనులారా! భగవంతుడు మీకనుగ్రహించిన యౌదార్యమును స్ఫురణకు దెచ్చుకొనుడు. మీరు సుషుప్తియందున్నారు; అదిగో అవలోకింపుడు! ‘ఆయన’ తన దివ్యావిష్కరణయను చైతన్యపూరిత పవనములతో మీకు చేతనత్వమునొసగి ఆవిష్కృతమును, అద్వితీయమును అగు తన దివ్యపథమును మీకు తెలియపరచినాడు.

112

అస్వస్థతావస్థలయందు సమర్ధులగు వైద్యులనాశ్రయింపుడు; మేము భౌతిక సాధనముల వినియోగము నలక్ష్యము గావింపలేదు; భగవంతుడు తన యుజ్జ్వల, మహిమాన్విత ధర్మమునకు ప్రత్యూషస్థలిగ నియమించిన ఈ దివ్యలేఖినితో దీనినామోదించితిమి.

113

ఇతఃపూర్వము - విశ్వాసులలో ప్రతి యొక్కడును తన సముపార్జనల యందలి యమూల్య పురస్కృతులను మా యాసనముమ్రోల సమర్పింపవలెనను కర్తవ్యమును భగవంతుడు విధియించి యున్నాడు. ప్రస్తుతము, మా దయాన్వితాను గ్రహమునకు ప్రతీకగా ఈ యనివార్యత కుద్వాసన చెప్పినాము. సత్యమునకు, ‘ఆయన’ మహాదాత, సర్వౌదార్యుడు.

114

ప్రత్యూషఘడియలో, తన యాలోచనలను దైవముపై కేంద్రీకరించి, ఆయన దివ్యనామస్మరణమున మగ్నుడై, ఆయన క్షమనర్ధింపుచు, మష్రిఖుల్ -అఝ్కార్ దిశగా తన యడుగులనువైచి, అందు ప్రవేశించి, సార్వభౌముడును, శక్తివంతుడును, సమస్తసంకీర్తితుడును అగు భగవంతుని ప్రవచనములను మౌనముగ నాలకించుటకై యాసీనుడగునాతడు ధన్యుడు. వచించు : నా సంకీర్తనమునకై గ్రామములయందునను, నగరములయందునను నెలకొల్పబడిన ప్రతి భవనమును మష్రికుల్- అఝ్కార్ యే. ఈ నామము కీర్త్యాసనమున కెదుట సూచితమైనట్టిదని గ్రహియింపుడు.

115

సకల దయామయుని ప్రవచనముల నత్యంత మధుర స్వరములతో నాలపించు వారు, భూస్వర్గముల యౌన్నత్యము సైతము వాటికి సమతూగదని గ్రహియింతురు. వారు వాటినుండి - ఉత్కృష్టమును, శోభాయమానమును అగు దివ్యావిష్కరణాదృక్పథము అనుగ్రహింపబడిన వారు దక్క అన్యులవలోకింప జాలనట్టి నా ప్రపంచముల దివ్యసౌరభము నాఘ్రాణింతురు. ప్రవచించు: ఈ పావనప్రవచనములు పవిత్రహృదయములను, ఆనిర్వచనీయములును, ఊహాతీతములును అగు ఆధ్యాత్మికలోకముల కతిచేరువగా కొనిపోవును. ఆలకింపుచున్నవారు ధన్యులు.

116

ఓ నా జనులారా! నా సృష్టియందున నన్ను ప్రస్తుతించుటకును, నా సామ్రాజ్యవ్యాప్తముగ నా దివ్యవాక్కును సముద్ధతి నొందించుటకును ఉద్యుక్తులైన నా సంచిత సేవకులకు సాహాయ్యము గావింపుడు. వీరు యదార్ధమునకు, మానవజాతికి నా ప్రేమాన్విత స్వర్గపు తారకలు, నా మార్గదర్శక దీపికలు. కాని నా పావన ఫలకములయం దనుగ్రహీతమైన దానికి విరుద్ధముగ పలుకునాతడు నావాడు కాడు. ఏ దుష్కపటినైనను మీరనుసరింతురేమో, జాగరూకులు కండు. భూ స్వర్గముల నడుమ తన వాణిని వెలువరించునాతడును, ఉషోదయ కారకుడును అగు ‘ఆయన’ ముద్రచే ఈ దివ్యఫలకములు అలంకృతములైనవి. నిక్కమగు ఈ పిడిని, శక్తిసమన్వితమును, దుర్భేద్యమును అగు నా దివ్యధర్మ పాశమును బలముగ చేబూనుడు.

117

దివ్యధర్మసందేశమును ప్రాక్పశ్చిమములయందున విస్తరిల్లజేసి హృదయములు పునరుజ్జీవమునొంది, విగతాస్థిక చేతనత్వమునొందు నటుల ప్రపంచజనులయందున, వారి మిత్రులయందున తన దివ్యనామము నుచ్చరించు నిమిత్తమై వివిధ భాషల నభ్యసించనెంచు నాతనికి భగవాను డనుమతి ననుగ్రహించినాడు.

118

విచక్షణాజ్ఞానవరప్రసాదియగు మానవుడు, ఆ జ్ఞానమును హరియించు దానిని గ్రహియింపతగదు. మానవస్థాయికి తగిన విధముగ తప్ప, అలక్ష్యపరుల, అస్థిరచిత్తుల యకార్యముల ననుసరించి ప్రవర్తింపరాదని యాతనికి నిర్దేశింపబడినది.

119

మీ శిరములను విశ్వసనీయత, సౌశీల్యములనెడు సుమహారముల తోడను, మీ మనములను దైవభీతితోడను, మీ జిహ్వలను సంపూర్ణ సత్యసంధత తోడను, మీ దేహములను సౌజన్యాంబరము తోడను అలంకరింపుడు. మీరు పర్యాలోచింపగలవారేని, యదార్ధమునకు, మానవ దేహాలయమునకు తగిన భూషణములివి. ఓ బహాజనులారా! సత్యస్వరూపుడగు భగవంతుని శుశ్రూషా పాశమును చేబూనుడు; ఏలయన, ఆపై మీ స్థానములు వెల్లడియగును; మీ నామములు లిఖియింపబడి, భద్రపరుపబడును, మీ బిరుదము లౌన్నత్యము నొందును; భద్రఫలకమున మీ స్మరణ సంకీర్తితమగును. మహిమాన్వితమును, సమున్నతమును అగు ఈ స్థానమునుండి భూలోకవాసులు మిమ్ము ప్రతిరోధింతురేమో, జాగరూకులు కండు. మా యనేక లేఖలయందునను, మీ దైవమును, అధికారవంతుడును, సకలవివేకియును అగు భగవంతుని శాసనప్రభాత నక్షత్రము ప్రకాశితమైనట్టి మా యీ పవిత్ర ఫలకమున మిమ్మీ విధముగ ప్రబోధించినాము.

120

నా ప్రత్యక్షతా పయోనిధి క్షీణతనొంది, మా దివ్యావిష్కరణాగ్రంథము సమాప్తినొందినపుడు, దైవసంకల్పితుడును, ఈ ప్రాచీనమూలోద్భవుడును అగు ‘ఆయన’ వంకకు మీ వదనములను సారింపుడు.

121

మానవ మస్తిష్కములెంతటి యల్పములో యోచింపుడు. వారు తమకు హానికారకముల నపేక్షింతురు, తమకు లాభకరముల నుపేక్షింతురు. వారు యదార్ధమునకు సన్మార్గదూరులు. కొందరు స్వేచ్ఛనభిలషింపుచు, దానియం దహంకారపూరితులగుటను మేమవలోకించినాము. అట్టివారజ్ఞానపు టగాధమందున్నారు.

122

స్వేచ్ఛ - తుద కెవ్వరును ఆర్పివేయజాలని విప్లవాగ్నికి దారి తీయును. గణకుడును, సర్వవిదుడును అగు ‘ఆయన’ మిమ్ములనీ విధముగ హెచ్చరింపు చున్నాడు. స్వేచ్ఛాస్వరూపమనినను, దానికి ప్రతీకయనినను చతుష్పాద జంతువేనని తెలియుడు. స్వీయ అజ్ఞానము నుండి పరిరక్షించునవి, దుర్మార్గు డొనరించు హాని నుండి సంరక్షించునవి యగు పరిధులకు లోబడియుండుట మానవునకు సముచితము. స్వేచ్ఛ మానవుని ఔచిత్యావధుల నతిక్రమింపచేసి, ఆతని స్థాయీగౌరవమునకు భంగము వాటిల్లజేయును. అది యాతనిని భ్రష్టత, దుష్టతల స్థాయికి దిగజార్చివేయును.

123

మానవులను తమ సంరక్షణకు కాపరి యవసరమైన గొఱ్ఱెల మంద వలె గణియింపుడు. నిక్కముగా నిది సత్యము, పరమ సత్యము. నిర్దిష్ట స్థితుల యందున స్వేచ్ఛను మేమామోదింతుము, తక్కిన స్థితులయందున తిరస్క రింతుము. యదార్ధమునకు, మేము సర్వవిదులము.

124

వచించు : నిజమగు స్వేచ్ఛ, నా యాజ్ఞలకు లోబడియుండు మానవుని విధేయతయందున్నది, స్వల్పముగనైనను తెలియుడు. మానవులు దివ్యావిష్కరణ స్వర్గమునుండి తమకనుగ్రహీతమైన దానిని పాటించిరేని వారు నిశ్చయముగ పరిపూర్ణస్వేచ్ఛ నొందగలరు. సృజిత వస్తు సమస్తమును ఆవరించినయట్టి తన యభీష్టస్వర్గము నుండి భగవంతునిచే నావిష్కృతమైన ప్రయోజనమును గ్రహియించిన యాతడు ఆనందభరితుడు. వచించు: నిత్యసత్యమగు భగవంతుని పరిపూర్ణ సేవయందు తప్ప నీకు లబ్ధినిచ్చు స్వేచ్ఛ యింకెందునను కానరాదు. దాని మాధుర్యము నాస్వాదించిన యాతడు దానిని సమస్త భూ స్వర్గ సామ్రాజ్యముల వినిమయమునకైనను విక్రయింపడు.

125

మీరు మమ్ము ప్రశ్నలనడుగుట బయాన్‌నందు నిషేధించ బడినది. పూర్వీకులు అలవాటుగావేయు వ్యర్ధప్రశ్నలను గాక, మీరడుగదగిన ప్రశ్నలనడుగు స్వేచ్ఛయుండునటుల, ఇప్పుడు దేవదేవుడా నిషేధమునుండి మిమ్ము విముక్తులను గావించినాడు. దైవభీతిని కలిగి యుండుడు, ధార్మికులు కండు! దివ్యధర్మమునను, ‘ఆయన’ దివ్యసామ్రాజ్యమునను మీకు ఫలప్రదాయకము లగు ప్రశ్నలనే వేయుడు; ఏలయన, ‘ఆయన’ మృదుకారుణ్య ద్వారములు సమస్త భూస్వర్గవాసులకును తెరువబడినవి.

126

ఒక సంవత్సరమందలి మాసముల సంఖ్య పంధొమ్మిదియని భగవంతుని దివ్యగ్రంథమున నిర్దేశితమైనది. వీనియందలి ప్రథమ మాసము సమస్త సృష్ట్యావృతమగు ఈ దివ్యనామముచే నలంకృత మైనది.

127

మృతులను గాజుతో గాని, దృఢమగు రాతితోగాని, మేలైన మన్నికైన దారువుతో గాని చేయబడిన శవపేటికల యందుంచవలెనని, అక్షరములు చెక్కిన అంగుళీయములను వారి వ్రేళ్లకు తొడుగవలెనని పరాత్పరుడు నిర్దేశించినాడు. ‘ఆయన’ యదార్ధమునకు, పరమ నిర్దేశకుడు, సర్వవిదుడు.

128

ఈ యంగుళీయకములపై పురుషులకు : “స్వర్గముల యందునను, భూమిపైనను, వాటి మధ్యనుగల సమస్తమును భగవంతునిది; వాస్తవమున కాయన సమస్త విషయజ్ఞుడు”౎ అనియు, స్త్రీలకు : “స్వర్గముల యందునను, భూమిపైనను, వాటి మధ్యనుగల సామ్రాజ్యము భగవంతునిది; వాస్తవమున కాయన సకలాంశముల పైనను అధికారయుతుడు”౎ అనియు అక్షరము లుండవలె. ఈ దివ్య ప్రవచనములు ఇతఃపూర్వమే యావిష్కృతములైనవి; అయినను, చూడుడు, ప్రస్తుతము బయాన్ కేంద్రము: “ఓ లోకముల శ్రేష్ఠప్రియుడా ! వాటి స్థానమున సమస్తమానవాళిపైనను నీ దయానుగ్రహముల పరిమళములను ప్రసరించు ప్రవచనముల నావిష్కరింపుము. నీ నుండి వెలువడు ఒక్క పదము బయాన్ నందనుగ్రహీతమైన సమస్తమును అధిగమించునని మేము ప్రతియొక్కరికిని ప్రకటించినాము. వాస్తవమునకు, నీవు నీకు సంప్రీతికరమైన దానినొనరింప సమర్ధుడవు. నీ భృత్యులను నీ కారుణ్యసాగరము నుండి పొంగిపొరలు అనుగ్రహములకు దూరము చేయకు. వాస్తవమునకు, నీవు అపారకరుణాన్వితుడవు,”౎ అని ఘోషింపుచున్నది. అవలోకింపుడు, మే ‘మాయన’ పిలుపు నాలించి, ‘ఆయన’ ఇచ్ఛనిపుడు నెరవేర్చినాము. ‘ఆయన’, యదార్ధముగా, సర్వోత్తమ ప్రియుడు, ప్రార్థనల సమాధానకర్త. ఈ క్షణమున, భగవత్ప్రసాదితమైన ఈ క్రింది ప్రవచనము స్త్రీ, పురుషుల ఖననాంగుళీయములపై చెక్కబడుటయనునది వారికి యింకను శుభప్రదము; నిశ్చయముగ, మేము పరమనిర్దేశకులము : “నేను దైవము నుండి ఆగమించి, దయాళువును, కరుణాళువును అగు ‘ఆయన’ దివ్యనామమును దృఢముగ చేబూని, ‘ఆయన’ వినా సర్వమును త్యజియించి, ఆయన కడకే తిరోగమించు చుంటిని.”౎ పరాత్పరుడీ విధముగ తన సాన్నిధ్యానుగ్రహమునకై యెంచుకొనిన వారిని ప్రత్యేకించినాడు. ‘ఆయన’, సత్యముగా, శక్త్యధికారముల కధిదేవుడు.

129

అంతియేగాక, పట్టు లేదా నూలు వస్త్రము లైదింటి యందున మృతుని చుట్టవలెనని భగవంతు డాదేశించినాడు. పరిమిత వనరులు గలవారు వీటియందే రకముదైనను ఒక్క వస్త్రములో చుట్టిన చాలును. ఇవ్విధముగ సర్వజ్ఞుడును, సకలవిదుడును అగు ‘ఆయన’ చే నిర్దేశితమైనది. నగరము నుండి ప్రయాణకాలము ఒక గంటకు మించునట్టి దూరమునకు మృతదేహమును తరలించుట మీకు నిషేధింపబడినది. అట్లుగాక, అది యానందముతో, ప్రశాంతముగ ఒక సమీప ప్రదేశమున ఖననము గావింప బడవలె.

130

ప్రయాణమునకు సంబంధించి బయాన్ గ్రంథమునందు విధియింప బడిన ఆంక్షలను దేవుడు తొలగించినాడు. ‘ఆయన’ యదార్ధమునకు అనిర్బంధనుడు; ‘ఆయన’ తనకు ప్రియమైనదానినొనర్చును, తన యభీష్టమును నిర్దేశించును.

131

ఓ జగజ్జనులారా! మహత్తర కారాగారమందలి తన యావాసము నుండి : “యదార్ధమునకు, అధికారపరిపూర్ణుడు, శక్తివంతుడును, సమస్తాధీనుడును, సర్వోత్తముడును, సర్వజ్ఞుడును, సకల వివేకియును అగు నేను దక్క దైవము లే”౎ డని మీకు చాటుచున్న దివ్యనామాధిపతి పిలుపు నాలింపుడు. సర్వశక్తి వంతుడును, సమస్తలోకపాలకుడును అగు ‘ఆయన’ తప్ప నిజమునకు వేఱు దైవము లేడు. ‘ఆయన’ యభిలషించిన, తన సాన్నిధ్య జనితమగు ఒకే ఒక్క వాక్కుతో, సమస్తమానవాళిపైనను అధికారమును సాధింపగలడు. జాగ్రత్త, దేని యెదుట స్వర్లోక దేవగణమును, దివ్యనామముల నగరాలవాసులును మ్రోకరిల్లిరో, ఆ దివ్యధర్మము నంగీకరించుటకు శంకింతురేమో, జాగ్రత్త. భగవద్భీతిని కలిగియుండుడు; తెరమరుగైన వారి చందమున యుండవలదు. తెరలను నా ప్రేమానలముచే దహియింపుడు. సమస్తసృష్టిని లోబరచుకొనిన ఈ దివ్యనామముచే వ్యర్ధపుటూహల మంచు తెరలను త్రెంచివేయుడు.

132

పావనప్రదేశములు రెండింటియందునను గల గృహద్వయమును, సకల దయామయుడగు మీ దేవుని సింహాసనము సంస్థాపితమైన యితర స్థలములను ప్రవృద్ధమొనరించి, ప్రస్తుతింపుడు. అవగాహనాయుత మనస్కులగు ప్రతి యొక్కరి దైవము ఈ విధముగ నాజ్ఞాపింపుచున్నాడు.

133

శక్తివంతుడును, విశ్వసనీయుడును అగు ‘ఆయన’ మీకు విధియించినదానిని పాటించుట నుండి ఐహిక బంధములును, బాధ్యతలును మిమ్ము ప్రతిబంధించునేమో, జాగరూకులు కుండు. శక్తిప్రపూరితమగు సార్వభౌమత్వ స్వరూపుడై, స్వయంస్థితుడై ప్రత్యక్షమైనపుడు ఆయనను విశ్వసింపనివారు వెలిబుచ్చిన శంకలతో వెనుకంజవేయక, మానవులయందున పట్టుదలకు ప్రతీకలు కండు. “సత్యముగా, మహాశ్రేష్ఠుడను, సమస్త సంకీర్తితుడను అగు నేను తప్ప దేవుడు లే”౎ డను సత్యము నుగ్గడించు ఈ సజీవ దివ్యగ్రంథము చెప్పుదానిని ఆలకింపనీయక, దివ్యగ్రంథమున పొందుపరుప బడిన ఇంకేదైనను మీకు అవరోధము కలిగించునేమో జాగరూకులై వర్తింపుడు. దివ్యేచ్ఛాశక్తులనెడు స్వర్గము నవరోహించిన ‘ఆయన’పై న్యాయ దృక్కులను సారింపుడు, అన్యాయ వర్తనులు కాబోకుడు.

134

ఇక, ఈ దివ్యావిష్కరణకు నివాళిగ నా యగ్రదూతయగు ‘ఆయన’ లేఖిని నుండి, జాలువారిన ఈ ప్రవచనములను స్ఫురణకు దెచ్చుకొని, నా యావజ్జీవితకాలమునను దమనకారుల హస్తములు ఎట్టి దుశ్చర్యలను కొన సాగించినవో యోచింపుడు. సత్యమునకు, వారు గతియించినవారియందున గణియింపబడినారు. ‘ఆయన’ యిట్లు పలికినాడు : “మేము ప్రత్యక్షీకరించు ‘ఆయన’ సమక్షప్రాప్తి నొందితిరేని, ఔదార్యముతో మీ పర్యంకములపై నాసీనుడగు వరప్రదాన మొనరింపుమని భగవంతుని యర్ధింపుడు. అట్టి చర్యే మీ పై అసమాన గౌరవాతిశయములను కురియించును. ఆయన మీ గృహముల యందొక్క చిరుపాత్ర యుదకమును సేవించినను సకల విశ్వాసులకే కాదు, సమస్త జీవకోటికి జీవనజలమును సమర్పించిన దానికన్న మిన్నయైన ఫలము దక్కును. ఓ నా భృత్యులారా! తెలిసికొనుడు.”౎

135

మదీయాస్తిత్వమును నుతియించిన నా యగ్రగామి ప్రవచనము లిట్టివని గ్రహియింపుడు. ఆ దివ్యప్రవచనములను ధ్యానించి, వాటియందలి నిక్షిప్తమౌక్తికములును గ్రహించినవారు, భగవంతుని ధర్మజ్ఞత సాక్షిగా, ఈ కారా గృహము దిశనుండి వీయుచున్న సకలదయామయుని సౌరభమును గ్రహియించి, భూస్వర్గముల సేనలు సైతము నిరోధింపలేని అత్యాతురతతో, మనఃపూర్వకముగ ‘ఆయన’ వైపుకు పరువిడుదురు. వచించు: ఈ దివ్యావిష్కరణము చుట్టును ప్రతి నిదర్శనమును, దృష్టాంతమును పరిభ్రమింపుచున్నది. ధర్మనిర్ణేత లైనచో, మీ పరంధామునిచే, కరుణేశునిచే ఇవ్విధముగ ననుగ్రహింపబడినదని గ్రహియింపుడు. వచించు : సమస్త సృష్ట్యావృతమగు నా ప్రియకారుణ్య మృదు పవనములచేతను, నా యౌదార్య మధుర సౌరభములచేతను పారవశ్యము నొందినవారు తప్ప, సమస్త జీవులను సంభ్రమాశ్చర్యభరితులను గావించినయట్టి మహోన్నతుని దివ్యలేఖినికి అనుగ్రహీత మైన నిఖిల నిగమముల నిగ్గిది.

136

ఓ బయాన్ జనులారా! మహోదారునియెడ భీతిని గలిగియుండుడు; మరియొక గ్రంథభాగమున : “భగవంతుడు సాక్షాత్కరింప జేయునట్టి ‘ఆయన’ యే యదార్ధముగా ‘ఖిబ్లేహ్’; ‘ఆయన’ శాశ్వతముగ విశ్రాంతినొందు వరకును, ‘ఆయన’ చలియించినపుడెల్ల అదియును స్థానచలనము నొందు” నని ‘ఆయన’ నుడివినదానిని గణియింపుడు. పరమ నిర్దేశకుడీ మహత్తర సౌందర్యమును ప్రస్తావింపనెంచినపుడు, ‘ఆయన’ చే నివ్విధముగ నిర్దేశింపబడినది. ఓ ప్రజలారా! దీనిపై పర్యాలోచింపుడు; కాని దోషారణ్యమున, ద్రోవతప్పి చరియించు వారివలె కావలదు. ఓ నిర్లక్ష్య సముదాయమా! మీ వ్యర్ధపుటూహల యానతిన మీరాయనను తిరస్కరించిరేని, మరి, మీరు ఆశ్రయించు ‘ఖిబ్లేహ్’ ఎక్కడ? ఈ దివ్యప్రవచనముపై దీర్ఘాలోచనము గావించి, భగవంతుని యెదుట ధర్మనిర్ణయము గావింపుడు; తద్వారా, అదృష్టవశమున, సమస్త మహిమో పేతుడను, పరమోన్నతుడను అగు నా దివ్యనామము పేరిట ఉప్పొంగు సంద్రమునుండి మార్మికమౌక్తికములను మీరు సమీకరించు కొనవచ్చును.

137

ఈ యుగమందెవ్వడును, ఈ దివ్యావిష్కరణమునందు వెలువరింప బడిన దానిని తప్ప మరిదేనినీ సుస్థిరముగా నవలంబింపరాదు. ఇది భూత భవిష్యత్కాలములకు భగవంతుని నిర్దేశము; పూర్వపు దివ్యవార్తాహరుల పవిత్రలేఖనములు అలంకృతములైనట్టి నిర్దేశమిది. ఇది భూతభవిష్యత్కాలములకు భగవంతుని ప్రబోధము; దివ్యజీవనగ్రంథ ప్రవేశికను ప్రవృద్ధమొనరించిన ప్రబోధమిదియని గ్రహియింతురు గాక. ఇందుకు బదులు అజ్ఞానావమానముల నెంచుకొందురేమో జాగరూకులు కండు. ఈ దినమున భగవంతుడు దక్క ఎవ్వరును మీకు ఉపకరింపరు; సర్వజ్ఞుడును, సకల వివేకియును అగు ‘ఆయన’ తప్ప వేరొండు ఆశ్రయమును లేదు. నన్ను తెలిసికొనిన వారు సమస్త వాంఛల లక్ష్యమును తెలిసికొనినట్లే; నన్నాశ్రయించినవారు, సమస్త ఆరాధనాలక్ష్యము నాశ్రయించినట్లే. సకల జగన్నాయకుడు దివ్యగ్రంథమునం దివ్విధముగ నిర్దేశించి నిర్ధారించినాడు. భూత, వర్తమానతరములయందలి గ్రంథసమస్తమును గ్రాహ్యమొనరించు కొనుటకన్న కేవలము నా ప్రవచన మొక్కదానిని పఠియించిన చాలును. మీకు చెవులుండి వినజాలితిరేని, సకల దయామయుని వాణి యిది! వచించు: జ్ఞానసారమిదియేనని గ్రహియింపుడు.

138

ఇక ఇప్పుడు, దైవవశమున మీ స్వీయభావనలను త్యజియించి, అస్తిత్వ ప్రభుడగు భగవంతునిదెసకు మీ వదనములను సారింప వచ్చునని వేరొక రచనాభాగమునందు వెలువరింపబడిన దానిని గుఱించి యోచింపుడు. ‘ఆయన’ (బాబ్) యిలా ప్రవచించినాడు: “బయాన్ విశ్వాసిని దక్క అన్యులను వివాహమాడుట శాసనవిరుద్ధము. వివాహకాలమునకు కేవలమొక పక్షమే దివ్యధర్మమునవలంబించి యుండెనేని, అతని లేదా ఆమె సంపదలు రెండవ పక్షమునకు - దివ్యధర్మములోనికి పరివర్తనమొందనంత వరకును - శాసనవిరుద్ధము లగును. అయినను, ఈ శాసనము యదార్ధమునకు - మేము ప్రత్యక్షీకరించునట్టి ‘ఆయన’ దివ్యధర్మము కాని, న్యాయమునకు యితః పూర్వమే ప్రత్యక్షీకరింపబడినది కాని ఔన్నత్యమునొందినపుడే అమలు జరుగును. ఇందుకు ముందుగా, మీ యభీష్టానుసారముగ వివాహబంధము నేర్పరచు కొనవచ్చును, ఈ విధానముతో మీరు దివ్యధర్మమునకు ఔన్నత్యమును సముపార్జింప వచ్చును. సకలౌదార్యుడగు తన దైవమును సంకీర్తింపుచు, ఉత్కృష్ట శాఖనుండి కోకిల మధురస్వరముతో నాలపింపుచున్నది. ఆలకించు వారికి శుభమగు గాక.

139

ఓ బయాన్ జనులారా, సత్యశక్తిచే యనుగ్రహీతమైన ఈ వాణిని న్యాయదృష్టితో పరికింపుడనియు, దైవనిదర్శనమును వీక్షించియు దాని నుపేక్షించి, తిరస్కరించు వారలు కావలదనియు సర్వేశ్వరుడును, కారుణ్య దైవమును అగు మీ భగవంతునిసాక్షిగా నేను మీకు సూచింపుచున్నాడను. వారు వాస్తవమునకు తప్పక నశియించు వారు. ఈ దివ్యప్రవచనమున బయాన్ కేంద్రము తన స్వీయదివ్యధర్మ సమక్షమున నా దివ్యధర్మౌన్నత్యమును విస్పష్టముగ ప్రస్తావించినది; ఇందుకు ధర్మబద్ధమును, అవగాహనాయుతమును అగు ప్రతి మనస్సును సాక్ష్యము వహియించును. మీరీ దినమున స్వయముగ తక్షణమే విలోకింప గలుగుచున్నటుల, దీని ఘనత యెంతటిదన - నశ్వరజీవిత మైకమున అంధులైనవారును, తదనంతర జీవితమున తమకై అవమానకరమైన దండన నిరీక్షింపుచున్నయట్టి వారును దక్క అన్యులెవ్వరును కాదనలేనట్టిది.

140

వచించు: భగవంతుని ధర్మబద్ధత సాక్షిగా! సత్యముగ, ‘ఆయన’(బాబ్) పరమప్రియుడను నేను; ఆయన దివ్యావిష్కరణాస్వర్గమునుండి ఈ క్షణమందున అవరోహితమగుచున్న దివ్యప్రవచనముల నాలింపుచు, మీరీదినముల యందొనరించిన దుష్కృత్యములకు విలపింపుచుండును. భగవద్భీతిని కలిగియుండుడు, దమనకారుల దరి చేరవలదు. వచించు : ఓ జనులారా ! మీరు ‘ఆయన’ (బహాఉల్లా) ను విశ్వసింపనెంచనిచో, కనీసము, ఆయనను వ్యతిరేకించుట నైనను మానుడు. దైవసాక్షిగా ! ఆయనకు వ్యతిరేకముగ సముద్యమించిన క్రూరసేనల దుశ్చర్యలు చాలును.

141

ఈ దివ్యసంవిధానమున, పరమోన్నతుని లేఖిని తన మహోన్నత స్థానమును, తన మహోజ్జ్వలసౌందర్యమును దక్క అన్యమును సంకీర్తింప నవసరము లేకుండునటుల ‘ఆయన’ (బాబ్) కొన్ని శాసనములను నిశ్చయముగ నావిష్కరించినాడు. అయినను, మీయెడ మాకుగల అనుగ్రహమును చూపనెంచుటచే, మీరు పాటింపవలెనని - సత్యబలముచే, సుస్పష్టముగ ఈ శాసనములనేర్పరచినాము. మీరు పాటింపవలెనని - మేమభిలషించిన దానిని సులభము గావించినాము. నిక్కముగా, ‘ఆయన’ అనుకంపానిధి, వదాన్యుడు.

142

ఈ దివ్యవివేక ప్రత్యూషముచే నుచ్చరింపబడిన దానిని ‘ఆయన’(బాబ్) ఇతఃపూర్వమే మీకు విశదీకరించినాడు. ‘ఆయన’ (బాబ్) ఇట్లు సెలవిచ్చినాడు : “మరి ‘ఆయన’ సత్యమునే వచించును : ‘యదార్ధమునకు, ఏకైకుడను, తుల్యరహితుడను, సర్వజ్ఞుడను, సకల ప్రాజ్ఞుడను అగు నేను తప్ప వేరొక దేవుడు లే’ డని, సర్వావస్థలయందునను ప్రకటించగల వాడు ‘ఆయన’ యే.”(బహాఉల్లా) ఈ పరమోన్నత, ఈ యమూల్యాద్భుత దివ్యావిష్కరణమునకు పరమేశ్వరుడు ప్రత్యేకించి ప్రసాదించిన స్థానమిది. ‘ఆయన’ ఔదార్యాన్వితానుగ్రహానికిది ప్రతీకయని, అప్రతిహతమగు ‘ఆయన’ తీర్మానమునకు సంకేతమని మీరు గ్రహియింపగల్గినచో గ్రహియింపుడు. ఇది ‘ఆయన’ పరమోన్నత నామమని, పరమోత్కృష్ట ప్రవచనమని, ఆయన మహోత్కృష్ట బిరుదముల ప్రత్యూషమని గ్రహియింపుడు. అంతియే కాదు, ప్రతి స్రవంతి మూలమును, ప్రతి దివ్య మార్గదర్శన ఉషోదయస్థానమును ‘ఆయన’ మూలముననే ఏర్పరుపబడినది. ఓ ప్రజలారా, సత్యముగా అనుగ్రహీతమైనట్టి దానిని గురించి దీర్ఘముగ నాలోచింపుడు, అందుపై పర్యాలోచింపుడు, కాని అతిక్రమించువారు కావలదు.

143

సర్వమతస్థులును మీ నుండి భగవంతుని మధుర సౌరభముల నాఘ్రాణించుటకై, వారితో మీరు మైత్రీభావమున, సామరస్యమున సహజీవన మొనరింపుడు. మానవులయందలి మూర్ఖత్వపుటజ్ఞానజ్వాల మిమ్ములను జయింపకుండ జాగరూకులు కండు. సమస్తవస్తు సంచయమును భగవంతుని నుండే వెలువడును, తిరిగి ‘ఆయన’ చెంతకే తిరోగమించును. సమస్త విషయములకును ‘ఆయన’యే మూలాధారము. సమస్తమును ‘ఆయన’ యందే సంలీనమగును.

144

గృహయజమాని లేని సమయమున, ఆతని యనుమతి లేకుండ, అందెవ్వరును ప్రవేశింపరాదని యెరుగుడు. మీరు సర్వావస్థలయందునను మర్యాదతో మెలగవలెనే కాని, మూర్ఖులుగా వర్తింపవలదు.

145

మీ జీవనాదాయములను, అట్టి యితర జీవనోపాధులను జకాత్ సమర్పణతో పవిత్రీకరించుకొనుట మీకు నిర్దేశితమైనది. దివ్యప్రవచనావిష్కర్త యగు ‘ఆయన’ చే ఈ మహత్తర ఫలకమునందీ విధముగ సూచితమైనది. దైవేచ్ఛయును, సంకల్పమును అయినచో, దాని గణనకు ప్రమాణమును మేమచిర కాలములోనే నిర్దేశింతుము. యదార్ధముగా, ‘ఆయన’ తన యభీష్టమై, తన స్వకీయజ్ఞానమున వాంఛించిన దానినే వ్యాఖ్యానించును; సత్యమునకు, ‘ఆయన’ సర్వజ్ఞుడు, సకల వివేకి.

146

భిక్షాటన శాసనవిరుద్ధము, భిక్షువునకిడుట నిషిద్ధము. జీవనోపాధి నార్జించుకొనుట ప్రతియొక్కరికిని నిర్దేశితమై యున్నది. అట్లొనరించుకొనలేని వారికి తగు సౌకర్యమును కల్పించుట భగవంతుని ప్రతినిధులపైనను, సంపన్నులపైనను మోపబడిన బాధ్యత. భగవంతుని శాసనములను, ఆజ్ఞలను పాలింపుడు; అంతియే కాదు వానిని మీ కన్నులవలె సంరక్షింపుడు, దారుణమగు హానికి లోనగు వారు కావలదు.

147

మీరు విరోధ వివాదములయందున తలదూర్చుట, యితరులను దండించుట, మనస్సులకును, ఆత్మలకును విషాదకారకములగు చర్యలకు పాల్పడుట వంటివి భగవంతుని దివ్యగ్రంథమునందు నిషేధింపబడినవి. పరుల దుఃఖమునకు కారకులైన వారెవ్వరి కైనను ఇతఃపూర్వము పంధొమ్మిది మిష్కల్‌ల సువర్ణము అపరాధశుల్కముగా సర్వేశ్వరుడగు ‘ఆయన’ చే విధియింపబడినది; అయినను, ఈ దివ్యసంవిధానమున ‘ఆయన’ మిమ్ము దానినుండి విముక్తులను గావించి, న్యాయవర్తనతో, ధార్మికతతో వర్తింపుడని బోధింపు చున్నాడు. ‘ఆయన’ ఈ ప్రజ్జ్వలిత ఫలకమునం దాజ్ఞాపించి, మీకు విధియించి నట్టిదిది.. మీకై యాశించుకొనని దానిని అన్యులకై వాంఛింపవలదు; దైవభీతిని కలిగి యుండుడు, గర్వాంధులు కావలదు. మీరందరును, జలమునుండి సృజియింపబడినారు, ధూళివైపునకు తిరోగమింతురు. మీకై వేచియున్న అంత్యమును గురించి యోచింపుడు. దమనకారుల మార్గముల ననుసరింప వలదు. ‘పవిత్ర జీవనవృక్ష’ మగు ‘ఆయన’ ఆలపింపుచున్న దివ్య ప్రవచనములకు చెవియొగ్గుడు. నిశ్చయముగా నవి, ఇహ పరముల ప్రత్యగాత్మ యగు భగవంతునిచే నేర్పరుపబడిన దోషరహిత తుల వంటివి. మానవాత్మ వానిమూలమున దివ్యావిష్కరణ ప్రత్యూషము దెసకు పయనించును; ప్రతి నిజవిశ్వాసి హృదయమును తేజరిల్లును. భగవంతుడు మీకు విధియించిన శాసనములిట్టివి; ‘ఆయన’ దివ్యఫలకమున మీకు సూచితములైన యాదేశము లిట్టివి; హర్షోల్లాసములతో వానిని పాలించినచో, మీకు శుభమగునని తెలియుడు.

148

ఉదయ సాయంసంధ్యల యందున భగవత్ప్రవచనములను ఆలపింపుడు. వాటి నాలపింపుటయందు విఫలమైన వారు ‘ఆయన’ దివ్య ఒడంబడికకును, ‘ఆయన’ దివ్య శాసనమునకును నిబంధనకును అవిధేయులు; ఇంకను, ఈ పావన ప్రవచనములకు విముఖుడు దైవమునకు శాశ్వతముగ విముఖుడైనట్లే. ఓ నా సేవకులారా ! ప్రతి యొక్కరును దైవభీతిని కలిగి యుండుడు. దివ్యప్రవచనముల నధికముగ అధ్యయనము చేయుటచేతను, అహర్నిశలనేక పుణ్య కార్యములొనరించుట చేతను గర్వింపవలదు; ఏలయన, సంకటహరుడును, స్వయమాధారుడును అగు భగవంతుని దివ్యగ్రంథ సమస్తమును ప్రయాసతో అధ్యయనము గావించుటకన్న ఆనందోత్సాహములతో నొక్క ప్రవచనమును పఠియించుట యెంతయో ఉత్తమము. నిరాశ, బడలిక మిమ్ముల నావరించనంత వరకే పవిత్ర ప్రవచనములను పఠియింపుడు. అలుపు, సొలపులతో కృంగదీయు వానితో మీ యాత్మలపై భారమును మోపక, వానిని తేలికపరచి, ఉత్తేజభరితములు గావింపుడు; తద్వారా, అవి దివ్య ప్రవచనములనెడు పక్షములతో ‘ఆయన’ ప్రత్యక్షతా ప్రతీకల ప్రత్యూష స్థానము దెసకు విహరింపవచ్చును. గ్రహియించిరేని, మిమ్మిది భగవంతుని దరి జేర్పగలదు.

149

దివ్యవైభవాధికార స్వర్గమునుండి వెలువరింపబడిన పావన ప్రవచనములను మీ చిన్నారులకు బోధింపుడు; తద్వారా, వారు మష్రికుల్ -అఝ్కార్‌ల మండపముల యందున, అత్యంత మధురస్వరములతో సకల దయాళువు దివ్యఫలకములను పఠియింప గలరు. అనుకంపాన్వితుడనగు నా దివ్యనామసంకీర్తనాజనితమైన ఆనందముతో పారవశ్యమునొందినవారు గాఢనిద్రా పరవశుల హృదయములను సైతము ఆకట్టుకొందురు. మహోత్కృష్టములును, మహోన్నతములు నగు పర్వతములను ధూళిగా మార్చినయట్టి నా దివ్యనామము పేరిట దయామయుడగు తన దేవుని వాక్కులనుండి అనంత జీవనమను మార్మిక ద్రాక్షాసవమును సేవించిన యాతడు ధన్యుడు.

150

ప్రతి పంధొమ్మిది సంవత్సరములు గడిచిన పిదప, మీ గృహోపకరణములను నవీకరించుకొనుట మీకు నిర్దేశితమైనది; సకల విదితుడును, సర్వజ్ఞుడును అగు ‘ఆయన’ చే మీకీవిధముగ నాదేశితమైనది. యదార్ధమునకు, ‘ఆయన’ మీయొక్క, మీ యాస్తిపాస్తులయొక్క పరిశుద్ధత నభిలషింపుచున్నాడు. దైవభీతిని త్రోసిపుచ్చవలదు, అలక్ష్యపరులు కావలదు. తమ యార్ధిక వనరులిందుకు చాలకపోవుటచే, దీనిని పాటించలేకపోయిన వారు నిరంతర క్షమాశీలియును, మహౌదార్యుడును అగు భగవంతునిచే క్షమియింప బడినారు.

151

మీ పాదములను - గ్రీష్మమున దినమున కొకపర్యాయమును, శిశిరమున దినత్రయంబున కొకపర్యాయమును - ప్రక్షాళన మొనరింపుడు.

152

ఎవ్వడేని నీపై కినుకను వహించిన, ఆతనికి సౌమ్యచిత్తుడవై సమాధానము నీయవలె; ఎవ్వడేని నిన్ను నిందించిన, ప్రతినిందింపక ఓరిమి వహించి, ఆతని నాతనికే వదలివైచి, ప్రతీకారదక్షుడును, న్యాయ శౌర్యాధిదేవుడును అగు భగవంతుని యందు విశ్వాసమునుంచుము.

153

మీరు అధ్యాసనము (మెట్లతోకూడిన అత్యున్నతమైన ఆసనం) లను ఉపయోగింప నిషేధించబడినారు. మీకై దైవప్రవచనము నాలపింపనెంచిన యాతడు వేదికపై నేర్పరుపబడిన కుర్చీలో కూరుచుండి, సమస్త మానవజాతికిని, తనకును ప్రభువగు దేవదేవుని స్తుతి యించు గాక. ఆయన యెడలను, మూర్తీభవించిన ‘ఆయన’ మహనీయ, జ్యోతిర్మయ దైవధర్మము యెడలను మీ ప్రేమకు గౌరవసూచకముగ, కుర్చీలలోను, బల్లలపైనను మీరు ఆసీనులగుట భగవంతుని కెంతయో సమ్మోదకరము.

154

జూదమును, నల్లమందు సేవనమును మీకు నిషేధింపబడినవి. ఓ ప్రజలారా ! అతిక్రమించువారి ననుసరింపక, ఆ రెండింటిని వర్జింపుడు. మానవదేహమునకు మాంద్యమును, భారమును కలిగించి, హానిచేయు ఎట్టి పదార్ధమును ఉపయోగింపక జాగరూకులు కండు. మేము, సత్యముగా, మీకు ప్రయోజనకరమగునది దక్క అన్యము మాకు అభిలషణీయము కాదు. సమస్త సృష్టియును ఇందుకు సాక్ష్యము, చెవులుండిన యాలకింపుడు.

155

విందునకు గాని, పండుగ వేడుకకు గాని ఆహ్వానితులైనపుడు ఆనందో త్సాహములతో స్పందింపుడు; తన వాగ్దానమును నిలుపుకొను నాతడు నిందారోపణ నుండి సురక్షితుడు. వివేచనాయుతమగు భగవన్నిర్దేశము లన్నియును విశదీకరింపబడిన దినమిదియే.

156

అవలోకింపుడు : “మహావ్యత్యస్తమర్మము సార్వభౌమ చిహ్నముగ” ఇప్పుడు వెల్లడియైనది.” ‘ధర్మబద్ధమైన’ ఈ ‘అలీఫ్’ సద్గుణముచే పెంపొందింపబడిన “షష్ఠి” ని గుర్తెఱుగుటలో భగవంతునిచే సహకరింపబడిన వాడు ధన్యుడు; నిశ్చయముగా, సత్యమైనవిశ్వాసము కలవారిలో ఆతడొకడు. “ఓ ప్రపంచముల యభీష్టమా! నీకు సకల కీర్తి వర్తించుగాక!” యని సంభ్రమాశ్చర్యములతో పల్కుచు, ‘ఆయన’ ను సమీపించిన మూర్ఖులెందరు, విముఖులైన బాహ్యపవిత్రులెందరు ! తాను ఆశించిన దానిని, తాను అభిలషించిన వారి కొసంగుటయూ, తాను ఇచ్చగించిన వానికి తాను ప్రీతించిన దానిని ఇవ్వకుండుటయు, యదార్ధముగా దేవుని హస్తవశమై యున్నది. హృదయాంతరాళముల రహస్యములను, కపటి కనుసైగ యందలి నిగూఢ మర్మమును ‘ఆయన’ గుర్తెఱుగును. హృదయ నైర్మల్యముతో మా దరిజేరవచ్చిన అలక్ష్యమూర్తులనెందరిని అంగీకారాసనముపై ప్రతిష్ఠించ లేదు; వివేక ప్రతినిధు లెందరిని మా సకల న్యాయనిర్ణయమున అగ్నిదగ్ధుల గావింపలేదు. మేము, సత్యముగా, న్యాయనిర్ణేతలము. “అభీష్టాను వర్తను” డన భగవంతునిదివ్యావతారమే; “అభీష్టానుసార నిర్దేశిత సింహాసనము”౎ నధిష్ఠించునదియు ‘ఆయన’ యే.

157

అవలోకింపుడు : “మహావ్యత్యస్తమర్మము సార్వభౌమ చిహ్నముగ” ఇప్పుడు వెల్లడియైనది.” ‘ధర్మబద్ధమైన’ ఈ ‘అలీఫ్’ సద్గుణముచే పెంపొందింపబడిన “షష్ఠి” ని గుర్తెఱుగుటలో భగవంతునిచే సహకరింపబడిన వాడు ధన్యుడు; నిశ్చయముగా, సత్యమైనవిశ్వాసము కలవారిలో ఆతడొకడు. “ఓ ప్రపంచముల యభీష్టమా! నీకు సకల కీర్తి వర్తించుగాక!” యని సంభ్రమాశ్చర్యములతో పల్కుచు, ‘ఆయన’ ను సమీపించిన మూర్ఖులెందరు, విముఖులైన బాహ్యపవిత్రులెందరు ! తాను ఆశించిన దానిని, తాను అభిలషించిన వారి కొసంగుటయూ, తాను ఇచ్చగించిన వానికి తాను ప్రీతించిన దానిని ఇవ్వకుండుటయు, యదార్ధముగా దేవుని హస్తవశమై యున్నది. హృదయాంతరాళముల రహస్యములను, కపటి కనుసైగ యందలి నిగూఢ మర్మమును ‘ఆయన’ గుర్తెఱుగును. హృదయ నైర్మల్యముతో మా దరిజేరవచ్చిన అలక్ష్యమూర్తులనెందరిని అంగీకారాసనముపై ప్రతిష్ఠించ లేదు; వివేక ప్రతినిధు లెందరిని మా సకల న్యాయనిర్ణయమున అగ్నిదగ్ధుల గావింపలేదు. మేము, సత్యముగా, న్యాయనిర్ణేతలము. “అభీష్టాను వర్తను” డన భగవంతునిదివ్యావతారమే; “అభీష్టానుసార నిర్దేశిత సింహాసనము”౎ నధిష్ఠించునదియు ‘ఆయన’ యే.

158

దేని చలనమున భగవంతుని మందమారుతమువీచి సమస్త జగత్తును ఆవరించినదో, దేని స్తబ్ధతచే సమస్త అస్తిత్వ ప్రపంచమునను ప్రశాంతత గోచరించునో అట్టి లేఖినినుండి జాలువారిన రచనల అంతరార్ధపరిమళమును గ్రహియించిన యాతడు ధన్యుడు. అగణితానుగ్రహావిష్కర్తయగు సకల దయామయుడు ప్రకీర్తితుడు. వచించు : ‘ఆయన’ అన్యాయమును సహియించుటచే భూమిపై న్యాయమావిర్భవించినది; ‘ఆయన’ అవమానమును మన్నించుటచే మానవాళి యందున భగవంతుని మహనీయత శోభిల్లినది.

159

అత్యవసరమైతే తప్ప సాయుధులై చరియించుట మీకు నిషేధింప బడినది; పట్టువస్త్రములను ధరియించుకొనుట మీ కనుమతింప బడినది. దేవదేవుడు తన యౌదార్యము కొలది వస్త్రధారణ, గడ్డపు కత్తిరింపుల విషయమున పూర్వానువర్తిత ప్రతిబంధకముల నుండి మిమ్ము విముక్తులను గావించినాడు. యదార్ధమునకు ‘ఆయన’ నిర్దేశకుడు, సర్వజ్ఞుడు. ప్రాజ్ఞులును, న్యాయవర్తనులును అంగీకరింపని దేదియును మీ ప్రవర్తనయం దగుపింపకుండు గాక; మీరజ్ఞానులకు ఆట వస్తువులు కావలదు. సత్ప్రవర్తన తోడను, శ్లాఘనీయ వర్తన తోడను అలంకృతుడగు నాతనికి శుభమగుగాక! ఆతడు నిక్కముగా, తమ దైవమునకు విశిష్ట, విలక్షణ కార్యములతో సహకరించు వారియందున గణియింప బడును.

160

భగవంతుని నగరముల, దేశముల యభివృద్ధిని పెంపొందించి, వానియం ‘దాయన’ శుభానుగ్రహప్రాప్తినొందిన వారి ఉచ్చైస్వనములతో ‘ఆయన’ మహనీయతను చాటుడు. గృహములు, నగరములు హస్తము తదితర సాధనములచే నిర్మింపబడినటుల, వాస్తవమునకు, మానవ హృదయములు జిహ్వశక్తి నిర్మితములు. ప్రతి లక్ష్యసాధనకును మేమొక విధానము నేర్పరచితిమి; వినియోగించుకొని, సర్వజ్ఞుడును, సకల వివేకియును అగు దేవుని యందు నమ్మికను, విశ్వాసమును కలిగియుండుడు.

161

భగవంతుని యందునను, ‘ఆయన’ సంకేతముల యందునను తనకు గల విశ్వాసము నంగీకరించి, “ ‘ఆయన’ తన చర్యలకు ప్రశ్నింపబడ” డని గ్రహియించిన యాతడు ధన్యుడు. అట్టి గుర్తింపు, భగవంతునిచే ప్రతి విశ్వాసమునకు ఆభరణముగను, దానికి మూలముగను గావింపబడినది. ప్రతి సత్కర్మావలంబనమును అందుపై ఆధారితమై యుండవలె. తిరుగుబాటుదారుల మంతనములు మిమ్ముల నాకస్మికపతనము నొందనీయ కుండునటుల దానిపై మీ దృష్టిని స్థిరముగా నిలుపవలె.

162

అనాదిగా నిషిద్ధమైన దానిని న్యాయబద్ధమైనదిగ నిర్దేశించుటకును, సర్వదా న్యాయసమ్మతమని విశ్వసింపబడుతూ వచ్చిన దానిని నిషేధించుటకును ‘ఆయన’ నిర్ణయించెనేని, ‘ఆయన’ అధికారమును ప్రశ్నించు హక్కెవ్వరికిని యొసంగబడలేదు. క్షణమాత్రమేని సందేహించిన వాడెవ్వడైనను అవిధేయునిగ గణియింప బడును.

163

పరమోన్నతమును, మూలాధారమును అగు ఈ సత్యమును గుర్తింపక, ఈ మహనీయస్థానప్రాప్తినొంద విఫలుడైన వానిని, అనుమానపు పెనుగాలులు కలవరపెడతాయి. అవిశ్వాసుల ప్రలాపములాతని యాత్మను పెడత్రోవ పట్టించును. ఈ నియమమును గుర్తించిన వానికి మహాపరిపూర్ణ స్థిరత్వము ప్రసాదింపబడును. ప్రతి విశిష్ట ఫలకమును అలంకరించు దానిని స్మరియించుటయే ఈ సకల మహనీయ స్థానమునకు అఖిలగౌరవము. మిమ్ము సకలవిధ సంశయ, సంకోచముల నుండి విముక్తుల గావించి, ఇహపరముల యందు మోక్షప్రాప్తిదాయకమగు ప్రబోధమునే భగవంతుడు మీకు అనుగ్రహించి నాడు. ‘ఆయన’, నిశ్చయముగా, నిత్యక్షమాశీలి, మహోదారుడు. “శక్తివంతుడను, సకలవివేకిని యగు నేను దక్క అన్యదైవము లే” డని ఉద్ఘోషించుటకై దివ్యదూతలను, దివ్యగ్రంథములను పంపినది ‘ఆయన’ యే.

164

ఓ కాఫ్, రా (కిర్మాన్) భూభాగమా! మేము, నిశ్చయముగా నీవు భగవంతుని యెడ అసంతోషముతో నుండుటనూ వీక్షింతుము, అటులనే సర్వజ్ఞుడును, సకల గ్రాహియును అగు ‘ఆయన’ కు దక్క అన్యులెవ్వరికిని గ్రాహ్యము కానిది నీ నుండి వెడలిపోవుటనూ అవలోకింతుము; నీ నుండి గోప్యముగ, అపహృతమై వెలువడు దానిని సైతము గ్రహియింతుము. పవిత్ర ఫలకమున లిఖితమైన సమస్త వస్తు పరిజ్ఞానమును మాయొద్ద నున్నది. నీకు సంభవించిన దానికి చింతిల్లకు. మతగురువుల దుష్ట సలహాలు నిరోధించలేనటుల, అనుమాన బీజములను నాటువారి కపటోపాయములచే వెనుదీయ లేనటుల, నా శక్తియుత నామమును సుస్థిర మొనరించునట్టి శక్తివంతులను, పరాక్రమశాలురను భగవంతు డనతికాలములోనే నీయందావిర్భవింపజేయగలడు. వారు తమ స్వీయ నేత్రములతో దేవుని దర్శించి, తమ స్వీయజీవితములనొడ్డి ఆయన*కు విజయమును చేకూర్చెదరు. వాస్తవమునకు వారు దృఢచిత్తులు.

165

ఓ మతాధిపతుల సమూహమా! నా దివ్యప్రవచనములు అనుగ్రహింపబడి, నా విస్పష్టచిహ్నములు వెల్లడియైనపుడు, నీవు తెర మరుగునయుండ గాంచితిమి. నిజమునకిది వింతయే. నా నామమున కీర్తింప బడుచున్నను, సకలాధార సమన్వితముగ, నిదర్శనా పూర్వకముగ పరమేశ్వరుడు మీమధ్య ప్రత్యక్షమైనప్పుడు గుర్తించరైతిరి. మేము తెరలను చీల్చి దూరముగ విసరి వైచితిమి. జనులను వేరొక ముసుగులో కప్పివేయుదురేమో, జాగ్రత్త. సకల జననాధుని పేరిట వ్యర్ధపుటూహల శృంఖలములను త్రుంచి వేయుడు; అంతియేతప్ప, వంచకులు కావలదు. మీరు భగవంతుని ఆశ్రయించి, ‘ఆయన’ దివ్యధర్మము నవలంబించిరేని, అందున అశాంతిని వ్యాపింప చేయవలదు, భగవంతుని దివ్యగ్రంథమును మీ స్వార్ధపూరిత వాంఛలతో తులనము గావింపవలదు. నిశ్చయముగా, భూత భవిష్యత్తుల యందున భగవంతుని యుపదేశమిది; అవును, భగవంతుడును, ‘ఆయన’ యనుగ్రహప్రాప్తినొందినవారును, ‘మా’ యందలి ప్రతి యొక్కరమును ఇందుకు సాక్ష్యమును వహించి ధృవీకరింతుము.

166

తన సమకాలీన మతాధిపతులలో మహాపండితునిగా గణుతికెక్కిన మహమ్మద్ హసన్ నామధేయము గల షేఖ్‌ను స్ఫురణకు దెచ్చికొనుడు. సత్యసంధుడు సాక్షాత్కరించినవేళ, గోధుమలను, బార్లీని జల్లించు నాతడొక్కడు ‘ఆయన’ నంగీకరించి దేవదేవుని వైపుకు తిరుగగా, ఈ షేఖ్ తనవంటి మరికొందరితో పాటుగా ‘ఆయన’ ను తిరస్కరించాడు. దైవశాసనములని, నియమములని తాను భావించినవాటిని క్రోడీకరించుట యందాతడు రేయింబవళ్లు నిమగ్నుడైయున్నను, అనిర్బంధనుడగు దేవుడు ప్రత్యక్షమైనపుడు, వాటి యందలి యొక్క అక్షరమైనను ఆతనికి అక్కరకు రాలేదు, లేనిచో నాతడు - దైవానుగ్రహీతుల వదనములను శోభిల్లజేసిన ‘ఆయన’ దివ్యముఖారవిందము నుండి వైదొలగి యుండెడువాడు కాడు. భగవంతుడు ప్రత్యక్షీకృతుడైనప్పుడు మీ ‘రాయన’ ను విశ్వసించియుండిన, ప్రజలు ‘ఆయన’ నుండి వైదొలగి పోవువారును కారు, ఈనాడు మీరవలోకింపుచున్నవి మాకు సంభవించెడివి కావు. భగవద్భీతిని కలిగి యుండుడు, అలక్ష్యపరులు కావలదు.

167

సకల నామాధిపతియగు ‘ఆయన’ ను దరిచేరనీయక ఏ నామమైనను మిమ్ము నిరోధించునేమో, మీ వివేకములకు మూలాధారమగు ‘ఆయన’ స్మరణను ఏ పదమైనను విస్మరింప జేయునేమో జాగరూకులు కండు. ఓ మతగురువుల సముదాయమా! భగవంతుని కభిముఖులై ‘ఆయన’ సంరక్షణను అర్ధింపుడు; నాకును, నా సృష్టికిని మధ్య అడ్డుతెఱలు కావలదు. మీ చర్యలు సమసిపోవలెననియు, మీ స్థితిని మీరే మఱచితిరనియు మీ ప్రభుడీ విధముగ మిమ్ములను న్యాయవర్తనులై మెలగుడని ఉద్బోధింపుచూ, ఆజ్ఞాపింపుచున్నాడు. ఈ దివ్యధర్మతిరస్కారకుడు, సమస్తసృష్టియందలి మరే దివ్యధర్మపు సహేతుకతనైనను నిరూపింపగలడా? లేదు, విశ్వరూపకర్తయగు దేవుని సాక్షిగా, నిరూపింపలేడు. ఆయినను ప్రజలింకను దృగ్గోచరమగు ముసుగులో కప్పివేయ బడినారు. వచించు: ఈ దివ్యధర్మము ద్వారా ప్రామాణిక ప్రభాతనక్షత్రము ఉదయించినది. నిదర్శనాప్రకాశము ప్రపంచ జనులందరిపైనను ప్రసరిల్లినది. ఓ అంతర్దృష్టియుతులారా, భగవద్భీతిని కలిగి యుండుడు, నన్ను విశ్వసింపనివారు కావలదు. “ప్రవక్త”౎ యను పదము ఈ పరమోన్నత ప్రకటన నుండి మిమ్ము నిరోధించునేమో, లేక సమస్త లోకావృతమగు భగవంతుని సార్వభౌమత్వమున కధీకృత ప్రతినిధి యగు ‘ఆయన’ నుండి “ప్రాతినిధ్య”౎ పరమైనదేదైనను, మిమ్ము నిలిపివేయునేమో జాగరూకులు కండు. ప్రతి నామమును ‘ఆయన’ దివ్యవాగ్జ్జనితమే; ప్రతి ధర్మము, అప్రతిహతమును, శక్తివంతమును, అద్భుతమును అగు ‘ఆయన’ దివ్యధర్మాధారితమే. వచించు: సమస్తలోకముల సంరక్షణాదక్షుడగు ‘ఆయన’ దక్క వేరెద్దియును ప్రస్తావితము గానట్టి దివ్యదినమిది. మీ యంధవిశ్వాసములను, విగ్రహములను ప్రకంపిల్లజేసిన దివ్యధర్మమిది.

168

సంకటహరుడును, స్వయంభువును అగు, దైవమును ఖండించుటకై ఇతరమగు ప్రతి దివ్యధర్మపుటనుయాయులును తమ పవిత్ర గ్రంథముల యందున హేతువులకై యన్వేషించిన చందముననే, భగవంతుని దివ్యగ్రంథమును చేబూని అందుండి నిదర్శనములను, వాదములను ఎత్తి చూపుచు తన దైవమును పరిత్యజింపచేయజూచు వానిని నిశ్చయముగా మీయందే మేమవలోకింపు చున్నాము. వచించు: “యదార్ధమునకు సర్వజ్ఞుడను, సకల వివేకవంతుడను అగు నేను తప్ప వేరు దైవము లే” డని సృష్టి హృదయాంతరాళము నం దుద్ఘోషింపుచున్నయట్టి ఈ సజీవ దివ్యగ్రంథము దక్క, ప్రపంచమందలి పవిత్ర గ్రంథావళి గాని, సమస్త పుస్తకములు, రచనలు ఎవ్వియునుగాని ఈ దివ్యదినమున ఇందుకై మీకుపకరింపవు.

169

ఓ మతాధిపతుల సముదాయమా! దివ్యధర్మపు తొలి దినముల యందున మీరు దాని నిరాకరణకు కారకులైనటులే, భూమిపై కలహములకు కారకులగుదురేమో, జాగరూకులు కండు. “సకల సంకేతములకును ప్రత్యూషస్ధానమగు భగవంతునిదే సామ్రాజ్య”౎ మని గులకరాళ్లను సహితము ఘోషిల్లజేసిన ఈ దివ్యప్రవచనము చుట్టును ప్రజలను సమీకరింపుడు. మీ దేవదేవుడు తనయౌదార్యములో ఒక భాగముగ ఆయన మిమ్మీవిధముగ హెచ్చరింపుచున్నాడు; వాస్తవమునకు ఆయన నిత్యక్షమాశీలి, పరమోదారుడు.

170

భగవంతుని చెంతకు మేమాహ్వానించిన వేళ, స్వీయవాంఛా ప్రేరితుడై, తిరస్కారభావమును పెంపొందించుకొనినయట్టి కరీమ్‌ను స్ఫురణకు దెచ్చికొనుడు; అయినను, మేమాతనికి అస్తిత్వ ప్రపంచమున సాక్ష్యనేత్రమునకు సాంత్వనమును, సమస్త భూస్వర్గవాసులకును భగవంతుని వాగ్దానపరిపూర్తి ప్రమాణమును సైతము పంపినాము. సకల సంపన్నుడును, పరమోన్నతుడును అగు ‘ఆయన’ యనుగ్రహమునకు సంకేతముగ, దివ్యసత్యము నవలం బింపుమని ఆతని నాదేశించినాము. కాని భగవంతుని న్యాయబద్ధచర్యగా ఆగ్రహదేవత లాతనినావహించునంత వరకు అతడు తిరస్కరించినాడు. యదార్ధమునకు, మేమే ఇందులకు సాక్షులము.

171

దివ్యసామ్రాజ్యవాసులకు సైతము వినిపించునటుల అడ్డుతెఱలను చీల్చివేయుడు. భూత, భవిష్యద్దివసముల కిది భగవదాజ్ఞ. తన కాజ్ఞాపితమైన దానిని పాలించునాతడు ధన్యుడు; అలక్ష్యపరుని దుఃఖమావరించును.

172

నిశ్చయముగా ఈ భూలోకమున పరంధాముని ప్రత్యక్షీకరింపజేసి ‘ఆయన’ సార్వభౌమత్వమును సాక్షాత్కరింపచేయుట తప్ప మాకు వేరొండు పరమార్ధము లేదు; నాకు సాక్షిగా నుండుటకు భగవంతుడే తగినవాడు. సత్యముగా ఉత్కృష్ట సామ్రాజ్యమునం ‘దాయన’ దివ్యధర్మమును సమున్నత మొనరించి, ‘ఆయన’ ప్రఖ్యాతిని శ్లాఘించుట తప్ప మాకు వేరొండు యుద్దేశ్యము లేదు; నాకు రక్షకుడగుటకు దేవుడే తగినవాడు. యదార్ధమునకు, భగవంతుని, ‘ఆయన’ యనుగ్రహించిన దానిని స్తుతించుట వినా దివ్య సామ్రాజ్యమున మాకు వేరొండు కాంక్ష లేదు; నాకు సహాయకారి యగుటకు దేవదేవుడే తగినవాడు.

173

ఓ బహా పండితులారా! మీరు సంతోషాత్ములు. దైవసాక్షిగా ! మీరు మహాసముద్రపుటుత్తుంగ తరంగములు, కీర్త్యాకాశ తారకలు, భూ స్వర్గముల నడుమన ఎగయు విజయకేతనములు. వసుధపై వసియించు వారందరికిని మీరు స్థైర్యతామూర్తులు, దివ్యవాణీ ప్రభాతములు. మిమ్మనుసరించు నాతనికి శుభమగును, వక్రగతి నేగినవాడు దుఃఖభాజనుడగును. దయాళువును, పరమాత్ముడును అగు భగవంతుని కరుణాన్వితహస్తముల నుండి అనంతజీవన మార్మికమధువును గ్రోలినయాతడు, తనచే ప్రపంచమును, ప్రతిహతమైన ప్రతి అస్తికయును చేతనత్వము నొందునటుల మానవజాతియను దేహమందలి ధమనియై ప్రకంపించును.

174

ఓ ప్రపంచ ప్రజలారా! మార్మికకపోతము తన దివ్యసంకీర్తనా శ్రయము నుండి బయల్వెడలి, తన సుదూర గమ్యమునకు, తన నిగూఢఆవాసమునకు ఎగసిపోయినపుడు, దివ్యగ్రంథము నందేదైనను మీకవగతము కానిచో, ఈ మహావృక్షము నుండి యావిర్భవించిన శాఖయగు ‘ఆయన’ కు నివేదింపుడు.

175

ఓ పరమోన్నతుని లేఖినీ: స్వర్గముల స్రష్ట యగు నీ యధినాధుని యానతిన, దివ్యఫలకముపై చలియింపుము; సర్వోత్కృష్ట ఏకత్వ సాంప్రదాయము దెసకు, దివ్యైక్యతాప్రత్యూషమగు ‘ఆయన’ యడుగిడనెంచిన కాలమును గురించి ప్రస్తావింపుము; శక్తివంతుడును, సర్వజ్ఞుడును అగు నీ సర్వేశ్వరునివి యును, తెరమరుగున దాగియున్నట్టివియును అగు మర్మములను సహృదయులు దైవవశమున సూచీరంధ్రమంతైనను, లిప్తపాటు పరికింతురు గాక. వచించు: మేము, యదార్ధముగా, సమస్తసృష్టి గ్రహియింపక పూర్వమే అంతర్భావము, అర్ధవివరణము అను విద్యాలయమునం దడుగిడితిమి. సకల దయామయుడగు ‘ఆయన’ చే యనుగ్రహింపబడిన దివ్యప్రవచనములను గాంచితిమి, ‘ఆయన’ (బాబ్) మాకు సమర్పించిన ఫలకమునందలి యాపద్బాంధవుడును, స్వయంభువును అగు భగవంతుని దివ్యప్రవచనములను స్వీకరించితిమి; ‘ఆయన’ ఆ ఫలకమున ధృవీకరించినదంతయును శ్రవణము గావించితిమి. నిశ్చయముగా, దీనిని మేము అవలోకించితిమి. మా యానతితో ఆయన యభీష్టము నామోదించితిమి; ఏలయన, యదార్ధమునకు మేము ఆజ్ఞాపింప సమర్థులము.

176

ఓ బయాన్ జనులారా! వాస్తవమునకు మీరు జాగ్రదావస్థ యందుండగ మేము భగవంతుని విద్యాలయమునం దడుగిడితిమి; మీరు గాఢనిద్ర యందుండగ దివ్యఫలకమును పారాయణము గావించితిమి. సత్యైకదేవుని సాక్షిగా! మీకింకను దెలియక మునుపే, ఆవిష్కరణకు పూర్వమే దివ్యఫలకమును పఠియించినాము; మీరింకను జనియింపక మునుపే, మాకు దివ్యగ్రంథమును గుఱించిన సంపూర్ణపరిజ్ఞానమున్నది. ఈ వాక్కులు, మీ ప్రామాణికతకే తప్ప భగవంతుని ప్రామాణికీకరణకు కాదు. మీరు గ్రహియింప గలవారేని, ఆయన జ్ఞానమునందు నిక్షిప్తమైనట్టిదే ఇందుకు నిదర్శనము; మీరు అవగాహనాపరులైనచో సర్వశక్తివంతుడగు దేవాధిదేవుని జిహ్వయే ఇందుకు సాక్ష్యము వహియించును. భగవంతునిపై ప్రమాణము ! మేము తెఱను తొలగించినమీరు నిశ్చేష్టులగుదురు.

177

మీరు భగవంతుని గుఱించియును, ఆయన దివ్యధర్మమును గుఱించియును వ్యర్ధముగ కలహింపరాదని తెలిసికొనుడు; ఏలయన, అదిగో వీక్షింపుడు! భూత వర్తమానస్థితములగు వస్తుసమస్తమును ఆవరించినయట్టి మహా దివ్యావిష్కరణముతో ‘ఆయన’ సాక్షాత్కరించినాడు. దివ్యసామ్రాజ్య వాసుల భాషలో మేము ప్రసంగింపవలసి వచ్చినయట్లైన “సత్యముగా, భగవంతుడు ఆ దివ్యవిద్యాలయమును, భూస్వర్గముల సృష్టికి పూర్వమే సృజియించినాడు. అ మరియు గు అక్షరములను జతగూర్పక మునుపే, మేమందు ప్రవేశించితి”౎ మని పలుకుదుము. మా దివ్యసామ్రాజ్యమున మా పరిజనులభాష యిట్టిది. మా యుత్కృష్ట దివ్యధామవాసుల భాష యెటు లుండునో యోచింపుడు, ఏలయన వారికి మేము మా పరిజ్ఞానము ననుగ్రహించినాము, దైవజ్ఞాన నిక్షిప్తమైన సకలమును వెల్లడించినాము. కనుక భగవంతుని సర్వవైభవసామ్రాజ్యమున శౌర్యవైభవ జిహ్వ యుచ్చరించునదేమో యూహింపుడు.

178

ఈ దివ్యధర్మము మీ వ్యర్థభ్రమలకై క్రీడావస్తువు గావింపరానట్టిది; అవివేకులకును, భయాన్వితహృదయులకును స్థానములేని క్షేత్రమిది. దైవసాక్షిగా అంతర్దృష్టికిని, అసంగతత్వమునకును, దార్శనికతకును నెలవైనదియును, మర్త్యజగత్తునుండి సర్వమును ఎడబాసిన దయామయుని ధీరాశ్వికులు దక్క అన్యుడెవ్వడును చొరజాలనిదినియును నగు రణభూమి యిది. అవనియందున భగవంతునికి విజయమును చేకూర్చువారును, మానవాళి యందాయన సార్వభౌమప్రతాపమునకు ప్రత్యూష స్థానములును నిక్కముగా వీరే.

179

బయాన్ గ్రంథమునం దావిష్కృతమైనది యేదైనను, పరమ కరుణాన్వితుడగు మీ ప్రభుని నుండి మిమ్ము దూరము గావించునేమో జాగరూకులు కండు. నా కీర్తిని యుగ్గడించుటకు తప్ప అన్యప్రయోజనమునకై బయాన్ అనుగ్రహీతము కాలేదనుటకు భగవంతుడే నాకు సాక్షియని యెరుంగుడు ! నిష్కల్మష హృదయులిందున నా ప్రేమపరిమళములనే కనుగొందురు, గోచరా గోచర సమస్తమును ఆచ్ఛాదించిన నా దివ్యనామధేయమునే గాంచెదరు. వచించు: ఓ ప్రజలారా! నా మహోన్నత లేఖిని నుండి వెలువడినట్టి దాని నాశ్రయింపుడు. అందుండి దైవసౌరభముల నాఘ్రాణించినచో, ఆయనకు వ్యతిరేకముగ వర్తింపనూవలదు, ఆయన ప్రేమాన్విత ఉపకృతులయందలి, ఆయన అగణిత ఔదార్యానుగ్రహముల యందలి భాగమును విస్మరింపనూ వలదు. భగవంతుడు మిమ్మీ విధముగ హెచ్చరింపుచున్నాడు; నిశ్చయముగా ఆయన ఉపదేశకుడు, సర్వజ్ఞుడు.

180

బయాన్ గ్రంథాంశముల యందేదైనను మీ కవగతము కానియెడల, మీ ప్రభుడును, మీ పూర్వీకుల ప్రభుడును అగు భగవంతుని యర్ధింపుడు. ‘ఆయన’ అభిలషించెనేని, అందావిష్కృతమైన దానిని వ్యాఖ్యానించి, దాని ప్రవచనమహాబ్ధియందు నిక్షిప్తములైయున్న దివ్యజ్ఞాన, వివేక మౌక్తికములను మీకు వెల్లడింపగలడు. ‘ఆయన’ నిశ్చయముగా, సకల నామాధిపతి; సంకట హరుడును, స్వయంభువును అగు ‘ఆయన’ తప్ప దైవము లేడు.

181

బృహత్తరమును, నవీనమును, మానవనేత్రములు ఇతఃపూర్వ మెన్నడును వీక్షించి ఎఱుగనట్టిదియును యగు ఈ దివ్యప్రపంచ సంవిధానపు ప్రకంపనా ప్రభావముచే ప్రపంచ సమతౌల్యతాస్థితి తలక్రిందులైనది. అద్వితీయమును, అత్యద్భుతమును అగు ఈ సంవిధానమూలమున మానవజాతి జీవనసరళియే సమూలముగ పెనుమార్పులకులోనైనది.

182

నా ప్రవచన పయోనిధి యందున నిమజ్జనము కండు, తద్వారా మీరు దాని రహస్యములను ఛేదింపవచ్చును, దాని యగాధముల యందున దాగియున్న వివేకమౌక్తికములను కనుగొనవచ్చును. భగవంతుని శక్తిసామర్ధ్యములు వెల్లడిగావింపబడి, ఆయన సార్వభౌమాధికారమును స్థిరీకృతమొనరించిన ఈ దివ్యధర్మపు సత్యమును సమాశ్రయించుటయందున మీ సంకల్పము వికల్పము కాకుండ జాగరూకులు కండు. ప్రమోదముతో వెలుగొందు వదనములతో ఆయన దరిజేర వేగిరపడండి. భూత, భవిష్యత్తులయందున, నిరంతరమును మార్పునొందనిది ఈ భగవద్ధర్మము. తదన్వేషకుడు దాని ప్రాప్తినొందుగాక; తదన్వేషణను తిరస్కరించిన వాని విషయమున భగవంతుడు, నిశ్చయముగ, తాను సృజియించిన ప్రాణుల సర్వావశ్యకములకు అతీతముగా స్వయం సంపన్నుడు.

183

వచించు : మీరీ సత్యమును విశ్వసించి, గుర్తించినవారేని, భగవంతుడు చేబూనినయట్టి ఈ త్రాసు దోషరహితమైనది; భూమిపైనను, స్వర్గమునందును వసియించు వారందరును యిందు తూచబడి, వారి ప్రారబ్ధము నిర్ణయింపబడును. వచించు : మీరీ సత్యమును విశ్వసించి గుర్తించిన వారేని, ప్రతి నిదర్శన ప్రమాణమును తరతరములుగ స్థిరీకృతమొనరించినయట్టి మహత్తర నిదర్శనమిది. వచించు : మీరు విశ్వసించిరేని, దాని వలన పేదలు సంపన్నులైనారు; పండితులు జ్ఞానసంపన్నులైనారు, ప్రకర్షితులైనారు, జిజ్ఞాసువులు దైవసాన్నిధ్యమున కధిరోహించినారు. దానిని మీ మధ్య కలహకారక మొనరింతురేమో జాగరూకులు కండు. ప్రేమాస్పదుడును, శక్తిశాలియును అగు మీ పరమేశ్వరుని పరమ ధర్మమున దృఢముగ నిలిచిన పర్వతమువోలె యుండుడు.

184

వచించు: ఓ దుస్స్వభావమూలమా! నీ స్వాతిశయాంధకారమును విస్మరించి ప్రజలయందు సత్యమునే వచింపుము. నీవు నీ స్వార్ధమనో వికారములకులోనై, నిన్ను మలిచి నీకు ఉనికిని ప్రసాదించిన ‘ఆయన’ ను పరిత్యజింపగా పరికించి పరితాపమునొందితినని భగవంతునిపై ప్రమాణము చేయుదును. దివ్యధర్మసేవకై మేము అహర్నిశలు నిన్ను పోషించిన విషయమును, పరమాత్ముని మృదుకారుణ్యమును స్ఫురణకు దెచ్చికొనుము. దైవభీతినొంది, యదార్ధముగా పశ్చాత్తాపగ్రస్తుడవై వర్తింపుము. నీ స్థాయిని గని లోకులు భ్రాంతినొందిరనుకొన్నను, నీవు సైతము నీ విషయమున అటులే భ్రాంతినొందితి వనుకొనవచ్చునా? భగవానుని యెదుట భయకంపితుడవై, మా సింహాసన పార్శ్వమున నిలిచి, మేము ప్రవచించిన ప్రవచనములను, సంరక్షణాదక్షుడును, శక్త్యధికారాధి నాథుడును నగు దేవుడు ప్రసాదించిన ప్రవచనములను మేము వక్కాణింపుచుండ నీవు లిఖించిన దినములను పునరావలోకనము గావించుకొనుము. భగవంతుని పవిత్రసాన్నిధ్యప్రాప్తి నొందుటకు, నీ యహంకారాగ్ని నిన్ను ఆటంకపరచునేమో, జాగరూకుడవు కమ్ము. నీ కృత్యము లకు దిగులుచెందకు, ‘ఆయన’ నాశ్రయింపుము. సత్యముగా, ‘ఆయన’ తన వదాన్యతగా, తానపేక్షించిన వారిని, ఔదార్యవశమున క్షమియించును; నిరంతరక్షమాశీలియును, సకలౌదార్యుడును నగు ‘ఆయన’ తప్ప దేవుడు లేడు. దేవుని కొఱకే నిన్ను ప్రబోధింపుచున్నాము. నీవీ యుపదేశము నంగీకరించియుండిన నీ ప్రయోజనమునకై వర్తించి యుండెడివాడవు; నీవు తిరస్కరించితివేని, ‘ఆయన’ నిశ్చయముగ నిన్నును, నిన్ననుసరించి భ్రాంతికి లోనైనవారందరిని పరిత్యజించును. నిన్ను పెడదారి పట్టించిన వానిపై దేవుడు నియంత్రణను కలిగియుండుట నవలోకింపుము! వినయముతో, అణకువతో, దైన్యముతో భగవంతుని చెంతకు తిరోగమింపుము; నిశ్చయముగా, ఆయన నీ పాపములను పోద్రోలును, ఏలయన నీ దేవదేవుడు నిక్కముగా క్షమాశీలి, శక్తివంతుడు, సకలదయాళువు.

185

మీరాలించితిరేని ఇదియే దైవోపదేశము! మీరొందితిరేని ఇదియే దైవానుగ్రహము! మీరెరిగితిరేని ఇదియే దైవవాణి! మీరు గ్రహియించితిరేని ఇదియే దివ్యైశ్వర్యము !

186

ప్రపంచమునకు నిరంతరదీపికయైన మహాగ్రంథమిది, భూ ప్రజలయందున ‘ఆయన’ అనుల్లంఘనీయ ఋజుమార్గము. వచించు: మీరు గ్రహించితిరేని, ఇదియే దివ్యపరిజ్ఞానప్రత్యూషము, మీరు అవగాహనాపరులేని, ఇదియే దైవశాసనములకు ప్రభాతస్థలియని తెలియుడు.

187

భరియింప గలిగినదానికన్న అధికభారమును జంతువుపై మోపవలదు. మేము, సత్యముగా, దివ్యగ్రంథమునందొక నిబద్ధైక నిషేధముగా పరిగణించి అట్టి యనుసరణను నిషేధించినాము. న్యాయమునకును, నిష్పాక్షికతకును ప్రతిరూపములై మెలగుడు.

188

ఉద్దేశ్యరహితముగ, ఎవ్వడేని వేరొకని ప్రాణమును తీసిన, మృతుని కుటుంబమునకు నూరు మిష్కల్‌ల సువర్ణమును పరిహారముగా నిచ్చుట ఆతని విధి. ఈ దివ్యఫలకమున నిర్దేశింపబడిన దానిని పాటింపుడు, దీని పరిధులను అతిక్రమించు వారు కావలదు.

189

ప్రపంచమందలి సమస్త చట్టసభల సభ్యులారా! ఉర్విజనులందరి యుపయోగార్ధమై యొక భాషను, అటులే, ఒక సామాన్యలిపిని ఎంచికొనుడు. భగవంతుడు, నిశ్చయముగా, మీకు ప్రయోజనకరమగు దానిని, మిమ్ములను పరులనుండి స్వతంత్రులను గావింపగల దానిని మీకు విశదీకరింపగలడు. ఆయన, సత్యముగా మహోదారుడు, సమస్తజ్ఞాని, సకల విదితుడు. మీరవగాహన చేసికొనినచో, ఐక్యతకు సాధనమిది; మీరర్థము చేసికొనినచో, నాగరికతను, సామరస్యమును పెంపొందించుటకు మహోపకరణమిది. మానవజాతి యుగాగమనమునకు మేము రెండు సంకేతములను ఏర్పరచినాము. మొదటిది, మా వేరొక దివ్యఫలకమున మేమేర్పరచిన సుస్థిరమగు పునాది; రెండవది, ఈ యద్భుత గ్రంథమునందే వెలువరించబడినది.

190

గంజాయి సేవనము మీకు నిషేధింపబడినది. మేము, నిశ్చయముగా, ఈ యలవాటును గ్రంథము నందొక అనివార్య శాసనమూలమున నిషేధించి నాము. ఎవ్వడైనను అందుకు పాల్పడెనేని, ఆతడు నిస్సంశయముగ అస్మదీయుడు కాడు. అవగాహనా వరప్రసాదితులారా, భగవద్భీతిని కలిగి యుండుడు.

Questions And Answers

1

ప్రశ్న: మహోన్నత పర్వదినమునకు సంబంధించి.

జవాబు : బయాన్ ప్రకారము మహోన్నత పర్వదినము* సంవత్సరమందలి రెండవ మాసపు పదమూడవ రోజునాటి మధ్యాహ్నానంతర మారంభమగును. ఈ పర్వకాలమునకు సంబంధించిన మొదటి, తొమ్మిదవ, పండ్రెండవ రోజులయందున పనిచేయుట నిషేధింపబడినది.

2

ప్రశ్న: జన్మదినద్వయమునకు సంబంధించి.

జవాబు: మొహరం (ఇస్లామిక్ చాంద్రమాన పంచాంగమందలి మొదటి నెల) మాసపు రెండవ రోజునాటి ఉషఃకాలము ఆభా సౌందర్యుని (బహాఉల్లా) జన్మఘడియ; కాగా, ఈ మాసపు మొదటి రోజు ఆయన దివ్యవార్తాహరుని ఆవిర్భావమునకు సూచకము. భగవంతుని దృష్టియందీ రెండు రోజులును ఒక్కటిగనే గణియింప బడినవి.

3

ప్రశ్న: వివాహసంబంధమైన పవిత్రవచనాలకు సంబంధించి . (అరబ్బీ భాషలో ఈ రెండు పవిత్రవచనాలు స్త్రీ, పురుషులకు వేరువేరుగా ఉంటాయి)

జవాబు: మగవారికి : “నిశ్చయముగ మేమెల్లరమును దైవేచ్ఛకు బద్ధులమై యుందుము.” మగువలకు: “నిశ్చయముగ, మేమెల్లరమును దైవేచ్ఛకు బద్ధులమై యుందుము.”

4

ప్రశ్న: తన అనుపస్ధితి కాలాన్ని - అంటే తాను తిరిగివచ్చేసమయాన్ని సూచనామాత్రంగానైనా తెలియచేయకుండా, ఏ వ్యక్తి ఐనా పయనమై పోయి, ఆ పై ఆతని గురించి ఏ మాటా వినరాక, ఏ జాడా తెలియరాక పోతే, ఆతని భార్య అనుసరించదగిన విధానం ఏమిటి?

జవాబు: ఏ వ్యక్తి యైనను కితాబ్-ఎ-అఖ్దస్ నందు స్పష్టముగ నిర్దేశితమైన ఒప్పందము గురించి తెలిసి యుండియు, తాను తిరిగి వచ్చు సమయమును నిర్ధారణగ చెప్పుటను విస్మరించిన, అటువంటి వ్యక్తి భార్య పూర్తిగా నొక సంవత్సర కాలముపాటు నిరీక్షించిన మీదట, శ్లాఘనీయమైన విధానము నవలం బించుటకైనను, పునర్వివాహము చేసికొనుటకైనను స్వతంత్రురాలు. ఒకవేళ ఆతనికీ యొప్పందము గురించి తెలిసి యుండని పక్షమున, ఆమె యోర్మిని వహియించి, ఆతని గతి ఏమైనదో తనకు వెల్లడించుటకు భగవంతుడు ప్రీతిని వహియించునంత వరకును నిరీక్షింపవలె. ఇందుకు సంబంధించి, శ్లాఘనీయమైన విధానమనగా - ఓరిమిని వహియించుటయే.

5

ప్రశ్న: “ఇంకను జనియింపనట్టి శిశువుల యార్తనాదముల నాలకించి, వారి వాటాను మేము ద్విగుణీకృత మొనరించి, మిగిలినవారి వాటాలను తగ్గించి నార,” మను పవిత్ర ప్రవచనానికి సంబంధించి :

జవాబు: భగవంతుని దివ్యగ్రంథానుసారము, దివంగతుని ఆస్తిపాస్తులు 2,520 వాటాలుగా విభజించ బడును. ఈ సంఖ్య 1 నుండి 9 వరకు గల పూర్ణసంఖ్యల సామాన్య గుణిజము. ఈ వాటాలన్నియును ఆపై ఏడు భాగములు చేయబడి, వాటిలో ఒక్కొక్కటియును, దివ్యగ్రంథమున పేర్కొనబడినట్లు, ప్రత్యేకింపబడిన వారస వర్గమునకు కేటాయింపబడును. ఉదా: పిల్లలకు, 60 వాటాలు గల 9 భాగములు, అనగా మొత్తం 540 వాటాలు కేటాయింపబడినవి. “వారి వాటాను మేము ద్విగుణీకృత మొనరించితి” మను వాక్కుల కర్ధము: పిల్లలను, 60 వాటాలు గల మరో 9 భాగములకు, అనగా మొత్తం 18 భాగములకు అర్హులను గావించితిమని. అదనముగ వారు పొందు ఈ వాటాలు ఇతర వారస వర్గముల వాటాల నుండి తగ్గింపబడినవి. అందువలన, ఉదాహరణకు : “నాలుగు వందల ఎనుబది వాటాలు గల ఎనిమిది భాగము” లకు అనగా, 60 వాటాలు గల 8 భాగములకు సమానమగు వంతునకు భార్య లేక భర్త అర్హులని వెల్లడించబడినను, ఈ పునర్వ్యవస్ధీకరణ వలన 90 వాటాలతో కూడిన ఒకటిన్నర భాగమును, భార్య లేక భర్తకు చెందిన భాగమున తగ్గించి, తిరిగి పిల్లలకు కేటాయించడమైనది; అటులే, తక్కిన వారసుల విషయమునను జరిగినది. ఫలితముగా: తగ్గింపబడిన మొత్తము, పిల్లలకై అదనముగా కేటాయింపబడిన 9 భాగములకు సమమగును.

6

ప్రశ్న: దివంగతుని సోదరుడు వారసత్వాస్తిలో తన వాటాకు అర్హుడు కావాలంటే, అతను, తన దివంగత సోదరుని తల్లిదండ్రులు ఇద్దరికీ జన్మించి ఉండటం అవసరమా ? లేక తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికి జన్మించి ఉన్నా సరిపోతుందా?

జవాబు: సోదరుడు కనుక తండ్రికి జన్మియించి యుండిన, దివ్యగ్రంథమున నిర్ణయించిన వారసత్వపు వాటాకు అర్హుడగును; ఒకవేళ, ఆతడు తల్లికి జన్మించి యుండిన, నిర్ణయింపబడిన వాటాయం దాతనికి మూడింట రెండువంతులు మాత్రమే లభించును; మిగిలిన మూడవ వంతు న్యాయమందిరమునకు మరలింపబడును. సోదరి విషయమునను ఇదే నియమ మనువర్తించును.

7

ప్రశ్న: వారసత్వాస్తికి సంబంధించిన నియమాలలో , మృతుడు నిస్సంతు అయితే, అతని ఆస్తిలో సంతానానికి చెందవలసిన వాటా న్యాయ మందిరానికి మళ్లించబడాలని ఉంది. మరి, ఇతర వారసత్వవర్గీయులు అంటే తండ్రి , తల్లి, సోదరుడు, సోదరి, ఉపాధ్యాయుడు సైతం లేని పక్షంలో, వారి వారసత్వవాటాలు కూడా న్యాయమందిరానికి మళ్లించబడతాయా, లేక వేరే విధంగా పంపిణీ చేయబడతాయా?

జవాబు : పవిత్ర ప్రవచనమే చాలును. ఆయన - ఆయన వాక్కులు ప్రకీర్తితములగు గాక : “మృతి నొందిన వారికి సంతానము లేనిచో, వారి వాటా . . . న్యాయమందిరమునకు చెందవలె” నని, “మరణించిన వారికి పిల్లలుండి, దివ్యగ్రంథమునందు పేర్కొనబడిన ఇతర ఔరసవర్గీయులెవ్వరును లేని యెడల, వారికి మూడింట రెండు వంతుల యాస్తి సంక్రమింపవలె; మిగిలిన మూడవ వంతు న్యాయ మందిరమునకు మరలింపబడవలె” నని ప్రవచింపుచున్నాడు. వేరొకతీరున చెప్పవలెననిన, సంతానము లేని సందర్భములలో, వారసత్వపుటాస్తిలో వారికై ఏర్పరచిన భాగము న్యాయమందిరమునకు మరలింప బడును; సంతానముండి, యితర వారస వర్గీయులు లేనపుడు, వారసత్వపుటాస్తియందు మూడింట రెండు వంతులు సంతానమునకు చెందును, మూడవ వంతు న్యాయమందిరమునకు మరలింపబడును. ఈ నియమమునకు సాధారణ, ప్రత్యేక అనువర్తనములు రెండును కలవు. అనగా, తరువాయి వర్గమునకు చెందిన వారసులెవ్వరును లేనిచో, రెండు వంతులు సంతానమునకును, మిగిలిన మూడవ వంతు న్యాయ మందిరమునకును చెందును.

8

ప్రశ్న: హుఖుఖుల్లా చెల్లింపు అనువర్తించే కనీస మొత్తానికి సంబంధించి.

జవాబు: హుఖుఖుల్లా చెల్లింపు అనువర్తించు కనీస మొత్తం విలువ పంధొమ్మిది మిష్కల్‌ల సువర్ణము. అనగా, ఈ మొత్తమునకు సమానమగు ధనమార్జింపబడినప్పుడు దానిపై హుఖుఖుల్లా చెల్లింపవవలసి యుండును. అటులే, తక్కిన యాస్తుల విలువ, వాటి సంఖ్యతోనిమిత్తము లేకుండా, నిర్ణీత మొత్తము నకు చేరినపుడు హుఖుఖుల్లా చెల్లింపవలసి యుండును. హుఖుఖుల్లా చెల్లింపు ఒక్కసారికి మించి యుండదు. ఉదాహరణకు, ఒకడు వెయ్యి మిష్కల్‌ల స్వర్ణమునార్జించి దానిపై హుఖుఖుల్లా చెల్లించినచో, నా మొత్తముపై వాణిజ్య, వ్యాపారముల మూలముగ అదనముగ చేరిన దానిపై తప్ప, చెల్లించు బాధ్యత యుండదు. వ్యక్తి లాభార్జన నిర్దేశిత మొత్తమునకు సమానమైనపుడు భగవంతు డాజ్ఞాపించిన దానిని నిర్వర్తింపవలె. అసలు మొత్తము చేతులు మారినపుడు ఆ మొత్తముపై, దానిని ప్రథమార్జనగానే భావించి, హుఖుఖుల్లా చెల్లింపవలసి యుండును. తన స్వాధీనమం దేది యున్నను, దాని మూల్యముపై హుఖుఖుల్లా చెల్లింపవలెనని “సర్వప్రథమ బిందువు” సూచించినాడు; అయినను, మహాశక్తియుతమగు ఈ సంవిధానమున, ఆవశ్యకములగు గృహోపకరణములను, గృహమును హుఖుఖుల్లా చెల్లింపునుండి మేము మినహాయించినాము.

9

ప్రశ్న: దివంగతుని హుఖుఖుల్లా చెల్లింపులు, ఋణాలు, అంత్యక్రియల, ఖనన సంబంధములైన ఖర్చులు - వీటిలో దేనికి ప్రాధాన్యత?

జవాబు: అంత్యక్రియలకు, ఖనన వ్యయములకు ప్రాధాన్యత ; ఆపై ఋణముల పరిష్కారము, తద నంతరమే హుఖుఖుల్లా చెల్లింపు. దివంగతుని ఋణముల పరిష్కారమునకు ఆతని యాస్తి చాలనిచో , నాతని యాస్తిపాస్తులను అప్పుల దామాషాలో పంపిణీ చేయవలె.

10

ప్రశ్న: కితాబ్-ఎ-అఖ్దస్‌లో సమూల శిరఃకేశఖండన నిషేధించ బడినది; కాని,సురే-ఇ-హజ్ విధించ బడినది.

జవాబు: కితాబ్-ఎ-అఖ్దస్‌కు విధేయులై యుండుట అందరి విధి. అందు ఆవిష్కృతమైనదంతయు ఆయన సేవకులకు దైవశాసనం. పవిత్రగృహమును సందర్శించు తీర్ధయాత్రికులు శిరోముండనమును గావించుకొనవలెనన్న యాజ్ఞ తొలగింపబడినది.

11

ప్రశ్న: నిరీక్షణ సంవత్సరంలో దంపతుల మధ్య సంయోగము జరిగి, ఆపై తిరిగి విరోధం పొడసూపి విడిపోయిన పక్షంలో, వారు తమ ఎడబాటు కాలాన్ని పునఃప్రారంభించాలా? లేక తమ సంయోగానికి ముందు కాలాన్ని, నిరీక్షణ సంవత్సరకాలంలో భాగంగా పరిగణించవచ్చా? ఒకసారి విడాకులు తీసుకోవడమంటూ జరిగిన తరువాత, యింకా నిరీక్షణను పాటించడం అవసరమా?

జవాబు: నిరీక్షణాకాలమున దంపతుల మధ్య తిరిగి అనురాగము ప్రభవిల్లెనేని, ఆ వివాహబంధము సక్రమమే కనుక, భగవంతుని దివ్యగ్రంథము నందాజ్ఞాపితమైన దానిని పాటింపవలె; కాని, నిరీక్షణ సంవత్సర మొకపర్యాయము పరిసమాప్తమై దైవనిర్దేశితము సంభవించిన మీదట, ఇక నిరీక్షింప నక్కర లేదు. నిరీక్షణా వత్సరమున భార్యాభర్తల మధ్య లైంగికసంభోగము నిషిద్ధం; ఈ చర్యకు పాల్పడినవారు భగవంతుని క్షమాభిక్ష నర్ధింపవలె. ఇంకను, అపరాధశుల్కముగ న్యాయ మందిరమునకు పంధొమ్మిది మిష్కల్‌ల సువర్ణమును ముట్టజెప్పవలె.

12

ప్రశ్న: వివాహ ప్రవచనములను పఠించి, వివాహశుల్కం చెల్లింపు జరిగిన తదుపరి, ఆ దంపతుల మధ్య వైషమ్యం తలయెత్త్తినప్పుడు, నిరీక్షణావత్సరాన్ని పాటించకుండానే విడాకులు సంభవించునా?

జవాబు: వివాహ ప్రవచనములను ఉచ్చరించి, వివాహశుల్కము చెల్లింపబడిన పిదప సైతము ధర్మ బద్ధముగా విడాకులను కోరవచ్చును; అయితే అది, వివాహసమాగమమునకు పూర్వమే జరగవలె. అట్టి పరిస్థితులయందున నిరీక్షణావత్సరమును పాటించనవసరము లేదు. కాని, చెల్లింపబడిన వివాహ శుల్కమును, తిరిగి స్వాధీనపరచుకొనుటకు అనుమతి లేదు.

13

ప్రశ్న: వివాహానికి యిరుపక్షాల తల్లిదండ్రుల సమ్మతి అత్యావశ్యకమా లేక ఒకపక్షం వారి తల్లిదండ్రులు సమ్మతిస్తే సరిపోతుందా? ఈ నియమము కేవలం కన్యలకేనా, లేక యితరులకు సైతం వర్తిస్తుందా ?

జవాబు: వివాహ మిరువర్గముల తల్లిదండ్రుల సమ్మతి యను నిబంధనకు కట్టుబడియున్నది; ఈ విషయమున వధువు కన్యా, కాదా యను వివక్ష లేదు.

14

ప్రశ్న: అనివార్య ప్రార్ధనాలాపన సమయంలో ఖిబ్ల్లేహ్ దెసకు అభిముఖులు కావడం విశ్వాసులకు నిర్దేశిత మైనది; మరి ఇతర ప్రార్ధనలను, భక్తిగీతాలను ఆలపించేటప్పుడు ఏ దిశకు అభిముఖులు కావాలి?

జవాబు: అనివార్య ప్రార్ధనల ఆలాపనా సమయమున ఖిబ్ల్లేహ్ దెసకు అభిముఖులు కావలెననునది నిర్ధారిత నియమము. తక్కిన ప్రార్థనలను, భక్తిగీతములను ఆలపించు సమయమున “నీ వేదిశకు అభిముఖుడ వైనను, భగవంతుని వదనముండు” నని ఖురాన్‌లో వెలువరింపబడిన భగవత్ప్రవచన మును మన మనుసరింపవలె.

15

ప్రశ్న: మష్రిఖుల్-అఝ్కార్‌లో ప్రభాతసమయాన గావించదగిన దైవస్మరణ గురించి.

జవాబు: “ప్రభాతవేళ” యని భగవంతుని దివ్యగ్రంథమున ప్రవచింపబడినను, ప్రభాత, సూర్యోదముల మధ్యగల తొలిసంధ్యా సమయమైను, సూర్యోదయానంతరము రెండు గంటల వరకైనను దైవసమ్మతమే.

16. ప్రశ్న: మృతదేహాన్ని ప్రయాణకాలం ఒక గంటకు మించి పట్టేంత దూరానికి తరలించకూడదు అనే శాసనం భూమార్గాన, సముద్రమార్గాన గావించే తరలింపులు రెండింటికీ వర్తిస్తుందా?

16

జవాబు: ఓడయందైనను, రైలునందైనను ప్రయాణ దూరము ఒక్క గంట అయిఉండవలెనను ఈ యాదేశము భూ, సముద్ర మార్గములు రెండింటికిని అనువర్త్తించును; రవాణా మార్గమేదైనను ప్రయాణ మొక్క గంటకు మించరాదన్నదే ఉద్దేశ్యము. ఏదేమైనను, ఖననక్రియ ఎంత శీఘ్రముగ జరిగిన అంత సముచితము, సమ్మతము.

17

ప్రశ్న: ఇతరులు పోగొట్టుకున్న ఆస్తి కనుగొనబడినప్పుడు పాటించ వలసిన పద్ధతి ఏమిటి?

జవాబు : అట్టి యాస్తి ఏదైనను పట్టణమున తారసిల్లిన, ఆ యంశమును పట్టణ చాటింపుదారునిచే నొక్కపర్యాయము చాటింపు వేయింపవలె. అప్పుడా యాస్తి స్వంతదారు డగుపించినచో దాని నాతనికి యిచ్చివేయ వలె. లేనిచో, నా యాస్తిని కనుగొనిన వ్యక్తి ఒక్క ఏడాది వరకు నిరీక్షింపవలె; ఈ లోపున ఆస్తి యజమానిని గురించి తెలియవచ్చినచో, నాతని నుండి చాటింపుదారుని శుల్కమును వసూలు చేసికొని ఆస్తిని అప్పగింపవలె; ఆస్తి స్వంతదారుడు ఒక సంవత్సరకాలము పాటు అగుపించనిచో, నిక ఆ యాస్తిని కనుగొనినవాడే స్వాధీనపరచుకొనవచ్చును. దొరకిన యాస్తి విలువ చాటింపుదారుని భృతికి సమముగనో, తక్కువగనో యుండిన, దానిని కనుగొనిన వ్యక్తి ఒక రోజు నిరీక్షించి, అప్పటికిని దాని స్వంత దారుడెవ్వడో తెలియరానిచో, తానే దానిని సముచితరీతిన వినియోగింప వచ్చును; ఇక నిర్జన ప్రదేశమున కనుగొనబడిన యాస్తి విషయము: దానిని కనుగొనినవాడు మూడు దినములపాటు నిరీక్షింపవలె; అప్పటికిని స్వంతదారుని జాడ తెలియరానిచో, దానిని కనుగొనిన వ్యక్తికి సదరు ఆస్తిని స్వాధీనపరచుకొను స్వేచ్ఛ కలదు.

18

ప్రశ్న: శుద్ధీకరణలకు సంబంధించి, ఉదాహరణకు: ఒక వ్యక్తి అప్పుడే శరీరమంతా తడిసేలా స్నానం చేసినప్పటికీ, శుద్ధీకరణలను చేసుకోవలసినదేనా?

జవాబు: శుద్ధీకరణకు సంబంధించిన శాసనమును, ఏ పరిస్థితి యందైనను పాటింపవలె.

19

ప్రశ్న: ఒక వ్యక్తి తన దేశం నుండి వలస పోదలచినపుడు, అతని భార్య అందుకు వ్యతిరేకించడమూ, ఆ అసమ్మతి విడాకులకు దారితీయడమూ జరిగి, ఆతని ప్రయాణసన్నాహాలకు ఒక సంవత్సరానికి పైగా పడితే, ఆ సంవత్సర కాలాన్ని నిరీక్షణా వత్సరంగా పరిగణించవచ్చునా? లేక ఆ దంపతులు విడి పోయిన దినాన్నే వారి నిరీక్షణా వత్సరానికి ఆరంభంగా పరిగణించవచ్చునా?

జవాబు: భర్త బయలుదేరి పోవుటకు ఒక సంవత్సరమునకు పూర్వము నుండియే ఆ దంపతులు విడిగా ఉంటున్నందువల్ల, వారి నిరీక్షణా వత్సరమును లెక్కించుటకై, వారు విడిపోయిన దినమునే ప్రారంభదినముగ పరిగణింపవలె. ఒక వేళ, వారి మధ్య అనురాగ సౌరభములు తిరిగి పరిమళించనిచో, విడాకులు చోటుచేసుకొన వచ్చును. అట్లు కాదేని, భర్త వెడలిపోయిననాటినుండియే, నిరీక్షణా వత్సరమును గణియింపుచు, కితాబ్-ఎ-అఖ్దస్ నందు అనుసూచితములైన నియమములను పాటింప వలె.

20

ప్రశ్న: మతపరమైన బాధ్యతలకు సంబంధించిన యుక్త వయస్సు గురించి.

జవాబు: యుక్తవయ స్సనునది స్త్రీ, పురుషులిరువురికిని పదునైదేండ్లు.

21

ప్రశ్న: “ప్రయాణము చేయునపుడు, ఏదేని సురక్షితప్రదేశమందు ఆగి విశ్రమింపవలసివచ్చెనేని, మీరు . . . చేయలేకపోయిన ప్రతి అనివార్య ప్రార్థన స్థానము నందొక్క సాష్టాంగప్రణామము నాచరింప వలె” నన్న పవిత్ర ప్రవచనం గురించి.

జవాబు: ప్రయాణావస్థయందునను, అభద్రతాస్థితి కారణమునను, వదలి వేయబడిన ప్రార్థనలకు ఈ సాష్టాంగ ప్రణామమే పరిహారం. ఒక వేళ ప్రార్థనా సమయమునకు, విశ్రమించుట కనువైన సురక్షిత ప్రదేశం లభ్యమైనచో, ప్రయాణీకుడు ఆ ప్రార్థనను ఆలపింపవలె. ఈ పరిహారప్రణామమునకు సంబంధించిన ఏర్పాటు ఇంటియందునను, ప్రయాణమందునను వర్తించును.

22

ప్రశ్న: ప్రయాణానికి నిర్వచనం గురించి.(ఇది ప్రయాణికుడికి ఉపవాసమునుండి మినహాయింపు నిచ్చు కనీస కాలపరిమితిని గురించి)

జవాబు: గడియారము ననుసరించి ప్రయాణకాలపరిమితి తొమ్మిది గంటలని నిర్వచనము. ఏ ప్రయాణీకుడైనను ఒకచోట ఆగి, బయాన్ గణన ప్రకారం ఒక మాసమునకు తక్కువ కాకుండ తానక్కడ విశ్రమింపగలనని భావించినచో, ఉపవాసమును పాటించుట ఆతని విధి; కాని, మాసమునకు తక్కువైనచో నాతనికి ఉపవాసమునుండి మినహాయింపు ఉండును. ఒక వేళ అతడు ఉపవాస మాసమున, బయాన్ ప్రకారము, ఒక మాసంపాటు ఉండు నిమిత్తమై ఒక ప్రదేశమునకు చేరుకొనినచో, మొదటి మూడు దినములు పూర్తియగునంత వరకును ఉపవసింపరాదు, ఇక ఆపై మిగిలిన వ్యవధి యందుపవసింపవలె. అయితే, ఆతడు తన శాశ్వత నివాసమునకు చేరెనేని, చేరిన తొలినాటినుండియే ఉపవసింపవలె.

23

ప్రశ్న: జారులకు, జారిణులకు విధించే శిక్షల గురించి.

జవాబు: మొదటి తప్పుకు తొమ్మిది, రెండవ తప్పుకు పద్ధెనిమిది, మూడవదానికి ముప్పదియారు మిష్కల్‌ల సువర్ణము ఇలా . . . ప్రతి ఉత్తరాపరాధమునకును, పూర్వపు జరిమానా రెట్టింపగునటుల చెల్లింపులు జరుగవలె. బయాన్ నిర్దేశానుసారముగ, ఒక మిష్కల్ బరువు పంధొమ్మిది నాఖుద్ లకు సమానము.

24

ప్రశ్న: వేటాడటం గురించి.

జవాబు: ఆయన, ఆయన మహోన్నతుడగు గాక : “మీరు ఆహారమునకై మృగములనో, పక్షులనో వేటాడవలసి వచ్చెనేని,” ఇత్యాదిగా వచించినాడు. ధనుర్బాణములును, తుపాకులును, వేటయం దుపయోగించు సంబంధిత సాధనసామగ్రి వంటి ఇతర విధానములు సైతము చేర్పబడినవి. ఏమైనను, ఒకవేళ బోనులు, ఉచ్చులు ఉపయోగింప బడినచో, వాటియందు తగులుకొనిన ఎర, దానిని సమీపింపక పూర్వమే మృతినొందినచో, దాని నాహారముగ స్వీకరించుట న్యాయబద్ధము కాదు.

25

ప్రశ్న: తీర్ధ యాత్రకు సంబంధించి.

జవాబు: పావన గృహద్వయ మందొకదానికి తీర్ధయాత్రను చేయుట విధాయకము; అయితే, దేనిని సందర్శింపవలెనో నిర్ణయించుకోవలసినది యాత్రీకుడే.

26

ప్రశ్న: వివాహ శుల్కానికి సంబంధించి.

జవాబు: వివాహశుల్కమునకు సంబంధించి, వ్యక్తి మనస్ఫూర్తిగా సంతుష్టినొందవలసినదని ఆశింపబడిన కనిష్ఠస్థాయి పంధొమ్మిది మిష్కల్‌ల రజతము.

27

ప్రశ్న: “అయితే, ఒకవేళ తన పతి మరణ లేదా హత్యా సమాచార మామెకు చేరెనేని,” అనే పవిత్ర ప్రవచనానికి సంబంధించి.

జవాబు: నిరీక్షణకు సంబంధించి “నిర్దిష్ట సంఖ్యగల మాసముల” విషయమున తొమ్మిది మాసముల వ్యవధి నిర్ణయింపబడినది.

28

ప్రశ్న: వారసత్వపుటాస్తిలో ఉపాధ్యాయుని వాటా గురించి మరొక మారు ప్రశ్నించబడింది.

జవాబు: ఉపాధ్యాయుడు పరమపదించెనేని, ఆతడికి సంక్రమింప వలసిన వారసత్వపుటాస్తి వాటాలో మూడింట ఒక వంతు న్యాయ మందిరమునకు మరలింపబడును; తక్కిన రెండు వంతులు దివంగతుని వారసులకు చెందునే తప్ప, ఉపాధ్యాయుని సంతానమునకు మాత్రము కాదు.

29

ప్రశ్న: తీర్ధయాత్ర గురించి మరొకమారు ప్రశ్నించబడింది.

జవాబు: మానవులకు నిర్దేశితమైన పావనగృహ తీర్థయాత్ర, బాగ్దాద్ నందలి మహత్తర గృహమున కును, షిరాజ్‌నందలి సర్వప్రథమ బిందువు గృహమునకును ఉద్దేశితమైనది. వీటిలో దేనిని సందర్శించి నను సరి పోవును; తమ నివాస స్థానములకు చేరువయందున్న గృహమును వారు సందర్శింప వచ్చును.

30

ప్రశ్న: “తన సేవకై యొక సేవికను గైకొను నాతడు సముచితరీతిన వర్తింపవలె,”నన్న ప్రవచనం గురించి.

జవాబు: ఇది పూర్తిగా - యవ్వనమందున్నవారైనను, వృద్ధులైనను - వేతనమునకు సేవలనందించు తక్కిన సేవకవర్గీయులకు సంబంధించినదే; అట్టి పరిచారికకు తనకు నచ్చిన తరుణమున భర్తను ఎంచుకొను స్వేచ్ఛ యున్నది. ఏలయన, ఆ స్త్రీని కొనుగోలు చేయుటకాని, మానవునకు ఇరువురికి మించి భార్యలుండుట కాని - నిషిద్ధము.

31

ప్రశ్న: “మీరు ముమ్మారు పలికి స్త్రీకి విడాకులనిచ్చు పూర్వవిధానము నవలంబించుటను పరమాత్ముడు . . . నిషేధించినా” డనే పవిత్ర ప్రవచనం గురించి.

జవాబు: ఇది - విడాకులు పొందిన మహిళ తన పూర్వపు భర్తను పునర్వివాహం చేసుకునేందుకై, ముందుగా ఆమెను వేరొక పురుషుడు వివాహము చేసుకొని యుండుటను ఆవశ్యకం గావించిన పురాతన శాసనమునకు సంబంధించింది; కితాబ్-ఎ-అఖ్దస్ నందీ విధానము నిషేధింపబడినది.

32

ప్రశ్న: పవిత్రస్థలద్వయమందలి పావన గృహముల, తక్కిన సింహాసన ప్రతిష్ఠిత ప్రదేశాల స్వాధీన, పరిరక్షణలకు సంబంధించి:

జవాబు: గృహద్వయ మనగా, మహత్తర గృహమని, సర్వప్రథమ బిందువు నివాసమని అభిప్రాయం. ఇక ఇతర స్థలములను గురించి : అవి నెలకొనియున్న ప్రాంతవాసులు దివ్యధర్మ సింహాసన ప్రతిష్ఠిత స్థలముల యందన్నింటిని, లేదేని ఒక్క దానినైనను సంరక్షింప సమకట్టవలె.

33

ప్రశ్న: వారసత్వపుటాస్తిలో ఉపాధ్యాయునికి సంక్రమించే వాటా గురించిన పునర్విచారణ.

జవాబు: ఉపాధ్యాయుడు బహాజనులయందలి వాడు కానిచో, వారసత్వపుటాస్తియం దాతనికి వాటా సంక్రమింపదు. ఉపాధ్యాయులు అనేకులున్నచో, సంబంధిత వాటాను వారికి సమముగా పంచవలె. ఉపాధ్యాయుడు దివంగతుడైనచో, నాతని సంతతికి వారసత్వపుటాస్తిలో వాటా సంక్రమింపదు; అందుకు బదులుగా, ఆస్తిలో మూడింట రెండు వంతులు యజమానుని సంతతికిని, తక్కిన ఒక్క వంతు న్యాయ మందిరమునకును మరలింపబడును.

34

ప్రశ్న: నివాసగృహం ప్రత్యేకించి మగసంతతికే చెందడానికి సంబంధించి.

జవాబు: నివాసగృహము లనేకములున్నచో, వాటియం దుత్తమము, శ్రేష్ఠమైనదని భావము. మిగిలిన గృహములను తక్కిన ఆస్తులతోపాటుగా వారసులందరికిని పంపకము చేయవచ్చును. ఏ వారసుడైనను - ఏ వర్గమునకు చెందిన వారసుడైనను సరియే - భగవంతుని దివ్యధర్మమునకు చెందనివాడైనచో, నాతడిక జీవరహితునిగనే గణియింపబడును; ఆతడికి వారసత్వపరమగు హక్కు ఉండదు.

35

ప్రశ్న: నౌరూజ్ గురించి.

జవాబు: సూర్యాస్తమయమునకు ఒక్క నిమిషము ముందుగ సంభవించినను, సూర్యుడు మేషరాశిూ యందు ప్రవేశించు రోజే నౌరూజ్ పర్వదినము.

36

ప్రశ్న: జన్మదినద్వయ వార్షికోత్సవాలలో ఏ ఒక్కటి కాని, లేక బాబ్ దివ్యప్రకటనా వార్షికోత్సవంకాని ఉపవాసకాలంలో సంభవిస్తే ఏం చేయాలి.

జవాబు: ఉపవాసకాలమున జన్మదినద్వయ వార్షికోత్సవములను కాని, బాబ్ దివ్యప్రకటనాదిన వేడుక లను కాని జరుపుకోవలసి వచ్చినచో, ఆ రోజున ఉపవాస నియమము వర్తింపదు.

37

ప్రశ్న: వారసత్వాన్ని నిర్ధారించే పవిత్ర నియమాలలో దివంగతుని నివాసం, వ్యక్తిగతమైన దుస్తులు పురుష సంతానానికే కేటాయింపబడినాయి. ఈ ఏర్పాటు కేవలం పిత్రార్జితానికే వర్తిస్తుందా, లేక తల్లి ఆస్తికి కూడానా?

జవాబు: తల్లి వినియోగించిన దుస్తులను కుమార్తెలకు సమముగ పంచవలె; స్థలములు, ఆభరణములు, వాడని వస్త్రములతో సహా ఇతరత్రా ఆస్తిపాస్తులను మాత్రము కితాబ్-ఎ-అఖ్దస్‌లో వెల్లడింపబడిన విధానముననుసరించి ఆమె వారసులందరికిని పంపిణీ చేయవలె. కాని, దివంగతురాలికి కుమార్తెలు లేనిచో, నామె యావదాస్తిని పవిత్ర గ్రంథమున పురుషులకై ప్రత్యేకింపబడిన విధానములో పంపకము చేయవలె.

38

ప్రశ్న: ఒక సంవత్సర నిరీక్షణ కాలానంతరం చోటు చేసుకోవలసిన విడాకుల గురించి; ఇరువురిలోను, కేవలం ఒక్కరే రాజీకి ఇష్టతను కనపరచినపుడు ఏం చేయాలి?

జవాబు: కితాబ్-ఎ-అఖ్దస్‌నం దావిష్కృతమైన శాసనము ననుసరించి యిరుపక్షములును సంతృప్తి నొందవలె; ఇరువురికిని యిష్టము లేనిచో పునస్సమాగమము సాధ్యము కాదు.

39

ప్రశ్న: వివాహశుల్కానికి సంబంధించి, వరుడు పూర్తి మొత్తం చెల్లించలేక, అందుకు బదులు, తనకు స్తోమత ఉన్నప్పుడు చెల్లించగలనన్న అవగాహనతో, వివాహమహోత్సవ సమయంలో లాంఛన ప్రాయంగా ఒక వాగ్దానపత్రాన్ని వ్రాసి వధువుకు ఇవ్వవచ్చునా?

జవాబు: ఈ పద్ధతి నవలంబించుటకై ‘దివ్యాధికార మూలము’ నుండి అనుమతి అనుగ్రహింప బడినది.

40

ప్రశ్న: నిరీక్షణావత్సర కాలంలో భార్య భర్తల యెడ అనురాగసౌరభం పునఃపరిమళించి, ఆపై తిరిగి వైషమ్యమేర్పడి, మిగిలిన ఏడాది అంతా సుముఖత, విముఖతల మధ్య ఊగిసలాటతో గడిచి, చివరికి మళ్లీ వైషమ్యానిదే పైచేయి ఐతే, విడాకులు చోటు చేసుకుంటాయా, లేదా?

జవాబు: వైషమ్య మేర్పడిన ప్రతి పర్యాయమును, ఆనాటి నుండి నిరీక్షణావత్సర మారంభమగును; సంవత్సరకాలపు నిరీక్షణ పూర్తి కావలె.

41

ప్రశ్న: దివంగతుని నివాసం, దుస్తులు స్త్రీ సంతతికో, యితర వారసులకో కాక, ఆతని పురుష సంతానా నికే కేటాయించబడ్డాయి. మృతునికి మగ సంతతికి లేనప్పుడు ఏం చేయాలి?

జవాబు: ఆయన, ఆయన మహోన్నతుడగు గాక, ఇట్లు ప్రవచించినాడు: “మృతినొందినవానికి సంతానము లేనిచో, వారి వాటా . . . న్యాయ మందిరమునకు చెందవలె.” ఈ పవిత్ర ప్రవచనము ననుసరించి, నివాసమును, వ్యక్తిగత వస్త్రములును న్యాయమందిరమునకు మరలింప బడును.

42

ప్రశ్న: హుఖుఖుల్లా శాసనం కితాబ్-ఎ-అఖ్దస్‌లో వెలువరించ బడింది. హుఖుఖుల్లా చెల్లింపు అనువర్తించే ఆస్తిలో నివాసం - అందలి వస్తుసంచయం, అవసరమైన గృహోపకరణాలతో సహా - చేరుతుందా లేక దానిని మరో విధంగా లెక్కగట్టవలసి ఉంటుందా?

జవాబు: పారశీకమున మేము వెలువరించిన శాసనముల ననుసరించి ఈ మహాదివ్యావిష్కరణ యుగమున హుఖుఖుల్లా చెల్లింపు నుండి గృహమును, గృహోపకరణములును మినహాయింప బడినవి; అనగా నవి అత్యవసరమైనవిగ నెంచబడినవి.

43

ప్రశ్న: యుక్తవయస్సునకు పూర్వమే ఒక బాలికకు వివాహనిశ్చయం లేదా ప్రధానం చేయడం గురించి.

జవాబు: ఈ సంప్రదాయము శాసనవిరుద్ధమని ‘దివ్యాధికార మూలము’ చే ప్రకటితమైనది, అదియును గాక, వివాహమునకు తొంభైఐదు దినములకు పూర్వమే వివాహమును గురించి ప్రకటించుట శాసన విరుద్ధము.

44

ప్రశ్న: ఉదాహరణకు ఒక వ్యక్తివద్ద నూరు తూమానులు ఉండి, ఆ మొత్తంపై హుఖుఖుల్లా చెల్లించి, సదరు మొత్తంలో సగాన్ని విఫల వ్యవహారాల్లో కోల్పోయి, తిరిగి వ్యాపారంలో హుఖుఖ్ చెల్లించదగిన మొత్తాన్ని సంపాదించిన పక్షంలో అప్పుడు ఆ వ్యక్తి ఆ మొత్తంపై హుఖుఖ్‌ను చెల్లించాలా, వద్దా?

జవాబు: అట్టి సందర్భమున హుఖుఖ్‌ను చెల్లింపనవసరము లేదు.

45

ప్రశ్న: ఒకవేళ హుఖుఖుల్లా చెల్లింపు జరిగిన తరువాత, ఈ నూరు తూమానుల మొత్తం పూర్తిగా నష్టమైపోయి, ఆ మీదట వాణిజ్యరీత్యా ఆ మొత్తం తిరిగి ఆర్జించడం జరిగితే, దానిపై రెండవసారి హుఖుఖ్‌ను చెల్లించవలసి ఉంటుందా, ఉండదా?

జవాబు: ఈ సందర్భమునను హుఖుఖుల్లాను చెల్లింప నవసరము లేదు.

46

ప్రశ్న: “పరమేశ్వరుడు మీకు వివాహమును నిర్దేశించినా” డను పవిత్ర ప్రవచనమునకు సంబంధించి : ఈ నిర్దేశాన్ని పాటించడం అనివార్యమా, కాదా?

జవాబు : అనివార్యము కాదు.

47

ప్రశ్న: ఒక వ్యక్తి ఒకానొక స్త్రీని, కన్య అని నమ్మి, వివాహశుల్కాన్ని చెల్లించి వివాహం చేసుకున్నా డనుకుందాం; అయితే, సమాగమ సమయంలో ఆమె కన్య కాదని స్పష్టంగా తేలినప్పుడు, అయిన ఖర్చులను, వివాహశుల్కాన్ని తిరిగి ఇచ్చివేయాలా, వద్దా? వివాహం కన్యాత్వ ప్రాతిపదికన నిశ్చయమై, ఆ నిబంధన పాటింపబడనపుడు, మరి ఆ వివాహ నిశ్చయం చెల్లుతుందా?

జవాబు: అట్టి స్థితియందు ఖర్చులను, వివాహశుల్కమును తిరిగి చెల్లించివేయవలె. ఏ ప్రాతిపదికన వివాహ నిశ్చయము జరిగినదో, ఆ నియమము పాటింపబడనిచో ఇక, ఆ నిశ్చయము చెల్లనేరదు. అయినను, ఆ యంశమును మరుగుపరచి క్షమియింపగలుగుట, భగవంతుని దృష్టియందనుగ్రహాన్విత పురస్కారముగ ఔన్నత్యము నొందును.

48

ప్రశ్న: “విందును గావించుట . . . మీకు విధియింపబడినది” ఇది అనివార్యమా, కాదా?

జవాబు: అనివార్యము కాదు.

49

ప్రశ్న: వ్యభిచారము, స్వలింగసంపర్కము,దొంగతనము - వీటికి సంబంధించిన అపరాధ శుల్కములు, వాటి స్థాయిలకు సంబంధించి.

జవాబు: ఈ యపరాధ శుల్కముల స్థాయిని నిర్ధారించు అధికారము న్యాయమందిరమునకే కలదు.

50

ప్రశ్న: స్వబాంధవులను వివాహం చేసుకోవడంలో గల ఔచిత్యం లేదా అనౌచిత్యం గురించి.

జవాబు : పైన పేర్కొనినట్లు, ఈ యంశములును న్యాయమందిర ధర్మకర్తలకు సంబంధించినవే.

51

ప్రశ్న: శుద్ధీకరణములకు సంబంధించి “ప్రక్షాళనకు జల మలభ్యమైన యాతడు పరమ పావనుడగు, “పరమ పావనుడగు భగవంతుని దివ్యనామము పేరిట” యను పదముల నైదు పర్యాయములు పలికి . . .” అని వెలువరింప బడినది. ఈ ప్రవచనాన్ని చలితీవ్రతలో కాని, ముఖానికి లేదా చేతులకు దెబ్బలు తగిలినప్పుడు ఉచ్చరింపవచ్చునా?

జవాబు: చలి తీవ్రముగ నున్నప్పుడు ఉష్ణోదకమును ఉపయోగింప వచ్చును. చేతులకును, లేదా ముఖమునకు గాయములైనను, లేక నీటి వాడకమున నొప్పులు, బాధలు కలిగి, తద్వారా నీటి వినియోగమే హానికరమైనచో, ప్రక్షాళన స్థానమున నిర్ణీత ప్రవచనము నాలపింపవచ్చును.

52

ప్రశ్న: సంకేతాల ప్రార్థనకు ప్రతిగా వెలువరించబడిన ప్రవచనాన్ని ఆలపించడం అనివార్యమా?

జవాబు : అనివార్యము కాదు.

53

ప్రశ్న: వారసత్వానికి సంబంధించి స్వంత సోదరీ, సోదరులుండగా తల్లి పక్షానగల సవతి సోదరీ, సోదరు లకు వారసత్వాస్తిలో వాటా లభిస్తుందా?

జవాబు: వారికి వాటా లభించదు.

54

ప్రశ్న: ఆయన - ఆయన మహోన్నతుడగుగాక - యిలా ప్రవచించాడు : “మృతుడు జీవించియుండగనే, సంతానవంతుడగు ఆతని కుమారుడు దివంగతుడయ్యెనేని . . . ఆ సంతతి తమ తండ్రి వాటాకు వారసులగుదురు.” మరి, తండ్రి జీవించి ఉండగానే కూతురు మరణిస్తే ఏం చేయాలి?

జవాబు: ఆమె వారసత్వపు వాటాను సప్తవర్గములకు చెందిన వారసులకు, దివ్యగ్రంథ శాసనాను సారముగ పంపకము చేయవలె.

55

ప్రశ్న: మృతిచెందినది మగువ ఐతే “భార్య” తాలూకు వారసత్వపు వాటా ఎవరికి కేటాయించబడింది?

జవాబు: “భార్య” వారసత్వపు వాటా “భర్త” కు కేటాయింపబడినది.

56

ప్రశ్న: మృతదేహానికి చుట్టవలసిన వస్త్రములు ఐదుగా నిర్దేశితం కావడం గురించి : ఐదు వస్ర్తాలు అంటే ఇంత వరకూ ఆచారంగా వస్తున్న ఐదు విడి వస్త్రాలు అనా, లేక పొడవైన వస్త్రం ఒకదానిని చుట్టుమీద చుట్టుగా ఐదుసార్లు చుట్టడం అనా?

జవాబు: ఐదు వస్త్రములను వినియోగింపవలె ననునదే భావము.

57

ప్రశ్న: ఆవిష్కృతమైన ప్రవచనాలలో కొన్నింటి మధ్యగల వ్యత్యాసాల గురించి.

జవాబు: ఆవిష్కృతమైన ఫలకములయందనేకములు, సరిచూడకనే, పునరావలోకనము చేయకనే యధాతధముగ విడుదల చేయడమైనది. పర్యవసానముగ నవి, ఆజ్ఞాపించిన విధంగా, ధర్మవిరోధుల దురాక్షేపణలకు పూర్వమే వ్యాకరణ సాంప్రదాయముల కనుగుణముగ సరిచూడబడుటకై పవిత్ర సాన్నిధ్యమున పునఃపఠింపబడినవి. ఈ యాచరణకు మరియొక హేతువేమనగా అగ్రగామి - ఆయన దక్క తక్కిన వారి ఆత్మలన్నియు ఆయనకై అర్పితములగు గాక - అనుసరించిన వినూత్నశైలియందు వ్యాకరణ సూత్రావలంబన పట్ల స్వేచ్ఛను గమనింపవచ్చును; అక్కారణముననే, పవిత్ర ప్రవచనముల యందధికాంశము - అవగాహనాసౌలభ్యము, సంక్షేప వ్యక్తీకరణముల నిమిత్తమై ప్రస్తుత వ్యావహారికమున కనువుగ వెలువరింపబడినవి.

58

ప్రశ్న: “ప్రయాణము చేయునపుడు, ఏదేని సురక్షితప్రదేశమందు ఆగి విశ్రమింపవలసివచ్చెనేని, మీరు . . . చేయలేకపోయిన ప్రతి అనివార్య ప్రార్థన స్థానము నందొక్క సాష్టాంగ ప్రణామము నాచరింపవలె” నన్న పవిత్రప్రవచనానికి సంబంధించి; ఈ పరిహారం, అభద్రతావస్థలలో చేయలేకపోయిన అనివార్య ప్రార్థన విషయంలోనేనా లేక ప్రయాణంలో ఉండటం వల్ల అనివార్య ప్రార్థనను మానివేసిన సందర్భంలో కూడానా?

జవాబు: అనివార్య ప్రార్థనాసమయ మాసన్నమై, భద్రత లేనప్పుడు సురక్షితస్థలమును చేరిన పిదప, అప్పటికి చేయలే పోయిన ప్రతి అనివార్య ప్రార్థన స్థానమునం దొక సాష్టాంగ ప్రణామమును గావింపవలె; తుది ప్రణామానంతరము, అర్థపద్మాసనాసీనులై నిర్ణీత ప్రవచనమును పఠియింప వలె. సురక్షిత ప్రదేశమున్నచో, ప్రయాణమున అనివార్య ప్రార్థనను మాననక్కర లేదు.

59

ప్రశ్న: ప్రయాణికుడు విశ్రాంతికై ఒకచోట బసచేసినప్పుడు, అది అనివార్య ప్రార్థనా సమయమైతే, అతడు అనివార్య ప్రార్థన చేయాలా, లేక అందుకు బదులు సాష్టాంగ ప్రణామం చేయాలా?

జవాబు: అభద్రతాస్థితులయందు తప్ప అనివార్య ప్రార్థనను విడచుటకు అనుమతి లేదు.

60

ప్రశ్న: అనివార్య ప్రార్థనలను చేయలేకపోయినందువల్ల, అనేక సాష్టాంగ ప్రణామాలను చేయవలసివస్తే, పరిహార పూర్వకమైన ప్రతి సాష్టాంగ ప్రణామం తరువాత నిర్దిష్ట ప్రవచనాన్ని పునరుచ్చరించ వలసి ఉంటుందా?

జవాబు: సాష్టాంగ ప్రణామములయందు చివరిదాని తరువాత నిర్ణీత ప్రవచనమును పఠియించిన చాలును. అనేక సాష్టాంగ ప్రణామము లున్నచో, ప్రతిదాని విషయమునను ప్రత్యేకించి ప్రవచనమును పునరుచ్చరింప నవసరము లేదు.

61

ప్రశ్న: ఒకవేళ నివాసంలో కూడా అనివార్య ప్రార్థనను విడిచిపెడితే సాష్టాంగ ప్రణామంతో పరిహారం చెల్లింప వచ్చునా లేదా?

జవాబు: ఇతఃపూర్వము వేయబడిన ప్రశ్నలకు సమాధానముగా “పరిహారపూర్వకమగు ఈ సాష్టాంగ ప్రణామము, ఇంటియొద్దను, ప్రయాణమునను రెండింటికిని వర్తించు” నని వ్రాయబడినది.

62

ప్రశ్న: ఒకవేళ మరెందు కోసమో శుద్ధీకరణలు గావించుకున్నప్పుడు, అనివార్యప్రార్ధనాసమయం వచ్చినప్పుడు ఆ శుద్ధీకరణలు సరిపోతాయా, మరలా శుద్ధీకరణలను చేయవలెనా?

జవాబు: ఈ శుద్ధీకరణలు చాలు. తిరిగి ప్రత్యేకముగా శుద్ధీకరణలను చేయనక్కరలేదు.

63

ప్రశ్న: తొమ్మిది రకాహ్‌లతో కూడిన అనివార్య ప్రార్థనను ఉదయ, మధ్యాహ్న, సాయంసమయాలలో చేయవలసి ఉంటుందని కితాబ్-ఎ-అఖ్దస్ లో నిర్దేశించబడింది; అయితే అనివార్య ప్రార్థ్ధనల ఫలకముూ ఇందుకు భిన్నంగా అగుపిస్తున్నది.

జవాబు: కితాబ్-ఎ-అఖ్దస్‌లో వెలువరించబడినది మరో అనివార్య ప్రార్ధనకు సంబంధించినది. కొన్ని సంవత్సరములకు పూర్వము, వివేకహేతువులుగా, తదనివార్య ప్రార్థ్ధనతో సహా పలు అంశములకు సంబంధించిన కితాబ్-ఎ- అఖ్దస్ శాసనములను వేరుగా ఆవిష్కరించి తక్కిన పవిత్రరచనలతో సహా, భద్రపరచి, పరిరక్షించు నిమిత్తమై పంపివేయడమైనది. తదనంతరమే, ఈ మూడు అనివార్య ప్రార్థనలును ఆవిష్కరింపబడినవి.

64

ప్రశ్న: సమయాన్ని తెలుసుకునేందుకై గడియారాలపై ఆధారపడటం యుక్తమేనా?

జవాబు: సమయనిర్ణయానికి గడియారములపై నాధారపడుటకు అనుమతి కలదు.

65

ప్రశ్న: అనివార్య ప్రార్థనల ఫలకములో, మూడు ప్రార్థనలు ఆవిష్కరించ బడినాయి; ఈ మూడు ప్రార్థన లను చేయవలసిన అవసరం ఉందా, లేదా?

జవాబు: ఈ ప్రార్థనాత్రయము నుండి ఒక్కదానిని ఆలపించుట విధాయకము; దేనిని ఆలపించినను చాలును.

66

ప్రశ్న: ఉదయకాల ప్రార్థనకై చేసుకున్న శుద్ధీకరణలు మధ్యాహ్న ప్రార్థనకు చెల్లుతాయా? మరి, అదే విధంగా మధ్యాహ్నం చేసుకున్న శుద్ధీకరణలు సాయంకాలం వరకు చెల్లుతాయా?

జవాబు: శుద్ధీకరణలు ఏ అనివార్య ప్రార్థనలకై చేయబడుతున్నవో, వాటికే చెందును. ప్రతి ప్రార్థనకును శుద్ధీకరణలను చేసికొనవలె.

67

ప్రశ్న: సుదీర్ఘ అనివార్య ప్రార్థనకు సంబంధించి లేచి నిలిచి “భగవంతుని వైపుకు తిరుగ” వలె. ఇది ఖిబ్లేహ్ వైపుకు తిరగవలసిన అవసరంలేదని సూచిస్తున్నట్లుగా ఉంది; అవునా, కాదా?

జవాబు: ఇక్కడ భావము - ఖిబ్లేహ్ అనే.

68

ప్రశ్న: “ఉదయ సాయంసంధ్యల యందున భగవత్ప్రవచనములను ఆలపింపు” డను పవిత్ర ప్రవచనము నకు సంబంధించి.

జవాబు: ఇక్కడ ఉద్దేశ్యం : దివ్యోచ్చారణా స్వర్గము నుండి అనుగ్రహీతమైన సకలమును అని. పావన ఆత్మల కుండవలసిన ప్రథమావశ్యకత - భగవత్ప్రవచనమును పఠియింపవలెనను ఆసక్తి, ప్రేమ. బహు గ్రంథపఠనముకన్నను ఆనందాతిరేకమున ఒక్క ప్రవచనమునైనను, ఒక్క పదమునైనను పఠియించుట ఉత్తమము.

69

ప్రశ్న: ఏ వ్యక్తి ఐనా వీలునామాను వ్రాస్తున్నప్పుడు - హుఖుఖుల్లా లేదా ఋణవిమోచనలకు మాత్రమే కాక - దానధర్మాలకై తన ఆస్తిలో కొంత భాగాన్ని కేటాయించవచ్చునా? లేక అతనికి తన అంత్యక్రియల వ్యయాలకు సరిపడే కొంతమొత్తాన్ని కేటాయించుకొని, మిగిలిన ఆస్తినంతటినీ, దైవనిర్ణీత మైన సప్తవర్గవారసులకు చెందేలా చేసే వీలుమాత్రమే ఉన్నదా?

జవాబు: వ్యక్తికి తన యాస్తిపై సంపూర్ణాధికారమున్నది. అతడు హుఖుఖుల్లాను చెల్లింపగలిగి, ఋణ విముక్తుడై యుండెనేని, ఆపై యాతని వీలునామాయందు గావింపబడిన ఏ ప్రకటన యైనను, నిర్ణయ మైనను అంగీకారయోగ్యమే. తన కనుగ్రహీతమైన దానితో తన యిచ్చవచ్చిన రీతిని వ్యవహరించుటకు భగవంతుడాతనిని నిశ్చయముగ ననుమతించినాడు.

70

ప్రశ్న: ఖననాంగుళీయ ధారణ విశేషించి పెద్దలకు మాత్రమేనా, లేక పిల్లలకూ వర్తిస్తుందా?

జవాబు : ఇది పెద్దలకు అనగా వయోజనులకు మాత్రమే. అదేవిధముగ, దివంగతులకు నిర్దేశితమైన ప్రార్థనయును పెద్దల నిమిత్తమే.

71

ప్రశ్న: ‘ఆలా’ మాసంలో కాకుండా మరో సమయంలో ఉపవసించాలని ఎవరైనా ఆశిస్తే, అందుకు అనుమతి ఉన్నదా, లేదా? అలా ఉపవసిస్తానని అతను ప్రతినబూనటం అంగీకారయోగ్యమేనా?

జవాబు: ఉపవాససంబంధితమగు శాసనము ముందే ఆవిష్కృతమైనది. అయినను, తన యభీష్టము నెరవేరుటకో, మరేదైనా లక్ష్యసాధన నిమిత్తమో ఎవరైనను భగవంతునికి ఉపవాసము నర్పింపనెంచిన అది యిప్పుడును, మున్ముందును అంగీకృతమే. అయినను, ప్రతినలును, ప్రమాణములును మానవాళికి లాభము నొనగూర్చునవిగ నుండవలెననునదే భగవంతుని - ఆయన మహోన్నత కీర్తిమంతుడగు గాక - యాకాంక్ష.

72

ప్రశ్న: వ్యక్తి నివాసం, వ్యక్తిగత దుస్తులకు సంబంధించి మరో ప్రశ్న వేయ బడింది : పురుషసంతతి లేకపోతే వీటిని న్యాయమందిరానికి మరలించాలా లేక మిగతా ఆస్తి మాదిరిగానే పంపకాలు చేయాలా?

జవాబు: నివాసము, వ్యక్తిగత వస్త్రములకు సంబంధించి మూడింట రెండు వంతులు స్రీ ్తసంతతికి చెందవలె; మూడవ వంతు ప్రజల ఖజానాగా భగవంతునిచే నిర్దేశితమైన న్యాయమందిరమునకు మరలింపబడవలె.

73

ప్రశ్న: ఒక సంవత్సర నిరీక్షణానంతరం భర్త విడాకులివ్వడానికి నిరాకరిస్తే, అప్పుడు భార్య ఏం చెయ్యాలి?

జవాబు: నిర్ణీతకాలము పరిసమాప్తినొందినప్పుడు విడాకులు చోటు చేసుకుంటాయి. అయినను, నిర్ణీతకాలపు టాద్యంతములకు సాక్షులు ఉండుట అవసరము; అవసరమైనచో, నిజనిర్ధారణకు వారి నాహ్వానింప వచ్చును.

74

ప్రశ్న: వృద్ధాప్య నిర్వచనం గురించి.

జవాబు: అరబ్బులకు అవసానదశయే వృద్ధాప్యము; అయితే, బహా ప్రజల కది డెబ్భదియవ సంవత్సరము నుండి.

75

ప్రశ్న: కాలినడకన ప్రయాణించే వ్యక్తికి ఉపవాసపరమైన పరిమితికి సంబంధించి.

జవాబు: పరిమితి రెండు గంటలుగా నిర్ణయింపబడినది. ప్రయాణము రెండు గంటలకు మించినచో ఉపవాస విరమణకు అనుమతి ఉన్నది.

76

ప్రశ్న: ఉపవాసమాసంలో కఠినశ్రమలో నిమగ్నులైనవారు ఉపవాసాన్ని పాటించడానికి సంబంధించి.

జవాబు: అట్టి వారిని ఉపవాసము నుండి మినహాయించడమైనది. అయినను, దైవశాసనము పట్ల, దాని మహోన్నతస్థానము పట్ల గౌరవమును చూపుటకై మితముగా, ఏకాంతముగా భుజియించుట ప్రశంసనీయము, సముచితము.

77

ప్రశ్న: అనివార్యప్రార్థనకై చేసుకున్న శుద్ధీకరణలే, మహోన్నతనామాన్ని తొంభై ఐదు సార్లు పునరుచ్చరించడానికి కూడా సరిపోతాయా?

జవాబు : శుద్ధీకరణలను తిరిగి చేసుకోనవసరము లేదు.

78

ప్రశ్న: భర్త భార్యకు కొనియిచ్చిన వస్త్రాభరణాల గురించి : భర్త మరణాంతరం, అవి కూడా వారసులకు పంపిణీ చేయబడాలా లేక భార్యకై ప్రత్యేకించబడాలా?

జవాబు: వాడబడిన దుస్తులు తప్ప, ఆభరణములైనను, మరేవైనను - భార్యకు కానుకగా ఇవ్వబడి నట్లు ధృవీకరింపబడినవి దక్క - సర్వమును భర్తకు చెందినవే.

79

ప్రశ్న: సరైన సాక్షులు ఇద్దరి సాక్ష్యం ఆధారంగా ఒక అంశాన్ని నిర్ధారించవలసి వచ్చినప్పుడు పాటించ వలసిన న్యాయప్రమాణాల గురించి.

జవాబు: న్యాయప్రమాణములకు ప్రజలయం దత్యంత గౌరవమున్నది. భగవత్సేవకులు ఏ మతము వారైనను, తెగవారైనను వారి సాక్ష్యము ఆయన సింహాసనము ఎదుట అంగీకృతమే.

80

ప్రశ్న: దివంగతుడు ఒకవేళ హుఖుఖుల్లా పట్ల తన విధిని నిర్వర్తించక, ఇతర ఋణాలను పరిష్క రించకపోయిన పక్షంలో వీటిని నివాసం, వ్యక్తిగత దుస్తులు, ఇతర ఆస్తిపాస్తుల నుండి తీసి పరిష్కరించ వచ్చునా; లేక నివాసాన్ని, వ్యక్తిగత దుస్తులను పురుషసంతతికి వదలివైచి, పర్యవసానంగా మిగిలిన ఆస్తిని ఉపయోగించి ఋణ విమోచన చేయాలా? ఒకవేళ ఋణాల పరిష్కారానికి మిగిలిన ఆస్తి చాలకపోతే ఏం చేయాలి?

జవాబు: చెల్లింపవలసిన ఋణములను, హుఖుఖుల్లా చెల్లింపును మిగిలిన ఆస్తి నుండే పరిష్కరింప వలె; అయితే, అట్టి పరిష్కారమునకు ఆస్తి చాలనిచో, తక్కిన మొత్తాన్ని నివాసమునుండి, వ్యక్తిగత వస్త్రముల నుండి చెల్లింపవలె.

81

ప్రశ్న: మూడవ అనివార్య ప్రార్థనను నిలిచి చేయాలా లేక కూర్చుని చేయాలా?

జవాబు : అత్యంత వినయభావమున, భక్తితో నిలిచి చేయుట సయుక్తము, సముచితము.

82

ప్రశ్న: అనివార్య ప్రార్థనలలో మొదటిదానిని తనకు ఎప్పుడు సమయం అనుకూలిస్తే అప్పుడు అత్యంత అణకువ , ఆకాంక్షాపూరిత ఆరాధనా భావంతో నిర్వర్తించాలి” అన్న నిర్దేశానికి సంబంధించి. దానిని ఇరవై నాలుగు గంటలకొక సారి చేయాలా, లేక తరచూ చేయాలా?

జవాబు: ఇరువదినాలుగు గంటలకొక్క పర్యాయము చాలును; దివ్యాజ్ఞానజిహ్వ నుడివినదిది.

83

ప్రశ్న: “ఉదయము”, “మధ్యాహ్నము”, “సాయంకాలము” - వీటి నిర్వచనమును గురించి.

జవాబు: ఇవి సూర్యోదయము, మధ్యాహ్నము, సూర్యాస్తమయమును. అనివార్య ప్రార్థన కనుమతింపదగు వేళలు - ఉదయము నుండి మధ్యాహ్నము వరకు, మధ్యాహ్నము నుండి సూర్యాస్తమయము వరకు, ఇంకను సూర్యాస్తమయము నుండి ఆపై రెండు గంటల వరకును. అధికారము - దివ్యనామద్వయధారియగు భగవంతుని హస్తగతము.

84

ప్రశ్న : ఒక విశ్వాసి, విశ్వాసికాని వ్యక్తిని వివాహం చేసుకోవడం ఆమోద యోగ్యమేనా?

జవాబు: వివాహపరముగ యిచ్చిపుచ్చుకొనుటలు రెండునూ అనుమతింపదగినవే; ఔదా ర్యానుగ్రహముల సింహాసనమును అధిష్టించి నపుడు దేవదేవు డివ్విధముగ నిర్దేశించినాడు.

85

ప్రశ్న: దివంగతులకు ఉద్దేశించిన ప్రార్థన గుఱించి : దీనిని చేయవలసినది ఖననానికి ముందా, తర్వాతా? ఖిబ్లేహ్‌కు అభిముఖం కావడం అవసరమా?

జవాబు: ఖననమునకు పూర్వమే ఈ ప్రార్థనను గావింపవలె; ఇక ఖిబ్లేహ్ గురించి.... “మీ రేదిశకు అభిముఖులైన, ఆ దిశయందు దేవుని ముఖముండును.” (ఖురాన్ 2:115)

86

ప్రశ్న: మధ్యాహ్న లఘు అనివార్య ప్రార్థనకును, ఉదయ, మధ్యాహ్న సాయంకాలములలో చేయ వలసిన అనివార్య ప్రార్థనకును మధ్యాహ్న సమయం ఒక్కటే కనుక, ఈ ప్రార్ధనలను చేయడానికి విడివిడిగా శుద్ధీకరణలు అవసరమా లేక ఒక శుద్ధీకరణ సరిపోతుందా?

జవాబు : పునశ్శుద్ధీకరణలు అనవసరం.

87

ప్రశ్న: గ్రామస్థులు వెండిని వివాహశుల్కంగా ఇవ్వవలసినదాని గుఱించి : ఇక్కడ గ్రామస్థులై ఉండ వలసినది వరుడా, వధువా లేక ఇద్దరూనా? ఒకవేళ ఇద్దరిలోను ఒకరు నగరవాసి, మరొకరు గ్రామవాసి అయిఉంటే, ఏం చేయాలి?

జవాబు: వివాహశుల్కము వరుని నివాసస్థల ప్రాతిపదికన నిర్ణీతమైనది; అతడు నగరవాసియైన స్వర్ణమును, గ్రామీణుడైన రజతమును వివాహశుల్కమగును.

88

ప్రశ్న: గ్రామ లేక నగరవాసిని నిర్ధారించే ప్రమాణం ఏది? ఒక నగరవాసి గ్రామంలో లేదా ఒక గ్రామవాసి నగరంలో శాశ్వత ప్రాతిపదికపై నివాసాన్ని ఏర్పరచుకుంటే ఏ విధానం వర్తిస్తుంది? జన్మస్థలమే నివాసస్థాన నిర్ణయానికి ప్రాతిపదికా?

జవాబు: శాశ్వత నివాస మెచ్చోట కలదను దానిపై ఆధారపడి నిర్ణయించుటయే విధాయకము; దివ్య గ్రంథమందలి యాదేశము ననుసరింపవలె.

89

ప్రశ్న: పంధొమ్మిది మిష్కల్‌ల సువర్ణమునకు సరిపడా ఆర్జించిన వ్యక్తి, ఆ మొత్తంపై భగవంతుని హక్కును చెల్లించాలని పవిత్ర ఫలకములలో వెల్లడింపబడినది. ఈ పంధొమ్మిది అంటే ఎంతో వివరింప నగునా?

జవాబు: నూరింట పంధొమ్మిది అని దైవశాసనము స్థిరీకరించినది. దీనినే ప్రాతిపదికగ తీసికొని గణన చేయవలె. అప్పుడు పంధొమ్మిది పై ఎంత చెల్లింపవలెనో అవగతమగును.

90

ప్రశ్న: ఒక వ్యక్తి సంపద పంధొమ్మిదికి మించినప్పుడు ఆ అదనపు మొత్తంపై హుఖుఖ్‌ను చెల్లించడానికి గాను, అది మరొక పంధొమ్మిదికి చేరవలెనా లేక అదనపు మొత్తం ఎంతైనా హుఖుఖ్‌ను చెల్లించవలసినదేనా?

జవాబు: పంధొమ్మిదికి ఏ మొత్తము వచ్చిచేరినను, అది పంధొమ్మిదికి చేరునంతవరకు హుఖుఖ్ చెల్లింపు నుండి దానికి మినహాయింపు కలదు.

91

ప్రశ్న: స్వచ్ఛమైన జలము గురించి, దానిని వినియోగించవలసిన స్థాయిని గురించి.

జవాబు: హస్తములను, ముఖమును ప్రక్షాళన గావించుకొనుటకు ఒక పర్యాయము ఉపయోగింపబడిన స్వల్పపరిమాణపు - అనగా ఒకటి లేక రెండు, లేదా మూడు పానపాత్రల పరిమాణం గల - జలం. అయితే, ఒక కుర్ర్ (షుమారుగా ఒక ఘ. లీ.) లేదా అంతకు మించిన పరిమాణముగల జలము ఒకటి, రెండు పర్యాయములు ముఖప్రక్షాళనము గావించుటచే మార్పునొందదు. అట్టి జలము, మువ్విధముల (రంగు, రుచి,వాసనల) యం దేవిధముగను చెడనిచో వాడకమునకు అభ్యంతరముండ జాలదు. ఉదాహరణకు వివర్ణమైన జలమును, ఉపయోగించిన జలముగనే గణియింపవలె.

92

ప్రశ్న: వివిధప్రశ్నలపై వెలువడిన ఒక పారశీక గ్రంథంలో యుక్తవయస్సు పదిహేనేళ్లుగా నిర్ణయింప బడినది. అదేవిధంగా వివాహం కూడా యక్త వయస్సుకు సంబంధించిన నియమానికి లోబడి ఉంటుందా లేక అంతకు ముందే చేయడానికి అనుమతింపదగునా?

జవాబు: దైవగ్రంథమునం దిరుపక్షముల సమ్మతి యవసరమని చెప్పబడుట చేతను, యుక్తవయస్సు నకు పూర్వమే ఆ పక్షములకు సమ్మతి కలదా లేదా యనునది స్పష్టము కాదు కనుకను వివాహము యుక్త వయస్సు నియమమునకు లోబడియుండవలె; తత్పూర్వ వివాహ మామోదనీయము కాదు.

93

ప్రశ్న: అస్వస్థులు ఉపవాస, అనివార్య ప్రార్థనలను చేయడం గురించి

జవాబు: భగవంతుని దృష్టియం దనివార్యప్రార్థనయును, ఉపవాస నియమములును ఉత్కృష్ట స్థానము నొందునని యదార్ధముగ వచియింతును. అయినను, ఆరోగ్యస్థితియందే వాటి వైశిష్ట్యముల అనుభూతి నొందవచ్చును. అనారోగ్యస్థితియం దీవిధులను నిర్వర్తింప ననుమతిలేదు. సర్వావస్థల యందునను, దేవదేవుని - ఆయన వైభవము మహోన్నతమగు గాక - యానతిట్టిది. ఆయన ధార్మిక నియమము లకు చెవియొగ్గి, పాటించు స్త్రీపురుషులు ధన్యులు. నిశ్శంశయాత్మక నిర్ధారణముల యావిష్కర్తయును, దివ్యప్రవచములను భువికంపిన దేవునికే సకల ప్రశస్తి.

94

ప్రశ్న: మసీదులకు, ప్రార్థనామందిరములకు, దేవాలయములకు సంబంధించి

జవాబు: ఏకైక సత్యదేవుని ఆరాధనకై నిర్మితములైన మసీదులు, ప్రార్థనా మందిరములు, దేవళములు వంటి వేటినైనను భగవన్నామస్మరణకు దక్క అన్య ప్రయోజనమునకు వినియోగింపరాదు. దైవశాసన మిది; దీనిని ఉల్లంఘించినవాడు నిశ్చయముగ హద్దులనతిక్రమించినవాడగును. నిర్మాణకర్త కెట్టి హాని యును కలుగదు; ఏలయన ఆతడా కార్యమును భగవంతునికై నిర్వహించి సముచిత పురస్కృతి నందినాడు; ఇంకను అందుచునే యుండును.

95

ప్రశ్న: వృత్తి వాణిజ్య నిర్వహణకు అనువగు స్థానముల నేర్పరచుకోవడం గురించి; వీటిపై హుఖుఖుల్లా చెల్లించవలసి ఉంటుందా లేక గృహోపకరణము లకు సంబంధించిన శాసనమే వీటికి వర్తిస్తుందా?

జవాబు: గృహోపకరణములకు నిర్దేశితమైన శాసనమే వీటికిని అనువర్తించును.

96

ప్రశ్న: ధర్మనిధులలో ఉంచబడిన ఆస్తిని, తరుగుదల లేదా నష్టం నుండి కాపాడుటకై, నగదు, తదితర ఆస్తుల రూపంలోకి మార్పిడి చేయడం గురించి.

జవాబు: ధర్మనిధులయందలి యాస్తిని తరుగుదల, నష్టముల నుండి పరిరక్షించు నిమిత్తమై ఆస్తిని రూపాంతర మొనరించుట గురించి లిఖితపూర్వకముగ నడుగబడిన ప్రశ్నకు సంబంధించి, అట్టి యాస్తి విలువకు సమానమగు ప్రత్యామ్నాయముతో మార్పిడి గావించుకొనుట ఆమోదనీయమే. నిశ్చయముగా నీ ప్రభుడు నిగూఢార్థ వ్యాఖ్యాత, సర్వజ్ఞుడు, యదార్థమునకాయన నిర్దేశకుడు, దివ్య దినప్రాచీనుడు.

97

ప్రశ్న: చలికాలంలోను, వేసవిలోను పాదప్రక్షాళనం చేసుకోవడం గురించి:

జవాబు: రెండు సందర్భములయందునను ఒకే విధము. ఉష్ణోదక వినియోగమునకు ప్రాధాన్యత; కాని, శైత్యోదకమున కభ్యంతరమును లేదు.

98

ప్రశ్న: విడాకులపై వేరొక ప్రశ్న

జవాబు: దేవుడు - ఆయన వైభవము ఉన్నతినొందు గాక - విడాకులకు సానుకూలుడు కానందున, ఈ యంశమై ఏమియును వెల్లడింప బడలేదు. అయినను, నిరీక్షణా వత్సరారంభము నుండి సంవత్సరాంతము వరకు ఇరువురు గాని అంతకు ఎక్కువమంది గాని సాక్షులుగా పరిశీలింపు చుండవలె; ఒక వేళ తుదివరకును సామరస్యము కుదరనియెడల విడాకులు చోటుచేసుకొనును. ఈ విడాకుల వ్యవహారమును న్యాయమందిర ధర్మకర్తలచే నియుక్తుడైన న్యాయాధికారి నమోదు చేసికొన వలె. ఈ విధానము నవలంబించుట అత్యావశ్యము; లేనిచో అవగాహనాపరుల మనములు వ్యధ నొందవచ్చును.

99

ప్రశ్న: సమాలోచనము గురించి

జవాబు: సభలోని తొలి వర్గ సదస్యుల సమాలోచనము అభిప్రాయ భేదముతో ముగిసెనేని నూతను లను చేర్పవలె. ఆ పై మహోన్నతనామ సంఖ్యకు సరిపడునంత లేదా ఎక్కువ లేదా తక్కువ మందిని లాటరీ మూలమున ఎంచుకొనవలె. ఆపై సమాలోచనము పునరారంభింపబడవలె. తత్పర్యవసాన మేదైనను అంగీకరింపబడవలె. అభిప్రాయభేదము లింకను కొనసాగెనేని, ఆ విధానమునే ఒకటి రెండు పర్యాయము లాచరింపవలె; అధికసంఖ్యాకు లామోదించినదే నిర్ణయమగును. నిశ్చయముగా ఆయన, తానెంచుకొనిన వారికి సన్మార్గదర్శనము గావించును.

100

ప్రశ్న: వారసత్వార్జితము గురించి

జవాబు: వారసత్వార్జితమునకు సంబంధించి, సర్వప్రథమబిందువు - ఆయన దక్క అన్యుల ఆత్మలన్నియును ఆయనకై యర్పితమగు గాక - చే నిర్దేశితమైనది సంప్రీతికరముగ నున్నది. సజీవులైన వారసులందరును తమకు కేటాయించబడిన వారసత్వపు వాటాను అందుకొనిన మీదట, తక్కిన యాస్తిపై నివేదిక నొకదానిని మహోన్నతుని న్యాయస్థానమునకు సమర్పింపవలె. అధికారమూల మాయన హస్తమునందున్నది. ఆయన తన యభీష్టమునే నిర్దేశించును. ఈ విషయమై, జాడతెలియని వారసుల వాటాను, తాత్కాలికముగా, ఇందు గురించిన నిర్దేశమొక్కటి చాటబడునంతవరకును, సజీవులుగానున్న వారసుల కనుగ్రహింపుచు మార్మికభూమి (అడ్రియానోపుల్) యందొక శాసనమావిష్కృతమైనది. అయితే ప్రాచీన సౌందర్యునివోలె ఆ సంవత్సరమే వలసవెళ్లిన వారి వారసత్వపువాటా, వారి వారసులకు ఇవ్వబడినది; భగవంతుడు వారి కనుగ్రహించిన పురస్కృతి యిది.

101

ప్రశ్న: నిధి, నిక్షేపముల శాసనమునకు సంబంధించి.

జవాబు: నిక్షేపము లభ్యమయ్యెనేని, అందలి మూడవవంతు దానిని కనుగొనిన యాతినిది; కాగా, తక్కిన రెండు వంతులును న్యాయమందిర జనులచే ప్రజాసంక్షేమార్థమై వెచ్చింపబడవలె. న్యాయమందిరము సంస్థాపితమైనప్పుడిది అమలులోనికి వచ్చును. అంతవరకును దానిని, ఆయా ప్రదేశములయందలి, ప్రాంతముల యందలి విశ్వసనీయుల చెంత భద్రపరుపవలె. సత్యమునకు ఆయన మహాపాలకుడు, శాసనకర్త, సర్వజ్ఞుడు, సకలవిదుడు.

102

ప్రశ్న: ఫలసాయము నార్జింపని స్థిరాస్తులపై హుఖుఖ్ చెల్లింపు గురించి.

జవాబు: ఆదాయము నార్జింపని అనగా ఎట్టి ఫలసాయము నీయని స్థిరాస్తులపై హుఖుఖ్‌ను చెల్లింప వలసిన అగత్యము లేదని దైవశాసనము. నిశ్చయముగా ఆయన అధిపతి, ఔదార్యప్రదాత.

103

ప్రశ్న: “దివారాత్రముల యవధి సుదీర్ఘముగ నుండు ప్రదేశములయందున గడియారముల . . . వలన ప్రార్థనా సమయములు తెలిసికొనబడు గాక” యను పవిత్ర ప్రవచనమునకు సంబంధించి:

జవాబు: మారుమూల ప్రదేశములని భావము. మరి, ఈ వాతావరణముల యందలి కాలదైర్ఘ్య వ్యత్యాసము కేవలం కొద్ది గంటలే కనుక, ఈ నియమము అనువర్తింపదు.

104

“నిశ్చయముగా, తన తండ్రిని సేవించుటను ప్రతి కొమరునికిని నిర్ణయించితి” మన్న పవిత్ర ప్రవచనము ఆబా బదీ దివ్యఫలకము నందు వెలువరింపబడినది. భగవంతుని దివ్యగ్రంథమున మేమిచ్చిన నిర్దేశమిట్టిది.

105

మరియొక ఫలకమునం దీ మహత్తర వాక్కులు ఆవిష్కతమైనవి : ఓ మహమ్మద్ ! నిన్ను ప్రస్తావింపుచు, తమ బిడ్డలకు శిక్షణ నిమ్మని దైవ జనులను హెచ్చరింపుచు, దివ్యదినప్రాచీనుడు తన వదనమును నీ వంకకు అవలగ్నము గావించినాడు. ఆద్యంతరహితుడగు మహాప్రభుని దివ్య లేఖినిచే కితాబ్-ఎ-అఖ్దస్ నందు పొందుపరుపబడిన ఈ అత్యంతావశ్యక దివ్యాదేశము నుపేక్షించిన యే తండ్రి యైనను తన పితృస్వామ్యమును కోల్పోయి భగవంతుని యెదుట దోషిగ గణియింపబడును. దైవ బోధనలను తన మనోఫలకమున ముద్రించుకొని, దృఢచిత్తుడై వాని ననుసరించు నాతనికి శుభ మగును. వాస్తవమునకు, భగవంతుడు తన భృత్యులకు సహకరించి, సత్ఫలితములనిచ్చి తనను సమీపించుటకు శక్తినిచ్చు వానినే యనుగ్రహించును. ఆయన నిర్దేశకుడు, నిరంతరుడు.

106

ఆయన భగవంతుడు, దివ్యాధికారములుగల ప్రభుడగు ఆయన మహోన్నతుడగు గాక ! మానవజీవన వృక్షాంతరాళమున నిక్షిప్తపరుప బడినది సాక్షాత్కరింపబడుటకును, వాటికి సత్ప్రవర్తన, సదవగాహన లనెడు జీవజలములతో సంరక్షించుటకును సత్యైక దేవునిచే ప్రవక్తలును, శ్రేష్ఠతములును నియోగింప బడినారు. ప్రతి వృక్షమును ఫలములనిచ్చునని యును, వంధ్యావృక్షము అగ్ని కాహుతి యగుటే యుక్తమనియు నిట్టే తెలియనైనది. ఈ ప్రబోధకులు వచించిన, ప్రబోధించిన సమస్తము యొక్క ఉద్దేశ్యము కేవలం మానవుని యున్నత స్థాయిని పరిరక్షించుటయే. భగవంతుని కాలమున ఆయన ప్రబోధములను దృఢముగ నవలంబించి, ఆయన యదార్ధ, మౌలిక శాసనము నుండి వైదొలగక నిలిచియుండు నాతడు ధన్యుడు. విశ్వసనీయత, దైవభక్తి, సత్యసంధత, నిష్కపటములే మానవ జీవనవృక్షమునకు ఉత్తమ ఫలములుగ నొప్పును; కాని వీటన్నింటికన్న గొప్పది: ప్రఖ్యాతుడును, మహిమాన్వితుడును అగు భగవంతుని - ఆయన ప్రకీర్తితుడు అగు గాక - ఏకత్వమును గుర్తించిన పిదప, తల్లిదండ్రుల పట్ల తమకుగల హక్కులను గుర్తించుట. భగవంతుని దివ్యగ్రంథము లన్నింటి యందునను ఈ ప్రబోధము ప్రస్తావితమై పరమోన్నతలేఖినిచే పునఃస్థిరీకృత మైనది. “సమతుల్యుని గాని, సదృశుని గాని భగవంతునికి ఆపాదించక ఆయన నారాధింపుడు; మీ తల్లిదండ్రుల యెడ వాత్సల్యమును, ఆదరమును ప్రదర్శింపు” డని పవిత్ర ఖురాన్ గ్రంథము నందు దయామయుడగు భగవంతుడు - ఆయన కీర్తితుడును, ప్రకీర్తితుడును అగు గాక - వెలువరించిన వాక్కులను గణియింపుడు. నిజైక దేవుని గుర్తించుటకును, మాతాపితరుల యెడ ప్రేమానురాగములకును సారూప్యమెట్లు కూర్పబడినదో గమనింపుడు! ప్రాచీన పవిత్ర గ్రంథములయందునను, ఈ యసమాన అద్భుత ఫలకము నందునను దైవావిష్కృతమైనదానిని వీక్షించి, గ్రహించి, పఠించి, పరమార్థము నెరిగి, పాటించుటకై సద్వివివేకమును, సదవగాహనాశక్తి యును అనుగ్రహింప బడినవారు సంతోషాత్ములు.

107

ఆయన - ఆయన వాక్కు లుత్కృష్టత నొందుగాక - తన ఫలకముల యందొక దానియందిటుల వెలువరించినాడు: అవ్విధముగనే, జకాత్ విషయమునను, ఖురాన్ నందావిష్కృత మైనదాని ననుసరింపుడని నిర్దేశింపుచున్నాము.

Notes

1

నా వస్త్రపు సుమధురపరిమళము ¶4

ఖురాన్‌లోను, పాత నిబంధన గ్రంథంలోను గల జొసెఫ్ కథ దీనికి అన్వయం గావించ బడింది. అందులో జోసెఫ్ సోదరులు అతని వస్త్రాన్ని, తమ తండ్రి అయిన జేకబ్ వద్దకు తెచ్చినపుడు, అది అతనికి బహుకాలం క్రితం తప్పిపోయిన తన ప్రియసుతుని ఆనవాలు పట్టేందుకు ఉపకరించింది. భగవంతుని దివ్యావతారాన్నీ, ఆయన దివ్యావిష్కరణాన్నీ ప్రస్తావించేందుకు వీలుగా ఈ సుమధుర పరిమళ భరిత “వస్త్రోపమానము” బహాయి లేఖనాలలో తరచుగా ఉపయోగించబడింది.

బహాఉల్లా తన ఫలకాలలో ఒక దానిలో అతి “తుచ్ఛమైన వెలకు అమ్మివేయ బడిన దివ్య జేకబ్‌” గా తనను అభివర్ణించుకున్నాడు. ఖయ్యాముల్- ఆస్మాలో , బహాఉల్లాను బాబ్ – “నిజమైన జోసెఫ్‌” గా గుర్తించాడు; విశ్వాసఘాతకుడైన తన సోదరుని చేతిలో బహాఉల్లా అనుభవించవలసిన కడగండ్ల గురించి ముందే భాష్యం చెప్పాడాయన. అదే విధంగా ఆబ్దుల్-బహా సర్వోత్కృష్టత, ఆయన సవతి సోదరుడైన మీర్జా ముహమ్మద్ అలీ (చూ. వివరణ 190) లో తీవ్రమైన అసూయను, భయంకరమైన మాత్సర్యాన్ని రేకెత్తించడానికీ, “జోసెఫ్ ఉత్కృష్టాధిక్యత అతడి సోదరుల హృదయాలలో తీవ్రమైన అసూయను రగిలింప చేయడానికీ” గల సాదృశ్యాన్ని షోఘీ ఎఫెండీ చూపించాడు.

2

శక్త్యధికారములనెడు యంగుళులచే దివ్యమదిరాభాండమును వివృత మొనరించినాము. ¶5

మదిరాసేవనం, మాదకద్రవ్యాల వినియోగము కితాబ్-ఎ-ఆఖ్దస్‌లో నిషేధించ బడినది. (చూ. వివరణలు 144, 170).

మదిరా సేవన సంబంధమైన ప్రస్తావన, ఆధ్యాత్మిక పారవశ్యానికి దృష్టాంత భావనతో సూచించ బడినది. బహాఉల్లా దివ్యావిష్కరణంలోనే కాదు, బైబిల్ లోను, ఖురాన్‌లోను సనాతన హైందవ సాంప్రదాయాల లోను, ఇటువంటి దృష్టాంత సహిత వర్ణనలు అగుపిస్తాయి.

ఉదాహరణకు: ఖురాన్‌లో - ధార్మికులు భద్రపరచబడిన “ఆభీష్ట మదిర” ఇవ్వబడతారని వాగ్దానం చేయబడింది. తన ఫలకాలలోని “కస్తూరీ పరిమళా”లను, “సమస్తజీవకోటిపై” గుబాళించిన తన దివ్యావిష్కరణమును – “ఆభీష్ట మదిర” గా బహాఉల్లా అభివర్ణించాడు. ఈ “మదిర”ను “వివృతం చేశా” నని ఆయన ప్రకటిస్తాడు. తద్వారా, ఇప్పటి వరకూ తెలియచేయబడని ఆధ్యాత్మిక సత్యాలను వెల్లడి చేస్తున్నాడు. దివ్యమదిరను పానం చేసిన వారిని “దివ్యైక్యతా ప్రభలను కాంచుటకు” అంతే కాక, “భగవద్గ్రంథాలలో నిబిడీకృత మైన పరమార్ధాన్ని గ్రహించుటకు” సమర్ధులను గావిస్తాడు.

తన ధ్యానఫలకాలలో ఒకదానిలో “అన్యమంతయు మరచి, నీ దైవధర్మ సేవకు ఉద్యుక్తులై నీ ప్రేమయందు దృఢచిత్తులై యుండునటుల” విశ్వాసులకు “నీ దయాభీష్ట మదిర” నొసంగుమని బహాఉల్లా భగవంతుని వేడుకొంటాడు.

3

అనివార్య ప్రార్థనను మీకు నిర్దేశించినాము. ¶6

అరబ్బీ భాషలో ప్రార్థన అనే అర్థాన్నిచ్చే పలు పదాలున్నాయి. ఇక్కడ మూలంలో అగుపిస్తున్న “సలాత్‌” అనే పదం ఒక ప్రత్యేక విధమైన ప్రార్థనల వర్గాన్ని సూచిస్తుంది. వీటిని ప్రతిరోజూ నిర్ణీత సమయాల్లో ఆలపించడం విశ్వాసులకు నిర్దేశించబడింది. ఇతర ప్రార్థనల నుండి ప్రత్యేకంగా సూచింపబడేందుకు వీలుగా ఈ పదం “అనివార్య ప్రార్థన” గా భాషాంతరం గావించబడింది.

“భగవంతుని దృష్టియం దనివార్యప్రార్థనయును, ఉపవాస నియమములును ఉత్కృష్ట స్థానము నొందు” నని బహాఉల్లా వక్కాణిస్తున్నాడు. (చూ. ప్ర.-జ. 93) “భగవంతుని వంకకు మోమును నిల్పి ఆయన పట్ల తమ భక్తిని వ్యక్తము చేసుకొనుటకూ, వినయవిధేయతలకూ ఉపయుక్తము” లని, అంతేకాక, ఈ ప్రార్థనల ద్వారా “మానవుడు భగవంతునితో సంసర్గమునొంది, ఆయన సామీప్యము నర్థించి తన మనోవల్లభునితో సంభాషించి, ఆధ్యాత్మిక స్థానముల నందుకొను,” నని అబ్దుల్-బహా నొక్కి వచిస్తున్నాడు.

ఈ దివ్యప్రవచనంలో ప్రస్తావించబడిన అనివార్య ప్రార్థన (చూ. వివరణ 9) స్థానంలో మరో మూడు అనివార్య ప్రార్థనలు బహాఉల్లాచే వెలువరించబడినాయి. [చూ. ప్ర.-జ. (ప్రశ్నలు – జవాబులు) 63]. ప్రస్తుతం వినియోగంలో వున్న ఈ మూడు ప్రార్థనల మూలపాఠాలను, వాటి ఆలాపనకు సంబంధించిన నియమాలను ఈ సంపుటంలో ‘కితాబ్-ఇ-అఖ్దస్‌కు అనుబంధంగా బహాఉల్లా వెలువరిం చిన కొన్ని మూల గ్రంథముల’ లో చూడవచ్చు.

ప్రశ్నలు - జవాబులలో అనేకం ఈ నూతన అనివార్య ప్రార్థనాత్రయం గురించి వివరిస్తాయి. ఈ మూడు ప్రార్థనలలో నుండి ఏ ఒక్కదానినైనా యెంచుకోవడానికి వ్యక్తి అనుమతింపబడ్డాడని బహాఉల్లా వచిస్తున్నాడు. (చూ. ప్ర.-జ. 65). ఇందుకు సంబంధించిన ఇతర నియమాలకై 66, 67, 81, 82 సంఖ్యలు గల ప్రశ్నోత్తరాలను చూడవచ్చు.

అనివార్య ప్రార్థనలకు సంబంధించిన శాసన వివరణలు, ‘కితాబ్-ఎ-అఖ్దస్ శాసనాదేశముల సారసంగ్రహము – క్రోడీకరణము’ లో పరిచ్ఛేదము 4. అ. 1-17 లో సంక్షిప్తం గావించబడినాయి.

4

తొమ్మిది ‘రకాహ్’ లు ¶6

విశేషించి వెలువరించబడిన దివ్యప్రవచనాలను నిర్దేశిత దండప్రమాణ విధానాల ననుసరిస్తూ ఆలపించడాన్నే ‘రకాహ్’ అని వ్యవహరిస్తారు.

బహాఉల్లా తన అనుయాయులకు ప్రధానంగా తొమ్మిది ‘రకాహ్ లు కలిగిన అనివార్య ప్రార్థనను నిర్దేశించాడు. ఈ ప్రార్థన కనిపించకుండా పోయిన కారణంగా దీని సూక్ష్మ స్వభావం కాని, దీనిని ఆలపించడానికి నిర్దేశింపబడిన ప్రత్యేక సూచనలు కాని తెలియరాలేదు. (చూ. వివరణ 9)

ప్రస్తుతం ఆదేశించబడిన అనివార్యప్రార్థనలపై వాఖ్యానిస్తూ అబ్దుల్-బహా ఒకానొక ఫలకంలో యిలా సూచించాడు: “అనివార్య ప్రార్థన యందలి ప్రతి పదములో, చలనములో మానవుని అవగాహనకు అందనివీ, లేఖలయందున, స్మృతులందున కానరానట్టి దృష్టాంతములు, మర్మ వివేకము లున్నవి.”

కొన్ని ప్రార్థనలను ఆలపించడం కోసం బహాఉల్లా ప్రసాదించిన నిర్దేశాలు కేవలం ఆధ్యాత్మిక భావగర్భితాలే కాక, వ్యక్తికి “ప్రార్థన, ధ్యానములలో పూర్తి ఏకాగ్రతను వహించుట” కుపకరిస్తాయని షోఘి ఎఫెండీ వివరిస్తున్నాడు.

5

ఉదయ, మాధ్యాహ్నిక, సాయంకాలములయందున ¶6

ప్రస్తుత కాలంలో మధ్యమ అనివార్య ప్రార్థనలను ఆచరించ వలసిన “ఉదయ”, “మధ్యాహ్న”, “సాయంకాలము” లను నిర్వచిస్తూ, వాటిని “సూర్యోదయం, మధ్యాహ్నం, సూర్యాస్తమ,” యాలతో అనుసంధించాడు బహాఉల్లా. (చూ. ప్ర.-జ. 83) “అనివార్య ప్రార్థన నాలపించుటకు అనుమతింపదగు సమయాలు ఉదయం మొదలు మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం మొదలు సూర్యాస్తమయం వరకు, సూర్యాస్తమయం తదుపరి రెండు గంటల కాలం వరకు” అని స్పష్టీకరించా డాయన. అదే విధంగా ఉదయ అనివార్య ప్రార్థనను ఉషోదయానికి ముందే చేయాలని అబ్దుల్-బహా ప్రకటించాడు.

“మధ్యాహ్నం మొదలు సూర్యాస్తమయం” వరకు గల సమయాన్ని “మధ్యాహ్నం”గా నిర్వచిం చడం జరిగింది. ఇది లఘు, మధ్యమ అనివార్య ప్రార్థనలను చేసే విషయంలో అనువర్తిస్తుంది.

6

అసంఖ్యాక ప్రార్థనల నుండి మిమ్ము విముక్తుల నొనరించినాము. ¶6

కితాబ్-ఎ-అఖ్దస్‌లో నిర్దేశించబడిన తొమ్మిది ‘రకాహ్’ లు గల అనివార్య ప్రార్ధనను చేయవలసిన పర్యాయాలకన్న బాబీ, ఇస్లాం మతాలలో అనివార్య ప్రార్థనను చేయవలసిన పర్యాయాలు అనేకం; అవశ్యం. (చూ. వివరణ 4)

బయాన్‌లో పంధొమ్మిది ‘రకాహ్’ లు గల అనివార్య ప్రార్థన నొకదానిని బాబ్ నిర్దేశించాడు. దానిని ఇరవై నాలుగు గంటలకొక పర్యాయం - అంటే ఒక మధ్యాహ్నానికీ మరునాటి మధ్యాహ్నానికీ మధ్య గల సమయంలో - చేయాలి.

ముస్లిం ప్రార్థన రోజుకు ఐదు పర్యాయాలు - ప్రాతః కాలం, మధ్యాహ్నం, అపరాహ్నం, సాయంకాలం, రాత్రి వేళలలో - ఆలపించబడుతుంది. అర్పించే ‘రకాహ్’ ల సంఖ్య, ఆలపించే కాలాన్ని బట్టి ఉంటుంది. రోజులో - మొత్తం పదిహేడు ‘రకాహ్’ లు అర్పించబడతాయి.

7

మీరీ ప్రార్థన చేయనెంచినప్పుడు . . . అమరపురజనుల కారాధనా కేంద్రముగ భగవన్నిర్దేశిత మైనదియును, . . . అగు ఈ పునీత స్థానము దెసకు, నా పరమ పవిత్ర ప్రత్యక్షతా స్థానము వంకకు అభిముఖులు కండు. ¶6

“ఆరాధనా కేంద్రము” అంటే అనివార్య ప్రార్ధన చేసేటప్పుడు ఆరాధకుడు అభిముఖుడు కావలసిన బిందువు. దీనిని ఖిబ్లేహ్ అని అంటారు. ఈ ఖిబ్లేహ్ భావన పూర్వపు మతాలలో కూడా ఉంది. గతంలో జెరూసలెమ్ ఆరాధనా బిందువుగా నిర్ధారితమైంది. మహమ్మదు ఈ ఖిబ్లేహ్ ను మక్కాకు మార్చాడు. అరబ్బీ బయాన్‌లో బాబ్ యిలా సూచించాడు :

“దేవుడు ప్రత్యక్షీకరించునతడే”యదార్ధమైన ‘ఖిబ్లేహ్’ ; ఆయన విశ్రమించునంత వరకు అది ఆయన గమనముననుసరించి చరించును.”

ఈ గ్రంథభాగాన్ని బహాఉల్లా కితాబ్-ఎ-అఖ్దస్‌లో ఉటంకించి, (¶137) పై దివ్యప్రవచనంలో ధృవీకరించాడు. ఖిబ్లేహ్ - దిశగా అభిముఖమవడం “అనివార్య ప్రార్థన పఠనకు నిశ్చయించిన విధాన” మని కూడా ఆయన సూచించాడు. (చూ. ప్ర.-జ. 14, 67). అయితే ఇతర ప్రార్థనలు, ఆరాధనల విషయంలో వ్యక్తులు ఏవైపునకైనా తిరగవచ్చు.

8

దివ్యసత్య, దివ్యోచ్చారణా సూర్యుడస్తమించినపుడు, మేము మీకై నిర్దేశించినయట్టి దివ్యస్థలి వైపు నకు మీ వదనములను సారింపుడు. ¶6

తాను పరమపదించిన తదుపరి తన విశ్రామస్థానాన్ని ఖిబ్లేహ్ గా బహాఉల్లా నిర్దేశించాడు. పరమ పవిత్ర సమాధి అక్కాలోని బహ్‌జీ వద్ద ఉంది. ఈ క్షేత్రాన్ని “తేజోమయ పుణ్యక్షేత్రము” గాను, “ఊర్ధ్వలోక దైవ సమూహములు ప్రదక్షిణమొనరించు ప్రదేశము” గాను అబ్దుల్-బహా అభివర్ణించాడు.

షోఘీ ఎఫెండీ తన తరఫున వ్రాయబడిన ఒక లేఖలో, ఖిబ్లేహ్ వైపుకు అభిముఖం కావడానికి గల ఆధ్యాత్మిక ప్రాధాన్యతకు, మొక్క సూర్యుడి వంకకు తిరగడానికి గల ప్రాముఖ్యతకు గల సాదృశ్యాన్ని ఇలా వివరిస్తాడు. :

... జీవానికీ, ఎదుగుదలకూ అవసరమైన సూర్యరశ్మికై ఏ విధంగా ఒక మొక్క పరితపిస్తుందో, ప్రార్థించేటప్పుడు మనం మన హృదయాలను భగవంతుని దివ్యావతారమూర్తి బహాఉల్లా వంకకు అలా మరల్చుతాము; ... అంతఃకరణానికి చిహ్నంగా ఈ భూమిపై ఆయన దేహధూళి విశ్రమించియున్న దిశకు ... మన ముఖాలను మరల్చుతాము.

9

అనివార్య ప్రార్థనా వివరాలను మేమింకొక దివ్యఫలకమునందు వెల్లడించినాము. ¶8

మౌలికమైన అనివార్య ప్రార్థన, “వివేక హేతువు”గా, బహాఉల్లాచే ఒక ప్రత్యేక ఫలకంలో వెలువరించ బడినది. (చూ. ప్ర.-జ. 68) దీని స్థానంలో ప్రస్తుతం అమలులో ఉన్న మూడు అనివార్య ప్రార్థనలు వెలువరించబడటం వల్ల, ఆయన జీవితకాలంలో ఈ ప్రార్థన విశ్వాసులకు అందజేయబడలేదు.

బహాఉల్లా స్వర్గారోహణానంతరం కొద్ది కాలానికే, ఈ ప్రార్థనా పాఠాన్నీ, మరికొన్ని యితర ఫలకాలనూ - ఆయన ఒడంబడికను ఉల్లంఘించిన మహమ్మద్ అలీ తస్కరించాడు.

10

దివంగతుల కొరకైన ప్రార్థన. ¶8

దివంగతులకై నిర్దేశించిన ప్రార్థన (చూ. కితాబ్-ఇ-అఖ్దస్‌కు అనుబంధంగా బహాఉల్లా వెలువ రించిన కొన్ని మూల గ్రంథములు) మాత్రమే సామూహికంగా ఆలపించవలసిన ఏకైక అనివార్య ప్రార్థన. దీనిని ఒక విశ్వాసి పఠిస్తుండగా, అక్కడ చేరినవారు మౌనంగా నిలబడాలి (చూ. వివరణ 19). మృతులకై చేసే ఈ ప్రార్థన, మృతుడు వయోజనుడైతేనే అవసరమనీ (చూ. ప్రశ్నోత్తరాలు 70), మృతుని ఖననం చేయడానికి ముందే ఈ ప్రార్థన నాలపించాలని, ఖిబ్లేహ్ వైపుకు అభిముఖం కానవసరం లేదని (చూ. ప్ర.-జ. 85) బహాఉల్లా విశదీకరించాడు.

మృతులకై చేయవలసిన ప్రార్థన గురించిన మిగతా వివరాలు సారసంగ్రహము - క్రోడీకరణములో పరిచ్ఛేదము 4. అ. 13-14 లో సంక్షిప్త పరచబడినాయి.

11

ఆరు నిర్దిష్ట గ్రంథభాగములు దివ్యప్రవచనావిష్కర్తయగు భగవంతునిచే ననుగ్రహింపబడినవి. ¶8

మృతులకై చేసే ప్రార్థనలో భాగమైన ఈ గ్రంథభాగాలతో పాటు, ఆరు పర్యాయాలు అల్లా ‘హో’ ఆభా (భగవంతుడు సకల మహిమాన్వితుడు) నామ పునరుచ్చారణను కూడా నిర్దేశించడమైనది. ప్రతి అల్లా ‘హో’ ఆభా నామోచ్చారణతో పాటుగా, ప్రత్యేకించి వెలువరించబడిన గ్రంథభాగాలను పంధొమ్మిది సార్లు పునరుచ్చరించాలి. ఈ దివ్యప్రవచనాలు మృతులకై బయాన్‌లో బాబ్ వెలువరించిన ప్రార్థనలోని ప్రవచనాలను పోలిఉన్నాయి. బహాఉల్లా ఒక నివేదనను ఈ ప్రవచనాలకు ముందు జోడించాడు.

12

కేశములైనను, జీవరహితములగు నస్తికలవంటివైనను నీ ప్రార్థనను భంగము గావింపనేరవు. బీవరు, ఉడుత, యింకను యితర జంతువుల యున్నిని మీరు ధరియింపవచ్చును. ¶9

పూర్వపు మతధర్మాలు కొన్నింటిలో వ్యక్తి - కొన్ని జంతువుల రోమాలను, ఇతర వస్తువులను ధరించి చేసే ప్రార్థన నిష్ఫలమని నిర్ణయించబడింది. అటువంటి వస్తువులేవీ ప్రార్థనను నిష్ఫలం గావించలేవని అరబ్బీ బయాన్‌లో బాబ్ చేసిన తీర్మానాన్ని, బహాఉల్లా ఆమోదించాడు.

13

యుక్తవయస్సారంభమైననాటినుండి ప్రార్థన చేయుమని, ఉపవసింపుమని మేము నిన్నాదేశించి నాము. ¶10

“మతవిధుల నిర్వహణకు యుక్త వయస్సు” “స్త్రీ పురుషు లిరువురికిని పదునైదేండ్లు” గా బహాఉల్లా నిర్వచించాడు (చూ. ప్ర.-జ. 20). ఉపవాసకాల వివరాలకై , చూ. వివరణ 25.

14

అనారోగ్యము లేక వృద్ధాప్యముచే దుర్బలులైన వారిని ‘ఆయన’ . . . దీనినుండి మినహాయించినాడు. ¶10

అనారోగ్యకారణంగా బలహీనులైన వారు, వయోవృద్ధులు అనివార్య ప్రార్థన చేయడం నుండి, ఉపవాస నియమాలను పాటించడం నుండి పొందిన మినహాయింపు గురించి ప్రశ్నలు -జవాబులలో వివరించబడింది. “అనారోగ్యస్థితియం దీవిధులను నిర్వర్తింప ననుమతిలే” దని బహాఉల్లా సూచించాడు. (చూ. ప్ర.-జ. 93). వృద్ధ్యాప్యమంటే డెబ్భై ఏండ్ల నుండి అని ఆయన నిర్వచించాడు (చూ. ప్ర.-జ. 74). డెబ్భై సంవత్సరాల వయసు గలవారు బలహీనులైనా, కాకపోయినా ఈ విధుల నుండి మినహాయింప బడ్డారని షోఘి ఎఫెండీ విశదీకరించాడు.

ఉపవాసం నుండి మినహాయింపు కొన్ని ఇతర విశేష వర్గాలకు చెందిన వారికి కూడా ఇవ్వ బడింది. వారి జాబితా సారసంగ్రహము - క్రోడీకరణము లో పరిచ్ఛేదము 4. ఆ. 5లో ఇవ్వబడింది. అదనపు వివరాలకై చూ. వివరణలు 20, 30, 31.

15

పరిశుభ్ర స్థానమెందైనను సాష్టాంగప్రణామము నొనర్చుటకు భగవంతుడు మీ కనుమతి నను గ్రహించినాడు, ఏలయన ఇందుకు సంబంధించి దివ్యగ్రంథమునం దేర్పరుపబడిన నియమమును మేము తొలగించినాము. ¶10

పూర్వపు మత ధర్మాలలో సాష్టాంగ ప్రణామం ప్రార్థనలో ఒక భాగంగా చేర్చబడింది. తమ ఫాలభాగాన్ని పరిశుభ్రమైన భూ ఉపరితలాన్ని తాకేలా సాష్టాంగ ప్రణామం చేయమని అరబ్బీ బయాన్‌లో బాబ్ విశ్వాసులను ఆదేశించాడు. అదే విధంగా ఇస్లాంలో, సాష్టాంగ ప్రణామం చేయవలసిన ఉపరితలం గురించి మహమ్మదీయులకు కొన్ని పరిమితులు విధించబడ్డాయి. బహాఉల్లా ఈ పరిమితులను రద్దుచేసి “పరిశుభ్ర స్థాన మెందైనను” అని సరళీకృతం గావించాడు.

16

శుద్ధీకరణకు జలము అలభ్యమైన యాతడు “పరమ పావనుడగు, పరమ పావనుడగు భగవంతుని దివ్యనామము పేరిట” యను పదముల నైదు పర్యాయములు పలికి, ఆపై తన ప్రార్థనాదికముల కుపక్రమింపవలె. ¶10

అనివార్య ప్రార్థన సమర్పణకు సంసిద్ధుడయ్యేటందుకై, విశ్వాసి శుద్ధీకరణలను చేసుకోవలసి ఉంటుంది. ఇందులో చేతులను, ముఖాన్ని ప్రక్షాళనం చేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ నీరు లభ్యం కాని పక్షంలో ప్రత్యేకంగా వెలువరించబడి, నిర్దేశించబడిన దివ్యప్రవచనాలను ఐదు పర్యాయాలు ఉచ్చరించాలి. శుద్ధీకరణలకు సంబంధించిన సాధారణ వివరాలకై చూ. వివరణ 34. నీరు అలభ్యమైనప్పుడు అవలంబించవలసిన ప్రత్యామ్నాయ విధానాలకు సంబంధించి పూర్వపు మతధర్మాలలో గల ఏర్పాట్లను ఖురాన్ లోను, అరబ్బీ బయాన్‌లోను చూడవచ్చు.

17

దివారాత్రముల యవధి సుదీర్ఘముగ నుండు ప్రదేశములయందున గడియారములు లేదా కాల గమనము నెరుకపరచు సాధనముల వలన ప్రార్థనా సమయములు తెలిసికొనబడు గాక. ¶10

ఇది రాత్రికీ, పగలుకూ కాలపరిమితిలో సుదీర్ఘ వ్యత్యాసాలు ఉండే ఉత్తర, దక్షిణ ధృవ ప్రాంతా లకు సంబంధించిన అంశం. ఈ ఏర్పాటు ఉపవాస నియమావలంబనకు కూడా వర్తిస్తుంది. (చూ. ప్ర.-జ. 64, 103)

18

సంకేత ప్రార్థన గావించవలసిన యావశ్యకత నుండి మిమ్ములను విముక్తుల నొనరించినాము. ¶11

భూకంపాలు, గ్రహణాలు, భయాందోళనలను కలిగించే అసాధారణ వైపరీత్యాలు దైవ సంకేతాలుగా భావించబడతాయి. అటువంటివి సంభవించినప్పుడు పఠించేందుకై ప్రత్యేకించి మహ్మదీయు లకు సంకేత అనివార్య ప్రార్థన వెలువరించబడినది. ఈ ప్రార్థనను చేయవలసిన ఆవశ్యకత రద్దుచేయ బడినది. దీని స్థానంలో “గోచరా గోచరముల కధిపతియును, సృష్టికర్తయును అగు దేవదేవునిదే సామ్రాజ్య” మని బహాయి పలకవచ్చు. అయితే, ఇది అనివార్యం కాదు. (చూ. ప్ర.-జ. 52).

19

దివంగతులకు నిర్దేశితమైన ప్రార్థనయందు తప్ప సామూహిక ప్రార్థనాచారము తొలగింపబడినది. ¶12

ఉదాహరణకు, ఇస్లాంలో ఆచారంగా మసీదులో ఇమామ్ చే నిర్వహించబడే నిర్ణీత ఆచారనియమంతో పఠించవలసిన శుక్రవారం నాటి సామూహిక ప్రార్థ్థన బహాయి దివ్యధర్మములో రద్దుపరచబడింది. కేవలం మృతుని కొరకై విధించిన ప్రార్థన (చూ. వివరణ 10) మాత్రమే - బహాయి శాసనం నిర్దేశించిన సామూహిక ప్రార్థన. దీనిని అక్కడ సమావేశమైన వారిలో ఒకరు ఆలపిస్తుండగా మిగిలినవారు మౌనంగా నిలబడి ఉంటారు. ఆలపించే వ్యక్తికి ప్రత్యేక హోదా ఏమీ ఉండదు. సమావేశమైన వారు ఖిబ్లేహ్ కు అభిముఖులు కావడం అవసరమేమీ కాదు. (చూ. ప్ర.-జ. 85)

దైనందిన అనివార్య ప్రార్థనాత్రయాన్ని, సామూహికంగా కాక, వ్యక్తిగతంగా ఆలపించాలి.

అనివార్యం కాని ఇతర బహాయి ప్రార్థనాలాపనల నిమిత్తం - ప్రత్యేకించి విధివిధానాలేమీ నిర్దేశించబడి లేవు. అటువంటి ప్రార్థనలను వ్యక్తిగతంగా గాని, సమావేశాలలో గాని, తమకు అనువైన రీతిలో చేసే స్వేచ్ఛ అందరికీ ఉంది. షోఘి ఎఫెండీ ఈ విషయంలో ఇలా అంటాడు:

... మిత్రులు తమ యిష్టానుసారం అనుసరించ వీలున్నప్పటికీ, ఏ విధంగానూ వారి ఆచరణకు అతి కఠినమైన లక్షణమును ఆపాదింపజేసి, ఒక స్థిరవ్యవస్థగా రూపుదాల్చకుండా అత్యంత జాగ్రత్తను వహించాలి. సుస్పష్టంగా సూచించబడిన దివ్యబోధనల నుండి వీడి పోకుండుటకు మిత్రులు ఈ విషయాన్ని సదా తమ మేధ యందుంచుకోవాలి.

20

బహిష్టైన మహిళలను - అనివార్య ప్రార్థనను, ఉపవాసములను చేయుట నుండి భగవంతుడు మినహాయించినాడు. ¶13

బహిష్టైన స్త్రీలు అనివార్య ప్రార్థన చేయడం నుండి, ఉపవాస నియమపాలన నుండి మినహాయించ బడ్డారు. వారందుకు బదులుగా, శుద్ధీకరణాన్ని ఆచరించి (చూ. వివరణ 34), నాటి మధ్యాహ్నానికి మరుసటి మధ్యాహ్నానికి మధ్యకాలంలో, “దేవుడు మహిమాన్వితుడు, శోభాసౌందర్యాల విభుడు” అనే దివ్యప్రవచనాన్ని 95 పర్యాయాలు ఉచ్చరించాలి. ఇందుకు సంబంధించి అరబ్బీ బయాన్‌లోను ఇటువంటి అవకాశమే కల్పించబడింది.

పూర్వం, కొన్ని మత ధర్మాలలో, బహిష్టైన స్త్రీలు మతాచార కర్మలకు అపవిత్రులుగా పరిగణింపబడి ప్రార్థన, ఉపవాస విధులను ఆచరించటం నుండి నిషేధించబడ్డారు. ఆచారకర్మలకు అపవిత్రులు అనే భావనను బహాఉల్లా రద్దు చేశాడు (చూ. వివరణ 106 )

కితాబ్-ఎ-అఖ్దస్‌లో కొన్ని విధులు, బాధ్యతల నుండి మినహాయింపు యివ్వబడిన విషయమై వివరణ యిస్తూ, ఆ మాట మినహాయింపునే సూచిస్తుంది కాని, నిషేధం కాదని విశ్వన్యాయ మందిరము వారు విశదీకరించారు. అందుకే, ఏ విశ్వాసి ఐనా కావాలనుకుంటే, తనకు అనువర్తించే మినహాయింపును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు. అయితే, ఆ మినహాయింపును పాటించటమా, మానడమా అన్న విషయాన్ని నిర్ణయించుకునేటప్పుడు బహాఉల్లా ఆయా మినహాయింపులను సహేతుకంగానే ప్రసాదించాడని విశ్వాసి తన వివేకాన్ని ఉపయోగించి గ్రహించాలి.

మౌలికంగా తొమ్మిది రకాహ్ లు గల్గిన అనివార్య ప్రార్థనకు సంబంధించిన ఈ నిర్దేశిత మినహాయింపు - ప్రస్తుతం, ఆ ప్రార్థన స్థానంలో వెలువరించబడిన అనివార్య ప్రార్థనాత్రయానికి వర్తిస్తుంది.

21

ప్రయాణము చేయునపుడు, ఏదేని సురక్షితప్రదేశమందు ఆగి విశ్రమింపవలసివచ్చెనేని, మీరు - స్త్రీ పురుషులొకే విధముగ - చేయలేక పోయిన ప్రతి అనివార్య ప్రార్థన స్థానము నందొక్క సాష్టాంగ ప్రణామము నాచరింపవలె. ¶14

అభద్రతా పరిస్థితుల్లో అనివార్య ప్రార్థ్ధనాలాపన దుర్లభమనిపించినపుడు, అటువంటి వారు అనివార్య ప్రార్థనను చేయడం నుండి మినహాయించబడ్డారు. వ్యక్తి ప్రయాణంలో ఉన్నా, ఇంటివద్ద ఉన్నా ఈ మినహాయింపు వర్తిస్తుంది. అలాగే ఈ అభద్రతా పరిస్థితుల కారణంగా పఠించబడని అనివార్య ప్రార్థనలకు పరిహారం చేయడానికి ఈ మినహాయింపు అవకాశాన్నిస్తుంది.

ఎవరైనా అనివార్య ప్రార్థన చేయడానికి “సురక్షిత ప్రదేశము” కనుగొనబడేటంత వరకూ దీనిని “మానవలసిన అవసరము లే” దని బహాఉల్లా స్పష్టం చేశాడు. (చూ. ప్ర.-జ. 58)

ప్రశ్నలు - జవాబులలో 21, 58, 59, 60, 61 సంఖ్యలు గలవి ఈ నిబంధనలను సవిస్తరంగా వివరిస్తాయి.

22

మీ సాష్టాంగ ప్రణామముల యనంతరము . . . నర్ధపద్మాసనా సీనులై ¶14

“హేయ్కాలుత్-తవ్హీద్‌” అనే అరబ్బీ పారిభాషికపదం ఇక్కడ “అర్ధ పద్మాసన” మని (అంటే ‘ఐక్యభంగిమ’ అనే అర్థంలో) అనువదించబడింది. అర్థపద్మాసనం సంప్రదాయ విధానాన్ని సూచిస్తుంది.

23

భగవంతుడు నిగూఢమగు నా ప్రేమను దివ్యైశ్వర్యమునకు తాళపుచెవిని గావించినాడు ¶15

భగవంతుడికి, ఆయన సృష్టికి సంబంధించి ఇస్లాంలో ఒక ప్రసిద్ధమైన ఐతిహ్యం ఉంది :

“మున్నొక నిక్షిప్త కోశాన్ని నే

మిన్నగా నెఱుక జేయబడనెంతు

మన్నికగొని విరచించితి సృష్టి

నన్నరయుదురు మీరని తలంచి”

ఈ సాంప్రదాయ సంబంధ ప్రస్తావనలు, సూచనలు బహాయి పవిత్రలేఖనా లన్నింటిలోనూ కానవస్తాయి. ఉదాహరణకు తన ప్రార్థనలలో ఒక దానిలో బహాఉల్లా యిలా వెలువరిస్తాడు :

నా దేవుడవైన ఓ ప్రభూ! నీ నామము ప్రశంసింపబడుగాక. నీవు స్మృత్యతీతాస్తిత్వమునందు అభినివిష్టం గావింపబడిన నిక్షిప్త భాండాగారానివనీ, నీ స్వీయ సారమునందు ప్రతిష్ఠితమైనట్టి దుర్గ్రాహ్యరహస్యానివనీ నేను సాక్ష్యం వహిస్తాను. నిన్ను నీవు బహిర్గతమొనర్చనెంచి ఊర్ధ్వాధమ లోకాల కస్తిత్వ మొసంగి, మానవుని సమస్త జీవకోటి కతీతునిగా నెంచికొని, ఇరు ప్రపంచములకును ఆతనిని చిహ్నము గావించిన నీవు మా సకలాధీశుడవు, పరమ దయానిధివి.

నీ సృష్టి యందలి జనులందరి సమక్షమున నీ సింహాసనము నధిరోహించు నటుల ఆయనను ఉత్తిష్టుని గావించితివి. నీ మర్మములను వెలువరించి నీ దివ్యావిష్కరణా స్ఫూర్తి కాంతులతో వెలుగొంది నీ దివ్యనామములనూ, సద్గుణ విశేషములనూ ప్రదర్శించు నటుల ఆయనను యోగ్యుని జేసితివి. నీ కల్పనాకృత విశ్వమునకు విభుడవగు ఓ దేవా! ఆయన ద్వారా నీ సృష్టి రచనా ప్రవేశి నలంకరించితివి.

(ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్ బై బహాఉల్లా , 38 నుండి)

అదే విధంగా, నిగూఢార్థ ప్రవచనము (హిడెన్ వర్డ్స్) లలో ఆయన యిలా ప్రవచిస్తాడు:

ఓ మానవపుత్రుడా! నిన్ను సృష్టించుటను ప్రేమించినందుననే నిన్ను సృజించితిని. నీకు నామకరణము చేసి, నీ ఆత్మను జీవసారముతో నింపు నిమిత్తము నీవు నన్ను ప్రేమింపుము.

పై సాంప్రదాయం గురించి వ్యాఖ్యానిస్తూ అబ్దుల్-బహా యిలా వ్రాశాడు:

ప్రియతముని పథాన పయనించు ఓ పథికుడా! ఎవరు ఆయన సమస్త కీర్తియుతాస్తిత్వానికి ఉషోదయస్థానములో వారి గురించి, సత్యస్వరూపము నందు భగవంతుని నిక్షిప్తమూ, భగవంతుని ప్రత్యక్షీకరణ దిశల గురించి ప్రస్తావించడమే ఈ పవిత్ర సాంప్రదాయపు ప్రధానోద్దేశ్యమని తెలిసికొనుడు. ఉదాహరణకు, అనంతాగ్నిజ్వాల వెలిగింపబడి, ప్రత్యక్షీకరింపబడుటకు పూర్వమే విశ్వసాక్షాత్కారాలకు నిగూఢ చిహ్నముగా దానియందే అంతర్లీనముగా దాగి ఉంటుంది; ఇదే “నిక్షిప్త భాండాగార” దశ. పావన తరువు తనంత తానే రగిలింపబడి, ఆ దివ్యాగ్ని తన జీవసత్త్వము నందలి చేవచే జ్వలించు దశే “నే నెఱుక చేయబడనెంతు” ననునది. విశ్వదిఙ్మండలము నుండి అనంత దివ్యనామ గుణ విశేషణములతో అగంతుక నిరంజన ప్రపంచములపై శోభిల్లినపుడు, వినూత్నాద్భుత సృష్టి ఆవిర్భావము నొంది “మన్నిక గొని విరచించితి సృష్జి” యనుదానికి అనుసంధానమగును. పునీతాత్మలు సమస్త భవబంధములనెడు తెరలను చీల్చివైచి, ప్రాపంచిక నిరోధములను అధిగమించి, దివ్యసాక్షాత్కార దర్శనమునకు భగవదవతారమూర్తిని గుర్తెరుగు గౌరవమునకు త్వరపడు దశనొంది, వారి హృదయముల యందున పరమాత్ముని పరమోన్నత శోభా చిహ్నమును వీక్షించినపుడు, అనంతసత్యమైనట్టి ఆయనను తెలిసికొనినపుడు సృష్టి పరమార్థము సాక్షాత్కరించును.

24

ఓ మహోన్నతుని దివ్యలేఖినీ ! ¶16

“పరమోన్నతుని లేఖిని”, “పరమోన్నత లేఖిని”, “మహోత్కృష్ట లేఖిని” అనేవి బహాఉల్లాకు – భగవత్ప్రవచనావిష్కర్తగా ఆయన కర్తవ్యనిర్వహణను అభివర్ణిస్తూ - అనువర్తిస్తాయి.

25

మీకు స్వల్పకాలముపాటు ఉపవసించుటను విధియించి . . . ¶16

ఆవిష్కృత భగవత్శాసనానికి - ఉపవాస, అనివార్య ప్రార్థనలు మూలస్థంభాలు. అనివార్యప్రార్థనల ద్వారా, ఉపవాస ప్రార్థనల ద్వారా విశ్వాసులు దైవసాన్నిధ్యము నొందుదురు కనుకనే, తాను వాటిని వెలువరిం చడం జరిగిందని బహాఉల్లా ఒకానొక దివ్య ఫలకంలో ధృవీకరించాడు.

సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలను వర్జించి, పాటించే ఉపవాసకాలం గురించి షోఘి ఎఫెండీ ఇలా వ్రాశాడు :

“... ప్రత్యేకించి యిది ప్రార్థనకు, ధ్యానమునకు, ఆధ్యాత్మిక పునర్ప్రాప్తికి అనువైన వ్యవధి. ఈ తరుణంలో విశ్వాసి తన ఆంతరంగిక జీవనమునందు పునస్సమన్వయములను చేసుకోవ డానికీ, తన ఆత్మయందు లీనమై యున్న ఆధ్యాత్మిక శక్తులను పరిశుద్ధీకరించి, దృఢీకరించ డానికీ శ్రమించడం ఎంతో అవసరం. అందువలన, దాని ప్రాముఖ్యత, ఉద్దేశ్యం ప్రధానంగా ఆధ్యాత్మిక స్వభావానికి సంబంధించినవి. స్వార్థపూరిత, ఐహిక సౌఖ్యాలను వర్జించవలె ననడాన్ని గుర్తుచేసే సంకేతమే ఉపవాస నియమము.”

విశ్వాసులందరికీ 15 నుండి 70 యేండ్ల వయస్సు వచ్చేంత వరకు, ఉపవాస నియమం విధించబడింది.

ఉపవాస శాసనానికి సంబంధించిన పూర్తి వివరణల గురించి, కొన్ని వర్గాల వారికి ఇచ్చిన మినహాయింపుల గురించి కితాబ్-ఎ-అఖ్దస్ శాసనాదేశముల సారసంగ్రహము – క్రోడీకరణము లో పరిచ్ఛేదము 4. ఆ. 1-6 లో ఇవ్వబడింది. ఉపవాసం నుండి మినహాయింపులకు సంబంధించిన చర్చనీయాంశాలకై చూ. వివరణలు 14, 20, 30, 31.

పంధొమ్మిది రోజుల ఉపవాస కాలం - బహాయి మాసం ఆలా* తో కలిసి - సాధారణంగా అధిక దినాలు ముగియగానే మార్చి 2-20 మధ్య వస్తుంది (చూ. వివరణలు 27, 147); నౌరూజ్ పండుగతో ముగుస్తుంది (చూ. వివరణ 26).

26

. . . తదంత్యమును నౌరూజ్ పండుగగా నిర్ధారించినాము. ¶16

ప్రస్తుతం బదీ లేక బహాయి పంచాంగముగా వ్యవహరించబడుతున్న నూతన పంచాంగాన్ని (చూ. వివరణలు 27, 147) బాబ్ ప్రవేశపెట్టాడు. ఈ పంచాంగం ప్రకారం సూర్యాస్తమయం నుండి సూర్యాస్తమయం వరకు గల సమయాన్ని ఒక రోజుగా పరిగణించడమైనది. బయాన్ లో – ‘ఆలా’ మాసాన్ని ఉపవాసమాసం గాను, ఆ మాసాంతాన్ని నౌరూజ్‌కు నాంది గాను, నౌరూజ్‌ను దైవదివసం గాను బాబ్ పేర్కొన్నాడు. బహాఉల్లా - బదీ పంచాంగాన్ని ఆమోదిస్తూ నౌరూజ్‌కు పర్వదిన (పండుగ) హోదాను కల్పించాడు.

సంవత్సరంలో మొదటి రోజు - నౌరూజ్. ఇది మార్చి 21వ తేదీన ఉత్తరార్ధగోళంలో వసంతఋతు విషువత్తుతో కలిసి ఏకకాలంలో సంభవిస్తుంది. సూర్యుడు మేషరాశిలో ఏ దినాన ప్రవేశిస్తాడో - అది ఆ సూర్యాస్తమయానికి, ఒక్క నిమిషం ముందైనా కావచ్చు - ఆ దినాన్ని పండుగగా జరుపుకోవాలని బహాఉల్లా వివరించాడు. వసంతఋతు విషువత్తు సంభవించే కాలం ఆధారంగా, నౌరూజ్ - మార్చి 20, 21 లేదా 22న రావచ్చు.

అనేక శాసనాల వివరణలను పూరించే విధిని బహాఉల్లా విశ్వన్యాయ మందిరానికి అప్పగిం చాడు. వీటిలో బహాయి పంచాంగానికి వర్తించే విషయాలు చాలా ఉన్నాయి. నౌరూజ్ సమయనిర్ధారణకు సంబంధించిన శాసనాన్ని ప్రపంచమంతటా అమలులో పెట్టడానికి వసంతఋతు విషువత్కాలాన్ని నిర్ధారించటానికి ప్రామాణికంగా తీసుకోదగిన ఒక ప్రత్యేక ప్రదేశాన్ని ఎన్నుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని దివ్యధర్మ సంరక్షకుడు షోఘి ఎఫెండీ ప్రకటించాడు. ఈ ప్రదేశాన్ని నిర్ణయించే అధికారాన్ని విశ్వన్యాయ మందిరానికే వదిలి వేయడం జరిగిందని కూడా ఆయన సూచించాడు.

27

మాసముల యందలి అధిక దినములు ఉపవాస మాసమునకు ముందుంచబడు గాక. ¶16

సంవత్సరానికి 365 రోజుల, 5 గంటల 50 నిమిషాలు ఉండే సౌరమాన పంచాంగం ఆధారంగా బదీ పంచాంగం రూపొందించబడింది. ఈ పంచాంగంలో మాసానికి 19 రోజుల చొప్పున సంవత్సరానికి 19 మాసాలు (అంటే 361 రోజులు) ఉంటాయి. వీటికి అదనంగా నాలుగు (లీపు సంవత్సరానికైతే ఐదు) అధిక దినాలను కలిపి ఒక సంవత్సరంగా పరిగణిస్తారు. నూతన పంచాంగం ప్రకారం అధిక దినాలు సంవత్సరంలో ఎక్కడ చోటు చేసుకుంటాయన్నది బాబ్ నిర్ధారించలేదు. ఈ అధిక దినాలను “ఆలా” మాసానికి అంటే ఉపవాస కాలానికి ముందుండేలా స్థిరపరచి కితాబ్-ఎ-అఖ్దస్ ఈ సమస్యను పరిష్క రించింది. బహాయి పంచాంగం గురించిన మరిన్ని వివరాలకై చూ. బహాయి వరల్డ్, సంపుటి 18.

28

ఈ రేయింబవళ్లన్నియును, “హా” యక్షరస్వరూపములు కావలె నని నిర్దేశించినాము. ¶16

అయ్యామ్-ఇ-హా (హా దినములు) గా వ్యవహరించబడుతున్న ఈ అధిక దినాలు “హా అక్షర” సాంగత్యంతో విశిష్టత నొందినాయి. అబ్జాద్ సాంఖ్యక విలువ ఐదు అయిన ఈ అరబ్బీ అక్షరం అధిక దినాల సంఖ్యకు సరిపోతున్నది.

“హా” అక్షరానికి పవిత్ర లేఖనాలలో అనేక ఆధ్యాత్మికార్థాలు ఇవ్వబడ్డాయ. దైవధృతికి ప్రతీక - వాటిలో ఒకటి.

29

నిగ్రహకాలమునకు మునుపు వచ్చునట్టి ఈ దాతృత్వ దినములు ¶16

ఈ దినాలలో విందు, వినోదాలను నిర్వర్తించవలసిందిగా బహాఉల్లా తన అనుచరులకు నిర్దేశిం చాడు. “అతిధి సత్కారాలకు, దాన ధర్మాలకు ఈ అధిక దినాలు ప్రత్యేకంగా రూపొందింపబడిన” వని షోఘి ఎఫెండీ తరఫున వ్రాయబడిన ఒక లేఖలో వివరించబడింది.

30

ప్రయాణికులు . . . ఉపవాస నియమమునకు బద్ధులు కారు ¶16

ప్రయాణానికి సంబంధించి, ఉపవాసం నుండి విశ్వాసికి మినహాయింపునిచ్చే - కనిష్ఠ వ్యవధి బహాఉల్లాచే నిర్వచించబడింది. (చూ. ప్ర.-జ. 22, 75). ఈ నిబంధన వివరాలు సారసంగ్రహము - క్రోడీకరణము లోని పరిచ్ఛేదము 4. ఆ. 5. అ. 1-5 వరకు సంక్షిప్త పరచబడ్డాయి.

ప్రయాణికులకు ఉపవాసం నుండి మినహాయింపు ఇవ్వబడినప్పటికీ, వారికి ఇష్టమైతే ఉపవాసనియమాన్ని పాటించవచ్చునని షోఘి ఎఫెండీ స్పష్టీకరించాడు. ఈ మినహాయింపు పూర్తి ప్రయాణకాలానికి వర్తిస్తుంది తప్ప - రైలులోనో, కారులోనో ప్రయాణించే కొద్దిపాటి గంటల కాలానికి వర్తించ దనికూడా సూచించా డాయన.

31

ప్రయాణికులు, రోగులు, గర్భవతులు, స్తన్యమునిచ్చు తల్లులు ఉపవాస నియమమునకు బద్ధులు కారు; భగవంతుడు తన యనుగ్రహమునకు ప్రతీకగ వారికి మినహాయింపు నొసంగినాడు. ¶16

అస్వస్థులు, లేదా వయోవృద్ధులకు (చూ. వివరణ 14), బహిష్టు మహిళలకు (చూ. వివరణ 20), ప్రయాణికులకు (చూ. వివరణ 30), గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు ఈ మినహాయింపు ప్రసాదించ బడినది. ఎక్కువగా కష్టించే శ్రామికులకు కూడా ఈ మినహాయింపు ఇవ్వబడింది, కాగా అదే సమయంలో వారు “దైవశాసనం పట్ల, దాని మహోన్నత స్థానం పట్ల గౌరవాన్ని ప్రదర్శించేందుకై మితంగా, ఏకాంతంగా భుజింప” వలెనని సూచించబడ్డారు. (చూ. ప్ర.-జ. 76). ప్రజలకు ఉపవాస నియమం నుండి మినహాయింపును ఇవ్వదగిన పనుల వివరాలను విశ్వన్యాయ మందిరము వారు నిర్వచిస్తారని షోఘి ఎఫెండీ సూచించాడు.

32

సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు అన్నపానాదులను వర్జింపుడు. ¶17

ఇది ఉపవాస కాలానికి సంబంధించింది. ఉపవాసంలో అన్నపానాదుల వర్జనయే కాదు ధూమపానం కూడా ఒక విధమైన ‘సేవన’ మే (అంటే త్రాగడమే) నని, అబ్దుల్-బహా తన దివ్యఫలకాలలో ఒకదానిలో వివరించాడు. ‘పానం’ అనే మాట అరబ్బీ భాషలో ధూమపానానికి కూడా యధాతధంగా వర్తిస్తుంది.

33

న్యాయాధీశుడగు భగవంతుని విశ్వసించు ప్రతి యొక్కడును అనుదినమును . . . “అల్లా ‘హో’ అభా” ను తొంబదియైదు పర్యాయము లుచ్చరింపవలె. ¶18

“అల్లా ‘హో’ ఆభా” అనేది “దేవుడు సకల మహిమాన్వితుడు” అని అర్ధాన్నిచ్చే అరబ్బీ పదబంధం. భగవంతుని మహోన్నతనామ స్వరూపమిది (చూ. వివరణ 137). మహోన్నతం అన్నది ఇస్లాం సంప్రదాయంలో భగవంతుని వివిధ నామాలలో ఒకటి. ఈ మహోన్నత నామపు జాడ అదృశ్యంగా ఉంటుంది. భగవంతుని మహోన్నత నామం : “బహా” యేనని బహాఉల్లా స్థిరపరిచాడు.

“బహా” నుండి జన్మించిన వివిధ పదజనితాలు కూడా మహోన్నత నామములే. షోఘి ఎఫెండీ తరఫున ఆయన కార్యదర్శి యిలా వ్రాశాడు :

బహాఉల్లా నామధేయమే మహోన్నత నామము. “యా బహాఉల్ –అభా” అనే ధ్యాన శ్లోకానికి: “ఓ మహిమలకు మహిమా” అని భావము. “అల్లా హో* ఆభా” అభివందనకు “దేవుడు సకల మహిమాన్వితు” డని అర్థం. ఈ రెండూ బహాఉల్లాకే వర్తిస్తాయి. మహోన్నత నామము పేరిట, భగవంతుని మహోన్నత నామముతో బహాఉల్లా సాక్షాత్కరించాడని అర్థం. మరోవిధంగా చెప్పనెంచిన, ఆయన భగవంతుని మహోన్నత దివ్యావతారమని చెప్పవచ్చు.

“అల్లా ‘హో’ ఆభా” అనే అభివందన బహాఉల్లా బహిష్కృతుడై అడ్రియానోపుల్ లో ఉండగా అమలులోకి వచ్చింది.

“అల్లా ‘హో’ ఆభా” ను తొంభైఐదు సార్లు ఉచ్చరించేందుకు ముందుగా శుద్ధీకరణలను ఆచరించాలి (చూ. వివరణ 34).

34

అనివార్య ప్రార్థనకై శుద్ధీకరణములను గావింపుడు ¶18

కొన్ని ప్రార్థనలకు శుద్ధీకరణలు ప్రత్యేకంగా అనుసంధించబడినాయి. మూడు అనివార్య ప్రార్ధనలను పఠించడానికి ముందుగానూ, అలాగే, అనుదినం తొంభైఐదు సార్లు ఉచ్చరించవలసిన “అల్లా ‘హో’ ఆభా” కు ముందుగానూ, అనివార్య ప్రార్థనలకు మారుగానూ, బహిష్టైన మహిళలకై నిర్దేశింపబడిన దివ్య ప్రవచనాల పఠనకు ముందు గానూ - ఈ శుద్ధీకరణలు జరగాలి (చూ. వివరణ 20).

ప్రార్థనకు సమాయత్తమయ్యే ముందు హస్తాలనూ, ముఖాన్నీ ప్రక్షాళన చేసుకోవడం కూడా నిర్దేశిత శుద్ధీకరణలలో ఉంది. మధ్యమ అనివార్య ప్రార్థన విషయంలో, యిది కొన్ని దివ్య ప్రవచనాల ఆలాపనతో పాటు అనుసంధానించబడింది. (చూ. కితాబ్-ఇ-అఖ్దస్‌కు అనుబంధంగా బహాఉల్లా వెలువ రించిన కొన్ని మూల గ్రంథములు).

సాధారణ ప్రక్షాళనకన్నా, శుద్ధీకరణలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. వాస్తవానికి, ఒక వ్యక్తి అనివార్య ప్రార్థనకు ముందుగా స్నానం చేసి ఉన్నప్పటికీ, శుద్ధీకరణ గావించుకోవడం అత్యావశ్యకం. (చూ. ప్రశ్నోత్తరాలు 18)

శుద్ధీకరణకు నీరు లభ్యం కానప్పుడు, నిర్ణీత ప్రవచనాలను ఐదుసార్లు ఉచ్చరించాలి (చూ. వివరణ 16), నీటి వాడకం వల్ల శరీరానికి హానికలిగే వారికి కూడా ఇది వర్తిస్తుంది (చూ. ప్ర.-జ. 51).

శుద్ధీకరణ శాసనానికి వర్తించే విధి విధానాలు సారసంగ్రహము - క్రోడీకరణము లోని పరిచ్ఛేదము 4. అ. 10. అ.-ఋ. వరకూ, ఇంకా, ప్రశ్నలు - జవాబులలో 51, 62, 66, 77, 86 సంఖ్యలు గలవానిలోనూ పొందుపరచ బడ్డాయి.

35

హతమార్చుట . . . నుండి మీరు నిషేధింపబడినారు. ¶19

ఇంకొకరి ప్రాణాన్ని తీయడం నిషిద్ధమన్న నియమాన్ని బహాఉల్లా కితాబ్-ఎ-అఖ్దస్ లోని 73 వ పేరాలో పునఃప్రతిపాదించాడు. ఒక పథకం ప్రకారం చేసే నరహత్యకు అపరాధపరిహారాలు నిర్దేశింపబడ్డాయి (చూ. వివరణ 86). నరహత్య విషయంలో హతుని కుటుంబానికి నిర్ణీత నష్టపరిహారాన్ని చెల్లించడం తప్పనిసరి (చూ. కితాబ్-ఎ-అఖ్దస్ ¶188).

36

లేక వ్యభిచరించుట ¶19

“వ్యభిచారము” అని ఇక్కడ భాషాంతరం చేయబడిన “జినా” అనే అరబ్బీ పదం - వ్యభిచారం, జారత్వం రెండింటినీ సూచిస్తుంది. ఇది ఒక వివాహితుడు లేదా వివాహితురాలు తన భార్య లేదా భర్త కాని వ్యక్తితో కలిగి ఉండే లైంగిక సంబంధాలకే కాక, సాధారణ వివాహేతర లైంగిక సంబంధాలకు కూడా వర్తిస్తుంది. బలాత్కారం అన్నది “జినా” కు మరో రూపాంతరం. వ్యభిచార నేరానికి బహాఉల్లా ఒకే ఒక శిక్షను విధించాడు (చూ. వివరణ 77); ఇక ఇతరత్రా జరిగే లైంగిక నేరాలకు విధించదగిన దండనల నిర్ణయాధికారాలు న్యాయమందిరానికి ఇవ్వబడ్డాయి.

37

పరోక్షనింద, మిథ్యారోపణ ¶19

పరోక్షనింద, దూషణ, పరుల దోషములను పెద్దవి చేసి చెప్పడం వంటి చర్యలను బహాఉల్లా అనేక పర్యాయాలు ఖండించాడు. నిగూఢార్ధ ప్రవచనములలో ఆయన యిలా స్పష్టంగా వచించాడు : “ఓ అస్తిత్వ పుత్రుడా! నీ దోషాలను మరచి ఇతరుల దోషాల పట్ల నిరతుడవైతే ఎట్లు? ఇ ట్లనుసరించువారు నా శాపాను గ్రస్తులగుదురు.” ఇంకా : “ఓ మానవ పుత్రుడా! నీవు పాపివై యున్నంత వరకు యితరుల పాపములను శ్వాసించకు. ఈ ఆజ్ఞ మీరితివేని శపింపబడుదువు. ఇందుకు నేనే సాక్ష్యం వహింతును,” అని కూడా పేర్కొన్నాడు. తీవ్రమైన ఈ హెచ్చరికను తన కడపటి పవిత్ర లేఖనమైన “ది బుక్ ఆఫ్ మై కవనెంట్” లో యిలా నొక్కిచెప్పాడు: “జిహ్వ యున్నది శుభమును వచియించుటకేనని నేను నిశ్చయముగా చెప్పుచున్నాడను, అయుక్తమగు సంభాషణతో దానిని మలినము గావింపవలదు. భగవంతుడు గతించిన దానిని క్షమియించినాడు. ఇక ముందు ప్రతి యొక్కరును యుక్తమైన దానినీ, సముచితమైన దానినే వక్కాణింపుచూ మానవుల మనస్సుకు దుఃఖకారకములగు దూషణ దుర్భాష లకు దూరముగ నుండవలె.”

38

వారసత్వపుటాస్తిని . . . సప్తవర్గములుగ విభజించినాము. ¶20

వీలునామా లేని పక్షంలోనే, అంటే - ఏ వ్యక్తి ఐనా వీలునామా వ్రాయకుండా మరణించినప్పుడే బహాయి వారసత్వ శాసనాలు అనువర్తిస్తాయి. ప్రతి విశ్వాసి తన వీలునామాను వ్రాయాలని బహాఉల్లా, కితాబ్-ఇ-అఖ్దస్ (¶109) లో ఆదేశించాడు. ప్రతి వ్యక్తికీ తన ఆస్తిని తనకు నచ్చిన రీతిన విభజించటానికి గాని, నామనిర్దేశం చేయడానికి గాని, బహాయిలను లేదా బహాయేతరులను గానీ తన ఆస్తికి వారసులను చేయటానికి గానీ సంపూర్ణ స్వేచ్ఛ ఉన్నదని వేరొకచోట స్పష్టంగా ప్రకటించాడాయన (చూ. ప్ర.-జ. 69). ఇందుకు సంబంధించి షోఘి ఎఫెండీ తరఫున వ్రాయబడిన ఒక లేఖ యిలా వివరిస్తుంది:

... ఒక బహాయి వీలునామా ప్రకారం తన ఆస్తిని తన యిష్టానుసారం పంచివేయటానికి అనుమతించబడినప్పటికీ, అతడు తన వీలునామాను వ్రాసేటప్పుడు నైతికంగా, న్యాయంగా కొన్ని అంశాలను ఎప్పుడూ మదిలో ఉంచుకోవలసి ఉంటుంది. అనగా - సంపద సామాజిక ధర్మానికి సంబంధించిన బహాఉల్లా నియమాన్ని సమర్ధించవలసిన అవసరాన్నీ, అదే విధంగా, ఆ సంపద కొందరు వ్యక్తుల లేదా వ్యక్తుల సమూహాల అధీనంలో అధికంగా సమీకరింప బడటాన్నీ, కేంద్రీకరింపబడటాన్నీ అరికట్టవలసిన తక్షణావశ్యకతను గుర్తుంచు కోవాలి.

అఖ్దస్ గ్రంథములోని ఈ దివ్యప్రవచనం, బహాయి వారసత్వ శాసనాన్ని బహాఉల్లా విశదీకరించే సుదీర్ఘ గ్రంథభాగాన్ని మనకు పరిచయం చేస్తుంది. దీనిని పఠించే సమయంలో - మృతుడు పురుషుడు అన్న భావంతో ఈ శాసనం రూపొందించబడిందని - దృష్టి యందుంచుకోవాలి. పరమపదిం చినది స్త్రీ ఐతే తదనుగుణంగా మార్పులు అనువర్తిస్తాయి.

పరమపదించిన వాని వారసత్వపుటాస్తిని సప్త (ఏడు) వర్గాలకు చెందిన వారసు (సంతానం, భార్య/భర్త, తండ్రి, తల్లి, సోదరులు, సోదరీమణులు మరియు ఉపాధ్యాయుడు) లకు పంపిణీ చేసే విధానం, బయాన్‌లో బాబ్ పొందుపరచిన నిబంధనలపై ఆధారితమై ఉంది. వీలునామా లేని పక్షంలో వారసత్వపుటాస్తికి అనువర్తించే బహాయి శాసనాల ప్రధాన లక్షణాలు :

1. మరణించినవాడు పురుషుడై, అతని ఆస్తిలో గృహం కూడా ఉన్నట్లయితే, ఆ గృహం జ్యేష్ఠ పుత్రునికి అంటే పెద్దకుమారునికి దక్కుతుంది. (చూ. ప్ర.-జ. 34)

2. మృతినొందినవానికి మగసంతానం లేకపోతే, ఆస్తిలో మూడింట రెండు వంతులు స్త్రీ సంతతికి చెందుతుంది. మిగిలిన మూడవ వంతు న్యాయ మందిరానికి మరలించ బడుతుంది (చూ. ప్ర.-జ. 41, 72). న్యాయమందిర వ్యవస్థకు వర్తించే వివిధ స్థాయి లకు సంబంధించిన ఈ శాసనం గురించి చూ. వివరణ 42 (చూ. వివరణ 44 కూడా)

3. మిగిలిన ఆస్తి ఏడు వర్గాల వారసులకు పంపిణీ చేయబడింది. ఒక్కొక్క వర్గానికీ వర్తించే వాటాల సంఖ్యల వివరాలకు, చూ. ప్ర.-జ. 5 ఇంకా సారసంగ్రహము - క్రోడీకరణము లోని పరిచ్ఛేదము 4. ఇ. 3. అ.

4. ఏ వర్గానికి చెందిన వారసుల సంఖ్య ఐనా ఒకటికి మించితే, ఆ వర్గానికి వర్తించే ఆస్తిని వారందరికీ - వారు స్త్రీలైనా, పురుషులైనా సరే - సమంగా పంచాలి.

5. సంతానం లేని పక్షంలో పిల్లల వాటా మొత్తం న్యాయమందిరానికి మరలించబడుతుంది (చూ. ప్ర.-జ. 7, 41)

6. సంతానం ఉండి, మిగతా వర్గాల వారసులు కొందరే ఉండటమో, లేదా అసలు లేకపోవడమో జరిగిన పక్షంలో వారి వాటాలలో మూడింట రెండు వంతులు సంతాన వర్గానికి, మూడవ వంతు న్యాయమందిరానికి చెందుతాయి (చూ. ప్ర.-జ. 7).

7. పైన పేర్కొనబడిన ఏ వర్గం వారు కూడా జీవించి ఉండని పక్షంలో, వారసత్వపుటాస్తిలో మూడింట రెండు వంతులు మృతుని అన్నదమ్ముల, అక్కచెల్లెళ్ళ పిల్లలకు చెందు తుంది. వారు లేని పక్షంలో ఆ వాటాలు చిన్నాన్న, చిన్నమ్మ, మేనత్తలకు చెందు తుంది; వారూ జీవించిఉండకపోతే వారి పిల్లలకు చెందుతుంది. ఏ సందర్బంలోనైనా మూడవ వంతు మాత్రం న్యాయమందిరానికే మరలింపబడుతుంది.

8. పైన పేర్కొనబడిన ఏ వర్గానికి చెందిన వారసులూ లేని పక్షంలో యావదాస్తి న్యాయ మందిరానికి చెందుతుంది.

9. బహాయి తల్లిదండ్రుల నుండి, బంధువుల నుండి బహాయేతరులు వారసత్వాన్ని పొందజాలరని బహాఉల్లా వక్కాణించాడు (చూ. ప్ర.-జ. 34). తన తరపున వ్రాయ బడిన ఒక లేఖలో షోఘి ఎఫెండీ : “వీలునామా వ్రాయకుండా మరణించిన వారి ఆస్తి విషయంలోనే కితాబ్-ఎ-అఖ్థస్ లో పేర్కొనబడిన విధంగా వారసత్వపుటాస్తిని విభజించడం జరుగుతుంది. అలా కాక, వీలునామా ద్వారా తన వారసత్వపుటాస్తిని ఎవరికైనా, ఏ మతస్తునికైనా ధారాదత్తం చేసే హక్కు ఒక బహాయికి ఉన్న” దని ఈ నిబంధనల నిర్బంధతను వివరించాడు. బహాయేతరులైన తన భాగస్వామికి, సంతానానికి లేదా బంధువులకు, వీలునామా పూర్వకంగా వారసత్వపుటాస్తి హక్కును కల్పించడం ఒక బహాయికి సదా సాధ్యమే.

వారసత్వాస్తి శాసనాలకు సంబంధించిన అదనపు వివరాలు సారసంగ్రహము - క్రోడీకరణము లోని పరిచ్ఛేదము 4. ఇ. 3. అ.- అం. వరకు సంక్షిప్తపరచ బడినాయి.

39

ఐదు భాగములను సోదరులకును . . . నాలుగు భాగములను సోదరీమణులకును . . . ¶20

స్వర్గస్తుని సోదరీసోదరులకు కేటాయించబడిన వారసత్వపుటాస్తి వాటాల ఏర్పాట్లను ప్రశ్నలు – జవాబులు లో చూడవచ్చు. స్వర్గస్తుని సోదరుడు లేదా సోదరి (ఒకే తండ్రి సంతానం) తనకు కేటాయించ బడిన పూర్తి వాటాను పొందుతారు. అయితే, సోదరుడు లేదా సోదరి వేరొక తండ్రి సంతానమైనపుడు, నిర్ణీత వాటాలో వారికి మూడింట రెండు వంతులు మాత్రమే యివ్వడం జరుగుతుంది; మూడవ వంతు న్యాయమందిరానికి మరలింపబడుతుంది (చూ. ప్ర.-జ. 6). అదే విధంగా మరణించిన వ్యక్తికి సంబంధిం చిన వారసులలో స్వయానా తోడబుట్టిన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఉన్నట్లయితే, తల్లి పక్షానికి చెందిన మారు సోదరసోదరీమణులు వారసత్వపుహక్కును పొందజాలరు (చూ. ప్ర.-జ. 53). అయితే, వారు స్వంత తండ్రి ఆస్తిలో నుండి పొందవలసిన వాటాకు అర్హులౌతారు.

40

ఉపాధ్యాయులకు ¶20

అబ్దుల్-బహా ఒకానొక దివ్యఫలకములో ఆధ్యాత్మిక శిక్షణ గరపిన గురువును “తన సంతతికి శాశ్వత జీవితాన్ని ప్రసాదించు” నట్టి “ఆధ్యాత్మిక జనకు” నితో పోల్చాడు. అందుకే “దైవశాసనము” నందు “గురువులు వారసుల జాబితాలో చేర్చబడ్డా” రని ఆయన వివరించాడు.

వారసత్వపుటాస్తిలో ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయిని పొందే వాటాను బహాఉల్లా ప్రత్యేకంగా సూచించాడు (చూ. ప్ర.-జ. 33).

41

గర్భస్థ శిశువుల యార్తనాదముల నాలకించినయంత, వారి వాటాను ద్విగుణీకృత మొనరించి, మిగిలినవారి వాటాలను తగ్గించినారము. ¶20

బాబ్ ప్రతిపాదించిన వారసత్వ శాసనాలలో 540 వాటాలు గల 9 భాగాలు శిశువులకు కేటాయించ బడ్డాయి. ఈ కేటాయింపు వారసత్వపుటాస్తిలో నాలుగవ వంతుకన్నా తక్కువే. బహాఉల్లా ఆ వాటాను రెట్టింపు చేసి, అంటే 1080 వాటాలకు పెంచి, తక్కిన 6 వర్గాల వారసుల వాటాలను ఆ మేరకు తగ్గించాడు. వారసత్వపుటాస్తి పంపిణీకి సంబంధించిన ఈ దివ్యప్రవచన అంతరార్థాన్ని, దీని అనువర్తన లను సంక్షిప్తంగా వివరించాడాయన (చూ. ప్ర.-జ. 5).

42

న్యాయ మందిరము ¶21

కితాబ్-ఎ-అఖ్దస్‌లో న్యాయమందిర ప్రస్తావనను గావించిన బహాఉల్లా, అది - విశ్వన్యాయ మందిరమా లేక స్థానిక న్యాయమందిరమా అన్న విషయాన్ని స్పష్టం చేయలేదు; ఈ రెండు వ్యవస్థలు ఆ దివ్యగ్రంథంలో నిర్దేశించబడినవి. ఆయన సాధారణంగా “న్యాయమందిరము” అనే పేర్కొంటూ, ఈ శాసనాన్ని అనువర్తింప చేయవలసిన వ్యవస్థ అంతటికీ వర్తించే స్థాయి లేదా స్థాయిలను, అనంతర కాలంలో విశదీకరించబడేందుకు అనువుగా అవకాశాన్ని కల్పించాడు.

ఒక దివ్యఫలకంలో స్థానిక కోశాగారానికి సంబంధించిన ఆదాయాలను లెక్కిస్తూ, అబ్దుల్-బహా - వారసులు లేని వారసత్వపుటాస్తులను కూడా విలీనం చేస్తూ, వారసత్వపుటాస్తికి సంబంధించి కితాబ్-ఎ-అఖ్దస్‌లో పేర్కొనబడిన న్యాయమందిరం స్థానిక న్యాయమందిరమేనని వివరించాడు.

43

మృతునకు పిల్లలుండి . . . ఇతర వారసవర్గీయులెవ్వరును లేని యెడల ¶22

“ఈ నియమమునకు సాధారణ, ప్రత్యేక అనువర్తనములు రెండును కలవు. అనగా, తరువాయి వర్గమునకు చెందిన వారసులెవ్వరును లేనిచో, రెండు వంతులు సంతానమునకును, మిగిలిన మూడవ వంతు న్యాయమందిరమునకును చెందు” నని బహాఉల్లా విశదీకరించాడు. (చూ. ప్ర. - జ. 7)

44

మృతుని నివాసమును, వ్యక్తిగత వస్త్రములను, స్త్రీ సంతతికో, అన్యవారసులకో కాక, పురుష సంతతికే ప్రత్యేకించినాము. ¶25

దివంగతుని నివాసం, వ్యక్తిగత వస్ర్తాలు ఆతని మగ సంతతికే మిగులుతాయని ఒకానొక పవిత్ర ఫలకంలో అబ్దుల్-బహా సూచించాడు. అవి అతని జ్యేష్ఠపుత్రుడికి చెందుతాయి; జ్యేష్ఠపుత్రుడు లే నప్పుడు ద్వితీయ జ్యేష్ఠపుత్రుడికి ... అలా జ్యేష్ఠుడికి చెందుతాయి. భగవత్శాసనంతో సుస్థిర పరచ బడిన ఈ నియమం ఒక నిర్ద్వంద్వ భావోక్తి అని వివరించాడాయన. పర్షియాకు చెందిన ఒక అనుయాయికి ఒకానొక ఫలకంలో ఆయన ఇలా వ్రాశాడు : “సమస్త దివ్యావిష్కృత యుగములందు నను జ్యేష్ఠపుత్రునకు అసాధారణ వైశిష్ట్యము లీయబడినవి. ప్రవక్తత్వస్థాయి సహిత మాతని జన్మహక్కై యున్నది.” జ్యేష్ఠపుత్రునికి ఇవ్వబడిన వైశిష్ట్యాలు విద్యుక్తకృత్యానుసరణీయాలు. ఉదాహరణకు, భగవంతుని కొరకు తన మాతృమూర్తిని సంరక్షించడం, తక్కిన వారసుల అవసరాలను తీర్చడం ఆతడి నైతిక బాధ్యత.

ఈ వారసత్వశాసనపు వివిధాంశాలను బహాఉల్లా విశదీకరిస్తాడు. నివాస గృహాలు ఒకటికంటే ఎక్కువగా ఉన్నప్పుడు ప్రధానగృహం మగసంతతికి దక్కుతుంది. మిగిలిన గృహాలను, యితర ఆస్తులతో కలిపి వారసులకు పంపిణీ చేయా (చూ. ప్ర.-జ. 34) లని, మగసంతతి లేని పక్షంలో, దివంతుని నివాస గృహం, అతని వ్యక్తిగత వస్త్రము లలో మూడింట రెండు వంతులు స్త్రీ సంతతికీ, మూడవ వంతు న్యాయ మందిరానికీ చెందుతాయని ఆయన సూచించాడు. అదే విధంగా, మరణించి నది మహిళ అయితే, ఆమె వస్ర్తాలు ఆమె కుమార్తెలకు సమంగా యివ్వాలి. ఆమె ధరించుకొనని వస్ర్తాలను, ఆభరణాలను, సంపత్తిని - కుమార్తెలు లేని పక్షంలో - ఆమె ధరించిన ఉడుపులతో సహా ఆమె వారసులకు పంచాలి (చూ. ప్ర.-జ. 37).

45

మృతుడు జీవించియుండగనే, సంతానవంతుడగు ఆతని కుమారుడు దివంగతుడయ్యెనేని . . . ఆ సంతతి తమ తండ్రి వాటాకు వారసు లగుదురు. ¶26

ఈ శాసనాంశం కేవలం తల్లి లేదా తండ్రికన్నా ముందుగా మరణించిన కుమారుని విషయంలో వర్తిస్తుంది. మృతుని కుమార్తె సంతానవతిగా మరణిస్తే ఆమె వాటాను పరమ పవిత్ర గ్రంథంలో నిర్దేశించబడిన సప్తవర్గ వారసత్వాన్ననుసరించి విభజించాలి (చూ. ప్ర.-జ. 54).

46

మృతుని పిల్లలు పసివారైనచో, వారసత్వపుటాస్తియందలి వారి వాటాను . . . ఒక విశ్వాసపాత్రు నికి . . . అప్పగింపవలె. ¶27

ఈ పేరాలో, “విశ్వాసపాత్రుడు” గా “ధర్మకర్త” గా అనువదింపబడిన “అమీన్‌” అనే పదానికి ముఖ్యంగా విశ్వసనీయతను మాత్రమే కాక విధేయత, విశ్వాసపాత్రత, న్యాయవర్తన, నిజాయితీ మొదలైన లక్షణాలను సూచించే వివిధార్ధాలు ఉన్నాయి; న్యాయశాస్త్ర పరిభాషలో వాడబడిన “అమీన్‌” అనే పదానికి యితరత్రా వచ్చే అర్థాలలో, ధర్మకర్త, పూచీదారు, కాపలాదారుడు, సంరక్షకుడు, రక్షకుడు అనేవి కూడా ఉన్నాయి.

47

హుఖుఖుల్లా చెల్లించబడి, ఋణము లేవైనను పరిష్కృతములై, అంత్యక్రియల, ఖననముల వ్యయములు జరుపబడి మృతుడు సమాధిస్థలికి గౌరవమర్యాదలతో కొనిపోబడిన పిదపనే ఆస్తి పంపిణీ జరుగవలె. ¶28

బహాఉల్లా నిర్దేశించిన వరుసక్రమాన్ననుసరించి, వారసత్వపుటాస్తి నుండి తొలుత అంత్యక్రియల, శవఖననపు వ్యయాలు, అనంతరం దివంగతుని ఋణాలు, తదనంతరం హుఖుఖుల్లా చెల్లింపు జరగాలి (చూ. వివరణ 125) (చూ. ప్ర.-జ. 9). చెల్లింపులన్నీ తక్కిన గృహేతర ఆస్తి నుండి చెల్లించాలి. అది చెల్లింపులకు చాలని పక్షంలో, స్వర్గస్థుని నివాస గృహం, వ్యక్తిగత వస్త్రాల నుండి చెల్లించాలని కూడా ఆయన సూచించాడు (చూ. ప్ర.-జ. 80).

48

తొమ్మిదితో నారంభింపబడుటచే యెన్నడును మార్పునొందని మర్మజ్ఞానమిది. ¶29

వారసత్వానికి సంబంధించిన తన శాసనం “భగవద్గ్రంథము నందలి నిగూఢ పరిజ్ఞానము -- అనగా ఎప్పటికీ మార్పునొందనిదీ, పునఃస్థాపన చేయలేనట్టిదీ నగు పరిజ్ఞానము ననుసరించి యున్న” దని అరబ్బీ బయాన్ లో బాబ్ వర్ణించాడు. వారసత్వపుటాస్తి విభజనకు ఉపకరించే అంకెలు, భగవంతుడు ప్రత్యక్షీకరింప జేయునట్టి ఆయనను గుర్తించటానికి దోహదపడేందుకు ఉద్దేశించిన ఈ అంకెలు, ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయని పేర్కొన్నాడాయన.

ఇక్కడ ప్రస్తావించిన “తొమ్మిది” అన్న సంఖ్యకు, అరబ్బీ మూలపాఠంలో “థా” అనే అక్షరం - అబ్జాద్ మూల్యాంకనం ప్రకారం - ప్రాతినిధ్యం వహిస్తున్నది (చూ. పారిభాషిక పదసూచిక). వారసత్వాస్తి పంపిణీలో పిల్లలకు “తొమ్మిది భాగములు” గా ప్రతిపాదించిన బాబ్ విధానానికి ఇదే మూలాధారము. మహోన్నత నామధేయమైన “బహా” సంఖ్యకు సమానమైనందువల్ల తొమ్మిది సంఖ్య ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ పవిత్ర ప్రవచనపు తరువాయి భాగంలో “దృశ్యాదృశ్య సదృశము, అతిక్రమించ నలవిగానట్టి, సమీపించ వీలుగానట్టి మహోన్నత నామధేయ” మని సూచించబడింది (చూ. వివరణ 33).

49

ప్రతి నగరమునను న్యాయమందిరమొక్కటి స్థాపింపబడవలెనని . . . భగవంతు డాదేశించినాడు. ¶30

ఈ న్యాయమందిర వ్యవస్థలో స్థానిక, జాతీయ, అంతర్జాతీయ సమాజ స్థాయిలలో కార్యనిర్వహణ చేసే, ఎన్నుకోబడిన సభలు ఉంటాయి. కితాబ్-ఎ-అఖ్దస్ లో బహాఉల్లా - విశ్వన్యాయ మందిరము, స్థానిక న్యాయమందిరము అనబడే రెండింటినీ నిర్దేశించాడు. అబ్దుల్-బహా తన మరణ శాసనంలో ద్వితీయ (ప్రాంతీయ లేదా జాతీయ) న్యాయమందిరాలను ఏర్పరచి, విశ్వన్యాయ మందిరాన్ని ఎన్నుకోవడానికి అవలంబించవలసిన విధానానికి రూపకల్పన చేశాడు.

పై పవిత్ర ప్రవచనంలో పేర్కొనబడిన స్థానిక న్యాయమందిరం తొమ్మిది లేదా అంతకు మించిన సంఖ్యలో వయోజన బహాయిలు నివసించే ప్రదేశంలో ఎన్నుకోబడ వలసిన వ్యవస్థను సూచిస్తుంది. ఇందు గురించి, వయోజనులకు కనిష్ఠ వయోపరిమితి 21 ఏళ్లని తాను గావించిన తాత్కాలిక నిర్ధారణ, భవిష్యత్తులో విశ్వన్యాయమందిరము వారిచే మార్పు చేయబడుటకు వీలున్నదని దివ్యధర్మ సంరక్షకుడు సూచించాడు.

స్థానిక, ద్వితీయ న్యాయ మందిరాలు ప్రస్తుతానికి స్థానిక ఆధ్యాత్మిక సభలుగా, జాతీయ ఆధ్యాత్మిక సభలుగా వ్యవహరించబడుతున్నాయి. ఇది “తాత్కాలిక నామ” మని షోఘి ఎఫెండీ యిలా సూచించాడు:

... బహాయి దివ్యధర్మపు స్థానము, లక్ష్యాలు మరింత సంపూర్ణంగా అవగతమై, గుర్తింపు నొందినప్పుడు క్రమేణా న్యాయమందిరానికి అనుగుణమైన శాశ్వత హోదా కల్పించ బడుతుంది. నేటి స్థానిక ఆధ్యాత్మిక సభలు భవిష్యత్తులో విభిన్నంగా ఉండటమే గాక, బహాఉల్లా దివ్యధర్మపు గుర్తింపు వలన ఏర్పడి, ప్రస్తుతం ఉన్న కార్యాచరణ విధులు, అధికారాలు, ఆధిక్యతల వల్ల అది - కేవలం ప్రపంచ మతవిధానాలలో ఒకటిగా గాక, సార్వభౌమాధికారం గల సర్వస్వతంత్ర అధీకృత మతంగా గుర్తింప బడుతుంది.

50

బహా సంఖ్య ¶30

అబ్జాద్ విధానం ప్రకారం “బహా” అంటే తొమ్మిదికి సమానం. బహాఉల్లా నిర్దేశించిన విధంగా - ప్రస్తుతానికి విశ్వన్యాయ మందిరము, జాతీయ, స్థానిక ఆధ్యాత్మిక సభలలో ఒక్కొక్క దానిలోను, తొమ్మండుగురు కనీస సభ్యులున్నారు.

51

మానవులయందున దయామయుని విశ్వాసపాత్రులుగ వ్యవహ రించుట . . . వారి కనివార్యమై యున్నది. ¶30

విశ్వన్యాయ మందిరము, జాతీయ ఆధ్యాత్మిక సభ, స్థానిక ఆధ్యాత్మిక సభల సాధారణ అధికార విధులు, వాటిలో సభ్యత్వానికి వర్తించే అర్హతలు, బహాఉల్లా, అబ్దుల్-బహాల పవిత్ర రచనలలోను, షోఘి ఎఫెండీ లేఖలలోను, విశ్వన్యాయమందిరము వారి వివరణలలోను పొందుపరచబడినాయి. ఈ వ్యవస్థల ముఖ్యవిధులు, విశ్వన్యాయ మందిర రాజ్యాంగంలోను, అదే విధంగా జాతీయ, స్థానిక ఆధ్యాత్మిక సభల రాజ్యాంగాల లోను పేర్కొనబడి ఉన్నాయి.

52

సంఘటితముగ సమాలోచనలను గావించుట ¶30

బహాఉల్లా సమాలోచనా ప్రక్రియను తన దివ్యధర్మానికి ప్రాథమిక నియమంగా స్థిరీకరించి, విశ్వాసులందరూ “సమస్త విషయములందునను సంఘటితముగ సమాలోచనలను గావింపవలె” నని ఉద్బోధించాడు. సమాలోచన అనగా “మార్గము జూపు జ్యోతి” అని “అవగాహనా ప్రదాయిని” అని ఆభివర్ణించా డాయన. “సమాలోచనా నియమ మనేది ... బహాయి పరిపాలనా సంవిధాన మౌలిక శాసన మందొక రూప” మని షోఘి ఎఫెండీ వివరిస్తున్నాడు.

ప్రశ్నలు - జవాబులు 99 లో బహాఉల్లా - తుది నిర్ణాయకంలో ఏకాభిప్రాయ సాధనకు గల ప్రాధాన్యతను వివరించి, అది సాధ్యం కాని పరిస్థితిలో, అత్యధికుల అభిప్రాయాన్ని నిర్ణయంగా పరిగణించాలని నొక్కివక్కాణిస్తూ సమాలోచనకు ఒక విధానాన్ని రూపొందించాడు. సమాలోచనకు సంబంధించిన బోధనలపై వేయబడిన ఒక ప్రశ్నకు సమాధానంగా, సమాలోచనకు సంబంధించిన మార్గదర్శకాలు, ఆధ్యాత్మిక సభల సంస్థాపనకు పూర్వమే వెలువరించబడ్డాయని విశ్వన్యాయ మందిరము వారు విశదీకరించారు. సహాయసహకారాలకై మిత్రులు స్థానిక ఆధ్యాత్మిక సభలను సంప్రదించ వచ్చునని, ప్రశ్నలు - జవాబులలో సూచించబడిన విధానాన్ని అవలంబించడానికి ఎలాంటి నిషేధమూ లేదని విశ్వన్యాయమందిరము వారు ధృవీక రించారు. మిత్రులు తమ వ్యక్తిగత సమస్యలను గురించి సంప్రదించ దలిస్తే వా రీమార్గాన్ని అనుసరించవచ్చు.

53

సమస్త భూభాగముల యందుననూ ఆరాధనామందిరములను నిర్మింపుడు. ¶31

బహాయి ఆరాధనా మందిరం దైవసంకీర్తనకు అంకితమైన స్థానము. ఆరాధనా మందిరం అంటే : మష్రిఖుల్-అఝ్కార్ (దైవసంకీర్తనకు ఉషోదయత్ప్రదేశము) కు కేంద్ర ప్రాసాదమని. భవిష్యత్తులో ఈ ఆరాధనా మందిరానికి అదనంగా, సాంఘిక, ప్రజాహితైక, విద్యా వైజ్ఞానిక వృత్తులకు అంకితమయ్యే అనేక అనుబంధ సంస్థల భవనసముదాయం అనుసంధించబడి విరాజిల్లుతుంది. మష్రికుల్-అఝ్కార్‌ని “ప్రపంచమందున అత్యంతావశ్యక వ్యవస్థలయం దొకటి” గా అభివర్ణించాడు అబ్దుల్-బహా. ఇది “బహాయి సేవారాధన” లకు సమైక్యస్వరూపమని షోఘి ఎఫెండీ స్థూలంగా సూచించాడు. ఈ ఆరాధనా మందిరము, దీని అనుబంధ సంస్థలు “బాధితులకు ఉపశమనంగా, పేదలకు జీవనాధారంగా, పథికులకు ఆశ్రయంగా, దీనులకు స్వాంతనంగా, అజ్ఞానులకు శిక్షణాలయంగా భాసిల్లుతా” యన్న దార్శనికతను ఆయన వ్యక్తం చేశాడు. భవిష్యత్తులో ప్రతి గ్రామంలోను, పట్టణంలోను బహాయి ఆరాధనా మందిరాలు నిర్మితమౌతాయి.

54

మీలో స్తోమతగల వారు పవిత్రగృహమునకు తీర్ధయాత్రను గావింప వలెనని దేవాధిదేవు డాదేశించి నాడు. ¶32

షిరాజ్, బాగ్దాద్ నగరాలలోని బాబ్, బహాఉల్లా గృహాలు రెండింటికీ ఈ నిర్దేశం అనువర్తిస్తుంది. ఈ గృహద్వయంలో ఏ ఒక్కదానిని సందర్శించినా తీర్ధయాత్రాఫలం లభిస్తుందని బహాఉల్లా పేర్కొన్నాడు. (చూ. ప్ర.-జ. 25, 29). సురీహ్-ఇ-హజ్ (చూ. ప్ర.-జ. 10) పేరు గల రెండు వేర్వేరు దివ్యఫలకాలలో బహాఉల్లా ప్రతి తీర్ధయాత్రకు ఆచరింపవలసిన విశేష కర్మలను నిర్దేశించాడు. దీనినిబట్టి చూడగా గృహద్వయాన్ని మామూలుగా దర్శించి రావడంకన్నా తీర్ధయాత్ర చేయడం మిన్న.

బహాఉల్లా స్వర్గారోహణం తర్వాత, బహ్‌జీ లోని ఆయన పవిత్ర సమాధిని తీర్ధయాత్రా క్షేత్రంగా పేర్కొన్నాడు అబ్దుల్-బహా. ఒకానొక ఫలకంలో ఆయన “మహాపావన సమాధిని, బాగ్దాద్‌నందలి శుభసౌందర్యుని పవిత్ర గృహమును, షిరాజ్‌నందలి బాబ్ పూజ్యగృహములను తీర్ధయాత్రా క్షేత్రములుగ అంకితము గావించడమైన” దని, “భరించగల, స్తోమత గల వ్యక్తికి దారిలో విఘ్నము లేమియును కలుగనిచో, నిది యనివార్య”మని సూచించాడు. మహాపావన సమాధి సందర్శనకు ఎటువంటి కర్మాచరణలు విధించబడలేదు.

55

ఆయన తన కారుణ్యము కొలది మహిళల నిందుండి మినహాయించినాడు. ¶32

ఆర్ధిక స్తోమత, ప్రయాణం చేయగల స్థితి గల తన అనుయాయులకు - వారు తమ జీవితకాలంలో ఒక పర్యాయం తీర్థయాత్ర చేయవలెనన్న శాసనాన్ని బాబ్ తన బయాన్ గ్రంథంలో విధించాడు. ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందుల నుండి మహిళలను తప్పించాలన్న అభిప్రాయంతో, వారికి దీనిని అనివార్యంగా నిబద్ధీకరించలేదని ప్రవచించాడాయన.

అదే విధంగా, తీర్థయాత్రావశ్యకత నుండి బహాఉల్లా మహిళలను మినహాయించాడు. అయితే, ఈ మినహాయింపు నిషేధం కాదని, స్త్రీలు స్వేచ్ఛగా తీర్ధయాత్రను గావించవచ్చునని విశ్వన్యాయమందిరము వారు స్పష్టం చేశారు.

56

ఏదో ఒక వృత్తి . . . లో ప్రవేశించుట ¶33

స్త్రీ, పురుషులు ఏదేని వృత్తినో, వ్యాపారమునో చేపట్టడం తప్పనిసరి. “అట్టి కార్యమునం దవలగ్నులగుట” – “దైవారాధనా స్ధాయి”కి చెందినదని నుతించాడు బహాఉల్లా. ఈ శాసనానికి గల ఆధ్యాత్మిక, ఆచరణాత్మక ప్రాముఖ్యతలు, దాని ఆచరణలో సమాజం, వ్యక్తుల పరస్పర బాధ్యతల గురించి షోఘి ఎఫెండీ తరఫున వ్రాయబడిన ఒక లేఖలో వివరించబడింది:

విశ్వాసులు ఏదేని వృత్తిలో నిమగ్నం కావడం గురించి బహాఉల్లా యిచ్చిన శాసనమునకు సంబంధించి: ఈ విషయంలో బోధనలు - ప్రత్యేకించి కితాబ్-ఎ-అఖ్దస్ లో నవీన ప్రపంచవిధానక్రమంలో, నిర్వ్యాపారులకు స్థానం లేదని సుస్పష్టంగా చెబుతున్నాయి. తత్ఫలితంగా, భిక్షాటనను నిరుత్సాహ పరచడమే కాక, దానిని సమాజం నుండి సమూలంగా తుడిచి వేయాలని బహాఉల్లా ఈ నియమానికి అనుబంధంగా ప్రవచించాడు. ప్రతి వ్యక్తికి ఏదో ఒక వృత్తిలో అవసరమైన ప్రావీణ్యతను పొందడానికీ, ఆ ప్రావీణ్యతను సద్వినియోగం చేసుకునేందుకూ మార్గాలను, తమ జీవనోపాధి నార్జించుకోవడానికి అవకాశాలను కల్పించవలసిన బాధ్యత సమాజ నిర్వాహకులపై ఉంది. ఒక వ్యక్తికి ఎంతటి అంగవైకల్యం ఉన్నా, పరిమితులున్నా, ఏదో ఒక పనినో, వృత్తినో చేపట్టడం అవసరం. ఎందుకనగా, సేవాతత్పరతతో చేసే పని బహాఉల్లా బోధనల ప్రకారం ఒక ఆరాధనా స్వరూపమే. అది కేవలం ఉపయుక్తమే కాదు, దానిలో ఎంతో విలువ కూడ దాగి ఉన్నది. ఏలయనగా, అది మనలను దేవుని సన్నిధికి చేర్చి, ఈ ప్రపంచంపట్ల ఆయన ఉద్దేశ్యాన్ని సవ్యంగా గ్రహించేలా చేస్తుంది. వారసత్వపుటాస్తి, ఎవరికిని వారి దైనందిన వ్యావృత్తి నుండి మినహాయింపును ఇవ్వజాలదని విశదమౌతున్నది.

“ఒక వేళ ఏ వ్యక్తియైనను భుక్తిని ఆర్జింప నశక్తుడయ్యెనేని, లేక కటిక పేదరికము కృంగదీసెనేని, లేక నిస్సహాయుడయ్యెనేని అతనికి జీవనోపాధిగా నెలవారీ భత్యము నేర్పరచవలసిన బాధ్యత ధనవంతులపై, లేదా ఉపప్రతినిధులపై యున్నది.... ఉపప్రతినిధులనగా ప్రజాప్రతినిధులు అనగా న్యాయమందిర సభ్యు” లని తన ఫలకాలలో ఒక దానిలో అబ్దుల్-బహా ప్రవచించాడు. (చూ. భిక్షాటనపై వివరణ 162)

బహాఉల్లా ఆదేశం ప్రకారం - జీవనోపాధికై భార్య, తల్లి, ఇంకా ఆమె భర్త పనిచేయవలసి ఉంటుందా అని ఆడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, మిత్రులు తమకు, సాటివారికి లాభదాయకమగు వృత్తిని చేపట్టవలెనని, గృహస్థ్దావస్థ ఎంతో గౌరవప్రదము, బాధ్యతాయుతము అయిన కార్యమని, సామాజికంగా దానికి ప్రాధాన్యత ఉన్నదనీ బహాఉల్లా నిర్దేశాల సారాంశమని విశ్వన్యాయమందిరము వారు వివరించారు.

ఒక నిర్ణీత వయస్సుకు చేరుకున్నవారు వృత్తినుండి విరమించుకునే విషయంలో - తన తరఫున వ్రాయబడిన ఒక లేఖలో: “కితాబ్-ఎ-అఖ్దస్‌లో ఇందుకు వివరణ లేనందున, ఇది అంతర్జాతీయ న్యాయమందిరం శాసనం చేయవలసిన విషయ” మని వివరించాడు షోఘి ఎఫెండీ.

57

కరచుంబనము దివ్యగ్రంథమున నిషేధింపబడినది. ¶34

అనేక పూర్వపు మతావిష్కరణలలోనూ, మరికొన్ని సంస్కృతులలోను, మతాధిపతి లేదా ప్రముఖుని కరాన్ని (హస్తాన్ని) భక్తిసూచకంగాను, అటువంటి వ్యక్తులకు తమకు గల తేడాకు సంకేతం గాను, వారి అధికారం పట్ల తమకు గల విధేయతకు ప్రతీకగాను ముద్దిడుకొన వలసి వచ్చేది. బహాఉల్లా కరచుంబనాన్ని ప్రతిషేధించి, ఒకరు మరొకరి ముందర సాష్టాంగపడటాన్ని, ఒక వ్యక్తి కన్న మరో వ్యక్తి గౌరవాన్ని కించపరచే అవమానకర ప్రవర్తనలకు పాల్పడటాన్ని తన దివ్య ఫలకాలలో గర్హించాడు (చూ. వివరణ 58).

58

తమ పాపవిముక్తికై అన్యుల క్షమ నాశించుట కెవ్వరునూ అనుమతింపబడలేదు. ¶34

ఒక వ్యక్తి మరొక వ్యక్తికి తన పాపాలను నివేదించడం, పాపప్రక్షాళనకై ప్రాధేయపడటం వంటి పనులను బహాఉల్లా ప్రతిషేధించాడు. బదులుగా ఎవరైనా భగవంతుని క్షమాభిక్షను అర్థించాలి. బిషారత్ దివ్య ఫలకంలో ఆయన “వ్యక్తులముం దొనరించు పాపనివేదనము అవమానమునకు, గౌరవభంగము నకు దారితీయు” నని ప్రవచించాడు; “భగవంతుడు తన సేవకుల అవమానము నభిలషింప” డని రూఢిగా పలికా డాయన.

షోఘి ఎఫెండీ ఈ నిషేధాన్ని సందర్భోచితంగా వివరించాడు. ఆయన తరఫున ఆయన కార్యదర్శి యిలా వ్రాశాడు :

... క్యాథలిక్ మతగురువుల ఎదుట తమ పాపాలను నివేదించుకోవడం, ఇతరత్రా మతోపశాఖలలో ఆచరణలో ఉన్నట్లుగా, తమ పాపకృత్యాలను ప్రజల ముందు బహిర్గతం చేయడం వంటి వాటినుండి మనం నిషేధించబడ్డాము. అయినను, ఏదేని పొరపాటు జరిగిందని తెలిసికొన్నప్పుడు లేదా మన ప్రవర్తనలో లోప మున్నదని అనిపించినప్పుడు క్షమించమని ఇంకొక వ్యక్తిని తక్షణమే అడిగే స్వేచ్ఛ మనకు ఉన్నది.

పాపనివేదనం గురించి బహాఉల్లా విధించిన నిషేధం గురించి విశ్వన్యాయ మందిరమువారు కూడా స్పష్టీకరిస్తూ, ఈ నిషేధం - బహాయి వ్యవస్థల పరిరక్షణలో, సంప్రదింపులలో తమ అతిక్రమణలను అవతలి వ్యక్తికి చెప్పడాన్ని నిరోధించదు అని పేర్కొన్నారు. అదే విధంగా, ఒక సన్నిహిత మిత్రుని నుండి గాని లేదా వృత్తినిపుణుని నుండి గాని సలహా పొందగోరినపుడు తమ విషయాన్ని వివరించే సందర్భంలో ఈ నిషేధం వర్తించదని కూడా వివరించారు.

59

తన మనమునం దగ్రాసనము నపేక్షింపుచు ద్వారసీమ చెంతగల పాదరక్షల మధ్య ఆసీనుడైన వా డొకడు జనులయందు గలడు. ¶36

ఏదైనా సమావేశంలోకి ప్రవేశించే ముందు చెప్పులను, బూట్లను వెలుపల వదలి వేయడం తూర్పుదేశాల సాంప్రదాయం. గది ద్వారానికి దూరంగా, అభిముఖంగా, గౌరవస్థానంగా పరిగణించబడే చోట, ఉపస్థితులైన వారిలోకెల్లా ప్రముఖులు కూర్చుంటారు. మిగతావారు, చెప్పులు బూట్లు వదలివేయబడిన ద్వారం వైపుకు అవరోహణ క్రమంలో కూర్చుంటారు; మరీ సాధారణ వ్యక్తులు కడపటికి, ద్వారాని కీవలగా కూర్చుంటారు.

60

అంతర్జ్ఞ్ఞానకోవిదుడనని . . . చెప్పుకొనువాడును జనులయందే గలడు. ¶36

ఇది విశేషజ్ఞానాభినివేశం కలవారమని ప్రకటించుకునే వారిని ఉద్దేశించినది. అటువంటి జ్ఞానసంపర్కం, భగవంతుని దివ్యావతారావిష్కరణను గ్రహించడానికి అవరోధాన్ని కలిగిస్తుంది. “తమ ఊహలు మలిచిన ప్రతిమల నారాధిస్తూ, అదియే అంతఃకరణ జ్ఞానమని భావించువారు యదార్ధమునకు మ్లేచ్ఛులుగ గణియింప బడుదు” రని వేరొకచోట బహాఉల్లా స్పష్టం చేశాడు.

61

భరతఖండపు పర్వతసానువులయం దెందరు సర్వసంగపరిత్యాగులై, కఠోరనియమములను విధియించుకొని, దివ్య పదావిష్కర్త యగు భగవంతుని స్మృతికి దూరులు కాలేదు. ¶36

ఈ దివ్య ప్రవచనం - సన్యాస, వానప్రస్థ జీవితంపై గల నిషేధానికి అన్వయిస్తుంది. చూ. సారసంగ్రహము - క్రోడీకరణము లోని పరిచ్ఛేదము 4. ఈ. 1. ఝ. 3-4. బహాఉల్లా స్వర్గ సదృశ పరిభాషలో ఈ నియమాలకు సంబంధిత విశేష వివరణలను ఇచ్చాడు. “ఏకాంతవాసమునో, సన్యాసమునో అవలంబిం చుట భగవంతుని సమక్షమునం దంగీకరింపబడ” వని ప్రబోధించా డాయన. “ఆనందోత్సాహములను కలిగింపు వానిని పాటింపు” డని, దాని నవలంబించు వారికి పిలుపు నిచ్చాడు. “పర్వతగుహలను గృహములుగ గ్రహియించిన” వారిని, “రాత్రులలో స్మశానవాటికలయం దేకాంతవాసము చేయు” వారిని అటువంటి అనుష్ఠానాన్ని పరిత్యజించమని ఆదేశిస్తూ, మానవజాతి నిమిత్తం కల్పింపబడిన “భగవ దౌదార్యముల”ను కోల్పోవద్దని ఆజ్ఞాపించాడు. సన్యాసుల, పూజారుల “భక్తిపూరిత కర్మల” ను వివరిస్తూ, బిషారత్ దివ్యఫలకములో “ఏకాంతవాసమును మాని, బాహ్యప్రపంచము నందడుగిడి, తమకునూ, ఇతరులకునూ లాభదాయకమగు కార్యములను చేపట్టు” డని వారికి పిలుపు నిచ్చాడాయన. అంతేకాక, “భగవంతుని స్మరియించువానికి జన్మమునిచ్చుటకై వివాహితులు కావలె” నన్న వరాన్ని ఆయన వారికి అనుగ్రహించాడు.

62

సహస్రవర్షముల పరిపూర్తికి పూర్వమే భగవదావిష్కరణకర్తగా ప్రకటించుకొనువాడు ¶37

బహాఉల్లా దివ్యసంవిధానము, తదుపరి దివ్యావతారము అవతరించునంత వరకు కొనసాగుతుంది. అట్టి మహనీయుని రాకడ “పూర్తిగ సహస్రవర్షములు” (అంటే వెయ్యి సంవత్సరాలు) గడిచిన పిదపనే తప్ప, అంతకు ముందు సంభవింపదు. ఈ “దివ్యప్రవచనము” యొక్క “విస్పష్టభావము” నకు భిన్నమైన వాదనల గురించి హెచ్చరిస్తూ, ఈ వెయ్యేళ్ల కాలవ్యవధి గురించి ప్రస్తావిస్తూ ఆయన ఒకానొక దివ్యఫలకంలో: “ప్రతి వర్ష” మున “ఖురాన్ ననుసరించి పండ్రెండు మాసములు, బయాన్ ను అనుస రించి పంధొమ్మిది దినములు గల పంధొమ్మిది మాసములు ఉండు” నని పేర్కొన్నాడు.

1852 సం. అక్టోబర్‌లో తెహరాన్‌లోని సీయాచల్‌లో బహాఉల్లా అందుకున్న భగవదావిష్కరణ సందేశమే ఆయన ప్రవక్తృత్వానికి నాంది. తదుపరి ప్రత్యక్షమయ్యే దివ్యావతారమూర్తి ఆగమనానికి ముందు, వేయి సంవత్సరాలకు పైగా గడవాలి.

63

ఇరాక్ నందు వసియించునప్పుడును, మరి ఆపై మార్మిక భూమి యందుండగను మీకు మేము ముందుగా హెచ్చరిక చేసినదియును, ఇప్పుడీ దేదీప్యమానస్థలినుండి హెచ్చరింపుచున్నది యును ఇదియే. ¶37

“మార్మికభూమి” అడ్రియానోపుల్ ను, “ఈ దేదీప్యమాన స్థలి” అక్కా ను సూచిస్తాయి.

64

పాండిత్యముచే గర్వమునొంది . . . తనను వెన్నంటివచ్చు పాదరక్షల సవ్వడిని వినినంతనే స్వీయౌన్నత్యమున . . .తానే యధికుడనని అహంకరించు నాతడు జనబాహుళ్యమున కలడు. ¶41

గతంలో తూర్పు దేశాలలో తమ మతనాయకులకు, తమకు మధ్యగల అంతరానికి సూచనగా, అనుయాయులు వారిని (మతనాయకులను) అనుసరించి, వెనుకగా ఒకటి రెండడుగులు దూరంగా నడవడం ఆనవాయితీగా ఉండేది.

65

నిమ్రోదు ¶41

ఈ దివ్యప్రవచనంలో ప్రస్తావితమైన నిమ్రోదు అనే పదం యూదు, ఇస్లాం సాంప్రదాయాలకు సంబంధిం చింది. ఇది అబ్రహామ్‌ను వేధించిన వాడూ, గర్వాతిశయానికి ప్రతిరూపమూ అయిన ఒక రాజు పేరు.

66

అఘ్సాన్ ¶42

అఘ్సాన్ (‘ఘస్న్’ కు బహువచనం) అంటే ‘శాఖలు’ అనే అర్ధం వచ్చే అరబ్బీ పదము - బహాఉల్లా తన మగసంతతిని ఈ పదంతో సూచించాడు. అది కేవలం వారసత్వాస్తు (మాన్యము)ల స్వభావాలనే కాక బహాఉల్లా, అబ్దుల్-బహాల స్వర్గారోహ ణానంతరం అధికారిక వారసత్వాన్ని కూడా సూచిస్తున్నది (చూ. వివరణ 145). తన ఒడంబడిక గ్రంథంలో బహాఉల్లా తన జ్యేష్ఠపుత్రుడైన అబ్దుల్-బహాను దివ్యధర్మానికి నేతగాను, తన ఒడంబడికకు కేంద్రంగాను, నియమించాడు. అబ్దుల్-బహా తన మరణశాసనంలో తన జ్యేష్ఠదౌహిత్రుడైన షోఘి ఎఫెండీని దివ్యధర్మానికి సంరక్షకునిగా, ప్రధానాధిపతిగా నియమించాడు.

కితాబ్-ఎ-అఖ్దస్‌లోని ఈ గ్రంథభాగం, ఎంచుకోబడిన అఘ్సాన్‌ల ధర్మాధికార వారసత్వం గురించి, ధర్మసంరక్షక వ్యవస్థ గురించి తెలియచేస్తుంది. అలాగే, వాటి క్రమానికి భంగం వాటిల్లే ఆస్కారాన్ని కూడా సూచిస్తుంది. ఈ గ్రంథభాగంలో పేర్కొన్నట్లుగా వ్యవస్థలు రూపుదిద్దుకోవటానికి పూర్వమే, 1963 లో విశ్వన్యాయ మందిర స్థాపనకు ముందే ఈ అఘ్సాన్‌ల వంశక్రమం అంతరించింది (చూ. వివరణ 183).

67

బహాజనులకు . . . మరలింపబడును. ¶42

విశ్వన్యాయ మందిర సంస్థాపనకు మునుపే అఘ్సాన్ వంశక్రమం అంతరించే అవకాశాన్ని బహాఉల్లా ఊహించాడు. అటువంటి పరిస్థితిలో “ధర్మాదాయాలు బహాజనులకు మరలింపబడు” నని ఆయన నిర్ధారించాడు. “బహాజనులు” అను పదము బహాయి పవిత్ర రచనలలో విభిన్నభావాలతో అనేక పర్యాయాలు ఉపయోగించబడింది. ఈ సందర్భంలో బహాజనులు “ఆయన యాజ్ఞతో గాని మాట్లాడని వారు” గా, “దేవుడి ఫలకము నందు నిర్దేశించబడిన దానిని యనుసరించి తప్ప వేరుగా తీర్మానించని వారు” గా వర్ణించబడ్డారు. 1957 లో షోఘిఎఫెండీ మరణానంతరం, 1963లో విశ్వన్యాయ మందిరం ఎన్నికయ్యేంతవరకు, భగవంతుని దివ్యధర్మవ్యవహారాలకు దివ్యధర్మహస్తములు మార్గదర్శకత్వాన్ని వహించారు (చూ. వివరణ 183).

68

మీ శిరములకు సంపూర్ణ ముండన మొనరింపవలదు. ¶44

శిరోముండనము కొన్ని మతాలలో వాంఛనీయ సాంప్రదాయం. అయితే, బహాఉల్లా శిరోముండనాన్ని నిషేధించాడు; కాగా కితాబ్-ఎ-అఖ్దస్‌లోని ఈ దివ్యప్రవచనం, సురీహ్-ఇ-హజ్ అనే ఫలకంలో షిరాజ్‌లోని పావనగృహ సందర్శన నిమిత్తమై శిరోముండనాన్ని చేయించుకోవలెననన్న నియమాన్ని రద్దు చేసినట్లైంది.

69

కేశములను కర్ణసీమలను మించి పెరగనీయుట యుక్తము కాదు. ¶44

కర్ణసీమలను దాటే విధంగా కేశాలను పెంచరాదన్న శాసనం కేవలం పురుషులకు మాత్రమే వర్తిస్తుందని షోఘి ఎఫెండీ వివరించాడు. ఈ శాసనాన్ని అమలు పరచడం గుఱించి విశ్వన్యాయమందిరం వివరణను ఇవ్వవలసి ఉంటుంది.

70

చోరునికి ప్రవాసమును, కారాగారవాసమును శిక్షగా నిర్ణయింప బడినవి. ¶45

నేరతీవ్రతననుసరించి శిక్షలను, జరిమానాలను, నిర్ణయించవలసిన అధికారం న్యాయమందిరమునకు ఉంటుందని బహాఉల్లా వివరించాడు (చూ. ప్ర.-జ. 49). చౌర్యానికి విధింపబడిన శిక్షలు, భావిసమాజ పరిస్థితి దృష్ట్యా నిర్దేశింపబడినాయి. భవిష్యత్తులో విశ్వన్యాయ మందిరము వాటిని పూరించి అమలు చేస్తుంది.

71

నేరము మూడవమారు పునరావృతమయ్యెనేని, భగవంతుని నగరములలోనికిని, ఆయన రాజ్యముల లోనికిని అనుమతింప బడకుండునటుల, ఆతని నుదుటిపై నొక ముద్రను వేయుడు. ¶45

తస్కరుని నుదుటిపై ఒక చిహ్నాన్ని ముద్రించడం ద్వారా, ప్రజలకు అతని వ్యక్తిత్వాన్ని వ్యక్తపర్చడమే దీని ఉద్దేశ్యం. అటువంటి ముద్ర స్వభావం, దానిని ఎలా ముద్రించాలి, ఎంత కాలం పాటు అత డాముద్రను భరించాలి, ముద్రను తొలగించడానికి అనుకూలించే పరిస్థితులు, చౌర్యపు తీవ్రతకు సంబం ధించిన వివిధ స్థాయిలు మొ. అంశాలను విశ్వన్యాయమందిరము వారు నిర్దేశించగలరు.

72

ఎవ్వరైనను సువర్ణ, రజత పాత్రముల నుపయోగింప నెంచినచో స్వేచ్ఛగా వాడుకొనవచ్చును. ¶46

వెండితోను, బంగారంతోను చేయబడిన వంటపాత్రల ఉపయోగాన్ని బయాన్‌లో అనుమతిస్తూ, మత పరంగా వీటి వినియోగంపై గల నిషేధం ఖురాన్ ద్వారా వచ్చిన విస్పష్టాదేశం కాదని, కేవలం ముస్లిమ్ సాంప్రదాయజనితమని త్రోసిపుచ్చాడు బాబ్. ఆయన గావించిన ఈ నిబంధనను బహాఉల్లా ఆమోదించాడు.

73

నలుగురితోకూడి ఆహారస్వీకరణము గావించునపుడు పాత్రముల, పళ్లెరముల యందలి పదార్ధముల లోనికి చేతులను జొప్పింతురేమో, జాగరూకులు కండు. ¶46

షోఘి ఎఫెండీ ఈ నిషేధాన్ని “ఆహారంలో చేతులు జొప్పించుట” అని నిర్వచించాడు. ప్రపంచంలోని అనేక దేశాలలో - అనేకమంది కలిసి ఒకే పాత్రలో ఆహారాన్ని వడ్డించుకుని, చేతులతో తినే ఆనవాయితీ ఉన్నది.

74

అత్యంత పరిశుభ్రతకనువగుతీరుల నవలంబింపుడు. ¶46

నైర్మల్యం, పరిశుభ్రతల ప్రాముఖ్యాన్ని ప్రస్తావించే అనేక గ్రంథభాగాలలో ఇది ప్రథానమైనది. అరబ్బీ మూలపదం ‘అతాఫా’ కు - యిక్కడ ఇవ్వబడిన “నైర్మల్యం” అనే అర్ధమే గాక, మనోజ్ఞం, సౌందర్యం, పరిశుభ్రత, నాగరికత, విధేయత, సౌమ్యత, సున్నితం, ఔదార్యం అనే అర్థాలతోపాటుగా చమత్కృతి, పరిశుద్ధం, పావనం, పవిత్రం అనే విస్తృత భావార్ధశ్రేణి ఉన్నది. కితాబ్-ఎ-అఖ్దస్ లో ఈ పదం, సంద ర్భోచితంగా “నైర్మల్యము” లేదా “పరిశుభ్రత” గా అనువదించబడినది.

75

భగవంతుని దివ్యధర్మపు టుషోదయోత్పన్న స్థానమగు ఆయనకు భాగస్థుడెవ్వడును లేడు. ¶47

ఇష్రాఖత్ అనే దివ్యఫలకంలో బహాఉల్లా పరమోన్నత నిష్కళంకత్వము, భగవంతుని దివ్యావతారాల వశమై ఉన్నదని నిర్ధారించాడు.

సమ్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ అనే గ్రంథంలోని 45వ అధ్యాయం, కితాబ్-ఎ-అఖ్దస్‌లో ఈ దివ్యప్రవచనానికి అబ్దుల్-బహా ఇచ్చిన వివరణకై వినియోగించబడినది. ఆయన ఈ అధ్యాయంలో ఇతర విషయాలతో పాటు, భగవంతుని దివ్యావతారాలలో నిష్కళంకత్వపు విశేష అవిభాజ్యతను ప్రస్ఫుటంగా ప్రస్తావిస్తూ “వారి నుండి వెలువడునదేదైనను సత్యస్వరూపమూ, యదార్ధానుసరణీయమూ” నని, “వారు పూర్వశాసనముల ఛాయలక్రింద ఉండ” రనీ, అంతే కాక, “వా రేది నుడివిను అది దైవవాక్కేననియు, వా రేదొనర్చినను అది ధార్మిక ప్రక్రియయే” ననీ వివరించాడు.

76

పఠన, లేఖన కళను . . . తన కుమారునికిని, కుమార్తెకును నేర్పింపవలసిన బాధ్యత ప్రతి తండ్రి కిని విధియింపబడినది. ¶48

అబ్దుల్-బహా తన ఫలకాలలో బాలల విద్య అన్నది కేవలం తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల వహించవలసిన బాధ్యతే కాక, బాలికలే రేపటి మాతృమూర్తులు, ఆ తల్లులే నూతనతరానికి ఆదిగురువు లౌతారు కనుక “విద్యా, సంస్కారాలు కుమారులకన్న కుమార్తెలకే అత్యవసర” మని విస్పష్టంగా సూచించాడు. అందుకే ఏ కుటుంబానికైనా పిల్లలందరినీ చదివించడం వీలుకాకపోతే, బాలికల విద్యకే ప్రాధాన్యత నివ్వాలి. ఎందుకంటే, విద్యావతులైన తల్లులవల్ల విజ్ఞాన ఫలాలు అత్యంత ప్రభావంతో, త్వరితగతిన సమాజమంతటా విస్తరిస్తాయి.

77

ప్రతి జారుడును, జారిణియును న్యాయమందిరమునకు చెల్లింపవలసిన అపరాధ రుసుమును . . . తొమ్మిది మిష్కల్‌ల సువర్ణముగా భగవంతుడు నిర్దేశించినాడు. ¶49

ఇక్కడ “జారత్వము” గా అనువదింపబడినా, ఆయన ఫలకాలలో విస్పష్టార్థంలో, వివాహితుల లేదా అవివాహితుల మధ్య అక్రమ లైంగిక సమాగమాన్ని సూచిస్తుంది. (ఈ పదం యొక్క నిర్వచనానికై చూ. వివరణ 36). అవివాహితులమధ్య లైంగిక సంపర్కము జరిగినట్లైతే, అటువంటి వ్యక్తులకు ఇక్కడ విధించబడిన శిక్ష వర్తిస్తుందని అబ్దుల్-బహా వివరించాడు. వివాహితుడు లేదా వివాహితురాలు చేసే వ్యభిచారానికి తగిన అపరాధ శుల్కాన్ని నిర్ణయించే అధికారం విశ్వన్యాయమందిరము వారికి ఉన్నదని కూడా సూచించాడాయన (చూ. ప్ర.-జ. 49).

ఒకానొక ఫలకంలో అబ్దుల్-బహా - నైతిక శాసనోల్లంఘనానికీ, అదే విధంగా ఇక్కడ వివరింపబడిన ఈ అపరాధశుల్కానికీ సంబంధించిన ఆధ్యాత్మిక, సామాజిక అనువర్తనలను పేర్కొన్నాడు. నేరాన్ని నిరూపించి, అపరాధశుల్కాన్ని విధించి, దోషులను బహిర్గతపరచి, ఇటువంటి దుష్కృత్యం భగవంతుని దృష్టిలో లజ్జాకరమని - తద్వారా వారు సమాజం దృష్టిలో అవమానానికి, తలవంపులకు గురౌతారని - అందరకు స్పష్టపరచటమే ఈ శాసనోద్దేశ్యమని ఆయన సూచించాడు. అలా బహిర్గతం చేయబడటమే కఠినశిక్ష అని ఆయన నొక్కిచెప్పాడు.

ఈ దివ్యప్రవచనంలో ప్రస్తావితమైన న్యాయమందిరం బహుశః ఇప్పుడు స్థానిక ఆధ్యాత్మిక సభగా వ్యవహృతమౌతున్న స్థానిక న్యాయ మందిరమే అయి ఉండాలి.

78

తొమ్మిది మిష్కల్‌ల సువర్ణము . . . వారా నేరమును పునరావృత మొనరించిరేని అది రెండింత లగును. ¶49

మిష్కల్ అనేది బరువుకు సంబంధించిన ప్రమాణం. మధ్య ప్రాచ్యంలో చెలామణిలో ఉన్న మిష్కల్, 24 నాఖుద్ లకు సమానం. అయితే బహాయిలు వ్యవహరించే మిష్కల్ మాత్రం “బయాన్ నిర్దేశాన్ని అనుసరించి” (చూ. ప్ర.-జ. 23) 19 నాఖుద్‌లకు సమానము. ఇటువంటి 9 మిష్కల్‌ల బంగారం యొక్క బరువు 32.775 గ్రాములకు లేదా 1.05374 ఔన్సులకు సమానం.

అపరాధ శుల్కాన్ని అనువర్తింపచేయడానికి సంబంధించి బహాఉల్లా విస్పష్టమైన వివరణ నిస్తూ, తదుపరి నేరాలకు విధించే ప్రతి అపరాధశుల్కము, మొదట విధింపబడిన దానికి రెట్టిం పవుతుం దన్నాడు (చూ. ప్ర.-జ. 23). అలా విధింపబడే అపరాధ శుల్కము గుణోత్తర శ్రేఢిలో హెచ్చుతుంది. ఈ అపరాధశుల్కపు విధింపు భావి సమాజ పరిస్థితికై ఉద్దేశించబడింది. అప్పుడు విశ్వన్యాయ మందిరము వారిచే ఈ శాసనశేషం పూరింపబడి అమలు చేయబడుతుంది.

79

సంగీతశ్రవణమును, గానమును మీకు శాసనబద్ధము గావించినాము. ¶51

“కొన్ని ప్రాచ్యదేశముల యందున సంగీతము నిందార్హమైనదిగా గణియింప బడిన” దని అబ్దుల్-బహా వ్రాశాడు. ఈ విషయంపై ఖురాన్‌లో ఎటువంటి మార్గదర్శనమూ లేకపోయినా, కొందరు మహమ్మ దీయులు సంగీతశ్రవణాన్ని శాసనవిరుద్ధంగా పరిగణిస్తున్నారు. మరికొందరు కొన్ని పరిమితులకు, ప్రత్యేక నియమాలకు లోబడి సంగీతాన్ని సహిస్తున్నారు.

బహాయి రచనలలో సంగీతాన్ని సంకీర్తించే గ్రంథభాగాలనేకం ఉన్నాయి. ఉదాహరణకు “గాత్రజనిత మైనను, వాద్యజనితమైనను సంగీతమేదైనను ఆత్మకును, మనస్సునకును ఆహారము వంటి” దని అబ్దుల్-బహా నొక్కిచెప్పాడు.

80

ఓ న్యాయ పురుషులారా ! ¶52

విశ్వన్యాయమందిర సభ్యత్వము పురుషులకు మాత్రమే పరిమితం చేయబడి యుండగా, ద్వితీయశ్రేణి న్యాయమందిరముల (ఇవి ప్రస్తుతం జాతీయ, స్థానిక ఆధ్యాత్మిక సభలుగా పేర్కొనబడుచున్నవి) సభ్యత్వానికి స్త్రీ, పురుషు లిరువురికీ అర్హత ఉన్నదని అబ్దుల్-బహా, షోఘి ఎఫెండీల రచనలు వివరిస్తున్నాయి.

81

ఒకనిని గాయపరచినందుకు లేక కొట్టినందుకు విధియింపబడు అపరాధశుల్కము గాయపు తీవ్రతపై నాధారపడియుండును; ఏలయన దివ్యన్యాయాధీశుడు ప్రతి స్థాయికిని, విశేష పరిహారమును సూచించినాడు. ¶56

గాయపడినవానికి చెల్లింపవలసిన అపరాధశుల్కపు పరిమితి, అతని “గాయపు తీవ్రత” పై ఆధారపడి ఉంటుందని బహాఉల్లా వివరించాడు; అయినా ఆ పరిమితులను గాని, నష్టపరిహార పరిమాణాలను గాని, ఆయన ఎక్కడా వ్రాసిపెట్టినట్టు లేదు. వీటిని నిర్ణయించే బాధ్యత విశ్వన్యాయ మందిరము వారికి సంక్రమింపచేయబడింది.

82

మాసమునకొక్క పర్యాయము విందును గావించుట . . . నిశ్చయముగ మీకు విధియింపబడినది. ¶57

బహాయి మాసోత్సవాలకూ, 19వ రోజు విందు నియమానికీ ప్రాతిపదిక ఈ ఆదేశమే. అరబ్బీ బయాన్‌లో బాబ్ - ప్రతి పంధొమ్మిది రోజులకొకసారి ఒకచోట సమావేశమై అతిధిసత్కారం గావించాలని, సౌహార్ద్రంతో మెలగాలని తన అనుయాయులకు ఆదేశించాడు. బహాఉల్లా దీనిని ఆమోదించి, సమైక్యతకు దోహదం చేసే ఇటువంటి సందర్భాల పాత్రను ఇక్కడ గుర్తించాడు.

ఆయన అనంతరం అబ్దుల్-బహా, షోఘీ ఎఫెండీలు వ్యవస్థాత్మకంగా ఈ ఆదేశానికి గల ప్రాధాన్యతను విశదీకరించారు. ఈ సమావేశాల ఆధ్యాత్మిక లక్షణాలను అబ్దుల్-బహా ఎంతగానో నొక్కిచెప్పాడు. షోఘి ఎఫెండీ ఈ విందుకు సంబంధించిన ఆధ్యాత్మిక, సామాజిక అంశాలను విస్తృతంగా వివరించడంతోపాటు, ఈ సమావేశాలకు గల పాలనాస్వభావాన్ని ప్రవృద్ధం గావించి, విందులను క్రమరీతిలో వ్యవస్థీకరించి, బహాయి సమాజ వ్యవహారాలపై సమాచారాలు, సందేశాలతో పాటుగా సంప్రదింపులకు కూడా వాటిలో అవకాశాన్ని ఏర్పరిచాడు. ఈ ఆజ్ఞ అనివార్యమా అన్న ప్రశ్నకు బదు లిస్తూ, అనివార్యం కాదన్నాడు (చూ. ప్ర.-జ. 48) బహాఉల్లా. తన తరఫున వ్రాయబడిన ఒక లేఖలో షోఘీ ఎఫెండీ యింకా యిలా అన్నాడు:

19వ రోజు విందు సమారాధనలకు హాజరు కావడం అనివార్యం కాదు కాని అతి ముఖ్యం; అటువంటి సమావేశములకు హాజరు కావడం తన బాధ్యతగా, సదవకాశంగా ప్రతి విశ్వాసి భావించాలి.

83

మీరు ఆహారయోగ్యములగు మృగములనో, పక్షులనో వేటాడవలసి వచ్చెనేని, వానిని వెన్నంటు నపుడు భగవన్నామమును స్మరియింపవలె; ఏలయన, అటుపై పట్టుబడినదేదైనను - అది విగతజీవిగ దొరికినను సరియే - మీకు ఆమోదనీయమే యగును. ¶60

ఈ శాసనం ద్వారా, వేటకు సంబంధించిన పూర్వమతసాంప్రదాయాలవిధి విధానాలను సులభతరం గావించాడు బహాఉల్లా. వేటకు ఉపకరించే ధనుర్బాణాలు, తుపాకులు వంటి ఆయుధాలు ఈ ఆజ్ఞప్రకారం సయుక్తములు గావింపబడ్డాయని, అయితే, అంతకు మునుపే వలలలో, బోనులలోబడి మృతి చెందిన వాని మాంసాన్ని ఆరగించడం నిషిద్ధమని కూడా ఆయన పేర్కొన్నాడు (చూ. ప్ర.-జ. 24).

84

మితిమీరి వేటాడతగదని ¶60

వేటాడటాన్ని బహాఉల్లా నిషేధించకపోయినా, అవసరానికి మించి వేటాడవద్దని హెచ్చరించాడు. కాలక్రమంలో విశ్వన్యాయమందిరం, ‘మితిమీరి వేటాడట’ మంటే ఏమిటో నిర్ధారిస్తుంది.

85

కాని అన్యుల యాస్తిపై వారికెట్టి హక్కును ఆయన యనుగ్రహింప లేదు. ¶61

బంధువర్గం పట్ల వితరణ చూపాలన్న బహాఉల్లా ఆదేశం, పరుల ఆస్తిపై వారికి (బంధువులకు) ఎటువంటి హక్కును సంక్రమింపచేయదు. మహమ్మదు ప్రవక్త వంశస్థులైన వారసులకు, సుంకములలో కొంత భాగానికి హక్కును కల్పించబడిన షియా ముస్లిం ఆచారానికి ఇది విరుద్ధమైనది.

86

ఎవ్వడైనను ఉద్దేశ్యపూర్వకముగ నొక గృహమును అగ్నికి ఆహుతి గావించెనేని, మీరును వాని నట్లే దహియింపుడు; బుద్ధిపూర్వకముగ నెవ్వడైనను యింకొకని ప్రాణమును తీసెనేని మీరును వానిని పరిమార్పుడు. ¶62

హత్యకు, గృహదహనానికి మరణశిక్షను కాని, దాని స్థానంలో ఆజన్మ కారాగారవాసాన్ని కాని విధించవచ్చునని బహాఉల్లా సూచించాడు (చూ. వివరణ 87).

కక్షకు, శిక్షకు గల భేదాన్ని అబ్దుల్-బహా తన ఫలకాలలో వివరించాడు. ప్రతీకారం తీర్చుకునే హక్కు వ్యక్తులకు లేదని, ప్రతీకారం భగవంతుని దృష్టిలో నీచమైనదని, శాసనబద్ధమైన దండన ఉద్దేశ్యం చేసిన నేరానికి పగతీర్చుకోవడం కాదని, చేసిన నేరానికి అపరాధశుల్కాన్ని విధించడం ఉంటుందని ధృవీకరించాడాయన. సమాజ సభ్యులను, సమాజపు మనుగడను కాపాడేందుకై నేరస్తులను శిక్షించే హక్కు సమాజానికి ఉంటుందని సమ్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ లో ఆయన నిర్ధారణగా పేర్కొన్నాడు.

ఈ ఏర్పాటుకు సంబంధించి, షోఘి ఎఫెండీ, తన తరఫున వ్రాయబడిన లేఖలో ఇలా వివరణ నిచ్చాడు :

అఖ్దస్‌లో బహాఉల్లా నరహత్యకు మరణ దండన విధించాడు. అయినప్పటికీ, దానికి ప్రత్యామ్నాయంగా జీవితఖైదును కూడా అనుమ తించాడు. ఈ రెండింటి ఆచరణము ఆయన శాసనాన్ని అనుసరించే జరుగుతుంది. మన పరిమిత పరిజ్ఞానానికందనపుడు, మనలో కొందరం, దీని వివేకాన్ని అవగాహన చేసుకోలేక పోవచ్చు; కాని ఈ సమస్త ప్రపం చానికి ముక్తిప్రదాయకాలైన ఆయన వివేకము, ఆయన కారుణ్యము, ఆయన న్యాయములు పరిపూర్ణములని తెలిసిన మనం దానిని సమ్మతించవలె. ఏ మానవుడైనా పొరపాటున మరణానికి గురికావించబడితే, సర్వశక్తివంతుడైన దేవుడు అనంతర ప్రపంచంలో, ఈ మానవ తప్పిదానికి, వేనవేల ప్రతిఫలాలనొసగునని విశ్వసింపలేమా? కేవలం ఎంతో అరుదైన సందర్భాలలో అమాయకులు శిక్షింపబడతారన్న నెపంతో శ్రేయస్కరములైన శాసనాలను విడనాడలేము.

భావి సమాజపు స్థితికై నిర్దేశింపబడిన బహాయి శిక్షా శాసనంలో నరహత్య, గృహదహన నేరాలకు విధింపబడే శిక్షల వివరాలను బహాఉల్లా పేర్కొనలేదు. నేర సమవస్థ, పరిహారం చేయదగిన పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవచ్చునా, నిర్దేశింపబడిన రెండు శిక్షలలో ఏది సమంజసం వంటి వివిధ వివరాలను, పరిస్థితుల ప్రాబల్యాన్ని బట్టి, శాసనాలు చేయవలసివచ్చినప్పుడు, విశ్వన్యాయ మందిరము వారు నిర్ణయిస్తారు. శిక్షను ఏ విధంగా నిర్వహించాలన్నది కూడా విశ్వన్యాయమందిర నిర్ణయానికే వదలివేయబడింది.

ఇక గృహదహనానికి సంబంధించి : అది - దగ్థం గావించబడిన గృహం ఏది అనే అంశంపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ఖాళీగా ఉన్న గిడ్డంగిని తగబెట్టడానికీ, బాలబాలికలతో నిండిఉన్న పాఠశాలను తగలబెట్టడానికీ మధ్య - నేరతీవ్రత పరంగా - నిస్సందేహంగా, ఎంతో వ్యత్యాసం ఉంటుంది.

87

గృహదగ్ధ కారకునకును, హంతకునకును ఆజన్మ కారావాసమును మీరు విధియించినచో నది దివ్యగ్రంథ నియమముల ప్రకార మామోదనీయమే. ¶62

అఖ్దస్‌లోని ఈ దివ్యప్రవచనం గురించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా షోఘి ఎఫెండీ, మరణదండన అనుమతించబడినప్పటికీ, “దండన తీవ్రతను తగ్గించటానికి” దాని స్థానంలో “ఆజన్మకారాగారశిక్ష” విధించబడిందని ధృవీకరించాడు. “మన వివేచన నుపయోగించి, తన శాసనం విధించిన పరిమితులకు లోబడి వీటిలో దేనినైనా నిర్వర్తించే అవకాశాన్ని బహాఉల్లా మనకిచ్చా” డనికూడా ఆయన వివరించాడు. ఇందుకు సంబంధించిన బహాయి శాసనాన్ని అమలు చేయటానికి విశేష మార్గదర్శనం లేనప్పుడు భవిష్యత్తులో ఈ విషయంలో విశ్వన్యాయమందిరం శాసనం చేయవలసి ఉంటుంది.

88

పరమేశ్వరుడు మీకు వివాహమును నిర్దేశించినాడు. ¶62

భగవంతుడు ఈ శాసనమును స్థాపించి, దీనిని “సంక్షేమ మోక్షాలకు దుర్గంగా చేశా” డని తన దివ్యఫలకాలలో ఒకదానిలో బహాఉల్లా వివరించాడు.

వివాహానికి, వివాహానికి అనుమతింపదగిన పరిస్థితుల గురించి సారసంగ్రహము - క్రోడీకరణము లోని పరిచ్ఛేదము 4. ఇ. 1. అ.-అం. , కితాబ్-ఎ-అఖ్దస్ లోని నియమాలను సంక్షిప్త పరుస్తుంది. ఇంకా ప్రశ్నలు - జవాబులు (చూ. ప్ర.-జ. 3, 13, 46, 50, 84, 92) లోను, వివాహ నిశ్చితార్థ శాసనము (చూ. ప్ర.-జ. 43) లోను, భార్య లేదా భర్త సుదీర్ఘకాలం పాటు అగుపించని పక్షంలో పాటించవలసిన విధానం (చూ. ప్ర.-జ. 4, 27) లోను, ఇంకా వివిధ ఇతర పరిస్థితులలోను (చూ. ప్ర.-జ. 12, 47) (ఇంకా చూ. వివరణలు 89-99) కూడా గమనించవచ్చు.

89

ఇరువురుకన్న ఎక్కువమంది భార్యలను వివాహమాడుదురేమో, జాగ్రత్త. ఎవ్వడైనను భగవంతుని పరిచారికలయం దొక్కరిని జీవితభాగస్వామిగా పరిగ్రహించి సంతుష్టి నొందెనేని ఆతడు, ఆమె - యిరువురును సామరస్యముతో జీవింతురు. ¶63

కితాబ్-ఎ-అఖ్దస్ ద్విభార్యత్వాన్ని అనుమతించినా, ఏకపత్నీత్వం వల్లనే సంతుష్టీ, సామరస్యమూ ఒనగూడుతాయని బహాఉల్లా ఉద్బోధిస్తున్నాడు. మరో దివ్యఫలకంలో: “తనకు తన భాగస్వామికి సౌఖ్యమును కలిగించు” రీతిన వ్యక్తి వ్యవహరించ వలసిన ఆవశ్యకతను నొక్కిచెప్పా డాయన. కితాబ్-ఎ-అఖ్దస్ లో ఏకపత్నీత్వమే విధించ బడిందని బహాయి పవిత్ర రచనలకు అధీకృత వ్యాఖ్యాత అయిన అబ్దుల్-బహా వివరించాడు. ఈ ఫలకంతో సహా మరెన్నో ఫలకాలలో ఆయన ఈ అంశాన్ని వివరించాడు :

ఒకే అర్ధాంగితో తృప్తినొందుట స్పష్టంగా ఏర్పరచడమైనది కాన భగవంతుని శాసనందృష్ట్యా బహుభార్యాత్వము అనుమతింపబడలేదని మీరు గ్రహించండి. ద్వితీయార్ధ్దాంగిని స్వీకరించడమన్నది యిరువురు భార్యలకు సర్వావస్థల యందునను సమముగా సమతా న్యాయములను అందించు అంశముపై ఆధారపడి యుండును. భార్యలిరువురకు సమానన్యాయుమును, ధర్మమును నెరవేర్చుట ఖచ్చితముగా దుస్సాధ్యము. కావున బహుభార్యాత్వము నిషేధింప బడినదనుటకు స్పష్టమైన ఆధారం ఈ దుస్సాధ్య నియమమే. అందుకే ఒక పురుషునికి ఒకరికంటే అధికంగా భార్యలుండుట అనుమతింపబడలేదు.

బహు భార్యాత్వమన్నది మానవసమాజంలో ఎక్కువగా పాటింపబడుతున్న అత్యంత పురాతనాచారం. భగవంతుని దివ్యావతారమూర్తులు, క్రమేపీ ఏకపత్నీత్వాన్ని ప్రవేశపెట్టి సాధించారు. ఉదాహరణకు : ఏసుక్రీస్తు - బహుభార్యత్వాన్ని నిషేధించలేదు, కాని - వ్యభిచరించిన పక్షంలో తప్ప - విడాకులను రద్దుపరిచాడు. మహమ్మద్ - పత్నుల సంఖ్యను నాలుగుకు పరిమితం చేసినా బహు భార్యాత్వ నియమాన్ని న్యాయసంభావ్యత ఆధారంగా చేశాడు; అంతేకాక విడాకులను పునఃప్రవేశపెట్టి అనుమతించాడు; బహాఉల్లా - ముస్లిం సమాజంలో ఉంటూనే, దినదినాభివృద్ధి చెందుతున్న తన సంకల్పావిష్కరణను, తన వివేక సిద్ధాంతాలను అనుసరించి, క్రమేపీ ఏకపత్నీత్వాన్ని ప్రతిపాదించాడు. ఆయన వాస్తవానికి, తన అనుయాయులకు తన దివ్యరచనల అర్థాన్ని వివరించేందుకై నిష్కళంక వ్యాఖ్యాతను ప్రసాదించి, కితాబ్-ఎ-అఖ్దస్‌లో బాహ్యంగా ఇరువురు భార్యలను గైకొనడానికి అనుమతిని ఇచ్చినప్పటికీ, అందుకు వర్తించే నియమాల దృష్ట్యా, ఈ శాసనపరమార్థం ఏకపత్నీత్వమేనని విశదీకరిం చేందుకు అబ్దుల్-బహాకు వీలు కలిగింది.

90

తన సేవకై యొక సేవికను గైకొను నాతడు సముచితరీతిన వర్తింపవలె. ¶63

ఇంటిపనులకై పురుషుడు ఒక సేవికను నియమించుకొనవచ్చునని బహాఉల్లా సెలవిచ్చాడు. షియా ముస్లిం సంప్రదాయం ప్రకారం ఇది ఆమెతో వైవాహిక ఒప్పందం కుదుర్చుకుంటే తప్ప వీలయ్యేది కాదు. “ఏ యితర భృత్యవర్గమైనను - యువతిగాని, వృద్ధురాలు గాని - వేతన లేదా వస్తువినిమయముగ చేయునట్టిదే” నని “సేవ” ను ఉగ్గడిస్తూ బహాఉల్లా ఈ ప్రవచనంలో సూచించాడు. (చూ. ప్ర.-జ. 30). తన సేవికపై యజమానికి ఎటువంటి లైంగికపరమైన అధికారాలు లేవు. స్త్రీని కొనుగోలు చేయడం నిషిద్ధం (చూ. ప్ర.-జ. 30) కనుక, ఆమె “తన యిచ్చ వచ్చినపుడు తనకొక భర్త నెంచుకొనవచ్చును”.

91

మీకిది నాయానతి; మీకు సహాయకారియగుటకై దీనిని స్థైర్యముతో పాలింపుడు. ¶63

కితాబ్-ఎ-అఖ్దస్ నందు వివాహం విధించబడినప్పటికీ, అది అనివార్యం కాదని బహాఉల్లా స్పష్టీకరించాడు (చూ. ప్ర.-జ. 46). షోఘి ఎఫెండీ కూడా, తన తరఫున వ్రాయబడిన ఒక లేఖలో, “వివాహం ఏ విధంగాను అనివార్యము కా” దని ప్రకటించి, “వైవాహిక జీవితం నెరపుటయా, బ్రహ్మచర్యము నవలంబించుటయా అన్నది ఆయా వ్యక్తులు నిర్ణయించుకోవలసిన అంశం” అని కూడా ధృవీకరించాడు. ఎవరైనా తన భాగస్వామిని ఎంచుకునేందుకై సుదీర్ఘకాలం వేచి ఉండవలసి రావడం, లేదా చివరికి ఒంటరిగానే ఉండిపోవడం సంభవిస్తే, దాని అర్ధం - ఆతను తన ఆధ్యాత్మిక జీవన పరమార్ధాన్ని పరిపూర్తిచేయలేకపోయాడని కాదు.

92

అది వారి జననీజనకుల సమ్మతిన జరుగవలెనని మేము నియమబద్ధము గావించినాము. ¶65

తన తరఫున వ్రాయబడిన ఒక లేఖలో, షోఘి ఎఫెండీ ఈ శాసననియమం గురించి యిలా వ్యాఖ్యానించాడు :

జీవించియున్న తల్లిదండ్రుల సమ్మతి బహాయి వివాహానికి అత్యవసరమని బహాఉల్లా వెల్లడిపచాడు. తల్లిదండ్రులు బహాయిలైనా, బహాయేతరులైనా, విడాకులు తీసుకున్నా, తీసుకొనకపోయినా ఈ నియమం వర్తిస్తుంది. సమాజపు కట్టుబాట్లకు, కుటుంబంలో అనుబంధాలను పటిష్టపరచడానికి, తమకు జన్మ నిచ్చి, తమ ఆత్మలను సృష్టికర్త వైపుకు అనంతయానానికి పురికొల్పిన తల్లిదండ్రుల యెడ పిల్లలు కృతజ్ఞతాభావాన్ని ప్రదర్శిం చేందుకూగాను ఈ మహాశాసనాన్ని రూపొందించా డాయన.

93

వివాహశుల్క సమర్పణ లేకుండ ఏ వివాహమును కుదర్పబడరాదు ¶66

సారసంగ్రహము - క్రోడీకరణము లోని పరిచ్ఛేదము 4. ఇ. 1. ఏ. 1-5 వరకు గల అంశాలు వివాహ శుల్కమునకు సంబంధించిన ఏర్పాట్ల గురించి వివరిస్తాయి. బయాన్‌లో ఈ ఏర్పాట్లు ఇంతపు పూర్వమే పేర్కొనబడినాయి.

వరుడు వధువుకు వివాహ శుల్కాన్ని సమర్పించాలి. ఈ శుల్కం నగరవాసులకు 19 మిష్కల్‌ల బంగారం గాను, గ్రామవాసులకు 19 మిష్కల్‌ల వెండి గాను నిర్ణయించబడింది (చూ. వివరణ 94). వివాహ సమయంలో వరుడు పూర్తి శుల్కాన్ని చెల్లించే స్థితిలో లేనపుడు వధువుకు ఒక వాగ్దాన పత్రాన్ని వ్రాసి యివ్వవచ్చునని బహాఉల్లా సూచించాడు (చూ. ప్ర.-జ. 39).

బహాఉల్లా ఆవిష్కరణతో - ఎన్నో భావాలు, సాంప్రదాయాలు, వ్యవస్థలు పునర్నిర్వచింప బడ్డాయి, కొంగ్రొత్త అర్థాలు ఇవ్వబడ్డాయి. వాటిలో వివాహశుల్కం ఒకటి. ఈ వ్యవస్థ అతి ప్రాచీనమైనది, బహురూపములు గలది. కొన్ని దేశాలలో ఇది - వధువు తల్లిదండ్రులు వరునికి ఇచ్చే “వరకట్నం”; కాగా, మరికొన్ని దేశాలలో వధువు తల్లిదండ్రులకు, వరుడు చెల్లించే “కన్యాశుల్కం”; ఈ రెండు సందర్భాలలోను చెల్లింపబడే సొమ్ము తరచూ ఎక్కువగానే ఉంటుంది. బహాఉల్లా అలాంటి వైరుధ్యాలను రూపుమాపి, దానినొక లాంఛనంగా, ఒక పరిమిత విలువను వరుడు - వధువుకు ఇచ్చే కానుకగా మార్పు చేశాడు.

94

నగరవాసులకు పంధొమ్మిది మిష్కల్‌ల స్వచ్ఛమైన సువర్ణముగను, గ్రామీణులకు అంతే పరిమాణముగల రజతముగను. ¶66

వివాహశుల్కపు చెల్లింపును నిర్ధారించటానికి ప్రామాణికంగా తీసుకోవలసింది వరుని శాశ్వత నివాస ప్రదేశమని, వధువుది కాదని బహాఉల్లా పేర్కొన్నాడు.

95

ఈ మొత్తము నెవ్వరేని పెంచనెంచిన, దానినాతడు తొంభైఐదు మిష్కల్‌ల పరిమితికి హెచ్చింప తగదు. . . అయినను, అత్యల్పస్థాయి చెల్లింపుతో సంతుష్టుడయ్యెనేని, దివ్యగ్రంథానుసార మది యాతనికి సముచితమే యగును. ¶66

వివాహశుల్కం గురించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా బహాఉల్లా యిలా ప్రవచించాడు :

నగరముల యందుననూ, గ్రామముల యందునను వసియించు వారి విషయమున, బయాన్ గ్రంథమునందు వెలువరించబడినదంతయును ఆమోదించబడినది. కావున దానిననుసరింపవలె. అయితే, కితాబ్-ఎ-అఖ్దస్ నందు కనిష్ఠస్థాయి ప్రస్తావితమైనది. బయాన్ గ్రంథమునందు గ్రామవాసులకు నిర్దేశింపబడినట్లు రజతమేనని దీని ఉద్దేశ్యము. ఇరుపక్షములును యిందుకు సమ్మతించినచో భగవంతునికి అత్యంతానందమగును. సమస్తప్రజల సౌఖ్యమును పెంపొందించి, వారి మధ్య ఐక్యత, ఒద్దికలను ఒనగూర్చుటయే దీని ఆశయం. కావుననే, ఈ విషయము నందెంత ఎక్కువ యోచించిన అంత యుచితము. బహా జనులు పరస్పరానురాగములను, నీతినిజాయితీలను కలిగి మెలగవలె. ప్రతియొక్కరి గౌరవమును, ప్రత్యేకించి దైవమిత్రుల ప్రయోజనములను దృష్టి యందుంచుకొన వలె.

తాను వెలువరించిన ఒకానొక ఫలకములో, అబ్దుల్-బహా వివాహశుల్కపు కనిష్ఠస్థాయి నిర్ధారణ గురించిన సముచిత విధానాలను సంక్షిప్త పరిచాడు. దిగువ ఉల్లేఖనములో ప్రస్తావించబడిన ఏకమాత్రపు చెల్లింపు “వాహెద్‌”. ఒక వాహెద్ 19 మిష్కల్ లకు సమానం. ఆయన యిలా అన్నాడు :

నగరవాసులు బంగారమును, గ్రామవాసులు రజతమును చెల్లింపవలె. అది వరుడు ఇవ్వగలిగే వనరులపై ఆధారపడి యుండును. అతను పేదవాడైన ఒక వాహెద్‌ను చెల్లిస్తాడు. ఒక మోస్తరు వనరులుంటే రెండు వాహెద్‌లు, సంపన్నుడైతే నాలుగు వాహెద్‌లు, మిక్కిలి సంపన్నుడైతే ఐదు వాహెద్‌లు చెల్లిస్తాడు. వాస్తవానికి ఈ విషయం, వధూవరులకు, అటులనే, వారి తల్లిదండ్రుల మధ్య కుదరవలసిన ఒప్పందము. చేసికొనిన యొడంబడిక యేదైనను దానిని నెరవేర్చుట సముచితము.

ఈ వివాహశుల్క విషయమైన ప్రశ్నలను శాసనాధికారం౎ గల విశ్వ న్యాయ మందిరము నకు విన్నవించుకోవాలని కూడా, ఈ ఫలకంలోనే విశ్వాసులకు సూచించాడు అబ్దుల్-బహా. “ద్వితీయ శ్రేణి అంశాలకు, గ్రంథములో లిఖిత పూర్వకంగా లేనట్టి ఇతర అంశములకు సంబంధించి శాసనములు చేయగల కూటమి ఇది” అని కూడా ఆయన ప్రస్ఫుటంగా పేర్కొన్నాడాయన.

96

తన సేవకులయం దెవడైనను ప్రయాణము చేయనెంచిన, ఆతడు తాను గృహమునకు తిరిగి వచ్చు సమయమును తన యర్ధాంగికి నిర్దుష్టముగ తెలుపవలె. ¶67

భర్త తాను తిరిగివచ్చే సమయాన్ని భార్యకు తెలియజెప్పకనే, ఇల్లు వీడి వెళ్లిపోతే భార్యకు అతని సమాచారం అందక, జాడ తెలియరానప్పుడు -- కితాబ్-ఎ-అఖ్దస్‌లో నిర్దేశింప బడిన ఈ శాసనం గురించి భర్తకు తెలిసిఉన్న పక్షంలో, భార్య ఒక సంవత్సర కాలం నిరీక్షించి, పునర్వివాహం చేసుకోవచ్చునని బహాఉల్లా సెలవిచ్చాడు. అయితే ఈ శాసనం గురించి భర్తకు తెలిసి ఉండని పక్షంలో, అతని జాడ తెలిసేంత వరకు భార్య నిరీక్షించాలి (చూ. ప్ర.-జ. 4).

97

. . . ఆమె నవమాసముల పర్యంతము నిరీక్షించుట యుక్తము; తదనంతర మామె పున ర్వివాహము చేసుకొనుట కెట్టి యవరోధమును ఉండబోదు. ¶67

భర్త నిర్ణీత సమయానికి తిరిగి రాకపోవడమో, లేదా ఆలస్యానికి కారణాన్ని భార్యకు తెలియపరచడంలో విఫలుడు కావడమో జరిగితే, నవమాసములు (అంటే తొమ్మిది నెలలు) నిరీక్షించి, ఆ పై పునర్వివాహం చేసుకోవడానికి - మరికొంత కాలంపాటు ఎదురు చూడటం సముచితమే అయినప్పటికీ - ఆ భార్య స్వతంత్రురాలు. (బహాయి పంచాంగం కొరకై చూ. వివరణ 147).

అలాంటి పరిస్థితులలో తన పతి మరణ లేదా హత్యాసమాచార ౎ మా భార్యకు అందిన సందర్భంలో , ఆమె పునర్వివాహమాడే ముందు, తొమ్మిది మాసాలపాటు నిరీక్షించాలని బహాఉల్లా వివరించాడు (చూ. ప్ర.-జ. 27). నవమాస నిరీక్షణాకాలం, భర్త తన గృహాన్ని వదిలివెళ్లి ఇంకెక్కడో మరణించినపుడే తప్ప, గృహంలోనే ఉండి మరణించినపుడు వర్తించదని అబ్దుల్-బహా ఒక ఫలకంలో మరింత స్పష్టంగా వివరించాడు.

98

శ్లాఘనీయవిధానమునామె యవలంబింపవలె. ¶67

“శ్లాఘనీయమైన విధానమనగా - ఓరిమిని వహియించుటయే” నని బహాఉల్లా నిర్వచించాడు (చూ. ప్ర.-జ. 4).

99

ధర్మపరులగు యిరువురు సాక్షులు ¶67

సాక్షులకు సంబంధించి, వారి నిజాయితీ నిరూపణకు ప్రజలలో వారికి గల గౌరవమును౎ ప్రాతిపదిక గావించాడు బహాఉల్లా. “భగవత్సేవకులు ఏ మతము వారైనను, తెగవారైనను వారి సాక్ష్యము ఆయన సింహాసనము ఎదుట అంగీకృతమే” కనుక సాక్షులు బహాయిలే అయి ఉండనవసరం లేదని బహాఉల్లా వివరించాడు (చూ. ప్ర.-జ. 79).

100

భార్యాభర్తల మధ్య రోషద్వేషములు తలయెత్తెనేని, యాతడామెకు విడాకులనివ్వక ఒక సంవత్సర కాలము ఓరిమిని వహియింపవలె ¶68

బహాయి బోధనలలో విడాకులు తీవ్రంగా గర్హింపబడ్డాయి. ఏమైనప్పటికీ, ఒక వేళ వైవాహిక పక్షాల మధ్య రోషద్వేషములు తలయెత్తితే, ఒక పూర్తి సంవత్సరకాల నిరీక్షణానంతరం విడాకులు అనుమతింపదగును. ఈ నిరీక్షణ కాలంలో భర్త, తన భార్యాపిల్లలకు ఆర్ధికపరమైన మద్దత్తును అందించాలి. అంతేకాక, భార్యాభర్తలిద్దరూ కూడా తమ మధ్యగల భేదాభిప్రాయాలను పరిష్కరించు కోవడానికి గట్టిగా ప్రయత్నించాలి. కలిసి కాపురం చేయడం దుస్సాధ్యమని, “విడాకులు తీసుకోక తప్ప” దని ఏ ఒక్కరు భావించినా, “విడాకుల నడగడానికి సమానహక్కు” భార్యాభర్త లిద్దరికీ ఉన్నదని షోఘి ఎఫెండీ వివరించాడు.

నిరీక్షణా సంవత్సరం, దాని అనుసరణ (చూ. ప్ర.-జ. 12), ఆ సంవత్సర ఆరంభ దిననిర్ధారణ (చూ. ప్ర.-జ. 19,40), రాజీ పడటానికి సంబంధించిన నియమాలు (చూ. ప్ర.-జ. 38), సాక్షుల పాత్ర, స్థానిక న్యాయమందిరం పాత్ర (చూ. ప్ర.-జ. 73, 98) వంటి వివిధ వివాదాంశాలను ప్రశ్నలు - జవాబులలో బహాఉల్లా విపులీకరించాడు. సాక్షులకు సంబంధించి - ప్రస్తుతం, విడాకుల వ్యాజ్యములలో స్థానిక ఆధ్యాత్మిక సభలే సాక్షుల పాత్రను నిర్వహిస్తాయని విశ్వన్యాయ మందిరము వారు స్పష్టీకరించారు.

విడాకులకు సంబంధించిన బహాయి నియమావళి వివరాలు సారసంగ్రహము - క్రోడీకరణము లోని పరిచ్ఛేదము 4. ఇ. 2 అ.-ఎ. లో క్లుప్తపరుపబడినవి.

101

మీరు ముమ్మారు పలికి స్త్రీకి విడాకులనిచ్చు పూర్వవిధానము నవలంబించుటను పరమాత్ముడు . . . నిషేధించినాడు. ¶68

ఇది : ఒక వ్యక్తి కొన్ని పరిస్థితుల దృష్ట్యా, తాను విడాకులిచ్చిన భార్యను పునర్వివాహ మాడటానికి - ఆమె వేరొకడిని వివాహమాడి విడాకులీయబడితే తప్ప - వీలుకాదని సూచించే ఖురాన్ గ్రంథంలోని ఇస్లాం శాసనానికి సంబంధించినది. ఇటువంటి ఆచరణ కితాబ్-ఎ-అఖ్దస్‌లో నిషిద్ధమని బహాఉల్లా నొక్కి చెప్పాడు (చూ. ప్ర.-జ. 31).

102

ఒక్కొక్క మాసము గడచుకొలది పరస్పరానురాగమును, అభీష్టమును ఒనగూడినపుడు, విడాకులిడినవాడు తన యర్ధాంగిని, ఆమె వేరెవ్వరినీ మనువాడియుండనిచో, పునరుద్వాహ మగుటకు నిర్ణయించుకొన వచ్చును. ఆమె మరల వివాహిత కాకపోయిన పక్షంలోనూ, ఆమె పరిస్థితి మారనట్లు స్పష్టమైతేనూ తప్ప ¶68

షోఘీ ఎఫెండి తన తరఫున వ్రాయబడిన ఒక లేఖలో వివరణను ఇస్తూ, “ఒక్కొక్క మాసము” అనడంలో ఉద్దేశ్యం కాలపరిమితిని సూచించడం కాదని, విడిపోయిన దంపతులు వారిలో ఏ ఒక్కరూ ఇతరులను వివాహమాడనంత వరకు, ఎప్పటికైనా పునర్వివాహానికి వీలున్నదని పేర్కొన్నాడు.

103

వీర్యము ఏహ్యకరమైనది కాదని ¶68

అనేక మత సాంప్రదాయాలలోను, షియా ముస్లిం మతాచారం గాను వీర్యం ఆచారపరంగా ఏహ్యకరమైనదిగా ప్రకటించబడింది. ఇక్కడ బహాఉల్లా, ఈ భావనను త్రోసిపుచ్చాడు. చూ. దిగువ వివరణ 106.

104

పారిశుధ్యపాశమును దృఢముగ చేబూనుడు ¶74

“స్వచ్ఛతా పవిత్రతల, పరిశుభ్రతా నిర్మలత్వముల” ప్రభావం “మానవస్థితి గొప్పతనము” “ఆంతరిక వాస్తవికతల” అభివృద్ధిపై ఎంతో ఉంటుందని అబ్దుల్-బహా సూచిస్తున్నాడు. “ నిర్మలమైన, మచ్చరహిత దేహము, మానవాత్మను ఎంతో ప్రభావితం చేస్తుం” దని కూడా ఆయన వ ర్ణించాడు (చూ. వివరణ 74).

105

మలినమైన ప్రతిదానిని, పేర్కొనబడిన మువ్విధములయందే విధముచేతను మార్పునొందని జలముతో ప్రక్షాళనమొనరింపుడు ¶74

ఈ ప్రవచనములో ప్రస్తావించిన “మువ్విధములు” - నీటి రంగు, రుచి, వాసనలను సూచిస్తుంది. అదే విధంగా స్వచ్ఛమైన జలం గురించీ, దానిని ఏ స్థాయిలో నిరుపయోగమైన జలంగా పరిగణించాలో, అందుకు సంబంధించిన అదనపు సమాచారాన్ని కూడా బహాఉల్లా అనుగ్రహించాడు (చూ. ప్ర.-జ. 91).

106

భగవంతుడు తన యౌదార్యసమక్షము నుండి వెలువడిన యనుగ్రహముగ, వివిధాంశములకును, జనులకును అశుచిని ఆపాదింపుచున్న “మలినత్వ” భావన నుద్వాసించినాడు.¶75

ఆచారకర్మలను అనుసరించే కొన్ని తెగలు, పూర్వమతాచారాలు పరిగణించిన “మలినత్వ” భావనను బహాఉల్లా త్రోసిపుచ్చాడు. తన దివ్యావిష్కరణముతో “సమస్త సృష్టియును విమలాంబుధి యందున స్నానమాడిన” దని ఉద్ఘోషించాడు (చూ. వివరణలు 12, 20, 103).

107

రిద్వాన్ ప్రథమ దివసము ¶75

ఇది బహాఉల్లా తన సహచరులతో సహా, బాగ్దాద్ నగరం వెలుపలనున్న, తరువాయి కాలంలో రిద్వాన్ ఉపవనంగా బహాయిలచే ప్రస్తావింపబడిన నజిబియ్యా ఉపవనానికి విచ్చేయటాన్ని సూచిస్తుంది. నౌరూజ్ అనంతరం ముప్ఫైఒక్క రోజుల పాటు, 1863 ఏప్రిల్ లో జరిగిన ఆ సంఘటన బహాఉల్లా తన సహచరులకు తన దివ్యధర్మాన్ని ప్రకటించిన కాలానికి ప్రారంభ ప్రతీకగా నిలిచింది. ఒకానొక ఫలకంలో “సర్వోన్నత పురస్కార దిన”మని తన ప్రకటనను, “ఏ ప్రదేశం నుండి సమస్తసృష్టి పైన ఆయన నామోద్భవశోభ వెదజల్లబడినదో ఆ ప్రదేశమిదియే” నని రిద్వాన్ ఉపవనాన్ని ఆయన అభివర్ణించాడు. తాను బహిష్కరింపబడిన ఇస్తాంబుల్‌కు బయలుదేరడానికి ముందుగా బహాఉల్లా ఈ దివ్యోపవనంలో 12 రోజులపాటు గడిపాడు.

పండ్రెండు రోజుల రిద్వాన్ పండుగగా ఏటేటా జరుపుకోబడుతున్న బహాఉల్లా ప్రకటనాదినాన్ని “బహాయి పండుగలన్నింటిలోకి అత్యంత పవిత్రమైనది, ప్రధానమైనది” గా షోఘీ ఎఫెండి వర్ణించాడు (చూ. వివరణలు 138, 140).

108

బయాన్ ¶77

బాబీ దివ్యధర్మపు మాతృగ్రంథానికి బాబ్ ‘బయాన్’ అని నామకరణం చేశాడు. అది ఆయన సమస్త పవిత్రరచనా సముదాయానికి వర్తిస్తుంది. పారశీక బయాన్ అనబడేది బాబ్ ప్రణీతమైన సైద్ధాంతిక గ్రంథము, ఆయన నిర్దేశించిన శాసనాలకు ప్రధాన మంజూషము. అరబ్బీ బయాన్ కూడా విషయపరంగా తత్సమానమైనదే అయినా, స్వల్పావశ్యకమైనది. గాడ్ పాసెస్ బై గ్రంథంలో షోఘి ఎఫెండి పారశీక బయాన్ ను వర్ణిస్తూ, అది : “భావి తరాలకు శాశ్వత మార్గదర్శనముగా వెలువరింప బడిన శాసన నిర్దేశ సంహితగా గాక, ప్రధానంగా వాగ్దత్తపురుషునికి సంకీర్తనగా పరిగణించ బడవలె” నన్నాడు.

అబ్దుల్-బహా యిలా వ్రాశాడు: “కితాబ్-ఎ-అఖ్దస్ నందు ప్రస్తావించబడి, ఆమోదింపబడిన శాసనములకు సంబంధించి తప్ప, బయాన్ గ్రంథస్థానమునకు కితాబ్-ఎ-అఖ్దస్ ఆదేశంబైనది.”

109

గ్రంథ వినాశనము ¶77

బాబ్ తన బయాన్ శాసనములను తన ఆమోదమునకు లోబడే చేశాడన్న వాస్తవాన్ని వెల్లడిస్తూ, తాను బాబ్ శాసనాలలో “కొన్నింటిని కితాబ్-ఎ-అఖ్దస్ నందు వేర్వేరు పదములలో పొందుపరుస్తూ” మిగిలిన వాటిని విస్మరించడం జరిగిందని బహాఉల్లా తన ఇష్రాఖత్ ఫలకములో వెల్లడించాడు.

గ్రంథముల విధ్వంసమునకు సంబంధించి : దివ్యధర్మానికి, దైవమతానికి అనుకూలముగ వ్రాయబడిన గ్రంథాలను తప్ప తక్కిన వాటినన్నింటినీ ధ్వంసం చేయవలసిందిగా బయాన్ బాబ్ అనుయాయులను ఆదేశించింది. బయాన్ లోని ఈ విశేషశాసనాన్ని బహాఉల్లా తొలగించాడు.

బయాన్ శాసనముల స్వభావం, తీవ్రతల గురించి, తన తరఫున వ్రాయబడిన ఒకలేఖలో షోఘి ఎఫెండి ఈ వ్యాఖ్యను చేశాడు :

బాబ్ వెలువరించిన కఠోర శాసనములను, ఆజ్ఞలను, ఆయన దివ్యధర్మ స్వభావము, పరమార్థము, లక్షణముల గురించిన ఆయన స్వీయవ్యాఖ్యల దృష్ట్యా వ్యాఖ్యానించినపుడే సవ్యంగా అవగతం చేసుకొనవచ్చును. ఈ వ్యాఖ్యలు ప్రస్ఫుటంగా వెలువరించినట్లుగానే, బాబీ దివ్యధర్మము - స్వాభావికంగా మత, సాంఘిక విప్లవం; అందుచేతనే దాని కాలపరిమితి కూడా స్వల్పమే. కాని విస్తృతములూ, కఠినములూ అయిన అనేక సంస్కరణలతో, విషాదమయ సంఘటనలతో కూడిన కాలం అది. బాబ్, ఆయన అనుయాయులు పటిష్టంగా అమలు పరచిన కఠిన చర్యలు షియా ఛాందసవాదాన్ని కూలద్రోసి, తద్వారా బహాఉల్లా ఆగమనానికి మార్గాన్ని ఏర్పరిచాయి. నవీన స్వతంత్ర దైవధర్మాన్ని ప్రకటించటానికీ, రానున్న బహాఉల్లా దివ్యావిష్కరణకు రంగం సిద్ధం చేయటానికీ బాబ్ అటువంటి కఠిన శాసనాలను చేయవలసి వచ్చింది. కాని వాటిలో అనేకాన్ని అనుయాయులపై బలవంతంగా రుద్దలేదు. వాస్తవానికి, అవి ఆయన దివ్యధర్మపు స్వతంత్ర ప్రతిపత్తిని చాటేందుకై వెలువరించబడిన శాసనాలు; అవి - విస్తృతమైన ఆందోళన రేకెత్తించి, ఛాందసులైన మతనాయకుల వ్యతిరేకతకు కారణమై, చివరికి ఆయన బలిదానానికి దారితీశాయి.

110

వ్యర్థవివాద కారకములు గాక, మీకుపయుక్తములగు శాస్త్రముల నధ్యయనము గావించుట కనుమతించినాము ¶77

జ్ఞాన సముపార్జనను, కళల, శాస్త్రాల అధ్యయనాన్ని బహాయి బోధనలు ఎంతో ప్రోత్సహిస్తున్నాయి. బహాయి పండితులను, విద్యావేత్తలను గౌరవించాలని, కేవలం వివాదాస్పద, నిరర్ధక అధ్యయనాలను కొనసాగించరాదని కూడా సూచించడం జరిగింది.

విశ్వాసులు సమాజపు “అభివృద్ధికీ, పురోగతికీ”, “ఉపయోగకరమైన” శాస్ర్తాలనూ, కళలనూ అభ్యసించాలనీ, “కేవలం మాటలతో మొదలై మాటల తోడనే ముగిసే” శాస్ర్తాలను అభ్యసించ కూడదని హెచ్చరిస్తూ, వాటి అధ్యయనం కేవలం “నిరర్ధక వివాదము” నకు దారితీస్తుందని బహాఉల్లా తన దివ్యఫలకములలో ఉపదేశించాడు. షోఘి ఎఫెండి తన తరఫున వ్రాయబడిన ఒక లేఖలో “మాటలతో మొదలై మాటలతోడనే ముగిసే” శాస్త్రాలను “నిష్ఫల అప్రస్తుత ప్రశంసలతో, తత్త్వవిచారణ సంబంధమైన వితండ వాదముల” తో పోల్చాడు. మరొక లేఖలో అటువంటి “శాస్త్రాల” గురించి బహాఉల్లా ప్రధానోద్దేశ్యాన్ని వివరిస్తూ, వేదాంత గ్రంథాలు, వ్యాఖ్యానాలు సత్యాన్ని తెలుసుకోవటానికి సహాయపడకపోగా, మానవ మేధస్సును తికమక పెడుతున్నాయని వివరించాడాయన.

111

భగవంతునితో సంభాషించిన యాతడు ¶80

యూదు, ఇస్లాం సాంప్రదాయాలలో మోజెస్‌కు గల బిరుదనామం. తన దివ్యావిష్కరణా గమనంతో “భగవంతునితో సంభాషించిన యాతడు సైనాయ్ పై వినినట్టి దానిని ఆలకించు భాగ్యము మానవ శ్రవణములకు కల్పింపబడిన” దని బహాఉల్లా ప్రవచించాడు.

112

సైనాయ్ ¶80

ఈ పర్వతం పైనే భగవంతుడు మోజెస్‌కు తన దివ్యశాసనాలను వెలువరించాడు.

113

పరమాత్ముడు ¶80

ఇస్లాం పవిత్ర రచనలలోను, బహాయి పవిత్ర లేఖనాలలోను ఏసుక్రీస్తును ప్రస్తావించడానికి ఉపయోగించిన బిరుదనామధేయాలలో యిదొకటి.

114

కార్మెల్ . . . జియోన్ ¶80

పవిత్రభూమిలో “భగవంతుని ద్రాక్షోపవన” మైన కార్మెల్ పర్వతం పైనే బాబ్ పవిత్రసమాధి, దివ్యధర్మపరిపాలనా కేంద్రస్థానం నెలకొని ఉన్నాయి.

ఇక జియోన్ అనేది జెరుసలెమ్‌లోని ఒక కొండ. జెరుసలెమ్ నగర పవిత్రతకు ప్రతీక ఐన చారిత్రాత్మక దావీదు సమాధి ఉన్న ప్రదేశం.

115

శోణమహానౌక ¶84

“శోణమహానౌక” బహాఉల్లా దివ్యధర్మాన్ని సూచిస్తుంది. ఆయన అనుయాయులను బాబ్ -- ఖయ్యాముల్-ఆస్మాలో “శోణమహానౌక నందలి సహచరులు” గా పేర్కొని, ప్రశంసించాడు.

116

ఓ ఆస్ట్రియా చక్రవర్తీ: నీవు అఖ్సా మసీదు సందర్శనార్థ్దమై వెడలి నప్పుడు, భగవజ్జ్యోతిఃప్రత్యూషమగు ఆయన అక్కా కారాగార వాసిగ నున్నాడు. ¶85

ఆస్ట్రియా చక్రవర్తీ, హంగేరి రాజూ అయిన ఫ్రాన్సిస్ జోసెఫ్ (ఫ్రాంజ్ జోసెఫ్ 1830-1916) జెరూసలెమ్‌కు 1869లో తీర్థయాత్ర చేశాడు. పవిత్రభూమిలో ఉన్నప్పుడు - అక్కడ అక్కా (ఆక్రే) లో ఖైదీగా ఉన్న - బహాఉల్లాను గురించి అడిగి తెలుసుకునే భాగ్యానికి దూరమయ్యాడు.

అఖ్సా మసీదు అంటే, “బహుదూరానగల” మసీదు అని అర్థం. ఖురాన్‌లో దీని ప్రస్తావన ఉంది. జెరుసలెమ్‌లో ఇది పర్వత దేవళంగా ప్రసిద్ధి చెందింది.

117

ఓ బెర్లిను రాజా! ¶86

ఒకటవ కైజర్ విలియమ్ (విల్‌హెల్మ్ ఫ్రెడ్రిక్ లుడ్విగ్, 1797-1888) ప్రష్యా ఏడవ రాజు, ఫ్రాంకో-ప్రష్యన్ యుద్ధ్దంలో ఫ్రాన్స్ పైన జర్మనీ విజయం సాధించిన మీదట, 1871 జనవరిలో ఫ్రాన్స్‌లోని వర్సెయిల్స్ లో జర్మనీ దేశానికి తొలి చక్రవర్తిగా గౌరవించబడ్డాడు.

118

నిన్ను మించిన యధికారముగల, నిన్ను మించిన స్థాయినొందిన యాతడు ¶86

ఇది ఫ్రెంచ్ చక్రవర్తి ఐన మూడవ నెపోలియన్ (1808-1873)కు అన్వయిస్తుంది. సమకాలీన పాశ్చాత్యచక్రవర్తులలో గొప్పవాడని చరిత్రకారులెందరో అతనిని ప్రస్తుతించారు.

తాను మూడవ నెపోలియన్‌కు వెలువరించిన దివ్యఫలకములలో, రెండవ దానిలో - అతని (నెపోలియన్) రాజ్యం “అయోమయావస్థలోకి త్రోయబడుతుం” దని, అతని “సామ్రాజ్యం చేజారిపోతుం” దని, అతని ప్రజలు తీవ్ర “సంక్షోభము” నెదుర్కొంటారని బహాఉల్లా స్పష్టంగా భవిష్యదర్శనం గావించాడు.

ఒక ఏడాది కాలంలోనే, మూడవ నెపోలియన్, ఒకటవ కైజర్ విలియమ్ చేతిలో 1870 లో జరిగిన సెడన్ యుద్ధంలో ఘోర పరాజయం పాలయ్యాడు. ఆ తర్వాత అతను ఇంగ్లండుకు ప్రవాసం వెళ్ళి, మూడేళ్ల తరువాత అక్కడే మరణించాడు.

119

ఓ కాన్‌స్టాంటినోపుల్ ప్రజలారా! ¶89

“కాన్‌స్టాంటినోపుల్‌” గా ఇక్కడ అనువదించబడిన ఈ పదం మూల స్వరూపం: “అర్-రుమ్‌” లేదా “రోమ్‌”. మామూలుగా ఇది - మధ్య ప్రాచ్యంలో, కాన్‌స్టాంటి నోపుల్‌ను తూర్పు రోమన్ సామ్రాజ్యాన్ని; ఆపై బైజాంతియమ్ నగరాన్ని, దాని సామ్రాజ్యాన్ని; తదనంతరం అట్ట్టోమాన్ సామ్రాజ్యాన్ని ప్రస్తావించేందుకై ఉపయోగించ బడుతూ వచ్చింది.

120

సముద్రద్వయ తీరములపైనున్న యో దివ్యస్థలీ! ¶89

ప్రస్తుతం ఇస్తాన్‌బుల్‌గా పిలువబడుతున్న ఒకనాటి కాన్‌స్టాంటినోపుల్‌కు ఇది అన్వయిస్తుంది. నల్ల సముద్రాన్నీ, మర్మరా సాగరాన్ని కలిపే 31 కి. మీ., పొడవున్న బోస్ఫోరస్ జలసంధి వద్ద, తుర్కిఓడరేవు ఒడ్డున గల పెద్ద నగరమిది.

1453 నుండి 1922 వరకు కాన్‌స్టాంటినోపుల్ అట్టోమాన్ సామ్రాజ్యానికి రాజధానీ నగరంగా ఉంది. బహాఉల్లా ఈ నగరంలో ప్రవాసజీవితం గడుపుతున్న కాలంలో, కౄరుడైన సుల్తాన్ అబ్దుల్ అజీజ్ సింహాసనాన్ని ఆక్రమించాడు. అట్టోమాన్ సుల్తానులు, సున్నీ ముస్లింలకు నాయకులైన ఖలీఫాలు కూడా ! 1924 లో రద్దు గావింపబడిన ఖలీఫా వ్యవస్థ పతనాన్ని బహాఉల్లా ముందే గ్రహించాడు.

121

ఓ రైన్ నదీతీరములారా! ¶90

మొదటి ప్రపంచ యుద్ధా (1914-1918) నికి పూర్వం, తాను వెలువరించిన ఒకానొక ఫలకంలో అబ్దుల్-బహా - రైన్ నదీ తీరములు “రక్తపంకిల”మగుటను వీక్షించితిమన్న బహాఉల్లా వ్యాఖ్యను ఫ్రాంకో-ప్రష్యన్ యుద్ధానికి (1870-1871) అన్వయించి, మరిన్ని క్లేశాలు వచ్చిపడనున్నాయని సూచించాడు.

షోఘి ఎఫెండి తన గాడ్ పాసెస్ బై లో - మొదటి ప్రపంచ యుద్ధంలో పరాజయంపాలైన తర్వాత జర్మనీపై విధించబడిన “దురన్యాయపూరిత ఒప్పందము”, “బెర్లిన్ ఆక్రందనలను మరింత ఉధృతం చేసిన”దని “ఈ సంఘటన అర్ధ శతాబ్దానికి ముందే, అశుభ సూచకంగా భవిష్యదర్శనం గావించబడిన” దని వివరించాడు.

122

ఓ తా ధాత్రీ! ¶91

ఇరాన్ రాజధాని తెహరాన్ లోని ప్రథమాక్షరమే “తా”. బహాఉల్లా తరచుగా, ఆయా ప్రదేశాలకు వాటి మొదటి అక్షరాన్ని అన్వయింప చేసేవాడు. అబ్జద్ గణక విధానం ప్రకారం ‘తా’ సాంఖ్యక విలువ 9; ఇది – ‘బహా’ నామపు సాంఖ్యక విలువకు సమానం.

123

తన దివ్యవైభవావతారము నీ యందావిర్భవించుటచే ¶92

ఇది 1817 సం. నవంబర్ 12 న తెహరాన్ లో జరిగిన బహాఉల్లా జననానికి అన్వయిస్తుంది.

124

ఓ ఖా ప్రదేశమా! ¶94

పర్షియాకు చెందిన ఖురాసాన్ ప్రాంతానికీ, దాని పరిసర ప్రదేశాలకూ - ఇష్కాబాదు (అష్కాబాదు) నగరంతో సహా - ఇది అన్వయిస్తుంది.

125

ఎవ్వడేని శతమిష్కల్‌ల స్వర్ణము నార్జించినచో, అందలి పంధొమ్మిది మిష్కల్‌లు, భూస్వర్గముల స్రష్టయగు భగవంతునివి; ఆయనకు సమర్పింపవలసినవి. ¶97

ఈ దివ్యప్రవచనం, దేవుని హక్కైన హుఖుఖుల్లా ను, విశ్వాసులు తమ సంపాదనల నుండి ఒక నిర్ణీత భాగాన్ని చెల్లించవలసిన విలువను వెల్లడిస్తుంది. భగవంతుని దివ్యావతారమూర్తి గా బహాఉల్లాకు చేయబడిన ఈ సమర్పణలు, ఆయన స్వర్గారోహణానంతరం ఒడంబడిక కేంద్రమైన ఆబ్దుల్-బహాకు చేయబడేవి. ఆయన తన వీలునామా - మరణశాసనంలో హుఖుఖుల్లా – “దివ్యధర్మ సంరక్షకుని ద్వారా” సమర్పింపబడాలని సూచించాడు. ప్రస్తుతం, సంరక్షకుడు లేని కారణంగా, దివ్యధర్మానికి ఆధిపత్యం వహిస్తున్న విశ్వన్యాయ మందిరము వారికి సమర్పించబడుతున్నాయి. ఈ నిధి దివ్యధర్మ పురోభివృద్ధికీ, ధర్మప్రయోజనాలకూ, అదేవిధంగా వివిధ దాతృత్వ కార్యక్రమాలకూ వినియోగించబడుతుంది. హుఖుఖుల్లా సమర్పణ ఒక ఆధ్యాత్మిక బాధ్యత. దానిని నెరవేర్చడమన్నది ప్రతి బహాయి మనస్సాక్షికే వదలి వేయబడినది. హుఖుఖుల్లా శాసనావశ్యకతను సమాజానికి తెలియచెప్పినప్పటికీ, దాని చెల్లింపునకై ఏ విశ్వాసిని కూడా వ్యక్తిగతంగా సమీపించరాదు.

ప్రశ్నలు - జవాబులలో అనేకం ఈ శాసనాన్ని విశదీకరించాయి. హుఖుఖుల్లా లెక్కింపు, వ్యక్తి సంపాదన విలువ పై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి సంపద విలువ పంధొమ్మిది మిష్కల్‌ల బంగారం విలువకు సమానమైతే (చూ. ప్ర.-జ. 8), ఆ మొత్తంలో పంధొమ్మిది శాతాన్ని, కేవలం ఒకే ఒకసారి, హుఖుఖుల్లాగా అర్పించడం ఆధ్యాత్మిక కర్తవ్యం (చూ. ప్ర.-జ. 89). ఆ తర్వాత, ఖర్చులన్నీ పోను, తర్వాత ఆతడి సంపాదన విలువ పెరిగి పంధొమ్మిది మిష్కల్‌లకు సమాన మైనపుడు, ఆ పెరుగుదలపై పంధొమ్మిది శాతం హుఖుఖుల్లా గా చెల్లించవలసి ఉంటుంది. ఆపై ప్రతి పెరుగుదల మీద, ఇలాగే చెల్లించవలసి ఉంటుంది. (చూ. ప్ర.-జ. 8, 90)

నివాసగృహం వంటి కొన్ని రకాల సంపదలకు హుఖుఖుల్లా చెల్లింపునుండి మినహాయింపు ఉంది (చూ. ప్ర.-జ. 8, 42, 95). అలాగే, ఆర్ధికనష్టం (చూ. ప్ర.-జ. 44, 45), లాభార్జనలో విఫలమైన పెట్టుబడుల (చూ. ప్ర.-జ. 102) విషయంలోను, మరణ సందర్భం (చూ. ప్ర.-జ. 9, 69, 80) లోను హుఖుఖుల్లా చెల్లింపుకు సంబంధించి కొన్ని ప్రత్యేక వెసులుబాట్లను ప్రకటించడం జరిగింది. (ఈ చివరి అంశం గురించి చూ. వివరణ 47).

దివ్య ఫలకముల నుండి, ప్రశ్నలు - జవాబుల నుండి, ఇంకా ఇతర పవిత్ర రచనల నుండి హుఖుఖుల్లా ఆధ్యాత్మిక విశిష్టతనూ, దానిని అనుసరించవలసిన విధి విధానాలను వివరించే రచనాభాగాల సంకలనం ఒకటి హుఖుఖుల్లా పేరిట చిన్న పుస్తకంగా ఆంగ్లంలో ప్రచురించబడింది.

126

. . . దేవదేవుని శాసనముల గురించి ఎన్నియో విజ్ఞాపనములు విశ్వాసుల నుండి మా సింహాసన సమక్షమునకు వచ్చినవి. పర్యవ సానముగా, మేమీ పావన ఫలకము నావిష్కరించి, జనులదృష్టవశమున తమ ప్రభుని యాజ్ఞల ననుసరింతురని, దానిని ఆయన శాసనవస్త్రములో నిక్షిప్తము గావించినాము. ¶98

“అనేక వత్సరములపాటు, విభిన్న ప్రదేశముల నుండి, భగవత్శాసనముల కొఱకు, పరమ పవిత్ర సమక్షమునకు, విన్నపములు జేరవచ్చినవి, కాని నియమిత సమయమాసన్నమగునంత వరకు మా లేఖినిని నిలిపి యుంచితి” మని బహాఉల్లా తన ఫలకములయందొక దానిలో వివరించాడు. తెహరాన్‌లోని సీయాచల్ లో తన ప్రవక్తృత్వ మహోద్యమం ఆవిర్భవించిన ఇరవై ఏళ్లవరకు, తన దివ్యధర్మశాసనాలకు కోశాగారతుల్యమైన కితాబ్-ఎ-అఖ్దస్‌ను వెలువరించలేదాయన. వెలువరించిన తరువాత, పర్షియాలో ఉన్న మిత్రులకు పంపించటానికి పూర్వం, కొంత కాలం దానిని ఆయన తన వద్దనే ఉంచుకున్నాడు. ఈ యుగానికి అనువర్తించే శాసనాలను వెలువరించడంలో దైవికంగా జరిగిన ఈ ఆలస్యం, ఆపైన క్రమేపి వాటి నియమాలు ఆచరణలోకి తీసుకు రాబడటాన్నీ, ప్రతి ప్రవక్త పరిధిలోనూ జరిగే గతిశీల ఆవిష్కరణనూ తేటతెల్లం చేస్తున్నది.

127

శోణితస్థలి ¶100

కారాగార నగరం ‘అక్కా’ కు ఇది వర్తిస్తుంది. “శోణిత” మనే పదం బహాయి పవిత్ర రచనలలో అనేకచోట్ల రూపకాలంకారంగాను, సంజ్ఞా వాచకం గాను ఉపయోగించ బడినది. (చూ. వివరణ 115)

128

సద్రత్-ఉల్-ముంతహా ¶100

“సుదూర దివ్యవృక్ష” మని అర్థం వచ్చే ఈ పదాన్ని షోఘి ఎఫెండి “తదుపరి తెరువేదియులేని తరు” వని అనువదించాడు. ఇది ఇస్లాం మతంలో - ఉదాహరణకు మహమ్మద్ తన రాత్రి ప్రయాణ వర్ణనలో, స్వర్గంలోని ఒక స్థానాన్ని వర్ణిస్తూ భగవంతుని సామీప్యాన్ని చేరడం మానవులకు, దేవదూతలకు సైతం సాధ్యం కాదనడానికీ, అదే విధంగా మానవాళికి అనుగ్రహింపబడిన దివ్యజ్ఞానమునకు అవధిరాహిత్యాన్ని చూపించడానికీ - ఒక సంకేతంగా ఉపయోగించబడింది. అందుకే బహాయి పవిత్ర రచనలలో తరచు భగవంతుని దివ్యావతారాన్ని ప్రస్తావించేందుకై వినియోగించబడింది (చూ. వివరణ 164 కూడా).

129

మాతృగ్రంథము ¶103

ఏ దివ్యమత సంవిధానానికి సంబంధించిన ప్రధానగ్రంథమైనా సాధారణంగా, “మాతృగ్రంథ”మని వ్యవహరించబడుతుంది. ఖురాన్‌లోను, ఇస్లాం హదీజ్ లోను - ఖురాన్ మాతృగ్రంథంగా పేర్కొనబడినది. బాబీ మతావిష్కరణ కాలంలో బయాన్ మాతృగ్రంథమైతే, బహాఉల్లా మతావిష్కృత యుగంలో మాతృగ్రంథము - కితాబ్-ఎ-అఖ్దస్. తన తరఫున వ్రాయబడిన ఒక లేఖలో షోఘి ఎఫెండి ఈ అంశాన్ని వివరిస్తూ, “బహాఉల్లాచే వెలువరించబడిన బోధనల సముదాయాన్నంతటినీ సూచించే ఏకీ కృత పద” మని కూడా అన్నాడు. విశాల దృక్పథంతో, దివ్యావిష్కరణా మంజూషానికి సంకేతంగా కూడా ఈ భావన వినియోగించబడింది.

130

దివ్యావిష్కరణాస్వర్గమునుండి యనుగ్రహీతమైన దానిని అనుచితముగ వ్యాఖ్యానించి, దాని వాస్తవార్థమును వక్రీకరించు నాతడు ¶105

మనస్సుకు హత్తుకునేలా వ్యాఖ్యానించేందుకు వీలయ్యే దృష్టాంత ప్రవచనాలకూ, అదే విధంగా, సాక్షీభూత అర్థం కలిగి, విశ్వాసుల సమ్మతి అవసరమయ్యే శాసనాలకూ, నిర్దేశాలకూ, ఇంకా ఆరాధన, మతాచారాల కు సంబంధించిన ప్రవచనాలకూ మధ్య గల వైశిష్ట్యాన్ని అనేక దివ్యఫలకములలో బహాఉల్లా స్పష్టంగా వివరించాడు.

వివరణలు 145, 184 లలో వివరించినట్లుగా, బహాఉల్లా - తన జ్యేష్ఠపుత్రుడైన అబ్దుల్-బహాను తనకు ఉత్తరాధికారిగాను, తన దివ్యబోధనలకు వ్యాఖ్యాతగాను పేర్కొన్నాడు. తన వంతుగా అబ్దుల్-బహా, పవిత్ర రచనలకు వ్యాఖ్యాతగా తన వారసత్వాన్ని చేపట్టేందుకై, తన జ్యేష్ఠపౌత్రుడైన షోఘి ఎఫెండిని దివ్యధర్మానికి సంరక్షకునిగా నియమించాడు. అబ్దుల్-బహా, షోఘి ఎఫెండీల వ్యాఖ్యానాలు దైవమార్గదర్శకత్వాన్ని పొందినవి గానూ, బహాయిలు తప్పనిసరిగా అనుసరించవలసినవి గానూ పరిగణించబడినాయి.

ఒక వ్యక్తి దివ్యబోధనలను అధ్యయనం చేసి, తానొక స్వీయాభిప్రాయానికి వచ్చి, ఆత్మావలోకనం చేసుకోకుండా అధీకృత వ్యాఖ్యానాలు నిరోధించవు. అయినప్పటికీ, అధీకృత వ్యాఖ్యానాలకు, స్వీయాధ్యయనం వలన కలిగిన అవగాహనకు మధ్య స్పష్టమైన వైవిధ్యం ఉంది. బోధనల పట్ల వ్యక్తి ఏర్పరచుకున్న అవగాహనపై ఆధారపడిన వ్యక్తిగత వ్యాఖ్యానాలు మనిషి జ్ఞానశక్తి ఫలితానికి తోడ్పడతాయి. అంతేకాక ధర్మాన్ని బాగా అర్థం చేసుకోవడానికి వీలును కల్పిస్తాయి. అయినా, అలాంటి అభిప్రాయాలలో సాధికారత లోపిస్తుంది. వ్యక్తులు తమ ఆలోచనలను ప్రస్తావించే టప్పుడు, ఆవిష్కృత దివ్యప్రవచనాల అధికారాన్ని నిరాకరించకుండా అధీకృత వ్యాఖ్యానాలతో వివాదపడకుండా, తర్కానికి పూనుకోకుండా జాగ్రత్త వహించాలనీ, వాస్తవానికి వారు తమ ఆలోచనలను జ్ఞానానికి ధారపోసి - తాము వెల్లడించినవి తమ స్వీయ అభిప్రాయాలు మాత్రమేనని స్పష్టీకరించాలి.

131

పారశీక ప్రజాస్నానవాటికలను సమీపింపవలదు ¶106

సాంప్రదాయక ప్రజాస్నానవాటికలలో ఉండే జలాశయాల వినియోగాన్ని బహాఉల్లా నిషేధించాడు. ఈ జలాశయాలలో అనేకమంది స్నానం చేయడం ఆచారం; అదీ కాక, వాటిలోని నీటిని మార్చడం చాలా అరుదు. పర్యవసానంగా వాటిలోని నీరు వివర్ణమై, మలినమె,ై అనారోగ్యహేతువై, భరింపశక్యంగాని దుర్గంధ పూరితమౌతుంది.

132

అవ్విధముగనే, పారశీక గృహ ప్రాంగణముల యందలి దుర్గంధ భూయిష్టములగు జలాశయములను వర్జించి ¶106

స్నానాలకూ, శుభ్రపరచుకోవడానికీ, ఇంకా యితర గృహావసరాలకూ వాడుకునేందుకై పర్షియాలో ఎక్కువ గృహప్రాంగణాల ముంగిళ్లలో జలాశయాలు ఉండేవి. వాటిలో నీరు నిలవచేయబడి ఉండటం వల్లను, ఆ నీటిని వారాల తరబడి మార్చకపోవడం వల్లను, ఆ నీటి మడుగులు ఎంతో అసహ్యకరమైన దుర్వాసనకు కారణమయ్యేవి.

133

మీ తండ్రుల పత్నులను పరిణయమాడుట మీకు నిషేధించ బడినది ¶107

సవతి తల్లిని వివాహమాడటం ఇందులో స్పష్టంగా నిషేధించబడింది. సవతి తండ్రిని వివాహమాడటానికి కూడా ఈ నిషేధం వర్తిస్తుంది. బహాఉల్లా వెల్లడించిన శాసనం అనువర్తించేచోట్ల, దీనిని - సందర్భం అసాధ్యం గావించనంత వరకు - అవసరమైన మార్పులతో స్త్రీ పురుషులకు వర్తించు శాసనముగా వ్యవహరించవచ్చు.

బంధువర్గాలకు సంబంధించి కేవలం సవతి తల్లులు మాత్రమే దివ్యగ్రంథంలో ప్రస్తావించబడినంత మాత్రాన కుటుంబంలోని ఇతర బంధువులతో సంయోగాలు అనుమతింపబడినట్లు అర్థం కాదని అబ్దుల్-బహా, షోఘి ఎఫెండి ధృవీకరించారు. “స్వబాంధవులను వివాహం చేసుకోవడంలో గల ఔచిత్యం లేదా అనౌచిత్యం గురించి” న ధర్మశాసనాలు విశ్వన్యాయ మందిరము వారినుండి వెలువడతాయని బహాఉల్లా వివరించాడు (చూ. ప్ర.-జ. 50). దంపతుల మధ్య రక్తసంబంధం ఎంతదూరమైతే అంత మంచిది, అటువంటి వివాహాలు మానవమనుగడకు శ్రేయోదాయకాలై, మానవజాతిలో సౌహార్ద్రభావనకు సహకరిస్తాయని అబ్దుల్-బహా వ్రాశాడు.

134

బాలుర విషయచర్చ ¶107

ఈ సందర్భంలో, “బాలురు” గా ఇక్కడ అనువదింపబడిన పదం అరబ్బీ మూలంలో ‘బాలురతో గుహ్యసంపర్కం’ అనే అర్థాన్ని ధ్వనిస్తుంది. షోఘి ఎఫెండి దీనిని స్వలింగ సంపర్కానికి సంబంధించిన అంశాలన్నింటికీ అనువర్తించే నిషేధంగా వ్యాఖ్యానించాడు.

లైంగిక నైతికతను గురించిన బహాయి బోధనలు వివాహం మీద కేంద్రీ కృతమై, పరివార జీవనం సమస్త మానవ సమాజానికి పునాదిరాయి అయ్యేలా, ఆ దివ్యవైవాహిక వ్యవస్థను కాపాడి, దృఢపరచేలా రూపొందించబడింది. బహాయి శాసనం ప్రకారం : స్త్రీ పురుషులకు మధ్య అనుమతింపదగిన లైంగిక సమాగమం - పురుషునికీ అతడు వివాహమాడిన స్త్రీ కి మాత్రమే పరిమితం.

తన తరఫున వ్రాయబడిన ఒక లేఖలో షోఘి ఎఫెండి ఇలా వివరించాడు:

స్వలింగ వ్యక్తుల మధ్య ఎంతటి ప్రేమానురక్తులున్నప్పటికీ, అది లైంగిక చర్యల ద్వారా వ్యక్తం కాబడడం తప్పు. అది ఆదర్శబంధమనడం క్షమార్హం కాదు. యదార్ధానికి బహాఉల్లా నీతి బాహ్యమైన ప్రతిదానినీ నిషేధించాడు; స్వలింగ సంపర్కాన్ని ప్రకృతివిరుద్ధమైనదిగా పరిగణించాడు. ఈ రకమైన వ్యసనానికి గుఱికావడం వివేచన గల ఆత్మకు పెనుభారం వంటిది. కాని వైద్యుని సలహా, సహకారాలతో, దృఢ సంకల్పంతో, కృషితో, ప్రార్థన ద్వారా ఈ బలహీనతను అధిగమించ వచ్చు.

వ్యభిచార, స్వలింగసంపర్క నేరాలకు - నేర తీవ్రతననుసరించి - తగిన అపరాధశుల్కాలను నిర్ణయించే అవకాశాన్ని బహాఉల్లా విశ్వన్యాయ మందిరమునకు ఏర్పరిచాడు (చూ. ప్ర.-జ. 49).

135

జనబాహుళ్యము వీక్షింప, వీధుల వెంట, విపణియందున విహ రింపుచు దివ్యప్రవచనములను వల్లించుటకెవ్వరును అనుమతింప బడలేదు ¶108

పూర్వపు మతధర్మాలలో కొందరు మతాధిపతులు, మతనాయకులు, కపట నాటకాలతో తమ ఆనుయాయుల ప్రశంసలనందుకునేందుకై, బాహ్యాడంబరాన్ని చూపుతూ, జనసంచారంగల ప్రదేశాలలో ప్రార్థనలను వల్లిస్తూ తమ భక్తిని ప్రదర్శించే ఆచారానికి ఇది ఒక నిదర్శనం. బహాఉల్లా ఇటువంటి ప్రవర్తనను నిషేధించాడు; వినయానికి, భగవంతునియెడ నిష్కళంకభక్తిని కలిగిఉండటానికి గల ప్రాముఖ్యాన్ని దృఢంగా ప్రబోధించాడు.

136

వీలునామా వ్రాయుట ప్రతి యొక్కరికిని విధియుక్తమై యున్నది. ¶109

బహాఉల్లా దివ్యబోధనల ప్రకారం, ప్రతి వ్యక్తి - వీలునామాను, మరణ శాసనాన్ని వ్రాయవలసిన బాధ్యతను కలిగియుండి, తానెంచుకొన్న ప్రకారం తన ఆస్తిని వితరణ చేయడానికి స్వతంత్రుడు (చూ. వివరణ 38).

“తనకనుగ్రహీతమైన దానితో తన యిచ్చవచ్చిన రీతిని వ్యవహరించుటకు భగవంతుడాతనిని నిశ్చయముగ ననుమతించినా” డని భగవంతుడు వ్యక్తికి అనుమతినిచ్చినాడు కనుక, తన వీలునామాను వ్రాయుటలో, “వ్యక్తికి తన యాస్తిపై సంపూర్ణాధికారమున్న” దని బహాఉల్లా ధృవీకరించాడు (చూ. ప్ర.-జ. 69). ఎవరైనా వీలునామా వ్రాయకుండా చనిపోతే వారసత్వపుటాస్తి పంపిణీకి కితాబ్-ఎ-అఖ్దస్ లో నిబంధనలు పొందుపరుప బడినాయి (చూ. వివరణలు 38-48).

137

మహోన్నత నామము ¶109

వివరణ 33 లో వివరించినట్లు, భగవంతుని మహోన్నత నామము “బహా” అనే పదం ఆధారముగా పలురూపాలను దాలుస్తుంది. ప్రాగ్దేశీయులైన బహాయిలు, తమ వీలునామాల పైభాగాన “ఓ సకల మహిమాన్విత మహిమా”, “సకల మహిమాన్వితుడైన దేవుని నామధేయమున”, “ఆయనే సకల మహిమాన్వితుడు” వంటి శీర్షికలను వ్రాస్తూ కితాబ్-ఎ-అఖ్దస్ లోని ఈ ఆజ్ఞను ఆచరణలో పెట్టారు.

138

సమస్త పర్వదినములును మహోన్నత పర్వదినద్వయమునను, దినద్వయమున సంభవించు మరి రెండు పండుగలయందునను సమ్మిళితమైనవి ¶110

ఈ గ్రంథ భాగం బహాయి సంవత్సరంలోని నాలుగు మహా పర్వదినాలను (పెద్ద పండుగలను) నిర్ధారిస్తుంది. “మహోన్నత పర్వదినద్వయం” గా బహాఉల్లా పేర్కొన్న వాటిలో మొదటిది - 1863 ఏప్రిల్/మే లో బహాఉల్లా బాగ్దాదు లోని రిద్వాన్ ఉద్యానవనంలో పండ్రెండు రోజులు బసచేసిన కాలంలో, ఆయన గావించిన ప్రవక్తృత్వ సముద్యమ ప్రకటనను సంస్మరిస్తూ జరుపుకునేది – “పర్వదిన వల్లభు” నిగా ఆయనచే సూచితమైనది అయిన రిద్వాన్ పండుగ; రెండవది 1844 లో షిరాజ్ లో సంఘటిల్లిన బాబ్ ప్రకటన. రిద్వాన్ పర్వకాలానికి సంబంధించి మొదటి, తొమ్మిదవ, పండ్రెండవ దినములు బాబ్ ప్రకటనా దినము మాదిరిగానే పరమ పవిత్రమైనవి (చూ. ప్ర.-జ. 1).

మరో “రెండు పండుగలు” - బహాఉల్లా , బాబ్ ల జన్మదిన వార్షికోత్సవాలు. ముస్లిం చాంద్రమాన పంచాంగం ప్రకారం, ఈ దినములు ఒకదాని వెంట ఒకటిగా అంటే బహాఉల్లా జననం 1233 హిజ్రి మొహర్రం మాసం రెండవదినాన (1817 నవంబర్ 12), బాబ్ జననము 1235 హిజ్రి అదే మాసం (మొహర్రం) మొదటి దినాన (1819 అక్టోబర్ 20) వరుసక్రమంలో వస్తాయి. అలా, ఆ రెండు రోజులూ కలిసి “జన్మదిన ద్వయం” గా వ్యవహరించబడ్డాయి. భగవంతుని దృష్టిలో ఈ రెండు రోజులు ఒకే దినముగా పరిగణింపబడినాయని బహాఉల్లా వివరించాడు. ఈ దినములు ఉపవాస మాసంలో వచ్చినట్లైతే, ఆ రోజులలో ఉపవాస నియమం వర్తించదని వెల్లడించా డాయన (చూ. ప్ర.-జ. 36). బహాయి పంచాంగం (చూ. వివరణలు 26, 147) సౌరమానాన్ని అనుసరిస్తుంది కనుక, ఈ రెండు పవిత్ర దినోత్సవాలను జరుపుకోవలసింది సౌరమానం ప్రకారమా, చాంద్రమానం ప్రకారమా అనే అంశాన్ని విశ్వన్యాయ మందిరము వారు నిర్ణయిస్తారు.

139

‘బహా’ మాసపు తొలిదినము ¶111

బహాయి పంచాంగం ప్రకారం సంవత్సరంలోని తొలి మాసానికీ, అలాగే, ప్రతి మాసపు తొలి దినానికీ “బహా”

అని నామకరణం చేయబడింది. బహా మాసపు తొలి రోజే బహాయి నూతన సంవత్సరాది అయిన నౌరూజ్. ఇది బాబ్ చే పర్వదినంగా నిర్దేశితమై, బహాఉల్లా చే ఆమోదించబడింది (చూ. వివరణలు 26, 147).

కితాబ్-ఎ-అఖ్దస్‌లోని ఈ గ్రంథ భాగాలలో నిర్దేశింపబడిన ఈ 7 పర్వ దినాలేగాక, బహాఉల్లా జీవితకాలంలో, బాబ్ బలిదాన వార్షికోత్సవాన్ని కూడా పర్వదినంగా జరుపుకోవడం జరిగింది; దీనికి అనుబంధంగా, బహాఉల్లా స్వర్గారోహణాన్ని కలుపుతూ, మొత్తం తొమ్మిది పండుగలు చేశాడు అబ్దుల్-బహా. ఇవి కాక, మరో రెండు వార్షికోత్సవాలను - ఒడంబడిక దినం, అబ్దుల్-బహా అస్తమయ దినాలను - కూడా జరుపుకోవడం ఉన్నది కాని, ఆరోజులలో దైనందిన వృత్తి వ్యాసంగాలను మానుకో నవసరం లేదు. చూ. బహాయి వరల్డ్, 18వ సంపుటంలో బహాయి పంచాంగాన్ని గురించిన విభాగం.

140

యదార్ధమునకు, మహోన్నత పర్వదినమన, ‘పర్వదినవల్లభుడే’¶112

ఇది రిద్వాన్ పండుగకు అన్వయిస్తుంది (చూ. వివరణలు 107, 138).

141

ఇతఃపూర్వము - విశ్వాసులలో ప్రతి యొక్కడును తన సముపార్జనల యందలి యమూల్య పురస్కృతులను మా యాసనము మ్రోల సమర్పింప వలెనను కర్తవ్యమును భగవంతుడు విధియించి యున్నాడు. ప్రస్తుతం . . . ఈ యనివార్యత కుద్వాసన చెప్పినాము. ¶114

భగవంతుడు ప్రత్యక్షీకరింపజేయునతడు సాక్షాత్కరించినపుడు ఆయనకు అమూల్య ములైన వస్తువులను సమర్పించాలని బయాన్‌లో ప్రస్తావితమైన గ్రంథ భాగాన్ని ఇది రద్దుచేస్తున్నది. భగవంతుని దివ్యావతారమూర్తి వర్ణనాతీతుడు కనుక - ఆయన మరొక విధంగా ఆదేశించకపోతే - అమూల్యమైన వాటిని, ఆయనకు సమర్పించేందుకై న్యాయసమ్మతంగా సమీకరించి ఉంచాలని బాబ్ వివరించాడు.

142

ప్రత్యూషఘడియ ¶115

బహాయి ఆరాధనా మందిరమైన మష్రిఖుల్-అఝ్కార్‌లో ప్రభాత ప్రార్థనలలో పాల్గొనడానికి సంబంధించి భగవంతుని దివ్యగ్రంథంలో వాస్తవ సమయం “ప్రత్యూషవేళ” గా పేర్కొనబడినప్పటికీ, “సూర్యోదయత్పూర్వం (అనగా తొలిసంధ్యవేళ), లేదా సూర్యోదయానంతరం రెండు గంటల వరకు” ఏ సమయమైనా ఆమోదయోగ్యమే నని బహాఉల్లా వివరించాడు.

143

భూ స్వర్గముల నడుమ తన వాణిని వెలువరించునాతడును, ఉషోదయ కారకుడును అగు ఆయన ముద్రచే ఈ దివ్యఫలకము లలంకృతములైనవి. ¶117

తన పవిత్రరచనల పరిపూర్ణ అభిన్నత్వమే భగవత్ప్రవచనమని పలుమార్లు ఉద్ఘాటించాడు బహాఉల్లా. ఆయన ఫలకాలలో కొన్ని ఆయన ముద్రలలో ఒకదానితో అంకితమై ఉన్నాయి. ది బహాయి వరల్డ్, 5వ సంపుటంలోని 4వ పుటలో బహాఉల్లా కు చెందిన వివిధ ముద్రల తో కూడిన ఫొటో ఒకటి ఉంది.

144

విచక్షణాజ్ఞానవరప్రసాదియగు మానవుడు, ఆ జ్ఞానమును హరియించు దానిని గ్రహియింపతగదు. ¶119

మధుపానాన్నీ, మరికొన్ని ఇతర మత్తుపానీయాల సేవనాన్నీ నిషేధిస్తున్నవీ, అదే విధంగా, అటువంటి మాదకద్రవ్యాలు మానవుడిపై చూపే దుష్ర్పభావాన్ని వివరిస్తున్నవీ అయిన సూచనలు బహాయి పవిత్ర రచనలలో ఎన్నో ఉన్నాయి. బహాఉల్లా తన దివ్యఫలకం ఒకదానిలో ఇలా ప్రవచించాడు:

భగవదామృత సేవనమును, మీ స్వీయమధువుకై మార్పిడి చేసుకునేరు జాగ్రత్త, అది మీ మేధస్సులను స్మృతి దప్పించి, మహిమాన్వితుడును, అసమానుడును, దుర్లభుడునగు దేవుని ముఖారవిందము నుండి మిమ్ములను విముఖులను గావించును. మహోన్నతుడును, సర్వశక్తిమంతుడును అగు భగవంతుని యానతిచే నది నిషేధింపబడినందున మీరు దాని దరిజేరవలదు.

“తేలికపాటివి, ఘాటైనవి అయిన మద్యపానీయాలు రెండింటినీ” అఖ్దస్ గ్రంథము నిషేధిస్తుందని అబ్దుల్-బహా వివరించాడు. మత్తుపానీయాల నిషేధానికి గల కారణాన్ని గురించి ఆయన యింకా యిలా అంటాడు: “మద్యం మెదడును పెడదారి పట్టించి, దేహాన్ని బలహీనపరుస్తుంది.”

షోఘి ఎఫెండి తన తరఫున వ్రాయబడిన లేఖలలో - ఈ నిషేధం, మద్యపానానికే కాక మెదడును వ్యత్యస్తపరచే ప్రతి పదార్థము౎ నకు వర్తిస్తుందని వివరించాడు. వివేచనాశీలి, సమర్థుడు ఐన వైద్యుని సలహామేరకు వైద్యచికిత్సలో భాగంగా, ఒక విశేష వ్యాధి నివారణకు నిర్ణయించినపుడు ఆల్కహాలు వాడుటకు అనుమతింపబడిన౎ దని కూడా ఆయన స్పష్టీకరించాడు.

145

దైవసంకల్పితుడును, ఈ ప్రాచీనమూలోద్భవుడును అగు ఆయన వంకకు మీ వదనములను సారింపుడు. ¶121

అబ్దుల్-బహాను తన వారసునిగా సూచిస్తూ, విశ్వాసులను ఆయన వంకకు అభిముఖులను కమ్మన్నాడు బహాఉల్లా. ఒడంబడిక గ్రంథములోను, తన వీలునామా, మరణశాసనములోనూ బహాఉల్లా ఈ ప్రవచనాల ప్రయోజనాన్ని యిలా వివరించాడు : “ఈ పవిత్రవాక్యోద్దేశ్యము మహత్తరశాఖయే దక్క వేరెవ్వరును కారు.” “మహత్తరశాఖ” అనే బిరుదాన్ని అబ్దుల్-బహాకు బహాఉల్లా ప్రసాదించాడు (చూ. వివరణలు 66, 184 లను కూడా).

146

మీరు మమ్ము ప్రశ్నలనడుగుట బయాన్‌నందు నిషేధించ బడినది. ¶126

భగవంతుడు ప్రత్యక్షీకరించునతడిని అనగా బహాఉల్లాను గురించి : అడిగే ప్రశ్నలు లిఖితపూర్వకంగా సమర్పించబడి, ఆయన స్థానౌచిత్యానికి తగినట్లుగా ఉంటే తప్ప, ఆయనను విశ్వాసులు ప్రశ్నించకుండా బాబ్ వారిని నిషేధించాడు. చూ. బాబ్ రచనల నుండి సంగ్రహింపబడిన గ్రంథభాగములు.

బాబ్ ఏర్పరచిన ఈ నిషేధాన్ని బహాఉల్లా తొలగించాడు. “అడగ దగిన” ప్రశ్నలను అడిగేందుకై విశ్వాసులను ఆయన ఆహ్వానించాడు. “పూర్వీకులు అలవాటుగా” వేస్తూఉండిన “వ్యర్ధప్రశ్నలను” వేయవద్దని వారిని హెచ్చరించాడు.

147

ఒక సంవత్సరమందలి మాసముల సంఖ్య పంధొమ్మిదియని భగవంతుని దివ్యగ్రంథమున నిర్దేశితమైనది. ¶127

బహాయి పంచాంగం ప్రకారం, బహాయి సంవత్సరానికి పంధొమ్మిది మాసాలని నిర్ధారించడం జరిగింది. అదే విధంగా, ప్రతి మాసానికీ పంధొమ్మిది రోజులుగాను, మిగిలిన దినాలను అధిక దినాలుగాను (సాధారణ సంవత్సరంలో నాలుగు, లీపు సంవత్సరంలో ఐదు) నిర్ణయించి, వీటిని 18వ మాసానానికీ, 19వ మాసానికీ మధ్యగా, సౌరమాన పంచాంగానికి అనువుగా, సర్దుబాటు చేయడం జరిగింది. బాబ్ ఈ మాసాలన్నింటికీ దైవలక్షణాలతో కూడిన పేర్లను పెట్టాడు. బహాయి నూతన సంవత్సరాది అయిన నౌరూజ్, మార్చి మాసానికి ముందుగా సంభవించే విషువత్తుతో కలిసి వచ్చేలా, ఖగోళశాస్ర్తానుగుణంగా స్థిరపరచబడింది (చూ. వివరణ 26). వారములోని రోజుల పేర్లకూ, ఇంకా మాసాలకూ సంబంధించిన ఇతర వివరాలకై చూ. ది బహాయి వరల్డ్, 18వ సంపుటం లో బహాయి పంచాంగానికి చెందిన విభాగం.

148

వీనియందలి ప్రథమ మాసము సమస్త సృష్ట్యావృతమగు ఈ దివ్యనామముచే నలంకృత మైనది. ¶127

సంవత్సరములోని ప్రథమ మాసానికి, పారశీక బయాన్ లో బహా౎ అనే నామాన్ని బాబ్ అనుగ్రహించాడు (చూ. వివరణ 139 ).

149

మృతులను . . . శవపేటికల యందుంచవలెనని . . . పరాత్పరుడు నిర్దేశించినాడు. ¶128

మరణించిన వ్యక్తిని గాజుతో కాని, మెఱుగు పెట్టబడిన రాతితో కాని చేయబడిన శవపేటికలో ఉంచాలని బయాన్‌లో బాబ్ నిర్దేశించాడు. షోఘి ఎఫెండీ తన తరపున వ్రాయబడిన ఒకలేఖలో, ఒకప్పుడు మానవుని అనంత జీవాత్మచే మహనీయత నొందిన౎ మానవశరీరం పట్ల గౌరవాన్ని ప్రదర్శించడమే ఈ ఏర్పాటు యొక్క ఉద్దేశ్యమని వివరించాడు.

మృతదేహాన్ని, మరణించిన స్థలం నుండి ఒక గంట ప్రయాణానికి మించి పట్టేంత దూరానికి తరలించరాదని - బహాయి శవఖనన శాసనం సంక్షిప్తంగా చెబుతున్నది; దేహాన్ని పట్టువస్త్రంలో గానీ, లేదా నూలుగుడ్డలో గానీ చుట్టి, “నేను దైవము నుండి ఆగమించి, దయాళువును, కరుణాళువును అగు ఆయన దివ్యనామమును దృఢముగ చేబూని, ఆయన వినా సర్వమును త్యజియించి, ఆయన కడకే తిరోగమించుచుంటి”నన్న ప్రవచనాలు చెక్కబడియున్న ఉంగరాన్ని వ్రేలికి ధరింపచేయాలి. శవపేటికను గాజుతో గాని, రాతితో గాని, దృఢమైన మేలుజాతి కలపతో గాని తయారుచేయించాలి. దివంగతునికై విశేష ప్రార్థన నిర్దేశించబడినది (చూ. వివరణ 10). శవాన్ని ఖననం చేయడానికి (పూడ్చిపెట్టడానికి) ముందే ఈ ప్రార్థనను చేయాలి. అబ్దుల్- బహా, షోఘీ ఎఫెండీలు ధృవీకరించినట్లు, ఈ శాసనం మృతదేహదహనాన్ని నిషేధిస్తుంది. నిర్ణీత ప్రార్థనను పఠించడం, వ్రేలికి ఉంగరాన్ని ధరింపచేయడం వంటి ప్రక్రియలు కేవలం యుక్త వయస్సు అనగా 15 సంవత్సరాల ప్రాయం వచ్చి మరణించిన వారికే ఉద్దేశించబడినాయి (చూ. ప్ర.-జ. 70).

శవపేటిక తయారీకి వాడవలసిన మూల పదార్ధానికి సంబంధించి : అది శవపేటికను వీలైనంత దీర్ఘకాలం మన్నేలా ఉంచేది కావాలన్నదే ఈ శాసనం ఉద్దేశ్యం. అదే విధంగా అఖ్దస్ గ్రంథములో ప్రస్తావించబడిన పదార్థాలతోనే కాక, బాగా దృఢమైన కలపతో గాని, కాంక్రీటు మిశ్రమంతో గాని పేటికను తయారు చేయించడానికి అభ్యంతరం లేదని విశ్వన్యాయమందిరము వారు స్పష్టీకరించారు. ప్రస్తుతం బహాయిలకు ఈ విషయంలో, తమ అభిరుచికి తగినట్లు వ్యవహరించే స్వేచ్ఛ ఉంది.

150

బయాన్ కేంద్రము ¶129

బాబ్ తనకు అన్వయించుకొన్న బిరుదనామాలలో “బయాన్ కేంద్రము” ఒకటి.

151

పట్టు లేదా నూలు వస్త్రము లైదింటి యందున మృతుని చుట్టవలె ¶130

మృతదేహాన్ని ఐదు పట్టు వస్త్రములలొ లేదా ఐదు నూలు వస్త్రములలో చుట్టి ఉంచాలని బయాన్ లో బాబ్ పేర్కొన్నాడు. బహాఉల్లా ఈ నియమాన్ని ఆమోదిస్తూ, “పరిమిత వనరులు గలవారు వీటియందే రకముదైనను ఒక్క వస్త్రములో చుట్టిన చాలు” నన్న నిబంధనను జోడించాడు.

ఈ శాసనంలో ప్రస్తావించబడిన “ఐదువస్త్రములు”, “పూర్తి నిడివిగల ఐదు గుడ్డలా” లేక “ఇప్పటి వరకు ఆచారముగా వాడుకలోనున్న ఐదు గుడ్డలా” అన్న ప్రశ్నకు బహాఉల్లా బదులిస్తూ: “ఐదు వస్త్రముల నుపయోగించుటే” దాని ఉద్దేశ్యమన్నాడు. (చూ. ప్ర.-జ. 56)

దేహాన్ని వస్త్రములో చుట్టి వేసే విధానానికి సంబంధించి : బహాయి పవిత్ర రచనలలో దేహమును ఎలా చుట్టాలి - “ఐదు వస్త్రముల” లోనా లేక “ఒకే వస్త్రము” లోనా అన్నది నిర్వచింపబడలేదు. ప్రస్తుతం, తమకు సముచితమైన విధిని అనుసరించే స్వేచ్ఛ బహాయిలకు ఉంది.

152

నగరము నుండి ప్రయాణకాలము ఒక గంటకు మించునట్టి దూరమునకు మృతదేహమును తరలించుట మీకు నిషేధింపబడినది ¶130

మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించడానికై ఎంపిక చేసుకున్న వాహనంతో నిమిత్తం లేకుండా, ఈ ప్రయాణాన్ని పట్టే వ్యవధిని ఒక గంట కు పరిమితం చేయడమే ఈ శాసన పరమార్ధం. ఎంత త్వరగా అంత్యక్రియలు జరిగితే “అంత సముచితము, సమ్మతము” అని బహాఉల్లా ధృవీకరించాడు (చూ. ప్ర.-జ. 16).

ఒక వ్యక్తి పట్టణంలోనో, నగరంలోనో మరణించినట్లైతే, మరణించిన ప్రదేశం నుండి కాక, ఆ పట్టణం లేదా నగరం యొక్క వెలుపలి సరిహద్దునుండి శ్మశానానికి గల దూరమే పరిగణనలోకి తీసుకోబడుతుంది. మృతులకై బహాఉల్లా నిర్దేశించిన శాసనంలోని ఆంతర్యం : అతడు లేదా ఆమె మరణించిన చోటుకు సమీపంలోనే ఖననం చేయబడాలన్నదే.

153

ప్రయాణమునకు సంబంధించి బయాన్ గ్రంథమునందు విధియింపబడిన ఆంక్షలను దేవుడు తొలగించినాడు. ¶131

ప్రయాణానికి సంబంధించి బాబ్ కొన్ని పరిమితులను విధించాడు. అవి బయాన్ వాగ్దత్తపురుషుని ఆగమనం వరకు అమలులో ఉండేవి. ఆ కాలంలో విశ్వాసులు కాలినడకన పయనించి ఆయనను సందర్శించుకునే వారు; ఎందుకంటే, ఆయన దర్శనభాగ్యమే తమ ఉనికికి ఫలమనీ, లక్ష్యమనీ వారి భావన.

154

పావనప్రదేశములు రెండింటియందునను గల గృహ ద్వయమును, సకల దయామయుడగు మీ దేవుని సింహాసనము సంస్థాపితమైన యితర స్థలములను ప్రవృద్ధమొనరించి, ప్రస్తుతింపుడు. ¶133

బహాఉల్లాచే “మహత్తరగృహ”మని పేర్కొనబడిన బాగ్దాదులోని ఆయన (బహాఉల్లా) గృహము, షిరాజ్ లోని బాబ్ గృహము - ఈ రెండూ కూడా “గృహద్వయము”గా బహాఉల్లాచే గుర్తించబడి, తీర్థయాత్రాక్షేత్రాలుగా నిర్దేశింపబడినాయి. (చూ. ప్ర.-జ. 29, 32, వివరణ 54).

“మీ దేవుని సింహాసనము సంస్థాపితమైన యితర స్థలము” లనగా భగవంతుని దివ్యావతారమూర్తి నివసించిన యితర ప్రదేశాలని షోఘి ఎఫెండి వివరించాడు. “అవి నెలకొనియున్న ప్రాంతలవాసులు, దివ్యధర్మ సింహాసన ప్రతిష్ఠిత స్థలములయందన్నిటినీ, లేదేని ఒక్క దానినైనను సంరక్షింప సమకట్టవలె” నని బహాఉల్లా ఉద్బోధించాడు (చూ. ప్ర.-జ. 32). బహాయి వ్యవస్థలు - భగవంతుని దివ్యావతారమూర్తు లిరువురితోను సంసర్గం గల ప్రదేశాలను గుర్తించి, వీలున్న సందర్భాలలో లిఖిత రూపేణా పత్రాలను ఏర్పరచి, ఆ విధంగా అనేక చారిత్రాత్మక ప్రదేశాలను స్వాధీనపరచుకుని, పూర్వస్థితికి తీసుకువచ్చాయి.

155

ఈ సజీవ దివ్యగ్రంథము చెప్పుదానిని ఆలకింపనీక, దివ్య గ్రంథమున పొందుపరచబడిన ఇంకేదైనను మీకు అవరోధము కలిగించు నేమో జాగరూకులై వర్తింపుడు. ¶134

“దివ్యగ్రంథము” అనగా భగవంతుని దివ్యావతారమూర్తిచే వెలువరింపబడిన ప్రవచన గ్రంథము. “సజీవ దివ్యగ్రంథము” అవతారమూర్తికి అన్వయిస్తుంది.

ఈ పదాలు బాబ్ తన పారశీక బయాన్‌లో - భగవంతుడు ప్రత్యక్షీకరింప జేయునాతడిని “సజీవ దివ్యగ్రంథ” మని సంకీర్తిస్తూ వెలువరించిన ప్రవచనాలకు అన్వయిస్తాయి. “భగవంతుని దివ్యగ్రంథము ఈ యువకుని రూపేణా అనుగ్రహీత మైన” దని తన దివ్యఫలకములలో ఒకదానిలో బహాఉల్లా స్వయంగా వివరించాడు.

అఖ్దస్ గ్రంథము లోని ఈ దివ్యప్రవచనంలోనూ, ఇంకా 168వ పేరా లోను, బహాఉల్లా తననే స్వయంగా “సజీవ దివ్యగ్రంథము” గా వ్యవహరించుకున్నాడు. “సజీవ దివ్యగ్రంథము” లోని ప్రవచనాలను ఖండించేందుకై “తమ పవిత్ర గ్రంథాలలో హేతువుల”ను వెతకకుండా జాగరూకులు కమ్మని ఆయన “ప్రతి యితర మత ధర్మానుయాయు” లను హెచ్చరిస్తాడు. ఆయన స్థాయిని గుర్తించడానికీ, ఈ నవీనావిష్కరణములోని దానిని దృఢంగా అవలంబించడానికి “దివ్యగ్రంథము” నందు పొందుపరచబడిన అంశాలు మిమ్ము ఆటంకపరచకూడదని ఆయన జనావళికి ఉపదేశించాడు.

156

నా యగ్రదూతయగు ఆయన లేఖిని నుండి, ఈ దివ్యావిష్కరణకు నివాళి ¶135

ఈ గ్రంథభాగంలో బహాఉల్లా ఉల్లేఖించిన నివాళి౎అనే పదం అరబ్బీ బయాన్ లోది.

158

బయాన్ విశ్వాసిని దక్క అన్యులను వివాహమాడుట శాసన విరుద్ధము. వివాహకాలమునకు కేవలమొక పక్షమే దివ్యధర్మము నవలంబించి యుండెనేని, అతని లేదా ఆమె సంపదలు రెండవ పక్షము నకు - దివ్యధర్మములోనికి పరివర్తనమొందనంత వరకును - శాసన విరుద్ధములగును. ¶139

ఇక్కడ బహాఉల్లా ప్రస్తావించిన బయాన్ గ్రంథభాగం “భగవంతుడు ప్రత్యక్షీకరించు నాతని” ఆగమనం ఆసన్నమైందన్న అంశాన్ని విశ్వాసుల దృష్టికి తీసుకువస్తుంది. బాబీ కాని స్త్రీని/పురుషుని వివాహమాడటం నిషేధం; ధర్మాన్ని అవలంబించిన భార్య/భర్త యొక్క ఆస్తి శాసనబద్ధ్దంగా బాబీ అయి ఉండనిభార్య/భర్తకు చెందదు - అన్న శాసనాన్ని బాబ్ తన వద్దనే నిలిపి ఉంచాడు; అది కాలక్రమంలో ఆచరణలోకి రాక పూర్వమే, బహాఉల్లాచే రద్దు చేయబడింది. ఈ శాసనాన్ని గురించి దీనిని వెలువరించడంలోని ఆంతర్యాన్ని స్పష్టీకరిస్తూ, బహాఉల్లా - తన (బహాఉల్లా) దివ్యధర్మపు పురోగతిని, అది తన (బాబ్) స్వీయధర్మంకనాన్న ముందుగా సాధింపబడటానికి గల సంభావ్యతను బాబ్ గ్రహించాడని వివరించాడు.

షోఘి ఎఫెండి గాడ్ పాసెస్ బై లోబయాన్ గురించి వ్రాస్తూ : “దానిని భావితరాల వారికి శాశ్వత మార్గదర్శకమైన శాసన నిర్దేశముల నియమావళిగా పరిగణించుట కంటే, వాగ్దత్త పురుషుని శ్లాఘిస్తూ వ్రాసిన సంకీర్తనాగ్రంథంగా పరిగణించా” లని అన్నాడు. “ఉద్దేశ్యపూర్వకంగా అది ఏర్పరచిన నియమ నిబంధనలు చాలా కఠోరమైనవి. అది స్థాపించిన సిద్ధాంతములు ఉద్యమమై తరముల తరబడి జడత్వముందున్న మతాధిపతులను, ప్రజలను మేల్కొలుపుటకు ఎంచుకొని, పనికిరాని దోషపూరిత వ్యవస్థలకు వినాశకరమైన ఆకస్మిక విఘాతాన్ని కలిగింపజేసి, దైవప్రవక్త తనకు పూర్వమున్న విధానాలను త్రోసిపుచ్చిన చందమున, తనకు ముందున్న దానిని విధ్వంసము చేయునని న్యాయాధిపతి సమక్షమునకు రమ్మని ఆజ్ఞాపించువాడు, నిష్కర్ష ప్రకర్షము నెఱపు దినమావిర్భవించెనని ఘోషించిన”దని ఆయన వివరించాడు.

159

బయాన్ కేంద్రము ¶140

బాబ్ బిరుదనామాలలో ఒకటి.

160

యదార్ధమునకు, ఏకైకుడను, తుల్యరహితుడను, సర్వజ్ఞుడను, సకల ప్రాజ్ఞుడను అగు నేను తప్ప వేరొక దేవుడు లే’డని . . . ¶143

భగవంతుని దివ్యావతారమూర్తి స్వభావాన్నీ, భగవంతునితో ఆయనకు గల సంబంధాన్నీ వర్ణించే గ్రంథభాగాలు అనేకం బహాయి పవిత్ర రచనలలో ఉన్నాయి. దైవత్వపు భావాతీత స్వభావాన్నీ, ఏకత్వాన్నీ బహాఉల్లా బలపరిచాడు. ఆయన యిలా వివరిస్తాడు: “తన సృష్టితో సత్యదేవునికి ప్రత్యక్షానుబంధం వుండనందున, భగవంతుడు ప్రతి యుగము నందునను విమలము, నిష్కళంకమునగు ఆత్మను, భూస్వర్గముల సామ్రాజ్యముల యందున సాక్షాత్కరింప జేయును.” “అగోచరుడును, గ్రహణసాధ్యుడును కాని” ఈ దివ్యావతారమూర్తి, “భౌతిక ప్రపంచము” నకు వర్తించు మానవీయ స్వభావమును, భగవదాత్మజనిత పదార్థమగు ఆధ్యాత్మిక స్వభావమును కలిగి యుంటాడు. ఆయనకు “రెండు స్థానములు” సైతము అనుగ్రహింపబడతాయి.

ఆయన అంతఃకరణ సత్యస్వరూపాన్ని ప్రతిబింబించి భగవద్వాణియే ఆయన వాణియని నిర్థారించేదే ఆయన ప్రథమస్థాయి ... దిగువ దివ్య ప్రవచనములచే వైశిష్ట్యమునొందిన మానవీయ స్థాయి ద్వితీయస్థాయి: “నేను మీ వలె మనిషినే.” “వచించు: నా దేవుడు సంకీర్తితుడగు గాక ! నేను మనిషి కంటే అధికుడైన దైవప్రవక్తనా?”

ఆధ్యాత్మిక లోకంలో సమస్త దివ్యావతారమూర్తుల మధ్య “విశిష్ట సమైక్యత” ఉన్నదని బహాఉల్లా ధృవీకరించాడు. వారందరూ “భగవంతుని సౌందర్యమును” వెలువరించి, ఆయన స్వభావ నామధేయములను సాక్షాత్కరింపచేసి, ఆయన దివ్యావిష్కరణాన్ని ఎలుగెత్తి చాటుతారు. ఇందుకు సంబంధించి, ఆయన యిలా అంటాడు:

సమస్త దివ్యావతారములయందలి ఏ యవతారమైనను “నేనే దేవుడ!”నని ప్రకటించునేని, ఆయన నిక్కముగా సత్యమునే వచియించినట్లు. వారి దివ్యావిష్కరణ మూలమున వారి స్వభావ నామధేయముల ద్వారా భగవదావిష్కరణము, ఆయన స్వభావ నామధేయములూ, ప్రపంచమున పలుమారులు ప్రత్యక్షీకృతములైనవని విదితమైనది.

భగవంతుని దివ్యావతారములు భగవంతుని నామాలనూ, ఆయన సద్గుణాలనూ ప్రతిఫలిస్తూ, మానవాళి పొందిన దైవజ్ఞానానికీ, ఆయన ఆవిష్కరణ పరిజ్ఞానానికీ కారణభూతులయ్యారు. అవతారపురుషులను ఎన్నటికీ “అగోచర సత్యంతో, స్వయంగా దైవసారమే అయిన వారిని ఎరుగనలవి కా” దని షోఘి ఎఫెండి వివరించాడు. బహాఉల్లాకు సంబంధించి ధర్మసంరక్షకుడు యిలా వ్రాశాడు : “మహత్తరమైన దైవావిష్కరణమునకు వాహనమై యుండిన మానవ దేవాలయమును” భగవంతుని “నిత్యత్వము” తో పోల్చరాదు.

బహాఉల్లా అద్వితీయతను, ఆయన దివ్యావిష్కరణపు ఘనతను ఉగ్గడిస్తూ షోఘి ఎఫెండి “దైవ దినం” గురించి పూర్వయుగాల పవిత్ర మతగ్రంథాలలో ప్రవచించబడిన ప్రవక్తృత్వ వాగ్దానాలన్నీ బహాఉల్లా ఆగమనంతో నెరవేరినాయని ఉద్ఘాటించాడు :

ఇజ్రాయల్‌కు ఆయన నిక్కముగా “దశసహస్రసిద్ధు”లతో భువికి దిగివచ్చిన “ఆద్యంతరహిత పితరుడు” “దివ్యదండనాథుని” అవతార సదృశుడు ; క్రైస్తవలోకానికి “పరలోకమందున్న తండ్రి మహిమతో” తిరిగి వచ్చిన క్రీస్తు; షియా ముస్లిమ్‌లకు ఇమాం హుస్సేన్ పునరావిర్భావం; సున్నీ ముస్లిమ్‌లకు దిగివచ్చిన “దైవాత్మ” (యేసుక్రీస్తు); జొరాస్ట్రియన్లకు వాగ్దత్తుడైన “షా బహ్రాము”; హిందువులకు శ్రీకృష్ణుని అవతారం; బౌద్ధ్దులకు పంచమ బుద్ధుడు.

దివ్యావతారమూర్తులందరికీ తనకూగల “దివ్యత్వ” స్థాయిని బహాఉల్లా ఇలా వర్ణించాడు :

...తనయందు గతించి భగవంతుని యందు జీవించు స్థాయి దివ్యత్వమును గురించి నేనెప్పుడు ప్రస్తావించినను అది నా పరిపూర్ణ అత్మోపేక్షతను చూపును. నా శ్రేయస్సుపై గాని, నా శోకముపై గాని, నా పునరుత్థానముపై గాని నా నియంత్రణ లేని స్థాయి యిది.

ఇక భగవంతునితో తనకు గల అనుబంధాన్ని గురించి ఆయన యిలా ధృవీరిస్తున్నాడు:

ఓ నా దేవా! నన్ను నీతో అనుసంధించి యుంచే సంబంధాన్ని నేను తలచుకొనినప్పుడు “నిశ్చయముగా నేనే దేవుడ!” నని సమస్త జీవకోటికి ప్రకటింప నెంతును. ఎప్పుడైతే నా స్వీయతను పరిగణించుకొందునో, ఏమని చెప్పను, మట్టికన్నా హీనమైనదని భావింతును.

161

జకాత్ సమర్పణ ¶146

క్రమబద్ధముగ చెల్లింపవలసినదిగా ఖురాన్ లో ముస్లిమ్‌లకు విధించబడిన దాన సమర్పణకు అన్వయమే ఈ జకాత్. కాలక్రమంలో ఈ కల్పన దానశుల్కంగా ప్రవృద్ధమై, కొన్ని ఆదాయవర్గాల వారికి, తమ ఆదాయాలలో కొంత భాగాన్ని సమర్పించవలసిన బాధ్యతగా, నియమిత పరిమితులకు అతీతంగా, పేదల ఉపశమనానికి, వివిధ దానకార్యాలకు, దైవధర్మావసరాలకు వినియోగించేందుకు వీలుగా విధించబడింది. మినహాయింపు పరిమితి వివిధ వస్తువులకు వేర్వేరుగా, చెల్లింపుకు అర్హమయ్యే మొత్తంపై కొంత శాతంగా ఉంటుంది.

బహాయి జకాత్ శాసనం “ఖురాన్ నందావిష్కృతమైనదాని” ననుసరించి ఉంటుందని బహాఉల్లా స్పష్టీకరించాడు (చూ. ప్ర.-జ. 107). మినహాయింపు పరిమితి, సంబంధిత ఆదాయ వర్గాలు, చెల్లింపులు ఎన్ని సార్లు చేయాలి, వివిధ వర్గాలకు జకాత్ అనువర్తించే వెలల తులనకు సంబంధించి ఖురాన్‌లో ప్రస్తావించ బడనందువల్ల, ఈ అంశాలను భవిష్యత్తులో విశ్వన్యాయమందిరము వారు నిర్ధారించవలసి ఉన్నది. అటువంటి శాసనము ఇంకా చేయవలసిఉన్నందువల్ల విశ్వాసులు తమతమ వీలును, వనరుల ననుసరించి యధాశక్తి బహాయి నిధికి విరాళాలను సమర్పిస్తూ ఉండాలని షోఘి ఎఫెండి సూచించాడు.

162

భిక్షాటన శాసనవిరుద్ధము, భిక్షువునకిడుట నిషిద్ధము. ¶147

ఒకానొక దివ్యఫలకంలో అబ్దుల్‌బహా, ఈ దివ్యప్రవచన పరమార్ధాన్ని యిలా వ్యాఖ్యానించాడు : “భిక్షాటనం నిషేధించబడినది, భిక్షాటనమును వృత్తిగా చేపట్టిన వారికి దానము చేయుట కూడా నిషేధించబడినది.” అదే ఫలకంలో ఆయన యింకా ఇలా సూచించాడు : “భిక్షాటనను సమూలంగా రూపుమాపుటే లక్ష్యం. అయినప్పటి కిని, నిస్సహాయతవల్లనో, కటికపేదరికం వల్లనో జీవనోపాధిని ఆర్జించుకొనుట ఒక వ్యక్తికి దుర్లభమైనపుడు, ఆతనికి జీవనాధారముగ నెలసరి భత్యమును ఏర్పాటు చేయవలసిన బాధ్యత ధనవంతుల కులేదా ఉపప్రతినిధులకు విధించబడినది . . . ఉపప్రతినిధులనగా ప్రజాప్రతినిధులని అర్థం. న్యాయ మందిర సభ్యులని కూడా చెప్పవచ్చు.”

పేదవారికి, అవసరంలో ఉన్నవారికి వ్యక్తులు లేదా ఆధ్యాత్మిక సభలు ఆర్థిక సహాయం చేయడానికి కాని, వారికి తమ జీవనోపాధిని ఆర్జించుకొనే నైపుణ్యాన్ని పొందే అవకాశాలను కల్పించడానికి గాని - దానసంబంధమైన ఈ నిషేధం అవరోధం కాజాలదు.

163

పరుల దుఃఖమునకు కారకులైన వారెవ్వరి కైననుఇతఃపూర్వము . . . అపరాధరుసుము . . . విధియింప బడినది ¶148

పొరుగు వానికి దుఃఖం కల్గించిన వ్యక్తి నష్టపరిహారంగాచెల్లించవలసిన అపరాధ రుసుమునకు సంబంధించి, పర్షియన్ బయాన్‌లో నిర్దేశితమైన శాసనాన్ని బహాఉల్లా రద్దుపరిచాడు.

164

పవిత్ర జీవనవృక్షము ¶148

“పవిత్ర జీవనవృక్షము” అనబడేది “తదుపరి తెరువేదియులేని తరు” వైన సద్రతుల్-ముంతహాకు అన్వయిస్తుంది. (చూ. వివరణ 128). బహాఉల్లాను సూచించడానికి ఇక్కడ వాడబడింది.

165

ఉదయ సాయంసంధ్యలయందున భగవత్ప్రవచనముల నాలపింపుడు. ¶149

“భగవత్ప్రవచనము” లను ఆలపించడానికి విశ్వాసులకు ఉండవలసిన “ప్రథమావశ్యకత” “భగవత్ప్రవచనమును పఠింపవలెనను ఆసక్తి, ప్రేమ” అని బహాఉల్లా వివరిస్తున్నాడు (చూ. ప్ర.-జ. 68).

“భగవత్ప్రవచనములు” అనే పదానికి నిర్వచనానికి సంబంధించి వివరిస్తూ, “దివ్యోచ్చారణాస్వర్గము నుండి అనుగ్రహీతమైన సర్వస్వము” నకు ఇది అన్వయిస్తుందన్నాడు బహాఉల్లా. ప్రాచ్యదేశాలకు చెందిన ఒక విశ్వాసికి వ్రాసిన లేఖలో షోఘీ ఎఫెండి “భగవత్ప్రవచనములు” అనే పదాన్ని విశదీకరిస్తూ, అందులో అబ్దుల్-బహా రచనలు అంతర్భాగం కావన్నాడు. అదే విధంగా, తన స్వీయరచనలకు కూడా ఆ పదం వర్తించదని ఆయన సూచించాడు.

166

ప్రతి పంధొమ్మిది సంవత్సరములు గడిచిన పిదప, మీ గృహోప కరణములను నవీకరించుకొనుట మీకు నిర్దేశితమైనది ¶151

ప్రతి పంధొమ్మిది సంవత్సరాలకు ఒకసారి గృహోపకరణాల నవీకరణకు సంబంధించి అరబ్బీ బయాన్‌లో గల ఆదేశాన్ని ఆచరణకు శక్యమైతే ఆచరించవలసిందిగా బహాఉల్లా ఆమోదించాడు. అబ్దుల్-బహా ఈ నిర్దేశాన్ని శుచిశుభ్రతల పెంపుదలకు వర్తింపజేశాడు. గృహోపకరణాలు పాతబడిపోయి, శోభావిహీనములై, అసహ్యతను కలిగించకుండా ఉండేలా నవీకరించాలన్నదే ఈ శాసనోద్దేశ్యమని ఆయన వివరించాడు. అరుదైన లేదా నిక్షిప్త వస్తువులకు, పురాతన కళాఖండాలు, ఆభరణాలకు ఇది వర్తించదు.

167

మీ పాదములను ప్రక్షాళనమొనరింపుడు. ¶152

సక్రమంగా స్నానంచేసి, పరిశుభ్రమైన దుస్తులను ధరించి, సాధారణంగా శుచి, శుభ్రతలకు మూలంగా ఉండాలని విశ్వాసులకు కితాబ్-ఎ-అఖ్దస్‌లో ఉపదేశించ బడింది. సారసంగ్రహము - క్రోడీకరణము లోని పరిచ్ఛేదము 4. ఈ. 3. ఝ. 1-7 తత్సంబంధిత నియమాలను క్లుప్తంగా వివరిస్తుంది. పాద ప్రక్షాళనకు గోరువెచ్చని నీటిని ఉపయోగించడం వాంఛనీయమైనప్పటికీ, చల్లని నీటిని కూడా ఉపయోగించ వచ్చునని బహాఉల్లా వివరించాడు. (చూ. ప్ర.-జ. 97).

168

మీరు అధ్యాసనములను ఉపయోగించ నిషేధించబడినారు. మీకై దైవప్రవచనము నాలపింపనెంచిన యాతడు వేదికపై నేర్పరుపబడిన కుర్చీలో కూరుచుండి, సమస్త మానవజాతికిని, తనకును ప్రభువగు దేవదేవుని స్తుతియించు గాక. ¶154

ఈ నియమాలకు పారశీక బయాన్ లో పూర్వప్రస్తావన ఉన్నది. ధర్మోపన్యాసాలను చేయడానికీ, దివ్యగ్రంథ పఠనానికీ గాను అధ్యాసనాలను (బాగా ఎత్తుగా ఉండే ఆసనాలను) ఉపయోగించడాన్ని నిషేధించాడు. అందుకు బదులుగా, భగవత్ప్రవచ నాన్ని స్పష్టంగా అందరూ ఆలకించేందుకు వీలుగా ఉపన్యాసకునికై ఒక కుర్చీని వేదికపై ఏర్పాటు చేయవచ్చునని పేర్కొన్నాడాయన.

ఈ శాసనం గురించి అబ్దుల్-బహా, షోఘి ఎఫెండీలు వ్యాఖ్యానిస్తూ, ఆరాధనా మందిరములలో (అంటే ధర్మోపన్యాసాలు నిషేధింపబడి కేవలం పవిత్ర గ్రంథపఠన చేయవలసినటువంటి చోట్ల) పాఠకుడు నిలిచి కాని, కూర్చొని కాని ఉండాలని, అందరికీ చక్కగా వినబడేందుకై - అవసరమైతే చరసాధనమైన చిన్న వేదికను ఉపయోగించేందుకు అనుమతించవచ్చునని వివరించారు. అలాగే, ఆరాధనా మందిరములో కాకుండా, యితర ప్రదేశాలలో జరిగే సమావేశాల విషయంలో కూడా కూర్చొనడానికి, నిలిచిఉండటానికి, వేదికను ఉపయోగించడానికి ఉపన్యాసకుని అనుమతించవచ్చు. ఏ ప్రదేశంలోనైనా, అధ్యాసనాలను ఉపయోగించడం మాత్రం నిషిద్ధమని పునరుద్ఘాటిస్తూ, సమావేశాలలో ప్రసంగించేటప్పుడు బహాయిలు అత్యంత వినయపూర్వకమూ, పరిత్యాగ పూరితమూ అయిన వైఖరిని అవలంబించాలని అబ్దుల్-బహా ఒక ఫలకంలో నొక్కి చెప్పాడు.

169

జూదము ¶155

ఈ నిషేధంలో చేర్చబడిన కృత్యాలు బహాఉల్లా పవిత్ర లేఖనాలలో సంక్షేపింపబడిలేవు. ఈ నిషేధానికి వర్తించే వివరాలను ప్రత్యేకించే బాధ్యత విశ్వన్యాయమందిరానిదేనని అబ్దుల్-బహా, షోఘి ఎఫెండి ఇరువురూ సూచించారు. లాటరీలు, గుర్రపు పందెములు, ఫుట్‌బాల్ క్రీడలు, బింగో వంటి వాటిపై పందెములు కాయడం వంటివి ఈ నిషేధంలో చేర్చబడ్డాయా అన్న ప్రశ్నకు - ఈ అంశం భవిష్యత్తులో సవివరంగా పరిశీలించబడుతుందని విశ్వన్యాయ మందిరము వారు బదులిచ్చారు. అలాగే - ఈ విషయాలను వివాదాస్పదం చేయక విశ్వాసుల వివేచనకే వదలివేయడం మంచిదని స్థానిక ఆధ్యాత్మిక సభలకు, వ్యక్తులకు సలహా ఇవ్వడం జరిగింది.

దివ్యధర్మం కోసమని లాటరీలు, చీట్లు వేయటం, అదృష్టవశమై ఉన్న ఆటలు మొ. వాటి ద్వారా నిధులను సేకరించడం సముచితం కాదని విశ్వన్యాయ మందిరము వారు నిబంధన చేశారు.

170

నల్లమందు సేవనమును . . . మానవ దేహమునకు మాంద్యము ను, భారమును కలిగించి, హానిచేయు ఎట్టి పదార్ధమును . . . ¶155

కితాబ్-ఎ-అఖ్దస్ లోని చివరి పేరా లో గంజాయి వినియోగంపై నిషేధం బహాఉల్లాచే పునరుద్ఘాటించబడింది. ఇందుకు సంబంధించి షోిఘి ఎఫెండి, “నిష్కళంక, పవిత్రజీవనము” నకు వలసిన అవశ్యకాలలో ఒకటి “గంజాయి సేవనమును, అలాంటి దురలవాటుకు దారితీసే మరికొన్ని మాదక ద్రవ్యాలను సంపూర్ణంగా వర్జించడం” అని చెప్పాడు. గంజాయి ఉత్పత్తులైన హెరాయిన్, హాషిష్, మార్జువానా వంటి యితర ఉత్ప్రేరకాలు, అలాగే ఎల్.ఎస్.డి. వంటి భ్రాంతికారకాలు, పెయోట్ (అమెరికన్ దేశాలలో పెరిగే ఒక విధమైన జెముడు మొక్కలనుండి తయారయ్యే మాదకద్రవ్యం) వంటి పదార్థాలు ఈ నిషేధం క్రిందికి వచ్చేవిగా పరిగణించబడతాయి.

అబ్దుల్-బహా యిలా వ్రాశాడు :

గంజాయికి సంబంధించి - అదొక దుర్గంధపూరితమూ, అసహ్యకరమైనదిన్నీ. అలాంటి దానిని వినియోగించే వానికి విధించబడే శిక్ష నుండి భగవంతుడు మనలను రక్షించు గాక. విస్పష్ట పరమ పవిత్ర గ్రంథము ప్రకారం ఇది నిషేధించబడినది. దీని వినియోగం నిష్కర్షగా గర్హింపబడినది. గంజాయిసేవనమొకవిధమగు ఉన్మాదము. దానిని వినియోగించువాడు పూర్తిగా మానవ ప్రపంచము నుండి తొలగిపోవునని సహేతుకముగ స్పష్టమగుచున్నది. మానవత్వపు పునాదిని శిధిలాలలోనికి నెట్టి, దానిని వినియోగించు వానిని శాశ్వతముగ నిర్వీర్యుని గావించు ఈ అత్యంత అసహ్యకరమగు అలవాటునుండి భగవంతుడు అందరినీ కాపాడు గాక. గంజాయి ఆత్మను బంధించి వేస్తుంది. కనుక దానిని పానం చేసిన వాని విచక్షణ క్షయిస్తుంది. అతని మేధస్సు ఒత్తిడికి గురై, అతని గ్రాహ్యశక్తులు హరిస్తాయి. అది ఆతనినిజీవచ్ఛవముగా మార్చివేయును; సహజోష్ణతను తగ్గించి వేయును. గంజాయి చేయు హాని కన్న గొప్పహానిని కలిగించున దేదియును లేదు. దాని పేరును సైతము పలుకనొల్లనివారు ధన్యులు; మరి, దానిని సేవించు వాడెంతటి భాగ్యవిహీనుడో ఒకింత యోచింపుడు.

ఓ భగవత్ప్రేమికులారా ! సర్వశక్తుడైన దేవుని ఈ యుగము నందు హింసాదౌర్జన్యములును, నిర్బంధదమనకాండలు మున్నగునవన్నియును గర్హింపబడినవి. అయితే, ఏ విధముగానైనా గంజాయి వినియోగమును నిర్మూలించుట కాజ్ఞయైనది, తద్వారా దైవవశమున మానవజాతి శక్తివంతమగు ఈ మహమ్మారి నుండి విముక్తిని పొందవచ్చు. అట్లు చేయలేని వాడు భగవంతుని యెడ తన బాధ్యతను విస్మరించినవాడై దుఃఖ, దౌర్భాగ్యముల పాలగును.

తన ఫలకములయం దొకదానిలో అబ్దుల్-బహా గంజాయిని గురించి యిలా వివరించాడు : “వినియోగదారుడు, క్రయదారుడు, విక్రయదారుడు - అందరును భగవంతుని వదాన్యతకును, ఔదార్యమునకును దూరులే.”

ఇక, వేరొక ఫలకములో అబ్దుల్-బహా యిలా వ్రాశాడు :

కొందరు పారశీకులు హషిష్‌ను వాడుట కలవడినారని నీవు వ్రేలెత్తి చూపిన దాని గురించి. దేవుడు దయామయుడు ! ఇది మాదక ద్రవ్యములలోకెల్లా తుచ్ఛమైనది, దీని ఉపయోగం విస్పష్టంగా నిషేధింప బడినది. ఇది యాలోచనను శైధిల్యము గావించి , ఆత్మకు సంపూర్ణ మాంద్యమును కలుగజేయును. ఎవ్వడైనను ఈ పైశాచిక వృక్షఫలము నాశించి, తన వంతు నంది, రాక్షస ప్రవృత్తులకు దృష్టాంతముగ నెటుల నిలువగలడు? ఈ నిషిద్ధ మాదకద్రవ్యమును వినియోగించి, సకల దయామయుని అనుగ్రహమున కేల దూరము కాదలచినాడు ?

సారాయి మేధస్సును క్షీణింపచేసి మానవునిచే ననుచిత కృత్యములకు పాల్పడజేయును. కాని గంజాయి - ఈ పైశాచిక వృక్ష ఫలము, దుష్ట హాషిష్ మెదడును నాశము గావించి, జీవనమును ఘనీభవింప జేసి ఆత్మను పాషాణతుల్యము గావించి కాయమును వ్యర్ధపరచి మనిషిని సర్వనాశనము చేసి వదలివేయును.

అయితే, ఈ నిషేధం - అర్హులైన వైద్యులు చికిత్సలో భాగంగా కొన్ని రకాలకు చెందిన మాదకద్రవ్యాల వినియోగాన్ని సూచించిన సందర్భాలలో అనువర్తించదని గమనించాలి.

171

“మహావ్యత్యస్తమర్మము సార్వభౌమ చిహ్నముగ” ¶157

“బాబ్ దివ్యధర్మాగమనమును ముందుగానే చాటిన తేజస్వీద్వయంలో ప్రథముడు,” షేఖ్ సాంప్రదాయ స్థాపకుడూ అయిన షేఖ్ అహ్మద్-ఇ-అహ్సాయి (1753-1831) - వాగ్దత్త పురుషుని సాక్షాత్కారంతో సర్వమును తారుమారై మొదటిది చివరిదిగా, చివరిది మొదటిదిగా మారిపోతాయని భవిష్యదర్శనం చేశాడు. తన దివ్య ఫలకముల యందొక దానిలో బహాఉల్లా “మహావ్యత్యస్తమర్మము సార్వభౌమ సంకేతము” యొక్క “చిహ్నమును సాదృశ్యము” ను సూచిస్తూ, “ఈ వ్యత్యస్తత ద్వారా ఆయన ఉచ్చమును నీచముగను, నీచమును ఉచ్చముగను చేయు”నని వివరించాడు. “యేసుక్రీస్తు రోజులలో ఘనత వహించిన జ్ఞానకోవిదులు, విద్యాసంపన్నులు, మతాధిపతులు ఆయనను తృణీకరింప, విధేయులైన జాలరులు దివ్యసామ్రాజ్యప్రవేశప్రాప్తికి త్వరపెట్టబడ్డా” రని గుర్తుచేశాడాయన (చూ. వివరణ 172 కూడా). షేఖ్ అహ్మద్-ఇ-అహ్సాయి గురించిన అదనపు సమాచారానికై చూ. ది డాన్ బ్రేకర్స్ లోని 1 నుండి 10 వరకు గలఅధ్యాయాలు .

172

‘ధర్మబద్ధమైన’ ఈ ‘అలీఫ్’ సద్గుణముచే పెంపొందింపబడిన “షష్ఠి” ¶157

షేఖ్ అహ్మద్-ఇ-అహ్సాయి, తన రచనలలో అరబ్బీ అక్షరం “వవ్‌” ను గురించి నొక్కి వక్కాణించాడు. ఈ అక్షరం గురించి ది డాన్ బ్రేకర్స్ లో వివరిస్తూ, నబీల్: ఇది - బాబ్ కూ, నవీన దివ్యావిష్కరణ యుగాగమనానికీ సంకేతం గాను, కితాబ్-ఎ- అఖ్దస్ లో బహాఉల్లా చే “మహావ్యత్యస్త మర్మము” నకు “సార్వభౌమచిహ్నము” నకు సాదృశం గాను చెప్పబడిందని పేర్కొన్నాడు.

“వవ్‌” అక్షరనామంలో వవ్, అలీఫ్, వవ్ (వ, అ, వ) అను మూడు అక్షరాలు ఉన్నాయి. అబ్జాద్ గణనను అనుసరించి, ఈ మూడింటి సాంఖ్యక విలువలు క్రమంగా - 6, 1, 6. ప్రాగ్దేశీయుడైన ఒక విశ్వాసికి షోఘి ఎఫెండి తరపున వ్రాయ బడిన ఒక లేఖలో, కితాబ్-ఎ-అఖ్దస్ లోని ఈ దివ్యప్రవచనం వ్యాఖ్యానించబడింది. ‘ధర్మబద్ధమైన’ ఈ అలీఫ్* బాబ్ ఆగమనానికి అన్వయిస్తుందని, సాంఖ్యక విలువ 6 గా గల మొదటి అక్షరం అలీఫ్‌కు ముందుగా వస్తూ, బాబ్‌కు పూర్వ యుగాలను భగవంతుని అవతారాలను సూచిస్తుండగా, సాంఖ్యక విలువ 6 గా కలిగి అలీఫ్ తర్వాత వచ్చే మూడవ అక్షరం - ప్రత్యక్షీకృతుడైన బహాఉల్లా పరమావిష్కరణకు వర్తిస్తుందని ఆయన వివరించాడు.

173

అత్యవసరమైతే తప్ప సాయుధులై చరియించుట మీకు నిషేధించబడినది ¶159

అత్యవసర పరిస్థితులలో తప్ప ఆయుధధారణ శాసనవిరుద్ధమన్న బయాన్ ఆదేశాన్ని బహాఉల్లా ఆమోదించాడు. విశ్వాసికి ఆయుధాలను ధరించి ఉండవలసిన “అత్యవస” రాన్ని - ప్రమాదకర పరిస్థితులలో ఆత్మరక్షణ నిమిత్తమై- అబ్దుల్-బహా అనుమతించాడు. తన తరపున వ్రాయబడిన ఒక లేఖలో, షోఘి ఎఫెండి కూడా - అత్యవసర పరిస్థితులలో, విజ్ఞాపన చేయడానికి చట్టబద్ధమైన అధికార వ్యవస్థ అందుబాటులో లేనప్పుడు బహాయిలు తమను తాము రక్షించుకోవడం న్యాయబద్ధమేనని వివరించాడు. ఆయుధాలను ధరించి, శాసనబద్ధంగా వాటిని వినియోగించే సందర్భాలెన్నో ఉన్నాయి; ఉదాహరణకు కొన్ని దేశాలలో ప్రజలు తమ అన్నవస్త్రాలకై సాగించే వేట. అదే విధంగా అస్త్రవిద్య, విలువిద్య, సాముగరిడీల సాధనల వంటి విషయాలలో ఆయుధధారణ అవసరమౌతుంది.

బహాఉల్లా చే విశదపరచబడి, షోఘీ ఎఫెండీ చే విస్తృతపరచ బడిన సామాజిక స్థాయిలో సామూహిక భద్రతా సూత్రము (చూ. గ్లీనింగ్స్ ఫ్రమ్ ది రైటింగ్స్ ఆఫ్ బహాఉల్లా, 117వ పరిచ్ఛేదము), (చూ. ది వరల్డ్ ఆర్డర్ ఆఫ్ బహాఉల్లా లో సంరక్షకుని లేఖలు) సేనల రద్దు విషయంలో పూర్వోహ చేయదు; అయితే, “సేనను న్యాయసేవకునిగా చేయు విధానమును నిర్దేశిస్తుంది.” “ప్రజా ప్రభుత్వం యొక్క వివిధాంగముల సమగ్రతను” కాపాడే అంతర్జాతీయ శాంతిసేన ఏర్పాటును కల్పిస్తుంది. బిషారత్ అనే ఫలకములో బహాఉల్లా - యుద్ధములో ఉపయోగించే “ఆయుధము లన్నియు పునర్నిర్మాణోపకరణములుగా పరివర్తితములై, మానవుల మధ్యనున్న కలహములు, విరోధములు తొలగిపోవలె”నన్న ఆకాంక్షను వ్యక్తం చేశాడు.

అదే ఫలకములో ఆయన సకల మతానుయాయులతో సౌహార్ద్రభావనతో వ్యవహరించడానికి గల ప్రాధాన్యతను నొక్కి చెప్పాడు; “పవిత్రయుద్ధ భావన యనునది - దివ్యగ్రంథము నుండి తొలగించి వేయబడిన” దనికూడా వివరించాడాయన.

174

పట్టువస్త్రములను ధరియించుకొనుట మీకనుమతింప బడినది. ¶159

ముస్లిం సాంప్రదాయం ప్రకారం పురుషులు పట్టు వస్ర్తాలను ధరించడం సాధారణముగా - ధర్మరక్షణార్ధమై చేసే యుద్ధసమయంలో తప్ప - నిషేధించ బడింది. ఖురాన్ గ్రంథప్రవచనాలు ప్రాతిపదికగా గావింపబడని ఈ నిషేధాన్ని, బాబ్ రద్దు చేశాడు.

175

దేవదేవుడు . . . వస్త్రధారణ, గడ్డపు కత్తిరింపుల విషయమున పూర్వానువర్తిత ప్రతిబంధకముల నుండి మిమ్ము విముక్తులను గావించినాడు. ¶159

ప్రపంచ మత సాంప్రదాయాలలో వస్త్రధారణకు సంబంధించిన నియమాలెన్నో ఉన్నాయి. ఉదాహరణకు షియా మతాధిపతులు తమకై విశేషమైన పొడవాటి అంగీని ధరించడానికి ఎంచుకొన్నారు; ఒకప్పుడు ప్రజలకు ఐరోపా వస్త్రధారణను నిషేధించారు. ముస్లిం ఆచారంలో తమ ప్రవక్త ఆచారానికి సమతూగేలా ఉండాలని మీసాల కత్తిరింపులోను, గడ్డపు నిడివి విషయంలోను రకరకాల నిబంధనలను ప్రవేశపెట్టారు.

వస్త్రధారణ, గడ్డం విషయంలో ఉన్న అటువంటి పరిమితులనన్నింటిని బహాఉల్లా తొలగించాడు. ఆయా అంశాలను వ్యక్తుల నిర్ణయానికే వదలివేసినా, విశ్వాసులు ఔచిత్యావధులు దాటకుండా ప్రతి విషయంలోను మితాన్ని పాటించాలని ఉద్బోధించాడు.

176

ఓ కాఫ్, రా భూభాగమా! ¶164

ఇరాన్‌లోని ఒక మారుమూల ప్రదేశమైన కిర్మాన్ పేరులోని మొదటి రెండు అక్షరాలే -- కాఫ్ (కి), రా (ర్).

177

నీ నుండి గోప్యముగ, అపహృతమై వెలువడు దానిని సైతము గ్రహియింతుము. ¶164

ఇది కిర్మాన్ నగరంతో సంబంధాన్ని కలిగియుండి, అజలీలుగా పిలువబడే మీర్జా యాహ్యా (చూ. వివరణ 190) అనుచర బృందపు కుతంత్రాలకు అన్వయిస్తుంది. ఆ బృందంలో ముల్లా జాఫర్, అతని కుమారుడు షేఖ్ అహ్మద్-ఇ-రూహీ, మీర్జా ఆఖా ఖాన్-ఇ-కిర్మాని (ఈ ఇద్దరూ మీర్జా యాహ్యా అల్లుళ్లు), ఇంకా మీర్జా అహ్మద్- ఇ-కిర్మానీలు కలిసి ఉన్నారు. వారు దివ్యధర్మాన్ని అణగద్రొక్క డానికి సమకట్టడమే కాక, నసీరుద్దీన్ షా పై హత్యాయత్నానికి దారి తీసిన రాజకీయకుట్రలలో భాగస్వాము లయ్యారు.

178

మహమ్మద్ హసన్ నామధేయము గల షేఖ్‌ను స్ఫురణకు దెచ్చికొనుడు. ¶166

బాబ్‌ను షియా ముస్లిం వర్గానికి చెందిన ప్రముఖ ప్రబోధకులలో ఒకడైన షేఖ్ మహమ్మద్ -హసన్ తిరస్కరించాడు. అనేక షియా ధర్మశాస్త్ర సంపుటాలకు కర్త ఐన ఈ హసన్ 1850 ప్రాంతంలో మరణించినట్లు తెలుస్తున్నది.

నజఫ్‌లో ముల్లా అలీహ్ బస్తామికీ, జీవాక్షరులలో ఒకడైన షేఖ్ మహమ్మద్ హసన్‌కు మధ్య జరిగిన ముఖాముఖి సమావేశాన్ని ది డాన్ బ్రేకర్స్ లో నబీల్ వర్ణించాడు. సమావేశం జరిగే సమయంలో ముల్లా అలీ, బాబ్ సాక్షాత్కారాన్ని ప్రకటించి ఆయన ఆవిష్కరణ శక్తిని కొనియాడాడు. షేఖ్ దుర్బోధల వల్ల - ముల్లా అలీ ధర్మవిరోధిగా ప్రకటింపబడి తక్షణమే సభనుండి వెలివేయబడ్డాడు; న్యాయవిచారణకు గురై, ఇస్తాన్‌బుల్‌కు పంపబడి, వెట్టిచాకిరీకి గురిచేయబడ్డాడు.

179

గోధుమలను, బార్లీని జల్లించు నాతడొక్కడు ¶166

ఇస్ఫహాన్ నగరంలో బాబీ ధర్మాన్ని స్వీకరించిన ప్రప్రథముడు ముల్లా మహమ్మద్ జాఫర్ గ్యాండమ్-పాక్-కున్ కు ఇది వర్తిస్తుంది. అతడు పారశీక బయాన్‌లో ప్రస్తావితుడై, “శిష్యత్వ వస్త్రభూషితు” డని ప్రశంసింపబడ్డాడు. ఈ “గోధుమలు జల్లించువా” డు దైవసందేశాన్ని నిస్సంకోచంగా సమ్మతించడాన్ని, ఈ నవీన దివ్యావిష్కరణను ఉత్సాహంగా సమర్థించడాన్ని ది డాన్ బ్రేకర్స్ లో నబీల్ వర్ణించాడు. ఇతడు షేఖ్ తబర్సి దుర్గరక్షకులతో కలిసి, ఆ కోట ముట్టడిలో మరణించాడు.

180

“ప్రవక్త” యను పదము ఈ పరమోన్నత ప్రకటన నుండి మిమ్ము నిరోధించునేమో . . . జాగరూకులు కండు ¶167

పవిత్ర గ్రంథములపై వారి వ్యాఖ్యానములు, భగవంతుని దివ్యావతారమూర్తిని గుర్తించడానికి అవరోధం కానివ్వకూడదని “అంతర్దృష్టి” గల ప్రజలను బహాఉల్లా హెచ్చరించాడు. ప్రతి మతానుయాయులు, దాని సంస్థాపకుని ఎడ తమ భక్తిని వెల్లడించి ఆయన దివ్యావిష్కరణనే భగవంతుని తుది ప్రవచనంగా భావించి, తదనంతర ప్రవక్త సాక్షాత్కార సంభావ్యతను విస్మరించడానికి పూనుకొన్నారు. యూదు, క్రైస్తవ, ఇస్లాం మతాల విషయంలో అలాగే జరిగింది. గడచిన యుగధర్మాల విషయంలో గానీ, తన స్వీయధర్మావిష్కరణ విషయంలో గానీ, ఇదే చివరి దివ్యావిష్కరణమన్న భావనలను బహాఉల్లా నిరసించాడు. ముస్లింలకు సంబంధించి, “ప్రవక్తల అధీకృత ముద్ర అను పదములు . . . ఖురాన్ జనుల నేత్రములను కప్పి వేశా” యని, “వారి అవగాహనను మఱుగుపరచి, ఆయన ఔదార్యాలను కోల్పోయేలా” చేశాయని ఆయన కితాబ్-ఎ-ఇఖాన్ గ్రంథంలో వ్రాశాడు. “ఈ సిద్ధాంతము . . . సకల మానవజాతికి దుఃఖపూరితమగు పరీక్ష” అని ధృవీకరించి, “ఈ పదములను పట్టుకు వ్రేలాడుతూ, తమ నిజమైన ఆవిష్కర్తను విశ్వసించని వారి” దురదృష్టానికి పరితపించాడు. బాబ్‌కూడా ఈ సిద్ధాంతాన్ని సూచిస్తూ “నామధేయముల కధినాథుడగు ఆయన నుండి నామములు మిమ్ములను మఱుగు పరచనీయవలదు, ప్రవక్త నామధేయము సహితము ఆయన వాణి నుండి యుద్భవించినదే తప్ప వేరొకటి కాద”ని హెచ్చరించాడు.

181

భగవంతుని సార్వభౌమత్వమున కధీకృత ప్రతినిధి యగు ఆయన నుండి “ప్రాతినిధ్య” పరమైనదేదైనను ¶167

“ప్రాతినిధ్యము” గా ఇక్కడ అనువదింపబడిన పదం అరబ్బీ మూలంలో“విలాయత్‌”గా వ్యవహరింప బడుతున్నది. దీనికి “ప్రతినిధిత్వము”, “సంరక్షణత్వము”, “రక్షణత్వము”, “వారసత్వము” అనే నానార్థాలున్నాయి. భగవంతునికి, ఆయన దివ్యావతారానికి లేదా దివ్యావతారముచే నియమింప బడిన ఉత్తరాధికారులకు మధ్య గల సంబంధాన్ని సూచించేందుకై ఇది ఉపయోగింప బడుతున్నది. అటువంటి భావనలు మానవులను ఈ నవీనదివ్యావతార “సార్వభౌమత్వా”నికీ, నిజమైన “దైవప్రతినిధి”కీ అంధులను కానీయరాదని బహాఉల్లా ఈ అఖ్దస్ ప్రవచనంలో హెచ్చరించాడు.

182

కరీమ్‌ను స్ఫురణకు దెచ్చికొనుడు ¶170

హాజీ మీర్జా మహమ్మద్ ఖాన్-ఇ-కిర్మానీ (1810-1873 ప్రాంతాలు), షేఖ్ అహ్మద్-ఇ-అహ్సాయి వారసునిగా నియమితుడైన సయ్యద్ ఖాసిం మరణాంతరం తనను తానే నియమించుకొన్న షేఖీ నాయకుడు. (చూ. వివరణలు 171, 172). షేఖ్ అహ్మద్ బోధనల పురోగతికి తనను తాను అంకితం చేసుకొన్నాడు. హితులకు, విమతులకు సహితం అతని అభిప్రాయాలు వివాదస్పదాలయ్యాయి.

సమకాలీన పండితాగ్రగణ్యుడిగా, రచయితగా గుర్తింపును పొందిన ఈ వ్యక్తి ఆనాటి వివిధ విజ్ఞానరంగాలకు సంబంధించి అనేక గ్రంథాలను, సందేశాలను రచించాడు. బాబ్, బహాఉల్లా లిరువురినీ తీవ్రంగా వ్యతిరేకించాడు. బాబ్‌నూ, ఆయన బోధనలనూ విమర్శించడానికై తన గ్రంథాలను ప్రయోగించాడు. అయితే, బహాఉల్లా అతని రచనలలోని అంశాలను, వైఖరిని గర్హించి, బాబ్‌కు విరుద్ధదృష్టాంతాలను కలిగియున్న అతని పుస్తకాలలో ఒకదానిని కితాబ్-ఇ-ఇఖాన్ లో ప్రస్తావించాడు. షోఘి ఎఫెండి అతనిని “దురాశాపరునిగా, వంచకునిగా” అభివర్ణించి, “షా చేసిన ప్రత్యేక విజ్ఞాపనతో అతను తన గ్రంథములలో ఒకదానిలో ఈ నవీన దివ్యధర్మం మీదను, దీని సిద్ధాంతాలమీదను ఎంత దారుణంగా విరుచుకుపడ్డాడో” కూడా వర్ణించాడు.

183

ఓ బహా పండితులారా! ¶173

బహాఉల్లా తన అనుయాయులలో గల విద్వాంసులను ప్రస్తుతించాడు. ఆయన తన ఒడంబడిక గ్రంథములో ఇలా వ్రాశాడు: “బహా జనుల యందలి పాలకులు, పండితులు ధన్యులు.” ఈ ప్రకటన గురించి షోఘి ఎఫెండి యిలా వ్రాశాడు:

ఈ పవిత్ర యుగంలో “పండితు”లు ఒక విధముగా దివ్యధర్మహస్తములు, మరియొక విధముగ ఆయన బోధనలను ప్రబోధించువారు, విస్తరింప చేయువారు; దివ్యధర్మహస్తముల శ్రేణికి చెందకపోయినా, బోధనారంగమున విశిష్టస్థాయి నొందినవారు. ఇక “పాలకు”లనగా - స్థానిక, జాతీయ, అంతర్జాతీయ న్యాయమందిరముల సభ్యులకు సంకేతం. వీరిలో ప్రతియొక్కరి విధులు భవిష్యత్తులో నిర్థారించబడతాయి.

దివ్యధర్మహస్తములు బహాఉల్లాచే నియమితులై, అనేక విధులు - విశేషించి ఆయన దివ్యధర్మ రక్షణ, విస్తరణ బాధ్యతలు - అప్పగించబడిన వ్యక్తులు. మెమోరియల్స్ ఆఫ్ ది ఫెయిత్‌ఫుల్ అనే గ్రంథంలో అబ్దుల్-బహా -- కొందరు విశిష్టవిశ్వాసులను దివ్యధర్మహస్తములుగా సూచించి, తన వీలునామా, మరణ శాసనంలో దివ్యధర్మ సంరక్షకునికి పిలుపునిస్తూ, ఆయన తన వివేచన ప్రకారం దివ్యధర్మహస్తములను నియమించే ఏర్పాటును కల్పించాడు. షోఘి ఎఫెండి తొలుత కీర్తిశేషులైన ఎందరో విశ్వాసులను ఈ స్థాయికి సముద్ధరించాడు. ఆ తర్వాతి సంవత్సరాలలో, 32 మంది విశ్వాసులను ఈ స్థాయిలో అన్ని ఖండాలలోను నియమించాడు. షోఘి ఎఫెండి మృతికి (1957) విశ్వన్యాయమందిరం ఎన్నిక (1963) కు మధ్యకాలంలో, దివ్యధర్మహస్తములే దివ్యధర్మపు వ్యవహారాలకు మార్గదర్శకత్వాన్ని వహించి శైశవావస్థలో ఉన్న బహాఉల్లా ప్రపంచకూటమికి ప్రధానరక్షకులుగా వ్యవహరించారు. (చూ. వివరణ 67). విశ్వన్యాయమందిరం 1964 నవంబరులో దివ్యధర్మ హస్తముల నియామకాలకు వీలును కల్పించే శాసనాన్ని తాను చేయలేదని నిర్థారించింది. అయితే, అందుకు బదులుగా అది -- 1968లో సలహాదారుల ఖండాంతరమండళ్ల నియామకం ద్వారాను, 1973లో పవిత్రభూమిలో ప్రధానాసనం ఉండేలా అంతర్జాతీయ బోధనా కేంద్రాన్ని నెలకొల్పడం ద్వారాను - దివ్యధర్మహస్తముల ప్రధాన విధులైన ధర్మరక్షణ, విస్తరణలు - భవిష్యత్తులో కూడా కొనసాగేలా నిర్ణయించింది.

విశ్వన్యాయమందిరము అంతర్జాతీయ బోధనా కేంద్ర సలహాదారుల సభ్యులను, ఖండాంతరమండళ్ల సలహాదారులను నియమిస్తుంది. ఖండాంతర మండలి సలహాదారులచే సహాయక మండలి సభ్యులు, నియమించ బడతారు. షోఘి ఎఫెండి ఇచ్చిన పై వివరణలోని “పండిత” వర్గంలోకి వీరంతా వస్తారు.

184

దివ్యగ్రంథము నందేదైనను మీకవగతము కానిచో, ఈ మహావృక్షము నుండి యావిర్భవించిన శాఖ యగు ఆయనకు నివేదింపుడు. ¶174

బహాఉల్లా తన పవిత్ర ప్రవచనాలను వ్యాఖ్యానించే అధికారాన్ని అబ్దుల్-బహాకు ప్రసాదించాడు (చూ. వివరణ 145 ).

185

సర్వోత్కృష్ట ఏకత్వ సాంప్రదాయము ¶175

తాను బయాన్ వాగ్దత్త పురుషుడనని గావించిన ప్రకటనను బాబీలలో కొందరు ఖండించడానికి గల కారణాన్ని ఈ దివ్యప్రవచనంలోను, దీని తరువాయి ప్రవచనాల లోను బహాఉల్లా ప్రతిఘటించాడు. “భగవంతునిచే ప్రత్యక్షీకరింపజేయబడు నాతని”ని ఉద్దేశించి బాబ్ వెలువరించిన దివ్యఫలకం ఆధారంగా వారు తమ ఖండనను గావించారు. ఈ దివ్యఫలకానికి వెనుకవైపున బాబ్ : “భగవంతునిచే ప్రత్యక్షీకరింపజేయబడు నాతనిదృక్కులు ఈ లేఖను ప్రాథమిక దశలోనే శోభిల్లజేయు గాక” అని వ్రాశాడు. బాబ్ పవిత్ర రచనల సంకలనము లో ఈ ఫలకం ప్రచురితమైంది.

బహాఉల్లా బాబ్ కన్న వయస్సులో రెండు సంవత్సరాలు పెద్ద కనుక ఆయనకు “ప్రాథమిక దశలోనే” ఈ దివ్యఫలకాన్ని అందుకోవడం సాధ్యం కాదని ఆ బాబీలు వాదించారు.

అయితే, ఈ ప్రస్తావనఈ జీవనతలానికి అతీతంగా ఆధ్యాత్మిక ప్రపంచాలలో సంఘటిల్లే ఘటనలకు వర్తిస్తుందని బహాఉల్లా ఇక్కడ వివరించాడు.

186

ఆయన మాకు సమర్పించిన . . . దివ్యప్రవచనములను స్వీకరించితిమి ¶175

“భగవంతునిచే ప్రత్యక్షీకరింపజేయబడు నాతని” ని ఉద్దేశిస్తూ తాను వెలువరించిన దివ్యఫలకములో బయాన్ ను బహాఉల్లాకు తన సమర్పణగా పేర్కొన్నాడు బాబ్. చూ. బాబ్ పవిత్ర రచనల సంకలనము.

187

ఓ బయాన్ జనులారా! ¶176

ఇది బాబ్ అనుయాయులకు అన్వయిస్తుంది.

188

అ మరియు గు అక్షరములను జతగూర్పకమునుపే ¶177

షోఘి ఎఫెండి తన తరఫున వ్రాయబడిన లేఖలలో “అ మరియు గు అక్షరముల” ప్రాధాన్యతను వివరించాడు. ఈ అక్షరాలు “తన ఆదేశమున సమస్తమును ఉనికి లోనికి తీసుకురాగల భగవంతుని సృజనాత్మక శక్తి”, భగవంతుని దివ్యావతారమూర్తి శక్తి, ఆయన పరమాధ్యాత్మిక సృజనశక్తి” తో కూడిన “అగు” అనే పదంగా ఏర్పడతాయి.

ఆజ్ఞాపూరితమైన “అగు” అరబ్బీ మూలంలో “కాఫ్‌”, “నూన్‌” అనే రెండు అక్షరాలతో కూడిన “కున్‌” అనే పదం (ఆంగ్లంలో ఇది “Be”). షోఘి ఎఫెండి వాటిని పై విధంగా అనువదించాడు. సృష్టిని ఉనికిలోకి తీసుకురావడానికి భగవంతుడు ఉపయోగించిన ఆజ్ఞగా ఈ పదం ఖురాన్‌లో ప్రయోగించబడినది.

189

ఈ దివ్యప్రపంచ సంవిధానము ¶181

పారశీక బయాన్‌లో బాబ్ యిలా వివరించాడు: “బహాఉల్లా సంవిధానముపై దృష్టిని సారించి, తన దైవమునకు ధన్యవాదముల నర్పించునాతడు ధన్యుడు. ఆయన తప్పక ప్రత్యక్షీకరింపచేయబడును కనుక భగవంతుడు నిక్కముగ, నిర్ద్వంద్వముగ దీనిని బయాన్ నందు నిర్దేశించినాడు.” షోఘి ఎఫెండి ఈ “సంవిధానము” ను, అ అఖ్దస్ గ్రంథంలో బహాఉల్లా వెల్లడించిన విధానంతో పోల్చాడు. మానవజీవితంపై ఆ సంవిధానపు విప్లవాత్మక ప్రభావాన్ని, దాని వ్యవహారశైలిని నియంత్రించే శాసన నియమాలను ఈ గ్రంథంలో సహేతుకంగా వివరించాడు బహాఉల్లా .

“నూతన ప్రపంచ సంవిధాన” లక్షణాలు బహాఉల్లా, అబ్దుల్-బహాల రచనలలోను, షోఘి ఎఫెండి, విశ్వన్యాయమందిరముల లేఖలలోను వర్ణించబడ్డాయి. వర్తమాన బహాయి పరిపాలనావిధానానికి సంబంధించిన వ్యవస్థలు బహాఉల్లా భావి ప్రపంచ సంవిధానానికి “నిర్మాణ ప్రాతిపదిక”లై, వృద్ధి చెంది, బహాయి ప్రపంచ కూటమిగా పరిణితి చెందుతాయి. షోఘి ఎఫెండి ఈ అంశాన్ని నిర్ధారిస్తూ, పరిపాలనా సంవిధానం “దాని ప్రధాన భాగాలు, వివిధాంగాలు పటిష్టంగా, శక్తివంతంగా విధుల నిర్వహణను ఆరంభించే కొద్దీ, నూతన ప్రపంచ సంవిధానానికి కేంద్రకంగానే గాక, సమయమాసన్నమైనప్పుడు సమస్త మానవాళికి అనువర్తితమయ్యే ఆదర్శ సంవిధానంగా తన అధికారాన్ని సుస్థిరపరచుకుంటుం”దన్నాడు.

ఈ నూతన ప్రపంచ సంవిధాన పరిణామం గురించిన అదనపు సమాచారానికై, ఉదాహరణకు, ది వరల్డ్ ఆర్డర్ ఆఫ్ బహాఉల్లా లో ప్రచురితమైన షోఘి ఎఫెండి లేఖలను చూడవచ్చు.

190

ఓ దుస్స్వభావమూలమా! ¶184

సుభ్-ఎ-అజల్ (అనంతప్రభాతం) గా వ్యవహరింపబడినవాడూ, బహాఉల్లాకు, ఆయన దివ్యధర్మానికి వ్యతిరేకంగా ధ్వజమెత్తినవాడూ అయిన - ఆయన సవతి తమ్ముడు మీర్జా యాహ్యాకు ఇది అన్వయిస్తుంది. వాగ్దత్త పురుషుని ఆగమనం ఏ సమయంలోనైనా సంభవించవచ్చునని ఎదురు చూస్తున్న బాబీ సమాజానికి నాయకునిగా మీర్జా యాహ్యాను బాబ్ నియమించాడు. సయ్యద్ మహమ్మద్ -ఎ -ఇస్ఫహాని (చూ. వివరణ 192) ప్రేరణతో బాబ్ పట్ల అవిశ్వాసంగా వ్యవహరించి, ఆయనకు వారసుడిగా చెప్పుకుని, బహాఉల్లాకు వ్యతిరేకంగా కుట్రలు పన్ని, చివరికి ఆయనపై హత్యాప్రయత్నాలు కూడా చేశాడు మీర్జా యాహ్యా. అడ్రియానోపుల్‌లో బహాఉల్లా తన దివ్యకార్యక్ర మాన్ని గురించి మీర్జా యాహ్యాకు వెల్లడించినపుడు అతను ప్రతిగా ఏ స్థాయికి వెళ్ళాడంటే: తనకు కూడా ఒక స్వతంత్రమతానికి సంబంధించిన సందేశం అందిందని ప్రకటించుకున్నాడు. అజలీలుగా వ్యవహరింపబడిన కొందరు తప్ప, చివరికి అందరూ అతని అతిశయోక్తులను త్రోసిపుచ్చారు (చూ. వివరణ 177) షోఘి ఎఫెండి అతనిని “బాబ్ ఒడంబడికను తీవ్రంగా ఉల్లంఘించినవా”డని అభివర్ణించాడు (చూ. గాడ్ పాసెస్ బై , 10వ అధ్యాయము ).

191

దివ్యధర్మసేవకై మేము అహర్నిశలు నిన్ను పోషించిన విషయమును, పరమాత్ముని మృదుకారుణ్యమును స్ఫురణకు దెచ్చికొనుము. ¶184

మీర్జా యాహ్యా కన్నా పదమూడేళ్లు పెద్దవాడైన బహాఉల్లా, కిశోరప్రాయంలోనూ, పెద్దయ్యాక కూడా అతని మంచిచెడ్డలు చూసి, సంరక్షించాడన్న వాస్తవాన్ని షోఘి ఎఫెండి గాడ్ పాసెస్ బై లో వివరించాడు.

192

నిన్ను పెడదారి పట్టించిన వానిపై దేవుడు నియంత్రణను కలిగి యుండుట ¶184

“బహాయి దివ్యాష్కరణానికి సైతాను” వంటి వాడని షోఘి ఎఫెండిచే వర్ణించబడిన, సయ్యద్ మహమ్మద్-ఇ-ఇస్ఫహానికి ఇది అన్వయిస్తుంది. అతను దుస్స్వభావి, దురాశాపరుడు. బహాఉల్లాను వ్యతిరేకించి, ప్రవక్తృత్వాన్ని చేపట్టవలసిందిగా మీర్జా యాహ్యాను ప్రేరేపించినవాడు అతనే (చూ. వివరణ 190). మీర్జా యాహ్యా పక్షీయుడే అయినా, బహాఉల్లాతోపాటుగా అక్కా కు బహిష్కరించబడ్డాడతను. బహాఉల్లాకు వ్యతిరేకంగా ఆందోళనలు లేవదీయడం, కుట్రలు పన్నడంలాంటివి కొనసాగించాడు. అతని మరణపరిస్థితులను, గాడ్ పాసెస్ బై లో షోఘీ ఎఫెండి వర్ణించాడు :

బహాఉల్లా జీవితానికి మరొక సరిక్రొత్త విపత్తు ఏర్పడినట్లు స్పష్టంగా తెలియ వచ్చింది. తమను హింసించే వారికి వ్యతిరేకంగా ప్రతీకారచర్యలను చేపట్టవద్దని తన ఆనుయాయులను ఎన్నో సందర్భాలలో మౌఖికంగాను, లిఖితపూర్వకం గాను గట్టిగా నిషేధించాడాయన. తన ప్రియతమ నేతకు జరిగిన అన్యాయాలకు ప్రతీకారంచేయడానికి యోచించినవాడూ, బాధ్యతారహితుడూ, పూర్వాశ్రమంలో అరబ్బు అయిఉన్న ఒక విశ్వాసిని ఆయన బీరూట్‌కు త్రిప్పిపంపివేశాడు; అయినా, ఆయన సహచరులలో ఏడుగురు రహస్యంగా బైటికి వెళ్లిపోయి, తమను బాధలకు గురిచేస్తున్నవారిలో ముగ్గురిని - సయ్యద్ మహమ్మద్, అఖా జాన్ లతో సహా - హతమార్చారు.

అంతకుముందు నుంచే అణచివేతకు గురౌతూవస్తున్న సమాజానికి కలిగిన భీతి వర్ణనాతీతం. బహాఉల్లా ఆగ్రహానికి అంతులేదు. ఈ సంఘటన జరిగిన కొద్దికాలానికే వెలువరించిన ఒక దివ్యఫలకములో తన ఆవేశాన్ని ఇలా వ్యక్తం చేశాడాయన : “మేము మాకు సంభవించిన దానిని ప్రస్తావించినచో, స్వర్గములు చీలి బీటలు వారును, పర్వతములు నేలకూలును.” మరో సందర్భంలో ఆయన యిలా వ్రాశాడు: “నా కారావాసము నాకు హాని చేయజాలదు. నాకు హాని చేయునది - నన్ను ప్రేమించుచు, నా వారమని చెప్పుకొనుచు, నా హృదయమును, నా లేఖినిని ఆక్రోశింపచేయు వారి ప్రవర్తయే.”

193

యొక భాషను . . . ఒక సామాన్యలిపిని ఎంచుకొనుడు. ¶189

ఒకే విశ్వభాషను, లిపిని అవలంబింపుడని బహాఉల్లా నిర్దేశించాడు. ఆయన పవిత్ర రచనలు ఈ ప్రక్రియకు సంబంధించి రెండు దశలను వెల్లడిస్తాయి. తొలి దశలో ప్రస్తుతం ఉన్న భాషలలో నుండి గాని, నూతనంగా కల్పన చేసి గాని ఒక దానిని ఎంపిక చేసుకోవడం, ఆ పై అది ప్రపంచంలోని పాఠశాలలు అన్నింటిలోనూ మాతృభాషకు, సహాయభాషగా బోధించబడటంగా ఉంటుంది. తమ చట్టసభల ద్వారా ఈ అత్యావశ్యక శాసనాన్ని చేయవలసిందిగా ప్రపంచంలోని ప్రభుత్వాలు కోరబడాలి. పర్యవసానంగా రెండవ దశలో, దూరభవిష్యత్తులో, భూమిపై వసించే వారందరూ ఒకే సామాన్య భాషను, సార్వత్రిక లిపిని అలవరచుకోవడం జరుగుతుంది.

194

మానవజాతి యుగాగమనమునకు మేము రెండు సంకేతములను ఏర్పరచినాము. ¶189

బహాఉల్లా పవిత్ర రచనలలో సూచితమైన మానవజాతి యుగాగమనానికి ప్రథమ సంకేతం : మూలధాతువులను సమూలంగా పరివర్తింపచేసేదీ, మౌలికవిధానంతో కూడి “దైవిక తత్త్వ్వజ్ఞానం” గా వర్ణితమయ్యేదీ అయిన విజ్ఞానం ఆవిర్భవించడం. భవిష్యత్తులో చోటుచేసుకోనున్న మహత్తర విజ్ఞానవికాస శోభకు యిదొక సంకేతం.

కితాబ్-ఎ-అఖ్దస్ లో బహాఉల్లా సూచించిన “రెండవ” సంకేతానికి సంబంధించి షోఘి ఎఫెండి యిలా వివరించాడు: “బహాఉల్లా ... తన పరమ పవిత్ర గ్రంథములో - భూమిపై నుండువారందరూ తమ ఉపయోగానికై ఒకే భాషను ఎంపిక చేసుకుని, సార్వత్రిక లిపిని అవలంబించాలని సూచించాడు; నెరవేర్పబడినప్పుడు, అది - తానే స్వయంగా ఆ దివ్యగ్రంథములో నుడివినట్లుగా, ‘మానవజాతి యుగాగమన’ సంకేతాలలో ఒకటౌతుందని వివరించాడు.”

మానవజాతి యుగాగమన ప్రక్రియ ఆంతర్యం గురించి, పరిణితి దిశగా దాని ప్రస్థానం గురించి మరికొంత సమాచారాన్ని బహాఉల్లా ఇచ్చిన ఈ దిగువ వివరణ అందిస్తుంది :

ప్రపంచ పరిణితి కొక సంకేతము : రాజరికపుభారమును భరియించుట కెవ్వడును సమ్మతింపడు. తన భారమును వహియించుట కెవ్వరును సహియింపనట్టిదిగ రాజరికము మిగిలిపోవును. మానవజాతియందున వివే సాక్షాత్కారము జరుగునది ఆ దినముననే.

సమస్త మానవజాతి సమైక్యతతో, ప్రపంచకూటమి సంస్థాపనతో, సమస్త మానవ జాతియొక్క వివేక, నైతిక ఆధ్యాత్మిక జీవితాలకు ఆపూర్వమైన ఉత్తేజం కలగడంతో మానవజాతి యుగాగమనం ముడివడిఉందని షోఘి ఎఫెండి వెల్లడించాడు.

Windows / Mac